Sunday, October 17, 2010

దసరా సెలవల్లో ప్రయాణం.. రైలెక్కేదాకా..



పరీక్షలయ్యాయి అమ్మయ్య ' అనుకునేటప్పటికి, స్కూల్లో కల్చరల్ వీక్, స్పోర్ట్స్ డే, పిక్నిక్, తల్లిదండ్రులని పరుగులెత్తించి వదిలిపెట్టారు 10 రోజులకి!  దసరా సెలవలు.  3 నెలల క్రితమే నిర్ణయం అయిపోయింది ఈసారి కన్యాకుమారి కి వెళ్ళాలని. రైల్వే వెబ్ సైట్ లోంచి 90 రోజుల ముందు చేసుకోవచ్చు అనగానే టికెట్లు ఉదయం 10 కే చేసేశాం. అప్పటికే మాకన్నా ఫాస్ట్ గా 150 కి పైగా బెర్తులు బుక్ అయ్యాయంటే.. 'ఔరా..' ఎంత ప్లాన్ డ్ గా ఉన్నారు మన ప్రజలు ? అని హాచ్చర్య పోయాం.


ఈ లెక్కన హోటళ్ళూ బుక్ చేసుకోకపోతే రైల్వే క్లోక్ రూం లో సామాన్లు వేసి ఏ చెట్టు కిందో స్నానాలూ అవీ కానివ్వాల్సి వస్తుందని భయం వేసి,.. ఆరోజే హోటల్ గదులూ బుక్ చేసేసి ఊపిరి పీల్చుకున్నాం.  ఆఫీసులో బాసుడికి ఒక ముక్క చెవిన వేస్తే సరిపోతుందనుకుంటే నాకా,...  క్రాస్ అయిన డెడ్ లైన్లు మూడు ఉన్నాయి!!!  అని మాట్లాడకుండా నెమ్మది గా సిస్టం లో లీవ్ అప్లై చేసి ఊరుకున్నాను.


మా బాసొకరుండేవారు. ఆయన ఇండియాకెళ్ళి వచ్చాక రెండు ఫొటో ఆల్బుం లు ఆఫీస్ లో పెట్టుకునేవారు. ఒకటేమో, అందరికీ చూపించటానికి.. .. గోవా బీచుల్లో, స్టార్ హోటల్లలో,.. దేవాలయాల్లో..


ఇంకోటి దేశీలకు మాత్రమే!!..  వాళ్ళ కుటుంబం నడిపే దుకాణం, ఇంట్లో ఉయ్యాలా బల్ల మీదవీ, వాళ్ళింట్లో జరిగిన శుభకార్యాల ఫొటోలూ,  ఉండేవి.


అలాగే మా సెలవలు ఎలా గడిపాం అంటే.. ' యా.. ఇట్ వాజ్ గుడ్ యూ నో..  వీ హాడ్ టూ మచ్ ఫన్!!
కన్యాకుమారి లో యూ నో.. సన్ రైజ్ చూసి తీరాలి !.. నెవర్ మిస్ ఇట్ వెన్ యూ గో!! వివేకానంద మెమోరియల్.. మాన్!! ఎంత ప్రశాంతం గా ఉందో.. ' అని ఆఫీస్ వాళ్ళకీ, మా చుట్టుపక్కల నివసించే వాళ్ళకీ, చుట్టాలకీ వర్ణించి వర్ణించి చెప్తున్నాం..  నిజంగా సెలవల్లో ప్రయాణాల్లో ఎన్ని సాధక బాధకాలు? రెండు భాగాలు గా బ్లాగ్ మిత్రులతో సెలవల అనుభవాలు పంచుకుందామని..


ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చింది..


అల్మారీలన్నీ బట్టలతో నిండి తలుపు తీయగానే ఆనకట్ట కి గేట్లు తీసినట్టు పొర్లి పడతాయా?  ఉతికేటప్పుడు, మడతలు పెట్టేటప్పుడు, ఐరన్ చేసేటప్పుడు కనపడే గుట్టల గుట్టల బట్టల్లో.. ప్రయాణానికి సద్దుకుందామంటే ఒక్కటీ కనపడదే..? కొన్ని వెలిసినవి, కొన్ని సడెన్ గా ష్రింక్ అయినవి (అబ్బే నేను లావు అవ్వటం వల్ల కాదు లెండి.. కొన్ని బట్టలు 20-30 ఉతుకుల తర్వాత కూడా నాలుగైందు వారాలు వాడకపోతే ష్రింక్ అవుతాయన్నమాట!)


సరే,  ఫొటోల్లో ఉండిపోతాయి నాలుగు జతలు మంచివి కొనాలి,...  పైగా ఆఫీస్ డెడ్లైన్ ఒకటి మిగిలింది నా ప్రాణానికి..  అర్థరాత్రి దాకా ఆఫీస్ పనీ, ఒక పక్క షాపింగ్, ఇంటి పనులూ,.. సతమతమవుతుంటే.. ఇదే బెస్ట్ సమయం అని మా డ్రైవర్ వాళ్ళావిడ కి 2 వారాల ముందే నొప్పులు మొదలైపోయాయి. అర్జెంట్ గా సెలవు పెట్టేశాడు. ఏడ్చినట్టుంది ' ఇంతకన్నా దురదృష్టం ఉంటుందా? ' అనుకున్నాను  ఇంకో షాక్ ఉందని తెలియక..


ఇంటికి రాగానే మా పని అమ్మాయి ఇంకో బాంబు పేల్చింది. క్రిష్టియన్ మహా సభలున్నాయి అక్కడికి వారం రోజులు వెళ్ళాలి.. సెలవిప్పించమని.. ' అయ్యో రేపు రావా? '  అని అడుగుదామనుకుని.. ఎందుకైనా మంచిది.. మా బాసు దగ్గరా, పని మనిషి దగ్గరా ఫేవర్లు అడిగితే, ఇంతకి అంత అని వసూలు చేసుకుంటారు  అని గుర్తొచ్చి.. నోరు మెదపకుండా ఊరుకున్నాను. 


అసలే ఒక పక్క చస్తుంటే,  మా స్నేహితురాలు ఇచ్చిన సలహాలు... ఆఫీస్ లో విన్న టెక్ టాక్ లా వినీ విననట్టు వదిలేశాను. (క్రిష్నా.. జుట్టు ట్రిం చేయించుకో.. ఫేషియల్ చేయించుకో..  ఈ మాసిన బ్యాగ్ వదిలేసి మాంచి  డిజైనర్ బ్యాగ్ కొనుక్కో.. అక్సెసరీస్ మర్చిపోకు.. లాంటివి)


నా షాపింగుల తోటే చస్తుంటే.. ఆఖరి రోజున రెండు పుట్టిన రోజు పార్టీలు. మా పిల్లలు గిఫ్ట్ లేకుండా వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చారు. ఇక నా పరిస్థితి సంబరాల రాంబాబు దే అయ్యింది.  ఆఖరి నిమిషం షాపింగ్ లో బట్టలూ, రైల్లోకి చిరుతిండీ.. లాంటివి కొని తెచ్చుకుని లిస్టులేసుకుని సూట్ కేసులు దించి చూస్తే జ్ఞాపకాల పొరల్లో ఎక్కడో అట్టడుగున తప్పిపోయిన బట్టలు, వస్తువులు!!!  .


అసలు మనకున్న బట్టలకి ఎక్కడికెళ్ళినా ఇంకా ఇంకా కొని, లెక్కా పత్రం లేకుండా పడున్నాయి. లాస్ట్ టైం హైదరాబాద్ నుండి సోమవారం ఉదయం రైల్లో రావటం వల్ల ఆదరా బాదరా గా ఆఫీస్ కి పరిగెట్టి.. శని వారం వచ్చేదాకా సమయం లేకపోవటం వల్ల అలాగే అటక కెక్కించిన బాబతు అనుకుంటా..  అప్పుడే డిసిప్లిన్ గురించి అందరికీ లెక్చర్ ఇచ్చానేమో..నాలుక కరుచుకుని, ఎవ్వరూ చూడలేదు కదా అని దాచేసాను




పిల్లల దెబ్బలాటలకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ల్లో గంటకి 30 రేట్ లో  మొదట అనునయం గా, తర్వాత కఱకుగా, పిదప బెదిరింపులతో, అటు పిమ్మట (ఏమరుపాటులో ఉంటే గుండె ఆగిపోయేలా) అరుపులతో తీర్పులిస్తూ, ప్రయాణానికి సద్దుకోవటం, ..  బాస్ ఫోన్ కాల్స్ సాధ్యమైతే ఎవోయిడ్ చేసి, కుదరకపోతే.. టైలర్ల లాగా 'పని తప్పక అయిపోతుంది .. మీకెందుకు.. నేనున్నాను కదా.. మర్చిపోండి ' .. అని అబద్ధపు ప్రామిస్ లు చేస్తూ,  మానేజ్ చేస్తుంటే.. హాయిగా కామన్ వెల్త్ ఆటలు ఆస్వాదిస్తున్న తండ్రీ కూతుర్లని చూస్తే, వచ్చిన ఇరిటేషన్ ముందు సల్మాన్ కి వివేక్ ఒబ్రాయ్ ని చూస్తే వచ్చే భావం దిగదుడుపే..  




అసలే పిల్లలకి బట్టలు, స్విం సూట్లు, కెమేరా, కాం కార్డర్, సెల్ ఫోన్లు, అన్నిటికీ చార్జర్లు, ప్రయాణం లో బోర్ అవకుండా ఎలక్ట్రానిక్ సాధనాలు, ఆటలు, తినుబండారాలు, పుస్తకాలు,  బ్యాగులకి బ్యాగులు నిండిపోతున్నాయి. మేము తల పట్టుకుని కూర్చుంటే.. మా పక్కావిడ వచ్చి.. అక్కడంతా వర్షాలు.. టీ వీ చూడలేదా? గొడుగులు మర్చిపోవద్దు అని చక్కా వెళ్ళింది.


మిగిలిన పాలు,పెరుగులు, కూరగాయలు, ఎవ్వరికిద్దామన్నా.. అందరూ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. పనమ్మాయా లేదు. సరే అని మాకున్న సామాన్లు చాలక, ఇంకో ప్లాస్టిక్ బ్యాగ్ లో ఇవన్నీ పెట్టుకున్నాం  దోవ లో ఇల్లు కడుతున్న కూలీలకి ఇచ్చేందుకు.. 




బోల్డు ఆటోవాళ్ళున్నారు లక్కీగా అనుకుంటూ,  కార్ దిగగానే.. 




ఆటో కావాలా సార్,.. అంటూ ఆగిన ఆటో అబ్బాయిలకి  మా సామాన్లను చూడగానే ముఖం మీద ఒక సామ్రాట్ అశొక్, ఒక శ్రీకృష్ణదేవరాయల, లేదా, అక్బర్ బాద్షా రాజసం,ఠీవీ ఆటోమేటిక్ గా వచ్చేసాయి..  ఎంతకి మాట్లాడామో, తలచుకుంటే అబ్బో.. కన్యాకుమారి కి ఇంకో టికెట్ వచ్చేదేమో అనిపించింది.


అసలు ఎక్కడినుండి ఎక్కడికెళ్ళాలన్నా.. ఇన్ని సామాన్లవుతాయేంటో.. జనాలు హాయిగా నవ్వుతూ తృళ్ళుతూ పుల్ ఆన్ లు సుతారం గా పట్టుకుని లాగుతూ వెళ్తుంటే.. మేము మాత్రం 9 శాల్తీ లతో చెమటలు కక్కుతూ ఆటోలు దిగాము :-(  'కెమేరా నీ దగ్గరే ఉంది కదా? నీ పర్స్ ఉన్న బ్యాగ్ ని కూలీ కి ఇవ్వకు.. లాంటి అరుపులతో ఎలాగోలా మా ప్లాట్ ఫాం మీదకి వచ్చి.. రైలెక్కి సామాన్లు సద్దుకుని కూర్చున్నాం..


ఇంకా స్టేషన్ లో ఆటోలోంచి దిగకముందే.. పిల్లలు 'అమ్మా.. బాత్ రూం ' అని ఒకరు, టింకిల్ కొంటావా అని ఒకళ్ళు ' పీకి పాకం పెట్టగా..రైల్వే స్టేషన్ లో ఉరుకులూ, పరుగులతోనే సరిపోయింది.




మనస్సు లో మాత్రం,.. వంటింటి కిటికీ వేసానో లేదో, వచ్చేముందు చెత్త అంతా ట్రాష్ బ్యాగ్ లో పెట్టాను తలుపు పక్క.. బయట పెట్టానో లేదో.. లాంటి అనుమానాల గాఢత 'కుప్పం స్టేషన్ ' వచ్చేంతవరకూ తగ్గలేదు.. రైలెక్కి సామాన్లు పెట్టుకున్నామో లేదో.. హాయిగా వెనక్కి వాలదామని ఇలా కూర్చున్నానో లేదో..


' అమ్మా.. పూరీలు తీస్తావా? చాలా హంగ్రీ గా ఉన్నాను.. ' అని ఒకళ్ళు.. రైల్లోకి ఏది వస్తే అది కొనమని ఒకళ్ళు గొడవ గొడవ చేసి. పది అయ్యేదాకా తిండి కార్యక్రమం లోనే ఉండి.. కాస్త క్లీన్ అప్ చేసుకుని మళ్ళీ వెనక్కి వాలదామనుకునే సరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మళ్ళీ బాత్ రూం..




రైలెక్కాక ఎన్నెన్ని చేయాలని ఊహించుకున్నానో,.. ఎంత ఆప్యాయంగా పుస్తకాలు తీసుకెళ్ళానో..


 ఇంక ఎలాగో పిల్లలని పడుకోబెట్టి,  పూర్తి చేయకుండా వచ్చిన ఆఫీస్ పని ముల్లు లాగా గుచ్చుకుంటుంటే, ఆ ఆలోచనలు మనస్సు లోంచి తోసేస్తూ .. నా పుస్తకం తీసి చదువుదామని కూర్చుకునేసరికి  అలసట.. తో కళ్ళు మూసుకుపోయాయి.. :-(

32 comments:

భాను said...

హమ్మయ్య ..ఇప్పుడైనా కాస్త కళ్ళు ముసుకొంటే బాగుండు...అయిన ఎక్కడ ముసుకోనిస్తార్లెండి...

.బాగున్నై కృష్ణ గారు మీ ప్రయాణ సన్నాహాలు. మరి తర్వాత విషయాలు గూడా పోస్ట్ చెయ్యండి.

పద్మ said...

"(ఏమరుపాటులో ఉంటే గుండె ఆగిపోయేలా) అరుపులతో తీర్పులిస్తూ, ప్రయాణానికి సద్దుకోవటం" :)))) :)))) :)))

మీరు భలే రాస్తారు కృష్ణగారు.

సామాన్ల విషయంలో డిట్టో నేను. క్రితం వారం దసరా పూజలని నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ గ్రూప్ పిలిస్తే శని ఆది రెండంటే రెండు రోజులకి నేనొక్కదాన్ని వెళ్ళాను, మూడు బాగులేసుకుని. అన్నీ అవసరమనిపిస్తాయి. ఏది తీయాలో అర్థం కాదు. నిజంగా వారం రోజుల వెకేషన్ కి కూడా ఒక బాగ్ వేసుకుని వెళ్ళేవాళ్ళని చూస్తే కుళ్ళు వేస్తుంది.

SRRao said...

ఈ విజయదశమికి ఆ జగజ్జనని మిత్రులందరికీ సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............

- SRRao

శిరాకదంబం

sunita said...

baagundanDee mee prayaaNamloe padanisalu.

3g said...

ఓరి నాయనోయ్ ఇన్ని పనులా...........అయినా ఏం రాసారండి, చదువుతుంటే మీ పక్కన నిలబడి ఇదంతా చూస్తున్నట్టే ఉంది.

హరే కృష్ణ said...

>>సల్మాన్ కి వివేక్ ఒబ్రాయ్ ని చూస్తే వచ్చే భావం దిగదుడుపే..
:-) సూపర్

బావుంది టపా
విజయదశమి శుభాకాంక్షలు

Priya said...

Ammoyee.......Chala well planned journey.. Bayamga undhi mee ikkatlu vintuntene, pillaltho ekkadikina vellali ante chala kastam kadha...Inthaki kanyakumari ela undhandi.

హరే కృష్ణ said...

3g గారు పక్కన నిలబడి చూసే బదులు కాస్త హెల్ప్ చెయ్యొచ్చు కదా :) jk

.>దసరా సెలవల్లో ప్రయాణం.. రైలెక్కేదాకా..
రైలు దిగిన తర్వాత విశేషాలు చిన్నప్పుడు సోషల్ క్లాసు కి తీసుకు వెళ్ళిపోవాలని ఆశిస్తూ తొందర్లోనే sequel టపా వెయ్యాలని కోరుకుంటున్నాం

మాలా కుమార్ said...

ఇదంతా ప్రయాణపు మొదలే ! అసలు ప్రయాణ విశేషాలు ముందున్నాయన్నమాట .:))

మాలా కుమార్ said...

దసరా శుభాకాంక్షలు .

కృష్ణప్రియ said...

@ భాను గారు,
నా బ్లాగ్ కి స్వాగతం! ఈ వారాంతం లోపల మిగిలిన విశేషాలు పోస్ట్ చేస్తాను..

@ పద్మ గారు,
నా బ్లాగ్ కి స్వాగతం! మీరూ నా లాగే అన్నమాట.. హమ్మయ్య.. :-)

@ ఎస్ ఆర్ రావు గారు,
మీకు కూడా శుభాకాంక్షలు!

@ సునీత,
థాంక్స్!

@ 3జీ,
థాంక్స్! :-) ఇంకా అప్పుడే ఏమైంది.. ఇంకా చాలా గ్రంథం ఉంది..

@ హరేకృష్ణ,
థాంక్స్ .. నా తరఫు నుండి కూడా శుభాకాంక్షలు!

@ ప్రియ,
నా బ్లాగ్ కి స్వాగతం! అవును.. ఇంకా మా పిల్లలు పెద్దయ్యారు. 3-4 యేళ్ళ క్రితం అయితే.. డైపర్లు, మంచి ఇంటరెస్టింగ్ కథ గైడ్ చెప్తున్నప్పుడు కయ్యో మని ఏడ్వటాలు, ఆక్టివ్ గా నడవాల్సి వచ్చినప్పుడు నిద్రపోవటాలు . :-)
కన్యా కుమారి సంగతి నెక్స్ట్ పోస్ట్ లో.. అద్భుతమైన ప్రదేశం..

@ హరేకృష్ణ,
:-) సీక్వల్.. ఈ వారాంతం లోగా..
@ మాల గారు,
అవునండీ.. మీకు కూడా విజయ దశమి శుభాకాంక్షలు!

వేణూశ్రీకాంత్ said...

చిన్న చిన్న విషయాలను కూడా కళ్ళకుకట్టినట్లుగా వివరించి చాలాబాగా రాశారండీ :-) అసలు ప్రయాణం కోసం ఎదురుచూస్తూ...

మంచు said...

:-))

కృష్ణప్రియ said...

@ మంచు,
:-) థాంక్స్!
@ వేణు,
ధన్యవాదాలు. ఫొటోలు అప్ లోడ్ చేయాలి .. ఈ వారాంతం రాస్తాను..

3g said...

@హరే: :D:D:D హెల్ప్ చెయ్యాల్సింది గాని మళ్ళీ మీరంతా ఇలాంటి పోస్టు మిస్సయిపోతారు కదా అందుకే చెయ్యలేదు.

నేస్తం said...

>>>> నిజంగా వారం రోజుల వెకేషన్ కి కూడా ఒక బాగ్ వేసుకుని వెళ్ళేవాళ్ళని చూస్తే కుళ్ళు వేస్తుంది..

అయితే పద్మా కుళ్ళుకోండి నన్ను చూసి :P

క్రిష్ణా ఈ విషయం లో నేను సూపరు ..అంటే మా ఆయన ఎక్కడికన్నా వెళతాం అంటే పొరపాటున కూడా సర్ధే చాయలకు రారు.. అప్పుడు నాకు భలే ఇష్టం ... అన్నీ ఆలోచించుకుని బాగా అవసరం అయినవే పెడతా అన్నమాటా .. అవక్కరలేదు ఇవక్కరలేదు అని అన్నీ తీసి పడేసి... ఒకవేళ ఎదైనా తేలేదు అని ఎవరైనా అంటే మనకి ఉందిగా ఆయుధం ..ఒక్కళ్ళన్నా హెల్ప్ చేయలేదు గాని ఇన్ని మాటలంటారా అని ...

ఇందు said...

nice post. meelage memu kooda...battalu anni mundesukuni vetukkuntam :D emchestaam lendi...manushulu takkuvaa.....wardrobes ekkuva ayipoyindi paristiti.....long jrny antee inthe....kani marii '9' ante konchem ekkuvemoo krishnagaaru...!! antha luggage vesukuni ela tirigaarandi babu???

ఇందు said...

>>>>క్రిష్ణా ఈ విషయం లో నేను సూపరు ..అంటే మా ఆయన ఎక్కడికన్నా వెళతాం అంటే పొరపాటున కూడా సర్ధే చాయలకు రారు.. అప్పుడు నాకు భలే ఇష్టం ... అన్నీ ఆలోచించుకుని బాగా అవసరం అయినవే పెడతా అన్నమాటా .. అవక్కరలేదు ఇవక్కరలేదు అని అన్నీ తీసి పడేసి... ఒకవేళ ఎదైనా తేలేదు అని ఎవరైనా అంటే మనకి ఉందిగా ఆయుధం ..ఒక్కళ్ళన్నా హెల్ప్ చేయలేదు గాని ఇన్ని మాటలంటారా అని ..


nestam garu super idea ichharu....eesari deenni aacharana lo pettali :) thnq :)

సవ్వడి said...

కృష్ణ గారు! జరిగింది జరిగినట్లు కళ్లముందు పెట్టేసారుగా! గుడ్.
కన్యాకుమారి విశేషాల కోసం చూస్తూ....

శివరంజని said...

హహహ కృష్ణ ప్రియ గారు భలే రాశారు ... బాబోయ్ లగేజ్ ఉంటే ప్రయాణం అస్సలు చేయబుద్ది కాదు ..వాటితో పడుతూ లేస్తూ ఎంత కష్టమో ..భలే కళ్ళకు కట్టినట్టు చూపించారు

కొత్త పాళీ said...

అవును, వెకేషన్ తరవాత దాన్నించి కోలుకోడానికి ఇంకో రెండ్రోజులు ఆఫ్ కావాలి. ఏమైనా, తల్లులందరికీ హేట్సాఫ్!

Venkat said...

heelo krishna gaaru sagam lo aapesharu entandi
alaage ee madya rayadam tagginchaaru nenaite chaala rojulu wait chesanu
nice post

Sravya V said...

బాగున్నాయండీ మీ ప్రయాణ సన్నాహాలు :)
ఒక ఉచిత సలహా ఏమిటంటే మీ బ్లాగు టెంప్లేట్ ని ఏదైనా రెండు కాలమ్స్ టెంప్లేట్ గా మార్చొచ్చు కదా , మీరు రాసివి పెద్ద పోస్ట్లులు , పైగా కామెంట్లు కూడా ఎక్కవే కాబట్టి చదవటానికి బాగుంటుంది . మీరు బిజీ ఐతే ఇది కూడా టెక్ టాక్ లా వదిలేయండి నో ప్రోబ్లేమో :)

కృష్ణప్రియ said...

@ 3g,
:-))

@ నేస్తం,
:-)) నిజమే... మంచి సలహా ..

@ ఇందు,
థాంక్స్! అవును.. బోల్డు లగేజ్ తో వెళ్ళాం. ఎనిమిది రోజులకి సరిపడ.. బట్టలు, తదితర సామాన్లు :-).. మా తాతగారు మంచి సరదా గా మాట్లాడేవారు. ఆయన చివరి రోజుల్లో ఒకసారి అన్నారు.. ఒకటే కోరిక తీరలేదు. ఏదైనా ఊరికి చిన్న బ్రీఫ్ కేస్ తో వెళ్ళి రావాలని అని :-)

@ సవ్వడి, @ శివరంజని,
:-) థాంక్స్!

@ కొత్త పాళీ గారు,
నిజం.. ఏ వెకేషన్ అయినా మళ్ళీ రెండు రోజుల విశ్రాంతి లేకపోతే.. అంతే సంగతులు..

@ వెంకట్,
ధన్యవాదాలు నా పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నందుకు .. ఫొటోలు అప్ లోడ్ చేయగానే.. ఈ వారాంతానికి పూర్తి చేస్తాను..

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,
:-) థాంక్స్! అవునండీ.. టెంప్లేట్ సరైనది మార్చాలి. కొన్ని చూశాను కానీ.. సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను. ఏనుగు గ్రే /తెలుపు .. డల్ గా ఉంది మంచిది చూసుకోవాలి.. 2 కాలం ల టెంప్లేట్ లు మీరు శ్రమ అనుకోకపోతే ఈ మెయిల్ చేయగలరు..

శే.సా said...

చాల బాగుందండి .... త్వరగా రెండో భాగం రాసేయండి

వీరుభొట్ల వెంకట గణేష్ said...

__________________________________
కృష్ణ గారు! జరిగింది జరిగినట్లు కళ్లముందు పెట్టేసారుగా! గుడ్.
కన్యాకుమారి విశేషాల కోసం చూస్తూ....
__________________________________
Comment re-use !!

lalithag said...

మొత్తం వర్స పెట్టి చదివేశానోచ్!

సుజాత వేల్పూరి said...

అల్మారీలన్నీ బట్టలతో నిండి తలుపు తీయగానే ఆనకట్ట కి గేట్లు తీసినట్టు పొర్లి పడతాయా? ఉతికేటప్పుడు, మడతలు పెట్టేటప్పుడు, ఐరన్ చేసేటప్పుడు కనపడే గుట్టల గుట్టల బట్టల్లో.. ప్రయాణానికి సద్దుకుందామంటే ఒక్కటీ కనపడదే..? కొన్ని వెలిసినవి, కొన్ని సడెన్ గా ష్రింక్ అయినవి ...........ఇది నా డైలాగండోయ్! ఎప్పుడూ బట్టలు కొంటూనే ఉంటా! అయినా ఊరెళ్లాలంటే ఒక్కటీ సర్దుకోదగ్గది కనపడదు.:-))

ఏం చేస్తాం! అప్పటికప్పుడు వెళ్ళి మరో నాలుగు జతలు కొని..ఎలాగో సర్దుకుంటా!

కృష్ణప్రియ said...

@ శేషేంద్ర సాయి,
రాసేస్తా.. సెలవలనుండి రాగానే..ఆఫీస్ లో మోతా! :-(

@ వీరుభొట్ల వెంకట గణేష్,
థాంక్స్.. రాద్దామనే.. ఒకటి రెండు రోజుల్లో..

@ లలిత,
:-) చాలా ఓపికమంతురాలివి ..

@ సుజాత గారు,
:-) Same Story No difference, Only names changed అన్నమాట

Sravya V said...

ఏంటండీ మీ స్టేషన్ ఇంకా రాలేదా ఇంకా ట్రైన్ లో ఉన్నారా :)?

BTW కొత్త టెంప్లేట్ బాగుందండి !

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,

మీరిచ్చిన సలహా వల్లే టెంప్లేట్ మార్చానండీ.. థాంక్స్! ఒక మూడు వారాలు ఆఫీస్ లో ఊపిరి సలపనంత పని, పిల్లల జ్వరాలు .. :) మళ్ళీ బ్లాగులు ఇవ్వాళ్టినుండే చూస్తున్నాను...

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;