దీపావళి పండగ.. (ఇదేంట్రా.. బ్రహ్మానందం అదేదో సినిమాలో చేసినట్టు.. హోలీ పండగప్పుడు దీపావళి కథ మొదలెడుతుందీవిడా.. అనుకుంటున్నారా? మనం కాస్త స్లో అన్నమాట!) వాళ్ల వాళ్ల ఇండ్లల్లో ఏం చేసుకుంటున్నారో తెలియదు కానీ,.. కాలనీ లో మాత్రం సామూహికంగా ఝం ఝం లాడించేయాలని నిర్ణయం జరిగిపోయింది. కాలనీ కల్చరల్ కమిటీ లో కొత్త గా ఇంట్లోకి దిగిన మాంచి ఉత్సాహమైన అమ్మాయి చేరింది. పిల్లా, జెల్లా లేరేమో.. సమయం కూడా బాగానే ఉన్నట్టుంది...
ఆ అమ్మాయి ఉత్సాహం చూసి .... మాలాంటి వాళ్ళకీ కాస్త ప్రేరణ కలిగి ప్లానింగ్ మొదలు పెట్టేసాం. నాకు సాధారణం గా అంత టైం/ఇంటరెస్ట్ ఉండటం అరుదు కానీ.. ఒకళ్లు కాస్త ముందుకు రావటం తో.. వెనక ఉండి చేయ గలిగినంత చేయచ్చని.. అదీ గాక మరి ఫస్ట్ లేడీ కదా మరి నాకొక ఇజ్జత్, గట్రా ఉండాలి కదా.. మా వారి ప్రెసిడెంట్ గిరీ లో .. సాంస్కృతపరం గా కూడా పేరు గడించవచ్చు..
ఇంకేం? ఆఫీస్ నుండి వచ్చాక పిల్లలు ఆటలకి బయల్దేరుతూనే. నేనూ కల్చరల్ కమిటీ మీటింగ్ కి వెళ్లాను.. ఇంట్లో అంట్లు తర్వాతైనా తోమచ్చు.. కాలనీ లో కాస్త మంచిపేరు తెచ్చుకుంటే ఎంత డాబు గా ఉంటుంది? "అబ్బా..కృష్ణ గారు ఎంత ఆక్టివ్.. ఇల్లూ, పిల్లలూ, ఆఫీసూ మానేజ్ చేసుకుంటూనే.. కాలనీ లో దీపావళి వేడుకలు ఎంత అద్భుతం గా జరిపించారు? " ఆహా.. ఆలోచనల తోనే ఒళ్లు పులకరించిపోయింది.. రాత్రి ఆఫీస్ మీటింగ్ లోపల చేయాల్సిన వంట, తిండి, పిల్లల హోంవర్కూ..మీటింగ్ లో కి కావలసిన నాలుగు స్లైడ్లూ.. అబ్బే... దీపావళి ధమాకా ఆలోచనల వీటో ఓటు ముందు వీగిపోయాయి...
మనం అసలు ఏది మొదలు పెట్టినా , మొదట ప్లాన్ చేసినా తిండేగా? అసలు ఆ మీటింగ్ లోకి ఏం తినాలో కూడా ఫోన్ల ద్వారా తెగ చర్చలు జరిపి.. ఫలితాలు రాక.. కావలసిన వాళ్లు ఎవరి చాయ్/కాఫీ వాళ్లే తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకునేటప్పటికే చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పరిస్థితి.. ఏర్పడింది...అలాంటిది నలభై ఇళ్ల వారు చేరి పండగ భోజనం ఏం తినాలో చర్చించాలంటే ఎంత కాంప్లెక్స్?
"పండగ భోజనాల బాధ్యత ఎవరు తీసుకుంటారు? కృష్ణాజీ ఆప్ లేంగే క్యా? " అని అడగ్గానే.. ..రోజంతా ఆఫీస్ లో ఏదో కస్టమర్ ఇష్యూ తో కొట్టుకోవటం వల్ల ఏర్పడిన మతి భ్రమణమో, ఏం జన్మలో ఏం పాపం చేసానో.. (అంటే ఈ జన్మ లో చేయలేదని కాదు.. వీటి ఎఫెక్ట్ ఇంకో రెండు మూడు జన్మలదాకా.. రాదని ఒక పిచ్చి నమ్మకం.. అదిచ్చిన ధైర్యం! ) దర్పం గా 'ఓకే' అని తల పైకీ కిందకీ స్టైల్ గా ఊపుతూ చూసాను..అందరివంకా..
కొందరు శ్రేయోభిలాషుల కళ్లల్లో జాలీ, నేనంటే విసుగు, చిరాకు ల్లాంటి భావాలున్న ఉన్న కొందరి మొహాల్లో.. టీవీ సీరియల్ కారక్టర్ల మొహాల్లో లాంటి వర్ణించలేని ఫీలింగ్ చూసా.. ఎందుకో ఒక్క క్షణం కొద్దిగా గుగుర్పాటు లాంటిది వచ్చింది.. ( రాం గోపాల్ వర్మ షోలే చూసాక వచ్చిన భావం లాంటిది ) కానీ.. 'భోజనాలదేముందీ? నాలుగు హోటళ్లు చూసి ఏదో ఒక దాంట్లో ఆర్డర్ చేసేయటమే.. మనమేమైనా గుండిగలు మోయాలా. గానుగలు తిప్పాలా? " అని నా ఆలోచనలని తిప్పి కొట్టి.. ఇంటికి నడిచా..
వారాంతం దాకా అసలు పండగ గురించి ఆలోచనలు రాలేదు.. అసలు అలాంటి ఆలోచన వచ్చినట్టు తెలిసినా.. మా బాసాసురుడు ఇంకొంచం పని ఇచ్చి ఆ కొద్ది తీరిక సమయానికీ కూడా పని చెప్పటానికి సిద్ధం గా ఉన్నారాయే... శుక్రవారం సాయంత్రం కార్ దిగి లోపలకి వస్తుంటే.. పండగ కి ఎంటర్టైన్మెంట్ బాధ్యత తీసుకున్నావిడ హడావిడి గా నలుగురినేసుకుని నడుస్తుండటం కనిపించింది.. పలకరింపుగా నవ్వా..
ఆవిడ అరనిమిషం ఆగి 'హాయి కృష్ణాజీ. ఎలా అవుతోంది మీ ప్రిపరేషన్? రెండు డాన్సులూ, ఒక నాటకం, స్కిట్, బింగో గేం ప్లాన్ చేశా.. సామూహిక పూజా, ముగ్గులూ,.. ఏర్పాటు చేశా.. అలాగే పాటలూ, ఫాషన్ షో కూడా పెడుతున్నా.. హాండీ క్రాఫ్ట్ స్టాల్ లాంటిది కూడా ట్రై చేస్తున్నా!!" అంది.. నా గుండె లో రాయి పడింది. 'వామ్మో.. నేను అసలు పండగ గురించే ఆలోచించలేదు.. చచ్చాన్రా!!! ' అని మనసులో అనుకుని.. పైకి మాత్రం గంభీరం గా.. 'యా.. కన్సిడరింగ్ వేరియస్ ఆప్షన్స్ యూ నో..' అన్నాను.. ఆవిడ ..'ఓకే..' అని వెళ్ళింది..
సరే.. ఇక లాభం లేదని శనివారం మొదలు పెట్టాను నా డిన్నర్ ప్లానింగ్.. మనమే అంతా ఎలా నిర్ణయిస్తాం? కాస్త అందర్నీ కనుక్కుందాం అని రెండో నంబర్ ఆవిడ కి ఫోన్ కొట్టా.. " ప్లేట్ 250 Rs కి తక్కువ అయితే మేము రాము డిన్నర్ కి .. ఆగస్ట్ 15 కి సొసైటీ లో సెలెబ్రేషన్ అప్పుడు మాకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఛీప్ గా పెడితే..మేము రాము..' అంది. 'ఓహ్.. ఖరీదైన ప్లేట్ ఐతే శుచికరం గా ఉంటుందని ఎలా చెప్పగలం? ...' అని ఇంకా ఏదో అంటుండగా ఆవిడ.. 'మా నాన్న గారు పేద్ద ఆఫీసర్... మాకు చిన్నప్పటి నుంచీ ఖరీదైన జీవితం అలవాటు..' అంది.. 'ఆహా.. చిన్నప్పటి నుండీ స్మార్ట్ గా ఉండంటం లాగా నా? ' అని మనసు లో అనుకుని.. పైకి మాత్రం వెర్రి నవ్వు నవ్వి.. "తర్వాత చెప్తా అప్ డేట్" అని చెప్పి తర్వాతి నంబర్ తిప్పా.
ఆవిడ.. 'మానేజింగ్ కమిటీ పెట్టుకుంటుందా? మనమే పే చేయాలా? ' అని అడిగింది.. 'మనమే ..' అంటుండగానే.. 'మా చుట్టాలొస్తారు దీపావళి కి.. మేముండము.. ' అని ఆదరా బాదరా గా పెట్టేసింది.. 'వార్నీ... అదే సొసైటీ పెడుతుంది ఖర్చు అంటే బంధు మిత్ర సపరివార సమేతం గా వస్తుందేమో..' అనుకున్నా..
ఎక్కువ మందిని కనుక్కుంటున్న కొద్దీ.. ఒక్కొక్కళ్ళూ వాళ్ల అద్భుతమైన ఆలోచనలతో.. నాకు కళ్ళు తిరిగేలా చేసారు. ఒకళ్లు అందరం.. ఇంటికొక వంట చొప్పున చేద్దామని, ఆ ఖర్చు తగ్గిద్దామనీ, ఇంకొకరు.. ప్లేట్ కి ౧౦౦ కి మించి పెట్టద్దని, వేరొకరు South Indian వంటలైతే రామని.. వేరొకరు రాత్రి పూట పూర్తి స్థాయి డిన్నర్ వేస్ట్.. అనీ.. ఒకళ్లు కారాలు ఎక్కువ అయితే తాము రామనీ.. ఒకళ్లు తమ పిల్లలు మహా అంటే ఒక్క రొట్టె ముక్క తింటారు కాబట్టి వారికి సెపరేట్ గా పే చెయమనీ..
తల పట్టుకుని కూర్చున్నా. ఇప్పుడర్థం అయింది...ఎవ్వరూ భోజనాల బాధ్యత ఎందుకు తీసుకోలేదో.. అయినా.. ఏదో ఏడాదికి ఒక్క సారి, ఒక్క పూట ఏదో తినే వంట గురించి ఇంత రభసా? పది మంది తో సరదా గా తినాలి కానీ...అని నాకు బాగా చనువు ఉన్న పక్కావిడ తో అంటే.. 'పది మంది తో మంచి తిండి తినాలి కదా.. దీపావళి అంటే దేశం లొ అందరికీ ఇంపార్టంటే... ఆ రోజు ఎవ్వరైనా.. మంచి విందు భోజనం చేయాలనుకుంటారు కదా..? ' అంది.. నేను బెంబేలెత్తాను. .
దానితో ఆడవాళ్లతో కాదు.. మగవారితో ఆడిగితే ఆఫీస్ లంచుల్లా కాస్త ఈజీ గా ఏదో ఒకటి అని వదిలేస్తారేమో.. అని కొంత మంది మగవారిని కదిపి చూశా..వాళ్లు మరీ.. 'మొదట ఎవరి దగ్గర కెళ్లారు? మా ఒపీనియన్ కోసం ముందర రాలేదు కాబట్టి నేనేమీ చెప్పను.. పదహారో నంబర్ ఆయన సౌత్ ఇండియన్ కావాలన్నాడా? అయితే.. పంజాబీ అయితే తప్ప నేను రాను.. అందరికీ ఆం లైన్ వోటింగ్ పెడితే? ' లాంటి సజెషన్లతో.. విసుగెత్తించారు. ఇక లాభం లేదని వెళ్లా.. పాత ప్రెసిడెంట్ గారింటికి.. ఆయన కూర్చుని చిద్విలాసం గా నవ్వి.., 'పది మంది దగ్గరికెందు కెళ్లావు? మీరు ఒకరిద్దరు కోర్ కమిటీ చేసుకో.. లేకపోతే.. అంతా నీమీదకే వస్తుంది.. ఒకళ్లు ఉత్తర భారతీయులయ్యేట్టు, ఒకళ్లు గుజ్జు, లేక మరాఠీ వారయ్యేట్టు కూడా జాగ్రత్త పడు ' అని జాలి గా గీతోపదేశం చేశారు.
ఒక ఆ ప్రయత్నాల్లో భాగం గా ఒక పంజాబీ అమ్మాయిని అడిగాను.. 'కోర్ ఫుడ్ కమిటీ లొ మెంబర్ గా ఉంటావా?' అని.. ఆ అమ్మాయి . 'ఉంటా.. కానీ.. నాకు మంచి పంజాబీ ఫుడ్ పెట్టిద్దాం.. నాకొక రెస్టారెంట్ తెలుసు.. అక్కడ పొద్దున్న ఫ్లైట్ లొ పనీర్ పంజాబ్ లోంచి వస్తుంది.. ఇంగువ దగ్గర్నించీ..అక్కడినుంచే తెప్పిస్తారు..multi cuisine andra family restaurants లాగా ఎవరో తెలుగు కుక్స్ తో వండించి ఇదే పంజాబీ భోజనం అని చెప్పరు..' అని పారవశ్యం గా చెప్తూ పోతోంది.. 'ఆహా.. ' అనుకుని... ఇక మధ్య దేశం వారి నడిగితే ఇంకే అభిప్రాయాలు చెప్తారో.. అని విరక్తి కలిగి.. ఇంటికి చేరాను. పండుగ చూస్తే నాలుగు రోజుల్లో..
'అవునూ.. ఎందుకు నేను అందర్నీ ప్లీజ్.. చేయటానికి ప్రయత్నిస్తున్నాను? అసలు సాధ్యమేనా? మా ఇంట్లోనే ఒకళ్ల మాట ఒకరికి పడదు.. ' అని ఒక ఆలోచన వచ్చింది.. మన ఇంట్లో అంటే మన డబ్బు కాబట్టి మనమే బాధ్యత పడతాం కాబట్టి.. ధైర్యం గా ఖర్చు పెడతాం. మరి జనాల డబ్బు అంటే...value for money అందివ్వాలనే టెన్షన్ లో ఇదేంటి ఇంత కష్ట పడటం? అయినా..నా మీద బాధ్యత పెట్టినప్పుడు నా ఇష్టం.. మహా అంటే.. తిండి బాగాలేదు.. కృష్ణ టేస్ట్ చెత్త.. అంటారు.. దానితో..ఇక ముందు కూడా నాకు బాధ్యత అప్పగించరు.. కదా.. అని ఉత్సాహం గా.. ఐదేళ్లు దాటిన మనిషికి 150 Rs చొప్పున పండుగ భోజనం తిందామనుకునేవారు చెల్లించాలని నోటీస్ పంపి.. ఆఫీస్ పక్కన ఉన్న ఒక 'multi cuisine andhra family restaurant' లో రెండు నార్తూ, రెండు సౌతూ, రెండు సలాడ్లూ, రెండు స్వీట్లూ ఆర్డర్ చేసి గమ్మున ఊరుకున్నా..
అదేదో పాత హిందీ సినిమా లో దేవానంద్ లా దీపావళి డిన్నర్ అప్పుడు ఎవ్వరి కళ్ళల్లోకీ చూడకుండా.. నుదుటి వంకా.. జుట్టు వంకా.. చూస్తూ పిల్లలున్న వైపు గడిపేసా.. ఫీడ్ బాక్ ఇవ్వటానికి వచ్చేటప్పుడు.. రింగ్ టోన్ నొక్కేసి.. ఫోన్ వచ్చినట్టు నటించి.. 'చాలా కొంపలు ముంచే ఇష్యూ.. అటెండ్ అవకపోతే.. నా తల తీసే ప్రమాదం ఉందన్నంత బిల్డప్ ఇచ్చి బయట పడ్డా..
అబ్బా!!..నేను దొరుకుతానా? బాసులు, కో వర్కర్లు, చుట్టాలు,పిల్లల స్కూల్ టీచర్లు.. ఎందరి ఫీడ్ బాక్ లు సాధ్యమైతే తప్పించుకుని, తప్పదంటే విన్నట్టు నటించి.. ఇంకెప్పుడూ ఈ తప్పిదం చేయను అన్నట్టు ముఖం పెట్టి బయట పడలేదు?
అప్పటికీ కొద్ది మంది పట్టు వదలని విక్రమార్కులు నా వెంట బడి మరీ ఇచ్చారనుకోండి..అబ్బే..మనం హర్ట్ అయితేగా.. కొద్ది మంది వెనకేం తిట్టుకున్నా, ముఖం మీద మాత్రం భోజనం బాగుందని ఇచ్చారు..
కాకపోతే .. సెక్యూరిటీ, హౌజ్ కీపింగ్ వాళ్ల గురించి మర్చిపోవటం వల్లా.. కొంతమంది ఐదేళ్ల లోపల అని తల్లిదండ్రులు రాయించినా,.. కేటరర్ ఒప్పుకోకపోవటం వల్లా.. వాళ్లకి టిప్స్ సంగతి మర్చిపోవటం వల్లా.. దాదాపు 1500 Rs ఖర్చు నా ఖాతా లో పడింది... చాల్లే దీనితోనయినా వదిలింది... ఇంక ఈ జన్మ కి వచ్చిన పేరూ, ప్రతిష్టా చాలు.. అని నిర్ణయించుకుని ఇదిగో..ఇలా ఊరూ పేరూ లేని మంద లో గొర్రె లాంటి జీవితం గడిపేస్తున్నా...