Showing posts with label సమాజం. Show all posts
Showing posts with label సమాజం. Show all posts
Thursday, January 3, 2013 16 comments

సైడు బెర్తు ఆవిడా, నేనూ


బెంగుళూరు – కాచిగూడా బండి ఎక్కి కూర్చున్నాం. తత్కాల్ లైన్లో మూడు గంటలు పడిగాపులు గాస్తే దొరికిన టికెట్లు.. ఏసీ టూ టయర్. నేనూ, నా పిల్లలూ సామాన్లు సద్దుకుని కూర్చున్నాకా ఎదురు గా చూస్తే నల్లటి గుబురు మీసాలు, పెద్ద బొజ్జ, ఎర్రటి పెద్ద కళ్ళు.. నుదుటన పెద్ద నామాలు.. కొద్దిగా భయం వేసింది. పిల్లలు కూడా ఒకింత గుబులు గా ‘నాన్నా.. నువ్వూ మాతో రావాల్సింది.. అప్పుడు ఈ నాలుగు సీట్లూ మనకే ఉండేవి..’ అంటుంటే గుబురు మీసాలాయన చిన్నగా నవ్వాడు. చేతిలో ఏదో తమిళ పుస్తకం.

రైలు బయల్దేరింది.. చిన్నగా మేమూ తిండీ గట్రా ముగించుకుని ఎవరి పుస్తకాల్లో వాళ్లం తలలు దూర్చేసాం. కానీ నాకెందుకు అనీజీ గా ఉందో కాసేపాగాకా లైట్లు ఆపుచేసి పరదాలు వేసినప్పుడు అర్థమైంది. రోజులు అస్సలూ బాగోలేవు. ఆడ,మగా అని లేదు, వయసు ని చూడటం లేదు.. వాహనాల్లో జరిగే అత్యాచారాల గురించి వార్తా పత్రికలూ, చానెళ్ళూ హోరెత్తిస్తున్నాయి.. చాలా సేపు నిద్రే పట్టలేదు.. ఆలోచనల్లో ఎప్పుడో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాకా ‘మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మం హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్ ప్లీ ఈ ఈ ఈ జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్, దుబ్బ్ దుబ్బ్..’ శబ్దం.. మంద్రంగా.. భయంకరం గా..

టపక్క్ మని కళ్ళు తెరిచి చూస్తే.. కర్టెన్ చాటు ఒక మనిషి కదలికలు తెలుస్తున్నాయి. అసలేం జరుగుతుందో అర్థమయ్యేలోపల ఒక్కసారి గా కర్టెన్ తో సహా ఒక మనిషి దుబ్బుమని రెండు సీట్ల మధ్యలో పడ్డాడు.. ‘అమ్మ్మా..’ అంటూ! నాకు మతి తోచలేదు. కెవ్వుమని కేకేసి కాళ్లు వేగం గా ఆడించి కిందపడిన మనిషి ని తన్నటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఒక్కటీ తగిలినట్టు లేదు.

ఆ మనిషి ఎందుకొచ్చినట్లు? పై బెర్త్ గుబురు మీసాలాయనా? లేక దొంగా? చేతిలో కత్తా? గన్నుందా?

ఈలోగా లైట్లు వెలిగి టీసీ, ఒకరిద్దరు మనుషులు వచ్చేశారు.. నా కళ్లజోడెక్కడ చచ్చిందో.. టీసీ వచ్చి ‘చిన్న కిడ్.. కంగారు పడకండి..’ అని చెప్తున్నాడు. ‘చిన్న పిల్లా!! అయ్యో మా పాప! పై సీట్లోంచి పడినట్లుంది..’ నేను కర్టెన్ లాగేసి కింద నుంచి శాల్తీని లేపి నా పక్కన కూర్చోపెట్టుకుని లొడ లోడా వాగుతూ వీపు మీద దబ దబా కొడుతూ ఊరడించడం మొదలు పెట్టాను. ఇదేంటి ఇంత గింజుకుపోతోంది.. షాక్ తిందేమో నా చిట్టి తల్లి.. వాగుడు లెవెల్ ఎక్కువైంది..

‘అమ్మా.. ఏమైంది?’ అంటూ పైన్నుంచి పెద్ద పిల్ల అడుగుతోంది. ‘అదేంటి? ఇది పెద్ద పిల్ల కాదా?’ ఎదురు గా కింద సీట్లోకి చూశాను. మా చిన్నమ్మాయీ లేచి చూస్తోంది..

అయితే నేను ‘ఓదార్చేది’ ఎవర్ని? అని చూస్తే ఎర్ర చొక్కా వేసుకున్న ఒక చిన్న పిల్లాడు. మా పెద్దమ్మాయి వయసులోనే ఉన్నాడు.. ఇట్లా కాదు కానీ నా కళ్లజోడు కోసం పర్సు తెరిచి పెట్టుకునేసరికి సీనంతా అర్థమైంది.



పది-పన్నెండేళ్ల కుర్రాడు.. అర్థరాత్రి బాత్రూం కెళ్లి వస్తూ అన్ని సీట్లకీ కర్టెన్లు వేసి ఉండటం తో, పొరపాటున వేరే సైడ్ బర్త్ కర్టెన్ తీసి అమ్మా.. అమ్మా.... అని భుజం మీద కొట్టబోయాడట. ఆవిడ దెబ్బకి భయపడి పిడి గుద్దులు గుద్ది, అదీ చాలక కాళ్లతో తోసేసిందట. దానితో మా సీట్లకి మధ్యలో పడిపోయాడు..

ఆ బాబు ని వాళ్ల తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయాకా. మా అమ్మాయిలు ‘అబ్బా..ఎంత భయమైతే మాత్రం.. మరీ అంత గట్టిగా అరవాలా? It was so embarassing you know!’ అనేశారు.. ‘భడవల్లారా! మీరు ఎన్నెన్ని ప్రాంతాల్లో ఎన్నెన్ని వందల సార్లు నన్ను తలెత్తుకోకుండా చేయలేదు?’ అనుకుని గోరంత దీపం లొ సూర్యాకాంతం లా ‘హమ్మ కూతుళ్లో, హమ్మ కూతుళ్లో.. ‘ అని నిట్టూర్చాను.

ఇక నిద్ర పడితే ఒట్టు.. చిన్నది పడుకుంది. కానీ పెద్దమ్మాయి మాత్రం నిద్ర పట్టడం లేదంది. ‘సరే.. రా.. అని దుప్పటీ కప్పుకుని లాప్ టాప్ లోకి డౌన్ లోడ్ చేసిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్ ‘ సినిమా ఇయర్ ఫోన్లు పెట్టుకుని చూపించి మరీ మా అమ్మాయి పరమ గిల్టీ గా ఫీలయ్యేలా చేశా..

ఉదయం రైలు దిగే వేళ ఆ పిల్లవాడి తండ్రి వచ్చి సైడు బర్త్ ఆవిడకి క్షమాపణ చెప్తూనే, ‘మా అబ్బాయి బాగా భయపడ్డాడు. వాడికి గుండె జబ్బు. హైదరాబాదు లో పెద్ద ఆసుపత్రి లో ఆపరేషన్ కోసం తెస్తున్నాం.. అని సమాధానం చెప్పే ఆస్కారం ఇవ్వకుండానే దిగిపోయారు. అది వినగానే ‘ మాకూ గుండెలు కలుక్కుమన్నాయి..

టెర్రరిస్టుల వల్ల ఎలాగూ జనాలు బాగా తిరిగే చోట్ల, ఎవ్వర్నీ నమ్మడం తగ్గించేశాం. బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నాం. వార్తా పత్రికల,ఇంకా టీవీ, ఇంటర్నెట్ లాంటి సాధనాల వలన వరస అత్యాచారాల సంగతులు వినీ వినీ సాటి మనిషిని నమ్మాలన్నా వంద సార్లు ఆలోచించాల్సివస్తోంది...

సైడు బర్తావిడ ‘నేనేం చేయనండీ.. నేనూ పేపర్లు చదువుతున్న మనిషినే. మా ఇంట్లోనూ టీవీ ఉంది. అర్థరాత్రి కర్టెన్ తీసి మనిషి మీద కి వంగి భుజం కుడుపుతుంటే.. నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు..’ అని బెంగపడుతూ దిగింది.. వెనకాలే మేమూనూ..

Saturday, December 22, 2012 29 comments

యుగాంతం రోజు.. (21.12.2012)

యుగాంతం,.. Dooms day,.. क़यामत का दिन.. ఏమో వీటి మీద ఇంటి చుట్టుపక్కల వాళ్ల చర్చలు, ఆఫీసు లో కబుర్లు.. Dec. 21 sales, .. టీవీల్లో షోలు,


ఉదయం లేస్తూనే.. ఆఫీసుకి వెళ్లాలంటే రోజూ లాగే బద్ధకం.. బయట అంతా కొద్దిగా పొగమంచు... పిల్లలకి స్కూలు లేదు. క్రిస్ మస్ కార్నివాల్, తల్లిదండ్రులు-టీచర్ల మీటింగు అయితే ఉంది పదిన్నర కి. సరే సగం రోజు సెలవ పెట్టి మధ్యాహ్నం ఇంటి నుండి పని చేద్దాం అని నిర్ణయం తీసుకుని.. నా చాయ్, నిన్నటివి, ఇవ్వాల్టివీ న్యూస్ పేపర్లూ నేనూ వెచ్చ వెచ్చగా హాయిగా కూర్చుని మొదటి పేజీ తీశాను...



దేశ రాజధాని లో మెడికో పై సామూహిక అత్యాచారం మీద కవరేజ్. వెచ్చదనం కాస్తా సెగలు గా.. దేశ రాజధాని లో అర్థ రాత్రి కూడా కాదు.. తొమ్మిదింటికి సినిమా చూసి వస్తే.. రోడ్డు మీద ఉన్న ప్రతివారికీ జవాబు చెప్పాలా? చెప్పకపోతే.. కొట్టేసి అత్యాచారం చేసి.. ఎదిరించిన పాపానికి పొట్టలో చిన్న ప్రేగుల దాకా నాశనం చేస్తారా? బస్సులోంచి తోసేసి వెళ్లిపోతారా? టీ మరీ చేదు గా,.. భయంకరమైన పశు ప్రవృత్తి.. ఢిల్లీ అంతే.. మహిళలకి అస్సలూ సేఫ్ కాదు. ఛీ.. అనుకున్నాను. ఏదో మిగిలిన ప్రాంతాలన్నీ మహా సేఫ్ అన్నట్టు.



ఈ సంవత్సరం మహా నగరం లో నమోదయిన అత్యాచారాల సంఖ్య 530+ ట. క్రితం ఏడు 630+. ఒక వంద తక్కువ అత్యాచారాలు అయ్యాయని సంతోషించాలా? ఇవన్నీ కేవలం రిపోర్ట్ చేసిన సంఘటనలే. ఇంక వెనక ఎన్ని అవుతున్నాయో.. ఎవరికెరుక? అయినా ఒక దేశ రాజదాననే ఏముంది.. ఆడ,మగ, వయసు తో సంబంధం లేకుండా.. ఒక సామాజిక భద్రత ఉంది, రాత్రి తల దాచుకోవడానికి చిన్నో, పెద్దో ఇల్లు అంటూ ఉన్న మధ్యతరగతి, లేదా ఆర్థికం గా ఉన్నత వర్గాల వ్యక్తులకి కూడా రోడ్డు మీద రక్షణ లేదు. ఫుట్ పాత్ మీద పడుకునే కుటుంబాల మాట, అర్థరాత్రి పొట్ట కూటి కోసం ఉద్యోగాల చేసి వెనక్కి వచ్చే అమ్మాయిల విషయం చెప్పనే అక్కర్లేదు. చిన్న సైజ్ పట్టణాల్లో.. 



ఒక మహా నగరం లో దేశ రాజధాని లో ఒక చదువుకున్న అమ్మాయికి జరిగిన ది కాబట్టి ఇంత వెలుగులోకి వచ్చి దేశాన్ని కుదిపేసింది.. మీడియా, విద్యార్థులు, సంఘ సేవ చేసే వాళ్లు, అందరూ ధ్వజమెత్తి నిరసిస్తున్నారు. వీధుల్ని నినాదాలతో దద్దరిల్లేలా చేస్తున్నారు... ఉదయం నుండీ ఏ చానల్ చూసినా గొంతులు చించుకుని మరీ దులిపేస్తున్నారు.. మంచిదే. యువత నిరసన ప్రదర్శించడం మంచిదే. వీరిలో చైతన్యం ప్రశంసనీయమే. మరి మిగిలిన ఐదు వందల సంఘటనలో? టైమ్స్ లో బెంగుళూరు, హైదరాబాదు, ఇంకా చిన్న పట్టణాల్లో గణాంకాలు కూడా ఇచ్చారు. ఎనిమిదేళ్ల పిల్లలు, ఐదేళ్ల పిల్లలు... వాళ్ల గురించి ఒక కార్నర్ లో చిన్న వార్త తప్ప, ఎంతవరకూ ప్రజలని ఎఫెక్ట్ చేసింది..



మా అమ్మాయి వచ్చి పేపర్ చదవడానికి కూర్చుంది. సాధారణంగా రోజూ పేపర్ చదవదని దెబ్బలాడతాను. ఈరోజు మాత్రం.. వద్దు.. ఆటల పేజీలు, కార్టూన్లు చదువు చాలు అని మెయిన్ పేపరు ఇవ్వలేదు. ఇలా మెయిన్ పేపర్ ఎన్నాళ్లు దాచాలి? అసలు దాచాలా? జాగ్రత్తలు చెప్పాలా? ఏరకమైన జాగ్రత్తలు చెప్పాలి? అభద్రతా భావం, సాటి మనిషన్నవాడిని ఎవ్వర్నీ నమ్మరాదని చెప్పాలా? అన్నీ నాకు ప్రశ్నలే. ఎవర్నడగాలో తెలియదు. ఎవరికైనా ఖచ్చితమైన సమాధానం తెలుసని నేననుకోను.

http://www.youtube.com/watch?v=hY8CyTeegrM , http://www.ted.com/talks/sunitha_krishnan_tedindia.html

ఈ మధ్య మనసు కలచి వేసేలా చేసిన ఈ వీడియోలు గుర్తొస్తూనే ఉన్నాయి. ఇంకోసారి చూసి కన్నీరు పెట్టుకుని,.. ఇంక కార్నివాల్ సమయం అయిందని లేచి రెడీ అయిపోయాం అందరం.



యుగాంతం రోజున ఆఫీసు లో ఒంటరి గా ఈ సువిశాల అంతరిక్షం లో ఒక ధూళి రేణువు లా కలిసిపోలేను.. కుటుంబం తో కలిసి నాలుగు రేణువుల సమూహం లా మిగిలిపోతాను. ఉదయం స్కూల్లో పని కాబట్టి సెలవ కావాలి. మధ్యాహ్నం ఇంటి నుండి పని చేస్తాను... అని మెయిల్ కొట్టాను.



స్కూల్లో కార్నివాల్ సరదాగా గడిచిపోయింది..కానీ ఏదో ముల్లులా గుచ్చుకుంటోంది. ఏంటో అర్థం కాలేదు. కాసేపటికి పిల్లలు ఏవో ఆటలాడుతుంటే పక్కనే నుంచుని ఆలోచిస్తున్నాను.ఒకమ్మాయి.. ‘Maam.. please go out and stand. NOW.. just get going .. We need space.. come on.. move...’ అని స్టాల్ లోంచి బయటకి తరిమింది. వెళ్తూ గొణిగాను. ‘బయట చాలా వేడి గా ఉంది. మా అమ్మాయి గోరింటాకు పెట్టించుకోవడానికి ఇంకో ఐదు నిమిషాలు పడుతుంది. మళ్లీ వెతుక్కోవాలి కదా..’ ఇంకా ఏదో అనేలోగానే.. ‘That’s not my problem Mam. You need to handle it. We need space. Please move’ అంది. ‘వార్నీ.. ఎంత మాట సొగసు. అక్కడికి వచ్చే వాళ్లు విద్యార్థుల తల్లిదండ్రులని తెలుసు.. తను ఒక విద్యార్థి .. బహుశా.. ఎనిమిదో/తొమ్మిదో తరగతి అయ్యుండచ్చు.. అనుకుంటూ.. బయటకి నడిచాను. అప్పుడర్థమైంది.. ముల్లు ఎక్కడుందో.. స్టేజ్ మీద ముగ్గురమ్మాయిలు.. ముగ్గురబ్బాయిలు డాన్సు వేస్తున్నారు. చుట్టూ పెద్దలు, పిన్నలు, చేరి చప్పట్లతో ఉత్సాహ పరుస్తున్నారు. వాళ్ల పాటలు..



‘Radha on the dance floor, Radha likes to party.. Radha wants to move that ... Radha body’,

‘సారొచ్చారొచ్చారే .. వచ్చాదోచ్చాడే’

‘ఆకలేస్తే అన్నం పెడతా..(కి తమిళ్/కన్నడ వర్షన్.. సరిగ్గా అర్థం కాలేదు. నా పిచ్చి గానీ కొన్ని తెలుగు పాటలే నాకు అర్థమయి చావవు..)

ఏజెంట్ వినోద్ లో పాట ప్యార్ కీ పుంజీ బజాదే..

Why this kolaveri Di’..



వయసుకి తగని పాటలకి డాన్స్ చేయడం నచ్చక, అక్కడ నుంచుని చప్పట్లు కొడుతున్న టీచర్ కి ఒకావిడ కి చెప్తే,.. ‘మా చేతుల్లో లేదు. మా సూపర్ వైజర్ ఇష్టం. ఆవిడకి రాత పూర్వకం గా మీరు కంప్లైంట్ ఇవ్వండి’ అంది. సర్లే.. మధ్యాహ్నం పని పూర్తి చేసుకోపోతే మళ్లీ వారాంతం లో పని చేసుకోవాలి.. ఎందుకొచ్చింది అని .అక్కడ నూడిల్సు, ఫ్రైలు, బర్గర్లు తినేసి ఇంటికొచ్చి పడ్డాము..



2012 సినిమా చూడలేక పోయానే.. ఎంత మిస్సయ్యానో.. అని నిన్నంతా తెగ బెంగ పడిపోయాను.. స్కూల్లో ఫంక్షన్ లో ఒక్కసారి గా నిలబెట్టిన వినైల్ హోర్డింగ్ గాలిలో, పరిగెట్టుకు వచ్చిన పిల్లల మూక తోసినందుకో, రెండూ జరిగినందుకో.. ఢామ్మని పడిపోయింది. ఇంకేం.. జనాలు.. బాబోఓఒయ్ అని పరుగులు ఒక నిమిషం తర్వాత తేరుకుని నవ్వుకున్నాం.

పక్కింట్లో కూడా పైన్నుంచి ఏదో కుర్చీ పిల్లలు పడేస్తే,.. పిల్లలు అంతా వచ్చి చూసి..’ఓస్ ఇంతేనా..అని బ్హాగా నిరాశ చెందారు..



ఒక స్నేహితురాలితో నా ఉదయం బాధని gchat ద్వారా పంచుకుని కాస్త శాంతించి... రాత్రి రోజూ లాగే శుభ్రం గా తినేసి, పుస్తకాలు చదువుకుంటూ అందరం పడుకున్నాకా, పాలు ఫ్రిజ్ లో పెట్టలేదని గుర్తొచ్చి లేచి వచ్చాక టీవీ పెడితే.. స్టార్ ప్లస్ లో 2012. నేనైతే కూర్చుని పూర్తిగా చూశాను. సాంకేతికం గా బాగా నచ్చింది. భలే తీశాడనిపించింది. అమెరికన్ల ప్రపంచం,వాళ్ల “ఉదారత” ..నవ్వొచ్చింది..



సినిమా చూస్తుండగా ఇంకో ఫ్రెండ్ ‘కర్ణాటక సంగీతం పాడే నిత్యశ్రీ భర్త ఆత్మహత్య వివరాలు చెప్తే బాధ వేసింది. ఇద్దరు అమ్మాయిలట. భర్త ఆత్మహత్య తర్వాత, తనూ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందిట. నిన్న రాత్రి అత్తగారు చనిపోయిందట. అసలు పాపం ఏమవుతోంది తన జీవితం లో?


 చాలా ఏళ్ల క్రితం నాకు చెన్నై లో శ్రీమతి పట్టామ్మాల్ గారి కోడలు (లలిత గారనుకుంటా) శిష్యురాలితో పరిచయం ఉండేది. ఓరోజు బీచ్ కి వెళ్లి వస్తూండగా ఆ అమ్మాయి ‘హమ్మో.. నాకు క్లాస్ సమయమైంది. చూసుకోలేదు.. ఎలా’ అని కంగారు పడి ‘పోనీ నువ్వు నాతో వస్తావా? పట్టమ్మాళ్ ఇంటికి తీసుకెళ్తాను వస్తావా?’ అనడిగింది. నేను ఏదో ఒక పిచ్చి పాత నూలు సల్వార్ కమీజ్ లో ఉన్నాను. పైగా ఇసుక రాలుతోంది. అయినా.. carnatic musical trinity లో ఒకరైన పట్టమ్మాళ్ ని చూసే అదృష్టమే!! నాకు నోట మాట రాలేదు. అలా వెళ్లిపోయాం. అక్కడ నిత్యశ్రీ ని చూపించి.. ‘ఈ అమ్మాయే.. మా మాడం కూతురు. తనూ బాగా పాడుతుంది.కచేరీలు చేస్తుంది.’ అని పరిచయం చేసింది.



నా స్నేహితురాలు క్లాస్ లో కూర్చుంటే.. నిత్యశ్రీ తో నేనూ పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చున్నాను. చాలా సరదాగా మాట్లాడింది. ‘అంత పెద్ద విద్వాంసురాలి మనవరాలు కదా.. మీకు చాలా గర్వం గా ఉండి ఉండవచ్చు కదా..’ అంటే.. ‘అవును. చాలా గర్వం గా ఉంటుంది. అలాగే చాలా అదృష్టం నాది’ అనిపిస్తుంది.. అంది. ‘మీరూ చాలా అదృష్టవంతులు..’ అంది.

‘అవును.పట్టమ్మాళ్ మనవరాలితో మాట్లాడే అవకాశం దక్కినందుకు.. కదూ’ అన్నాను.

‘చనువు గా ఒక్కసారి భుజం మీద చరిచి పక్కున నవ్వుతూ.. ‘కాదు. మీకు తెలుగు తెలుసు. తెలుగు వారు. త్యాగరాజ కృతుల్నినేర్చుకోవడానికి ఎంత ఈజీ మీకు? నాకు మా అమ్మ తెలుంగు నేర్పిస్తుంది..’ అంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం గురించి ఆసక్తి గా అడుగుతూంది.

‘సబాపతిం..’ అని రాగం తానం.. పల్లవి అంటూ ఏదో పాడి వినిపించింది. అప్పట్లో నాకర్థం కాలేదు.. విని మొహమాటానికి బాగుందని చెప్పాను. ఈలోగా, మా నాయనమ్మ ని చూడాలంటే పక్క వీడు కెళ్ళాలి అంది.



అంత పెద్ద కళాకారిణి ఇంటికెడుతూ కనీసం ఒక మూర పూలు, ఒక స్వీట్ ముక్క,కనీసం మంచి బట్టలు కూడా వేసుకోలేదు  అనుకుని చాలా మొహమాటం గా వెళ్లాను. పట్టమాళ్ నాతో ఎవరో అమ్మమ్మ మాట్లాడినంత ప్రేమ గా మాట్లాడి ఊరూ, పేరూ తెలుసుకుని ఒక మూర మల్లెపూలు చేతిలో పెట్టి, ‘పెట్టుకో. నా ప్రోగ్రాం ఉంది. త్యాగరాయ సభలో.. వస్తావా? ‘ అని అడిగింది. నాకు నోట మాట రాలేదు. పట్టు చీరల్లో పట్టమాళ్, లలిత గారు, నిత్యశ్రీ, పక్కన దిష్టి బొమ్మల్లా నేనూ, నా ఫ్రెండూ.. పట్టమ్మాళ్ కొడుకు నాచేతికి ఒక ఎలక్ట్రానికి తంబూరా ఇచ్చి కాస్త పట్టుకోమ్మా.. అని కార్ లోకి ఇచ్చారు. అప్పుడు చూసుకున్నాను. హవాయి చెప్పులు..చింపిరి జడ.. కానీ పట్టమాళ్ ఇచ్చిన మల్లెమాల.. నిత్యశ్రీ కార్ లో కూర్చుని నేను వెళ్లటమేమిటి? అని.



రెండు కార్లు వెళ్లి ఆ సభ దగ్గర ఆగుతూనే, చాలా మంది ఆవిడకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతుంటే, ఆ వెనక మేము ఎలా వెళ్లామో, మొదటి వరస లో కూర్చుని ఏం విన్నామో.. దేవుడికెరుక. ప్రోగ్రాం అవుతూండగానే హాస్టల్లో మళ్లీ రానీయరని. స్టేజ్ మీద పాడుతున్న పట్టమాళ్ కి నమస్కారం చేసి, నాయనమ్మకి సహకారం ఇస్తున్న నిత్యశ్రీ కి బై అన్నట్టు చేయి ఊపేసి, నందనం బస్సెక్కేసాం...



జీన్స్ లో ‘కన్నులతో చూసినదీ’ పాటా,..చంద్రముఖి లో ‘వారాయ్’ అన్న పాట పాడి తెలుగు సినిమా ప్రేక్షకులకి చేరువ అయినప్పుడూ .. కర్ణాటక సంగీత సీడీ లు అమ్మే ప్రతి షాపు లోనూ తన సీడీ లు ఎప్పుడు చూసినా గర్విస్తూ ఉంటాను.. ఇదంతా ఇంకోసారి గుర్తు చేసుకుని..నిద్రపోయాను...



ఈరోజు లేచి చూస్తే.. నరకం లో నూనె లో కాల్చబడుతూనో, స్వర్గం లో కుర్చీల్లో కూర్చుని రంభా వాళ్ల డాన్సులు చూడకుండా,.. పాల పాకెట్లు మళ్లీ చింపుకుని స్టవ్ మీద పెట్టుకుని రోజు మొదలు పెట్టాల్సి వచ్చినందుకు సంతోషం గానే ఉన్నా,.. ఏమూలో ఒక చిన్న, mild disappointment.

Wednesday, July 11, 2012 44 comments

సీతారాముడు బెంగుళూరొచ్చాడు - ఉపోద్ఘాతం.


(By Vishnupriya)
“ఓ పని చేయి మామయ్యా! వాడిని బెంగుళూరు బస్సెక్కించెయ్! ఓ పది రోజులు చూస్తాను, నాకు తోచినది నేర్పిస్తాను… కొద్దిగా ఒక దిశా నిర్దేశం చేసేందుకు నాకు కాస్త అవకాశం దొరుకుతుంది..” అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

సీతారాం మా చుట్టాలబ్బాయి. వాళ్ల నాన్నగారు మా నాన్నగారికి ఆప్తులు. కాకపోతే రాకపోకలు తగ్గి నాకు ఆ కుటుంబం లో పిల్లల తో పరిచయం తక్కువే. బొత్తి గా పల్లెటూరు, ఓ ఎకరం కాస్త అమ్మి మరీ, ఒక మాదిరి పట్టణం లో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ ల్లో, ఒకానొక కాలేజీ నుండి తన కొడుక్కి మా మామయ్య బీ టెక్ పట్టా తెప్పించగలిగాడు. పిల్లవాడు చాలా ‘బుద్ధిమంతుడు’ అని చుట్టాల్లో పేరు. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాడు. వాళ్లింట్లో అతనే మొదటి ఇంజనీరు. చిన్న సిటీ లో, చిన్న కాలేజీ లో చదువుకోవటం తో, పెద్దగా కాంపస్ ఇంటర్వ్యూలు జరగలేదు. జరిగిన వాటిలో వాళ్లబ్బాయి వ్రాత పరీక్ష లో ఉత్తీర్ణుడయినా, గ్రూప్ డిస్కషన్ల లో వెనకంజ వేశాడు అని తండ్రి చెప్పాడు.

“అమ్మా! కృష్ణా! నువ్వే కాస్త వాడికి ఒక దారి చూపించాలి. మీ కంపెనీ లోనో, తెలిసిన వారి దగ్గరో, ఒక ఉద్యోగం ఇప్పించు!” అని పదే పదే చెప్పటం తో, నేను కూడా చేతనైనంత సహాయం చేద్దాం.. అని నిశ్చయం చేసుకున్నాను. నాకూ, నాకు తెలిసిన వారికి చాలా మందికి కాంపస్ సెలక్షన్లలో ఉద్యోగం దొరికేయటం తో, కొత్తగా పాస్ అయిన వారు ఉద్యోగాల కోసం ఎలాగ ప్రయత్నిస్తారో నాకు అస్సలూ ఐడియా లేదు. నాకు తెలిసిన వాళ్లకి కాస్త చెప్పి 2012 లో పాస్ అయిన ఇంజనీర్లు అసలు అవకాశాల కోసం ఎలాగ ప్రయత్నించాలో తెలుసుకోవటం మొదలు పెట్టా.

పది మందికీ విషయం చెప్పటం తో, వంద రకాల సలహాలు రావటం మొదలు పెట్టాయి. నాకూ తల తిరిగిపోయింది. మంచి కాలేజీల్లో చదివి కొద్దిగా ‘స్మార్ట్’ గా ఉన్న పిల్లలకి ఎలాగూ అవకాశాలున్నాయి. B గ్రేడ్ టౌన్లల్లోని అరగొర సదుపాయాలున్న ఇంజనీరింగ్ కాలేజీ ల్లోంచి వచ్చిన పిల్లలకి మొదటి సాఫ్ట్వేర్ (మంచి) ఉద్యోగం సాధించటం దాదాపు తెలుగు సినిమాల్లో హీరో/హీరోయిన్ వేషం సాధించటమంత కష్టతరవిషయం అని. ఆంగ్లం లో గడగడా మాట్లాడగలగాలి, సబ్జెక్టుల్లో ఎలాగూ దిట్టలై ఉండాలి, వాళ్ల సబ్జెక్టులేకాక, కంప్యూటర్ల లో కొత్త విషయాల్లో ప్రవేశం ఉండాలి. అంతే కాక, కనపడిన ప్రతి వాక్ ఇన్ కీ పరిగెత్తాలి, అనుభవం లేదు కాబట్టి నామ మాత్రపు జీతాలకి పని చేయటానికి రెడీ గా ఉండాలి, ఒక్కోసారి ఎదురిచ్చి కూడా పని చేయటానికి కూడా సిద్ధం గా ఉండాలి, చిట్టెలుకంత చురుకు గా తిరగాలి, చిరుతంత వేగం గా ఉండాలి, చీమలు బెల్లం ఎక్కడ దాచినా వాసన పసి గట్టినట్టు, సిటీ లో అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలమీదా ఓ కన్నేసి ఉంచి అన్నింటిలోకీ ఒక రాయేసి చూడగలగాలి.. అన్నింటికీ మించి ‘మీ వాడికి ఇంకా ఉద్యోగం రాలేదా? పాపం! మా వాడికి ఫలానా కంపెనీ వాళ్లు ఆరు లక్షల పాకేజీ ఇస్తున్నారు, వేరేవాళ్లు తొమ్మిది ఇస్తున్నారు కానీ, బొంబాయి కి వెళ్లాలట.. ఎందుకూ, ఉన్నఊళ్లో కళ్ళ ఎదురు గా ఉండి ఆరు కి కాంప్రమైజ్ అవమని అడుగుతున్నాం.. ‘ అని సాటి వారు చెప్పే సోది విని నిర్వికారం గా ఉండగలగాలి!

మన వాడికి విషయ జ్ఞానం ఎలాగుంది? వాడి ఆంగ్లం పరవాలేదా? చురుకు గా ఉంటాడా? చెప్పింది చెప్పినట్టు అల్లుకుపోగలడా? ఇలాంటి ప్రశ్నలతో నాకు ఉక్కిరి బిక్కిరి అయినట్లయింది. ఈలోగా ఊరి నుండి ఫోన్ల మీద ఫోన్లు. ‘ఏమైంది ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయి? ‘ అంటూ. మా మామయ్య స్వాతి ముత్యం లో కమల్ హాసన్ లా రోజూ నన్ను అడగటమేకాక సీతా రాం చేత కూడా ఫోన్లు చేయించాడు. నా ఫోన్ పండగ పూట కోవెల్లో గంట లా గణగణ లాడుతూనే ఉంది.

ఓ నెల పాటూ ఫోన్ల ద్వారా సంభాషణలు మామయ్య తో అయ్యాకా, కొద్దిగా నాకు విషయం అర్థమవటం మొదలైంది. మా మామయ్యకి తానొక ‘అపర ఐన్ స్టీన్ కి తండ్రంత వాడినని గట్టి నమ్మకం! ‘అబ్బాయి ఇంజనీరయ్యాడు..’ అనగానే వరసగా క్యూలు కట్టి అందరూ వెనక వెనక పడి ‘మా కంపెనీ లో చేరు.. లక్షిస్తాం’ అంటే.. మా కంపెనీ లో రెండు లక్షలిస్తాం..’ అంటూ వేలం పాటలా పైకి తీసుకెళ్లి ‘అమెరికా వెళ్తావా! ఆస్ట్రేలియా కెడతావా?’ అని బ్రతిమాలుతూ, పాత సినిమాల్లో నాగేశ్వరరావు ని అడిగినట్టు.. ‘ ‘మీరు మీ తెలివి పెట్టుబడి పెట్టండి.. మేము డబ్బు పెడతాం..‘ అంటూ ఆఫర్లు ఇచ్చే పారిశ్రామికవేత్తలూ, .. గ్రూప్ డిస్కషన్ లో నోరు పెగలక పోతే, “భాష కాదు! భావం ముఖ్యం.. మిమ్మల్ని ఇంగ్లిష్ లో మాత్రమే మాట్లాడమని ఎవరన్నారు? తెలుగు లో మాట్లాడండి! ” అని అదో టైప్ సీరియస్ ఎక్స్ ప్రేషన్లు ఇచ్చి ప్రోత్సహించే ‘త్రిష’ ల్లాంటి ఎగ్జెగ్యూటివ్ లూ.. అబ్బో.. మా మామయ్య గారికి చాలానే భ్రమలు ఉన్నాయి అని అర్థమైంది.

“మామయ్యా! ఓ సారి వాడికి ఫోన్ ఇయ్యి... మాట్లాడతాను” అన్నాను. ‘ సీతారాముడు పూజ లో ఉన్నాడు.. ఇప్పుడు మాట్లాడలేడు. ఓ ఇరవై నిమిషాలాగి చేస్తాడు.. ‘ ఇరవై నిమిషాల పూజా! ఏదైనా పండగా! ఏంటి? మరీ పండగలూ, పబ్బాలూ పట్టించుకోని మెకానికల్ బతుకైపోయింది బొత్తి గా.. :- ( అనుకుంటూ, ‘అబ్బో.. ఏంటి స్పెషల్ ఈరోజు? ‘ కొద్దిగా గిల్ట్ నిండిన గొంతు తో అడిగాను. మామయ్య ‘లేదమ్మా! ప్రతి రోజూ రెండు పూటలా తలస్నానం చేసి సంధ్యావందనం, పారాయణం వంటివి అన్నీ చేసుకోవటం వాడి దినచర్య లో భాగం.. అన్నట్టు మా వాడు తిరుచూర్ణం, తిరువణిక్కాపు తో నామం పెట్టుకుంటాడు.. మరి ఉద్యోగాలకి ప్రయత్నిస్తున్నప్పుడు అదొక అడ్డంకి కాదు కాదు కదా? ‘ అని ఒకింత అమాయకం గా అడిగాడు..

నాకెందుకో ఒక్కసారి గా జాలి, నవ్వూ, వీడికి ఒక మంచి ఉద్యోగం ఎలాగైనా సంపాదించుకునేలా చేసి తీరాలనే పట్టుదలా కలగా పులగం గా తలకెక్కేసాయి. దాని ఫలితమే ఈ ఫోన్ కాల్...

(సశేషం)


Wednesday, October 19, 2011 41 comments

పండగ, సకల జన సమ్మె, పెళ్లి పిలుపులు


                         మా ఇంటి పక్క వారి ఇంటి ముందు పెట్టిన బతుకమ్మలు.
తమ్ముడి పెళ్లి.. పిల్లలకి ఎలాగూ దసరా సెలవలు..వారం సెలవ పెట్టా. హైదరాబాద్ అంతా తెలంగాణా సకల జన సమ్మె అని బస్సులు నడవట్లేదు, రైల్ రోకోలు, ఆఫీసులు లేవు, స్కూళ్లు బందు. ముందే చేసుకోవాల్సింది పనులు అనచ్చు కానీ ముందు అంతా మూఢాలు. కనీసం పెళ్లి పత్రిక అయినా అచ్చేయించటానికి లేదు. అసలు పెళ్లి పిలుపులు ఎలా జరిపించాలో, ఒక వేళ పిలవగలిగినా, పిలిచిన బంధువులు ఎలా వస్తారో.. అమ్మా వాళ్లకి ఒకటే కంగారు. ఈ బస్సుల బంద్, అవీ విన్నాక ఒక వారం రోజులు హైదరాబాద్ నుంచి పని చేస్తానని బాసు గారికి ఈ-మెయిల్ చీటీ రాసి పది రోజుల ముందే రైలెక్కేసా. మా వారు తర్వాత వస్తానన్నారు. ఉన్న నలుగురికీ రెండు భోగీల్లో సీట్లు. దానికే కష్టం గా ఉంటే.. ఆటోలు నడవకపోవచ్చు అని రైల్లో రూమర్. ముందు రోజు బంద్ ట.

సాధారణం గా నేను హైదరాబాద్ కి వస్తే ఎవ్వరూ స్టేషన్ కి రావటం జరగదు. ఎవ్వర్నైనా అసలు ‘ఆటోలు తిరుగుతున్నాయా’ అని అడిగినా స్టేషన్ కి వచ్చేస్తారు. ఎందుకు ఇబ్బంది పెట్టటం.. అని ఊరుకున్నా. కానీ అందరూ ‘అయ్యో మీకు ఎవ్వరూ రారా? ‘ అని అడుగుతుంటే కాస్త భయమేసింది. ముసలి అత్తగారు, చిన్నపిల్లలు, లగేజ్ లో నగలు, పట్టు చీరలు,.. సరే, ‘మొహమాటం తో స్టేషన్ కి రాడు’ అని నమ్మకమున్న ఫ్రెండ్ కి ఫోన్ చేసి అసలు పరిస్థితి ఏంటి? అని అడిగాను. ‘ఏమీ లేదు.. బంద్ జరిగింది ఈరోజు! రేపు అంతా ఓకే. బోల్డు ఆటోలు తిరుగుతాయి. అంతగా ఏమీ తిరగక పోతే ఏముంది ఈ నంబర్ కి కాల్ చేయి టాక్సీ వచ్చేస్తుంది.. అని అన్నాడు. ‘హమ్మయ్య’ అనుకుని పడుకున్నా. ఉదయాన్నే ఫోన్ మోగుతోంది. ఎత్తితే,.. ‘ఏ డబ్బా లో ఉన్నావు?’ అని నా ఫ్రెండ్! ‘వార్నీ!’ అనుకున్నా. కానీ చాలా రిలీఫ్ గా అనిపించింది.

స్టేషన్ లోంచి బయటకొస్తుంటే.. మామూలు గానే ఆటోల వాళ్లు చుట్టుముట్టటం .. పర్వాలేదు అనిపించింది. రోడ్డంతా మామూలుగానే,.. దుకాణాలూ తెరిచే ఉన్నాయి. ఏ గల్లీ చూసినా దుర్గా దేవి విగ్రహాలు. ఆశ్చర్యం వేసింది. ఏది ఆగినా పండుగ మాత్రం ఆగలేదన్నమాట. ఇంటికొచ్చాక మద్యాహ్నం మళ్లీ స్కూటర్ మీద బయల్దేరాను సిటీ లోకి ఏదో పెళ్లి పని తో.. సాధారణం గా బస్సులతో, బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులతో కళ కళ లాడే వీధులు విశాలంగా, బోసి పోయి.. కార్లు, మోటార్ సైకిళ్లు మాత్రమే నడుస్తూ.. ట్రాఫిక్ సగమైంది అనిపించింది. అసలీ రోడ్లు ఇంత ఖాళీ గా చూసి దశాబ్దాలు అయ్యాయి అనిపించింది. ఇరవై ఏళ్ల క్రితం ఇలాగ ఖాళీ వీధుల్లో తిరిగాం, తర్వాత మళ్లీ ఇప్పుడు.. కానీ అప్పుడు బస్సులు రోడ్డు నింపితే ఇప్పుడు కార్లు నింపాయనిపించింది.


బతుకమ్మలు ఆడుతూ మా ఏరియాలో ఆడవారు.

మన సంస్కృతి,సాంప్రదాయాలు నశిస్తున్నాయని, మన పండుగలు జరుపుకోవటం తగ్గిపోయిందని బాధపడే జనాల్లో నేనూ ఒకదాన్ని. దసరా ముందు బజారు కి వెళ్దామని బయలుదేరాం. దోవలోనే ‘కృష్ణా! రండి బతుకమ్మ ఆడదాం.. ‘ అని ఆటో స్టాండ్ కి వెళ్లే వీధి లో తెలిసిన వారు ఆపేశారు. ఎన్నేళ్లు అయిందో. ఎప్పుడో కరీం నగర్ లో ఆరో తరగతి లో ఆడిన గుర్తు. తర్వాత మళ్లీ ఆడలేదు. తెలంగాణా ఎఫెక్ట్ తో చాలా చోట్ల మానేసిన వాళ్లు కూడా ఈ సంవత్సరం మొదలు పెట్టారు మా ఏరియా లో. ఒక పక్క రావణ దహనం, ఇంకో పక్క కలకత్తా కాళి విగ్రహాలు వినాయకుడి తీరు లో పెట్టేసారు. ఇంకో పక్క గుజరాతీ వారి గర్భా, కోలాటాలు.. అన్ని ఇళ్ల ముందూ మంచి ముగ్గులు, అందరూ పట్టు చీరలు అవీ.. జమ్మి చెట్టు పత్రి పంచుకుని వీధిలో జనాలు కౌగలించుకుని మైత్రి చాటుకుంటుంటే.. (అర్జునుడు అజ్ఞాత వాసం ఆఖరి లో, విరాట రాజు రాజ్యం లో జమ్మి చెట్టు మీద దాచుకున్న ఆయుధాలు మళ్లీ కౌరవుల పైన యుద్ధం కోసం ఈరోజే తీశాడని ఒక నమ్మకం. అందుకే ఆరోజు జమ్మి పత్రీ ని బంగారం అంటూ పంచుకుంటారు.. కొన్ని ప్రాంతాల్లో..) అసలు ఇన్ని రకాల ఉత్సవాలు చూసి ఎన్నాళ్ళైందో,.. ఇళ్లల్లో బొమ్మల కొలువులు అవీ ఎలాగూ ఉన్నాయనుకోండి.


కొద్దిగా లేట్ అయ్యాం.. రావణుడు కాలిపోయాడు.

జమ్మి ఆకులు..


పండగ పూట మా అమ్మాయి స్వహస్తాలతో వేసిన ముగ్గు
విజయ దశమి రోజున పగలల్లా పనులతో అలిసినా.. అర్థ రాత్రి పూట అందరం కులాసాగా పెళ్లి పందిరి లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే.. ధన, ధన ధన మని చెవులు చిల్లులు పడేలా బాలీవుడ్ సంగీతం, పక్క వీధిలోంచి.. చూద్దాం.. అని గుంపు గా బయల్దేరాం. గమ్మత్తు గా అనిపించింది. కలకత్తా కాళీ ప్రతిమ ని ఊరేగిస్తున్నారు. బాగానే ఉంది. గుజరాతీ కోలాటాలు, గర్బా చేస్తూ ఆడా, మగా, పిల్లా, పీచూ, అదీ సరే.. కాస్త పాశ్చాత్య ధోరణి, సూటూ, బూటూ వేసిన డీ జే, డిస్కో లైట్లు, గర్భాలకి ఇదంతా మామూలే.. అనుకుంటే.. ఒక్క సారిగా ‘బీటు మార్చండే హా..’ అని ‘మాయదారి మైసమ్మో మైసమ్మా.. మనం మేడారం పోదమే మైసమ్మా!, నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నేక్కినవే మైసమ్మా’ ఇంత cultural integration, cosmopalitan culture మా వీధి లోనా! అని కన్నీళ్లు తుడుచుకున్నంత పని చేశాను. కాకపోతే అర్థరాత్రి ఉత్సవాల వల్ల కష్టపడే ముసలి వారు, పిల్లలు, వ్యాధిగ్రస్తుల మాట..  ఆలోచించలేదు.



మా వీధి కాళీ మాత



మాయదారి మైసమ్మో మైసమ్మా.. చిందులేస్తున్న కుర్రకారు..
బజారు లో జనాలు తక్కువ గా ఉంటారు లెమ్మనుకుంటే.. అబ్బే ఎక్కడా! ఏ బ్రదర్స్ షాపు చూసినా వందలాది ఆడవాళ్లు గుంపులు గుంపులు గా చీరలు కొనేస్తున్నారు. ఏది ఆగినా దసరా సందడి మాత్రం అలాగే ఉందని అర్థమైంది.

సకల జన సమ్మా మజాకా! అందరికీ బోల్డు తీరిక, ఓపిక,.. పిల్లా, మేకా ఈ పండుగ జరిపినంత ఈ మధ్య కాలం లో ఏదీ జరపలేదేమో  బజార్లకి పరిగెత్తాలంటే.. ఆటో వాళ్లకి భయపడి ప్రాణాల మీదకి వస్తే తప్ప ఇల్లు కదలక పోవటం.. అంతే కాదు.. సింగరేణి కార్మికుల సమ్మె పుణ్యమా అని ఉదయం ఎనిమిది కే కరెంట్ కట్. ముప్పై మంది ఉన్న పెళ్లింట్లో, అందరికీ ఒక డిసిప్లిన్ వచ్చిందంటే.. సకల జనుల సమ్మె వల్లే. ఎనిమిది తర్వాత వేన్నీళ్లు బంద్.. అనేసరికి పిల్లా, మేకా, గొడ్డూ గోదా.. అంతా ఎనిమిదిన్నరకల్లా స్నాన పానాదులు చేసి రెడీ.. వంటింట్లో పచ్చళ్లు రుబ్బుడు కార్యక్రమాలు అన్నీ డన్! పగటి పూట నాలుగు గంటల కరంట్ కట్ వల్ల పిల్లకాయలు, పెద్దవారూ, ముసలి వారూ కార్టూన్లు, వార్తలు, సీరియళ్ల, TTD,భక్తి చానళ్ల కోసం యుద్ధం చేసుకోకుండా, ఇంటర్ నేట్టూ, షాపింగులూ, అనకుండా సామరస్యం గా పెద్దలు పాత తరహా లో వాళ్ల చిన్నప్పటి ముచ్చట్లు చెప్తూ, పిల్లలు తమ స్కూళ్లల్లో నేర్పిన పాటలూ పద్యాలూ ఇతరులకి వినిపిస్తూ,.. ఆహా.. ఏమదృష్టం? ఇక మేమంతా వంట వారు ఉన్నా, వేరే పనీ పాటా లేక పులిహార నుండీ పిజ్జా దాకా, అరిసెల నుండీ, కేకుల దాకా చేసుకున్నాం.. సరదా గా తిన్నాం. (ఇక ఇంకా ఇంకా సరదాగా వర్క్ అవుట్ చేయాలనుకోండి.. నెమ్మదిగా..)

అమ్మా వాళ్లకా.. కారు లేదు. ఎక్కడా.. బస్సుల్లేవు కాబట్టి ఆటోలూ అవీ బోల్డు అడుగుతున్నారు. అసలు పిలుపులన్నీ ఫోన్ మీదే.. హైదరాబాద్ లో లేని వారికి పోస్ట్ ద్వారా, ఇంకా కొరియర్ ద్వారా, ఫోన్ ద్వారా ... అని ఏవో లెక్కలేసుకున్నా, కనీసం బంధువుల్లో వాళ్ల జెనరేషన్ వారిని, పెద్దవారిని మాత్రం వెళ్లి పిలవాలని .. కారు మాట్లాడుకుని విజయ దశమి పూట నలుగురం బయల్దేరాం. ఇంతకు ముందు ఇలాగే మా కజిన్ చెల్లి పెళ్లి పిలుపులకి వెళ్తే ఎవరూ కాఫీ కి మించి ఇచ్చిన పాపానికి పోలేదు, అని మా అమ్మ ఒక సంచీ నిండా గారెలు, అల్లం పచ్చడి, పులిహార పోట్లాల్లాంటివి పెట్టి పంపింది. ఈ పెళ్లి పిలుపులకి వెళ్లటం నా జీవితం లో ఒక మర్చిపోలేని అధ్యాయం! మళ్లీ నా పిల్లల పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో.. తెలియదు. ముందస్తుగా వస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పలేదు. బంధువులు దండి గా ఉన్న ఏరియా కి వెళ్లి వారింటి కి దగ్గర్లో ఉన్నప్పుడు ఫోన్ చేయటం.. ఉంటే ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి పిలవటం, లేదా పత్రిక గుమ్మం లో పెట్టి రావటం!

పిల్లలు అమెరికా లకో, ఆస్ట్రేలియాలకో, వెళ్లిపోతే బిక్కు బిక్కు మంటూ లంకంత ఇళ్లల్లో, అడుగడుగునా సమస్త రాజ భోగాలతో, వృద్ధాప్యం లో భక్తి టీవీలు చూస్తూ, అమృతాంజన్ వాసనలు పీలుస్తూ, కాలక్షేపం చేస్తున్న తల్లిదండ్రుల ఇళ్లకి వెళ్లాం.. పండగ పూట శాస్త్రానికి కొద్దిగా పని మనుషులకీ, పక్కవారికీ ఇవ్వటానికి పిండి వంటలు చేయించి అలాగ ఈసురోమంటూ కూర్చుని ఉన్న ఆ పెద్దలని చూసి నిట్టూర్చి పిలిచి వచ్చేశాం.. భర్త చనిపోయిన భార్య ఎలాగో బతుకుతుంది కానీ భార్య చనిపోయిన భర్త జీవితం నరకం .. అని విన్నాను, అదీ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాక.. ఒకరిని పిలవటానికి వెళ్లి ఆయన ఇల్లు, విధానం చూసి చలించిపోయాను. ఫ్రిజ్ లోంచి తెచ్చిన ప్లాస్టిక్ నీళ్ల బాటిల్ మూత దగ్గర మురికి, ఇల్లు అంతా దుమ్ముతో, ఏదో చెప్పలేని తేడా.. భోజనం సంగతి ఏంటని అడిగితే ‘ఓపిక ఉంటే వంట, లేదంటే తంటా.. ‘ అని చమత్కరించినా.. (కేవలం వంట అని కాదు కానీ...) వాళ్లావిడ, పిల్లలూ ఉన్న రోజుల్లో డాక్టర్ గారైన ఆయన జీవన విధానం గుర్తొచ్చి కొద్దిగా బరువు గా అనిపించింది.

అలాగే.. ఉద్యోగస్తులైన కొడుకూ, కోడళ్ల తో కలిసి ఉన్న వృద్ధ దంపతులు.. గొంతు లో జీర తో.. ‘ఎంత సద్దుకుపోదామన్నా మా ఉనికి భరించలేనిదయ్యింది.. మా కొడుక్కీ, కోడలికీ’ అని అంతలోనే టాపిక్ మార్చేస్తూ నవ్వేస్తూ...

మా అత్తగారూ, ఇలాగే అనుకోవట్లేదు కదా.. ఒక చిన్న ఆత్మ విమర్శ మనస్సు లో..

తల్లీ తండ్రీ పోయినా, ఓకే ఏరియా లో నివసిస్తూ, నెలకోసారి కలిసి భోజనం చేసే తొమ్మిది మంది అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, వారి బిడ్డలందరినీ పండుగ భోజనాలు చేస్తుండగా కలిసి ఒకేసారి పిలిచాం. ఒకేసారి గా ఆనందం, ఈర్ష్య, గర్వం లాంటి భావాలు కలగా పులగం గా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. అక్కడినించి వచ్చేశాం.

మా చిన్నప్పుడు ఒక హీరోలా, మోటార్ సైకిల్ మీద ఫీట్స్ చేస్తూ, పెద్దలనెదిరించి ప్రేమ వివాహం చేసుకుని.. ఆ రోజుల్లో, మా టీనేజర్ల దృష్టి లో హిమాలయాలంత ఎత్తు లో ఉన్న ఒక దూరపు చుట్టం ఇంటికి వెళ్లాం.. నేనూ చాలా ఉద్వేగం గా, ఉత్సాహం గా, ఎలా ఉంటుందో ఇల్లు, కుటుంబం ఎలా ఉంటుందో.. అని రకరకాల అంచనా లతో వెళ్లి చూసి ఒక విధమైన దిగ్భ్రాంతి కి గురయ్యాను. ఆయన బట్టతల తో, మాసిన గడ్డం తో, చిరుగులు పడ్డ, పాత బడ్డ గుడ్డలతో, ఇల్లు పెయింట్ గట్రా లేకుండా, ఊడిన తలుపులు, వాకిలి నిండా పిచ్చి తుప్పలు, ఇంటి నిండా ఉతకాల్సిన, ఉతికబడి మడతలు పెట్టాల్సిన బట్టల కుప్పలతో, పండుగ పూట పదకొండైనా.. స్నానాలు, గట్రా లేకుండా, నూనె, షాంపూలు వాడని వారికి మల్లే, ఎండిన తలకాయల తో ముగ్గురు పిల్లలు టీవీ చూస్తూ,.. ‘ఇంకా వెళ్ళరేమన్నట్టు చూస్తూ’ .. ఆఫీస్ లో ఏదో ఫ్రాడ్ లో ఇరుక్కుని ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడని చెప్పాడు. రెండు నిమిషాల తర్వాత వచ్చేస్తూ ‘దౌలత్ ఔర్ జవానీ ఎక్ దిన్ ఖోజాతే హై’ .. పాట గుర్తు చేసుకుంటూ మౌనం గా వస్తుంటే చెంప దెబ్బ కొట్టినట్టు ఒక్కసారి గా ఒక ఆలోచన వచ్చింది. ఆదివారాలు మేమూ నెమ్మదిగా స్నానాలు చేయకుండా, మందం గా ఉంటాం ఇంట్లో.. ఎవరైనా వస్తే అది ఎంత చిరాగ్గా అనిపిస్తుందో అర్థమైంది. ఒక మెంటల్ నోట్ చేసుకుని బయల్దేరాం.

ఏ ఇంటికి వెళ్లినా స్కూళ్లు, కాలేజీలు లేక, వేలాడే మొహాలేసుకున్న చదువుకునే పిల్లలు.. కానీ మా పిల్లలు మాత్రం ఆశ గా హైదరాబాద్ కి వచ్చేద్దామమ్మా అని అడిగారు. కొత్త గా అపార్ట్ మెంట్లు కొన్న వారి ఇళ్లకి వెళ్లి వారి ఇంట్లో ఇంచ్ ఇంచ్ గొప్పదనాన్ని విని తరించాము. అందుకే కాబోలు కొత్తగా ఇల్లు కట్టిన వారింటికీ, కొత్తగా పిల్లలు పుట్టిన వారింటికీ వెళ్తే ఇంతే అంటారు అనుకుని నవ్వుకున్నాను.

చిన్న ఉద్యోగం చేస్తూ, ఇరుకైన అపార్ట్ మెంట్ లో ఉంటూ, పండుగ పూట మొదటి సారి వచ్చానని, ఆప్యాయత తో బొట్టు పెట్టి, జాకెటు ముక్క పెట్టి కాళ్లకి పసుపు రాసి పంపిన వారు, చెవి పిండి మరీ పండగ వంటలు బలవంతాన కుక్కిన వారు, ‘ఫోన్ చేశారు కదే.. ఎందుకూ.. ఇలా కష్టపడ్డారు.. మేమెలాగూ వచ్చేసేవారం..’ అని ప్రేమ తో మందలించిన వారు, ‘ఇంటికొచ్చి పిలిచారు కాబట్టి వస్తున్నాం.. లేకపోతే మానేద్దామనుకున్నాం’ అని వేళాకోళాలాడినవారు, పోనీలే కనీసం ఈ వంకనైనా మా గుమ్మం తొక్కావు అని నిష్టూరాలాడిన వారు.. వెరసి నా వాళ్లు.. వెనక్కి వస్తూ అలసట గా జాలబడి కళ్లు మూసుకుని అనుకున్నాను.. ‘అమ్మో.. నయమే.. ఏం వెళ్తాం లె పిలుపులకి ‘ అనుకుని ఇంట్లో ఉండిపోయాను కాను.. ‘.

దాదాపు పది, పదిహేనేళ్లు అయిందేమో.. వెళ్లి! ఇంటికి చుట్టుపక్కల వారిని పిలుస్తుంటే అర్థమైంది.. అన్ని కుటుంబాల్లో,.. ఇంచుమించు గా ఒకటే కథ.. రెక్కలొచ్చిన పిల్లలు, ఒంటరి తల్లిదండ్రులు.. లేదా బిక్కు బిక్కు మంటూ, IIT,medicine లకి చదువుకుంటున్న మనవలకి disturbance లేకుండా కాలం గడుపుతున్న పెద్దలు. కొన్న ఇళ్లకి అప్పులు తీర్చటం కోసం.. పరుగులు తీసే నడి వయస్కులు, చదువుల ప్రపంచం లో పిల్లలు, పక్కింట్లో ఎవరున్నారో, ఏం జరుగుతుందో కూడా తెలియని మనుషులు..



పోస్ట్, కొరియర్లు సరిగ్గా పని చేయకపోవటం తో, శుభలేఖలందక, బస్సుల్లేక, ఆరోగ్యం, ఆర్ధిక సామర్థ్యం లేని జిల్లాల్లో బంధువులు, కావలసిన వారు అసలు ఎలా వస్తారో, రాగలరో అర్థం కాక, పెళ్లి పందిరి లో చతికిల బడ్డాము. కానీ సుమోలు, క్వాలిస్ లు కట్టించుకుని, ఎలాగైతేనేం.. కుటుంబానికి ఒక్కరైనా రావాలని బిలబిల లాడుతూ వచ్చి తమ్ముడిని ఆశీర్వదించి వెళ్లిన బంధువులని, తృప్తి గా పంపించి రైళ్లు కాన్సెల్ అవటం తో అత్యవసరమైన సామాన్లు మాత్రం తీసుకుని ఎలాగోలా మా బెంగుళూరు కి వచ్చి పడ్డాం.

Monday, March 14, 2011 34 comments

సింగం, బార్డర్ సమస్యా, మల్లెపూలూ..



ఆఫీస్ లో నా ప్రాజెక్ట్ పార్టనర్ సింగ పెరుమాళ్ నుండి మెయిల్.. సోమవారం. 'Family Emergency.. Will be Out of Office for couple of days' అని.  'అయ్యో.. పాపం ఏం ఎమర్జెన్సీ యో' అనుకున్నాఒక్క క్షణం కానీ.. ఆయన చేయాల్సిన పని కూడా నా మీద పడిందని గుర్తొచ్చి.. నీరసం వచ్చింది...  కానీ మళ్ళీ అనుకున్నా.. పోన్లే.. ఎన్ని సార్లు నన్ను ఆదుకోలేదు.. అని..






రెండు రోజులకని వెళ్ళిన వాడు వారం అంతా రాలేదు.ఫోన్ కి పలకడు.. ఆన్లైన్ లేడు.బాసుగారిని అడిగితె.. 'నాకూ చెప్పలేదు.. ఏమైందో..' అని చెప్పాడు.  సింగ పెరుమాళ్ చాలా నెమ్మది. ఘాటైన తమిళ వాసన తో మాట్లాడతాడు. తనని అందరూ సింగం అని పిలుస్తారు.. మేమైతే 'సిమ్గామంటీ చిన్నోడే ఆఫీస్ కొచ్చాడే..' అని సరదాగా ఏడిపించినా..  'Singapore mall' అని ముద్దు పేరు పెట్టినా..నవ్వుతూ వెళ్ళిపోవటమే..


అతను మొత్తానికి ఆఫీసు కి రాగానే..  'ఏమైంది? ' అని అడిగితే రుద్రవీణ లో లా 'అదంతా పెద్ద కథ' అని నిట్టూర్చాడు. సరే ఈరోజు లంచ్ సింగం తో ఫిక్స్ చేసేసా..  కిటికీ సీట్ సంపాదించి..'ఇప్పుడు చెప్పు..' అనగానే.. మొదలు పెట్టాడు..


'మా ఊరు తమిళ నాట ఒక అందమైన చిన్న పల్లె.. ' అని..    నేను.. 'ఆ ఆ.. introduction వద్దు తండ్రీ... పచ్చని చేలూ, ఊరి పక్క పారే కావేట్లో చల్లని నీరూ, నిష్కల్మషమైన హృదయాల తో ఊరి ప్రజలూ, ఇళ్ళ ముందు ముగ్గులూ, .. ' ఇంకా ఏదో అనబోతుంటే..  సింగం మొహం లో ఎక్స్ప్రెషన్ చూసి.. 'సారీ.. చెప్పు చెప్పు ' అన్నాను.


ఊళ్ళో.. వాళ్ళింటి పక్క వారికీ సింగం కుటుంబానికీ భూముల గొడవలు ఉన్నాయిట. అంతగా పడదట. ఈలోగా వీళ్ళ ఇళ్ళ మధ్య కంచె ఏదో నిప్పు అంటుకుని కొంత పార్ట్ కాలిపోయిందిట. మళ్ళీ వేయించే సమయం లో పక్కాయన కాస్త పకడ్బందీ గా  సింగం తండ్రి ఊళ్ళో లేని సమయం లో రెండడుగులు జరిపి కట్టించాడట. సింగం అమ్మ  ఉదయమే లేచి ఈ ఘోరం చూసి గగ్గోలు పెట్టి అరిచి నానా యాగీ చేసి.. పక్కవాళ్ళని శాపనార్థాలు పెట్టినా.. వాళ్ళు వినిపించుకోలేదట...


ఇక వాళ్ల నాన్న ఊర్లోకి రాగానే పెద్ద గొడవ.. కంచె కట్టటం ఆపు చేయించి.. ఊళ్ళో పెద్దమనుషుల్ని పిలిచి గొడవ పెట్టించాడట.  సింగం తండ్రి ఒక సామాజిక వర్గానికి నాయకుడు. ఆయన వెనక మొత్తం కుల సంఘం నిలిచింది. ఇక అవతల పక్కవారి వైపు కౌన్సిలర్ ఉన్నాడట. దానితో.. కాంగ్రెస్ వాళ్ళంతా వెనక నిలిచారట. ఇటు సింగం తండ్రి  DMK మెంబర్. దానితో.. ఆయన వెనక రాజకీయ శక్తులు కూడా వచ్చి చేరాయి.


ఒక పక్క సింగం కి తప్పి పోయిన పెళ్లి సంబంధం వారు ఒకళ్ళు అవతల పక్క  గుంపు లో కలిసారట. వాళ్ళు MLA చుట్టాలు.  ఎలక్షన్ల హడావిడి కూడా ఉందిట ఆ ఊర్లో.. దేనివో..


ఈలోగా.. ఒక DMK అతనికి అవతల పక్క చేరిన కాంగ్రెస్ మనిషి తో ఉన్న పాట కక్ష తీర్చుకోటానికి ఇదే మంచి అవకాశం అని తోచింది. ఇంకేం?  వెంటనే.. దారి కాసి శత్రువులపై కర్రలతో, కత్తులతో దాడి చేసారు.. వాళ్ళూ అప్రమత్తం గానే ఉండటం తో కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు.. అదీ పోలీస్ జీప్ అదే దారిలో వస్తూండటంతో...


దాంతో.. గొడవ పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళిందిట.. సరే.. ఇక ఇంత దూరం వచ్చాక తగ్గేది లేదని.. సపోర్ట్ కోసం కొడుకులకి ఫోన్లు చేసారట.. తల్లి దండ్రులు.. 


 సింగం తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడట. సింగానికి మొదటి నుండీ కోపమెక్కువ.. ఊళ్ళో గొడవల్లో ఇరుక్కుంటుంటే వాళ్ల తల్లిదండ్రులు హాస్టల్ లో పెట్టి చదివించారని చెప్తే..  నాకు కాస్త భయమేసి ఎందుకైనా మంచిదని స్టిఫ్ గా కూర్చున్నాను.   నా పరిస్థితి ని పట్టించుకోకుండా.. సింగ పెరుమాళ్ తన కథ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.





'హమ్మో.. సింగాన్ని చాలా సార్లు డెడ్ లైన్ల గురించి నిలదీయటం, వార్నింగ్ లు ఇవ్వటం.. లాంటివి చేస్తూ ఉంటాను.. టీం లీడ్ గా.. ఇంత బాక్ గ్రౌండ్ ఉందా.. అని కాస్త భయం వేసింది.  ఇంద్ర లో చిరంజీవి లా అజ్ఞాత వాసం గడుపుతున్నాడా? తేడా వస్తే..  తల కాయలు  లేపేస్తాడేమో .. ఎన్ని సార్లు అతనికి కోపం వచ్చి ఉంటుందో.. ఈ పాటికి అని ఒక అంచనా వేయటం లో మునిగిపోయాను.




చిన్న కాలిన కంచె ఊళ్ళో కులాల మధ్య గొడవగా,.. రాజకీయ పార్టీల మధ్య పోరుగా పరిణామం చెందింది.. ఊరు మండుతోందిట.  తండ్రి ఫోన్ చేసినా.. మా ప్రాజెక్ట్ డెడ్ లైన్ వల్ల సింగ పెరుమాళ్ ఊరెళ్ళ లేకపోయాడు. కానీ.. ఈలోగా. గొడవ ఇంకో రూపు దిద్దుకుందిట.



ఉదయం 5 గంటలకి సింగం తండ్రి కాల కృత్యాలు తీర్చుకోవటానికి ఇంటి ఆవరణలో కూలిన కంచె వైపున్న బాత్ రూం వైపు నడుస్తుండగా..  ఏదో తేడా గా అనిపించి కాస్త జాగ్రత్త గా చూస్తే.. ఒక ఎర్రటి చీర..ఒక స్త్రీ శరీరం.. ఆయన కి ఒళ్ళు జలదరించి ఒక్క పరుగులో ఇంట్లోకి చేరి కుటుంబాన్ని లేపారట..  అవతల పార్టీ వాళ్ళు మర్డర్ చేసి శవాన్ని ఇటు పారేసారని భయం వేసి..అందరూ కలిసి వెడదామని లాంతరూ అవీ తీసుకునేలోపల మళ్ళీ ఒక పెద్ద అరుపు వినిపించిందట..  ఏంటా అని చూస్తే.. పక్కావిడ వణుకుతూ ఇంట్లోకి పరిగెట్టటం చూసారట..


నేనూ చాలా ఉత్కంట గా ముందుకు వంగి వింటున్నా..  అందరూ జాగ్రత్త గా వెళ్లి చూస్తే.. ఏమీ లేదుట...  అందరికీ ఇది ఒక మిస్టరీ అయిపొయింది. కంచెకి అవతల వాళ్ళూ, ఇవతల వాళ్ళూ  చర్చల్లో ములిగిపోయారు.. కానీ.. ఎవరు చేసి ఉంటారీ పని? అన్నది తెలుసుకోలేక పోయారు. 


' ఇంక లాభం లేదు .. సింగం .. ఇంటికి రా..' అని పిలుపు తండ్రి నుండి అందుకున్న సింగ పెరుమాళ్ హుటాహుటిన బయల్దేరి ఊరెళ్ళాడట... ఇక్కడి వరకూ  చెప్తూ ఉండగా ఫోన్ మోగిందని మాట్లాడుతున్నాడు సింగం..   ఆ 2 నిమిషాల్లో ఎన్నో ఆలోచనలు నన్ను కమ్మి పారేశాయి..  'అబ్బా.. నా జీవితం ఎంత చప్ప గా ఉంది... అయితే  ఫాక్షన్ సినిమాల్లో చూపించేంత  ట్విస్టులతో జీవితాలు ఉన్న వాళ్ళల్లో ఒకరు నా టీం లో ఉన్నారా.. హెంత అదృష్టం!! సింగం ఊరెళ్ళి మిస్టరీ సాల్వ్ చేసాడా? ఇలాగ..  ఒక్కసారి ఫోన్ లాక్కుని విసిరి గొట్టి.. 'తర్వాత ఏమైంది? ' అని అడుగుదామనుకున్నా.. కానీ.. 'అసలే అజ్ఞాత వాసం లో ఉన్న ఇంద్ర ' లాంటి సింహ అని గుర్తొచ్చి.. ఎదురు చూస్తూ కూర్చున్నా..  


ఈలోగా ఫోన్ కాల్ అయి.. మళ్ళీcontinue చేసాడు సింగం..



సింగం  తల్లికి మంచి నెట్వర్క్ ఉందిట ఊళ్ళో.. ఆవిడ వేగుల ద్వారా సమాచారం సంపాదించింది.. ఏంటయా అంటే..   వీరి దొడ్లో మల్లెలు విరగబూస్తాయట. ఒక కొంటె పిల్లకి మల్లెల పిచ్చిట. తనుండే గుడిసె లో మల్లె తీగ లేదు.. ఎవర్నడిగినా, 'అబ్బే!! మాకే సరిపోవట్లేదు..' అనేస్తున్నారట. ఇలా కాదని ఉదయమే వచ్చి కోసుకుంటోందిట పిచ్చి పిల్ల!!!  సింగం తల్లి ఈ విషయం చెప్పగానే.. అందరూ 'అమ్మయ్య' అని రిలాక్స్ అయిపోయారట.  


సింగం తల్లి .. 'అయ్యో పాపం.. పక్కింటావిడ భయపడింది.. ఆవిడకూ చెప్దాం..' అని అందరూ వారించినా వాళ్ళింటి వైపు కంచె దగ్గరికి చక చకా నడిచిందట.  15 ఏళ్ళుగా భూమి గొడవల కారణాన మాట్లాడటం మానేసినావిడ ఇంట్లోకి తొంగి చూస్తూ 'పార్వతమ్మా.. ' అని పిలుస్తుంటే.. 'పోన్లే ఆడ వాళ్ళని ఆపటం ఎందుకూ '  అని  ఊరుకున్నారట అవతల పక్షం వాళ్ళు. .. ఈ మల్లె పూల దొంగ విషయం చెప్పగానే కంచె కి రెండు పక్కల వాళ్ళూ 'హమ్మయ్య' అనుకుని నవ్వుకుని.. ఒకళ్ళకొకళ్ళు సారీలు చెప్పుకుని కలిసిపోయారుట...


ఓస్ .. ఇంతేనా? నేనేదో.. ఒక Sherlock Holmes లా మా సింగం వెళ్లి మిస్టరీ సాధించాడేమో నని సంబర పడుతుంటే. నెత్తిన చల్లని నీళ్ళు జల్లినట్టైంది..   సరే.. ఏం చేస్తాం.. నా జీవితం లో ఈ మాత్రం మిస్టరీ, గొడవలూ, అజ్ఞాత వాసాలూ లేవు.. ఆ విధం గా నాకు తెలిసిన ఒక్క మనిషి సిమ్గమే కదా అని సద్ది చెప్పుకుంటున్నా..   

సింగం.. కంటిన్యూ చేసాడు..

కానీ కుల సంఘాల వాళ్ళూ, రాజకీయ నాయకులూ, మాత్రం అలాగ మధ్యలో కలిసిపోతే కుదరదు.. అని హెచ్చరిక లు రోజూ..చర్చలు.. మాఅమ్మా వాళ్ళకీ ఏమీ పాలు పోదు. చుట్టాలువెనక్కి తగ్గద్దని ఒకటే ఒత్తిడి.  ఇంటి బయటకి రావాలంటే భయం.. భూమి గొడవ లేదు. కానీ ఊరి గొడవ  పెరిగింది.

'అదిగో ఈ ఒత్తిడి భరించలేక నాలుగు రోజులు తల్లి దండ్రులని తీసుకుని వచ్చాను... అన్నాడు సింగ పెరుమాళ్.. 

'మరి ఇప్పుడు? '  అని అడిగితే 'ఏముంది? నాలుగు రోజులు ఇక్కడే ఉంటారు.ఊరికి వెళ్ళినా గొడవలు తగ్గకపోతే..మాత్రం.. నేను వెళ్లి.. నా పధ్ధతి లో సరిచేస్తాను.. అన్నాడు..  ఎందుకైనా మంచిది.. అని  పధ్ధతి అంటే  ఏంటో అడగలేదు నేను.   

లంచ్ చేసాక క్యూబ్ కి నడుస్తూ.. 'అన్నట్టు ఈ కథ నేను బ్లాగ్ లో రాసుకోవచ్చా? కావాలంటే .. పులి పెరుమాళ్/పులి రాజా.. ఇలాగ మార్చమంటే మారుస్తా.. అని అడిగా.. గట్టిగా నవ్వి.. 'పేరేమీ మార్చక్కరలేదు..రాయి' అని.. 'అన్నట్టు.. కృష్ణాజీ.. నేను కొత్త బగ్స్ ఇచ్చారు రెండు.. తీసుకోలేను..పేరెంట్స్ ని బయటకి తీసుకెళ్ళాలి.. మీరే చేసేస్తారా?' 

అని 'వినమ్రం' గా రిక్వెస్ట్ చేసాడు సింగం..  'అయ్యో.. ఈ మాత్రం దానికినోరు తెరిచి అడగాలా? నో ప్రాబ్లం..నేను చేస్తాను.. ' అనేసాను...  అదేదో.. నాకు ఎంత అదృష్టం పట్టింది? ఆ కొత్త బగ్స్ కూడా సాల్వ్ చేసే అవకాశం వచ్చింది? ' అన్నట్టు ఎక్స్ ప్రెషన్ పెట్టి :-(










Wednesday, June 9, 2010 10 comments

ఈ తెలుగోళ్ళంతా ఇంతే..

' మా తమిళ్ వాళ్ళు ఇంద మాదిరి సేయరి మాడం. కన్నడ, తెలుంగు రొంబ మోసం మాడం ' మా పనమ్మాయి పొద్దున్నే కసి గా అన్న మాటలివి. మేరీ కి తెలుసు నేను తెలుగు దాన్నని. తనకి మా డ్రైవర్ పడడు. అతనికి ఎక్కడ ఎక్కువ అధికారం, చనువు మాతో ఏర్పడతాయో.. ఎక్కడ తను తక్కువవుతుందేమో అని తన బాధ. నాకు నవ్వొచ్చింది. కానీ తను అంత బాధగా చెప్తుంటే.. ఎందుకు లే అని సీరియస్ గానే మొహం పెట్టాను. 'ఎవర్నైనా నమ్మవచ్చు కానీ ఈ అరవ వాళ్ళని నమ్మలేం.. ' అని మరి రోజూ చాలా మంది నోట వింటూ ఉంటాను ఆఫీస్ లో..

తర్వాత ఆఫీసుకొస్తూ ఆలోచిస్తూ ఉన్నాను. తన దగ్గర్నించి ఇలాంటి కామెంట్లు చాలానే విన్నాను ఇంతకుముందు. 'ఎన్ వీటికిట (మా ఇంటి దగ్గర) బ్రాహ్మిన్స్ ఉండారు మాడం.. క్లీన్ గా ఉండరు మాడం. బ్రాహ్మిన్ జాతి ఎల్లా రొంబొ మోసం మాడం..' మళ్ళీ తనే ఇంకో సారి 'ఎన్ వీటికిట బ్రహ్మిన్స్ ఉండారు మాడం.. నల్ల స్వీట్స్ సేస్తండారు. నాన్ తీసుకువస్తాన్ ' అనేది. బ్రాహ్మలూ, మిగిలిన వాళ్ళని శుభ్రం లేదనీ, అదనీ అనుకోవటం నాకు బాగానే తెలుసు.


ఈ విషయం మీద బ్లాగాలని అనుకుంటూ ఉన్నాను. మా ఆఫీస్ లో శ్రీను వచ్చి.. 'మా ఇంటి వాళ్ళు తెగ గొడవ పెడుతున్నారండీ.. కన్నడ గౌళ్ళు కదా గీరెక్కువ!! ' అన్నాడు. నేను.. 'కన్నడ గౌళ్ళు కాకుండా పంజాబీలో, హర్యానా జట్ లో, లేక తెలుగు రెడ్లో, తమిళ బ్రాహ్మలో అయితే గీర ఉండదంటారా? ' అన్నాను నవ్వుతూ.. దానికి శీను.. 'నీ దగ్గర అంటే ఇలా అంటావని నాకు తెలుసు కృష్ణా..' అని టాపిక్ మార్చేసాడు.

అందరూ ప్రపంచం లో తమ ఐడెంటిటీ తప్ప వేరే వన్నీ.. చాలా చెత్తవనీ.. వాళ్ళు అపరిశుభ్రం గా, అచేతనం గా, గ్యాంగు కట్టి, క్రూరం గా లేక కల్మషం గా, క్రుకెడ్ గా, తేనె పూసిన కత్తి లా అలాగ నానా రకాల అవలక్షణాలతో ఉంటారని అనుకుంటారనుకుంటా.

మా తోటి కోడలి వరస ఒకమ్మాయి గుంటూరు పిల్ల. తను 'మా అక్క వాళ్ళ అత్తగారూ వాళ్ళు గోదావరి జిల్లాల వాళ్ళని తెలియక పెళ్ళి చేసారు మా అమ్మావాళ్ళు. అమ్మో వాళ్ళు తేనె పూసిన కత్తులు, ఇప్పటికీ బాధ పడతారు మా పేరెంట్స్ ' అంది. మా చిన్నప్పుడు మేము పెరిగిన కరీం నగర్ లోనూ, మా పెద్దమ్మగారి ఊర్లోనూ.. 'అమ్మో గుంటూరు వాళ్ళు అతి తెలివి వాళ్ళు.. ' అనటం విని నిజమేమో అనుకుంటూ ఉండేదాన్ని.. నెమ్మదిగా అర్థమైంది అందరూ మిగిలిన వాళ్ళందరినీ అలాగే అనుకుంటారని...

మొన్నీ మధ్య మా ఆఫీస్ లో ఎవరో చెప్తున్నారు. 'ఫలానా కాస్ట్ వాళ్ళు అంతే.. వాళ్ళ హీరోల సినిమాలే చూస్తారు .. వాళ్ళ పిల్లలకి వేరే కాస్ట్ హీరోల పాటలు హం చేసినా,డాన్స్ చేసినా.. తప్పమ్మా. మనం వాళ్ళ సినిమాలు చూడకూడదు.. మన హీరోలు వీరే.. అని చెప్తారు. ' అని. దానికి ఇంకొకరు 'అయ్యో మీకు తెలియదేమో.. ఫలానా కాస్ట్ వాళ్ళు అయితే.. స్వాతంత్ర్య సమర యోధుల్లో కూడా.. నేషనల్ లెవెల్ లో ఫలానా వాళ్ళని మాత్రమే ఆరాధిస్తారు..' అని వాళ్ళ అభిప్రాయం చెప్పారు.

'చా.. మరీ చెప్తారు మీరు..' అంటే.. మీరు గమనించి చూడండి.. ఈసారి అని చెప్పారు.
జాతీయ లెవెల్లో, సింధీలా.. అమ్మో.. భాంగ్స్ లతో పెట్టుకోకూడదు .. మల్లూస్ తో మనకెందుకు? మార్వాడీల్లా ఏంటి ఈ లెక్కలు? గుజ్జూలింతా ఇంతే.. సౌత్ అంతా పిసినారులు, నార్త్ వాళ్ళకి ఆర్భాటం ఎక్కువ, విషయం తక్కువ.. ..

మేము చదువుకున్నప్పుడు మా స్నేహితులు ఏ ప్రాంతమో అంతగా పట్టించుకోలేదు ఎప్పుడూ...ఆవిధం గా మా ఇంట్లో ఒకళ్ళు గోదావరి జిల్లాలు, ఒకళ్ళు తెలంగాణ, వేరొకళ్ళు అనంతపురం, ఇంకా గట్టి గా మాట్లాడితే కజిన్లు పెళ్ళి చేసుకున్నవాళ్ళల్లో బెంగాలీలు, బీహారీలు, మరాఠీ వారు, చైనీయులు, తెల్లవారు కూడా ఉన్నారు.

గమ్మత్తేంటంటే.. మాకు తెలిసిన పెద్దమనిషి రోజుకి ఒకసారైనా అనకుండా ఉండరు..
మహాత్మా గాంధీ అన్నారు.. 'మంచీ,చెడూ, ఏ ఒక్క జాతి లక్షణాలు కావు.. ఎల్లపుడూ మన మనసు కిటికీలు తెరిచే ఉంచుకోవాలి.. అని. '

ఆయన ఈ విషయం మనస్పూర్థిగా నమ్మి ఆచరించటానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తారు.. కానీ.. ఆయన నోటి నుండే.. చాలా సార్లు 'ఫలానా ప్రాతం,కులం,మతం వారికి ఫలానా .. గుణం ఎక్కువ.. వాళ్ళని భరించలేం' అనీ అంటూనే ఉంటారు.

చెప్పడం కన్నా ఆచరించటం ఎంత కష్టమో తెలుస్తుంది.. ఆయన మాటల్ని వింటుంటే..

మా ఆరేళ్ళ అమ్మాయి వచ్చి.. ' కార్నర్ ఇంట్లో ముస్లింస్ వచ్చారమ్మా.. వాళ్ళతో జాగ్రత్త గా ఉండాలట అని చెప్పింది మొన్నీ మధ్య. అప్పుడు 'అలా అనకూడదు.. నీకేం తెలుసని అలా అన్నావ్? తప్పు ' అని వదిలేసాను. ఈరోజు.. ఇంటికెళ్ళాక దానికి ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా ఎలా వివరించాలా అని ఆలోచనలో పడ్డాను..

మా బాస్ చూసాడంటే.. 'అమ్మా.. ఆఫీస్ విషయాలు కూడా కాస్త ఆలోచించు తల్లీ..' అంటాడు.. మళ్ళీ వారాంతం లో రాస్తాను.. సెలవు!
Monday, May 24, 2010 4 comments

'నిక్కీ ' నూకాలమ్మ..

మా స్నేహితురాలు పద్మిని ఫోన్.. ' విస్సుగ్గా ఉంది.. మీ ఇంటికి వస్తున్నాం.. భోజనానికి.. ఏర్పాట్లు చేసుకో' అని.

పద్మినికీ,నాకూ 20 యేళ్ళ స్నేహం. దానికి ఇద్దరు పిల్లలు. కవలలవటం,కాస్త పీల గా పుట్టటం, ఏదో ఒక అనారోగ్యం వల్ల అక్కడ తమ వల్ల కావట్లేదని.. భార్యా భర్తలూ ఉద్యోగాలకి రిజైన్ చేసి వాళ్ళ సామాన్లు షిప్ చేయించి మరీ కాలిఫోర్నియా నుండి బెంగుళూరు విమానమెక్కేసారు. రెండేళ్ళతర్వాత మళ్ళీ వెళ్తాం. ఇప్పటికి ఇండియాలో అయితే.. పనిమనుషులని పెట్టుకోవచ్చు.. తల్లీ దండ్రీ, అత్తా మామల సహకారం,సహాయం ఉంటాయని..

పద్మిని కి గుండె కొట్టుకోకపోయినా.. నడుస్తుంది కానీ.. ఉద్యోగం లేకపోతే మాత్రం గడవదు. అమెరికన్ సిటిజెన్ షిప్ ఉంది. బెంగుళూరు కి వచ్చాక వాళ్ళమ్మగారికి పరాలిసిస్ వచ్చిందిట. మామగారికి రక్తపుపోటు ఎక్కువైంది అని గుండె జబ్బనీ.. ఇల్లు కదలటం లేదట. మరి పాపం.. ఎలా నడుపుకొస్తుందో.. నెలల పిల్లలనీ, విడవలేని ఉద్యోగాన్నీ.. అనుకుంటూ వంట ప్రయత్నం లో పడ్డాను.

ఇంటిముందు ఇన్నోవా ఆగింది. ఆత్రం గా ఎదురెళ్ళిన నాకు ఆనందంగా, అప్పుడే బ్యూటీ పార్లర్ నుండి దిగివచ్చినట్టుగా పద్మిని స్మార్ట్ గా దిగింది. వెనగ్గా ఒక పిల్లవాడ్ని తీసుకుని దాని భర్త రవి. ఇంకోడేడి? అని ఆశ్చర్యపడుతుంటే వెనక ఇంకో పిల్ల దిగింది బాబుని ఒకచేత్తో, డైపర్ బాగుని ఇంకో చేత్తో తీసుకుని. ఈ అమ్మాయెవరా అనుకుంటూ ఇంట్లోకి ఆహ్వానించాను.

పిల్ల నల్లగా ఉన్నా కళగా ఉంది. ఒక పదేళ్ళుంటాయి. అంత చిన్న పిల్లలు ఐబ్రోలు చేయించుకోవటం చూడటం నేను అదే మొదలు. షాంపూ చేసిన జుట్టు బాండ్ పెట్టి వదిలేసింది. మొహానికి పౌడర్, గోళ్ళకి రంగు. లేత రంగు సల్వార్ కమీజ్. కొద్దిగా పెద్ద దానిలా కనపడాలన్న ప్రయత్నం కనిపిస్తోంది.

లోపలకెళ్ళాక పద్మిని చెప్పింది. వాళ్ళ పుట్టింటి దగ్గర కూలీల పిల్లట. తండ్రికి 10,000 రూపాయలిచ్చి తెచ్చుకుందిట. రెండు నెలలకొకసారి ఐదువేలు ఇస్తాం అందిట. వాడు తాగుబోతు. తల్లి వద్దని గొడవ పెడుతున్నా వినకుండా పంపేసాడట. నాకు చాలా కోపం వచ్చింది. 'ఇదేం పిచ్చి పని? చదువుకోవలసిన పిల్లని పనిలో వాళ్ళు పెట్టారు సరే. అమెరికాలో ఎం ఎస్ చేసావు.. నువ్వు డబ్బిచ్చి తెచ్చుకోవటం తప్పనిపించలేదా? పాలు కారే ప్రాయం.. పైగా ఇది చట్టం దృష్టి లో నేరం కూడా ' అని కసిరాను.

'నీకేం? ఎన్నయినా చెప్తావు... మీ అత్తగారు ఇంట్లో ఉంది. పిల్లలకి ఇంటిపక్కన పిల్లల స్కూలు, ఆఫీస్.. అందరికీ అలా కుదుర్తుందా? అయినా నేను తీసుకెళ్ళకపోతే ఇంకోళ్ళు తీసుకెళ్తారు. దానికి వాళ్ళెవరి దగ్గరో ఉండేకన్నా నా దగ్గర పని చేస్తేనే భద్రతా.. సుఖం' అంది.

' ఏమో.. నాకయితే నచ్చలేదు నువ్వు చేసిన పని. ఐ ఆం డిసపాయింటెడ్ ఇన్ యూ ' అన్నాను, తల అడ్డం గా ఊపుతూ.

'నువ్వు అంత బాధ పడిపోతావెందుకు? నేను ఆఫీస్ నుండి వచ్చాక దాన్ని కూర్చోపెట్టి చదువు చెప్తాను కదా.. అయినా ఈ విషయంలో నీకేంటి సంబంధం? దాన్ని చూడు.. జిడ్డోడిపోతూ ఉండేది. దాని దగ్గర్నుంచి భరించలేని వాసన ఉండేది. నేను వారం రోజులు దాన్ని స్టెర్లైజ్ చేయించి, బాడీ, జుట్టు ట్రీట్ చేయించి.. ఆ మురికి వదిల్చాను. మొహం లో కళ రావటానికి రోజూ,పాలూ, జ్యూసులూ కూరలూ ఎన్ని పెడుతున్నానో..' అంది.

'ఆ పిల్ల ఏమైనా కోడిపెట్టా? మేపటానికి, రుద్ది కడగటానికి? నువ్వు కాబట్టి వాదిస్తున్నాను. అదే ఇంకెవరైనా అయితే.. ఈపాటికి పోలీస్ కంప్లైంట్ చేసేదాన్ని.. ఇంతకీ పాప పేరేంటి?' అన్నాను.

' నిక్కీ. అసలు పేరు నూకాలమ్మ అనుకో, నేనే 'నిఖిత గా మార్చేసాను. ఇదిగో నిక్కీ.. కం హియర్.. ' అంది. ఆ అమ్మాయి నెల రోజులకే.. చాలా ఫాషన్ గా, స్టయిల్ గా తయారయినట్టుంది. ' యెస్ ఆంటీ.. ' అంది. ఇద్దరు పిల్లలకీ అన్నం పెట్టి, వాళ్ళ డైపర్లు మార్చి బజ్జోపెట్టి.. ఇలాంటి పనులు చేయటానికి ఇబ్బంది పడటం నేను చూస్తూ ఉండిపోయాను.

తర్వాత రెండు మూడు సార్లు కనపడ్డారు వాళ్ళు. 'నిక్కీ బొద్దుగా తయారయి నిగారింపు వచ్చింది. స్టైల్ కూడా హెచ్చింది. మాట తీరు మారింది. బొత్తిగా టీవీల్లో ఆంకర్లల్లా గా తెలుగు.. సగానికి పైగా ఆంగ్ల పదాలు. చదువెంత వరకూ వచ్చిందని అడిగితే.. 'పద్మిని ఆంటీ చదివిస్తానన్నారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదాంటీ.. ' అంది అప్పచెప్పినట్టు గా.


కాస్త తెరిపి గా ఉండటం తో పద్మిని మనసు మళ్ళీ అమెరికాకి మళ్ళింది. నిక్కీని తీసుకువెళ్తానంది. 'క్రైం కూడా అది. దాన్ని హాస్టెల్ లో చేర్పించు. ఇంకో పెద్దావిడని వెతుక్కో' అని చిలక్కి చెప్పినట్టు చెప్పినా వినలేదు పద్మిని. పాస్పోర్ట్ తయారు చేయిస్తోందని విన్నాను. చేయగలిగింది లేక నిట్టూర్చాను.

ఒకసారి తెలిసింది.. నిక్కీ తల్లి చనిపోయిందని. ఆ అమ్మాయి ఊరెళ్ళిందని. పద్మిని అమెరికా వెళ్ళిపోతోంది 3-4 రోజుల్లో అని ఒకసారి చూసి రావాలని వెళ్ళాను. పద్మిని తల్లిదండ్రులు ఉన్నారు పిల్లల్ని ఆడిస్తూ.. కాస్త కబుర్లూ,కాకరకాయలూ అయ్యాక.. 'నిక్కీ ఏది? పాపం వాళ్ళమ్మ పోయిందిట ఈ మధ్య?.. దానికి ఏం వీసా తీసుకున్నారు? ' అని అడిగాను.

అందరూ మొహాలు ముడుచుకున్నారు. పద్మిని ముందుగా తేరుకుని.. 'నువ్వు చెప్పింది నిజం కృష్ణా.. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా.. లాగా అలగా జనాలకి అలగా బుద్ధి ఎక్కడికి పోతుంది? వాళ్ళమ్మ పోయినప్పుడు.. మరీ చెత్త చెత్త గా ఏడ్చి యాగీ చేసి శోకణ్ణాలు పెట్టింది. దాన్ని చూస్తే అసహ్యం వేసింది.. దానికి చెప్పలేదు.. మీ నాన్నని చూసిరా అని పంపాము. అది ఆదివారం వస్తుంది. శనివారమే మేము వెళ్ళిపోతాం.' అంది.

షాకింగ్ గా అనిపించింది. 'నేను అన్నది అదా? ఆ పాపని మోసం చేసి వెళ్ళిపోతారా? హాయిగా మట్టిలో ఆడుకుంటూ.. అంట్లూ అవీ తోమటానికెళ్ళినా ప్రభుత్వ పాఠశాలకి వెళ్తూ,.. ఆడుకునే ప్రాణాన్ని తీసుకొచ్చి..నాగరికత నేర్పి.. సున్నితం గా తయారు చేసి.. ఇప్పుడు గాలికి వదిలేస్తారా? ఎంత క్రూరత్వం? ' అని అనుకున్నాను.

'పోనీ.. నీకు కావాలా? నీ పిల్లల పనులు చేసి పెడుతుంది..నువ్వూ హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు ' అంది. ఒక్కసారి చురుగ్గా సీరియస్ గా చూసేటప్పటికి ' కృష్ణ పెద్ద సంఘ సంస్కర్త.. తను అసలు జీవితం లో ఒక్క రూల్ కూడా బ్రేక్ చేయలేదు. మనం మాత్రం నీతీ, నియమం లేని జనాలం. ' అంది వ్యంగ్యంగా.

ఏమీ అనకుండా కాసేపు కూర్చుని 'బై' చెప్పి బయట పడ్డాము. చాలా రోజులు నాకు నూకాలమ్మ గుర్తుకొచ్చేది. అసహనం గా ఉండేది. పోనీ..పద్మిని అన్నట్టు తీసుకురావాల్సింది ఇంటికి.. నేను ఎక్కడైనా చేర్పించాల్సింది అని చాలా మదనపడ్డాను.

హైదరాబాద్ కెళ్ళినప్పుడు.. పద్మిని తల్లిగారింటికి వెళ్ళి చూసాను.. అపార్ట్ మెంట్ కట్టటం ఆల్ మోస్ట్ అయిపోయింది. వెళ్ళి అడిగాను.. 'నూకాలమ్మ ఉందా? ' అని. 'ఏమ్మా? తీస్కబోయి కన్ బొమ్మల్ గొరిగించాలనుకున్న్నవా? పో.. మీగసుంటోళ్ళవల్లనే బిడ్డ ఏమిట్కీ గాకపాయె.. మంచిగున్నది ఇప్పుడు.. గింక ఇటుసంది వస్తె మంచిగుండదు పో..పో ' అంది ఒకావిడ. అక్కడున్న బాల కార్మికుల్లో నూకాలమ్మ ఎక్కడుందో తెలియలేదు. నిట్టూర్చి స్కూటీ వెనక్కి తిప్పాము.
Sunday, May 16, 2010 15 comments

ప్రియ కొడుకు IIT

మా మేనత్త కూతురు ప్రియ నాకు చిన్నప్పట్నించీ ఇష్టం. ప్రతి వేసవి సెలవల్లో తప్పని సరిగా కలిసేవాళ్ళం. 30 యేళ్ళ స్నేహం మాది. ఏమే అని పిలుచుకునే చనువూ, తప్పు చేస్తే మందలించే చొరవా.. కోపగించుకుని అరుచుకునే దగ్గరతనం మాకు ఉన్నాయి.

కాకపోతే.. మా అత్త పాతకాలపు మనిషి. ప్రియ కి పద్ధెనిమిదవ ఏడు వస్తూనే పెళ్ళి చేసేసింది. ఎవరెంత చెప్పినా వినలేదు. ప్రియ డిప్లోమో చేసి.. ఇంకా చదువుదామనుకున్నా.. మా అత్త పడనీయలేదు. దానికి చదువు పిచ్చి తీరలేదు. భర్త సహకరించినా.. అత్తింట్లో పరిస్థితులు సహకరించకపోవటం తో తన చదువు కొనసాగించలేకపోయింది.

పైగా పెళ్ళయి ఏడాది తిరక్కుండానే కొడుకు. వాడి ఆలనా పాలన తోనే దానికి గడిచిపోయింది. నా పిల్లలు ఇంకా మిడిల్ స్కూల్ రాలేదు. దాని కొడుకు అప్పుడే ఐ ఐ టి లో ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం లో కొచ్చేసాడు. చెప్పటానికి ఈజీ గానే ఉంది కానీ.. అది పడిన కష్టం, వాడిని పెట్టిన హింస మాటల్లో చెప్పలేనిది.

చిన్నప్పట్నించీ.. వాడికి చదువు తప్ప వేరే వ్యాపకాల్లేవు. ఒక చుట్టం, పక్కం తెలియదు. అహర్నిశలూ చదువు. వాడి ఆటపాటల్లో కూడా నోటి లెక్కలూ, భాష, విజ్ఞానాన్ని పెంపొందించే ఆటలే. వాడికి చెస్, స్క్రాబుల్, క్రాస్ వర్డ్, లాంటి ఆటలు తప్ప బాట్మింటన్,క్రికెట్ లాంటివి అలవాటు చేయలేదు.

ఏ విషయం లో నైనా.. మా మాట వినేది కానీ.. కొడుకు విషయం లో సాక్షాత్తూ ఆ దేవుడు దిగి వచ్చినా తన పంతమే నెగ్గేలా చూసుకునేది. మేము కూడా చెప్పి చెప్పి అలిసిపోయాం. గమ్మత్తేంటంటే.. దాన్ని చూసి 'ఇదేంటీ అనుకున్న నేను.. దాని లాంటి వందలాది తల్లిదండ్రులని చూసి ఆశ్చర్యపోయాను. పేపర్లో చదువుతూనే ఉన్నాం కదా .. సీట్ రాని వాళ్ళ ఆత్మహత్యా ప్రయత్నాలూ, చదువు పేరుతో దిప్రెషన్ లోకి దిగిన వాళ్ళూ,.. వేలాది మంది..


అయితే వాడు సహజం గా తెలివైన వాడే..పైగా..తల్లి ఆశయం పట్ల నిబద్ధత కల్గిన వాడు, బుద్ధిమంతుడూ..
వాడిని దాని ఆశయానికి తగ్గట్టు ఐ ఐ టి లో సీటే ధ్యేయం గా పెట్టుకున్న స్కూల్లో ఎనిమిదవ తరగతి నుండీ.. వేసింది. వాడు నిన్నటి పువ్వులా.. వడిలిపోయాడు. కళ్ళల్లో తేజం పోయి.. ముఖం నీరసపడి డల్ గా తయారయ్యాడు.

ఆరా తీస్తే తేలిందేంటంటే... ఉదయం 5 కొట్టే 15 నిమిషాల ముందే లేస్తాడట. పదిహేను నిమిషాల్లో తెమిలి గ్లాస్ పాలు తాగి ఆటో ఎక్కుతాడట. 5.30 నుండీ 7.30 దాకా ఐ ఐ టి కోచింగ్. ఎనిమిది కి ఇంటికి వచ్చి స్నాన పానాదులూ, బ్రేక్ ఫాస్టూ కానిచ్చి స్కూల్ కి పరుగు.

స్కూల్ నుండి 3.45 కి రాగానే.. చక చకా బట్టలు మార్చుకుని పెట్టింది తిని.. ఇంకో ఆటోలో ఇంకో కోచింగ్ సెంటర్ కి పయనం. అలా వెళ్ళినవాడు 8 కి ఇంటికి తోటకూర కాడ లా నీరసం గా ఇంటికి రావడం. అప్పుడే తిండీ, స్కూలు పనీ,నిద్రా.. ఇది చాలదన్నట్టు ప్రతి శనివారమూ ప్రాక్టీస్ టెస్టులు!!!

స్కూల్లో ఎలాగూ ఐ ఐ టీ కి కూడా చెప్తున్నారు గా..ఇంకా వాడికి మళ్ళీ బయట ఎందుకు అంటే.. 'నీకు తెలియదే.. చుక్కా రామయ్య దగ్గర సీటు దొరకాలంటే ఇక్కడ రెండేళ్ళు రుబ్బితే కానీ కుదరదు ' అంది.

అసలు ఈ కోచింగ్ కోసం పెట్టిన ఎంట్రన్స్ లో వాడికి రెండవ రాంకు వచ్చిందిట. వాళ్ళు మొదటి రాంకు వాడికి పూర్తి ఫీస్ రాయితీ.. రెండవ రాంకు వాడికి 50% రాయితీ.. మూడవ రాంకు వాడికి 25 % రాయితీ ఇచ్చాడట.

ఇక్కడ ఇంటర్ లో చుక్కా రామయ్య దగ్గర సీట్ కోసం కోచింగ్ ట. 'అబ్బో ' అనుకున్నాను. ఇంట్లో టీ వీ తీసేసారు. ఫోనూ పీకేసారు. పేపర్ తప్ప వేరే వినోదం లేదు వాళ్ళ జీవితం లో.

వాడు మాకు నాలుగేళ్ళు కనపడలేదు. అఫ్ కోర్స్.. ప్రియ కూడా కనపడలేదనుకోండి.

ఈ నాలుగేళ్ళ కఠోర దీక్ష కి ఫలితం వచ్చిన రోజున.. వాళ్ళు పడ్డ వత్తిడి ని చూసి నాకు భయం వేసింది. ఎందుకయినా మంచిదని వాళ్ళ ఇంటి బయట కాపు కాయమని (పిల్లాడు ఒకవేళ అఘాయిత్యానికి తలపడితే?).. మా డ్రైవర్ కి చెప్పాను. రిజల్ట్ వచ్చింది. మూడు వేలకి పైన వచ్చింది. ప్రియ ఏడుపు, శాపనార్థాలు.

వాడు చిన్నబుచ్చుకున్నాడు. ఇంటి బయట పడ్డాడు. వాడి వెంట కాస్త దూరం లో నీడలా మా డ్రైవర్ రెడ్డి.

బోల్డు ఐఐటీలు పెట్టటం వల్ల వాడికి సీటైతే వచ్చింది కానీ కోరుకున్న బ్రాంచ్ కాదు. వాడికి నాలుగేళ్ళ ఎగ్జైల్ తర్వాత మనుషుల్లో పడటానికి చాలా కాలం పట్టింది. ఐఐటీలో మూవీ క్లబ్ కి సెక్రెటరీ. కల్చరల్ వింగ్ కి ప్రెసిడెంట్ అవటానికి ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఊహించుకోండి..

ట్రెక్కింగ్, బైకింగ్, స్పీచుల్లో,డ్రామాల్లో అన్నింటిలోనూ వాడే. అదీకాక వాడి దగ్గర వందల MP3 లు. scribd లో డవున్లోడ్ చేసిన పుస్తకాలూ, torrent లో తీసిన సినిమాలూ,.. ఉన్నాయంటే.. వాటితో పాటూ ఒకటి రెండు 'F' లు కూడా చేరాయని.. ప్రత్యేకం గా చెప్పనవసరం లేదనుకుంటాను?

వాడు ఇంటికి వస్తున్నాడని తెలిసి కలవటానికి వెళ్ళాను.,.

జ్వరం తో సెలవలకొచ్చిన వాడిని ప్రియ.. గ్రేడుల విషయం లో నిలదీసి అడిగింది. చదువు తప్ప మిగిలినవి వదలమని వార్నింగ్ ఇచ్చింది. కానీ వాడు చూసిన ఒక్క చూపు లో కనపడిన నిరసనకి భయపడింది. మౌనం గా రెండు క్షణాలు తీక్షణం గా తల్లి వంక చూసి..

'కృష్ణత్తా! మొన్న అడిగావు కదా.. ఐఐటీ లో సీట్ వచ్చినందుకు ఏది కావాలన్నా ఇస్తానని?' అన్నాడు. 'అఫ్ కోర్స్! అడుగు..' అన్నాను ఉత్సాహంగా.. 'నీ పిల్లల్ని ఐఐటీ కి పంపించకు.. పంపినా ఏళ్ళతరబడీ వాళ్ళను హింసించకు ' అన్నాడు. ఎవ్వరం ఏమీ మాట్లాడలేకపోయాం....
Monday, May 10, 2010 7 comments

సూర్యోదయం..

'రే...య్'.. 'వీళ్ళమీదెవ్వండ్రా.. కంప్లైంట్ జేసిన్రంట.. కాల్లు జేతుల్ దీసి నజ్రానా పంపిస్త..' అని వెనక్కెళ్తూ ' మీ బిడ్డ నేనా ఈమె? మస్తుగుంది.. మంచిగ చదూకో బిడ్డా.. మీ అమ్మ నాన్న తెలివైనోళ్ళు.. నీకు ఏం కష్టం కల్గకుండ చూస్కుంటరు.. ' అని కూతురిని చూస్తూ విలన్లు వెళ్తున్నారు.. చిరాకేసి చానెల్ మార్చేసాను.

మనస్సంతా కాస్త అలజడి గా అనిపించింది. నేనేమో బెంగుళూరు లో కూర్చున్నాను. మా చెల్లెలూ, తమ్ముడూ వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళ ఊర్లల్లో బిజీ. ఈ మధ్య మా అమ్మా నాన్నా వాళ్ళకి ఒక కష్టం వచ్చింది..

20 యేళ్ళ క్రితం కట్టుకున్న చిన్న మాడెస్ట్ రెండు బెడ్ రూముల ఇల్లు మాది. ఇంటి ముందూ, వెనకా.. కాస్త జాగా వదిలి అన్ని రకాల మొక్కలూ, చెట్లూ వేసి పెంచటం మా తల్లి దండ్రులకి ఒక హాబీ.. అనే కన్నా ఒక passion అనటం సబబేమో...

ఇప్పుడో? చుట్టూ పెద్ద పెద్ద భవనాలతో.. సూర్యోదయం చూడనే లేరు మా అమ్మావాళ్ళు...

మా కాలనీ కి ఒక పక్కంతా.. చిన్న చిన్న ఇళ్ళవాళ్ళ వాళ్ళు. పిండి గిర్నీ, చిల్లర కొట్టూ,మిషను, లాంటివి పెట్టుకున్న దిగువ మధ్య తరగతి వాళ్ళుంటారు. మొదట్నించీ.. నా స్నేహితులంతా.. మా కాలనీ వాళ్ళే ఉండేవాళ్ళు. మా అమ్మా,నాన్నగారు అందరితో కలివిడి గా ఉంటారు.

వాళ్ళు ఎప్పుడెళ్ళినా.. ఇంటికి.. 'ఒక 30 లక్షలిస్తరా నీకు? ఎంత దాచినవ్? బిడ్డలకు ఏం చేయించనవ్? కొడుకు లేకపాయ్.. ఏం లాభం? ఆడ పిల్లలు మీరు పెద్దగయినంక చూస్తరా? ' లాంటి ప్రశ్నలతో విసిగించటం.. 'మా శీనుకి ఉద్యోగం ఇప్పించరాదా?' అని అడగటం.. నేను ముభావం గా..తప్పించుకుంటాను...

ఆరోజుల్లో అయితే ఊరవతల కాబట్టి ఆ మాత్రం ఇల్లు కొనగలిగారు. రిటైర్ అయి కాస్త స్థిమితం గా ఉన్నారు... అయితే ఇంటికి వెనక ఒక్క అడుగు వదిలి అపార్ట్ మెంట్ కట్టారు, అదీ అన్ని నిబంధనల్నీ ఉల్లంఘించి. కట్టేటప్పుడు మా వెనక గోడ కూల్చి వాళ్ళ పనులు చేసుకున్నారు.

తర్వాత.. మా అమ్మగారు ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నప్పుడు.. ముందుగా చెప్పకుండా.. 4 అడుగులు ముందుకి జరిపి గోడ కట్టటం మొదలు పెట్టారు. మా అమ్మ వెళ్తే ఏముంది? 10 మంది నుంచుని.. ఎంత గొడవ చేసినా.. ఒక్క మాట అనకుండా/వినకుండా.. పట్టించుకోకుండా ఆక్రమిచేసారు. చేసేదేమీ లేక ఊరుకుండిపోయారు.

ఇదంతా 4 యేళ్ళ క్రింద సంగతి.ఈ మధ్య తేలిందేంటంటే.. వాళ్ళు కనీస ప్రమాణాలతో డ్రైనేజ్ ఇవ్వలేదని.. 5 అంతస్థుల భవనం లోంచి డ్రైనేజ్ నీరంతా.. నేల లోకి వదిలేసారు. పైపుల్లాంటి ఏవీ పెట్టకుండా ఒక 20 వేలు ఆదా చేసినట్టున్నాడు బిల్డర్. ఇక మా వెనక దొడ్డిలోకి డ్రైనేజ్ నీరు పొంగటం మొదలయ్యింది.

కంగారు పడి మా తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ నివసించే వాళ్ళకి చెప్పుకుంటే.. మొదట చూస్తాం చేస్తాం అన్న పెద్దలు.. వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని.. పూర్తిగా వీళ్ళని ఇగ్నోర్ చేయటం మొదలు పెట్టారు.మా అమ్మా నాన్నలు.. తలలు పట్టుకుని కూర్చున్నారు. నెమ్మది గా చెప్తే వినటం లేదు. అని వాళ్ళ పార్కింగ్ దగ్గర అమ్మ, ప్రతి తలుపూ తట్టి మా నాన్నగారు అడిగినా.. మాకు తెలియదు అని మొహాల మీద తలుపులేయటం, అసలేమీ వినబడనట్టు వెళ్ళిపోవటం..

ఈలోగా డ్రైనేజ్ నీరు మా మేడ మెట్ల దగ్గర కారి దుర్గంధ పూరితం కాసాగింది.వారం దాటుతోంది.. ఎవ్వరూ ఏమీ చేయరు. ఈలోగా.. మాకు తెలిసిన బిల్డర్ ని అడిగాము మేము. అతను నాకు చిన్నప్పుడు క్లాస్ మేట్ కూడా. అతను కాస్త మధ్యవర్తిత్వం చేసినట్టు హడావిడి చేసి.. 4 రోజుల్లో చేసేస్తారు పని. అని వెళ్ళిపోయాడు.

నేను అతనికి ఫోన్ చేసి అడిగితే.. 'వాళ్ళతో నెమ్మది గా పనిచేయించుకోవాలి కానీ మీ అమ్మా వాళ్ళు గట్టిగా అరుస్తారు. అదే వాళ్ళ కోపం. వాళు తిరిగి మీదకొస్తే.. మీకే కష్టం... బిల్డర్ నాకు సంబంధం లేదు అన్నాడు. ఇప్పుడు మనం అరిస్తే లాభం లేదు. తెలివి గా చేయించుకోవాలి. వాళ్ళల్లో ఎవరూ డబ్బు ఖర్చు పెట్టటానికి సిద్ధం గా లేరు.. ' అన్నాడు. నాకు అర్థం అయింది. తప్పించుకుంటున్నాడని.

మా అమ్మా వాళ్ళు ఇంక ఇలాకాదని.. 'ఒక్క రోజు ఇస్తున్నాం. ఈలోగా ఏమీ చేయకపోతే.. మునిసిపల్ కౌన్సిలర్ దగ్గర పిర్యాదు చేస్తాం' అని రెసిడెంట్స్ కి వార్నింగ్ ఇచ్చారు. నాకేమో భయం. 'పోనీ.. మనమే కట్టించేద్దామా? లేని పోని గొడవలెందుకు?' అన్నాను.. మా అమ్మా వాళ్ళతో...

'ఇంత భయస్తురాలివనుకోలేదు.. మన ప్రాథమిక హక్కు గురించి పోరాడుతుంటే.. ఇంత టెన్షన్ పడుతున్నావు? మేము ఏదో ఒకటి చేస్తాం.. ఈ తరం వాళ్ళు.. హుహ్.. ' అని ఫోన్ పెట్టేసింది. మా నాన్నగారికి చేస్తే.. ' మేము చేతనయినది చేసుకుంటాము. నువ్వు మాకు సహాయం చేయనక్కరలేదు.. పిరికి మందు నూరి పోయకు ' అన్నారు.చేయగలిగేది లేక ఊరుకున్నాను.

ఈలోగా.. ఆఫీస్ లో పెద్ద ఎమెర్జెన్సీ.. తిండీ, నిద్రా లేకుండా వారం రోజులు పని చేసాం.. తర్వాత మాకు హైదరాబాద్ ప్రయాణం.. ఇంక ఈ సమస్య గురించి గిల్టీ గా అనిపించి.. అడగలేదు. హైదరాబాద్ లో ఇంట్లో దిగగానే.. నాకు భయం గా బరువుగా.. ఏమైందో అని.. మా అమ్మావాళ్ళు ఆనందం గా మాట్లాడుతున్నారు.

తెల్లవారుతోంది...

నేను నెమ్మదిగా వెనక వైపుకి వచ్చి చూసాను.. అంతా నీట్ గా ఉంది.'నాన్నగారూ.. ' అనగానే చిరునవ్వుతో ఇద్దరూ చెప్పారు. మునిసిపల్ కౌన్సిలర్ కీ.. బిల్డర్ కీ కూడా ఏముందో.. వెళ్ళి పిర్యాదు చేసినా.. లాభం లేకపోయిందిట.చుట్టుపక్కల చిన్న చిన్న ఇళ్ళ వాళ్ళని ఒక 10 మందిని తీసుకెళ్ళి మా అమ్మావాళ్ళు ధర్నా చేసారుట. అపార్ట్ మెంట్ ముందు. అదే రోజు వర్కర్లు వచ్చి పని మొదలు పెట్టేసారుట.

సిగ్గు పడ్డాను చాలా... ఏంటి.. అంత భయం,జంకు నాకు? ముందు ఇలాగ లేనే? సినిమాలు చూడటం వల్ల మనకి అసలు అన్యాయం ఎదిరిస్తే ప్రాణాలకే ప్రమాదం అన్న అభిప్రాయం బలపడిపోయిందేమో ? రిస్క్ తీసుకోకుండా..మన చుట్టూ గీసుకున్న వృత్తం లోంచి బయటకి రావటం ఇష్టం లేదు. గేటెడ్ కమ్మ్యూనిటీ లో ఉండాలి. కార్ లోనే తిరగాలి.. క్యూబ్ కాకుండా.. రూం లో కూర్చుని పని చేయగల్గితే.. ఇంకా మంచిది. ఒక్క మనిషి తోనూ మాట్లాడకుండా పూర్తి షాపింగ్ చేయగలిగితే బెస్ట్. పక్కనే ప్రాణాలు పోతున్నా మనకెందుకు రిస్క్! అనుకోవటం...

డబ్బు పోతే పోయింది... పని జరగటం ముఖ్యం అనుకోవటం.. కమ్యూనిటీ అంటే.. పుట్టినరోజులూ, ఆనివర్సరీలూ జరుపుకోవటం.. కాదేమో.. నన్ను మా పక్కవాళ్ళెవరైనా ఇలా ధర్నా చేయాలి రమ్మంటే వెళ్తానా? తప్పించుకుంటానా? గజిబిజి ఆలోచనలతో సతమతమయ్యాను.

చుట్టూ పెద్ద ఇళ్ళ వల్ల 15 ఏళ్ళుగా చూడలేకపోయిన సూర్యోదయం.. ఇవ్వాళ్ళ అనుభవం లో కొస్తోంది.


గేట్ చప్పుడయింది. మాకు రెండిళ్ళ అవతల ఉండే చిన్న ఇంట్లో ఆవిడ వస్తోంది.. 'ఎప్పుడొచ్చినవ్? మంచిగున్నరా మీ ఆయ్న? పిల్లలు కూడా వచ్చిన్రా? మస్తు దొడ్డుగైనవ్? '.. అని అడుగుతోంది. సాధారణం గా.. చిన్నగా పలకరించి.. లోపలకెళ్ళిపోతాను నేను. ఈసారి మాత్రం.. 'బాగున్నారా? ఇప్పుడే వచ్చాం.. పిల్లలు బాగున్నారా? ఆరోగ్యం గా ఎలా ఉంది? ' అని మాట కలిపాను.
Friday, April 23, 2010 27 comments

ప్రణీత M Tech - 1


ప్రణీత M Tech చదివిన కన్నడ అమ్మాయి. నా ఎదురుగా రెండవ క్యూబ్ లో కూర్చుంటుంది. చామన చాయ, గుండ్రటి మొహం, కాస్త మొటిమల పాత గుర్తులతో, పల్చటి నున్నని జుట్టు ని పోనీ టైల్ గా బిగించి, తన సైజు కి మించిన ఫ్యాబ్ ఇండియా ఖాదీ టాపులూ, జీన్సూ వేసుకుని చక చకా నడుస్తూ వస్తుంది. గల గలా నవ్వుతుంది. నవ్వితే ఒక పక్క పన్ను మీద పన్ను అదనపు ఆకర్షణ తనలో. ఎప్పుడూ ఏదో సంగీతం వింటూ, హెడ్ ఫోను తీయదు, పని చేసేంత వరకూ.

నాకు భలే సరదాగా ఉంటుంది. పదిహేను ఏళ్ళయి పోయింది. యూనివర్సిటి వదిలి. ఎంత సమయం ఉండేదో.. ఎంత హాయిగా గా మనసుకి నచ్చినట్టు గడిపామో .. నా గతానికి ప్రతీక లా ఉండేది ప్రణీత. ఆఫీసు పనే కాకుండా ప్రతి విషయం లో ముందుండేది.

నెమ్మది గా తన లో మార్పులు రావటం మొదలు పెట్టాయి...

సాధ్యమయినంత వరకూ, క్యూబ్ లోనే భోజనం చేయటం మొదలు పెట్టింది. ఎప్పుడైనా ఇంటినుండి తెచ్చుకోలేక పొతే.. నన్ను రమ్మంటుంది కాంటీన్ కి. జనరల్ విషయాలు తప్పితే ఎప్పుడూ స్వవిషయాలు మాట్లాడదు. నేనెప్పుడూ పది మందితో లంచికి వెళ్ళటం పరిపాటి. కానీ ప్రణీత అడిగినప్పుడల్లా, తన తో వెళ్లి దూరం గా కూర్చుని.. కోక్ చప్పరిస్తూ, నలభై నిమిషాల లో తిని, మా బిల్డింగ్ చుట్టూ పది నిమిషాలు నింపాది గా నడిచి వస్తాం.

ఎవరైనా మాట్లాడిస్తే నవ్వుతూ, సరదాగా మాట్లాడుతుంది కానీ ఎవ్వర్నీ తనంతట తాను పలకరించటం నేను చూడలేదు. రెస్ట్ రూమ్ల దగ్గర మాత్రం, చాలా సార్లు ఉద్వేగం గా ఫోన్లో మాట్లాడటం గమనించాను. ఒక్కోసారి ఏడుపు గొంతు తో బేల గా, ఒక్కోసారి కోపం గా, .. అలాంటప్పుడు.. నేను చాలా అర్జంట్ పని ఉన్నట్టు వెళ్ళిపోతాను..

పలకరించను. రోజు రోజుకీ.. గల గలలు తక్కువయి, రెస్ట్ రూం సంభాషణలు ఎక్కువయినట్టు అనిపించింది. కానీ..
MNC లో పని చేసే నా లాంటి ఇద్దరు పిల్లల తల్లులకి అంత కన్నా ఎక్కువ గమనించటానికి, స్పందించటానికి టైం ఉండటం అరుదు.

నా deadlines హడావిడి లో కొంత కాలం గమనించలేదు. అప్పుడప్పుడూ.. పలకరించి ఏవో కామెంట్స్ చేస్తే.. పేలవం గా నవ్వటం తప్ప, తను నాతొ మాట్లాడింది లేదు. ఒక రోజు ఏదో మీటింగ్ నుండి వేరే బిల్డింగ్ నుండి వస్తున్నాను. 'కాఫీ?' అని వినపడింది వెనక నుండి. తిరిగి చూస్తె ప్రణీత. సరే అని ఖాళీ బల్ల వెతుక్కుని చతికిల పడ్డాం.

ఉపోద్ఘాతం లేకుండా.. కృష్ణా... 'I am getting divorce' అంది. ఇలాంటి గొడవేదో అవుతోన్దనుకున్నాను కానీ.. ఇంత దూరం వచ్చారనుకోలేదు. నేనూ ఏమీ మాట్లాడలేదు. చాలా సేపు తన విషయాలు చెప్తూ పోయింది.

తండ్రి లేని తను కష్టపడి చదువుకున్న వైనం, పెళ్లి కి ఒక్క రోజు ముందు కాబోయే భర్త తనకేదో మానసిక బాధ (రోగం అన్న పదం వాడాలంటే జంకు తో) కి చికిత్స పొందు తున్నానని చెప్పిన సంగతీ, ఆరు నెలలు తనపై నిఘా వేయించి, తాను శీలవతి అని తెలుసు కునేంత వరకూ తనని దూరం గా ఉంచిన సంగతీ, రెండేళ్ళ దాంపత్య జీవితం లో కనీసం ఇరవై సార్లు దెబ్బలకి, చీత్కారాలకీ తట్టుకోలేక తల్లి గారింటికి వెళ్ళిపోయినా, మోకాళ్ళ మీద కూర్చుని ఏడ్చి మళ్ళీ వెనక్కి తెప్పించుకుని మరీ మణికట్టు మీద బయటకి కనపడకుండా కొట్టిన భర్త భయానక మానసిక స్థితీ.. ,

తల్లి ఆరాటం, చుట్టాల అవహేళ నా , అత్తగారి చీత్కారాలూ, తోటి కోడలి చిన్నచూపూ, తన వెనక ఉన్న ఇద్దరు చెల్లెళ్ళను దృష్టి లో ఉంచుకుని ఓర్చుకున్న విషయమూ,.... ఇంకా ఓర్పు నశించి విడాకులకి పిటిషన్ వేసిన విషయమూ.. ఆరు నెలలు విడిగా ఉండి మళ్ళీ రమ్మన్నారట.. చాలా బాధ వేసింది.

ఈలోగా.. మళ్ళీ భర్త.. కాళ్ళా, వేళ్ళా పడి తీసుకెళ్ళాడు. తల్లి, చెల్లెళ్ళు, మేన మామలు, ఎంత చెప్పినా వినలేదు. గొర్రె కసాయి వాడినే నమ్ముతుందిట. ఎందుకో నమ్మింది వాడిని. Detective Agency వాళ్ళని పెట్టాడు. చివరకి ఆఫీసు లో కూడా నిఘా పెట్టాడు. చెల్లెళ్ళని దుర్బాష లాడటం, పుట్టింటి వారెవర్నీ ఇంటికి రానివ్వకపోవటం.. లంచ్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా.. మగ వారితో టేబుల్ మీద కూర్చుంటే.. సాయంత్రానికి రిపోర్ట్ .. ఒకరిద్దరికి ఆటను ఫోన్ చేసి నా భార్య తో నీకేం పని? ఎందుకు ఎప్పుడూ కాఫీ తాగేటప్పుడు పలకరిస్తావు అని గొడవ.. నెమ్మది గా తన విషయాలు ఆఫీసు లో కూడా తెలుస్తున్నాయి. ఉద్యోగం మాత్రం చేయాలి.. లక్ష రూపాయలు నెలకి.. ఎవరికి చేదు?

మనిషి నల్ల పడింది. కళా హీనం గా తయారయింది.

మన సమాజం లో ఆర్థికం గా నిలబడలేని స్త్రీలూ, సాంఘికం గా ఒక రకమైన బానిస తత్వాన్నీ, భయాన్నీ, చిన్నప్పటినుండీ, నారా నరాల్లో జీర్ణించుకున్న స్త్రీలూ, భర్త తిట్టినా, కొట్టినా, చంప ప్రయత్నించినా వేరే మనుగడ లేదని భావించే స్త్రీలూ ఉన్నారని తెలుసు కానీ.. నా తో రోజూ మాట్లాడే ప్రణీత,.. ఆ కోవ లోకి వస్తుందని కలలో కూడా ఊహించలేక పోయాను.

ఒక రోజు ఫోన్ ఎత్తక పోతే వాళ్ళమ్మ కి భయం.. వాహనాల రద్దీ వల్ల కాస్త ఆఫీసుకి ఆలస్యం అయితే.. నాకు బెంగ! .. ఇంటినుండి పని చేస్తానని అన్న రోజున.. మెసెంజర్ లో కి లొగిన్ అవకపోతే బాసుకి ఆదుర్దా..

దిన దిన గండం.. నూరేళ్ళ ఆయుషు లా తన దాంపత్య జీవనం సాగి పోతోంది.

నాకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. అంత కష్టం లో కూడా.. ఏవో ఒక పుస్తకాలగురించీ.. కొత్త సినిమాల గురించీ.. ఖాదీ బట్టల గురించీ.. రామయణం లో పాత్రల ఔచిత్యం గురించీ, మాట్లాడుతుంది.తనకి తెలిసిన జీవిత సత్యాల్నీ..తన అనుభవం నేర్పిన పాఠాల్నీ.. తను విన్న అందమైన స్పూర్థి దాయక మంచి మాటల్నీ ఒక పుస్తకం లో క్రోడీకరించింది.. తనకి కలగ బోయే పిల్లల కోసం..కారంస్, చెస్ లాంటి ఆటలూ, క్రాస్ వర్డ్లూ, చేస్తూ, మెదడు చురుగ్గా ఉంచుకుంటుంది..

మొన్న పుట్టినరోజు తనది. చిన్న పుస్తకం కొని తెచ్చాను ఇద్దామని. ఆఫీసు కి రాలేదు. పదకొండు అయంది. భయంగానే..ఫోన్ చేసాను.. తల్లిగారింట్లోంచి ఎత్తింది. దవడ మీద కొట్టాడట. కంటి కింద నలుపు వచ్చిందిట. ఫోన్ లో నవ్వుతూ, కంఠం లో జీర తో చెప్పింది. ఇల్లు కొంటాడట.. నగలు తెమ్మన్నాడట తల్లి గారివి..

2 రోజుల తర్వాత వచ్చింది. దవడ ఇంకా వాచే ఉంది. చేయి పైకెత్తింది ఏదో చెప్తూ.. ఎర్రటి వాతలు.. ఏంటి అని అడిగితే.. నవ్వేసి.. వెళ్ళాలి నేను మీటింగ్ ఉంది అని వెళ్ళిపోయింది. .. లేని హడావిడి కొని తెచ్చుకుని... మనం ఏమి చెప్పినా వినదు అని తెలుసు.

జాలిగా, విసుగ్గా.. చూస్తూ ఉండి పోయాను. ఎప్పటికి మారుతుందో ఈ ప్రణీత.. ఈ కథ కి మంచి ముగింపు ఉంటుందని.. తర్వాత ఆనందం గా జీవితాంతమూ గడిపింది అని ప్రణీత ఎం టెక్ -2 నేను రాయాలని.. మీరూ కోరుకోండి..
 
;