Thursday, December 16, 2010

అతిథి దేవో భవ!! (కానీ.. )





శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక నాకు ఎక్కడ లేని నీరసమూ ఆవహిస్తుంది. అలా సోఫా లోకి కూరుకుపోయానంటే.. సాక్షాత్తూ యమ ధర్మ రాజు వచ్చి 'నడువ్వ్...' అని కొరడా ఝుళిపించినా 'నా వల్ల కాదు.. రేపు రండని పంపించే పరిస్థితి. అంటే మిగిలిన వాళ్ళంతా చెంగు చెంగున గెంతులేస్తూ ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటారని కాదు. రఘు మాత్రం శనివారం పొద్దున్నే 9 కల్లా ఎక్కడికైనా వెళ్ళే ప్రోగ్రాములు విధి గా వేయటం, చిన్న "డిస్కషన్" లోకెళ్ళటం.. మర్నాడు గెలిచిన వాళ్ళు బెరుగ్గా,.. ఓడిన వారు కసి తీరా నోరు పారేసుకోవటం మాకు మామూలే..


2 వారాల క్రితం సరిగ్గా అలాంటి ఒక శుక్రవారం పూట, నిస్త్రాణ గా సోఫా లో పడి టీ తాగుతున్న సమయాన అసాధారాణ స్థాయి లో ప్రసన్నత నిండిన స్వరం లో "ఆన్నట్టు చెప్పటం మర్చిపోయాను,.. మా ఫ్రెండ్ ఫణి తెలుసు కదా... " అని తను అడగగానే.. నా మనస్సెందుకో కీడు శంకించింది


'ఆ.. గుర్తున్నాడు చెప్పండి ' అన్నాను చాలా భయంగా. తను అంతకన్నా భయభక్తులతో ఎందుకైనా మంచిదని నా చుట్టుపక్కల ఉన్న చిన్న సామాన్లు తీసి నాకు దూరం గా పెడుతూ... నా టీ ఆఖరి చుక్క కూడా అయిపోయిందని నిర్ధారణ చేసుకుని 'చెప్పడం మర్చిపోయాను కృష్ణా.. వాడు రేపు ఉదయం నాలుగ్గంటల ఫ్లైట్ కి దిగుతాడు.. ఒక వారం ఉంటాడట.. ' అని కప్పు విసిరేస్తే లాఘవం గా పట్టుకోడానికి రైనా లా సంసిద్ధమై నుంచున్నారు.


నా ముఖం లో ఎక్స్ ప్రెషన్ మారే లోపలే.. 'వాడికి ప్రత్యేకం గా ఏమీ చేయక్కరలేదు. ఏదో మనతో పాటే కల్లో, గంజో...' అని ఒక పాత కాలం డైలాగ్ కొట్టారు. నాకు ఏమనాలో తోచలేదు. ఊరుకుండిపోయాను. ఫణి నాకు పదేళ్ళకి పైగానే తెలుసు. రఘు కి ఒకప్పటి కో వర్కర్.  చాలా డబ్బు మనిషి. కానీ మంచివాడే. ఆడ వాళ్ళకి అతనికి అన్నం పెట్టమంటే ఎంతో ఆనందం గా ఉంటుంది. ఏమి పెట్టినా వంక పెట్టకుండా ఆనందం గా మరో సారి అడిగి వడ్డించుకుని ' అన్నదాతా సుఖీ భవ !! ' అని ఆశీర్వాదం కూడా ఇచ్చి.. ఎలా చేశారో అన్నీ తెలుసుకుని మరీ వెళ్తాడు. కానీ బొత్తి గా మెటీరియలిస్టిక్. అవసరాన్ని బట్టే సంబంధ బాంధవ్యాలు నడిపిస్తాడు.


అదంతా కాదు నా భాధ. వారం క్రితం మెయిల్ పంపి కాల్ చేసి చెప్తే రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం లో దిగుతున్నాడని చెప్తే.. మా బట్టలు కొట్టు సద్దేది ఎప్పుడట?" వారం రోజుల్లో ఉతికిన బట్టలు గెస్ట్ రూం లో పడేయటం మాకు అలవాటు. మా మేరీ మడతలు పెట్టి ఉంచినా అవి మా వార్డ్ రోబ్ లో పెట్టుకోవటానికి కూడా ఒక్కోసారి తీరికుండదు. ఓపిక లేకపోవటం తో, ఆయన కేయాల్సిన అక్షింతల కార్యక్రమం సాధ్యమైనంత క్లుప్తం గా ముగించి, గది సద్దటం మొదలు పెట్టాను.


"ఉదయం మూడు కే కార్ తీసుకుని వెళ్ళాలి Airport కి" ... అని అనగానే నాకు కోపం వచ్చింది. "ఏంటి అసలు? అమెరికా నుండి వస్తూ, ఉదయం పూట గంట డ్రైవ్ చేసుకుని రమ్మనమనడమేమిటి? మనమే డ్రైవర్ మీద ఆధారపడతాం, లేదా టాక్సీ తీసుకుంటాం.. " అని ఏదో అనబోయి.. 'పాపం తనకి మొహమాటం ' అని ఊరుకున్నాను. చక్కగా 2 సూట్ కేసులతో దిగాడు ఫణి. టీ తాగుతూ బోల్డు కబుర్లు, కాకరకాయలూ అయ్యాక.. మా పిల్లలూ వచ్చి చేరారు ఆరు గంటలకే.. (స్కూల్ ఉంటే 7.30 చేస్తారు కానీ.. వీకెండ్ మాత్రం ఠంచన్ గా ఆరుకే లేస్తారు మరి).


పాపం ఏం తిన్నాడో ఫ్లైట్ లో.. మొహమాటం గా ఉంటాడేమో నని, మసాలా దోశలు, 2 చట్నీలూ చేసి వడ్డిస్తే.. ఆనందం గా తిని, పొగడ్తలతో నన్ను ముంచెత్తి,... వెళ్ళి పడుకున్నాడు జెట్ లాగ్ అని. మేమంతా కాస్త నెమ్మది గా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశాం సాయంత్రం వెళ్ళి డ్రైవర్, టాక్సీ తో వచ్చాడు. ఈ లోగా మా పిల్లలు "మా బొమ్మలుండిపోయాయి ఆ రూం లో" అని ఎంత నసిగినా మేము ఒప్పుకోలేదు అక్కడికి వెళ్ళటానికి. సాయంత్రం అతనొచ్చాక గది లోకెళ్ళి వచ్చిన పిల్లలు మెరుస్తున్న కళ్ళతో... 'అమ్మా... అంకుల్ బాగ్స్ చుట్టూ, బోల్డు చాక్ లేట్లు, టాయ్స్ అవీ ఉన్నాయి.. మాకు ఇస్తాడేమో కొన్ని... " అని ఉత్సాహంగా చెప్పారు.


"అతను ఎవరికోసం తెచ్చాడో.. మీరు అస్సలూ అటువైపు వెళ్ళద్ద"ని వాళ్ళని మందలించేసాం. ఫణి తో కూర్చుని మాట్లాడుతుంటే... రోజురోజుకీ ఇంకా మెటీరియలిస్టిక్ గా మారుతున్నట్టు అనిపించింది.


'అమెరికా నుండి ఏదీ తేలేదు రా రఘూ,.. మా అక్క చెళ్ళెళ్ళకి, కజిన్లకీ.. ' అన్నాడు. మేము 'ఆ అవును. ఎక్కడైనా ఒకటే ఈ రోజుల్లో.. అన్నీ అన్ని చోట్లా దొరుకుతున్నాయి ' అని అతన్ని సమర్ధించాం. ' ఓ పది వేలు తీసుకుని షర్ట్ కావాలన్న వాడికి షర్టూ, షూలు కావాలన్నవాడికి షూలూ, ఫోన్లు కావాలన్న వాడికి ఫోన్లూ కొని పడేద్దామనుకుంటున్నాను...' అన్నాడు. నాకు వొళ్ళు మండి పోయింది. కానీ సౌమ్యంగా 'అయినా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళే కొనుక్కుంటారేమో ఫణీ.. ఈ మధ్య ఒకరి చాఇస్ ఒకరికి నచ్చటం మానేసింది..' అన్నాను.


డబ్బు సంబంధమైన మాటలు తప్ప, మంచీ, చెడ్డా అనేది అన్నీ వదిలేశాడు. ఇళ్ళూ, స్టాకులూ, జాబులు అసలు ఎంత క్విక్ గా మారుస్తాడో .. అలాంటివి చెప్తూనే ఉన్నాడు. ఆశ్చర్యం వేసింది. డబ్బు మనిషి అని తెలుసు కానీ.. మరీ ముదిరిపోయాడనిపించింది.


ఏదో విషయం మాట్లాడుతూ, 'మా మేనకోడల్ని ఇంట్లో పెట్టుకొమ్మంటున్నారు రా.. మా అక్క/బావగారు. తనకి MS లో సీటొచ్చింది. ఖర్చంతా భరిస్తాం .. కానీ.. సహజం గా భయస్తురాలు. మీతో కొంతకాలం ఉంటే తర్వాత నెమ్మది గా పరిచయాలయ్యాక అపార్ట్ మెంట్ లో కెళ్ళిపోతుంది .. అని..' ' గాడిద గుడ్డేం కాదూ? ' అన్నాను. అని..


అయ్యో అనుకున్నాము. "సుకన్య వచ్చి ఎన్నాళ్ళయింది ఇండియా కి? " అని అడిగితే.. 'తను రాదు రా.. నాకేదో పని ఉందని వచ్చాను. తనకి ఇబ్బంది గా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యా వాళ్ళది ఇరుకైన 2 బెడ్ రూం అపార్ట్ మెంట్ ' .. అందుకని రాదు. అన్నాడు.


ఇస్త్రీ అబ్బాయి వచ్చాడు, బట్టలు తీసుకోవటానికి. 'నావీ ఉన్నాయి వేస్తాను ' అన్నాడు. కానీ.. "ఏంటీ!! 5 రూపాయలా? వద్దులే " అని మానేశాడు. పొద్దున్ననంగా ఇంట్లోంచి వెళ్ళి.. అర్థరాత్రి తిరిగి వచ్చేవాడు. రెండో రోజు ఉదయం లేచి హాల్లోకి రాగానే ఎవరో ఉన్నట్టు అనిపించి..'బాబోయ్' అని చూస్తే.. ఫణి డ్రైవర్ ట. హల్లో పడుకున్నాడు. అతనికి కూడా రగ్గూ, దుప్పటీ, దిళ్ళూ.. ఇచ్చారట. ఓహో.. మళ్ళీ ఇదొకటా అనుకున్నాను.

కాసేపయ్యాక చూస్తే.. మోటర్ సైకిల్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది. 'అమ్మయ్య.. కందిపప్పు అయిపోయింది అనుకున్నాను. చెప్దాం ' అని నేను బయటకెళ్తుంటే కనిపించింది.. ఫణి డ్రైవర్ తీసుకెళ్తున్నాడని. అతని పర్సనల్ వర్క్ కోసమట. 'అదేంటి? బస్సులో వెళ్ళచ్చు కదా? ' అంటే.. 'పాపం.. బస్ స్టోప్ దూరం కదా' అని నసిగారు రఘు. 'ఫణి కార్ ఉంది కదా..?' అంటే.. 'పెట్రోల్ వేస్ట్ అనీ.' అనగానే నాకు చిరాకు పెరిగిపోయింది. కానీ మొహమాటమొకటేడ్సింది కదా మనకి.


అలా వారం రోజుల పాటూ, ఫణికీ, అతని డ్రైవర్ కీ భోజనం, పడకా, టీ, కాఫీలూ, వారం రోజులకీ వాడుకోవటానికి మా ఇంట్లో ఉన్న మొబైల్ ఫోనూ .. హాయిగా సాగిపోయింది. దేశ విదేశాలు తిరిగిన మహానుభావుడు కనీసం తువ్వాలూ, సబ్బూ కూడా తెచ్చుకోలేదు. తనకే కాక తన డ్రైవర్ కి కూడా ఇవ్వవలసి రావటం ..

ఇంకో రెండు రోజుల్లో వెళ్తాడనగా ...

'క్రిష్నా.. మీ పిల్లలు చాక్లేట్లు తింటారా? ' అని అడిగాడు. 'ఓహో ఇప్పుడు చాక్లేట్లు పడేస్తాడన్నమాట ' అనుకున్నాను. ఎలాగైనా సరే ఫణి ఒక్క పది రూపాయలైనా ఖర్చు పెడుతుంటే చూడాలన్నా ఆకాంక్ష తో..'యా.. పిల్లలన్నాక చాక్ లేట్లు ఇష్టం లేని వాళ్ళు చాలా అరుదు కదా ' అన్నాను. 'ఏ ఫ్లేవర్ ఇష్టపడతారు? వైట్? బ్లాక్? బ్రవున్? ' నేను నిర్లజ్జగా ' ఏదైనా ఓకే.. కాడ్  బరీజ్ సిల్క్ ' వాళ్ళ ఫేవరేట్ అన్నాను.


'ఓకే.. మీరు శుక్రవారం సాయంత్రం మాత్రం ఫ్రీ గా ఉంచుకోండి.. I want to take you all out for dinner. Pick a nice restaurant.." అన్నాడు. సాధారణం గా అయితే.. 'వద్దు ఫణీ.. ఈ హడావిడి లో ఇదంతా ఎందుకూ? ' ససేమిరా ఒప్పుకునేదాన్ని కాదు. అందునా శుక్రవారం రాత్రికి!


కానీ ఒక విధమైన పంతం మొదలైంది. 'సరే ' అని ఒకటి రెండు పేర్లు చెప్పాను. ఇలా చెప్తున్నప్పుడు రఘు.. ముఖం చూడలేదు ఎందుకైనా మంచిదని. :)


శుక్రవారం రానే వచ్చింది. సాయంత్రం 7 అయినా రాడే? ఫోన్ చేస్తే .. 'నాకు లేట్ అవుతుంది ఒక గంట లో వస్తాను ' అన్నాడు. నేను పిల్లలకి 2 దోశలు పెట్టేసి చూస్తున్నాను. 8.30 కి వచ్చి.. "I am very tired. Can we order pizza? " అన్నాడు. సరే అని డామినోజ్ లోంచి అందరికీ పిజ్జాలూ, స్టార్టర్లూ, డెజర్టులూ, కోక్ లూ చాలా ఉదారం గా ఆర్డర్ చేశాడు 1200+ అయింది బిల్లు. ఆర్డర్ ఇంటికి వచ్చాక వెంటనే బాత్ రూం లో కి దూరాడు. ఎంతకీ బయటకి రాడే? డెలివరీ అబ్బాయి నుంచున్నాడు... విసుగ్గా..
సరే ఏం చేస్తాం? అని అయిష్టం గా.. నేనే పే చేశాను. అదేంటో.. కరెక్ట్ గా డెలివరీ బాయ్ బయటకి వెళ్ళడమేమిటి.. 'అయ్యో.. నువ్వు పే చేసావా క్రిష్నా.. ఇదేం బాగా లేదు.. This is my treat ' అన్నాడు. కానీ.. అంతకు మించి ఏమీ రియాక్ట్ అవలేదు. హాయిగా తినేసి.. మర్నాడు.. 'వెళ్ళొస్తాను .. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను రా" అని వెళ్ళిపోయాడు.


1200 అని కాదు కానీ ఆశ్చర్యం వేసింది అంతలా ఎలా తప్పించుకున్నాడని.. చాక్ లేట్లన్నాడు, ఏ రకం కావాలన్నాడు.. చివరకి తన బట్టలు కూడా మా చేతే ఉతికించి.. వెళ్ళిపోయాడు.. మళ్ళీ అమెరికా చేరానని ఫోన్ కూడా చేయలేదు.


వారెవ్వా.. ఇంక 2 యేళ్ళు ఆడుకోవచ్చు మా వారిని .. ఈ ఒక్క పాయింట్ మీద అనుకున్నాను. 
మళ్ళీ అంతలోనే ...
చ చ... ఏమైంది నాకు? అతని స్వభావం అతనిది. నేనెందుకు మారాలి? అతనికి నచ్చిన విధం గా అతనున్నాడు. తన స్వభావాన్ని దాచటానికి ప్రయత్నం చేయలేదు. నేనే దిగజారాను. ఈ విధం గా అతను డిన్నర్ కి ఖర్చు పెడితే నాకు వచ్చేది ఏంటి? ఇలా ఎక్స్ పెక్ట్ చేయటం.. మెటీరియలిజం కాదా?   అనుకుని నెమ్మది గా మా గొడవలో మేము మునిగిపోయాము..




నిన్ననే బిల్లు వచ్చింది తను వాడిన మొబైల్ ది. 1700 రూపాయలట..
తన జేబు నుంచయితే కనీసం 5 రూపాయలని ఇస్త్రీ చేయించుకోడా? తనది కాదు కదా అని ఇంత యూజ్ చేస్తాడా?

నెక్స్ట్ ఇయర్ రానీయండి చెప్తాను.. 


52 comments:

ఆ.సౌమ్య said...

హ్మ్మ్ కొందరుంటారు ఇలాంటివాళ్ళు....మనం మొహమాటపడిపోతాంగానీ వాళ్ళు అస్సలు మొహమాటపడరు.

అయితే ఆ ఫోన్ బిల్లు చూసాక మీ ఇంట్లో ఎన్ని వస్తువులు విసిరేసారు మీరు. పాపం మీవారు.. ఎన్ని దెబ్బలు తగిలాయో ఏమిటో! :))))

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

ఇలాంటి వాళ్ళు పబ్లిక్ లైఫ్ లో ఉంటే మాత్రం Reimbursements తో ఖజానా ఖాళీ చేసేస్తారు

రాధిక(నాని ) said...

కొందరు డబ్బు సంపాదించడం ఎక్కువైయ్యేకొలది మెటీరియలిస్టిక్ గా అయిపోతారు.మాకు తగులుతారు అప్పుడప్పుడు.ఎం చెస్తాం అతిథి దేవో భవ!!

Anonymous said...

ఈ విషయం మీద ఇదివరలో నేను కూడా నాకు తోచిన విధంగా రెండు టపాలు పెట్టాను. తీరికుంటే ఒకసారి చూడండి.

1)http://harephala.wordpress.com/2010/04/05/baataakhaani-202/

2)http://harephala.wordpress.com/2010/04/06/baataakhaani-204/

ఇందు said...

హ్మ్! ఎలా ఉంటారండీ బాబూ? మేం అమెరికా వచ్చిన కొత్తల్లో మా చందు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాం ఒక టెన్ డేస్..ఇల్లు వెదికే వరకు.ఆ పదిరోజులు నాకు నరకం.వాళ్ళేమన్నా ఇబ్బంది పడతారేమో అని చాలా జగ్రత్తగా ఉండేదాన్ని.అది మినిమం కామన్ సెన్స్ కదా! మరి ఇలాంటి కంజూస్ కి పెద్ద పట్టిములు ఉండవేమో!

Sravya V said...

ఇప్పుడు ఆ ఫణి గారు మీ బ్లాగు చదివితే మీ పరిస్తితి ఏంటి :)
ఈలాంటి వాళ్ళు కుప్పలు కుప్పలు గా తగులుతూనే ఉంటారేమో, నిజం గా చిరాకు వేస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే మళ్ళీ కబుర్లు మాత్రం ఏం
మాత్రం తగ్గకుండా చెబుతుంటారు .
కాని మీలాంటి వాళ్లకి కూడా అంత విసుగు తెప్పించాడంటే ఆ ఫణి గారిని ఒకసారి చూడాల్సిందే :)

భాస్కర రామిరెడ్డి said...

హ్మ్... పోష్ట్ బాగుందండి. మీరు ఇక్కడ వున్నప్పుడు ఇలాంటి వారు అడుగుకొకరు తగిలుండాలి కదా? కొన్ని జీవితాలంతే.... అయినా పిజ్జా బిల్, చాక్లెట్స్, హోటల్ చెప్పి ఎగ్గొట్టడమేమిటండీ మరీ చీప్ మెంటాలిటీ కాకపోతే.

ఆత్రేయ said...

ఇలాంటి వాళ్ళని మీరు ఫ్రెండ్ అంటారా?
డబ్బు గురించి కాదు గానీ అలా ప్రవర్తించే మనుష్యులను దూరం గా ఉంచాలి
ఇంకో మాట అలాంటి పీ___వె____ల ని మేపేకన్నా ఏ అనాధ ఆశ్రమం లో పిల్లలకి పెట్టటం ఉత్తమం.
క్షమించాలి మీ ఫ్రెండ్ ని పట్టుకొని అలా మాటలన్నందుకు.
పనిలో పనిగా ఆ ఫణి మెయిల్ ఐడి ఇస్తే మీ పోస్ట్ కాపీ అండ్ పేస్టు అండ్ సెండ్ చేస్తా

lalithag said...

Back so soon :)
Good.
"చ చ... ఏమైంది నాకు? అతని స్వభావం అతనిది. నేనెందుకు మారాలి? అతనికి నచ్చిన విధం గా అతనున్నాడు. తన స్వభావాన్ని దాచటానికి ప్రయత్నం చేయలేదు." Expect not to expect ....

భాను said...

ఇలాంటి వాళ్ళు అంటే ఎదుటివాళ్ళు ఏమనుకున్తారని ఆలోచించారు. అయ్యో ఏమనుకుంటారో అనుకునేవాళ్లు ఇలా ఎందుకు చేస్తారు. అవునండీ ఆ ఫణి ఈ పోస్ట్ చదివితే! ఆ చదివిన మనల్ని కాదులే అనుకోని మళ్ళీ నెక్స్ట్ ఈయర్ రెడీ అయిపోతదనుకుంటా..

హరే కృష్ణ said...

ఈ పోస్ట్ భద్రంగా ఉంచండి ..next year తను వచ్చే ముందు రోజు ఈ పోస్ట్ ని ఇక్కడ reactions ని చదివి మరీ ఐర్పొర్ట్ కి వెళ్ళాలి..

వేణూశ్రీకాంత్ said...

ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించిందండి చదువుతుంటే..

Krishna K said...

"నెక్స్ట్ ఇయర్ రానీయండి చెప్తాను.. "
పెద్దగా ఏమీ చెప్పలేకపోవచ్చునేమో అలోచించండి :)

చందు said...

Ilaanti vallaki manam dabbu pettina daanitho paatu dobbulu koodaa pettali.. Yevadee Phani..Next year mee inti kosthe.. suit case lo saamanlu vaadesi.. thechina taxi lo shopping chesi.. Battalu vuthiketappudu chimpesi.. chatni lo kaaram yekkuva veyyandi..
Paapam mee aayanni vadileyandi...

Sree said...

khacchitamgaa ilaantivaallu untaaru ani naa personal experience.. next year malli vastaada????

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఇల్లాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. మీరు ఇంత మొహమాటస్తులా? నేనైతే హోటల్ బిల్ లాగా ఓ బిల్ చేతిలో పెట్టేవాడిని. కనీసం మళ్ళీ మాటు వచ్చినప్పుడు ఇంకో ఇల్లు చూసుకుంటాడు.

మా తువాళ్లు, సబ్బులు మేమే తెచ్చుకుంటాం. గెస్ట్ రూము సర్దక్కర లేదు. డ్రైవరు పడుక్కొన్న హాలు లోనే పడుకుంటాము. మా బట్టలు మేమే ఉతుక్కుంటాము. కావాలంటే మీవి కూడా ఉతికి పెట్టుతాము. ఎప్పుడు రమ్మంటారు? :):)

మాలా కుమార్ said...

మా ఇంటికి వచ్చిన అథిది కన్నా మీ అథిది చాలా నయం . మా అథిది కి పిల్లల రూం ఇచ్చాము . వాళ్ళ టూత్ బ్రెష్ , టంగ్ క్లీన్ , టవల్ సుబ్బరంగా వాడుకున్నాడు . మా పిల్లలకు , మాకు ముందు తెలీలేదు . తెలిసాక ఆయన వెళ్ళిపోయాకా , ఆ బాత్ రూం లో వున్న బ్రష్ లు టంగ్ క్లీనర్లూ బయటపడేసేదానిని ! ఆయన బట్టలు ఎంత నల్లగా నీరు కావిరంగు పట్టి వుండేవంటే పనిమనిషి ఆ బట్టలు ఉతకనేసింది . ఆయన ఏమాత్రం సిగ్గుపడకుండా సూట్కేస్ లో పెట్టేసుకున్నాడు . ఇలా చెప్పాలంటే ఆయన కతలు బోలెడు . చదువుకోని వాడుకాదు సి. ఈ గా చేసేవాడు .ప్రతినెలా బరోడా టూర్ వచ్చేవాడు . మాఇంట్లోనే వుండేవాడు . పెద్ద పోస్ట్ అయ్యేటలుంది :)

రాజ్ కుమార్ said...

ఇలాంటి వాళ్ళుంటారు లెండి.. నాకు చాలా మంది తగిలారు :) :) నైస్ పోస్ట్..

Overwhelmed said...

why are you encouraging him to take advantage of you guys?

Kalpana Rentala said...

చదువుతుంటేనే...వొళ్ళు మండుకొచ్చింది..మీరేలా తట్టుకున్నారో! మాకు కూడా ఇలాంటివే అనుభవాలు కొంచెం కూడా తేడా లేకుండా వున్నాయి. కాకపోతే అవి అటు నుంచి ఇటు వచ్చినవి.ఇండియా నుంచి ఇక్కడకొచ్చి వేపుకు తినే బాచ్.

ఇంకొంత మంది ఫ్రెండ్స్ చెప్పినవి కూడా చాలా వీన్నాను..మీ స్ఫూర్తి తో నేను కూడా ఒక పోస్ట్ రాసి పడేస్తానుండండి ఎప్పుడో....

సుజాత వేల్పూరి said...

కృష్ణ గారూ, ఇలాంటి వాళ్ళు మాకు ఫ్రెండ్స్ లో అరుదే గానీ చుట్టాల్లో బోల్డు మందున్నారు. మాఇంటికొతే మాకేం తెస్తావ్? మీ ఇంటికొస్తే మాకేంపెడతావ్? ఇదీ వరస! మీ ఆయన పేద్ద ఉజ్జోగంలో ఉన్నాడుగా..ఏం ఖర్చు పెడితే చచ్చిపోతారా? అనే వరసలో ఉంటాయి ప్రవర్తనలూ మాటలూ! నవ్వుతూనే అలా మాట్లాడేస్తుంటారు. మామూలు హోటళ్ళలో టిఫిన్లు పనికి రావు. చట్నీస్ లో బ్రేక్ ఫాస్టూ, f9 లో లంచూ, నొవోటెల్ లో డిన్నరూ ఉండాలి. మామూలుగా అయితే ఇలాంటి రెస్టరెంట్స్ కి వెళ్ళే ధైర్యం పొరపాటున కూడా చేయరు గానీ మా ఇంటికొస్తే అంతా ఖరీదు ఖరీదుగా ఉండాలి యవ్వారం!

కారు చాలక ఆటో ఎక్కమంటే కోపాలొచ్చేస్తాయి. టాక్సీ పిలవాలి. అదీ ఇండికాలు గిండికాలు పనికి రావు. మహీంద్రా లోగాన్ కి తక్కువైతే ఎక్కరు. అమ్మో! ఒకటా రెండా! ఎన్నో అనుభవాలు! వాళ్లనని లాభం లేదు. అభిమానం, ప్రేమా అని అలవాటు చేసేశాంగా మరి! మమ్మల్నే అనుకోవాలి.

పొరపాటున ఏ వీకెండో వాళ్ళిళ్ల కెళ్తే పులిహోరా, దోసకాయ పప్పూ ఇదే మెనూ!

నాకైతే చుట్టాలకంటే ఫ్రెండ్స్ బెటర్ అనిపిస్తుంది. మా ఇద్దరి ఫ్రెండ్సూ హాయిగా ఇంట్లో మనుషుల్లా కలిసిపోతారు.

మనకేమో ఆరెస్ బ్రదర్స్ వాడు విడి కౌంటర్లోపెట్టే "పెట్టుబడి చీరలు"! వాళ్ళొస్తే మాత్రం కళాంజలి నాగవల్లి కలెక్షన్ లెవెల్లో ఉండాలి. బోల్డన్నీ కుందన్సూ, రాళ్ళు రప్పలూ,పూసలూ అవీ ఉండాలి బట్టల నిండా!

అమ్మో, చాలా చెప్పిస్తున్నారు నా చేత

కృష్ణప్రియ said...

@ సౌమ్య,
:) అవును. ఇక బిల్లొచ్చాకా అంటారా.. అబ్బే. 'ఇదంతా విధి ' అని అనుకుని, ఆనందం గా పే చేసి మా రొటీన్ లోకి వెళ్ళిపోయాం. (స్వగతం: అమ్మయ్య .. సౌమ్య కి నమ్మశక్యం గానే చెప్పినట్టున్నాను )

@ WP
నిజమే

@ రాధిక,
అవునండీ... 'తిన్నమ్మకి తిన్న వాపిరి, కన్నమ్మ కి కన్న వాపిరీ' అని ఒక సామెత :)

@ లక్ష్మీ ఫణి గారు,

నా బ్లాగ్ కి స్వాగతం! మీ టపాలు రెండూ ముందే చదివాను :) చాలా సార్లు నేను అనుకున్నాను.. నేను రాసేవి చాలా వరకూ మీరు మీ బ్లాగ్ లో అల్రేడీ టచ్ చేసేశారని ...

సవ్వడి said...

మరీ ఇంతలానా... కనీసం చాక్లైట్లు కూడా కొనకుండా...

ఎలా భరించారండి!

Anonymous said...

కృష్ణ ప్రియ గారు,
ఇటువంటి వాళ్ళు అమెరికా దేసీ లలలో అడుక్కి ఒకడు ఉంటాడు.చేసేది ఫారిన్ ఉద్యోగం.థర్డ్ గ్రేడ్ లో cheapest మెంటాలిటి వాళ్ళని నేను చూసాను.
అప్పుడప్పుడు అనిపిస్తుంది,మనము సంపాదిస్తుంది బతకటానికా లేక రేపు బకీటు తన్నినప్పుడు ఈ డబ్బులు అన్నీ వేసుకొని తగలేసుకోవడానికా అని.
కొన్ని జీవితాలు అంతే. మనము ఏమి చెయ్యలేము. అతని మెయిల్ id చెప్పండి.ఈ టపా మెయిల్ చేస్తాము. ఇటువంటి రకాలకి కనీసం అటువంటి బుద్ది అన్న చెప్పాలి.
ఒనె అఫ్ ది బెస్ట్ పోస్ట్ ఫ్రొం యు.కీప్ రైటింగ్ మేడం.

కృష్ణప్రియ said...

@ ఇందు,
అందరూ అలాగ ఉండరు లెండి.. మొన్నీ మధ్య ఎవరింటికో వెళ్ళి ఉండాల్సిన్ వచ్చినప్పుడు మేమూ చాలా చాలా జాగ్రత్త గా ఉన్నాం (at least అనుకున్నాం)

@ శ్రావ్య,
:) ఫణి కి లాభం లేని పని చేయడని అర్థమైంది.. ఈ బ్లాగు చదవడు. చదివినా మారడు

@ భ. రా. రె. గారు,
అవును.. స్పెసిఫికేషన్లు అన్ని అడగటం పైగా :)

@ ఆత్రేయ,
:))

@ లలిత,
అవును.

కృష్ణప్రియ said...

@ భాను,
You are right

@ హరే,
:) మళ్ళీ Airport కి వెళ్ళటం కూడానూ..

@ వేణు శ్రీకాంత్,
ఎందుకుండరూ, భేషుగ్గా ఉంటారు. సుజాత/మాల గారి కామెంట్లు చూడండి..

@ కృష్ణ,
:) అవును, కుక్క తోక వంకర.. మర్చిపోవటం దేవుడిచ్చిన వరం? కనీసం డిన్నర్ ఇన్విటేషన్ త్రోసిపుచ్చి ఒక 1200 మిగుల్చుకుంటాం..

కృష్ణప్రియ said...

@ చందు,
:)) మీ సజెషన్లు బాగున్నాయి. నెక్స్ట్ ఇయర్ కి అదే నా ప్రణాళిక..

@ శ్రీ.
ఆయనకేవో బిజినెస్సులు .. తప్పక వస్తాడు..

@ బులుసు సుబ్రమణ్యం గారు,
:))) మీరిలాగ నవ్విస్తానంటే మీరు చెప్పినవి చేయకపోయినా.. మా మొబైల్ ఇచ్చి మరీ మా ఇంట్లో అట్టేపెట్టుకుంటాం...

@ మాల గారు,
:)) బ్రష్షులూ, టంగ్ క్లీనర్లూ.. :) మావాడే బెటర్ అన్నమాట ..

కృష్ణప్రియ said...

@ వేణూరాం,
:) థాంక్స్..

@ జాబిలి,
ఇదే మొదటి సారి కదా.. ఈసారి జాగ్రత్త గా ఉంటాం..

@ కల్పన గారు,
:) అవును. ఒకటి గుర్తుకొచ్చింది. ఒకావిడ వచ్చిందోసారి. ఆవిడ బ్యాగులు రాలేదని.. నా బట్టలు వాడి..పైగా.. ఒక్కటీ బయటకి వేసుకెళ్ళేందుకు తగినవి కాదని తేల్చి చెప్పింది.. మీ టపా కోసం చూస్తాను..

@ సుజాత,
LOL.. మీరంటుంటే గుర్తొచ్చింది మా చుట్టాలాయన ఒకసారి పేద్ద కోల్ద్ క్రీం డబ్బా లోంచి క్రీం రక రకాలు గా వాడుతూ, మళ్ళీ అదే చేతులతో మళ్ళీ తీయటం చూసాక అది ఉంచలేక, పారేయలేక చాలా కాలం ఉంచేశాం..

ఆ.సౌమ్య said...

నేను నమ్మలేదు నమ్మలేదు...మీరు failed :))))

కొత్త పాళీ said...

ఓపెనింగ్ ఫెంటాస్టిక్.
ఇండియానించి రెండేళ్ళకోసారి అమెరికా తెలుగు సోదరుల్ని ఉద్ధరించడానికొచ్చే కళామతల్లి ముద్దు బిడ్డాల్ని గురించి ఈమాటలో ఎవరో ఒక కథలాగా రాశారు. ఇటునించి అటు చేసే వాళ్ళకి కూడా తక్కువలేదన్నమాట. నాకేమో అత్యంత ప్రాణమిత్రులున్నా, వాళ్ళు రమ్మన్నా, ఏదో హోటల్లో సద్దుకు పోతాను తప్ప .. బాబోయ్!
పోనీ అలాగని రేపు మీరు గుండె రాయి చేసుకుని, అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని వీల్లేదని కరాఖండిగా చెప్పారనుకోండి, ఆ కృష్ణని చూశావా, అస్సలు మన సాంప్రదాయాలకి నీళ్ళొదిలేసింది అని ఆడిపోసుకుంటుంది ఈ పాడు (అతిథి) లోకం

lalithag said...

అందరూ అలాగ ఉండరు లెండి.. మొన్నీ మధ్య ఎవరింటికో వెళ్ళి ఉండాల్సి వచ్చినప్పుడు మేమూ చాలా చాలా జాగ్రత్త గా ఉన్నాం (at least అనుకున్నాం) - ఇందులో "at least అనుకున్నాం" important.

మనం ఇంకొకరిని మన ప్రవర్తనతో మెప్పించగలమని (పొరపాటు, నొప్పించకుండా ఉండగలమని) అనుకోవడం మటుకే మనం చెయ్య గలం. మన ప్రవర్తనలో ఎన్ని లోపాలు కనిపించవచ్చో ఇంకో వైపున (చెప్పుకునేందుకైనా). అందుచేత నువ్వు చెప్పినట్టు మనమూ మన స్వభావం దాచుకుని ప్రవర్తించడం వృథా ప్రయాస. కావల్సిన వారు సర్దుకుపోతారు. ఇష్టం లేని వారు ఎలాగూ కష్టపెట్టుకుంటారు. (Easier said than done అనుకో)

Ennela said...

ఇక్కడికొచ్చాక ఇంకా భారత్ కి వెళ్ళలేదండీ...టికెట్ల వరకూ ఓకే, ఆఫ్ సీసన్లో కొనుక్కోవచ్చు. కాని పయి ఖర్చులు గురించి అలోచించి భయపడుతున్నానంతే .కుంచెం మీ అడ్రస్సు ఇద్దురూ...ఎంచక్కా వాడేసుకుంటానూ....అబ్బా, మీ పోస్ట్ చదివాకా....నాకు భారత్ కి వెళ్ళొచ్చని చిన్ని చిన్ని ఆశ భూతంలా పెరిగిపోతోంది....
ఈ కామెంటు అచ్చంగా అచ్చేసెయ్యొచ్చండీ కృష్ణ ప్రియ గారూ

శివరంజని said...

Krishna Priya గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

kannaji e said...

మొహమాటం అనే సుగుణం చూసారూ ...అది చాలా సందర్భాల్లో చేటు...
మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

బులుసు సుబ్రహ్మణ్యం said...

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

AK41 said...

Hello Krishna Garu
Happy New Year!!!
We are Eagerly Waiting for NEW POST...

Regards
Anil Krishna kotamraju

Ennela said...

Krishna priya garu,
I wish you and family a happy new year andee

మాలా కుమార్ said...

happy new year andi .

Ennela said...

kotta post yedandee..abhimaanulu waiting ikkada

మంచు said...

కొత్త నెల , కొత్త సంవత్సరం కానీ కొత్త పొస్ట్ లేదు :(

కృష్ణప్రియ said...

@ సవ్వడి,
:) అదే మరి..

@ అప్పి-బొప్పి,
మీ వ్యాఖ్య కి థాంక్స్.. ఒకళ్ళు బుద్ధి చెప్తిఏ మారే టైప్ కానే కాదు వీళ్ళు..

@ సౌమ్య,
అయ్యో నేను ఎంతో తెలివి గా.. మంచి ఇంప్రెషన్ కొట్టాననుకున్నానే.. :)

@ కొత్త పాళీ గారు,
థాంక్స్! మీరు చెప్పింది అక్షరాలా నిజం.. బ్రహ్మానందం గారి కథ నేనూ చదివాను.. ఈ మాట లో అనుకుంటా..

కృష్ణప్రియ said...

@ లలిత,
నువ్వన్నది నిజమే.. సాధ్యమైనంత వరకూ ఇబ్బంది ఇతరులకి కలిగించనంత కాలం.. నేనింతే' అన్నట్టు ఉంటే నష్టం లేదు..

@ ఎన్నెల,
వచ్చేయండి.. కానీ..ఒక్కటే షరతు! మీరు లాస్ట్ లో డిన్నర్ కి తీసుకెళ్తానంటే మాత్రం కుదర్దు.. :)

@ శివరంజని,
చాలా థాంక్స్.. మీక్కూడా శుభాకాంక్షలు

@ kannaji e,
అవునండీ.. మీక్కూడా శుభాకాంక్షలు..

@ బులుసు సుబ్రహ్మణ్యం గారు,
మీకు కూడా.. మనహ్ పూర్వక శుభాకాంక్షలు..

@ AK41,
మీకు కూడా శుభాకాంక్షలు! రాయాలనే చూస్తున్నాను.. సమయాభావం వల్ల..

కృష్ణప్రియ said...

@ మాలా కుమార్ గారు, ఎన్నెల,
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!..

@ మంచు, ఎన్నెల,AK41,
మొన్న హైదరాబాద్ కెళ్ళినప్పుడు పుస్తక ప్రదర్శన లో కొన్న పుస్తకాలు నములుతూ.. బ్లాగు వైపుకి పెద్దగా చూడలేదు.. ఈ వారాంతం తర్వాత..రాస్తాను... అభిమానంగా అడిగినందుకు థాంక్స్! :)

Anonymous said...

హాయ్యో! మాకూ ఇలాటి అనుభవమే లెండి.
మెల్బోర్న్ లో ఏదో పనుండి ఆరు నెలలు వున్నారు మురళి. ఆహా అంటూ పిల్లల్నేసుకుని వెళ్ళాను ఒక వీకెండు. ఉన్న మూడు రోజులలో రెండు సార్లు భోజనానికొచ్చాడొక "స్నేహితుడు". ఆఖర్న వూరెళ్ళే రోజు "మై ట్రీట్" అంటూ పెద్ద హోటల్ కి తీసికెళ్ళి, బిల్లు రాగానే "మై షేర్" అంటూ 10 డాలర్లు ప్లేట్లో పడేసాడు. నాకూ మురళీకైతే మొహం ఎర్ర బడింది.
మురళీ నవ్వేసి "డోంట్ బాదర్" అంటూ మొత్తం తనే పే చేసారు.
ఏం చేస్తాం! ఇలాటి వాళ్ళు కూడా వుంటారు!
శారద

కృష్ణప్రియ said...

@ శారద,
:))

Sravya V said...

ఓహ్ మీరు బుక్ ఎక్ష్గ్జిబిషన్ కి వచ్చారా ? ఏ రోజున వచ్చారు ? నేను 26 మధ్యాన్నం వెళ్లాను ఒకవేళ అదే రోజున నీరు వచ్చుంటే ప్చ్ మిమ్మల్ని కలవటం మిస్సయ్యనన్నమాట :(

నీహారిక said...

సంక్రాంతి శుభాకాంక్షలు కృష్ణప్రియ గారు.

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,

నేను 23 న వచ్చాను. అయినా..మీరు బెంగుళూరికి వచ్చి నా పార్టీ స్వీకరించి వెళ్తానన్నారు? చెప్పా పెట్టకుండా వచ్చి వెళ్ళిపోవటమేమిటి? :)

@ నీహారిక గారు,
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ సంక్రాంతి టపా చూశాను.. నోరూరింపచేశారు :)

Sravya V said...

హ హ మీరు హైదరాబాద్ వస్తున్నారని ముందస్తు సమాచారం అందుకే అలా ఈసారి తప్పని సరి గా బెంగళూరు వస్తాను :)

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

>> నెక్స్ట్ ఇయర్ రానీయండి చెప్తాను..

నిజమా?, జరిగే పనేనా ఒకసారి ఆలోచించండి .. :))

Anonymous said...

ivala sukravaram. Maa varini bayata tinamani cheppa.alage annaru. Antaloki gurtochindi papam, (mee katha loni character lanti vadu)ivala voori nundi vastunnadu..enduku le vadu elagu techukodu, malla bill katte deggara edo okati..naake padutundi...anname pettule ani adjust ayyaru :-)Normal ga tanu lunch ki rice tintam rare. so, anni chotla unnaru alanti vallu...vallani ela handle cheyali annadi mana vignatha ni batti untundi ani naa abhiprayam..:)

Anonymous said...

ma husband valla frnd unnadu...same category..thana bday ani party ki piliche bill vache time ki washroom ki velladu and malli eppudo valla intiki vellinapudu dinner ki biryani order chesi malli bill machethe kattinchadu...

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;