Thursday, March 8, 2012

ఆకుపచ్చ చుడీదార్ అమ్మాయి..

అదేం చిత్రమో?!,


ఖాళీ గా, ఉద్యోగం లో లాంగ్ లీవ్ పెట్టుకుని కూర్చున్నప్పుడు ఒక్క పుస్తకం చదవబుద్ధయ్యేది కాదు. ఒక్క ముక్క నాకోసం రాసుకోబుద్ధయ్యేది కాదు. ఎవరికైనా స్నేహితులకి కాల్ చేసి హస్కు కొట్ట బుద్ధయ్యేది కాదు. ధ్యానం, తోటపనీ .. అబ్బే.. చెప్పనే అక్కరలేదు. కస్టమర్లు ‘ఇదేం ప్రోడక్ట్ రా బాబోయ్!’ అని గగ్గోలు పెట్టినప్పుడు, పనమ్మాయి ‘మెడికల్ లీవు’ పెట్టినప్పుడు, ప్రాజెక్ట్ డెడ్లైన్ నెత్తి మీద ఉన్నప్పుడు, ముఖ్యం గా మార్చ్ లో పిల్లల పరీక్షలున్నప్పుడు.. రోలర్ కోస్టర్ రైడ్ లో కిందా మీదా పడుతూ,లేస్తూ, పుస్తకాలు చదువుతుంటే ఉంటుంది మజా.. అబ్బ!.. చిన్నదనం లో దొంగతనం గా పక్కింటి మామిడి కాయలు రాళ్లతో కొట్టి, వంటింట్లోంచి తెచ్చుకున్న ఉప్పూ,కారం నంచుకుంటూ తిన్నప్పుడు కూడా రాలేదనిపిస్తుంది నాకు.

నెల రోజులనుండీ.. మేము చేసిన ప్రాజెక్ట్ వాడుకున్న పాపానికి బలైన కస్టమర్లు ఫోన్ కాల్ లో, మా కోడ్ దెబ్బకి పడ్డ బాధలకి భోరు భోరున విలపిస్తూ చెప్పుకుంతుంటే ‘ఆహా... పుస్తకాలు తిరగేస్తూ..’ సానుభూతి ప్రకటిస్తూ, ‘మీకెందుకూ.. రేపటికల్లా ఫిక్స్ ఇచ్చేయమూ? ‘ అని ఓదారుస్తూ.. తెగ చదివేశా ఈ మధ్య.

మొన్న మాంచి సస్పెన్స్ లో పుస్తకం చదవటం ఆపేసి స్కూటర్ మీద ఆఫీసు కి వెళ్తుంటే, ఆ సమయం అంతా పుస్తకాలు చదవకుండా అయిపోతుందని ఒకటే బాధ! కాలేజ్ రోజుల్లో బస్సుల్లో వేలాడుతూ ఎన్ని పుస్తకాలు చదివామో.. ఎంత సరదాగా ఉండేదో.. ఒక్కోసారి పుస్తకం లో ములిగి పోయి దిగాల్సిన స్టాప్ దాటేసామని గ్రహించి, మళ్లీ వెనక్కెళ్ళే బస్సు పట్టుకోవటం.. ఆ అనుభవాలన్నీ ఎంత బాగుండేవి.. ఇలా కాదని నిన్న వెళ్లేటప్పుడు మా వారితో వెళ్లి వెనక్కి వచ్చేటప్పుడు బస్సు లో వద్దామని రెండు మూడు పుస్తకాలు బ్యాగు లో పెట్టుకున్నా..వెనక్కి వచ్చేటప్పుడు, ఉత్సాహం గా.. మెయిన్ రోడ్డెక్కేవరకూ కొద్ది కొద్దిగా చదువుతూ రోడ్డెక్కి మూసేసా.. నా ఖర్మేంటో, బస్టాప్ అంతా జనమే జనం. కిక్కిరిసిపోయి, మొహాలూ, లాప్ టాప్ బాగులూ వేలాడేసుకుని బోల్డు అమ్మాయిలూ, అబ్బాయిలూ.. చుట్టూ అన్నీ సాఫ్ట్ వేర్ కంపెనీ లేగా? నేనూ అక్కడే సెటిల్ అయిపోయా.. ఒక్కసారి గా కర్రీ పఫ్ ల వాసన.. తిరిగి చూస్తే పక్కన బేకరీ.. ‘వావ్.. ఇది కూడా తిందాం..చాలా రోజులైంది అని ఒక వెజ్ పఫ్ ఆర్డరిచ్చా..’ అక్కడే ..దుమ్ము లో నిలబడి తింటుంటే.. ఆహా స్వర్గమే.. (ఆఫ్ కోర్స్.. దుమ్ము మేఘాల వల్ల కూడా అలా అనిపించి ఉండవచ్చు).. బస్సుల నిండా వేలాడుతూ జనం.. బాబోయ్.. ఇంత మందా.. ఇక చదివినట్టే.. అనుకుని నిరుత్సాహబడ్డా..

కానీ... పోన్లే.. దంచినమ్మకి బొక్కినంత.. అనుకుని కనీసం కర్ర్రీ పఫ్ తిన్నాను.. అనుకుని ఒక బస్సేక్కేసా నేనూ. పక్కకి కదలటానికి లేదు.. కాకపొతే ఏసీ బస్సు అవటం తో, ఏదో ఒక మాదిరి గా పర్వాలేదు. కొందరు చెవుల్లో ఐ పోడులూ, చేతుల్లో ఐ పాడులూ, బిజీ బిజీ గా.. కొందరు కనీసం ఫోన్లో.. ‘అబ్బా.. ఏమిరుక్కున్నానో.. స్కూటర్ మీదయితే ఈ పాటికి ఇంటికెళ్లి పోయుంటానేమో.. హహ్’ అనుకుంటుండగానే..

‘అది కాదురా! ‘ అని వినపడింది. నా వెనక ఉన్న అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్నట్టుంది. వాళ్ల తమ్ముడితోనో, కొడుకుతోనో.. ఏమోలే అనుకున్నా..

‘నువ్వింత లవ్ చేస్తున్నావ్. అది అసలు నిన్ను కేర్ చేస్తుందా? ‘ అంటోంది.. (అబ్బ! రష్ గా ఉంటే ఉంది బస్సు. భలే కబుర్లు వినచ్చు..’ అని చెవి అటువైపు పడేశా..)

‘నువ్వెంత స్ట్రాంగ్ గా ఉండాలంటే.. అది రేపు నీ ప్రాజెక్ట్ లో, నీ పార్ట్ నర్ గా వచ్చినా నువ్వు నవ్వుతూ పని చేయగలగాలి!’ (అమ్మో చాలా తెలివైన పిల్ల లా ఉంది.. ఈ అమ్మాయి మొహం చూద్దామంటే, తల తిప్పే చోటు లేదు. ఆకుపచ్చ చుడీదార్ అంచులు మాత్రం కనిపిస్తున్నాయి)

“అయినా.. నీకు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ వచ్చు.. దానికేమొచ్చు? చచ్చు పుచ్చు ఇంగ్లీషూ అదీనూ.. “ (ఓహో.. ప్రేమ కి ఇవన్నీ కావాలన్నమాట.. ఛా.. ఈ తెలివి లేక అనవసరం గా చదువుకున్నప్పుడు భాషలని లైట్ తీసుకున్నా.. అందుకే ప్రేమ లో పడలేకపోయా  ‘ )

‘నువ్వు.. ఫలానా యూనివర్సిటీ రా.. అది.. ఆ సుత్తి ఉస్మానియా..యూనివర్సిటీ..’ (ఆ అమ్మాయి మీద ఓ మాదిరి గా ఉన్న తున్న భావం .. అంతా.. కూకటి వేళ్లతో పెకిలింపబడిపోయింది.. వార్నీ.. మా ఉస్మానియా కేమైందిట? దీనికి మరీ కొళుపు ఎక్కువ.. అక్కసు గా అనుకున్నా’

‘అయినా. ఏదో పబ్ కి నాతో వచ్చావే అనుకో.. సొ? ఆ మాత్రానికే అలుగుతుందా?’ (ఓహో..అదన్నమాట)

‘సిగ్నల్ చాలా బాగున్నట్టుంది.. అవతల పక్క మాటలు కూడా కొద్దిగా వినబడుతున్నాయి. (నేనూ చెవి కాస్త ఎక్కువ రిక్కించాననుకోండి..)

(అవతల పక్కనుండి).. ;అది కాదు తల్లీ.. ఐ లవ్ హర్..’ (ఓహో.. ప్రేమికుడు.. ప్చ్.. పాపం. ).

‘ఒరేయ్.. నువ్వు ఫూలిష్ గా మాటాడకు.. మా లవ్వే మనకు వద్దు. .. ఆగు రూమ్ కెళ్ళాక మాట్లాడతా .. బస్సులో ఉన్నాన్రా!’ (ఓహో నాలా ఇంకా జనాలు వింటున్నారా? చుట్టూ చూశా.. నాలాంటి ‘హుందా తత్వం ‘ ఉన్నవారిలా ఉన్న పెద్దవాళ్లు ఒకరిద్దరు వింటూ, ఈ మాట విన్నాక.. నావైపు అదోరకం గా చూశారు.. అదేదో వాళ్లకొక్కల్లకే వినే హక్కున్నట్టు.. నేను పట్టించుకుంటే కదా..)

‘అసలు.. ఫేస్బుక్ లోకి కొన్ని రోజులు వెళ్లకు.. కాల్స్ కట్ చేయి, సిమ్ కార్డ్ మార్చెయ్..చాట్ లోకి వెళ్లకు.. (ప్లానంతా రెడీ.. గుడ్..)

;(అవతల పక్క నుండి) “అది కాదే.. మొన్న దానికి expensive watch,ring ఇచ్చా.. పైగా.. సమ్యక్ లో సల్వార్లు కొన్నా..’ ( ఇదన్నమాట అబ్బాయి బాధ!)

“ఎప్పటికి మారతార్రా మీరూ.. కన్ఫర్మ్ అవకుండా.. టైం తీసుకోకుండా అలా గిఫ్తులిస్తారా మీరూ! టూ మచ్! ‘ (కన్ఫర్మ్ అంటే ఏంటో.. ఎంత టైం తీసుకున్నాక గిఫ్టులివ్వచ్చో..మనకి ఎలా తెలుస్తుంది?)

“(అవతల పక్కనుంచి..) “నువ్వు మరీ చెప్తావు.. గిఫ్ట్ ఇవ్వకుండా పబ్ దాకా వస్తారా ఎవరైనా.. తన సంగతి వదిలేయ్.. నువ్వేడతావా?’ (అమ్మో..ఇదొకటా? బానే ఉంది)

“ఒరేయ్.. నా సంగతి వదిలేయరా! నేను రమేష్ ని ఎప్పుడూ ఏదీ అడగలేదు. సునీల్ అంటే.. అప్పుడు నాకు తెలియదు రా.. సచ్చా ప్యార్ అంటే ఏంటో..’ (అయ్యో.. ఈ అమ్మాయిని కనుక్కోవాలి సచ్చా ప్యార్ ఏంటో.. )

బస్ స్టాప్ వచ్చింది. జనాలందరూ దిగిపోతున్నారు.. ఈ అమ్మాయి మొహం చూసి తరించవచ్చు.. అని ఉత్సాహం గా తిరిగితే.. పిల్ల కి సీట్ దొరికింది. ముఖం అవతల వైపు.. ఆ పిల్ల పక్కన ఆల్రెడీ ఎవరో .. నుంచున్నారు... నేనూ ఎలాగోలా దూరిపోయా.. కొద్దిగా మిస్సయినట్టున్నా.. కానీ..అసలు ఎలా మాట్లాడుతోంది.. అంత వ్యక్తిగత విషయాలు బస్సులో పది మంది మధ్యలో. కొంతమంది గమనిస్తున్నారని తెలిసినా.. పెద్దగానే మాట్లాడుతుంది..

‘ఇది స్కూల్/కాలేజ్ కాదు రా.. కార్పోరేషన్..’ ( కార్పోరేట్ వరల్డ్ అనుకుంటా..నాలా వింటున్న పెద్ద మనుషులు కిసుక్కు మన్నారు.. నేను సమయానికి గిచ్చుకున్నాను కాబట్టి గట్టి గా నవ్వలేదు.)

‘అది కాదు రా.. అసలు ముందు నువ్వు నన్నే లవ్ చేశావు.. అదే నీకు మంచిది. కానీ నువ్వు నాకు సరిపోవు రా.. అందుకే నీకు సరిపోయే అమ్మాయిని సెట్ చేసే బాధ్యత నాది.. ‘ (ఆ అమ్మాయి కి సరిపోని ఆ అబ్బాయికి ‘సెట్’ చేసి పెట్టేంత మంచి హృదయం .. ఖళ్, ఖళ్, మని దగ్గొచ్చేసింది.. అంటే ఆనందం, తృప్తి, జాలి, కోపం..చిరాకు,బాధ, అసహ్యం లాంటి వాటిల్లో ఎగ్జాక్ట్ గా ఏం కలిగిందో చెప్పటం కష్టం.. ఆ అమ్మాయి మొహం చూడ్డామనుకున్నాను కానీ నేనీ భావ పరంపరల తాకిడి లో ఉక్కిరిబిక్కిరి అవుతుండగానే.. ఆ పిల్ల లేచి నిలబడింది.. గేట్ దగ్గర కెడుతూ కూడా మాట్లాడుతోంది.. ‘ఇప్పుడు నేను సింగిల్ కాదు రా..రవీ చాలా మంచోడు రా..వాడికి నేనంటే చాలా ఇష్టం..’ అబ్బో!! ఈ అమ్మాయికి వాల్యూస్ చాలా ఎక్కువ లా ఉంది)..

‘వ్వ్వావ్వావ్వాట్!!!!’ కోపం గా అరుస్తూ దిగిపోయింది ఆకుపచ్చ చుడీదార్.. .. బస్సు కదిలిపోయింది. ‘ఆ అబ్బాయి ఏమనుంటాడో.. అంత గట్టి గా వ్వ్హాట్ అంది’ అని నేను ఆలోచిస్తుండగానే నేను దిగవలసిన స్టేజీ వచ్చేసింది... నా పుస్తకాలు బస్సులో తెరిచిన పాపానికి పోలేదని గుర్తుకొచ్చింది.





49 comments:

sphurita mylavarapu said...

:)))))

మధురవాణి said...

LOL.... Hilarious!!! :)))))))))

Anonymous said...

Pustakam teravakapote em? Antakanna manchi kadhe vinnaruga. Chala bagundi. Good one.
Kalyani

శారద said...

పుస్తకాలెందుకండీ, ఇంత మంచి సంభాషణలు వినేటప్పుడు?పుస్తకాల్లో ఇంత కంటే ఙ్ఞానమూ, సమాచారమూ వుంటాయా? :P

అంతర్జాతీయ మహిళా దినం (మహిళల దినం కాదు!) రోజు బలే చురకలేసారే!
వెరీ నైస్!
శారద

Anonymous said...

thy name modernity

కొత్తావకాయ said...

నిజంగానే మీ పాపానికి నిష్కృతి లేదండీ. మీరూ ఒక్క దూకులో దిగి వెంబడించలేకపోయారా? రవేమయ్యాడో ఏమో.. ప్చ్.. బాబోయ్ ఇప్పుడు నాక్కూడా బాధావేశాసహ్యకావేశాలు ముంచుకొచ్చేస్తున్నట్టున్నాయ్. :(

nice post! :)

Sravya V said...

హ హ భలే observations !

గ్రీన్ చుడిదార్ , ఆ రవి దొందూ దొందే లాగున్నాయి కాబట్టి నో సానుభూతి ఓన్లీ నవ్వులు :)))

విరజాజి said...

కిట్టూ, నిజంగా నీవు చాలా గ్రేట్ రా (రా అనే మాట ఆడ స్నేహితుల కోసం కూడా వాడుతున్నారు అందుకె అలా రాసాను), అస్సలు హెంత బాగా రాసావో. ఇంతకీ రవి పాపం !!

మీరు బస్సులోనే విన్నారు - నేను మా ఆఫీసు లో కారిడార్లో, వాష్ రూంలో రోజూ చాలా ఇలాటి కధలు వింటూ...........నే ఉంటాను. ఇప్పటి అబ్బాయిల మీద జాలి పడడం తప్ప ఇంకేం చెయ్యలేక నిట్టూరుస్తూ ఉంటాను.

భావన said...

హ హ హ అసలు ఆకుపచ్చ చూడిదార్ అమ్మాయి కి జై. నా మాట విని రోజు బస్సు లోనో ట్రైన్ లోనో వెళ్ళండి, వెధవ బండీ తీసి మీ పనమ్మాయికి దీపావళి కు గిఫ్ట్ ఇద్దురు. ;-)

pallavi said...

I am coming to your blog and checking everyday, that if you are gonna post 'mary, nenu' next..

Anonymous said...

ఏం అనుమానంలేదు. నేటి రోజు పరిస్థితి ఇంతే.

జ్యోతిర్మయి said...

కృష్ణ ప్రియ గారూ పుస్తకం తెరవకపోతేనేంలెండి. మీకు లోక జ్ఞానం చాలా వచ్చింది. మాక్కూడా పంచేశారు.

Found In Folsom said...

Hahahaha.....maa papa ni paduko bedutu chadiva....so paiki gattiga navvaleka poyanu....:) omg, hilarious...

జయ said...

బాగుందండి అనుభవం:) మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి.

Subramanya Shastry said...

మీకు ఆ అమ్మాయి ముఖం చూడాలనిపించింది - నాకు ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులెవరో చూడాలనిపిస్తోంది.

కృష్ణప్రియ said...

స్ఫురితా,

:))

మధురవాణి,

నచ్చిందా.. థాంక్సు..

కల్యాణి గారు,

ధన్యవాదాలు!

శారద గారు,

:)) మరే.. సినిమా హాల్లో పుస్తకాలెందుకు? :)

ఫణీంద్ర గారు,

అదో స్టైల్ లా ఉంది ఏంటో..

కృష్ణప్రియ said...

కొత్తావకాయ,

నిజమే.. కాలేజ్ రోజుల్లో అయితే ఖచ్చితం గా అలాగే చేసి ఉండేదాన్ని.. అప్పటికే లేట్ అవుతోంది.. రన్నింగ్ బస్సులోంచి దూకే వయస్సూ కాదు :)

థాంక్స్!

శ్రావ్య,

:) కదా! దొందు దొందే.. థాంక్స్!

@ విరజాజి,

:)))))
ఒక్కసారి కిట్టూ ఎవరా అని హాచ్చర్యపోయా! ROFL. నిజమే.. సొంత తమ్ముడినే ముద్దు పేరు తో పిలవాలా వద్దా.. అని ఆలోచిస్తుంటే... వీళ్లు ఎంత వీజీ గా

కృష్ణప్రియ said...

భావన గారు,

బహుకాల దర్శనం! అంతేనంటారా? ఇక బస్సులే ఎక్కమంటారా? బోల్డు ఎంటర్ టెయిన్ మెంట్..
పైగా.. బ్లాగులు రాసుకోటానికి బోల్డు మెటీరియల్..

కష్టే ఫలే శర్మ గారు,

అందరూ కాదులెండి.. చాలా మంది ఈకాలం పిల్లలు , ఎంతో పరిపక్వత తో ఉన్న అమ్మాయిలూ అబ్బాయిలూ.. కూడా కనిపిస్తూనే ఉన్నారు. నాకు చాలా కుళ్లు గా ఉంటుంది ఒక్కోసారి వారిలా ఆలోచించలేకపోతున్నందుకు...

కృష్ణప్రియ said...

భావన గారు,

బహుకాల దర్శనం! అంతేనంటారా? ఇక బస్సులే ఎక్కమంటారా? బోల్డు ఎంటర్ టెయిన్ మెంట్..
పైగా.. బ్లాగులు రాసుకోటానికి బోల్డు మెటీరియల్..

కష్టే ఫలే శర్మ గారు,

అందరూ కాదులెండి.. చాలా మంది ఈకాలం పిల్లలు , ఎంతో పరిపక్వత తో ఉన్న అమ్మాయిలూ అబ్బాయిలూ.. కూడా కనిపిస్తూనే ఉన్నారు. నాకు చాలా కుళ్లు గా ఉంటుంది ఒక్కోసారి వారిలా ఆలోచించలేకపోతున్నందుకు...

కృష్ణప్రియ said...

పల్లవి గారు,

నిజమే నండీ..అసలు మేరీ,సరస్వతీ టపా బాకీ ఉన్నందుకే, వేరే విషయాలేవీ రాయలేదు ఈ మధ్య.. తీవ్రమైన పని వత్తిడి.. తదుపరి టపా అదే. మీరు గుర్తు పెట్టుకుని అడిగినందుకైనా రాసేయాలి.. అతి త్వరలో..

కృష్ణప్రియ said...

జ్యోతిర్మయి గారు,

:) అంతే నంటారా? థాంక్స్!

@Found in Folsum,

:) థాంక్స్. మీ బ్లాగు ఇప్పుడే చూసి వస్తున్నా.. పుస్తక ప్రియుల్లా ఉన్నారు...

@ జయగారు,

మీకు కూడా హోలీ,అంతర్జాతీయ అతివల దినోత్సవ శుభాకాంక్షలు!

@ తెలుగు భావాలు,

:) కానీ ఒక్కోసారనిపిస్తుంది.. పాపం.. ఈ కాలం లో తల్లిదండ్రులెం చేయగలరు? చుట్టూ వాతావరణం అనూహ్యం గా మారిపోయింది.. వాల్యూ సిస్టం మారిపోయింది .. ఎవరు చెప్పినా వినే స్థితి ఉందని నేననుకోను

lalithag said...

"అందరూ కాదులెండి.. చాలా మంది ఈకాలం పిల్లలు , ఎంతో పరిపక్వత తో ఉన్న అమ్మాయిలూ అబ్బాయిలూ.. కూడా కనిపిస్తూనే ఉన్నారు. నాకు చాలా కుళ్లు గా ఉంటుంది ఒక్కోసారి వారిలా ఆలోచించలేకపోతున్నందుకు... "
This is what I like in Krishnapriya's posts (your comments inclusive). I try not to jump to conclusions when reading your posts. Most of the time they are snapshots of life. Enjoyed reading this post.

buddhamurali said...

కృష్ణ ప్రియ గారు బాగా రాశారు .. వీలు చూసుకొనే బస్సేక్కలని కొద్ది రోజుల నుండి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మరింత గట్టిగా తీసుకున్నా... బస్సెక్కితే అక్కడి నుంచి ప్రపంచాన్ని చూడొచ్చు. ఉద్యోగ రిత్యా నాకు బస్సు పాసు ఉచితమే .. కానీ బస్సు ఎక్కను ఎందుకని తీసుకోవాలని తీసుకోలేదు . ఆ మధ్య మిత్రుడు ఇలా ఉంటే ప్రపంచం తెలియదు నా మాట విని బుస్స్ పాస్ తీసుకోని అప్పుడప్పుడు బస్సు ఎక్కండి అన్నాడు. నేల క్రితం తీసుకున్నా బస్సు ఎక్కలేదు. ఇది చదివాక నేను ఎంత మంచి సాహిత్యాన్ని మిస్ అయ్యానో తెలుస్తోంది. బస్సేక్కుతాను .కొత్త ప్రపంచాన్ని చూస్తాను

Anonymous said...

టపా బాగుంది కాని, కొళుపు అంటే ఏమిటండి?

అయినా మీరిలా సగం సగం కథలు చెప్పడం ఏమీ బాగో లేదు. (ఒకసారి అతడు సినిమాలో ఎమ్మెస్ నారాయణ డైలాగులు గుర్తు చేసుకోండి.)

అందుకు శిక్షగా, మీరు మగధీరలో రాంచరణ్‌లా ఆ ఆకుపచ్చ చుడీదార్ అమ్మాయిని వెతికి పట్టుకుని మిగతా కథ చెప్పాలి.

వెన్నెల్లో ఆడపిల్ల said...

Hilarious..
నాకు అసలు ఇంట్లోనే వేరేవాళ్ల ముందు ఫోన్ లో మాట్లాడటానికి ఆలోచిస్తాను.. బయట నేను కూడా బస్సులో ఇలాంటిది చూసాను ( విన్నాను ) :-)

మాలా కుమార్ said...

:)))))

ఇందు said...

OMG!!! bhale undandi ;) entha navvukunnnoooo!!! hahaha!! :) inthaki mee green chudidar heroine face chudaledaa :P entha anyayam jarigipoyindi Krishna garu :))))))))))) papam ravi :P

Found In Folsom said...

Pustakala tho paatu inka konni pichilu unnai....annitiki kalabosi oka chota cheruddam ani start chesanu...:)
Btw, I loved your blog...already oka ara dajanu mandi friends ki refer chesanu....vallu kooda danda Yatra lo unnaru prastutam mee blog meeda..nice writes, keep writing...:)

Anonymous said...

@bongiri, కొళుపు అంటే కొవ్వు, తమిళ పదం.

@ క్రిష్ణ బిరియా Post రొంబ నల్లా ఇరుక్కు, అనాలం అడుతవంగ పేచ్చ నమ్మ కేటిరిక కూడాదు. : D


కాముధ

కృష్ణప్రియ said...

లలితా,
:) థాంక్స్!

@ బుద్ధా మురళి గారు,

బాగుంది బాగుంది. మీరూ బస్సేక్కేసి 'నవ లోకం' చూసేయండి..

@ బోనగిరి గారు,

:))) బానే పని తగిలించారు. ఇప్పుడు నేను రామ్ చరణ్ లా.. ఊరెమ్బడ తిరగాలా? సరే.. అలాగే తిరిగి కథ పూర్తి చేస్తా..

పైన కాముధ చెప్పారు కదా.. కొళుపు అంటే కొవ్వు అని అర్థం..

@ వెన్నెల్లో ఆడపిల్ల,

:) కదా!

@ మాలా కుమార్ గారు,

థాంక్స్!

కృష్ణప్రియ said...

@ ఇందు,

చాన్నాళ్లకి కనిపించారు? అవును. ముఖం చూడకుండానే దిగిపోయింది :-(

@ Found in folsum,

ధన్యవాదాలు. తెలుగు బ్లాగు ప్రపంచం లో బోల్డు మంచి బ్లాగులున్నాయి. మీ స్నేహితులతో తప్పక చదివించండి.

@ కాముధ,
రొంబ నల్రి!

జీడిపప్పు said...

ఎప్పటిలాగే.... చక్కని పోస్టు క్రిష్ణప్రియ గారు.
మళ్ళీ ఎర్రబస్సెప్పుడెక్కుతున్నారు? :)

Mauli said...

(అబ్బ! రష్ గా ఉంటే ఉంది బస్సు. భలే కబుర్లు వినచ్చు..’ అని చెవి అటువైపు పడేశా..)

(కన్ఫర్మ్ అంటే ఏంటో.. ఎంత టైం తీసుకున్నాక గిఫ్టులివ్వచ్చో..మనకి ఎలా తెలుస్తుంది?)

(ఆ అమ్మాయి కి సరిపోని ఆ అబ్బాయికి ‘సెట్’ చేసి పెట్టేంత మంచి హృదయం .. ఖళ్, ఖళ్, మని దగ్గొచ్చేసింది.. అంటే ఆనందం, తృప్తి, జాలి, కోపం..చిరాకు,బాధ, అసహ్యం లాంటి వాటిల్లో ఎగ్జాక్ట్ గా ఏం కలిగిందో చెప్పటం కష్టం..)

హ హ , ఆ అమ్మాయి మాటలు మీరు వ్రాస్తే, మీ మాటలు నేను వ్రాసానన్న మాట. హ్మ్, మీ మాటలపై నా వ్యాఖ్యలు మాత్రం వ్రాయడం లేదు :)

కృష్ణప్రియ said...

జీడిపప్పు గారు,

థాంక్స్! :)

మౌళి గారు,
:))) అదే మరి. బస్సుల్లో ఇతరుల సంభాషణని వినే నా స్వభావం మీద 'నో కామెంట్స్' అన్నమాట.. బాగుంది..

Mauli said...

హ హ , కాదండీ , అక్కడ వినిపిస్తే మీరు వినాల్సి వచ్చింది. 'నో కామెంట్' అన్నది వేరే :)

ఆ.సౌమ్య said...

హహ్హహహ్హహ :)))

Advaitha Aanandam said...

నవ్వలేక చచ్చానండి బాబూ....

ఏమనుంటాడంటే......

"మన (ex) ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పేసాను" అని......

Anonymous said...

మీరేక్కిన బస్ రూట్ చెప్పరూ

శేఖర్ (Sekhar) said...

దేవుడా ....ఏమిటి ఈ గోరం

మొదటిసారి మీ బ్లాగు కి వచ్చాను అండి...బాగా రాసారు....:))

సుభ/subha said...

:):):):):):):):)
నందన నామ ఉగాది శుభాకాంక్షలు మీకు:)

తృష్ణ said...

!!!
:)))

రాధేశ్యామ్ రుద్రావఝల said...

మీ బ్లాగుకి నన్ను ఎడిక్ట్ చేసేస్తున్నారు..
చాలా బాగుంది. కొసమెరుపు ఇంకా బాగుంది.

David said...

మొదటిసారి మీ బ్లాగు కి వచ్చాను చాలా బాగుంది మీ పోస్టు.....ఆ గ్రీన్ చుడి దారు పిల్ల మా ఉస్మానియా యూనివఋసిటిని అంత చులకన చెస్తదా.....

Krishna Palakollu said...

Hi Krishna garu

its been a while that you have written something.

Hope things are fine and will wait for your post

Krishna

కృష్ణప్రియ said...

మౌళి,
:)

సౌమ్యా,
:) థాంక్స్..

@ మాధవి గారు,
ధన్యవాదాలు.. అలాగ అని ఉంటాడంటారా! బాగుంది బాగుంది..

@ అజ్ఞాత,
ఒక బస్సు రూటని కాదు లెండి.. ఈ రూటైనా ఇవే కథలు.. కొద్దిగా అటూ, ఇటూ గా..

@ శేఖర్ గారు,
సుస్వాగతం! ధన్యవాదాలు!

@ సుభ,
:)) థాంక్సు..

@ తృష్ణ గారు,
:) ధన్యవాదాలు..

@ More Entertainment,
thanks a lot!

@ రాధేశ్యాం గారు,
ధన్యోస్మి! చాలా పెద్ద కాంప్లిమెంటు..

@ డేవిడ్ గారు,
మీకు సుస్వాగతం! ధన్యవాదాలు...

@ krishna palakollu గారు, వచ్చేసానండీ.. కొద్దిగా పని వత్తిడి వల్ల రాలేకపోయా..

నాగేస్రావ్ said...

మీ ఈటపా ఇప్పుడే చూట్టం పడింది.
గట్టిగా నవ్వితే పక్క కలుగు(cube)ల్లోని వాళ్ళేమనుకుంటారోని, నోరు బిగబట్టుకోని చదివేసాను.
ఆపిల్లకి ప్రస్తుతం జంట రమేశ్ అన్నారు, మళ్ళీ రవి అని రాసారు, పొరపాటా..ఈలోపే అభ్యర్థి మారిపోయాడా?
పక్కవాళ్ళ కబుర్లు వింటంకన్న (సెల్లుకబుర్లయుతే మరీ మంచిది, మనక్కావలిసిన మసాలాలు, తిట్లు జోడించుకోవచ్చు) మించిన పొళుదుపోక ఎక్కడ దొరుకుతుండీ?

Sujata M said...

అహా.. చాలా బావుందీ అమ్మాయి. మా హాస్టల్లో కూడా వుండేది ఇలాంటి అమ్మాయి. తెలివైందే. మంచి జాబ్ కూడా చేస్తోంది. కానీ తన పెర్సనల్ విషయాలన్నీ, మెట్ల మీదా, కారిడార్ లోనూ, పెద్ద గొంతు తో మాట్లాడుతూండేది సెంటిమెంటు కబుర్లు కూడా. రాత్రి పూట కూడాను. ఫోన్ లో ఏడుపులూ అవీ, వినీ వినీ మాకే విసుగొచ్చేది. ఆ అబ్బాయి (లవర్ - ఒక్కడే అయితే ) మాత్రం ఎలా సహించేవాడో ఈ అమ్మాయి మాటలు అనిపించేసేది.

కృష్ణప్రియ said...

@ నాగేస్రావ్ గారు,
:) థాంక్స్.
పొరపాటున రాయడం కాదు.. రాయడం చేతకాక నేను క్రియేట్ చేసిన కన్ఫూషన్.
పక్కవాళ్ళ కబుర్లు వినడానికి మించిన సుఖం నిజంగానే లేదు రైట్! :))

@ సుజాత గారు,

అరే? మా హాస్టల్ లో కూడా ఉండేదిలాంటమ్మాయి. crybaby అని ఆమెకి మేము పెట్టుకున్న ముద్దు పేరు.

CP said...

Superb!! ఎంత బాగా రాశారో! తాపత్రయం వెర్సస్ రియాలిటీ.పుస్తకం తెరిచిన పాపాన పోలేదు... నాకు భలే నచ్చింది మీ పోస్ట్!
పద్మప్రియ.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;