Monday, May 30, 2011 45 comments

పారిస్ వెళ్లండి!! కానీ..


లవంగం (మన్మథుడు లో బ్రహ్మానందం) ఇంటికి మాత్రం వెళ్లకు..." అని ఒకళ్లు.. "పారిస్ లో ఎస్కలేటర్లు మాత్రం మా బెమ్మి చెప్పినట్టే ఎక్కు ,.. అసలే పారిస్ ఇండియా ని టేప్ లో 30 సంవత్సరాలు ఫార్వార్డ్ చేస్తే ఎలా ఉంటుందో అంత ముందు ఉంటుంద"ని ఒకరు... "పారిస్ వాళ్లకి కూడా నీళ్లంటే భయం అందుకే బ్రిడ్జులు కట్టార" ని ఒకరూ.. "పారిస్ లో బూట్లు కొనద్దు ... ఈజీ మెథడ్లు ఉంటాయని ఒకరూ.. తిరిగి వచ్చేప్పుడు సామాన్లు ఎక్కువైతే ఎక్కడైనా పెట్టేయ్.. సంవత్సరం తర్వాత వచ్చినా అక్కడే ఉంటుందని అప్పుడు తెచ్చుకోవచ్చని ఒకరూ.. సలహాలిచ్చారు.. పారిస్ కి సెలవలకి వెళ్తున్నానని తెలిసి.... తెగ నవ్వుకున్నాం.


పారిస్... ఐరోపా సాంస్కృతిక రాజధాని.. కళాకారుల కలల నగరం.. ఫాషన్ ప్రపంచ రాజధాని కూడా కదా .. ఎన్ని నవలల్లో చదివాం.. ఎన్ని రకాలు గా ఊహించుకున్నాం.. ఐదు రోజులు పారిస్ లో ఉంటామనగానే ఒక రకమైన ఉద్విగ్నత.. మూడు నెలల క్రితమే టికెట్లు కొనేసాం... హోటల్ గదులూ బుక్ చేసేసాం.. ఇంటర్నెట్ అంతా గాలించి, శోధించి, సమాచారాన్ని పుంఖాను పుంఖాలు గా ప్రింట్ అవుట్లు తీసి భద్రపరచుకున్నాం...


ఇదంతా ఒక ఎత్తు.. బాసు గారి దగ్గర సెలవు ప్రస్తావన తేవాలంటే బోల్డంత బెరుకు.. అంతకన్నా.. 'మీ సిస్టం పాస్ వర్డ్ అర్జెంట్ గా ఇస్తారా?' అడిగితేనే బెటరేమో.. ఎలాగా అని కొట్టుకుపోతుంటే నా పూర్వ జన్మ లో ఏ దాహం తో సొమ్మసిల్లిన వాడికి నీళ్లు పోసానో.. దేవుడు నన్ను కరుణించి.. ఆ పూట నా బాసు గారికి బోల్డు అర్జంట్ పనులతో ఊపిరి సలపకుండా చేసాడు.. నా తో 1:1 మీటింగు లో ఆయన.. ఎప్పుడు నేను లేచి వెళ్తానా అన్నట్టు ఉన్నారు. మామూలు గా అయితే... నేనే అలా అనుకుంటాను.. ఈయనేంటి. ఇంకా వదలడు...' అని. కాసేపు.. అవీ ఇవీ.. మాట్లాడి.. ఆయన అసహనం గా.. వేరే ఈ మెయిల్స్ చూస్తూ వినీ విననట్టు ఉన్నారని గమనించగానే.. 'అన్నట్టు మే లో విదేశాలకి వెళ్తున్నాను.. కరెక్ట్ డేట్లు కన్ఫర్మ్ కాగానే అప్లై చేస్తాను .. ' అన్నాను. ఆయన అన్య మనస్కంగా 'ఆ ఆ' అన్నారు. 'ఆహా.. వచ్చిన పని అయింది ' అని నేనూ వచ్చేసాను.

 కానీ సిస్టం లో అప్లై చేస్తే వెంటనే రిజెక్ట్ చేయగల ఘనుడాయన.. కానీ ౧౦ రోజులు కస్టమర్లతో ఆయనకి చాలా బిజీ అని తెలుసుకొని కరెక్ట్ గా ఆరోజే ఇరవై రోజులకి అప్లై చేసి ఊరుకున్నాను.. తర్వాత ఆయనా బిజీ.. ఎవ్వరి లీవూ అప్రూవ్ చేయలేదని తెలుసుకుని ..'హమ్మయ్య ' అని నా గొడవలో నేనూ బిజీ..

ఆఖరి వారం లో చూసి.. 'అదేంటి.. ఇలా చేసావ్? ' అని ఒకటే గొడవ.. మిమ్మల్నడిగేగా నెల రోజుల క్రితం అప్లై చేసింది ? అని నేనూ కాస్త దబాయించి బయట పడ్డాను..



"పారిస్ కి వెళ్తున్నాం..సెలవలకి ..." అనగానే..పైన మన్మథుడి లో హాస్యం తో బాటూ.. తెలిసిన వారు అందరూ తలా ఒక సలహా ఇచ్చారు.. 'అదేంటి? ఒక్క పారిస్ మాత్రమే నా? ఇంకా అన్ని ఐరోపా దేశాలూ తిరిగి రావచ్చు కదా? ' 'పారిస్ లో ఏముంది? ఆ శిల్పాలూ, చిత్రాలూ తప్పితే..అదే ఈజిప్ట్ అయితే పిరమిడ్లు, స్విట్జర్లాండ్ అయితే ప్రకృతి అందాలు.. వాటికన్ నగరం లో ఇవీ.. లండన్ లో అవీ..' అనీ... ఇంకొక కొ వర్కర్ అయితే 'ఎందుకండీ కృష్ణ గారూ.. అన్ని లక్షలు పోసి..పారిస్.. సినిమాల్లో చూస్తూనే ఉన్నాం.. ఏదైనా ఆఫీస్ ట్రిప్ వేసుకుని దోవ లో ఆగండి.. చక్కగా.. ఈ డబ్బు తో బంగారం కొని పెట్టండి..మీకు అసలే ఆడపిల్లలు! రేపు అవసరాలుంటాయి.." అని. ఒళ్లు మండింది కానీ.. ఆతను శ్రేయోభిలాషి అని తెలుసు.. నవ్వి ఊరుకున్నాను.


అంతకు ముందు చూసి వచ్చినవారిలో 'మోనాలిసా ని మాత్రం చూస్తే చేష్టలుడిగి అలాగే నిలబడిపోతాం' అని ఒకరు, 'అంత కష్టపడి మ్యూజియం అంతా తిరిగి తిరిగి వెళ్తే ఐదు మీటర్ల దూరం లో పైగా గాజు ఫ్రెం లో ఉంటుంది.. దాని బదులు ఇంటర్ నెట్ లో చూడటం మేలు..' అని ఒకరు.. టూరిస్ట్ పాకేజ్ తీసుకొమ్మని ఒకరు.. అంత దండగ వేరే లేనే లేదు.. అన్నీ గూగుల్ చేసి పెట్టుకొమ్మని ఒకరు.. గది లో వండుకొమ్మని ఒకరు,.. అక్కడ ఉన్న భారతీయ రెస్టారెంట్ విషయాలు కొందరు, అంత దూరమూ వెళ్లి ఇండియన్ ఫుడ్ ఏంటి? హాయిగా ఫ్రెంచ్ కుజీన్ తినక ..అని మరి కొందరు..


అందరి అభిప్రాయాలూ విన్నాక చెప్పలేనంత కన్ఫ్యూషన్ ఏర్పడింది. ఇంతకు ముందర మేము లండన్ అవీ వెళ్లినప్పుడు కేవలం మేము భార్యా భర్తలమే చర్చించుకున్నా, చొక్కాలు చించుకున్నా.. చివరకి ఒక నిర్ణయానికి అంటూ వచ్చేవారం. ఇప్పుడు పిల్లల అభిప్రాయాలు..వాళ్లు మా ప్రయాణం గురించి అందరికీ నెల ముందే అందరికీ చెప్పేయటం వల్ల వారందరి అభిప్రాయలకీ విలువ ఇవ్వాల్సిన పరిస్థితి! పెద్దమ్మాయి కాస్త కళాత్మక హృదయం కలిగినదైతే, చిన్నదానికి థ్రిల్ రైడ్లూ, మంచి భోజనమూ గట్రా ఉంటే చాలు. మాకు కొన్నింటికి 'ఇదిగో.. ఈ కట్టడం కూడా చూసాం..' అని ఫోటో,వీడియో ప్రూఫులూ, కొన్నింటిని నిజం గా చూడాలనే ఉత్సాహమూ ఉన్నాయి.. కాకపొతే కరెక్ట్ గా..ఇద్దరి ఇష్టాలూ వ్యతిరేకం.


చివరకి అందరి ప్రయారిటీ లిస్టులేసి.. అందరికీ న్యాయం జరిగేలా ప్లాన్ వేసాం. మా చెల్లీ,మరిదీ ఒకటే నవ్వు.. 'పారిస్ లో తినటానికి .. ఫ్రెష్ గా కొత్తావకాయ పెట్టానూ..' అంటే.. వీలున్నప్పుడు ఒకపూట హోటల్లో వండుకుని.. ఒక్కోరోజూ బయట ఒక్కో రకం తిండీ తిందామని నిర్ణయం. సామాన్లు పెద్దగా లేవు గా.. అందుకని రైస్ కుక్కర్, అన్ని పొడులూ,పచ్చళ్ళూ, నూనె,నెయ్యి, ఉప్పు, మాగీ పాకెట్, లాంటివి పాక్ చేసుకుని విమానమెక్కేసాం.

 ఇక మా ట్రావెల్ ఏజెంట్ పుణ్యమా అని.. పారిస్ లో దిగగానే టాక్సీ డ్రైవర్ వచ్చి హోటల్ రూమ్ లో పడేశాడు. మా పెద్ద అమ్మాయి హోటల్ రూమ్ లోకి వెళ్తూనే కర్టెన్లు తీసి.. 'ఈఫిల్ టవర్!! అదిగో.... ' అని అరిచి తెగ సంబరపడింది. మాకు గుర్తేలేదు. ట్రావెల్ ఏజెంట్ ఈఫిల్ టవర్ కిటికీ లోంచి కనపడేలా గది ఇస్తానన్న విషయం. ప్రయాణం అలసట అంతా ఉఫ్ఫ్ఫ్ మని ఊడినట్టు ఎగిరిపోయింది. గబగబా తయారయి ఇంటి నుండి తెచ్చుకున్న చపాతీలు తినేసి మెట్రో లో ఈఫిల్ టవర్ కి ప్రయాణం కట్టాం.




రెండేళ్ల క్రితం ఇదే మే లో లండన్ వెళ్తే చలికి గడ గడ లాడాం కదా అని స్వేటర్లూ అవీ తీసుకుని బయటకి వచ్చాక తెలిసింది.. 'నమ్మ బెంగుళూరు' లానే ఉందని.. రాత్రి ౧౦.౩౦ కి సూర్యాస్తమయం. మా చిన్నది కాస్త డిజప్పాయింట్ అయింది. 'నా కొత్త స్వెటర్ వేసుకోటానికి లేదు ' అని. పోన్లే ఒకసారి వేసుకుని చటుక్కున ఫోటో తీసి మళ్లీ లోపల పెట్టేద్దాం అని ఓదార్చాను. చిన్నపిల్లల అభిప్రాయాలు వింటే ఆశ్చర్యం వేసింది. 'పారిస్ లో బొట్లు పెట్టుకోవద్దు.. మీ అమ్మని కూడా సల్వార్ కమీజ్ వేసుకోవద్దని చెప్పు.. అక్కడ ..you need to like you are one of them.. else you would land in to trouble' అన్నారు ట. అలాగే.. పిల్లలకి ఆసియా,ఆఫ్రికా ఖండాల్లో జనాలు మాత్రమే 'అన్నమో రామచంద్రా' అని అలమటిస్తూ ఉంటారు. ఐరోపా, అమెరికా వాస్తవ్యులు డబ్బులో ములిగి తేలుతూ ఉంటారని ఒక నమ్మకం.

 
మా పెద్దమ్మాయికి మెట్రో స్టేషన్ కి చేరుతూనే రెండు అభిప్రాయాలూ పటా పంచలయ్యాయి. అడుక్కుని తినే వారు, సావనీర్లని 'యూరోకి ఐదు.. యూరోకి ఆరిస్తా తీసుకో.. ' అని గుంపులు గుంపులు గా మీద మీద కి వచ్చి బస్తాల్లో సామాన్లు పెట్టుకుని అమ్ముకునే ఏషియన్లు, నల్ల జాతి వారు, (వద్దు వద్దు అన్నా.. పోనీ ఎన్ని కావాలి చెప్పండి 'బెహన్జీ' అని వెంట పడే వారు.. వాళ్ల బాధ తట్టుకోలేక ఈఫిల్ టవర్ల బొమ్మలు మెడల్లో వేసుకుని మరీ తిరగాల్సి వచ్చేది..) బస్సుల్లో మన బియ్యం బస్తాల మెటీరియల్ తో చేసిన పేద్ద సంచీల్లో గ్రాసరీలు కొనుక్కుని వెళ్లే ఫ్రెంచ్ వనితలనీ,... మీటర్ల కొద్దీ బట్టని రక రకాలు గా తమ పధ్ధతి లో వంటికి చుట్టుకుని రైళ్లల్లో ప్రయాణాలు చేసే నల్ల జాతి స్త్రీలనీ, పారిస్ సిటీ లో చర్చిల దగ్గరా, ఓప్రా, మ్యూజియం ల దగ్గరా, హోటల్ రూమ్ లోనో, ఇంకెక్కడో పెట్టుకోకుండా.. బాగేజ్ (pull on) ని లాక్కుంటూ, భోజనాల సమయం లో ఏ మెట్ల మీదో, బెంచి మీదో, పెట్టె లోంచి ఇంటి నుండి తెచ్చుకున్న లంచ్ బాక్స్ తీసుకుని తినే ఐరోపా యువత నీ, చూసి 'అమ్మా నువ్వు కరెక్టే.. మా ఫ్రెండ్స్ రాంగ్' అంది. రైటూ, రాంగూ అని కాదు.. అని ఒక పేద్ద లెక్చర్ దానికి బహుమతి గా ఇచ్చాను..


ఏడేళ్ల పిల్ల కి స్నేహితులు చెప్పారుట.. 'ఈఫిల్ టవర్ మీద రెండో అంతస్తులో పారిస్ అందాలు చూస్తూ డిన్నర్ ' చేస్తేనే మజా ఉంటుంది.. మా పదేళ్ల పిల్లకి.. 'పారిస్ చాలా fashionable city.. మంచి డ్రెస్సులూ, కాస్మెటిక్స్ కొనుక్కో ' అని. 'అబ్బా.. వీళ్లు ఇలాంటివి చర్చిస్తారా? ' అని బుగ్గలు నొక్కుకున్నాం.


మొదటి రెండు రోజులూ, కాస్త స్టైల్ గా బయట ఫుడ్ తిన్నాక, పిల్లలు 'Amma.. Can we pack some aavakaayannam today to museum?' అని అడిగారు.. 'కుదిరింది తిక్క' అని మనసు లో అనుకుని.. పైకి మాత్రం సాధ్యమైనంత గంభీరం గా తల ఊపి ఊరుకున్నాను. పైగా.. 'ఏంటమ్మా? ఒక్క బ్రిడ్జ్, బిల్డింగ్..ప్లెయిన్ గా లేదు? ఏది చూసినా.. ఏదో తలకాయలు తొంగి చూడటం, టూ మచ్ గా పూలు, బంగారం పూతలూ, వాళ్ల దేవుళ్ల, రాజుల బొమ్మలు.. ' అని విసుగు. మా చిన్నదైతే.. 'ఏ ఒక్క అమ్మాయి శిల్పానికీ సరిగ్గా బట్టల్లేవు.. నాకు నచ్చలేదు.. ' అని ఖరా ఖండీ గా చెప్పేసింది. లూవ్ర్ మ్యూజియం లో నైతే.. ఏదో ముసలమ్మ లా.. ఒక బెంచి చూసుకుని.. 'మీరు అందరూ, ఈ బొమ్మలూ, చిత్రాలూ, శిల్పాలూ ఏం చూసుకుంటారో చూసుకుని ఇక్కడికే రండి.. నేను సామాన్లు చూసుకుంటా' అంది. అలా ఎలా వదిలేస్తాం.. ఒక్కదాన్నీ? అని బలవంతాన తీసుకెళ్తే మొహం మాడ్చుకుని, విసుగు చూపించటం.. చిరాకేసి.. 'ఇలా కాదు. పిల్లలు కాలేజ్ కెళ్ళాక.. మనమిద్దరమే వచ్చి చూడాలి ఇవన్నీ మళ్లీ..' అన్నాను. వెంటనే మా పెద్దమ్మాయి.. 'అవునవును.. ఛీ ఛీ.. అనుకుంటూ పారిస్ మ్యూజియం లన్నీ తిరగండి..' అని వ్యంగ్యం గా అంది. (సరిగ్గా బట్టల్లేని బొమ్మల్ని చూసి ఛీ ఛీ అంటామని...) ' ఇలాగయితే డిస్నీ లాండ్ కి వెళ్లినప్పుడు నేనూ ఇలాగే చేస్తాను.. ' అన్నానంతే.. దెబ్బకి చక చక లాడుతూ మ్యూజియాలూ, పాలస్ లూ, కాతేడ్రల్ లూ చూసి పెట్టారు.


పాపం వాళ్లని కాస్త కష్టపెట్టినట్టనిపించినా,.. ఒక్కటి గమనించాను.. పెద్దమ్మాయికి చరిత్ర పట్ల ఇంటరెస్ట్ ఉందని. ఎక్కడికెళ్లినా గైడ్ పక్కనే.. ఉండి అన్నీ తెలుసుకుంటూ తిరిగిందని.. అలాగే మ్యూజియం లో హెడ్ సెట్స్ ద్వారా చాలా ఫేమస్ చిత్రాల కథా, కమామీషూ తెలుసుకుని.. నాకు చెప్పింది. చాలా సంతోషం వేసింది.



మొదటి రోజు జాగ్రత్త గా, బెరుగ్గా వెళ్లి మెట్రో మాప్ చూసుకుంటూ ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్లాం. మెట్రో స్టేషన్ లోంచి బయటకి రాగానే చాలా మంది రోడ్ల మీద నుంచుని బొమ్మలమ్ముకుంటున్నారు.. ఒకర్ని ఈఫిల్ టవర్ ఎక్కడుంది? అని అడగగానే.. నవ్వి వెనక్కి చూపించాడు. ఆకాశమంత ఎత్తులో టవర్.. గుగుర్పాటు గా అనిపించింది. దగ్గరగా కనిపించినా.. సావనీర్లు అమ్ముకునేవారిని దాటుతూ, జనాలతో నడుస్తూ, మొత్తానికి పదిహేను నిమషాల నడక అయినట్టనిపించింది. పెద్ద లైన్. నెమ్మది గా నలభై నిమిషాల తర్వాత ఎలివేటర్ లో రెండవ అంతస్తుకి చేరాం. అక్కడ మా పాప కోరిక మేర సాండ్ విచ్ లు తిని పేక మేడల్లా అందం గా చాక్ పీసు ముక్కల రంగుల్లో తీర్చి దిద్దినట్టున్న పారిస్ నగరాన్ని చూసి, కాసేపటికి పై అంతస్తుకి వెళ్లాం. అక్కడనుంచి మళ్లీ కిందకి చూసి.. ఆనందించి 'అమ్మో ౧౦ దాటింది..' అని తిరుగు ముఖం పట్టం. విద్యు ద్దీపాలు ఒక్కసారి గా వెలగటం తో ఎంతో ఆనందం అనిపించింది. కిందకి దిగి మెట్రో స్టేషన్ వైపు నడుస్తుండగా.. ఒక్కసారి గా దీపాలు వెలుగుతూ ఆరుతూ సందడి చేశాయి.



 రెండవ రోజు ఉదయాన్నే లేచి హాయిగా సుదీర్ఘ అల్పాహారం (అధికాహారం?) చేసి నెమ్మది గా లూవ్ర్ మ్యూజియం కి వెళ్లే మెట్రో రైలెక్కాం. దిగాల్సిన స్టేషన్ దగ్గర రైలు ఆగలేదు.. 'అదేంటి' అంటే.. రైల్లో వాళ్లు అదొక ఎక్స్ ప్రెస్ బండి అని రెండు స్టేషన్లు దాటితే గానీ ఆగదని చెప్పారు. ఉసూరు మనిపించింది. మెట్రో లోంచి నీరసం గా బయటకి వచ్చి చూస్తే ఏముంది? అకస్మాత్తుగా ఒక టైం మషీన్ లో ఎక్కి మూడు వందల ఏళ్ల క్రితం రోజుల్లోకి వెళ్లామా అని ఆశ్చర్యం వేసింది. చుట్టూ పాతకాలపు రాజరిక చిహ్నాలున్న భవనాలు. అక్కడేదో స్ట్రైక్ లాంటిది చేస్తున్నారు. మేము నడుస్తూ, చుట్టూ భవనాల్ని, షాపులనీ చూస్తూ నెమ్మదిగా మ్యూజియం కి చేరాం.







మళ్లీ పెద్ద లైన్లో నంచున్నాం. ఒక్కసారి టికెట్, ఆడియో టూర్ తీసుకున్నాక, మేము నోట్ చేసుకుని వచ్చిన కళాఖండాలు ఎక్కడ చూడవచ్చో మార్క్ చేసుకుని.. మొట్టమొదట మోనాలిసా దగ్గరికి పరిగెత్తాం. (ఈ మ్యూజియం మరి నెమ్మదిగా చూస్తే వారమైనా పడుతుంది..) సాయంత్రం దాకా ఎంత కాళ్లు నొప్పులు గా అనిపించినా పట్టించుకోకుండా అనుకున్నవన్నీ చూసి...మధ్యలో మా మాగాయన్నం పొట్లాలతో బాటూ, అక్కడ సాండ్ విచ్లూ, కాఫీ, ఐస్ క్రీంలూ తిని.. రాత్రికి అలిసి చేరుకున్నాం.


మర్నాడు మాత్రం ముందు రోజులా పరిగెత్తకూడదని నిర్ణయం తీసుకుని కాస్త నెమ్మదిగా రెస్టారెంట్ లో ముందు రోజులా అధికాహారం తీసుకుని.. ఈసారి సిటీ టూర్ బస్సు లో (hop on, hop off) మొత్తం పారిస్ అంతా తిరిగి చూసాం. ఆడియో లో స్థల మహత్యాన్ని గురించి వినటం, ఎక్కడ కావాలంటే అక్కడ దిగి తిరిగి మళ్లీ వచ్చే బస్ ఎక్కి తర్వాతి స్టాప్ కి వెళ్లటం. ఈ విధం గా.. పారిస్ నగరాన్ని అంతా తిరిగి చూసి.. కాస్త షాపింగ్ చేసి ఇంటికొచ్చి పడ్డాం.

 నాలుగో రోజు తీరిగ్గా.. notre dome cathedral లో గంట గడిపి నెమ్మదిగా సీన్ నది మీద ఆడియో టూర్ తో బోట్ విహారం చేశాం. దాదాపు పారిస్ నగర విశేషాలన్నీ సీన్ నదీ తీరం లోనే ఉన్నాయి. ఒక్కో బ్రిడ్జ్ కీ ఒక్కో చరిత్ర.

 ఇక ఆఖరి రోజున వేర్సైల్స్ రాజ భవనం చూడటానికి బయల్దేరాం. ఆరు తరాల ఫ్రెంచ్ చక్రవర్తులు నివసించిన ఆ పాలస్ కోసం మెట్రో లో పారిస్ నగర శివార్లలో ఉన్న వేర్సైల్స్ నగరానికి వెళ్లాం. పొరపాటున వై జంక్షన్ లా ఉన్న రైలు స్టాపుల్లో రెంటికీ ఓకే నంబర్ ఉండటం తో చిన్న కన్ఫ్యూషన్.. రైల్లో ఉన్న ఒక మధ్యవయసు జంట ని అడిగితే వాళ్లు మమ్మల్ని రైలు దింపి మాతో వచ్చి మరీ కరెక్ట్ రైలెక్కించారు. పైగా.. మా రైలొచ్చేదాకా నుంచుని..కాలక్షేపం కబుర్లు చెప్పి వెళ్లారు. ఆ రాజ భవనం, వేల ఎకరాల్లో ఉద్యానవనాలూ, బంగారు తాపడాలతో జిగేల్ మంటున్న పాలస్ లొ గైడెడ్ టూర్ తీసుకుని కింగ్ లూయ్ XIV,XV,XVI నివసించిన గదులూ, వారి వ్యవహార శైలుల్లో తేడాలూ, వారి భావనానంకరణ లో అభిరుచులూ, ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసిన పరిస్తుతులూ కొద్దిగా చదివి వచ్చినా.. మళ్లీ గైడ్ ద్వారా వింటుంటే బాగా అనిపించింది. రాజుగారి తోట లో మొత్తానికి నా కొత్తావకాయన్నం తిని, అక్కడి కఫే లో మంచి కాఫీ, కేక్ తిని హోటల్ గది కి వచ్చి పడ్డాం.




ఫ్రెంచ్ చక్రవర్తుల పాలస్ లూ, ఫ్రెంచ్ విప్లవాల, వారి యుద్దాల, విజయాల స్మారక చిహ్నాలు, చర్చిలూ, మ్యూజియం లూ, చివరకి సీన్ నది మీద కట్టిన ప్రతి బ్రిడ్జీ, వందలాది ఏళ్ల చరిత్ర ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుండగా.. గాలేరియాలూ, గట్రా.. మనం అడుగు పెడితేనే మాసిపోతాయన్నట్టు.. 'ఏదైనా కొందాం అక్కడ సరదాకి' అనుకున్నాను కానీ.. ధరలు చూసి.. మాట్లాడకుండా బయటకి వచ్చి.. notre dome cathedral పక్కన ఉన్న వీధిలో హాయిగా బంధు మిత్రులకి మా రేంజ్ లో సావనీర్లు కొనుక్కుని..సంతృప్తి పడ్డాము. కానీ నాకైతే కనీసం పిల్లలకి మంచి ఫాషనబుల్ బట్టలు ఒక్క జత అయినా కొని ఉండాల్సింది.. అని పీకుతూనే ఉంది.
ఇంక రేపు ఉదయం విమానమెక్కుతాం కదా .. వెళ్లి ఫాషన్ పేరిట ఎక్కడా చిరుగులు లేని పాంటులూ, కాస్త ఎక్కువ బట్ట ఉన్న చొక్కాలూ తీసుకుని వచ్చేసా..

అక్కడినుండి పిల్లలు "అమెరికా, అమెరికా" అని కంగారు పడ్డారు.. కానీ నాకు మాత్రం పారిస్ మనస్సులో ఉండిపోయింది. ఎంత అందమైన నగరం, ఏమి కట్టడాలు, గాలరీలు, చర్చిలు, రాజ భవనాలు, పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకున్న చరిత్రా, పెద్దయ్యాక ఆంగ్ల నవలల్లో చదివిన వర్ణనలూ ఇన్నాళ్లకి చూడగలగగా, వాళ్ల రోడ్ సైడ్ కఫెలూ, మెట్రో లో ప్రయాణాలూ, ఫైన్ రెస్టారెంట్లూ, ఫాషనబుల్ బట్టల్లో నానా జాతుల వారు, డా విన్సీ, వాన్ గాగ్, మైకేలాన్జిలోలూ, గ్రీక్/రోమన్ దేవతలూ..కట్టడాలూ కళ్లల్లో మెదులుతూ ఉండగానే.. పారిస్ నగరం వదిలి సాన్ ఫ్రాన్ సిస్కో విమానం ఎక్కేశాం.

పారిస్ ఫోటోలు, అమెరికా విశేషాలు వీలుంటే ఇంకో టపాలో..










Tuesday, May 3, 2011 23 comments

కూ చుక్ చుక్ చుక్....




గత ఐదేళ్లు గా ఉద్యాన నగరి నుండి భాగ్య నగరి కి కార్ లో, విమానం లో బస్సు లల్లో ఎన్ని సార్లు వెళ్లామో లెక్కేలేదు. దేని అందం దానిదే నైనా.. రైల్లో ప్రయాణం మాత్రం నా ఫేవరేట్... వెళ్లిన ప్రతి సారీ ఏదో ఒక కొత్త వింత తెలుసుకునే లా చేస్తుంది.  మళ్లీ ఒక్కసారి కూడా కలవలేకపోయినా ప్రయాణం లో కలిసిన సాటి ప్రయాణికుల ముద్ర హృదయం లో ఎక్కడో శాశ్వతం గా వేసేస్తుంది...

వేసవి సెలవలా? పిల్లలు.. 'అమ్మమ్మ ఇల్లో' అని ఒకటే గొడవ.. వాళ్ళని హైదరాబాదు నగరం లో దింపి ప్రతి వారాంతం మేమూ వెళ్లి వస్తూనే ఉన్నాం.  ఈ హడావిడి తో టపాలూ రాయలేదు.. ఈ నెల.. ఒక బ్లాగు పుట్టినరోజు టపా వదిలి..

ఇవ్వాళ మాత్రం కాస్త ఖాళీ.. ఏప్రిల్ మాసం లో నాలుగు సార్లు వెళ్లి వచ్చాగా.. ప్రతి సారీ కొత్త అనుభవాలు.. సరదాగా బ్లాగ్మిత్రులతో పంచుకుందామనీ..






ఏప్రిల్ మొదటి వారం : ఉద్యాన నగరి ->భాగ్య నగరి..  ఆఖరి పరీక్ష రోజున..

పరీక్ష హాల్ లోంచి తెలుగు సినిమా ఆడే థియేటర్ కి వెళ్లి పోయేవాళ్లం.. మరి ఇప్పుడో .. ఆఖరి పరీక్ష రోజున కూడా టార్చర్ క్లైమాక్స్ ఎందుకని.. ఆ పధ్ధతి మానేశాం లెండి.. ఇలాగ ఎగ్జాం రాసి అలాగ రైలెక్కేసాం.. మా అమ్మాయిలు అసలు ఆఖరి పరీక్ష రాసాక.. ఇక జీవితం లో సాధించాల్సింది ఏమీ లేదన్నట్లు మొహాలు పెట్టి.. ఈ పరీక్షలు రాసి పెట్టాం.. మీ సంతోషం కోసం.. ఇక మేము చేయాల్సింది ఏదీ మిగల్లేదు అన్నట్టు.. అదేదో పది మంది సంతానం ఉన్న తల్లిదండ్రులు ఆఖరి పిల్ల పెళ్లి చేసాక అనుభవించేంత రిలీఫ్..







రైల్లో కనపడిన వస్తువల్లా కొనుక్కుని తిని ఆటలు పాటలతో వాళ్లు చుట్టు పక్కల ఎవ్వర్నీ పెద్దగా పట్టించుకోలేదు.. కానీ.. వృద్ధ దంపతులు.. మా ముందు సీట్లో.. ప్రతి చిన్న విషయం ఒకరితో ఒకరు చర్చించుకుంటూ.. ఒక పెద్ద సంచీ నిండా తెచ్చిన చిరుతిళ్లు ఒక్కోటి గా పధ్ధతి గా తీసుకుని తింటూ.. అంటే పకోడీలూ, బజ్జీల్లాంటివి కాదు పళ్ళు, మజ్జిగల్లాంటివి.. ఒకరి ఆరోగ్యం గురించి ఒకరు బోల్డు శ్రద్ధ తీసుకుంటూ..



తొమ్మిది దాటింది.. బెర్తులు దించేద్దామా అనుకుంటుండగా.. ఆయన మా ఆవిడ ఇంజెక్షన్ తీసుకున్నాక అరగంట ఇంకా మెలకువ గా ఉండాలి.. ఒక అరగంట ఆగి పడుకుంటారా? అని అడిగారు.. దానికేం భాగ్యం? అని  వాళ్ల తో కబుర్లు.. మొదలు పెడితే.. చాలా చాలా ముచ్చట అనిపించింది.. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక ఇద్దరూ ఒకరికి ఒకరు గా.. గత నలభై ఐదేళ్లు గా..  బోరింగ్ గా కాకుండా.. ప్రపంచం లో ఉన్న ప్రతి చిన్న విషయమూ చర్చిస్తూ.. ఒకరికోసం ఒకరుగా..  సామాన్య మైన ఆర్ధిక స్థితి, అయినా బోల్డు సంతోషం గా..

 మేముండగలమా అలాగ ఒక ముప్ఫై ఏళ్ల తర్వాత? వీళ్ల లానే ఉండాలి అని కూడా అనిపించింది.. చాలా ఇన్స్పైరింగ్ జంట!

వాళ్లు దిగుతున్నప్పుడు 'వాళ్లిద్దరూ ఉన్నంత కాలం ఆనందంగా ఆరోగ్యం గా ఉండాలని ఇద్దరిలో ఒక్కరే మిగిలిపోయే సందర్భం రాకూడదని ఎందుకో కోరుకోవాలి అనిపించింది...




భాగ్యనగరి -> ఉద్యాన నగరి మళ్లీ రిజల్ట్ రోజున..

రైలెక్కాక పిల్లలకి భయమే.. 90% దాటితే ఏదో కొంటానన్నాను.. 'అమ్మా.. 80% కూడా మంచి మార్కులే.. కొంటావా? అని.. బేర సారాలు మొదలు..  ఈలోగా ఎదురుగా ఉన్న ఒకాయన మాట్లాడుతూ.. తన హాబీ గురించి చెప్తే గమ్మత్తు గా అనిపించింది.. ఆయనకి HAM Radio membership ఉందిట.. చాలా ఆక్టివ్ గా ఉంటారట..

మాకూ ఇంటరెస్ట్ కలిగింది.. వివరాలు కనుక్కున్నాం. ఉదయం దిగేముందు ఫ్రీక్వెన్సీ కి ట్యూన్ అయి.. అక్కడ అప్పటికే ఉన్న సభ్యులతో మాట్లాడుతూ.. "రైల్లో ఉన్నాను.. నా ముందు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు". అని మా ఇద్దరు పాపలనీ పరిచయం చేసారు. వాళ్లూ ఉత్సాహం గా మాట్లాడారు... అనుకోకుండా.. ఒక కొత్తదనం.



మీకూ తెలుసుకోవాలనుకుంటే..

http://www.indianhams.com/home.asp

ఉద్యాన నగరి -> భాగ్య నగరి కి మళ్లీ (రిజల్త్స్ తర్వాత)

పొలోమని స్టేషన్ కి పరుగు... యశ్వంత పుర కి ..మరీ మధ్యాహ్నం రెండింటికే.. పిల్లలకి సరదా.. పెద్దలకి ప్రాణ సంకటం.. :-(


ఒక పక్క ఆఫీసు లో కస్టమర్ ఇష్యూ తో కుస్తీ.. బాసు గారు .. ఇలా వదిలేసి వెళ్తే ఎలా? అని గొడవ.. 'నాయనా.. ఇలాగ రేపు హైదరాబాద్ లో ఉదయం ఐదు కి దిగటం.. కస్టమర్ తో మాట్లాడతా.. ఈలోగా.. ఫోన్ లో మాట్లాడండి.. (స్టేషన్ కీ స్టేషన్ కీ మధ్య కనెక్షన్ కలిసి ఏడిస్తే అని మనసులో అనుకుంటూ).. ఆయన విసుక్కుంటూ ఒప్పుకున్నారు..  వేరే దారేదీ? నేను తప్ప ఆ ఇష్యూ మీద పని చేసే వారు లేరు.. నేనా.. ప్రయాణం పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదు..

ముందర పాత టపా ' (లాప్) టాబ్భూషణం భూషణం ' లో చెప్పినట్టు.. అరటి గెలా, అత్తగారూ, అల్లరి పిల్లలూ, గుడ్డ సంచీలూ (మరి ప్లాస్టిక్ వద్దని కదా) , స్టీల్ లంచ్ బాక్సుల్లో ఆవకాయన్నాలూ .. తలకి నూనెలూ, మొహాన బొట్లూ.. 'అబ్బే.. ఎవ్వరికీ ఆనేలేదు.. ' కాస్త దూరం వెళ్ళాక.. మా కంపెనీ బ్యాగూ, అందులోంచి లాప్ టాప్ దీసి పిల్లల ఆటలూ చూశాక కొద్దిగా ప్రవర్తన లో మార్పు,..




 ఒక చిన్నారి పాపాయి తల్లి దండ్రులు అన్నం తింటూ.. మాకు ఇచ్చేసారు.. ఇంకేం.. బోల్డు కాలక్షేపం!! రైలు లేటైనా.. 'అయ్యో అప్పుడే వచ్చేసామా' అనిపించేలా.. పాపాయి అసలు తల్లి దండ్రుల దగ్గరకి వెళ్తే గా? భాగ్య నగరి-> ఉద్యాన నగరి... పిల్లల్ని దింపేసి.. ఒక్కదాన్నే..
ఒక్కదాన్నే వచ్చానేమో.. పుస్తకాల లో మునిగి తేలి.. ఈదుతూ.. మధ్యలో గమనించాను.. ఎదురుగా ఉన్న (దాదాపు అరవై ఏళ్ల) ఆడవాళ్లంతా ఒక్కలానే ఉన్నారని..




కుతూహలం గా అడిగా.. ఏంటి ? అని.. వాళ్లు నవ్వేసి.. మేము ఆరుగురం అక్కచెల్లెల్లం మేము.. మాలో ఒక్కరే హైదరాబాద్ లో ఉంటుంది.. తన కొడుకు నిశ్చితార్థం అని వెళ్లి వచ్చాం... అన్నారు ఆశ్చర్యం వేసింది.. అందరూ బెంగుళూరులో బాంక్ ల్లో ఆఫీసర్లు, లెక్చరర్లు, అలాగ పని చేస్తున్నారు. వాళ్ల పెద్ద అక్క ఏమంటే అదే అన్నట్టున్నారు.. అసలు ఇలాగ గీసిన గీత దాటకుండా.. ఎంత చక్కగా ఉన్నారు? ఒకరిని మించి ఒకరు జోకులేస్తూ.. ఒకటే స్టీల్ కారియర్ తీసి భోజనం చేసి....

ఆశ్చర్యం వేసింది... ఆనందం గా అనిపించింది.. 'అయ్యో బెంగుళూరొచ్చేసిందా? ' అని నిట్టూర్చి దిగేసాను.
మళ్లీ భాగ్య నగరానికి... భార్యా భర్తలం..






రైలు ఇక కదులుతుందనగా భార్యా భర్తలు, ఒక టీనేజర్ కొడుకు వచ్చి ఎక్కారు. రొప్పు తగ్గక.. ఆయాస పడుతున్నారు.  'సాయి లీల .. వచ్చి ఎక్కాం అని తమిళం లో అనుకుంటున్నారు.. ' ఓహో చాలా సాయి బాబా భక్తుల్లా ఉన్నారు.. అనుకున్నాము..


కాస్త సెటిల్ అవగానే.. ముగ్గురూ, మఠం వేసి.. సత్య సాయి భజనలు మొదలు పెట్టారు.. ఇదేంట్రా.. ఇంత గట్టిగా మొదలు పెట్టారు అని విసుగేసింది.. కానీ.. ఒక పావు గంట దాటాక అనిపించింది. ఆవిడ శ్రావ్యం గా.. ఆయన భక్తిగా.. పిల్లవాడు ఉత్సాహం గా పాడుతున్నట్టు గమనించాము.

పెద్దవాళ్లు సరే, టీనేజర్ అంతలా పాడుతున్నాడంతే ఆశ్చర్యమే.. అనిపించింది. ఒక గంట కి పైగా పాడి.. ఇంక ఆపారు.. 'అమ్మయ్య.. ఇక చదువుకుంటా నా పుస్తకం ' అనుకోగానే.. పిల్లవాడు 'ఆంటీ.. అంకుల్.. మూసేయండి.. లాప్ టాప్స్ అలాగే పుస్తకాలు ' అని చనువు గా.. 'ఏదైనా డైలాగులు చెప్పండి అంకుల్.. అని తనని అడిగితె.. ఆయన.. చాలా చాకచక్యం గా..


'అబ్బే నాది ఆఫీస్ పని.. అంటీ కి ఇవన్నీ ఇష్టం.. తెగ పాడుతుంది.. ' అని నన్ను ఇరికించేసారు. ఎందుకన్నా మంచిదని నా తో ఐ కాంటాక్ట్ లేకుండా చూసుకున్నారనుకోండి..
మొదట విసుగనిపించి ..'ఏంటి ఈ అబ్బాయి ఇలాగ?' అని తెలుగు లో అనుకుంటుంటే ఆవిడ.. ' సారీ, మీకు ఇబ్బంది అయితే వద్దులెండి.. ' అంది ముభావం గా.. 'అయ్యో ' అని నొచ్చుకుని..  అసలు పాడటమంటే నాకు ఉన్న ఆసక్తీ.. చాన్స్ ఇలాగ దొరికితే ఊరుకోను అని ఆవిడని నమ్మించి.. 'ఎలాగోలా నేనూ రెండు మూడు పాటలు పాడి... ఆ అబ్బాయి చదువు కబుర్లూ, సాయి బాబా గారి కబుర్లూ, వారికి ఆయన పట్ల నమ్మకం, భక్తీ ఎలా ఏర్పడిందో.. చెప్తుంటే వింటూ కూర్చున్నాము.
పుట్టపర్తి లో ఎవరికో ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నారావిడ సాయి బాబా గారి పరిస్థితి..

"సాయి బాబా ఇంక నేడో రేపో అన్నట్టుంది.. అన్నారు కదా?"  అనగానే.. కుటుంబం అంతా ఏకగ్రీవం గా తీవ్రం గా ఖండించారు.. అంతా మీడియా వల్ల ఇలాగ అనుకుంటున్నారు. ఆయన కి మరణం లేదు..  ఇంకో పదేళ్ల తర్వాత ఐచ్చికం గా సమాధి అవుతారని చెప్పారు. నేను 'ఓకే.. ఓకే' అని వదిలేసాను.

టాపిక్ మార్చి మీరేం చేస్తారు అని అడిగాను.. ఆశ్చర్యం వేసింది. చాలా చాలా చదువుకున్న కుటుంబం. ఆవిడ బెంగుళూరు విశ్వవిద్యాలయం లో ఒక విభాగం లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మరియు డీన్.. అలాగే సాయి బాబా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో ఆవిడ ఒక డైరెక్టర్ ట.. మీటింగ్ కని ప్రతి నెలా వస్తారుట..
ప్రశాంతి నిలయం నెక్స్ట్.. దిగుతారా? అని అడిగాను.. వారికి ఈ రూట్ లో పుట్టపర్తి వస్తుందని తెలియదట. దానితో చాలా సంతోషించారు.. నాకు పెద్దగా బాబా గురించి తెలియదు. ఆయన వల్ల చాలా మంది స్ఫూర్తి చెంది డాక్టర్లు ఉచిత సేవ చేస్తారని, ఆయన ట్రస్ట్ త్రాగు నీరు ఎన్నో ప్రాంతాలకి అందించారనీ, ఆయన ట్రస్ట్ విద్యా సంస్తలనీ నిర్వహిస్తుందని తెలుసు. 

 అలాగే ఎన్నో సార్లు ఆ స్టేషన్ మీదుగా వెళ్లినా పెద్దగా ఆసక్తి గా అనిపించలేదు.. కానీ ఈ మధ్య టీ వీ ల్లో చూసి చూసి.. స్టేషన్ రాగానే నేనూ కుతూహలం గా పుట్టపర్తి లో దిగాను...  ఒక రకమైన గుగుర్పాటు గా అనిపించింది. వందలాది జనం.. ఆ ప్లాట్ ఫాం మీద సాష్టాంగ పడి సాయి బాబా.. కోలుకోవాలని 'ఓం సాయి రాం..' అని జపిస్తున్నారు.

నేనూ అప్రయత్నం గా.. ఇంతమంది అభిమానాన్ని దోచుకున్న సాయి బాబా.. కోలుకుంటే బాగుండును అని మనస్పూర్తి గా అనుకున్నా..



ఈలోగా.. వాళ్లబ్బాయి 'అమ్మా.. అక్కడ జనరల్ కంపార్ట్ మెంట్ లో అందరూ సాయి భజన లు చేస్తున్నారు.. వెళ్దాం పద' అనగానే.. ఆనందంగా కాస్త సామాన్లు మమ్మల్ని చూస్తో ఉండమని వెళ్లి పోయారు.  వాళ్లు వచ్చే లోపల పడుకున్నాము కానీ.. ఉదయం మళ్లీ వారి సాయి భజనల తో మెలకువ వచ్చేసింది...

రెండో రోజు సాయి బాబా మరణించారు .. నేను ఆవిడ కి SMS రూపం లో సంతాపం ప్రకటించాను.. ఆవిడ రైలు టికెట్ కాన్సెల్ చేయించి కార్ లో ఆఖరి దర్సనం చేసుకోవటానికి వెళ్ళాం అని సమాధానం ఇచ్చారు..







ఉద్యాన నగరి -> భాగ్యనగరి మూడు రోజుల క్రితం.. బస్సు లో..

రైలు టికెట్ లేదు గా.. సరే అని బస్సు లో ప్రయాణం.. నేనేక్కినప్పుడు ప్రభాస్ సినిమా 'డార్లింగ్' నడుస్తోంది.. ఏదో సరదాగానే ఉన్నట్టుందని చూస్తున్నా.. ఒక గంట లో అయింది.. ఈసారి 'ఎక్ నిరంజన్ ' వేసాడు.

అబ్బా.. ఏంటీ.. ఈ ప్రభాస్ మోత.. అని విసుక్కుంటూనే చూసా.. అసలే బోల్డు డబ్బు పోసి కొన్నాం టికెట్.. అని.. అంతే.. ఉదయం నిద్ర లేస్తూనే హైదరాబాద్ పొలిమేరల్లో.. నా స్టాప్ రాగానే దిగిపోయాను.

భాగ్య నగరి -> ఉద్యాన నగరి నిన్న.. మళ్లీ కాచిగూడా ఎక్స్ ప్రెస్ లో...

ఒవైసీ, పహల్వాన్ కాల్పుల గొడవల తర్వాత హైదరాబాద్ బంద్.. పైగా వర్షం.. అని ఎందుకైనా మంచిదని ముందు బయల్దేరితే.. మరీ రైలు టైము కి రెండు గంటల ముందే వచ్చి చేరాం.. బోల్డు పుస్తకాలు కొనుక్కుని  రైల్లో సెటిల్ అయ్యాక చూస్తె..  పిల్లలు కొద్దిగా బెంగ గా.. మరి అమ్మమ్మ గారింటినుండి వచ్చే పిల్లలంతే గా?

ఏవో పేక ముక్కలతో మాజిక్ చేస్తానని మా అమ్మాయి గొడవ. ,.. నాకేమో పుస్తకం చదవాలనీ.. అన్యమనస్కం గా వహ్వా లు చెప్తూ పుస్తకం చూస్తుంటే.. ఎదురుగా కూర్చున్న ఒకాయన 'ఏదీ నాకు చూపించు నీ మాజిక్? '  అని దాన్ని అడిగారు.. 'అమ్మయ్య.. ఇక నా పని చూసుకోవచ్చు.. కాసేపు.. ' అని పుస్తకం తెరిచా.. ఈలోగా చిన్నమ్మాయి.. ఏవో కబుర్లు చెప్తోంది. సరే లెమ్మని పుస్తకం మూసి వింటున్నా. మాటల్లో అర్థమైంది. ఆయన ఒక సర్జన్ అని. కుతూహలం గా ఆయన పక్కన కూర్చున్న ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో కబుర్లు చెప్తుంటే వింటూ కూర్చున్నా..

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేతిలో తెలుగు పత్రికలని చూసి.. తెలుగు బ్లాగుల గురించి చెప్పి.. అగ్గ్రగేటర్ల లంకెలు ఆయన పత్రికల మీద రాసాను..




Doctor Subbarao V Kanchustambam

మా అమ్మాయితో ఆడే ఆయన ఒక Liver Transplant Surgeon. అపోలో ఆసుపత్రి లో చేస్తారట.. (ఆయన తన గురించి అంతే చెప్పుకున్నా.. వచ్చాక google చేస్తే తెలిసింది ఆయన గురించి..

దేశం లో కాలేయ మార్పిడి శాస్త్ర చికిత్సా నైపుణ్యం లో ఆయన కి ఆయనే సాటి అని.. ఆంద్ర ప్రదేశ నుండి ఆయన ఈ ఫీల్డ్ లో ప్రథముడనీ.. 2006 లో ఉత్తమ వైద్య బిరుదాన్కితుడనీ.. మూడు రోజులు వరసగా ఈ సర్జరీలు చేసిన ఏకైక వైద్యుడిగా ఘనత దక్కించుకున్నవారనీ.. ఇలాగ.. వీలయితే ఈ లంకే చూడండి.. ఆయన news paper clippings, ఆయన చదువు, వృత్తి వివరాలన్నీ ఉన్నాయి..



http://www.liversurgeonindia.com/index.html

నాకున్న అనుమానాల గురించి అడగాలనిపించింది... కొన్ని ప్రశ్నలు మీ ఫీల్డ్ గురించి అడగాలని ఉంది .. పరవాలేదా? అని అడిగాను. ఆయన చిరునవ్వుతో.. 'Please go ahead' అన్నారు. సరే మొదలు పెట్టాను ఇంటర్వ్యూ...
రెండేళ్ల క్రితం ఒక సహోద్యోగిని తండ్రికి కాలేయం పూర్తిగా చెడిపోయిందనీ కాలేయం లో 30% కుటుంబ సభ్యులు దానం చేయగలిగితే చాలు అని అంటే నలుగురు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఉన్నప్పటికీ ఒక్కరు తప్ప అందరూ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నారు. ఆ మిగిలిన ఒక్కరూ కూడా కాలేయ దానం ఇవ్వటానికి ఒప్పుకున్నారని కాదు. ఆవిడ యాభై ఏళ్ల మానసిక వికలాంగురాలు. అందరూ ఆవిడ దగ్గరినించి దానం తీసుకుంటే మంచిదని మిగిలిన వారంతా ఏకగ్రీవం గా అంగీకరించినా..

ఆ కుటుంబం లో ఒక్కరికి మాత్రం అది అన్యాయమనీ.. నోరు తెరచి తన బాధ నైనా చెప్పుకోలేని మనిషి దగ్గర్నించి ఇలాగ అవయవ దానం స్వీకరించటం అమానుషం అని ఒక అమ్మాయి అందరినీ ఆలోచింపచేసింది. ఈ విధం గా తాత్సారం చేస్తుండగా ఆయన మరణించారు.
అవయవ దానం గురించి ఈ మధ్య అవగాహన అందరికీ బాగానే ఉంది కదా.. నాకు తెలిసిన కుటుంబాల్లోనే ఎంతో మంది కుటుంబ సభ్యులకి మూత్రపిండాలని దానం చేసిన వారిని, అలాగే ఇంకా bone marrow లాంటివి వింటూనే ఉన్నాను.  అలాగే చనిపోయాక శరీరాన్నే దానం చేయాలని మా అమ్మగారు విల్ కూడా రాసారు మరి. మిగిలిన అవయవ దానాలు.. ఒక పూర్తి పార్ట్ ఇవ్వటం తెలుసు .. మరి ఈ కాలేయం 30% ఇవ్వటం ఏంటో.. అర్థం కాలేదు మరి..

ఆయన నవ్వి ఆయన రైలు టికెట్ ప్రింట్ అవుట్ తీసి వెనక బొమ్మ వేసి చూపారు. కాలేయం లో 8 భాగాలు ఉంటాయని.. ప్రతి పార్ట్ ఒక అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో ఒక్కో ఫ్లాట్ కీ వాటి కరెంట్, నీరు సప్లై విడి విడి గా ఉన్నట్టు రక్త నాళాలు ఉంటాయని.. కొన్ని ఫ్లాట్లని ఎలాగైతే జాగ్రత్త గా తీసి అసలంటూ పూర్తిగా కాలేయం పాడయిన వారికి అమర్చవచ్చని చెప్పారు. 60 % కాలేయాన్ని దానం చేసినా.. కొద్ది నెలల్లో మళ్లీ యధాస్థితి కి వస్తుందని చెప్పారు. అలాగే లివర్ కి మాత్రం ప్రత్యామ్నాయం లేదని చెప్పారు.
నేనూ అది విన్నట్టే గుర్తు.. హృదయానికి వెంటి లేటర్లూ, మూత్రపిండానికి బదులు గా డయాలసిస్ లాంటివి ఉన్నాయి.. కానీ కాలేయం లేకపోతే ఇక అంతే..

ఈ కాలేయం మార్పిడి వల్ల దాత లకి ఏమైనా రిస్క్ ఉందా? అని అడిగితే 6000 మార్పిడులలో ఒక్క 15 మంది మాత్రం వివిధ కారణాల వల్ల మరణించారని చెప్పారు. ఒక్కోసారి ఈ చికిత్స జరిగాక ఎక్కడో లోపల ఉన్న వేరే ఏదో సమస్య బయట పడి బాధ పడిన వారున్నారని,

అలాగే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న ఒక  సీనియర్ తెలుగు నటి భర్త కి ఇలాగే కాలేయ మార్పిడి కి తమ పని మనిషి దగ్గర్నించి దానం తీసుకుంటే.. కాస్త ఎక్కువ శాతం తీసేసారట పాపం అతని దగ్గర్నించి. దానితో ఆతను మరణిస్తే .. పెద్దవాళ్లు కదా కేస్ కాకుండా తప్పించుకున్నారని చెప్పారు. బాధేసింది.. ఏం చేస్తాం?




ఈ మార్పిడి కి 6-7 గంటల శాస్త్ర చికిత్స కనీసం ఐదుగురు వైద్యుల బృందం నిర్వహిస్తుందని వివరించారు. దీనికి కనీసం 25-30 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని కూడా చెప్పారు.  Brain death అయ్యాక నాలుగు గంటల్లో ఈ మార్పిడి చేయవచ్చని చెప్పారు. బోల్డు లైన్ ఉంటుంది ..కాలేయాలకోసం ఎదురు చూస్తూ ఆసుపత్రిలలో చికిత్స పొందేవారి తో.. అని ఒక వ్యక్తీ చనిపోతే వారి సమీప బంధువులు ఒప్పుకుని సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు.


మీరు సగటున వారానికి ఎన్ని సర్జరీలు చేస్తారు? అని అడిగితె
వారానికే? అని నవ్వేశారు... నెలకి మూడు నుండి నాలుగు దాకా చేస్తానని చెప్పారు. ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలకి వివరం గా సమాధానాలు చాలా ఓపిగ్గా చెప్పారు..

మచ్చుకి..


మాంసాహారం తింటే ఎక్కువ రిస్క్? - లేదు

ఆల్క హాల్? - 90% కాలేయం సమస్యలకి మూలం ఇదే

శాకాహారం లో? - పిండి పదార్థాలు తగ్గించాలి
అలాంటివి ఎన్నో అనుమానాలు తీర్చారు.. ఆయన ప్రజలకి కాలేయం మీద అవగాహన పెరగటానికి ఒక సంస్థని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
చివరగా.. మీకు ఈ వృత్తి వల్ల ఎంతో సంతృప్తి గా ఉండి ఉండవచ్చు కదా.. మీకు ఎప్పుడైనా విసుగ్గా.. కష్టం గా అనిపిస్తుందా? అని అడిగితె.. ఆపరేషన్ అప్పుడు anxiety ఉంటుంది..
అలాగే అన్ని లక్షలు పోసాం కాబట్టి సక్సెస్ అయి తీరాలని బంధువులు అనుకుని దీంట్లో ఉన్న రిస్కుల గురించి అస్సలూ ఎంత చెప్పినా అర్థం చేసుకోరని అన్నారు.. నిజమే కదా అనుకున్నాను..
ఇంక నా ప్రశ్నల పరంపర ని ముగించే ముందు.. ఆఖరు గా ఒక్క ప్రశ్న.. ఇలాగ ఏదో సరదాగా రైల్లో వెళ్తుంటే.. నాలాంటి వాళ్లు ఇలాగ మీ వృత్తి సంబంధమైన విషయాలే చర్చిస్తుంటే మీకెలా అనిపిస్తుంది? అని అడిగితే

ఆయన నవ్వేసి..'పర్వాలేదు.. ప్రశ్నలకి సమాధానం చెప్పటం కూడా ఒక పనేనా? ' అన్నారు. ఉదయం రైలు దిగుతూ.. మీరు చెప్పిన విషయాలు నా బ్లాగ్ లో వేసుకుంటాను అని అడిగాను. ఆయన.. 'అలాగే ' అని లింక్ మెయిల్ చేయమని చెప్పారు.


అవండి!!!  మా ఏప్రిల్ మాసపు ప్రయాణాల కబుర్లు.. అన్నీ టీవీలూ, పత్రికలూ,  గూగుల్ నుంచే కాకుండా..  ఇలాగ అనుకోకుండా.. గొప్పవారిని కలవగలగటం.. విషయాలు తెలుసుకోగలగటం... నేనైతే  చాలా హాపీస్!  మే నెల లో మా ఇంటర్ నేషనల్ విహార విశేషాలతో మళ్లీ కలుస్తాను..
 
;