Friday, July 22, 2011 34 comments

ఎనిమిదికి రెండు మార్కులు ...




మీటింగ్ లో ఉన్నా.. సెల్ మోగుతోంది.. 'అప్పుడే మూడున్నరైంది' అనుకుని బయట పడి కాల్ అటెండ్ అయ్యాను. చిన్నదాని ఫోన్.


'అమ్మా.' సాక్రీన్ స్వీట్ గా చిన్న దాని గొంతు. నాకు తెలుసు ఏదో ఫిట్టింగ్ పెట్టటానికే. మా చిన్నదానికి అవసరమైన విషయాల్లో తప్పించి వేరే వాటన్నింటిలో తెగ తెలివి తేటలు.

గంభీరం గా గొంతు పెట్టి..'చెప్పు త్వరగా.. మీటింగ్ లో ఉన్నా.. అరగంట లో బయల్దేరతా ఇంటికి..' అన్నాను.

'నాకు హిందీ లో మార్కులిచ్చారు డిక్టేషన్ లో' అని నానుస్తూ..

'నీకేన్నొచ్చాయి ?'.
'సుకృతి కి 1/8. '

'నీకేన్నొచ్చాయి ?'
'అసలు క్లాస్ లో అందరికీ ఒకటే మార్క్ వచ్చింది ఎనిమిది కి'
'నీకెన్ని?'
'అసలు పేపర్ చాలా కష్టం గా...'
'నీకెన్ని?'
'అంటే.. నాకు సుకృతి కన్నా ఎక్కువ...'
'నీకెన్ని?!!!!'
గొంతు .చాలా చిన్నదైపోయింది. ఒక్కసారి గా..
..'' రెండు మార్కులు
'వినపడట్లా'
'రెండు మార్కులు' అని త్వరతరగా 'అసలు నా మార్కులు అంత తక్కువగా ఎందుకొచ్చాయో తెలుసా?'
'ఎందుకబ్బా? Give me one good reason!'


'ప్రతి సారీ నా ముందు కూర్చునే ఉదిత్ గాడిని ఈసారి వెనక కూర్చో బెట్టారు'
'ఏంటీ!!!! కాపీ చేస్తున్నావా? నీకు పిచ్చా? సున్నా వచ్చినా పర్వాలేదు. కాపీ చేస్తే మాత్రం చంపేస్తా!'

'అదే మాట మీదుండు!.. మాట మార్చకు. నేనేం కాపీ ఎప్పుడూ చేయను.జీరో కన్నా ఎక్కువే వచ్చాయి కదా..'

'మధుమిత కి ఎన్నొచ్చాయి?'
'దానికా.. ఏడు.'

'వినపడట్లా'
'ఏడు'
'మరి అందరికీ తక్కువ మార్కులొచ్చాయన్నావు?'
'దానికే ఎందుకో ఎక్కువొచ్చాయిలే!'
'అమ్మా.. నీకే ఇంత బాధ గా ఉందే.. మరి సుకృతి వాళ్లమ్మ కి ఎంత బాదుండాలి చెప్పు..It must be insulting for her'
'ఏం?'
'వాళ్లింట్లో హిందీ మాట్లాడతారు.. అయినా దానికి..'
'అబ్బా... మరి నీకు తెలుగు ఎంత వచ్చో !!'
'నాకు స్కూల్ లో నేర్పరు కదమ్మా..'
'మరి మధుమిత ఇంట్లో తమిళ్ మాట్లాడతారు కదా?'
'అబ్బా... చెప్పాగా.. దానికి ఏదో తేడా..'
'ఆ??
'అన్నింటికీ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్లతోనే కంపేర్ చేసుకోకూడదమ్మా!.. ఒక్కోసారి మిగిలిన వాళ్ల తో కూడా కంపేర్ చేసుకోవాలి'
'నీ దగ్గర్నించే నేర్చుకోవాలి పాఠాలు నేను.. ఇంటికి రానీ నీ పని చెప్తా!!'

'కృష్ణాజీ.. We are waiting...' లోపల నుంచి మా సింగ పెరుమాళ్...
'Coming.. just a minute' ... 'ఇదిగో.. తప్పులైన పదాలని ఐదు సార్లు రాయి. సరేనా?'

'అమ్మా.. నువ్వెప్పుడోస్తున్నావు? '
'గంట లో ఉంటా ఇంట్లో.. I need to run..'
'గంట కి కదా.. అప్పటికి రాసేస్తాలే!'
'రాయక పోవాలి.. ఈరోజు ఆటలు లేవు.. అసలు రోజూ నాతో ఒక గంట కూర్చోవాలి నువ్వు ఈరోజు నుంచీ సరేనా?'
'అబ్బా... రేపటి నుంచీ చదువుకుందాం'
'కృష్ణా.. Are you coming back? Or shall we continue later?' ఆశ గా సింగ పెరుమాళ్..
అబ్బే.. అతికష్టం మీద మీటింగ్ కి అందరూ వచ్చారు. అంత తేలిగ్గా వదులుతానా?

'తల్లీ.... లేటర్.. ఐ రియల్లీ నీడ్ టు రన్!'
'థాంక్స్ అమ్మా.. ఒకవేళ కరంట్ పొతే.. నేను రాయలేకపోతే ఏమీ అనద్దు.. ఓకే?'
'ఓకే ఓకే'

లోపల కొచ్చాక అర్థమైంది.. అదేమందో.. కరెంట్ పొతే రాయటానికేంటిట?
ఇంటికెళ్లాక చెప్తా దాని పని. 'హః.'. ఒళ్లు మండుతోంది...
* * * * * * * *



"తీయవే పుస్తకాలు... ఏం చెప్పారు ఇవ్వాళ క్లాస్ లో ?'
'సోషల్ లో Our Country చెప్పారు.'

'తీయి అయితే చూద్దాం ..'
'గ్లోబ్ తీసుకునిరా'

(అరగంట తర్వాత, నాలుగు అరుపులు, ౨౦ పెడబొబ్బలు అయ్యాక.. ఏడుపు మొహం తో వచ్చి కూర్చున్న అరక్షణానికి..'
'ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్'

'Who is it?'
'Aunteeeee.. Can she come out to play?'
'Nooooo.. she is studying'
'మన దేశం లో ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియన్ సముద్రం, దక్షిణాన హిందూ మహా సముద్రం.. చూడు...'
'అసలు ఏమంటున్నావు? నాకర్థం కావట్లే'

(హః. ఇంగ్లిష్ మీడియం పిల్లలు :-(( ' - మనస్సులో అనుకుని).
'మన దేశానికి నార్త్ లో హిమాలయాజ్, ఈస్ట్ లో బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ లో అరేబియన్ సీ, సౌత్ లో ఇండియన్ ఓషన్ .. చూడు..'
(పిల్ల ఆలోచన లో..)
'ఏంటి మళ్లీ.. ఆలోచనలు.?.'

'నీళ్లల్లో ఇండియన్ ఓషన్ కీ, అరేబియన్ సీ కీ మధ్య లైన్ ఎలా గీస్తారు? బార్డర్ ఎలా తెలుస్తుంది?'
(ఏదో సద్ది చెప్పి..ఇండియా లో వివిధ భౌగోళిక పరిస్తుతులని వర్ణిస్తున్నా.)
'ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్'

'Who is it?'
'Aunteeeee.. Can she come out to play?
'Nooooo.. she is studying'

'రాజస్థాన్ లో డిసర్ట్.. అక్కడ అన్నీ కాక్టస్ లూ, థార్నీ ప్లాంట్స్ మాత్రమే పెరుగుతాయి..'
'అంటే రోజెస్ లాంటివి?' (చిలిపి గా)
'చంపుతా.. నీకు తెలుసనీ నాకు తెలుసు.. Let me continue.. అక్కడ రోజంతా చాలా వేడిగా.. రాత్రంతా.. విపరీతమైన చల్లగా.. నీళ్లు తక్కువ..పంటలు తక్కువ..."

"కిసుక్కు..."

(ఇదేంటబ్బా.. కాస్త తేడా గా.. అని చూస్తే పెద్దది.. ఏంటి.. అన్నట్టు దాని వైపు చూసా..)

'అక్కడ పీపుల్ పోయెమ్స్ ఎలా రాస్తారా అని ఆలోచిస్తున్నా.. ఆల్వేజ్ మా టెక్స్ట్ బుక్ లో ఎప్పుడూ, బ్యూటిఫుల్ ఫామ్స్, ఫీల్డ్స్, గ్రీనరీ, వాటర్ స్ట్రీమ్జ్ నే దిస్క్రైబ్ చేస్తారు కదా'

'ఆగవే.. అసలే నేను చస్తుంటే.. రాజస్తాన్ లో పొయెట్రీ ఎలా రాస్తారో నాకెందుకు?'



'ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్'

'Who is it?'
'Aunteeeee.. Can she come out to play?'
'Nooooo.. she is studying'

'ఆ.. ఎక్కడిదాకా వచ్చాం? లేక్స్.. ..'
'I know.. I know.. చిలుక లేక్ కానీ గ్రీన్ గా ఉండదు. సాంబార్ లేక్ వాటరీ గా ఉంటుంది.. వులార్ లేక్ -- దీనికే ఏమీ ఫన్నీ గా చెప్పటానికి లేదు.. ఏం చెప్పచ్చు?'



'ఆంటీ ప్లీజ్.. సెండ్ హర్ అవుట్! వీ నీడ్ హర్!!' (అరడజన్ పిల్లలు గుమ్మం దగ్గర..)
'సరే పో.. గంటలో ..'


మళ్లీ వచ్చేయాలి.... అనేలోపలే.. గాయబ్! చాల్లే ఇవ్వాల్టికి చదివిన చదువు చాలు!





Tuesday, July 12, 2011 38 comments

గేటెడ్ కమ్యూనిటీ కథలు - I am ok, You are not ok!













ఆగస్ట్ పదిహేను మళ్లీ వచ్చేస్తోందా? ఈలోగా మొన్నటి చబ్బీస్ జనవరి గురించి మాట్లాడుకుపోతే.. మరీ కొత్తావకాయ పెట్టాక పాత సంవత్సరం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి, ఎండిన, రంగు మారిన ఆవకాయ లాంటి కబుర్లయిపోతాయి కదా.. అసలే ఇప్పటికే లేట్ లెండి.

మొన్న క్రిస్ మస్ సెలవలకి ముందుగా ప్లాన్ చేసుకున్న కుటుంబాలు ఎంచక్కా వెకేషన్లకి పరిగెడితే.. కాలనీ బోసిపోయింది. ఎక్కడికీ టికెట్లు దొరకక ఉద్యాన నగరి లోనే ఉండిపోయిన వారు క్రెడిట్ కార్డ్ మాగ్నెటిక్ స్ట్రిప్ గీతలు పడేంత వరకూ గీకి గీకి అస్సలూ అవసరం లేని వస్తువులన్నీ తెగ కొనేసి, రిలీజ్ చేసిన సినిమాల్లో కాస్త 'గుడ్డిలో మెల్ల ' అనిపించినవి చూసి తలనొప్పులు తెచ్చుకుని కచ్చ గా తీరిగ్గా ఉన్నారేమో.. గొడవలు అక్కడ రాజుకున్నాయి.


ముప్ఫయ్యవ నంబర్ ఆయన కి కాలనీ లో సీనియర్ సిటిజన్లకీ మొదటి గొడవ.. రాత్రుళ్లు గాట్టిగా మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నారు. దాని వల్ల పడుకోవటానికి కష్టం గా ఉంది.. అని. ఇదేమైనా బౌద్ధుల/జైనుల ఆశ్రమమా మౌనం గా నడవటానికి? అంతగా కష్టం గా ఉంటే చెవిలో దూది పెట్టుకుని పడుకోండి.. అని పెద్దవాళ్లు విసుక్కున్నారు. కాలనీ మెయిలర్ భగ భగ మంది. ఈ-మేయిలాస్త్రాలు విసురుకున్నారు..


నాలుగో నంబర్ ఆవిడ పూల తీగ విరగ బూసి ఎండుటాకులూ, పూలూ ఐదో నంబరాయన వాకిట్లో పడుతున్నాయట. సరే అని ఆవిడ రోజూ పనమ్మాయి ని అటువైపు కూడా చీపురు వేయమని పురమాయించింది. కానీ.. మాకు చీకటవుతోంది.. కాస్త అరటి చెట్లు కొట్టించేయండి.. అన్న మాట వింటూనే గయ్యి మని లేచిందీవిడ. మీ ఇంట్లో పాలు తాగి పిల్లి మా ఇల్లు పాడు చేస్తోంది. అని ఎదురు దాడి చేసింది. దానికి 'మేము మాత్రమే దానికి పాలు పోస్తున్నామని రుజువేంటి.. వేరే ఏ ఇంట్లోనూ అది తిండి ముట్టదని ప్రూవ్ చేస్తే నేనే వచ్చి అంతా శుభ్రపరుస్తాను. అని ఈయనా చాలెంజ్ విసిరాడు. ఫలితం.. మాటలాగిపోయాయి. పిల్లి మీదా, కాకి మీదా పేర్లు పెట్టుకుని కాస్త వాగ్యుద్ధాలు..

ఇరవై ఎనిమిదో ఆయనకి పండక్కైనా, తద్దినానికైనా షార్ట్స్ లోనే తిరగటం అలవాటు. ఆగస్టు పదిహేనుకీ అవే కురుచ వస్త్రాలతో జండా వందనం చేశాడని, ఇరవయ్యొకటవ ఇంటాయన మనోభావాలు దెబ్బదిన్నాయి. కనీసం గణతంత్ర దినోత్సవం రోజున పధ్ధతి పాటించాలని ప్రతిపాదిస్తూ ఒక మెయిల్. 'చాట్! నన్నంటాడా? అయినా ఆయనకేం దేశభక్తి ఉండేడ్సింది? నాది RSS. నేను క్రమశిక్షణ కలిగిన స్వయం సేవక్ ని. నన్నింత మాటన్నాక నేను రాను. మీరే చేసుకోండి.. పధ్ధతి గా ..' అని అలిగి అటకెక్కాడు.


పిల్లల నాటకాల్లో వాళ్ల పిల్లలకి ప్రాముఖ్యత లేని పాత్ర లిచ్చారనీ, నాట్యం లో వెనక వరస లో నిలబెట్టారనీ.. స్పీచ్ అవకాశం వాళ్ల పిల్లలకి ఇవ్వలేదనీ.. ఇలాగ తల్లుల గొడవలు.



పిల్లలకి మ్యూజిక్ బాండ్ ఏర్పాటు చేసారు. మా కాంప్లెక్స్ లో ఒకప్పటి ఒక కాలేజ్ సూపర్ స్టార్, ప్రస్తుతపు మామూలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్/తండ్రి. అందరూ ఎంతో ఉత్సాహం గా మొదలు పెట్టారు. రోజూ ప్రాక్తీసే. ఇంకో రెండు రోజుల్లో ఫంక్షన్ అనేసరికి మూడు మైకులు ఉంటాయనగానే.. మైక్ నాకు ఉండాలని, అబ్బే నా గొంతు బాగుంది నాకే ఉండాలని పిల్లల కస్సు బస్సులు. తల్లుల రికమెండేషన్, గొడవలూ..


పెసిడెంట్ గారికీ తొమ్మిదో నంబర్ ఆయన కీ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని ప్రతీతి. తొమ్మిదో నంబర్ ఆయన పూల కుండీలు తెప్పించి ఇంటి బయట రోడ్డుకి దగ్గర గా పెట్టించి తోటమాలి లేడని ఆఫీస్ కెళ్లి వచ్చేసరికి 'ఎన్నాళ్ళకి దొరికావు !' అని ఆనందంగా ఆ కుండీలు తీయించి లోపల పెట్టించి పెద్ద మెయిల్ పంపారాయన. దానికి తొమ్మిదయన నిప్పులు దొక్కిన వాడిలా చిందులేస్తూ.. ఆవేశపడి వెళ్తే పెసిడెంట్ గారు ఊర్లో లేరని తెలిసింది. దానితో ఆయన కుతకుత లాడుతున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.


ఇలాగ హై వోల్టేజ్ ట్రాన్స్ ఫార్మర్ పక్కన ఉన్నట్టు .. కాలనీ లో గంభీర మైన వాతావరణం. కొంత మంది మరీ సెన్సిటివ్ తల్లి దండ్రులు పిల్లల్ని కూడా కలవనీయకుండా అడ్డుకుని గొడవల్ని ఇంకో ఎత్తుకి తీసుకెళ్లారు.

ఈ పండుగ ప్రిపరేషన్లకి మాత్రం నన్ను ఎంత మంచి మనసున్న దానిననీ, అద్భుతమైన నైబరనీ, అత్యంత రుచికరమైన వంటలు చేస్తాననీ, అందర్నీ కలుపుకుపోయే స్వచ్చమైన స్వభావమనీ, ఇంకా ఎన్నో రకాలు గా కృష్ణ సహస్ర నామాలు చదివినా.. నేను దీపావళి దెబ్బ నుండి ఇంకా కోలుకోకపోవటం తో.. అస్సలూ లొంగలేదు.. (ఏ మాట కామాటే చెప్పుకోవాలి.. లోపల లోపల సంతోషించి మా బాసూ, మా ఇంట్లో వాళ్లూ కూడా ఇలాగే అనుకుంటే ఎంత బాగుండు? అనుకున్నాను లెండి..)


ఇక ఆరోజు అందరం ఎనిమిది కల్లా జండా కర్ర దగ్గర సమావేశం అయ్యాం. ఒక కాలనీ కి చెందిన వారిలా, కలిసి ఉత్సాహం గా కబుర్లు చెప్పుకుంటూ కోలాహలం గా ఉండే వారు.. ఏదో అఖిల పార్టీ సమావేశం లో జగన్ కి ఒక పక్కన కిరణ్ కుమార్,ఇంకో పక్క చంద్రబాబు,ఆయన పక్కన లక్ష్మీ పార్వతి కూర్చున్నట్టు,

ఇంకోవరస లో చిరంజీవి కి ఒకపక్క రోజా, ఇంకో పక్క మోహన్ బాబు కబుర్లాడుకుంటున్నట్టు, పోనీ అని ఆయన పక్కకు తప్పుకుని ఒక చోట కూలబడితే అక్కడ జీవితా రాజశేఖర్ లు తగిలినట్టు..  పోనీ అటుపోదాం అంటే.. వీజీ శాంతి  పక్కన తప్ప ఖాళీ సీట్ లేనట్టు.


కొద్ది దూరం లో గంగా భవాని, నన్నపునేని రాజకుమారి ఒక పక్క కూర్చున్నట్టు... తటస్థులు బిక్కు బిక్కు మంటూ ఒక మూల కూర్చుని కాసేపు.. లాభం లేదని కాస్త హడావిడి చేస్తున్నాం.

ప్రత్యేకం గా టీ పెట్టాలంటే వేన్నీళ్ళు కాచక్కరలేదు. కుర్చీల మధ్యనుండి అలా కెటిల్ తీసుకెళ్తే చాలు. పొగలు కక్కే చాయ్ తయార్!

ప్రోగ్రాం మొదలైంది. జండా వందనం, పిల్లల ఆటపాటలు, నృత్యాలు,.. స్కిట్స్.. బాగానే నడుస్తున్నాయి.

పెసిడెంట్ గారు, తొమ్మిదో నంబర్ ఆయనా మంచి వాగ్యుద్ధం చేసుకున్నారు. అందరికీ సాంస్కృతిక కార్యక్రమాల కన్నా.. అదే ఎక్కువ రంజింపచేసిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను?

నెమ్మదిగా అందరూ పిల్లల పాటలు, డాన్సులు సరదాగా చూస్తున్నారు. పెద్ద పెద్ద డ్రం సెట్లు తెచ్చి మైక్ అదీ పెడుతూనే..పిల్లల కేరింతలు కొట్టేస్తున్నారు.బయట నుండి అద్దెకి తెచ్చిన స్పీకర్లు పెట్టి కరెంట్ కనెక్షన్లు ఇచ్చి తెగ హడావిడి, కోలాహలం లో ఎప్పుడు మబ్బులు కమ్ముకున్నాయో గమనించనే లేదు. నీటి చుక్కలు టాప్ టాప్ మని గుండె లటుక్కుమంది. అద్దెకి తెచ్చిన ఎలక్ట్రిక్ సామాన్లు, మా కాలనీ వాసుల సరదా కోసం తెచ్చిన ఖరీదైన డ్రమ్స్, మైక్స్ అలాగ అన్నీ!!!

పిల్లలు అరుపులు. ఒక రెండు క్షణాలు నిశ్చేష్టులై ఉండి పోయినా.. సద్దుకుని అందరూ పరుగులు తీసారు లాన్ లోకి. ఒకళ్లు మోటార్ సెట్ మీద కప్పే టార్పాలిన్ షీట్ తెచ్చి కప్పటానికి ప్రయత్నిస్తే..ఇంకోరు మధ్యలో కర్రలు పెట్టి గొడుగు లా నిలపటానికి..

ఈలోగా పెద్దాయన హడావిడి లో వైర్ కాలికి తట్టుకుని పడిపోబోయారు. ముప్ఫయ్యవ నంబర్ ఆయన ఆపి చేత్తో నడిపించి గొడుగు కిందకి తెచ్చారు.

నాలుగో నంబర్ ఆవిడా, ఐదో నంబర్ ఆయనా కలిపి ఒక కర్ర ని అడ్డం గా పైకి పట్టుకున్నారు. మరి గొడుగు ఎత్తు పెంచాలా?

ఇరవై ఎనిమిదవ నంబర్ ఆయన పండగ బహిష్కరించినా, వాళ్ల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనటం తో ఆయన వర్షం లో ఇరుక్కున్న కుటుంబం కోసం వస్తూ.. ఇరవై ఒకటవ ఆయన చేతినుండి ఇంకో నాలుగు కర్రలు అందుకుని రాటల్లా నిలబెట్టారు...

కాలనీ ఆడవారంతా పిల్లలు తడవకుండా, ఇన్స్త్రు మెంట్లు ముట్టుకోకుండా కాపాడారు. ఇంత చేసినా ఒక పక్క టార్పాలిన్ కి చిల్లు పడితే.. పెసిడెంట్ గారు.. తొమ్మిదో నంబర్ ఆయన ని.. 'అదిగో నా కార్ పైన వేసిన కవర్ లాక్కు రావయ్యా.. ఇక్కడ ఎలెక్ట్రిక్ కనేక్షన్లకి ప్రమాదం.. అని అరిచాడు. ఇద్దరూ నీరు పడకుండా ఆపారు.

వర్షం పెరగటమే కానీ తగ్గదే? పిల్లలు మాత్రం ఖుష్! గెంతులే గెంతులు. పెద్దలు కూడా కొద్దిగా తడుస్తూ, వణుకుతూ.. జోకులేసుకుంటూ వృద్ధులనీ, పిల్లల్నీ సంరక్షిస్తూ ..



ఈ పిల్లా మేకా (మైకూ) వర్షం బారీన పడకుండా ఒక కృష్ణుడు కాదు ఒక యాభై కృష్ణుళ్ళు ఉన్నారా అన్నట్టు. ఒక విధమైన తృప్తి.. ఆనందం!!


ఆ వర్షం మా కమ్యూనిటీ జనుల మనసు లో గడ్డ కట్టిన చిన్న చిన్న మనస్పర్థలని, ముందర తడిపి, మెత్తపరచి, నెమ్మదిగా చిత్తడి చేసి, కరిగించింది. వర్షం నీళ్ళల్లో కలిసి ప్రవహించి మా rain water recycling plant 's reservoirs లోకి చేరింది. మళ్లీ ఆ నీరు తాగి మేము కొత్త గొడవలు పెట్టుకునేంత వరకూ మేమంతా 'I am ok, you are ok, We are all Ok' :)
Wednesday, July 6, 2011 55 comments

తెనాలి రామలింగడికీ నాకూ ఉన్న మౌలికమైన అభిప్రాయ బేధం!



ఒకసారి రాయల వారు తీరిగ్గా కూర్చుని.. 'ఈ ప్రపంచం లో అన్నింటికన్నా సులువైంది ఏది?' అని అడిగితే.. అందరూ నానా రకాల విషయాలు చెప్తే, తెనాలి రామకృష్ణుడు అన్నిటికన్నా సలహాలు ఇవ్వటం సులువు అని రాయలవారిని ఒప్పించాడట.


అది కరెక్టే నని మీరు ఒప్పుకుంటారా? ఏమో నేనైతే ఒప్పుకోను... తెనాలి రామ కృష్ణుడికీ, నాకూ ఈ విషయం లో మౌలిక మైన అభిప్రాయ బేధాలున్నాయి..

అసలు సలహాలివ్వటం వెనక ఎంత శాస్త్రం ఉంది? నా అనుమానం.. 64 కళల్లో ఇదొక కళ అని. ఒకవేళ లేకపోతే ఇది అరవై ఐదవ కళ అని సవినయం గా మనవి చేసుకుంటున్నాను. ఒక వేళ అంగీకరించక పొతే ఆమరణ నిరాహార దీక్ష చేయటానికి సిద్ధం అవుతున్నాను. అసలు సలహాలకి ఎన్ని సూత్రాలున్నాయి? వాటికి మళ్లీ బోల్డు కోరోలరీలు!!!.. సెంటిమెంట్ ఉంది. నవరసాలు అలవోక గా ముఖం లో చూపించగలగాలి! ఎదుటి వారి మనస్సు లోకి దూరి వాళ్ల ఆలోచనలు పసిగట్ట గలగాలి. కర్మ సిద్ధాంతం మీద నమ్మకం కలిగి ఉండాలి. అంటే సలహా ఒకవేళ ఆచరించి, అది వికటిస్తే, ఎటాక్ ని తట్టుకునే మానసిక స్థైర్యం ఉండాలి.

నేనూ బోల్డు సలహాలు అడిగినా అడక్కపోయినా తెగ ఇచ్చేస్తూ ఉంటా.. పైగా ఆఫీసులో సలహాల కోసం ముప్ఫై ల్లో ఆడవాళ్ళకి బోల్డు డిమాండు. సాధారణం గా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ముప్ఫై ఐదు వచ్చేసరికి ఒకరిద్దరు పిల్లలు తయారయి చాలా వరకూ ఉద్యోగాలయినా వదిలేయటమో, లేక కారీర్ లో పైకి దూసుకు పోవటమో, జరుగుతుండటం తో నాలాంటి వాళ్ల క్యూబ్ ముందు పేద్ద లైన్ అన్నమాట.



సలహా ఇవ్వటం వరకూ మాత్రమే మన కర్తవ్యమ్. ఇవ్వగానే మనం తప్పుకోవాలన్నమాట. పాటిస్తారా? సంతోషం.. పాటించరా ? మహా సంతోషం!! ఏదో సమాజ సేవ చేస్తున్న తుత్తి.. చాలా మంది 'కృష్ణా.. నీ దగ్గర సమయం ఉందా.. నేనొక ప్రాబ్లం లో ఉన్నా' అనగానే ఇక నాకు ఆటోమేటిక్ గా కనుబొమ్మలు విల్లుల్లా లేచి నుంచుంటాయి., ముఖం వెనక దేదీప్యమానం గా వెలుగుతున్న చందమామ దొర్లుకుంటూ వచ్చి అడ్జస్ట్ అవుతుంది. ముఖం మీద చిరునవ్వు పోయి టీవీ లో 'బ్రతుకు బండి భారం' ప్రోగ్రాం లో సుమలత లా సీరియస్, కన్సర్న్డ్ లుక్కు వచ్చి చేరుతుంది.

ఇలాగ సలహాలిస్తున్నప్పుడు కళ్లజోడు ఉంటే కొద్దిగా 'హుందా' గా ఉంటుందని కాంటాక్ట్స్ మానేసా. ;)
మనలో మాట... కొంత మంది గంట సేపు వాళ్ల కష్టాలు చెప్పుకుని సలహా వినకుండానే వాళ్ల బరువు దింపేసుకుని వెళ్లి పోతారనుకోండి.. అలాగని ఈ సెషన్లు పెట్టకుండా ఉంటామా ఏమిటి? మనకి వచ్చే ఇలాంటి కౌన్సెలింగ్ అవకాశాలు ఎందుకు వదులుకోవాలి అసలు?

ఆడపిల్లలు జనరల్ గా కష్టాలు చెప్పుకుంటారు అని ప్రతీతి గానీ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుల్లోఅమెరికా లో కానీ, బెంగళూరు లో కానీ అబ్బాయిలు కూడా బాగానే తమ కష్ట సుఖాలు చెప్పుకోవటం మామూలే.
ఇలా నా సలహా సామ్రాజ్యం లో ప్రజల కష్టసుఖాలు ఆఫీస్ లో మానేజర్ కష్టాలు, గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ తో ఝగడాలు, అత్తగారింటి వారితో లడాయిలు, పక్క క్యూబ్ అమ్మాయితో పోరు, వేరే గ్రూప్ వారితో గొడవలు, పని మనుషుల ధంకీలు, అబ్బో ఒకటని ఏముంది.. రోజూ, నా ప్రజలు క్యూబ్ ముందు నుంచుని .. నా ఏక చత్రాదిపత్యం మా ఫ్లోర్ లో కొనసాగుతూ ఉంది




.
నా సామ్రాజ్యపు రాజ్యాంగం లో సలహా సూత్రాలు ..

౧. సలహాలు అడిగిన వారిని అంచనా వేయాలి. వారు నిజంగా అడుగుతున్నారా? ఊర్కే భారాన్ని దింపుకోవటానికి చెప్తున్నారా? భారాన్ని దింపుకోవటానికయితే వింటూ, ఆఫీసు పనో, ఇంటికెళ్ళాక చేయాల్సిన పనుల జాబితా గట్రా ఆలోచిస్తూ.. ఆర్ట్ సినిమాలో హీరోయిన్ లాగా భావరహితం గా చూస్తూ, మధ్య మధ్యలో.. హ్మ్... అనటం.. నొసలు చిట్లించి తల పైకీ కిందకీ ఊపగలిగితే అదనపు మార్కులు.

ఉదా: భర్తల మీద చెప్పే పతివ్రతలకి ఇచ్చే సలహాలు.. పొరపాటున.. 'అవునా అంత దుర్మార్గమా? మరీ? అన్నామో మటాష్! ఇన్స్టంట్ గా విలన్ అవ్వాలనే సరదా ఉంటే ..ఈ పధ్ధతి అత్యంత శ్రేష్టం!!!. పైన చెప్పినట్టు ముఖ కవళికలు మారుస్తో 'చా.. మరీ.. అలా కాదులే' లాంటి డైలాగులు కొడుతూ ఉండాలి.


అలాగని అత్తగార్ల మీదా, ఆడపడచుల మీదా చెప్తున్నప్పుడు ఆర్ట్ హీరోయిన్ పాత్ర పోషిస్తే ..అది కాస్తా.. మాస్ సినిమా క్లైమాక్స్ అయి కూర్చుంటుంది జాగ్రత్త! సాధ్యమైనంత సానుభూతి ని ఒలికిస్తూ, దుష్ట, దుర్మార్గ,హీనాతి హీన, నికృష్ట లాంటి పద జాలాలని వాడుకోగలిగితే ఇక మనకి తిరుగులేదు.

౨. వాళ్లు నిజంగా అడిగితే అప్పుడు కూడా రెండు రకాలు. కొంత మంది వాళ్లు ముందుగానే నిర్ణయించుకుని మనం వాళ్లు అనుకున్నట్టే చెప్పాలని కోరుకునేవాళ్లు.. ఇలాంటి వారితో కొద్దిగా ప్రమాదం. వాళ్లు నిజంగా ఏం కావాలనుకుంటున్నారో.. అర్థం చేసుకోవటం ఏమంత పేద్ద ఆర్ట్?



ఉదా: ఈ అమ్మాయి ని చూడు .. BTech From IIT Chennai, ముప్పై లక్షల జీతం. ఐశ్వర్య లా ఉండదు కానీ.. ఏదో అనుష్క లా ఉంటుంది. వాళ్లకి సిటీ లో మూడిళ్లు, ముగ్గురు అన్నదమ్ములకీ ఒక్కతే వారసురాలు.. తండ్రికి ఊళ్లో డెబ్భై ఎకరాల పొలం.. పిల్ల నెమ్మదస్తురాలు. పాటలు బాగా పాడుతుంది ట. ఈ అమ్మాయి ని చేసుకొమ్మని అడుగుతున్నారు. చేసుకొమ్మంటావా? పర్వాలేదంటావా?

౩. ఇక మిగిలిన వాళ్లు నిజంగానే అడుగుతారు. పాటించవచ్చు, పాటించక పోవచ్చు. మళ్లీ మనల్ని అడిగి ..సలహా ని ఖచ్చితం గా పాటించరు అని నమ్మకం గా ఉంటే గొడవలేదు.. హాయిగా.. మనం నిజంగా ఏమనుకుంటున్నామో చెప్పచ్చనుకుంటామా? అక్కడ కూడా మన జాగ్రత్త లో మనముండాలి. అడిగిన వాళ్లకి సింపతీ ఉన్న వాళ్లకి వ్యతిరేకమైన అభిప్రాయం చెప్తే తట్టుకునే శక్తి సామర్ధ్యాలు ఉన్నాయా? అని. తర్వాత మళ్లీ మనతో మాట్లాడతారా మళ్లీ? అలా మాట్లాడకపొతే మనకి పర్వాలేదు కదా.. అని.



ఉదా: నాకు కొత్త ఐడియా వచ్చింది. ఫోన్ చేస్తే ఈరోజు వాతావరణం తెలుస్తుందన్నమాట. ఫోన్ కాల్ కి ఐదు రూపాయలు.. అని ఎవరైనా వచ్చి ఐడియా ఎలా ఉంది? అడిగితే 'ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది.' అనకుండా.. టీ వీ లో చూడచ్చు, పేపర్ లో చూడచ్చు.. అంతలా ఈరోజు వాతావరణం గురించి ఐదు రూపాయలు ఎందుకు ఖర్చుపెడతారు ఎవరైనా? లాంటి ప్రశ్నలు వేసే ముందు.. తర్వాత 'నా ఐడియా ని రిడిక్యూల్ చేసింది కృష్ణ! నన్ను కించపరిచింది' లాంటివి విని బాధ పడకుండా ఉండగలమా? ఒకవేళ మనం 'బాగుంది! విజయోస్తు! ' అంటేనో?

౪. కొద్ది మందికి మాత్రం నిజంగానే దిక్కు తోచక అడుగుతారే.. వీళ్లకి నిజాయితీ గా చెప్పవచ్చు. కానీ.. మన ఐడియా ఫెయిల్ అయిందో.. అంతే సంగతులు. వాళ్ల కష్ట నష్టాలకి మనల్ని బాధ్యులని చేయరూ?
ఉదా: పెళ్లి మధ్య వర్తిత్వం , స్టాకుల్లో పెట్టుబడీ... ల్ల్లాంటివి.. అమ్మో.

అన్నింటికన్నా ముఖ్యమైన గమనిక : బలహీన క్షణాల్లో వాళ్ల కష్టాలు చెప్పుకుని ఏరు దాటాక మనమంటే భయపడి మనకి దూరం గా మెలుగుతూ.. వాళ్లని వాళ్లు కష్టపెట్టుకుని.. మనల్ని గిల్టీ గా చేసి.. హబ్బో.. అదంతా చాలా గ్రంథం ఉంది.

ఇంతకీ ఈ సలహా పురాణం ఎందుకు విప్పానంటారా? ఇన్ని సలహా శాస్త్రాలూ ఆపోశనం పట్టీ ఈ మధ్య ౨-౩ సలహాల్లో పప్పులో కాలేసా గా ఆ వైరాగ్యం అన్నమాట.


మొన్నీ మధ్య ఒక అబ్బాయికి ఒక అమ్మాయి తెగ నచ్చేసింది. కానీ ఆ పిల్ల కి పొగ తాగే వాళ్లంటే వెగటు. అస్సలూ తట్టుకోలేదు. ఇతనేమో అప్పుడప్పుడూ పొగ తాగుతాడు. మానేసే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఫెయిల్ అవుతూనే ఉంటాడు. ఈ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గర పెళ్లి విషయం తెచ్చే ముందు.. నన్ను అడిగితే నేను ఆలోచించి 'నువ్వు ముందరే చెప్పకు ఈ విషయం ' అని ఒక సుత్తి సలహా ఇచ్చాను. అతను సాలోచన గా 'సరే' అని వెళ్లాడు. తర్వాత మొహం వేలాడేసుకుని వచ్చి 'సారీ.. నిజాయితీ ముఖ్యం కదా.. ' అని నువ్వు చెప్పినా వినకుండా.. చెప్పేసాను. ఆ అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టమే కానీ నేను పొగ తాగటం మాత్రం భరించలేను. I need to think about this.. sorry' అని చెప్పెసిందిట. దానితో నేను.. 'చూసావా? పెద్ద మహాత్మా గాంధీ.. తమ్ముడు బయల్దేరాడండీ' అని ఎద్దేవా చేసి నేను బాధపడి అతన్నీ 'అయ్యో తప్పు చేసానే' అనుకునేలా చేశాను.

కానీ రెండో రోజు సంతోషం గా వచ్చి నేను నిజాయితీ గా ఉండటం తనకు నచ్చింది. అని నాకు 'ఓకే' అని చెప్పింది. అని అన్నాడు. నాకు సిగ్గేసింది. నేను ఎంత చెత్త సలహా ఇచ్చాను. అని. ఆఫ్ కోర్స్.. ఒకవేళ ఆ అమ్మాయి నిజాయితీ లేదు, వంకాయ లేదు.. గెట్ లాస్ట్ అని వెళ్ళిపోయుంటే? అని సర్ది చెప్పుకుని ఊరుకున్నాను.

ఇంకో మిత్రుడు భార్య తో పొరపొచ్చాలొచ్చి విడి గా ఉంటున్నాడు. ఇంటి బాధ్యతలు తీసుకోవటం లేదని ఆవిడ పిర్యాదు. మొన్న తన చెల్లెలి పెళ్లికి రమ్మని.. ఊళ్లో వాళ్ల ముందు మర్యాదగా ఉండదని.. రెండు మూడు సార్లు అడిగినా ఆ అమ్మాయి.. 'పోరా' అని ఊరుకుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదని తల పట్టుకుని ఇతను 'ఏం చేయమంటావు?' అని అడిగాడు. నాకూ తెలియదు ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తే మంచిదో. బాగా ఆలోచించి
'కాళిదాసు కవిత్వం కొంతా.. నా సొంత పైత్యం కొంతా' లాగా నాకున్న పరిజ్ఞానం, వాళ్ల వల్లా, వీళ్ల వల్లా, సినిమాల వల్ల తెలుసుకున్నదీ ఏవో నాకు తోచిన విధాలు చెప్పాను. మొత్తానికి తనని ప్లీజ్ చేసుకునే సిల్లీ పద్ధతులు.
అంతా విని 'నేను ఇలాగే ఉండగలను. ఇవ్వాళ పెళ్లికి తనని రప్పించటానికి అబద్దపు పనులు చేసి తాత్కాలికం గా తనని ప్రసన్నం చేసుకోగలిగినా, జీవితాంతం కట్టు బడి ఉండలేను కదా.. పోన్లే.. ' అని వదిలేసాడు. నేనూ.. ఇలాంటి చెత్త సలహా ఇచ్చినందుకు నన్ను నేను తిట్టుకుని ఈసారి పిచ్చి సలహాలు ఇవ్వకూడదని ధృడ నిశ్చయం చేసుకున్నాను.

నిన్న ఆ అబ్బాయి ఆఫీస్ లొ అడుగు పెడుతూనే ఎదురొచ్చి..'కృష్ణా.. నీకొక మెయిల్ పంపా చూడు..' అన్నాడు. క్యూబ్ కెళ్లి చూస్తే మెయిల్ లొ 'జస్ట్ ఒక ఫోటో..' సరే తెరిచి చూస్తే.. ఆ అబ్బాయి చెల్లి పెళ్లి ఫోటో. ఒక పక్క అన్న, ఇంకో పక్క వదిన. 'వావ్.. ' అని కనుక్కుంటే.. ఆ అబ్బాయి చెప్పాడు. 'నా బాధ్యత నేను నిర్వర్తించకపొతే ఎలా ఉంటుందో.. నీకు చూపించుదామని అలా చేశాను.' అనేసిందిట. మనస్పూర్తి గా అభినందించి బయట పడ్డాను.
లాభం లేదు. ఇక పెళ్ళిళ్ళ కి సంబంధించి కొత్త రూల్స్ జత చేయాల్సిందే. ఎవరిదగ్గరైనా ఏమైనా సలహాలున్నాయా?
అలాగే మీకే విషయం లొ సలహాలు కావాలన్నా.. నేను ఇక్కడ బ్లాగు తెరిచి కూర్చున్నానని మర్చిపోకండెం!! online సలహా సర్వీసులు కూడా మొదలెడుతున్నా.. ఈసారి :)

PS. సరదా గా రాసాను. ఆఖర్లో రాసిన రెండు సలహాలూ నిజంగానే ఇచ్చాను. నిన్న ఒక బ్లాగర్ నా 'ఈరోజు' పోస్ట్ చదివి మెయిల్ ద్వారా ఒక చిలిపి సలహా అడిగితే ..నవ్వుకుని ఈ టపా రాసానన్నమాట.
బ్లాగర్ అడిగిన చిలిపి సలహా..

Priya gaaru
"మా ఇ౦ట్లో బోర్న్ విటా బాగా గట్టిగా అయ్యి౦ది. తినడానికి రావడ౦ లేదు. ఏదన్నా టిప్!!!!! :)"




 
;