Showing posts with label అనుభవాలు. Show all posts
Showing posts with label అనుభవాలు. Show all posts
Wednesday, February 20, 2013 40 comments

సారీ.. తెనాలి రామా! నువ్వే రైటు..

అప్పుడెప్పుడో ఆయనకీ, నాకూ భేదాభిప్రాయాలున్నట్టు రాసేసినట్లున్నాను.. ఇక్కడ (http://krishna-diary.blogspot.in/2011/07/blog-post.html) కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకోవాల్సివచ్చింది...అయినా నా అభిప్రాయాలు శిలల మీద చెక్కినంత స్థిరంగా ఉన్నదెప్పుడని...




సప్తసముద్రాలు దాటి వచ్చిన వాడు ఇంటి ముందు నీటి గుంట లో పడ్డాడట.

అలాగ ఆటక మీద నుంచి పడి దులుపుకుని వెళ్లిన నేను, మెట్ల మీద నుంచి జర్రున జారి కాస్త అటూ ఇటూ విదిలించుకుని పనిలోకి దూరిన నేను, సన్నజాజులు కోయటానికి పాత ప్లాస్టిక్ కుర్చీ ఎక్కి అది ఫెళ ఫెళ మంటూ విరిగి పడితే, మళ్లీ ఇంకో కుర్చీ ఎక్కి మరీ పని పూర్తి చేసుకున్న నేను,..

ఓ శుక్రవారం పొద్దున్నుంచీ కదలకుండా ఒకేచోట కూర్చుని పని చేసి చేసి ఇక ఈ వారానికి చాలు ‘ఈ సోఫా లో మళ్లీ కూర్చోను.. సోమవారం దాకా’ అనుకుని సాయంత్రం లాప్ టాప్ షాపు కట్టేసి ఇక కాస్త సాయంత్రపు నడక కి బయల్దేరదామని లేచి అరడుగు ఎత్తు నుంచి దబ్బున కూలి పడి పాదం ఎముక విరగ్గొట్టుకున్నాను. ఓ రెండు గంటల్లో ఎక్స్ రే లూ, సిమెంట్ కట్టూ అన్నీ అయి, మళ్లీ అదే సోఫా లోకి వచ్చి పడ్డాను. మా వారూ, పిల్లలూ కూర్చో పెట్టి మంచి నీళ్ల దగ్గర్నించీ చేతికిచ్చి .. ‘ఆహా.. ఇంత రాజ భోగం ఉంటుందని తెలిస్తే ..ఎప్పుడో పడేదాన్ని..కనీసం కాలు బెణికిందనో, చేయి గుంజిందనో చెప్పైనా ఎన్ని సేవలు చేయించుకోవడం మిస్సయ్యానో ‘ అని ఓ సారి నిట్టూర్చాకా అందరికీ మరి ఫోన్ చేసి చెప్దామా? అని ఉత్సాహం గా ఫోన్ చేతిలోకి తీసుకుని మొదలు పెట్టాను.




కొందరు విషయం వినగానే రాత్రికి రాత్రే వచ్చి పలకరించి వెళ్తే, కొందరు..ఫోన్ మీదే సానుభూతి ప్రకటించారు. మరి కొందరు పిల్లలకి సహాయం ఆఫర్ చేస్తే, ఇంకొందరు తలుపు కొట్టి మరీ రకరకాల వంటలు తెచ్చి పెట్టారు. ఆఫీసు వాళ్లు చేతనైనంత ఇంట్లోంచి చేయి..లేదా మానేయి అని ఆదరం చూపిస్తే,..మా అత్తగారు ఆఘ మేఘాల మీద సహాయం గా ఉండటానికి వచ్చేశారు.మా మేరీ డార్లింగ్ ‘నువ్వు.. సరిగ్గా పూడ్సేవరకూ.. నాను.. ఇక్కడనే.. ఉంటాను మాడం’ అంది. వెలక్కాయ పచ్చడి నుంచీ ఎగలేస్ కేక్ దాకా ఏదో ఒకటి తెచ్చి ఇవ్వడం, నేను తినేయడం .. బాగానే అలవాటైపోయింది. రేపు కట్టు తీసేశాకా, ఓ నాలుగు కిలోల బరువు పెరిగితే అస్సలూ ఆశ్చర్యపోవాల్సిన పనీ లేదు.

http://www.youtube.com/watch?v=5E9bSGA4w0U

అదేం చిత్రమో.. టీవీ చానెళ్ల వారికి ఎలా తెలిసిందో.. ఏ చానెల్ చూసినా చక్రాల కుర్చీల్లో చెదరని మేకప్ లో ఆడవాళ్లని ‘దారి చూపిన దేవతా..’ , మా ఇంటి మహాలక్ష్మి నీవే’ అని ముద్దుగా చూసుకునే సినిమాలు తెగ వేశాడు. నాకు అంత జరగట్లేదని మా వారిని నిష్టూరాలాడితే.. ‘నేనూ పాడతా లే.. (ఎ) డారి చూపిన దేవతా.. లేక (గో) దారి చూపిన దేవతా ‘ అని..నా ఆశల మీద నీళ్లు చల్లేసారు  గయ్యి మని లేవగానే..

http://www.youtube.com/watch?v=SslpgwUIA9s

‘నువ్వు అలా పట్టు చీర కట్టుకుని వీల్ చెయిర్ లో కూర్చుంటే పోనీ మా ఇంటి లోని మహాలక్ష్మి.. అంటూ జడేస్తాను అయితే.. అని సెటైర్లు వేశారు. బయట వాళ్లే నయం..బోల్డు సలహాలిచ్చారు.

మా అన్న తెనాలి రాముడు మాత్రం అబ్బో అడుగడుగునా, అదేదో సినిమా లో అలీ లాగా ముక్కున వేలేసుకుని, సొట్ట బుగ్గలతో, నవ్వుతూ తలాడిస్తున్నట్టు అబ్బో.. ఒకటే గొడవ. అయినా ఆయనకి వ్యతిరేకాభిప్రాయాలు వెలిబుచ్చి నిలిచిందెవరంట?

నాకొచ్చిన సలహాలు..

అసలెందుకు పడ్డావు?

కృష్ణా.. నీకు దూకుడెక్కువ.. ఇంక నెమ్మది గా నడవటం నేర్చుకో..!!! (నేను నడుస్తూ పడలేదే?)

వయసు పెరుగుతున్నప్పుడు ఎముకలు బిరుసు బారిపోయి ఉంటాయి.. జాగ్రత్త గా ఉండాలి.. (ఓకే. అయితే ఈసారి ఆరడుగు ఎత్తు కూడా ఎక్కకుండా జాగ్రత్త గా ఉండాలి..)

పచ్చళ్లూ, పొడులూ తింటావు.. టీ ఎక్కువ గా తాగుతావు. తగ్గించేసి, కాల్షియం ఎక్కువ ఉన్న కూరలూ, పళ్లూ తినాలి.అయినా కాస్త డయట్ చేయి.. (అలాగే.. అన్నీ తగ్గించేస్తా...)

తిండి లో కాల్షియం సరిపోదు. కాల్షియం టాబ్లెట్లు తీసుకోవా నువ్వు? (డాక్టర్ ని అడిగినా అక్కర్లేదన్నాడు.. మరి..మళ్లీ అడిగి చూస్తా)

మొన్న ధనుర్మాసం లొ సరిగ్గా గోదాదేవి వ్రతం చేసావా? అంటే ఏమన్నావు.. నాకు ఆసక్తి ఉండదు.. ఉన్నా సమయం ఉండదు.. అని..చూశావా ఇప్పుడేమయిందో? (మరి తమరు.. యదావిధి గా అన్ని పూజలూ చేస్తూ వస్తున్నారు.. మరి మీకు ఏ కష్టమూ రావటం లేదా?’)

నరుడి దృష్టికి నల్ల రాయైనా పగులుతుందంటారు.. మరి ఊర్కే,.. ఫేసు బుక్కు లో ఫొటోలు పెడతావు.. నేనింత గొప్ప, నాకిన్నున్నాయి.. అని తమకీ కొట్టుకుంటూ తిరుగుతావు. ఫలితం చూడు.. (నేను..ఆఫీసు లో మరి performance reviews లో తప్ప ప్రగల్భాలు అంత చెప్పుకున్నట్టు లేదే?)

ఇల్లు క్లీన్ గా ఉంచుకోవాలి. ఎప్పుడూ ఆఫీసూ, ఆఫీసూ అని పరిగెత్తకూడదు. అందుకే నేను ఒకటికి రెండు సార్లు శుభ్రం గా కడుగుతాను. ఎక్కడి వస్తువులక్కడ పెట్టుకోవాలి. నేల జిడ్డు గా ఉంటే అంతే.. (హ్మ్. ఈ ముక్క మా మానేజర్ గారికి వినపడాలి. ఖంగు తింటాడు..ఆయనేమో..ఇల్లూ, ఇల్లూ అని పరిగెడతానని ఒకపక్క సాధిస్తుంటేనూ...నేను జిడ్డు గా ఉన్న నేల మీద జారి పడ్డానని ఎవరన్నారబ్బా?)

నడవాలా వద్దా?

ఇదిగో.. నడవకు.. ఒక చోట ఉండు.. లేకపోతే జీవితాంతం నొప్పి వెంటాడుతూనే ఉంటుంది.. (మరి డాక్టర్ గారు.. నడువు అని చెప్పారే)

ఇదిగో.. ఒకేచోట జడ్డిగా కూర్చుండిపోకు.. ఎప్పుడు చూసినా కూర్చునే కనిపిస్తున్నావు.. కండరాలు బిగదీసుకుపోతాయి. అలాగే రక్త ప్రసరణ ఆగిపోతుంది. కాస్త పనులు చేసుకుంటూ ఉంటే మంచిది. (అవునా. పొద్దున్న వంట, చేస్తున్నాను. ఒక ఫ్రాక్చర్ అయిన కాలు బయట పెట్టి మంచి కాలుని లోపల పెట్టి నుంచుని పిల్లలకి తలంట్లు పోస్తుంటే? సాధ్యమైనంత వరకూ యోగా..లాంటివి చేసి అప్పర్ బాడీ ఎక్సర్సైజులు చేస్తూ.. మనసు, శరీరం కంట్రోల్ లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే..? ఎలాగూ కూర్చునే ఉంటాను.. అని ఆఫీసు పని చేసుకుంటుంటే? వడియాలు,కంది పొడి, ఆవకాయలు ఖాళీ గానే ఉన్నాను కదా.. అని పెట్టుకుంటే?, మహా భారతం మరోసారి చదువుకుని కొత్త బ్లాగు కూడా మొదలు పెడితేనూ.. )

ఇదిగో కాస్త లీన్ గా ఉన్నవాళ్లకయితే త్వరగా తగ్గుతుంది.మరి బల్కీ గా ఉన్నవారి బరువంతా చిన్న పాదం మీద పడటం తో మీకు నడకకి ఉన్న ఇబ్బంది ని నేనర్థం చేసుకోగలను.. (నేను—కన్నీరు తుడుచుకుంటూ.. నన్నర్థం చేసుకునేవారు ఇన్నాళ్లకి దొరికారు..) అయినా నడిచి తీరాలి.. (ఈయన కోసమైనా నడవాలి నేను...)

ఎలా నడవాలి?

స్ట్రెయిట్ గా నడువు.. అలా వంకర గా నడిస్తే.. అదే అలవాటై కూర్చుంటుంది.. (ఆ కట్టు వేసిందే.. పాదం దగ్గర ఎముక కదలకూడదని.. స్ట్రెయిట్ గా ఎలా నడుస్తారు? అయినా పెళ్లయిపోయింది గా?;))

ఇదిగో ఒక స్టిక్ తీసుకుని నడువు.. నాకు తెలుసు.. కర్ర సహాయం తీసుకుంటే ముసలి దానిలా ఉంటావని భయమా? ( ఆవు మల్ల.. పిల్లలు తెచ్చిన బట్టలేవో కట్టుకుని .. అంటే ఎర్ర టాప్, ఆకుపచ్చ బాటం, మామిడి పండు రంగు చున్నీ, కాలికి కట్టు, వంకర నడక తో కొత్త వన్నెలు తీరిన నా సౌందర్యానికి, కొత్త గా కర్ర సహాయం.. తీసుకుంటే వచ్చే నష్టం ఏంటంట?)



సైకలాజికల్ కౌన్సిలింగ్ ..

నాకు ఏదో అయిందని సెల్ఫ్ పిటీ లోకి వెళ్లిపోకు.. నీకేమీ అవలేదు.. నీకన్నా కష్టం లో ఉన్నవాళ్లని చూసి ధైర్యం తెచ్చుకో.. లేచి తిరుగు.. ( పాత పాట గుర్తొచ్చింది... నడవాలమ్మా..నడవాలి...అవును.. నాకేమీ అవలేదు.. నడవాలి నేను...నడవాలి!)

ఆరోగ్యానికి సూచనలు..

కాస్త లేచి ఎండలోకి వచ్చి కూర్చో.. డీ విటమిన్ వచ్చి, ఎముక అతుక్కుంటుంది... అసలే సాఫ్ట్ వేరు వారు.. ఎప్పుడూ నీడపట్టున కూర్చునీ, కూర్చునీ.. (అమ్మా.. కూర్చుంటాను. ఎండలోనే కూర్చుంటాను. నీడ మాటేత్తను.. తల్లీ..)

కర్పూరం కరిగించి, ఆవనూనె లో..కాస్త.. కలిపి...... మర్ధనా చేసి... (ఇదిగో మిమ్మల్నే,.. కాస్త బజారు కెళ్లి కర్పూరం, బిళ్ళ గన్నేరు,.. ఆవనూనె, జిల్లేడు కాయలూ, నిమ్మగడ్డీ, కరక్కాయలూ, కర్పూరం, .... తెస్తారా.. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయా? ఏమో.. ఆమాత్రం నాకోసం తెలుసుకుని తేలేరా? అదేంటి అంత కోపం? అసలు కోపం రావాల్సింది నాకైతేనూ.. అదే తలనొప్పి వచ్చినా పక్కింటి మీనాక్షికి..వాళ్లాయన....)

హోమియో లో మందుందిట.. ఒక్క పూట లో నయమైపోతుందిట.. (మరి మా హోమియో డాక్టర్.. ఆరు వారాలు ఆగాల్సిందే అన్నాడే)

ఒక బకెట్ నీళ్లల్లో గోరు వెచ్చటి నీరు పోసి.. ఉప్పు వేసి.. కలియబెట్టి దాంట్లో.. కాలు ముంచు.. (మరి డాక్.. నీళ్లకి ఆమడ దూరం ఉంచమన్నాడే...)

And the award for the best advice goes to....

మాకు చిన్న చిన్నటాక్స్ పనులు చేసి పెట్టే ‘టాక్స్’ నాగరాజు గారు చాలా మంచాయన.. ఆయన పడ్డ కష్టం ఎదుటి వారు పడకూడదని ఆయన ఆత్రం కాస్త పెద్దాయన..ఓరోజు వచ్చి నా కాలు చూసి బాగా నొచ్చుకుని మంచి సలహా ఇచ్చారు. ‘అమ్మా.. అలాగ కూర్చుని ఉండిపోకు.మా అత్తగారు. అలాగే కుర్చీ లో కూర్చుని కూర్చుని..తర్వాత,నుంచో లేక పోయారు.పోయేంత వరకూ.. అలాగే.. ఒక కాలు.. తొంభై డిగ్రీల కోణం లో ఉండిపోయింది. పోయేదాకా అందరం ప్రయత్నిస్తూనే ఉన్నాం.. అందరం.. చివరకి... అని చాలా డ్రమాటిక్ గా ఆగి నన్ను చూశారు..

నాకేమో నరాలు చిట్లిపోయేంత టెన్షన్.. ‘ఏమైంది.. చెప్పండి.. ‘ అన్నాను.. ఉత్కంఠ గా.. తొంభై డిగ్రీ ల కోణం నుండి కొంచెం గూడా కాలు కదిలించకుండా..

ఆయన.. మన జోయీ (ఫ్రెండ్స్ లో అబ్బాయి) లా మొహం పెట్టి.. ఆవిడ పోయాకా.. స్నానం గట్రా చేయించాకా మరి పాడె మీదకి ఎక్కించేముందు ఇద్దరం అటు, ఇద్దరం ఇటూ పట్టుకుని లాగాము. అలా కూర్చో పెట్టి కాలిస్తే బాగుండదు కదా అని..

దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది.. నిజమే కదా.. ఒక్కసారి నేను అలా .. ఊహల్లోకి వెళ్లి వచ్చేశాను. ముల్లా నసీరుద్దీన్ చనిపోయే వరకూ జనాల్సి నవ్వించి నవ్వించి పోయే ముందు చుట్టూ అందరినీ సీరియస్ గా కూర్చుని బాధ పడటం చూసి.. ‘ఇలా కాదని’ కాస్త గోడ దగ్గరకి తనని జరపమని కాళ్లు గోడ మీదకి నలభై ఐదు డిగ్రీల కోణం లో పెట్టి పోయాడట. దానితో ఆయన పోయాక కాళ్లు కిందకి పెడితే తల పైకి లేస్తుందిట, తల కిందకి తోస్తే కాళ్లు పైకెళ్ళిఅందరూ హాయిగా నవ్వుతూ అంత్య క్రియలు చేసేలా చేసాడట.

నాకు అలాంటి పరిస్థితి కలగకూడదన్న ఆయన ఆవేదన నన్ను కదిలించింది. ఏమనాలో తెలియక.. ‘అలాగే.. అప్పుడప్పుడూ లేస్తూ ఉంటా లెండి..’ అని మాట ఇచ్చాను. ఒకవేళ నాకలాంటి పరిస్థితి వస్తే.. ‘ఆ నలుగురూ..’ . కావాల్సింది ఇలాంటి వాటికి కూడా అని తెలిసొచ్చింది. ఎందుకైనా మంచింది. మనల్సి వంచి సాగదీసే శక్తి ఉన్న నలుగురితో మంచి గా ఉండాలి బాబోయ్..

అబ్బబ్బ.. మరి తెనాలి రామా.. నువ్వే రైటయ్యా.. సలహాలివ్వటమే తేలిక.. నేనే ఏదో, నిన్ను వ్యతిరేకించి పేరు గడిద్దామానుకుంటేనూ....



గమనిక : టపా సరదాకి రాసుకున్నది మాత్రమే.. నా మీద ఎంతో అభిమానం ఉండి, నేనిచ్చిన చనువు వల్లే నాకు నా హితులు, సన్నిహితులూ, స్నేహితులు, బంధువులు ఇచ్చిన సలహాలివి. ఈ నలభై రోజుల ‘confinement’ నాకు ఇంతమంది ఉన్నారని కళ్ళు చెమర్చేలా చేసింది.

Thursday, January 3, 2013 16 comments

సైడు బెర్తు ఆవిడా, నేనూ


బెంగుళూరు – కాచిగూడా బండి ఎక్కి కూర్చున్నాం. తత్కాల్ లైన్లో మూడు గంటలు పడిగాపులు గాస్తే దొరికిన టికెట్లు.. ఏసీ టూ టయర్. నేనూ, నా పిల్లలూ సామాన్లు సద్దుకుని కూర్చున్నాకా ఎదురు గా చూస్తే నల్లటి గుబురు మీసాలు, పెద్ద బొజ్జ, ఎర్రటి పెద్ద కళ్ళు.. నుదుటన పెద్ద నామాలు.. కొద్దిగా భయం వేసింది. పిల్లలు కూడా ఒకింత గుబులు గా ‘నాన్నా.. నువ్వూ మాతో రావాల్సింది.. అప్పుడు ఈ నాలుగు సీట్లూ మనకే ఉండేవి..’ అంటుంటే గుబురు మీసాలాయన చిన్నగా నవ్వాడు. చేతిలో ఏదో తమిళ పుస్తకం.

రైలు బయల్దేరింది.. చిన్నగా మేమూ తిండీ గట్రా ముగించుకుని ఎవరి పుస్తకాల్లో వాళ్లం తలలు దూర్చేసాం. కానీ నాకెందుకు అనీజీ గా ఉందో కాసేపాగాకా లైట్లు ఆపుచేసి పరదాలు వేసినప్పుడు అర్థమైంది. రోజులు అస్సలూ బాగోలేవు. ఆడ,మగా అని లేదు, వయసు ని చూడటం లేదు.. వాహనాల్లో జరిగే అత్యాచారాల గురించి వార్తా పత్రికలూ, చానెళ్ళూ హోరెత్తిస్తున్నాయి.. చాలా సేపు నిద్రే పట్టలేదు.. ఆలోచనల్లో ఎప్పుడో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాకా ‘మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మం హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్ ప్లీ ఈ ఈ ఈ జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్, దుబ్బ్ దుబ్బ్..’ శబ్దం.. మంద్రంగా.. భయంకరం గా..

టపక్క్ మని కళ్ళు తెరిచి చూస్తే.. కర్టెన్ చాటు ఒక మనిషి కదలికలు తెలుస్తున్నాయి. అసలేం జరుగుతుందో అర్థమయ్యేలోపల ఒక్కసారి గా కర్టెన్ తో సహా ఒక మనిషి దుబ్బుమని రెండు సీట్ల మధ్యలో పడ్డాడు.. ‘అమ్మ్మా..’ అంటూ! నాకు మతి తోచలేదు. కెవ్వుమని కేకేసి కాళ్లు వేగం గా ఆడించి కిందపడిన మనిషి ని తన్నటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఒక్కటీ తగిలినట్టు లేదు.

ఆ మనిషి ఎందుకొచ్చినట్లు? పై బెర్త్ గుబురు మీసాలాయనా? లేక దొంగా? చేతిలో కత్తా? గన్నుందా?

ఈలోగా లైట్లు వెలిగి టీసీ, ఒకరిద్దరు మనుషులు వచ్చేశారు.. నా కళ్లజోడెక్కడ చచ్చిందో.. టీసీ వచ్చి ‘చిన్న కిడ్.. కంగారు పడకండి..’ అని చెప్తున్నాడు. ‘చిన్న పిల్లా!! అయ్యో మా పాప! పై సీట్లోంచి పడినట్లుంది..’ నేను కర్టెన్ లాగేసి కింద నుంచి శాల్తీని లేపి నా పక్కన కూర్చోపెట్టుకుని లొడ లోడా వాగుతూ వీపు మీద దబ దబా కొడుతూ ఊరడించడం మొదలు పెట్టాను. ఇదేంటి ఇంత గింజుకుపోతోంది.. షాక్ తిందేమో నా చిట్టి తల్లి.. వాగుడు లెవెల్ ఎక్కువైంది..

‘అమ్మా.. ఏమైంది?’ అంటూ పైన్నుంచి పెద్ద పిల్ల అడుగుతోంది. ‘అదేంటి? ఇది పెద్ద పిల్ల కాదా?’ ఎదురు గా కింద సీట్లోకి చూశాను. మా చిన్నమ్మాయీ లేచి చూస్తోంది..

అయితే నేను ‘ఓదార్చేది’ ఎవర్ని? అని చూస్తే ఎర్ర చొక్కా వేసుకున్న ఒక చిన్న పిల్లాడు. మా పెద్దమ్మాయి వయసులోనే ఉన్నాడు.. ఇట్లా కాదు కానీ నా కళ్లజోడు కోసం పర్సు తెరిచి పెట్టుకునేసరికి సీనంతా అర్థమైంది.



పది-పన్నెండేళ్ల కుర్రాడు.. అర్థరాత్రి బాత్రూం కెళ్లి వస్తూ అన్ని సీట్లకీ కర్టెన్లు వేసి ఉండటం తో, పొరపాటున వేరే సైడ్ బర్త్ కర్టెన్ తీసి అమ్మా.. అమ్మా.... అని భుజం మీద కొట్టబోయాడట. ఆవిడ దెబ్బకి భయపడి పిడి గుద్దులు గుద్ది, అదీ చాలక కాళ్లతో తోసేసిందట. దానితో మా సీట్లకి మధ్యలో పడిపోయాడు..

ఆ బాబు ని వాళ్ల తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయాకా. మా అమ్మాయిలు ‘అబ్బా..ఎంత భయమైతే మాత్రం.. మరీ అంత గట్టిగా అరవాలా? It was so embarassing you know!’ అనేశారు.. ‘భడవల్లారా! మీరు ఎన్నెన్ని ప్రాంతాల్లో ఎన్నెన్ని వందల సార్లు నన్ను తలెత్తుకోకుండా చేయలేదు?’ అనుకుని గోరంత దీపం లొ సూర్యాకాంతం లా ‘హమ్మ కూతుళ్లో, హమ్మ కూతుళ్లో.. ‘ అని నిట్టూర్చాను.

ఇక నిద్ర పడితే ఒట్టు.. చిన్నది పడుకుంది. కానీ పెద్దమ్మాయి మాత్రం నిద్ర పట్టడం లేదంది. ‘సరే.. రా.. అని దుప్పటీ కప్పుకుని లాప్ టాప్ లోకి డౌన్ లోడ్ చేసిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్ ‘ సినిమా ఇయర్ ఫోన్లు పెట్టుకుని చూపించి మరీ మా అమ్మాయి పరమ గిల్టీ గా ఫీలయ్యేలా చేశా..

ఉదయం రైలు దిగే వేళ ఆ పిల్లవాడి తండ్రి వచ్చి సైడు బర్త్ ఆవిడకి క్షమాపణ చెప్తూనే, ‘మా అబ్బాయి బాగా భయపడ్డాడు. వాడికి గుండె జబ్బు. హైదరాబాదు లో పెద్ద ఆసుపత్రి లో ఆపరేషన్ కోసం తెస్తున్నాం.. అని సమాధానం చెప్పే ఆస్కారం ఇవ్వకుండానే దిగిపోయారు. అది వినగానే ‘ మాకూ గుండెలు కలుక్కుమన్నాయి..

టెర్రరిస్టుల వల్ల ఎలాగూ జనాలు బాగా తిరిగే చోట్ల, ఎవ్వర్నీ నమ్మడం తగ్గించేశాం. బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నాం. వార్తా పత్రికల,ఇంకా టీవీ, ఇంటర్నెట్ లాంటి సాధనాల వలన వరస అత్యాచారాల సంగతులు వినీ వినీ సాటి మనిషిని నమ్మాలన్నా వంద సార్లు ఆలోచించాల్సివస్తోంది...

సైడు బర్తావిడ ‘నేనేం చేయనండీ.. నేనూ పేపర్లు చదువుతున్న మనిషినే. మా ఇంట్లోనూ టీవీ ఉంది. అర్థరాత్రి కర్టెన్ తీసి మనిషి మీద కి వంగి భుజం కుడుపుతుంటే.. నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు..’ అని బెంగపడుతూ దిగింది.. వెనకాలే మేమూనూ..

Wednesday, September 21, 2011 49 comments

వావ్! నేను తెల్లవారుఝామున కన్న కల నిజమైంది....



విజయ గర్వం తో జై జై ద్వానాల మధ్య.. నాలుగు వైపులా జనాలు కరతాళ ధ్వనులు.... ఒక చేతిలో ఖడ్గం.. రెండో చేతిలో రథం పగ్గాలు. రథాన్ని ఆపి శిరస్త్రాణం తీసి,కవచాన్ని వదులు చేసి దిగాను. నా చేతిలో ఉన్న వస్తువుల్ని ఇద్దరు ముగ్గురు అందుకున్నారు.. దుమ్ముకొట్టుకుపోయిన,అక్కడక్కడా చిరిగిన బట్టలు, చిన్నపాటి గాయాలు. జుట్టు చెదిరి, వొళ్లు నొప్పులు .. బురద తో నిండిన పాదరక్షలు.. వెనక్కి తిరిగి చూశాను. చాలా మంది ఇంచుమించు నాలాగే.. యుద్ధం లొ పోయిన వారు పోగా.. కొందరు క్షతగాత్రులై చికిత్సా శిబిరాలకి తరలి వెళ్లిన వారు కొందరైతే.. రథాలు విరిగి, వాహనాలకి, శరీరాలకి గాయాలయినా.. కొండలూ, కోనలూ, నదులూ దాటి, విజయాన్ని చేజిక్కించుకుని ఆనందం చిందుతున్న మొహాలతో నా వాళ్లు నా వెనక..



‘కృష్ణా..లే.. మళ్లీ లేటయింది అని గోల పెడతావు.. నువ్వు లేస్తే కానీ.. పిల్లలు లేవరు’ అని మా వారు.. ‘ఆహా! ఇదంతా కలయా!..తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమౌతాయంటారు.ఐతే ఇవ్వాళ్ల యుద్ధం చేస్తానా? రాత్రంతా వర్షం కురిసినట్టుంది.. సరే లే జీవితమే ఒక యుద్ధం.... ‘ అనుకుంటూ లేచి పనుల్లో పడ్డాను.

ఎవరితో అవుతుంది యుద్ధం? అత్తగారితో.. ఆవిడకా ఓపిక లేదు. నాకా తీరిక లేదు. పిల్లలతో, పక్కవాళ్ళతో,పని మనిషితో.. పాలు పోసే అబ్బాయితో.. మా వారితో.. ఫోన్లో స్నేహితులతో.. ఇలా సరదాకి..ఎవరితో అవవచ్చో ఆలోచించాను.

బాసు తో యుద్ధం అవుతుందేమో.. ఇవ్వాళ్ల.. లేక మా సింగం,నేనూ కలిసి టెస్ట్ టీం వాళ్లతో గొడవ పడం కదా.. అనుకుంటూ బయటకి స్కూటర్ తీశాను.. హెల్ మెట్, జాకెట్ వేసుకుని రివర్స్ చేస్తున్నాను. DRDO లొ సైంటిస్ట్ ఆవిడ కార్ లొ వెళ్తూ నా వైపు పలకరింపు గా చూసి నవ్వి..’ఏంటి? వర్షం రాత్రంతా వర్షం! స్కూటర్ మీద వెళ్తున్నారా? జాగ్రత్త!’ అంది. కొద్దిగా జంకు గా అనిపించింది కానీ ఎక్కుబెట్టిన రామ బాణాన్నీ, ఒకసారి బర్రు మనిపించిన స్కూటర్నీ ఇక వెనక్కి తిప్పే ప్రశ్నే లేదు.




కాస్త మెయిన్ రోడ్డెక్కా.. ఒక ఇరవై నిమిషాల తర్వాత పావు కిలో మీటర్ నడిచి ఆగింది బండి.. పర్వాలేదు.. ఇవ్వాళ్ల పెద్దగా ట్రాఫిక్ లేదు.. అనుకుని బండి పార్క్ చేశా నడి రోడ్డు మీద. పక్క స్కూటర్ ఆయన ఎవరితోనో.. ఫోన్లో కబుర్లు చెప్తున్నాడు.. ముందు మోటార్ సైకిల్ ఆయన షేవింగ్ కిట్ తీసి గడ్డం గీస్తున్నాడు. ఇంకో ఆవిడ హెల్ మెట్ తీసి దాంట్లో పాకెట్ లోంచి సన్నజాజులు గుమ్మరించి మాలలు కడుతోంది. నేను బ్యాగ్ తీసి చూస్తే.. ట్రాఫిక్ జాముల్లో చదువుకునే పుస్తకం కనపడలేదు. పోన్లే.. కాసేపు యోగా చేద్దాం అని మొదలు పెట్టాను.


కాసేపయ్యాక ఒక్కసారి గా హారన్ లు కొడుతున్నారు. ‘హమ్మయ్య.. ఇంకో రెండు ఇంచులు ముందుకెళ్లచ్చు.. అని మళ్లీ స్కూటర్ ఆన్ చేసి రెండించులు ముందుకెళ్లి ఆగి అటూ ఇటూ చూస్తున్నా రాత్రి మీటింగ్ అర్థ రాత్రి దాకా అయ్యింది. ఒక్క కునుకు తీద్దామా? అని కాస్త సెంటర్ స్టాండ్ వేసి బ్యాగ్ దిండు లా అడ్జస్ట్ చేస్తుంటే ‘హాయ్ కృష్ణా!’ అని మా ఎదురింటావిడ కార్ లోంచి పిలుస్తోంది. సరే కబుర్లేసుకోవచ్చు.. అని ఉత్సాహంగా ఆవిడ విండో దగ్గరకెళ్లి ఈ ఆదివారం చూసిన ఈ టీ వీ సుమన్ సినిమా ట్విస్ట్ కథ మొదలు పెట్టా.. ఆవిడ..’కృష్ణా! యూట్యూబ్ లొ ఉందన్నావు గా.. చూస్తాలే’ అని రెండు చేతులూ జోడించి దీనం గా అడిగింది. ‘అమ్మా! ఆశ! నువ్వు మళ్లీ ఇంత తీరిగ్గా దొరుకుతావా?’ అని మొదటి భార్య ఎంట్రీ దాకా చెప్పా.. మరి మొన్న వాళ్లింట్లో తమ్ముడి పెళ్లి ఫోటోలు దాదాపు ఏడు వందలు చూపించినప్పుడో?

 
ఇంతలో ఏ కమ్యూటర్ చేసిన వ్రత ఫలమో..అక్కడ ఆక్సిడెంట్ తాలూకు శకలాల్ని తొలగించి వదిలినట్టున్నారు.. ముందు నుండి ఒక హారన్ మోగింది.. అందరూ ఉత్సాహం గా బోయ్ బోయ్ అని ఒకటే మోత. ఒకేసారి అందరూ బండ్లు ముందుకురికించారు.


కళ్ళు మూసి తెరిచేలోగా అన్ని వైపులనుండీ బండ్లు... ముందుకు దూసుకుపోతున్నాయి. దుమ్ము మేఘం లా చుట్టూ దట్టం గా..
స్కూటర్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, కార్లు, టెంపో ట్రక్ లు, వాన్లు, బస్సులు, లారీలు, ఒకటేమిటి.. మధ్యలో పాదచారులు, వీళ్లు చాలదన్నట్టు మహా నగర సింహాలు (అవేనండీ గ్రామ సింహాలు/శునక రాజాలు) ఆవేశం తో రోడ్డు మీద.. బరి లోకి ముందడుగు వేస్తున్నాయి..




అదేదో యుద్ధం శంఖారావం ముందున్న సైన్యాధ్యక్షుడు చేయగానే.. సైన్యం అంతా వారి వారి శంఖాలు పూరించి శూలాలు పట్టుకుని వెళ్లే పాదచారులు, గుఱ్ఱాల మీద వెళ్లే వారు (ఆశ్వారూడులు), ఏనుగుల పై వెళ్లేవారు, రథాలనధిరోహించి రథ సారథి పై ఆధారపడి బాణాలూ అవీ సరి చూసుకునేవారు ముందుకి ఉరకలేస్తూ వేగం గా వెళ్తున్నట్టు..


ఒక్కసారి గా బల్బ్ వెలిగింది ఉదయపు కల నిజమైంది అని అర్థమైంది. టపటపా కన్నీళ్లు కారిపోయాయి. జ్ఞాన/ఆనంద/దుఃఖ భాష్పాలు కావవి.. దుమ్ము వల్ల కలిగిన కాలుశ్య భాష్పాలు. తుడుచుకుందామంటే శిరస్త్రాణం లోకి చేయి పెట్టి తుడవాలి. ఒక Ford I10 కీ, వాల్వో బస్సుకీ మధ్య ఉన్న అరమీటర్ గాప్ లోంచి అతి లాఘవం గా బండిని ఇరికించి ఇద్దరు డ్రైవర్ల చూపులూ, అరుపులూ, హాంకులూ విననట్టు, చూడనట్టు, నటిస్తూ ముందుకెడుతూ ఆలోచిస్తున్నా.. ఎలాగోలా ఇంటర్వ్యూ కాండిడేట్ వచ్చే సమయానికి చేరుకుంటే చాలు..



ముందు ఒక కాల్ టాక్సీ శకటం వెళ్లి ఒక ద్విచక్ర వాహనాన్ని స్పృశించింది. ఒక చిన్న పాటి గొడవ ని పట్టించుకోకుండా..శకటం దెబ్బ తింది. ద్విచక్ర వాహన చోదకుడి కాలి కి గాయం తగిలి రక్తం కారుతోంది.. కరుణ తో కూడిన ఒక చూపు అరసెకను వారి వైపు విసిరి ముందుకేగుతూనే ఉన్నా. రింగు రోడ్డెక్కా! అన్ని దేశాల సైన్యం చిన్న చిన్న దారుల ద్వారా వచ్చి ప్రధాన రహదారి లొ కలిసినట్టు.. రోడ్డు రంగు కనిపించట్లేదు. అన్నీ వాహనాలే.








ఇంకా ఎక్కడైనా గాప్ దొరుకుతుందా అని చూస్తున్నా.. అబ్బే.. లాభం లేదు. చుట్టూ దుమ్ము మేఘం పలచబడుతోంది. గుండె లబలబ లాడింది.. ‘అంటే..మళ్లీ ట్రాఫిక్ జామా! అయ్యో!! పోన్లే బాబాయి కి ఫోన్ చేసి రెండు నెలలవుతోంది.. ఇప్పుడు చేసేస్తే సరి!’ అనుకుంటున్నా.. ‘అదేంటి? ఆ చివర జనాలు పోతున్నారే! అసలు అక్కడ మాత్రం ఖాళీ ఏదబ్బా!’ అని బండి ని అటువైపు ఉరికించా.. చూస్తే.. రోడ్డు పక్క ఉన్న కాలువ పైన రెండు బండలు వేసి అప్పటికప్పుడు తాత్కాలికం గా వేసిన అడ్డ రస్తా! మీద ఒక్కొక్కరు గా కాలవ దాటి సర్వీస్ రోడ్డు మీదకి చేరుతున్నారు. అద్భుతమైన టీం వర్క్! చాలా ఆనందం వేసింది. నేనూ వెళ్దామని చూశా.. కానీ.. కొద్దిగా భయం వేసింది. స్కూటర్ తూలితే.. మురికి కాలవ లోకే! కార్ల వారు, బస్సుల వారు ఇదంతా ఈర్ష్య గా చూస్తున్నారు.


నా వెనక శంఖారావాలు తారా స్థాయికి అందుకున్నాయి. వెనక్కి చూస్తే.. ‘ఆ వంతెన ఎక్కవేం!! ‘ అని కొందరు చూపులతో గద్దిస్తే.. కొందరు చేతులతో మార్గ నిర్దేశన చేస్తున్నారు. నేను వెళ్తే గాని వెనక వారు వెళ్ళలేరు. సరే అని నా వెనక బండాయన దిగి నా స్కూటర్ పడకుండా చూస్తానని మాటిచ్చాడు. బండ ఇలా ఎక్కానో లేదో..ఒక చక్రం ఇరుక్కుపోయింది. నలుగురు వచ్చి తీసి మళ్లీ రింగు రోడ్డు మీదకి తెచ్చేశారు. ఈలోగా.. ఇంత సాహసం చేసి బ్రిడ్జ్ కట్టి మరీ సర్వీస్ రోడ్డు మీదవెళ్లిన జనం మళ్లీ తిరిగి వస్తున్నారు. ముందు అంతా పైప్ లైన్ కోసం తవ్వేశారు ట. లాభం లేదట.


చతుర్చక్ర వాహన చోదకులు ‘బాగా అయింది!’ అన్న లుక్కు ఇచ్చి సంతృప్తి గా నిట్టూర్చారు. కానీ పట్టు వదలని విక్రమార్కులు ద్వి.చ.వా.చోలు (ద్విచక్ర వాహన చోదకులు) డివైడర్ మీద కెక్కించి ఎదురుగా వస్తున్నా ట్రాఫిక్ వైపు వెళ్దామని ప్రయత్నిస్తున్నారు.


ఇంతలో మళ్లీ శంఖారావం మ్రోగింది. అందరూ.. మళ్లీ ముందుకు.. ఒక్కసారి గా మళ్లీ ప్రకృతి పరవశించి, దుమ్ము మేఘం వెలిసింది, బురద ఫౌంటెన్.. చిమ్మింది. ప్లెయిన్ చుడీదార్ మీద మంచి డిజైన్లు ఏర్పడ్డాయి. చెప్పులు మీద చాక్లెట్ కోటింగ్ లా బురద చేరింది. ఏం చేస్తాం.. కొంతమంది అభినవ కర్ణులు తమ బండ్ల చక్రాలు బురద లొ కూరుకుపోయాయి. పక్క బండి వాడి బూటు కాలు కొట్టుకుంది. ‘ఒక్క సారి గా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు..’.. ఈ సినిమాల్లో ఎన్ని దెబ్బలు తిన్నా.. ఎలా మళ్లీ లేచి ఫైట్ చేస్తారబ్బా! అనుకున్నాను. అవున్లే..ఉత్తుత్తి నే తంతే అంతే.. పైగా లేచేదాకా.. కర్ణ కఠోరంగా స్పూర్తిదాయక గీతాలు పాడుతుంటే ఆపటానికైనా లేవాలి తప్పదు.

అభినవ భీష్మాచార్యులు ట్రాఫిక్ పోలీసు నిస్సహాయం గా చూస్తున్నారు.



మరీ మడమలు దాటెంత ఎత్తు వర్షపు నీరు. అయ్యప్ప స్వామి లా లూనాల వాళ్లు కాళ్లు పైకెత్తేసారు. నేను ఒక అడుగు పైకి కాళ్లు పెట్టి ముందు వెళ్తున్న స్కూటర్ వెనకే జాగ్రత్త గా వెళ్తున్నా.. ముందర ట్రాఫిక్ మళ్లీ ఆగింది. అక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు. విధిగా ఆగి ప్రోగ్రెస్ చూసి ప్రతి ప్రయాణికుడూ/రాలూ తరించాలి గా.. చిన్న గాప్ ఉంది ఎదురుగా.. పడతానా? పట్టనా? భయం గానే ఉంది. వెనక బండి అతను హాంక్ చేస్తున్నాడు. ఇంకో నిమిషం ఆగితే దిగి హారన్ బదులు నన్ను కొడతాడేమో అని భయం వేసింది. గాప్ ఇచ్చిన వాడు గమ్యం చేర్చక పోతాడా అన్న ధీమా తో.. ముందుకు వెళ్లాను. డివైడర్ మీద ముళ్ల కంప గీరుకుని కమీజ్ పక్క కొర్రు, చేతి మీద ఎర్ర రక్తపు చార.. కనీసం ఇంకో నాలుగు మీటర్లు ముందుకొచ్చాం సంతోషం..పక్క బండి మీద వారు ఎవరో ఏసుక్రీస్తుకి మొక్కుకుంటున్నారు.. నేనూ ‘ఆమెన్’ అని నా దేవుళ్ళు రామ కృష్ణులని పూజించుకున్నా.


ఈలోగా అందరూ మెయిన్ రోడ్డు పక్కన గ్రామం లోంచి వెళ్తే బెటర్ అని అటుపోతున్నారు. నేనూ ఒక్క క్షణం ఊగిస లాడా.. కానీ.. మెయిన్ రోడ్డు మీద, అందునా రింగు రోడ్డు మీద, బురద లొ మునిగి, గాయం అయి, బట్టలు చిరిగి దుమ్ము కోటింగ్ తో ఉన్నా.. ఇంక చిన్న గుంతల రోడ్డు మీద వెళ్లి కొత్త సమస్యలనెదుర్కునే మానసిక స్థైర్యం, శారీరక బలం లేక వదిలేశా. ఇంకో అరగంట తర్వాత ఇంకో రెండు కిలో మీటర్ల దూరం వెళ్లాకా చూస్తే అర్థమైంది. నేను తీసుకున్నది సరైన నిర్ణయమని. అక్కడ రైల్ ట్రాక్ దాటాలి. రైలోస్తుంటే.. ఆఫీస్ తొందరలో ఎవరో దాటాలని పట్టాల కింద పడ్డారట! దానితో.. మళ్లీ అటు డీ-టూర్ అయిన జనాలు మా వెనక కలిసారని. బాధ తో హృదయం నిండి పోయింది.


ఉక్క గా.. చెమట గా కాసేపు హెల్ మెట్ తీద్దామని తీసి చేత్తో పట్టుకున్నా.. మళ్లీ శంఖారావం. దుమ్ము మేఘం.. బురద ఫౌంటెన్.. అలాగే ముందుకు పరిగెత్తిస్తున్నా బండి ని.

 
మా ప్రార్థనలు కాస్తా పొరపాటున వరుణ దేవుడు విన్నట్టున్నాడు..ఆయన కరుణించాడు. ఒకేసారి ఫెళ్ళున వాన. ‘వామ్మో నా లాప్ టాప్’ అనుకుని ఒడుపు గా జాకెట్ తీసేసి లాప్ టాప్ బాగ్ మీద కప్పి హెల్ మెట్ పెట్టేసుకున్నా. ముందరేమవుతుందో తెలియదు. వెనక్కెళ్ళటానికి లేదు. ఎవరో అండర్ పాస్ కోసం తవ్విన గుంట లొ పడ్డారని అంటున్నారు. ‘అయ్యో’ అనుకోవటం తప్ప చేసేదేదీ లేదు. వర్షం వల్ల గుంటల్లోకి ధబ్ ధబ్ మని పడుతూ లేస్తూ మా ఆఫీస్ గేట్ దగ్గర కి చేరుకొని ఆత్రం గా షెడ్ కిందకి వెళదామంటే.. ‘అబ్బే! మా సెక్యూరిటీ వాళ్లంత కర్తవ్య నిష్ఠ కలిగిన వారు యావద్ప్రపంచం లొ ఉండరాయే. నిజమే.. ఈ ట్రాఫిక్ వల్ల ఉన్న ఆవేశం తో బిల్డింగ్ కూల్చేస్తే! చెప్పలేం..

అసలు ఈ నోబుల్ పీస్ ప్రైజులు, సెయింట్ హుడ్లూ, మఠాలకి పీఠాధిపతుల పోస్టులూ గట్రా ఇచ్చే ముందు ఈ ట్రాఫిక్ టెస్ట్ చేసి చూడాలి. ఈ ట్రాఫిక్ లో ఒక్క తిట్టు వాడకుండా, ఒక్క రూలైనా బ్రేక్ చేయకుండా.. చిరునవ్వు చెదరకుండా, ప్రశాంత చిత్తం తో ఐదు కిలో మీటర్లు రెండు గంటల్లో ప్రయాణం చేస్తేనే ఇవ్వాలని.. ఏమంటారు?


ఆ వర్షం లొ బ్యాగ్ లోంచి ఐడీ కార్డ్ తీసి చూపించి ముఖాన్ని మాచ్ చేయటానికి హెల్ మెట్ తీసా.. సెక్యూరిటీ వాళ్లు నా బ్యాగ్ లో ఏమైనా మారణాయుధాలు తెచ్చానేమో అని చూస్తున్నారు.. వెనక్కి తిరిగి చూశా..




అచ్చం నా కల లాగానే!!!




ఒక చేతిలో ఖడ్గం.. రెండో చేతిలో రథం పగ్గాలు. రథాన్ని ఆపి శిరస్త్రాణం తీసి,కవచాన్ని వదులు చేసి దిగాను. నా చేతిలో ఉన్న వస్తువుల్ని ఇద్దరు ముగ్గురు అందుకున్నారు.. దుమ్ముకొట్టుకుపోయిన,అక్కడక్కడా చిరిగిన బట్టలు, చిన్నపాటి గాయాలు. జుట్టు చెదిరి, వొళ్లు నొప్పులు .. బురద తో నిండిన పాదరక్షలు.. వెనక్కి తిరిగి చూశాను. చాలా మంది ఇంచుమించు నాలాగే.. యుద్ధం లొ పోయిన వారు పోగా.. కొందరు క్షతగాత్రులై చికిత్సా శిబిరాలకి తరలి వెళ్లిన వారు కొందరైతే.. రథాలు విరిగి, వాహనాలకి, శరీరాలకి గాయాలయినా.. కొండలూ, కోనలూ, నదులూ దాటి, విజయాన్ని చేజిక్కించుకుని ఆనందం చిందుతున్న మొహాలతో నా వాళ్లు నా వెనక..


































Thursday, August 11, 2011 34 comments

పొడుగైన వారాంతం.... :)

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేస్తున్నా అందరికీ.. ఎందుకంటే..రేపు నేను బిజీ. శ్రావణ శుక్రవారం WFH చేయక తప్పదు. ఉదయం ఒకరింట్లో వాయనం, ఇంకోరింట్లో భోజనం, ఒకళ్ళకి నాలుగింటికి, ఇంకోళ్ళకి ఆరింటికి ఆల్రెడీ సమయం ఇచ్చేసా. పొద్దున్నే లేచి కాస్త ఇంటి పని చూసుకుని, ఆఫీసు పని చేసుకుని, మధ్యలో వాయినాలకి వెళ్లివస్తూ..  ఇక తర్వాత వారాంతం అంతా మా కమ్యూనిటీ లో మరి పంద్రాగస్తు పండగ కి ఏర్పాట్లు చేయద్దూ ?



మా చిన్నది మూడో ఏట పాడిన పాట.. మొన్నటిదాకా ఎవరికి చూపించినా కోప్పడేది. ఈ మధ్యే ఎవరికి వినిపించినా ఏమీ అనట్లేదు. బ్లాగు లో పెట్టుకోవచ్చా? అంటే ఒక చూపు విసిరి 'ఓకే' అనేసింది..





చిన్నదానికి ఈరోజు దేశ భక్తి గేయాల పోటీ బడి లో.. అందుకని తయారయి వెళ్లింది... అన్నట్టు ఒక మాట అంది.. నన్ను ఆలోచింపచేసింది.. 'అమ్మా.. అప్పటి వరకూ నవ్వుతూ హాపీ గా ఉన్నవాళ్లు.. patriotic songs పాడేటప్పుడు ఎందుకు చాలా సాడ్ గా మొహం పెడతారు. It is almost like.. they are really not thaaat happy being Indians...'






పెద్దదానికీ ఒక దేశ భక్తి గేయానికి నాట్యం పోటీలు స్కూల్లో...




పొడుగు జడలూ, దుపట్టాలూ ఇప్పుడంటే బోల్డు ఇష్టం. మరి పెద్దయ్యాక.. పొట్టి ద్రస్సులూ, చింపిరి జుట్లూ.. ఇష్టమౌతాయేమో తెలియదు.. ప్రస్తుతానికి .. ఇలాగ..



తిరిగి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ.. శ్రావణ శుక్రవారం కూడా అందరూ ఆనందం గా జరుపుకోవాలని ..భావిస్తూ...




కృష్ణప్రియ/


















Friday, February 25, 2011 59 comments

చేజారిన మంత్రదండం!




మొన్న  ఆఫీస్ కి స్కూటర్ మీద తీరిగ్గా బయల్దేరాను..  అసలు ఇంటి నుండే పని చేద్దామనుకున్నా.. కానీ అత్యవసరం గా రమ్మంటే.. ఉన్న పళాన బయల్దేరాల్సి వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్డు మీద బోల్డు ట్రాఫిక్! టక్క్మని శబ్దంవచ్చింది.. ఏంటా అని చూస్తే.ఏమీ ప్రత్యేకం గా తేడా గా అనిపించలేదు..  ముందర ఆఫీస్ బ్యాగ్ అయితే ఉంది.  సరే రోడ్డు మీద ఏదైనా రాయో రప్పో లే అనుకుని నా దారిన నేను పోతుంటే.. 

పక్కన కార్ డ్రైవర్ హారన్ కొట్టి కొట్టి ఇబ్బంది పెడుతున్నాడు.. కొద్ది సేపు ఇగ్నోర్ చేసి..  తర్వాత కోపం గా చూసే టప్పటికి అర్థమైంది.. వాళ్ళేదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నారని.. వాళ్ళు రోడ్డుకి మధ్యన అడ్డంగా కార్ ని రాయల్ గా ఆపేసి.. నన్ను రమ్మని సైగ చేస్తే.. నేనూ అయోమయం గా వాళ్ల పక్కకి వెళ్లి నిలుపు కున్నాను... 

జనాలంతా  ఏదైనా అయిందేమో అని చుట్టూ ఆసక్తి గా చూస్తున్నారు... చెత్త ట్రాఫిక్ లో ఏదైనా మసాలా దొరకచ్చు అని!  కార్ లో వాళ్ళు.. 'నీ మొబైల్ పడిపోయింది ..బ్రిడ్జ్ మీద.. ఒక సైకిల్ అబ్బాయి వెంటనే తీసుకుని పారిపోయాడు..' అని చెప్పారు.. 

ఈలోగా  'ఏ ఫోన్...ఎలా? ఎక్కడ పెట్టుకున్నావు? ....' అని పక్క నున్నవాళ్ళు ఊదర కొట్టటం.. 

మంచి ఖరీదయ్యినదైతే 'అయ్యో...' వాల్యూ ఎక్కువ కదా! .. నేను షాక్ లోంచి బయటకొచ్చేసరికి..  జనాలు చుట్టూ అడుగుతున్నారు.. ఆశ్చర్యమేంటంటే.. ట్రాఫిక్ లో అరక్షణం వేస్ట్ చేయలేని మోటార్ సైక్లిస్స్టులు, బస్సుల మధ్యలోంచీ, ఫుట్ పాతుల మీద రాళ్ళమీదనుండీ. కరెంట్ స్తంభాల మధ్య ల్లోంచీ  దూకుడు గా హారన్ కొడుతూ దూసుకెళ్ళే వారంతా .. ఏ మాత్రం తొందర లేకుండా.. నింపాది గా ఎదురు చూస్తున్నారు. 

'అంత ఖరీదైనది కాదని అన్నాను.. అంతే.. 




వాళ్ళని నేనేదో  బొట్టు పెట్టి పిలిచినట్టు.. వాళ్ళని నేను డిజాప్పాయింట్ చేసినట్టు నిరసన గా.. అంతా వెళ్ళిపోయారు. సిగ్గేసింది. కనీసం ముప్ఫై వేల రూపాయల ఫోన్ పోగొట్టుకుంటే.. కాస్తైనా ఇజ్జత్ ఉండేది ఇలాకా లో.. ఈసారి మంచి ఖరీదైంది పారేసుకోవాలి ..  అని ముందర గట్టి నిర్ణయం తీసుకుని..  అప్పుడు పోయిన సెల్ ఫోన్ కోసం బాధ పడటం మొదలు పెట్టాను. ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే ఎత్తాడు కానీ.. తర్వాత సిం కార్డ్ విసిరేసుంటాడు.. చాలా cheated గా, నీరసం గా అనిపించింది.  



ఫోన్ లో రికార్డ్ చేసిన పిల్లల విన్యాసాలు,..  తీసిన వందలాది ఫోటోలు..  ఐదేళ్ల నుండీ మేరు పర్వతం లా పెరిగిన కాంటాక్ట్ లిస్టూ... కళ్ళ ముందు రీల్స్ గా తిరగటం మొదలయింది.. చా.. సినిమాలు తగ్గించాలి.. మరీ రింగురోడ్డు మీద రింగులు రింగులు గా వెళ్లి పోవటం.. బాగుండదు కదా.. అని ఎలాగో వచ్చి పడ్డాను ఆఫీసుకి.. 

అప్పుడు .. చూడాలి కష్టాలు..  మా వారి నంబర్ అయితే గుర్తుంది, మాట్లాడాను కానీ.. ఇంకెవ్వరి నంబర్లూ గుర్తు లేవు. ఇంటి నంబర్ తో సహా..  తనని అడగ వచ్చు కానీ ఆమాత్రం తెలియదా అని గేలి చేస్తారేమోనని  ఒకటి రెండు సార్లు తప్పు  నంబర్లకి చేసి.. మొత్తానికి ఇంటి నంబర్ కి చేయగలిగా!!!...  

సాయంత్రం ఎవరికో ఫోన్ చేయాలంటే ఆ నంబర్లు లేవు. ఫోన్ లేకపోవటం తో ఎప్పుడూ సీట్ లోనే కూర్చోవాల్సి రావటం అన్నింటికన్నా పెద్ద కష్టం లా తోచింది.ఎవ్వరు ఫోన్ చేసినా ఉండాలని..

సెల్ లేనిదే అస్సలూ నడవదు కదా.. ఇంట్లోంచి బయటకెళ్ళేముందు కార్ లో కూర్చుని.. నేను తాళాలేసుకునే లోపలే 'మంచి నీళ్ళు తీసుకురా.. స్టడీ రూం లోంచి ఫలానా పుస్తకం తీసుకురా ' అని ఫర్మాయిష్ లు కూడా ఈ మొబైల్ ఫోన్ ద్వారా నడుస్తూ ఉండటమే!..సూపర్ మార్కెట్ లో ఒక ఐల్ నుండి రెండో ఐల్ లోకీ ఫోన్ కాల్స్!! రెండు నిమిషాలు లేటైతే కాల్స్.. మూడు నిమిషాలు ముందు వచ్చానని కాల్స్..  వంకాయ పులుసు లో పోపెలా పెట్టాలని కాల్స్.. అడ్రస్ కనుక్కోవటానికి కాల్స్.  

మొన్నీ  మధ్య ట్రైన్ జర్నీ ముందు గా ఒక పిచ్చి ట్రైన్ లో చేసుకుని.. తర్వాత తత్కాల్ లో మాకు కావలసిన ట్రైన్ లో చేసుకున్నాం. మా వారు ..రైలెక్కాక.. 'అన్నట్టు... టికెట్ కాన్సెల్ చేసావు కదా?' అని అడగగానే.. గుండె లటుక్కుమంది. అసలే మమ్మల్ని ఎక్కించటానికి కూడా వచ్చారు మావాళ్ళు.. మర్చిపోయానూ అంటే.. ఎంత అప్రతిష్ట! ' అని 'యా.. చేసేసా' అన్నాను. రైల్లో పిల్లి లా వెళ్లి తన జేబు లోంచి ఐఫోన్ తీసి.. రెండు నిమిషాల్లో కాన్సెల్ చేసేసి.. మళ్ళీ జేబు లో పెట్టేసి.. 'హమ్మయ్యా' అనుకున్నా..



ధనుస్సు లేని రాముడినీ, వేణువు లేని కృష్ణుడినీ, త్రిశూలం లేని శివుడినీ అయినా ఒక్కోసారి ఊహించవచ్చు.. 'సెల్లు' అనే మంత్రదండం లేని మనిషి ని ఈరోజుల్లో ఊహించగలమా?  మా పనమ్మాయి మేరీ  దగ్గర్నించీ.. మా బాసు దాకా అంటా సిట్యుయేషన్ ని ఆనందం గా వాడేసుకున్నారు. .. మేరీ రాలేదు.. ఫోన్ చేసి అడుగుదామంటే  నంబర్ లేదాయే.. వచ్చినప్పుడు 'ఏంటి ... చెప్పా పెట్టకుండా మానేయటమేనా?  '  అని నిలదీస్తే.. 'ఫోన్ పన్నిటా.. ఎంగ పోయిటాంగ నీంగ  మాడం ? '  అని చిలిపి గా,  అమాయకం గా అడిగినట్టు అడిగింది.. ఏం చేస్తాం? నంబర్ ఒక కాగితం మీద రాసుకున్నా..  (ఆ కాగితం గంట లోపలే పారేసుకున్నానను కొండి)   

బాసు గారేమో.. 'I called your desk number multiple times.. Looks like you were away.. ' అని కాస్త ప్రోబింగ్ గా అడిగారు..  రెండో రోజు డ్రైవర్ నంబర్ తీసుకోవటం మర్చిపోయి హడావిడిగా ఆఫీస్ లోపలకి పరిగెట్టేసరికి సాయంత్రం.. ఎనిమిది అంతస్స్థుల్లో కార్ ఎక్కడ పెట్టాడో తెలియక లాప్ టాప్ బ్యాగ్ తో తిరగాల్సి వచ్చింది.



అంటే ఎంత టైం వేస్ట్? అసలు ఎంత కష్టం...? అని నా మీద నేను తెగ జాలి పడిపోయి.. ఇలా కాదని.. ఎలాగయినా.. ఇన్స్ట్రుమెంట్ కొని తీరాలని అనుకున్నా.. కానీ.. ఇల్లూ.. పనులూ గుర్తొచ్చి..మళ్ళీ పోస్ట్ పోన్ చేసేసా.. ఇంటికొచ్చాక చాలా కాలానికి మా లాండ్ లైన్ ఫోన్ ఏ మూల ఉందో చూసి దుమ్ము దులిపి..  కొత్త ఫోన్ వచ్చేదాకా ఇదే కదా గతి అని అనుకునేంతలో.. రింగ్ అవుతొంది... 

అమ్మ.. 
'ఎక్కడికెళ్ళావు? ఈరోజంతా లేవు.. ఇంటి ఫోన్ కీ అందాకా.. సెల్ కీ అందక? భయపడి చచ్చాను..!!!' హ్మ్.. అనుకున్నా.. ఈ ఫోన్ పోవటం వల్ల .. కాస్త ఇంపార్టెంట్ గా ఫీల్ అయ్యా... కానీ పాత విషయం గుర్తొచ్చింది..


మా స్కూల్   రోజుల్లో హైదరాబాద్ లో ఉండే వాళ్ళమేమో.. ఊర్ల నుండి వచ్చిన చుట్టాలని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా,  మా సర్వీస్ ల అవసరం మా తల్లిదండ్రులకుండేది.   అలా వెళ్ళినప్పుడు  చుట్టాల ఇళ్ళల్లో ఒక్కోసారి  రాత్రి కి ఉండిపొమ్మంటే ఉండిపోయేవాళ్ళం. మా ఇంట్లోనూ ఫోన్ ఉండేది కాదు.. మా వాళ్ళిళ్ళల్లో అంతకన్నా ఉండేవి కావు! ఇంటికి రాత్రి ౧౦ దాటినా రాలేదంటే బహుశా అక్కడ ఉండిపొమ్మన్నారేమో అనుకునేవాళ్ళు మా పెద్దవాళ్ళూనూ.. 


ఆ రోజుల్లో ఉన్న 'ఏమీ కాదన్న' నమ్మకం  ఈరోజు ఉందంటారా?  అప్పట్లో ఒకసారి మా చెల్లి, సడెన్ గా మత కల్లోలాలయ్యాయని  కర్ఫ్యూ విధించినప్పుడు ఇంటికి దాదాపు 20 కి. మీ. దూరం లో ఉండిపోయింది.  అప్పుడు ఫోన్ అవసరం.. దాని ప్రాముఖ్యత తెలిసి వచ్చి మా ఇంట్లో.. ఎక్కువ డబ్బు ఇచ్చైనా పెట్టిన్చుకోవాలనే పట్టుదల వచ్చేసింది.అప్పటిదాకా మాకు లాండ్ లైన్ ఫోనే లేదు! తర్వాతైనా.. ఫోన్ కాల్స్ అంటే అత్యవసర  పరిస్థుతులకోసం..


ఏమాట    కామాటే చెప్పుకోవాలి..  ఫోన్ లేకపోవటం వల్ల  withdrawl  symptoms కనిపించినా (అంటే రెండు చేతులూ వాడుతూ  పని చేస్తున్నప్పుడు  కాస్త తల భుజం మీద కి వంచి.. ఫోన్ అటెండ్ చేస్తున్న పోజు లో ఉండటం.. చేతులు ఫోనుని ఫ్లిప్ ఫ్లాప్ చేసున్న ఆక్షన్ చేస్తూ ఉండటం.. కనులు మూసినా ఫోన్.. తెరిచి చూసినా ఫోనే ... ఇలాగ ఆఫోన్ గురించి కన్నీరు కారుస్తూ ..బెంగ పెట్టుకుంటే.. ఎందుకో తట్టింది.. 

నాకు ఫోన్ లేదని ఆఫీస్ లో వీకెండ్ సపోర్ట్ డ్యూటీ విముక్తి లభించిందని.. వీకెండ్ అంతా ఎక్కడో ఉన్న మనుషులతో కాకుండా హాయిగా చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడటానికి వీలైంది..  ఫోన్ లేనప్పుడు ఇలా ఉండేవాళ్ళమా అని ఆశ్చర్యం వేసింది! సూపర్ మార్కెట్ లో ఇక్కడ కలుద్దాం ఒకవేళ తప్పిపోతే అని ముందస్తు గా అనుకోవటం..  ఈ టైం కి వస్తానని చెప్పుకుని.. కాస్త అటూ ఇటూ అయితే కంగారు పడద్దని అనుకోవటం.. కొద్దిగా అనిశ్చత లో థ్రిల్, కొద్దిగా ఆరాటం లో ఉన్న భావోద్వేగం.. ఎదురు చూపు లో దాగున్న అభిమానాన్ని అసలు ఈ సెల్ ఫోన్లు ఎప్పుడు కబళించి వేసాయి? అని ఆశ్చర్యపడి .. ఆ తృప్తి ని తనివి తీరా అనుభవించాను..





మొత్తానికి ఏదో ఒక పాత ఫోన్ లో టెంపరరీ గా సిం కార్డ్ వేయించుకున్నా..  పాత కాలం టైప్ రైటర్ కి బలం గా నొక్కినట్టు నొక్కితేనే కానీ నంబర్ వెళ్ళని అరకిలో బరువున్న గుండ్రాయి లాంటి ఫోన్. అన్ని కాంటాక్ట్ లూ పోయాయి. ఐదేళ్ళ నుండీ సంపాదించిన నంబర్లు!!! ఎక్కడెక్కడ పట్టుకోను మళ్ళీ ? 


ఇంక ఆఫీస్ లో  కో వర్కర్స్, చుట్టు పక్కల వారు చుట్టాలు .. చివరికి పిల్లల దగ్గర్నించీ ఆంతా చెప్పేవారే.. కాస్త జాగ్రత్త గా బ్యాగ్ లో పెట్టుకోవాల్సింది...జిప్ వేసి పెట్టుకోవాలి.. రోడ్ మీద ప్రయాణాలప్పుడు!!  (అదే మరి.. వినే వాడు వెంగళప్ప అయితే చెప్పేవాడు మహాజ్ఞాని అవుతాడు)  

అప్పుడప్పుడూ కాంటాక్ట్స్ కంప్యూటర్ లోకి ఎక్కించుకోవా నీవు? (ఏదో రోజూ పళ్ళు తోముకోవా? ' అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి మరీ అడగటం.. )  

కొంత మందైతే మరీ.. స్కూటర్ నడపడం మానేయి అసలు.. అలాగే ఎత్తుకుపోతారు.. రేప్పొద్దున్న నీ ఆఫీస్ బ్యాగ్ ఎత్తుకుపోతెనో? (ఆహా.. అంత వంటి మీద స్పృహ లేని దాన్నా?)  

ఇంకా  అందరూ వాళ్ల పెద్దత్తగారి చిన్న కోడలి బావ ఫోన్ ఎలా పోయింది? దగ్గర్నించీ.. స్కూటర్ మీద వెళ్తున్న వాళ్ల ఆడపడచు వాళ్ల బాబాయి గారి కూతురి మెదలోంచి మంగళ సూత్రం ఎంత లాఘవం గా లాగేసారో.. కూలంకషం గా వర్ణించి చెప్పి నా బ్రెయిన్ వాష్ చేసేసారు.. (మనలోమాట.. నేనూ ఇలాంటి చాన్స్ వస్తే.. అస్సలూ తగ్గను ! ౩-౪ ఇలాంటి కథలు అనర్గళం గా చెప్పేస్తాను మామూలు గా..  ఇప్పుడు విక్టిమ్స్ మనం కదా.. అందుకే పెద్దగా సొక్కలేదన్నమాట)..
  
ఇదిగో.. సెల్ ఫోన్, లాప్ టాప్..పర్సూ అవీ .. జాగ్రత్త.. పారేసుకోకు.. (చా..సెటైర్లు.. ఒకసారి పోగొట్టుకున్నంత మాత్రాన.. ఎలా కనపడుతున్నాను?)




ఏం చేస్తాం..ఇలానేను ఎలా చేసి ఉండవల్సిందీ.. నేను చేసిన ప్రాథమిక తప్పిదాలేంటి అన్న విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవటం ఒక ఎత్తు.. ఫోన్లు ఎత్తటం మరో ఎత్తు.. కొంతమంది కాల్స్ స్క్రీన్ చేయటానికి లేదు. ప్రతి వాళ్ళు చేసిన ఫోన్లూ ఎత్తాల్సి వచ్చింది. బాస్ తో కస్టమర్ ఇస్ష్యూ గురించి మాట్లాడుతుంటే.. దూరం చుట్టాలావిడ కాల్.. ఏమైనా అర్జంటా? అంటే.. 'అబ్బే ..చాలా కాలం అయింది కదా అని ఊరకే చేశా ' అంది.. 'నా తల్లే ' అనుకుని.. సాయంత్రం మాట్లాదతానని వాగ్దానం చేసి బయటపడ్డాను.  

అలా అని జరిగిన మరో మేలు ఉంది లెండి.. ఒక స్నేహితురాలు చేసిన పని మీద కోపం వచ్చి తన కాల్స్ తీసుకోవట్లేదు... కానీ నంబర్ చూపించక పోవటం తో.. ఎవరో ఏంటో అనుకుని ఎత్తి.. . మాట్లాడి మనస్పర్థలు దూరం చేసుకోవటమైంది.  చాలా తేలిగ్గా అనిపించింది మనస్సంతా.. 

కొత్త  ఫోన్ కొనాలి.. అనగానే..ఒక్కసారి బజార్ల లో వెరైటీ చూస్తే కళ్ళు తిరిగినంత పని అయింది. కళ్ళు మూసుకుని ఈసారి మినిమం ఫీచర్లున్న ఫోన్ కొనాలా? ఫోన్ పోయినా అంత బాధ పడకుండా.. లేక ఐఫోన్.. ఆన్డ్రైడ్ లాంటి హై ఎండ్ ? తర్జన బర్జన..  పిల్లలు ఐఫోన్..ఐఫోన్.. అని..  మా బాంక్ పాస్ బుక్కేమో.. కొద్దిగా చవకైన ఫోన్ అనీ..  హ్మ్.. 

 ప్రతి సంవత్సరం అకాడెమిక్ ఇయర్ మొదలయ్యేముందు.. పుస్తకాలన్నింటికీ అట్టలేసి..జాగ్రత్తగా.. మొదటి వారమంతా అందంగా ఎలా నోట్స్ రాస్తామో.. జనవరి ఫస్ట్ నుండీ.. టెంత్ దాకా ఎలా డైరీ రాసి జిమ్ కెళ్ళి వస్తామో.. అలాగ నేనూ మొదట కొన్ని రోజులు రెగ్యులర్ గా సిస్టం లో ఫోన్ నుండి బాక్ అప్ చేసుకుంటా.. 


ఈలోగా.. మీ ఫోన్ నేను పొరపాటున ఎత్తక పొతే 'ఏదో పాత ఫోన్ కదా.. సిగ్నల్ సరిగ్గా దొరక లేదేమో అనుకొండే? ' ..



Monday, January 17, 2011 29 comments

చెప్పు, చెప్పవయ్యా!!..చెప్పూ??.....



మా డ్రైవర్ రాము మా ఇంట్లో పని చేయబట్టి నాలుగేళ్ళు!    వాళ్ళావిడ లక్ష్మీ మా ఇంట్లో మధ్యాహ్నం 2 గంటలు పని చేస్తుంది, కాస్త కూరగాయలు తరిగిపెట్టటం, పప్పు రుబ్బి పెట్టటం లాంటివి,. పిల్లలతో బాడ్మింటన్, బోర్డ్ గేంస్ ఆడి 'తొండి తొండీ"  అని వాళ్ళల్లో కలిసి పోట్లాడుతుంది కూడా!

లక్ష్మి కి పదహారు నిండకుండానే వాళ్ళ నాన్న పెళ్ళి చేసేశాడు. పదవ తరగతి ఇలా పాస్ అయిందో లేదో, అలా పెళ్ళి చేసుకుని వచ్చేసింది.. ఆ అమ్మాయి ని చూస్తే.. ఇంకా చిన్న పిల్లలానే అనిపిస్తుంది. 

                                  ఎంత చదువుకుంటానన్నా, వాళ్ళ నాన్న బలవంతాన పెళ్ళి చేసేశాడని కాస్త తండ్రి మీద అలిగింది. నేను ఎంత బలవంతం చేసినా, ఫీజులన్నీ కడతానన్నా.. 'అబ్బే..వద్దాంటీ...' అనేసింది. మొదట్లో గంభీరం గా ఉన్నా, రాను రాను పిల్లలతో కలిసి పోటీ పడి ఆడటం, ముగ్గులేసి పెట్టటం,.. పాటలు పాడటం లాంటివి చేసేది. మాకందరికీ చాలా దగ్గరైపోయింది.

భర్త మమ్మల్ని "సార్, మాడం"  అని పిలిచినా, తను మాత్రం,.. నాలుగు రోజుల్లో ఆంటీ, అంకుల్ లోకి వచ్చేసింది. మా అత్తగారికి స్వెటర్లు అల్లటంలో, నాకు రొట్టెలు ఒత్తటం లో సహాయం చేస్తూ, పిల్లలకి బొమ్మలు వేయటం, ముగ్గులేయటం లాంటివి నేర్పించటం చేస్తూ మా అందరికీ తల లో నాలుకైపోయింది.

పెళ్ళయి రెండు నెలలు తిరక్కుండానే, గర్భవతి అయింది. ఆరోజు 'అయ్యో ఎంత చిన్నపిల్ల.. అప్పుడే తల్లా? '' అని బాధేసింది. కాకపోతే.. బయటకి అంటే.. నొచ్చుకుంటుందని భయం వేసి అన్యమనస్కంగానే కంగ్రాట్స్, అవీ చెప్పి ఊరుకున్నాను. రోజూ పిల్లలతో పాటు పాలూ, సాయంత్రం బలవంతం గా 2 పళ్ళూ పెట్టేదాన్ని.

ఇట్టే కళ్ళు తిరిగి పడిపోయేది.. "నువ్వు పనికి రాకు..రెస్ట్ తీసుకో!!." .అంటే.. "బెంగుళూరు కొచ్చినదే వ్యవసాయం మీద అప్పులు తీర్చుకోవటానికి.. ఇంత చిన్నదానికే భయపడితే ఏట్లా ఆంటీ." అని నవ్వేసేది... నెలలు నిండుతున్నా..చురుకు గా పని చేస్తూ,గడ గడా మాట్లాడేది.

నెల క్రితం పుట్టింటికి డెలివరీ కెళ్ళింది  'ఆంటీ.. మళ్ళీ మీ అందర్నీ చూస్తానో లేదో..'  అని కన్నీళ్ళు పెట్టుకుని కాళ్ళకి నమస్కరించి వెళ్ళింది.  పని కోసం వచ్చినా, మా పిల్లలాగే అనిపించింది.

మా డ్రైవర్ రాము వారం లో వాళ్ళావిడ డెలివరీ అనగానే సెలవు పెట్టేశాడు!  అరగంట క్రితం ఫోన్ చేసి..'మాడం.. !!!' అని ఆగిపోయాడు..  'ఆ చెప్పు రామూ ' అన్నాను..

"మాడం మీరు పనిలో లేరు కదా.. లక్ష్మి విషయం చెప్దామని...  "  అని అన్నాడు..

'అయ్యో ఏమైందో.. అసలే చిన్నది.. లక్ష్మి క్షేమమే కదా.' అని గుండె దడ దడ లాడింది. కుర్చీ లో కూలబడి..'చెప్పు రామూ.. ' అనగానే..  'మాడం.. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా.. ' అన్నాడు రాము.

'ఆ ..ఆ చెప్పు చెప్పు...' అన్నాను ఆత్రం గా..
'లక్ష్మిని ఎడ్మిట్ చేశాము మాడం..నిన్న నొప్పులొస్తుంటే..' అన్నాడు సాగదీస్తూ...
'ఆ..ఆ.. ఏమయ్యింది? ' అన్నాను..కాస్త గొంతు పెంచి..
'అదే.. డెలివరీ .. నార్మల్ గా అవటం కష్టం అని నిన్న రాత్రి చెప్పారు మాడం' అన్నాడు..
'ఆ... ఆ.. చెప్పు చెప్పు.. మరి ఎలా? బానే ఉందా తను?' అని అడిగాను ఎంత భయం వేసిందో.. ఇదేంటి రాము గొంతు లో ఏ భావం లేదు? బిడ్డకేమైనా ప్రమాదమేమో...' అని టెన్షన్ వేసింది.
ఈలోగా.. మా ఇంట్లో వాళ్ళూ నా చుట్టూ మూగి చూస్తున్నారు..

'అదీ .. మాడం.. మా ఊర్లో.. డాక్టర్ ఇక్కడ కాదంటే..రాత్రి కి రాత్రే తెచ్చాం మాడం, బంగార్ పేట పెద్దాసుపత్రికి, ట్రాక్టర్ లో. ...' అన్నాడు..
నాకు లీల గా అర్థమయిపోయింది.. 'ఆ.. నాకు తెలుసు.. లేటయిపోయినట్టుంది..' అయ్యో.. లక్ష్మీ!!!' అని విచారం వేసింది..
స్పీకర్ లో పెట్టాను.. అందరూ వింటారని..

రాము నెమ్మది గా..'మాడం.. ఇద్దరు డాక్టర్లు చేశారు మాడం.. ఆపరేషన్..' అన్నాడు..
ఇంకా నీరసం వచ్చేసింది.. మా వారూ, పిల్లలూ విచారం గా చూస్తున్నారు. 

మాడం .. మరి.. ' అని ఆగిపోయాడు.
రామూ చెప్పూ..చెప్పవయ్యా.. ఎలా ఉందీ...   అరిచేసాను..
;అందరూ ఉన్నారు మాడం.. ఆపరేషన్ కే గంట పైన పట్టింది మాడం, లక్ష్మి చాలా వీక్ అయింది, మందిచ్చారు నిద్రపోతోంది మాడం, బాధ తెలియకుండా ' అన్నాడు..
'ఓహ్..పోన్లే' అనుకున్నాం..
'పాప పుట్టింది ..మాడం.. ఇప్పుడే 20 నిమిషాలైంది మాడం..' అన్నాడు.
ఒక్కసారిగా ఉధృతం గా కోపం వచ్చింది.. అంతలో మళ్ళీ చిన్న డవుట్.. 'పిల్ల ...అంతా బాగానే ఉందా?'
'బాగుంది ..మాడం.. మా అమ్మ లాగనే ఉంది మాడం ' అన్నాడు..

ఇంక ఆనకట్ట తెగిపోయింది.. అందరం కంగ్రాట్స్ మానేసి, అరిచి చేసిన గొడవకి... రాము కనక అసలు ఎదురుగా  ఉంటే..నాలుగు వేసేవాళ్ళం కూడానేమో..

అందుకే ఆధ్యాత్మ రామాయణం లో ..

రామలక్ష్మణులు,  'సీత సమాచారం హనుమంతుడు తప్పక తెస్తాడు' అని ఎదురు చూస్తుంటే..
హనుమంతుడు లంక నుండి వచ్చి ఆయన ముందు వాలి, .'సీతమ్మ ...'  అని మొదలుపెడితే.. ఆ రెండు క్షణాలూ ఆ శ్రీ రామచంద్రుడు ఎక్కడ కంగారు పడతారో నని,..'కనుగొంటినీ రాఘవా!!!  సీతమ్మ తల్లినీ... ...' అని అన్నాడని ఉంటుంది...
Thursday, January 13, 2011 41 comments

హైదరాబాద్ కబుర్లు, పుస్తక ప్రదర్శనా, ఎగ్సెట్రా ఎగ్సెట్రా..

కిస్మస్ సెలవలముందు ఒక రోజు ఉదయం.. మా ఇంట్లో..

ఉదయం స్కూల్ కెళ్ళే హడావిడి ..ఒక పక్క నేను జడా.. వాళ్ళ నాన్న షూసూ వేస్తుంటే.. గంభీరం గా.. మొహం పెట్టి దోశ ముక్క నములుతూ, మా చిన్నమ్మాయి ..'నాన్నా.. మీ చిన్నప్పుడు.. world black 'N' white  ఆ? కలరా? ' అని అడిగింది నిన్న. వొళ్ళు మండింది.. మేము కనీసం టీ కూడా సుఖం గా తాగకుండా.. సేవలు చేస్తుంటే.. ఎంత హాయిగా.. ఆలోచించుకుంటుంది..అని.. 'లేదమ్మా.. ప్రపంచం ఎప్పుడూ.. రంగులతోనే ఉంది..' అంటే ..  'కానీ.. గాంధీజీ వాళ్ళప్పుడు పాపం Black 'N' White  లోనే ఉంది....' అని నిట్టూరుస్తూ....

రెండు రోజుల క్రిందట... "అమ్మా.. Byeeee" అని పళ్ళికిలిస్తూ స్కూల్ బాగేసుకుని వచ్చింది మా పెద్దమ్మాయి . . బుగ్గ పిండి పోపు పెట్టుకోవచ్చు.. అంత జిడ్డు మొహం!..

'ఏంటి అసలు సబ్బైనా పెట్టుకున్నావా? ముఖం మీద? ' అని గద్దిస్తే... 'yes అమ్మా!!.. నీకెప్పుడూ డౌటే నామీద.. అని ఇరిటేట్ అయింది మా పాప.. పోన్లే అని నేనూ హడావిడి లో పట్టించుకోలేదు..స్కూల్ బస్ వెళ్ళాక బాత్ రూం లోకెళ్ళి చూస్తే.. బకెట్ లో నీళ్ళ లెవెల్ ఒక ఇంచ్ అయినా తగ్గినట్టు అనిపించలేదు.. సబ్బు చూస్తే.. రాజస్తాన్ లో ఎడారి నేలంత .. పొడి పొడిగా..

సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక.. 'అవునూ.. ఉదయం నీ ఏక్షన్ రీ ప్లే చెప్తాను. బాత్ రూం కెళ్ళావు.. హాయిగా కొత్త టింకిల్ చదివావు.. 'టైం అయ్యిందీ' అని నా అరుపు వినగానే..గబ గబా.. చేతుల్ని బకెట్ లో ముంచి. మొహం తుడుచుకుని వచ్చేసావు.. ' అవునా? ' అని అడిగాను.. ముందర నా మొహం లోకి చూసింది.. వ్యంగ్యం,కోపం, లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయేమో..  ఒకవేళ నిజాన్ని ఒప్పుకుంటే.. తనకి ఏ విధమైన ట్రీట్ మెంట్ దొరకవచ్చు అని జాగ్రత్త గా..బేరీజు వేసుకుని.. నెమ్మది గా.. సిగ్గుగా, గారంగా ముఖం పెట్టి 'నీకెలా తెలుసు? ' అని అడిగింది..
నాకు కొన్ని దివ్యశక్తులున్నాయి అని చెప్పి..  స్నానం చేయకపోతే వచ్చే నష్టాలని వర్ణించి.. కాస్త భయపెట్టి వదిలాను.
వెళ్తూ వెళ్తూ.. 'అసలు టింకిల్ అలా చదివితేనే ఎంత.. thrilling గా ఉంటుందో తెల్సా? ' అని నా కందకుండా పరిగెత్తింది..

నేనూ తయారయి ఆఫీస్ కి వెళ్ళటానికి కార్ ఎక్కాక ఇద్దరు పిల్లల కబుర్లు, చిలిపి చేష్టలు  నెమరు వేసుకుంటూ  నవ్వుకుంటూ,  కాసేపు చక్రాలు చక్రాలు గా  కళ్ళముందు తిరుగుతూ..అలా నా నలుపు-తెలుపు ప్రపంచం లోకెళ్ళిపోయాను.. అదే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నమాట..

మా చిన్నప్పుడు మేమూ అలాగే... పుస్తకాలు చదివేవాళ్ళం.. అసలు పుస్తకాలేంటి.. ప్రతీదీ... ఎంత బేసిక్ ఆనందాలుండేవి ... లైఫ్ లో... అని ఆలోచిస్తుంటే.. ఎన్ని గుర్తొచ్చాయో..

బస్ స్టాప్ లో.. బస్సు సమయానికొస్తే.. దాంట్లో అనుకోకుండా సీట్ దొరికితే కాలేజ్ రోజుల్లో వచ్చిన ఆనందం ... పది పైసల ఆకుపచ్చ గట్టి చాక్ లేటు కొనే డబ్బున్నప్పుడు.. పావలా కొచ్చే eclairs కొంటే వచ్చే ఆనందం,..  ఏ బస్సులోనో, రోడ్డు మీదో.. అనుకోకుండా.. ఆకస్మికం గా పాత స్నేహితులు కనిపిస్తే దొరికే ఆనందం.. 
ఇంటికి కాళ్ళీడ్చుకుంటూ వస్తుంటే ఇంట్లో ఫేవరేట్ చుట్టాల గొంతులు వినిపిస్తే వచ్చే ఆనందం.. 

గ్ర్ర్ర్ర్ర్ అని శబ్దం వచ్చే పంప్ స్టవ్ మీద.. తోపుడు బండీ లో వేయించే మిర్చీ బజ్జీలు తిని, (బకెట్ లో ఉన్న కుళ్ళు నీళ్ళలో ఒకసారి ముంచి స్టెర్లైజ్ చేసిన స్టీల్ ప్లేట్ లో ) ..
గాజు గ్లాసుల్లో మరకలని కర్చీఫ్ తో తుడుచుకుంటూ, వేడి వేడి టీ లు తాగినప్పుడొచ్చే ఆనందం..

జనాల్ని తప్పించుకుంటూ, తోసుకుంటూ, సుల్తాన్ బజార్ (హైదరాబాద్) లో.. రబ్బర్ బాండ్ లో, పిన్నులో  కొంటే వచ్చే ఆనందం..   ఇలాంటి చిన్న చిన్న సర్ ప్రైజులు, ఆనందాలూ, కాస్త కాస్ట్లీ ఆనందాల, సర్ప్రైజుల వెనక్కి, ఎక్కడో అటకలమీద పెట్టేసాం..

ఇప్పుడు కార్ లో బయటకెళ్ళటం, ఫోన్ చేసి ఎపాయింట్ మెంట్ తీసుకోకుండా రాని బంధు మిత్రులూ, తినటానికెళ్ళాలంటే.. 'ఒక స్టాండర్డ్ ' ఉండాలని, .. షాపింగ్ అంతా.. మాల్స్ లో..  టీలూ,కాఫీలూ కాఫీ డేల్లో..

సెలవలంటే వాటికోసం తయారవటానికి 10 రోజులూ, సెలవలంతా.. అద్భుతం గా గడిపామన్న ప్రూఫ్ ల కోసం సెలవలంతా..మంచి కొత్త బట్టలేసుకుని, కెమేరాల్లో ఏ ఏ సీన్లు బంధించవచ్చా.. అని వెనకపడటమే సరిపోతుంది కదా అసలు?!!
వెనక్కొచ్చాక ఆ సెలవలనుండి రికవరీ కి మళ్ళీ ఇంకో వారం..

కనపడినవల్లా కొనేయటం,.. కో వర్కర్లకేమివ్వాలి? చుట్టుపక్కల వారికేమివ్వాలి? డ్రైవర్ కీ, పని అమ్మాయికేం కొనాలి? మన కుటుంబ సభ్యులకి ఎంత లో కొనాలి.. ఈ ఊబిలో కొట్టుకుంటూ.. 

ఇలా కాదు.. ఈ కిస్ మస్ సెలవల్లో గిఫ్టులు, కార్ లల్లో ప్రయాణాలు,  చుక్క హోటళ్ళల్లో భోజనాలు, మాల్ లల్లో కొనడాలు,   లాంటి వి వదిలేసి.. కొన్ని రోజులు 'బ్లాక్ ఎండ్  వైట్ ' ప్రపంచం లో గడపాలని నిర్ణయం తీసేసుకున్నాం.


హైదరాబాద్ లో దిగాక, సాయంత్రం పుస్తక ప్రదర్శన కి వెళ్ళి  పేపర్ కప్పుల్లో టీ తాగి.. నాలుగున్నర గంటల పాటూ, పుస్తక ప్రపంచం లో విహరించాం..   ఇ-తెలుగు లో 'మనసు లో మాట' సుజాత గారు కనపడతారేమో నని ఆశ పడ్డాను కానీ..  నిరాశే అయింది.. అంతకు ముందే.. 'గడ్డిపూలు ' సుజాత గారు వచ్చి వెళ్ళారని తెలిసింది.. 'అయ్యో' అనుకున్నాను.. మేమొచ్చి వెళ్ళాక.. ' ప్రవీణ్ శర్మ, సీ బీ రావు గారు వచ్చారని తెలిసింది.. వాళ్ళనీ చూడలేక పోయాం.. అని అనుకున్నాను.శ్రావ్య గారూ వచ్చారని .. విన్నాను.. కానీ వేరే రోజనుకుంటా..

అక్కడ కలిసిన బ్లాగర్ల గురించి రెండు ముక్కలు చెప్పాలి..

భార్గవ రాం - త్వరగా కలిసిపోయి హాయిగా నవ్వుతూ నవ్వించే స్వభావం.. పైగా.. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే .. అంటే.. నాది చాలా ఆర్డినరీ ఫేసండీ.. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు ప్రపంచం లో అంటారు.. నన్ను పోలినవారు మాత్రం 700 ఉంటారు కనీసం.. అని నవ్వేసారు.

కౌటిల్య గారు - ఎక్కువ మాట్లాడలేదు కానీ.. నన్ను బ్లాగర్ గా గుర్తించి.. నా బ్లాగ్ చదివానని, ఆయనకి నచ్చిందనీ చెప్పారు. (బహుశా.. ఆరోజు కలిసిన బ్లాగర్లలో ఒక్కరే అనుకుంటా.. నన్ను బ్లాగ్ ద్వారా గుర్తించింది.. )

శ్రీనివాస్ కుమార్ గారు : ఆయన చాలా సాదా (Simple) మనిషి లా అనిపించారు. మంచి స్టాల్స్ గురించి సూచనలిచ్చారు.

చావా కిరణ్ : బ్లాగుల్లో ఆయన చాలా సీనియర్ అని పరిచయం చేసారు. 'నేను చాలా వరకూ.. బ్లాగులు చదువుతాను.. మీ పోస్ట్ ఏదైనా చెప్పండి.. గుర్తిస్తాను.. ' అన్నారు.  ఏ పోస్ట్ గురించి చెప్పాలో అయోమయం లో పడి ఇంక చెప్పలేదు..

కత్తి మహేశ్ కుమార్ : బ్లాగుల్లో ఆయన పేరు చాలా సార్లు విని ఉండటం వాల్ల, ఆయన టపాలు కొన్ని చూసి.. ఆయన పోస్టులు ఒకటి రెండు చదివి, కామెంట్ చేసిన experience తో  .. ఆయన ని  భీకరం గా.. కళ్ళెర్ర జేసి ఆవేశం గా రంకెలేస్తూ .. ఆలాగ ఏదో ఊహించుకున్నాను కానీ..  మృదు స్వభావి గా, మాట మాటకి పగలబడి నవ్వుతూ, నేను ఊహించిన దానికి వ్యతిరేకం గా కనిపించారు.  మహేశ్ గారు నన్ను బ్లాగర్ గా గుర్తించలేదు.. నా కామెంట్లని గుర్తు చేసి.. కొద్దిసేపు ఆయన టపాల్లో ఏది నచ్చలేదో.. ఎందుకు నచ్చలేదో.. నేను ఆవేశం గా చెప్పినా.. ఆయన చిరునవ్వు తో చూస్తూ ఉండి పోయారు.  వెళ్తూ వెళ్తూ.. తన బ్యాగ్ లో పుస్తకం చూపించి  'ముదిగొండ శివప్రసాద్ ని సంచీలో తీసుకెళ్తున్నాను ' అని చమత్కరించి వెళ్ళిపోయారు.

వీకెండ్ పొలిటిషియన్ : 
వీకెండ్ పొలిటిషియన్ అంటే బొర్ర మీసాలతో, ఒక చలపతి రావో, ఒక కృష్ణం రాజో.. ఖాదీ బట్టలేసుకుని ఎర్రని బొట్టూ అదీ పెట్టుకుని భారీ కాయం తో .. చేతికి, మెడలో  బంగారు గొలుసులతో .. చేతులు జోడించి అందర్నీ పలకరిస్తూ.... అని ఎవరైనా ఊహిస్తారు  ఆయన కూడా.. దానికి విరుద్ధం గా.. సన్నగా పొడుగ్గా.. పెద్దగా ఆర్భాటాలు లేకుండా..  హుందా గా కనిపించారు. ( వారాంతాలు మాత్రమే ఆయన రాజకీయాలు చేస్తారనుకుంటా.. ఒక్క చొక్కా మాత్రమే.. ఖాదీ, మామూలు పాంటూ  అందుకే వేసుకున్నారు కాబోలు )..
బోల్డు పుస్తకాలు కొని ఇంటికి చేరాం ...


హాయిగా.. మామూలు బట్టలేసుకుని, తలకి నూనె దట్టించి,..  బస్సుల్లో తిరగటం,....సెలవలంతా..  పుస్తకాలు నమలటం,  రోడ్డు సైడ్ తోపుడు బళ్ళల్లో తినటం, 'ఆపిల్స్, పీర్స్ ' లాంటివి నాజూగ్గా పింగాణీ పళ్ళాల్లో ఫోర్కులతో తినటం కాకుండా.. 'చున్నీ తో దుమ్ము దులిపి బజార్ లో రేక్కాయలు, జామకాయలు, తేగలు, తిని, బస్సుల్లో తిరిగి,.. ఇరానీ హోటళ్ళల్లో చాయ్ లూ, పిడత కింద పప్పూ, బఠాణీలూ, తినటం, మా అమ్మగారింట్లో ఒక గోడ పెయింట్ చేయటం, తెల్లవారేదాకా స్నేహితులతో.. కబుర్లు,కొట్లాటలూ,  జెనరల్ బజార్ లో మామిడి తాండ్ర, బొట్టు బిళ్ళల షాపింగ్ చేయటం.. లాంటివి చేయటం.. ఎంతో సంతృప్తి గా .. చాలా సీదా, సాదా గా.. సెలవలు గడిపి మళ్ళీ మా బంగారు బెంగుళూరు చేరుకున్నాం... 

మళ్ళీ రొటీన్ లో పడినా.. కనీసం, 2 వారాలకి ఒక సారి కార్ వదిలి బస్సులో ప్రయాణం చేయాలనే నిర్ణయం, సెలవల్లో స్నేహితులతో, కుటుంబ సభ్యులతో,  కసి దీరా కొట్లాడినప్పుడూ, ఆర్థ్రమైన సంభాషణలు చేసినప్పుడూ,   పుస్తకాలని నమిలినప్పుడు, ఆఘ్రాణించిన ఆలోచనా స్రవంతీ, సెలవల్లో దొరికిన కొత్త ఫ్రెండూ,  చాలు... ఒక మంచి వెకేషన్.. అనిపించటానికి ..

హైదరాబాద్ 'అబ్బో బాగా మారిపోయింది.. మునపట్లా లేదు..' అనుకుటూ ఉండేదాన్ని, కానీ.. మారింది నేనేననీ,  కొన్ని చూడటం/గమనించటం  మానేశాననీ, .. కొన్ని మాత్రమే.. చూడటం నేర్చుకున్నానీ, సిటీ భౌతికం గా కొంత మారినా, ఎవరికి కావాల్సిన అనుభూతి వాళ్ళకి ఇవ్వటం మాత్రం లో మాత్రం మారలేదనీ.. మున్ముందు కూడా మార్పు రాదనీ అర్థమయింది....
Friday, August 27, 2010 40 comments

వావ్ ఈ విషయం మాకు చెప్పనే లేదే?



ర్ర్ర్ర్ర్ర్ర్ కిర్ర్ర్ర్ర్ర్ శభ్దం తో. మొదలయి డబ్ డబ్ మంటూ ఆగిపోయింది మా వాషింగ్ మిషను.

ఈ ఏడాది నాలుగోసారి అప్పుడే. సరే అని టెక్నిషియన్ ని పిలిపించాం. మల్లిక్ హీరోలా చిలిపి గా చెవుల్దాకా నవ్వుతూ " నాలుగు వేలవుతుంది సార్!!" అన్నాడు నాగరాజ్ ప్రతిసారీ అతనే వస్తాడు.. ప్రతి సారీ ఆలోచించి చించి మళ్ళీ రిపైర్ చేయించటం.. మళ్ళీ 2 నెలల్లో పాడవటం..

ఇలా కాదని ఈసారి కొత్తది కొనేశాం. కొన్నప్పుడు షాపు వాళ్ళు లక్కీ డ్రా కూపన్లని మాకు ఒక నాలుగు కూపన్లు చేతిలో పెట్టారు. మొదటి బహుమతి 50 గ్రా బంగారం, రెండవ బహుమతి అరకిలో వెండి, మూడవది.. 10 గ్రా బంగారం.. అలాగ.. మనకొస్తుందా చస్తుందా, ఎన్ని చూశాం అని నిర్లిప్తం గా పక్కన పడేశాం. వాటిని మా పని అమ్మాయి తీసి పిల్లల పాత కాగితాలలో పడేసింది. మొన్న శ్రావణ శుక్రవారం మాంచి కన్నడ హీరో తో లక్కీ డ్రా చేసి చూస్తే మా పేరు ఉందిట. వాళ్ళు ఫోన్ చేసారు.

పండగ పూటా ఇలా లక్ష్మీ దేవి వచ్చిందని మా అత్తగారు తెగ సంబర పడ్డారు. మాకు ఫస్ట్ ప్రైజో, సెకండ్ ప్రైజో అర్థం కాలేదు. అప్పటికప్పుడు షాప్ కి ఫోన్ చేసి కనుక్కుంటే సెకండ్ ప్రైజ్ అని అర్థమైంది. ఆ కూపన్లెక్కడున్నాయో అస్సలూ గుర్తుకు రాలేదు!!! ఒక అరగంట నీది తప్పంటే.. నీ బుద్ధే చేలో మేయటానికెళ్ళిందని ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఇల్లంతా వెతుక్కుంటుంటే.. మా పనమ్మాయి చటుక్కున తీసి ఇచ్చింది.

అర కిలో వెండంటే మాటలా? ఎంతుంటుందో అని గబగబా ఒకళ్ళు పేపర్, ఇంకోళ్ళు లప్పు టప్పు (లాప్ టాప్ కి మేం ముద్దుగా తెలుగు లో పిలుచుకునే పేరు లెండి) తీసి ఆబగా ఆశగా ఎన్ని లక్షలుంటుందో అని చూస్తే దగ్గర దగ్గర 30 వేలట. కాస్త డిజపాయింట్ అయ్యాం లెండి. అంటే దాదాపు 15 వేలన్నమాట. పోన్లే "దంచినమ్మకి బొక్కినంత" అని సరిపెట్టుకున్నాం.

ఈ వార్త తెలిసేటప్పటికి బయటకి వచ్చి ఎవరెవరికి చెప్దామా అని బయటకొచ్చేటప్పటికి పేరంటాళ్ళంతా తలుపులేసేసుకున్నారు. మరీ తలుపులు కొట్టి ప్రత్యేకం గా చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి? .. ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్దవారు రాత్రి అన్నం తిన్నాక నడక కి వచ్చినట్టున్నారు. సాధ్యమైనంత కాజువల్ గా నడుస్తూ వాళ్ళ దగ్గరకి రాగానే.. ఏదో ఒక విషయం మీద పలకరించి వాళ్ళకి విషయం చెప్పేద్దాం అని.

సాధ్యమైనంత వరకూ లేజీ గా నడుస్తున్నట్టు నటిస్తూ వెళ్తున్నాం.. వాళ్ళు మా దగ్గరకొచ్చేటప్పటికి అకస్మాత్తు గా 'మాహా మాహా..మహా మహా మహా' అని పాట రావటం మొదలుపెట్టింది. బిత్తరపోయి చూసేటప్పటికి పాపం వృద్ధ దంపతులు.. ఇబ్బంది గా మొహం పెట్టారు. వాళ్ళ రింగ్ టోనట. ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోయారు. "అయ్యో బంగారం లాంటి చాన్స్ మిస్సయ్యాం" అనుకుని.. ముందుకెళ్ళి చూస్తే పిట్ట లేదు రోడ్ మీద.

సరే ఫోన్ చేసి చెప్పవచ్చు గా.. అనుకుని.. 'ఈ వీకెండ్ ఏదైనా హోం వర్క్ ఉందా పిల్లలకి ?', ' మొన్నీమధ్య వైరల్ జ్వరాలన్నారు ఇప్పుడు బాగున్నారా? " , "మీ తమ్ముడి పెళ్ళి అయిందన్నావు బాగా అయ్యిందా?", "మా ఆడపడచుకి చీర కొందామనుకుంటున్నాను, దగ్గర్లో మంచి బట్టల షాప్ ఎక్కడుంది?', "మొన్న జాబ్ మారతానన్నారు ఏమైంది?" లాంటి సాకులతో ఫోన్ చేసి గర్వం గా అప్పుడే గుర్తొచ్చినట్టు విషయం అందరికీ చెప్పేశాం. మా ఆడపడచులకి తలా 10% ఇస్తాం అని వాగ్దానం చేసాం.

అమ్మయ్య కాస్త కడుపు ఉబ్బరం తగ్గింది అనుకుని ఆ వెండి తో మా అత్తగారు చెప్పినట్టు "కడ్డీల్లాగే లాకర్ లో ఉంచేసుకోవాలా?" మా అమ్మ చెప్పినట్టు "వెండి కంచం చేయించుకోవాలా" అని తనివి తీరా వాదించుకుని పడుకుని లేచి షాప్ కి పరిగెత్తాం. 11 గంటలకి తాళాలు తీసి వాకిలి చిమ్ముతున్నారు. 'రండి రండి ' అని ఆదరం గా పిలిచిన వాళ్ళు.. విషయం తెలియగానే..'సరే కూర్చుని తగలడండి.. మా ఓనర్ వస్తాడూ అన్న లుక్కిచ్చి తమ పని తాము చూసుకోసాగారు. కాసేపాగి ఓనర్ సోమవారం వస్తాడు వెళ్ళండన్నారు.

సోమవారానికి మా కాలనీ అంతా చెప్పేసాం, మా వారి ఆఫీస్ లోనూ, నా ఆఫీస్ లోనూ అందరికీ చెప్పి అందరి కళ్ళల్లో ఆశ్చర్యం, లైట్ గా ఈర్ష్య చూసి తెగ ఆనందించాం. మా గ్రూప్ లో వాళ్ళు మమ్మల్ని కాఫీ డే లో పార్టీ కి తీసుకెళ్తావా చస్తావా? అని పీకల మీద కూర్చోవటం తో సాయంత్రం 14 మంది ని తీసుకుని ఆఫీస్ పక్కన దానికి తీసుకెళ్ళాను. కాఫీ, సండేలూ వగైరా ఆర్డర్ చేసారు అందరూ.. 'ఆహా నీ అదృష్టమే అదృష్టం.. పెట్టి పుట్టావు ' లాంటి మాటలతో నన్ను పొగిడి తబ్బిబ్బు చేసేసారు. గాలిలోకెక్కడికో వెళ్ళిపోయిన నన్ను ఒక్క దెబ్బలో భూమి కి పడేసింది బిల్లు. 1500 చిల్లర అయింది.

2 కిలోల స్వీట్ తెచ్చి పెట్టాను ఎందుకైనా మంచిదని. మా కాంప్లెక్స్ లో వాళ్ళు ..'ఆహా కృష్ణా.. పార్టీ " అంటూ వచ్చిన వారికి చేతిలో స్వీటు ముక్క పెట్టి సంతోషం పంచుకున్నాము. అక్కడో ఐదు వందలకి తైలం వదిలింది.

షాప్ వాళ్ళు కంప్యూటర్ లో చూసి 2 పాస్ పోర్ట్ ఫొటోలూ, పాన్ కార్డ్ కాపీలూ, 4,500 రూపాయల కాష్ తెచ్చి కట్టమన్నారు. 'అదేంటి? ' అంటే.. 'టాక్శ్ ' అన్నాడు.. 'ఈ మాత్రం తెలీదా? ' అన్నట్టు జాలిగా మొహం పెట్టి. మొత్తం కొన్న వెండికి విలువ చూస్తే 14 వేల చిల్లర. దీంట్లో ఐదు వేలు టాక్స్ కెళ్తే 9 వేల లాభం. అసలు కడదామా వద్దా అని తర్కించుకుని.. అసలే అందరికీ చెప్పేసుకున్నాం కొని తీరాల్సిందే అన్న నిర్ణయానికొచ్చి ఏడుపు ముఖమేసుకుని ఐదు వేలూ కట్టేసాం. (500 ఏమో వేరే ఖర్చులకి ..) రోకట్లో తల పెట్టాక రోకలి పోటులకి భయపడితే ఎలా?

'ఏదీ వెండి? ' అని అడిగితే 'అమ్మా! అంత వీజీ గా ఎలా ఇస్తాం? మా షాప్ వాళ్ళ ఫంక్షన్ ఉంటుంది దాంట్లో స్టేజ్ మీద పిలిచి ఇస్తారు..' అన్నారు. వెర్రి మొహాలేసుకుని ఇంటికి వచ్చి పడ్డాం. ఈ లోగా మా ఆడపడచులకి .. తలా వెయ్యీ ఇచ్చి మీకు కావలసిన వెండి వస్తువు కొనుక్కోండి అని ఇచ్చేసాం.

అంత ఫంక్షన్ లో కట్టుకోవటానికి మంచి చీర ఉంటే బాగుంటుంది కదా.. నావన్నీ సాదా సీదా గా ఉన్నాయి లేదా పాత ఫాషన్ వి. అని కొత్త పట్టు చీర అవీ తీసుకున్నాం. చెప్పొద్దూ.. మూడు వేలకి ఎంత చక్కటి చీర

నేను కొనుక్కుంటూ పిల్లలకి కొనకపోవటమేమిటని వాళ్ళకీ కొత్త బట్టలు కొన్నాం, 5 వేలు బట్టలకైంది అందరికీ. మా పనమ్మాయి 'మాడం.. మీరు అలా గాలికి వదిలేస్తే నేనే కదా పెట్టాను పక్కన జాగ్రత్త గా..' మీరు నాకు ఏం కొంటారు? అని అడిగింది. అదీ నిజమే అని తనకి 500 ఇచ్చి ఏదైనా చీర కొనుక్కొమ్మన్నాను.

ఫంక్షన్ అయింది వెండి కడ్డీలూ దొరికాయి. సంతోషం గా ఇంటికి చేరాం. వారం గడిచేటప్పటికి కాస్త రంగు లో మార్పు వచ్చినట్టనిపించింది. వెండి అంటే ఇది మామూలే అని ఊరుకున్నాం. నాకే మనసాగక కంసాలి దగ్గరకెళ్ళి చూపించాను. 'పర్వాలేదు.. మరీ నాసి రకం కాదు ' అన్నాడు. కానీ.. వేరే లోహం కలిసిందన్నాడు. 'ఏం చేస్తాం?' ఎవ్వరితోనూ అనకుండా తేలు కుట్టిన దొంగల్లా కాం గా ఉండిపోయాం. వెండి చేతికొచ్చేలోపల ఈ విషయం లో మేము చేసిన ఖర్చు తలచుకుంటే.. అసలు ఖరీదుకి కాస్త ఎక్కువే అయినట్టు తేలింది.

ఈ కథకి కొసమెరుపేంటంటే.. ఆ షాప్ కి బెంగుళూరు లో 4-5 బ్రాంచిలున్నాయి. అన్నింటిలోనూ వెండి అందుకుంటూ మా ఫొటోలు పెట్టారు. తెలిస్న వారు కొందరు చూసి.. 'వావ్ ఈ విషయం మాకు చెప్పనే లేదే?' అని జెలస్ గా అంటుంటే.. మేము హి హి హి అని పైకి అంటూ, లోపల మాత్రం తెగ గింజుకుపోతున్నాం. మీరూ చెప్పకండే?
Friday, July 23, 2010 23 comments

హాయిగా హాల్లో సినిమా...

పుట్టినరోజని సినిమా కెళ్దాం అని బయల్దేరాం..మాల్ లో మల్టీప్లెక్స్ థియేటర్ కి. అన్ని సెక్యూరిటీ పరీక్షలూ పాస్ అయి తీరిగ్గా వెళ్ళి కిటికీ షాపింగ్ చేసి... ( ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్నందువల్ల, తొందర లేదు..) ఇంకో పది నిమిషాలుందనగా.. లోపలకెళ్ళాం. కెమేరా లకోసం వెతికి లోపలకి పంపగానే 500 రూపాయలు ఫట్!! కోక్, నాచోలకీ.. పాప్ కార్న్ కీ..

రెహమాన్ జాతీయగీతం, అందరూ నిలబడ్డాం. తర్వాత.. స్మూత్ గా జరిగిపోయింది సినిమా. జోకులకి నవ్వుతున్నా.. పెద్దగా సీట్లు చించేసేంత లేదు అక్కడ. సినిమా అయ్యాక..దోవలోనే పిల్లలు నిద్రపోయారు. ఇంటికొచ్చాక ఆలోచనలో పడ్డాను.

మా చిన్నప్పుడు ..మా ఊర్లో "హేఏఏఏఏ కృష్ణా.. ముకుందా... మురారీ......" ' ఘంటసాల గొంతు వినబడగానే..పౌడర్లు దబ దబా మొహాన దగ్గొచ్చేలా కొట్టి పరిగెత్తించేవారు మా అమ్మా వాళ్ళు. స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఎంత సున్నితం గా దువ్వినా అరిచి గీ పెట్టే మేము ఆరోజు మాత్రం నేలని దున్నినట్టు దువ్వినా కిక్కురు మనకుండా సహకరించేవాళ్ళం. పైగా అడగకుండానే అమ్మా వాళ్ళు వినేలా అరడజన్ పాఠాలు గట్టిగట్టిగా చదివేసి.. ఈ పీ ఎం (performance assessment) ముందు వారం రోజులు ఆఫీస్ లో పని చేసినట్టు!!.. 2 వారాలకోసారేమో వెళ్ళేవాళ్ళం. అందరూ మనల్ని చూస్తున్నారా లేదా అని గమనించుకుంటూ..

స్లైడ్లూ, న్యూస్ రీళ్ళూ అయ్యాక, అసలు మొదటి హీరో తెర మీదకొచ్చేదాకా వాడేమన్నాడో అసలేమవుతోందో తెలిసేదే కాదు.. అన్ని ఈలలూ, చప్పట్లూ, పిల్లి కూతలూ. ఇంటర్వెల్ లో ఏమీ కొనమని మా అమ్మా వాళ్ళూ ఇష్ట దైవాల మీద ఒట్లు పెట్టించుకుని తెచ్చేవారు. కానీ ఇంటర్వెల్ లో సామ, దాన, బేధ, దండోపాయాలేవైనా సరే వాడి కనీసం గోలీ సోడా అయినా కొనిపించుకునేవాళ్ళం అనుకోండి..

ఆఖరి పరీక్ష అయ్యాక సినిమా కెళ్ళే ఆనందానికి ముందు బంగారు తొడుగులు అయినా సాటి రావు కదా.. ఒకసారి ఆఖరి పరీక్ష అయ్యాక మా ఊర్లో సినిమా హాల్లో 'ఎఱ్ఱ మల్లెలు ' ఆడుతోంది. మా అమ్మ నేను చచ్చినా రాను అంది. ఏం చేస్తాం? మా నాయనమ్మ దగ్గర గొడవ చేస్తే..ఆవిడ సరే అంది. నేనూ, మా చెల్లీ, నాయనమ్మా బయల్దేరాం. ఆవిడా..నెమ్మదిగా నడుస్తుంది. ఊరంతటికీ ఒకటే హాల్. పైగా.. ఎఱ్ఱ మల్లెలా మజాకా? గోదావరిఖని కార్మికులంతా హాల్లోనే.. వెళ్ళి చూస్తే.. టికెట్లన్నీ అయిపోయాయి. మేము దొర్లి దొర్లి ఏడుపు! ఎంతైనా మనవరాళ్ళ ఏడుపు చూడలేక మా నాయనమ్మగారు బతిమాలి బెంచి టికెట్ సంపాదించారు. పెద్దావిడ కదా అని ఆవిడ కి కాస్త చోటిచ్చారు జనాలు. మేం కిందే.. ఎంత మజా.. 30 యేళ్ళు దాటినా ఇంకా ఆ బీడీ వాసన ఫ్రెష్ గా..

ఇక అమ్మమ్మ గారింట్లో సినిమా అంటే.. ఉదయం డప్పు తీసుకుని దండోరా వచ్చేది... "ఈరోజు.. ఢం ఢం ఢం ఢం.. నక్కా తాతయ్యగారి దొడ్లో.. ఢం ఢం ఢం ఢం.. 'వయ్యారి భామలూ.. వగలమాడి భర్తలూ'.. వేస్తున్నారోఓఓఓఓఓఓ ఢం ఢం ఢం ఢం!!!!!" ఇంక మాకు పట్ట పగ్గాలుండేవి కావు.

పొద్దున్నుంచీ గొడవ గొడవ చేసి.. అందరి దగ్గరా బోల్డు మంచి వేషాలేస్తే.. సాయంత్రం పంపేవారు.. చాపలూ, పాత దుప్పట్లూ తీసుకుని పొలో మని.. వెళ్తే.. టికెట్ కి అర్థ రూపాయి. మధ్యలో కరెంట్ పోతే.. నాగమణి అని ఒక పిల్ల ఉండేది.. 10-12 యేళ్ళుంటాయేమో.. 'నువ్వాడవే." అనటం ఆలస్యం.. పాడుతూ డాన్స్ చేసేసేది. మేము ఇంత ఎంజాయ్ చేస్తున్నట్టు కనపడ్డా.. మా తాతగారు 'ఏంటా వెకిలి వేషాలు ? ' అని హుంకరించటం.. ఎన్నున్నాయో గోడ మీద సినిమా జ్ఞాపకాలు!!! ఎంటివోడి సినిమాలంటే చాలు! ఊరి పెద్దలు కుర్చీల మీద, మిగిలిన వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న చాపలమీదా కూర్చుని చూడటం...

హైదరాబాద్ కొచ్చాక మాత్రం సినిమాల జోరు మాకు తగ్గిపోయింది. మేమూ పెద్దయి.. కుటుంబం కన్నా.. స్నేహితులతో ఎక్కువ వెళ్ళేవాళ్ళం. చిరంజీవి, బాలకృష్ణ, అప్పుడప్పుడూ శోభన్ బాబు, కృష్ణ.. అమీర్ పేట లో సత్యం, చిక్కడపల్లి లో. బోల్డు థియేటర్లు..బస్సెక్కి పోవటం, చూడటం..

అప్పుడప్పుడూ పిల్లల్ని పంపేది మా అమ్మ సినిమాలకి.
మా తమ్ముడు మామూలప్పుడు మామూలు గా తిన్నా..సినిమాలకి వెళ్తే.. ఇంక ఆగేవాడు కాదు. వాడిని తీసుకెళ్తే.. ఇంక మాకు తిప్పలే తిప్పలు. మంచి నీళ్ళ బాటిల్ లోంచి నీళ్ళు పారబోసి.. చెఱకు రసం పోయించుకునేవాడు. చిప్స్ దగ్గర్నించీ పావలా త్రికోణం సమోసాల దాకా తిండే తిండి.. పర పర, కర కర.. ఒకసరైతే..తెచ్చుకున్న డబ్బంతా తిండి కే సరిపోయి సినిమా హాల్ నుండి ఇంటికి వెనక్కెళ్ళటానికి బస్సుకి డబ్బుల్లేవని నడుచుకుంటూ వెళ్ళాం.

మా పెద్దమ్మల ఇళ్ళకెళ్తే అక్కడ సినిమా చూడటం లో మజా యే వేరు. 20 మంది 7-8 రిక్షా లెక్కి వెళ్ళటం.. ఉక్కిపోతూ కూర్చోవటం.. హాల్లో పాటలొచ్చినప్పుడు మగాళ్ళంతా బయటకెళ్ళటం.. ఫైట్లప్పుడు ఆడవాళ్ళు కబుర్లు మొదలు పెట్టడం.. ఏడుపు సీన్లలో ఆడవాళ్ళు వెక్కి వెక్కి ఏడ్వటం.. ఒకసారి ఒకావిడ చేతులూపుతూ శాపనార్థాలు పెట్టింది.. మా పక్క సీట్లో ( ఓలమ్మో.. నీదొక ఆడ జన్మేనా థూ.. దాని మొగుణ్ణి వల్లో వేసుకుంటావా.. !@%@) అంటూ.. తెగ ఏడుపు! నవ్వుకోలేక చచ్చాం..

ఒకసారి ఉండ్రాజవరం అన్న ఊర్లో టూరింగ్ టాకీస్ లో 'జగజ్జట్టీలు ' అన్న సినిమాకెళ్ళాం. ఆవూర్లో ఆడవాళ్ళకీ, మగవారి సీట్లకీ మధ్య ఒక గోడ ఉండేది. మేమా చిన్న పిల్లలం. 2 సైకిళ్ళమీద బయల్దేరాం. మగాళ్ళ సైడ్ మా అన్నయ్య.. ఆడవాళ్ళ సైడ్ లో నేనూ, మా అక్క, చెల్లీ.. (కజిన్లం ) డబ్బేమో వాడి దగ్గరే.. ఇంటర్వెల్లో భటాణీలూ, పల్లీలూ కొనుక్కొచ్చేసరికి లైట్లు ఆపేశారు. గోడ మీదనుండి.. 'పాపాయీ.. తీసుకోవే.. పిడత కింద పప్పు తెచ్చాను 3 పొట్లాలు.. ' అన్నాడు.. మేము సినిమాలో లీనమైపోయాం అప్పటికే.. ఎవరో శుభ్రం గా అందుకుని తినేసారు. విషయం సినిమా అయ్యాక తెలిసి మాకు ఎక్కడ లేని బాధా వచ్చేసింది...


టెంత్ లో అనుకుంటా పబ్లిక్ పరీక్షలప్పుడు లెక్కల పేపర్ లీకయిందని కాన్సెల్ చేసారు. పరీక్ష హాల్ కి రాగానే వార్త విని, వచ్చిన రిక్షా నే 'బాబూ.. సత్యం థియేటర్ కి తిప్పు ' అని వెళ్ళిపోయాం.

లాబ్ లో అటెండన్స్ ఇచ్చి ప్రాక్టికల్సప్పుడు ఎంత హాయిగా వెళ్ళిపోయేవాళ్ళమో .. కానీ అప్పుడప్పుడూ దారుణం గా దొరికిపోయేవాళ్ళం.. పైగా..ఎక్కువ డబ్బులు ఉండేవి కావు. దానితో లంచ్ డబ్బా లో పెట్టిందే తినటం. ఒకసారి లైట్లు తీసేశాక చీకట్లో దోశలు తింటుంటే ముందు సీట్లో అబ్బాయి నాకూ దోశలు కావాలని ఒకటే ఏడుపు...

ఒక్కోసారి మార్నింగ్ షో కెళ్ళి ఇంటర్వెల్ లో వచ్చి మాటినీ కి కొనుక్కునేవాళ్ళం. ఉదయం నుండీ సాయంత్రం దాకా 2 సినిమాలు చూసి.. కాలెజొదిలే సమయానికి ఇళ్ళకి చేరటం.. మా స్నేహితురాలిని తెచ్చి మా అమ్మని అడిగించటం.. 'ప్లీజ్ మీ అమ్మాయిని పంపమని.. ఫ్రెండ్స్ ముందు ఒప్పుకున్నా.. వాళ్ళు వెళ్ళాక రికమెండేషన్లు తెస్తావా అని తిట్లు..

మా ఇంటి ఎదురు గా ముగ్గురు అన్నదమ్ములు అందరూ మెడికల్ కాలేజ్ లో చదివేవారు. మా నాన్నగారు వాళ్ళని ఆదర్శం గా తీసుకొమ్మంటారని వాళ్ళకి తెలుసు.. ఒకసారి అందాల నటుడు శొభన్ బాబు సినిమా ఏదో చూసి వస్తున్నాను ఫ్రెండ్స్ తో.. 'ఏంటీ సినిమా నా.. ఏం చూసావ్? అనగానే.. మరీ 'శ్రీవారి ముచ్చట్లో ఏదో చెపితే ఏం బాగుంటుందని.. పక్క థియేటర్ లో ఆడిన కళా తపస్వి విశ్వనాథ్ గారి సినిమా శ్రుతి లయలు చూశామని కోసిన గుర్తు. ఏం చేయను? మా ఫ్రెండ్ శోభన్ బాబు కి వీరాభిమానాయె! తర్వాత ఎందుకైనా మంచిదని కథా, నటుల గురించి తెలుసుకున్నాను..

ఇంక యూనివర్సిటీ లో..సైకిల్ మీద వెళ్ళి బస్ టికెట్ల డబ్బు తగ్గించుకుని తిరిగినవీ.. 'చీప్ ' అని మొదటి వరస లో చూడటం... ' అందాజ్ అప్నా అప్నా ' సినిమా కెళ్తూ సరదాకి ఒకళ్ళం చీర/20 నగలూ, ఒకరు జీన్సూ/టీ, ఇంకోళ్ళు సల్వార్-కమీజ్, ఇంకోళ్ళు ధోతీ/జుబ్బా లలో వెళ్ళి నవ్వించటం..
హం ఆప్కే హై కౌన్ ఐదు సార్లు చూడటం.. ముందుగానే కథ/డైలాగులూ తెలుసుకుని ఇంగ్లిష్ సినిమా ప్రతి ముక్కా అర్థమయినట్టు నటించటం.. మదరాసులో సూపర్ స్టార్ రజనీకాంత్ వీ, బెంగుళూరు లో పవర్ స్టార్ పునీత్ వీ చూడటం.. 'ఖల్ నాయక్ ' చూద్దామని ముందుగానే 15 మందికి సైకిల్ మీద వెళ్ళి సరిగ్గా చూసుకోకుండా అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. హిందీ డబ్బింగ్ సినిమా 'ఈవిల్ డెడ్ ' అయ్యిందని 15 మంది కొట్టటానికి వస్తే పారిపోయి రావటం,

అమెరికాలో ఇంక సినిమాలు పిల్లలు పుట్టనంత కాలం వారానికొకటి చూసి హాయిగా వచ్చేవాళ్ళం.. ఓ సారి సన్నీ వేల్ లో సినిమా చూడాలని ( ఇంకో వారం లో మా పాప పుడుతుంది అనగా ) వెళ్ళాం నేనూ, మా వారూ.. చిరంజీవి సినిమా 'అన్నయ్య ' కి. టికెట్లిచ్చే ఆవిడ 'మీకు వీలు గా ఉండేందుకు ఐల్ సీట్ ఇస్తాము ' అనగానే 'అబ్బో వీళ్ళకి ఎంత దయ! ' అనుకుని వెళ్తే ఏముంది.. పట్టుమని 10 మంది కూడా లేరు హాల్లో..ఆవిడ జోక్ చేసిందని అప్పటికి అర్థం అయింది మాకు :-)

ఇలా ఇంకో వారం లో పుడతారనేదాకా కూడా చూసినందువల్లనేమో.. మా పిల్లలకీ.. బానే సినిమా పిచ్చే :-) చిన్నప్పట్నించీ వాళ్ళకి సినిమాలు అలవాటే.. కాకపోతే పాప్ కార్న్ పాకెట్లు అయ్యాక ఎవరో ఒకళ్ళం గుమ్మం దగ్గర నిలబడేవాళ్ళం అనుకోండి..

మా తాతగారి జమానా లో బళ్ళు కట్టించుకుని కారియర్లలో టవున్లకొచ్చి చూసినా.. మా తల్లిదండ్రుల జమానా లో రిక్షాల్లోనో, చేతక్ మీదో వెళ్ళి చూసినా, ఆటోల్లో, బస్సుల్లో వెళ్ళి లైన్లల్లో నుంచుని/బ్లాక్ లో కొని చూసినా.. సాఫిస్టికేటెడ్ గా ఇంటర్నెట్ లో బుక్ చేసుకుని యే సీ కార్లో వెళ్ళి కోక్, నాచోలూ తింటూ మల్టీ ప్లెక్స్ లో చూసినా.. హాల్ కెళ్ళి చూడటం లో మజా నాకయితే.. డీవీడీల్లో, టీవీలోనో, యూ ట్యూబ్ లోనో, టోరెంట్లో డవున్లోడ్ చేసి చూస్తేనో.. రాదు.

కానీ అంత టైమెక్కడేడ్సింది? ఎలాగో అలాగ వారానికో సినిమా ఖాతా లో పడకపోతే.. తెలుగు వారికి సంతృప్తి ఎక్కడిది?
Friday, July 16, 2010 35 comments

NRI నుండి పక్కా ఇండియన్ గా మారడం దాకా..

ఏదో ఆఫీస్ పార్టీ.. అంటే బయటనుంచి సమోసాలు, పకోడీలు, 2 రకాల స్వీట్లు, సలాడ్ తెప్పించి బ్రేక్ రూం లో పెట్టి మా అడ్మిన్ మెయిల్ పంపితే అందరం ' యెటాక్ ' అని నచ్చినవి తీసుకుని అక్కడ కూలబడి కబుర్లు చెప్పుకుంటూ కొత్తగా వచ్చిన ఇంజినీర్ ని గమనిస్తున్నాం.

'హ్మ్మ్మ్ .. లుక్స్ గుడ్!! ' అని కళ్ళెగరేసి.. చూసి.. ' వావ్ !! ' అని కాస్త అరిచినట్టుగా చేసి.. అతి జాగ్రత్త గా ఒక టిష్యూ పేపర్ మీద ఒకటే 'వెజెటబుల్ ' తీసుకుని ఒక కార్నర్ కొచ్చి సాటి IE లతో నుంచున్నాడు (Imported Engineers). " జిలియన్ కాలరీస్ " , "గ్రీజీ " లాంటి పదాలు వినబడుతున్నాయి మంధ్రం గా ...

IE .. ముద్దుగా మా గ్రూపు లో పెట్టుకున్న పేరు లెండి. మేమందరం కళ్ళతోనే ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాం. ఇది పునహ్ భారతీకరణ లో మొదటి ఫేజ్. (పది పదిహేనేళ్ళ విదేశీ వాసం తర్వాత భారత జన జీవన స్రవంతి లో మళ్ళీ కలిసిపోవడం ...)

మా హెడ్ ఆఫీసు అమెరికా లో ఉండటం తో.. ఆర్థిక మాంద్యం మొదలైన దగ్గర్నించీ , దాదాపు 2 వారాలకొకరు బెంగుళూరు వచ్చేస్తునారు మూటా ముల్లే సద్దుకుని.

మొదటి ఫేజ్ లో ఉన్నాడు సుభాష్. అందరు RI (Returning Indians) ల్లాగానే.. కొద్దిగా వెలిసినట్టున్న లేత రంగుల షర్టులూ, అవే రంగుల్లో పాంటులూ, హైకింగ్ లేదా స్పోర్ట్ షూలూ, కనబడిన వాళ్ళందరినీ, పెదాలు సాగదీసి నవ్వినట్టు పోజిచ్చి
తల తో ' రా ' అని పిలిచినట్టు ఒకసారి కిందకి వంపి హాల్ వే లల్లో కుడి వైపు నడుస్తూ, అందరికీ తగలబోయి సారీలు చెపుతూ ..

కాఫెటేరియా తిండి లో కాలరీలు లెక్కపెట్టడం, టిష్యూ పేపర్ల కట్టలు క్యూబ్ లో పెట్టుకుని వాడటం.. ఇతర క్యూబ్ లలోకి తొంగి చూడకుండా డీసెంట్ గా ఆయిల్స్ లోంచి వెళ్ళటం.. ఇతరులు మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి మాట్లాడక పోవటం.. ఒక తేదీ న పని పూర్తి చేస్తానన్నప్పుడు అది పాటించి పూర్తిచేసి చూపటం లాంటివి మంచి బుద్ధులతోనే ఉంటారు మొదట్లో ..

ఇళ్ళు ఎగ్సెట్రా..

రావటం రావటం గెస్ట్ హౌజ్ లోనో, లేక వారి ఆత్మీయిలు ఇళ్ళల్లోనో దిగి.. ఇక వాళ్ళు ఇళ్ళు వెతకటం చూస్తే ముచ్చటేస్తుంది. మొదటి ప్రశ్నలు.. 'ఈజ్ ఇట్ సేఫ్ నైబర్ హుడ్?' , ' ఇతర ఆర్ ఐ లు ఉన్నారా లేరా? '.. గేటెడ్ కమ్యూనిటీ తప్పని సరి. ఇంటికి మారగానే పని మనుషులు కుప్పలు తెప్పలు గా వచ్చి..' అమ్మగారో.. ' అంటూ చక చక లాడుతూ పనిచేస్తారనే ఊహలు! అయినవాళ్ళంతా.. @సర్వీస్.. అంటూ అండగా ఉంటారని కూడా అంతర్లీనం గా ఆశ పడటం.. అదే విధం గా మనం కావాలనుకున్నప్పుడు మాత్రమే మనల్ని ఎంటర్ టెయిన్ చేసి వద్దనుకున్నప్పుడు తెర చాటుకెళ్ళే బంధుగణం..

కలలు కరిగాక .. వారానికో రోజు ఆరోగ్యం,చుట్టాలు, నానా రకాల ఫంక్షన్ల పేర్లు చెప్పి ఎగ్గొట్టే పని మనుషులు,.. వాళ్ళ వాళ్ళ రొటీన్ లో ఉన్న ఆత్మీయులు, అవసరాన్ని బట్టి ప్రత్యక్షమయ్యే బంధువులూ..

వీకెండ్ లు?

అమెరికాలోలాగే ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాలేమో అన్న రంధిలో కొంతకాలం కొట్టుకోవటం.. బెంగుళూరు ట్రాఫిక్ లో అడుక్కి అరవైనాలుగు సార్లు కార్ ఆగుతూ.. ఏదో విధం గా కష్టపడి తిరిగి రావటం..

ఆరు నెలలు తిరిగేసరికి..
వారాంతాలంటే..హాయిగా ఇంటిపట్టున పడి ఉండటం.. పిల్లలూ, పెద్దలూ, వారం లో పేరుకుపోయిన పనులు పూర్తిచేసుకోవటం.. ట్రాఫిక్ తక్కువ ఉన్న వైపు తప్ప పొరపాటున కూడా వెళ్ళకపోవటం!

ప్రయాణాలు?


మొదట్లో వారి సొంత ఊళ్ళకి ప్రయాణాలన్నీ విమానాల్లో.. లేక 7-8 వందల కిలో మీటర్లు కూడా కార్ డ్రైవ్ చేయచ్చా అని ఆలోచనలూ.. లేదా రైలెక్కారంటే.. తప్పని సరిగా స్టేషన్ కి టాక్సీలు.. కూలీలకి అడిగినంత ఇచ్చేయటం.. చేతి సంచీలో టాయిలెట్ టిష్యూలు, ఎక్వా ఫినా నీళ్ళ సీసాలు మాత్రం మరిచిపోకపోవటం!

ఓ ఏడాది తిరిగేటప్పటికి.. బస్సూ, థర్డ్ ఏ సీ, స్లీపర్ కోచూ... కార్లలో వెళ్ళినా.. అద్దె కార్లలో..డ్రైవర్ ని నియమించుకోకుండా వెళ్ళే సాహసాలు చేయకపోవటం..

కబుర్లు?


' సాన్ హోసే (వారుండి వచ్చిన సిటీ) ' లో ఉన్నప్పుడు.. తో మొదలు పెట్టి.. బెంగుళూరు లో క్రమశిక్షణ లేని ట్రాఫిక్ ని తిట్టుకోవటం తో ముగించటం.
ముదిరిన లంచగొండిదనం, సమయపాలన చేయని వారి ప్రవర్తన గురించి,విదేశాల్లో ఉండగా తిరిగిన ప్రదేశాల చర్చలు...
విదేశాల్లోని వస్తువుల నాణ్యత గురించి, భారతావని లోని కాలుశ్యం గురించీ మాట్లాడకుండా ఉండని ఆర్ ఐ లుంటారా?
అమెరికన్/వారుండివచ్చిన ప్రాంతపు కూరలూ, పళ్ళూ, ఇతర ఆహార/ఇతర పదార్థాలు ఎక్కడ దొరుకుతాయో..వివరాలు ఎక్స్ చేంజ్ చేసుకోవటం..
అక్కడ పిల్లల చదువు లో సృజనాత్మకతా,..ఇక్కడ బట్టీ కొట్టే పద్ధతి గురించి విపులం గా మాట్లాడుకోవటం..
విదేశాలకి ఒక్కసారి కూడా వెళ్ళని వారు తారసపడితే కాస్త గంభీరం గా మొహం పెట్టి, స్టైలిష్ గా పలకరించి ఊరుకోవటం..

ఇతరత్రా..

ఒక ఏడాది పాటు అక్కడనుంచి తెచ్చిన బట్టలూ, ఇతర వస్తువులూ వాడటం, ఎవరైనా వస్తుంటే తెప్పించుకోవటం.. ఓ రెండేళ్ళు అక్కడికి ఎవ్వరి వెళ్తున్నా.. విదేశాల్లో స్నేహితులకి మైసూర్ పాక్ ల నుండీ.. కాటన్ కుర్తీల వరకూ పంపటం..
క్రెడిట్ కార్డ్ బిల్లుల్లో డబ్బు మేరుపర్వత ప్రమాణాన కనిపిస్తుంటే.. నెమ్మదిగా తగ్గించేయటం..

ప్రైవసీ కరువైందని బెంగపెట్టుకోవటం.. తెలిసీ తెలియని వారి పార్టీల్లో 'ఆర్ ఐ ' లు గా గుర్తింపు పొందాలని తాపత్రయపడటం..

ఇలాగ ఎన్ని చేసినా ఎన్ని విషయాల్లో కష్టపడ్డా.. నష్టపడ్డా, డిజపాయింట్ అయినా, అనారోగ్యం పాలయినా (మొదట్లో వాతావరణం మార్పు కి..ముఖ్యం గా పిల్లలకి), ప్రైవసీ లేదని బెంగపెట్టుకున్నా.. ట్రాఫిక్ ని తిట్టుకున్నా, టైంలీ నెస్ ఏదీ? అని నిట్టూర్చినా...

చక్కగా నచ్చినవి కొనుక్కోవటం, లేదా చేయించుకోవటం, అదీ కుదరకపోతే..పని వారి సహాయం తో స్వయం గా చేసుకోవటం.. వాతావరణం ఎలా ఉంది? ఎన్ని లేయర్ల తొడుగులు అవసరం లాంటి లెక్కల్లేకుండా.. చటుక్కున వీధిలోకి వచ్చేయటం. పిల్లలని మరీ ఇంట్లో కట్టిపారేయకుండా వీధిలోకి.. (లేదా కాంప్లెక్స్ ఆవరణ లోకి) ధైర్యం గా పంపగలగటం.. తల్లిదండ్రులతో వీసాలూ, ఇన్ష్యూరన్సులూ, లాంటి టెన్షన్లు లేకుండా వారి జీవన చరమాంకం లో ఆసరా ఇవ్వగలగటం.. వారితో పిల్లలకు అనుబంధాన్ని పెంచగలగటం.. అన్నింటినీ మించి మాతృ దేశం లో వచ్చి పడ్డామన్న తృప్తి తో పోల్చుకుంటే.. ఈ ట్రాఫిక్కూ, సమయపాలనా, లంచగొండిదనం.. పెద్ద విషయాలే కావేమో..

విదేశాల్లో పరిచయమైన పాత ఫ్రెండ్స్ ఎక్కడ తగిలినా.. 'ఎంత సుఖపడిపోతున్నామో.. పని మనిషి (ఎంత మంది మారినా, ఇంట్లో వస్తువులు ఎన్ని కొట్టేసినా.. డ్రైవర్ (కార్ లో ఒక్క ముక్క మాట్లాడినా 'ట్రూ మన్ షో ' లా ప్రపంచానికి తెలుస్తుందని నోరు మూసుకుని కార్లో పడి ఉన్నా.. తోటమాలి తో (మొక్కల్ని ఎండబెట్టినా, లాన్ ని కుళ్ళబెట్టినా).. ఇస్త్రీ అమ్మాయితో (పట్టు చీరలు కాల్చినా, షర్టులు మాయం చేసినా)..

వీళ్ళందరి సహాయం..మేమేమీ చేయం.. హాయిగా అక్కడా ఇక్కడా తిరగటం, ఆఫీస్ పని చూసుకోవటం, ఎంజాయ్ చేయటం.. అంతే! అని చెప్పుకుంటారు. (లేకపోతే అర్థరాత్రి దాకా కాల్సూ, నిద్రలేమీ,..ల్లాంటివి చెప్పుకుంటామా ఏంటి? మరీ..)

ఓ ఏడాది పోయాక.. మళ్ళీ ఇలాంటి పార్టీ యే ఉంటే RI లు ఈ పాటికి ప్యూర్ 'I' లు గా రూపాంతరం చెంది ..గాఢమైన రంగుల బట్టలూ, అందర్నీ గట్టిగా పలకరించటం, (వీలైతే..భుజం మీద ఒక్క చరుపు చరిచి మరీ..),.. పెద్ద సమోసాని తీసుకుని చిదిమి చట్నీలు పోసుకుని.. చేత్తో తిని.. పెట్టిన స్వీట్లన్నీ తినేసి.. కొత్తగా వచ్చిన ఆర్ ఐ ల మీద కామెంటుతూ ఉంటారు..

" ఏంటీ..? నీకెలా తెలుసూ అంటారా? నేనూ ఇదంతా స్వయంగా అనుభవించటమే కాక.. నాలుగైదేళ్ళనుండీ చూస్తున్నాకదండీ :-)

ps : సరదాగా రాసిందే .. ఎవ్వర్నీ కించపరచాలని కాదు
Sunday, May 2, 2010 7 comments

భాగ్యనగరం లో స్కూటర్ పై సాహసాలు..

మా చెల్లెలు.. మృదు స్వభావానికి పెట్టింది పేరు.. ఎక్కువగా మాట్లాడదు. మాట్లాడినా.. మంధ్ర స్థాయి లోనే,..చిరునవ్వుతో 'నో' అని చెప్పటం దాని దగ్గర్నించి నేర్చుకోవాల్సిందే.. అందరూ మీ చిన్నమ్మాయి చాలా నెమ్మది, అనేవాళ్ళు.

దానితో ఒకసారి స్కూటర్ మీద హిమాయత్ నగర్ వెళ్ళాను. ఒకడెవడో సెల్ లో మాట్లాడుతూ బైక్ నడుపుతూ ..వెనగ్గా వస్తూ చిన్న గా.. కొట్టుకున్నాడు మా స్కూటర్ కి..

అంతే.. అపర కాళి లా నేనెప్పుడూ, కనీ,వినీ ఎరగని భయంకరమైన భాషలో రెండు తిట్లు వదిలింది. నేను బిత్తర పోయాను.. నా చెల్లెలేనా ఇది లేక 'అపరిచితుడు ' ఆవహించాడా? అని .. వాడు వెనక్కి తిరిగి దీనికి రెట్టింపు డోసు లో అందుకుంటే.. మన గతేంటి.. అని. భయపడ్డాను. అతను 'సారీ' చెప్తూ పారిపోయాడు.

నా భయం చూసి.. మళ్ళీ 'రూల్స్ రామనుజం ' రూపం లోకెళ్ళి ఒక మందహాసం నా మొహాన పడేసి .. 'హైదరాబాద్ లో మెతక గా ఉంటే బైక్ నడపలేం అక్కా!!! మనం ఇంతకన్నా ఏ మాత్రం తక్కువ గా రియాక్ట్ అయినా.. వాడు తప్పు నీదే అని దబాయిస్తాడు.. పైగా.. నడపడం రాకపోతే.. వెనక కూర్చో.. ఎందుకమ్మా మా ప్రాణాలు తీయటానికి వస్తారు రోడ్ల మీదకి అని..' అంది. 'అఘోరించావు లే ' అనుకున్నాను.

ఇంటి కొచ్చి పడే దాకా నాకు గుండె దడ తగ్గలేదు.ప్రాణాలకొడ్డి, ఎప్పుడు ఎక్కడనుండి ఏ వాహనాయుధాన్నయినా ఎదుర్కుని విజయాన్ని పొందగలమన్న అచంచల విశ్వాసం, అట్టి నమ్మకం గురించి తమ జీవితాన్ని పణం గా పెట్టగల గుండె ధైర్యం లేకపోతే మన భాగ్య నగరం లో 2 వీలర్ నడపటం కాస్త కష్టమే..

కాలిఫోర్నియా లో నా కొలీగ్ ఒకతను ఒకసారి సెలవలకి భారతదేశానికి వెళ్ళి వచ్చాడు. కాఫెటేరియా లో లంచికి మా గ్యాంగంతా కలిసాం. తన వెకేషన్ కబుర్లు చెప్తున్నాడు. 'నా హైదరాబాదీనెస్ పడిపోయిందోయ్.. మొన్న బెగంపేట లో నా బండికి బుస్ టక్కర్ ఇచ్చింది. ఒక్క దూకులో బండి దిగి బుస్ ఎక్కి డ్రైవర్ గల్లా పట్టినా.అప్పుడేమైందో తెలుసా?' అని అందర్నీ.. నిశితం గా.. సాధ్యమయినంత స్లో గా తల తిప్పుతూ.. ప్రశ్నించాడు.

భోజనం తింటూ ఉండటం తో .. ఆయన చాలెంజ్ ని మేము పెద్దగా రెసిస్టన్స్ లేకుండానే ఓడిపోయినట్టు గా 'తెలియదన్నట్టు ' గా తల అడ్డం గా ఆడించాం. ఒకింత బాధ గా..

"కాలేజ్ దినాల్లో.. గల గలా జారిపోయేవి బోల్డు తిట్లు.. ఆరేళ్ళ ఈ చప్ప కాలిఫోర్నియా లైఫ్ స్టైల్ తో.. ఒక్కటంటే ఒక్కటి .. కనీసం ఒక్క తిట్టు కూడా నాకు గుర్తు రాలేదు.." అని చాలా సిగ్గు గా చెప్పాడు.. తల దించుకుని. మేము కూడా.. మాకు తోచినట్టు .. 'జగన్ ' మొహం పెట్టి ఓదార్చాం.

"డ్రైవర్ కాలర్ పట్టాక 'ఏంది బే .. ' తర్వాత.. బోల్తీ బంద్!!! నాకు ఒక్క పదం రాలే.." "డ్రైవరే కాదు బస్ లో కూడా అందరూ నవ్వటమే..' అన్నాడు..

కాలేజ్ రోజుల్లో లూనా మీద, మా నాన్న గారు చూడకుండా.. ఆయన చేతక్ మీదా.. ఆబిడ్స్, కోఠీ మొదలుకుని దిల్ షుక్ నగర్, పంజాగుట్టా, అమీర్ పేట్ సైర్లు ఎన్ని సార్లు కొట్టామో లెక్క లేదు.

పదిహేనేళ్ళ క్రితం ఒకసారి ఇంటికి వస్తుంటే కళ్ళజోడు పగిలిపోయింది. పైగా వర్షం. అయినా ధైర్యం గా 5 కిలొమీటర్లు నడిపి వచ్చేసాను. ఇంకోసారి ఉస్మానియా యూనివర్సిటీ లో మా స్నేహితురాలి తో పాటూ, దాని ఇద్దరు చెళ్ళెళ్ళనీ.. కూడా చిన్న స్కూటీ మీద తెచ్చేసాను ఒకసారి తార్నాకా చౌరాస్తా దాకా. ట్రాఫిక్ పోలీస్ వేసిన ఫైన్ వల్ల 2 సినిమాల నష్టం!

ఒకసారి ఒక గతుకుల రోడ్ గల్లీ లో వెళ్తున్నాను.. ముందాయన బహుశా తన భార్య తో స్కూటర్ మీద వెళ్తున్నాడు. హాంక్ కొట్టినా నెమ్మదిగానే వెళ్తున్నాడు. విసుగొచ్చి దొరికిన మొదటి అవకాశం లోనే ఆయనకి కట్ కొట్టి భుజాల మీదుగా ఒక లుక్ పడేసి గతుక్కు మన్నాను. ఆయన మా ఫామిలీ డాక్టర్. వాళ్ళావిడ కి ఎనిమిదవ నెల.

వారం తర్వాత చిన్న ఆక్సిడెంట్ అయి చిన్న చిన్న దెబ్బల తో వెళ్ళాను. ఆయన 'వెల్కం.. ఎప్పుడో ఈరోజు వస్తుందని తెలుసు.. కానీ ఇంత త్వరగా వస్తుందనుకోలేదు.' అని ఆయన వ్యంగ్యోక్తులతో మమ్మల్నలరించారు :-)

ఇంటర్ చదువుతున్నప్పుడు మా చెల్లి ఫైనల్ పరీక్షలకి వెళ్తూ నిర్మానుష్యమైన రోడ్ లో ఫైనల్ పరీక్షలకి వెళ్తూ ఆగిపోతే బండి పక్కన పడేసి ఇంటికో ఫోన్ కొట్టి, ఎవరో లక్కీ గా ఆపితే ఆయన పాప తో అడ్ జస్ట్ అయి ఎగ్జాం సెంటర్ కెళ్తే.. తిట్టుకుంటూ మెకానిక్ దాకా తోసుకెళ్ళటం.. తలచుకుంటే... ఇప్పుడు అలాంటి సాహసం చేయగలమా? అని ఆశ్చర్యం వేస్తుంది.

పదేళ్ళు విదేశీ వాసం తర్వాత బెంగుళూరు లో ఆక్టివా నడిపినా నాకు హైదరాబాద్ లో మాత్రం భయమే.అయితే ఏం.. మే ఎండల్లో మా చెల్లెలి వెనక కూర్చుని హాయిగా వేడి వేడి కాలుష్యపు గాలి పీలుస్తూ, దోవలో కొన్న జామ/అల్లనేరేడు పళ్ళని దుమ్ము లయెర్ ని చున్నీ తో తుడిచేసి తింటూ, షాపింగ్ బ్యాగుల్ని అన్ని వైపులా తోరణాల్లా వేలాడతీసుకుని, ట్రాఫిక్ జాముల్లో చిక్కుకుని.. గజం దూరం ఎదురుగా దొరికితే ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం తో ముందుకెళ్ళటం లో ఆనందం ....
 
;