Friday, February 25, 2011 59 comments

చేజారిన మంత్రదండం!
మొన్న  ఆఫీస్ కి స్కూటర్ మీద తీరిగ్గా బయల్దేరాను..  అసలు ఇంటి నుండే పని చేద్దామనుకున్నా.. కానీ అత్యవసరం గా రమ్మంటే.. ఉన్న పళాన బయల్దేరాల్సి వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్డు మీద బోల్డు ట్రాఫిక్! టక్క్మని శబ్దంవచ్చింది.. ఏంటా అని చూస్తే.ఏమీ ప్రత్యేకం గా తేడా గా అనిపించలేదు..  ముందర ఆఫీస్ బ్యాగ్ అయితే ఉంది.  సరే రోడ్డు మీద ఏదైనా రాయో రప్పో లే అనుకుని నా దారిన నేను పోతుంటే.. 

పక్కన కార్ డ్రైవర్ హారన్ కొట్టి కొట్టి ఇబ్బంది పెడుతున్నాడు.. కొద్ది సేపు ఇగ్నోర్ చేసి..  తర్వాత కోపం గా చూసే టప్పటికి అర్థమైంది.. వాళ్ళేదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నారని.. వాళ్ళు రోడ్డుకి మధ్యన అడ్డంగా కార్ ని రాయల్ గా ఆపేసి.. నన్ను రమ్మని సైగ చేస్తే.. నేనూ అయోమయం గా వాళ్ల పక్కకి వెళ్లి నిలుపు కున్నాను... 

జనాలంతా  ఏదైనా అయిందేమో అని చుట్టూ ఆసక్తి గా చూస్తున్నారు... చెత్త ట్రాఫిక్ లో ఏదైనా మసాలా దొరకచ్చు అని!  కార్ లో వాళ్ళు.. 'నీ మొబైల్ పడిపోయింది ..బ్రిడ్జ్ మీద.. ఒక సైకిల్ అబ్బాయి వెంటనే తీసుకుని పారిపోయాడు..' అని చెప్పారు.. 

ఈలోగా  'ఏ ఫోన్...ఎలా? ఎక్కడ పెట్టుకున్నావు? ....' అని పక్క నున్నవాళ్ళు ఊదర కొట్టటం.. 

మంచి ఖరీదయ్యినదైతే 'అయ్యో...' వాల్యూ ఎక్కువ కదా! .. నేను షాక్ లోంచి బయటకొచ్చేసరికి..  జనాలు చుట్టూ అడుగుతున్నారు.. ఆశ్చర్యమేంటంటే.. ట్రాఫిక్ లో అరక్షణం వేస్ట్ చేయలేని మోటార్ సైక్లిస్స్టులు, బస్సుల మధ్యలోంచీ, ఫుట్ పాతుల మీద రాళ్ళమీదనుండీ. కరెంట్ స్తంభాల మధ్య ల్లోంచీ  దూకుడు గా హారన్ కొడుతూ దూసుకెళ్ళే వారంతా .. ఏ మాత్రం తొందర లేకుండా.. నింపాది గా ఎదురు చూస్తున్నారు. 

'అంత ఖరీదైనది కాదని అన్నాను.. అంతే.. 
వాళ్ళని నేనేదో  బొట్టు పెట్టి పిలిచినట్టు.. వాళ్ళని నేను డిజాప్పాయింట్ చేసినట్టు నిరసన గా.. అంతా వెళ్ళిపోయారు. సిగ్గేసింది. కనీసం ముప్ఫై వేల రూపాయల ఫోన్ పోగొట్టుకుంటే.. కాస్తైనా ఇజ్జత్ ఉండేది ఇలాకా లో.. ఈసారి మంచి ఖరీదైంది పారేసుకోవాలి ..  అని ముందర గట్టి నిర్ణయం తీసుకుని..  అప్పుడు పోయిన సెల్ ఫోన్ కోసం బాధ పడటం మొదలు పెట్టాను. ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే ఎత్తాడు కానీ.. తర్వాత సిం కార్డ్ విసిరేసుంటాడు.. చాలా cheated గా, నీరసం గా అనిపించింది.  ఫోన్ లో రికార్డ్ చేసిన పిల్లల విన్యాసాలు,..  తీసిన వందలాది ఫోటోలు..  ఐదేళ్ల నుండీ మేరు పర్వతం లా పెరిగిన కాంటాక్ట్ లిస్టూ... కళ్ళ ముందు రీల్స్ గా తిరగటం మొదలయింది.. చా.. సినిమాలు తగ్గించాలి.. మరీ రింగురోడ్డు మీద రింగులు రింగులు గా వెళ్లి పోవటం.. బాగుండదు కదా.. అని ఎలాగో వచ్చి పడ్డాను ఆఫీసుకి.. 

అప్పుడు .. చూడాలి కష్టాలు..  మా వారి నంబర్ అయితే గుర్తుంది, మాట్లాడాను కానీ.. ఇంకెవ్వరి నంబర్లూ గుర్తు లేవు. ఇంటి నంబర్ తో సహా..  తనని అడగ వచ్చు కానీ ఆమాత్రం తెలియదా అని గేలి చేస్తారేమోనని  ఒకటి రెండు సార్లు తప్పు  నంబర్లకి చేసి.. మొత్తానికి ఇంటి నంబర్ కి చేయగలిగా!!!...  

సాయంత్రం ఎవరికో ఫోన్ చేయాలంటే ఆ నంబర్లు లేవు. ఫోన్ లేకపోవటం తో ఎప్పుడూ సీట్ లోనే కూర్చోవాల్సి రావటం అన్నింటికన్నా పెద్ద కష్టం లా తోచింది.ఎవ్వరు ఫోన్ చేసినా ఉండాలని..

సెల్ లేనిదే అస్సలూ నడవదు కదా.. ఇంట్లోంచి బయటకెళ్ళేముందు కార్ లో కూర్చుని.. నేను తాళాలేసుకునే లోపలే 'మంచి నీళ్ళు తీసుకురా.. స్టడీ రూం లోంచి ఫలానా పుస్తకం తీసుకురా ' అని ఫర్మాయిష్ లు కూడా ఈ మొబైల్ ఫోన్ ద్వారా నడుస్తూ ఉండటమే!..సూపర్ మార్కెట్ లో ఒక ఐల్ నుండి రెండో ఐల్ లోకీ ఫోన్ కాల్స్!! రెండు నిమిషాలు లేటైతే కాల్స్.. మూడు నిమిషాలు ముందు వచ్చానని కాల్స్..  వంకాయ పులుసు లో పోపెలా పెట్టాలని కాల్స్.. అడ్రస్ కనుక్కోవటానికి కాల్స్.  

మొన్నీ  మధ్య ట్రైన్ జర్నీ ముందు గా ఒక పిచ్చి ట్రైన్ లో చేసుకుని.. తర్వాత తత్కాల్ లో మాకు కావలసిన ట్రైన్ లో చేసుకున్నాం. మా వారు ..రైలెక్కాక.. 'అన్నట్టు... టికెట్ కాన్సెల్ చేసావు కదా?' అని అడగగానే.. గుండె లటుక్కుమంది. అసలే మమ్మల్ని ఎక్కించటానికి కూడా వచ్చారు మావాళ్ళు.. మర్చిపోయానూ అంటే.. ఎంత అప్రతిష్ట! ' అని 'యా.. చేసేసా' అన్నాను. రైల్లో పిల్లి లా వెళ్లి తన జేబు లోంచి ఐఫోన్ తీసి.. రెండు నిమిషాల్లో కాన్సెల్ చేసేసి.. మళ్ళీ జేబు లో పెట్టేసి.. 'హమ్మయ్యా' అనుకున్నా..ధనుస్సు లేని రాముడినీ, వేణువు లేని కృష్ణుడినీ, త్రిశూలం లేని శివుడినీ అయినా ఒక్కోసారి ఊహించవచ్చు.. 'సెల్లు' అనే మంత్రదండం లేని మనిషి ని ఈరోజుల్లో ఊహించగలమా?  మా పనమ్మాయి మేరీ  దగ్గర్నించీ.. మా బాసు దాకా అంటా సిట్యుయేషన్ ని ఆనందం గా వాడేసుకున్నారు. .. మేరీ రాలేదు.. ఫోన్ చేసి అడుగుదామంటే  నంబర్ లేదాయే.. వచ్చినప్పుడు 'ఏంటి ... చెప్పా పెట్టకుండా మానేయటమేనా?  '  అని నిలదీస్తే.. 'ఫోన్ పన్నిటా.. ఎంగ పోయిటాంగ నీంగ  మాడం ? '  అని చిలిపి గా,  అమాయకం గా అడిగినట్టు అడిగింది.. ఏం చేస్తాం? నంబర్ ఒక కాగితం మీద రాసుకున్నా..  (ఆ కాగితం గంట లోపలే పారేసుకున్నానను కొండి)   

బాసు గారేమో.. 'I called your desk number multiple times.. Looks like you were away.. ' అని కాస్త ప్రోబింగ్ గా అడిగారు..  రెండో రోజు డ్రైవర్ నంబర్ తీసుకోవటం మర్చిపోయి హడావిడిగా ఆఫీస్ లోపలకి పరిగెట్టేసరికి సాయంత్రం.. ఎనిమిది అంతస్స్థుల్లో కార్ ఎక్కడ పెట్టాడో తెలియక లాప్ టాప్ బ్యాగ్ తో తిరగాల్సి వచ్చింది.అంటే ఎంత టైం వేస్ట్? అసలు ఎంత కష్టం...? అని నా మీద నేను తెగ జాలి పడిపోయి.. ఇలా కాదని.. ఎలాగయినా.. ఇన్స్ట్రుమెంట్ కొని తీరాలని అనుకున్నా.. కానీ.. ఇల్లూ.. పనులూ గుర్తొచ్చి..మళ్ళీ పోస్ట్ పోన్ చేసేసా.. ఇంటికొచ్చాక చాలా కాలానికి మా లాండ్ లైన్ ఫోన్ ఏ మూల ఉందో చూసి దుమ్ము దులిపి..  కొత్త ఫోన్ వచ్చేదాకా ఇదే కదా గతి అని అనుకునేంతలో.. రింగ్ అవుతొంది... 

అమ్మ.. 
'ఎక్కడికెళ్ళావు? ఈరోజంతా లేవు.. ఇంటి ఫోన్ కీ అందాకా.. సెల్ కీ అందక? భయపడి చచ్చాను..!!!' హ్మ్.. అనుకున్నా.. ఈ ఫోన్ పోవటం వల్ల .. కాస్త ఇంపార్టెంట్ గా ఫీల్ అయ్యా... కానీ పాత విషయం గుర్తొచ్చింది..


మా స్కూల్   రోజుల్లో హైదరాబాద్ లో ఉండే వాళ్ళమేమో.. ఊర్ల నుండి వచ్చిన చుట్టాలని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా,  మా సర్వీస్ ల అవసరం మా తల్లిదండ్రులకుండేది.   అలా వెళ్ళినప్పుడు  చుట్టాల ఇళ్ళల్లో ఒక్కోసారి  రాత్రి కి ఉండిపొమ్మంటే ఉండిపోయేవాళ్ళం. మా ఇంట్లోనూ ఫోన్ ఉండేది కాదు.. మా వాళ్ళిళ్ళల్లో అంతకన్నా ఉండేవి కావు! ఇంటికి రాత్రి ౧౦ దాటినా రాలేదంటే బహుశా అక్కడ ఉండిపొమ్మన్నారేమో అనుకునేవాళ్ళు మా పెద్దవాళ్ళూనూ.. 


ఆ రోజుల్లో ఉన్న 'ఏమీ కాదన్న' నమ్మకం  ఈరోజు ఉందంటారా?  అప్పట్లో ఒకసారి మా చెల్లి, సడెన్ గా మత కల్లోలాలయ్యాయని  కర్ఫ్యూ విధించినప్పుడు ఇంటికి దాదాపు 20 కి. మీ. దూరం లో ఉండిపోయింది.  అప్పుడు ఫోన్ అవసరం.. దాని ప్రాముఖ్యత తెలిసి వచ్చి మా ఇంట్లో.. ఎక్కువ డబ్బు ఇచ్చైనా పెట్టిన్చుకోవాలనే పట్టుదల వచ్చేసింది.అప్పటిదాకా మాకు లాండ్ లైన్ ఫోనే లేదు! తర్వాతైనా.. ఫోన్ కాల్స్ అంటే అత్యవసర  పరిస్థుతులకోసం..


ఏమాట    కామాటే చెప్పుకోవాలి..  ఫోన్ లేకపోవటం వల్ల  withdrawl  symptoms కనిపించినా (అంటే రెండు చేతులూ వాడుతూ  పని చేస్తున్నప్పుడు  కాస్త తల భుజం మీద కి వంచి.. ఫోన్ అటెండ్ చేస్తున్న పోజు లో ఉండటం.. చేతులు ఫోనుని ఫ్లిప్ ఫ్లాప్ చేసున్న ఆక్షన్ చేస్తూ ఉండటం.. కనులు మూసినా ఫోన్.. తెరిచి చూసినా ఫోనే ... ఇలాగ ఆఫోన్ గురించి కన్నీరు కారుస్తూ ..బెంగ పెట్టుకుంటే.. ఎందుకో తట్టింది.. 

నాకు ఫోన్ లేదని ఆఫీస్ లో వీకెండ్ సపోర్ట్ డ్యూటీ విముక్తి లభించిందని.. వీకెండ్ అంతా ఎక్కడో ఉన్న మనుషులతో కాకుండా హాయిగా చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడటానికి వీలైంది..  ఫోన్ లేనప్పుడు ఇలా ఉండేవాళ్ళమా అని ఆశ్చర్యం వేసింది! సూపర్ మార్కెట్ లో ఇక్కడ కలుద్దాం ఒకవేళ తప్పిపోతే అని ముందస్తు గా అనుకోవటం..  ఈ టైం కి వస్తానని చెప్పుకుని.. కాస్త అటూ ఇటూ అయితే కంగారు పడద్దని అనుకోవటం.. కొద్దిగా అనిశ్చత లో థ్రిల్, కొద్దిగా ఆరాటం లో ఉన్న భావోద్వేగం.. ఎదురు చూపు లో దాగున్న అభిమానాన్ని అసలు ఈ సెల్ ఫోన్లు ఎప్పుడు కబళించి వేసాయి? అని ఆశ్చర్యపడి .. ఆ తృప్తి ని తనివి తీరా అనుభవించాను..

మొత్తానికి ఏదో ఒక పాత ఫోన్ లో టెంపరరీ గా సిం కార్డ్ వేయించుకున్నా..  పాత కాలం టైప్ రైటర్ కి బలం గా నొక్కినట్టు నొక్కితేనే కానీ నంబర్ వెళ్ళని అరకిలో బరువున్న గుండ్రాయి లాంటి ఫోన్. అన్ని కాంటాక్ట్ లూ పోయాయి. ఐదేళ్ళ నుండీ సంపాదించిన నంబర్లు!!! ఎక్కడెక్కడ పట్టుకోను మళ్ళీ ? 


ఇంక ఆఫీస్ లో  కో వర్కర్స్, చుట్టు పక్కల వారు చుట్టాలు .. చివరికి పిల్లల దగ్గర్నించీ ఆంతా చెప్పేవారే.. కాస్త జాగ్రత్త గా బ్యాగ్ లో పెట్టుకోవాల్సింది...జిప్ వేసి పెట్టుకోవాలి.. రోడ్ మీద ప్రయాణాలప్పుడు!!  (అదే మరి.. వినే వాడు వెంగళప్ప అయితే చెప్పేవాడు మహాజ్ఞాని అవుతాడు)  

అప్పుడప్పుడూ కాంటాక్ట్స్ కంప్యూటర్ లోకి ఎక్కించుకోవా నీవు? (ఏదో రోజూ పళ్ళు తోముకోవా? ' అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి మరీ అడగటం.. )  

కొంత మందైతే మరీ.. స్కూటర్ నడపడం మానేయి అసలు.. అలాగే ఎత్తుకుపోతారు.. రేప్పొద్దున్న నీ ఆఫీస్ బ్యాగ్ ఎత్తుకుపోతెనో? (ఆహా.. అంత వంటి మీద స్పృహ లేని దాన్నా?)  

ఇంకా  అందరూ వాళ్ల పెద్దత్తగారి చిన్న కోడలి బావ ఫోన్ ఎలా పోయింది? దగ్గర్నించీ.. స్కూటర్ మీద వెళ్తున్న వాళ్ల ఆడపడచు వాళ్ల బాబాయి గారి కూతురి మెదలోంచి మంగళ సూత్రం ఎంత లాఘవం గా లాగేసారో.. కూలంకషం గా వర్ణించి చెప్పి నా బ్రెయిన్ వాష్ చేసేసారు.. (మనలోమాట.. నేనూ ఇలాంటి చాన్స్ వస్తే.. అస్సలూ తగ్గను ! ౩-౪ ఇలాంటి కథలు అనర్గళం గా చెప్పేస్తాను మామూలు గా..  ఇప్పుడు విక్టిమ్స్ మనం కదా.. అందుకే పెద్దగా సొక్కలేదన్నమాట)..
  
ఇదిగో.. సెల్ ఫోన్, లాప్ టాప్..పర్సూ అవీ .. జాగ్రత్త.. పారేసుకోకు.. (చా..సెటైర్లు.. ఒకసారి పోగొట్టుకున్నంత మాత్రాన.. ఎలా కనపడుతున్నాను?)
ఏం చేస్తాం..ఇలానేను ఎలా చేసి ఉండవల్సిందీ.. నేను చేసిన ప్రాథమిక తప్పిదాలేంటి అన్న విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవటం ఒక ఎత్తు.. ఫోన్లు ఎత్తటం మరో ఎత్తు.. కొంతమంది కాల్స్ స్క్రీన్ చేయటానికి లేదు. ప్రతి వాళ్ళు చేసిన ఫోన్లూ ఎత్తాల్సి వచ్చింది. బాస్ తో కస్టమర్ ఇస్ష్యూ గురించి మాట్లాడుతుంటే.. దూరం చుట్టాలావిడ కాల్.. ఏమైనా అర్జంటా? అంటే.. 'అబ్బే ..చాలా కాలం అయింది కదా అని ఊరకే చేశా ' అంది.. 'నా తల్లే ' అనుకుని.. సాయంత్రం మాట్లాదతానని వాగ్దానం చేసి బయటపడ్డాను.  

అలా అని జరిగిన మరో మేలు ఉంది లెండి.. ఒక స్నేహితురాలు చేసిన పని మీద కోపం వచ్చి తన కాల్స్ తీసుకోవట్లేదు... కానీ నంబర్ చూపించక పోవటం తో.. ఎవరో ఏంటో అనుకుని ఎత్తి.. . మాట్లాడి మనస్పర్థలు దూరం చేసుకోవటమైంది.  చాలా తేలిగ్గా అనిపించింది మనస్సంతా.. 

కొత్త  ఫోన్ కొనాలి.. అనగానే..ఒక్కసారి బజార్ల లో వెరైటీ చూస్తే కళ్ళు తిరిగినంత పని అయింది. కళ్ళు మూసుకుని ఈసారి మినిమం ఫీచర్లున్న ఫోన్ కొనాలా? ఫోన్ పోయినా అంత బాధ పడకుండా.. లేక ఐఫోన్.. ఆన్డ్రైడ్ లాంటి హై ఎండ్ ? తర్జన బర్జన..  పిల్లలు ఐఫోన్..ఐఫోన్.. అని..  మా బాంక్ పాస్ బుక్కేమో.. కొద్దిగా చవకైన ఫోన్ అనీ..  హ్మ్.. 

 ప్రతి సంవత్సరం అకాడెమిక్ ఇయర్ మొదలయ్యేముందు.. పుస్తకాలన్నింటికీ అట్టలేసి..జాగ్రత్తగా.. మొదటి వారమంతా అందంగా ఎలా నోట్స్ రాస్తామో.. జనవరి ఫస్ట్ నుండీ.. టెంత్ దాకా ఎలా డైరీ రాసి జిమ్ కెళ్ళి వస్తామో.. అలాగ నేనూ మొదట కొన్ని రోజులు రెగ్యులర్ గా సిస్టం లో ఫోన్ నుండి బాక్ అప్ చేసుకుంటా.. 


ఈలోగా.. మీ ఫోన్ నేను పొరపాటున ఎత్తక పొతే 'ఏదో పాత ఫోన్ కదా.. సిగ్నల్ సరిగ్గా దొరక లేదేమో అనుకొండే? ' ..Saturday, February 5, 2011 123 comments

వింటే భారతమే వినాలి.. తింటే...పిల్లలకి కథలు చెప్పటం నాకు ఇష్టమే కానీ కథలే రావు. పోనీ నాకు తెలిసిన నాలుగు కథలైనా చెప్దామని చూస్తే, అవన్నీ పిల్లలు ఏ కార్టూన్ చానెల్ లోనో.. లేదా.. టింకిల్ లోనో చదివేసాం అనేస్తారు. రోజూ కథలు.. అందునా ఏడేళ్లకు పైగా చెప్పాలంటే.. ఏ సుధా మూర్తో కావాలి కానీ నా లాంటి వాళ్ల తరమా?  పోనీ ఏదైనా కథ చదివి చెప్దాం అనుకుంటే వాళ్ళు నా కన్నా ముందుగానే చదివేస్తున్నారు. :-((

అప్పటికీ రెండేళ్ళ క్రితం ఒక ట్రిక్ కనిపెట్టి వాడటం మొదలు పెట్టాను. కథ లో ఒక దుర్గుణం ఉన్న పిల్ల ఉంటుంది.. కథ పూర్తయ్యేసరికి ఆ దుర్గుణా న్ని  అధిగమిస్తుంది.  ఏ కళనున్నారో.. ఒక వారం విన్నారు. తర్వాత.. మా పెద్ద అమ్మాయి 'Ammaa.. Please don't tell me the stories of bad girls turning in to good girls.. I got the msg..' అనేసింది.  ఈ కాలం పిల్లల్ని కసి తీరా తిట్టుకుని, నా చిన్నప్పుడు ఎంత వినమ్రం గా  ఉండేవాళ్ళం? అనుకుని.. ఊరుకున్నాను.

ఇలా కాదు.. ఈసారి మన ఇతిహాసాలు, పురాణాలు,  వెలికి తీసి చెప్దాం అనుకుని చూస్తే.. హనుమంతుడి కథలూ, చిన్ని కృష్ణుడి లీలలూ TV లో చూసేసారు.. రామాయణమూ, వినాయకుడి కథలూ ఏదో చానెల్ లో వేస్తూనే ఉన్నారు. .. బిక్క మొహం వేసాను.. పైగా మా చిన్నది.. 'మొన్నటి వరకూ.. నా favorite god హనుమాన్ జీ కానీ టీ వీ లో 'బాల్ గ ణేశ' చూసాక ఇప్పుడు 'శివ జీ ' అంది...  ఇక నా వల్ల కాదు అని వదిలేసాను కానీ.. మొన్న దీపావళి కి ఇల్లు దులుపుతుంటే.. ప్రయాగ రామకృష్ణ 'భారతం లో చిన్న కథలు ' కనిపించింది. కానీ.. వద్దులే చిన్నపిల్లలకి ఒకటి రెండు కథలు పర్వాలేదు కానీ.. వాళ్లకి అర్థమయ్యేలా, ఆసక్తికరం గా.. మహా భారతం  చెప్పాలంటే కష్టమే.. అనుకున్నా  ముందర ౨-౩ సార్లు ప్రయత్నించి మానేసాను.  మళ్ళీ చూద్దాం అని మొదలు పెట్టాను..ప్రతి సారీ భరతుడి పుట్టుక తో మొదలు పెట్టి.. మరీ chronological  గా చెప్పటం వల్ల వాళ్లకి ఆసక్తికరం గా చెప్పలేక పోతున్నట్టు అనిపించి.. ఈసారి వ్యూహం మార్చి చిన్న పిట్ట కథ తో మొదలు పెట్టి చూస్తే ఆసక్తి గా వింటారేమో చూద్దాం అని మొదలు పెట్టాను, ఏకలవ్యుడి గురించి..కథ తో.. 

వింటే భారతమే వినాలి.. తింటే గారెలే తినాలి.. అన్నాను.. ఉపోద్ఘాతం గా..
I don't like gaarelu anyway.. అంది విసుగ్గా.. మా పెద్దమ్మాయి. 
సరే పిజ్జా అనుకో.. అన్నాను..మా పెద్దమ్మాయి అలవాటుగా పెదవి విరిచి.. 'I know this one' అని అనాసక్తి గా అటు తిరిగి పడుకుంది. మా చిన్నమ్మాయి పెద్దగా పుస్తకాలు చదవటం అవీ చేయదు.. అందువల్ల జాగ్రత్తగానే వింది. కథ పూర్తయ్యాక.. 'How mean?' అంది. ద్రోణాచార్యుడు ఆవిధం గా ప్రవర్తించటానికి కారణాలున్నాయి అని ఆగాను. మా పెద్దమ్మాయి కొద్దిగా ఇటు తిరిగినట్టు అనిపించింది.  

హమ్మయ్య అనుకుని.. కొద్దిగా ఆయనకు హస్తినాపురి తో ఉన్న అనుబంధాన్ని.. అసలు ఆయన ఎందుకు కురు వంశం వాళ్ళ రాకుమారులకి గురువు ఎలా అయ్యాడో చెప్పి.. అసలు దానికీ ఇంకో రీజన్ ఉంది.. అని ఆపేశాను.  అప్పటికి ఇద్దరూ చాలా ఆసక్తి గా వింటున్నట్టు అనిపించింది. కృపి, కృపాచార్యుల వారి పరిచయం జరిగింది.. ద్రోణాచార్యులవారి బీదరికం సంగతి చెప్పి.. ఆయనకి వేరేచోట తిండికి మార్గమేలేక కాదు ఒక లక్ష్యం తో వచ్చాడు..  ఆ లక్ష్యం గురించి రేపు చెప్తాను అని ఆపేశాను.


నేనాశించిన రియాక్షన్ అయితే వచ్చింది...'నో అమ్మా.. ప్లీజ్.. చెప్పు ఎందుకు వచ్చాడో...' అని.. నేనూరుకోలేదు.. కుదరదు అని కథ ఆపేశాను.  మర్నాడు మళ్ళీ అన్నం తిన్నాక, ద్రోణాచార్యుడి చిన్నప్పటి విషయాలూ, ఆయనకి ద్రుపదుడితో స్నేహం, తర్వాత పెద్దయ్యాకా వచ్చిన విభేదం గట్రా చెప్పి మళ్ళీ కౌరవుల, పాండవుల చిన్నప్పటి కాలం లోకి లాక్కొచ్చి పడేశాను. 

పాండవులూ, కౌరవులూ అంటే కజిన్లే కానీ వారికి వైరం ఉన్న విషయం వారికి అర్థం అయ్యేలా చేసి వారిచేతే.. 'ఎందుకూ' అని అడిగించి వాళ్ళ తల్లిదండ్రుల పరిచయం చేసి..
వారు ఆవిధం గా.. ఒకరు అంధత్వం తోనూ, ఇంకొకరు పాండు రోగం తోనూ.. పుట్టటం వెనక కూడా ఒక రహస్యం ఉందని చెప్పి ఆరోజు కథ ఆపేశాను. మళ్ళీ గొడవ. ఇంకా చెప్పు.. చెప్పు అని..

ఇలాగ.. పాండవులకీ, కౌరవులకీ ఉన్న వైరం గురించి చెప్తూ.. వారి పూర్వీకుల కథల్లోకి ఒక్కొక్కరి కథ లోకి తొంగి చూస్తూ.. మళ్ళీ వర్తమానం లోకి వస్తూ కథ నడిపిస్తూ మా ఇంట్లో మహా భారత సాగరం లో ఈదుతూ ఉన్నాం. దీపావళప్పుడు మొదలు పెట్టిన కథ సంక్రాంతి దాటినా అవలేదు..  'కట్టె, కొట్టె, తెచ్చె ' గా చెప్పవచ్చు గానీ..


ప్రపంచం లో ఉన్న సమయం అంతా ఈ కథ చెప్పుకోవటానికే అన్నట్టు.. మేము.. ఏ చిన్న విషయమూ వదలకుండా.. 10 నిమిషాల కథా.. 20 నిమిషాల చర్చా.. వాళ్ళ భావోద్వేగాలు అన్నీ విపులం గా చెప్పుకుని ఆలోచిస్తూ అలాగ..

సాధారణం గా మన ఇతిహాసాలూ, పురాణాలూ చదివితే చదివిన వారికీ, విన్న వారికీ.. ఫలానా శుభాలు కలుగుతాయని శ్లోకాలు ఉంటాయి కదా.. అవన్నింటి సంగతీ ఏమో కానీ.. నాకు  గత రెండున్నర నెలల్లో కలిగిన శుభాలైతే ఇవీ.. 


ఇంట్లో టీవీ గోల తగ్గి పిల్లలు ఒక రకమైన ఆలోచన లో పడ్డారనిపించింది..  త్వరగా పని పూర్తిచేసుకుని మర్నాటికి కావలసినవి రెడీ చేసుకుంటే కానీ భారత కథ ఉండదన్నానని..  పనులన్నీ చక చకా పూర్తి చేసుకుని నేను వంట చేస్తున్నా.. వేరే పనులు చేస్తున్నా.. నా వెనకే తిరుగుతూ వంటిట్లో రెండు స్టూల్లేసుకుని కూర్చుని నాకు పప్పులూ, ఉప్పులూ అందించటం.. 

రికార్డ్ స్థాయిలో.. గడియారం ఎనిమిది కొట్టేసరికి పిల్లలుమంచం ఎక్కేసి.. కథ కోసం ఆరాట పడేవారు..  రోజు లో చాలా సార్లు భారతానికి సంబంధించిన ప్రశ్నలెన్నో అడిగేవారు.  కొన్ని ప్రశ్నలు ఇబ్బంది పెడితే.. కొన్ని అబ్బురపరిచాయి. కొన్నింటికి సమాధానాల కోసం నాకు తెలిసిన పెద్దవారినీ, పండితులనీ సంప్రదించాల్సి వస్తే.. కొన్ని ప్రశ్నలు నాకు రాలేదేమని ఈర్ష్య కలగ జేశాయి.  మచ్చుకి..  


లాక్షా గృహ దహనానంతరం పాండవులు తమకిచ్చిన ఆహారం లో సగం భీముడికివ్వాలని కదా రూల్? మరి కుంతి ద్రౌపది ని తెచ్చినప్పుడు.. అందరూ సమానంగా పంచుకొమ్మని రూల్ ఎందుకు మార్చింది?

Thank God.. matsya yantra test was not won by one of kauravaas'  

'Wow.. Mahabharat is based on hatred in brothers, and Ramayan is based on love..'


ఉపపాండవులు పాండవులని ఏమని పిలిచేవారు? ధర్మరాజ నాన్నా? భీమ నాన్నా.. అలాగా?

ఒక  అక్కా, తమ్ముళ్లలో అక్క రాణి అయి, తమ్ముడు రాక్షసుడిలా అయ్యాడు? (సుధేష్ణ, కీచకులు)
ధృతరాష్ట్రుడికి తన పిల్లలందరి లోనూ.. ఒక్క దుర్యోధన దుశ్శాసనులే ఎక్కువగా ఇష్టమా? అర్జునుడే ఎక్కువ డామేజ్ చేస్తే.. భీముడిని ఎందుకు కౌగలించుకుని చంపాలనుకున్నాడు? 
విశ్వరూపాన్ని , ధృతరాష్ట్రుడు చూడ గలిగాడు కదా మరి గాంధారి పట్టీ తీసిందా? ..  స్నానం చేసేటప్పుడు.. పట్టీ తీస్తే కనిపిస్తుందా? అని
ఆశ్వత్థామ హతః కుంజరః అన్న ఒక్క అబద్ధానికి కొన్ని క్షణాల పాటూ నరకాన్ని చూసాడు కదా ధర్మరాజు.. మరి 'What about gambling and loosing brothers and wife and troubling them for years..?'

కథ  అయ్యాక సరదాకి కొన్ని ప్రశ్నలడిగాను. 
మహా భారత యుద్ధానికి కారణమెవ్వరు? ఒకళ్ళు ద్రౌపది, ధర్మరాజులనీ, ఇంకొకళ్ళు భీష్మ ప్రతిజ్ఞ-ధృతరాష్ట్రుడు గుడ్డి వాడవడమనీ..  సుయోధనుడి జెలసీ అనీ చెప్పారు.
గాంధారి కరెక్ట్ పని చేసిందా? అంటే... ఒకళ్ళు 'లేదు.. She should have helped him instead..' అని,.. 'ఏమో.. ధృతరాష్ట్రుడికి జెలసీ అనుకుని కట్ట్కుకుందేమో.. అని.. 
బెస్ట్ కారెక్టర్ ఎవరు భారతం లో ? అంటే  ఒకళ్ళు 'అఫ్కోర్స్ కృష్ణుడని, ఇంకోళ్ళు.. కర్ణుడనీ 
బెస్ట్ లేడీ.. అంటే..ఒకళ్ళు ద్రౌపది అనీ, ఇంకొకళ్ళు కుంతి అనీ.. 


అలాగే నువ్వే ద్రౌపది వైతే ఏం చేసేదానివి? కుంతి వైతే ఏం చేసేదానివి? యుద్ధం ఏం జరిగితే ఆగి ఉండేది.. లాంటి చాలా ప్రశ్నలకి వారి సమాధానాలు రాసి పెట్టుకున్నాను.  నాకు తెలుసు.. ప్రతి సంవత్సరమూ.. వాళ్ల మానసిక ఎదుగుదలని బట్టి సమాధానాలు మారుతూ ఉంటాయని..  
ఇవ్వాళ మొత్తానికి నా కథ చెప్పటం అయిపోయింది. మరి రేపేం చేయాలి? రాత్రి ఇంతకన్నా మించిన కథ ఏముంటుంది? అని ఆలోచిస్తూ ఉన్నాను.. ఇప్పుడే మా అమ్మాయి నిద్ర లోంచి లేచి అడిగింది.. 'పోనీ భగవద్గీత చెప్తావా? రేపు ? ' అని.. 'నీకు అర్థం అవుతుందా? ఇంకా కొంచెం పెద్దవ్వాలి ..' అంటే.. 'I just want to know what made Arjuna go to the war..  What did Lord Krishna say to make him go..' అంది. 

నేను.. భగవద్గీత మొదలు పెట్టాను చదవటం.. సరిగ్గా చెప్పలేనేమో.. నాకే అర్థం కాదేమో.. అన్నీ అనుమానాలే.. 


ఇప్పుడు నా మీద కొత్త ఒత్తిడి మొదలైంది.. మహా భారతాన్ని మించి మెప్పించే కథ ఏముంది? ఏమి చెప్పి ఒప్పించగలను నా పిల్లలని .. అని.. Any suggestions?
 
;