Sunday, September 19, 2010

ఓ పనైపోయింది బాబూ..
రోజూ మా కాంప్లెక్స్ లో సాయంత్రం వీధంతా పిల్లలు పరుగెడుతూ, లేక సైకెళ్ళమీదా, స్కూటర్ల మీదా, స్కేట్స్ మీదా .. తూనీగల్లా తిరుగుతూ.. అరుస్తూ, గొడవ పడుతూ, .. కొంతమంది బాడ్మింటనో, హూలా హూపో ఆడుతూ, కనిపిస్తూ ఉంటారు.. ఇక రాత్రి అన్నం తిన్నాక నడుస్తుంటే.. టీవీల్లోంచి వాణిజ్య ప్రకటనల గోల, పాటలూ, చప్పట్లూ, టీ వీ పాత్రల ఏడుపులూ,  చంటిపిల్లలున్న ఇళ్ళల్లో వాళ్ళ ఏడుపులూ.. అలసట పడి ఆఫీసులనుండి వచ్చిన జంటలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటం, సన్న సన్న గా వినిపిస్తూ ఉండటం కద్దు.                                 కానీ గత 15 రోజులుగా.. ఎవరో ఒకరిద్దరు, మొహాలు వేలాడేసుకుని.. విరక్తి గా రోడ్లమీద పిల్లలు కనిపిస్తున్నారు. రాత్రిళ్ళు 12 అయినా లైట్లు కనిపిస్తున్నాయి, చడీ చప్పుడూ లేదు..  మా పక్కింట్లోకి అమెరికా నుండి 3 నెలలక్రిందటే వచ్చి సెటిల్ అయ్యారు భార్యా భర్తలు.. వాళ్ళకి అర్థం కాలేదు. అదేదో సినిమాలోలాగా.. 'ఏం జరుగుతోందిక్కడ? నాకు తెలియాలి తెలిసి తీరాలి..' అని  వాళ్ళు వాపోతూ ఇంటి బయట నుంచున్నారు. నేనేదో.. ఇంట్లో వాళ్ళకి డిస్టర్బన్స్ లేకుండా మాట్లాడదామని బయటకొచ్చి మాట్లాడుతున్నాను అఫీస్ కాల్ లో.

              నేను 'Bye' అని చెప్పటమేమిటి.. ఆత్రం గా అడిగారు..నేనూ సీరియస్ గా..  మీకు తెలియదా? ఫత్వా జారీ చేసారు. ఈ కాంప్లెక్స్ లో పిల్లలకి ఘోషా.. ఈ నెలంతా... ' అన్నాను. కంఫ్యూజ్ డ్  గా ఉన్న వాళ్ళ మొహాలు చూసి.. పోన్లే అని 'త్రైమాసిక పరీక్షలండీ బాబూ..' అనగానే.. వాళ్ళూ 'వార్నీ' అనేసుకుని.. నేటి చదువు తీరూ, పిల్లలమీద పెరిగిన ఒత్తిడీ, మారుతున్న మానవ విలువలూ, మా కాలం లో ఎలా ఆడుతూ, పాడుతూ చదివేవాళ్ళమో కూలంకషం గా చర్చించి, 'ప్చ్చ్..' అని దీర్ఘం గా నిట్టూర్చి.. లోపలకెళ్ళిపోయారు.ఈ చర్చ లో కొట్టుకుపోయిన నేను హడావిడి గా లోపలకొస్తూ ఎందుకైనా మంచిదని కిటికీ లోంచి తొంగి చూస్తే.. మా పెద్దది.. టింకిల్ చదివేస్తోంది.. చిన్నదేమో.. మ్యూట్ లో పెట్టి టీ వీ లో ఏదో చూస్తోంది.. నేను చిన్నగా దగ్గేసరికి చటుక్కున.. పుస్తకాలు తీసి నటన లో జీవించటం మొదలు పెట్టేసారు.పోన్లే అని గమనించనట్టు 'ఊ ఊ ఎంత వరకూ వచ్చింది అని..మళ్ళీ వాళ్ళ చదువులో కూరుకుపోయాను.  అంత  గా కనీసం ఒక దగ్గర కూర్చోవటానికీ ఒక కారణం ఉంది. ఇద్దరికీ అప్పుడే హిందీ మార్కులిచ్చేశారు. స్పీడ్ యుగం కదా.. టీచర్లూ యమా స్పీడ్.  మా పెద్దమ్మాయి కి 14/20 వచ్చాయి. లెక్క ఎక్కడ తప్పిందో.. తవ్వి, ఏవిధం గా ఇలాంటి తప్పులు చేయకుండా ఉండవచ్చో చెప్దామని పెద్ద లెక్చర్ తయారు చేసుకుంటే.. దాని పేపర్ చూడగానే నవ్వు ఆపుకోలేకపోయాం. 'చందా కే ఊపర్ లోగ్ క్యో నహీ రహ్సక్ తే? ' అన్న ప్రశ్న కి.. 'చందా పే ..' అన్న దాకా రాశాక 'హవా' అన్న పదం గుర్తు రాలేదట. అందుకని ఆలోచించి చించి.. సాధారణంగా తెలుగు కి దగ్గర్లోనే ఉంటాయిగా హిందీ పదాలూ అని.. 'చందా పే గాలీ నహీ రహ్తా' అని రాసేసిందిట. 

           వాలి మహారాజు దీ తీరయితే ఇక సుగ్రీవుల వారి పని చెప్పేదేముంది? స్త్రీ లింగం, పుం లింగం రాయడంలో 'దాదా దాదీ, మామా, మామీ, నానా, నానీ రాసాక, పితా కీ అదే లాజిక్ వాడేసరికి .. దాని టీచర్ ఎర్ర ఇంక్ తో పెద్ద మార్క్ పెట్టి మార్కులు కట్ చేసి పడేసింది :-) 
మొన్నేమో సైన్స్ అయ్యింది. మా పెద్దది నెయ్యీ, చీజూ దేనితో తయారు చేస్తారు అంటే, ఆవు తో అని రాసి వచ్చిందిట! అదేమంటే.. ఆవు లోంచే కదా పాలు వచ్చేదీ.. అని సాగదీసింది. అమ్మ నుంచి ఇడ్లీస్ వస్తాయి అన్నట్టుంది అంటే..  అర్థమయీ అవనట్టు గా తలాడించి ఊరుకుంది.చిన్నదేమో ఇంటికి వచ్చాక హాయిగా అవీ,ఇవీ తిని ఊరెంబడా తిరిగి ఇంక ఇంటికి వచ్చేవేళకి కాలనీ లాన్ లో బెంచీ మీద నేను చూసేలా ఏడుస్తూ కూర్చుంది. 'అయ్యో పాపం.. అనుకుని కంగారు కంగారు గా పరిగెట్టి వెళ్ళి చూస్తే ఏముంది..'నేను అస్సలూ ఇంటెలిజెంట్ కాదు. అక్కకే అన్నీ మంచి మార్కులు వస్తాయి.. నేను వేస్ట్!' అని మనీషా కోయిరాలా లా జలజలా కన్నీళ్ళు  కార్చింది.


                     తరచి తరచి అడగగా..చెప్పింది పదికి ఒక్క మార్క్ వచ్చిందిట!!! పైగా.. 'ఏం చెప్పనమ్మా.. సైన్స్ లో మనిషికి 'గాలీ, నీరూ,ఆహారం అవసరాలని చెప్తారు. అదే ఎన్విరాన్మెంటల్  స్టడీస్ లో తిండీ, బట్టా, ఇల్లూ ' అని అంటారు. నేను 'కంఫూజ్ అయిపోతున్నాను.. అని బొట బొటా కన్నీరు కారిస్తే.. అసలే తల్లి హృదయం కదా.. 2946 ముక్కలయింది. పర్వాలేదమ్మా.. సున్నా వచ్చినా నేనేమీ అనను.. విషయ జ్ఞానం రావాలి కానీ..అన్న ధోరణి లో నానా విధాలు గా ఓదార్చి..
                           
                                       ఇంట్లోకి తెచ్చి పడుకొమ్మని కిందకి వచ్చాను తోడు పెట్టటం మరిచిపోయానని.. పైకెళ్ళేటప్పటికి అక్క తో చెప్తోంది..'చూశావా? నీకు పది కి తొమ్మిది మార్కులొచ్చినా ఆ ఒక్క మార్కూ ఎక్కడ పోయిందీ అని గొడవ చేస్తుంది అమ్మ.. 'నాకు సున్నా వచ్చినా ఏమీ అనదటా కాస్త తెలివి గా ఉండాలి అని అక్కకే పాఠాలు చెప్తోంది... ఇక దాని వెనక పరిగెత్తి ఒక్కటిచ్చుకునేంత వరకూ ఆవేశం చల్లారలేదు.
                              
                 కాలనీ ఆడవాళ్ళందరం తాత్కాలికం గా మిగతా టాపిక్ లకి సెలవిచ్చి, పిల్లల పరీక్షల గురించీ, వాళ్ళ మొండి దనం గురించీ, తండ్రులెవ్వరూ అస్సలూ పట్టించుకోకపోవటం గురించీ, మూడో క్లాస్ లో 95 దాటలేదు సొషల్లో.. ఇలాగయితో రేప్పొద్దున్న ఐ ఐ టీ ల్లో సీట్లెలా వస్తాయి అనీ.. ఆక్రోశం పంచుకుని ఈ మధ్య చున్నీలూ, కొంగులూ లేకపోవటం వల్ల కనీసం వట్టి చేతులతోనో, కర్చీఫ్ లతో కన్నీళ్ళొత్తుకున్నాం.


ఊళ్ళో పిల్లలలని చూస్తే మా పిల్లలే నయం అనిపించింది మాకు రెండిళ్ళవతలావిడ విషయం వింటే.. వాళ్ళ చిన్నోడు కడుపు నొప్పి అని గిల గిలా తన్నుకుంటే భయమేసి  డాక్టర్ దగ్గరకి వెళ్తే  ఆవిడ ఇంజెక్షన్ భయం చూపించేసరికి 'లేదు లేదూ అని వెల్లడించిన విషయమేమిటంటే..

                  వాళ్ళ పదేళ్ళ పెద్దబాబు, చిన్నవాడికి ' వీ వీడియో గేం' వరస గా  వారం రోజులు ఆడుకోనిస్తానని లంచం చూపి అమ్మ ని ఏదో విధం గా 'ఎంగేజ్' చేయి. ఈలోపల నేను కాస్త రిలాక్స్ అవుతా.. అన్నాడట!!


మా పెద్దమ్మాయి ఒక ప్రశ్న చదవాలంటే ఆవిడ గారికి మేము ఆలుగడ్డ తప్ప వేరే కూర చేయట్లేదు. నూడుల్స్, పాస్తా, మైసూర్ పాక్, పిజ్జా, జంతికలు, ఇలాగ ఆవిడ అడగటం ఆలస్యం లక్ష్మీ దేవి చుట్టూ, ప్రసాదాలు చేర్చి పూజ చేసినంత ఘనం గా నా నా రకాల ధూప,దీప నైవేద్యాలతో, స్తోత్ర పఠనం చేసి ఆవిడ అనుగ్రహం క్లాస్ పుస్తకాలమీద కలిగేట్టు చూసుకుంటున్నాము.
                                 దీనికి తోడు, లెక్కలంటేనే ఎలర్జీ అయిన ఆవిడాయె, దీన్ని ఏం చేయాలి అని వాపోతుండగా.. ఠక్కున ఐడియా వచ్చింది. దానికి పాటల పిచ్చి ఉంది. దాని లెక్క తప్పయితే నాకిష్టమైన పాటలు, లేక పోతే దానికిష్టమైన పాటలు అని.. ఆరోజు బోల్డు తెలుగు పాటలు వింది..బానే ఉంది. కాకపోతే ఇప్పుడు తెలుగు పాటలు తెగ నచ్చి..తప్పులు చేసినా పర్వాలేదనుకుంటోందనుకోండి.. వేరే మెథడ్లు వెతకాలి ఇంక. 

చిన్న రాకుమారి గారికి పరీక్షలకి తయారవటం అంటే పది పెన్సిళ్ళు చెక్కి పెట్టుకుని 2 ఎరేజర్లు, 2 షార్పెనర్లు బాక్స్ లో పెట్టుకోవటమే.. అంతకు మించి కష్టపడటం దానికి ఇష్టం ఉండదు.   దాని క్లాస్ మేట్లంతా ఒకటో క్లాస్ కే..రాత్రి 11 దాకా చదివి, మళ్ళీ ఉదయం 5.30 నుండీ మళ్ళీ పునశ్చరణ చేసుకుని, బస్ స్టాండ్ లో కూడా తల్లులు నెమరు వేయిస్తుంటే.. ఇది చిద్విలాసం గా తిరుగుతూ ఉంటుంది.
                                
దాని జీ కే జ్ఞానం చూస్తే..కళ్ళు తిరుగుతాయి ఎంతటివాళ్ళకయినా.. ఆఖరి పరీక్ష.. జనరల్ నాలెడ్జ్ పుస్తకం తేవే అంటే.. అలాంటి సబ్జెక్టే లేదు పొమ్మంది.. 'అదే జీ కే ' అంటే ..ఓహో అదా అంది.  పుస్తకం తెరిస్తే.. ఒక చాప్టర్ అంతా వంశ వృక్షం!!! కపూర్ ఖాందాన్ . రణబీర్ కపూర్ అక్కలెవరు? కరీనా చిన్న తాతగారి పెళ్ళాం ఎవరు లాంటి వెధవ ప్రశ్నలు! 
                                           చదువుకి కూర్చొమ్మంటే.. పుస్తకం తేవటానికి అరగంటా, పెన్సిల్ కీ, మిగతావాటికీ ఒక్కొక్క దానికీ అరగంటా.. చేసి పైగా మొదటి ప్రశ్న లోనే నీళ్ళకీ, బాత్రూం కీ, 4-5 బ్రేక్ లూ, అదేంటో ఎప్పుడు ఫోన్ తీయమన్నా కాలింగ్ బెల్ కొట్టారు చూడమన్నా..విసుక్కుంటూ, కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళే పిల్లలు పరీక్షలప్పుడు మాత్రం పరుగు పరుగున 2 సెకండ్లలో అటెండ్ చేస్తారు.. అందరిళ్ళల్లో ఇంతేట. అంజూ జార్జ్ లు పనికి రారట. కేబుల్ కట్ చేస్తే దూర్ దర్శన్ లో హిందీ వార్తలు కూడా తన్మయత్వం గా చూస్తున్నారు.


                            ఈ హడావిడి చూసి ఐ ఐ టీ ప్రవేశ పరీక్ష కి చదువుతున్న పక్క అబ్బాయికి ఒకటే నవ్వు. ఇప్పుడే కేబుల్ తీయిస్తే.. ఇంటర్ కొచ్చాక ఇంకేం ఉంటాయి తీయించి  పడేయటానికి అని..  మా ఎదురింట్లో పిల్లకి పాపం బోల్డు ఒత్తిడి. దాని ఖర్మ కాలి దాని కజిన్లందరూ దాని కన్నా కనీసం 10 యేళ్ళు పెద్ద. అంతా పెద్ద పెద్ద చదువుల్లో సీట్లు సంపాదించారు. ఇక వాళ్ళమ్మ దెబ్బలూ, ఈ పిల్ల అరుపులూ వినిపిస్తూనే ఉంటాయి.  వారం క్రితం వాళ్ళమ్మా వాళ్ళూ ముందెళ్ళిపోయారని.. పిల్లలతో  ఆఖరి సారి చదివిస్తుంటే వచ్చింది, స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తూ.  పాలూ, బంగారం చిలికి దానితో చేసిన ఇడ్లీ ల్లంటి బుగ్గల మీద ఎర్ర గా వాత.  కళ్ళల్లో ఎక్కడో దిగులు.
      
ఇక చదివింది చాల్లే అని పిల్లలని మాటల్లో దింపాను. ఆ అమ్మాయి తల్లి పట్ల ద్వేషం పెంచుకుంటుందేమోనని .. మా పిల్లలకి నాలుగు పడ్డాయి ఈ పరీక్షల్లో..  తల్లిదండ్రులు పిల్లల మంచికోసమే కదా.. కొట్టేది... అయినా.. ప్రేమ ఉన్న చోటే దెబ్బ వేయటమూ ఉంటుంది.. అని ఏదో చెప్తుంటే.. ఆ పిల్ల అంది..'యా.. ఐ టూ వాంట్ టు సే.. ఐ లవ్ యూ టూ మామ్మ్మా ' అంది.

ఆ మాట లోతుగా తాకినా.. మంచి జోక్ విన్నట్టు అందరం నవ్వేశాం.. తన తల్లి తో ఎప్పుడో నెమ్మది గా మాట్లాడాలి.. అనుకుంటూ.. నిన్ననే ఆఖరి పరీక్ష..


పాపం పిల్లలకి మళ్ళీ జనవరి దాకా ఊరట. నిన్న చూడాలి వాళ్ళ ఆనందం.. వీధిలోంచే పుస్తకాల బ్యాగులు గిర గిరా తిప్పి విసిరి కొట్టి.. ఎగురుతూ, అరుస్తూ..
ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు కొంతమంది పిల్లలు.. వాళ్ళకీ పరీక్షల గోల ఉండదు కదా అబ్బా.. మీరెంత లక్కీ యో.. అని నేనంటే.. . ఒక అబ్బాయి అన్నాడు.. 'ఆంటీ ఏం లక్కీ.. వీళ్ళకి ఆఖరి పరీక్ష రాసాక వచ్చే ఆనందం మాకేదీ? ' అని :-))

ఏదైతేనేం? ఒక పనైపోయిందండీ.. మళ్ళీ వాకింగ్ కెళ్తే.. రోడ్ మీద పిల్లల గొడవా,..టీవీల్లో సీరియళ్ళ హడావిడీ..

(బొమ్మలన్నీ గూగులమ్మ చలవే..)

52 comments:

సవ్వడి said...

సూపర్... చిన్న పిల్లలంటేనే సరదా... వాళ్ల గురించి ఏం చెప్పినా చక్కగా నవ్వుకోవచ్చు.
<< దాని జీ కే జ్ఞానం చూస్తే..కళ్ళు తిరుగుతాయి ఎంతటివాళ్ళకయినా.. ఆఖరి పరీక్ష.. జనరల్ నాలెడ్జ్ పుస్తకం తేవే అంటే.. అలాంటి సబ్జెక్టే లేదు పొమ్మంది. >>
అంతే! చిన్న పిల్లలు అంతే! భలే నవ్విస్తారు.

Sravya Vattikuti said...

బాగుంది మీ స్టైల్ లో ! మీ పిల్లల పరీక్షల కోసం మీ బ్లాగు యాక్టివిటీ ని త్యాగం చేసారా కొన్ని రోజులు :)
మీ చిన్నమ్మాయి బాగా నచ్చింది నాకు .

Krishnapriya said...
This comment has been removed by the author.
Krishnapriya said...

@ సవ్వడి,
థాంక్స్! నిజం.. పిల్లల కబుర్లు చెప్పుకోవాలంటే ఒక జీవిత కాలం చాలదు.

@ శ్రావ్య,
అవునండీ.. రెండో తరగతి త్రైమాసిక పరీక్షలా? మజాకా? వాళ్ళని చదివించి చదివించి నీరసం వచ్చింది..

హరే కృష్ణ said...

మీ పిల్లలు ఐ ఐ టీ లో చేరుతారు కృష్ణ ప్రియ గారు.. చేరుతారు (కళ్ళు తుడుచుకుంటూ)
ట్రైనింగ్ కావాలంటే మేమంతా చాలా మంది ఉన్నాం alumni :)
ఎప్పటిలానే మీ స్టైల్ లో చాలా బావుంది
వీళ్ళకి ఆఖరి పరీక్ష రాసాక వచ్చే ఆనందం మాకేదీ? ' అని :-))
ఇది బాగా నచ్చింది

Weekend Politician said...

చాలా బాగా రాశారు. అద్భుతంగా రాశారు లాంటివన్నీ రొటీన్ కామెంట్లయి పోయాయి మీ బ్లాగులో కాబట్టి అలాంటివి రాయనవసరం లేదు :)

పిల్లల కబుర్లే కాదండీ మీరు ఏకబుర్లయినా అంత బాగా రాస్తున్నారు మరి!!

నాక్కూడా మీ చిన్నమ్మాయే ఫేవరెట్.

budugu said...

baaguMdaMDee mee pOsTu. iddaru chiTTitallulatO saradaasaradaagaa gaDipEstunnaarannamaaTa.

హరే కృష్ణ said...

రాజ్ కపూర్ ఫ్యామిలీ ఫోటో కదా last నుండి 3rd
2946 significance ఏంటో అర్ధం కాలేదు :)

sunita said...

ee Tapaa naakkooDaa anubhavamae:-)

Krishnapriya said...

@ హరేకృష్ణ,
LOL100 (నా ఫ్రెండూ నేనూ పెట్టుకున్న కోడ్. 100 అంటే 100 డెసిబెల్స్ అన్నమాట. మనుషులు 20-20,000 డెసిబెల్స్ వినగలరనుకుంటా.. ) మీ అభిమానానికి థాంక్స్! కోచింగ్ ఎల్ కే జీ నుండి అనుకుంటా.. మా చిన్నది అసలే రెండో క్లాస్ కొచ్చేసింది. ఎలాగూ పరీక్షలైపోయాయి కాబట్టి బాక్ లాగ్ అంతా నేర్పించటం మొదలు పెట్టాలి ఇంక రేపట్నుంచీ.. :-)

@ వీకెండ్ పొలిటిషియన్,
హ్మ్మ్.. థాంక్స్.

@బుడుగు,
నా బ్లాగ్ కి స్వాగతం! మీకు నచ్చినందుకు ఆనందం గా ఉంది.

@ సునీత,
:-) సేం స్టోరీ నో డిఫరెన్స్.. ఓన్లీ నేంస్ చేంజ్ డ్!! అన్నమాట

Bulusu Subrahmanyam said...

చాలా బాగా వ్రాసారు. పిల్లలని పరీక్షల టైములో చూస్తే చాలా జాలి వేస్తుంది నాకు. మా మనమరాలి పరీక్షలప్పుడు నేను మా అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి లేదు.వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ. నేను ఇంటిలోకి వస్తే వాళ్ళమ్మాయి కి రెండు గంటల చదువు పోతుందట. ప్చ్ ఏంచేస్తాం. వాళ్ళ భవిష్యత్తు కోసం కఠినంగా ఉండాలి అంటుంది. ఇంత కష్టపెట్టాలా వాళ్ళని. ఎనిమిది ఏళ్ళ వయసు లో అంత భవిష్యత్తా? నాకు అర్ధం కాదు.
వీకెండ్ పోలిటీషియన్ గారు అన్నట్టు చాలా బాగా వ్రాసారన్నా వెలితిగానే ఉంటుంది.

we3ours3 said...

భలే రాస్తారండి ...చదువు తూ వుంటే చదవాలనిపిస్తుంది...!

Krishnapriya said...

@ బులుసు సుబ్రమన్యం గారు,
చాలా చాలా థాంక్స్! మీలాంటి మంచి బ్లాగర్ కి నా టపా నచ్చినందుకు చాలా ఆనందం గా ఉంది. మా అత్తగారూ అదే అంటూ ఉంటారు. ఆవిడ తో పిల్లలు మాటల్లో పడినప్పుడల్లా లాగి కుదేసి రుద్దుతూ ఉంటాం..

ఏం చేస్తాం చెప్పండి..క్లాస్ లో 440 కి 401 మార్కులొస్తే రాంక్ 26 వచ్చింది. మూడవ తరగతి లో అంత కష్టపడి చదువుతున్నారు. మనం పోన్లే అని వదిలేస్తే..క్లాస్ లో మొద్దులు అన్న పేరు పడి.. వాళ్ళ కాంఫిడెన్స్ పోగుట్టుకుంటున్నారు.

Krishnapriya said...

@హరేకృష్ణ గారు,
అవును. ఐ ఐ టీ లోంచి పాస్ అయినా రెండో క్లాస్ జీ కే సరిగ్గా చదవనట్టుంది :-) మరీ టూ మచ్ కదా.. అసలు వాళ్ళ వంశవృక్షం పిల్లలు ఎందుకు చదవాలి?
2946 అంటారా.. ఏదో వేలికి తోచిన నంబర్.. :-)

@we3ours3,
ధన్యవాదాలండీ....

హరే కృష్ణ said...

తమ్ముడు అని అంటారు గారు అని పిలుస్తారు
ఇదేం బాలేదు :)
పోస్ట్ చదివినప్పుడు ఫ్లో చివరివరకు కంటిన్యూ అయిపొయింది trance లో ఉండి
కామెంట్ రాయడం కుదర లేదు

పాటలు పాడించడం ట్రిక్ వర్క్ అవుట్ కాలేదా ఇట్లాంటి సమయాల్లోనే కిచెన్ ని రాయిచేసుకొని చుంబరస్కా,టల్లోస్ అస్త్రాలను ప్రయోగించాలి
జనవరి లో పరీక్షలకి తప్పకుండా ట్రై చేయండి.. ఆల్ ది బెస్ట్ :)

nagarjuna said...

>>చందా పే గాలీ నహీ రహ్తా.....

కెవ్.....మీ చిన్నమ్మాయి టాలెంటు అమోఘం, చిన్నప్పుడు నాక్కూడా ఇంత టాలెంటు లేదు. :)

I second, third, fourth, fifth Hare

indrathinks said...

baagundi :) :)

భాస్కర రామి రెడ్డి said...

మీ చిన్న అమ్మాయి సూపరండి, ఎంతైనా తెలియకుండా గోల చేసేది చిన్నపిల్లలు, అరిచి గీపెట్టి తన్నులు తినేది పెద్ద పిల్లలు కదా :-)

ఓపని అయిపోయింది బాబూ, చదివి కామెంటు కూడా వేసేసాను :-)

సాంబశివుడు said...

ప్రియ గారు,
మీరు ఎమీ అనుకోక పోతె ఈ జీవ హింసని చాలా అందం గా అమేరికా వాడు ఇరాక్ మీద దాడి చేసేటప్పుడు చెప్పిన విధంగా చెప్పారు. నిజం గా కపూర్ ఫామీలి గురించి పరిక్షకు చదవాలా? ఈ దేశం లో చదువుకున్న వాళ్ళంత అసమర్ధులు,నిస్సహాయులు,స్వార్ధ పరులు లేరని పిస్తున్నాది మీ టపా చదివితె. కనీసం స్కులు వారిని ఇలాంటివి ఎందుకు చదవాలని ఎవరు ప్రశ్నించరా?

మంచు said...

బావుంది :-))

హి హి ... మనిషి 150 డెసిబల్స్ వరకే తట్టుకొగలడు (జెట్ ఇంజెన్ 140 డెసిబల్స్ వుంటుంది ) ... 20000 డెసిబల్స్ అంటే అరసెకన్ లొ పైకి పొతాడు :-))

20 - 20000 రేంజ్ అన్నది ఫ్రీక్వెన్సీ కి ... 20 Hz నుండి 20000 Hz మద్యనున్న ఫ్రీక్వెన్సి మనిషి వినగలడు...

Krishnapriya said...

@ హరేకృష్ణ,
నిజమే..ఆ ఐడియా ఎందుకు తట్టలేదబ్బా? ఎంతైనా ఐ ఐ టీ బుర్రా? మజాకా?
జనవరి లో పరీక్షలకి చుంబరస్కా, టల్లోస్.. లెక్క తప్పినప్పుడల్లా.. 2 చెంచాలు పట్టిస్తే (అంటే గట్టిపడితే కొరికిస్తాను, జిగట గా తయారయితే పళ్ళతో పీకిస్తాను, ద్రవరూపం లో వస్తే..తాగిస్తాను)..
అమ్మయ్య .. నా టెన్షన్ తీరిపోయింది :-)

Krishnapriya said...
This comment has been removed by the author.
Krishnapriya said...

@ నాగార్జున,
:-) థాంక్స్. చందమామని చూసినప్పుడల్లా మాకు గాలే గుర్తొస్తుంది :-)
ఈ మాట మా పెద్దమ్మాయిది. చిన్నది 4థ్ చ్లాస్ కొచ్చినప్పుడు ఏం రాస్తుందో చూడాలి :-)

@ indrathinks,
:-) థాంక్స్!

@ భాస్కర్ రామి రెడ్డి గారు,

:-) ధన్యవాదాలు! మీరు చెప్పింది కరెక్ట్.. పెద్దపిల్లలు పాపం తల్లి దండ్రుల పేరెంటింగ్ ఎక్స్పెరిమెంట్లన్నీ భరించాలి తప్పదు. పేరెంటింగ్ గినియా పిగ్స్ వాళ్ళు. చిన్న పిల్లలు 50 వచ్చినా చిన్నపిల్లలే :-)

Krishnapriya said...

@ సాంబశివుడు గారు,

టపా పెద్దదవటం వల్ల, లాస్ట్ పారాల్లో రాసిన చదువు హింస సరిగ్గా చెప్పలేకపోయాననిపించింది.
అదెక్కడి జీ కే? కపూర్, గాంధీ కుటుంబం, (మళ్ళీ సంజయ్ గాంధీ కుటుంబానికి చోటు లేదు) ల వంశవృక్షాలు, వాళ్ళు ఎందుకు చదవాలి?

అలాగే,.. 440 మార్కులకి తరగతి లో నలభై మంది పిల్లల్లో కనీసం పాతిక మందికి 420 కి పైన వస్తున్నాయి మార్కులు. తల్లిదండ్రులు నాలుగవ తరగతి పిల్లలని కూర్చోపెట్టి సాగదీస్తున్నారు. మా అమ్మాయి కి 400 వస్తే మొద్దు పిల్ల గా లేబుల్ తగిలిస్తున్నారు. దానితో పిల్లకి 'అవును నాకు ఏమీ రాదు.. అన్న భావం పెరిగిపోతోంది..చాలా మంది తల్లి దండ్రులు పోటీలు పడి చదువు గంటలు పెంచి.. వాళ్ళ బాల్యాన్ని హరిస్తుండగా.. పోన్లే అని వదిలేసినవారు.. మనం తప్పు చేస్తున్నామేమో నని పీర్ ప్రెషర్ కి గురయి ఇంకా ఇంకా తోస్తున్నారు.
వాళ్ళకి అర్థమయ్యేలా సరదాగా చదివిద్దామంటే మార్కుల పోటీ లో వెనక పడిపోతారన్న తాపత్రయం ఒకటి..

Krishnapriya said...

@ మంచు,
:-) థాంక్స్.. అయితే..ఇకనుంచీ.. LOL10-40 రేంజ్ వాడతాము

lalithag said...

కృష్ణప్రియ గారూ, టపా గురించి ఏం చెప్పాలి!
చాలా బావుంది.

ఇక టపాలో ఆలోచింపచేసే విషయాల గురించి ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండలేక:

"అదెక్కడి జీ కే? కపూర్, గాంధీ కుటుంబం, (మళ్ళీ సంజయ్ గాంధీ కుటుంబానికి చోటు లేదు) ల వంశవృక్షాలు, వాళ్ళు ఎందుకు చదవాలి?"
మంచి ప్రశ్న. ఇటువంటి సిలబసు ఎటువంటి స్కూళ్ళలో ఉంటోంది?

"ఏం చేస్తాం చెప్పండి..క్లాస్ లో 440 కి 401 మార్కులొస్తే రాంక్ 26 వచ్చింది. మూడవ తరగతి లో అంత కష్టపడి చదువుతున్నారు. మనం పోన్లే అని వదిలేస్తే..క్లాస్ లో మొద్దులు అన్న పేరు పడి.. వాళ్ళ కాంఫిడెన్స్ పోగుట్టుకుంటున్నారు. "
"440 మార్కులకి తరగతి లో నలభై మంది పిల్లల్లో కనీసం పాతిక మందికి 420 కి పైన వస్తున్నాయి మార్కులు. తల్లిదండ్రులు నాలుగవ తరగతి పిల్లలని కూర్చోపెట్టి సాగదీస్తున్నారు. మా అమ్మాయి కి 400 వస్తే మొద్దు పిల్ల గా లేబుల్ తగిలిస్తున్నారు. దానితో పిల్లకి 'అవును నాకు ఏమీ రాదు.. అన్న భావం పెరిగిపోతోంది..చాలా మంది తల్లి దండ్రులు పోటీలు పడి చదువు గంటలు పెంచి.. వాళ్ళ బాల్యాన్ని హరిస్తుండగా.. పోన్లే అని వదిలేసినవారు.. మనం తప్పు చేస్తున్నామేమో నని పీర్ ప్రెషర్ కి గురయి ఇంకా ఇంకా తోస్తున్నారు.
వాళ్ళకి అర్థమయ్యేలా సరదాగా చదివిద్దామంటే మార్కుల పోటీ లో వెనక పడిపోతారన్న తాపత్రయం ఒకటి.. "

ఈ ద్వైదీభావం అర్థం చేసుకున్నాను అనే అనుకున్నాను నేను ఇన్నాళ్ళూ. కానీ ఎందుకో మీ టపా చదువుతుంటే తళుక్కున మెరిసినట్టనిపించింది:

ఇలాంటి చదువులకీ, బార్బీ బొమ్మల్లా తయారయ్యేందుకు ప్రోత్సహించే సంస్కృతికీ పోలిక ఉందనిపించి తల్లి దండ్రులుగా ఎంత వరకూ ఈ పోటీకి మన వంతు సాయం తగ్గించాలో కాస్తంత అర్థం అయినట్లనిపించింది.

"నలభై మంది పిల్లల్లో కనీసం పాతిక మందికి 420 కి పైన వస్తున్నాయి మార్కులు" మరీ అంత సులభం అయిపోయాయా సబ్జెక్టులు? మరీ అంత తెలివి పెరిగిపోతోందా పిల్లలకి? లేక మన విద్యా విధానం ఆశించిన ఫలితాలు చక్కగా నెరవేరి ఏ వయసుకి నేర్చుకోవలసిన విషయాలు ఆ వయసులో పిల్లలకి అంత చక్కగా అర్థం అయ్యేలా పాఠాలు చెప్తున్నారా? ఏమిటీ ఈ మార్కులకీ, రేంకులకీ అర్థం? మన పిల్లల ఆత్మవిశ్వాసానికి తప్పు కొలబద్దలు ఎంచుకుంటుంటే మనము వారికి సరైన కొలబద్దలు చూపలేమా?

ఈ పరుగు పందెంలో ఎంత వరకూ ఎవరైనా నెగ్గ గలరు? ఎవరికి వారు, ఇంకొకరు ముందు ఉన్నారు కనుక నేనూ పరిగెడతాను అంటే? "వాళ్ళకి అర్థమయ్యేలా సరదాగా చదివిద్దామంటే మార్కుల పోటీ లో వెనక పడిపోతారన్న తాపత్రయం ఒకటి.. " ఇది భ్రమ మాత్రమే. మీరు చదివించడం మానేసి ఎంత వచ్చినా పరవాలేదు అంటే వేరు. వాళ్ళకి విషయ పరిజ్ఞానం అందించి ఎన్ని మార్కులు వచ్చినా పరవాలేదు అంటే అది వేరు.

p.s. ఇవన్నీ నేను ఇప్పుడు ఇలా రాసుకుంటున్నాను, ఎప్పుడైనా సందేహం వస్తే నాకూ గుర్తు ఉండాలనే.

Krishnapriya said...

@ లలిత గారు,
మీ కామెంట్ కి చాలా చాలా థాంక్స్! ఈ పాయింట్ గురించి నాకు ఎప్పుడూ సంఘర్షణే..
సిలబస్ లో కంప్యూటర్స్ లో పవర్ పాయింట్ వాడే విధానం గురించి ఒక పెద్ద పాఠం. అందులో పవర్ పాయింట్ లో ఎన్ని ఆప్షన్లున్నాయి, ఒకే ఎఫెక్ట్ కోసం ఎన్ని మెథడ్ లున్నాయి అన్నవాటి మీద! 10 పేజీల పైన ఉంది పాఠం. స్కూల్లో లాబ్ కి తీసుకెళ్ళకుండా చెప్పారు. అసలు మా అమ్మాయికి ప్రెజెంటేషన్ అంటే ఏంటో కూడా అర్థం కాలేదు. కానీ.. నేను ఇంటికొచ్చేసరికి కాస్త నోట్స్ చదువుకుని రెడీ గా ఉండు అంటే..

నేను ఇంటికి రాగానే.. 'నాకసలు ఇదంతా ఏంటో అర్థమే కాలేదమ్మా..అంది భయం గా..' అప్పుడు ఇంట్లో సిస్టం ఉంది కాబట్టి దానిచేత ఒక ప్రెజెంటేషన్ తయారు చేయించాను కాబట్టి సరిపోయింది. అది బానే నేర్చుకుంది కానీ.. ఇదే స్కూల్లో బేకరీ ఓనర్ కూతురు ఉంది. వాళ్ళింట్లో పీ సీ లేదు. ఆ పాప చేస్తుంది? బట్టీ వేయటమేగా? ఇంత నేర్చుకుని వెళ్ళినా.. వాళ్ళు చెప్పినట్టు మా పాప స్టెప్పులు వేయలేదు కాబట్టి బోల్డు మార్కులు కట్ చేసారు. నేను.. పర్వాలేదు వదిలేయ్.. అన్నాను.

తనకొక్కదానికే తక్కువ మార్కులొచ్చాయి బాధ పడింది. మార్కులు ఇంపార్టెంట్ కాదు అని చెప్తే.. కొన్ని వచ్చీ రానట్టు గా చదివి వదిలేస్తుంది :-)

వేణూరాం said...

చాలా బాగా రాసారండి..:)
పాలూ, బంగారం చిలికి దానితో చేసిన ఇడ్లీ ల్లంటి బుగ్గల మీద ఎర్ర గా వాత. కళ్ళల్లో ఎక్కడో దిగులు. ప్చ్ .. నేను ఈ లైన్ ౧౦ సార్లు చదివా.. :)

స్నేహ said...

కృష్ణప్రియ గారు,

బాగా రాసారు.నేను మా పిల్లల విషయానికి వస్తే మార్కుల గురించి పెద్దగా పట్టించుకునేది లేదు అసలు మార్కుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నాకు మార్కుల కంటే పుస్తకం లో వున్నది అర్థం చేసుకోవడమే ముఖ్యం. ఇంక వేరే వాళ్ళకి ఎక్కువ వస్తే మన పిల్లల్ని మొద్దు అంటారు దాని వల్ల వాళ్ళ ఆత్మ విశ్వాసం తగ్గుతుందన్న సమస్య కూడా లేదు. మా వాడికి పరీక్షలు అన్న విషయం కూడా గుర్తు చేయను. వాడు గుర్తు పెట్టుకొని అడిగితే చెప్తాను లేకపోతే లేదు.పరిక్షల రోజు కూడా మామూలుగానే ఆడుకుంటూ ఉంటాడు.వాడు పెరిగి పెద్దయినా అలాగే ఉండాలని నా కోరిక.

నేస్తం said...

అందరింట్లో గోల ఇదే అన్నమాట ..మావాళ్ళను చదవమంటే..అమ్మాయికి అప్పుడే ఆకలి వేస్తుంది..వీడికి బాత్రుం కొస్తుంది..ఇక పెన్సిల్ ,రబ్బరు వెదికేసరికి దాదాపు 3 గంటలు పడుతుంది..ఇంకా గట్టిగా అంటే ఈ రోజు ఆంటీ నీకు ఇంకా పోన్ ఎందుకు చేయలేదమ్మా అని నాకు గుర్తు చేస్తాడు :)
మా అమ్మయి కి మొన్న మావారు క్లాస్ పీకారు మేము గాని చెప్పిన మాట వినకపోతే మా నాన్న బెల్ట్ విరక్కొట్టేవారు,మా అమ్మ వాతలు పెట్టేది..దీన్ని బట్టి మీకెం అర్ధం అయ్యింది అనగానే మా అమ్మాయి కూల్ గా.. ఊ .. మరేమో.. మీ మమ్మీ,డాడీ కైండ్ లెస్ పీపులని అంది ముద్దు ముద్దు గా

సవ్వడి said...

నేనే ఫస్ట్ అన్నమాట.
కృష్ణ ప్రియ గారు! నిజమే.. పిల్లల గురించి ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు.
నేను మా మావయ్య వాళ్ల పాప గురించి రాసిన పోస్ట్ చదవండి. ఈ లింక్ చూడండి.
http://krishna-savvadi.blogspot.com/2009/12/blog-post_30.html


స్నేహ గారు! మీరు గ్రేట్.... సూపరో సూపర్..

శివరంజని said...

కృష్ణప్రియ గారు,బాగా రాసారు..మీ కబుర్లన్నీ భలే వినబుద్దేస్తుంది

Krishnapriya said...

@ వేణూరాం,
హ్మ్మ్.. థాంక్స్.. అవును. పాపం ఆ పాప క్లాస్ ఫస్ట్ రావాల్సిందే..

@ స్నేహ,
చాలా బాగుంది. నేనూ ఈ సారి అలా కనీసం చిన్నదానికి ప్రయత్నించి చూస్తాను.

@ నేస్తం,
:-) అదే మరి..

@సవ్వడి,
:-) అవును. మీరు చెప్పిన టపా నేను చదివేశాను మొన్నీ మధ్య. చాలా బాగుంది.

@ శివరంజని,
ధన్యవాదాలు!

M said...

excellent

ఆ.సౌమ్య said...

అమ్మో ఎన్ని కష్టలండీ... మా చిన్నతనంలో మమ్మల్నెవరూ పెద్దగా పట్టించుకోకపోయినా చదువుకునే వాళ్ళం, ఇప్పటి పిల్లలతో అలా కాదు కదా, కష్టమే! కానీ మీ పిల్లలు చిచరపిడుగులండోయ్...సూపరు

మా తెలిసిన వాళ్ళ అబ్బాయి 3 యేళ్ళు నిండాయి. ప్రీస్కూలుకి వెళ్తున్నాడు. ఒకరోజు వాడిని ఏదో చదవమంటే చదవలేదుట. వాళ్ళ అమ్మ గట్టిగా తిడితే "నన్ను తిట్టకమ్మా, నేనూ చదువుకున్నవాడినే, నాకూ అన్నీ తెలుసు" అన్నాడట.

ఇంకో తెలిసిన వాళ్ళ అబ్బాయి 4 వ తరగతి చదువుతున్నాడు. చదవమని తిడితే "నన్ను తిట్టడానికి నీకేం రైట్స్ ఉన్నాయి. అసలు తల్లిదండ్రులకి ఏమేమి రైట్స్ ఉంటాయో తెలుసా" అంటూ ఒక అరగంట లెక్ఛరు ఇచాట్ట.

ఇవన్నీ చూస్తూ ఉంటే గుబులు గుబులుగా ఉంటుంది భవిష్యత్తు కనిపిస్తూ :(

Bulusu Subrahmanyam said...

మళ్ళీ వచ్చాను మీ బ్లాగులోకి. ’శరత్ చంద్ర చంద్రికా ధవళం’ (ఆతర్వాత గుర్తు లేదు)అని కాళిదాసు గారో మరెవరో రాస్తే ఓ పాతిక పేజీల వ్యాఖ్యానం రాసారుట పండితులు. పాలు బంగారం కలిపి చిలికి ఇడ్లీ వేసినట్లున్న బుగ్గలు అని మీరు రాసిన వాక్యం మీద కామెంటు రాద్దామనుకొని, పై కామెంట్లు చదువుతూ మరోకటి వ్రాసాను. నేనుకూడా ఓ పది పేజీ ల వ్యాఖ్యానం రాద్దామనుకున్నాను కాని,నా భాషాజ్ఞానం సరిపోదని విరమించుకుంటన్నాను.
ఈ వాక్యం గుర్తు చేసిన వేణూరామ్ గారికి థాంక్స్.

Krishnapriya said...

@M,
ధన్యవాదాలు!

@ సౌమ్య,
ఈ కాలం పిల్లలు :-)

@ బులుసు సుబ్రమణ్యం గారు,

మీకు నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది...
చాలా కాలం క్రితం నేను భావ కవిత్వం తెగ రాస్తూ ఉండేదాన్ని. ఒక క్లాస్ మేట్ మీద..

'మేలిమి బంగారము లో వెన్నపూస కలిపి చిలికి, సుతారముగ, సుమారుగను మేని వన్నె కూర్చబడెనె, పట్టుకుచ్చు వంటి కురుల, పచ్చని నీ వంటి (మేని) మీద చూచి తన రంగు నంత కూర్చిపెట్టెనా రేతిరి.. బ్లాహ్ బ్లాహ్.. ' రాసినట్టు లీల గా గుర్తు..

అప్పట్లో బంగారం తో వెన్నపూస ని కలిపి చిలికి అని రాసినా.. పాలల్లోనే కలిపితే ఆ ఎఫెక్ట్ అని ఇప్పుడనిపిస్తోంది.. :-)

Venkat said...

Chala Bagundi kaani 2946 ardham kaaledu

C.ఉమాదేవి said...

చదువులలో మర్మమెల్ల చదివితీ తండ్రీ అన్న ప్రహ్లాదుడు దైవాంశసంభూతుడు.కాని నేటి పిల్లలు చిచ్చర పిడుగులు.టెక్నాలజీ పిల్లలకు వేలిముద్ర.కంప్యూటర్,టి.వి పిల్లల ఆటవస్తువులు.పెరిగిన సిలబస్ పిల్లలకన్నా వారి తల్లిదండ్రులనే ఎక్కువగా భయపెడుతోంది.పెద్దలు ఆందోళన వీడి పిల్లల సిలబస్ ను విభజించుకుని చక్కటి లెసన్ ప్లాన్ వేసుకుంటే పరీక్షల భయం ఉండదు. పరీక్షలప్పుడు పిల్లలను ఒత్తిడికి గురిచేసి తాము ఒత్తిడికి గురవడం మానుకున్ననాడే పిల్లలు పట్టాభిరామ్ గారు చెప్పినట్లు కష్టపడికాక ఇష్టపడి చదవగలరు.చక్కటి పోస్ట్!

lalithag said...

"మేలిమి బంగారము లో వెన్నపూస కలిపి చిలికి, సుతారముగ, సుమారుగను మేని వన్నె కూర్చబడెనె, పట్టుకుచ్చు వంటి కురుల, పచ్చని నీ వంటి (మేని) మీద చూచి తన రంగు నంత కూర్చిపెట్టెనా రేతిరి.." :)

"సిలబస్ లో కంప్యూటర్స్ లో పవర్ పాయింట్ వాడే విధానం గురించి ఒక పెద్ద పాఠం. ... స్కూల్లో లాబ్ కి తీసుకెళ్ళకుండా చెప్పారు" అది కదా అసలు సమస్య!
ఒకప్పుడు మొదటి తరం అక్షరాస్యులు, ఇప్పుడు మొదటి తరం కంప్యూటర్ అక్షరాస్యులు అన్న మాట.
ఇంట్లో కంప్యూటర్ ఉన్నా, లేకున్నా, కంప్యూటరు పాఠం ఉన్నాక ల్యాబులో చెప్పేలాచూసుకోవలసిన బాధ్యత యాజమాన్యానిదీ, అడగాల్సిన బాధ్యత తల్లి దండ్రులదీ. అదీ ఇదీ కాదంటే, (కంప్యూటర్) అక్షరాస్యులైన తల్లి దండ్రులు, (కంప్యూటర్) అక్షరాస్యులు కాని తల్లి దండ్రుల పిల్లలకు సాయం చెయ్యడం ఒక మార్గం.
డబ్బులు కట్టి చేర్పించే బళ్ళే ఇలా ఉంటే ప్రభుత్వ పాఠశాలలని ఎందుకు అనుకోవడం?

Krishnapriya said...

@ వెంకట్,
2946 .. ఏదో వేలుకి తగిలిన కీ నొక్కటం తో.. భావం ఏంటంటే.. వెయ్యి కన్నా ఎక్కువ ముక్కలైందని :-)
@ ఉమాదేవి గారు,
థాంక్సండీ..
@ లలిత గారు
అవును. మళ్ళీ ఇవన్నీ బోల్డు ఫీజులు కట్టించుకునే స్కూళ్ళు. వీలు చిక్కినప్పుడు శనివారాలు వెళ్ళి అడుగుతూనే ఉంటాము మేము..

Kalpana Rentala said...

కృష్ణప్రియ గారూ,

ఇప్పుడే మీ ఈ పోస్ట్ చదివాను. ఎంత బాగా రాసారండీ.నాకు అసూయ గా వుండి మీ స్టైల్ కి. మీరేమో నన్ను మంచి రచయిత్రి అంటారా? ఆ కామెంట్ నన్ను ఏడిపించటానికి పెట్టినట్లు ఇప్పుడు ఇక్కడికొచ్చాక అర్థమైంది...

మిగతా పోస్టులు కూడా నిదానం గా చదువుతాను.

sreedevi said...

chala bagundi. maa panthommidella ammayiki chadivi vinipinchanu. tanaki telugu chadavadam radu mari.

Krishnapriya said...

@ కల్పన గారు,
నేను బాగా రాశాను అన్నందుకు థాంక్స్..
మిమ్మల్ని ఏడిపించటానికి కామెంట్ :-) ఇంకా నయం.. మీ బ్లాగ్ లోంచి ఈ మధ్యే పాత టపాలు తీరిగ్గా చదువుతున్నాను. అంతర్జాలం లో మీ పేరు చాలా కాలం నుండీ వింటున్నాను. మీరు మంచి రచయిత్రి అన్న స్టేట్ మెంట్ లో అతిశయోక్తి ఏమీ లేదు.

@ శ్రీదేవి గారు,
ధన్యవాదాలు! మీరు మీ అమ్మాయి కి చదివి వినిపించరాని విని చాలా సంతోషం వేసింది. నా బ్లాగ్ కి స్వాగతం!

కృష్ణప్రియ/

హరే కృష్ణ said...

కొత్త పోస్ట్ ఎప్పుడు రాస్తున్నారో తెలియచేయాలని డిమాండ్ చేస్తున్నాం

కొత్త పాళీ said...

brilliant as usual.
It is never easy with kids.
Our grandparents' methods did not work for our parents.
Our parents' methods do not work for us.

Krishnapriya said...

@ హరేకృష్ణ,
:-) Thanks.. ఆ పని మీదే ఉన్నా..

@ కొత్తపాళీ గారు,
ధన్యవాదాలు! మీరు అన్నది నిజం. ఇదంతా constant learning అనిపిస్తుంది నాకు. ప్రతీ రోజూ కొత్తగానే ఉంటుంది. పిల్లల మీద మా పైత్యం experiment చేస్తున్నామేమోననిపిస్తుంది.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Nice post.

________________________
. మా పెద్దది.. టింకిల్ చదివేస్తోంది.. చిన్నదేమో.. మ్యూట్ లో పెట్టి టీ వీ లో ఏదో చూస్తోంది..
________________________
నేను కూడా చిన్నప్పుడు ఇలానే చేసేవాడిని!!

Weekend Politician said...

Where is the next post? :)

స్నేహ said...

కృష్ణప్రియ గారు,
మీరు John holt గారి How children learn? అన్న పుస్తకం ఎప్పుడైనా చదివారా?

Krishnapriya said...

@ గణెష్,
థాంక్స్. :-) మేమూ అలాగే.. డిస్టర్బన్స్ వస్తుందని తలుపులూ, కిటికీలూ వేసేసుకుని నిద్రపోయేవాళ్ళం. లేదా పుస్తకాల్లో కథల పుస్తకాలు పెట్టుకుని చదివేవాళ్ళం.

@ వీకెండ్ పొలిటిషియన్,
:-) It is out..

@ స్నేహ గారు,
చదవలేదండీ.. పుస్తకం గురించి విన్నాను. నెట్ లో రివ్యూలు చదివాను. I will look for it..

Indian Minerva said...

"యా.. ఐ టూ వాంట్ టు సే.. ఐ లవ్ యూ టూ మామ్మ్మా"

I too wanted to say many a times.... but I never got the chance. Now I have the chance but I am not the same.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;