Sunday, October 17, 2010 32 comments

దసరా సెలవల్లో ప్రయాణం.. రైలెక్కేదాకా..పరీక్షలయ్యాయి అమ్మయ్య ' అనుకునేటప్పటికి, స్కూల్లో కల్చరల్ వీక్, స్పోర్ట్స్ డే, పిక్నిక్, తల్లిదండ్రులని పరుగులెత్తించి వదిలిపెట్టారు 10 రోజులకి!  దసరా సెలవలు.  3 నెలల క్రితమే నిర్ణయం అయిపోయింది ఈసారి కన్యాకుమారి కి వెళ్ళాలని. రైల్వే వెబ్ సైట్ లోంచి 90 రోజుల ముందు చేసుకోవచ్చు అనగానే టికెట్లు ఉదయం 10 కే చేసేశాం. అప్పటికే మాకన్నా ఫాస్ట్ గా 150 కి పైగా బెర్తులు బుక్ అయ్యాయంటే.. 'ఔరా..' ఎంత ప్లాన్ డ్ గా ఉన్నారు మన ప్రజలు ? అని హాచ్చర్య పోయాం.


ఈ లెక్కన హోటళ్ళూ బుక్ చేసుకోకపోతే రైల్వే క్లోక్ రూం లో సామాన్లు వేసి ఏ చెట్టు కిందో స్నానాలూ అవీ కానివ్వాల్సి వస్తుందని భయం వేసి,.. ఆరోజే హోటల్ గదులూ బుక్ చేసేసి ఊపిరి పీల్చుకున్నాం.  ఆఫీసులో బాసుడికి ఒక ముక్క చెవిన వేస్తే సరిపోతుందనుకుంటే నాకా,...  క్రాస్ అయిన డెడ్ లైన్లు మూడు ఉన్నాయి!!!  అని మాట్లాడకుండా నెమ్మది గా సిస్టం లో లీవ్ అప్లై చేసి ఊరుకున్నాను.


మా బాసొకరుండేవారు. ఆయన ఇండియాకెళ్ళి వచ్చాక రెండు ఫొటో ఆల్బుం లు ఆఫీస్ లో పెట్టుకునేవారు. ఒకటేమో, అందరికీ చూపించటానికి.. .. గోవా బీచుల్లో, స్టార్ హోటల్లలో,.. దేవాలయాల్లో..


ఇంకోటి దేశీలకు మాత్రమే!!..  వాళ్ళ కుటుంబం నడిపే దుకాణం, ఇంట్లో ఉయ్యాలా బల్ల మీదవీ, వాళ్ళింట్లో జరిగిన శుభకార్యాల ఫొటోలూ,  ఉండేవి.


అలాగే మా సెలవలు ఎలా గడిపాం అంటే.. ' యా.. ఇట్ వాజ్ గుడ్ యూ నో..  వీ హాడ్ టూ మచ్ ఫన్!!
కన్యాకుమారి లో యూ నో.. సన్ రైజ్ చూసి తీరాలి !.. నెవర్ మిస్ ఇట్ వెన్ యూ గో!! వివేకానంద మెమోరియల్.. మాన్!! ఎంత ప్రశాంతం గా ఉందో.. ' అని ఆఫీస్ వాళ్ళకీ, మా చుట్టుపక్కల నివసించే వాళ్ళకీ, చుట్టాలకీ వర్ణించి వర్ణించి చెప్తున్నాం..  నిజంగా సెలవల్లో ప్రయాణాల్లో ఎన్ని సాధక బాధకాలు? రెండు భాగాలు గా బ్లాగ్ మిత్రులతో సెలవల అనుభవాలు పంచుకుందామని..


ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చింది..


అల్మారీలన్నీ బట్టలతో నిండి తలుపు తీయగానే ఆనకట్ట కి గేట్లు తీసినట్టు పొర్లి పడతాయా?  ఉతికేటప్పుడు, మడతలు పెట్టేటప్పుడు, ఐరన్ చేసేటప్పుడు కనపడే గుట్టల గుట్టల బట్టల్లో.. ప్రయాణానికి సద్దుకుందామంటే ఒక్కటీ కనపడదే..? కొన్ని వెలిసినవి, కొన్ని సడెన్ గా ష్రింక్ అయినవి (అబ్బే నేను లావు అవ్వటం వల్ల కాదు లెండి.. కొన్ని బట్టలు 20-30 ఉతుకుల తర్వాత కూడా నాలుగైందు వారాలు వాడకపోతే ష్రింక్ అవుతాయన్నమాట!)


సరే,  ఫొటోల్లో ఉండిపోతాయి నాలుగు జతలు మంచివి కొనాలి,...  పైగా ఆఫీస్ డెడ్లైన్ ఒకటి మిగిలింది నా ప్రాణానికి..  అర్థరాత్రి దాకా ఆఫీస్ పనీ, ఒక పక్క షాపింగ్, ఇంటి పనులూ,.. సతమతమవుతుంటే.. ఇదే బెస్ట్ సమయం అని మా డ్రైవర్ వాళ్ళావిడ కి 2 వారాల ముందే నొప్పులు మొదలైపోయాయి. అర్జెంట్ గా సెలవు పెట్టేశాడు. ఏడ్చినట్టుంది ' ఇంతకన్నా దురదృష్టం ఉంటుందా? ' అనుకున్నాను  ఇంకో షాక్ ఉందని తెలియక..


ఇంటికి రాగానే మా పని అమ్మాయి ఇంకో బాంబు పేల్చింది. క్రిష్టియన్ మహా సభలున్నాయి అక్కడికి వారం రోజులు వెళ్ళాలి.. సెలవిప్పించమని.. ' అయ్యో రేపు రావా? '  అని అడుగుదామనుకుని.. ఎందుకైనా మంచిది.. మా బాసు దగ్గరా, పని మనిషి దగ్గరా ఫేవర్లు అడిగితే, ఇంతకి అంత అని వసూలు చేసుకుంటారు  అని గుర్తొచ్చి.. నోరు మెదపకుండా ఊరుకున్నాను. 


అసలే ఒక పక్క చస్తుంటే,  మా స్నేహితురాలు ఇచ్చిన సలహాలు... ఆఫీస్ లో విన్న టెక్ టాక్ లా వినీ విననట్టు వదిలేశాను. (క్రిష్నా.. జుట్టు ట్రిం చేయించుకో.. ఫేషియల్ చేయించుకో..  ఈ మాసిన బ్యాగ్ వదిలేసి మాంచి  డిజైనర్ బ్యాగ్ కొనుక్కో.. అక్సెసరీస్ మర్చిపోకు.. లాంటివి)


నా షాపింగుల తోటే చస్తుంటే.. ఆఖరి రోజున రెండు పుట్టిన రోజు పార్టీలు. మా పిల్లలు గిఫ్ట్ లేకుండా వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చారు. ఇక నా పరిస్థితి సంబరాల రాంబాబు దే అయ్యింది.  ఆఖరి నిమిషం షాపింగ్ లో బట్టలూ, రైల్లోకి చిరుతిండీ.. లాంటివి కొని తెచ్చుకుని లిస్టులేసుకుని సూట్ కేసులు దించి చూస్తే జ్ఞాపకాల పొరల్లో ఎక్కడో అట్టడుగున తప్పిపోయిన బట్టలు, వస్తువులు!!!  .


అసలు మనకున్న బట్టలకి ఎక్కడికెళ్ళినా ఇంకా ఇంకా కొని, లెక్కా పత్రం లేకుండా పడున్నాయి. లాస్ట్ టైం హైదరాబాద్ నుండి సోమవారం ఉదయం రైల్లో రావటం వల్ల ఆదరా బాదరా గా ఆఫీస్ కి పరిగెట్టి.. శని వారం వచ్చేదాకా సమయం లేకపోవటం వల్ల అలాగే అటక కెక్కించిన బాబతు అనుకుంటా..  అప్పుడే డిసిప్లిన్ గురించి అందరికీ లెక్చర్ ఇచ్చానేమో..నాలుక కరుచుకుని, ఎవ్వరూ చూడలేదు కదా అని దాచేసాను
పిల్లల దెబ్బలాటలకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ల్లో గంటకి 30 రేట్ లో  మొదట అనునయం గా, తర్వాత కఱకుగా, పిదప బెదిరింపులతో, అటు పిమ్మట (ఏమరుపాటులో ఉంటే గుండె ఆగిపోయేలా) అరుపులతో తీర్పులిస్తూ, ప్రయాణానికి సద్దుకోవటం, ..  బాస్ ఫోన్ కాల్స్ సాధ్యమైతే ఎవోయిడ్ చేసి, కుదరకపోతే.. టైలర్ల లాగా 'పని తప్పక అయిపోతుంది .. మీకెందుకు.. నేనున్నాను కదా.. మర్చిపోండి ' .. అని అబద్ధపు ప్రామిస్ లు చేస్తూ,  మానేజ్ చేస్తుంటే.. హాయిగా కామన్ వెల్త్ ఆటలు ఆస్వాదిస్తున్న తండ్రీ కూతుర్లని చూస్తే, వచ్చిన ఇరిటేషన్ ముందు సల్మాన్ కి వివేక్ ఒబ్రాయ్ ని చూస్తే వచ్చే భావం దిగదుడుపే..  
అసలే పిల్లలకి బట్టలు, స్విం సూట్లు, కెమేరా, కాం కార్డర్, సెల్ ఫోన్లు, అన్నిటికీ చార్జర్లు, ప్రయాణం లో బోర్ అవకుండా ఎలక్ట్రానిక్ సాధనాలు, ఆటలు, తినుబండారాలు, పుస్తకాలు,  బ్యాగులకి బ్యాగులు నిండిపోతున్నాయి. మేము తల పట్టుకుని కూర్చుంటే.. మా పక్కావిడ వచ్చి.. అక్కడంతా వర్షాలు.. టీ వీ చూడలేదా? గొడుగులు మర్చిపోవద్దు అని చక్కా వెళ్ళింది.


మిగిలిన పాలు,పెరుగులు, కూరగాయలు, ఎవ్వరికిద్దామన్నా.. అందరూ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. పనమ్మాయా లేదు. సరే అని మాకున్న సామాన్లు చాలక, ఇంకో ప్లాస్టిక్ బ్యాగ్ లో ఇవన్నీ పెట్టుకున్నాం  దోవ లో ఇల్లు కడుతున్న కూలీలకి ఇచ్చేందుకు.. 
బోల్డు ఆటోవాళ్ళున్నారు లక్కీగా అనుకుంటూ,  కార్ దిగగానే.. 
ఆటో కావాలా సార్,.. అంటూ ఆగిన ఆటో అబ్బాయిలకి  మా సామాన్లను చూడగానే ముఖం మీద ఒక సామ్రాట్ అశొక్, ఒక శ్రీకృష్ణదేవరాయల, లేదా, అక్బర్ బాద్షా రాజసం,ఠీవీ ఆటోమేటిక్ గా వచ్చేసాయి..  ఎంతకి మాట్లాడామో, తలచుకుంటే అబ్బో.. కన్యాకుమారి కి ఇంకో టికెట్ వచ్చేదేమో అనిపించింది.


అసలు ఎక్కడినుండి ఎక్కడికెళ్ళాలన్నా.. ఇన్ని సామాన్లవుతాయేంటో.. జనాలు హాయిగా నవ్వుతూ తృళ్ళుతూ పుల్ ఆన్ లు సుతారం గా పట్టుకుని లాగుతూ వెళ్తుంటే.. మేము మాత్రం 9 శాల్తీ లతో చెమటలు కక్కుతూ ఆటోలు దిగాము :-(  'కెమేరా నీ దగ్గరే ఉంది కదా? నీ పర్స్ ఉన్న బ్యాగ్ ని కూలీ కి ఇవ్వకు.. లాంటి అరుపులతో ఎలాగోలా మా ప్లాట్ ఫాం మీదకి వచ్చి.. రైలెక్కి సామాన్లు సద్దుకుని కూర్చున్నాం..


ఇంకా స్టేషన్ లో ఆటోలోంచి దిగకముందే.. పిల్లలు 'అమ్మా.. బాత్ రూం ' అని ఒకరు, టింకిల్ కొంటావా అని ఒకళ్ళు ' పీకి పాకం పెట్టగా..రైల్వే స్టేషన్ లో ఉరుకులూ, పరుగులతోనే సరిపోయింది.
మనస్సు లో మాత్రం,.. వంటింటి కిటికీ వేసానో లేదో, వచ్చేముందు చెత్త అంతా ట్రాష్ బ్యాగ్ లో పెట్టాను తలుపు పక్క.. బయట పెట్టానో లేదో.. లాంటి అనుమానాల గాఢత 'కుప్పం స్టేషన్ ' వచ్చేంతవరకూ తగ్గలేదు.. రైలెక్కి సామాన్లు పెట్టుకున్నామో లేదో.. హాయిగా వెనక్కి వాలదామని ఇలా కూర్చున్నానో లేదో..


' అమ్మా.. పూరీలు తీస్తావా? చాలా హంగ్రీ గా ఉన్నాను.. ' అని ఒకళ్ళు.. రైల్లోకి ఏది వస్తే అది కొనమని ఒకళ్ళు గొడవ గొడవ చేసి. పది అయ్యేదాకా తిండి కార్యక్రమం లోనే ఉండి.. కాస్త క్లీన్ అప్ చేసుకుని మళ్ళీ వెనక్కి వాలదామనుకునే సరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మళ్ళీ బాత్ రూం..
రైలెక్కాక ఎన్నెన్ని చేయాలని ఊహించుకున్నానో,.. ఎంత ఆప్యాయంగా పుస్తకాలు తీసుకెళ్ళానో..


 ఇంక ఎలాగో పిల్లలని పడుకోబెట్టి,  పూర్తి చేయకుండా వచ్చిన ఆఫీస్ పని ముల్లు లాగా గుచ్చుకుంటుంటే, ఆ ఆలోచనలు మనస్సు లోంచి తోసేస్తూ .. నా పుస్తకం తీసి చదువుదామని కూర్చుకునేసరికి  అలసట.. తో కళ్ళు మూసుకుపోయాయి.. :-(
Sunday, October 3, 2010 38 comments

గుండె ఊసులు.. (అబ్బే రొమాంటిక్ కథ కాదు.. )

నాన్నగారికి బీ పీ తగ్గట్లేదని డాక్టర్ కి చూపిస్తే హార్ట్ ప్రాబ్లం, రక్తనాళాల్లో బ్లాకులున్నాయి,  ఏంజియోప్లాస్టీ చేయాలి అన్నారని చెప్పగానే విపరీతమైన దిగులు వేసింది. యుద్ధ ప్రాతిపదిక మీద నేనూ, మా తమ్ముడూ వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నా రెక్కలు కట్టుకుని వాలిపోయాం. చెల్లీ, మరిదిగారూ ఇల్లూ, వాకిలీ వదిలేసి హాస్పిటల్, ఆఫీసూ, అమ్మా వాళ్ళ ఇల్లూ తిరగటం మొదలుపెట్టారు. ఒక పక్క మా అత్తయ్యలు దిగిపోయారు. మా బాబాయి పిల్లలు ఊర్లోనే ఉంటారు, వాళ్ళూ పొద్దున్నా సాయంత్రం ఫోన్లు చేసి ఊదరగొట్టారు. . ఊళ్ళోనే 2 కి మీ దూరం లో ఉండే అమ్మమ్మ అమ్మకి సపోర్ట్ గా వచ్చేసింది. పెద్దమ్మ కుటుంబం ఇంచుమించు ఇంట్లోనే ఉంటున్నట్టు లెక్క.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇల్లు కళ కళలాడిపోయింది. వంటలు,వార్పులు, ఆ రిపోర్టుల  గురించి గంటల కొద్దీ చర్చలు, జోకులు.. వేళాకోళాలు. అదేదో పెళ్ళి సందడి లాగా.. మేము 'కాస్త గుమ్మడి లా దుఖం గా మొహం పెట్టి శాలువా కప్పుకుని గడ్డం పెంచుకోండీ 'శూన్యం లోకి చూస్తూ, నిట్టూరుస్తూ, జీవితం నీటి బుడగలాంటిది ' అని కాస్త బరువైన డైలాగులు చెప్పండి అని మేము ఆయన్ని ఆట పట్టించాము. ఆయన అంత సరదాగానూ తీసుకుని,.. ఇంకొంచెం కూర వేసుకోమ్మా.. లేకపోతే.. నా ఈ చిన్ని హృదయం, సన్నని రక్తనాళాలూ తట్టుకోలేవమ్మా...తట్టుకోలేవు .. ' అని సినీ ఫక్కీ లో డైలాగులు కొట్టారు.

పరీక్షల ముందు రోజు దాకా పుస్తకాలు దులపనట్టు గా, రెండేళ్ళ క్రితం కొన్న షుగర్ టెస్ట్ మెషిను అట్టపెట్టె లోంచి తీసి మాన్యువల్స్ చదవటం మొదలు పెట్టాం. మా పిన్ని కూతురు తెచ్చిపెట్టిన బీపీ మిషను ఒకళ్ళం తెరిచాం.

ఒక్కసారి గా, అన్నం,పప్పూ, ఎఱ్ఱావకాయా, కమ్మని నెయ్యీ, మెంతికారం, బెల్లం వేసి చేసిన చిక్కని పులుసు కూరలూ, మజ్జిగ పులుసులూ, జీలకర్ర కారం వేసిన గుత్తి కూరలూ, చెవులూరించే రోటి పచ్చళ్ళూ, చల్ల మెరపకాయలూ, గుమ్మడి వడియాలూ, అప్పడాలూ,  ఆవపెట్టిన పెరుగు పచ్చళ్ళూ, ముద్ద కూరలూ, , ఎఱ్ఱ గా వేయించిన వేపుళ్ళకూ ఆయన పళ్ళెం లో స్థానం లేకుండా పోయి, , ఒక్కసారి గా  75 గ్రాముల ముడి బియ్యం తో చేసిన అన్నం, ఆవిరిపై ఉడికించిన ఉపూ వేయని కూరలూ, చక్కెర లేని తేనీరూ, మీగడ తీసిన మజ్జిగా,  అవీ లిమిటెడ్ గా...

తెనాలి రామలింగడు ప్రూవ్ చేసినట్టు అందరం, మా మిడి మిడి జ్ఞానాన్ని ప్రదర్శించి ఏవి తినవచ్చో, తినకూడదో,.. గూగుల్ నుండి, మా స్నేహితుల ద్వారా నేర్చుకున్న విషయాలతో ఉక్కిరి బిక్కిరి చేశాం.

ఇది చాలదన్నట్టు మాకు తెలిసిన వారికెన్ని హార్ట్ బ్లాకులు ఎంత శాతం పూడుకుపోయాయో, వారే జాగ్రత్తలు తీసుకుంటున్నారో, వర్ణించి వర్ణించి.. వదిలిపెట్టాం. పనిలో పనిగా.. అమ్మమ్మగారు ముగ్గురు నలుగురు దేవుళ్ళకి మొక్కేసుకున్నారు.

          మా నాన్నగారు అటక మీదనుంచి ఎప్పుడో కొన్న పుస్తకాలు వెలికి తీయించారు. 'హార్ట్ ఎటాక్, రక్త పీడనం, చక్కెర వ్యాధీ లాంటి టైటిళ్ళు. ఈ పుస్తక పఠనం వల్ల ఇంకా కొత్త కొత్త అనుమానాలొచ్చాయి ఆయనకి. మచ్చుకి.. 'అవునూ.. ఈ స్ప్రింగుల్లాంటివి రక్త నాళాల్లో అమరిస్తే.. కొన్నాళ్ళకి ఆ స్ప్రింగ్ పక్కనున్న కొవ్వు కరిగితే ఆ స్ప్రింగులు జారి గుండె లోకి జారవు కదా..???', ఆ స్ప్రింగులకి తుప్పు పడితే? స్ప్రింగ్ రక్త పీడనానికి ముక్క విరిగితే?' లాంటివి. ఇక అందరూ ఆయన మీద గంతేసి పుస్తకాలు బయటకి గిరవాటేయించేదాకా శాంతించలేదు..

సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలా? లేక ఆయన దగ్గరే చేయించుకోవాలా అని వాదోపవాదాలు చేసి చేసి ఇక ఓపిక లేక సరే ఈ డాక్టర్ మీదే తల్లిదండ్రులకి గురి కాబట్టి ఆయనతోనే చేయిద్దామని నిర్ణయం చేసుకున్నాం. ఇక మా నాన్నగారు 'నా దగ్గర పైకం ఉంది. ఎవ్వరిమీదా ఆధారపడవలసిన అవసరం లేదు. నేను ఖర్చు పెట్టుకుంటాను ' అనేశారు. 'అదేంటి.. అంటే నేను లేననుకున్నారా? ఇన్స్యూరన్స్ తీసుకున్నది ఎందుకు ?  నా అవసరమే లేదూ అని మీరు తేల్చి చెపితే ఇక నేనెందుకు ఇక్కడ?. రాత్రి బస్సుకి పోతానని తమ్ముడు అలిగాడు. వీళ్ళని చూసి ఎందుకైనా మంచిదని నా ఆఫీస్ ఇన్ష్యూరన్స్ కాగితాలు ఇంక సంచీ లోంచి తీయలేదు.

ఇక నాన్నగారు పదే పదే అదే కథ ని పాల అబ్బాయి దగ్గర్నించీ,  పక్కింటాయన దాకా, చిన్నత్తయ్య ఆడపడచు నుండీ, మా బాబాయి గారి వియ్యకుండిదాకా చెప్పి చెప్పి బుగ్గలు నొప్పెట్టి పడుకున్నారు. 2 లీటర్ల పాలు ఎక్కువ తెప్పించి పరామర్శకి వచ్చిన వాళ్ళకి టీ లూ, కాఫీలూ ఏర్పాటు చేశారు.

ఈలోగా, ఎలాగూ అందరం ఉన్నాం అని మా అమ్మ ఇంటిముందుకొచ్చిన పచ్చి చింతకాయలు తొక్కి కబుర్లాడుతూ పచ్చడి చేసి అందరికీ వాటాలు చేసి కవర్లలో పెట్టింది. కోరుకొండ నుండి మా బావగారి అక్క వస్తూ, అందరికీ అప్పడాలూ, మాంచి ఇంగువ వేసిన అప్పడాల పిండీ భరిణె లో తెచ్చి పెట్టింది.  

 2 లక్షల పైనే ఖర్చు ఉందని తేలింది. రక్తనాళాల్లో వేసే స్టెంట్ అనే పరికరం భారతదేశం లో తయారయ్యిందయితే 87 వేలు, జర్మన్ స్టెంట్ అయితే లక్షా, అమెరికన్ దయితే 1.25 లక్షలూ అని చెపితే.. ఏది బెస్ట్ అయితే అదే వేయమని చెప్పాం.

అన్నిటికన్నా హై లైట్ మా చిన్నత్త రాక. ఆవిడ ఇల్లు కట్టించటం లో బిజీ గా ఉండి ఈ విషయం తెలియలేదట. రాత్రి 10 గంటలకి తెలిసింది..ఎల్లుండి ఆపరేషన్ అని..అంతే.. బస్సెక్కేసింది.  హాండ్ బాగ్ వేలాడేసుకుని వచ్చిన అత్తని చూసి ఆశ్చర్యపోయాం. కాళ్ళకి చెప్పులు లేవు. 'ఏంటత్తా? ' అంటే.. బస్సు లో తెగిపోయింది. మళ్ళీ టైం వేస్ట్ అని వచ్చేశాను. అన్నయ్య ని చూశాక తీరిగ్గా కొనుక్కోవచ్చులే అని.. అంది. నాన్నగారు తను చూడకుండా.. కన్నీళ్ళు తుడుచుకున్నారు.  మద్యాహ్నం భోజనమవుతూనే స్లాబ్ వేయించగానే వచ్చేస్తానని మళ్ళీ బస్సెక్కేసింది.

ముహూర్తం నిర్ణయించుకుని ఆయన్ని ఆసుపత్రి లో చేర్పించేశాము.  ఇంక ఆసుపత్రి లో ఒక్క మనిషి నీ, తిండి పదార్థాలనీ రానీయకుండా సెక్యూరిటీ గార్డులు అడ్డుపడుతున్నా, మేము మాత్రం, మా ఆరేళ్ళ చిన్నమ్మాయి దగ్గర్నించీ, మాగాయ అన్నం బాక్స్ దాకా స్మగుల్ చేసాం.. అదో తుత్తి. 20 నిమిషాల ఆపరేషన్ కి మా చెల్లెలి ఇంటినుండి ఒక టిఫిన్, పెద్దమ్మ గారింటినుండి ఒకటీ..

అంత మంది మధ్య కోలాహలం గా విజయవంతం గా ఇంటికి చేరారు మా నాన్నగారు. కొత్త దుప్పట్లు పరిచి, సాధ్యమైనంత ఆహ్లాదకరం గా గది ని మలిచి, ఒక్కొక్కళ్ళం బయల్దుదేరాం.

ఇదంతా బాగుంది కానీ, మా నాన్నగారి 'టర్న్ ' కోసం ఎదురుచూస్తుంటే ఒకావిడని బయటకి తెచ్చారు. ఆవిడ కి మూడు రక్త నాళాలు బ్లాక్ అవుతే స్టెంటులు వేశారుట. ఆవిడ భర్త, కొడుకూ, కూతురూ ఆత్రం గా, ఆనందం గా ఆవిడ చుట్టూ మూగి .. 'ఎలా ఉంది?' అని అడగ గానే..ఆవిడ కన్నీరు పెట్టుకుని కూతురి చేయి ని ముద్దు పెట్టుకుంది. మేమూ ఆ దృశ్యం చూసి నిట్టూర్చాం.

మర్నాడు ఐ సీ యూ దగ్గర ఆవిడ భర్త చెప్పుకొచ్చారు కథ. ఆయన ఫోర్మన్ గా పదవీ విరమణ చేశారుట. కొడుకు చిన్న దుకాణం పెట్టుకున్నాడు. పెద్దమ్మాయి పెళ్ళి అయింది. చిన్నమ్మాయి డిగ్రీ చదివి ప్రైవేట్ గా చదువుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది ట.

చాలా మామూలు గా ఉన్న కుటుంబం. రెండేళ్ళ క్రితం ఇదే ఆపరేషన్ అయితే ఒకటిన్నర లక్షలయితే, 'ఎంప్లాయీ అసోసియేషన్ ఇన్ష్యూరన్స్'  వల్ల సులభం గా జరిగిపోయిందిట. తర్వాత బైపాస్ చేయించాల్సి వస్తే.. ఇంకో లక్ష పైగా ఖర్చయితే.. రిటైర్ అయిన ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయీ బెనిఫిట్స్ ద్వారా రియెంబ్రన్స్ అయి గట్టెక్కారట.  కానీ అది ఫెయిల్ అయి ఆరు నెలలు తిరగ కుండానే, తీవ్రమైన ఆయాసం, అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి లో ఉన్నారట ఆవిడ. కోడలు డాక్టర్ దగ్గరకెళ్ళి తీరాల్సిందేనని పట్టుపడితే. 'ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే ఒట్టే' అని ఆపారట.

అమ్మాయి హైదరాబాద్ లో ఏవో పోటీ పరీక్షలకోసం చదువుతూ, అక్క ఇంట్లో ఉందిట.  ఇంటి మీద గాలి మళ్ళి ఊరికి వచ్చిన అమ్మాయి, తల్లి పరిస్థితి చూసి తండ్రినీ, మిగిలిన వారినీ కేకలేసి, హైదరాబాద్ కి బయలు దేరదీసిందిట.

'నాకేమీ లేదు.. నీకు పిచ్చి ' అని కూతురి మీద అరిచి యాగీ చేసినా వినిపించుకోకుండా తెచ్చి చూపిస్తే.. కార్డియాలగిస్ట్,.. తెర వెనకకి కూతురినీ, భర్తనీ వెళ్ళమని,..' 'అమ్మా.. నీకేంటి ప్రాబ్లం.. చెప్పు.. మందులతో తగ్గించి, ఎక్కువ ఖర్చు కాకుండా చేస్తాను..' అని నెమ్మదిగా అడగగానే.. 'భరిచలేని నొప్పి, ఆయాసం డాక్టర్ గారూ, నాకు విషం ఇవ్వండి.. కానీ.. పెద్ద ఖర్చున్న ఆపరేషన్లు చెప్పవద్దు. బిడ్డకు పెళ్ళి కాలా..' అన్నారుట.

మూడు బ్లాకులున్నాయని, 3 స్టెంటులకి జర్మన్ వైతే ఐదున్నర లక్షలవుతుందని, మన దేశపు స్టెంటులేయిస్తే,.. 3 లక్షల చిల్లర తో తేలిపోవచ్చని చెప్పారుట.

భారతీయ టెక్నాలజీ తో తయారు చేసిన స్టెంట్ (మాజీ రాష్ట్రపతి కలాం గారు, సోమరాజు గారి ఐడియా ద్వారా చేశారని విన్నాను) వాడితే 2 లక్షలైనా మిగిలేది కదా.. కానీ.. ఏమో ఏమవుతుందో అన్న భయంతో వారి కుటుంబం జర్మన్ టెక్నాలజీ కే మొగ్గిందట.

ఆ అమ్మాయి కోసం దాచిన ఆరు లక్షల ఫిక్స్ డ్ డిపాసిట్ ముట్టటానికి వీల్లేదని ఆవిడ మళ్ళీ వొట్టు ! రెండు లక్షలకి ఇన్ష్యూరన్స్ ఉంది కాబట్టి ఒక్కటే బ్లాక్ తీయించుకుంటానని పేచీ.. పాపం ఆ తల్లి వ్యథ అర్థమయినా,.. అమ్మాయి మాత్రం తండ్రి సహకారం తో,.. ఎఫ్ డీ ల సెక్యూరిటీ తో 2.5 లక్షల లోన్ బాంక్ ద్వారా తీసుకుని, తల్లికి 1.5 లక్షల లో అయిపోతుందని చెప్పి ఆసుపత్రి లో చేర్పించారట.

ఆ అమ్మాయి కూడా .. 'మాది ఎంత అదృష్టమండీ .. మా అమ్మ మాకు దక్కింది.  
అమ్మకి ఆపరేషన్ చేయించకుండా దాచిన డబ్బుతో పెళ్ళి చేసుకుని సుఖపడతానా నేను? వీళ్ళ చాదస్తం గాని? నా ఎం బీ యే అయిపోతుంది 3 నెలల్లో.. జూనియర్ అకౌంటంట్ ప్రవేశపరీక్ష రాసాను. 2 మార్కుల్లో పోయింది. మళ్ళీ రాస్తా .. మా నాన్నగారు 1.5 లక్షలు తెస్తున్నారు ఫ్రెండ్ దగ్గర్నించి.. మంచి ఉద్యోగం రావడమేమిటి..తీర్చేస్తాను..' అంది. ఆ అమ్మాయి కళ్ళు ఆత్మవిశ్వాసం తో కళ కళ లాడిపోతున్నాయి.  నా కళ్ళు తెలియని భావం తో మసకబారాయి. ఈ అమ్మాయే ఈ నాటి యువత కి ప్రతీక అనుకున్నాను. ఆసుపత్రి నుండి వచ్చే ముందు ఆ తల్లిదండ్రులకి అభినందనలు చెప్పి సెలవు తీసుకుని వచ్చాము.


కానీ,.. మనసులో ముల్లు మాత్రం నాటుకుపోయింది. మనకి ఒక ఫోరం / సంస్థ  కావాలి...  మన దేశపు పరికరాల నాణ్యత వివరాలు, అపోహలు లేకుండా, కమర్షియల్ వాసన లేకుండా..  ఇలాంటిది ఉందా? మన మీడియా లో ఈ వివరాల ప్రచారం విస్త్రుతం గా జరగాలి. సామాన్య ప్రజల అపోహలు తొలగించేలా..


ఏదో అవసరానికి అప్పులపాలయినా అర్థం ఉంది కానీ, ఇలాగ అపోహల కోసం ఖర్చు చేయగలగటం ఎంతవరకూ సబబు?

మా అమ్మాయి వాక్సినేషన్ కి వెళ్ళినప్పుడు కూడా, అమెరికన్ ది కావాలంటే 1700 రూపాయలు, ఇండియన్ ది అయితే 150 అంది. అమెరికన్ ది అయితే నొప్పి తక్కువ, జ్వరం రాదు అంటే.. మాతో సహా, చంటిపిల్లలకి నొప్పి,జ్వరం ఎందుకొచ్చిన ఇబ్బంది అని అమెరికన్ దే వేయించాము.


మొన్నీ మధ్య కంటి సర్జరీలకీ ఇదే పోకడ విన్నాను. ఇండియన్ పరికరాలతో అయితే.. ఒక ధరా, అమెరికన్ అయితే ఇంకో ధరా, ఇంగ్లిష్ వాళ్ళవయితే వేరొకటీ..  'కన్ను' అనగానే.. మనకీ భయమే కదా.. ఇండియన్ వి అయితే గొడ్డలి పాటి మందం తో ఉంటాయేమో, అమెరికన్ వి సన్నగా, నాణ్యతతో ఉంటాయేమో నని...

డాక్టర్లు కూడా ఇలాంటి చాయిస్ ఇవ్వటం వల్ల.. ఎదురైన పరిస్థితి ఇది ఏమో?..  పర్వాలేదు తక్కువ రకం వేయమని ఎవరు చెప్పగలరు?
 
;