Tuesday, August 31, 2010

సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు!!! -- పొరుగింటి పుల్లకూర రుచని..

అదేంటో ఇంట్లో నేనేం వండినా ఒక పట్టాన నచ్చదండీ మా వాళ్ళకి!!!


ఒకవేళ పొరపాటున బాగా కుదిరి ఆనందం గా తిన్నా 'ఆ .. ఉల్లీ, వెల్లీ ఉంటే మా మల్లి గూడా బానే వండుతుంది ' అని తీసి పారేస్తారు.  అదే నేను కాక ఇంకెవరు చేసినా 'న భూతో భవిష్యతి ' అని మెచ్చుకుంటూ తినేస్తారు. అప్పటికీ ' ఈ వంట తింటే భవిష్యత్తు లో భూతాలవుతారనా లేక భూతాలకి కూడా భవిష్యత్తు ఉండదనా ? '  అని రిటార్ట్ ఇస్తూనే ఉంటాననుకోండి.


                                 నన్నేడిపించటానికే ఇలా మా వారు అంటున్నారని ..  'నేతి బీరకాయలో నెయ్యంత ఉందో ' వాళ్ళ మాటల్లో నిజం పాలు అంత ఉందని నా నమ్మకం. 'అబ్బే.. వేపకాయలో తీపి, వేసంగి లో చలవా, నీ వంటలో రుచి ' అని వెక్కిరిస్తూనే ఉంటారు. అయినా మా ఇంట్లో వాళ్ళకే సరైన టేస్ట్ లేదు లెండి. భోజరాజు వంటి రాజుంటే.. కాళిదాసు లాంటి కవి అప్పుడే పుడతాడు.


               మా చిన్న పాప ని చూస్తే..'వచ్చీరాని మాటలు రుచీ, ఊరీ ఊరని ఊరగాయ రుచీ' అని ఎందుకన్నారో తెలుస్తుంది.. కాకపోతే ముద్దొచ్చిన్నప్పుడే చంకెక్కాలని దానికి తెలుసు. .ప్రేమ గా ఏం వండిపెట్టనూ అంటే వెన్నతో అట్టేయమనే రకం!అదీ ఆ తాను ముక్కేగా? పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టు తండ్రి పోలికలు బానే పుణికి పుచ్చుకుందది. చిన్నప్పటినించీ ఇంట్లో ఏం వండినా సొక్కదు. వంక పెట్టకుండా తిననే తినదు.


వాశిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం తూగితే, కారెడ్ల కామక్క వంకాయల భారం తూగిందట. అలాగ నేనేం తక్కువ అని మా పెద్దమ్మాయికీ అదే గొడవ. దానికెప్పుడూ పొరుగింటి పుల్లకూరే రుచి! అది చాలదన్నట్టు శుభ్రం గా కంచం ఖాళీ చేసి రామాయణం అంతా విన్నాక రాముడికి సీతేమవుతుందన్నట్టు.. 'నేను తిన్నది ఏంటి? ' అని అమాయకమ్మొహం వేసుకుని అడుగుతుంది!! అద్దం అబద్ధం చెప్పదు.. దానికి వంట నచ్చిందనటానికి,  కడిగేసినట్టున్న దాని కంచమే సాక్ష్యం.  రైల్లోకి టిఫిన్ బాక్సు కట్టినా 'రామేశ్వరానికి పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్టు చూస్తుంది నావైపు.


అగ్ని కి ఆజ్యం పోసినట్టు,  తండ్రి వంటంటే చెవులు కోసుకుంటారు  పిల్లలు!! ఇక నా పరిస్థితేమో .. అత్త కొట్టినందుకు కాదు. తోటి కోడలు నవ్వినట్టు ' తయారవుతుంది.


ఆడలేక మద్దెల వోడన్నట్టు, నాకు చెదిరిన వంటలకి, ముదిరిన కూరగాయల వంకా, పులిసిన పెరుగు వంకా, కుదరని వంట పాత్రల వంకా  పెడతాను లెండి.


అందుకే 'అడుసు తొక్కనేల? కాలు కడగనేల'  అనుకుని ఒక్కరోజూ..వంటెలా ఉందీ.. అని అడిగి, 'కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకోవటం ' ఎందుకని  పెద్దగా ఫీడ్ బాకులు అడగను. కానీ వంకలు పెట్టకుండా తినాలంటే మన కిటుకుల సంచీ లోంచి తీసిన చిట్కా..'ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు..'


'చేత కానమ్మకి చేష్టలెక్కువ ' అని కాస్త గార్నిషింగులు చేసేస్తే సరి!! ఆవురావురుమంటూ తినక ఏం చేస్తారు?  మూల విగ్రహానికే ఈగలు దోలుతుంటే,.. ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపు ఎప్పుడని అడిగినట్టు, రోజూ వారీ వంటకే దిక్కు లేదు ఇక పిండివంటల సంగతి చెప్పనక్కరలేదు.


ఆ.. నేను పట్టించుకుంటే గా!!!!.. హెచ్చు గా పేలున్న వాళ్ళకు, హెచ్చుగా అప్పులున్నవాళ్ళకు దురదలేదు.వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్ల దాగిన వాడిని చావ మోదినట్టు  మా వారినే దెప్పుతూ ఉంటాను లెండి. అయినా పిల్లలు 'చీ బావుళ్ళేదంటే.. '


ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు! మా ఫ్రెండ్ భర్త.. ఇంట్లో చూరు నీళ్ళు తాగి, బయటకొచ్చి చల్ల దాగి వచ్చానని చెప్పుకునే రకమైతే..  బయట అంతా నా వంట గురించి గొప్ప గా చెప్పుకుంటుంటే.. నా పరిస్థితేమో ఇంట ఈగల మోత, బయట పల్లకీ మోత అయింది :-(


అయినా ఒక ఊరి కరణం ఇంకో ఊరి వెట్టి ట.. మా అమ్మ ఊరెళ్ళితే.. మా నాన్న గారు నానుబాయి గా అన్నం వండి పెట్టినా పొగుడుకుంటూ తినేవారు..


 ఏం చేస్తాం ? కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు లెండి.. మా ఇంకో స్నేహితురాలైతే.. టీ కూడా వంటావిడ తోనే పెట్టిస్తుంది.


మొన్నేమైందో తెలుసా?


కల కాలపు దొంగైనా ఏదో ఒకనాడు దొరుకుతాడంటే ఏంటో అనుకున్నాను కానీ,


నా విషయం లో రుజువయ్యింది!! మొన్నీ మధ్య మా స్నేహితులొక్కరు ఆకస్మికం గా ఫోన్ చేసి, భోజనానికొచ్చేయండి ' అని పిలిచింది. 'అయ్యో వంట మొదలు పెట్టానే.' అంటే..'చేసినంత తెచ్చి, సగం చేసింది ఫ్రిజ్జిలో పడేసి వచ్చేయ మంది. గుత్తి వంకాయ కూర బాక్స్ లో పెట్టుకుని బయలు దేరాను. మరి మా వారికీ సంగతి తెలియదుగా.. అక్కడ భోజనం చేస్తూ.. 'అబ్బా.. పద్మజ గారూ, అన్ని వంటకాలొక ఎత్తు! ఈ గుత్తి వంకాయ ఒకెత్తు.. క్రిష్నా.. కాస్త రెసిపీ తెలుసుకోవచ్చు గా' అనేసారు. సదరు పద్మజ ఇచ్చిన అదోరకమైన ఎక్స్ ప్రెషన్ చూసి.. పాపం ఆయన కేం అర్థం కాలేదు..




తర్వాత ఏం జరిగిందో .. మీ ఊహకే వదిలేస్తున్నాను !!!  :-)))))


Blog Author' s note:


ఇది నా కథ కాదు. :-) మా ఇంట్లో అందరం ఏది బడితే అది హాయిగా తినేసే రకాలే.. ఊర్కే బోల్డు సామెతలు వాడి ఏదైనా రాయాలని చేసిన ప్రయత్నం ... 32 సామెతలు వాడాను. కాకపోతే చివరి పారా మాత్రం నిజం గా జరిగిందే!!

61 comments:

Sravya V said...

తిండి కి సంభందించి సామెతలు ఇన్ని వాడి పొరుగింటి "పుల్లకూర రుచేక్కువ " వాడలేదు (స్వగతం : అమ్మయ్య నాకు సామెతలు వచ్చు అని కృష్ణ గారి తెలిసుంటుంది :) .
ఆ చివరి పేరా మాత్రం అదిరింది పాపం ప్రెసిడెంట్ గారి కి రెండురోజులు పుడ్డు కట్టు ఏమో (మీరు బయట తిని పడ్డ తిప్పలు పాత పోస్టు లో చదివా :)

kannaji e said...

చాలా మంచి ప్రయత్నం ...చదువుకోడానికి కూడ బావుంది...

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,
ఐదవ పారా, మూడవ లైన్లో. వాడాను .. చూడండి.. :-)
ప్రెసిడెంట్ గారికి ఫుడ్ కట్ కాదు.. పద్మజా వాళ్ళింట్లో ఆయన కి గౌరవం కట్ :-)
అప్పటించీ ఎందుకైనా మంచిదని 'ఐటంలన్నీ బాగున్నాయండీ' అనటం నేర్చుకున్నారు..
అగ్రహారం పోయినా లా తెలిసింది ఆయనకి :-)

@kannaji e,

ధన్యవాదాలు

Sravya V said...

ఓకే ఒకే ఆ సామెత బ్లాగు టైటిల్ లోనే వాడేసారా , నా కామెంట్ వాపస్ వాపస్ !

Sravya V said...

ఓకే ఒకే ఆ సామెత బ్లాగు టైటిల్ లోనే వాడేసారా , నా కామెంట్ వాపస్ వాపస్ !

వీరుభొట్ల వెంకట గణేష్ said...

______________________________________________
అప్పటించీ ఎందుకైనా మంచిదని 'ఐటంలన్నీ బాగున్నాయండీ' అనటం నేర్చుకున్నారు..
అగ్రహారం పోయినా లా తెలిసింది ఆయనకి :-)
______________________________________________
LOL!!

ramesh said...

ఫాపం, గొంతులో పచ్చి వెలక్కాయ పడిందన మాట:-)

మీరు bold face లో పెట్టనవి ఇంకెన్ని సామెతలవుతయో ముందు రోజుల్లో - మచ్చుకి, చెదిరిన వంటలకి ముదిరిన కూరగాయల వంక పెట్టినట్లు.

వేణూశ్రీకాంత్ said...

వినూత్నమైన ప్రయత్నం చాలా బాగుందండీ.. హ హ చవర్లో గుత్తివంకాయ కూర ట్విస్ట్ అదరహో :-)

Sravya V said...

ఇప్పుడు ఒక ఆరు సార్లు చదివి కామెంటుతున్నా, ప్చ్ ఏదో నా సామెతల పరిజ్ఞానం చూపిద్దామంటే అట్టర్ ప్లాప్ అయింది , ఒకటి కాదు రొండు సార్లు వాడిన సామెత హ్మ్ !
కొసరు గా వాడిన సామెత "అగ్రహారం పోయినా లా తెలిసింది ఆయనకి " ఇది ఇంకా అదిరింది. :)

Hamsa said...

LOL..! నిజం గా చాలా బావుందండీ...

కృష్ణప్రియ said...

@ వెంకట గణేష్,
:-))
@ రమేశ్,
అవి నా సొంత పైత్యం లెండి.. భావి తరానికి నేను సైతం.. :-)

@ వేణూ శ్రీకాంత్,
థాంక్స్! :-)

@ శ్రావ్య,
హ్మ్మ్.. ఐతే 2 సార్లు రాసిన, పైగా టైటిల్ లో ఉన్న సామెత మిస్ అయ్యారంటే... మీరు తప్పక బెంగుళూరు మీదుగా టికెట్ కొనుక్కుని చుంబరస్కా టల్లోస్ తిని వెళ్ళాల్సిందే.. దీన్ని తినటం వల్ల ఏకాగ్రత పెరుగి ఏక సంతాగ్రహులౌతారని మా ఊళ్ళో అంతా చెప్పుకుంటున్నారు. :-)


@ హంసా,
ధన్యవాదాలు!

జయ said...

బాబొయ్! ఇన్ని సామెతలే!!!ఎక్కడివండీ ఇవన్నీ. మొత్తానికి ఇందులో చాలా మటుకు అస్సలు తెలీదు. భలే ఉందండి.

మంచు said...

:-))

జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అన్నట్టు మీరు ఎమీ రాసినా బావుంటుంది :-))

Rao S Lakkaraju said...

చక్కనమ్మ చిక్కినా అందముగా ఉంటుంది -- అనే సామెత పెడదామను కున్నా గానీ మంచు గారి లాగా జోడీ కుదరలేదు.

కృష్ణప్రియ said...

@ జయ,
బాగానే గుర్తు చేశారు. నేను సామెతలు తీసుకున్న సోర్సుల గురించి రాద్దామనుకుని మరిచాను.
స్పెషల్ థాంక్స్ మీకు!!

1. మా నాన్నగారికి 2 వేల సామెతలకి పైమాటే వచ్చని తేలింది. ఒకసారి హైదరాబాద్ నుండి ఢిల్లీ వేళ్ళేదాకా 200 పేజీల నోట్ పుస్తకం లో గుర్తున్నవి రాశారట వాళ్ళ స్నేహితుల బృందం.. కానీ ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళిపోయారు చూసి ఇస్తానని :-(
2. 99 లో ఒక పుస్తకం కొన్నాను. టైటిల్ : 'తెలుగు సామెతలూ బై గోపి, సుధ (పల్లవి పబ్లికేషన్స్)
3. తెలుగు బ్లాగ్స్
http://konamanini.blogspot.com/2008/10/saametalu.html
and
http://pappusreenu.blogspot.com/2009/11/blog-post.html

కృష్ణప్రియ said...

@ మంచు,
చాలా చాలా థాంక్స్..
@ Rao S Lakkaraju గారు,
పర్వాలేదు లెండి.. పైన పెట్టిన లంకెల్లోంచి బోల్డు సామెతలు చూసుకోవచ్చు..

కన్నగాడు said...

సామెతల చిట్టా కావాలంటే ఓసారి ఈ లింకు చూడండి.

http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B1%86%E0%B0%A4%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE

సి.ఉమాదేవి said...

సామెతలు,పొడుపు కథలు తెలుగు భాషకు మరిన్ని సొబగులద్దుతాయి.మితంగా వాడితే కథలు,నవలలు తెలుగుసాంబ్రాణిని గుబాళిస్తాయి.చిన్నారులకు ఈ సామెతల గురించి వాటి అర్థాలను,వివరిస్తే తెలుగు భాషను సేవించినట్లే.

maha said...

చాలా బాగుంది అండి....కొన్ని సామెతలు అయితే నేను అస్సలు వినలేదు....

కృష్ణప్రియ said...

@ ఉమాదేవి గారు,
హ్మ్మ్, బాగా చెప్పారు..
@ మహా, indrathinks,
ధన్యవాదాలు..

భావన said...

అబ్బ చాలానే సామెతలు తెలుసండీ మీకు. నాకు సగం పైనే తెలియదు వీటిలో. మా ఇలాకా లో నేనే సామెతల క్వీన్ ను. :-( చాలా బాగుంది. నేను ఇంకో కిటుకు వాడే దానిని, వంట బాగుందా అని అడిగి పులుపు ఎక్కువ అయ్యింది అన్నాడనుకో మా ఆయన, అలానే వుండాలి ఈ కూర పుల్ల గా అని రివర్స్ కొట్టే దానిని. గుర్ మనే వాడు ప్రతి దానికి అదే సమాధానం ఇంక ఎందుకు అడుగుతావు అని ;-)

కృష్ణప్రియ said...

@ కన్నగాడు,
థాంక్స్!

@ భావన,
:-) ధన్యవాదాలు..

నీహారిక said...

You are very talented and sincere writer. you are not a blogger.

నీహారిక said...

సామెత లేని మాట ఆమేత లేని ఇల్లు!!! -- పొరుగింటి పుల్లకూర రుచని..
ఆమేత అంటే ఏమిటండీ?

కృష్ణప్రియ said...

హే నీహారికా,

:-) ధన్యవాదాలు మీ కాంప్లిమెంట్ కి.. ఆమేత అంటే ఆవు కి మేత అనుకుంటున్నాను. నాకు కచ్చితం గా తెలియదు. కొత్త పాళీ గారి లాంటి బ్లాగ్ పెద్దలకి తెలుసేమో కనుక్కోవాలి..

హరే కృష్ణ said...

అన్ని సామెతలను కవర్ చేసి భలే రాసారు
ఆభినందనలు
మంచు పల్లకి గారు చెప్పినదానితో ఏకీభవిస్తున్నాం

హెచ్చు గా పేలున్న వాళ్ళకు, హెచ్చుగా అప్పులున్నవాళ్ళకు దురదలేదు :D :D

జ్యోతి said...

సామెత లేని మాట ఆమేత లేని ఇల్లు అంటే.. సామెత అనే మాట వినబడని ముచ్చట్లు, భోజనం లేదా విందు లేని ఇల్లు అని అర్ధం.. సామెతలు మన నిత్యజీవితంలో అంతగా ఇమిడిపోయాయి అన్నమాట..

కృష్ణప్రియ said...

జ్యోతి గారూ,

చాలా చాలా థాంక్స్. ఆమేత అనగానే.. ఆవుమేత అనుకున్నానంటే నా పరిజ్ఞానం స్థాయి .. చెప్పుకోవక్కరలేదు..

కృష్ణప్రియ/

నేస్తం said...

రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకుంది అని ...నేనూ ఒక మారు చికెన్ బిర్యాని చేసి పక్కింటి ఆవిడ ఇచ్చిందని చెప్పి మెప్పించుకోవలసి వచ్చింది క్రిష్ణా ...సామెతలు సూపరూ

Venkat said...

Krishan garu meeku chala sametalu telusandi
chala baaga rasharu

కొత్త పాళీ said...

కృష్ణప్రియ, మె కి దీర్ఘం లేదు. బ్రౌణ్యం ఇలా చెబుతున్నది.
āmeta. [Tel.] n. Invitation, banquet, feast. ఆమెతచేయు. to feed on: make a meal. Vasu. iii. 152. ఆమెతపెట్టు to give a dinner. విందుచేయు
"మేటి తుమ్మెదల కామెతలు పెట్టు." రసి. iv.

నీహారిక, మీ వ్యాఖ్యని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు టేలెంటెడు రైటరేగాని బ్లాగరు కాదు, అంటే బ్లాగర్లు పనికిమాలిన వాళ్ళనా?

కృష్ణప్రియ said...

@ హరేకృష్ణ,
థాంక్స్!
@ నేస్తం,
:-))
@ వెంకట్,
ధన్యవాదాలు!

కృష్ణప్రియ said...

@ కొత్త పాళీ గారు,
స్పందించి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు!
మీరు చెప్పినట్టు గా టపా టైటిల్ సరిచేశాను. నా నిఘంటువు మా అమ్మగారింట్లో ఉండిపోయింది.
ఈసారి తెచ్చుకుని రాసే ముందు తెలుసుకుని మరీ రాస్తాను.

కృష్ణప్రియ/

..nagarjuna.. said...

సామెతల సంగతేమోకాని మీవి, భావనగారివి, మా నేస్తం అక్క వంట కష్టాలు భలే ఉన్నాయి. ఈ టపా వల్ల తెలిసిందేంటంటే నలభీమపాకమే బెస్ట్ అని.. ;)

కొత్త పాళీ said...

http://www.andhrabharati.com/dictionary/

నీహారిక said...

అయ్యో!నేను ఆ ఉద్దేశ్యంతో అలా అనలేదు.బ్లాగరులందరు రచయత/రచయిత్రులు కారు(నాలాగా).కొందరే రచయత/రచయిత్రులు.వారిలో వీరు ఒకరని నా ఉద్దేశ్యం.మామూలుగా నోట్స్/పరీక్ష రాసినట్లు వ్రాయడానికి
క్రియేటివ్ గా వ్రాయడానికి తేడాలేదంటారా?

జేబి - JB said...

బాగుందండీ - కొన్ని సామెతలు గుర్తుచేశారు. సామెతలు-జాతీయాలు భాషకు అందం తెస్తాయి.

Bhãskar Rãmarãju said...

ఏదో సామెత చెప్పినట్టుంది మీ టపా...

కృష్ణప్రియ said...

@ కొత్తపాళీ గారు,
థాంక్స్, చాలా బాగుంది.

@ జే బీ గారు,
ధన్యవాదాలు.

@ భాస్కర్ గారు,
హ్మ్మ్ ఏ సామెతబ్బా?

సవ్వడి said...

నాకు ఇందులో సగానికి పైగా తెలియవు. మీవల్ల చాలా సామెతలు తెలుసుకున్నాను.

కృష్ణప్రియ said...

@ సవ్వడి,
హ్మ్మ్.. థాంక్స్..

భాస్కర రామిరెడ్డి said...

హి హి హి.. కలిసొచ్చే రోజుల్లో నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు పొద్దు పొద్దున్నే ఈ టపా తగిలింది. బాగున్నాయి కబుర్లు. అందుకే నేనైతే వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు పొగడాల్సి వస్తే ముందుగా ఆ వంట ఎవరు చేసారో కనుక్కోవడం అలవాటుగా పెట్టేసుకున్నాను

స్వగతం : ఓ రెండు సార్లు దెబ్బ తిన్నాలేండి. దెబ్బతిన్నాక జ్ఞానోదయం అయి, ఎవరు చేసారో ముందుగా పేరు కనుక్కుంటున్నాను :-)

కృష్ణప్రియ said...

భాస్కర్ గారు,
మంచి అలవాటు.. :-))
థాంక్స్.. మీ కామెంట్ చూశాక గుర్తొచ్చింది. ఒకసారి మా పాప పుట్టిన రోజు సందర్భం గా చాలా వరకు ఐటంలు ఆర్డర్ చేసి ఒక్కటి మాత్రమే నేను చేశాను. వచ్చిన వాళ్ళు నేను చేసింది కూడా ఆర్డర్ చేసిన పదార్థమమేననుకుని.. 'వాడి మొహం లా చేశాడు.. రుచీ పచీ లేదు.. పైగా.. బోల్డు నూనె వేసి చేశాడు.. ' అని నానా రకాల కామెంట్లతో నన్ను అలరించారు :)

Naganna said...

కృష్ణ ప్రియ గారూ .. మా ఊరు ను చూసినందులకు దన్యవాదములు.
మీ ఇంట్లో కూడా సీతాఫల చెట్టు వుందన్నారు ... ఈ సారి కాత అంతా మాకే సరేనా .....!
మీ సామెతల వాడకం బాగా కుదిరింది.
ప్రొసీడ్ ....!
నమస్తే ..ఉంటాను.
మొగిలిపేట నుండి .. నాగరాజు గోల్కొండ.

రాధిక(నాని ) said...

కృష్ణ ప్రియ గారుమీ సామెతలు చాలా బాగున్నాయి .చాలా బాగా రాసారు.నాదీకూడా ఒక సామెత కలుపుకోండి.
సత్రం కూటికి సర్కారు సెలవెందుకానీ.

Anonymous said...

బాగుంది...

కృష్ణప్రియ said...

@ నాగరాజు గారు, రాధిక గారు,
థాంక్స్! మీ బ్లాగ్ లకి నేను రెగ్యులర్ రీడర్ ని. మీ బ్లాగుల గురించి మా సర్కిల్ లో చెప్తూ ఉంటాను కూడా. మంచి పల్లె గుభాళింపు తో టపాలు చాలా బాగుంటాయి.

@ ఆదిత్య గారు
ధన్యవాదాలు!
కృష్ణప్రియ/

Unknown said...

సామెతల్ని చాలా చక్కగా వాడారండీ...
మీరు వండిన ఫుడ్డేదైనా ఒక్కసారి పార్సిల్ పంపగలరా...
ఏమీ లేదు సామెతల కోసం మీరు రాసిన కథలో, కథ కానిదెంతో చూద్దామనీ :) ;)

శే.సా said...

సామెతలు బాగున్నాయండి. చాలా వరకు నాకు తెలియదు :(
పాపం మీ వారు అలా బుక్ అయిపొయారా :)

భాస్కర రామిరెడ్డి said...

Krishnapriya గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

హారం

కృష్ణప్రియ said...

చంద్రమౌళి గారు,
ధన్యవాదాలు.. ధైర్యస్థుల్లా ఉన్నారు!

శేషేంద్ర సాయి గారు,
:-) థాంక్స్

కృష్ణప్రియ said...

భాస్కర రామిరెడ్డి గారు

మీకు కూడా శుభాకాంక్షలు.

శివరంజని said...

హ..హ...హ... కృష్ణ ప్రియ గారు మీ సామెతలు చాలా బాగున్నాయి ... లేదు లేదు సామెతల తో కధ చాలా బాగుంది ఇందులో చాలా వరకు సామెతలు నాకు తెలియనివే ఉన్నాయి

HarryKris said...

Hi Andi,
Mee blog chadivite chala peace of mind. Naa peru Harikrishna. London lo SW job. Meeru chala manchi blog raastunnaru. Meeru Guntur (maa ooru kooda) anukuntunnanu. Daya chesi meeru naa mail id ki oka test mail pampandi. Nenu kotha gaa NRI life start chesanu. Need your suggestions for my career.

Thanks
HariKrishna
ihkris@gmail.com

కృష్ణప్రియ said...

@ శివరంజని,

థాంక్స్! :-)

@HarryKris,

ధన్యవాదాలు.

Mauli said...

నాకీ పోష్టు బాఘా నచ్చింది . ఎందుకంటే ...ఎంచక్కా హ్యాపీగా లాస్ట్ నుండి చదవడం మొదలు పెట్టా ...:)

sreedevi said...

చాలా బాగుంది. రెండు మూడు సార్లు చదివాను నాకు తెలియని సామెతలు నేర్చుకొని మా ఇంట్లో ప్రయోగిద్దామని. :-))

కృష్ణప్రియ said...

@ మౌళి,
:-) నచ్చినందుకు సంతోషం, వెనక నుండి చదివినా నచ్చిందంటే ?
@ శ్రీదేవి గారు,
థాంక్స్! తెలుగు బ్లాగుల్లో సామెతల లిస్ట్ రెండు మూడు చోట్ల చూశాను. కూడలి లో 'సామెత ' అని సర్చ్ చేసి..

karlapalem Hanumantha Rao said...

కృష్ణ ప్రియ గారు !
ఈ టపా నాకూ బాగా నచ్చింది .మీ బ్లాగ్ మొత్తం మీ మంచి అభిరుచిని తెలియచేస్తుంది. అభినందనలు .నా లోకం బ్లాగ్ లో నా కథ చూసి స్పందించినందుకు ధన్యవాదాలు.

కృష్ణప్రియ said...

@ హనుమంత రావు గారు,
ధన్యవాదాలు!

Anonymous said...

aametha ante lady anukuntaa

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;