Sunday, September 19, 2010 52 comments

ఓ పనైపోయింది బాబూ..




రోజూ మా కాంప్లెక్స్ లో సాయంత్రం వీధంతా పిల్లలు పరుగెడుతూ, లేక సైకెళ్ళమీదా, స్కూటర్ల మీదా, స్కేట్స్ మీదా .. తూనీగల్లా తిరుగుతూ.. అరుస్తూ, గొడవ పడుతూ, .. కొంతమంది బాడ్మింటనో, హూలా హూపో ఆడుతూ, కనిపిస్తూ ఉంటారు.. ఇక రాత్రి అన్నం తిన్నాక నడుస్తుంటే.. టీవీల్లోంచి వాణిజ్య ప్రకటనల గోల, పాటలూ, చప్పట్లూ, టీ వీ పాత్రల ఏడుపులూ,  చంటిపిల్లలున్న ఇళ్ళల్లో వాళ్ళ ఏడుపులూ.. అలసట పడి ఆఫీసులనుండి వచ్చిన జంటలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటం, సన్న సన్న గా వినిపిస్తూ ఉండటం కద్దు.



                                 కానీ గత 15 రోజులుగా.. ఎవరో ఒకరిద్దరు, మొహాలు వేలాడేసుకుని.. విరక్తి గా రోడ్లమీద పిల్లలు కనిపిస్తున్నారు. రాత్రిళ్ళు 12 అయినా లైట్లు కనిపిస్తున్నాయి, చడీ చప్పుడూ లేదు..  మా పక్కింట్లోకి అమెరికా నుండి 3 నెలలక్రిందటే వచ్చి సెటిల్ అయ్యారు భార్యా భర్తలు.. వాళ్ళకి అర్థం కాలేదు. అదేదో సినిమాలోలాగా.. 'ఏం జరుగుతోందిక్కడ? నాకు తెలియాలి తెలిసి తీరాలి..' అని  వాళ్ళు వాపోతూ ఇంటి బయట నుంచున్నారు. నేనేదో.. ఇంట్లో వాళ్ళకి డిస్టర్బన్స్ లేకుండా మాట్లాడదామని బయటకొచ్చి మాట్లాడుతున్నాను అఫీస్ కాల్ లో.

              నేను 'Bye' అని చెప్పటమేమిటి.. ఆత్రం గా అడిగారు..నేనూ సీరియస్ గా..  మీకు తెలియదా? ఫత్వా జారీ చేసారు. ఈ కాంప్లెక్స్ లో పిల్లలకి ఘోషా.. ఈ నెలంతా... ' అన్నాను. కంఫ్యూజ్ డ్  గా ఉన్న వాళ్ళ మొహాలు చూసి.. పోన్లే అని 'త్రైమాసిక పరీక్షలండీ బాబూ..' అనగానే.. వాళ్ళూ 'వార్నీ' అనేసుకుని.. నేటి చదువు తీరూ, పిల్లలమీద పెరిగిన ఒత్తిడీ, మారుతున్న మానవ విలువలూ, మా కాలం లో ఎలా ఆడుతూ, పాడుతూ చదివేవాళ్ళమో కూలంకషం గా చర్చించి, 'ప్చ్చ్..' అని దీర్ఘం గా నిట్టూర్చి.. లోపలకెళ్ళిపోయారు.



ఈ చర్చ లో కొట్టుకుపోయిన నేను హడావిడి గా లోపలకొస్తూ ఎందుకైనా మంచిదని కిటికీ లోంచి తొంగి చూస్తే.. మా పెద్దది.. టింకిల్ చదివేస్తోంది.. చిన్నదేమో.. మ్యూట్ లో పెట్టి టీ వీ లో ఏదో చూస్తోంది.. నేను చిన్నగా దగ్గేసరికి చటుక్కున.. పుస్తకాలు తీసి నటన లో జీవించటం మొదలు పెట్టేసారు.



పోన్లే అని గమనించనట్టు 'ఊ ఊ ఎంత వరకూ వచ్చింది అని..మళ్ళీ వాళ్ళ చదువులో కూరుకుపోయాను.  అంత  గా కనీసం ఒక దగ్గర కూర్చోవటానికీ ఒక కారణం ఉంది. ఇద్దరికీ అప్పుడే హిందీ మార్కులిచ్చేశారు. స్పీడ్ యుగం కదా.. టీచర్లూ యమా స్పీడ్.  మా పెద్దమ్మాయి కి 14/20 వచ్చాయి. లెక్క ఎక్కడ తప్పిందో.. తవ్వి, ఏవిధం గా ఇలాంటి తప్పులు చేయకుండా ఉండవచ్చో చెప్దామని పెద్ద లెక్చర్ తయారు చేసుకుంటే.. దాని పేపర్ చూడగానే నవ్వు ఆపుకోలేకపోయాం. 'చందా కే ఊపర్ లోగ్ క్యో నహీ రహ్సక్ తే? ' అన్న ప్రశ్న కి.. 'చందా పే ..' అన్న దాకా రాశాక 'హవా' అన్న పదం గుర్తు రాలేదట. అందుకని ఆలోచించి చించి.. సాధారణంగా తెలుగు కి దగ్గర్లోనే ఉంటాయిగా హిందీ పదాలూ అని.. 'చందా పే గాలీ నహీ రహ్తా' అని రాసేసిందిట. 

           వాలి మహారాజు దీ తీరయితే ఇక సుగ్రీవుల వారి పని చెప్పేదేముంది? స్త్రీ లింగం, పుం లింగం రాయడంలో 'దాదా దాదీ, మామా, మామీ, నానా, నానీ రాసాక, పితా కీ అదే లాజిక్ వాడేసరికి .. దాని టీచర్ ఎర్ర ఇంక్ తో పెద్ద మార్క్ పెట్టి మార్కులు కట్ చేసి పడేసింది :-) 




మొన్నేమో సైన్స్ అయ్యింది. మా పెద్దది నెయ్యీ, చీజూ దేనితో తయారు చేస్తారు అంటే, ఆవు తో అని రాసి వచ్చిందిట! అదేమంటే.. ఆవు లోంచే కదా పాలు వచ్చేదీ.. అని సాగదీసింది. అమ్మ నుంచి ఇడ్లీస్ వస్తాయి అన్నట్టుంది అంటే..  అర్థమయీ అవనట్టు గా తలాడించి ఊరుకుంది.



చిన్నదేమో ఇంటికి వచ్చాక హాయిగా అవీ,ఇవీ తిని ఊరెంబడా తిరిగి ఇంక ఇంటికి వచ్చేవేళకి కాలనీ లాన్ లో బెంచీ మీద నేను చూసేలా ఏడుస్తూ కూర్చుంది. 'అయ్యో పాపం.. అనుకుని కంగారు కంగారు గా పరిగెట్టి వెళ్ళి చూస్తే ఏముంది..'నేను అస్సలూ ఇంటెలిజెంట్ కాదు. అక్కకే అన్నీ మంచి మార్కులు వస్తాయి.. నేను వేస్ట్!' అని మనీషా కోయిరాలా లా జలజలా కన్నీళ్ళు  కార్చింది.


                     తరచి తరచి అడగగా..చెప్పింది పదికి ఒక్క మార్క్ వచ్చిందిట!!! పైగా.. 'ఏం చెప్పనమ్మా.. సైన్స్ లో మనిషికి 'గాలీ, నీరూ,ఆహారం అవసరాలని చెప్తారు. అదే ఎన్విరాన్మెంటల్  స్టడీస్ లో తిండీ, బట్టా, ఇల్లూ ' అని అంటారు. నేను 'కంఫూజ్ అయిపోతున్నాను.. అని బొట బొటా కన్నీరు కారిస్తే.. అసలే తల్లి హృదయం కదా.. 2946 ముక్కలయింది. పర్వాలేదమ్మా.. సున్నా వచ్చినా నేనేమీ అనను.. విషయ జ్ఞానం రావాలి కానీ..అన్న ధోరణి లో నానా విధాలు గా ఓదార్చి..
                           
                                       ఇంట్లోకి తెచ్చి పడుకొమ్మని కిందకి వచ్చాను తోడు పెట్టటం మరిచిపోయానని.. పైకెళ్ళేటప్పటికి అక్క తో చెప్తోంది..'చూశావా? నీకు పది కి తొమ్మిది మార్కులొచ్చినా ఆ ఒక్క మార్కూ ఎక్కడ పోయిందీ అని గొడవ చేస్తుంది అమ్మ.. 'నాకు సున్నా వచ్చినా ఏమీ అనదటా కాస్త తెలివి గా ఉండాలి అని అక్కకే పాఠాలు చెప్తోంది... ఇక దాని వెనక పరిగెత్తి ఒక్కటిచ్చుకునేంత వరకూ ఆవేశం చల్లారలేదు.
                              
                 కాలనీ ఆడవాళ్ళందరం తాత్కాలికం గా మిగతా టాపిక్ లకి సెలవిచ్చి, పిల్లల పరీక్షల గురించీ, వాళ్ళ మొండి దనం గురించీ, తండ్రులెవ్వరూ అస్సలూ పట్టించుకోకపోవటం గురించీ, మూడో క్లాస్ లో 95 దాటలేదు సొషల్లో.. ఇలాగయితో రేప్పొద్దున్న ఐ ఐ టీ ల్లో సీట్లెలా వస్తాయి అనీ.. ఆక్రోశం పంచుకుని ఈ మధ్య చున్నీలూ, కొంగులూ లేకపోవటం వల్ల కనీసం వట్టి చేతులతోనో, కర్చీఫ్ లతో కన్నీళ్ళొత్తుకున్నాం.


ఊళ్ళో పిల్లలలని చూస్తే మా పిల్లలే నయం అనిపించింది మాకు రెండిళ్ళవతలావిడ విషయం వింటే.. వాళ్ళ చిన్నోడు కడుపు నొప్పి అని గిల గిలా తన్నుకుంటే భయమేసి  డాక్టర్ దగ్గరకి వెళ్తే  ఆవిడ ఇంజెక్షన్ భయం చూపించేసరికి 'లేదు లేదూ అని వెల్లడించిన విషయమేమిటంటే..

                  వాళ్ళ పదేళ్ళ పెద్దబాబు, చిన్నవాడికి ' వీ వీడియో గేం' వరస గా  వారం రోజులు ఆడుకోనిస్తానని లంచం చూపి అమ్మ ని ఏదో విధం గా 'ఎంగేజ్' చేయి. ఈలోపల నేను కాస్త రిలాక్స్ అవుతా.. అన్నాడట!!


మా పెద్దమ్మాయి ఒక ప్రశ్న చదవాలంటే ఆవిడ గారికి మేము ఆలుగడ్డ తప్ప వేరే కూర చేయట్లేదు. నూడుల్స్, పాస్తా, మైసూర్ పాక్, పిజ్జా, జంతికలు, ఇలాగ ఆవిడ అడగటం ఆలస్యం లక్ష్మీ దేవి చుట్టూ, ప్రసాదాలు చేర్చి పూజ చేసినంత ఘనం గా నా నా రకాల ధూప,దీప నైవేద్యాలతో, స్తోత్ర పఠనం చేసి ఆవిడ అనుగ్రహం క్లాస్ పుస్తకాలమీద కలిగేట్టు చూసుకుంటున్నాము.
                                 దీనికి తోడు, లెక్కలంటేనే ఎలర్జీ అయిన ఆవిడాయె, దీన్ని ఏం చేయాలి అని వాపోతుండగా.. ఠక్కున ఐడియా వచ్చింది. దానికి పాటల పిచ్చి ఉంది. దాని లెక్క తప్పయితే నాకిష్టమైన పాటలు, లేక పోతే దానికిష్టమైన పాటలు అని.. ఆరోజు బోల్డు తెలుగు పాటలు వింది..బానే ఉంది. కాకపోతే ఇప్పుడు తెలుగు పాటలు తెగ నచ్చి..తప్పులు చేసినా పర్వాలేదనుకుంటోందనుకోండి.. వేరే మెథడ్లు వెతకాలి ఇంక. 

చిన్న రాకుమారి గారికి పరీక్షలకి తయారవటం అంటే పది పెన్సిళ్ళు చెక్కి పెట్టుకుని 2 ఎరేజర్లు, 2 షార్పెనర్లు బాక్స్ లో పెట్టుకోవటమే.. అంతకు మించి కష్టపడటం దానికి ఇష్టం ఉండదు.   దాని క్లాస్ మేట్లంతా ఒకటో క్లాస్ కే..రాత్రి 11 దాకా చదివి, మళ్ళీ ఉదయం 5.30 నుండీ మళ్ళీ పునశ్చరణ చేసుకుని, బస్ స్టాండ్ లో కూడా తల్లులు నెమరు వేయిస్తుంటే.. ఇది చిద్విలాసం గా తిరుగుతూ ఉంటుంది.
                                
దాని జీ కే జ్ఞానం చూస్తే..కళ్ళు తిరుగుతాయి ఎంతటివాళ్ళకయినా.. ఆఖరి పరీక్ష.. జనరల్ నాలెడ్జ్ పుస్తకం తేవే అంటే.. అలాంటి సబ్జెక్టే లేదు పొమ్మంది.. 'అదే జీ కే ' అంటే ..ఓహో అదా అంది.  పుస్తకం తెరిస్తే.. ఒక చాప్టర్ అంతా వంశ వృక్షం!!! కపూర్ ఖాందాన్ . రణబీర్ కపూర్ అక్కలెవరు? కరీనా చిన్న తాతగారి పెళ్ళాం ఎవరు లాంటి వెధవ ప్రశ్నలు! 
                                           చదువుకి కూర్చొమ్మంటే.. పుస్తకం తేవటానికి అరగంటా, పెన్సిల్ కీ, మిగతావాటికీ ఒక్కొక్క దానికీ అరగంటా.. చేసి పైగా మొదటి ప్రశ్న లోనే నీళ్ళకీ, బాత్రూం కీ, 4-5 బ్రేక్ లూ, అదేంటో ఎప్పుడు ఫోన్ తీయమన్నా కాలింగ్ బెల్ కొట్టారు చూడమన్నా..విసుక్కుంటూ, కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళే పిల్లలు పరీక్షలప్పుడు మాత్రం పరుగు పరుగున 2 సెకండ్లలో అటెండ్ చేస్తారు.. అందరిళ్ళల్లో ఇంతేట. అంజూ జార్జ్ లు పనికి రారట. కేబుల్ కట్ చేస్తే దూర్ దర్శన్ లో హిందీ వార్తలు కూడా తన్మయత్వం గా చూస్తున్నారు.


                            ఈ హడావిడి చూసి ఐ ఐ టీ ప్రవేశ పరీక్ష కి చదువుతున్న పక్క అబ్బాయికి ఒకటే నవ్వు. ఇప్పుడే కేబుల్ తీయిస్తే.. ఇంటర్ కొచ్చాక ఇంకేం ఉంటాయి తీయించి  పడేయటానికి అని..  మా ఎదురింట్లో పిల్లకి పాపం బోల్డు ఒత్తిడి. దాని ఖర్మ కాలి దాని కజిన్లందరూ దాని కన్నా కనీసం 10 యేళ్ళు పెద్ద. అంతా పెద్ద పెద్ద చదువుల్లో సీట్లు సంపాదించారు. ఇక వాళ్ళమ్మ దెబ్బలూ, ఈ పిల్ల అరుపులూ వినిపిస్తూనే ఉంటాయి.  వారం క్రితం వాళ్ళమ్మా వాళ్ళూ ముందెళ్ళిపోయారని.. పిల్లలతో  ఆఖరి సారి చదివిస్తుంటే వచ్చింది, స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తూ.  పాలూ, బంగారం చిలికి దానితో చేసిన ఇడ్లీ ల్లంటి బుగ్గల మీద ఎర్ర గా వాత.  కళ్ళల్లో ఎక్కడో దిగులు.
      
ఇక చదివింది చాల్లే అని పిల్లలని మాటల్లో దింపాను. ఆ అమ్మాయి తల్లి పట్ల ద్వేషం పెంచుకుంటుందేమోనని .. మా పిల్లలకి నాలుగు పడ్డాయి ఈ పరీక్షల్లో..  తల్లిదండ్రులు పిల్లల మంచికోసమే కదా.. కొట్టేది... అయినా.. ప్రేమ ఉన్న చోటే దెబ్బ వేయటమూ ఉంటుంది.. అని ఏదో చెప్తుంటే.. ఆ పిల్ల అంది..'యా.. ఐ టూ వాంట్ టు సే.. ఐ లవ్ యూ టూ మామ్మ్మా ' అంది.

ఆ మాట లోతుగా తాకినా.. మంచి జోక్ విన్నట్టు అందరం నవ్వేశాం.. తన తల్లి తో ఎప్పుడో నెమ్మది గా మాట్లాడాలి.. అనుకుంటూ.. నిన్ననే ఆఖరి పరీక్ష..


పాపం పిల్లలకి మళ్ళీ జనవరి దాకా ఊరట. నిన్న చూడాలి వాళ్ళ ఆనందం.. వీధిలోంచే పుస్తకాల బ్యాగులు గిర గిరా తిప్పి విసిరి కొట్టి.. ఎగురుతూ, అరుస్తూ..
ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు కొంతమంది పిల్లలు.. వాళ్ళకీ పరీక్షల గోల ఉండదు కదా అబ్బా.. మీరెంత లక్కీ యో.. అని నేనంటే.. . ఒక అబ్బాయి అన్నాడు.. 'ఆంటీ ఏం లక్కీ.. వీళ్ళకి ఆఖరి పరీక్ష రాసాక వచ్చే ఆనందం మాకేదీ? ' అని :-))

ఏదైతేనేం? ఒక పనైపోయిందండీ.. మళ్ళీ వాకింగ్ కెళ్తే.. రోడ్ మీద పిల్లల గొడవా,..టీవీల్లో సీరియళ్ళ హడావిడీ..

(బొమ్మలన్నీ గూగులమ్మ చలవే..)
 
;