Thursday, October 10, 2013 26 comments

“కష్టాలంటే ఏంటో తెలియకుండా పెంచాడు మా నాన్న..


ఎందుకంటే.. కష్టాల్లోనే సుఖాలు చూసుకున్నాం మేము. అవి కష్టాలని మాకు తెలియవు.”  ఇది ఏదో, ప్రాస/హర్షద్వానాల కోసం చెప్పిన డైలాగో, కాదు.

 “బాగా కష్టాల్లోంచి పైకొచ్చిన మనిషి. కింద స్థాయి నుండి తన కృషి తో ఎదిగిన మనిషి, గంజి నీళ్ల నుంచీ, బెంజి కారు స్థాయి కి ఎదిగిన మనిషి.. “ అని పరిచయం ఇచ్చిన ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి తో మన (రియల్ స్టార్?) శ్రీహరి అన్న మాటలివి.


 అతని పేరు చెప్పగానే మొదట గా ప్రతి వారూ చెప్పేవే ఇవి.  శ్రీహరి అంటే నాకు మొదటి నుండీ చాలా అభిమానం. అదేదో సినిమాలో రంభ కి కాబోయే భర్త గా నటించినప్పుడు మొదటి సారి గా చూశాను. ముఖం లో క్రూరత్వం+ అమాయకత్వం కలిసి ఉంటాయి అందులో. చిరంజీవి అతన్ని మూర్ఖుడిని చేసి జనాల్ని నవ్విస్తూ ఉంటాడు. తర్వాత తర్వాత చాలా సినిమాల్లో అతన్ని గుర్తు పట్టడమూ మొదలు పెట్టాను.

తర్వాత శ్రీహరి అభిమాని గా నెమ్మది గా మారిపోయాను..


అలా మొదలైంది...

ఓసారి ఏదో పత్రిక లో అతనిది బాలా నగర్/బోయనపల్లి అని చూశాను. అర్రే... మా ఊరి హీరో.. అనుకుని కుతూహలం గా బాలా నగర్ లో నా కాంటాక్ట్స్ ని అడిగాను. ‘అదేనోయ్..మన శోభన థియేటర్ ఎదురుగా ఉన్న పాత చెక్క మెకానికల్ షెడ్... ఉండేది చూడు.. అక్కడుండేటోడు..కదా.?’ అంది మా ఫ్రెండు. నాకు అస్సలూ గుర్తు రాలేదు కానీ..  మరి అవతల పక్క వాడు  రియల్ స్టార్ కదా.. అందుకని గుర్తొచ్చినట్లు అర్జెంట్ గా బల్బ్ వెలిగినట్లు నటించాను. ఇప్పటిదాకా అదే ఇమేజ్ మెయిన్టైన్  చేస్తున్నా...

పిచ్చి ముదిరి పీక్ స్టేజ్ కి ...

అయితే గత పదిహేనేళ్లుగా అందరూ నన్ను శ్రీహరి వీరాభిమాని గా గుర్తిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సాటి సాఫ్ట్వేర్ కూలీలు, స్నేహితులూ, చుట్టుపక్కల మదర్స్, సిస్టర్స్.. (అమ్మలక్కలు), అందరున్నూ.. ఎప్పుడైనా ఏ సినిమాలోనైనా, శ్రీహరి పేరు టైటిల్స్ లో చూసినా, అలాగే ముఖం తెరమీదో/పేపర్ లోనో కనపడినా, ఆయన పేరు వినబడినా.. అదేదో చంద్రముఖి లో జ్యోతిక ముఖం వెలిగిపోయినట్లు నాకు ఏ పూనకం వచ్చి మళ్లీ మొదలు పెడతానేమోనని, అందరూ ‘అవును.. మాకు తెలుసు బాబోయ్.. మీ బోయన పల్లి హీరో.. మీ ఇంటిదగ్గర ఆయన మెకానికల్ షెడ్డూ, నీ డొక్కు లూనా అక్కడే నీకు రిపెయిర్ చేసి పెట్టాడు శ్రీహరో, వాళ్ల అన్నో నీకు సరిగ్గా గుర్తులేదు...” అని దణ్ణం పెట్టే స్థాయిదాకా అంచెలంచలు గా ప్చ్ .. ఏంటో అలా పెరిగిపోయింది.

ఇంకా అతి చేయచ్చు గానీ..

నేను స్కూల్ కి బస్సు లో వెళ్తుంటే పక్కన డబ్బుల్లేక సైకిల్ మీద వెళ్తూ కన్పించేవాడు.. అలాంటివి, అయితే మరీ నాకూ ఓ యాభై ఏళ్లు అని జనాలు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది కదా అని.. కొద్దిగా కంట్రోల్ అనుకోండి..

సైట్ ఇన్స్పెక్షన్ చేసి డిటైల్స్ జాగ్రత్త గా దాచుకున్నా..

ఎవరు ఎప్పుడు ఎక్కడ రియల్ స్టార్ శ్రీహరి మాటెత్తినా.. మా బోయనపల్లి వాడే.. ఆయన షెడ్ మేము ఎప్పుడూ సినిమాలు చూసే థియేటర్ ఎదురుగానే... ఉండేది.. (అబద్ధం.. మేము ఎప్పుడూ శోభనా లో సినిమా చూస్తే కదా? ఓసారి అప్పట్లో ఇండియా వెళ్లినప్పుడు ఆ థియేటర్ దగ్గరకెళ్లి ఎదురుగా పరిసరాలు నోట్ చేసుకున్నాను. ఎవరైనా అడిగినప్పుడు ఆథెంటిగ్గా నా కథ ఉంటుందని..)

వ్యక్తిగత అభిమానం Vs. ఒక ప్రాంతం, సామాజిక వర్గానికి చెందామని లేదా ఫలానాయన కొడుకు/మనవడు అని ఉండే అభిమానం..

నాకెప్పుడూ, ఇలాంటి బేసిస్ మీద ఉండే అభిమానం అంటే ఒక చిన్న చూపు..  కానీ నాకూ అలాంటి అభిమానం ఉంది అని నేను గ్రహించనే లేదు.. నిజానికి, నా సామాజిక వర్గం నుంచి వచ్చిన వారందరంటే నాకు గోప్ప అభిప్రాయం ఉందా? ఏమో? సహజం గా వాళ్లంటే ఒక చిన్న సానుభూతి, వాళ్లల్లో ఏమాత్రం విషయం ఉన్నా, గొప్పగా అనిపిస్తుందేమో.. తెలియదు. 

అలాగే అట్టడుగు స్థాయి నుంచి, గాడ్ ఫాదర్ లేకుండా కష్టపడి పైకి వచ్చాడు అందువల్ల అభిమానం?  మరి రాచరిక కుటుంబం నుండి వచ్చాడనే ప్రభాస్ అంటే ఇష్టపడుతున్నామా? 

అయితే అసలంటూ విషయం ఉంటేనే పైన చెప్పిన కారణాల వల్ల కొద్దిగా, బ్రౌనీ పాయింట్లు మనకే తెలియకుండా కలుస్తాయేమో...

వ్యక్తిగతం?

అక్షర ఫౌండేషన్ గురించి తెలుసు, శాంతి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలుసు, బంజారా హిల్స్ లో ఇటు శ్రీహరి, అటు శాంతి అని నేం ప్లేట్ ఉన్న ఒక పెద్ద భవనం అతనిదని తెలుసు..  అలాగే జిమ్నాస్టిక్స్ లో జాతీయ స్థాయి క్రీడాకారుడని కూడా తెలుసు.  అయితే అంతకు మించి ఎప్పుడూ తెలుసుకునేంత ఆసక్తి నాకు లేకపోయింది. నిన్న రాత్రి మాత్రం ఒక పాత ఇంటర్వ్యూ చూసి చాలా విషయాలు తెలుసుకున్నాను. 

నాకెందుకో అతను చాలా నిజాయితీ గా సమాధానాలిచ్చాడని అనిపించింది. నాదంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి, స్క్రీన్ మీద నేను కనిపించినప్పుడు మిగిలిన వారి మధ్యలో నన్ను జనాలు చూడాలి అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని కండలూ అవీ పెంచి..  బ్రూస్లీ సినిమాల్లో అతని టెక్నిక్ ని గమనించి.. జిమ్నాస్టిక్స్ లో చెరి ఆరు సార్లు జాతీయ స్థాయి లో ఆడానని, సియోల్ ఒలింపిక్స్ లో కూడా సెలక్షన్ క్యాంప్ లో వెళ్లి వెనక్కి వచ్చినట్లు గా చెప్పాడు.

నాకు అతని మాట తీరు లో నచ్చినదేమిటంటే,.. అంతులేని నిజాయితీ ఒకటి,  కలిమి, లేమి, గెలుపు, ఓటమి, అతని మిత్రులు, బంధువులు, చిన్నప్పటి లేమి, పెట్టుకున్న కొట్లాటలు, శోభనా థియేటర్  లో పాలు పోసినప్పుడు అతను చేసిన కిరికిరీలు, సెటిల్మెంట్లు, ఒక ఎత్తైతే

శాంతి తో అతని పెళ్లి ఎలా జరిగిందో, అలాగే తన కూతురు అక్షర ఆకస్మిక మరణం,  పదేళ్ల పాటు సినీ రంగం లో నిలదొక్కుకున్నప్పుడు పడ్డ కష్టం, రాజకీయాల్లో తనకి వచ్చిన అవకాశం అన్నీ ఒకే టోన్ లో ‘as the matter of fact’ చెప్పడం.

అలాగే తన పిల్లలకి బంగారు గ్లాసు, కంచం చేయించి ఒక పూటంతా వాటినే చూస్తూండి పోయానని born with golden spoon అంటే ఇదే నేమో అని చెప్పాడు. అలాగే తాను రబ్బర్ చెప్పులు, లుంగీ కట్టుకుని, తన కొడుకుని బెంజి కారు లో తిప్పడాన్ని గురించి కూడా.

మీ ఆవిడ రోజుకి వంద సార్లు మీకు ఫోన్ చేసి కనుక్కుంటుందట. బాగా అనుమానమట? అని అడిగితే ‘లేదు. అతిప్రేమ వల్ల వచ్చిన అనుమానమది. అయినా ఇప్పుడు బాగా తగ్గింది..’ అన్నాడాయన, చాలా మామూలు గా.

అన్నిటికన్నా.. పాత్రలు, రోల్స్, ప్రాజెక్ట్స్ కాకుండా వేషాలు.. అన్న పదం వాడటం కూడా భలే అనిపించింది.  

‘నన్ను తండ్రిని చేయటానికి చాలా మంది ప్రయతించారు. నేను ఒప్పుకోలేదు. బ్రదర్ దాకా ఓకే’ అన్నాను. అప్పుడే అమితాబ్ బచ్చన్ అవదలచుకోలేదు. చాలా టైం ఉంది.. అన్నాడు.

షేర్ ఖాన్ ముందు?

భద్రాచలం, శ్రీశైలం, హనుమంతు, అయోధ్య రామయ్య, పృథ్వీనారాయణ, ఎవడ్రా రౌడీ.. విజయ రామ రాజు ల్లాంటివి సినిమాలు ఆవరేజ్ గా అనిపించినా, నాకు హీరో అతని,నటన, టైమింగ్, ఈజ్ మాత్రం తెగ నచ్చేశాయి. నాలాంటి వాళ్లు కోకొల్లలని,నిన్నటి నుండీ, ఫేస్ బుక్ లో వివిధ గ్రూపుల్లో వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతోంది.

చాలా మంది నా శ్రీహరి అభిమానం చూసి నవ్వుకున్న వాళ్లు “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” లో అన్న గా అతన్ని చూసి, ఒప్పేసుకున్నారు.  ఇక   ఢీ సినిమా లో  “ఏమిస్తున్నర్రా వీనికి?” అని వెనక్కి తిరిగి చూసి అడిగే డాన్ పాత్ర చూసి, ‘కేవలం దీనికి ఇష్టం కాబట్టి.. మనం వ్యతిరేకిద్దాం అనుకునే నా ప్రత్యర్థి రంగాల వారూ, ఇతని లో విషయం ఉందని “రూఢి” చేసేసుకున్నారు.

ఇక కింగ్ లో.. బొమ్మలు వేయడం, బొట్టుశీను తో సెటిల్మెంట్లు, హార్డ్ వేర్ బిజినెస్ మాన్ అవతారమెత్తటం, రజనీ కాంతు లా, గంభీరం గా “సిగ్మండ్ ఫ్రాయిడ్ బుక్కు కి తెలుగు నకళ్ళుచదివిన.. “ అని చెప్పడం.. కళా వైద్యం చేయడం,.. బామ్మర్ది దావత్ ఇవ్వడం,  ఇంట్లో పెద్ద ముత్తైదువలు “పప్పన్నం పెట్టి ఊర్కోనుడు గాదు.. మాకు పట్టు శీరలు పెట్టాలే’ అంటే, “శీరలు పెట్టమంటరు ఒక్కరైన పది సంవత్సరాలనుండి నాకు ఒక్క శీర ని చూసినారే??’అని నిష్టూరాలాడటం,..ఎంగేజ్మెంట్ దినం చేసే వాళ్ల వంశం చేసే సంప్రదాయాలు, అతని భాష,..  ఒక్కటని కాదు..  విశ్వరూపం చూపించాడు అనిపించింది.   అన్న, అమాయకపు డాన్, పాత్రలకి ‘కింగ్’ అని కితాబు ఇక అందరికీ ఇవ్వక తప్పింది కాదు.

ఇక షేర్ ఖాన్ గా అతను ప్రదర్సించిన నటన, నాకే మాత్రం ఆశ్చర్యం కలిగించనే లేదు.. కానీ ఇంకాస్త నిడివి ఉంటే బాగుండు అని నిరాశ గా మాత్రం అనిపించింది. శ్రీకాకుళం బెస్తవానిగా, నాలుగు వందల ఏళ్ల క్రితం రాజు గా రెండు పాత్రల్లో మెప్పించినా నాకేమాత్రం ఆన లేదు L

ఇంకా ఈ జీవిత నాటక రంగం లో ఆయన పాత్ర నిడివి ని భగవంతుడు పెంచి ఉంటే.. సినీ రంగం లో ఎన్ని పాత్రల్లో మనల్ని ఇంకా ఎన్నెన్ని రకాలు గా మెప్పించేవాడో.. ఏమో..

నేనింత ఇమేజ్ క్రియేట్ చేశానా?

నిన్న ఆఫీసులో నాకు ఒక  క్లిష్టమైన ఒక సమస్య ని ఎదుర్కున్న  రోజు. అలాగే కుటుంబ పరం గా కూడా అతి ముఖ్యమైన రోజు.  ఫోన్లు, చాట్ చర్చలు, ఆఫీసులో ఇద్దరు ఇంజనీర్ల మధ్య వివాదాలు పరిష్కరించడం అనే పని పెట్టుకోవడం తో, తల దిమ్మెక్కి పోయినట్లయింది.  ఇంత హడావిడి లో నాకిష్టమైన వ్యక్తులిద్దరితో (కోవర్కర్లు) కలిసి పదిహేను నిమిషాల భోజనం, పది నిమిషాల నడక,. ఇంకో స్నేహితురాలితో కాఫీ, ఇంకోరితో అల్లం టీ, ఇంటికొచ్చాకా ముగ్గురిళ్ళల్లో పేరంటాలు,..

మధ్యలో  చాట్ ద్వారా,ఫోన్ల ద్వారా, మెయిల్స్ ద్వారా, ఫేస్ బుక్ సందేశాల ద్వారా ముఖతః ఎంత మంది శ్రీహరి చనిపోయినందుకు నాకు తమ విచారాన్ని తెలిపారో..  ఈరోజు కూడా నా బ్లాగు తెరిచి ఒక పేజీ అయినా రాయకపోతే.. ఇన్నేళ్లు గా నేను పెంచుకున్న అభిమానానికి అర్థం లేదు. తర్వాత ఇమేజ్ సెర్చ్ చేస్తే.. ఎంత పీలగా ఉన్నాడు ఆగస్ట్ లో? 


ఇదే నా అభిమాన నటునికి నా నివాళి..
 
;