Wednesday, August 24, 2011 38 comments

అమ్మ ఊరెళ్తే? !!!



చిన్న పని పడింది. రెండు రోజులకి ఎలాగైనా హైదరాబాద్ కెళ్లి రావాలి. చూస్తే ఈ వారాంతం తప్ప అవకాశమే లేదు. పెద్దదానికి ప్రాణ స్నేహితురాలి పుట్టినరోజట! పైగా రోబోటిక్స్ క్లాస్ ట. చిన్న దానికి స్కౌట్స్ & గైడ్స్ పిక్ నిక్ ట. అస్సలూ కుదరదు.


పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్తే ఏడుస్తారు. నాకూ అయ్యో అనిపిస్తుంది ఎలాగా? ఏం చేద్దాం? అని ఆలోచిస్తుంటే పిల్లలు పోనీ నువ్వొక్క దానివే వెళ్లు.. మేముంటాం. అనేసారు. మా వారూ, అత్తగారూ కూడా పర్వాలేదు వెళ్లు అని అభయ హస్తం ఇవ్వగానే ..చివరకు మనసు చిక్కబెట్టుకుని టికెట్టు కొనుక్కొచ్చుకున్నాను.

ఇవ్వాళ స్కూల్ నుండి ఇంటికి రాగానే పిల్లల్ని ‘ఏమ్మా! బాగా ఉంటారా నేను లేకపోతే.. ‘..అని కాస్త బెంగ తో కూడిన అనురాగం తో అడిగాను. అంతే ఇక కలల ప్రపంచం లోకి అలా అలా వెళ్లి పోయారు.

చిన్నదానికి కాస్త పొగరెక్కువకదా.. ఏది వినాలనుకోలేదో అదే అనేసింది. ‘ఏం పర్వాలేదమ్మా! We will be more than fine!, infact it will be excellent!’ ‘అబ్బా దీనికి బొత్తి గా దాపరికం లేదు..’ అని విసుక్కున్నా. అది ఊరుకుంటుందా? అరమోడ్పు కన్నులతో.. దాచాలని తెలియదాయె బోల్డు ఆనందం తో చెప్పింది.



1. లేస్ చిప్స్ అలా హాయిగా తినచ్చు (అబ్బా.. ఎప్పుడూ అవేనా?)
2. రోజంతా టీ వీ చూడచ్చు (హమ్మో హమ్మో)

3. బాత్ రూమ్ లో ఒక రివెర్ చేయచ్చు. (నా తల్లే)

4. రెయిన్ లో ఎప్పుడూ హాయిగా ఆడుకోవచ్చు (అఆహా)

5. మూవీస్ , కార్టూన్స్ ఇష్టం వచ్చినట్టు చూడచ్చు (చూడండి చూడండి. అసలు కేబుల్ కనెక్షన్ తీయించి వెళ్తే సరిపోతుంది)

6. నో స్టడీస్ ఓన్లీ ఆటలు (ష్యూర్..)

7. బాత్ చేయక్కరలేదు. (హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్ )

8. మార్నింగ్ టు ఈవెనింగ్ ఆడుకోవచ్చు (ఇందాకా చెప్పారు గా..)

9. అందర్నీ మాడ్,, స్టుపిడ్ అలా బాడ్ వర్డ్స్ అనచ్చు (అని చూడండి తెలుస్తుంది)

10.మాగీ , పిజ్జాలు తినచ్చు. పప్పు వైపు కూడా చూడక్కర్లేదు (నాలుగు రోజుల అవే తింటే.. ప్లీజ్ పప్పన్నం పెట్టు అని మీరనరా? నేను విననా?)

11.తింటూ మధ్య మధ్యలో బాత్ రూమ్ కెళ్ళచ్చు ( ఛీ...)

12.ఒక డాగ్ కొనచ్చు, కాట్ కొనచ్చు (ఆహా. రెండ్రోజుల్లో రెండు కొనేస్తారా.. వచ్చాక నేను మళ్లీ ఇచ్చేస్తా!)

13.ఫ్రెండ్స్ ని పిలిచి మంచాల మీద ఎగరచ్చు (రోజూ ఎగురుతారు గా మీ మంచాల మీద. మా మంచాన్ని కూడా వదలరా.. లాక్ చేసి పోవాలి తప్పదు)

14.జొ మన్ మె ఆయె వొహ్ కర్సక్తె హైన్ (మళ్లీ దీని మొహానికి హిందీ..)

15.ఒక కళ్ళజోడు చేయించుకోవచ్చు (ఓర్నాయనో..)

16.జుట్టు ముళ్ళేసుకోవచ్చు (దానికో పిచ్చి అలవాటు.. మాన్పించలేక చస్తున్నాను)

17.నాయనమ్మ ఐపోడ్ ని లాగేసుకుని, నాన్న లాప్ టాప్ లో ఆడచ్చు.. (అత్తగారికీ, ఈయన గారికీ చెప్పి వెళ్లాలి)

18.జడలు వేసుకోకుండా హాయిగా తిరగచ్చు.. (తిరగండి.. తిరంగండి నేనోచ్చాక కసి గా చిక్కులు తీస్తుంటే తెలుస్తుంది అమ్మగారికి)



పెద్దది ముసి ముసి గా నవ్వుకుంటూ.. వచ్చి నా భుజాల మీద చేతులేసి.. ‘లేదమ్మా! We will miss you a lot!’ అని చిన్నదాని వైపు చూసి నవ్వుతోంది.. పైగా.. చూశాను దానికి గీతా బోధ చేస్తుంటే.. ‘ఇవ్వన్నీ నువ్వు అమ్మ కి చెప్పేయకు. మాడ్’

‘అమ్మా! అక్క నన్ను మాడ్ అంటోంది...’ కంప్లెయింట్!


వామ్మో ఎంతకి తెగించారు? పోనీ ట్రిప్ కాన్సెల్ చేసేసుకుంటే? ఊర్కే అన్నా లెండి. మా చిన్నప్పుడు మా అమ్మ ఒకటి రెండు రోజులకి ఊరెళ్తే మేమూ అంతే.. మళ్లీ మాట్లాడితే ఇంకాస్త ఎక్కువేమో.. కానీ నా పిల్లలకి కాస్త మంచి పోలికలు రావచ్చు కదా నా పోలికలే ఎందుకు రావాలీ.... (((





 
;