Sunday, April 29, 2012

గేటెడ్ కమ్యూనిటీ కథలు - మా పచ్చ పిచ్చి కథ.

కొత్త ప్రెసిడెంట్ ఎన్నికలొచ్చేశాయి. అంటే ఈ ఎన్నికలు రివర్స్ అశ్వమేథ యాగం లాంటివి అన్నమాట. ప్రెసిడెంట్ కిరీటం పట్టుకుని పాత ప్రెసిడెంట్ దీనంగా, ఆశగా వీధి లో కాపు గాసి ఉండి, ఏమరుపాటు గా రోడ్డు మీదకి వచ్చిన మొదటి వ్యక్తి నెత్తి మీద పెట్టేసి, దాగుడు మూతల ఆట లో లాగా, ‘అంతే, అంతే! దొరికాడు కొత్త అద్యక్షుడు’ అని హాయిగా ఊపిరి పీల్చుకోవటం.. (మరి వేరే ఎవరికీ పెద్దగా ఇంటరెస్ట్ ఉండదు గా?) అలాగ ‘బుక్కయి’ పోయిన (ఇరవయ్యోనంబరాయన) మా నూతన అద్యక్షుల వారు సాధారణం గా ఊర్లో ఉండరు, దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు, అంటే ఆయన ఉద్యోగం అలాంటిది. “నా వల్ల మీకేం ఉపయోగం ఉండదు. మీకు ఏవైనా సమస్యలుంటే నేను అందుబాటు లో కూడా ఉండనే.. మరి నన్నెన్నుకుని మీరేం సాధిస్తారు? నన్నొదిలి పెట్టండి “ అని అత్యంత దయనీయకరం గా వేడుకున్నా.. “అబ్బే మేమంతా ఉన్నాం.. మీకు సహాయం చేస్తాం.. అదీ ఇదీ” అని సర్ది చెప్పి కిరీటాన్ని ఫెవికాల్ తో ఆయన తలకాయ మీద అంటించేశాం.. ముహూర్త బలం బాగున్నట్టుంది. ఆయన కి ఒక్కసారి గా కాలనీ వాసులకి ఏదో ఒకటి చేసి ‘చరిత్ర సృష్టించాలని ‘ దుగ్ధ మొదలైపోయింది.
ఈ లోగా ఒక రెండు మూడు నెలలు గా ఖాళీ గా ఉన్న నాలుగో నంబర్ ఇంట్లోకి కొత్త కుటుంబం దిగింది. పిల్లలు సంబరపడి సామాన్లు మోసుకొచ్చిన ట్రక్ వెనగ్గా పొలోమని వెళ్లి చూసి పెదవి విరిచి వచ్చేశారు. ఆ ఇంట్లో దిగిన వారికి పిల్లలు లేరట. పిల్లల్లా పెద్దవాళ్ళం ట్రక్ వెనక పరిగెత్తలేం, అలాగని క్యూరియాసింటీ చంపుకోలేము కదా.. రొటీన్ గా నడవటానికి వెళ్తున్నట్టు కళ్ళచివర నుండే ఎలాంటి సామాన్లున్నాయి, ఏంటి అని గమనించి వచ్చేశాం. లెదర్ సోఫాలూ, నగిషీల డిజైన్ల అల్మారాలూ, చెక్క సామాన్లూ అలాంటివి, వాళ్లింటికి వెళ్తే ఎలాగూ చూస్తాం కానీ, ముందర సామాన్లు దింపుతున్నప్పుడే చూస్తే ఎంత మజా అసలు!


ఆశ్చర్యం గా అలాంటివేవీ కనపడలేదు. అన్నీ మొక్కలే. రంగు రంగుల పూల మొక్కలు, బోన్సాయ్ చెట్లు, కూరగాయల మొక్కలు, తోట పనిముట్లు, ఎరువుల బస్తాలు... ఈలోగా నాలుగు రౌండ్లు నడిచేసరికి మట్టి,ఆకుపచ్చ రంగు బట్టలేసుకుని, పెద్ద ముక్కుపుడక, చాలా ఫాషనబుల్ గా ఒకావిడ వచ్చి పరిచయం చేసుకుంది. తనకి పర్యావరణ సరంక్షణ అంటే పిచ్చి అని, మొక్కలే తన ప్రపంచమనీ,.. చెప్పింది. చూస్తూ చూస్తుండగానే తన ఇల్లంతా ఆకుపచ్చగా మారిపోయింది. ఇంటి చుట్టూ పైనా, కిందా, ఇంట్లో కూడా ఎక్కడ చూసినా మొక్కలే. తలుపులకి నాచు రంగు వేయించింది. వంటింటికి ముదురాకు పచ్చా, హాల్లో లేతాకుపచ్చా.. పూజ గది కి చిలకాకు పచ్చా.. వేయించింది.


ఆమె స్పూర్థి తో కాలనీ వాసులకి ‘పచ్చ పిచ్చి’ ఒక్కసారి గా పట్టుకుంది. ఏ ఇంట్లో చూసినా కొత్తగా పూల కుండీలు, ఇంట్లో పెట్టుకునే మూలికలూ, ఎడారి మొక్కలూ, పాకే తీగలు, నారు మడులూ,పండ్ల మొక్కలూ, డాబాల మీద వాటర్ ప్రూఫ్ కోటింగులు వేయించి ఆకుకూరల మడులు, అబ్బబ్బ.. ఒక్కటని కాదు. వంటింట్లో మొదలుకుని స్నానాల గది దాకా మొక్కలతో, నిండి పోయాయి. అందరూ ఒక్కొక్కరు గా తోట పని కోసం ఒక బట్టలేంటి, చేతి తొడుగులు, పనిముట్లు, కొనేసుకున్నారు. శని,ఆదివారాల్లో ఇక కమ్యూనిటీ వాసులు ఉదయం నుండీ తోట పనే.. ఇల్లంతా నింపేసి, వాకిలంతా పరిచేసి, చోటు చాలక ఇంటి ముందు సొసైటీ వారు వేసిన చెట్టుకి కూడా ఏవో తీగలు పాకించేశారు. నేనూ ఒక సన్నజాజి తీగని పాకించాననుకోండి.


ఎక్కడ మొక్కలు తెచ్చారు, విత్తనాలు ఎక్కడ శ్రేష్ఠం, పేడ ఎక్కడ దొరుకుతుంది, ఎవ్వరింట్లోనూ కనిపించని అపురూపమైన మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, అనేవే చర్చలు.. వారాంతాల్లో మాళ్ళూ, సినిమా హాళ్ళూ మానేసి అందరూ నర్సరీ ల చుట్టూ పరుగులెత్తారు..


మా కొత్త వైస్ ప్రెసిడెంట్ గారికి ఈ మాత్రం చాన్స్ ఇస్తే అల్లుకుపోడూ.. వెంటనే ఒక తోటపని నైపుణ్యం గల ‘కన్సల్టెంట్’ ని పిలిపించి గెస్ట్ లెక్చర్లు ఇప్పించేసాడు. ఆయన చెప్పినట్టు అందరూ వారి వారి ఇళ్ల వెనక పెద్ద గొయ్యి తవ్వి సేంద్రియ ఎరువు తయారీ చేయాలనే శపథాలు తీసేసుకున్నారు.. ట్రాక్టర్ల కొద్దీ పేడ వచ్చేసింది. ఇంట్లోంచి ప్రతి చిన్న వ్యర్థ పదార్థమూ గొయ్యి లోకే..


కొన్ని వారాలయ్యేసరికి అందరి ఇళ్లూ పాచ్చ్చ్చ్చ్గా.. నాలుగో నంబర్ ఆవిడంటే నిజమైన ఆసక్తి కాబట్టి ఎప్పుడూ మట్టి లోనే కాఫీ కప్పుతోనో, పేపర్ తోనో, పుస్తకం తీసుకునో.. కనిపిస్తూనే ఉండేది, కానీ, మిగిలిన వారు మాత్రం నెమ్మది గా ఒక్కొక్కరు గా తోట పని లోంచి తప్పించుకుని పని వాళ్ల మీద వదిలేశారు. అందరిళ్ళ ముందరా, ఒక్కసారి గా తోటమాలులకి గిరాకీ పెరిగిపోయింది.మా ఇంట్లో కాసాయని ఏదో ఒకటి ఇంకోళ్ళకి సగర్వం గా పంపుకోవటం,.. ‘ఇన్ని చిక్కుడు కాయలు ఏం చేసుకుంటాం.బాబూ..’ అని విసుక్కోవటాలూ.. మొదలైంది. మామూలు మొక్కలూ, విత్తనాలూ, ఒకళ్లకొకరు ఇచ్చుకున్నా, ఫలానా మొక్క వాళ్లింట్లో తప్ప దొరకదని అనిపించుకోవాలనే యావ అందరికీ ఎక్కువైపోయింది. ఇక వాకింగ్ లో మా ఆడవారికి మంచి మసాలా దొరికినట్టయింది. ‘రోజూ చూస్తున్నాను. తొమ్మిదో నంబరావిడ వాళ్ల టమాటా మొక్కలు ఎండిపోయి ‘సైజ్ జీరో కరీనా ‘ ల్లా కనిపించాయి. మరి ఇన్ని నవ నవ లాడే టమాటాలు తెచ్చి మాకు ఎక్కువయ్యాయి అని ఎలా ఇస్తోంది.. బజార్ నుండి కొనే ఇస్తోంది.’ అని రహస్యాలని చేదించిన వారు కొందరు..

మా మామిడి చెట్టు కన్నా మీ మామిడి చెట్టుకి ఎక్కువ పళ్లెలా వచ్చాయని కుళ్లుకునేవారు కొందరైతే, మేకులు కొడితే జామచెట్టు విరగకాస్తుందని, పాత తోలు చెప్పుతో కొడితే నిమ్మచెట్టు రెపరెప లాడుతూ ఎదుగుతుందని.. సెలవిచ్చిన వారు కొందరు. నేనూ ఒక ‘బలహీన క్షణం’ లో పాత చెప్పు తీసి కొడదామా అనుకుని, తర్వాత తీరిగ్గా సిగ్గు పడి నిమ్మచెట్టు కాయకపోతే, పోయే.. మొక్కని చెప్పు తో కొట్టే సమస్యే లేదని ఊరుకున్నాను.


ఆరో నంబర్ ఆవిడ ఆరోజు పొరపాటున ఓ తొండ మీద కాలేసింది.. తర్వాత ఆవిడ చేసింది భరత నాట్యమో, బ్రేక్ డాన్సో ఇప్పటికీ ఎవరూ తేల్చుకోలేక పోయారనుకోండి.. మూడో నంబర్ ఆయన బట్టల అలమర లో ఒక ఎలక దూరింది.. గొయ్యి లో కుళ్లిన కూరగాయల వాసన కాస్త కష్టమై ఎరువు తయారీ ఇంచు మించు అందరిళ్ళల్లోనూ ఆగింది. పూలు,ఆకులూ చెత్తా పడుతున్నాయని ఒకరు, ఇళ్లు బురదవుతోందని కొందరు, ఎలర్జీలు అన్న సాకు తో కొందరు, కాపు కొచ్చిన కూరల్ని,పాదులని పందికొక్కులు మిగల్చట్లేదని కొందరు, పిట్టలు కాపురం పెట్టి ‘ఆగం ఆగం’ చేస్తున్నాయని మరి కొందరు ఏదైతేనేం మొక్కలు తగ్గించేశారు.


ఛత్రపతి శివాజీ తల్లి గారు ఓసారి అంతఃపురం కిటికీ దగ్గర దువ్వుకుంటూ ‘కాజువల్’ గా చూస్తే.. అల్లంత దూరాన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆక్రమించిన ‘సింహగ ఢ్’ కోట కనిపించిందిట. ఆవిడ ఆక్రోశం తో కొడుకుని పిలిపించి మళ్లీ సింహగ ఢ్ ని మన ఆధీనం లోకి తెచ్చుకోవాలని ఆదేశించిందిట. ఆయన మరుక్షణం, కుమారుడి పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న తానాజీ ని పిలిపించి తల్లి ఆదేశం చెప్పి కోటని గెలుచుకుని రమ్మన్నాడట.


అలాగ మా గేటెడ్ కమ్యూనిటీ కి ఛత్రపతి, ధర్మప్రభువులు, ప్రెసిడెంట్ గారి తల్లి వచ్చి.. బాల్కనీ లో చాయ్ చప్పరిస్తూ ‘ఈ చెట్లేంటి? ఈ వాలకం ఏంటి? సొసైటీ వేసిన చెట్లని కొమ్మలు కొట్టించి చెట్టు మూలం దగ్గరున్న చిన్న మొక్కలనీ, తీగలనీ పీకించేయి.. ‘ అని ‘ఆర్డర్లు’ జారీ చేసేసింది.


అంతే.. మాతృవాక్య పరిపాలన ఏనాడూ తప్పని మా అద్యక్షుల వారు వెంటనే ఒక ఈ మెయిల్ పంపి కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నా అన్ని చెట్ల బేస్ లు శుభ్రపరిపించాడు. చెట్ల కొమ్మలు కొట్టించాడు.. దానితో నిజమైన ‘పచ్చ పిచ్చి’ ఉన్న వాళ్లు కన్నీరు కార్చి, కవితలు రాసి ఈ మెయిళ్ళు పంపుకుని ఆందోళనలకి దిగి కుమిలి కుమిలి కృశించగా.. ‘అబ్బ! వెలుతురొచ్చినట్టయ్యిందని’ మిగిలిన తాత్కాలిక హరిత ప్రేమికులు ఊపిరి పీల్చుకున్నారు.. కార్ పోర్టికోల మీద పాకించిన తీగల్ని పీకి పారేసి, రూల్ ప్రకారం కంపల్సరీ గా ఉంచాల్సిన లాన్ మాత్రం మిగిల్చి, చుట్టూ గచ్చు చేయించుకుని ‘నీటు’ గా చేసుకుని గత స్మృతులని నెమ్మదిగా మరిచిపోయారు. మరి కొందరు కాస్త నీటి కరువు వచ్చినప్పుడు ‘మనకే లేనిది.. మొక్కలకెక్కడి నుంచి తెస్తా’ మంటూ మానేశారు..


అయితే, తోటమాలి మీద ఆధారపడేవారూ, మొక్కల ప్రేమికులూ, వాళ్ల ఇళ్లని ఇంకా ఆకు పచ్చగా దివ్యం గా ఉంచుతూనే ఉన్నారు. నీరు లేకపోనీ, కూరలు కడిగిన నీరో, వార్చిన గంజో, ఇంకా గతి లేకపోతే బట్టలుతికిన నీరైనా మొక్కలకి పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తూనే ఉన్నారు.. అదండీ మా హరిత విప్లవం కథా కమామీషూ..
24 comments:

harephala said...

" నీరు లేకపోనీ, కూరలు కడిగిన నీరో, వార్చిన గంజో, ఇంకా గతి లేకపోతే బట్టలుతికిన నీరైనా మొక్కలకి పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తూనే ఉన్నారు."--- ఇది మాత్రం బాగుంది...

తృష్ణ said...

:)) బావున్నాయి గేటెడ్ కమ్యూనిటి హరిత విప్లవ కబుర్లు.అందుకేనేమో "కొత్త ఒక వింత పాత ఒక రోత" అన్నారు..!
ఈ కొత్త టెంప్లేట్ ఇదే చూట్టం... నాకయితే మీ పాత టెంప్లేట్ చాలా నచ్చేది..

Krishna Palakollu said...

హహ్హ!
నిమ్మ చెట్టుని పాత చెప్పు తో కొడితే .....హహ్హ హ్హహ్హ!
భలే ఉంది ఈ పోస్ట్ :-)

kastephale said...

పచ్చదనం పిచ్చి కాదు, మనిషికి అవసరం.

buddha murali said...

నేనూ ఒక సన్నజాజి తీగని పాకించాననుకోండి.
........
మరీ మీ సన్న జాజి సంగాతెమయిందో చెప్పలేదు .
మొక్కలకు బట్టలుతికిన నీళ్ళు పోయవద్దు. సబ్బు నీళ్ళు మంచిది కాదనుకుంటా ..

తెలుగు భావాలు said...

"...మరి ఇన్ని నవ నవ లాడే టమాటాలు తెచ్చి మాకు ఎక్కువయ్యాయి అని ఎలా ఇస్తోంది.. బజార్ నుండి కొనే ఇస్తోంది.’ అని రహస్యాలని చేదించిన వారు కొందరు..." నిజమా? ఇదేనా కారణం!?!?!

మాలా కుమార్ said...

చెప్పుతో కొడితే నిమ్మ చెట్టు కాస్తుందా ? నేనెప్పుడూ వినలేదే . మా నిమ్మచెట్టు కాయటం లేదుకాని చూస్తూ చూస్తూ చెప్పుతో ఎలా కొట్టటం :)

నాగేస్రావ్ said...

"పిల్లల్లా పెద్దవాళ్ళం ట్రక్ వెనక పరిగెత్తలేం, అలాగని క్యూరియాసింటీ చంపుకోలేము కదా" కదా మరి!!
ప్రఖ్యాత శాస్త్రవేత్త గో.దొ.(G.D.)నాయుడు గారు బొప్పాయి చెట్టొకటి కాయలు కాయకపోతే దాన్ని pellet gunతో కొట్టారట. అప్పుడు కాయటం మొదలెట్టిందట.

జయ said...

బాగుందండి. కాని పాపం:(

మురళి said...

టమాటాలు... హ..హ.......నవ్వాగలేదండీ అక్కడ..

బులుసు సుబ్రహ్మణ్యం said...

చెట్లలో కొన్ని మొగ చెట్లు ఉంటాయి. వాటికి ఒకటి రెండు మేకులు దిగ గొడితెనో, చెప్పు పుచ్చుకొని నాల్గైదు తగిలిస్తే కానో, పొద్దున్నే చెట్టు ముందు నుంచుని తిట్ల దండకం పఠిస్తేనో కానీ పూయవు, కాయవు. నిజం. మీ నిమ్మచెట్టు ని పాత చెప్పుతో నాలుగు ఇచ్చుకోండి. ఎందుకు కాయదో చూద్దాం....దహా.

Kathi Mahesh Kumar said...

****
:):):):)

జీడిపప్పు said...

బాగుంది. కృష్ణప్రియ గారు, font పెద్దదిగా ఉన్నట్టుంది, ఓ లుక్కేయండి.

బాబోయ్ కూడలి.. వామ్మో మాలిక - 2 చూడండి, http://jeedipappu.blogspot.in/2012/05/2.html
అలాగే http://100telugublogs.blogspot.in/ కూడా

కృష్ణప్రియ said...

లక్ష్మీఫణి గారు,
హ్మ్మ్, థాంక్స్..
తృష్ణ గారు,
థాంక్స్ :) టెంప్లేట్.. మళ్లీ మారుస్తా అయితే త్వరలో..
కృష్ణ గారు,
నిమ్మ చెట్టు కి చెప్పు దెబ్బలు, జామ చెట్టుకి మేకులు దింపటం.. :) అవును ఇవే ఈ మధ్య నేర్చుకున్న కొత్త గార్డెనింగ్ టెక్కు నిక్కులు..

puranapandaphani said...

ఆరంభ శూరులు వెనక్కి తగ్గారు, నిజమైన హరిత ప్రేమికులు మిగిలారు.. అంతేనా? :)

కృష్ణప్రియ said...

కష్టేఫలే శర్మ గారు,
రైట్! తప్పక ప్రతిఒక్కరికీ ఉండి తీరాల్సిన పిచ్చి..

బుద్ధా మురళి గారు,
నా సన్న జాజి తీగ నీ ప్రెసిడెంట్ గారు పీకించేశారు. కానీ, ప్రెసిడెంట్ గారి హయాం ఏడాది తర్వాత పూర్తయ్యే దాకా, భూమి లో దాక్కున్న వేళ్లల్లోంచి మళ్లీ కొత్తమొలకలు వచ్చిఇప్పుడు మళ్లీ పెద్ద చెట్టుని చుట్టుకుని పైకి పాకేస్తోంది..
@తెలుగు భావాలు,
హ్మ్.. నిజం ఏదైనా అయ్యుండవచ్చు.. మా ఇంట్లో కాసాయని కూరగాయలు, పళ్ళు ఇవ్వటం ఎలాగైనా గొప్పే కదా.. డెఫినెట్ గా కొందరు అలాగ చేసే ఉంటారు. కొన్న ఊరగాయలు కూడా ఇంట్లో చేసినవని ఇవ్వటం చూశాను.. :)

కృష్ణప్రియ said...

మాలా కుమార్ గారు,
అదే మరి.. నిమ్మకాయలు కావాలంటే మనసు దిటవు చేసుకోవాలి.. తప్పదు.:)
నాగేస్రావ్ గారు,
హ్మ్..థాంక్స్.. బొప్పాస్ కాయలు పండించాలంటే తుపాకీ లైసెన్స్ కి అప్ప్లై చేసి చూడాలి అయితే..
జయగారు,
కదా.. రెండు పక్కల వారూ, , గచ్చు చేయించేసరికి, చిన్న వర్షానికే.. వెనక దొడ్డంటా సముద్రమయిపోతోంది..

కృష్ణప్రియ said...

మురళి గారు,
బహుకాల దర్శనం.. ధన్యవాదాలు..

బులుసు గారు,
అంతేనంటారా.. అయితే మీదగ్గర ఇంకా ఏమైనా ఉపాయాలున్నాయేమో.. ట్యూషన్ కి రావాలి తప్పదు..

మహేశ్ గారు,
నాలుగు నక్షత్రాలతో బాటు, నాలుగు స్మైలీలు కూడానా! థాంక్స్!

జీడిపప్పు గారు,
మీ బ్లాగూ, వంద బ్లాగుల సంకలనం చూశాను.. బాగుంది. ఈజీ గా చూసుకోవచ్చు..

@puranapandaphani గారు,
అవును.. నిజమైన హరిత ప్రేమికులతో పాటు.. నూటికి నూరు శాతం మాలీ ల చేత పని చేయించగలిగే వారూనూ..

రంగావఝ్యుల శేషాంజనేయావధాని శర్మ said...

కృష్ణ ప్రియ గారు

" పచ్చ పిచ్చి " వుండడం మన ఆరోగ్యానికే మంచిదే కృష్ణప్రియ గారు.

చెట్టలకి కాయలు కాయకపోతే ఒకరు నరికేస్తాను అని వుంకోక్కలు వద్దని చెప్పండం. చేస్తు చిన్నగా 2లేక3 దెబ్బలు కత్తితో వేయాలి.
అప్పడు చూడండి చెట్టుకు కాయలు ఏలా కాస్తాయో.

Anonymous said...

"ఛత్రపతి శివాజీ తల్లి గారు ఓసారి అంతఃపురం కిటికీ దగ్గర దువ్వుకుంటూ ‘కాజువల్’ గా చూస్తే.. అల్లంత దూరాన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆక్రమించిన ‘సింహగ ఢ్’ కోట కనిపించిందిట. ఆవిడ ఆక్రోశం తో కొడుకుని పిలిపించి మళ్లీ సింహగ ఢ్ ని మన ఆధీనం లోకి తెచ్చుకోవాలని ఆదేశించిందిట. ఆయన మరుక్షణం, కుమారుడి పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న తానాజీ ని పిలిపించి తల్లి ఆదేశం చెప్పి కోటని గెలుచుకుని రమ్మన్నాడట."


:) :) :) :) :)
* * * * *

విరిబోణి said...

mokkalu penchadam pichhikaadu, oka art , adi andariki abbadu :) meeru matram continue cheyandi vadalakundaa :))

Anonymous said...

As a web site owner I think the material here is really magnificent. I appreciate it for your time. You must maintain it and keep it up forever! Excellent work.

anuhya miryala said...

krishna garu.. mi tapa lu superb nen mi blog ki peda fan ni andi. . mi blog okaroju anukoknda chusa oka tapa chadivanu anthe ade roju mthm tapalu chadivesa nd ani chaduvthune una andi. . miru blog telugu lo ala rastaro cheptara plz. . lekhini ani oka comnt lo cheparu lekhini tho alago vivarisatarani ashistna. .:-)

Mauli said...

ఏడేడి నీళ్ళు పోస్తే కాకరచెట్టు ఏడేళ్ళు కాస్తుందిట :)

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;