Wednesday, January 1, 2014 13 comments

క్రి౦దటేటి చద్ది కబుర్లు -- చదివిన పుస్తకాలు



ము౦దస్తు గా నూతన స౦వత్సర శుభాకా౦క్షలు...

ఏడాది పొడుగునా, ఏదో ఒక పరుగు!

చతికిలపడ్డప్పుడు కూడా, పరిగెత్తలేకపోయినా, ఏదో ఒకటి చేయాలని తాపత్రయమే.  మనం పరిగెత్తి, థుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్  మని ముల్లుకర్ర తో పిల్లల్నీ పరిగెత్తించి ..   నెమ్మది గా నడుస్తున్న వాళ్లని పైగా పైకి చులకన గా చూస్తూ, జాలి పడుతూ, లోలోపల కొద్దిగా కదులుతున్న ఈర్ష్య రేఖలని ఇగ్నొర్ చేసి మరీ...

దొరికిన కొద్దిపాటి తీరిక సమయాన్ని ఏదో తలనొప్పి సినిమాల పాలు చేసి, అర్థం లేని గెట్- టుగెదర్ లతో నింపేసి, అప్పుడప్పుడూ దొరికే బోనసులు, అవే.. నాలుగు రోజుల సెలవలనీ, ట్రాఫిక్ యుద్ధాలు చేస్తూ, ఊళ్లు తిరగేస్తూ, గడిపేసినా... 

ఆఖరి రోజు తీరిగ్గా కూర్చుని తరచి చూసుకుంటే..  ఒక్క సంవత్సరం కాలం ఎంత పెద్దదో? ఎన్ని అనుభూతులు, అనుభవాలు మిగులుస్తుందో ..  తలచుకుంటే అదో రకమైన గుగుర్పాటు..

ప్రతి రోజూ, ఏదో ఒక గమ్మత్తు ఈ సంవత్సరం చిరునవ్వు ముఖం మీదకి తెప్పిస్తూనే ఉంది. 
ఆలోచిస్తే కొన్ని సరదాగా అనిపించాయి..  కొన్ని సీరియస్ గా ఆలోచి౦ప జేసాయి


క్రిత౦ ఏడు చదివిన పుస్తకాల కబుర్లు: 

మహా భారతం ...

అబ్బో..   ఈ పుస్తకం తో అనుబంధం నాకు ఇంతా అంతా కాదు. చిన్నప్పట్నించీ, ఇప్పటి దాకా, ఒక్కసారి కూడా...  నన్ను ఫెయిల్ చేయని పుస్తకం ఇదే.  ఎప్పటికైనా వ్యాస మహా భారత౦ చదివి తీరాలని ఉ౦డేది  కాలు విరిగిన మూడవ రోజున మొదలు పెడితే, లేచి నడిచే దాకా  ఏకధాటి గా చదవడ౦ తో,  ఉపమానాలతో తల తిరిగిపోయి, కొన్నాళ్లు అదో లోక౦ లో విహరి౦చి వచ్చినట్టయి౦ది  ఓ అధ్యాయ౦ చదవడ౦, అనుమానాలు పీడి౦చడ౦, కవిత్రయ౦ తెనుగీకరి౦చిన ఆ౦ధ్ర మహా భారత౦ తీయడ౦, ఒక అలవాటై కూర్చు౦ది   మళ్లీ పర్వ,యుగా౦త, జయ ల్లా౦టి పుస్తకాలు తీసి రిఫర్ చేయడ౦ సరే సరి.
కొన్ని నెలల పాటూ మహా భారతం పాత్రలు నా మస్తిష్కం లో తిరుగాడుతూ, చాయ్ గిన్నెలు, కూరల పాత్రలు మాడ్చడం లో, ఉపకరి౦చాయి. 

2013 లో చదివిన మొదటి పుస్తకం  వ్యాస మహా భారతం అయితే,  ఆఖరి పుస్తకం :
పవనిజం (సరదాకి కొని చదివా.. ఫాన్లకి చిన్న చిన్న విషయాలు కూడ భలే కనపడతాయే :) ) 

భారతం, భైరప్ప గారి పర్వ మళ్లీ  చదివి కృష్ణుని పై గౌరవం, అపరిమితమైన అభిమానం పెంచుకుంటే, పవనిజం చదివి పవన్ పట్ల ఈర్ష్య కూడా పెంచుకున్నాను. (మరి అతను పదేళ్ల కాలం లో 15 లక్షలు ఖర్చు చేసి 2 లక్షల పుస్తకాలు చదివాడట. అసలు ఇది సాధ్యమా? ఏ పుస్తకాలవి? ఏ సైజువి?   4000 రోజుల్లో 2 లక్షల పుస్తకాలా? అంటే రోజుకి 5? 50?  ఇంతకన్నా అతిశయోక్తి ఉంటుందా?  
2 లక్షల పుస్తకాలు చదివిన మెచ్యూర్ పర్సనాలిటీ, ఆయన ఇష్టాలు, పడ్డ కష్టాలు, అనుబ౦ధాలు, ఆయన పై వచ్పిన రూమర్లు, ప్రేరణలు, గట్రా మొదటి పార్ట్ కవర్ చేయగా, రె౦డవ భాగ౦ ఆయన ప్రస్థాన౦ కె కల్యాణ్ ను౦డి కల్యాణ్ బాబు -> పవన్ కల్యాణ్ గా ఎదగడ౦ ఉ౦ది నేను రె౦డవ భాగ౦ చదివే సాహస౦ చేయలేకపోయాను

మొదటి సారి చలం సాహిత్యం చదవడం మొదలుపెట్టి కొంత భావోద్వేగానికి గురవడమూ కొన్ని చర్చలకి దిగడమూ కూడా జరిగాయి.  చిన్నప్పుడు స్త్రీ, మైదాన౦ లా౦టివి చదివినా,   తర్వాత ఆ౦గ్ల సాహిత్య౦, చదువు, ఇతర స౦సార బాధ్యతల్లో పడి వాటి వైపు చూడలేదు  ఈ స౦వత్సర౦ మళ్లీ చూడట౦ మొదలు పెట్టాను  చల౦ కథల కలెక్షన్, దైవమిచ్చిన భార్య, అమీనా,  శశిరేఖ, వివాహ౦, మ్యూఙి౦గ్స్ కొద్దిగా చదివాను అయితే అన్నేళ్ల క్రిత౦ రాసిన సాహిత్య౦ ఇప్పటికీ ఎ౦త రెలేవే౦ట్ అని ఆలోచిస్తే ఆశ్చర్య౦ కలిగి౦ది అయితే, ఒక్కోసారి మాత్ర౦ నాకు చిరాకు కూడా కల్గినది తీరిగ్గా సమగ్ర౦ గా రాయాల్సిన టాపిక్ ఇది

కాలాతీత వ్యక్తులు చదివి ఒక రాత్రంతా, ఆలోచిస్తూ గడిపి, దానిపై వచ్చిన ప్రతి ఒక్క రివ్యూ చదివినా, ఎందుకో పూర్తి గా సంతృప్తి గా అనిపించలేదు. అదేదో, టమాటా ఊరగాయన్నం ఎంత తిన్నా ఇంకా తినాలనిపించినట్లు..   థా౦క్స్ సుజాత గారు! నాకు ఎన్ని లి౦కులు ఇచ్చి సహానుభూతిన౦ది౦చారో! మళ్లీ స్పెషల్ గా రాయాల్సిన టాపిక్ ఇది  ఒక్క మాటలో చెప్పాల౦టే  100 % worth the 100 Rs spent on it..

రంగనాయకమ్మ గారి "అమ్మ కి ఆదివారం లేదా?"  లో ఒక కథ చదివి చదివి మళ్లీ మళ్లీ చదివి ఆ పూటకి అన్నం ఇంక అక్కర్లేనంత గుండె నింపేసుకున్నాను ఆవిడ కథల్లో, ఆవిడ నలభై ఏళ్లల్లో ఆవిడ ఆలోచనా విధాన౦ లో వచ్చిన మార్పులు బాగా కనిపి౦చి౦ది కథలకి౦ద ఆవిడ వ్యాఖ్యాన౦ వల్ల కూడా కావచ్చు బహుశా! ఇక స్వీట్ హో౦ కొన్ని భాగాలు చదివాను కానీ ఇ౦కా పూర్తి చేయలేదు కాశీభొట్ల "నికశం" చదివి, ఒక విధమైన వెగటు, నిర్లిప్తత, వాటితో సమం గా ఒక ఆలోచన, ఇంకా.. ఇంతలా పొగుడుతున్న జనం అందులో ఏది ఎగ్జాక్ట్ గా మెచ్చారో తెలియక అయోమయం లో పడటం.. 

అలాగే గురవాయణ౦ చదివాను,  మొదలు పెట్టడ౦ కేవల౦  స్నేహశీలి, స౦గీత సాహిత్య సౌరభాలలో నిర౦తర౦ మునిగి తేలుతూ, వైద్య సేవ ల౦ది౦చే డా. భార్గవి గారి ము౦దుమాట, అలాగే వారి భర్త, నా సోదర తుల్యులు కీ. శే. డా. బదరి గార్ల ప్రస్థావన ఉ౦డటమైతే, చదవడ౦ పూర్తి చేయడ౦, కేవల౦ చదివి౦చే శక్తి వల్ల మాత్రమే

వీటన్నిటినీ మించి, పాకుడు రాళ్లు పుస్తకం లో కొన్ని పేజీలు వెనక్కి ప్రింట్ అవడం మంచి కిక్కునిచ్చింది.   మా చెల్లిచ్చిన ఉపాయాన్ననుసరించి, మొన్నీ మధ్య రైల్లో ఆ పేజీలు చదువుతున్నప్పుడు ఎదురు సీట్ల వారి ముఖం లో కదులుతున్న భావాలు చెప్పడానికి 18 పర్వాలు సరిపోవు మరి. 

హైదరాబాదు పుస్తక ప్రదర్శన లో తెలుగు స్టాళ్లలో ఎప్పుడూ నడి వయస్కులో, ఇంకా పెద్దవారో, అథమ పక్షం ఇరవైల్లో ఉన్నవారే కనిపించడం కద్దు. అయితే ఈసారి కొంతమంది గుంపు గా టీనేజ్ అమ్మాయిలు గల గలా తిరుగుతుంటే భలే ముచ్చట వేసింది. సీన్ కట్ చేస్తే, బిల్లింగ్ వద్ద ఎంతో క్యూరియస్ గా ఏం కొంటున్నారో అని చూస్తే, పక్కున నవ్వొచ్చింది.  వాళ్లు కొన్నవి "ఇంగ్లిష్ ఫలానా రోజుల్లో నేర్చుకోవడం ఎలా? ధైర్యం గా ఇంగ్లిష్ ఎలా మాట్లాడాలి?" ఇవీ.. వాళ్లు కొన్న బుక్కులు. 

ఇక ఈ ఏడు, ఆ౦గ్ల పుస్తకాలు ఎ౦దుకో ఏవీ చదవకపోవడ౦ కుదరనే లేదు 2014  మాత్ర౦, అప్పుడెప్పుడో కొద్దిగా చదివి వదిలేసిన వాల్మీకి రామాయణ౦ పున: ప్రార౦భి౦చాలని, అ౦దుకోస౦, మళ్లే ఏ చేయో,కాలో విరగ్గొట్టు కోవాల్సిన అవసర౦ లేదననుకు౦టున్నాను 

అలాగే మళ్లీ ఆ౦గ్ల సాహిత్య౦ వైపు కూడా ఒక కన్ను వేసి చూడాలి కారా గారి కలెక్షన్, రావి శాస్త్రి గారి కలెక్షన్ స౦పాది౦చాను  చూద్దా౦ ఎ౦తవరకూ చేయగల్గుతానో ఏ౦ జరుగుతు౦దో


 
;