Thursday, January 26, 2012 23 comments

మా సింగం సజెస్ట్ చేసిన ‘తమిళ పడం’ సినిమా..


క్యూబ్ లో నేనూ, మా సింగం ( నా సహోద్యోగి) యమా సీరియస్ గా పని చేసుకుంటున్నాం. మా బాసు గారు వెనక నుంచి వచ్చి అంత కన్నా సీరియస్ గా.. ప్రాజెక్ట్ డెడ్ లైన్ పొడిగించబడింది. అమెరికా టీం వాళ్లకి వేరే ఏవో ఎమర్జెన్సీల వల్ల మా పని చేయరు. అని చెప్పి, ఆ వార్త మా మెదడు లో పూర్తిగా ఇంకే లోపలే ఆయన కి ఏదో ఫోన్ కాల్ వచ్చి చక్కా వెళ్లి పోయాడు. ఇంక సగం వాక్యం రాసిన డాక్యుమెంట్ అలాగే వదిలేసి బ్రేక్ రూమ్ లో కెళ్లి పిచ్చాపాటీ లో పడ్డాం. మాతో పాటూ, ఇంకో నలుగురు చేరారు. ఇలాంటి సమయాల్లో మనకి ఉండే టాపిక్కులు ఏముంటాయి? ఆఫీస్/దేశ రాజకీయాలు, మా కంపెనీ కాకుండా అన్ని కంపెనీల్లో ఎంత చక్కటి జీతాలు, గట్రా ఇస్తున్నారో, ఎవరు ఎక్కడ ఇళ్లు కొనేస్తున్నారో అయ్యాక ఇంక మిగిలింది సినిమా యే కదా! బిజినెస్ మాన్ జోకులు, పవన్ కళ్యాణ్ జోకులు, బాలకృష్ణ /జూనియర్ NTR జోకుల్లాంటివి తెలుగు వాళ్లు చెప్తే, తమిళులు, హిందీ వారు వాళ్ల సినిమా స్టార్ల జోకులు చెప్తూ అలరిస్తుండగా మా సింగ పెరుమాళ్ ఇవన్నీ కాదు కానీ క్రిందటేడు ‘తమిళ్ పటం’ అని ఒక సినిమా వచ్చింది. ఒక్క సినిమా చూసారంటే అన్ని సినిమాలూ చూసినట్టే.. ‘నాను గారంటీ’ అనేశాడు. నేనూ ఎక్కడో ఆ సినిమా గురించి చదివాను. సాధారణం గా సింగం మాట మీద నాకు చాలా గురి. క్యూబ్ కెడుతూనే, ఆన్ లైన్ లింక్ నాకు ఇచ్చాడు.

రేపెలాగా గణతంత్ర దినోత్సవం .. ఇంట్లోనే ఉంటాం కదా అప్పుడు చూద్దామనుకున్నాను. లింక్ పని చేస్తోందో లేదో చూద్దామని చూస్తే ఏముంది.. ఆంగ్ల సబ్ టైటిళ్లు లేవు. సర్లే అని వదిలేసి వేరే పనుల్లో పడ్డాను. రాత్రి, మీటింగ్ కాన్సెల్ అయింది. పిల్లలు గణతంత్ర దినోత్సవం కార్యక్రమాలకి తయారవుతూ చాలా బిజీ గా ఉన్నారు. కాస్త బ్లాగులు చూద్దామని లాప్ టాప్ తెరిచాను. ఎదురు గా ‘తమిళ్ పటం ‘ సినిమా డౌన్ లోడ్ అయి ఉంది. సరే చూద్దాం ఎప్పుడు అర్థం కాక బోర్ అనిపిస్తుందో అప్పుడే మానేద్దాం. అని మొదలు పెట్టాను.

ఈ మధ్య కాలం లో భాష పూర్తిగా అర్థం కాకపోయినా అంతగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సినిమా ఇదే..

సబ్ టైటిల్స్ కూడా లేకుండా చూసి ఒక రివ్యూ రాసే సాహసానికి ఉసి గొల్పిన సినిమా ఇది. అప్పటికప్పుడు కొంత మంది స్నేహితులకి ఫోన్ చేసి మరీ చూడమని బలవంతం పెట్టేందుకు ప్రేరేపించిన సినిమా ఇది.

“బామ్మా! ఇన్నాళ్లుగా నీ హృదయం లో సమాధి చేసిన రహస్యం చెప్పమ్మా చెప్పు.. నేనెవర్ని? నా తల్లిదండ్రులెవరు? నా ఊరేది?” అని హీరో చచ్చే భావోద్వేగం తో అడిగితే.. నింపాదిగా ‘అదేం పెద్ద విషయం కాదు.. నువ్వడగలేదు.. నేను చెప్పలేదు! అయినా ఇన్ని సినిమాలు చూస్తావు .. GK బొత్తి గా లేదేంటి? “ మెడ లో లాకెట్ చూసుకో.. అంటే కనీస స్పృహ లేని కథా నాయకుడు పాతికేళ్ల జీవితం లో మొట్ట మొదటి సారి లాకెట్ తెరిచి తల్లి దండ్రులని చూసుకుని కన్నీళ్లు పెట్టుకునే సీన్, చూసి చిరునవ్వైనా రాకుండా పోదు.

హీరోయిన్ తండ్రి ‘నీ అంతస్తేంటి నా అంతస్తేంటి? అని హీరో ని అడిగితే, నీకన్నా బోల్డు రెట్లు సంపాదించి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని చాలెంజ్ చేసి హీరో పౌరుషం గా బయటకెళ్లి ఒక పాట అయ్యేలోపల పాల పాకెట్లు, పత్రికలూ వేసి, పండ్లమ్మి, పాత ఇనప సామాన్లు కొని, పార్కులో ప్రేమికులకి పల్లీలమ్మి, కత్తులకి పదును బట్టి, కూలీ పని చేసి వేలాది కోట్లు సంపాదించి (అదీ హీరోయిన్ తండ్రి కప్పు కాఫీ తాగే లోపల!) పది ఫారిన్ కార్లలో రావటం చూస్తే నవ్వే నవ్వు.

ఇక, చెల్లి కాలేజ్ కెళ్తే, అరిచేతుల మీదుగా నడిపించే అన్నలు, రైలు డబ్బా మీద ప్రేమలేఖలు రాసే గంగోత్రులు, కాలేజ్ కెళ్లే నలభై ఏళ్ల లేత బాయ్స్, జులపాల జుట్ల విలన్లు, చిన్న స్టికర్ పెడితేనే ప్రేమికురాలు కూడా గుర్తు పట్టనంత మారిపోయే హీరో రూపం, చూస్తేనే పొట్ట చెక్కలవటం ఖాయం.

హీరోయిన్ ని ఇంప్రెస్ చేసేందుకు హీరో ఒక్క రాత్రంతా కష్టపడి భారత నాట్యం నేర్చుకుని ప్రదర్శన ఇచ్చిన సీన్ చూసి నేనైతే కుర్చీ లోంచి కింద పడి నవ్వాను. (ముఖ్యం గా భాగ్య రాజా స్టెప్ లు చూసి నాట్యం నేర్చుకోవాలని చూడటం)

వీధి లో దుండగులు ఫుట్ పాత్ మీద అమ్ముకునేవారి మీద చేసే జులుం అన్యాయాన్ని ఎదిరించటానికి ఒక పెడల్ వేసి సైకిల్ చక్రం తిప్పి పెద్దయి వచ్చి వారిని చితక్కొట్టిన సీన్ అవగానే దళపతి అయిపోయి, రజనీ కాంత్ లా డాన్స్ వేసే సీన్ ‘అబ్బ! ఎన్ని సినిమాల్లో చూశాం?’ అనిపించక మానదు.

దరిద్రం ఓడుతున్న ఇంటి తలుపు తీస్తూనే అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన ఇళ్లు, భయంకరమైన టెక్నాలజీ తో కట్టిన విలన్ల డేన్లూ, ఆదిమ మానవుడి కాలం నుండీ ఒకేరకం గా కనిపించే CBI కార్యాలయాలూ, పోలీస్ ఆఫీసర్లూ.. డాక్టర్లూ,

పనీ పాటా లేకుండా పతంగులకోసం మాంజా కోసం గాజు ముక్కల్ని మరిగిస్తున్న హీరోనీ, అతని బేవార్స్ స్నేహితుల దగ్గరకి కాలనీ సమస్యలు చెప్పుకోవటమే నవ్వు తెప్పిస్తే, ప్రజలకోసం తన డబ్బునీ, బండి నీ లంచం ఇవ్వటం చూస్తే గిగిల్ గిగిల్..

గజనీ, అపరిచితుడు, అపూర్వ సహోదరుల తరహా లో విలన్లని చంపే పద్ధతులు చూసి నవ్వీ నవ్వీ, డొక్కల నొప్పులు..

ఇక అన్నింటి కన్నా హైలైట్ హీరో ప్రేమ ట్రాక్, హీరోయిన్ కనపడుతూనే, లైట్లు వాటంతట అవే వెలగటం, గంటలు మోగటం, రోడ్డు మీద కనపడే ప్రతి ఆడ మనిషి లోనూ హీరోయినే కనిపించటం.. కాలేజీ ఇంటర్ కాం లో మైక్ లో ‘ ఐ లవ్ యూ’ చెప్ప టానికి క్యూ, ఊరంబడా చిత్తం వచ్చినట్టు కలిసి తిరిగి, ప్రధానం సమయం లో మాత్రం తెగ సిగ్గు పడటం.. ‘అబ్బ.. ఒక్కటని చెప్పటానికి లేదు’.

ఆంగ్లం లో విడిపోయిన కుటుంబ సభ్యులు ఎమోషనల్ పాట పాడుతూ కలవటం కూడా తెగ నచ్చింది..

క్లైమాక్స్ లో ఫైట్ అయితే చెప్పనే అక్కరలేదు.

సినిమా లో మొదటి సీన్ లోనే వర్షపు రాత్రి గుడిసె లో ఒక తల్లి ప్రసవ వేదన! మంత్రసాని, గుడిసె బయట తండ్రి ..అంతా మామూలే. బిడ్డ క్యార్ మన్నాడు.

‘మళ్లీ మగ బిడ్డ!’ ఆ ఊరి ఆచారం ప్రకారం బిడ్డ కి జిల్లేడు పాలు పోసి చంపేయమని తండ్రి మంత్రసాని కి ఆదేశం,.. హృదయ విదారకం గా ఏడుస్తున్న పురుట్లో పసి కందు ని మంత్రసాని తీసుకెళ్లిపోతుంది. ‘ఎందుకు? ఎందుకు? ఎందుకు? ‘ దానికో ఫ్లాష్ బాక్. ఆ ఊరి ‘పెదరాయడు’ ఒకానొక చారిత్రాత్మక తీర్పు ఇస్తూ, ‘ఈ ఊరి మగ బిడ్డలు పెరిగి పెద్దయి, చెన్నై కి వెళ్లి అక్కడ పంచ్ డైలాగులు కొడుతూ, హీరోలయిపోయి, మొదటి సినిమా రిలీజ్ అవకుండానే ముఖ్యమంత్రి పదవి కి అభ్యర్టులవుతున్నారు.. కాబట్టి.. పుట్టిన మగ పిల్లలకి.. జిల్లేడు పాలు..

మంత్రసాని హృదయ విదారక మైన పాట పాడుతూ, జిల్లేడు పాలు పట్టబోయేంతలో, ‘బుడ్డ సూపర్ స్టార్’ “ఆగు!! నన్ను గూడ్స్ బండి ఎక్కించు.. అన్ని సినిమాల్లో గూడ్స్ బండి చెన్నై కే వెళ్తుంది కదా!” అంటాడు. ఈవిధం గా బామ్మగారిని మురిపించి, ఆవిడ తోడుగా మదరాసు మహానగరానికి చేరతాడు.

వెంటనే అలవాటు ప్రకారం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పైన జూమ్ చేస్తుంటే ఒక ఆటో డ్రైవర్ వచ్చి.. ‘ఏంటి? మళ్లీ ఇంకో హీరో వచ్చినట్టున్నాడు చెన్నై కి? ఏం బాబూ? మద్రాసంటే ఇక రైల్వే స్టేషన్ ఒక్కటే ఉందా? బీచ్ ఉంది.. కాలేజీ ఉంది.. పోరా..’ అని బెదిరిస్తాడు. ఇలాగ చెన్నై కి చేరిన బాబు హీరో గా ఎదిగిన విధానం, అతని విజయాలు ఈ సినిమా కథ.

మనల్ని ఈసినిమా ఎంత నవ్వించినా తెర పైన పాత్రం చాలా చాలా సీరియస్ గా చేశాయి. అలాగే సంగీతం, ఛాయాగ్రహణం చాలా బాగున్నాయి. హీరో చాలా చాలా ప్రతిభావంతుడు. డైలాగులు పెద్దగా అర్థం కాకపోయినా తెలుగు సినిమాలూ అదే అదే చూపించి మనల్ని ఈ సినిమా చూడటానికి రెడీ చేసేసాయి.

మా అత్తయ్య వాళ్ల ఊర్లో ఒకావిడ అంతంత సొమ్ము పోసి కొంటున్నాం టికెట్టు అని కనీసం 18 రీళ్లయినా ఉండే సినిమాకే వెళ్తాను.. అనేది. అలాగ, ఈ ఒక్క సినిమా చూస్తే వంద సినిమాల పెట్టు.

ఈ సినిమా సమీక్ష కోసం :

http://www.indiaglitz.com/channels/tamil/review/11518.html

ఆలమూరు సౌమ్య రాసిన సమీక్ష చిత్ర మాలిక లో :

http://chitram.maalika.org/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%95%E0%B1%81-%E0%B0%A8%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8/
చూసి చెప్పండి మీకెలా అనిపించిందో..

Thursday, January 19, 2012 45 comments

స్పోర్ట్స్ డే కి ఎనిమిది వందలీయి..


“అమ్మా!! రేపు 800 రూపాయలియ్యాలి స్కూల్లో.. కవర్ లో పెట్టి ఇచ్చేయ్..” అంది చాలా మామూలు గా మా పెద్దది.

“ఎందుకు? స్కూల్లో పనీ పాటా లేనట్టుంది! ఎప్పుడు చూడు.. ఎనిమిది వందలియ్యి, వెయ్యియ్యి.. అంటూ... “

“స్పోర్ట్స్ డే కి’ (ఏంటింత వివరం అడుగుతావు? అన్నట్టు మొహం పెట్టి)

“మీ స్కూల్ వాళ్లు స్పోర్ట్స్ డే చేస్తే నేనెందుకియ్యాలి? నువ్వే ఆటా ఆడట్లేదు కదా! ”

“అమ్మా!! మేం ఆడకపోయినా డ్రిల్ ఉంటుంది కదా.. మాకు ఒకేరకం బట్టలు కుట్టించాలి కదా!”

“స్కూల్ డ్రెస్ వేసుకుని ఏడవచ్చు కదా!.. “

“అమ్మా.. ఇదేమీ కంపల్సరీ కాదు. కానీ ‘strongly encouraged’ అని మా ప్రిన్సిపాల్ చెప్పారు. ప్రాక్టీస్ కి రాని వాళ్లకి పాఠాలు ఉండవు. ఊర్కే తరగతి గది లో కూర్చోవాలి. మా క్లాస్ వాళ్లల్లో వెళ్లని వాళ్లు లేరు.ఒక్క అమ్మాయి కి కాలు లేదు కాబట్టి ఆ అమ్మాయి ఒక్కత్తే ఉంటుంది. నీ ఇష్టం ” అని చేతులెత్తి నిరసన చూపించి వెళ్లిపోయింది మా అమ్మాయి.

ఈ సంవత్సరం ఇప్పటికే ఎన్ని సార్లు ముక్కు పిండి వసూలు చేశారో! దీనికి వెయ్యి, దానికి మూడు వేలు.. అంటూ.. టైలర్ల తో ఏదో ఒప్పందం ఉండే ఉంటుంది. ఏదో ప్రోగ్రాం పెట్టి నాట్యం పెట్టటం..నాలుగు వేల మంది విద్యార్థులకి బట్టలు కుట్టే కాంట్రాక్ట్.. పైగా.. ఆ చెత్త డ్రస్సులు పిచ్చి బట్ట తో, ధగ ధగ మెరిసేలా కుట్టిస్తారు ఇంకోసారి ఇంట్లో వేసుకోవటానికి కూడా లేకుండా..ఎరుపు, మామిడి పండు పసుపు, వంగపండు రంగు, నారింజ రంగు చారలతో, అడ్డదిడ్డమైన కాంబినేషన్ల గుడ్డల మీద జరీ పోగు..వేసుకోవటానికుండదు, దాచుకోలేము. ఏ కార్యక్రమమైనా event management కి ఇచ్చేసి, అక్కడే తిండి అవీ కూడా యాభై కి నూడిల్స్, ఇరవై కి చిప్స్, ఐస్ క్రీం కి యాభై.. వేదిక ‘నలంకరించిన’ ముఖ్య అతిథులకి పుష్ప గుచ్చాలు, పెద్ద షామియానా, వీడియో,ఫోటోలు తీసి వాటికి మళ్లీ పిల్లల దగ్గర్నించి వసూలు చేయటం.. కార్లతో రోడ్డంతా జామ్ అయిపోవటం..

పిక్నిక్ అని రిసార్ట్ లకి తీసుకెళ్లటం .. విహార యాత్రలకి విదేశాలు తీసుకెళ్లటం.. అంతెందుకు? వారం లో ఐదు రోజుల్లో మూడు రకాల యూనీఫారాలు..పుట్టిన రోజుకి స్కూల్లో పంచటానికి ఖరీదైన చాక్లెట్ బార్లు, బట్టలు, పార్టీలు,..క్రిస్మస్ కి గిఫ్టులు..

చిన్నప్పుడు మా బళ్లో కార్యక్రమాలు గుర్తొచ్చాయి... మా బడి వార్షికోత్సవాలకి ‘మా తెలుగు తల్లికి’ పాట కి నాట్యం. మా టీచర్ గారు ఎలా చేయాలో ఎంతో చక్కగా నేర్పించారు కానీ అందర్నీ పట్టు లంగాలు వేసుకుని రమ్మన్నారు. మా అమ్మకి పెళ్ళప్పుడు కొన్న చీరలు మూడు. ఏదో వాటిల్లోంచి ఒకటి చింపించి నాకూ, మా చెల్లికీ కుట్టించింది కాబట్టి, ఏ కార్యక్రమం అయినా అవే వేసుకునేవాళ్ళం. పైగా మా భాగం అవగానే, అవీ కుట్టించుకోలేని పిల్లలు గబగబా మా బట్టలు వేసుకుని చేసేవారు. ఈ డాన్స్ లో మరి అందరమూ వేయాలి. తల నొప్పయిపోయింది మా టీచర్ గార్కి. ఇద్దరికి కనీసం మెరుపు పరికిణీలున్నాయని ఉన్నారు, మా చెల్లి పరికిణీ కుట్లు రెండు తీసి నా స్నేహితురాలు వేసుకుంది. ఇంకో ఇద్దరు అప్పు తెచ్చుకుని తంటాలు పడ్డారు. ఒకమ్మాయి కి ఆ భాగ్యమూ లేక నాట్యం లో పాలు పంచుకోలేకపోయింది. ఆ అమ్మాయి ఒకటే ఏడుపు. కళ్లల్లో నీళ్లు తిరిగి అప్పు తెచ్చుకున్న పరికిణీలు వెనక్కి ఇవ్వమని ఆ ఇద్దరు పిల్లలకీ చెప్పి, ఇద్దరి చేత ధోవతులు కట్టించి, మీసాలు గా కాటుక దిద్ది మగ వారిగా మార్చి, మిగిలిన ఒకరికి తన చీర ఇచ్చి తెలుగు తల్లిని చేసిన మా పంతులమ్మ గుర్తొచ్చి, ‘ఆ నాటి చదువులు, ఆ గురువులు, మధ్యతరగతి విద్యార్థులు వారి ఆర్ధిక స్థాయి.’. అలా పాత జ్ఞాపకాల్లోకి జారుకున్నాను.

వేదిక మీద పాత కాలం టేబుల్, మీద ఒక చీర, మా ఇంటినుంచి తెచ్చి ఒక ఫ్లవర్ వేజూ, సంవత్సరానికోసారి మైక్ తెస్తే గొప్ప, ఆగస్ట్ పదిహేనుకీ, జనవరి ఇరవయ్యారుకీ పది పైసల చాక్లేట్లు పంచితే గొప్ప.. ఇంట్లో ఏడిస్తే వచ్చే తల్లిదండ్రులు..వాళ్లల్లో కార్లల్లో వచ్చేదేవరని?

పిక్నిక్ కి పబ్లిక్ గార్డెన్ కి తీసుకెళ్తేనే, సగం మంది వచ్చేవారు కాదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కి రెండు రోజులు వెళ్లటానికి ఏడ్చి, నిరాహార దీక్షలు.. వేసిన ఒట్లు తలచుకుంటే నవ్వొచ్చింది. సగం సంవత్సరం దాకా శని వారం వేయాల్సిన తెల్ల యూనీఫారం లేక, బూట్లు లేక ఎంతమంది దెబ్బలు తినేవారో, చేతిపని క్లాస్ లో సంచీ కుట్టాలంటే ఇంట్లో బట్ట కొనక ప్రతి క్లాస్ కీ ఒక్కో దెబ్బ తినే పిల్లలు గుర్తొచ్చారు.. అంతెందుకు నాలుగైదు పాఠాలు అయ్యాక కూడా పుస్తకాలు కొననివారెందరో, టిఫిన్ బాక్స్ లో నిమ్మకాయ పులిహార తప్ప తేని వాళ్ల సంగతో? పుట్టిన రోజున కూడా కొత్త దుస్తులు లేక యూనీఫారం లో వచ్చిన పిల్లలు గుర్తొచ్చారు.. ఇటుక బట్టీ లో పని చేసే కార్మికుడి కొడుకు స్కూల్ ఫీజు కట్టలేక మానేస్తుంటే అందరమూ కొద్ది కొద్దిగా వేసుకుని కట్టిన జ్ఞాపకం ఒకటి వచ్చింది. మనసు చేదయిపోయింది. నాకింతే తెలుసు.. ఈ మాత్రం లేని వాళ్ల కథలు ఎన్ని వినలేదు? ...

వీళ్లకి విలువ తెలియదు.. కాస్త విలువ నేర్పాలి.. దృడం గా నిశ్చయించుకున్నాను.

మా పెద్దది మళ్లీ వచ్చింది..

“అమ్మా! మన ప్రింటర్ మళ్లీ పని చెయ్యట్లేదు.. ప్రాజెక్ట్ ఎల్లుండి లోపల ఇచ్చెయ్యాలి.. ఎలా? బయట చేయిస్తావా?, ఈ ప్రింటర్ ని తీసేసి మనం కొత్తది కొనాలమ్మా!” అంది విసుగ్గా మొహం పెట్టి.

నేను గంభీరం గా కూర్చున్నాను. అది పట్టించుకోకుండా..

“అమ్మా! చదువుకునే గది లో ఫాన్ శబ్దం వస్తోంది. అది కూడా.. “ అంటూ నా మొహం లో భావాల్ని చూసి..

“I know I know..వెనక గుడిసెల్లో పిల్లలకి ఫ్యాన్ వదిలేయ్, గది లేదు, చదువే సరిగ్గా లేదు..”

“కాదు తల్లీ.. మీకు ప్రింటర్ ఉంది ఇంట్లో! ఎంత మంచి సదుపాయం? ఎందరికి ఉంటుంది? కాస్త చుట్టూ చూడు. ఆ బొమ్మలేవో చేత్తో వేయచ్చుకదా! “

అదొక రకమైన చూపు చూసి.. “అమ్మా! నేను బొమ్మ వేసేస్స్తాలే.. డోంట్ వర్రీ.. BTW,.. మా ఫ్రెండ్స్ ఇంట్లో wii, kinnect,DS, కిండిల్, పీ యెస్ పీ, ipod, laptop అచ్చం గా వారికే ఉన్నాయి. కొందరికి ఇ-పాడ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి.” అని ఎఫెక్ట్ కోసం ఆగి అప్పుడప్పుడూ నేను కొట్టే సినిమా డైలాగ్ “ప్రింటర్ తో పాటూ వాళ్లకి అమ్మ కూడా ఉంది” అని నవ్వేసింది..

ఒక్కసారి గా “ఈ ఫౌంటెన్ పెన్ను ఏదో క్లాస్ లో ఉన్నప్పుడు మా నాన్న కొనిచ్చాడు.. ఇరవయ్యేళ్లు దాచుకున్నాను. నువ్వు నెలకి ఇరవై పెన్నులు పోగొడుతున్నావు.. గుడ్డి దీపం లో చదువుకుని పైకొచ్చాను...” అని చెప్తున్న మా నాన్నగారి వీడియో.. నా కళ్లముందు ఒక్కసారి గా ఆటో ప్లే అయిపోయింది.

Friday, January 13, 2012 22 comments

రివర్స్ గేరు..

శనివారం ఉదయం.. ఉదయాన్నే..కాసేపు టీ తాగుతూ, ఇంటి ముందు గార్డెన్ లో దినపత్రికలని నములుతూ కూర్చున్నా..ఫోన్ మోగింది. చూస్తే నా పాత స్నేహితురాలు సంధ్య. 'మరీ ఇంత పొద్దున్నే ? ' అనుకుంటూ ఎత్తాను. 'ఏం చేస్తున్నావు కృష్ణా? తీరిగ్గా ఉన్నావా? మామూలు రోజుల్లో నిన్ను పట్టుకోవటం కష్టం.. అని ఈ సమయం లో ఖచ్చితం గా ఉంటావని చేశాను.. ' అంది. నాకూ ఉత్సాహం గా అనిపించింది. ఎప్పుడు నేను ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడుతున్నా.. వంద అవాంతరాలు! పిల్లలు అప్పుడే వచ్చి 'చాక్లెట్ తినచ్చా? హోం వర్క్ వదిలేసి ఊరెమ్బడ బలాదూర్ తిరగచ్చా? ' లాంటివి అడిగి సాధించుకుంటూ ఉంటారు. విసుగొచ్చి పెట్టేస్తూ ఉంటాను.
ఇంట్లో ఎవ్వరూ లేవలేదు.. ఇదీ బానే ఉంది. అనుకుని 'ఆగు.. చిన్న బచ్చన్ walk 'n' talk అన్నాడు .. నడుస్తూ మాట్లాడతా' అని వీధిలోకి వచ్చాను. మాది ఇరవయ్యేళ్ల స్నేహం. ఎన్నో విషయాలు అరమరికలు లేకుండా చెప్పుకుంటూ ఉంటాం. కాసేపు.. బెంగుళూరు ట్రాఫిక్, హైదరాబాద్ ఎండలు, పిల్లల అల్లరి, కిస్మస్ సెలవల్లో ఏ ఏ సినిమాలకి బలి అయ్యామో, మా సెలవల్లో ట్రిప్ లాంటివి చెప్పుకుని.. టాపిక్ నెమ్మది గా భర్తల మీదకి వచ్చింది. 'రమేశ్ ని భరించలేకపోతున్నా కృష్ణా.. తెగ ఏడిపించేస్తున్నారు.' అంది. నాకిది అలవాటే.. ఎప్పుడూ అలాగే అంటుంది. మళ్లీ అంతలోనే ఎడ్జస్ట్ అయిపోతుంది. . 'హ్మ్... అలాగా..' అన్నాను.

'మరీ అంత డ్రై గా ఆఅలాఆగాఆఆ అనకు కృష్ణా! నువ్వంటే కూడా ఒళ్లు మండుతోంది..వెధవ రెస్పాన్సూ నువ్వూ..' అని కసి గా అనేసింది. 'లేదు..లేదు.. రోడ్డు మీద ఎవరో తెలిసిన వారు కనిపిస్తే.. అంత డీప్ గా స్పందించ లేకపోయా..' అని ఏదో సద్ది చెప్పటానికి ప్రయత్నించా.. 'డీప్ గా స్పందించలేకపోయావా? ఆ భాషేంటి? నేనంటే నీకు చాలా చులకన అయిపొయింది.. ' అని పెట్టేసింది. మళ్లీ ఫోన్ చేసి.. తనని ప్రసన్నం చేసుకునేసరికి తల ప్రాణం తోక కొచ్చింది.

'ఏమైంది అసలు చెప్పు శాండీ.. ఏమిటి అసలు ఈ రమేశ్ ప్రాబ్లం?' అని అడిగాను. 'ఉదయం లేస్తూనే చిరాకు చూపిస్తారు. వంటింట్లోంచి శబ్దం వస్తే సహించలేరు. అలా అని కాఫీ కి లేట్ అయితే మళ్లీ సాధింపు. నేల మీద ఇంత చిన్న కాగితమో, చెత్తో కనపడినా.. రోజంతా ఇంట్లో కూర్చుంటావు.. ఏం చేస్తావు? పొద్దున్నే లేవగానే ఏ మాల్ కి వెళ్దామా? ' అనే గొడవ. తప్పితే ఇల్లు ఎంత అసహ్యం గా పెడతావో చూడవు. అయినా.. చేసేదంతా పని మనిషి. తనతో కూడా సరిగ్గా చేయించలేవు.. ఎందుకూ.. వేస్ట్..' అని ఒకటే చిరాకు పడటం.

బాబు ఉదయం.. విపరీతమైన బద్ధకం చూపిస్తాడు.. వాడి మీద ఏమాత్రం గొంతు పెంచి అరిచినా గొడవే.. దానితో వాడికి నా మీద భయం భక్తీ లేవు. .. విరక్తి గా అనిపిస్తుంది.. ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది.. ' అంది.

'మా ఇంట్లోనూ same problem - no difference - only names changed' అన్నాను. 'అలా అనకు. Don 't be silly! నీకంటూ ఉద్యోగం ఉంది.నువ్వు ఊరకే నన్ను ఊరడించటానికి అంటున్నావని తెలుసు. నన్ను బొత్తిగా తీసి పారేస్తున్నారు తను. ఏదైనా గట్టిగా మాట్లాడితే.. మా అత్తగారూ వింటారని ఒక భయం. పైగా.. 'కష్టపడి ఉద్యోగం చేసి అర్థరాత్రి దాకా పని చేసి ఇంటికి వస్తే ఈ సాధింపులా? ' అని దాడి చేయటం. దీని కన్నా నరకం మేలు... " అంది. కాస్త సీరియస్ గానే ఉన్నట్టుంది.. అనుకుని.. నేనూ... 'అయ్యో..ఎందుకలా? ' అన్నాను.

ఇంక తనకి ఆవేశం కట్టలు తెంచుకుంది. 'తనేదో కష్టపడి ఉద్యోగం వెలగపెడితే.. నేను కంఫర్టబుల్ గా కూర్చుని.. మెక్కుతున్నానని, పని మనుషులు పని చేస్తుంటే.. నేను ఊరికే టీవీ చూస్తూ, స్నేహితులతో కాలక్షేపం చేస్తున్నానని అనుకుంటున్నారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు తెచ్చుకోవటం, బిల్లులు కట్టటం లాంటివి అన్నీ చేస్తున్నాను.. బాబుకి చదువూ,సంధ్యా, క్లాసులకి తీసుకెళ్లటం, ఇంటికొచ్చిన చుట్టాలూ పక్కాలూ నేను చూసుకోవట్లేదా? అని అంటే అదొక పేద్ద విషయమా? మా అమ్మా అలాగే చూసుకుంది.. ఆ మాటకొస్తే.. ఇంకా ముగ్గురు పిల్లలం, ఆవిడ టీచర్ ఉద్యోగమూ చేసేది.. ఇన్ని ఫెసిలిటీలూ లేవు.. బట్టలుతుక్కుని, గిన్నెలు తోముకుని, బియ్యాలూ అవీ ఏరుకుని.. బస్సుల్లో ప్రయాణాలు చేసి...చిరిగిన బట్టలకి టాకాలు వేసుకుంటూ, ఆర్ధిక ఇబ్బందులని ఎదుర్కుంటూ, చుట్టాలని సమర్ధించుకుంటూ..' ఇదీ ధోరణి!!.. వాళ్ళమ్మ ఆరోజుల్లో కష్టపడిందని నేనూ అలాగే కష్టపడాలి అంటే ఎలాగ? ' గొంతు గద్గదం గా ..
బాధేసింది.

ఏం చెప్పచ్చా.. అని ఆలోచిస్తుంటే.. ఉదయం.. అందరూ ఆఫీసులకీ,స్కూళ్ళకీ వెళ్లాక నేను ఇంటి పనీ అదీ చేసాక, నాకు టీవీ చూసే ఆసక్తి ఉండదు.. ఉన్నా.. మా అత్తగారు ఏవో వంటల ప్రోగ్రాం లో, భక్తీ ప్రోగ్రాం లో చూస్తారు. బాబు వచ్చాక వాడి చదువు తో బిజీ. సాయంత్రం నేను ఏదైనా చూద్దామంటే.. 'పొద్దున్నుంచీ.. నువ్వే ఇంట్లో కూర్చుని ఖాళీగా .. మేమింటికి వచ్చాక కూడా.. నువ్వే టీవీ చూడాలా? అని !!' 'ఇంట్లో నేను "ఖాళీ' గా కూర్చున్నానని.. సాయంత్రం అందరికీ ఒదిగి ఉండాలనీ, సాయంత్రం నేను రిలాక్స్ డ్ గా ఉంటే తనకి విసుగు, జెలసీ.. అలాగని టెన్స్ గా కనపడితే.. 'ఏమీ లేకుండానే ఇంత ఓవరాక్షన్.. నిజంగా ఏమైనా ఉద్యోగం చేస్తే ఏమవుతావు? ' అని .. తట్టుకోలేక పోతున్నాను.. మొన్నేదో సరిగ్గా చూసుకోకుండా ఎక్కువ ఖరీదు పెట్టి కొన్నానని......."

నా వాకింగ్ రౌండ్ అయినా.. పాపం చెప్తోంది కదా అని వింటున్నాను. "అంతెందుకు? నేను అందరూ ఇంట్లో ఉన్నప్పుడు వార్తా పత్రికలు చదువుతున్నా.. ఒక రకమైన లుక్ ఇస్తారు.. వీకెండ్స్ పని లేకుండా ఉండటానికి నేను ఎవ్వరూ లేనప్పుడు చాలా వరకు పని పూర్తి చేసుకుని అందరూ ఉన్నప్పుడు సరదా గా ఉన్నా కూడా సహించలేకపోతున్నారు. సరే అని ఎదో ఒక పని కల్పించుకుని చేస్తున్నట్టు కనిపిస్తే.. "చుట్టూ అందరమ్మాయిలనీ చూడు..చక చక లాడుతూ ఉంటారు..నువ్వు వారాంతం కూడా ఇలా మొహం వేలాడేసుకుని.. పనులు చేసుకుంటూ.."

ఎలా ఉన్నా తప్పే, ఏం వండినా తప్పే, ఏం చేసినా తప్పే, ఏం చేయకపోయినా తప్పే.. అసలు నేను బ్రతికుండటమే వచ్చింది. దుఃఖం తో గొంతు పూడుకుపోయినట్టుంది. . "అయ్యో! ఏంటిది.. " అనుకున్నా..

తనింకా చెప్పుకుంటూ పోతోంది.. "నా కారీర్ వదిలేశాను.. ప్రతి బిల్లూ నేనే కడతాను. ఇంటి పనీ, బయట పనీ నేనే చేస్తాను.. అయినా.."
నేనేమైనా అంటే.. మళ్లీ వాళ్లు కలిసిపోయి.. నన్ను విలన్ చేస్తారు. ఏం చెప్పాలా అని... ఆలోచిస్తూ..

నేను గొణుగుతున్నట్టు... 'అబ్బా అది కాదు లే.. ఏదో ఆఫీసు చిరాకేమో లే'
సంధ్య .. "నాకుండవా.. చిరాకులు? ఒక్క సరదా లేదు షికారు లేదు..'
నేను .. "అది కాదే బాబూ.. వాళ్ల ఆఫీసు ఈ మధ్య మూసేస్తున్నారని రూమర్లు వచ్చాయి కదా.."
సంధ్య.. "పోనీ అమ్మా వాళ్లకి చెప్దామంటే.. తన ఆరోగ్య పరిస్థితే బాగోలేదు.."
నేను.. " ఏదైనా తనకి ఆరోగ్య సమస్య ఉందేమో? బీ పీ? మధుమేహం? కొలెస్ట్రాల్?"
సంధ్య.. "నాకు లేదా? కొలెస్ట్రాల్? అలాగని అరుస్తానా నేను? "
నేను.. "ఒకసారి కూర్చుని నెమ్మదిగా మాట్లాడుకోండి..రమేశ్ అంత చెడ్డవాడు కాదు.."
సంధ్య.. "నాకూ మీ ఆయన ఉత్తమోత్తముడు లా కన్పిస్తాడు.. నువ్వోప్పుకుంటావా?"

లాభం లేదు.. అయినా ప్రతి వాళ్లతో మనం మంచి గా కనపడాలి, వాళ్లు మనగురించి "అబ్బ కృష్ణప్రియ ఎంత మంచి మనిషి? అనుకోవాలని దుగ్ధ ఎందుకు? ఇప్పుడు ఈ మూడ్ లోంచి బయటకి లాగేద్దాం. మహా అంటే.. దానికెంత పొగరు.. అనుకుంటుంది అంతేగా..." అనుకుని రివర్స్ గేర్ వేశా..

నేను.. "అది కరెక్టే.. మా ఆయన మంచి సంస్కార పరుడు.. ఇలాగ ఎవ్వర్నీ అనే తత్త్వం కాదు. ఆడవాళ్లని చాలా గౌరవిస్తారు.."

సంధ్య వైపునుంచి కొన్ని క్షణాల నిశ్శబ్దం.. .. తర్వాత.. " చూడు .. రామ్ నిన్నెప్పుడైనా ఇన్నేసి మాటలన్నాడా? అయినా ఉద్యోగం చేసే ఆడవాళ్లకి ఉండే రెస్పెక్ట్ వాళ్ళకుంటుంది లే.."

(నేను మనసులో.. హ్మ్. అనటమైతే అంది కానీ గొంతు లో తీవ్రత తగ్గింది.. చలో రెండో బాణం తీద్దాం..) పైకి..
" ఉద్యోగాస్తురాలినని కాదులే... ఇన్నేళ్ల పరిచయం లో ఒక్కళ్ళనీ అవమానకరం గా మాట్లాడగా నేను చూడలేదు.. హీ ఈజ్ అ జెంటిల్ మాన్ "

సంధ్య ఈసారి వెంటనే.. "రమేశ్ చెడ్డ వాడని కాదు కృష్ణా.. ఈ మధ్య అలాగ తయారయ్యాడు.. ఎందుకో.."

(నేను మనసు లో.. అమ్మయ్య.. రూట్ మార్చింది.. ) పైకి
" ఎప్పుడైనా పనమ్మాయి రాకపోతే, లేదా.. ఆఫీసు పని చాలా ఉంటే.. నేను పని చేస్తూ అలిసిపోయినట్టు కనిపిస్తే.. గబ గబా.. వచ్చి ఒక చేయి వేస్తారు.. లేదా.. వంట వద్దు.. పిజ్జా తెప్పిద్దాం. అనేస్తారు.."

సంధ్య.. "హే.. ఆయనా అంతేనే.. నాకు వొంట్లో బాగోలేని రోజు.. పెద్ద కస్టమర్ తో మీటింగులూ అవీ ఉన్నా.. ఇంట్లోంచి పని చేసి.. "

(నేను.. తన మాట మధ్యలోనే తుంచేస్తూ..) "అయినా తన దాకా అక్కర్లేదు.. నేనే ఇంకోళ్ళని పెట్టుకుంటా.. లేదా.. బయట నుండి తెప్పించేస్తా.. తనకి చెప్పటం..పర్మిషన్లూ అలాంటివేమీ ఉండవు మా ఇంట్లో.."

సంధ్య.. (కాస్త ఉక్రోషం గా) "ఇంటి ఖర్చు అంతా నేనే నడిపిస్తా కృష్ణా! జేబు ఖర్చు రోజూ నా దగ్గరే తీసుకుంటారు తను.. ఎప్పుడూ డబ్బు విషయం లో ఛీప్ గా తను ఎప్పుడూ లేరు.. మొన్నంటే.. నిజంగా చూసుకోకుండా.. ఏదో కొనేశాను.. రెండు వేల నష్టం..."

(నేను నవ్వాపుకుంటూ.. కట్ చేసేసి ) "హ్మ్.. ఎంత ఆఫీస్ ప్రెషర్ ఉన్నా.. ఇంట్లో చూపించటం.. రమేశ్ తప్పే"

సంధ్య .."కాదు లే.. మరీ ఉదయం తొమ్మిది కల్లా తినీ తినక ఇంట్లోంచి బయట పడితే మళ్లీ ఒక్కోసారి రాత్రి వచ్చేసరికి పదకొండయిపోతోందోయ్..పాపం.. ఈ మధ్య ఎసిడిటీ కూడా వచ్చేస్తోంది.. పైగా అంత సేపు కమ్యూట్ చేసి చేసి.. నడుం నొప్పి తనకి. పైగా.. ఆఫీస్ లో తలనొప్పి పెట్టించేస్తున్నారు.."

(నేను మనసు లో .. 'ఇంక ఈ డైలాగ్ తో మటాష్..) పైకి.. కాస్త ఘాట్టి గా..
"ఏమో బాబూ.. తనైతే.. చాలా అండర్ స్టాండింగ్ . ఎంతైనా సహాయం చేస్తారు. నేనే అంటాను కానీ.. ఒక్క మాటా నన్ను అనరు. అంటే నేనస్సలూ ఊరుకోను..ఎందుకు పడాలి మనం.. నీకేం తక్కువ అసలు? ఎక్కువ మాట్లాడితే నాలుగు రోజులు మీ అమ్మా వాళ్లింటికి వెళ్లిపో.. తెలిసొస్తుంది తనకి భార్య విలువ.."

సంధ్య. "అదేంటి కృష్ణా అలా అంటావు? నువ్వేదో.. కాస్త తెలివి గా మంచి గా చెప్తావు సలహా అనుకుంటే.. ఇలాగ మాట్లాడుతున్నావు? రమేశ్ ఎప్పుడైనా ఇలా ఉన్నాడా? తన గురించి నీకు తెలియదా? "

నేను ".ఊ..."

సంధ్య కంటిన్యూ చేస్తూ .. "తనకి ఆఫీసు లో పని ఎక్కువైపోతోంది.. కంపెనీ కూడా మూసేస్తారని, అమ్మేస్తారని రూమర్స్.. ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు.. వేళకి తిండి,నిద్ర ఉండట్లేదు.. ఏదైనా అన్నా నన్నే కదా. నా మీద కాకపోతే ఎవరి మీద చూపిస్తారు చిరాకు? ఒక సపోర్ట్ గా నిలుస్తాను కానీ నువ్వెవరివి నన్ననటానికి? అని నీలా ఎదురు తిరిగి దెబ్బలాడను. ఇదంతా తాత్కాలికం. "

నేను .."ఊ.."

"అయినా నాకు ఒక్కోసారి చిరాకేదైనా వస్తే నేనంటే తను పడరా? ఒక్క మాటనకుండా పడతారు. నా చిరాకు తగ్గాక నేను సారీ చెప్పేస్తాను. అలాగే ఇదంతా ఒక ఫేజ్. ఇదయ్యాక తన ప్రవర్తనకి తానే సిగ్గు పడి నాకు అపాలజీ చెప్తారు.."

"ఊ.."

.. "సరే.. రమేశ్ లేచినట్టున్నారు.. రోజూ ఎలాగూ ఆదరా బాదరా గా సీరియల్ తిని వెళ్తారు. ఇవ్వాళ్ల పెసరట్లకి నానపెట్టా. ఉప్మా పెసరట్ వేస్తాను.. ఉంటాను. మళ్లీ మాట్లాడతా.. బై"

ఫోన్ పెట్టేసి గట్టి గా నవ్వేసుకున్నా..ఎదురు గా వస్తున్న పెద్దాయన నా వైపుకి అనుమానం గా చూస్తూ ఎందుకొచ్చిందని రోడ్డు క్రాస్ చేసి అవతల పక్కకి వెళ్లాడు.. 
;