మీటింగ్ లో ఉన్నా.. సెల్ మోగుతోంది.. 'అప్పుడే మూడున్నరైంది' అనుకుని బయట పడి కాల్ అటెండ్ అయ్యాను. చిన్నదాని ఫోన్.
'అమ్మా.' సాక్రీన్ స్వీట్ గా చిన్న దాని గొంతు. నాకు తెలుసు ఏదో ఫిట్టింగ్ పెట్టటానికే. మా చిన్నదానికి అవసరమైన విషయాల్లో తప్పించి వేరే వాటన్నింటిలో తెగ తెలివి తేటలు.
గంభీరం గా గొంతు పెట్టి..'చెప్పు త్వరగా.. మీటింగ్ లో ఉన్నా.. అరగంట లో బయల్దేరతా ఇంటికి..' అన్నాను.
'సుకృతి కి 1/8. '
'నీకేన్నొచ్చాయి ?'
'అసలు క్లాస్ లో అందరికీ ఒకటే మార్క్ వచ్చింది ఎనిమిది కి'
'నీకెన్ని?'
'అసలు పేపర్ చాలా కష్టం గా...'
'నీకెన్ని?'
'అంటే.. నాకు సుకృతి కన్నా ఎక్కువ...'
'నీకెన్ని?!!!!'
గొంతు .చాలా చిన్నదైపోయింది. ఒక్కసారి గా..
..'' రెండు మార్కులు
'వినపడట్లా''రెండు మార్కులు' అని త్వరతరగా 'అసలు నా మార్కులు అంత తక్కువగా ఎందుకొచ్చాయో తెలుసా?'
'ఎందుకబ్బా? Give me one good reason!' 'ప్రతి సారీ నా ముందు కూర్చునే ఉదిత్ గాడిని ఈసారి వెనక కూర్చో బెట్టారు'
'ఏంటీ!!!! కాపీ చేస్తున్నావా? నీకు పిచ్చా? సున్నా వచ్చినా పర్వాలేదు. కాపీ చేస్తే మాత్రం చంపేస్తా!'
'అదే మాట మీదుండు!.. మాట మార్చకు. నేనేం కాపీ ఎప్పుడూ చేయను.జీరో కన్నా ఎక్కువే వచ్చాయి కదా..'
'మధుమిత కి ఎన్నొచ్చాయి?'
'దానికా.. ఏడు.'
'వినపడట్లా'
'ఏడు'
'మరి అందరికీ తక్కువ మార్కులొచ్చాయన్నావు?''దానికే ఎందుకో ఎక్కువొచ్చాయిలే!'
'అమ్మా.. నీకే ఇంత బాధ గా ఉందే.. మరి సుకృతి వాళ్లమ్మ కి ఎంత బాదుండాలి చెప్పు..It must be insulting for her'
'ఏం?'
'వాళ్లింట్లో హిందీ మాట్లాడతారు.. అయినా దానికి..'
'అబ్బా... మరి నీకు తెలుగు ఎంత వచ్చో !!'
'నాకు స్కూల్ లో నేర్పరు కదమ్మా..'
'మరి మధుమిత ఇంట్లో తమిళ్ మాట్లాడతారు కదా?'
'అబ్బా... చెప్పాగా.. దానికి ఏదో తేడా..'
'ఆ??
'అన్నింటికీ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్లతోనే కంపేర్ చేసుకోకూడదమ్మా!.. ఒక్కోసారి మిగిలిన వాళ్ల తో కూడా కంపేర్ చేసుకోవాలి'
'నీ దగ్గర్నించే నేర్చుకోవాలి పాఠాలు నేను.. ఇంటికి రానీ నీ పని చెప్తా!!'
'కృష్ణాజీ.. We are waiting...' లోపల నుంచి మా సింగ పెరుమాళ్...
'Coming.. just a minute' ... 'ఇదిగో.. తప్పులైన పదాలని ఐదు సార్లు రాయి. సరేనా?''అమ్మా.. నువ్వెప్పుడోస్తున్నావు? '
'గంట లో ఉంటా ఇంట్లో.. I need to run..'
'గంట కి కదా.. అప్పటికి రాసేస్తాలే!'
'రాయక పోవాలి.. ఈరోజు ఆటలు లేవు.. అసలు రోజూ నాతో ఒక గంట కూర్చోవాలి నువ్వు ఈరోజు నుంచీ సరేనా?'
'అబ్బా... రేపటి నుంచీ చదువుకుందాం'
'కృష్ణా.. Are you coming back? Or shall we continue later?' ఆశ గా సింగ పెరుమాళ్..
అబ్బే.. అతికష్టం మీద మీటింగ్ కి అందరూ వచ్చారు. అంత తేలిగ్గా వదులుతానా?
'తల్లీ.... లేటర్.. ఐ రియల్లీ నీడ్ టు రన్!'
'థాంక్స్ అమ్మా.. ఒకవేళ కరంట్ పొతే.. నేను రాయలేకపోతే ఏమీ అనద్దు.. ఓకే?''ఓకే ఓకే'
లోపల కొచ్చాక అర్థమైంది.. అదేమందో.. కరెంట్ పొతే రాయటానికేంటిట?
ఇంటికెళ్లాక చెప్తా దాని పని. 'హః.'. ఒళ్లు మండుతోంది...
* * * * * * * * "తీయవే పుస్తకాలు... ఏం చెప్పారు ఇవ్వాళ క్లాస్ లో ?'
'సోషల్ లో Our Country చెప్పారు.'
'తీయి అయితే చూద్దాం ..'
'గ్లోబ్ తీసుకునిరా'
(అరగంట తర్వాత, నాలుగు అరుపులు, ౨౦ పెడబొబ్బలు అయ్యాక.. ఏడుపు మొహం తో వచ్చి కూర్చున్న అరక్షణానికి..'
'ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్'
'Who is it?'
'Aunteeeee.. Can she come out to play?'
'Nooooo.. she is studying'
'మన దేశం లో ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియన్ సముద్రం, దక్షిణాన హిందూ మహా సముద్రం.. చూడు...'
'అసలు ఏమంటున్నావు? నాకర్థం కావట్లే'
(హః. ఇంగ్లిష్ మీడియం పిల్లలు :-(( ' - మనస్సులో అనుకుని).
'మన దేశానికి నార్త్ లో హిమాలయాజ్, ఈస్ట్ లో బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ లో అరేబియన్ సీ, సౌత్ లో ఇండియన్ ఓషన్ .. చూడు..'
(పిల్ల ఆలోచన లో..)
'ఏంటి మళ్లీ.. ఆలోచనలు.?.'
'నీళ్లల్లో ఇండియన్ ఓషన్ కీ, అరేబియన్ సీ కీ మధ్య లైన్ ఎలా గీస్తారు? బార్డర్ ఎలా తెలుస్తుంది?'
(ఏదో సద్ది చెప్పి..ఇండియా లో వివిధ భౌగోళిక పరిస్తుతులని వర్ణిస్తున్నా.)
'ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్'
'Who is it?'
'Aunteeeee.. Can she come out to play?
'Nooooo.. she is studying'
'రాజస్థాన్ లో డిసర్ట్.. అక్కడ అన్నీ కాక్టస్ లూ, థార్నీ ప్లాంట్స్ మాత్రమే పెరుగుతాయి..'
'అంటే రోజెస్ లాంటివి?' (చిలిపి గా)
'చంపుతా.. నీకు తెలుసనీ నాకు తెలుసు.. Let me continue.. అక్కడ రోజంతా చాలా వేడిగా.. రాత్రంతా.. విపరీతమైన చల్లగా.. నీళ్లు తక్కువ..పంటలు తక్కువ..."
"కిసుక్కు..."
(ఇదేంటబ్బా.. కాస్త తేడా గా.. అని చూస్తే పెద్దది.. ఏంటి.. అన్నట్టు దాని వైపు చూసా..)
'అక్కడ పీపుల్ పోయెమ్స్ ఎలా రాస్తారా అని ఆలోచిస్తున్నా.. ఆల్వేజ్ మా టెక్స్ట్ బుక్ లో ఎప్పుడూ, బ్యూటిఫుల్ ఫామ్స్, ఫీల్డ్స్, గ్రీనరీ, వాటర్ స్ట్రీమ్జ్ నే దిస్క్రైబ్ చేస్తారు కదా'
'ఆగవే.. అసలే నేను చస్తుంటే.. రాజస్తాన్ లో పొయెట్రీ ఎలా రాస్తారో నాకెందుకు?'
'ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్'
'Aunteeeee.. Can she come out to play?'
'Nooooo.. she is studying'
'ఆ.. ఎక్కడిదాకా వచ్చాం? లేక్స్.. ..'
'I know.. I know.. చిలుక లేక్ కానీ గ్రీన్ గా ఉండదు. సాంబార్ లేక్ వాటరీ గా ఉంటుంది.. వులార్ లేక్ -- దీనికే ఏమీ ఫన్నీ గా చెప్పటానికి లేదు.. ఏం చెప్పచ్చు?'
'ఆంటీ ప్లీజ్.. సెండ్ హర్ అవుట్! వీ నీడ్ హర్!!' (అరడజన్ పిల్లలు గుమ్మం దగ్గర..)
'సరే పో.. గంటలో ..'
మళ్లీ వచ్చేయాలి.... అనేలోపలే.. గాయబ్! చాల్లే ఇవ్వాల్టికి చదివిన చదువు చాలు!