Wednesday, July 11, 2012 45 comments

సీతారాముడు బెంగుళూరొచ్చాడు - ఉపోద్ఘాతం.


(By Vishnupriya)
“ఓ పని చేయి మామయ్యా! వాడిని బెంగుళూరు బస్సెక్కించెయ్! ఓ పది రోజులు చూస్తాను, నాకు తోచినది నేర్పిస్తాను… కొద్దిగా ఒక దిశా నిర్దేశం చేసేందుకు నాకు కాస్త అవకాశం దొరుకుతుంది..” అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

సీతారాం మా చుట్టాలబ్బాయి. వాళ్ల నాన్నగారు మా నాన్నగారికి ఆప్తులు. కాకపోతే రాకపోకలు తగ్గి నాకు ఆ కుటుంబం లో పిల్లల తో పరిచయం తక్కువే. బొత్తి గా పల్లెటూరు, ఓ ఎకరం కాస్త అమ్మి మరీ, ఒక మాదిరి పట్టణం లో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ ల్లో, ఒకానొక కాలేజీ నుండి తన కొడుక్కి మా మామయ్య బీ టెక్ పట్టా తెప్పించగలిగాడు. పిల్లవాడు చాలా ‘బుద్ధిమంతుడు’ అని చుట్టాల్లో పేరు. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాడు. వాళ్లింట్లో అతనే మొదటి ఇంజనీరు. చిన్న సిటీ లో, చిన్న కాలేజీ లో చదువుకోవటం తో, పెద్దగా కాంపస్ ఇంటర్వ్యూలు జరగలేదు. జరిగిన వాటిలో వాళ్లబ్బాయి వ్రాత పరీక్ష లో ఉత్తీర్ణుడయినా, గ్రూప్ డిస్కషన్ల లో వెనకంజ వేశాడు అని తండ్రి చెప్పాడు.

“అమ్మా! కృష్ణా! నువ్వే కాస్త వాడికి ఒక దారి చూపించాలి. మీ కంపెనీ లోనో, తెలిసిన వారి దగ్గరో, ఒక ఉద్యోగం ఇప్పించు!” అని పదే పదే చెప్పటం తో, నేను కూడా చేతనైనంత సహాయం చేద్దాం.. అని నిశ్చయం చేసుకున్నాను. నాకూ, నాకు తెలిసిన వారికి చాలా మందికి కాంపస్ సెలక్షన్లలో ఉద్యోగం దొరికేయటం తో, కొత్తగా పాస్ అయిన వారు ఉద్యోగాల కోసం ఎలాగ ప్రయత్నిస్తారో నాకు అస్సలూ ఐడియా లేదు. నాకు తెలిసిన వాళ్లకి కాస్త చెప్పి 2012 లో పాస్ అయిన ఇంజనీర్లు అసలు అవకాశాల కోసం ఎలాగ ప్రయత్నించాలో తెలుసుకోవటం మొదలు పెట్టా.

పది మందికీ విషయం చెప్పటం తో, వంద రకాల సలహాలు రావటం మొదలు పెట్టాయి. నాకూ తల తిరిగిపోయింది. మంచి కాలేజీల్లో చదివి కొద్దిగా ‘స్మార్ట్’ గా ఉన్న పిల్లలకి ఎలాగూ అవకాశాలున్నాయి. B గ్రేడ్ టౌన్లల్లోని అరగొర సదుపాయాలున్న ఇంజనీరింగ్ కాలేజీ ల్లోంచి వచ్చిన పిల్లలకి మొదటి సాఫ్ట్వేర్ (మంచి) ఉద్యోగం సాధించటం దాదాపు తెలుగు సినిమాల్లో హీరో/హీరోయిన్ వేషం సాధించటమంత కష్టతరవిషయం అని. ఆంగ్లం లో గడగడా మాట్లాడగలగాలి, సబ్జెక్టుల్లో ఎలాగూ దిట్టలై ఉండాలి, వాళ్ల సబ్జెక్టులేకాక, కంప్యూటర్ల లో కొత్త విషయాల్లో ప్రవేశం ఉండాలి. అంతే కాక, కనపడిన ప్రతి వాక్ ఇన్ కీ పరిగెత్తాలి, అనుభవం లేదు కాబట్టి నామ మాత్రపు జీతాలకి పని చేయటానికి రెడీ గా ఉండాలి, ఒక్కోసారి ఎదురిచ్చి కూడా పని చేయటానికి కూడా సిద్ధం గా ఉండాలి, చిట్టెలుకంత చురుకు గా తిరగాలి, చిరుతంత వేగం గా ఉండాలి, చీమలు బెల్లం ఎక్కడ దాచినా వాసన పసి గట్టినట్టు, సిటీ లో అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలమీదా ఓ కన్నేసి ఉంచి అన్నింటిలోకీ ఒక రాయేసి చూడగలగాలి.. అన్నింటికీ మించి ‘మీ వాడికి ఇంకా ఉద్యోగం రాలేదా? పాపం! మా వాడికి ఫలానా కంపెనీ వాళ్లు ఆరు లక్షల పాకేజీ ఇస్తున్నారు, వేరేవాళ్లు తొమ్మిది ఇస్తున్నారు కానీ, బొంబాయి కి వెళ్లాలట.. ఎందుకూ, ఉన్నఊళ్లో కళ్ళ ఎదురు గా ఉండి ఆరు కి కాంప్రమైజ్ అవమని అడుగుతున్నాం.. ‘ అని సాటి వారు చెప్పే సోది విని నిర్వికారం గా ఉండగలగాలి!

మన వాడికి విషయ జ్ఞానం ఎలాగుంది? వాడి ఆంగ్లం పరవాలేదా? చురుకు గా ఉంటాడా? చెప్పింది చెప్పినట్టు అల్లుకుపోగలడా? ఇలాంటి ప్రశ్నలతో నాకు ఉక్కిరి బిక్కిరి అయినట్లయింది. ఈలోగా ఊరి నుండి ఫోన్ల మీద ఫోన్లు. ‘ఏమైంది ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయి? ‘ అంటూ. మా మామయ్య స్వాతి ముత్యం లో కమల్ హాసన్ లా రోజూ నన్ను అడగటమేకాక సీతా రాం చేత కూడా ఫోన్లు చేయించాడు. నా ఫోన్ పండగ పూట కోవెల్లో గంట లా గణగణ లాడుతూనే ఉంది.

ఓ నెల పాటూ ఫోన్ల ద్వారా సంభాషణలు మామయ్య తో అయ్యాకా, కొద్దిగా నాకు విషయం అర్థమవటం మొదలైంది. మా మామయ్యకి తానొక ‘అపర ఐన్ స్టీన్ కి తండ్రంత వాడినని గట్టి నమ్మకం! ‘అబ్బాయి ఇంజనీరయ్యాడు..’ అనగానే వరసగా క్యూలు కట్టి అందరూ వెనక వెనక పడి ‘మా కంపెనీ లో చేరు.. లక్షిస్తాం’ అంటే.. మా కంపెనీ లో రెండు లక్షలిస్తాం..’ అంటూ వేలం పాటలా పైకి తీసుకెళ్లి ‘అమెరికా వెళ్తావా! ఆస్ట్రేలియా కెడతావా?’ అని బ్రతిమాలుతూ, పాత సినిమాల్లో నాగేశ్వరరావు ని అడిగినట్టు.. ‘ ‘మీరు మీ తెలివి పెట్టుబడి పెట్టండి.. మేము డబ్బు పెడతాం..‘ అంటూ ఆఫర్లు ఇచ్చే పారిశ్రామికవేత్తలూ, .. గ్రూప్ డిస్కషన్ లో నోరు పెగలక పోతే, “భాష కాదు! భావం ముఖ్యం.. మిమ్మల్ని ఇంగ్లిష్ లో మాత్రమే మాట్లాడమని ఎవరన్నారు? తెలుగు లో మాట్లాడండి! ” అని అదో టైప్ సీరియస్ ఎక్స్ ప్రేషన్లు ఇచ్చి ప్రోత్సహించే ‘త్రిష’ ల్లాంటి ఎగ్జెగ్యూటివ్ లూ.. అబ్బో.. మా మామయ్య గారికి చాలానే భ్రమలు ఉన్నాయి అని అర్థమైంది.

“మామయ్యా! ఓ సారి వాడికి ఫోన్ ఇయ్యి... మాట్లాడతాను” అన్నాను. ‘ సీతారాముడు పూజ లో ఉన్నాడు.. ఇప్పుడు మాట్లాడలేడు. ఓ ఇరవై నిమిషాలాగి చేస్తాడు.. ‘ ఇరవై నిమిషాల పూజా! ఏదైనా పండగా! ఏంటి? మరీ పండగలూ, పబ్బాలూ పట్టించుకోని మెకానికల్ బతుకైపోయింది బొత్తి గా.. :- ( అనుకుంటూ, ‘అబ్బో.. ఏంటి స్పెషల్ ఈరోజు? ‘ కొద్దిగా గిల్ట్ నిండిన గొంతు తో అడిగాను. మామయ్య ‘లేదమ్మా! ప్రతి రోజూ రెండు పూటలా తలస్నానం చేసి సంధ్యావందనం, పారాయణం వంటివి అన్నీ చేసుకోవటం వాడి దినచర్య లో భాగం.. అన్నట్టు మా వాడు తిరుచూర్ణం, తిరువణిక్కాపు తో నామం పెట్టుకుంటాడు.. మరి ఉద్యోగాలకి ప్రయత్నిస్తున్నప్పుడు అదొక అడ్డంకి కాదు కాదు కదా? ‘ అని ఒకింత అమాయకం గా అడిగాడు..

నాకెందుకో ఒక్కసారి గా జాలి, నవ్వూ, వీడికి ఒక మంచి ఉద్యోగం ఎలాగైనా సంపాదించుకునేలా చేసి తీరాలనే పట్టుదలా కలగా పులగం గా తలకెక్కేసాయి. దాని ఫలితమే ఈ ఫోన్ కాల్...

(సశేషం)


 
;