Saturday, December 11, 2010

చదువుకుంటారా? లేక...


మొన్నీ మధ్యేనా? త్రైమాసిక పరీక్షలయ్యాయి,.. 'ఓ పనై పోయింది బాబూ ' అన్నాను? మళ్ళీ వచ్చి పడ్డాయండీ హాఫ్ యర్లీస్ ..  పిల్లలు రెండు నెలల క్రితం ఆఖరి పరీక్ష రాసిన తర్వాత విసిరేసిన పుస్తకాల దుమ్మూ గట్రా దులుపుకుని, చెదలూ అవీ బ్లేడులతో గీకి పడేసి.. ముందరేసుకుని కూర్చున్నారు.  ఉదయం నుండీ పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు ఎపిసోడ్ కి 2 గంటల షార్ట్ బ్రేకులు విధి గా తీసుకుంటూ, తెగ అలిసిపోతున్నారు. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఉదయం నుంచీ ఒకటే దెబ్బలాట.
ఉదయం నుంచీ చూస్తున్నాను. అసలు ఇద్దరికిద్దరూ ఆగరే? ఇక లాభం లేదని జస్టిస్ కృష్ణప్రియ అవతారం ఎత్తాను.  ఇద్దరినీ తలా ఒక గది లో కూర్చోమని హుకుం జారీ చేసాను ..నేను చూడకుండా మళ్ళీ ఒకదగ్గర చేరి 10 నిమిషాలాడుకోవటం.. మళ్ళీ తగవు మూడ్ లోకి వెళ్ళిపోవటం :-(  ఇద్దరూ మాట్లాడుకోవటానికి వీల్లేదని తీర్పు ఇస్తే..సైగల్లో మాట్లాడుకుంటూ ఇకిలింపులు.. నిమిషాల్లో గొడవల్లోకి రూపాంతరం చెందటం.. పోనీ ఏక పక్ష తీర్పు ఇచ్చామా? మనల్ని ఫూల్స్ చేసి ఇద్దరూ కలిసిపోతారు!!!



అసలు రోజు మొదలవటమే పెద్ద గొడవతో .. టూత్ బ్రష్ మీద పేస్టు నేను ఫస్ట్ వేసుకుంటానంటే..నేను ఫస్టని రగడ.  పరుగు పరుగున వచ్చాను. తగవు తీర్చటానికి..  ఇద్దరూ నా వైపు నేను వర్ణించలేని భావం తో చూస్తున్నారు, తీర్పు ఎలా ఇస్తానా అన్నట్టు. రాం జన్మ భూమి తీర్పు కన్నా వంద రెంట్ల ఉత్కంఠ మా ఇంట్లో..TV రియాలిటీ షో ల్లో ఎవరు గెలిచారో చెప్పే ముందు చూపించే టెన్షన్ వాతావరణం లో..



సరేనని, దీనికి ఒక పరిష్కారం ఆలోచించి ఇద్దరి టూత్ బ్రస్షులూ తీసుకుని వేరే గది లోకెళ్ళి గడియలు బిగించి పేస్టులు వేసి .. ఎందుకో అనుమానం వచ్చి చూస్తే.. గది బయట కిటికీ లోంచి కర్టెన్ల సందులోంచి చూస్తున్నారు, ఎవరికి ఫస్ట్ వేస్తున్నానా అని.  'హమ్మో.. తృటి లో ఎంత ప్రమాదం తప్పింది.  నిన్న మా మేరీ కి ఉదారం గా మూడు రోజుల సెలవ గ్రాంట్ చేసినందులు భగవంతుడు ఇన్స్టంట్ గా ఇచ్చిన వరం!!


రోజంతా.. పిల్లల చాడీలతో తల వాచిపోయింది. 'అదిగో నేనేమీ చేయకుండానే నావైపు కోపం గా చూసింది చెల్లి ' అని అక్కంటే .. 'నేను ఏమీ అనకుండా నా పని చేసుకుంటూ కూర్చుంటే.. గట్టిగా అరుస్తూ, కావాలని నన్ను తోసుకుంటూ వెళ్ళింది చెల్లెలుంగారి కంప్లెయింట్.. అంబానీ సోదరులైనా కాస్త మీడియా ముందైనా అన్యోన్యత నటిస్తారేమో కానీ.. వీళ్ళు మాత్రం టాం & జెర్రీల్లా గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఒకపక్క సహనం నశిస్తున్నా.. పరీక్షలప్పుడు ఏడిపించటం ఎందుకని చూస్తున్నాను.


మా పెద్దమ్మాయికేమో,.. 'తప్పు చెల్లిదయినా తిట్లు నాకే పడతాయి. అమ్మ చెల్లిని ఫేవర్ చేస్తుంది ' అని బలమైన అభిప్రాయం. చిన్నదేమో.. 'అక్కంటేనే అమ్మకి ప్రాణం.. నాకు ఎప్పుడూ సెకండ్ ప్రిఫరెన్సే..  అని.. అందుకే అక్క ని ముందు కన్నాక దాన్ని కన్నామని దానికి అంతకన్నా దృఢమైన అభిప్రాయం.

తల్లిదండ్రులకి ఇద్దరూ సమానమే ' అన్న కాన్సెప్ట్ తలకెక్కేలా బోల్డు కథలు చెప్తున్నాను అప్పటికీ. 


నాకు ఇంకోటి కూడా  గుర్తొచ్చింది.. చిన్నప్పుడు  మా అమ్మ చెల్లిని వెనకెసుకొచ్చినప్పుడల్లా.. మా అమ్మ నిజంగా నాకూ అమ్మేనా? లేక నన్ను ఎక్కడినిచైనా తీసుకొచ్చారా అని అనుమానాలు రావటం గుర్తొచ్చింది.




మధ్యాహ్నం, చదువులయ్యాక కాస్త వంట చేద్దాం అని పిల్లలకి ' బ్రేక్ ' ఇచ్చి కూరగాయలు తరగటం మొదలు పెట్టానో లేదో పేద్దగా ఏడుస్తూ ఇంటికి చేరారు ఇద్దరూ.. వెనకాలే పిల్లల గాంగ్ తమాషా చూడటానికి చేరిపోయారు. ముందర బాబోయ్.. ఈ పిల్లలకి ఏ మోకాళ్ళ చిప్పలు పగలడమో, పళ్ళు విరగటమో జరగలేదు కదా అని వంటింట్లో పని అర్థంతరం గా ముగించి చేతులు కడుక్కునేంత లోనే..  ఇద్దరూ ఒకేసారి గట్టిగా వాళ్ళ వాదనలు మొదలు పెట్టేశారు. వీళ్ళకి తోడు పెద్దమ్మాయి స్నేహితులు, చిన్నమ్మాయి స్నేహితులు కూడా.. ఒకేసారి అరుస్తూండటం తో.. కళ్ళు బైర్లు కమ్మి.. 'ఆపండీఈ,  ' అని అరిచి.. కచేరీ మొదలు పెట్టాను. 


ఇంతకీ విషయం ఏంటీ అంటే..
హానా మోంటానా స్టిక్కర్లట 10 రూపాయలకి ఒకటి చొప్పున దొరుకుతాయి. ఎవరో రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. వాటికోసం ఇవ్వాళ్ళ మరీ రోడ్ మీద జుట్లు పీక్కున్నంత పని చేశారు.






సాధారణం గా ఇలాంటి గొడవలప్పుడు.. నాకు మా చిన్నదనం లో అక్కా చెళ్ళెళ్ళంటే వీళ్ళు రా అన్నట్టు ఎంత సఖ్యత గా ఉండేవాళ్ళమో..  కథలు కథలు గా చెప్పటం అలవాటు.. (మన లో మాట.. మా అమ్మా ..అదే కథ చెప్పేది.. "మీలా మేము కొట్టుకుంటే మా అమ్మా-నాన్న సన్యాసుల్లో కలిసిపోయేవాళ్ళు. ఏడుగురు పిల్లలలం ఎప్పుడూ అంబుల పొది లా కలిసి తిరిగే వాళ్ళం అని.. చిన్నప్పుడు అమాయకం గా నమ్మేసేదాన్ని.

ఇంకా నేను మొదలు పెట్టేలోపలే.. మా పెద్ద టపాకాయ.. 'నాకు తెలుసు.. నువ్వూ, పిన్నీ..ఒక్కసారి కూడా జుట్లు పీక్కునేవాళ్ళు కాదు. మేమే బాడ్ ' అంది ఉక్రోషం గా..  నేను వెంటనే రూట్ మార్చేసి.. ' అది కాదు.. నాకూ, నాన్నకీ..' అని ఏదో మొదలు పెట్టబోయాను.. 'మాకిద్దరికీ కొంత పరువు లాంటివి ఉంది. రోడ్డు మీద గొడవ పడితే మేము తల ఎత్తుకోగలమా? ' అని బరువైన డైలాగులు చెప్దామని ముఖం సాధ్యమైనంత సీరియస్ గా పెట్టుకునేంత లో.. మా చిన్న సిసింద్రీ . 'తెలుసు తెలుసు.. మీరిద్దరూ ఎంత ఫైట్ చేసినా.. ఇంట్లోనీ చేస్తారు కానీ..బయట జుట్లు పీక్కోరు.. ' అనేసింది. దానితో అందరం హాయిగా నవ్వేసాం.



Same story in my family aanTee  అంది ఎందురింటి ఆరేళ్ళ పిల్ల.  'ఆ ' అని అనేలోపలే ఏడేళ్ళ పక్కమ్మాయి మా ఇంట్లో కూడా మా అమ్మా నాన్న ఫైట్ చేసుకుంటారు కోనీ..  they won' t hit each other aunty.. అంది. ఇంకో పాప.. " మా ఇంట్లో అయితే.. My grandparents also fight with each other like anything Aunty అంది.  పక్కమ్మాయి మళ్ళీ అందుకుని.. మా క్లాస్ లో అరుణ్ వాళ్ళ అమ్మా నాన్న  fought so hard that.. Arun missed the school yesterday అంది, పెద్ద రహస్యాన్ని కనుక్కున్న దానిలా...




వీళ్ళ ఇబ్బంది కరమైన వాక్ప్రవాహాన్ని ఆపాలంటే మన దగ్గరుంది గా బ్రహ్మాస్త్రం? హా హా హా అని మనసులోనే వికటాట్టహాసం చేసుకుని.. 'పదండి పదండి.. ఇంక చదువు కీ అని మా పిల్లలని లోపలకి లాగి చాయిస్ ఇచ్చాను " చదువుకుంటారా? రండి లేదా.. కలిసి మెలసి ఆడుకోండి.."  కాలనీ పిల్లలని.. పోనీ మీరు కూడా వస్తారా? సరదాగా ప్రశ్నలడు... ' అనేలోపలే పిల్లలంతా.. 'గాయబ్, గాన్, (వెళ్ళి ) పోయారు.. పోయ్టాంగ.. గేలే,, పోగిదరే .


టైం దొరికింది గా.. చక చకా టపా రాసేస్తున్నాను.. :)

22 comments:

రాధిక(నాని ) said...

ఉదయం నుండీ పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు ఎపిసోడ్ కి 2 గంటల షార్ట్ బ్రేకులు విధి గా తీసుకుంటూ, తెగ అలిసిపోతున్నారు. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఉదయం నుంచీ ఒకటే దెబ్బలాట.
హహ్హహ్హ ...సూపరండి.మీరు బలే రాస్తారు:)).
ఇక జగడాల విషయం లో సేం మాపిల్లలు అంతే.అక్క హాస్టల్ నుండి వచ్చిందని నువ్వేమి అనవు అని వీడంటే..ఎమన్నా అంటే తమ్ముడు చిన్నోడు కదా అంటావు అని ప్రియా అంటుంది .వాళ్ళే కాసేపు దేబ్బలాడుకుని అలసి పోయిఆపెస్తుంటారు.. ..

మురళి said...

:):) ..nice one

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

>>పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు కి 2 గంటల షార్ట్ బ్రేకులు
This is toooo good.

>>పుస్తకాల దుమ్మూ గట్రా దులుపుకుని, చెదలూ అవీ బ్లేడులతో గీకి పడేసి
hmm.. you are reminding me of so many of my schoolmates :))

Sravya V said...

రొటీన్ గా చెప్పేదే ఐనా మళ్ళీ చెబుతున్నా చాలా బావుందండీ !
చెదలూ అవీ బ్లేడులతో గీకి పడేసి..
-------------------------------------
ఇదెలా సాధ్యం ? బ్లేడు తో గీకుతారు అసలు చెదలు పట్టినాక ఇంకేం మిగులుతుంది అక్కడ :)
మీ పిల్లల గొడవలు బావున్నాయి , నాకు చిన్నప్పటి నుంచి ఇలా గొడవపడి సాధించుకోవాలని మహ కోరిక కానీ అది తీరే మార్గమే లేదు అందుకే ఇలాంటివి చదివినప్పుడల్లా జెలస్ ఫీల్ అవుతుంటా ఏమి చెయ్యలేక :)
ఇక మీ పిల్లలు , పక్కింటి పిల్లల చెప్పిన తగువులు చూస్తుంటే నవ్వ లేక కడుపు చెక్కలవుతుంది , అఫ్కోర్సు ఇది చూసిన సినిమా అనుకోండి :)

lalithag said...

:)
పోనీ మీరు కూడా వస్తారా? సరదాగా ప్రశ్నలడు...:)

మీ ఇంట్లో పరీక్షలప్పుడా?
మా ఇంట్లో పరీక్షలకి preparation అంతా బళ్ళోనే జరుగుతుంది, ఇంటికి హాయిగా ఆడుకోనివ్వండి, తొందరగా పడుకోమనండి, breakfast పెట్టండి అన్న ఉత్తరం పపిస్తారు కాబట్టి కొంత నయం. కనీసం చదివించే సమస్య ఉండదు. మిగిలిన రెండు సమస్యలూ ప్రతి రోజూ ఉండేవే.
మాకు రోజూ ఉంటుందో పెద్ద యజ్ఞం. దాని పేరు homework. ఆ మీకెంత homework ఇస్తారో మాకు తెలుసు అంటావా.
అదే మరి, ఆ మాత్రానికే. కళ్ళ నీళ్ళ పర్యంతమైపోయి చెయ్యనని మొరాయిస్తే ఏం చెయ్యాలో చెప్పుదూ కాస్త.
మాకు ఇంతింత హోం వర్కులని కథలు కథలు చెప్పి చెప్పి అలిసిపోయాను.
మా పెద్దబ్బాయికి అదేంటో చిన్నాడికున్న హోం వర్కులో సగమే ఉంటుంది. వాడిది ముందు ఐపోతే మాత్రం నాకు బెంగ లేదు. చిన్నాడు అన్న మాట చక్కగా వింటాడు. ఇది మాత్రం నిజం.కానీ అదేంటొ వాడికి ఉన్న సగం పనికి రెండింతల సమయం కూడా సరిపోదు.

మా పిల్లలు చక్కగా ఏ గొడవా లేకుండా ఆడుకుంటారమ్మా, అన్నం తినేటప్పుడు తినడం బదులు, చదువుకునేటప్పుడు చదువు పక్కన పెట్టి, నిద్రపోవాల్సినప్పుడు తెల్లవారే దాకా...
కొంతమందికి మాత్రం హోం వర్క్ ఐపోయాక అబోలెడంత టైము మిగులుతుంది. ఆటలూ(sports), పాటలూ, ఫైట్లూ (కరాటె లాంటివి) అంటూ 64 కళలూ సాన బడుతుంటారు. నాకు మనశ్శాంతినిచ్చేది మా పిల్లల reading, drawing చుట్టు పక్కల ఉన్న పిల్లల స్నేహితులూ. మిగిలినవన్నీ ప్రయత్నించి వదిలేశాం.

వేణూశ్రీకాంత్ said...

హ హ :-) పిల్లలుకాదండి బాబు పిడుగులు :-)

ఇందు said...

హ్హహ్హహ్హ! భలే వ్రాసారండీ..నేను లాగే అడిగేదన్ని గొడవలప్పుడు మా అమ్మని...'నేను మీకు తిరణాల్లలో దొరికా కదా...తమ్ముడే మీ కొడుకు కదా అందుకే ఎప్పుడు వాడికే సపోర్ట్ చేస్తారు ' అని.మీ టపా మొత్తం చదువుతుంటే నేను మా తమ్ముడు చేసిన అల్లరి గుర్తొస్తోందీ...పాపం మా అమ్మావాళ్ళు ఎలా భరించారో ;)

lalithag said...

ఎన్నో హైలైట్లలో జుస్టిస్ కృష్ణప్రియ హైలైటు అదిరింది. ఉపాయం బావుంది, నాకూ ఉపయోగపడుతుంది అనుకునేలోపలే కిటికీలోంచి తొంగి చూస్తున్నారనే tension ఒకటి. మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. నీ పుణ్యం మమ్మల్నీ కాపాడింది.
అవునూ, నువ్వు టపాలు రాయడానికి పిల్లలు ఇలా టాపిక్కులు ఇస్తుంటారా? టపాల కోసం truobles ని టాపిక్కులు చేస్తుంటావా?
ఓ సారి మేమో embarrassing పరిస్థితిలో ఇరుక్కుంటే మా పెద్దబ్బాయి "నా జర్నల్ లో రాసుకోడానికి విషయం దొరికింది" అన్నాడు. మాకు అంతదాకా అద్భుతం అనిపించిన విశేషాలన్నీ మాకోసం భరించి కాళ్ళు నొప్పులూ, ఆకలి, ఇంకోటి అంటు మా ప్రాణం తీస్తున్న వాడల్లా. ఆ టానిక్కు అప్పుడే అరిగిపోయింది. ఇంటికొచ్చాక ఇప్పటి వరకూ జర్నల్ ముట్టలేదు. నీకేమైనా ఆ టాపిక్కు అప్పిచ్చేదేంటి, నువ్వు నాకో కప్పుడు హాస్యం అప్పిద్దువు గాని :)

కృష్ణప్రియ said...

@ బద్రి,
:))
@ రాధిక,
:) థాంక్స్. నేను ఏంటో వదలలేను.. కల్పించుకుని.. సోల్వ్ చేయటానికి మధ్యలో దూకి ఫూల్ అయిపోతూ ఉంటాను ఎప్పుడూ. :-((

@ మురళి గారు,
:) ధన్యవాదాలు!

@ weekend politician,
ఆ పదిహేను నిమిషాలకే చాలా కష్టపడాల్సి వస్తోంది :)

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,
థాంక్స్! పట్టేశారు. మట్టి తో గూడు లాంటిది చెదలే అనుకున్నాను.. బౌండ్ పుస్తకం మీద పట్టింది.. బ్లేడ్ అనేది అతిశయోక్తి అయినా.. ప్లాస్టిక్ చెంచా తో.. గీకాల్సి వచ్చింది ..
@ లలిత,
:) అవును. ఇండియా లో కాస్త పరీక్షల ప్రెషర్ ఎక్కువ.. నాకు మన చిన్నప్పుడు ఎంత హాయిగా ఉండేవాళ్ళమో అనిపిస్తుంది. మహా అంటే లెక్కల హోం వర్క్ ఉండేది అంతే...
@ వేణు,
అవును.. కరెక్ట్!
@ ఇందు,
:-) ఇంట్లో పెద్ద పిల్లలకి అందరికీ ఏదో ఒక టైం లో ఈ డౌట్ వచ్చే ఉంటుంది ..
@ లలిత,
:) టాగ్ లైన్ లో చెప్పాగా.. మామూలు గా అందరిళ్ళల్లో రోజూ జరిగే విశేషాలే ... కాస్త మసాలా అదీ కలిపి...

హరే కృష్ణ said...

అన్ని బాషలు వారు అర్ధం చేసుకునేలా కధ ఏంటో తెలుసుకోవడానికి బొమ్మలు చూపించి పెట్టడం బావుంది..:-)
పిల్లలు ఇలా అల్లరి చెయ్యకపోతే ఇంత మంచి పోస్ట్ వచ్చేదా చెప్పండి..వాళ్లకి థాంక్స్ కూడా చెప్పకుండా ఇలా జస్టిస్ అవతారం ఎత్తుతారా!.. హన్నా!
రెండో ఫోటో లో statue of liberty goddess కదా..న్యాయవాదా..? ఏమో తెలియడం లేదు :)

జేబి - JB said...

హహ్హహా - ఎంత కొట్టుకున్న వాళ్ళు కాసేపటికి కలిసిపోతారు. మధ్యలో జస్టిస్ అవతారం ఎత్తిన మనల్ని ఫూల్స్ చేసి కలిసిపోతారు. - మా ఇంట్లోనూ ఇదే మాట అనేవారు.

శివరంజని said...

అబ్బా మా అమ్మ కూడ ఇంతే మీ లా కొంచెం కూడా అల్లరి చేయనివ్వదు

సవ్వడి said...

<< ఉదయం నుండీ పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు ఎపిసోడ్ కి 2 గంటల షార్ట్ బ్రేకులు విధి గా తీసుకుంటూ, తెగ అలిసిపోతున్నారు. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఉదయం నుంచీ ఒకటే దెబ్బలాట. >>

Super...
Hahahaha....
mee pillalu inkaa ekkuva allari ceyyaalani korukuntunnaanu.:)

మధురవాణి said...

:) :)

మంచు said...

-) మీరు ఈసారినుండి రెండు టూత్ పేస్ట్లు కొనండి...చెరొకటీ

లత said...

బావుందండీ సరదాగా
ఇద్దరు పిల్లలున్న ప్రతి తల్లికీ ఇలాంటి సంఘటనలు తప్పవు కదా

ఆ.సౌమ్య said...

అచ్చు మా అక్కచెల్లెళ్లలాగే ఉన్నారు మీ వాళ్ళిద్దరూ.

"తప్పు చెల్లిదయినా తిట్లు నాకే పడతాయి. అమ్మ చెల్లిని ఫేవర్ చేస్తుంది ' అని బలమైన అభిప్రాయం. చిన్నదేమో.. 'అక్కంటేనే అమ్మకి ప్రాణం.. నాకు ఎప్పుడూ సెకండ్ ప్రిఫరెన్సే".....ఇది మా ఇద్దరి ఫేవరేట్ డైలాగు. మా అమ్మ దగ్గరా ఎప్పుడూ మేమిద్దరం అచ్చు ఇలాగే చెప్పేవాళ్ళం. చిన్నప్పుడు ఇవే మాటలు చెప్పి పాపం మా అమ్మని తెగ ఏడిపించేవాళ్ళం. మా గోల పడలేక మా అమ్మ కూడా కచేరీ మొదలెట్టేవారు.

మీరేం బెంగపడకండి, పెద్దయ్యాక వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయిపోతారు చూస్తూ ఉండండి.

కృష్ణప్రియ said...

@ హరే,
థాంక్స్.. ఆ బొమ్మకి అర్థం .. అంత ఎత్తు కి ఎదిగిపోయి న్యాయమూర్తి అవతారం ఎత్తానన్నమాట..

@ JB,
అవును,..భార్యా భర్తలు కూడా (చాలా కేసుల్లో ) అంతే కదా :)

@ సవ్వడి,
:) హ్మ్మ్.. అసలే తల వాచి ఉన్నాను. ఇవ్వాళ మా పిల్లల ఆఖరి పరీక్ష.. తుపాకీ గుండుకి కూడా అందనంత దూరం లో ఉంటారు స్కూల్ నుంచి వచ్చాక..

@ శివరంజని,
:-)) హ్మ్మ్.. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని.. మా అమ్మ లా అస్సలూ ఉండకూడదని అంటే పిల్లల అల్లరి ని భరిస్తూ, వస్తువులన్నీ చిందర వందర గా విసిరేస్తూ, నీళ్ళూ, పెయింట్ లాంటివి వెదజల్లుతూ ఉంటే 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ' లో సావిత్రి లా చెదరని ప్రసన్నత తో, సద్దుకుంటూ, పిల్లలని అంతులేని వాత్సల్యం తో చూసుకుంటూ, ఆనంద భాష్పాలు మధ్య మధ్య లో తుడుచుకుంటూ..

కానీ అబ్బే.. ఆ ఓపిక లో పదోవంతు కూడా లేదు ఏం చేస్తాం?

జేబి - JB said...

>>>అవును,..భార్యా భర్తలు కూడా (చాలా కేసుల్లో ) అంతే కదా :)

మా ఇంట్లో నేనూ, అన్నయ్య మాత్రమే :-)

మీరు శివరంజనిగారికి ఇస్తూ రాసిన జవాబు మటుకు సూపర్. :-)

కృష్ణప్రియ said...

@ మధురవాణి,

:))
@ మంచు,
మీ సలహా బాగుంది. కానీ అన్నింట్లో ఈ సూత్రం వర్తింప చేయాలంటే కొద్దిగా ఇబ్బంది. ఒక్కోసారి అమ్మో, నాన్నో నాతోనే ఆడాలి, అంటే నాతోనే అని.. తెగ దెబ్బలాడుకుని అలుగుతారు :)

@ లత,
అవును. అందరిళ్ళ కథే :)

@ సౌమ్య,
థాంక్స్.. నిజమే.. నేనూ, మా చెల్లెలూ కూడా అంతే..

కృష్ణప్రియ said...

@ JB,
అవును.. రాస్తున్నప్పుడు నాకే నవ్వొచ్చింది అంత ప్రసన్నత తో నా మొహాన్ని ఊహించుకుంటే.. :))

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;