Sunday, November 14, 2010

గేటెడ్ కమ్యూనిటీ కథలు - ఒక్క కప్పు చక్కెరిచ్చారంటే ..




సినిమాల్లో ఇంట్లో ఆడవాళ్ళని చక్కటి హెయిర్ స్టైల్స్, డిజైనర్ వేర్ బట్టలతో, ఫుల్ మేకప్ తో ముఖం మీద చిరునవ్వు చెక్కు చెదరకుండా.. పిల్లలనీ, భర్తనీ ఆనందంగా, హాయిగా స్కూళ్ళకీ, ఆఫీసులకీ పంపిస్తూ, ఉంటారా? భర్తలేమో బోల్డు రొమాంటిక్ మూడ్ తో, పిల్లలు కిల కిలా నవ్వుతూ, కడిగిన ముత్యాల్లా చక్కటి యూనీఫాం లేసుకుని టిఫిన్ చేస్తూ, పరుగులు తీస్తూ చక చక లాడిపోతూ ఉంటారా?  అదేంటో మాకు ఒక్క రోజూ అలా జరగలేదు, జరగదు,జరగబోదు.


మా వాళ్ళు బద్ధకం గా, నిద్ర మత్తులో.. చిరాకు మొహాలతో, టై కనిపించలేదని ఒకళ్ళూ, సైన్స్ ప్రాజెక్ట్ కి ఇదే లాస్ట్ రోజని ఒకళ్ళూ, నిన్నేం చేసావు? 9 కి స్కూలైతే ఇప్పుడా చెప్పేది? @్*్$@్ అని అరుపులూ,.. ఈ హడావిడి లో కాలుతున్న గిన్నె ముట్టుకోవటమో, బస్సు వచ్చిందని తినీ తినక పరుగులు తీయటమో..  చేస్తున్నప్పుడు మోగుతుందండీ మా ఇంటర్ కాం.  


పోనీ ఎత్తకుండా వదిలేద్దామంటే.. రెండో నిమిషం లో సదరు కాలర్ ఇంటి బెల్లు మోగించీగలరు..  సరే అని,.. దోశ పెనం  ఆఫ్ చేసి పరుగున వస్తే .. ' హాయ్ క్రిష్నా.. తుమ్హారే పాస్ ఏక్ ఎక్ష్ట్రా వైట్ టీ షర్ట్ హై? ' అని నాలుగో నంబర్ ఆవిడ ఫోన్.  వొళ్ళు మండింది. కానీ.. లేదనటానికి లేదు. ఎందుకంటే ఆవిడకి తెలుసు.. నేను పద్ధతి గా శనివారం ఉతికి, ఆదివారం ఇస్త్రీ చేయించి పెడతానని..  తనకేమో చికాకు. ' స్కూల్ డ్రెస్ ఉతుక్కోరా? వాళ్ళకిచ్చింది మళ్ళీ పిల్లలకి వేయకు.. ' అని వార్నింగ్..


'ఆగండి.. ప్లీజ్.. ఆవిడ వచ్చేస్తుంది..వింటే బాగుండదు.. ' అని బ్రతిమలాడుకుంటూనే.. మా చిన్నమ్మాయి కి ఒక లుక్కిచ్చాను. దాని వెనక ఒక సుదీర్ఘ గాథ ఉంది.


2 నెలల క్రితం ఒకావిడ సాక్స్ అరువు తీసుకుని వెళ్తుంటే.. 'ఆంటీ.. ' అని పిలిచింది. ఆవిడ ముద్దుగా.. 'ఏంటమ్మా? ' అంటే.. 'కెన్ యూ ప్లీజ్ మేక్ ష్యూర్ టు రిటర్న్? ' అంది. ఆవిడ ముఖం లో రంగులు మారిపోయాయి.. నేను ఆవిడకేదో సర్ది చెప్పి.. ఆవిడ వెళ్ళాక.. దీనికి క్లాస్ తీసుకున్నాను.


దీనికేమో.. కంఫ్యూషన్.. 'అదేంటి ? అది నా వస్తువు. నేను ఎవరికైనా ఇస్తే.. నువ్వు నన్ను అడుగుతావు కదా? ' అంది.  'అలా కాదమ్మా... ఇచ్చింది నేను కదా.. చిన్న పిల్లవి.. ఆంటీ ని అలా అడిగితే.. బాగుండదు.. నీ తోటి వాళ్ళనయితే అడుగు .. కానీ, పెద్దవాళ్ళని అడగటం సభ్యత కాదు ' అని చెప్తే.. 'కానీ ఆవిడ ఇవ్వకపోతే..మనకి ఒక జత సాక్స్ తక్కువ ఉంటాయి కదా? ' అంది. ఆరోజున జరిగిన ప్రశ్నోత్తర పరంపర తరువాత..  ఒక ఒడంబడిక చేసుకున్నాము. నేను అప్పిచ్చిన వస్తువులకి నేను బాధ్యురాలిని,.. అలాగే అదిచ్చిన వస్తువుకి అది బాధ్యురాలు. ఒకరి అప్పుల్లో ఇంకొకరు కల్పించుకొన రాదు.. గట్రా ' .. ఇప్పుదు నేను దానికిచ్చిన లుక్ వెనక అంత అర్థం ఉందన్నమాట ..
అశ్చర్యం ఏంటంటే.. ఆ తర్వాత కూడా ఆవిడ రెండు మూడు సార్లు సాక్స్ అడిగింది. కాకపోతే వెనక్కి ఇచ్చినప్పుడల్లా.. సాక్సులతో పాటూ, ఒక చాక్లేటో, బిస్కట్ ముక్కో.. వడ్డీ గా..


మా కాంప్లెక్స్ లోకి వచ్చిన తర్వాత,  'అప్పు ' అనేది మన జీవితం లో ఎంత గా పెనవేసుకుపోయిందో అర్థమయింది.


బిర్యానీ చేస్తున్నాను.. మీ దగ్గర మసాలా లు ఉన్నాయా ? అని ఫోన్.. 'ఆ ఆ రండి.. పర్వాలేదు..' అన్నాను. ఆవిడ వెళ్ళేటప్పుడు మొహమాట పడుతూనే 2 కాప్సికం లూ, ఒక పెద్ద ఆలుగడ్డ, 2 కారట్ లూ, తీసుకెళ్ళింది. ఆ చేత్తోనే రెండు కీరా లున్నూ.. మరి బిర్యానీ లోకి రాయితా లేకపోతే బాగుంటుందా?  పూర్వం బ్రాహ్మలకి ఇచ్చే స్వయం పాకం  కాన్సెప్ట్ గుర్తుకొచ్చింది.  ఈవిడ ఒక ఎత్తైతే.. ఇంకో ఆవిడ 'మీ ఇంట్లో గోధుమ పిండి ఉందా? ' అంది.  ఉంది, రమ్మంటే.. చిన్న డబ్బా తీసుకొచ్చింది. 'మా వారు పిజ్జా ఆర్డర్ చేశారండీ.. మా అత్తగారు పిజ్జా తినరు. ఆవిడకి మటుకు 2 పుల్కావులు చేశానంటే..  రేపు బజారు కెళ్ళినప్పుడు.. అన్నీ తెచ్చుకుంటాము..' అంది. 'మా తల్లే.. ' అనుకుని.. పోన్లే.. పుల్కాల్లోకి ఆధరువులకి కావలసినవి అడగలేదు ' అని ఆనంద భాష్పాలు కార్చినంత పని చేశాను. 


మా అమ్మ ఈ మధ్య వచ్చినప్పుడు 'ఇదెక్కడి గోలే.. ఇలాంటి అప్పులు కనీ వినీ ఎరగం .. చెప్పటానికేమో గేటెడ్ కమ్యూనిటీ.. అందరికీ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఫారిన్ కెళ్ళి తిరిగి వచ్చినవాళ్ళు.. కాని తెల్లారితే చాలు .. ''మజ్జిగుందా? మెంతులున్నాయా? మైదా పిండుందా?  చీ చీ ' అని తన నిరసన నానా విధాలు గా వ్యక్తం చేసింది. 


'అదేంటమ్మా అలాగంటావు? మీకంటే.. ఇల్లు దాటి రెండడుగులేస్తే చాలు దుకాణం. మరి మాకో.. కనీసం 2 కిలో మీటర్లు నర సంచారం లేదు కదా.. మెయిన్ రోడ్డెక్కాలి.. బండి చేతిలో ఉండాలి,.. కొంతమందికి బండి ఉన్నా డ్రైవింగ్ రాదు కాబట్టి డ్రైవర్ ఉండాలి.. ' అని సమర్థించాను మా కాలనీ వాళ్ళని.'


'అవును లే.. స్విమ్మింగ్ పూల్, జిమ్మూ, బాట్మింటన్ కోర్టూ కావాలంటే 2 అడుగులేస్తే చాలు.. ఉప్పు లాంటి తుచ్చమైన పదార్థాలు కావాలంటే మాత్రం 2 కిలో మీటర్లు వెళ్ళాలి.. వారెవ్వా' అన్నారు మా నాన్నగారు. 


అనగానే నవ్వొచ్చింది కానీ, అది నిజమే.. ఇరవై నాలుగ్గంటలూ డ్రైవర్లు అందుబాటులో ఉండరు కదా.. పైగా.. దుకాణాలు ముందర, ఫోన్ లో ఆర్డర్ చేస్తే 15 నిమిషాల్లో తెచ్చి పడేసేవారు. కాస్త వాటి మీద ఆధారపడుతున్నామని తెలిసాక,.. నెమ్మదిగా 2 గంటలైతేనే కానీ డెలివర్ చేయట్లేదు.  కొన్ని పెద్ద కమ్యూనిటీలల్లో ఒక మనిషి పనే ప్రతి గంటా.. దుకాణం లోంచి ఆర్డర్ చేసిన వస్తువులని గుమ్మం ముందుకి చేరవేయడం ట!!


'అవును.. ఇళ్ళు కొనుక్కునే ముందర,  ఆ ఏముంది.. కార్లున్నాయి, స్కూటర్లున్నాయి, డ్రైవర్ ఉంటాడు,.. కావాలంటే దుకాణం అతను సామాన్లు ఇంటికి చిటికెల మీద తెచ్చి పడేస్తాడు..  ' అనే assumptions మీద కొనేస్తారు..  మారే డ్రైవర్లు, వాళ్ళ సెలవలు, దుకాణం అతని latency లాంటివి పట్టించుకోరు .. తర్వాత ఏముందీ... కాస్త బియ్యం ఇస్తావా? బూట్లిస్తావా? ' అని ఇంకోళ్ళింటి మీద కి వెళ్ళటం..' అని వాక్ప్రవాహం  కట్టలు తెంచుకోకముందే టాపిక్ మార్చేసి.. వేరే పనుల్లో పడ్డాం.


ఈ దుకాణాలు దూరమవడం తో అయిన అలవాటు,.. నెమ్మదిగా సాక్సులూ, స్కూల్ డ్రెస్సులూ, అడగటం దాకా వచ్చిందన్నమాట.  ఈ విధం గా ఏడాది లో కాలనీ ప్రజానీకం, గార్డెన్ లోకి గడ్డపారలూ, పార్టీలకి చీరలూ, రాయితా లోకి పెరుగూ, రొట్టెల్లోకి గోధుమ పిండీ, ఉప్మా లోకి బొంబాయి రవ్వా, లాంటివి ఇచ్చి పుచ్చుకోవటం లో సిద్ధహస్తులమైపోయాం.


 మొదట్లో ఆశ్చర్యంగానూ, చిరాకుగా నూ ఉండేది, నెమ్మదిగా ఇవి నాకూ బాగానే అలవాటయినట్టున్నాయని నాకు క్రిందటి వారమే అర్థమయింది.


ఇంట్లో అందరికీ ఒకరి తర్వాత ఒకరికి, వైరల్ జ్వరాలు తగలడం తో ఎక్కువ గా దీపావళి కి బజారు పనులు చేసుకోలేకపోయాము. మా ఆడపడచు కుటుంబాన్ని పండగ కి సరదాగా రమ్మంటే, తెల్లవారుఝామునే రైలు దిగారు, అందరం కాఫీలు తాగుతూ, కబుర్లు చెప్పుకుంటుండగా.. 'పండుగ కదా..మంచి ముగ్గు పెడదాం  రమ్మని మా అమ్మాయి ని అడిగితే సరే అంది.  అప్పుడు గుర్తొచ్చింది.. 'అయ్యో ముగ్గు, రంగులు మర్చిపోయాం కొనటం ' అని. పోన్లే మైదా/బియ్యప్పిండి తో లాగించేయవచ్చు. పసుపూ, కుంకుమా ఉండనే ఉన్నాయి రంగులేయటానికి.. ' అనుకుని చూస్తే..గుర్తొచ్చింది.  పిజ్జా చేస్తున్నాం.. మైదా పిండి తక్కువైందని ఇరవయ్యో నంబరావిడ మైదా పిండి అప్పుగా తీసుకెళ్ళిన సంగతి!!!


మా పక్కావిడ ని క్షణం ఆలోచించకుండా అడిగేశాను.. 'ముగ్గు పిండి కాస్త ఇస్తారా ? ' అని. ఆవిడ.. అంత మామూలుగానే .. ముగ్గు పిండి , రంగుల పెట్టే ఇచ్చింది. ఈలోగా.. ఫైనల్ గా మా అమ్మాయి.. చాక్ తోనే వేస్తానందనుకోండి..


ఆవిడ, 'కొంజెం మన్ జల్ వేణుం.. ' అంది. పులిహార చేద్దామనుకుంటోందట. మా ఆడపడచు ముక్కున వేలేసుకుంది.,,   ఏదో అవసరార్థం అడిగారంటే తప్పులేదేమో కానీ.. పులిహార లోకి పసుపూ, ఇంటి ముందుకి ముగ్గూ .. 'ఇదేంటి వదినా..' అంటూ..  నాకూ సిగ్గేసింది.. 


ఇకనుండీ ఇంటి ఎవరైనా వచ్చినప్పుడు ముగ్గు పిండి  అప్పు అడగకూడని దృఢ నిశ్చయం చేసుకున్నాను. ఒకవేళ నేనడిగినట్టు కనిపిస్తే.. మీరు నాకు గుర్తుచేయాలి సరేనా?


పాత గేటెడ్ కమ్యూనిటీ కథలు.. 




http://krishna-diary.blogspot.com/2010/08/blog-post.html

56 comments:

మంచు said...

హ హ హ.... ఎం రాస్తారండి మీరసలు.... టాపిక్ ఎదయినా అసలు చదవడం మొదలు పెడితే మనకి తెలీకుండానే ఆ అక్షరాల వెంబడి కళ్ళు పరిగెట్టిస్తాయి :-) అప్పుడే అయిపొయిందా అనిపిస్తుంది... Simple & Effective గా రాయడానికి ట్రైనింగ్ కావాలంతే మీ బ్లాగ్ చూపిస్తే చాలు .....

మీ చుబరస్కా టల్లాస్ లొకి ఎమేమి అప్పు తెచ్చుకుంటూ ఉంటారు మీరు :-)))
మీ కమ్యూనిటి ఎమిటొ చెప్పండి.... బెంగళూరులొ సెటిల్ అవ్వాలంటే అక్కడే డిసైడ్ అయిపొతాను....

వేణూశ్రీకాంత్ said...

హ హ మీ చిన్నారి సూపరండీ "మేక్ ష్యూర్ యు రిటర్న్"

నిజమే "ఇలాంటి అప్పులు కనీ వినీ ఎరగం" మరీ ఇదేమిటండీ బాబు. ఎప్పుడో ఓసారి ఉదయం కొట్లు తీయని సమయంలో ఒక్క ఆలూ అప్పుతీసుకోవాల్సి వచ్చినందుకే స్టాక్ పెట్టుకోనందుకు వారం రోజులు నన్ను నేను తిట్టుకున్నాను. మీరీ టపాలో చెప్పిన వస్తువులు వింటే కాదేదీ అప్పుకనర్హం అనుకుని అవాక్కయ్యాను :-)

నేను said...

Hammayya post raasesaaraa, almost one month avutundi emayipoyaaru anukuntunnaa..

Post as usual ... :-)

Kotta template baavundi, font size maree chinnadigaa vunnattundi. koddigaa penchite better emo ?

Rao S Lakkaraju said...

చాలా చక్కగా వ్రాసారు. జీవితంలో అప్పుల్ని తప్పిచ్చుకోలేం.

మంచు said...

హమ్మయ్య ... ఫస్ట్ కామెంట్ నాదే :-)

Sravya V said...

ఒకసారి మీ లాప్టాప్ ఇటిద్దురు, ఒక కామెంట్ రాసి ఇచ్చేస్తా :)
మీ అప్పుల కష్టాలు బాగున్నాయి , మీ ముందు పోస్టులో చెప్పినట్లు మీ చిన్న అమ్మాయి చాల స్మార్ట్ నాకు చాలా నచ్చేసింది :)
BTW మిమ్మల్ని చాల మిస్సయ్యనండి ఈ మూడు వారాల్లో !

Anonymous said...

అమెరికా సాఫ్ట్వేర్లను రిన్ సోపుతో కడిగేశారు. ఐనా నాకు తెలీకడగుతా.. ఎంత అమెరికా సాఫ్ట్వేర్లయినంత మాత్రాన ఇలా అసహ్యంగా సాక్సులు, బనియన్లు, చెడ్డీలు అప్పు అడగటమేమిటండి!!! గేటెడ్ కాదు గ్రేటెడ్ (తురుముడు) కమ్యూనిటీ అని పేరు మార్చేసుకోండి. మంచూరియన్ అమెరికా సాఫ్ట్వేర్ లా వున్నారు, మీ అడ్రస్ చెప్పకండి, అరువేమి అడగాలో లిస్ట్ తయారు చేసుకుంటున్నట్టున్నారు. :D
అన్నట్టు మరిచాను, ఓ నాలుగు బాల్పాయింట్ పెన్నులు, ఓ ఠావు పేపర్లు అరువివ్వండి ఇవ్వడి అక్కయ్య గారు. నవల రాయాలనిపిస్తోంది. :P :))

lalithag said...

:)

ఆత్రేయ said...

మీ గే.క ( గేటెడ్ కమ్యూనిటీ ) లో అంతేనా? మా అ (అపార్ట్మెంట్) లో కూడ అంతే కాక పోతే చారెడు మెంతులు, గరిటెడు ధనియాల బదులు పావు కిలో పాకెట్స్ పట్టుకెళ్ళి స్పెన్సర్స్ కెల్లినప్పుడు మళ్ళీ కొని తెచ్చిస్తానని చెప్పి మర్చి పోతుంటారు. ఈ మధ్య మేము అన్నీ రెండు రెండు కొనుక్కుంటున్నాం. ఒకటి మాకు ఇంకోటి కూడా మాకే ( ఆశావాదం లో )

Anonymous said...

చాలా రోజుల తరువాత ఈ సైడ్ వచ్చినట్టున్నాను, పాతవి అన్నీ చదవాలి కుర్చోని ఎన్ని మిస్ అయ్యానో.
ఇంతకీ గేటెడ్ కమ్యూనిటీ అనగానేమి? కాలనీ చుట్టూ గోడ కట్టుకోని గేటు పెడతామనా?

సవ్వడి said...

hahaha..

శే.సా said...

>>రొట్టెల్లోకి గోధుమ పిండీ, ఉప్మా లోకి బొంబాయి రవ్వా,.... :)
టపా సూపరండి.మీరు ఇంకాస్త తరచుగా టపాలు రాయాలి అని కోరుకుంటున్నాము.

జేబి - JB said...

ఇదేంటండీ? పదిగంటల క్రింద పెట్టిన నా వ్యాఖ్య ఏమయ్యిందీ చెప్మా!

"గే.క.ల్లో పక్కవాళ్ళతో మాట్లాడుకోరనుకున్నా, అరువులు ఇచ్చిపుచ్చుకునేంతగా సంబంధాలుంటాయన్నమాట? లేదా, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారా అంతా?

Sujata M said...

Enjoyed reading. :D

Anonymous said...

ఆత్రేయ గారు, మీ పక్కిల్లు ఖాళీ ఐతే చెబుదురూ.. ఏవూరైనా పరవాలేదు. :P
కిలోలెక్కన పట్టుకెళితే దాంతో ఓ చిన్న నల్ల నువ్వుల పాకెట్ లేదా ఓ ఇనుప మేకు ఫ్రీగా జతచేసి పైకి వినపడేలా మెల్లిగా ఓ సారి "ఓం శనేశ్వరాయనమః " అనుకోండి, మీకు మంచి జరుగుతుంది. :))

3g said...

>>'కెన్ యూ ప్లీజ్ మేక్ ష్యూర్ టు రిటర్న్? '

హ హ్హ.... మీ చిన్నమ్మాయి కేకసలు.

ఆత్రేయ said...

@snkr రండి మా అపార్ట్మెంట్లోకి మొదటి మేకు మీకే ఇస్తా ఓం సనీస్వరాయ నమః
@ కృష్ణప్రియ : దార్లోనే ( by the way ) నాకో రెండు కొత్త పోస్ట్స్ రాసినవి అప్పిప్పిస్తారా మళ్ళీ నే రాసాక తిరిగి ఇచ్చేస్తాను

మంచు said...

కృష్ణప్రియ గారు ఆ ఒడంబడిక గురించి నిజం చెప్పండి.... చిన్నమ్మాయిని అలా అడిగమని ట్రైనింగ్ ఇచ్చింది మీరే కదా :D

కృష్ణప్రియ said...

@ మంచు,
మీ అభిమానానికి థాంక్స్.. మరీ మునగ చెట్టు ఎక్కిస్తున్నారు. . చుంబరస్కా టల్లోస్ కి పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నాను.. రెసిపీ ఇస్తే గోలైపోతుంది. :-) మా కమ్యూనిటీ పేరు చెప్తాను.. కానీ.. మీరెలాంటి అప్పులు ఇవ్వగలరు? ఏ తరహా అప్పులు తీసుకుంటారు.. అనేది ఒక ఐడియా ఉంటే...

@ వేణూ శ్రీకాంత్,
థాంక్స్!! అవాక్కయ్యారన్నమాట. పూర్వం, నిమ్మకాయా, చక్కెరా లాంటివి, తోడుకి మజ్జిగా ..అడిగేవాళ్ళు. మరి ఇప్పుడు వాటితో పాటు కొత్త నిత్యావసరాలు వచ్చేసాయి కదా.. కాస్త ప్రింటవుట్ తీసిస్తారా? పెన్ డ్రైవ్ ఒకసారిస్తారా? కూడా ఆడ్ అయిపోతున్నాయి మరి :)

కృష్ణప్రియ said...

@ బద్రి,
ధన్యవాదాలు.. చాలా సంతోషం గా ఉంది, నా టపాలు రావట్లేదని మీరు తలచుకున్నారంటే.. నిజమే font size కాస్త పెద్దది చేశాను చూడండి.

@ లక్కరాజు గారు,
థాంక్స్!

@ శ్రావ్య,
:)) అమ్మో..అప్పుల కథలు చెప్తే.. నా లాప్ టాపే అడిగేస్తున్నారే .. చాలా చాలా థాంక్స్, మీ అభిమానానికి.. ఆఫీస్ లో సడెన్ గా కస్టమర్ల ఇష్యూలూ, అదే మంచి సమయమని మా ఇంటికి వేంచేసిన వైరల్ జ్వరాలూ.. అదీ చాలదన్నట్టు మధ్యలో రెండు పండుగలూ.. కాస్త తెరపి వచ్చింది ఈ వీకెండే..

కృష్ణప్రియ said...

@ snkr,
:) అలాగే నవల రాసేయండి. కాగితాల మీద రాయడం ఓల్డ్ ఫాషనేమో.. పోనీ లాప్ టాప్ ఇమ్మంటారా?

@ లలిత,
:))

@ ఆత్రేయ,
:--- ఒకటి మాకు ఇంకోటి కూడా మాకే ( ఆశావాదం లో )
:)) చాలా బాగుంది.

కృష్ణప్రియ said...

@ తార,
అవును. ఒక పెద్ద గోడా, గేటూ, దాంట్లో ఇళ్ళూ, గేటు దగ్గర నలుగురు గార్డులూ, ఒక ప్లంబరూ, ఎలెక్ట్రీషియనూ, ఒక తోటమాలీ, హౌజ్ కీపింగూ, కొన్ని కామన్ ఫెసిలిటీలూ, ఒక ప్రెసిడెంటూ, కార్యాచరణ సమితీ. ఒక యాహూ గ్రూపూ, గుంపు గా చేసుకునే పండుగలూ, అనీ కలిపి వెరసి ఒక గేటెడ్ కమ్యూనిటీ.. అపార్ట్ మెంట్ లాంటిదే కాకపోతే ఇండిపెండెంట్ ఇళ్ళు..

@ సవ్వడి,
:)

@ శేషేంద్ర సాయి,
థాంక్స్! తప్పకుండా..

కృష్ణప్రియ said...

@ జేబి - JB,

జనరల్ గా కొద్దిగా అతిశయోక్తి రంగరించి రాస్తానండీ.. కానీ.. నేను రాసిన ఉదంతాలు నిజమే.. అందరివీ సొంతిళ్ళూ, ఒకదగ్గర ఉండటం వల్ల వచ్చిన చనువు తో, అలాగే కమ్యూనిటీ కి nearest దుకాణం 2 కిలో మీటర్ల దూరం లో ఉండటం..

@ సుజాత,
థాంక్స్!

@ 3g,
థాంక్స్!

@ ఆత్రేయ,
LOL

@ మంచు,
అంత తెలివే ఉంటే.. బాగానే ఉండును.. లేదండీ.. దానికి నోరెక్కువ. మొన్నీ మధ్య.. ఎవరింటికో ఫంక్షన్ కి బయల్దేరుతున్నాం ఒక గంట లేట్ గా.. (as usual).. అప్పుడే ఆ ఫంక్షన్ బాబతు చుట్టాల ఫోన్. 'బయల్దేరుతున్నారా? ' అని. 'ఆ ఆ.. ఇదిగో.. మార్తహళ్ళి బ్రిడ్జ్ దాకా వచ్చేశాం.. ' అన్నాను.. మా చిన్నది అక్కడ దిగుతూనే.. 'అమ్మమ్మ గారూ, మా అమ్మ మార్థహళ్ళి బ్రిడ్జ్ ఎక్కుతున్నాం అన్నప్పుడు కార్ కూడా ఎక్కలేదు..she lied!! అని నా పరువు కావేట్లో కలిసే కుళ్ళు కాలవ లో కలిపింది :-(((

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఎక్ష్ట్రా టీ షర్టా ? చదివి అరగంట అయింది ఇంకా తేరుకోలేదు. ఆశ్చర్యమాశ్చర్యము. నన్ను మించిన అప్పారావులు, అప్పాయమ్మలు ఉంటారను కోలేదు. మా ఇంట్లో బియ్యం కనిపించటం లేదు, మీ ఇంటికి భోజనానికి వస్తున్నాం అని చెప్పే నా లాంటి వాళ్ళు కూడా ఉంటారు తస్మాత్ జాగ్రత్త. మంచు గార్కి వచ్చిన అనుమానం నాకు కూడా వచ్చింది.

మీ శైలి సూపరు మరియూ ఫ్రీ ఫ్లోయింగ్ (తెలుగులో ఏమంటారో)
అవునూ దసరా సెలవుల కధ ఒకటి బాకీ ఉన్నారు మాకు, ఫోటోవులు అవి ఇవి పెట్టి వ్రాస్తామన్నారు, ఎప్పుడూ?

శిశిర said...

బాగుందండి. :) మాకైతే ఇలా అప్పు అడిగి తీసుకెళ్ళడాలులాంటివి ఉండవన్నమాట. అవసరమైనపుడు అతి చనువుగా తలుపులు తోసుకొచ్చేసి లోపల దాచుకున్న పాలగిన్నె తీసుకుని కావలసినన్ని పాలు వాళ్ళ గిన్నెలోకి వంపేసుకుని ఓ నవ్వు పడేసి తీసుకెళ్ళిపోవడమే. మిగిలినవి మా ప్రాప్తం అన్నమాట. :)

శివరంజని said...

బాగున్నాయి మీ అప్పు కబుర్లు హ హ్హ.... మీ చిన్నమ్మాయి చాల స్మార్ట్

లత said...

మీ పోస్ట్స్ అన్ని చాలా హ్యూమరస్ గా ఉంటాయ్ క్రిష్ణ గారూ ,
నాకు చాల ఇష్టం.చదువుతుంటే టైం తెలియదు అసలు.

కృష్ణప్రియ said...

@ బులుసు సుబ్రమణ్యం గారికి,
:-) ప్రతి శుక్రవారం స్కూల్ కి తెల్ల షర్టు వేస్తారు కదా,.. ఆ షర్ట్ అన్నమాట. మీ కామెంట్ కి చాలా థాంక్స్. మీ టపాల్లో హాస్యం ముందు నా టపాలెంత? దసరా సెలవలది మొదలు పెట్టి ఆపాను. త్వరలో పోస్టు చేస్తాను.

@ శిశిర,
:-) బాగుంది. అంటే మా వాళ్ళే కాస్త బెటర్ అంటారు..

@ శివరంజని,
:-) ధన్యవాదాలు.

@ లత,
చాలా థాంక్స్!

నిషిగంధ said...

:))) టపా చాలా బావుందండి కృష్ణప్రియ గారు.. మీ పాప ముందు జాగ్రత్త చూస్తుంటే ముచ్చటేస్తుంది :-)

మా కమ్యూనిటీలో ఇంచుమించు ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలే ఉంటాయి.. కాకపోతే కొంచెం డిఫరెంట్ స్కేల్లో అన్నమాట.. ఇంటికి పెయింట్ వేస్తున్నాం, తక్కువైంది ఒక డబ్బా ఇవ్వండి (ఇళ్ళన్నీ ఇంచుమించు సేం కలర్ కోడ్ తో ఉంటాయి కదా), గడ్డి బాగా పెరిగిపోయింది, మీ లాన్ మూవర్ అయితే బాగా కట్ చేస్తుంది, ఇస్తారా లాంటివన్న మాట :-)

btw, మీ టపాలన్నీ ఎప్పటికప్పుడు చదివి (ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుని), కామెంట్ మాత్రం రాయని బద్దకిస్టుని నేను :-)

నేను said...

మా ఇంట్లో బియ్యం కనిపించటం లేదు, మీ ఇంటికి భోజనానికి వస్తున్నాం అని చెప్పే నా లాంటి వాళ్ళు కూడా ఉంటారు తస్మాత్ జాగ్రత్త//
LOL. ఇలాంటోల్లు బానే తగిలారు నాకు.

నేను మాత్రం కాస్త వెరైటీ, పక్క ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి మా ఇంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయిపోయినయి కొద్దిగా పట్టుకొచ్చేస్తే ఇక్కడే వండుకుందాం అని పిలుస్తా. ఒక్కసారైనా అవేవో వచ్చి తీసుకుపో అంటారనుకుంటే.. ఊహు ఫొన్ పెట్టేసరికి గుమ్మం లో ప్రత్యక్షమయ్యే రకాలు, ఎగేసుకుంటూ వచ్చేస్తారు.

రాధిక(నాని ) said...

ఎప్పటిలానే చాలా బాగా రాసారు కృష్ణప్రియగారు:))))....మీ అప్పులు(వీటిని అప్పులనాలో.. చేబదులనాలో ) చూస్తే సినిమా వాళ్ళు కామిడీ సీన్లుకి కాపీ కొట్టేస్తారేమో!
ఐతే పిన్నిగారు!`కాస్త పంచదార ఇస్తారా?టిపోడిస్తారా?'అనే రోజులు పోయాయనమాట.
నిషిగంధగారు ,మీ ఇచ్చిపుచ్చుకోవడాలు ఇంకా బాగున్నాయి:).

రాధిక(నాని ) said...

మర్చిపోయాను ...మీ అమ్మాయి ,మా అబ్బాయి ఒకే కేటగిరి అనమాట !సత్యహరిచంద్రుడు వారసులు:))

ఇందు said...

కృష్ణప్రియ గారు..చాల బాగుందండీ మీ టపా! అప్పుడెప్పుడో మీ దసరా ప్రయాణం చదివి దాని కంటిన్యుషన్ కోసం చాలా సార్లు మీ బ్లాగ్లోకి తొంగి చూసా! హ్మ్! మీరు వ్రాయలేదు.ఇన్నాల్టికి ఈ గేటెడ్ కమ్యునిటీలు టపా పెట్తరు.మేము ఇండియా వస్తే ఇలాంటివే చూద్దామనుకుంటున్నం.కానీ మీ తిప్పలు చూస్తుంటే అలొచించాలంపిస్తోంది.అయినా ఎక్కడైనా ఇలాంటివి మామూలే.అలా ఉన్నప్పుడే మనకి అందరితో పరిచయాలు పెరుగుతాయి కదా!అప్పుడు లోన్లీనెస్ ఉండదు.సందడిసందడిగా ఉంటుంది :)

భాస్కర రామిరెడ్డి said...

>> ఒక ఒడంబడిక చేసుకున్నాము. నేను అప్పిచ్చిన వస్తువులకి నేను బాధ్యురాలిని,.

హెంత పేద్ద బాధ్యత తీసుకున్నారండీ. మీకు నా ప్రగాఢ సానుభూతి.



ఈ సారి బెంగుళూరు లో వుద్యోగం చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా మీ ఎదురిల్లు ఖాళీ చేపించి మరీ చేరతాము :)

sreedevi said...

చాల బాగుంది. మీ టపాల కోసం చాలా సార్లు మీ బ్లాగ్లోకి వచ్చాను. Missed you. Finally this post proved worth waiting.

Sreedevi.

Raghuram said...

కృష్ణ గారు..!,

ఇంత బాగా ఎలా వ్రాయగలరండి బాబు మీరు. గృహము పెకలించి మీది కూడా గొదావరి తీరం కాదు కదా?.


రఘురామ్

కృష్ణప్రియ said...

@ నిషిగంధ,

నా టపాలు చదివి షేర్ చేస్తున్నానన్నారు.. థాంక్స్.. ఇక పెద్ద స్కేల్ అప్పులంటారా, :) మాకూ అవి తప్పవు.. స్టెప్ స్టూల్, లాన్ మూవర్, సెల్ ఫోన్ చార్జర్లూ.. :)

@ బద్రి,

ఒక సారి యూ యెస్ లో బాగా తెలిసిన అమ్మాయి నాకు జ్వరం వచ్చి తగ్గాక ఫోన్ మీద..'క్రిష్నా.. నీకు జ్వరం అదీ అన్నావు..కాస్త తగ్గి బాగున్నావా? వంట చేసుకోగలుగుతున్నావా? ' అంది. ఓహో పాపం మళ్ళీ వంట చేసి తెస్తుందేమో పాపం ఇబ్బంది అని..'దుక్క లా ఉన్నాను. వంట మొదలు పెట్టేశాను.. ' అన్నాను. వెంటనే 'హమ్మయ్య!! నాకు బోర్ గా ఉంది.. కాస్త ఎక్కువ వండేయవా? శ్రీనీ, నేనూ వచ్చేస్తాం అక్కడికే ' అంది. :)

కృష్ణప్రియ said...

@ రాధిక,

ధన్యవాదాలు!! :) హైటెక్ అప్పులు మరి.. హ్మ్మ్.. సత్య హరిశ్చంద్రులవారి మీద.. మీ 'సత్యప్రియ ' లో ఒక టపా రాసేయండి మారి...

@ ఇందు,

థాంక్స్! అవును. దసరా ప్రయాణం పార్ట్ 2 రాశాను. పోస్ట్ చేయాలి.. గేటెడ్ కమ్యూనిటీ లోని రకరకాల పార్ష్వాల్లో అప్పులొక భాగం. మీరన్నట్టు,.. మనకి ఒక గ్రూప్ ఉంది. చుట్టూ తెలిసిన వారే అన్న భావం చాలా భద్రత ఇస్తుంది. హైదరాబాద్ లో ముందర.. గేటూ గట్రా లేకపోయినా ఇంకా సఖ్యత గా.. ఉండేవాళ్ళం. ఇప్పుడు మా అమ్మా వాళ్ళకి చుట్టూ అపార్ట్ మెంట్ లు వెలిసి, ఇప్పుడు తెలిసిన వాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టుకోవచ్చు.

@ భాస్కర్ గారు,

అరెరే.. నాలుగు కామెంట్ల ముందు చెప్తే.. మీకే రికమెండ్ చేద్దును.. మంచు గారికి మాటిచ్చానే.. పోన్లెండి.. పక్కన ఎక్కడైనా చూద్దాం. :))

కృష్ణప్రియ said...

@ శ్రీదేవి గారు,

అసలు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు.. చాలా థాంక్స్!!

@ రఘురాం,

ధన్యవాదాలు. *******గృహము పెకలించి **** LOL ఒక్క క్షణం వెలగలేదు.. అమ్మది గోదావరీ తీరం, నాన్నగారి తాతలు నైజాం జాగీర్దార్లు, ప్రాపర్ తెలంగాణా. :) సో..

హరే కృష్ణ said...

క్రిష్ణక్కా..
హమ్మయ్య..! మొత్తానికి టపా పడిందోచ్..బోలెడు థాంక్స్!


>>>ఇళ్ళు కొనుక్కునే ముందర, ఆ ఏముంది.. కార్లున్నాయి, స్కూటర్లున్నాయి, డ్రైవర్ ఉంటాడు,.. కావాలంటే దుకాణం అతను సామాన్లు ఇంటికి చిటికెల మీద తెచ్చి పడేస్తాడు.. ' అనే assumptions మీద కొనేస్తారు.. మారే డ్రైవర్లు, వాళ్ళ సెలవలు, దుకాణం అతని latency లాంటివి పట్టించుకోరు

So True..ఎంత బాగా చెప్పారు..కొత్తగా ఇళ్ళను కొనేటప్పుడు ఇవేమీ గుర్తుకు రావు.. ఎంత Sq.ft. highway కి airport కి ఎంత దూరం అనే తప్ప నిత్యావసర వస్తువులు దొరికే ప్రదేశాలను ఎవరూ పట్టించుకోరు..ebay వాళ్ళు పిజ్జా డెలివరీ వాళ్ళు ఏమైనా collaberate అయ్యి solve చేస్తే బావుండు భవిషత్తులో..



అప్పు చిన్న కప్పు నందు పెద్దబాధకలగకనుండు
చూడ చూడ లిస్టు పెరుగుతుండు.
స్టాక్ ఎక్సేంజ్ లందు కమ్యూనిటీ లోఎక్సేంజ్ లు వేరయా..
విశ్వదాభిరామ దిమ్మ తిరుగునేమ..

న అప్పో న కమ్యూనిటీషత్..

రాజ్ కుమార్ said...

2 నెలల క్రితం ఒకావిడ సాక్స్ అరువు [ సాక్స్ ఆరువా?? :) :) ] తీసుకుని వెళ్తుంటే.. 'ఆంటీ.. ' అని పిలిచింది. ఆవిడ ముద్దుగా.. 'ఏంటమ్మా? ' అంటే.. 'కెన్ యూ ప్లీజ్ మేక్ ష్యూర్ టు రిటర్న్? ' అంది.
kevvvvvvvvv.....
''మజ్జిగుందా? మెంతులున్నాయా? మైదా పిండుందా?కాస్త బియ్యం ఇస్తావా? బూట్లిస్తావా? .. హా హా... అరిపించారు ..
సూపర్ గా ఉందండి పోస్ట్...

Anonymous said...

బాగున్నది మీ వివరణ, కానీ యాహూ గ్రూపు కొత్తగా ఉన్నది, బహుశా మీది అందరూ సాఫ్ట్వేర్ జనాభా అట్టుంది

కొత్త పాళీ said...

very interesting.
మీ సహజమైన హాస్య శైలి అలా ఉండగా, టపాలో అంతర్గతంగా ఒదిగిపోయి ఉండే social commentary చాలా ఆలోచింప చేస్తున్నది.
ఈ ఆధునిక అప్పుల యవ్వారానికి మీరు చెప్పిన కారణాలు (కొట్టు దూరం, వెళ్ళిరావడం కష్టం, ఇత్యాది) వాటికంటే ఇంకా మౌలికమైన కారణాలు కొన్ని ఉన్నాయని నాకు తోస్తున్నది.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

బావుంది.

>>'అవును లే.. స్విమ్మింగ్ పూల్, జిమ్మూ, బాట్మింటన్ కోర్టూ కావాలంటే 2 అడుగులేస్తే చాలు.. ఉప్పు లాంటి తుచ్చమైన పదార్థాలు కావాలంటే మాత్రం 2 కిలో మీటర్లు వెళ్ళాలి.. వారెవ్వా'

ఇది కేక..

కొత్తపాళీ గారి అభిప్రాయంతో వందశాతం ఏకీభవిస్తాను. మీ రచనా శైలి గురించి ఆయన ఇచ్చిన వర్ణన సరిగ్గా సరిపోతుంది మీ పోస్టులకి.

కృష్ణప్రియ said...

@ హరేకృష్ణ,

:-) థాంక్స్. మీ వేమన పద్యం బాగుంది.

మొదటి లైన్ కాస్త మారిస్తే చందస్సూ సెట్ అవుతుందేమో..

@ తార,

అవును.. చాలా వరకూ సాఫ్ట్ వేర్ జనాభా కావటం తో..

@ కొత్త పాళీ గారు,

నెవర్లు.
అవునండీ.. కాస్త పెద్ద లెవెల్ లో అప్పు లేను వాళ్ళు ఈరోజుల్లో చాలా అరుదు. (ఇల్లు, కార్, చదువు లాంటివి)

----- వాటికంటే ఇంకా మౌలికమైన కారణాలు కొన్ని ఉన్నాయని నాకు తోస్తున్నది. ..
మీరు వీలు చూసుకుని వివరిస్తే.. మీ టపాలోనో, (లేదా వ్యాఖ్య రూపేణా.. ) బాగుంటుంది...

@ Weekend Politician,

ధన్యవాదాలు.

నేస్తం said...

>>> కాస్త ఎక్కువ వండేయవా? శ్రీనీ, నేనూ వచ్చేస్తాం అక్కడికే ' అంది. :)
ఉంటారండీ బాబు ఇలాంటి వాళ్ళు.. ఒకసారి మా ఎదురు అపార్ట్మెంట్ లోఉండే ఫ్రెండ్ అర్జెంట్గా రావా అంటే చిన్నపిల్లలు అవ్వడం వల్ల వాళ్ళతో బాటు ఆదరాబాదరగా వాళ్ళింటికి వెళితే ..ఏమీ లేదు డాక్టర్దగ్గర అపాయింట్మెంట్ ఉంది బాబుని చూసుకోవడానికి ఎవరూ లేరు మీరు ఓ నాలుగు గంటలు చూసుకోరా అంది.. సరే మా ఇంటికి తీసుకు వెళతా అంటే.. కాదంటా..వాళ్ళ అబ్బాయికి క్రొత్త ఇల్లు చూస్తే ఏడుపొస్తుంది అంట అందుకే నేనే వాళ్ళింట్లో ఉండి చూసుకోవాలని అంది.. నేను పిల్లలకు తిండి కూడా పెట్టలేదు అంటే ప్రిజ్ లో ఏదో ఒకటి ఉంటుంది పెట్టేయండి అని చెప్పేది వినకుండా వెళ్ళిపోయింది..

కృష్ణప్రియ said...

@ నేస్తం,

:-)) మరే.. ఆ ఇన్సిడెంట్ తర్వాత, 'ఆరోగ్యం ఎలా ఉంది, వండుకోగలుగుతున్నావా? ' అని ఎవరైనా అడిగితే,.. బాగానే ఉంది కానీ మీకు వండి పెట్టేంత కాదు!!!" అని ( మనసులో నే లెండి) అనుకుంటాను..

సిరిసిరిమువ్వ said...

:))హాయిగా నవ్వించారు.

అయినా ఎంత సాఫ్ట్వేరు వాళ్లూ.....ఫారిన్ రిటన్డులూ అయితే మాత్రం మరీ సాక్సులు..చొక్కాలూ అప్పేంటండీ బాబూ!!

రాజ్ కుమార్ said...

కృష్ణప్రియ గారు ! కొత్త అభిమానులని కన్సిడర్ చెయ్యరా మీరు? i hurt.. :) :)

కృష్ణప్రియ said...

@ వేణూ రాం,

అయ్యో సారీ.. ఎలా మిస్ అయ్యానో.. పేజ్ డవున్ చేసి మీ కామెంట్ కి సమాధానం వదిలేసాను. తప్పు నాది కాదు..హరే కృష్ణ పద్యానిది :)

మళ్ళీ సారీ.. మీ రెండు వ్యాఖ్యలకి చాలా చాలా థాంక్స్..

@ సిరిసిరి మువ్వ,

:) థాంక్స్!

lalithag said...

చంపేస్తున్నావు కదా కృష్ణా! ఇంతకు ముందు కనిపించని చేబదుళ్ళు అన్నీ ఇప్పుడు భూతద్దంలో కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడే ఎవరో వచ్చి ఏదో అడిగి తీసికెళ్ళారు. నిద్రలో నీకు ఎక్కిళ్ళొస్తే నీ పోస్టునే అనుకో మరి :)
మరి నీకు బదులున్న వ్యాఖ్య కూడా ఇక రాసెయ్యనీ. పెద్ద వ్యాఖ్యలు రాయకూడదని నిర్ణయించుకుని ఆగిపోయాను. కానీ బరువు దించుకోవాలి కదా? చిన్నప్పుడు దూరదర్శన్లో కొన్ని మంచి హిందీ కార్యక్రమాలు వచ్చేవి కదా, అందులో ఒక కథ చూపించారు. అత్యవసర సమయాల్లో బంధువులకన్నా ఇరుగు పొరుగు వారే అక్కరకు రాగలుగుతారు, దగ్గర ఉండడం వల్ల అని. అది చాలా నిజం కదా. Emergency contact లలో ఇరుగు పొరుగుల వివరాలే ఇస్తాము కదా? అందరితో కలుపుగోలుగా ఉండే ఒకామె వల్ల నాకు ఎంతో మంది పరిచయం అయ్యారు. ఆమె అవసరమైనంత మేరకు సాయం తీసుకోవడానికి మొహమాటపడదు. కానీ సాయం చెయ్యడానికీ అంతే ముందు ఉంటుంది. తెలిసిన వాళ్ళకి స్ట్రోక్ వస్తే వీరి కుటుంబమే అన్ని విధాలా సాయం చేసింది.

కృష్ణప్రియ said...

@ లలిత,

:-)
Exactly.. Emergencies లో అనే కాదు, మామూలప్పుడు కూడా.. చుట్టుపక్కలవారిచ్చే సహాయ సహకారాలూ, ధైర్యం.. విలువ కట్టలేనివి. అలాగే.. నువ్వు చెప్పినావిడ లాంటావిడే నాకూ తెలుసు. నిర్మొహమాటం గా మన వస్తువులడిగితీసుకెళ్తుంది, అలాగే అవసరానికి.. ఇంకోళ్ళింటినుండి అడిగయినా.. మనకి సమకూరుస్తుంది. మా ఇంట్లో దెత్ అయినప్పుడు చుట్టుపక్కల వారు చేసిన సహాయం.. ఎప్పటికీ మరవలేనిది...

Nagamani said...

bhale vundi mee post..mee ammayi katti kada asalu :)

pavan kumar said...

సరళమైన భాషలో భావాలని అందంగా రాస్తారండి మీరు,
మీ బ్లాగు చదవడం మొదలుపెట్టిన తరువాత అలవాటుగా మారిపోయింది..

కృష్ణప్రియ said...

@ నాగమణి, పవన్ కుమార్,

ధన్యవాదాలు.

Unknown said...

mee blog bavundi. me way of expression kuda. eppude chusanu. mottam chadivi malli coment post chestanu.meku kudirinappudu na blog ki randi

http:/kallurisailabala.blogspot.com

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;