Monday, August 1, 2011

అమ్మో ఏమి రుచి!!!!

"శుక్రవారం రాత్రి వచ్చేయండి.. మా ఇంటికి భోజనాలకి"..


అని మాకు బాగా తెలిసిన ఒక కొత్తగా పెళ్లయిన అబ్బాయి చెప్పాడు. "మా ఆవిడ వంట చాలా బాగా చేస్తుంది" అని తెగ పొగిడాడు. పైగా మద్యాహ్నం కాఫెటేరియా లో ఏదో “ఆరోగ్యకరమైన” సాండ్ విచ్ తిన్నానేమో నక నక లాడుతూ ఉన్నా! ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు చల్లగా ఉంది వాతావరణం.. కాస్త ఏదైనా వేడిగా తాగుదామా? అనుకుని మళ్లీ టీ తాగితే ఆకలి తగ్గిపోతుందని అలాగే బయల్దేరదామని మా వారిని ఊదర పెడుతుంటే..


"నువ్వు ఏం చేస్తావో చేసుకో!!.. నేను మాత్రం నా మగ్గుడు కాఫీ తాగకుండా కదిలేది లేద" ని ఖచ్చితం గా ఆయన చెప్పేయటం తో.. ఉసూరు మంటూ వెయిట్ చేస్తూ ఆ సువాసన ఆఘ్రాణిస్తూ తిప్పలు పడుతూ ఎలాగో ఆగి ఎట్టకేళకి . , మా వారిని బయల్దేరదీసా ..


ఒక పది మంది ఉంటారు డిన్నర్ పార్టీ లో. ఆ అమ్మాయి టేబుల్ మీద సలాడ్లు, బజ్జీల్లాంటివి ఏవో సద్ది కుక్కర్ లోంచి పొగలు కక్కుతున్న పప్పు, అన్నం తీసి పెట్టింది. కమ్మటి వాసన వస్తున్నకరిగిన నెయ్యి .. 'ఆహా.. మామిడి కాయ పప్పు లా ఉంది'. దానికి తోడు ఆవిరి కక్కుతున్న అన్నం, ఇంక ఆగలేక పోతున్నా.. అందరూ బజ్జీలు అవీ తీసుకుంటుంటే.. నేను అఆబ గా.. కంచెడు అన్నం పెట్టుకుని మధ్యలో చేత్తో గుంట చేసుకుని పప్పు గుమ్మరించుకుని, నెయ్యి వంపుకుని.. కాలుతున్న వేళ్లతో,.. ఆదరా బాదరా గా కలుపుకుని వాపిరి గా పింగ్ పాంగ్ బంతి అంత ముద్ద నోట్లో పెట్టుకున్నానంతే!!.



సీతాఫలం కన్నా మధురం గా ఉంది ఆ పప్పు. అదోరకం గా వాసన కూడా! జలుబు వల్ల ఇందాకా తెలియలేదు. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఫౌంటెన్ లా పైకి వచ్చేస్తుంది తిన్న పదార్ధం. ఎలాగోలా కష్టపడి మింగి .. "ఇది ఏం పప్పు?" అని అడిగాను.ఆ అమ్మాయిని.


"ఇది గుమ్మడి పండు, అరటిపండు మాష్ చేసి బెల్లం తో ఉడికించి చేసే పప్పు. జీడి మామిడి పండు గుజ్జు కూడా కలుపుతాం, ఇక్కడ దొరకదు గా.. జీడి మామిడి ఎక్స్ట్రా క్ట్ తెచ్చా ఇండియా నుంచి! మా వైపు స్పెషల్ ఇది తెల్సా!" అని మెరుస్తున్న కళ్ళతో చెప్పింది. "ఎలా ఉంది?" అని అడిగింది. ఇంక నాలో 'నా వల్ల కాదు.. నన్నోదిలేయ్!!! " అని దాక్కుంటున్న 'ఊర్వశి కృష్ణప్రియ' ని (ఆవిడ నాలో దాగిన నటి లెండి) బర బరా లాక్కొచ్చి ముందు నిలబెట్టా... ఆవిడ ఇక.. టీ వీ లో వంటల కార్యక్రమం లో వంట టేస్ట్ చేసాక ఆంకరమ్మ ఇచ్చే ఎక్స్ ప్రేషన్లని గుర్తు తెచ్చుకుని.. అటువంటి విపత్కర పరిస్థితి లోనూ


"It's nice! చాలా బాగుంది.. ఎప్పుడూ తినలేదు!!" అని బొంకింది.


ఈ అచేతనావస్థ లోంచి బయట పడేందుకు శత విధాలా ప్రయత్నిస్తుండం లో కాస్త బిజీ గా ఉన్నానా? చూసుకోలేదు :-(( "ఆ భరోసా ఇచ్చావు చాలు" అన్న ఉత్సాహం తో అమ్మాయి గిన్నె ఎత్తి నా కంచం లో ఇంకో పావు లీటర్ "వాళ్లూరి వంట' పోయటం! హతవిధీ.. నాకు కంచం లో పెట్టింది పారేయటం అలవాటు లేదు. కానీ ...ఇక నెమ్మది గా ఎవ్వరూ చూడకుండా ట్రాష్ లో పడేద్దామా? అని చూస్తున్నా. చూస్తే అందరూ బజ్జీలు లగాయిస్తున్నట్టున్నారు.. చెత్త బుట్ట ఫ్రెష్ గా.... ఒక్కళ్ళూ ఏదీ వేయలేదు :-( అంటే ఈ అన్నం పడేసింది నేనే అని తెలిసి పోతుంది. ఎలా? అర్థం కాలేదు. ఎవరైనా ఏదో ఒకటి పారేయకపోతారా వాటితో కలిపేయచ్చు అని.. నీరసం గా ప్లేట్ తో కూర్చున్నా. అందరూ హాయిగా.. బజ్జీలు తింటూ.. జీడి మామిడి ఎక్స్ట్రా క్ట్ వాసనకి తిప్పుతోంది.


కొత్త పెళ్ళికూతురు తియ్య పప్పు చప్పరించుకుంటూ ఒక రకమైన పారవశ్యం తో తింటోంది.కొత్త పెళ్లి కొడుకు కూడా తెగ ఎంజాయ్ చేస్తూ తింటున్నట్టున్నాడు. హః! అవున్లే పెళ్లైన కొత్తలో నేనూ బ్రోకోలీ , కాప్సికం ఉప్మా తిన్నాను అదో మాయ కదా...

చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తొచ్చింది.ఒకళ్ల ఇంటికి వెళ్లాం.వాళ్ళింట్లో చెల్లలేదేమో! పెద్ద ప్లేట్ లో పైనాపిల్ ముక్కలు కలిపిన చక్ర పొంగలి పెట్టారు. ప్రసాదం అని!. ఏదో తేడా ఉంది. పారేద్దామా అంటే భయం. దేవుడు శిక్షిస్తాడని! నేనూ మా చెల్లీ, ఆరోజు లక్కీ గా జేబుల చొక్కాలు వేసుకు వెళ్లామేమో.. అప్పటికి తప్పించుకోవటానికి జేబుల్లో నింపేసాము. ఇంటికొచ్చాక ఆటల్లో పడి మర్చిపోయాం. తర్వాత రోజు వాషింగ్ మషీన్ బట్టల్ని ఉతికితే.. మా అమ్మ మమ్మల్ని ఉతికింది ..

నాలోనేనే నవ్వుకుంటున్నా.. రెండు బజ్జీలు తీసుకుని ఏదో పప్పు లో నంచుకున్నట్టు నటిస్తూ బజ్జీలు మాత్రమే తింటున్నా.. 'అక్కడున్న వాళ్లందరి నీ చూస్తే ఒళ్లు మండింది.. ఈర్ష్య తో గుండె భగ్గుమంది. 'నా కాపీనం మండ! ఇంత పప్పు వేసుకోవాలా?' ఏడుపు వచ్చినంత పనైంది. చిన్నప్పటి లాగా చున్నీ లో మూట కడదామా అన్నంత వైల్డ్ ఆలోచన వచ్చింది కానీ.. బంగారం లాంటి చున్నీ.. అని ఆ ఆలోచన విరమించుకున్నా.


ఆ అమ్మాయి మళ్లీ అతిథి మర్యాదలకి పెట్టింది పేరనుకుంటా! నిమిషానికి నాలుగు సార్లు 'ఏంటి కృష్ణా తినట్లేదు? ' అని గోల!

ఊర్వశి కృష్ణప్రియ ని మళ్లీ లాక్కొచ్చా.. ఈసారి బెదిరిస్తే కూడా రాలేదావిడ. కాళ్లా వెళ్లా పడి రమ్మంటే వచ్చి.. 'నెమ్మదిగా ఆస్వాదిస్తూ తింటున్నా' అని అరమోడ్పు కన్నులతో, అరచెంచా పప్పన్నం నోట్లోకి వేసుకుని చెప్పింది.


ప్లేట్ క్షణ క్షణానికీ బరువెక్కుతోంది. మా కజిన్ కి పెళ్లి కుదిరిన కొత్త లో వాళ్ల కాబోయే అత్తగారింటికి వచ్చినప్పుడు వాళ్లు ఇచ్చిన ఫ్రూట్ సలాడ్ గుర్తొచ్చింది. ఏదో సిట్రస్ ఫ్రూట్ చేదెక్కి తినలేకపోయాం. ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంటే.. వాళ్ల అబ్బాయి 'రండి వదినా.. మా మొక్కలు చూపిస్తా..' అని పిలిచి ఒక దట్టమైన గుబురైన నిమ్మ గడ్డి మొదట్లో చోటు చూపించి పారేయమని మాకు దారి చూపించాడు. సరే అదే పని చేద్దాం అని.. 'మీ బాక్ యార్డ్ చూస్తా.. ఒకసారి .." అని తలుపు తీసి చూసా.. :-((( అబ్బే.. నీట్ గా ఉంది.ఒక్క మొక్క లేదు.









ప్లాస్టిక్ కవర్ లాంటిది ఏదైనా దొరుకుతుందని చూస్తున్నా.. నేనొక్క దాన్నే ఇలా!!!.. మిగతా వారంతా హాయిగా తింటున్నారు. ఈలోగా ఇంకో కామన్ ఫ్రెండ్ లీల వచ్చింది నా వైపు . అయోమయం గా చూస్తూ..
"ఎలా తింటున్నావు? నువ్వూ ఆ ఊరేనా? ఒక్క స్పూన్ ప్రయత్నిస్తేనే నాకైతే కడుపు లో దేవేస్తోంది." అంది.
ఏదో సముద్రం లో పడి ఊపిరాడకుండా కొట్టుకుంటున్న వాడికి లైఫ్ జాకెట్ దొరికినట్టు, టెక్నికల్ ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు అడిగిన ప్రశ్న కి సమాధానం లేక తెల్ల మొహం వేసినప్పుడు ఇంకొకరెవరో మన తరఫున సమాధానం చెప్పినట్టు.. చెప్పలేనంత రిలీఫ్!!!!. ఆ క్షణం లో ఆవిడ నాకు సాక్షాత్తూ అమ్మవారి లా అనిపించింది. నెమ్మది గా ఎందుకు మౌంట్ ఎవరెస్ట్ అంత ఎత్తు పప్పన్నం నా కంచం లో పెట్టుకున్నానో చెప్పా..

కిసుక్కున నవ్వింది. 'నీకో ఇన్సిడెంట్ చెప్తా.. మా పిన్ని మొన్నీ మధ్య ఎవరింటికో వెళ్తే కాఫీ ఇచ్చారుట. చాలా పిచ్చి గా ఉందిట. దాన్ని అస్సలూ తాగలేక వాష్ బేసిన్ లోకి వంపుదామని ఆ హోస్టెస్ ని మంచి నీళ్లడిగిందట. ఆవిడ వచ్చేలోగా అతి లాఘవం గా మరుగుతున్న కాఫీ ని ఒక్క సారి గా బేసిన్ లోకి వంపిన తర్వాత ఒక తెలియని బాధ.. కాళ్లల్లోంచి. మంట.. చూస్తే.. బేసిన్ కింద పైప్ లేదట. దానితో మరుగుతున్న కాఫీ కాళ్ల మీద వంపుకున్నానని అర్థమయి .. బాధకి తాళలేక అరిచిందట! ఆ ఇంటావిడ పరుగున వచ్చి విషయం అర్థమయి చల్లని నీరు ఉన్న గిన్నె తెచ్చి కాళ్లని దాంట్లో పెట్టుకొమ్మని ఇచ్చి తడి గుడ్డ తెచ్చి 'సారీ అండీ.. పైప్ పెట్టమని మొత్తుకున్నా..వినట్లేదు. ఎవ్వరికీ సమయం దొరకట్లేదు ' అంటూ తుడుస్తోందిట.. కాలి మంట కన్నా.. ఆవిడ కష్టపడి చేసిన కాఫీ పారబోసి, పైగా ఆవిడకే పట్టుపడి, సపర్యలు చేయించుకోవటం చాలా సిగ్గు, బాధ తెప్పించింది" అని చెప్తే.. అంత టెన్షన్ లో కూడా నవ్వు వచ్చేసింది.

ఈలోగా మా వారు కొద్దిగా పప్పు వేసుకుని, నా బాధ అర్థమై.. నా వైపు చూసి.. దూరం నుంచే ముసి ముసి నవ్వులు. నా చూపులకే శక్తి ఉంటే.. ఆపూట ఏమయ్యేదో.. నేను రాయకూడదు, మీరు చదవకూడదు లెండి.
ఒక చిన్న పాప .. వాళ్లమ్మ నోరు బలవంతాన తెరిచి పప్పన్నం కుక్కుతోంది.. అది వాళ్లమ్మ నుంచి అతి లాఘవం గా తప్పించుకుని 'yucky smell! It is too sweet! నాకొద్దు' అని అరుస్తోంది. చా.. ఆ పిల్ల ఎంత క్లియర్ గా చెప్తోంది!
చిన్న పిల్ల చక్క గా చెప్తుంటే నేనేమో ఇంత అనవసరపు ఇబ్బంది మొహమాటం.. హ్మ్.. ‘అమ్మా.. నీకు ఇంకా పని లేదు. వెళ్ళిరా’ అన్ని మా ఊర్వశి కృష్ణప్రియ కి చెప్పేసాను.

వెళ్లి పారేద్దాం.. ట్రాష్ లోకి... అంతగా అడిగితే.. 'జీడిమామిడి ఎక్స్ట్రాక్ట్ పడట్లేదు ఎందుకో' అని పడే ద్దామని కృత నిశ్చయం తో లేస్తుంటే లీల పిలిచి చటుక్కున నీళ్లు వంపెసింది నా ప్లేట్ లో! నాకు అర్థమయ్యే లోపలే.. 'అయ్యయ్యో.. సారీ సారీ' నాకు మాత్రమే కనపడేలా కన్నుకొట్టి గట్టి గట్టి గా అందరూ వినేట్టు గా అనేసింది.

అమ్మయ్య! .. నాకప్పటికి అర్థమైంది. 'శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని!'. ఈ మాత్రం హింట్ ఇస్తే మా ఊర్వశి కృష్ణప్రియ అల్లుకుపోదూ? “వద్దు.. వెనక్కి రా.. “ అని మళ్లీ పిలిచాను.

"అయ్యో!! ఇంత చక్కటి రుచికరమైన పప్పన్నం!" అన్న భావాన్ని అభినయిస్తూ... ' It's ok.' అంటూ .. ఆవిడ...
నేను ఆనందం గా చెత్త బుట్ట దగ్గరకి పరిగెత్తాను. డైనింగ్ టేబుల్ నిండా.. బోల్డున్నాయి! మళ్లీ ఆకలి తిరిగి వచ్చింది.


"ఏమంటున్నారూ..! ఓహ్ అదా.. ఆ తప్పు మళ్లీ జీవితం లో చేయను లెండి. ఈసారి అన్నీ కొద్ది కొద్దిగా రుచి చేసి మరీ వేసుకుంటా.... "







72 comments:

నైమిష్ said...

క్రిష్ణప్రియ గారు..కళ్ళవెంబట నీళ్ళు వచ్చేలా నవ్వించారు..చక్ర పొంగలి లో అనస ముక్కలా ..Yakkiii :((..అసలు ఇలాంటి అవిడియాలు ఎలావస్తాయో కదా..

SHANKAR.S said...

మీ అవస్థ చూస్తే ఏప్రిల్ 1 విడుదల - "మాటంటే మాటేనంట" పాటలో ఈ లైన్లు గుర్తొచ్చాయి
"నువ్వే మా మొదటి గెస్టని
మా ఆవిడ వంట బెస్టని
ఈ ఫీస్టుకు పిలుచుకొస్తిని
టేస్టు చెప్పి పోరా

ఇదేమా విందు భోజనం
మీరే మా బంధువీదినం
రుచులలో మంచి చెడ్డలు
ఎంచి తెలుపుతారా? "

తరవాత మీకు తెలిసిందే ...హి హి హి

వాత్సల్య said...

మీ అవస్థ ని తలచుకుని నవ్వు ఆపుకుంటూ, ఆ కాఫీ సంఘటన కి పెద్దగా నవ్వేసా ఆపుకోలేక..

నేను ఎక్కడా వినలేదండీ ఈ బంపర్ కాంబో పప్పు. ఆ అమ్మాయిది ఏ ఊరు?

మీ బ్రోకోలి క్యాప్సికం ఉప్మా సంఘటన తదుపరి టపా లో వివరించుడి

ఆ.సౌమ్య said...

హహహహ..." గుమ్మడి పండు, అరటిపండు మాష్ చేసి బెల్లం తో ఉడికించి చేసే పప్పు. జీడి మామిడి పండు గుజ్జు కూడా కలుపుతాం," ...వామ్మో, ఊహకందట్లేదు..ఎంతైనా మీరు లక్కీ అలాంటి పప్పు తినడానికి :)

రాజేష్ మారం... said...

Hilariuos...

వేణూశ్రీకాంత్ said...

హ హ భలే నవ్వించారండీ.. చక్రపొంగలి సీన్ లో ఉతుకుడు డైలాగ్ కేక :-)
కాఫీ సీన్ లో ఆవిడ హావభావాలు ఎలాఉండుంటాయో తలుచుకుని తలుచుకుని నవ్వుకున్నా :-)
కాస్త ఏఊరో చెప్పి పుణ్యం కట్టుకుందురూ.. నేను కూడా భవిష్యత్ లో జాగ్రత్తపడతాను.. అసలే కార్పోరేట్ లైఫ్ స్టైల్ పుణ్యమాని ఇతర రాష్టాల మిత్రుల ఇళ్లకు కూడా భోజనాలకి వెళ్ళాల్సొస్తుందొకోసారి.
నాకు కూడా తగని మొహమాటం... ఎప్పుడన్నా నిజం చెప్దామన్నా పాపం మనకోసం కష్టపడి వండిపెట్టారుకదా బాగుందని ఓమాటంటే ఏంపోయిందిలే అనిపిస్తుంది... నేనిలా బాగుందని మెచ్చుకుంటూ తింటుంటే సదరు హోస్ట్ గారి మొగుడు గారో పిల్లలో నువ్వు నీ మొహమాటం తగలెయ్య “ఫలానా రుచి తగ్గింది/పెరిగింది” పడేయ్ అని రక్షించేసిన సంధర్భాలు లేకపోలేదు :-)

@శంకర్ గారూ.. నేను టపా సగం నుండీ ఆపాటే పాడుకుంటూ చదివా :-) కృష్ణప్రియ గారు ఇలా పాడేవారేమో..
యధార్ధం చేదుగుంటది..
పప్పేమో తీపి గున్నది..
ఇది విందా.. తమ...

లత said...

అదేం పప్పండి బాబూ,మిమల్ని అలా బుక్ చేసేసింది
కొందరి వంటలు తినాలంటే మహా భయం నాకు కూడా

prasanna said...

Navvi navvi, kallaventa neellu vachayi..office ani marchipoyi navvesanandi,chaala baga rasaru, toooo good:-))

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

మామిడి కాయ పప్పు విన్నాను, తిన్నాను కాని జీడి మామిడి పప్పు గురించి ఇప్పుడే వినడం. :)

"సీతాఫలం కన్నా మధురం" అని చదివితే ముందు అర్ధం కలేదు కాని post మొత్తం చదివిన తర్వాత "మధురం" అంతే తియ్యదనం అని గుర్తు వచ్చింది.
అయినా పదార్ధం తియ్యగా ఉన్నా feel అయితే ఎలాగండి?

ఆ.సౌమ్య said...

ఈ చక్రపొంగలి గోలేంటి...నాకెక్కడా కనిపించలేదు మీ టపాలో? అందరూ కామెంటు పెడుతున్నారు?

అన్నట్టు ఇందాకల మరచిపోయా..."సీతాఫలం కన్న మధురం" అంటే రుచి అదిరిపోయిందనుకున్నాను...మొత్తం అంతా చదివాక అర్థమయింది. :)

మాలా కుమార్ said...

అమ్మో అమ్మో భలే నవ్వించేసారు . ఇంతకీ అది ఏ వూరి పప్పటా ?

Sravya V said...

హ హ బాబోయ్ మరీ అంత మొహమాటం ఏంటండి :)))))) అందుకే మీ చిన్నమ్మాయి ని కూడా తీసుకెళితే సరి పోయేది .
మీ ఫ్రెండ్ లీల గారు భలే షార్ప్ కదా ;))))

సౌమ్య గారు కళ్ళద్దాలు మార్చే టైం అయినట్లుంది :))))

ఆ.సౌమ్య said...

హహహ శ్రావ్య..నాకు కళ్లద్దాలు లేవుగానీ చక్ర పొంగలి అసలు ఎలా తప్పించుకుందీ అని గింజుకుపోతున్నా...ఇప్పుడు కనిపించిందిలెండి...హమ్మయ్యా తెలికగా ఉంది :D

చాణక్య said...

హహాహా.. మొహమాటానికి పోతే మహచెడ్డ చిరాకులు తెచ్చిపెడుతుంది. నాకు ఈ పరిస్థితి చాలా సార్లు ఎదురైంది. ఏది ఏమైనా మీ లీల గారికి మీరు రుణపడిపోయారు. ఆవిడ లేకపోతే డాక్టర్ల చుట్టూ తిరగాల్సివచ్చేది.

మీ బ్లాగ్‌లో ప్రతీసారీ 'చాలా బాగుంది' అని రాయాలంటే నాకే బోర్ కోడుతోంది. అందుకే ప్రీపెయిడ్‌గా ఒక వంద 'చాలా బాగుంది'లు స్టాక్ పెట్టేసుకోండి నా తరఫున. : )))))

Anonymous said...

"లాఘవం గా మరుగుతున్న కాఫీ ని ఒక్క సారి గా బేసిన్ లోకి వంపిన తర్వాత ఒక తెలియని బాధ.. కాళ్లల్లోంచి. మంట.. చూస్తే.. బేసిన్ కింద పైప్ లేదట. "-- సూపర్! అందుకే ఆబగా అన్నీ ప్లేటులో వేసేసికూడదు! మీ ఫ్రెండ్ ప్లేటులో నీళ్ళు ఒంచేసింతరువాత, మళ్ళీ పప్పు వేయవలసింది! ఒదిలిపోయేది !!
As usual nice post !

తృష్ణ said...

"అవున్లే పెళ్లైన కొత్తలో నేనూ బ్రోకోలీ , కాప్సికం ఉప్మా తిన్నాను అదో మాయ కదా..." ఇదేదో విని తీరాల్సిన కథలాగుండి.తదుపరి టపాలో చెప్పేయండి మరి..ఇక్కడ ఫ్లష్ బ్యాక్ లోకి పంపేసారుగా !!

"ఆ క్షణం లో ఆవిడ నాకు సాక్షాత్తూ అమ్మవారి లా అనిపించింది.." :)))

".. చూపులకే శక్తి ఉంటే.. ఆపూట ఏమయ్యేదో.." ఈ డైలాగ్ నేనెన్నిసార్లు విన్నానో..:))

అటువంటి అద్భుతమైన పప్పు కాస్తైనా తిన్నందుకు ఊర్వశి కృష్ణప్రియ గారికి హృదయపూర్వక అభినందనలు...:))

పద్మవల్లి said...

:-)))))))))))))))))))))

ఇందు said...

హ్హహ్హహ్హా! భలే భలే! నాకు ఇలాంటివి బోలెడు అనుభవాలు! అప్పుడు కొత్త స్నేహితులు కూడా అయ్యార్య్ చెత్తబుట్టదగ్గర ;) ఒకసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయా కూడా :))) అవన్నీ ఆ టైంలో చాలా ఇబ్బందిగా ఉన్నా.....తరువాత భలే ఫన్నీగా ఉంటాయ్ :)

కృష్ణప్రియ said...

@ తేజస్వి గారు, నైమిష్,
:) ధన్యవాదాలు. మీకు నచ్చినందుకు సంతోషం గా ఉంది.
@ SHANKAR.S గారు,
:)) నిజమే. ఇది ఒక పదేళ్ల క్రితం సంఘటన. ఇలాంటి బాధల ముందు శారీరక బాధలు ఎందుకూ పనికి రావనిపిస్తుంది ఒక్కోసారి.

@ రిషి గారు,
:) కాఫీ సంఘటన ఎప్పుడు తలచుకున్నా నవ్వు ఆగదు నాకు.
హమ్మో !! ఆ కాంబినేషన్ తలచుకుంటే ఇప్పటికీ డయట్ కంట్రోల్ అయిపోతుంది. మగ్గిన అరటి పళ్ళు ట, పైగా బెల్లం, గుమ్మడి పండు గుజ్జుతో ఉడక పెట్టి, .. ఈక్స్! కానీ పాపం వాళ్లూర్లో అదే స్పెషల్! ఊరిపేరు చెప్తే పాపం ఆ ఊరివాళ్ళ మనోభావాలు గాయపడవు కదా?
బ్రోకోలీ కాప్సికం ఉప్మా సంఘటన తప్పక త్వరలో వివరించెద!

విరిబోణి said...

ఇలాంటిదే నాకు ఒక అనుభవం, బెండకాయ వేపుడు అని చెప్తే పెట్టుకున్న ఒకసారి. అన్ని బెండకాయ తల కాయలే వున్నాయి, ఇది ఏదో బెండకాయల తల కాయల వేపుడు అని పేరు పెట్టి వుంటే బావుండేది అని అనుకున్న.. ఆ చేసిన ఆవిడ వాళ్ళ ఇంట్లో తలకాయలు కూడా కలిపే చేస్తారట :(( పెట్టుకున్న అందరు డస్ట్ బిన్ వేస్తె గిన్న లో నిడుగా వున్నా కూర తో డస్ట్ బిన్ నిండింది..నాకు జరిగిన అనుభవాలు కూడా గుర్తుకు వచ్చాయి :)

మధురవాణి said...

హహ్హహ్హా.. బావున్నాయ్ మీ కష్టాలు.. :)))
అసలు నేనిలాంటి పార్టీల్లో ఊరికే తిన్నట్టు నటిస్తాను.. అంతే! :)
ఒకసారిలాగే హాస్టల్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఏదో మటన్ కబాబ్ అంటూ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిందని చెప్పి ఇచ్చింది ఎంత వద్దంటున్నా.. తింటున్నట్టు నటించి ఇవతలికి వచ్చేసి కిటికీలోంచి బయటికి పడేసా.. :P
అసలే నాకు కొత్త వంటలు, కొత్త వాళ్ళ వంటలు ట్రై చెయ్యాలంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది.. కానీ, మీరన్నట్టు చాలాసార్లు ఎవరూ చూడకుండా పడెయ్యడం ఎలాగా అన్నది పెద్ద ఇబ్బందే! :(
అందుకే నేను తెలివిగా అన్నీ ఒక్కో స్పూనే వేసుకుంటాను.. తింటున్నట్టు నటించడానికి ప్లేట్ ఖాళీ లేకుండా కనపడటానికీ ఆ మాత్రం చాలు కదా మరి! ;)

కృష్ణప్రియ said...

@ సౌమ్య,
ఏంటీ.. నేను లక్కీ యా? రండి అయితే మా ఊరికి చేసి పెడతాను. మీరూ లక్కీ అవ్వచ్చు :)

@ Rajesh Maram,
థాంక్స్! నా బ్లాగ్ కి స్వాగతం!

@ వేణూ శ్రీకాంత్,
ఉతుకుడు డైలాగ్ :) థాంక్స్!!
కాఫీ సీన్.. మా ఫ్రెండ్ పిన్ని గారికి జరిగిన సంఘటన.
మీరన్నది నిజం. ఈ ప్రపంచీకరణ వల్ల రకరకాల రాష్ట్రాల వారిళ్ళ ల్లో తింటున్నాం. ఒకటి అర్థమైంది. అందరికీ ఆమోద యోగ్యమైన ఆహారం పెట్టాలి. మనకి నచ్చుతాయి కదా అని ఇలాంటి గమ్మత్తు వంటలు చేస్తే.. ఇదిగో.. చూసారు గా.. :)
:) శంకర్ గారిదీ, మీదీ పాటలు బాగున్నాయి.

కృష్ణప్రియ said...

@ లత గారు,
మరే :)
@ ప్రసన్న గారు,
ధన్యవాదాలు. మీరిదే రావటమనుకుంటా.. నా బ్లాగ్ కి స్వాగతం!
@ బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ ,
:) చాలా రోజులకి ఇటు వచ్చారు.
అవును మధురం అన్న పదం మేము 'ఓవర్లీ స్వీట్ ' గా ఉంటే వాడతాం.
మా తాతగారొకరు అరిసేలు బెల్లం పాకం లో ముంచుకుని తినేవారు. పొద్దున్నే జిలేబీలు పాలల్లో ముంచుకుని తినేవారు, అటుకులు పెరుగు లో పంచదార తో కలిపి తినేవాళ్లు.. :) ఇలా కొన్ని స్పెసిఫిక్ ప్రాంతాల వారి ఇంటరెస్ట్ లు కదా..
:) విడివిడి గా తింటానండీ. కలిపి వండి తేనే కాస్త....

మురళి said...

యాదృచ్చికం!! "ఒక కొత్తగా పెళ్ళైన అబ్బాయి" చదవగానే ఏప్రిల్ ఒకటి విడుదల లో పాట "మీరేమా మా ఫస్టు గెష్టని , మా ఆవిడ వంట బెష్టని, ఈ ఫీస్టుకు పిలుచుకొస్తినీ తెస్టు చెప్పి పోరా..." పాడుకుంటూ టపా చదువుతున్నానా.. ఇంతలోనే పప్పు రుచి చెప్పే లైన్లు వచ్చేశాయ్ టపాలో.. "యదార్ధం చేదుగుంటది.. పదార్ధం చెత్తగున్నది.. ఇది విందా, నా బొంద.. తిన్నోళ్ళూ గోవింద.. " అని పాడుకుంటూ పూర్తి చేసేశాను.. కీఫీ ఇన్సిడెంట్ చదివి ఇంకా నవ్వుతూనే ఉన్నా.. చివర్లో మీ ఫ్రెండ్ చేసింది నాక్కూడా అనుభవమేలెండి :)) :)) తా.క.. నేను కామెంట్ రాసేశాక, పోస్ట్ చేయబోతూ శంకర్ గారి వ్యాఖ్యతో సహా వ్యాఖ్యలన్నీ చదివానండీ..

sunita said...

hahaha! chaalaa baagundi!

కృష్ణప్రియ said...

@ సౌమ్య,
పైనాపిల్ చక్రపొంగలి :) పైన చెప్పినట్టు సీతాఫలం కంటే ఇంకో పండు తియ్యగా ఉంటే పర్వాలేదు. కానీ అన్నం లోకి అంటేనే :)) కాస్త ప్రాబ్లం.
@ మాలా కుమార్ గారు,
థాంక్సండీ.. వాళ్ల ఊరు జ్ఞాపకం లేదు కానీ.. సకినేటిపల్లి వైపు అని గుర్తు.

@ శ్రావ్య,
:) పాపం కొత్త పెళ్లి కూతురు కదా.. మనసు కష్టపెట్టుకుంటుంది అని .. మా చిన్నమ్మాయిని తీసుకెళ్తే అంతే! కానీ ఒక చిన్న ప్రాబ్లం. ఈ సంఘటన జరిగి కనీసం పన్నెండేళ్లయినది. మా లీల సూపర్ షార్ప్. ఆవిడ మీద టపా రాస్తా త్వరలో
(శ్రావ్య స్వగతం : బాబోయ్. ఈవిడ దగ్గర ఎమన్నా టపా వేసేస్తా అంటుంది...)

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Hilarious :)) అసలు మీలోని ఊర్వసి క్రిష్ణప్రియ మీద ఎక్కువగా ఆధారపడటం వల్లే మీకిన్ని కష్టాలు...నిజమే మీ పిన్ని నుండి సరిగ్గా నేర్చుకోలేనట్టుంది మీరు :)))

కృష్ణప్రియ said...

@ The Chanakya,
:) మరే.. నా బ్లాగ్ లో ప్రతీ సారీ 'చాలా బాగుంది' అని రాయాలంటే బోర్ గా ఉందన్నారు నెనర్లు.
'ఇచట అద్భుతం, అమోఘం, న భూతో న భవిష్యతి' వంటివి కూడా అంగీకరింపబడును.' మరి చూసుకోండి...

@ ఫణి బాబు గారు,
:) అమ్మో .. దూద్ కా జలా... టైపు లో అప్పటినుంచీ ముందు ప్లేట్ వెనక్కి దాచేసుకోవటం అలవాటైపోయింది లెండి.
థాంక్స్!
@ తృష్ణ గారు,
బ్రోకోలీ+కాప్సికం ఉప్మా కథ .. ప్చ్ !!! అదొక పెద్ద కథ.. ఇంకో టపా లో తప్పక రాస్తా..
నాకు పట్టిన అదృష్టం మీకందరికీ పట్టాలని మీరు కోరుకుంటే.. ఈసారి మా ఇంట్లో బ్లాగర్ల సమావేశం ఏర్పాటు చేసి..
ఈపప్పు చేసి పెడతా.. టల్లోస్ దీనికి కాంబినేషన్ ఉండనే ఉంది :)

కృష్ణప్రియ said...

@ పద్మవల్లి గారు,
బాగా నవ్వినట్టున్నారే! :) థాంక్స్!
@ ఇందు,
చెత్తబుట్ట దగ్గర స్నేహితులు - LOL good one :)
@ విరిబోణి గారు,
:) బెండకాయ తల కాయ వేపుడు నా తలకాయ లా ఉంది అనచ్చు నైస్!

కృష్ణప్రియ said...

@ మధురవాణి,
నా కష్టాలు మీకు బాగున్నాయా! :-( ఏం చేస్తాం..
ఈ అనుభవం తర్వాత నేనూ మీలాగే చేయటం నేర్చుకున్నాను..
@ మురళి గారు,
:) ఈ పాట మీరంతా అంటుంటే నేనూ మళ్లీ విన్నాను ఇవ్వాళ్ల పొద్దున్నే కూర్చుని..
కాఫీ ఇన్సిడెంట్ మా సర్కిల్ లో చాలా ఫేమస్ :)

@ సునీత గారు,
థాంక్స్ :)
@ WP,
declare చేసేసాగా పెద్దగా ఏమీ నేర్చుకున్నట్టు లేదు అని :-(

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>కాస్త ఏదైనా వేడిగా తాగుదామా? అనుకుని మళ్లీ టీ తాగితే ఆకలి తగ్గిపోతుందని.....

భోజనానికి వెళ్ళేముందు మీ ప్రిపరేషన్ చాలా బాగుంది అనుకున్నాను. కానీ ఆకలి రుచి ఎరుగదు అన్న సూత్రాన్ని కూడా కాదు అనిపించిన ఆ పప్పు ఒఖ్ఖ మాటు తినాలని ఉంది. PL. ఆ ఊరి పేరు చెప్పండి.ఇండియా లో అయితే ఎవడో ఒకడు ఆ ఉరివాడు దొరక్కపోడు.

అటుకులు పెరుగు లోనూ, పాలలోనూ వేసి పంచదార కలిపి మేము తినేవాళ్లం మీ తాత గారిలాగా.
చక్రపొంగలి లో పైనాపుల్ కూడా ట్రై చెయ్యాల్సినదే.

మీ టపా గురించి వేరే చెప్పేదేముంది. సూపర్ అంతే. అట్టహాసం

రంగావఝ్యల శేషాంజనేయాధాని శర్మ said...

సూపర్
మీరు చాలా భాధ పడిన్నట్టున్నారు భోజన్నానికి వెళ్ళి.
చివరిగా మీరు తీసుకున్న నిర్ణయం అమోఘం, అద్భుతం, ఇలాంటి నిర్ణయనికి నేను కూడ మీకు ఫుల్ సపోర్ట్ .

ఏప్పుడు చేప్పిన్నటే మీరు రాసేది సూపర్ కేక

Anonymous said...

మీ తరవాతి పోస్టులో ఆ పప్పు recipe, ఏ ప్రాంతం వాళ్ళ తిండో కూడా చెబుతారని ఆశిస్తున్నాను.:)
మన పాకవేద కౌటిల్యకి చేయమని ఓ అగ్నిపరీక్ష పెడదాం.
ఇదేదో కాశ్మీరీ పలావ్ లావుంది, ఓ సారి కోఠి కామత్లో ఎరక్కపోయి ఆర్డర్ చేసి, కష్టపడి దాల్ లేక్ గూటిపడవలో విహరిస్తున్నట్లు వూహించుకుని సగం తిన్నాను. :( గుజరాతీ నవరతన్ కూర్మ కూడా అలాంటిదేనండి, జాగర్త. :)

Mauli said...

పిలిచి ప్రేమగా అన్నన్ని ఐటమ్స్ చేసి , వాటితో పాటు 'వాల్లి౦టి స్పెషల్' కూడా రుచి చూపిస్తే (మళ్లీ మీకి౦కెక్కడా దొరకదు పాప౦ అని) ,
ఇలా చెప్తారా అ౦దరికీ :) . హ హ మొదట్లో తియ్యగా ,నల్లగా ఉన్నబెల్లం ఆవకాయో మాగాయ్ ని యాక్ అనే వాళ్ళం, కాని ఇప్పుడు :)
btw మీరు చెప్పిన పప్పు రెసిపి నెట్ లో చూస్తె , జీడికాయ ఎస్సెన్సు వెయ్యకు౦డనే చేసారు :), ఆ అమ్మాయి విజయనగరం/ శ్రీకాకుళం వాళ్ళు అయ్యు౦డాలి .

Ruth said...

>> టెక్నికల్ ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు అడిగిన ప్రశ్న కి సమాధానం లేక తెల్ల మొహం వేసినప్పుడు ఇంకొకరెవరో మన తరఫున సమాధానం చెప్పినట్టు.. LOL !!!

హి హి .... బాగుంది. నేనైతే, తిండిదగ్గర అస్సలు తగ్గను. కాని, ముందు జాగ్రత్తగానే వేసుకుంటానులెండి. మనకు భోజనం, తిండి, ఫలహారం... ఇత్యాదులన్నీ కారం, ఉప్పు, పులుపు రుచుల్లోనే ఉండాలి. మధురం అంటే ఎంత వాళ్ళకైనా మొహమటం లేకుండా చెప్పేస్తా నేను తీపి తినను అని.
>> పైనెవరో బెల్లమావకాయని ఏదో అంటున్నట్టున్నారు? అయ్యా/అమ్మా, ఇక్కడ చెప్పిన సదరు మధురమైన పదార్ధానికీ బెల్లమావకాయకీ లంకె పెట్టినచో మనోభావాలు తీవ్రంగా, భయానకంగా, విపరీతంగా ఇంకా రకరకాలుగా గాయపడును!

ఆ.సౌమ్య said...

మౌళి గారు...మా ఇజీనారం, సికాకుళం జిల్లాలో ఇలాంటి పప్పు చేసుకుంటారని నేనెప్పుడూ కనీవినీ ఎరుగలేదండీ...పుట్టి బుద్ధెరిగి ఇట్టాంటివి చూడలేదు. మరి మీకెందుకు అంత అభిప్రాయం కలిగింది? పెద్ద పెద్ద statemenst ఇచ్చేటప్పుడు ఓసారి ముందు వెనుక పరిశీలించుకోవాలిగదండీ.

మీరు రాసినది నన్ను కవ్వించదానికే అయితే వాకే...నేనూ సరదాగానే తీసుకుంటా :)

సిరిసిరిమువ్వ said...

:)) అలాంటి వంటలు రుచి చూసే అదృష్టం కడా ఉండాలండి..అది అందరికి రాదు..You are so lucky అన్న మాట.

శంకర్ గారూ, కాశ్మీరీ పులావ్ బాగుంటుందండి..మీరు తిన్న హోటలులో బాగోలేదేమో కానీ..అమీర్ఽపేట..హోటల్ అతిధి ఇన్ లో తిని చూడండి..బాగుంటుంది.

Mauli said...

@Ruth గారు

ఇప్పుడు నాకూ నచ్చుద్ది బెల్లం ఆవకాయ :) .

@ఆ.సౌమ్య

హ హ ,పెద్ద పెద్ద statemenst ఇచ్చేటప్పుడు ఓసారి 'మీరు' ముందు వెనుక పరిశీలించుకోవాలిగదండీ.

మీరెవరో బ్లాగుల్లో లేకున్నా నా వ్యాఖ్య ఇదే :), మరియు సరదాగా వ్రాయలేదు

రాజ్ కుమార్ said...

హహహ.. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ పోస్టండీ..తెగ నవ్వుకున్నా ;)
నాకు టపా చదవగానే.. ఏప్రిల్ ఒకటీ విడుదల లో మాటంటే మాటే నంటా పాట గుర్తొచ్చిందీ..

అపార్ధం చేసుకోరుగా.. అనర్ధం చెయ్యబోరుగా..
యదార్ధం చేదుగుంటదీ. .పదార్ధం చెత్తగున్నదీ..
ఇది విందా నా బొందా? తిన్నోళ్ళూ గోవిందా..

ఒకసంగతి గుర్తొచ్చిందీ ఒకసారి నా మలయాళీ ఫ్రెండ్ ఫిష్ పికిల్ అనీ, నాకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాననీ ఇచ్చాడు. ఒక ముక్క నోట్లో పెట్టుకోగానే విషయం అర్ధమయ్యిందీ ఆహా.. ఓహో.. అధ్బుతం అనేసీ పక్కకెళ్ళీ ఊసేసాను..;)వాడి కళ్లముందున్న ఆ కొన్ని సెకన్లూ వామ్మో పిచ్చెక్కిపోయిందీ.. ;)

హరే కృష్ణ said...

:-)))))))))))
తర్వాత రోజు వాషింగ్ మషీన్ బట్టల్ని ఉతికితే.. మా అమ్మ మమ్మల్ని ఉతికింది ..
కెవ్వ్!

ఇదేదో చాలా డిఫరెంట్ గా ఉంది
తను బ్లాగులు చూసి వంట నేర్చుకుందేమో అని నా ఘాట్టి ఫీలింగ్ :)

VSR said...

:)

these kind of incidents will happen in all of our lives....

I went to my frend's home. he is a Muslim....

YENDU CHEPALA kura pettaaru....

naaaku aa SMELL ki vaathulu ayyaayi....


Coffee Incident can be used in Movies so please try to get Copy Rights for that :P

on a whole.....kadupaaraaa navvukunnaanu......

sphurita mylavarapu said...

అమ్మో...పొట్ట నొప్పి వచ్చేసింది...నవ్వి నవ్వి...

బ్రోకలీ...క్యాప్సికం వుప్మా నా!!! మీకు వుప్మా అంటేబే పడదుకదా...వుప్మా అంటే హడలెత్తిద్దామని చేస్తే పెళ్ళయిన కొత్త కాబట్టి అది కూడా ఆహా వోహో అని తినేసారా Mr. కృష్ణ ప్రియ గారూ...:D

రవికిరణ్ పంచాగ్నుల said...

కారంవల్ల కళ్లెంబడ నీళ్లు రావడం అనుభవమే.. కొండొకచో చేదువల్ల కూడా!. కానీ "తీపి" కూడా కంట నీరు తెప్పిస్తుందని మీ టపా ఢంకా భజాయించి చెప్పిందండీ కృష్ణప్రియ గారూ!

కృష్ణప్రియ said...

@ బులుసు గారు,
ఎంత మాట! మీకు తినాలని ఉంటే ఎవరో ఎందుకు? మా ఇంటికి రండి. లేదా.. నేనే ఏలూరు వస్తా.. మీ ఇంట్లో వండి పెడతా..
ముందర రెండు మందహాసాలు ఇచ్చేవారు. ఇప్పుడు అట్టహాసం ఇస్తున్నారంటే .. రేటింగ్ ఎక్కువ చేసినట్టున్నారు.. ధన్యవాదాలు!
@ రంగావఝ్యల శేషాంజనేయాధాని శర్మ గారు,
:) థాంక్సండీ! నిజానికి పాపం కొత్త పెళ్లి కూతురని నోచ్చుకోకూడదని కాస్త కష్టపడి పారేశాను. ఇక మిగిలిన దంతా..కాస్త విన్నవీ, కన్నవీ కలిపి చేసిన మిర్చ్ మసాలా !
@ snkr గారు,
:) నిజమే. స్నాక్స్ గా ఎంత తీపైనా తినగలం కానీ.. అన్నం లో అనేటప్పటికి అదొక మెంటల్ బ్లాకేజ్ అనుకుంటా..
కానీ మా చుట్టాల్లో పెద్దవాళ్లు పెరుగు లోకి మామిడి పండూ, అరటి పండూ తినటం మామూలే.
అలాగే మామిడి టెంకల పులుసు, అరటి పండు పచ్చడి, జీడి మామిడి పళ్ళ పులుసూ కొన్ని ప్రాంతాల డేలికసీలే..

సిరిసిరిమువ్వ said...

"మా చుట్టాల్లో పెద్దవాళ్లు పెరుగు లోకి మామిడి పండూ, అరటి పండూ తినటం మామూలే"...మీరు తినరా???అయ్యో మీరు చాలా మిస్ అవుతున్నారు.

పెరుగు లోకి మామిడి పండో..అరటి పండో లేకపోతే నాకు పెరుగన్నం తిన్నట్టే ఉండదు..ఎక్కువగ ఆరటిపండు... మాకు భోజనాలప్పుడు కూడా ఈ రెండిటిలో ఏదో ఒకటి పెడతారు.

కృష్ణప్రియ said...

@ మౌళి గారు,
:) ఈ ముక్క రైటు! పోన్లే అని వాళ్ల ఇంటి స్పెషల్ రుచి చూపిస్తే.. నేను నానా మాటలూ అనటం!
వాళ్ల ఊర్లో జీడి మామిడి తోటలు కాబట్టి ఆవిడ ఇంట్లో ఆ అలవాటు వచ్చినట్టుంది. గుమ్మడి పండు, బెల్లం తో పప్పు నాకు తెలిసిన కేరళ వాళ్లు విధిగా చేసుకునే వంటకం! కాకపొతే నాకు అన్నంలో తీపి తినటానికి వచ్చిన కష్టం ఇది :)
@ రుత్ గారు,
:) థాంక్స్! చిన్నప్పుడు మేము దేంట్లో అయినా బెల్లం వేస్తున్నట్టు చూస్తే ముట్టుకునే వాళ్లం కాము. ఇప్పుడు కాస్త మారాం!
@ సిరిసిరి మువ్వ,
:) అంతే నంటారా?

కృష్ణప్రియ said...

@ హరేకృష్ణ,
:) అదే మరి ఉతుకుడే ఉతుకుడు.
@ VSR,
:) థాంక్స్! నా బ్లాగ్ లో మొదటి సారనుకుంటా రావటం. స్వాగతం! కాఫీ ఇన్సిడెంట్ మా సర్కిల్ లో తెగ పాపులర్. నేను కాపీ రైట్ చేస్తే చంపుతారు..

@ స్పురిత,
:) అదేం కాదు. మూడో నెల వేవిళ్లు బాబోయ్ స్టవ్ దగ్గరకెళ్లలేకపోతున్నాను అంటే.. మావారు చేసి పెట్టిన అద్భుతమైన వంటకం ఇది (డాక్టర్లు తినమంటారు కూరలు. ఉత్తి కార్బ్ లు తింటే కష్టం అని..)
దెబ్బకి ముక్కుకి గుడ్డ కట్టుకుని మామూలు వంటలు చేయటం నేర్చుకున్నాను.
@ సిరిసిరి మువ్వ,
అవును. మా నాన్నగారు తింటారు. నాకే ఎందుకో అన్నంలోకి తీపి తినటం కష్టం :-(

Mauli said...

:) అనుకున్నాను , ఆ రె౦డు జిల్లాల్లో నాకు తెలిసి బాగా జీడిమామిడి సాగు ఉ౦ది.కాని అప్పటికే మీరు ఇ౦కేదొ ఊరు చెప్పినట్లున్నారు చూడలేదు . నేను బె౦గులూరు లో ఒక బె౦గాలి ఫామిలీ ల౦చ్ కి పిలిస్తే వెళ్ళాను.
(మా ఇ౦టామే ,ఈమె తోడికోడళ్ళు ). మెనూ ఏ౦ట౦టే మొత్తం ఫిష్ కర్రి తో పాటు , జన తో చట్ని, స్కిన్ తో రిబ్బన్ పకోడీ లాగ (చేపదే) , 'తోక మరియు తలకాయ్' తో పప్పు.. మనం షాక్. (వేరే ఇ౦కెమ్ లెవ్వు. ఊరగాయలు కుడా తినరు చచ్చి.)

ఆ చట్ని, పాముల్లా ఉన్న పకోడీ ని ధైర్యం చెయ్యలేదు కాని, తలకాయ వేసారని తెలియక మీలానే పప్పు వేసుకున్నాను. బావు౦ది రుచిగా :)

మహీధర రెడ్డి said...

మీ పాలిట కష్టాలు మా నోట నవ్వుల హరివిల్లులు ఇంద్ర ధనస్సులు ఉరుములు మెరుపులు ......∞(infinity) పూయించాయి కదండీ!!! వామ్మో, అలా కూడా పప్పు చేస్తారని ఇపుడే తెలిసింది. అ కాఫీ సంఘటన కేకో కేక, దానికి మీరు పేటెంట్ తీసుకోవాల్సిందే. మీ ఈ టపా గత టపాల కన్న కొంచెం ఎక్కువ బాగుంది. మీ పాప లీల గురించి ఎపుడు వ్రాస్తా రా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను.

VSR said...

Yendaaa kaalam lo Perugannam lo modatlo RASAALU....tharuvaatha BANGINAPALLI maamidi kaayalu thinadam sahajame kadaaa!!!!


ilaa thindam gurinchi theliyani TELUGU vaaru kduaaa vuntaaraaa?????

కొత్తావకాయ said...

జిహ్వకో రుచిలెండి. ఎవరినీ ఏమీ అనలేం. నామటుకు నాకు పెరుగు, స్వీట్స్, కాఫీ టీలు ఇంకొకరి చేతితో చేసినవి ముట్టుకోలేను. నిర్మొహమాటంగా అలవాటులేదని చెప్పేస్తాను. వేరు కాపురం పెట్టుకొని నా వంట నేను చేసుకొనే దాకా ఇంచు మించు ఇవన్నీ త్యాగం చేసేసానంటే నమ్ముతారా? దాదాపు మూడేళ్ళు. మూర్ఖత్వం కాదిది అంతే.. ఆయా వస్తువుల మీద ఉన్న ప్రేమ. అంతే.


కామెంట్స్ కి పాప్ అప్ విండో కొంచెం ఇబ్బంది గా అనిపించింది నాకు. ఇంతకు ముందు ఉన్నట్టే బాగుందేమో!

స్నిగ్ధ said...

కృష్ణ గారు,నవ్వలేక చచ్చానండీ బాబు...
అసలే ఆకలి మీదున్నా మీ టపా చదివేప్పుడు..మీరేమో ఎంచక్కా మామిడికాయ పప్పు,నెయ్యి అంటూ నోరూరించారు...
చివరాఖరికి చూస్తే మేటర్ ఇదన్నమాట..
:) ఇంత వెరైటీ పప్పు తిన్నందుకు మీరూ గ్రేటో గ్రేట్...
కాఫీ సంఘటన ఐతే కేక...:)
మిమ్మల్ని ఆ సిట్వేషన్ నుండి రక్షించిన మీ ఫ్రెండ్ సూపర్...
మిగతా వంటకాలు ఓ.కె నా???

thrill said...

krihna priya garu ,

papam vallu pettinavi .. ruchulu chudakudadandi .. abhimanam apyayata anuragam kalipi tinte taste vastundi ... ( ade meeru capsicum upma tinnattu )ante kani ala ruchulu chustu tinte ittane untundi .. ade valla penimitiki meeku teda atanu avi kalupukoni pappu ni enta chakkaga aswadhistunnado chusara?..
( krishna priya gari antaratma- avunura baduddai .. ikkada cheri matalu cheppadam kadu , okka mudda tinunte chachi urukunevadivi ...oo pedda neetulu cheptunnav )
..

hahaha .... any ways it remaind me two things ...

1 . chinnappudu telugu pusthakam lo chaduvukunna viswanadhuni kavitha .. viswanadhudu kanrnataka velli .. akkada edo .. tini ...bengatho, badhatho kavitha rasthadu ... " dayaledaa neeku kannada rajyalaxmi , nenu kavisarvabhowmudan " antuuu..


2. maa seenu baduddai (kalas3)..eppudu kottaplace lo enta chetta hotel kelinaa ... just edaina kura oka pakka veskoni taste chusi bagunte malli veskundame dhyase undadu ... direct ga annam madhyalo full ga veseskuntadu .... ( of course baduddai enta chettagunna lottaleskuntuu tinesthadu ... naku oka pakka vamting vastunna pattinchukokundaa)

chivaraga .. mee frnd leela garu..neellu posindi mee annam lo kadu maa anandam meeda :P.

itlu
bakara bala satti

జయ said...

Krishnapriya garu, I wish you a very happy Friendship Day.

Chandu S said...

ఇవ్వాళ మళ్ళీ ఖాళీ, మీ బ్లాగులో పడ్డా కాఫీ మగ్గుతో, నవ్వి నవ్వి , నా కాలు బొబ్బలెక్కింది,( నవ్వులో మర్చి పోయా, చేతిలో వేడి కాఫీ ఉన్న సంగతి)

కొద్దిగా font size పెంచండి, ఈ మధ్య మరీ గుడ్డి పక్షి నయ్యాను.

sri nageswari said...

సూపర్ గా రాశారు

కృష్ణప్రియ said...

@ మౌళి,
:) తల కాయల పప్పు .. హతోస్మి!

@ మహీధర్ గారు,
చాలా చాలా థాంక్స్! రిప్లై లేట్ అయింది. నా బ్లాగ్ కి వెళ్ళకుండా.. వేరే వాళ్ల బ్లాగులు మాత్రమే చూస్తున్నాను గత వారం అంతా!

@ VSR,
hmm తెలుసు. అదొక స్పెషల్ అని .. కానీ అన్నం లోకి అంటే పర్సనల్ గా ఎందుకో తీపి తినలేక.. అంతే..

@ కొత్తావకాయ,
నిజమే. నేనూ.. టీ తాగను.. ఎవరింట్లోనూ. తాగను.. అని చెప్తాను. ఎందుకంటే ఎక్కువ పాలు అవీ పోస్తారని భయం :)
కామెంట్ పాప్ అప్ విండో మారుస్తాను. ఎవరో బ్లాగర్లు అడిగారనే ఇలాగ మార్చాను

@ స్నిగ్ధ,
:) థాంక్స్! మిగిలిన వన్నీ కత్తి,కేక etc etc.. బాగున్నాయి.

కృష్ణప్రియ said...

@ థ్రిల్,
:) బాగుంది. అన్నట్టు మీ ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు అందాయి. ధన్యవాదాలు...

@ జయ గారు,

మీకు కూడా.. కాస్త లేట్ గా..

@ శైలజ గారు,

:) ఈసారి కాఫీ తో రాకండి. టీ ట్రై చేయండి :) ధన్యవాదాలు!

@ శ్రీ నాగేశ్వరి గారు,

ఇటు వైపు ఇంతకు మునుపు మీరు వచ్చినట్టు లేదు. స్వాగతం!

Anonymous said...

mee laaanti pappu kashtaale maa friend okkarthi padindi.. vaalla atthagaaru apple pappu cheesinaappudu :) ..... Mohamaataaniki baagundantee... plate motham nimpeesindanta aavida.. plus... appudu intlooo vaallu iddaree dinner cheestunnaraantaa.. :) ....

శిరీష said...

చాలా బాగుంది గుమ్మడి అరటి జీడిమామిడి బెల్లం పప్పు :) :)
మా కార్యాలయం లో కుడా ఒక కేరలైట్ ఏదో కేరళ ప్రత్యేక వంటకం తెచ్చాను అంటే, అనందంగా అతని డెస్క్ దగ్గరికి వెళ్లితే చిన్న చిన్న కాగితం గ్లాస్ లో పొసిస్తే , గ్లాస్ చెతిలొకి తెసుకొగానే ఒకటే పిచ్చి వాసన. నేను నిజంగనే త్రాగుతున్నట్లు కొంచెం సేపు అలా ఇలా వీళ్ళా వైపు వాళ్ళవైపు చూసి ఎంత బాగుందో కదా !!! అయ్యో మర్చి పొయ్యాను హీ హీ నాకు కొంచెం తొందరగ చెయ్యాల్సిన పని ఉంది నేను నా డెస్క్ దగ్గరికి వెల్లి నిదానంగా త్రాగుతాను అని వెళ్ళి ఎవ్వరూ చూడకుండా చెత్త బుట్టలొ ఒంపేసి, వళ్ళా వైపు చూస్తే అందరూ ఇంకో గల్స్స్ అని తీసుకొంటున్నారు వరద భాదితుల్లాగా. అందరు అయిపోంది అనగానీ, ఆ అవకసం కొసం ఎదురుచూస్తున్న మనం, చాలా బాగుంది అప్పుడె అయిపొఇంద, చాలా బాగుంది నేను ఇంకో గ్లాస్స్ తీసుకొందాం అనుకొన్నానాను మళ్ళి ఎప్పుదు తెస్తారూ? హీ హీ ఈసారి కొంచెం ఎక్కువ తీసుకుకొనిరండి అని చెప్పి నెమ్మదిగా నా దెస్క్ గగ్గరికి వచ్చాను.

కృష్ణప్రియ said...

@ అజ్ఞాత,
 ఆపిల్ పప్పు :) భలే. మా ఆడపడచు వచ్చినప్పుడు చేసిపెడతా ఈసారి.

@ శిరీష,
:) మీ కథ విన్నాక ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఓసారి పూత రేకులు తెచ్చాను ఆఫీసుకి. ఒకాయన కొరికి (అస్సలూ నచ్చలేదనుకుంటా) ‘వ్వౌ నైస్ అని తింటూ వెళ్లి బ్రేక్ రూమ్ లో చెత్త లో పడేస్తుంటే నేను చూశాను అప్పుడు ఆయన మొహం లో పలికించిన భావాలు.. ఆహా :)

Anonymous said...

Hats off to your sense of humour!

SANJAY MENGANI said...

I was not able to enjoy this post as i'm in office. Coffee scene is keka.

Vani said...

Nenu enni rojulayindo nandi ila chaduvutha padi padi navvdam. US ki vachina kothalo andaram ilanti sannivesalni face chesam anamata. Mee saili matuku super andi.

Anonymous said...

చాలా రోజుల తర్వాత, కాఫీ గురించి చదివి, కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా నవ్వాను. అప్పుడే, పక్క క్యూబ్ నించీ, తెలుగు రాని ఒకాయన వస్తే, నవ్వుతూ, ఆయనకి ఇంగ్లీషులోకి తర్జుమా చేసి చెప్పి, మళ్ళీ నవ్వాను. ఆయన కూడా బాగా నవ్వాడు.

మీకు హాస్యం చక్కగా రాయగలిగే శక్తి వుంది. మంచి పదాలూ, మంచి భావ ప్రకటనా. సహజత్వం వుంటుంది మీ వివరణలో. అయితే, వాక్య నిర్మాణంలోనూ, విరామ చిహ్నాల విషయంలోనూ కొంచెం జాగ్రత్త వహిస్తే, భాష ఇంకా బాగుంటుంది.

ఉదాహరణకి, "ఒక చిన్న పాప .. వాళ్లమ్మ నోరు బలవంతాన తెరిచి పప్పన్నం కుక్కుతోంది." అని రాశారు. దానికి, "ఆ పాప, వాళ్ళమ్మ నోరు బలవంతాన తెరిచి పప్పన్నం కుక్కుతోంది" అని అర్థం వస్తుంది. పాప, వాళ్ళమ్మ నోరు తెరవడం ఏమిటీ? అసలు ఇది, మీ స్టైలులో అయినా, ""ఒక చిన్న పాప .. వాళ్లమ్మ దాని నోరు బలవంతాన తెరిచి పప్పన్నం కుక్కుతోంది." అని వుండాలి. అప్పుడు, అర్థం స్పష్టంగా వస్తుంది.

ఒకరు అన్నట్టు, ఆ పప్పు "సీతాఫలం లాగా మధురంగా" వుంది అని అనకూడదు. అలా అంటే, మీకు నచ్చినట్టు తప్పర్థం వచ్చింది. తర్వాత అర్థం అయిందనుకోండీ, మీ భావం. అసలు అర్థం, వాక్యం చదవగానే వచ్చేస్తే, ఇంకా బాగుంటుంది. "సీతాఫలం కన్నా తియ్యగా" వుందని రాస్తే, వెంటనే అర్థం అయిపోయేది. ఎవరూ (ఎక్కువ మంది) అన్నంలో తియ్యటి పప్పు ఇష్ట పడరు కదా?

మీరు, "సారీ అండీ.. పైప్ పెట్టమని మొత్తుకున్నా..వినట్లేదు. ఎవ్వరికీ సమయం దొరకట్లేదు" అని రాశారు. ఎందుకు రెండేసి ఫుల్ స్టాపులు పెడతారూ? సాధారణంగా, ఏదయినా వాక్యం పూర్తి చెయ్యకుండా, మధ్యలో వదిలేస్తే, అప్పుడు ఆ విషయాన్ని రెండేసి ఫుల్ స్టాపులు పెట్టి, స్పష్టం చేస్తారు. ప్రతీ చోటా ఇలా చేస్తే, అర్థ రహితంగా వుంటుంది.

ఇంకో చిన్న విషయం. "చేసాను", "వచ్చేసాను" అని రాస్తారు, మీరు. అలాగే పలుకుతారా, ఆ మాటలు చెప్పేటప్పుడు? కొన్ని సార్లు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఆ మాటలు ఎలా పలుకుతారో, సాధారణంగా. మీ భాష చూస్తుంటే, మీరు ఆ మాటల్ని, "చేశాను" అనీ, "వచ్చేశాను" అనీ పలుకుతారనే అనిపిస్తోంది. ఎలా పలికితే, అలాగే రాయడం బాగుంటుంది.

ఏవో ఉచిత సలహాలు ఇచ్చానని తిట్టుకోకండి. ఈ వ్యాసం చాలా బాగుంది గనకనే, ఈ విషయాలు చెప్పాలనిపించింది. నేను చెప్పినవి చిన్న విషయాలు. రాను రాను, ఇంకో సారి చెక్ చేసుకుంటే, మీకే తెలిసి పొతాయి.

చాలా సరదాగా చెప్పారు. ఇలా చెప్పడం అందరికీ చేతకాదు. ఆ శక్తి వున్నప్పుడు, దాన్ని చక్కగా వాడుకోవచ్చు మీరు. మాలాంటి వాళ్ళం చదివి నవ్వుకుంటాము. నిజానికి, ఈ పోస్టుని, కొంత మార్చి, ఒక కధలా చెయ్యొచ్చు. పత్రికల వాళ్ళు కళ్ళకద్దుకుని వేసుకుంటారు.

కధ సారాంశం: మీలాంటి ఒక మొహమాటాల ఆవిడ వుంటుంది. ఆవిడకి ఒకరింట్లో కాఫీ అనుభవం కలుగుతుంది. అప్పట్నించీ, మొహమాటం ఇంకా ఎక్కువై పోయి, బాగో పోయినా, తినడం మొదలు పెడుతుంది. ఆ తర్వాక ఈ పార్టీకి వెళ్ళడం, మీరు రాసినదంతా, చక్రపొంగలీ, చిన్న పిల్ల నిర్మొహమాటత్వం, అన్నీ అలాగే వుంటాయి, ఆఖరికి, మీ స్నేహితురాలు మీ ప్లేట్లో నీళ్ళు పొయ్యడం వరకూ, మీరు అయ్యో అని విచారించడం వరకూ. అప్పుడు, ఆ గృహిణి, "అయ్యో, మీరు చాలా ఇష్టపడ్డ పప్పన్నంలో నీళ్ళు పడ్డాయా? అయ్యయ్యో! వుండండీ, మీకు మళ్ళీ పప్పన్నం ఎక్కువగా వడ్డిస్తానూ" అని అంటూ, ఆ పప్పు గిన్నెని మీ దగ్గరకి తీసుకొస్తుంది. అప్పుడు, మీరు మొహమాటం వదిలేసి, కొంత నిజం చెప్పేస్తారు, ఇక ఆ బాధలకి తట్టుకోలేక. ఆ ఇంటావిడ, బలవంతపు నవ్వుతో (లోపల్లోపల నొచ్చుకుంటూ), "ఫరవాలేదు లెండి" అనేసి, మిమ్మల్ని వదిలేస్తుంది. అప్పుడు, మొహమాటం వదిలెయ్యాలని మీరు గాఢంగా, సంతోషంగా నిశ్చయించుకుంటారు, ఆ కష్టం నించీ తప్పించుకోగలిగినందుకు. అయితే, ఒక వారం పోయాక, ఆ ఇంటావిడ, మళ్ళీ ఇంకో డిన్నర్ పార్టీ ఇచ్చిందనీ, మిమ్మల్ని పిలవలేదనీ తెలుస్తుంది. దానికి, విచారించి, మళ్ళీ మొహమాటాన్ని వెనక్కి తెచ్చుకుంటారు.

భలే వుంటుంది, మీరు ఇలా రాస్తే, మీ భాష తోనూ, మీ భావ ప్రకటన తోనూ, మీ హాస్యం తోనూ. నవ్య వాళ్ళో, ఆంధ్రజ్యోతి ఆదివారం వాళ్ళో కళ్ళకద్దుకుని వేసుకుంటారు. ఇంటర్‌నెట్ మొహం ఎరగని పాఠకులు చాలా మంది వున్నారు. వాళ్ళందరూ సంతోషంగా చదువుకుంటారు. దీనర్థం, మీరు, నేను చెప్పినట్టే, కధ రాయాలని కాదు. మీకు తోచినట్టయినా, పూర్తి కధలాగా రాయొచ్చు.

ఉచిత సలహాలు ఇక ఆపుతాను. కావాలంటే, కొంచెం తిట్టండి గానీ, బాగా తిట్టకండి. పోనీ, బాగా తిట్టుకోండి మనసులో.

చక్కగా వుంది మొత్తానికి.

Anonymous said...

http://www.andhrajyothy.com/node/78192

అంతా తగ్గించి, ఏదో వేసుకుని, ఖూనీ చేసి పెట్టారు ఒరిజినల్ ఆర్టికల్‌ని. ప్రాణం వుసూరుమంది చూడగానే. ఉచిత సలహాలు ఇవ్వడం శుద్ధ దండగ. :-(

కృష్ణప్రియ said...

అనాన్ గారు,

నిజంగా చూసి విరక్తి వచ్చింది. ఎవరొ అంత చెత్తగా కత్తిరించి.. వాళ్ల స్వంత పైత్యం పెట్టి మరీ పబ్లిష్ చేశారు.
I am unhappy about it.

కృష్ణప్రియ said...

సంజయ్ గారు, వాణి గారు,

థాంక్స్.

అజ్ఞాత గారు,
మీ వ్యాఖ్య కి చాలా చాలా థాంక్స్. నేను చదివి, నా శ్రేయోభిలాషులకి చెప్తే వాళ్లు కూడా చదివి నిజమే, అని మీ అభిప్రాయాలకి వారూ మద్దతు పలికారు. అయితే చిన్న ఎమర్జెన్సీ లో ఉండటం తో వెంటనే స్పందించలేకపోయాను.
మీరు చూడండి, మళ్లీ రాసినప్పుడు ఇవి సరిదిద్దుకుని మరీ రాస్తాను. వీలైతే నాకు ఈ మెయిల్ చేయండి. ఈసారి కొత్త టపా రాస్తే మీకు పింగ్ చేస్తాను.

కృష్ణప్రియ said...

సంజయ్ గారు, వాణి గారు,

థాంక్స్.

అజ్ఞాత గారు,
మీ వ్యాఖ్య కి చాలా చాలా థాంక్స్. నేను చదివి, నా శ్రేయోభిలాషులకి చెప్తే వాళ్లు కూడా చదివి నిజమే, అని మీ అభిప్రాయాలకి వారూ మద్దతు పలికారు. అయితే చిన్న ఎమర్జెన్సీ లో ఉండటం తో వెంటనే స్పందించలేకపోయాను.
మీరు చూడండి, మళ్లీ రాసినప్పుడు ఇవి సరిదిద్దుకుని మరీ రాస్తాను. వీలైతే నాకు ఈ మెయిల్ చేయండి. ఈసారి కొత్త టపా రాస్తే మీకు పింగ్ చేస్తాను.

Mauli said...

hmm madhuram gaa undi, inkaa madhuram gaa undi anadam lo tedaa undaa!!!!!

inka, inkaaa ani annaa koodaa bhaavam lo vyakhyaata cheppina tedaa avapadadam ledu.


migilina savaranalu anni koodaa ardhavantam gaa anipinchadam ledu.

శ్రీ said...

AJ people killed this article to the core... nenu mee blog lo chadivi naa fb lo mee blog link pettanu...
loved the article ... thanks for such a wonderful article ...

కృష్ణప్రియ said...

@శ్రీ గారు,

:-( అవును ఖూనీ చేయడ౦ అ౦టే ఏ౦టో అర్థ౦ అయి౦ది

థా౦క్స్!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;