Wednesday, March 30, 2011 28 comments

గేటెడ్ కమ్యూనిటీ కథలు - పండగ భోజనం ఏర్పాట్లు..దీపావళి పండగ.. (ఇదేంట్రా.. బ్రహ్మానందం అదేదో సినిమాలో చేసినట్టు.. హోలీ పండగప్పుడు దీపావళి కథ మొదలెడుతుందీవిడా.. అనుకుంటున్నారా? మనం కాస్త స్లో అన్నమాట!) వాళ్ల వాళ్ల ఇండ్లల్లో  ఏం చేసుకుంటున్నారో తెలియదు కానీ,.. కాలనీ లో మాత్రం  సామూహికంగా ఝం ఝం లాడించేయాలని నిర్ణయం జరిగిపోయింది. కాలనీ కల్చరల్ కమిటీ లో కొత్త గా ఇంట్లోకి దిగిన మాంచి ఉత్సాహమైన అమ్మాయి చేరింది.   పిల్లా, జెల్లా లేరేమో.. సమయం కూడా బాగానే ఉన్నట్టుంది...

ఆ అమ్మాయి ఉత్సాహం చూసి .... మాలాంటి వాళ్ళకీ కాస్త ప్రేరణ కలిగి ప్లానింగ్ మొదలు పెట్టేసాం. నాకు సాధారణం గా అంత టైం/ఇంటరెస్ట్  ఉండటం అరుదు కానీ.. ఒకళ్లు కాస్త ముందుకు రావటం తో.. వెనక ఉండి చేయ గలిగినంత చేయచ్చని.. అదీ గాక మరి ఫస్ట్ లేడీ కదా మరి నాకొక ఇజ్జత్, గట్రా ఉండాలి కదా.. మా వారి ప్రెసిడెంట్ గిరీ లో .. సాంస్కృతపరం గా కూడా పేరు గడించవచ్చు..


ఇంకేం? ఆఫీస్ నుండి వచ్చాక పిల్లలు ఆటలకి బయల్దేరుతూనే. నేనూ కల్చరల్ కమిటీ మీటింగ్ కి వెళ్లాను.. ఇంట్లో అంట్లు తర్వాతైనా తోమచ్చు.. కాలనీ లో కాస్త మంచిపేరు తెచ్చుకుంటే ఎంత డాబు గా ఉంటుంది?  "అబ్బా..కృష్ణ గారు ఎంత ఆక్టివ్.. ఇల్లూ, పిల్లలూ, ఆఫీసూ  మానేజ్ చేసుకుంటూనే.. కాలనీ లో దీపావళి వేడుకలు ఎంత అద్భుతం గా జరిపించారు? " ఆహా.. ఆలోచనల తోనే ఒళ్లు పులకరించిపోయింది..  రాత్రి ఆఫీస్ మీటింగ్ లోపల చేయాల్సిన వంట, తిండి, పిల్లల హోంవర్కూ..మీటింగ్ లో కి కావలసిన నాలుగు స్లైడ్లూ.. అబ్బే... దీపావళి ధమాకా ఆలోచనల వీటో ఓటు ముందు వీగిపోయాయి...


మనం అసలు ఏది మొదలు పెట్టినా , మొదట ప్లాన్ చేసినా తిండేగా? అసలు ఆ మీటింగ్ లోకి ఏం తినాలో కూడా ఫోన్ల ద్వారా తెగ చర్చలు జరిపి.. ఫలితాలు రాక.. కావలసిన వాళ్లు ఎవరి చాయ్/కాఫీ వాళ్లే తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకునేటప్పటికే చావు తప్పి కన్ను  లొట్ట పోయినంత పరిస్థితి.. ఏర్పడింది...అలాంటిది నలభై ఇళ్ల వారు చేరి పండగ భోజనం ఏం తినాలో చర్చించాలంటే ఎంత కాంప్లెక్స్?"పండగ భోజనాల బాధ్యత ఎవరు తీసుకుంటారు? కృష్ణాజీ ఆప్ లేంగే క్యా? " అని అడగ్గానే.. ..రోజంతా ఆఫీస్ లో ఏదో కస్టమర్ ఇష్యూ తో  కొట్టుకోవటం వల్ల ఏర్పడిన మతి భ్రమణమో,  ఏం జన్మలో ఏం పాపం చేసానో..  (అంటే ఈ జన్మ లో చేయలేదని కాదు.. వీటి ఎఫెక్ట్ ఇంకో రెండు మూడు జన్మలదాకా..  రాదని ఒక పిచ్చి నమ్మకం.. అదిచ్చిన ధైర్యం! ) దర్పం గా 'ఓకే' అని తల పైకీ కిందకీ స్టైల్ గా ఊపుతూ చూసాను..అందరివంకా.. కొందరు శ్రేయోభిలాషుల కళ్లల్లో జాలీ,  నేనంటే విసుగు, చిరాకు ల్లాంటి భావాలున్న ఉన్న కొందరి మొహాల్లో.. టీవీ సీరియల్ కారక్టర్ల మొహాల్లో లాంటి వర్ణించలేని ఫీలింగ్ చూసా.. ఎందుకో ఒక్క క్షణం కొద్దిగా గుగుర్పాటు లాంటిది వచ్చింది.. ( రాం గోపాల్ వర్మ షోలే చూసాక వచ్చిన భావం లాంటిది )  కానీ.. 'భోజనాలదేముందీ? నాలుగు హోటళ్లు చూసి ఏదో ఒక దాంట్లో ఆర్డర్ చేసేయటమే.. మనమేమైనా గుండిగలు మోయాలా.  గానుగలు తిప్పాలా? " అని నా ఆలోచనలని తిప్పి కొట్టి.. ఇంటికి నడిచా..


వారాంతం దాకా అసలు పండగ గురించి ఆలోచనలు రాలేదు.. అసలు అలాంటి ఆలోచన వచ్చినట్టు తెలిసినా.. మా బాసాసురుడు ఇంకొంచం పని ఇచ్చి ఆ కొద్ది తీరిక సమయానికీ కూడా పని చెప్పటానికి సిద్ధం గా ఉన్నారాయే...  శుక్రవారం సాయంత్రం కార్ దిగి లోపలకి వస్తుంటే.. పండగ కి ఎంటర్టైన్మెంట్ బాధ్యత తీసుకున్నావిడ హడావిడి గా నలుగురినేసుకుని నడుస్తుండటం కనిపించింది.. పలకరింపుగా నవ్వా..


ఆవిడ అరనిమిషం ఆగి 'హాయి కృష్ణాజీ. ఎలా అవుతోంది మీ ప్రిపరేషన్? రెండు డాన్సులూ, ఒక నాటకం, స్కిట్, బింగో గేం ప్లాన్ చేశా.. సామూహిక పూజా, ముగ్గులూ,.. ఏర్పాటు చేశా.. అలాగే పాటలూ, ఫాషన్ షో కూడా పెడుతున్నా..  హాండీ క్రాఫ్ట్ స్టాల్ లాంటిది కూడా ట్రై చేస్తున్నా!!" అంది.. నా గుండె లో రాయి పడింది. 'వామ్మో.. నేను అసలు పండగ గురించే ఆలోచించలేదు.. చచ్చాన్రా!!! ' అని మనసులో అనుకుని.. పైకి మాత్రం గంభీరం గా.. 'యా.. కన్సిడరింగ్ వేరియస్ ఆప్షన్స్ యూ నో..' అన్నాను.. ఆవిడ ..'ఓకే..' అని వెళ్ళింది..


సరే.. ఇక లాభం లేదని శనివారం మొదలు పెట్టాను నా డిన్నర్ ప్లానింగ్.. మనమే అంతా ఎలా నిర్ణయిస్తాం? కాస్త అందర్నీ కనుక్కుందాం అని రెండో నంబర్ ఆవిడ కి ఫోన్ కొట్టా..  " ప్లేట్ 250 Rs కి తక్కువ అయితే మేము రాము డిన్నర్ కి .. ఆగస్ట్ 15 కి సొసైటీ లో సెలెబ్రేషన్ అప్పుడు మాకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఛీప్ గా పెడితే..మేము రాము..' అంది.   'ఓహ్.. ఖరీదైన ప్లేట్ ఐతే శుచికరం గా ఉంటుందని ఎలా చెప్పగలం? ...' అని ఇంకా ఏదో అంటుండగా ఆవిడ.. 'మా నాన్న గారు  పేద్ద ఆఫీసర్... మాకు చిన్నప్పటి నుంచీ ఖరీదైన జీవితం అలవాటు..' అంది.. 'ఆహా.. చిన్నప్పటి నుండీ స్మార్ట్ గా ఉండంటం లాగా నా? ' అని మనసు లో అనుకుని.. పైకి మాత్రం వెర్రి నవ్వు నవ్వి.. "తర్వాత చెప్తా అప్ డేట్" అని చెప్పి  తర్వాతి నంబర్ తిప్పా.

ఆవిడ.. 'మానేజింగ్ కమిటీ పెట్టుకుంటుందా? మనమే పే చేయాలా? ' అని అడిగింది.. 'మనమే ..' అంటుండగానే.. 'మా చుట్టాలొస్తారు దీపావళి కి.. మేముండము.. ' అని ఆదరా బాదరా గా పెట్టేసింది..  'వార్నీ... అదే సొసైటీ పెడుతుంది ఖర్చు అంటే బంధు మిత్ర సపరివార సమేతం గా  వస్తుందేమో..' అనుకున్నా..


ఎక్కువ మందిని కనుక్కుంటున్న కొద్దీ.. ఒక్కొక్కళ్ళూ వాళ్ల అద్భుతమైన ఆలోచనలతో.. నాకు కళ్ళు తిరిగేలా చేసారు.  ఒకళ్లు అందరం.. ఇంటికొక వంట చొప్పున చేద్దామని, ఆ ఖర్చు తగ్గిద్దామనీ, ఇంకొకరు.. ప్లేట్ కి ౧౦౦ కి మించి పెట్టద్దని, వేరొకరు South Indian వంటలైతే రామని.. వేరొకరు రాత్రి పూట పూర్తి స్థాయి డిన్నర్ వేస్ట్.. అనీ.. ఒకళ్లు కారాలు ఎక్కువ అయితే తాము రామనీ.. ఒకళ్లు తమ పిల్లలు మహా అంటే ఒక్క రొట్టె ముక్క తింటారు కాబట్టి వారికి సెపరేట్ గా పే చెయమనీ.. 


తల  పట్టుకుని కూర్చున్నా.  ఇప్పుడర్థం అయింది...ఎవ్వరూ భోజనాల బాధ్యత ఎందుకు తీసుకోలేదో.. అయినా.. ఏదో ఏడాదికి ఒక్క సారి, ఒక్క పూట ఏదో తినే వంట గురించి ఇంత రభసా? పది మంది తో సరదా గా తినాలి కానీ...అని నాకు బాగా చనువు ఉన్న పక్కావిడ తో అంటే.. 'పది మంది తో మంచి తిండి తినాలి కదా.. దీపావళి అంటే దేశం లొ అందరికీ ఇంపార్టంటే... ఆ రోజు ఎవ్వరైనా.. మంచి విందు భోజనం చేయాలనుకుంటారు కదా..? ' అంది..  నేను బెంబేలెత్తాను. .


దానితో ఆడవాళ్లతో కాదు.. మగవారితో ఆడిగితే ఆఫీస్ లంచుల్లా కాస్త ఈజీ గా ఏదో ఒకటి అని వదిలేస్తారేమో.. అని కొంత మంది మగవారిని కదిపి చూశా..వాళ్లు మరీ.. 'మొదట ఎవరి దగ్గర కెళ్లారు? మా ఒపీనియన్ కోసం ముందర రాలేదు కాబట్టి నేనేమీ చెప్పను.. పదహారో నంబర్ ఆయన సౌత్ ఇండియన్ కావాలన్నాడా? అయితే.. పంజాబీ అయితే తప్ప నేను రాను.. అందరికీ ఆం లైన్ వోటింగ్ పెడితే? ' లాంటి సజెషన్లతో.. విసుగెత్తించారు. ఇక లాభం లేదని వెళ్లా.. పాత ప్రెసిడెంట్ గారింటికి..  ఆయన కూర్చుని  చిద్విలాసం గా నవ్వి.., 'పది మంది దగ్గరికెందు కెళ్లావు? మీరు ఒకరిద్దరు కోర్ కమిటీ చేసుకో.. లేకపోతే.. అంతా నీమీదకే వస్తుంది.. ఒకళ్లు ఉత్తర భారతీయులయ్యేట్టు, ఒకళ్లు గుజ్జు, లేక మరాఠీ వారయ్యేట్టు కూడా జాగ్రత్త పడు ' అని జాలి గా గీతోపదేశం చేశారు.  

ఒక ఆ ప్రయత్నాల్లో భాగం గా ఒక పంజాబీ అమ్మాయిని అడిగాను.. 'కోర్ ఫుడ్ కమిటీ లొ మెంబర్ గా ఉంటావా?' అని.. ఆ అమ్మాయి . 'ఉంటా.. కానీ.. నాకు మంచి పంజాబీ ఫుడ్ పెట్టిద్దాం.. నాకొక రెస్టారెంట్ తెలుసు.. అక్కడ పొద్దున్న ఫ్లైట్ లొ పనీర్ పంజాబ్ లోంచి వస్తుంది.. ఇంగువ దగ్గర్నించీ..అక్కడినుంచే తెప్పిస్తారు..multi cuisine andra family restaurants లాగా ఎవరో తెలుగు కుక్స్ తో వండించి ఇదే పంజాబీ భోజనం అని చెప్పరు..' అని పారవశ్యం గా చెప్తూ పోతోంది.. 'ఆహా.. ' అనుకుని... ఇక మధ్య దేశం వారి నడిగితే ఇంకే అభిప్రాయాలు చెప్తారో.. అని విరక్తి కలిగి.. ఇంటికి చేరాను. పండుగ చూస్తే నాలుగు రోజుల్లో..


 'అవునూ.. ఎందుకు నేను అందర్నీ ప్లీజ్.. చేయటానికి ప్రయత్నిస్తున్నాను? అసలు సాధ్యమేనా? మా ఇంట్లోనే ఒకళ్ల మాట ఒకరికి పడదు.. ' అని ఒక ఆలోచన వచ్చింది.. మన ఇంట్లో అంటే మన డబ్బు కాబట్టి మనమే బాధ్యత పడతాం కాబట్టి.. ధైర్యం గా ఖర్చు పెడతాం. మరి జనాల డబ్బు అంటే...value for money అందివ్వాలనే టెన్షన్ లో ఇదేంటి ఇంత కష్ట పడటం? అయినా..నా మీద బాధ్యత పెట్టినప్పుడు నా ఇష్టం.. మహా అంటే.. తిండి బాగాలేదు.. కృష్ణ టేస్ట్ చెత్త.. అంటారు.. దానితో..ఇక ముందు కూడా నాకు బాధ్యత అప్పగించరు.. కదా..  అని ఉత్సాహం గా.. ఐదేళ్లు దాటిన మనిషికి 150 Rs చొప్పున పండుగ భోజనం తిందామనుకునేవారు చెల్లించాలని నోటీస్ పంపి..  ఆఫీస్ పక్కన ఉన్న ఒక 'multi cuisine andhra family restaurant' లో రెండు నార్తూ, రెండు సౌతూ, రెండు సలాడ్లూ, రెండు స్వీట్లూ ఆర్డర్ చేసి గమ్మున ఊరుకున్నా.. 

అదేదో పాత హిందీ సినిమా లో దేవానంద్ లా దీపావళి డిన్నర్ అప్పుడు ఎవ్వరి కళ్ళల్లోకీ చూడకుండా..  నుదుటి వంకా.. జుట్టు వంకా.. చూస్తూ పిల్లలున్న వైపు గడిపేసా.. ఫీడ్ బాక్ ఇవ్వటానికి వచ్చేటప్పుడు.. రింగ్ టోన్ నొక్కేసి.. ఫోన్ వచ్చినట్టు నటించి.. 'చాలా కొంపలు ముంచే ఇష్యూ.. అటెండ్ అవకపోతే.. నా తల తీసే ప్రమాదం ఉందన్నంత బిల్డప్ ఇచ్చి బయట పడ్డా.. 


అబ్బా!!..నేను దొరుకుతానా? బాసులు, కో వర్కర్లు, చుట్టాలు,పిల్లల స్కూల్ టీచర్లు.. ఎందరి ఫీడ్ బాక్ లు సాధ్యమైతే తప్పించుకుని, తప్పదంటే విన్నట్టు నటించి.. ఇంకెప్పుడూ ఈ తప్పిదం చేయను అన్నట్టు ముఖం పెట్టి బయట పడలేదు? 

అప్పటికీ కొద్ది మంది పట్టు వదలని విక్రమార్కులు నా వెంట బడి మరీ ఇచ్చారనుకోండి..అబ్బే..మనం హర్ట్ అయితేగా.. కొద్ది మంది వెనకేం తిట్టుకున్నా, ముఖం మీద మాత్రం భోజనం బాగుందని ఇచ్చారు..  కాకపోతే .. సెక్యూరిటీ, హౌజ్ కీపింగ్ వాళ్ల గురించి మర్చిపోవటం వల్లా.. కొంతమంది ఐదేళ్ల లోపల అని తల్లిదండ్రులు రాయించినా,.. కేటరర్ ఒప్పుకోకపోవటం వల్లా..  వాళ్లకి టిప్స్ సంగతి మర్చిపోవటం వల్లా.. దాదాపు 1500 Rs  ఖర్చు నా ఖాతా లో పడింది... చాల్లే దీనితోనయినా వదిలింది... ఇంక ఈ జన్మ కి వచ్చిన పేరూ, ప్రతిష్టా చాలు..  అని నిర్ణయించుకుని ఇదిగో..ఇలా ఊరూ పేరూ లేని మంద లో గొర్రె లాంటి జీవితం గడిపేస్తున్నా...


Monday, March 14, 2011 35 comments

సింగం, బార్డర్ సమస్యా, మల్లెపూలూ..ఆఫీస్ లో నా ప్రాజెక్ట్ పార్టనర్ సింగ పెరుమాళ్ నుండి మెయిల్.. సోమవారం. 'Family Emergency.. Will be Out of Office for couple of days' అని.  'అయ్యో.. పాపం ఏం ఎమర్జెన్సీ యో' అనుకున్నాఒక్క క్షణం కానీ.. ఆయన చేయాల్సిన పని కూడా నా మీద పడిందని గుర్తొచ్చి.. నీరసం వచ్చింది...  కానీ మళ్ళీ అనుకున్నా.. పోన్లే.. ఎన్ని సార్లు నన్ను ఆదుకోలేదు.. అని..


రెండు రోజులకని వెళ్ళిన వాడు వారం అంతా రాలేదు.ఫోన్ కి పలకడు.. ఆన్లైన్ లేడు.బాసుగారిని అడిగితె.. 'నాకూ చెప్పలేదు.. ఏమైందో..' అని చెప్పాడు.  సింగ పెరుమాళ్ చాలా నెమ్మది. ఘాటైన తమిళ వాసన తో మాట్లాడతాడు. తనని అందరూ సింగం అని పిలుస్తారు.. మేమైతే 'సిమ్గామంటీ చిన్నోడే ఆఫీస్ కొచ్చాడే..' అని సరదాగా ఏడిపించినా..  'Singapore mall' అని ముద్దు పేరు పెట్టినా..నవ్వుతూ వెళ్ళిపోవటమే..


అతను మొత్తానికి ఆఫీసు కి రాగానే..  'ఏమైంది? ' అని అడిగితే రుద్రవీణ లో లా 'అదంతా పెద్ద కథ' అని నిట్టూర్చాడు. సరే ఈరోజు లంచ్ సింగం తో ఫిక్స్ చేసేసా..  కిటికీ సీట్ సంపాదించి..'ఇప్పుడు చెప్పు..' అనగానే.. మొదలు పెట్టాడు..


'మా ఊరు తమిళ నాట ఒక అందమైన చిన్న పల్లె.. ' అని..    నేను.. 'ఆ ఆ.. introduction వద్దు తండ్రీ... పచ్చని చేలూ, ఊరి పక్క పారే కావేట్లో చల్లని నీరూ, నిష్కల్మషమైన హృదయాల తో ఊరి ప్రజలూ, ఇళ్ళ ముందు ముగ్గులూ, .. ' ఇంకా ఏదో అనబోతుంటే..  సింగం మొహం లో ఎక్స్ప్రెషన్ చూసి.. 'సారీ.. చెప్పు చెప్పు ' అన్నాను.


ఊళ్ళో.. వాళ్ళింటి పక్క వారికీ సింగం కుటుంబానికీ భూముల గొడవలు ఉన్నాయిట. అంతగా పడదట. ఈలోగా వీళ్ళ ఇళ్ళ మధ్య కంచె ఏదో నిప్పు అంటుకుని కొంత పార్ట్ కాలిపోయిందిట. మళ్ళీ వేయించే సమయం లో పక్కాయన కాస్త పకడ్బందీ గా  సింగం తండ్రి ఊళ్ళో లేని సమయం లో రెండడుగులు జరిపి కట్టించాడట. సింగం అమ్మ  ఉదయమే లేచి ఈ ఘోరం చూసి గగ్గోలు పెట్టి అరిచి నానా యాగీ చేసి.. పక్కవాళ్ళని శాపనార్థాలు పెట్టినా.. వాళ్ళు వినిపించుకోలేదట...


ఇక వాళ్ల నాన్న ఊర్లోకి రాగానే పెద్ద గొడవ.. కంచె కట్టటం ఆపు చేయించి.. ఊళ్ళో పెద్దమనుషుల్ని పిలిచి గొడవ పెట్టించాడట.  సింగం తండ్రి ఒక సామాజిక వర్గానికి నాయకుడు. ఆయన వెనక మొత్తం కుల సంఘం నిలిచింది. ఇక అవతల పక్కవారి వైపు కౌన్సిలర్ ఉన్నాడట. దానితో.. కాంగ్రెస్ వాళ్ళంతా వెనక నిలిచారట. ఇటు సింగం తండ్రి  DMK మెంబర్. దానితో.. ఆయన వెనక రాజకీయ శక్తులు కూడా వచ్చి చేరాయి.


ఒక పక్క సింగం కి తప్పి పోయిన పెళ్లి సంబంధం వారు ఒకళ్ళు అవతల పక్క  గుంపు లో కలిసారట. వాళ్ళు MLA చుట్టాలు.  ఎలక్షన్ల హడావిడి కూడా ఉందిట ఆ ఊర్లో.. దేనివో..


ఈలోగా.. ఒక DMK అతనికి అవతల పక్క చేరిన కాంగ్రెస్ మనిషి తో ఉన్న పాట కక్ష తీర్చుకోటానికి ఇదే మంచి అవకాశం అని తోచింది. ఇంకేం?  వెంటనే.. దారి కాసి శత్రువులపై కర్రలతో, కత్తులతో దాడి చేసారు.. వాళ్ళూ అప్రమత్తం గానే ఉండటం తో కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు.. అదీ పోలీస్ జీప్ అదే దారిలో వస్తూండటంతో...


దాంతో.. గొడవ పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళిందిట.. సరే.. ఇక ఇంత దూరం వచ్చాక తగ్గేది లేదని.. సపోర్ట్ కోసం కొడుకులకి ఫోన్లు చేసారట.. తల్లి దండ్రులు.. 


 సింగం తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడట. సింగానికి మొదటి నుండీ కోపమెక్కువ.. ఊళ్ళో గొడవల్లో ఇరుక్కుంటుంటే వాళ్ల తల్లిదండ్రులు హాస్టల్ లో పెట్టి చదివించారని చెప్తే..  నాకు కాస్త భయమేసి ఎందుకైనా మంచిదని స్టిఫ్ గా కూర్చున్నాను.   నా పరిస్థితి ని పట్టించుకోకుండా.. సింగ పెరుమాళ్ తన కథ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.

'హమ్మో.. సింగాన్ని చాలా సార్లు డెడ్ లైన్ల గురించి నిలదీయటం, వార్నింగ్ లు ఇవ్వటం.. లాంటివి చేస్తూ ఉంటాను.. టీం లీడ్ గా.. ఇంత బాక్ గ్రౌండ్ ఉందా.. అని కాస్త భయం వేసింది.  ఇంద్ర లో చిరంజీవి లా అజ్ఞాత వాసం గడుపుతున్నాడా? తేడా వస్తే..  తల కాయలు  లేపేస్తాడేమో .. ఎన్ని సార్లు అతనికి కోపం వచ్చి ఉంటుందో.. ఈ పాటికి అని ఒక అంచనా వేయటం లో మునిగిపోయాను.
చిన్న కాలిన కంచె ఊళ్ళో కులాల మధ్య గొడవగా,.. రాజకీయ పార్టీల మధ్య పోరుగా పరిణామం చెందింది.. ఊరు మండుతోందిట.  తండ్రి ఫోన్ చేసినా.. మా ప్రాజెక్ట్ డెడ్ లైన్ వల్ల సింగ పెరుమాళ్ ఊరెళ్ళ లేకపోయాడు. కానీ.. ఈలోగా. గొడవ ఇంకో రూపు దిద్దుకుందిట.ఉదయం 5 గంటలకి సింగం తండ్రి కాల కృత్యాలు తీర్చుకోవటానికి ఇంటి ఆవరణలో కూలిన కంచె వైపున్న బాత్ రూం వైపు నడుస్తుండగా..  ఏదో తేడా గా అనిపించి కాస్త జాగ్రత్త గా చూస్తే.. ఒక ఎర్రటి చీర..ఒక స్త్రీ శరీరం.. ఆయన కి ఒళ్ళు జలదరించి ఒక్క పరుగులో ఇంట్లోకి చేరి కుటుంబాన్ని లేపారట..  అవతల పార్టీ వాళ్ళు మర్డర్ చేసి శవాన్ని ఇటు పారేసారని భయం వేసి..అందరూ కలిసి వెడదామని లాంతరూ అవీ తీసుకునేలోపల మళ్ళీ ఒక పెద్ద అరుపు వినిపించిందట..  ఏంటా అని చూస్తే.. పక్కావిడ వణుకుతూ ఇంట్లోకి పరిగెట్టటం చూసారట..


నేనూ చాలా ఉత్కంట గా ముందుకు వంగి వింటున్నా..  అందరూ జాగ్రత్త గా వెళ్లి చూస్తే.. ఏమీ లేదుట...  అందరికీ ఇది ఒక మిస్టరీ అయిపొయింది. కంచెకి అవతల వాళ్ళూ, ఇవతల వాళ్ళూ  చర్చల్లో ములిగిపోయారు.. కానీ.. ఎవరు చేసి ఉంటారీ పని? అన్నది తెలుసుకోలేక పోయారు. 


' ఇంక లాభం లేదు .. సింగం .. ఇంటికి రా..' అని పిలుపు తండ్రి నుండి అందుకున్న సింగ పెరుమాళ్ హుటాహుటిన బయల్దేరి ఊరెళ్ళాడట... ఇక్కడి వరకూ  చెప్తూ ఉండగా ఫోన్ మోగిందని మాట్లాడుతున్నాడు సింగం..   ఆ 2 నిమిషాల్లో ఎన్నో ఆలోచనలు నన్ను కమ్మి పారేశాయి..  'అబ్బా.. నా జీవితం ఎంత చప్ప గా ఉంది... అయితే  ఫాక్షన్ సినిమాల్లో చూపించేంత  ట్విస్టులతో జీవితాలు ఉన్న వాళ్ళల్లో ఒకరు నా టీం లో ఉన్నారా.. హెంత అదృష్టం!! సింగం ఊరెళ్ళి మిస్టరీ సాల్వ్ చేసాడా? ఇలాగ..  ఒక్కసారి ఫోన్ లాక్కుని విసిరి గొట్టి.. 'తర్వాత ఏమైంది? ' అని అడుగుదామనుకున్నా.. కానీ.. 'అసలే అజ్ఞాత వాసం లో ఉన్న ఇంద్ర ' లాంటి సింహ అని గుర్తొచ్చి.. ఎదురు చూస్తూ కూర్చున్నా..  


ఈలోగా ఫోన్ కాల్ అయి.. మళ్ళీcontinue చేసాడు సింగం..సింగం  తల్లికి మంచి నెట్వర్క్ ఉందిట ఊళ్ళో.. ఆవిడ వేగుల ద్వారా సమాచారం సంపాదించింది.. ఏంటయా అంటే..   వీరి దొడ్లో మల్లెలు విరగబూస్తాయట. ఒక కొంటె పిల్లకి మల్లెల పిచ్చిట. తనుండే గుడిసె లో మల్లె తీగ లేదు.. ఎవర్నడిగినా, 'అబ్బే!! మాకే సరిపోవట్లేదు..' అనేస్తున్నారట. ఇలా కాదని ఉదయమే వచ్చి కోసుకుంటోందిట పిచ్చి పిల్ల!!!  సింగం తల్లి ఈ విషయం చెప్పగానే.. అందరూ 'అమ్మయ్య' అని రిలాక్స్ అయిపోయారట.  


సింగం తల్లి .. 'అయ్యో పాపం.. పక్కింటావిడ భయపడింది.. ఆవిడకూ చెప్దాం..' అని అందరూ వారించినా వాళ్ళింటి వైపు కంచె దగ్గరికి చక చకా నడిచిందట.  15 ఏళ్ళుగా భూమి గొడవల కారణాన మాట్లాడటం మానేసినావిడ ఇంట్లోకి తొంగి చూస్తూ 'పార్వతమ్మా.. ' అని పిలుస్తుంటే.. 'పోన్లే ఆడ వాళ్ళని ఆపటం ఎందుకూ '  అని  ఊరుకున్నారట అవతల పక్షం వాళ్ళు. .. ఈ మల్లె పూల దొంగ విషయం చెప్పగానే కంచె కి రెండు పక్కల వాళ్ళూ 'హమ్మయ్య' అనుకుని నవ్వుకుని.. ఒకళ్ళకొకళ్ళు సారీలు చెప్పుకుని కలిసిపోయారుట...


ఓస్ .. ఇంతేనా? నేనేదో.. ఒక Sherlock Holmes లా మా సింగం వెళ్లి మిస్టరీ సాధించాడేమో నని సంబర పడుతుంటే. నెత్తిన చల్లని నీళ్ళు జల్లినట్టైంది..   సరే.. ఏం చేస్తాం.. నా జీవితం లో ఈ మాత్రం మిస్టరీ, గొడవలూ, అజ్ఞాత వాసాలూ లేవు.. ఆ విధం గా నాకు తెలిసిన ఒక్క మనిషి సిమ్గమే కదా అని సద్ది చెప్పుకుంటున్నా..   

సింగం.. కంటిన్యూ చేసాడు..

కానీ కుల సంఘాల వాళ్ళూ, రాజకీయ నాయకులూ, మాత్రం అలాగ మధ్యలో కలిసిపోతే కుదరదు.. అని హెచ్చరిక లు రోజూ..చర్చలు.. మాఅమ్మా వాళ్ళకీ ఏమీ పాలు పోదు. చుట్టాలువెనక్కి తగ్గద్దని ఒకటే ఒత్తిడి.  ఇంటి బయటకి రావాలంటే భయం.. భూమి గొడవ లేదు. కానీ ఊరి గొడవ  పెరిగింది.

'అదిగో ఈ ఒత్తిడి భరించలేక నాలుగు రోజులు తల్లి దండ్రులని తీసుకుని వచ్చాను... అన్నాడు సింగ పెరుమాళ్.. 

'మరి ఇప్పుడు? '  అని అడిగితే 'ఏముంది? నాలుగు రోజులు ఇక్కడే ఉంటారు.ఊరికి వెళ్ళినా గొడవలు తగ్గకపోతే..మాత్రం.. నేను వెళ్లి.. నా పధ్ధతి లో సరిచేస్తాను.. అన్నాడు..  ఎందుకైనా మంచిది.. అని  పధ్ధతి అంటే  ఏంటో అడగలేదు నేను.   

లంచ్ చేసాక క్యూబ్ కి నడుస్తూ.. 'అన్నట్టు ఈ కథ నేను బ్లాగ్ లో రాసుకోవచ్చా? కావాలంటే .. పులి పెరుమాళ్/పులి రాజా.. ఇలాగ మార్చమంటే మారుస్తా.. అని అడిగా.. గట్టిగా నవ్వి.. 'పేరేమీ మార్చక్కరలేదు..రాయి' అని.. 'అన్నట్టు.. కృష్ణాజీ.. నేను కొత్త బగ్స్ ఇచ్చారు రెండు.. తీసుకోలేను..పేరెంట్స్ ని బయటకి తీసుకెళ్ళాలి.. మీరే చేసేస్తారా?' 

అని 'వినమ్రం' గా రిక్వెస్ట్ చేసాడు సింగం..  'అయ్యో.. ఈ మాత్రం దానికినోరు తెరిచి అడగాలా? నో ప్రాబ్లం..నేను చేస్తాను.. ' అనేసాను...  అదేదో.. నాకు ఎంత అదృష్టం పట్టింది? ఆ కొత్త బగ్స్ కూడా సాల్వ్ చేసే అవకాశం వచ్చింది? ' అన్నట్టు ఎక్స్ ప్రెషన్ పెట్టి :-(


 
;