Saturday, February 5, 2011 122 comments

వింటే భారతమే వినాలి.. తింటే...



పిల్లలకి కథలు చెప్పటం నాకు ఇష్టమే కానీ కథలే రావు. పోనీ నాకు తెలిసిన నాలుగు కథలైనా చెప్దామని చూస్తే, అవన్నీ పిల్లలు ఏ కార్టూన్ చానెల్ లోనో.. లేదా.. టింకిల్ లోనో చదివేసాం అనేస్తారు. రోజూ కథలు.. అందునా ఏడేళ్లకు పైగా చెప్పాలంటే.. ఏ సుధా మూర్తో కావాలి కానీ నా లాంటి వాళ్ల తరమా?  పోనీ ఏదైనా కథ చదివి చెప్దాం అనుకుంటే వాళ్ళు నా కన్నా ముందుగానే చదివేస్తున్నారు. :-((

అప్పటికీ రెండేళ్ళ క్రితం ఒక ట్రిక్ కనిపెట్టి వాడటం మొదలు పెట్టాను. కథ లో ఒక దుర్గుణం ఉన్న పిల్ల ఉంటుంది.. కథ పూర్తయ్యేసరికి ఆ దుర్గుణా న్ని  అధిగమిస్తుంది.  ఏ కళనున్నారో.. ఒక వారం విన్నారు. తర్వాత.. మా పెద్ద అమ్మాయి 'Ammaa.. Please don't tell me the stories of bad girls turning in to good girls.. I got the msg..' అనేసింది.  ఈ కాలం పిల్లల్ని కసి తీరా తిట్టుకుని, నా చిన్నప్పుడు ఎంత వినమ్రం గా  ఉండేవాళ్ళం? అనుకుని.. ఊరుకున్నాను.

ఇలా కాదు.. ఈసారి మన ఇతిహాసాలు, పురాణాలు,  వెలికి తీసి చెప్దాం అనుకుని చూస్తే.. హనుమంతుడి కథలూ, చిన్ని కృష్ణుడి లీలలూ TV లో చూసేసారు.. రామాయణమూ, వినాయకుడి కథలూ ఏదో చానెల్ లో వేస్తూనే ఉన్నారు. .. బిక్క మొహం వేసాను.. పైగా మా చిన్నది.. 'మొన్నటి వరకూ.. నా favorite god హనుమాన్ జీ కానీ టీ వీ లో 'బాల్ గ ణేశ' చూసాక ఇప్పుడు 'శివ జీ ' అంది...  ఇక నా వల్ల కాదు అని వదిలేసాను కానీ.. మొన్న దీపావళి కి ఇల్లు దులుపుతుంటే.. ప్రయాగ రామకృష్ణ 'భారతం లో చిన్న కథలు ' కనిపించింది. కానీ.. వద్దులే చిన్నపిల్లలకి ఒకటి రెండు కథలు పర్వాలేదు కానీ.. వాళ్లకి అర్థమయ్యేలా, ఆసక్తికరం గా.. మహా భారతం  చెప్పాలంటే కష్టమే.. అనుకున్నా  ముందర ౨-౩ సార్లు ప్రయత్నించి మానేసాను.  మళ్ళీ చూద్దాం అని మొదలు పెట్టాను..



ప్రతి సారీ భరతుడి పుట్టుక తో మొదలు పెట్టి.. మరీ chronological  గా చెప్పటం వల్ల వాళ్లకి ఆసక్తికరం గా చెప్పలేక పోతున్నట్టు అనిపించి.. ఈసారి వ్యూహం మార్చి చిన్న పిట్ట కథ తో మొదలు పెట్టి చూస్తే ఆసక్తి గా వింటారేమో చూద్దాం అని మొదలు పెట్టాను, ఏకలవ్యుడి గురించి..కథ తో.. 

వింటే భారతమే వినాలి.. తింటే గారెలే తినాలి.. అన్నాను.. ఉపోద్ఘాతం గా..
I don't like gaarelu anyway.. అంది విసుగ్గా.. మా పెద్దమ్మాయి. 
సరే పిజ్జా అనుకో.. అన్నాను..



మా పెద్దమ్మాయి అలవాటుగా పెదవి విరిచి.. 'I know this one' అని అనాసక్తి గా అటు తిరిగి పడుకుంది. మా చిన్నమ్మాయి పెద్దగా పుస్తకాలు చదవటం అవీ చేయదు.. అందువల్ల జాగ్రత్తగానే వింది. కథ పూర్తయ్యాక.. 'How mean?' అంది. ద్రోణాచార్యుడు ఆవిధం గా ప్రవర్తించటానికి కారణాలున్నాయి అని ఆగాను. మా పెద్దమ్మాయి కొద్దిగా ఇటు తిరిగినట్టు అనిపించింది.  

హమ్మయ్య అనుకుని.. కొద్దిగా ఆయనకు హస్తినాపురి తో ఉన్న అనుబంధాన్ని.. అసలు ఆయన ఎందుకు కురు వంశం వాళ్ళ రాకుమారులకి గురువు ఎలా అయ్యాడో చెప్పి.. అసలు దానికీ ఇంకో రీజన్ ఉంది.. అని ఆపేశాను.  అప్పటికి ఇద్దరూ చాలా ఆసక్తి గా వింటున్నట్టు అనిపించింది. కృపి, కృపాచార్యుల వారి పరిచయం జరిగింది.. ద్రోణాచార్యులవారి బీదరికం సంగతి చెప్పి.. ఆయనకి వేరేచోట తిండికి మార్గమేలేక కాదు ఒక లక్ష్యం తో వచ్చాడు..  ఆ లక్ష్యం గురించి రేపు చెప్తాను అని ఆపేశాను.


నేనాశించిన రియాక్షన్ అయితే వచ్చింది...'నో అమ్మా.. ప్లీజ్.. చెప్పు ఎందుకు వచ్చాడో...' అని.. నేనూరుకోలేదు.. కుదరదు అని కథ ఆపేశాను.  మర్నాడు మళ్ళీ అన్నం తిన్నాక, ద్రోణాచార్యుడి చిన్నప్పటి విషయాలూ, ఆయనకి ద్రుపదుడితో స్నేహం, తర్వాత పెద్దయ్యాకా వచ్చిన విభేదం గట్రా చెప్పి మళ్ళీ కౌరవుల, పాండవుల చిన్నప్పటి కాలం లోకి లాక్కొచ్చి పడేశాను. 

పాండవులూ, కౌరవులూ అంటే కజిన్లే కానీ వారికి వైరం ఉన్న విషయం వారికి అర్థం అయ్యేలా చేసి వారిచేతే.. 'ఎందుకూ' అని అడిగించి వాళ్ళ తల్లిదండ్రుల పరిచయం చేసి..
వారు ఆవిధం గా.. ఒకరు అంధత్వం తోనూ, ఇంకొకరు పాండు రోగం తోనూ.. పుట్టటం వెనక కూడా ఒక రహస్యం ఉందని చెప్పి ఆరోజు కథ ఆపేశాను. మళ్ళీ గొడవ. ఇంకా చెప్పు.. చెప్పు అని..

ఇలాగ.. పాండవులకీ, కౌరవులకీ ఉన్న వైరం గురించి చెప్తూ.. వారి పూర్వీకుల కథల్లోకి ఒక్కొక్కరి కథ లోకి తొంగి చూస్తూ.. మళ్ళీ వర్తమానం లోకి వస్తూ కథ నడిపిస్తూ మా ఇంట్లో మహా భారత సాగరం లో ఈదుతూ ఉన్నాం. దీపావళప్పుడు మొదలు పెట్టిన కథ సంక్రాంతి దాటినా అవలేదు..  'కట్టె, కొట్టె, తెచ్చె ' గా చెప్పవచ్చు గానీ..


ప్రపంచం లో ఉన్న సమయం అంతా ఈ కథ చెప్పుకోవటానికే అన్నట్టు.. మేము.. ఏ చిన్న విషయమూ వదలకుండా.. 10 నిమిషాల కథా.. 20 నిమిషాల చర్చా.. వాళ్ళ భావోద్వేగాలు అన్నీ విపులం గా చెప్పుకుని ఆలోచిస్తూ అలాగ..

సాధారణం గా మన ఇతిహాసాలూ, పురాణాలూ చదివితే చదివిన వారికీ, విన్న వారికీ.. ఫలానా శుభాలు కలుగుతాయని శ్లోకాలు ఉంటాయి కదా.. అవన్నింటి సంగతీ ఏమో కానీ.. నాకు  గత రెండున్నర నెలల్లో కలిగిన శుభాలైతే ఇవీ.. 


ఇంట్లో టీవీ గోల తగ్గి పిల్లలు ఒక రకమైన ఆలోచన లో పడ్డారనిపించింది..  త్వరగా పని పూర్తిచేసుకుని మర్నాటికి కావలసినవి రెడీ చేసుకుంటే కానీ భారత కథ ఉండదన్నానని..  పనులన్నీ చక చకా పూర్తి చేసుకుని నేను వంట చేస్తున్నా.. వేరే పనులు చేస్తున్నా.. నా వెనకే తిరుగుతూ వంటిట్లో రెండు స్టూల్లేసుకుని కూర్చుని నాకు పప్పులూ, ఉప్పులూ అందించటం.. 

రికార్డ్ స్థాయిలో.. గడియారం ఎనిమిది కొట్టేసరికి పిల్లలుమంచం ఎక్కేసి.. కథ కోసం ఆరాట పడేవారు..  రోజు లో చాలా సార్లు భారతానికి సంబంధించిన ప్రశ్నలెన్నో అడిగేవారు.  



కొన్ని ప్రశ్నలు ఇబ్బంది పెడితే.. కొన్ని అబ్బురపరిచాయి. కొన్నింటికి సమాధానాల కోసం నాకు తెలిసిన పెద్దవారినీ, పండితులనీ సంప్రదించాల్సి వస్తే.. కొన్ని ప్రశ్నలు నాకు రాలేదేమని ఈర్ష్య కలగ జేశాయి.  మచ్చుకి..  


లాక్షా గృహ దహనానంతరం పాండవులు తమకిచ్చిన ఆహారం లో సగం భీముడికివ్వాలని కదా రూల్? మరి కుంతి ద్రౌపది ని తెచ్చినప్పుడు.. అందరూ సమానంగా పంచుకొమ్మని రూల్ ఎందుకు మార్చింది?

Thank God.. matsya yantra test was not won by one of kauravaas'  

'Wow.. Mahabharat is based on hatred in brothers, and Ramayan is based on love..'


ఉపపాండవులు పాండవులని ఏమని పిలిచేవారు? ధర్మరాజ నాన్నా? భీమ నాన్నా.. అలాగా?

ఒక  అక్కా, తమ్ముళ్లలో అక్క రాణి అయి, తమ్ముడు రాక్షసుడిలా అయ్యాడు? (సుధేష్ణ, కీచకులు)
ధృతరాష్ట్రుడికి తన పిల్లలందరి లోనూ.. ఒక్క దుర్యోధన దుశ్శాసనులే ఎక్కువగా ఇష్టమా? అర్జునుడే ఎక్కువ డామేజ్ చేస్తే.. భీముడిని ఎందుకు కౌగలించుకుని చంపాలనుకున్నాడు? 
విశ్వరూపాన్ని , ధృతరాష్ట్రుడు చూడ గలిగాడు కదా మరి గాంధారి పట్టీ తీసిందా? ..  స్నానం చేసేటప్పుడు.. పట్టీ తీస్తే కనిపిస్తుందా? అని
ఆశ్వత్థామ హతః కుంజరః అన్న ఒక్క అబద్ధానికి కొన్ని క్షణాల పాటూ నరకాన్ని చూసాడు కదా ధర్మరాజు.. మరి 'What about gambling and loosing brothers and wife and troubling them for years..?'

కథ  అయ్యాక సరదాకి కొన్ని ప్రశ్నలడిగాను. 
మహా భారత యుద్ధానికి కారణమెవ్వరు? ఒకళ్ళు ద్రౌపది, ధర్మరాజులనీ, ఇంకొకళ్ళు భీష్మ ప్రతిజ్ఞ-ధృతరాష్ట్రుడు గుడ్డి వాడవడమనీ..  సుయోధనుడి జెలసీ అనీ చెప్పారు.
గాంధారి కరెక్ట్ పని చేసిందా? అంటే... ఒకళ్ళు 'లేదు.. She should have helped him instead..' అని,.. 'ఏమో.. ధృతరాష్ట్రుడికి జెలసీ అనుకుని కట్ట్కుకుందేమో.. అని.. 
బెస్ట్ కారెక్టర్ ఎవరు భారతం లో ? అంటే  ఒకళ్ళు 'అఫ్కోర్స్ కృష్ణుడని, ఇంకోళ్ళు.. కర్ణుడనీ 
బెస్ట్ లేడీ.. అంటే..ఒకళ్ళు ద్రౌపది అనీ, ఇంకొకళ్ళు కుంతి అనీ.. 


అలాగే నువ్వే ద్రౌపది వైతే ఏం చేసేదానివి? కుంతి వైతే ఏం చేసేదానివి? యుద్ధం ఏం జరిగితే ఆగి ఉండేది.. లాంటి చాలా ప్రశ్నలకి వారి సమాధానాలు రాసి పెట్టుకున్నాను.  నాకు తెలుసు.. ప్రతి సంవత్సరమూ.. వాళ్ల మానసిక ఎదుగుదలని బట్టి సమాధానాలు మారుతూ ఉంటాయని..  




ఇవ్వాళ మొత్తానికి నా కథ చెప్పటం అయిపోయింది. మరి రేపేం చేయాలి? రాత్రి ఇంతకన్నా మించిన కథ ఏముంటుంది? అని ఆలోచిస్తూ ఉన్నాను.. ఇప్పుడే మా అమ్మాయి నిద్ర లోంచి లేచి అడిగింది.. 'పోనీ భగవద్గీత చెప్తావా? రేపు ? ' అని.. 'నీకు అర్థం అవుతుందా? ఇంకా కొంచెం పెద్దవ్వాలి ..' అంటే.. 'I just want to know what made Arjuna go to the war..  What did Lord Krishna say to make him go..' అంది. 

నేను.. భగవద్గీత మొదలు పెట్టాను చదవటం.. సరిగ్గా చెప్పలేనేమో.. నాకే అర్థం కాదేమో.. అన్నీ అనుమానాలే.. 


ఇప్పుడు నా మీద కొత్త ఒత్తిడి మొదలైంది.. మహా భారతాన్ని మించి మెప్పించే కథ ఏముంది? ఏమి చెప్పి ఒప్పించగలను నా పిల్లలని .. అని.. Any suggestions?




























 
;