Sunday, December 25, 2011 47 comments

మూడు వందల అరవై రోజుల జ్ఞాపకాలు....



ఇంకో కాలెండర్ చెత్త బుట్టలోకి.., ఇంకో ‘యాప్పీ న్యూ ఇయరు..’ పది పేజీలు రాసి వదిలేసే ఇంకో డైరీ, రెండు రోజులు ఆచరించి మూలన పెట్టిన రెసొల్యూషన్లు.. ఈసంవత్సరం పోగేసిన ఇంకో నాలుగు పౌండ్లు.. మూడు వందల అరవై రోజులు,.. అంతేనా? ఒక సంవత్సరం కొందరి జీవితాల్లో ఓడల్ని బళ్లు గా .. బండ్లని ఓడలు గా మారుస్తుందేమో, . కొంత మంది జీవితాల్లో ఎక్కడి గొంగళి ని అక్కడే ఉంచేస్తుందేమో, వయసు పెరిగిన కొద్దీ, నలభైలకి దగ్గర కొస్తున్నకొద్దీ జీవితం గానుగెద్దు జీవితం లా అలాగే ఉంటుందనీ, పెద్దగా కూర్పు, మార్పు,చేర్పులుండవనీ, విసుగెత్తిపోతుందనీ.. ఎన్నో విన్నాను. మానసికం గా రెడీ అవ్వాలనుకుంటూ కూడా ఆలోచిస్తూన్నాను ఒకప్పుడు.. కానీ నాకైతే 2011 బాగా పాళ్లు కుదిరిన ఉగాది పచ్చడి లా.. కొద్దిగా తియ్యగా, పుల్లగా, చేదుగా,కమ్మగా,కారంగా, వగరు గా, అన్ని రకాలు గా.. జయోపజయాలు, కష్ట సుఖాలు, శాశ్వతమనుకున్న కొన్ని పరిచయాలు స్నేహాలు, ముందు రోజు జాజుల్లా వడలిపోగా, కొన్ని పరిచయాలు ఆకులు దూసేసిన మల్లె తీగలా కొత్త చిగుర్లు తొడగటాలు,.. ఎవరిదో బ్లాగ్ టాగ్ లైన్ లా ‘సహస్ర వర్ణ శోభితమీ జీవితం’ అన్న మాట కి అర్థం తెలిసేలా..


కమ్మగా,..కొబ్బరి పలుకుల్లా..

భలే పుస్తకాలు చదివాగా..

ప్రొ. బైరప్ప గారు రాసిన పర్వ, డా. కేశవరెడ్డి గారు రచించిన ‘మునెమ్మ’, ‘అతడు అడవిని జయించాడు’, యండమూరి రాసిన ‘డేగ రెక్కల చప్పుడు’, యార్లగడ్డ రాసిన ‘సత్యభామ’, మధురాంతకం వారి కథల కలెక్షన్, శ్రీపాద వారి పుల్లం పేట జరీ చీర, మార్గదర్శి కథల సంకలనాలు, నాలుగు కాలక్షేపం ఆంగ్ల నవలలు, అరడజను తెలుగు నవలలు,నవలికలూ..

నచ్చిన కొత్త రుచులు!

ఉలవచారు మీగడ తో, కిసాన్ వారి కొత్త క్రీం చీజ్ లు, శొంఠి, కర్వేపాకు కాడల చారు, డామినోస్ వారి చాకో లావా కేక్, హైడ్ & సీక్ – కిస్ ఆఫ్ కాఫీ బిస్కట్లు,

హం చేసుకున్న కొత్త పాటలు..

శంకర్ మహాదేవన్ - గణేశాయ ధీమహి, Mr Perfect - చలి చలిగా, JNDB- సేనోరిటా, రావన్ -చమ్మక్ చల్లో..

చేసుకున్న కొత్త అలవాటు..

ఒకటి రెండు ఇంట్లో శుభ కార్యాలకి తప్ప, సింథటిక్,పట్టు బట్టల వాడకం దాదాపు లేకపోవటం. అన్నీ నూలు బట్టలే నా వార్డ్ రోబ్ ని ఆక్రమించటం..

వ్యవసాయ విజయాలు..








చెప్పుకోదగ్గ పంటలు (కొద్దిగా పెద్ద పదం వాడినట్టున్నాను).. సంక్రాంతికి పసుపు కొమ్ములు తవ్వుకోగలగటం, ౨౦ గ్రాముల కందిపప్పు పండించుకోగలగటం, ఓ నాలుగు కిలోల చేమగడ్డలు, ఎనిమిది గెలల అరటి పండ్లు,.. బ్రహ్మ కమలాలు

తియ్య తియ్యని కొత్త బెల్లం లాగా.. మంచి బ్లాగ్ జ్ఞాపకాలు..

బ్లాగు లో దాదాపు అన్ని టపాలూ, విహంగ లో ఒక రచన, మాలిక పత్రికలో ఒక రచన, ఒక పుస్తకానికి తొలి రివ్యూ, ఒక సినిమా కి నవతరంగం లో ఏ-వ్యూ, నమస్తే ఆంధ్ర లో నా బ్లాగ్ టపా, బ్లాగ్ పరిచయం.. కృష్ణప్రియం టపా, స్ఫురిత వేసిన నా బ్లాగ్ ప్రొఫైల్ బొమ్మ, బోల్డు ఈ-ఉత్తరాలు..

అందుకున్న ప్రశంసలు..

నా తో అనారోగ్యకరమైన పోటీ తత్వం తో బాధపడుతున్న ఒక వ్యక్తి, ఒక బలహీన క్షణం లో నా బాటే కరెక్ట్ అని అంగీకరించటం, ,

కొన్ని బ్లాగర్ల ఈ-మెయిళ్ళు

చేసిన తప్పులు..

అబ్బా..ఇది కష్టం బాబూ.. చాలా చేశాను. అయినా.. కొన్ని .. స్కూటర్ మీద వెళ్తూ కూలీల పిల్లలిద్దరు ‘లిఫ్ట్’ అని అడిగితే కొంపలు మునిగే పని లేక పోయినా..సినిమా హాల్లో పార్కింగ్ దొరకదేమో నన్న బెంగ తో ఎక్కించుకోకపోవటం.. తర్వాత సినిమా చూస్తున్నంత సేపూ, అయ్యో అని వగచటం.

ఇస్త్రీ చేసే కుర్రాడు, నా బిడ్డ వయసు వాడు.. కేవలం పండగలకీ, పబ్బాలకీ స్వీట్లూ, అవీ ఇస్తాననీ,స్కూల్ ఫీజు కడుతున్నానన్న (ఎక్కడో మస్తిష్కం లో దాక్కున్న) గర్వం తో, ఒక విషయం లో సరిగ్గా పని చేయలేదని కొద్దిగా అవమానకరం గా మాట్లాడటం, సంవత్సరం అంతా.. మానని గాయం లా అది బాధించటం.

ఆఫీసులో కొంత పనిని కావాలని తప్పించుకోవటం, ఆఫీస్ సమయం లో వ్యక్తిగత పనులు చేసుకోవటం, .కొన్ని సార్లు హాస్యం శృతి మించి ఎదుటి వారిని గాయపరచటం.. ఒకరిద్దరిని ‘అవాయిడ్’ చేయటం..

మనస్సుకి నచ్చిన ఒక రోజు..

ఉదయపు అల్ఫాహారం, తోట పని, తలంట్లు అయ్యాక ఒకానొక ఆదివారం, పిల్లలు ఏదో ప్రాక్టీసులకని, శ్రీవారు ఆఫీసు పనికనీ,వెళ్తే.. నచ్చిన పుస్తకం చదువుకుంటూ, ఆవకాయన్నం తిని, ఒక కునుకు తీసి, చిరు చీకటి సమయం లో దీపాలు పెట్టకుండా.. పురందర దాసు రచించిన కాపీ రాగ కృతి ‘జగదోద్ధారణ’ పాడుకుంటుంటే, పక్కింటావిడ (బోంబే జయశ్రీ పెద్దమ్మ కూతురు) తన శృతి పెట్టే తెచ్చుకుని మరీ వచ్చి, నాతో కూర్చుని బోల్డు పాటలు పాడటం..

చిరు విజయాలు



ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ‘లైవ్’ హరికథ, దూర్ దర్శన్ పుణ్యమాని టీవీ లో మళ్లీ అప్పుడప్పుడూ చూసిన ప్రక్రియని ఆంగ్లం లో ‘దాక్షాయణి’ కథ ని ‘నాదా తనుమనిశం శంకరం’ , ‘నటనం ఆడెనే’, ‘శివాష్టకం’ లాంటివి పాడుతూ కర్ణాటక సంగీతం కృతులతో, పద్యాలతో కూర్పు చేసుకుని, నా పెద్ద కూతురి గాత్ర సహకారం తో కాంప్లెక్స్ వాసులకి చెప్పటం..

అన్ని వైపుల నుండీ వచ్చే ఒత్తిడులకి చెదరకుండా, బెదరకుండా, రెండు పెద్ద కస్టమర్ ఇష్యూలకి చెక్ పెట్టటం, నా కారీర్ లో ఇంకో ప్రాజెక్ట్ కొత్త బాక్స్ మీద సంవత్సరపు ఆఖరి రోజున పని చేయించగలగటం..

పిజ్జా, పాస్టా లే తిండి పదార్థాలు, ఆలుగడ్డ వేపుడు, ఉత్తర భారతీయులు చేసుకునే మీగడల, పనీర్ కూరలు మాత్రమే , తినాలి అనుకునే మా పిల్లల తో,.. పెసరపచ్చడి, నెయ్యన్నం, కాబేజ్, కాప్సికం, ముఖ్యం గా వంకాయ పులుసు అలవాటు చేయటం.


ఏకైక తమ్ముడికి పెళ్లి కుదిర్చటం లో ప్రముఖ పాత్ర వహించి, మరదల్ని తెచ్చుకోవటం.

సుమన్ బాబు సినిమాలకి ‘టెంప్ట్’ అవటమో, రాత్రి పూట మీటింగ్ లు నడుస్తుంటే పది దాటాక వేసే తెలుగు/హిందీ సినిమాలు చూడటం, అప్పుడప్పుడూ వేరే పనేదో చేసుకుంటూ చూసిన ఆంగ్ల సినిమాలు తప్పితే, టీవీ వ్యామోహం నుండి దూరమవగలగటం..

ఇంట్లో Wii,DS ల్లాంటివి ఉంచుకుని కూడా పిల్లలకి వాటి వైపు ధ్యాస పోకుండా ఆటపాటల్లో, పుస్తక పఠనం ఎక్కువ సమయం గడిపేలా చేయగలగటం.

మహాభారతం కథ విశదం గా చెప్పి, ఆఖర్న కొన్ని కథలు సగం సగం వదిలి, తద్వారా, మా పెద్దమ్మాయి తో డా. రాజ గోపాలాచారి గారి భారతం, దేవదత్త పట్నాయక్ రచించిన ‘జయ’ చదివేలా చేయగలగటం, అలాగే ఇడ్లీలు, దోశలు, పచ్చడి,మాగీ,సాండ్ విచ్ లు చేసుకోవటం అలవాటు చేయటం.

అపజయాలు..

నా దగ్గర చేరిన BITS BTech intern చేత పని చేయించుకోలేకపోవటం..

సంగీతం నేర్చుకోవటం ఆపేయటం.,

కార్ డ్రైవింగ్ టెస్ట్ కి ఈ సంవత్సరం కూడా వెళ్లకపోవటం...

యోగా వదిలేయటం.

స్నేహితులు..

ఇరవయ్యేళ్ల తర్వాత, కలిసిన నలుగురు స్నేహితులు, పదహారేళ్ల తర్వాత కలిసిన ఇంకో స్నేహితురాలు.. Thank you facebook, Linked in!

కేవలం నాలుగేళ్లు కనుమరుగమవటం వల్ల, పల్చబడ్డ పదిహేనేళ్ల స్నేహాలు రెండు మూడు..

కొత్తగా ఏర్పడ్డ మూడు స్నేహాలు..

ప్రయాణాలు..

బెంగుళూరు కి దగ్గర ఊళ్లకి వారాంతం ట్రిప్ లు..మేకెదాటు, రామ నగర, దొడ్డ మలూర్, కాలి నడకన తిరుపతి వెంకన్న దర్శనం, అమెరికా, పారిస్ పర్యటన, ఒక ఎనిమిది సార్లు హైదరాబాద్ ట్రిప్పులు, ఒక కడప ప్రయాణం..

దుఃఖాలు.. వ్యక్తిగతం గా పెద్దగా లేనట్టున్నాయి. పేపర్లలో పడ్డ కొన్ని సంఘటనలు, దేవానంద్ మరణం,

‘వా హ్’ అనుకున్న సెలెబ్రిటీ .. అన్నా హజారే

‘వార్నీ’ అనుకున్న దొంగలు : గాలి జనార్థన్. కనిమొళి

కొత్తగా సంపాదించిన చరాస్తులు.... నా బ్లాక్ బ్యూటీ (నల్ల హోండా ఆక్తివా బండి), ఒక జత బంగారు గాజులు.

బాగా కాయకష్టం చేసి అలిసిన రోజు.. వెంకన్న దర్శనం కోసం కాలి బాటన వెళ్లటాన్ని వదిలేస్తే, ఇంటి వెనక తోటంతా శుభ్రపరచిన రోజు..

‘అమ్మయ్య’ అనుకున్నరోజులు... తమ్ముడి పెళ్లయి ఇంటికి వచ్చిన రోజు, పిల్లల పరీక్షలైన రోజు, నిరోష్ఠ బ్లాగాయణం టపా అయిందనిపించినరోజు..

ముప్పైల్లో అందులో ఆఖరి సంవత్సరం ఇంత ఇంటరెస్టింగ్ గా గడుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు రోలర్ కోస్టర్ రైడ్ లాంటి బిజీ జీవితం లో చిన్న సర్ప్రైజ్ లు చిలకరించి మనసు లోతుల్లో, ఎక్కడో ఆటక పైన పెట్టిన దుమ్ము పెట్టిన అట్ట పెట్టెల్లో దాచిన పాత పరిచయాలు, అప్పుడప్పుడూ ఒక్కోటి గా దింపి, నెమరు వేసుకునేలా చేసిన ఘనత మాత్రం ఫేస్ బుక్, బ్లాగ్, లింకేడ్ ఇన్ లకే ఇస్తాను. మళ్లీ మనుషులని కాస్త దగ్గర చేయటానికి విత్తనం అయితే వేయబడింది. ఇక వాటిని నీళ్లు పోసి, జాగ్రత్తలు చేసి నిలుపుకోవటం, వదిలేయటం నా చేతుల్లోనే ఉంది.

ఇంకో ఐదు రోజులుంది కొత్త సంవత్సరాగమనానికి... ఇంకెన్ని రంగులున్నాయో, రుచులున్నాయో, ఇంకెన్ని  పరిమళాలు నా కోసం వేచి ఉన్నాయో,. చూద్దాం!

Tuesday, December 20, 2011 34 comments

తథాస్తు దేవతలు చేసిన మేలు..


ఆఫీస్ డెడ్ లైన్ దగ్గరకొచ్చేసింది.. ప్రతి రోజూ అర్థ రాత్రి దాకా కాన్ఫరెన్స్ కాల్సు,.. వెండర్ హార్డ్ వేర్ కరెక్ట్ చేసి ఇయ్యడు, కస్ట్ మర్ ఇస్తావా చస్తావా? అని బాసు గారి మీద రంకెలేస్తే, ఆయన యథాతథం గా ఆ దీవెనలన్నీ, ముళ్లల్లో జాగ్రత్త గా పెట్టి, దానికి ఆయన తిక్క కూడా జోడించి మా నెత్తి మీద గుమ్మరించేశాడు. సరే ‘జీతాలు తీసుకోవట్లా?’ అనుకుని, ఈ పనుల్లో హడావిడి గా.. తిరుగుతున్నానా? వచ్చే వారం నుండీ పిల్లల పరీక్షలని గుర్తుకొచ్చింది. వీళ్లని చదివిస్తూ, కస్టమర్ బగ్.. చూసుకుంటూ.. పదేళ్లు గా ఒక్కసారైనా మా ఇంటికి రాలేకపోయిన బంధువులు వస్తున్నామని ఫోన్.. ‘ఆహా! ఏమదృష్టం!’ అనుకుంటూ, చంద్రముఖి లో రజనీ లా.. “అసలు నా ఊహ కరెక్ట్ అయితే ఈ పాటికి పనమ్మాయి కి జలుబో, జ్వరమో రావాలి” అని కళ్ళు మూసుకుని ఇలాగ అన్నానో లేదో.. ఫోన్ రింగ్ అయింది.

‘హలో’ కి సమాధానం.. “ఖళ్ ఖళ్” మేరీ.. “ఒడంబు సరి ఇల్లే మేడం..”

ఒక్క క్షణం నా వాక్షుద్ధి కి గర్వించినా, అంట్లు, బట్టలు,ఇల్లు తుడవటం లాంటి అదనపు బాధ్యతలు కూడా కూడా నెత్తిన పడ్డాయి. కప్పు చాయ్ తాగేలోగా కనీసం మూడు సార్లు వెచ్చపెట్టుకోవటం,.. నీలపు పన్ను (బ్లూ టూత్) లో కాల్స్ లో మాట్లాడుతూనే తినటం, పిల్లల్ని తయారు చేయటం, వంటలు వండటం, ఇల్లూడవటం, చదివించటం,

అదేంటో, హాచ్చర్యం గా నాకు ఆఫీస్ లో ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు మా వారి ఆఫీసుల్ లో పెనుతుఫాన్లు, ఉత్పాతాలు.. నేను ఆడియో కాన్ఫెరెన్సులైతే, ఆయన ఇంకో మెట్టేక్కి, వీడియో కాన్ఫరెన్సులంటారు, ఇంట్లో ఉన్నంత సేపూ తలుపులు బిడాయించుకుని మరీ..

“ఇంకా పని అవలేదా? ఎలా? పోనీ ఆ చేతన్ కి ఇయ్యనా?” (నీ వల్ల కాదులే.. అని అసలు మెసేజ్), అని అడిగే బాస్ గారిని “లేదు.. దీని అంతు చూస్తే గానీ నిద్రపోను..” అని భీకర ప్రతిజ్ఞలు చేస్తూ, .... ప్చ్..

ఈ లోగా.. పరీక్షలకి కూర్చోపెట్టి చదివిస్తున్నానని కచ్చ తో, మా పాప కొలవేరి పాట కి తన సొంత వర్షన్ పాడుతోంది.

“కొలవేరి కొలవేరి కొలవేరి డి..

వాట్ కైండ్ ఆఫ్ ఫామిలీ ఫామిలీ ఫామిలీ ఇదీ..

మా నాన్న ఏమో కైన్డూ, కైన్డూ, అమ్మ మాత్రం రూడూ..

.. “

“భడవా! అమ్మ రూడా? ఏది కావాలంటే అది చేసి, మీకోసం కష్టపడుతుంటే! ..” అదెప్పుడో తుర్రుమంది.

పెద్దమ్మాయీ, “ఎప్పుడూ చదువూ, చదువూ అంటావు..” అని విసుక్కుంటోంది..

ఎంత చేసినా, ఏదీ చేసినట్టు లేదు. ఎవరికీ తృప్తి లేదు. ఏంటో.. నేను ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచానికి నష్టం లేదు.. ఎలాగూ సామాజిక స్పృహా లేదు.

‘ తల పగిలిపోతోంది.. నిద్రలేమి కి,..హు... ఏంటీ జీవితం! పగవారికి కూడా వద్దు ఈ కష్టాలు.దీనికన్నా.. ఎడారి లో నీళ్ల కోసం పరితపించటం మేలు.. ధృవాల దగ్గర చలికి వణకటం మేలు.. వీటన్నింటి నుంచీ దూరం గా వెళ్లగలిగితే ఎంత బాగుండు?’ అనుకుంటున్నా.. మా నాయనమ్మ చెప్పేది.. “కనుచీకటి పడే వేళ అలాగ ఏమీ అనుకోవద్దే బాబూ! తథాస్తు దేవతలుంటారు.!” అని. అబ్బే.. మనకెక్కితే గా! వాళ్లు బిరబిర లాడుతూ వచ్చేశారు..

‘తథాస్తు’ అనుకుంటూ..

లేకపోతే, వారం మధ్యలో బుధవారం పూట, అన్నన్ని పనులు పెట్టుకుని, అర్థరాత్రి దాకా పని చేసి, మర్నాడు పెద్దదానికి సైన్సు, చిన్నదానికి హిందీ పరీక్షలు పెట్టుకుని.. తల నొప్పి తగ్గకుండా, పని మనిషి రాని రోజుల్లో, ఎవరైనా.. విహార యాత్రకి వెళ్లగలరా?

పదిహేను రోజుల క్రితమే మా ఆఫీస్ లో కుర్రాడు రాజు తన పెళ్లికి రావలసిందే.. అని గట్టి గా చెప్పాడు. ‘ఓస్.. దానికేముంది.. అని మాటిచ్చేశాను. అమ్మాయి కూడా బెంగుళూరు.. ఏ మాత్రానికేం?’ అనుకున్నాను. ఉరుకులూ, పరుగుల జీవితం లో సహోద్యోగులు, స్నేహితులవటానికీ, సన్నిహితులవటానికీ, ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడిపే ఉద్యోగులకి సాధ్యమేమో, కానీ, ఇంట్లోంచి ఎక్కువగా పని చేసి ఆఫీసుల్లో తక్కువ సమయం గడిపే నా లాంటి వారికి పరిచయస్తులు ఎంతమంది అయినా, కొత్త స్నేహితులు ఏర్పడటం అరుదే. రాజు నా టీం లోనే ఉన్న తెలుగబ్బాయి. గత రెండు సంవత్సరాలల్లో ఏర్పడిన ఒకరిద్దరు ఫ్రెండ్స్ లో ఒకరు ఈ రాజు. బుధ వారం ఉదయం ముహూర్తం పెళ్లి అంటే తప్పక వస్తాను అని చెప్పేసాను.

బాసు గారు కూడా, “పెళ్లికి వెళ్తున్నావా కృష్ణా! అందరూ బచ్చాగాళ్ళు వెళ్తున్నారు.. నాకు చాలా పని ఉంది. నువ్వెడితే కాస్త వెయిట్ ఎక్కువ ఉంటుంది... ఆ రోజు కస్టమర్ బాధ్యత చేతన్ కిచ్చి వెళ్లు. ఇంతకీ ఎలా వెళ్తున్నావు?” అన్నారు.

‘వెయిటా!! అంటే?’ అని అడుగుదామన్న పౌరుషం, ‘కేతన్ కి వద్దు నేనే చేస్తా..’ అని బాధ్యతాయుతం గా ప్రవర్తిద్దామన్న ఆలోచనా.. పక్కకి పెట్టి..

‘’ఏముంది? కార్! నాతో ముగ్గుర్ని తీసుకెళ్లగలను” అనేశాను. స్టాఫ్ లో బాసుగారు “కృష్ణ వెళ్తోంది పెళ్లికి తనతో కొంతమందిని తీసుకెళ్లగలదు..” అని చెప్పేశారు. “ఓహ్! కడప కెడుతున్నావా?” పక్కన ఉన్న కునికి పాట్లు పడుతున్న సింగం అడిగాడు.

“కడపా!! Are you kidding?” అన్నాను.

“అవునూ.. పెళ్లి కడప లో కదా!” అన్నాడు కూల్ గా సింగం.

‘నిజమే కదూ అసలెలా మర్చిపోయాను??.. ఓర్నాయనో!.. మాటిచ్చాను. పైగా ముగ్గుర్ని నాతో కార్ లో కడపకి!!, అందునా వారం మధ్యలో.. అసలు ఊళ్లో పెళ్లికే వెళ్లటానికి పది సార్లు ఆలోచించాల్సిన సమయం లో 250 కి. మీ దూరం లో పెళ్లికి. పోనీ ఎమర్జెన్సీ కూడా కాదు. ఏం చెప్పి తప్పించుకోవచ్చు?’ అనుకున్నా.. కానీ రాజు కి ఎంత ఘాట్టి గా మాటిచ్చానో గుర్తొచ్చాకా, నెమ్మదిగా ఆచరణ లోకి పెట్టటం వైపుకి ఆలోచనలు మరలాయి.

మా వారు అభయ హస్తం ఇచ్చేసారు. “నేను మానేజ్ చేస్తాలే.. నువ్వెళ్ళు.. ఎలా వెళ్తావు? బస్సుకా? టాక్సీ కా”

“మీకు తెలుసుగా.. నాకు రోడ్డు జర్నీ పడదని? అందరికీ రైలుకి బుక్ చేస్తాను”

“కడప కి రైలు లేదు” 

రేపుదయమే నాలుగు గంటలకి ప్రయాణం అనగా.. బ్లూ టూత్ పెట్టుకుని మాట్లాడుతూనే, మర్నాటికి అల్పాహారం, టిఫిన్ బాక్సులు, పిల్లలకి స్కూల్ డ్రెస్సులు, అన్నీ రెడీ చేస్తూ, ... తలుపు చప్పుడు. తీస్తే ఎదురింటావిడ...

“పరీక్షల సమయం లో మీకు అర్జెంట్ గా ఊరెళ్ళాల్సి వస్తుందిట కదా, రేపు మీ పిల్లల్ని జడలకి, స్కూల్ నుంచి వచ్చాక చదువుకీ మా ఇంటికి పంపండి..” అని. “అలాగే” అని కృతజ్ఞత తో నిండిన గొంతు తో చెప్పాను.

అంతలోనే మేరీ ఫోన్.. “మాడం. నాళకి నా ఖండిపావరే! నీ పో..” ఆహా.. కడప నుండి ఏదైనా గిఫ్ట్ తేవాలి మేరీకి.. సంతోషం వేసింది.

పెద్దమ్మాయి నాతోనే లేచేసింది. “పడుకోవే.. మళ్లీ పరీక్ష సమయానికి నిద్ర వస్తుంది..” అన్నా వినకుండా.. చుట్టూ తిరిగింది. ఉదయం నాలుగు కల్లా బిల బిల లాడుతూ వచ్చేశారు పిల్లలు (అందరూ పాతికేళ్ళ లోపు వారు.. అమ్మాయిలూ, అబ్బాయిలూ..) అందరికీ కాఫీలు కలిపి వాన్ ఎక్కేశాను.

ఆఫీసు పిక్ నిక్ లకి వీళ్లందరితో వెళ్లటం ఒక ఎత్తు, ఇలాగ పెళ్లికి వెళ్లటం ఇంకో రకం. మా ఆఫీసు పిక్నిక్ లల్లో అసలు గొడవ గొడవ గా వెళ్తారు. ఆ వయసు లో మేమెక్కడికైనా వెళ్తే పాటలు, అంత్యాక్షరి ల్లాంటివాటితో బస్సు టాప్ లేపేసేవాళ్ళం. ఏంటో వీరంతా కొద్దిగా గంభీరం గానే ఉన్నారనిపించింది. చాలా మెచ్యూర్ సంభాషణలు...

నెమ్మదిగా కదిలిస్తే అందరూ మంచి ‘నెర్డ్ ‘ లన్నట్టు అనిపించింది. ఇదేదో బానే ఉంది.. అందరినీ కదిలిద్దాం అని మొదలు పెట్టాను... ఒక్కొక్కరూ ఒక్కో రకం, కాకపోతే అందరూ వాళ్ల కాలేజ్ టాపర్లే. ఒకరిద్దరు రెండు మూడేళ్లనుండీ పనిచేస్తున్న వారైనా, సహజం గా ముభావం గా ఉండటమే వారికి అలవాటు లా ఉంది. ఇద్దరు IIT ల్లోంచి MTech అయితే, ఒకరు BHU, ఇంకోరు BITS Pilani. కడప చేరేలోగా.. కొద్ది కొద్దిగా అందరూ కాస్త ‘loosen up’ అయ్యారు.



అయినా డిసెంబర్ లో అంత ఎండేంటి? ఆ ఎండకి, ఆ ఘాట్ రోడ్డుకి, కాస్త తిప్పి, బయటకి వచ్చి, నానావస్థా పడుతూ కూడా ఇంద్ర, సింహాద్రి, సమరసింహా రెడ్డి ల దగ్గర నుండి, సీమ శాస్త్రి కథల దాకా స్థల పురాణాలు చెప్పుకుంటూ, వచ్చి పడ్డాం. దోవలో YSR విగ్రహాల దుకాణాలూ, అవీ చూస్తూ పెళ్లి పందిటి దగ్గరికి వచ్చేశాం. ఈలోగా మా పెళ్లి కొడుకు నుండి కాల్స్. ఎక్కడిదాకా వచ్చారు? అని.. వస్తున్నాం లెమ్మని, పందిట్లోకి వెళ్లే ముందు చూసుకున్నాం మా బట్టలు.. అందరూ నెర్డ్ లు, ఒక దారపు పోగులో కూడా ఏమాత్రం సంబంధం లేని బట్టల కాంబినేషన్ వేసుకుని ఆఫీసు బాగుల్లో కెమేరాలు పట్టుకుని ఉన్నారు అందరూ. సరే. మరి నేను? దోవలో వాంతవటం తో సువాసనలు చిమ్ముతూ, గుడ్డ బాగు లో ఒక చీర, పర్సూ పెట్టుకుని వచ్చేసాను కదా.. ‘ఆహా.. ఎమోచ్చామండీ.. పెళ్లివారం.. బెంగుళూరు నుండి!’ థళ థళ లాడుతున్న పందిరి లో యూని ఫారం లాగా బంగారు బెల్టులూ, మెడల నిండా, చేతుల నిండా, సరే, తల నిండా కూడా, రక రకాల గొలుసులూ, బిళ్ళలతో ఉన్నారు ఆడవాళ్లు. చీరల్లో ఫాబ్రిక్ తక్కువ, జరీ పోగెక్కువ. కానీ మగవాళ్లు మాత్రం హాయిగా తెల్ల లుంగీలు, చొక్కాలు మోచేతుల పైకి..

అందరిలో మరీ తేలి పోయినట్టయింది. నెమ్మదిగా నా ఏడువందలెట్టి కొనుక్కున్న చీర మార్చుకున్నాక, కనీసం సుగంధాలు తగ్గాయి. నలుగురిలో పడ్డాం. బాపురే.. ఆ వేదిక మీద పది కిలోల బంగారం అయినా ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో... ఉలవ చారు గురించి ఎన్ని కథల్లో విన్నాం? మొదటి సారి రుచి చూశాను.. పెళ్లి భోజనం చేసి మళ్లీ వెనక్కి తిరిగి వెడుతున్నంత సేపూ, ఈ కాలపు పిల్లలు, చదువే లోకం గా, పెద్ద కాలేజీల్లోంచి బయటకి వచ్చిన వీళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయో చూద్దామని కదిపాను.

ఒకబ్బాయి తెలుగు వాడే, పైకి కనపడడు కానీ, హమ్మో, ప్రతి తెలుగు సినిమా లో డైలాగులూ నాలిక చివర్నే! ప్రత్యేకం గా జీవిత ధ్యేయాల్లాంటివి చెప్పలేదు కాని, ఒకరెండేళ్ళ ఉద్యోగ పర్వం తర్వాత, మళ్లీ చదువులోకి దూకుతాడని అర్థమైంది. చిన్నప్పట్నించీ క్లాస్ పుస్తకాలు రుద్దాడేమో, బొద్దుగా ఉన్నాడు.. ఇప్పుడు మాత్రం జిమ్మూ, ఆటలు, తెలుగు, ఆంగ్ల పుస్తకాలన్నీ తెగ చదువుతున్నాడు, వచ్చిన ప్రతి సినిమా చూస్తున్నాడు.

ఇంకో అమ్మాయి పది నెలల ఉద్యోగం లోనే 38 లక్షల ఫ్లాట్ కొనేసిందిట. “ఎలా సాధ్యం? ఎలా తీరుస్తావు?” అంటే.. ఒక పది నిమిషాల పాటు లెక్కలు చూపించింది. రిస్కూ, మిటిగేషన్, .. “సమీకరణాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఇప్పుడు అప్పులకి పోగా.. ఎంత మిగులుతుంది? ఏం తింటున్నావు?” అని అడిగా. “మూడువేలు మిగులుతాయి. ఫ్లాట్ లో ఒక గది అద్దెకిచ్చాను. రాత్రికి ఇద్దరం వండుకుంటాం. ఉదయం ఆఫీస్ లో తింటాను. సినిమాలు లాప్ టాప్ లో చూస్తాను. జీతమే పెరగదా?” అంది. ‘అభీష్ట ప్రాప్తి రస్తు!’ అనుకున్నాను.

ఇంకో అబ్బాయి BHU లో BTech చేసిన వాడు.. కేవలం రెండు వందల రూపాయలతో బ్రిజ భూమి చుట్టి ఇరవై రోజులు గడిపి వచ్చాడట. “అదెలా సాధ్యమైంది?” అనడిగాను. “వాళ్లల్లో కలిసిపోయి నందగావ్, మథుర, బృందావనం, గోవర్ధన గిరి అన్నీ, ఒక్కో చోట చిన్న చిన్న పనులు చేస్తూ, ఊరి వారి తో కలిసిపోయి వాళ్ల ఇళ్లల్లో తింటూ, ఊళ్ల మధ్యలో కాలి నడకన,.. చాలా ఆసక్తి కరం గా అనిపించింది. ఈసారి ఆయన అనుభవాలు తెలుసుకుని తీరిగ్గా రాయాలి..

ఒక కన్నడ పిల్లాడు, మామూలు గా అందరితోనూ చాలా చక్కగా గౌరవం గా మాట్లాడటం చూశాను ఆఫీస్ లో. కాబ్ డ్రైవర్ తో కూడా అదే ధోరణి.. చిరునవ్వు చెదరనీయకుండా, అతనితో మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలుసుకుని మాకూ చెప్పాడు. డ్రైవర్ ఇంటర్ లో ఉండగా ఒక అమ్మాయి ప్రేమ లో పడి చదువు పాడు చేసుకున్నాడట. ఆ అమ్మాయి ప్రేమ నిరాకరించాక, దేవదాసు అయి ఇంకొంత కాలం చదువుకి దూరం గా ఉన్నాడట. అతని ఇద్దరు అన్నలూ సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులట. అయినా వారితో ఇప్పుడు కాబ్ నడుపుతూ సమానం గా సంపాదిస్తున్నాడట. ఇదే బాగున్నట్టుంది.. అనుకున్నాం.

ఇంకో అబ్బాయి, వారాంతం రెండు రోజులూ కాన్సర్ తో బాధ పడుతూ జీవితపు చరమాంకం లో ఉన్న వారితో గడుపు తాడట. ఇంకొకతను ఒరిస్సా లోని వాళ్ల ఊరిలో కంప్యూటర్లు అవీ పెట్టించి ఊళ్లల్లో యువత కి శిక్షణ ఇచ్చి కొన్ని మార్పులు ఎలా తెచ్చాడో వివరించాడు. నాకు వారితో కబుర్లతో భలే కాలక్షేపం అయింది. వాళ్ల భిన్నాభిరుచులూ, ఆసక్తులూ తెలుసుకున్నాక నాకు సంతోషం గా అనిపించింది.

ఈలోగా.. కనీసం డజన్ సార్లు పిల్లల ఫోన్లు. ‘అమ్మా! ఎప్పుడోస్తున్నావు? మాకేదైనా సర్ప్రైజ్ తెస్తున్నావా?’ అని గొడవ. కడప లో నాకేమీ గొప్పగా అనిపించలేదు.. దోవలో మాత్రం భలే వస్తువులు కొన్నాను. జిడ్డు కృష్ణమూర్తి గారి మదనపల్లె లో.. ఉదయం పూట నేను వంట చేస్తుంటే వంటిట్లో ప్లాస్టిక్ స్టూళ్ళ మీద కూర్చుని నిద్ర కళ్ళతో కబుర్లు చెప్పే మా పిల్లల కోసం.



అలాగే తోలు బొమ్మలతో చేసిన ఈ హాన్గింగ్స్..



మధ్యలో చిన్న డీవియేషన్ తీసుకుని హార్స్లీ హిల్స్ వైపుకి వెళ్లాం కానీ, అక్కడ ప్రయాణం పడక నాకు కడుపు తిప్పేసి దిగకుండా, కార్ లోనే నిద్రపోయాను. తిరిగి వెళ్లే సమయానికి, చీకటి పడుతున్నకొద్దీ అయ్యో పిల్లలు ఎలాగ ఉన్నారో అని బెంగ.. తల నొప్పి, అందర్నీ దింపుకుంటూ మా ఇంటికి చేరే సరికి ఎనిమిది.. పిల్లలు పరిగెత్తుకుని వచ్చి ‘అమ్మా..’ అంటున్నా..వినే ఓపిక లేదు.

మర్నాడు లేస్తూనే ఫ్రెష్ గా .. లాప్ టాప్ తెరిచాను. బాసు గారి నుంచి మెయిల్. ‘చేతన్ చేతులెత్తేశాడు.. మరి నువ్వే చూసుకోవాలి తప్పదు.’ ఆహా.. మరి నేను చూసినంత కాలం, చేతన్ సహాయం తీసుకో.. అని!

టీ తాగుతూ ‘ఆఫీసు పని చూసుకుంటూ, వీళ్లని చదివించటం..అమ్మో! మాటలు కాదు’ అంటున్న మా వారితో ‘పొగిడేయటం ఈజీ. నిలబడి చేయగలగటం గొప్ప! రెండు సబ్జెక్టుల బాధ్యత మీరూ తీసుకోండి.’ అన్నాను. ఇంతలో పిల్లలూ లేచి వారంతట వారే పని చేయటం మొదలు పెట్టారు. ‘అబ్బో.. ఏంటీ విప్లవం?’ అని అడిగితే.. ‘నిన్న we almost missed the school bus!’ అంది మా చిన్నమ్మాయి. మా పెద్దది..’అమ్మా.. ఆంటీ చాలా ఎక్కువ చదివిస్తుంది. కదలనీయదు’..

‘ఆహా.. మరి నేను ఉదయం త్వరగా లే.. పరిగెట్టు.. అన్నప్పుడు.. నన్ను రూడూ.. అదీ అన్నారు? చదువు తో చంపుతున్నాను అన్నారు?’

నెమ్మది గా ఆఫీసు కెళ్ళాను.. కారిడార్లలో.. కొత్తగా ఒక అరడజన్ మంది నుంచి కొత్తగా ఒక చిరునవ్వు...

హ్మ్.. అప్పుడప్పుడూ ఇలాగ ‘ఎస్కేప్’ అవుతుంటే.. ఇన్ని లాభాలుంటాయా? ఇంకా ఎవరిదైనా పెళ్లి ఉందేమో చూడాలి.. ఎవరిదీ లేకపోతే.. రాజు వాళ్ల పదహారు రోజుల పండగ ఏ ఊర్లో చేస్తారో కనుక్కోవాలి..’ ఉత్సాహం గా క్యూబ్ వైపుకి నడిచాను.

Saturday, November 26, 2011 17 comments

సంధ్య,రమేశ్ మరియు ద్రౌపది..


‘ఇదిగో,ముందే చెప్తున్నాను.. ఆ పుస్తకం ఇంటికి తీసుకొస్తే ఒప్పుకోను..’ రమేశ్ నెమ్మది గా చెప్తున్నా, దృఢంగా చెప్తున్నాడు. అంతమంది ముందు చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్పాడని చిన్నబుచ్చుకుంది సంధ్య. ముఖం ఎర్రగా .. ‘అయ్యో, మధ్యలో నేనిరుక్కున్నానే..’ అని నేను నొచ్చుకున్నాను..

రమేష్, సంధ్య మాకు బాగా తెలిసిన వాళ్లు.. పెద్దగా దాపరికాలు పెట్టుకోరు.. అంతా డైరెక్ట్ గానే మాట్లాడటం, తాము నమ్మింది, బల్ల గుద్ది మరీ చెప్తారు. నమ్మనిది ఖండించటమే కాదు, ఖండఖండాలు గా చీల్చి చెండాడుతారు. ‘ఒప్పుకున్నాం.. మమ్మల్నోదిలేయండి!!’ అని దణ్ణం పెట్టేంత దాకా వదలరు. అలాగే, తమ వాదన లో తప్పుందని అనిపిస్తే సంవత్సరం ముందు సంగతైనా సరే, ‘అప్పుడు అలాగ అనుకోవటం తప్పని అర్థమైంది.’ అని ఫోన్ చేసి మరీ చెప్తారు.

కొత్త ఇల్లొకటి చూశారు. బోల్డు ఖరీదు. నెలనెలా కట్టాల్సిన వడ్డీ తర్వాత అంత పేద్ద ఇంట్లో గంజి తాగాలి .. మనం.. మన తాహతు లో మనం తీసుకుందాం, మనం ఎగరలేని ఎత్తుకి ఎయిమ్ చేస్తే, దబ్బున కూలబడతాం..’ అని సంధ్య అంటుంటే..

‘అబ్బే జీవితం లో రిస్క్ తీసుకోందే,..పైకి రాలేం!’ అని రమేశ్ అంటున్నాడు.. మేమూ, కర్ర విరగకుండా, పాము చావకుండా, మాకు తోచిన సలహాలు, గోడ మీద పిల్లుల్లా ఇస్తున్నాము.


యార్లగడ్డ రచించిన వివాదాత్మకమైన కథ ద్రౌపది పుస్తకం రైల్వే స్టేషన్ లో కొనుక్కుని రైల్లో చదివేసి హాల్లో టీపాయ్ మీద పడేసినట్టున్నాను.
సంధ్య చూసి ‘అరే ఈ పుస్తకం గురించి టీవీ లో ఏదో చూశాను. చాలా చెత్తగా రాశాడటగా? ‘ .. అంది.
‘చెత్త.. అంటే ఆయన అభిప్రాయం ఆయన రాసుకున్నాడు. నాకు అదొక మహత్తరమైన పుస్తకం అనిపించలేదు. కొన్ని సరిగ్గా రాయలేదు. అనిపించింది.. కొద్ది పార్ట్ అస్సలూ నచ్చలేదు.. ‘ ఇలా ఏదో చెప్తూఉండగా..
‘ఆగు ఆగు. చెప్పేయకు... నువ్వు చదివేసానంటున్నావు.. నేనూ చదివి ఇస్తా,, తీసుకెళ్లనా?’ అడిగింది సంధ్య.
దానికి వచ్చిన గొడవ ఇది. ఈ ఖరీదైన ఇల్లు కొనాలా,వేరేది వెతకాలా అన్న మీమాంస మీద వేడి చర్చ లో వాడిగా వాగ్బాణాలు విసురుకుని కచ్చ గా ఉన్నారేమో..


‘ఇదిగో,ముందే చెప్తున్నాను.. ఆ పుస్తకం ఇంటికి తీసుకొస్తే ఒప్పుకోను..’ రమేశ్ అనేశాడు.
‘ఏం? ఎందుకు ఒప్పుకోరు? నాకిష్టం అయిన పుస్తకం నేను చదివితే మీకేంటి ప్రాబ్లం? !’ పౌరుషం గా అంది సంధ్య.
‘ఆ పుస్తకం అంతా చెత్త అని మా ఆఫీస్ లో విన్నాను. టీవీ లో కూడా చెప్తున్నాడు..’
‘అయితే? నేనేమైనా చిన్న పిల్లనా ? నాకు మంచీ చెడ్డా తెలియవా?’
... అందరి ముందూ, తనని వద్దన్నాడని సంధ్యా, అందరి ముందూ, తను ‘ఆ పుస్తకం చెత్తని ‘ తెలుసుకున్న విషయాన్ని, గౌరవించకుండా ‘ నా ఇష్టం.. నేనే చదివి తెలుసుకుంటాను’ అందని రమేశ్ బిగుసుకుపోయారు.
‘ఈ పుస్తకం మా కాలనీ ఆవిడ అడిగింది, ఇవ్వలేను ‘ అని తప్పించుకున్నాను. కానీ ద్రౌపది మీద చర్చ మాత్రం కాసేపు అలా నడిచింది.
ఐదుగురు భర్తలని చేసుకున్న ద్రౌపది ఇంకా కర్ణుడిని కావాలనుకుందని, ఆవిడకి అసలు పురాణాల్లో ఒక స్థానం లేదని, బ్లా హ్... తనకున్న నాలెడ్జ్ తో హోరా హోరీ గా మిగిలిన అందరితో కాస్త చర్చ జరిపి రమేశ్,కాసేపటికి చల్లారి, మళ్లీ ఇంటి టాపిక్ కి వచ్చి, .. అలాగ ఒక సాయంత్రం గడిచి పోయింది. ఇద్దరూ వెళ్లిపోయారు. వెళ్లాక వాళ్లింట్లో దీపావళి అయ్యుంటుందని అనుకున్నాం.


ఇది జరిగిన ఒక వారం తర్వాత, అనుకున్న ఇల్లు కొనేస్తున్నామని, ఫోన్ వచ్చింది. సంధ్యతో ‘నొ రిస్క్, నొ గెయిన్’ అని వాదించినా కాస్త భయం గానే ఉందని ఉద్యోగాల మార్కెట్ లో తేడా వస్తే, చిప్ప చేతిలో పట్టుకోవాలేమో.. అని కాసేపు మదన పడ్డాడు. అయిపోయిన డెసిషన్ కదా.. ‘పర్వాలేదు.అంత పేద్ద మొత్తం తో ఇల్లు కొంటున్నావు. ఈ మాత్రం భయం సహజమేనని, జీవితమే ఒక జూదం.. ఆడక తప్పని ఆట అనీ.. మాకు తెలిసిన పాత సినిమా డైలాగులు గుర్తు చేసుకుని చెప్పేశాం...

అనుకున్నట్టు గా ఇల్లు రిజిస్ట్రేషన్ కానిచ్చి, ఇల్లు చూపించటానికి మమ్మల్ని కార్లో తీసుకెళ్లాడు రమేశ్. అందరం ఉత్సాహం గా వెళ్తున్నాం.
‘ఇంతకీ ఈ ఇంటి రిజిస్ట్రేషన్ అప్పుడు చిన్న గమ్మత్తు జరిగింది.. మీకు చెప్పాలి’ అన్నాడు రమేశ్.
సంధ్య మొహం కళ కళ లాడి పోయింది.? మాకూ భలే ఉత్సుకత గా అనిపించింది.
‘కోటిన్నర ఇల్లు... తొంభై లక్షల అప్పు.. ఇద్దరం చాలా టెన్షన్ గా వెళ్లాం. చేస్తున్న పని కరెక్టే అని ఒకరికి ఒకరం చెప్పుకుంటూ.. ‘

రిజిస్ట్రేషన్ లేట్ అయింది.. రెండయిపోతోంది. అబ్బాయి స్కూల్ నుండి వచ్చే సమయం అవుతోంది.. సంతకాలు అవుతూనే.. సంధ్య బయల్దేరింది. నేను చిన్నా చితకా పనులు చేసుకుని వెళ్దామని, ఆటో ఎక్కిద్దామని వెళ్లాను..

‘సంధ్యేమో.. మనం పొదుపు చేయాలి.. అని బస్సెక్కి వెళ్తానంది.’

మేము వాళ్లు చెప్పాలనుకున్న గమ్మత్తు అదేనేమోననుకుని, పక పకా నవ్వేసాం.
‘express/ volvo బస్సులెక్కి డబ్బు తగలేసావా? లేక మామూలు బండి ఎక్కావా? అసలే తొంభై లక్షల అప్పు!’ వేళాకోళం చేశాను నేను.
‘లేదు లే వచ్చిన మొదటి బస్సెక్కా’ అనేసింది సంధ్య.
‘అయినా అసలు చెప్పాలనుకున్న గమ్మత్తు అదికాదు.. ‘ అని కథ కొనసాగించింది తను.

‘బ్యాంక్ అతను పనులన్నీ అయితే sale deed తీసుకెళ్లటానికి ఎదురు చూస్తున్నాడు. మళ్లీ ఏ ముప్ఫై ఏళ్లకి చూస్తామో అని, రమేశ్ దేవుడికి ఒకసారి చూపించి వెళ్దామని ..’
ఇంకా చెప్తున్న సంధ్య ని ఆపి రమేశ్ ..
‘నేను చెప్తాలే.. మరీ అంతా ఉత్సాహ పడిపోకు..’ అని ఉడుక్కుని, కంటిన్యూ చేశాడు..

‘రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గుడి భోజన సమయం కదా, మూసేసారు. పక్కన ఇంకో గుడి కనిపిస్తోంది. అక్కడికి ఓకే ఒక్క నిమిషం.. చూపించి ఇచ్చేస్తాను.. ప్లీజ్’ అన్నాను ‘
‘బాంక్ అతను అసహనం గా.. వాచ్ చూసుకుంటూ.. సరేనని అనగానే, నేను ఆ గుడి వైపుకి పరిగెత్తాను. పూజారి గారు అప్పటికే గుడి మూయటానికి బయటకి వచ్చేశారు’

‘నేను వెళ్లి ఓకే నిమిషం లో వస్తానని బ్రతిమలాడుకుని, లోపలికి చెంగున పరిగెత్తి దేవుడి ముందు కుంకుమ పాకెట్ కి పెట్టి కళ్ళు మూసుకుని ‘నాయనా.. తండ్రీ.. నా జీవితం లో అతి పెద్ద రిస్క్, తీసుకుని కట్టుకుంటున్న ఇల్లు.. అన్నీ సవ్యం గా జరిగేట్టు అనుగ్రహించు..’ అని భక్తి గా దణ్ణం పెట్టుకున్నానో లేదో.. ‘శీఘ్రం.. ‘ అని అరుస్తున్నాడు అయ్యగారు.
‘’ఊ..’

‘నేను అదే పరుగు తో బయటకి వచ్చి బాంక్ అతనికి కాగితాలందించి.. అమ్మయ్య అని వెనక్కి తిరిగి చూశాను.. పంతులు గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు..
‘ధన్యవాదాలు! అని చెప్పి.. ఇంతకీ, లోపల దేవుడు ఎవరు స్వామీ ఉంది? అర్థం కాలేదు. అడుగుదామా అంటే.. సమయం లేకపాయే.. ఎవరైతే ఏంటి అని దణ్ణం పెట్టి వచ్చా.. అన్నాను.. అప్పుడు ఆయన నవ్వి.. ‘
అని ఎఫెక్ట్ కోసం ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగి ఉండటం తో అందరి వంకా, నాటక ఫక్కీ లో చూశాడు రమేశ్..

మేము.. ‘చెప్పండి. మళ్లీ మాకు క్విజ్జా?’ అని అడిగాము.
సంధ్య తన ఉత్సాహాన్ని ఆపలేక మెరుస్తున్న కళ్ళతో బ్రేక్ చేసింది..


‘అది ద్రౌపదీ సహిత ధర్మ రాజు గుడి’

PS :

ద్రౌపది గుడుల గురించి చదవాలంటే....

http://www.indianetzone.com/49/draupadi_temples_south_india.htm

Tuesday, November 22, 2011 22 comments

ఆర్ముగం తో చాయ్ – ౩

అమాయకత్వమో, అతి తెలివో, రెండింటి మిశ్రమమో, ఆర్ముగం చేసే పనులు, ఆలోచనలూ గమ్మత్తు గా ఉంటాయి.


ఒక రోజు చాయ్ సమయం, మామూలు గానే మా చాయ్ గాంగ్ అందరం చేరాం, పెట్రోల్ ధర మళ్లీ పెరిగిందని, మేధావుల్లా ఫీల్ అయి కాస్త ఇరాక్, కువైట్, అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇలా మాకున్న మిడి మిడి జ్ఞానాన్ని అందరం ఒకరి మీద ఒకరు రుద్దుకుంటున్నాం. ఆ పూట పేపర్ ఆఖరి నిమిషం లో చూసుకుని వచ్చి బజ్ వర్డ్స్, వాడి హమ్మయ్య మాకూ కాస్త జనరల్ నాలెడ్జ్ ఉందనిపించి పరువు దక్కించుకుంటున్నాము. అందరం ఇలాగ మా గొడవ లో మేము అరుచుకుంటుంటే ఆర్ముగం మాత్రం ఏదో ఆలోచనలో ఉన్నాడు..

‘ఏంటి కథ? ఏమాలోచిస్తున్నావు?’ అని అడిగారెవరో..

“మనం ఊర్కే వేరే దేశాల వారి మీద పెట్రోల్ కోసం ఆధారపడుతున్నాం, అందువల్ల మనకి బోల్డు ధర, దానికి వేరే ప్రత్యామ్నాయం లేదా? అని ఆలోచిస్తున్నా.. “

“ఏమన్నా దొరికిందా మరి?” అని వ్యంగ్యం గా అడిగారొకరు.

AK మాత్రం చాలా గంభీరం గా ఒక వైట్ బోర్డ్ దగ్గర కెళ్లి కింది బొమ్మ వేసి, గుజరాత్ దగ్గర సముద్రం లోంచి భూగర్భం లో ఒక సొరంగం తవ్వి గల్ఫ్ దేశాల క్రింద ప్రాంతం నుంచి ముడి చమురు తెచ్చుకోవచ్చు కదా అని ..”

“వ్వాట్!!”

“దీని వల్ల, మనం చమురుకి మన దేశం ఎవ్వరికీ చెల్లించక్కరలేదు, శక్తివంతమైన మోటార్ తో లాగేయవచ్చు. ఇక భారత దేశం లో పెట్రోల్ రూపాయికి నాలుగు లీటర్లు అమ్మవచ్చు.. ”

‘హాఆఆఆఆ!”

"కానీ .. ఇంకో ప్రాబ్లం ఉంది.. "

"అబ్బా ఏంటో అది!"

"అటు వాళ్లూ, ఇటు మనం, తవ్వేస్తే.. భూమి లోంచి ఒక ముక్క.. పడిపోతుందా? I am confused.. చూడాలి!"

• * * * * * * *

ఇంకో చాయ్ సెషన్ లో ఆర్ముగం మంచి ఐడియా తో వచ్చాడు..


అప్పట్లో రాజ్ కుమార్ ని అపహరించి, గంధం దొంగ వీరప్పన్ సంచలనం సృష్టిస్తున్నాడు..  జయప్రద అడవుల్లోకి వెళ్లింది ..
ఈ జయప్రద వాళ్లతో అయ్యేది కాదు, రాజకీయ నాయకులూ, పోలీసుల అండదండలతో ఉన్న వీరప్పన్ ని పట్టుకోవాలంటే..ఒక్కటే మార్గం..
ఆయన ఆఖరి గంధం చెట్టు కొట్టినప్పుడు, సినిమాల్లో లాగా పోలీసుకు.. 'You are under arrest" అని తీసుకు వెళ్ళచ్చు గా.. అంతవరకూ, ఆ గంధం చెక్క విలువ కన్నా, కన్నా, వాడిని పట్టుకోవటానికి, మన ప్రభుత్వం పెట్టె ఖర్చు,పోయిన పోలీసుల ప్రాణాల వాల్యూ ఎక్కువ. వేస్ట్.
*************************************************************************
ఇంకోసారి చాయ్ కి వచ్చి చేరినప్పుడు.. గంభీరం గా కనిపించాడు..

“ఏంటి సర్? కాస్త గంభీరం గా ఉన్నారు? ఏంటి కథ?”

“ఇది చాలా సీరియస్ విషయం..”

“ఏంటది?”

“మా అక్కకి వయసు దాటిపోతోంది. పెళ్లి ఆపాం మేము.. ఇప్పుడే మా అమ్మా వాళ్లకి చెప్పాను. ప్రయత్నం చేయద్దని..”

“ఆపటం ఎందుకూ? “

“తన జాతకం లో ఇరవై ఎనిమిదవ ఏట కానీ పెళ్లి రాసి లేదు..”

“అయితే? ప్రయత్నం చేయరా?”

“అంటే ప్రయత్నం చేయవచ్చు.. కానీ అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటే జనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఏమైనా లోపం ఉందేమో అనుకుంటారు కదా!”

“మరి పెళ్లి మాటే ఎత్తటం లేదు.. అనుకోరా?”

“అది వేరు..”

ఈ విషయం మీద హోరా హోరీ గా చర్చ జరిగాక, అందరం ఎవరి క్యూబ్స్ కి వాళ్లు వచ్చి పడ్డాక,..

ఆర్ముగం చెప్పాడు. “ఇంతకీ.. నీకో ఆంటీ క్లైమాక్స్ చెప్పనా? “

“అనుకున్నా.. నీ కథలకి, ఆంటీ క్లైమాక్స్ ఉంటుందని తెలుసు లే ..”


“మా అక్క పుట్టినప్పుడు మా ఇంట్లో గడియారం అనేదే లేదు. మా నాన్న బయట నుంచుని, చంటి పాపాయి ఏడుపు వింటుండగానే, మా ఊరు లోంచి వెళ్లే ఏకైక ఎక్స్ ప్రెస్ బండి అదే సమయానికి వెళ్లింది. తర్వాత జాతకం రాయించేటప్పుడు ఆ రైలు మా ఊరు చేరే సమయం తెలుసుకుని పంతులు గారితో రాయించాం..”

‘ఆఆ!”

• * * * * * * *


ఇంకోరోజు మరో చాయ్ మీటింగ్ లో ఇప్పుడే వస్తాన్నన్న వాడు, మేమింక టీ బ్రేక్ అయిందనిపించి మళ్లీ క్యూబులకి బయల్దేరుతున్నాం,.. ముఖం వేలాడేసుకుని వచ్చాడు ఆర్ముగం.

‘ఏంటీ.. కథ? “

“అబ్బే ఏం లేదు లే”

“పర్వాలేదు చెప్పు ఏదో ఉంటుంది..”

“మళ్లీ నవ్వుతారు!”

“మేమేం నవ్వం... చెప్పేయ్”

“మొన్న మరి HR వాళ్లు నామినేషన్ ఇవ్వమన్నారు కదా.. 401K, Accidental, death benefits etc..”

“అవును.. ఏం? అనుకున్న వాళ్లకి కాకుండా వేరే వాళ్లకి చెందాలని రాశావా? మార్చేసుకోవచ్చు గా ఇంకా టైం ఉంది?”

“అది కాదు...”

“చెప్పు బాబూ.. ఏం చేశావు ఈసారి?”

“ఏం లేదు.. 25% మా అమ్మ, నాన్నలకి, 25% మా ఆవిడకీ, 25% మా ఊర్లో తెలివైన బీదవారిని చదివించేందుకు ఫండ్ కోసం ఇచ్చాను. ఇంకో 25% ఎవరికీ నామినేట్ చేయాలా అని ఆలోచించి...”

‘ఊ.. ఆలోచించి?”

“ఈలోగా, ఈ సాఫ్ట్ వేర్ రాసిన వారు, సరిగ్గా రాశారా? లేక బగ్స్ ఏమైనా ఉన్నాయా? చూద్దాం అని..”

“ఆ.. చూద్దాం అని?”


“మిగిలిన 25% నాకే రాసుకుంటే ఈ సాఫ్ట్వేర్ ఎర్రర్ ఇస్తుందా? లేదా? అని చెక్ చేశాను..”

“ఏంటీ? నీవు పోయాక వచ్చే బెనిఫిట్స్ నీకే చెందేలా సిస్టం లా ఎంటర్ చేశావా? అప్పుడు? “ అందరికీ నవ్వొచ్చేస్తోంది..

“అందుకే.. చెప్పన్నన్నాను...”

“అబ్బా.. నవ్వం లే కంటిన్యూ..”

“సిస్టం నాకు ఇచ్చేసింది. నేనేమో.. సరే నా నుంచి తీసేసి మా అమ్మా వాళ్లకో, మా ఆవిడ కో వేద్దాం అని నా నామినేషన్ మార్చాలని ప్రయత్నించా.. కానీ.. ఈ పార్ట్ రాసిన వాడు కాస్త గట్టి వాడనుకుంటా.. ‘You can not transfer nomination from dead person : ) ‘ అని ఎర్రర్ మెసేజ్ వస్తోంది...”

ఇక అందరం ఘోల్లుమని నవ్వేసాం. “బాబూ.. మరి ఇప్పుడేమి చేద్దామని?”

“ఏముంది? ఫోన్ చేసి వాళ్లకి ఇదంతా చెప్పి, మార్చమని చెప్పి వచ్చా”

ఇంకా నవ్వుతూనే ఉన్నాం,.. మా AK కూడా సరదా గా,.

ఒకవేళ కనక ఆ సొమ్ము ట్రాన్సఫర్ కాదు, కుదరదు అంటే.. “ఏం చేస్తాం? 237 హై వే మీద అతి పెద్ద అంతిమ యాత్ర చేయండి నాకు, పూలు, బొంగు పేలాల తో పాటు చిల్లర పైసలకి బదులు, ముత్యాలో, డాలర్ నాణాలో జల్లండి.. డప్పు శివమణి తో కొట్టించండి.. డాన్సు కి కుదిరితే మైకేల్ జాక్సన్, అథమ పక్షం షారుఖో, అక్షయో..” అని నాటకీయం గా అని మమ్మల్ని నవ్విన కొద్దీ ఇంకా ఇంకా ‘ఇక చాల్లే’ అనేంత వరకూ నవ్వించాడు..

• * * * * * * *

ఇంకోసారి చాయ్ లో, అందరం కూర్చున్నాం. ఆర్ముగం ఇంకా రాలేదు. .. మా బాస్ అటువైపు వచ్చి ఇవ్వాళ్ల AK రాడు లెండి.. అన్నాడు.

“ఓహ్. ఏం?” అని అడిగితే ఆయన చెప్పిన వృత్తాతం...



బాసు గారి దగ్గరకి ఆర్ముగం, మోహన్ వెళ్లారట. దేనికో ఎస్టిమేట్ ఇవ్వటానికి..

“అసలీ కోడ్ ఎవరు రాశారో.. పరమ చెత్త గా రాశారు.. ఇది కరెక్ట్ చేసుకునే బదులు, కొత్తగా రాసుకోవటం బెటర్..” అని AK అనేశాడట..

ఒక్కసారి గా బిత్తర పోయారట, మా బాసు గారూ, మొహనూ. అదంతా మరి పూర్వాశ్రమం లో బాసు గారే రాశాడు.

ఆపుతాడేమో, అని చూస్తే ఆగలేదట... ప్రతి తప్పునీ, చూపించి, ప్రూవ్ చేసుకోవటం.. తప్పులుండచ్చు గాక, మరీ మొహం మీద చెప్పేటప్పుడు కాస్త మృదువు గా,.. అబ్బే లేదు.. ఫటా ఫట్ చెప్తూ, ఆవేశం గా అలాంటి ‘చెత్త’ కోడ్ వల్లపడే ఇబ్బందులు ఏకరువు పెడుతుంటే ..

ఎలా ఆపాలో తెలియక, మోహన్ కాలుతో అతని కుర్చీ కదిపి, సైగలు చేయటం మొదలు పెట్టాడట.. ‘ఏంటి? మోహన్? “ అని గట్టి గా అడిగేసరికి అతనికీ ఇంకేమనాలో తెలియక ఊరుకుండిపోయాడట...

తర్వాత మోహన్ చెప్పుంటాడు., “నా కోడ్ ని అన్నేసి మాటలన్నాడు కదా.. అందుకని నేనున్న పరిసరాల్లోకి కొంతకాలం ఇక రాడు..” అని ఆయనా నవ్వేశాడు.

“అది సరే.. మొన్న నన్నేమన్నాడో తెలుసా? “ ఇంకా కంటిన్యూ చేస్తూ..

ఆసక్తి గా అందరం చూస్తూ ఉన్నాం..

“ఈ నెలంతా శనివారాలు కష్టమర్ కి డ్యూటీ మీద ఉంటాను.. కానీ, వచ్చే నెల నాలుగు రోజులకి సెలవ కావాలి అన్నాడు..”

నేనూ సరే అన్నాను. అలా కాదు, రాసిమ్మన్నాడు. ఎందుకు? నీకు నమ్మకం లేదా? అని అడిగాను..”

“మీ మీద నమ్మకం ఉంది. రేప్పొద్దున్న మిమ్మల్ని ట్రాన్సఫర్ చేస్తే? అలాగే, మీకేదైనా అనారోగ్యమో, ఆక్సిడెంటో జరిగితే? అన్నాడు”

ఎవ్వరమూ, గట్టిగా నవ్వలేదు.. కానీ AK నెమ్మదిగా ఇలాంటి మాటలు మాట్లాడటం తగ్గించాడు.. కొద్ది, కొద్దిగా సాఫిస్తికేటేడ్ అయ్యాడు.. అయినా ఒక్కోసారి అప్రమత్తం గా ఉండనప్పుడు పాతకాలపు ఆర్ముగం బయట కి తొంగి చూస్తూనే ఉంటాడు..



చాలా సార్లు ఇతరుల లంచ్ బాక్సుల్లోంచి తిని, ‘బాగుంది బాగుంది’ అన్నా... ఒక్కోసారి ‘అబ్బా! ఈ సొరకాయ కూర డంబ్ గా ఉంది. నేను తినలేను..’ అని, మళ్లీ “Actually... blah blah” అని ఏదో చెప్తూ, సరిదిద్దుకుంటూ...

అదీ మా ఆర్ముగం రెండో ముఖం.. ఇలాగ తన గురించి బ్లాగు లో రాయనిచ్చినందుకు ధన్యవాదాలతో.. ఆర్ముగం ఇంకో కోణం తో మళ్లీ వస్తా..



Saturday, November 19, 2011 20 comments

బంగారు మనిషి


శుక్రవారం రాత్రి నాకు పదిన్నర కి ఈ టీ వీ లో సెకండ్ షో చూడటం మహా సరదా! మర్నాడు సెలవ, కాస్త ఆలస్యం గా లేవచ్చు, (సోమ- శుక్ర) వారం రోజుల్లో అస్సలూ టీవీ చూడను.

ఈ మధ్య పనెక్కువై కాస్త ఆ అలవాటు అటకెక్కింది. చాన్నాళ్లకి నిన్న రాత్రి మళ్లీ అవకాశం దొరికింది. సరే అని కూర్చున్నా. కొద్దిగా తొందర గా వచ్చినట్టున్నాను. వావ్! అంటూ సాయి కుమార్ కిక్కెక్కిస్తున్నాడు.. (వావ్, మంచి కిక్కెక్కించే షో.. ) సరే కాసేపాగి వద్దామని వచ్చి చూసేసరికి సినిమా టైటిల్స్ వచ్చేస్తున్నాయ్. పేరు తెలియ లేదు. తర్వాత నెమ్మదిగా గూగుల్ సర్చ్ ద్వారా అర్థమైంది.. 'బంగారు మనిషి' (1976)



మొదటి సీన్ లో పేద్ద బంగళా లో, లక్ష్మి తండ్రి తన చిన్న నాటి స్నేహితుడికి వ్యాపారం లో నష్టం వచ్చిందని తెలిసి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చి ఆ పైన అప్పు పత్రాల మీద సంతకం కూడా పెట్టాడు. అంతే! సగం సినిమా అర్థమైంది. మిత్రుడు చేయబోయే మోసం, వీళ్లకి పోబోనున్న ప్రాభవం, లక్ష్మి చెంగావి రంగు చీర, జాకెట్ తో, ‘కాలేజీకి వెళ్ళొస్తానని చెప్పి కార్ ఎక్కి ఒక నిర్జనమైన రోడ్డు మీద పోతోంది. అంతలో ఎన్ టీ ఆర్ స్క్రీన్ నిండా, తెల్ల చొక్కా, చెంగావి రంగు బెల్ బాటం పాంటూ వేసి. ఆయన ముఖం మీద పడేలా విగ్గు పెట్టుకుంటే, పక్కన లక్ష్మి నెత్తి మీద పేద్ద విగ్గు అటూ, ఇటూ వేలాడేలా ! ఇద్దరూ ఒకే కాలేజ్, బాగుంది. ఈయన లెక్చరర్, అమ్మాయి విద్యార్థిని అనుకున్నాను. తీరా చూస్తే ఇద్దరూ ఓకే క్లాస్, నిజమే నాదే తప్పు. ఓకే ఒక్క పుస్తకం చేతిలో పట్టుకుని నడుస్తున్నాడు అనగానే అర్థమయి ఉండాల్సింది. ‘ కారెక్కమంటూ’ లక్ష్మి, ‘వద్దు, ఆడపిల్లకి చెడ్డపేరు తేలేను’ అంటూ వేణు (అదే మన ఎన్ టీ ఆర్ గారు) వాదించు కుని, చివరకి లక్ష్మి ని కరుణించి కారెక్కాడు. కానీ వేణు చెప్పిందే నిజం. లోకులు కాకులు, వీళ్ల మీద పిచ్చి కూతలు కూశారు, గోడల మీద బొమ్మలు గా వేశారు. వేణు హర్ట్! లక్ష్మి వారికి తగిన విధం గా బుద్ధి చెప్పి, కాలేజీ తోట లోకి వేణుని వెతుక్కుంటూ వచ్చి, ‘మేలుకోవయ్యా వేణు గోపాలా! ‘ అని పాడుతోంది.


ఈ పాట మాత్రం ఎందుకో చూడబుద్ధి కాక, పక్క చానెల్ లో నాగార్జున, నయనతార పాట ఏదో వస్తుంటే అది చూశాను.అదవ్వగానే ఇంకో పాట ఏదో చూస్తూ ఉండి పోయా. కాసేపయ్యాక మళ్లీ ఇటు వచ్చి చూస్తే, ‘బంట్రోతు గుమ్మడి’ కలెక్టర్ కుర్చీ కి మొక్కుకున్నాడు. కలెక్టర్ ముక్కామల(?), మంచి డాబు గా హుక్కా పీలుస్తూ ‘ఏంటి రంగా? నాకన్నా ముందు ఆ కుర్చీ కి దణ్ణం పెడుతున్నావే?’ అన్నాడు. ‘ఆహా! గుహుడి లా మొహం పెట్టి గుమ్మడి చెప్పే డైలాగులు వినే అవకాశాన్ని వదులుకోకూడదని కాస్త ముందుకి వంగాను.



‘బాబు గారూ! ఈ కుర్చీ లో కలెక్టర్లు ఎందరో వచ్చారు, వెళ్లారు! కొందరు ఆ కుర్చీ లో కూర్చుని ప్రజల మీద కరుణ కురిపించితే, మరి కొందరు కన్నెర్ర చేసి దుష్ట శక్తులని అణిచినా, అది ఆ కుర్చీ ఇచ్చిన అధికారమే బాబూ. ఆ కుర్చీ ఇచ్చిన అధికారమే! నిజమైన దేవుడిని నేనెప్పుడూ చూడలేదు. అలాంటి అధికారాన్నిచ్చే ఈ కుర్చీ యే నాకు దేవాలయం, దానిని అధిష్టించే కలెక్టరే నాకు దేవుడు. అని అరమోడ్పు కన్నులతో, దణ్ణం పెట్టి బయటకి వెళ్లాడు. అది చూసి, కలెకటారు బాబు ‘అందరూ రంగడిలా ఉంటే ఎంత బాగుంటుంది?’ అనుకున్నారు. ఈ సీన్ లో మీకు గుమ్మడి హావభావాలెలా ఉంటాయో చెప్పవలసి వస్తుంది అంటే, మీరు తెలుగు వారు కారని అర్థం, లేదా మీలో తెలుగుదనం పాళ్లు కాస్త తక్కువ అయి ఉండవచ్చు.

ఇంతలో రేషన్ షాప్ లోనూ, నకిలీ సారాయి దుకాణాల్లో , ప్రభాకర్ రెడ్డి జరిపించే అక్రమాలూ, ప్రభాకర్ రెడ్డి కొడుకు రంగనాథ్, ఇంటికి వేణుని కాఫీకి తెస్తే, బంట్రోతు కొడుకు ని తెస్తావా అని అవమానం, ..

‘ఆ.. ఆ.. ఆ.. ‘ ఆవులింతలొస్తున్నాయి..

నాకు ఈ పాటికి మాంచి ఆకలేస్తోంది. కలెక్టర్ ఆఫీస్ లో ఉన్న నానా రకాల ఉద్యోగుల మధ్య కామెడీ సీన్ నడుస్తోంది. అల్లు రామలింగయ్య ఆడ క్లర్కులని ఆట పట్టిస్తున్నాడు. సరే నేను తీరిగ్గా వంటింట్లో ఒక కప్పు ఆకుపచ్చ చాయ్ చేసుకుని, ఒక ఫుల్కా మీద జామ్ రాసుకుని వచ్చి కూర్చున్నా.. సీన్ మారింది. వేణు నిలువు చారల చొక్కా, చెక్స్ పాంట్ వేసుకుని, కిటికీ బయట నుంచుని తల్లి దండ్రుల మాటలు వింటున్నాడు.

గుమ్మడి : ‘మన బాబు చదువు అర్థంతరం గా ఆగిపోకూడదు, మంచి చదువు చదివి సమాజానికి ఉపయోగపడేలా ఒక స్థాయికి మన బాబు ఎదగాలి! బాబుని ఎంత కష్టమైనా చదివిస్తాను. చివరకి నా ప్రాణాలు పోయినా సరే. ఈ విషయం లో వెనక్కి తగ్గేది లేదు’ (పది సార్లు బాబు అంటూ, మనకి రిపీటెడ్ గా వేణు చిన్న వాడు, కాలేజ్ లో చదువుకునే యూత్ అని గుర్తు చేయటమన్నమాట!)



పండరీ బాయి కన్నీరు కారుస్తూ, : ‘హంత మాటనకండి! రాలిపోయే ఆకుల్లాంటి వాళ్లం మనం. వేణుని చదివించటమే మన జీవిత ధ్యేయం!’ నేను బహుశా మొదటి సారి ఆవిడ శాలువా కప్పుకోకుండా నటించటం చూడటం.. శాలువా లేకున్నా బానే ఆనంద భాష్పాలు రాల్చింది. పర్వాలేదు.

వేణు ముఖం ఆందోళన తో, తండ్రి మాటలు ఒకటి కి రెండు సార్లు అతని మస్తిష్కం లో రీ సౌండ్ అవుతుంటే ఇక భరించ లేక, బాగా చదువుకుని మంచి స్థాయి కి వచ్చాకే తిరిగి ఇంటికి వస్తానని ఉత్తరం ముక్క రాసి వెళ్లిపోయాడు. అప్పుడు అర్థమయింది. కాబోయే దేవుడు ఈయనేనని. లక్ష్మి తండ్రిని అనుకున్నట్లే ఆ చిన్న నాటి స్నేహితుడు మోసం చేసినట్టున్నాడు, ఇంటికి స్వాధీనం చేసుకోవటానికి వచ్చిన సేట్ గారి ముందే తండ్రి పోయాడు. గుడిసె లోకి లక్ష్మి, తల్లి, తమ్ముడు, చెల్లెళ్లని తీసుకుని వెళ్లి పోయింది.

ఛా! నేనే ఒక ఇరవయ్యేళ్ల క్రితం పుట్టుంటే ఇలాంటి సినిమాలని మొదటి అరగంట చూసే రివ్యూలు రాసి పడేద్దును! బాడ్ లక్! అనుకున్నాను.

సీన్ మారిపోయింది. కొత్త కలెక్టర్ గారు రైలుకి వచ్చారు, ఊళ్లో జనాలు ఒక పక్క, బక్క బంట్రోతు ఒకపక్క నుంచున్నారు, గాగుల్స్, సూటూ బూటూ వేసి వేణు దిగి అటూ ఇటూ చూశాడు. ఒక పక్క పూల దండలతో పురప్రముఖులు,మరో పక్క అపర కుచేలుడిలా గుమ్మడి. దిగి అందర్నీ డిజాప్పాయింట్ చేసేసి ‘నాన్నా!’ అని తండ్రికి నమస్కరించి,.. కౌగిలించుకుని, కన్నీరు, ఉద్వేగం, ఆనందం.. ‘అబ్బ బ్బా.. వర్ణించలేను..’ ఏ తండ్రికైనా ఇంకేం కావాలి?
ఎందుకో 'బావా ఎప్పుడు వచ్చితీవు? ' గుర్తొచ్చింది.

బస్తీ లో బంట్రోతు గుమ్మడి పెంకుటింట్లోనుంచి ఆఫీసుకెళ్ళటానికి తయారీ. తండ్రికి తన స్వంత చేతులతో కాఫీ ఇచ్చి, ‘నాన్నా.. నా కోసం కార్, డ్రైవర్.. నాతో రా నాన్నా! ‘ అని ఆర్తి గా అన్నాడు ‘లేదు బాబూ! బంట్రోతు వాహనం ఇదే, అయినా బంట్రోతు కలెక్టర్ వచ్చే లోపల ఒక అరగంట ముందుగా వచ్చి సీటు అదీ దుమ్ము దులపాలి ‘ అంటూ మూల నున్న తన సైకిల్ ని చూపించాడు.

ఆఫీసు లో తన చిన్ననాటి స్నేహితుడైన శరత్ బాబు ప్రదర్శించిన అతి చనువు ని కంటి చూపుతో కంట్రోల్ చేసి, ‘బంట్రోతు తండ్రి కి పని చెప్పలేక సంఘర్షణ తో, బ్రతికి చెడి అదే ఆఫీస్ లో స్టెనో గా చేరిన ఒకనాటి ప్రేయసి లక్ష్మి ని రోజూ చూస్తూ అసలే సీరియస్ మనిషి మరికాస్త గంభీరం గా, టెన్స్ గా తయారయితే, ఇది చాలదన్నట్టు మన ప్రభాకర్ రెడ్డి కొడుకు, తన ఆప్త మిత్రుడైన శ్రీధర్ ఎస్ పీ గా అక్కడికే పోస్టింగ్ రావటం.. వేణు నిజంగా గొప్పవాడు. ఎలా నలిగిపోయాడో, భరించాడో.. మనసు ద్రవించుకుపోయింది. కరిగి నీరైంది.

(అన్నట్టు శరత్ బాబు, శ్రీధర్ ఎంత లేతగా ఉన్నారో వేణు బాబు పక్కన)

అప్పుడెప్పుడో నా స్నేహితురాలి భర్త నాకు బాస్ అవబోయాడు. మా బాసు గారి దగ్గరకెళ్లి ‘బాబోయ్ నా వల్ల కాదు’ అన్నాను. ‘you must be above this Krishna!’ అని తెగ కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేశాడాయన! ‘ఎంత చెప్పినా వినడే?’

సరే అని నా కారణాలు చెప్పటం మొదలు పెట్టాను.

“ఈయన గారికీ, వాళ్లావిడకీ జరిగే చిన్ని గిల్లి కజ్జాల దగ్గర్నించీ, మహా సంగ్రామాలదాకా నాకు తెలుసు.. అలాగే వారింట్లో అత్తాకోడళ్ల కథ ఒక వైపు నుండి నాకు తెలుసు, వాళ్లావిడ పూరణ్ పోళీలు చేస్తే ఈయనే నాకు డబ్బా కట్టిస్తాడు, ప్రతి ఏటా ఆవకాయ ఆయన కుటుంబానికి కూడా మా అమ్మే పెడుతుంది. ‘నన్నొగ్గేయండి!!’

ఆయన ఇంకా సద్ది చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు....

ఏం చేయను ఇంక? చెప్పాను.. ‘బాసుగారిని తనివి తీరా కాస్త తిట్టుకోవటానికి ఉండదు..’ దీనికి ఆయనకే ఏం సమాధానం చెప్పాలో తోచక..’సరే ఆయన కి నువ్వు రిపోర్ట్ చేయక్కర్లేదు లెమ్మన్నాడు. అదంతా గుర్తొచ్చి నవ్వుకున్నాను...

తండ్రి, ఇద్దరు మిత్రులు, ప్రేయసి ఓకే ఆఫీస్ లో .. దుర్మార్గుల భరతం ఎలా పడతాడు? ఈలోగా, ఇంతమంది ‘మంచి’ వాళ్లు, కావలసిన వాళ్లు ఒకేదగ్గర, దేవుడు లాంటి వేణు బాబు ఆఫీస్ లో పని చేస్తుంటే వారికొచ్చిన మనస్పర్థలేంటి? అవి వారు ఎలా పరిష్కరిస్తారు? ఎవరి కోసం ఎవరు ఎప్పుడు త్యాగం చేస్తారనేదే సస్పెన్స్.. ఆవలింతలు ఎక్కువయ్యాయి, సర్లే.. చూసింది చాలు.. అని ఇక ఆపేసా.

ఎవరైనా ఈ సినిమా నిన్న చూసుంటే, చివరకి శరత్ బాబుకీ, విలన్ కూతురికీ, ఒక పెళ్లి, NTR కీ, లక్ష్మికీ ఒక పెళ్లీ, అల్లు రామలింగయ్యా, ప్రభాకర్ రెడ్డీ జెయిల్ కీ (కన్నకొడుకే బేడీలు వేసి....) , రావు గోపాలరావు చనిపోగా, చివరి సీన్ లో మిగిలిన వారంతా పధ్ధతి గా ఒక వరస లో నుంచుని, కమెడియన్ వేసిన జోకుకి నవ్వో, లేక అందరూ మూకుమ్మడి గా ‘బంగారు మనిషి అని NTR ని పొగుడుతూంటే, వినమ్రం గా NTR, గుమ్మడి, పండరి బాయిలు తృప్తి గా వీరందరినీ తమ చల్లని చూపులతో చూసుకుంటూ, శుభం కార్డ్ పడటం..

కాకుండా ఇంకే రకమైన ఎండింగ్ అయినా ప్లీజ్, ప్లీజ్ చెప్పరూ?

Wednesday, November 16, 2011 22 comments

ఆర్ముగం తో సాయంకాలం చాయ్ – లైట్ అంకుల్ కథ!


కాస్త కూడపెట్టగానే మా AK చేసిన పని,.. ఊళ్లో, ఒక పక్క కూలుతున్న, పాతకాలం ఇంట్లో ఉన్న తన కుటుంబం కోసం మంచి పక్కా ఇంటిని కట్టించటం. మరి ఇప్పటిలాగా ఏంటి? కాలింగ్ కార్డ్ మీదో/వాయిప్ ఫోన్ మీదో గంటల కొద్దీ మాట్లాడి ఎలా కావాలో చెప్పి చేయించుకునే పరిస్థితి లేదు. ISD కాల్స్ బోల్డు ఖరీదు. కాబట్టి అవసరం మేరకే వాడుతూ AK చక్కగా ఉత్తరాల మీద కొన్నీ , చెన్నై లో స్నేహితులకి ఈ-మెయిల్ ద్వారా ఇంకొన్నీ సూచనలు ఇచ్చాడు. వాళ్ల ఊరివాడే కాంట్రాక్టర్ ఉంటే అతని చేత కట్టించుకున్నాడు.




ఇక అన్ని రకాల ఆధునిక సదుపాయాలూ అమర్చ టానికి ఎవర్నైనా నియమించుకుందామని, వాళ్లమ్మ రికమెండ్ చేయించిన ఒకతన్ని పెట్టుకున్నాడు. అద్దాలు, లైట్లు, ఫాన్లు.. ఒకటేమిటి? అన్నీనూ. అమెరికా లో తాను అనుభవించే అన్ని మంచి సదుపాయాలూ, తన కుటుంబం కూడా అనుభవించాలని చాలా ప్రయత్నించాడు..
ఒక శుభ ముహూర్తాన, కొత్త ఇంట్లోకి మారచ్చనీ, ఇంటికెళ్లి రెండేళ్లు అయిందని AK వాళ్ల ఊరెళ్ళి వచ్చాడు.



ఇద్దరు ముగ్గురు కలిసి మళ్లీ చాయ్ మీటింగ్ పెట్టించారు. ఆవిషయం, ఈ విషయం మాట్లాడాక, వాళ్ల ఇల్లూ, వ్యవహారం మీదకి చర్చ వెళ్లింది.
ఒక్కసారి గా క్రోధం కనిపించింది ఏకే మొహం లో. ఏమైంది? అని అందరం ఆసక్తి గా చూస్తున్నాం.



“మా అమ్మకి తెలిసిన వాళ్లు కదా అని కాంట్రాక్ట్ ఇచ్చాను, లక్ష సార్లు చెప్పాను.. వాష్ బేసిన్ ఎలా ఉండాలి? అద్దం ఎలాంటిది కావాలి? నల్లా ఎలాంటిది కావాలి? అనేవి పూస గుచ్చినట్టు చెప్పానా? “
“అవునూ.. అందరినీ కనుక్కుని, వెబ్ సైట్లు చూసి, ఫోటోలు పంపి.. ఆ గొడవ మాకూ తెలుసు.. ఐతే?”
“పూర్తి గా తగలేశాడు. వాష్ బేసిన్ మీద అద్దం పెట్టలేదు. పైగా అక్కడ లైట్ పెట్టాడు. అద్దం తువ్వాలు పెట్టుకునే రింగ్ మీదుగా పెట్టాడు.. “
“అదెం?”
“అదే! కడిగి పాడేసాను.. అతనింక ఏమీ చెప్పలేడు అనుకున్నాను..’
“ఆ మాత్రం తెలియదా అతనికి”
“ఇంకా నయం.. అతనేమన్నాడో వింటే..మీరు ఆశ్చర్యపోతారు..”
“ఏమన్నాడు?”
“మరుమహనే! ఇదంతా నీ మంచికే?’
“నా మంచికా! ఎలా?”



“ఇప్పుడు చూడు.. నువ్వు పొద్దున్న లేస్తావు, కచికో, వేప పుల్లో, టూత్ పేస్ట్/పౌడర్ ఏదో ఒకటి నోట్లో వేసుకుని, అదంతా కారుతూ, అసహ్యం గా ఉన్న ముఖం తో తలెత్తుతావు,నీ ముఖం నీకే పిచ్చిగా కనపడదూ? నీకేం ఖర్మ? శుభ్రం గా మొహం కడుక్కుని పక్కకి వచ్చి తువ్వాలు తో తుడుచుకుని అద్దం లో చూసుకో.. రాజా లా కనపడతావు కదా?”
ఫక్కుమని నవ్వేసాం అందరం.
“నా మొహం నాకు పేస్టు మరకలతో కూడా అందం గానే ఉంటుంది లే. నువ్వు ముందు మార్చు’
“మరుమహనే! నీ ఇష్టం.. మళ్లీ నన్ను అనద్దు. అయినా.. అక్కడ మరి లైట్ ఉంది గా..?”
“అవునూ.. లైట్ ఎందుకు పెట్టావు అక్కడ? దానికీ ఏదో ఒక థీరీ ఉందే ఉంటుంది చెప్పు! అన్నాను.”
“...”
“మరుమహనే! చలి కాలం లో చల్లటి నీళ్ల తో కడుగు తావు. కాస్త వెచ్చగా ఉంటుంది కదా.. “
“మరి ఎండా కాలం లో?”
“సారీ...”
“ఈ టాప్ ఇంత ఎత్తు ఎందుకు పెట్టావు?”
“నీళ్లు మంచి ఫోర్స్ గా వస్తాయి కదా మరుమహనే!”
“అవి చుట్టూ చిందవా?.. అని అరిచాను కోపం తో.., ఏమీ మాట్లాడకుండా చేతులు నలుపుకుంటూ నుంచున్నాడు.. ఎం చేస్తాం?”
“హ్మ్...”



“ఇది చాలదన్నట్టు అమెరికా లో లాగా డైనింగ్ టేబుల్ మీదకి వేలాడేట్టు లైట్ పెట్టమని చెప్పాను..”
“అవునవును.. గుర్తుంది”
“ ఆ లైట్ కాస్తా అతను.. కుర్చీ వెనక పెట్టాడు..”
“అదేంటి?”
“అదే మరి! ఇలాగ ఎందుకు చేశావు? అందం అంతా పోయింది. పైగా.. టేబుల్ మీద నీడ పడుతుంది అని నిలదీశాను”
“ఏమన్నాడు”
“మరు మహనే! ఇప్పుడు మాత్రం ఏంటి ప్రాబ్లం? నాలుగు కుర్చీల వెనక నుండీ నాలుగు లైట్లు పెట్టిద్దాం! అన్నాడు”
“హి హి..”
“నాకు లాగి కొడదామన్నంత కోపం వచ్చింది.. పెట్టింది చాలు! ఇక నన్ను వదులు.. అని అయిన కాటికి లెక్క కట్టి ఇచ్చేశా”
ఘొల్లుమని నవ్వాం అందరం..

“ఇలాంటివి అన్నీ నీకే ఎందుకవుతాయి ఆర్ముగం?”




“ఛా.. దీనికే? అసలు ఎగ్జాస్ట్ ఫాన్ కథ వింటే ఏమవుతారో?”
“చెప్పు చెప్పు.. ప్లీజ్..”
“అయ్యో.. టైం అయినట్టుంది.. మళ్లీ రేపు చెప్తాను..” అన్నాడు లేస్తూ..
ఇక మేము కాళ్ల మీద పడటమే బాకీ. బాగా బతిమలాడించుకుని చెప్పాడు.
“మొదటి సారి పెట్టాడు. నేనూ ఎప్పుడూ ఇండియా లో చూడలేదు. అమెరికా లో మన అపార్ట్ మెంట్లలో మనకి కనపడదు..డబ్బు సెటిల్ చేసి..మర్నాడు స్నానం చేస్తూ స్విచ్ ఆన్ చేసి చూద్దును కదా..”


“ఆఅ.. ఏమైంది? ఫ్యూజ్ పోయిందా? పేలిందా?” అందరం ఆందోళనతో...
“నో య్యార్.. తిరగేసి పెట్టాడు. బయట నుండి కాలవ కంపు అంతా బాత్ రూమ్ లోకి తెస్తోంది...”
ఇక మా వల్ల కాలేదు.. నవ్వి నవ్వి.. బుగ్గలు, పొట్టా పట్టుకుని సీట్లల్లో కూలబడి... వెనక్కి చూతును కదా.. ఆర్ముగం.


“కూర్చో.. బాబోయ్.. నవ్వించావు చాలా”
“ఈ కథ కి చిన్న పిట్ట కథ కూడా ఉంది క్రిష్ణబిరియా!”
“ఏంటి?”
“ఇతను మాకు దూరం బంధువు. పొలం లేదు, అక్కడా ఇక్కడా పని చేసి,.. సరిగ్గా రాక ముందే..సొంత పని మొదలు పెట్టాడు. భార్య కి కాన్సర్. నలుగురమ్మాయిలు.. అందరూ ఆ పనీ, ఈ పనీ చేస్తారు, తల్లికీ చేస్తారు,చదువుకీ వెళ్తారు..”
“ఓహ్.. I am sorry!”
“అప్పుడు ఆ క్షణం.. అక్కడ నా కష్టార్జితం వేస్ట్ అయిందని బాధ వల్ల తిట్టేసాను.. కానీ అనుకున్నంతా ఇచ్చాను. కష్టపడే చేశాడు..”
“హ్మ్...”
“ప్రేమ గా అల్లుడూ అని పిలిచేవాడు. మా అమ్మకి పెద్దమ్మమ్మ మనవడు. పోన్లే ఎవరు పర్ఫెక్ట్? ఏం? అంత పర్ఫెక్ట్ గా ఉంటే కానీ బతకలేమా?”అన్నాడు.


నేనేమీ అనకుండా కూర్చుండి పోయాను.
తనే అంటూ పోయాడు..


“నేనతన్ని అరిచాను. కానీ కాస్త చల్ల బడ్డాక, ‘ఛా. డైనింగ్ టేబుల్ మీద కాస్త నీడ పడితే ఏంటి? మన అవసరం, అతనికి అవసరం తీర్చగలిగింది. ultimately, humankind wins! He did not provide good work.. but I see his love thru the light.. I left it as it is.. Changed the exhaust fan though” అని తన క్యూబ్ కి వెళ్లిపోయాడు.

***********************************************************************************************************************


చాలా కాలం తర్వాత, ఒకసారి “మీ లైట్ అంకుల్ ఎలా ఉన్నాడు?” అని అడిగాను. ‘ఆయన భార్య చనిపోయింది. ఆయన వర్క్ మీద అందరికీ చిన్నచూపు.. పని ఎవ్వరూ ఇవ్వలేదు. కూతుళ్ళే చూస్తున్నారు. వాళ్లు బయట పనులు చేసుకుని వస్తే.. ఈయన ఇంటి పనులు చక్కపెడతాడు..” అని ఒక్క క్షణం ఆగి...
“అదే ప్రేమ, అదే పిలుపు,.. ఎప్పుడు కనపడినా, ఏమైనా పని ఉంటే చెప్పు మరుమహనే! బిడ్డలకి పెళ్లి చేయాలి త్వరలో.. చాలా కూడాబెట్టాలి.. అంటాడు తప్పితే, చేయి చాచి ఎప్పుడూ అడగడు.” అన్నాడు.
“అబ్బా! ఈ AK ఎప్పుడూ ఇంతే.. నవ్విస్తున్నట్టే ఉంటాడు, ఎక్కడో కలుక్కుమనేలా చేస్తాడు..’ అని మళ్లీ విసుక్కున్నాను.


ఇంకో ఆర్ముగం చాయ్ కథ తో మళ్లీ వస్తా..





Sunday, November 13, 2011 46 comments

ఆర్ముగం తో సాయంకాలం చాయ్


చెన్నై లో మొట్ట మొదటి ఉద్యోగం, నాతో పాటు గా వచ్చిన వారంతా నాలాంటి వారే, మధ్యతరగతి కుటుంబాల్లోంచి, ఇంజనీరింగ్ లూ, MCA లూ చేసి కాంపస్ ఇంటర్వ్యూల్లో గెలిచి, ఉద్యోగ పర్వం లోకి అడుగిడుతున్న వారు.
చుట్టూ గమనించాను.. ఉన్నంత లో మంచి బట్టలేసుకుని, ముఖాన నాలుగైదు షేడ్ల లో ఎర్ర బొట్లు, కొందరు  అడ్డంగా, నిలువుగా! నామాలూ, విభూతి మనిషి కి ఒక రకం గా పెట్టుకున్నా, అందరి ముఖానా కామన్ గా ఉంది మాత్రం బోల్డు ఒత్తిడి, ఉద్వేగం! స్కూల్ కెళ్లే పిల్లల్లా ఆడ పిల్లలు ఫైళ్లు పట్టుకుని, పక్కన వారి తండ్రులు,  కొద్దిగా నవ్వొచ్చింది. నా పక్కన కూర్చున్న అబ్బాయి మాత్రం పెద్దగా టెన్షన్ పడుతున్నట్టు లేడు. బట్టలు చూస్తే బొత్తిగా రోడ్ల మీద ఆదివారం సంత లో కొన్నట్టున్నాయి. ఒక కొర్రు కూడా ఉన్నట్టుంది. పెద్దగా దాచాలన్న ప్రయత్నం ఏమీ కనపడట్లేదు. అతని దగ్గర్నించి, గాఢమైన లైఫ్ బాయ్ వాసన! తలకి కొబ్బరి నూనె,  ఇంక అంతకన్నా నల్లని మనుషులని బహుశా చూడాలంటే ఆఫ్రికా కి వెళ్లవలసిందే! నలుపు ఒకటైతే, ముఖం లో అసలు ఏ భాగమూ వేరే భాగం తో సంబంధం లేనట్టు ఒక వక్రంగా, అసలు చూడబుల్ గా లేడు. ఆ రోజుల్లో మనకసలు ఒళ్లంతా పొగరేమో, ఆ తర్వాత అప్రయత్నం గానే అతని వైపు వీపు పెట్టి ‘ప్రపంచం లో అన్ని విషయాలూ నాకే తెలిసినట్టు’ మాట్లాడుతున్న ఒకరిద్దరి చర్చ ని ఆసక్తి గా గమనించసాగాను. మధ్యలో ఏదో ప్రశ్న గాఢమైన తమిళ యాస తో అడిగినా ఒకటి రెండు పదాల్లో పొడి పొడి గా సమాధానం చెప్పి వదిలేశాను.
అందర్నీ కాన్ఫరెన్స్ రూము లోకి రమ్మని కూర్చోపెట్టి పరిచయాలు మొదలు పెట్టారు. అందరూ తమ, కాలేజ్, వారి పర్సెంటేజ్/స్కోరులు, హాబీలు,జీవిత ద్యేయాలూ గట్రా చెప్తున్నారు. ఉత్సాహం క్షణ క్షణానికీ, ఇంకా ఇంకా ఎక్కువవుతూ..  చివరికి ఇతని టర్న్!  ‘ I am Armugam..’  అని,  ముక్తసరి గా  ‘అన్నా యూనివర్సిటీ’ నుంచి వచ్చాననీ, హాబీలు ఏమీ లేవని, జీవిత ధ్యేయం అంటూ ఏర్పరచుకోలేదనీ, ప్రస్తుతం, సాధ్యమైనంత ఆసక్తికరమైన పని చేస్తూ, డబ్బు సంపాదించటమే తన గమ్యమనీ, ఇది భవిష్యత్తు లో మారవచ్చనీ చెప్పి వదిలేశాడు. అతని పరిచయం చాలా మామూలు గా జరిగినా,  అతని ఆక్సెంట్ కి దిమ్మదిరిగిపోయింది. ఒక్క క్షణం నేను విన్నది తమిళమే అనిపించింది. కానీ నాకు అర్థమైందే! అన్నట్టు.గ్రామర్ రూల్స్ అంటే అతనికి బహుశా ఐడియా కూడా లేదేమో అన్నట్టు!
 రిక్రూట్మెంట్ కో ఆర్డినేటర్ ధన్యవాదాలు చెప్తూ,.. ‘ఆర్ముగం పదవతరగతి లో తమిళనాడు ఫస్ట్! ఇంటర్ లో లెక్కలూ, సైన్స్ల్లో మూడు సబ్జెక్టుల్లోనూ మూడు వందలు సంపాదించాడనీ, ఆ సంవత్సరపు యూనివర్సిటీ టాపర్ అనీ.. గోల్డ్ మెడలిస్ట్ అనీ చెప్పినప్పుడు  నాకు చెంపదెబ్బ కొట్టినట్టైంది. సిగ్గుతో ఆ పూట అతనితో మాట్లాడలేదు. అలాగే.. అతని మార్కులూ గట్రా విన్నాకే ఆ మనిషి కి ఒక వాల్యూ ఆపాదించిన నా సంస్కారం మీద నాకు కొద్దిగా చిరాకు వేసింది. అతనికి తక్కువ మార్కులొస్తే ఒక మనిషి గా గుర్తించనా? అని ఒక ఆలోచన తో ఎందుకో ఎప్పుడూ అతనితో మాట్లాడింది లేదు. ఒక నెల రోజులు నానా రకాల ట్రేయినింగులు తీసుకున్నాం. అతనికి  రెండే చొక్కాలు ఉన్నట్టు గుర్తు. తనతో ఎవరు మాట్లాడినా హాయిగా మాట్లాడేవాడు.. కానీ తానుగా ఎవ్వర్నీ పలకరించేవాడు కాదు.  తర్వాత నేను వేరే డిపార్ట్మెంట్ లో పడటం తో అతని గురించి దాదాపు గా మర్చిపోయాను. ఎప్పుడైనా ఎదురుపడితే పలకరింపు గా నవ్వటం వరకే. తర్వాత మళ్లీ ఆర్ముగం గురించి నేను మళ్లీ ఒక ఏడాది పాటూ వినలేదు. నా ప్రాజెక్టులూ, పెళ్లీ, కొత్త ఉద్యోగం వెతుక్కుని సెటిల్ అవటం,.. కొత్త కంపెనీ లో కూడా అర్ముగాన్ని చూసి.. కొద్దిగా మాట్లాడాను, కానీ కలిసి పని చేయలేదు. ఎప్పుడో కాఫేటేరియా లో కనిపిస్తే ఒకటి రెండు మాటలు అంతే!  తర్వాత అమెరికా లో ఇంకో కొత్త అధ్యాయం..  
·                   ********                            ************                    ***********************          

ఆఫీస్ లో ఒక రోజు మధ్యాహ్నం పూట!.. మా బాసు గారు ఎవర్నో ఇంటర్వ్యూ కోసం తెస్తున్నట్టున్నాడు..చేతిలో రెజ్యూమె..వెనక నడుస్తున్నాడు ఎవరో. ‘హాయ్ కృష్ణా!  I got some old friend of yours!’  అని ఇంటర్వ్యూ కాండి డేట్ ని చూపించాడు. ఇండియా నుండి బిజినెస్ వీసా మీద వచ్చాడు. మన రాజు రిఫర్ చేశాడని ఇంటర్వ్యూ కి పిలిచాను. అన్నాడు.
 ‘అరే! మన ఆర్ముగం! ‘ అనుకున్నాను. కాస్త నలుపు విరిగింది, జుట్టు పల్చపడింది, ఒళ్లు చేసినట్టున్నాడు. బట్టలు కూడా ఇదివరకు కన్నా చాలా బాగున్నాయి.  నేను సంతోషం గా ‘హాయి! ‘ అన్నాను కానీ, అతని ముఖం లో అసలు నన్ను ఎప్పుడూ జీవితం లో ముందు చూసినట్టు ఆనవాలు లేవు. రజనీకాంత్ రోబో చిట్టి అంత భావహీనం గా ‘హలో’ అన్నాడు. నాకు తిక్క రేగింది. నేను వచ్చేశాను. క్యూబ్ లో కూర్చున్నాక కూడా చిరాకు తగ్గలేదు. ఇంటర్వ్యూ లో ఫిబోనాచీ నంబర్ల గురించి అడిగితే ఆపకుండా అనర్గళం గా కళ్లల్లో మెరుపు తో చెప్తున్నాడట.. అదే  నన్ను అడిగితే అంతే సంగతులు. నాకు మనుషులు గుర్తున్నంత సబ్జెక్ట్ గుర్తుండదు. అతనికి రివర్సేమో?  ‘సరే లెమ్మని’ తేలిక పడిన మనసు తో పనులలో పడ్డాను. అతని గురించి నా అభిప్రాయం అడిగితే నాకు తెలిసిన విషయాలు చెప్పాను. అతనికి ఉద్యోగం ఇచ్చారని, వీసా చేస్తున్నారని తెలిసింది.
మళ్లీ నెల దాటాక ఒక రోజు, క్యూబ్ ముందు.. ‘క్రిష్ణబిరియా.. ‘ అన్న పిలుపు.. తిరిగి చూస్తే AK. (ఆర్ముగం షార్ట్ కట్ లెండి).  హాయ్, హవ్వార్యూలయ్యాక,
‘ నువ్వు తప్ప ఎవరూ తెలియదు ఇక్కడ. నాకు చిన్న సహాయం చేస్తావా?  అన్నాడు.
‘ఓ! తప్పకుండా! దానికేం?  చెప్పు’ అన్నాను. కొన్ని ఏవో కొనటానికి, కార్ మీద తీసుకెళ్ళాను.. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కార్ కోనేలోపల, కొత్త స్నేహితులని సంపాదించుకునే లోగా,  చాలా సార్లు కాస్త షాపింగ్ కి తీసుకెళ్లటం అవీ చేసేదాన్ని. అతనికి అమెరికన్ల ఆంగ్లం అర్థం చేసుకోవటానికి కాస్త కష్టం గా ఉండేది.
గరాజ్ సేల్ లో ఒకసారి పేద్ద వస్తువు ఏదో కొంటే నా కార్ లో తీసుకెళ్లి వాళ్లింట్లో పడేసి వచ్చేసరికి నాలుగయింది. ‘టీ కెళ్దాం’ అని బ్రేక్ రూమ్ లో కూర్చున్నాం. 

టీ తాగుతూ ఎందుకో వంగితే జేబు లోంచి చాలా వస్తువులు పడ్డాయి. . ‘నోరూ,చెవులూ, చదువూ,భాషా అన్నీ ఉండి మూగా చెవిటి వాడినయ్యాను. అందుకే!’ అని  కళ్ళుచికిలిస్తూ చిన్న కాగితాల దొంతర (స్టికీ నోట్స్), పెన్నూ చూపించాడు. 
నేను నవ్వేసి.. ‘ఎంతైనా ప్రాబ్లం సాల్వర్ వి కదా నువ్వు’ అని, ఏం ఇబ్బందులు ఎదురయ్యాయి నీకు చెప్పు.. అన్నాను.. 
బజార్ కెళ్లి ‘నాకు కుకింగ్ ఆయిల్ కావాలి’ అని అడిగాను. ఎంత చెప్పినా అర్థం కాలేదు. చివరకి దాని ఉపయోగాలు చెప్తున్న కొద్దీ, ఇంకా కన్ఫ్యూజ్ అయి.. ఎలాగైనా అది ఏంటో తెలుసుకోవాలని పట్టుదల తో షాపంతా అరగంట తిరిగి ‘ఓ ఓ ఓ ఓ ! ఆయేల్!’ అంది. నేనూ అదే అన్నా కదా! అనగానే.. ఒక్క లుక్కిచ్చింది.. అన్నాడు. అప్పటినించీ.. ఈ చీటీలు.. అన్నాడు.
‘ఓ సారి అపార్ట్మెంట్ ఆఫీస్ లో డబల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ కావాలి’ అన్నాను.  అక్కడ మానేజర్ కి నా లాంటి వాళ్లు బాగా తగులుతారనుకుంటా!  ఎన్ని బెడ్స్ కావాలంటే అన్ని వేసుకో.. అది నీ ఇష్టం అంది. టూ బెడ్ రూమ్ అనాలని అప్పుడు తెలిసింది’ అన్నాడు..
‘ఇంకా?’ అన్నాను..
‘మొదటి సారి కాంట్రాక్టర్ గా నన్ను మా కంపెనీ ఒక క్లైంట్ ఆఫీస్ లో కూర్చోపెట్టింది. ఓ రెండు వారాలు పని చేశాక,.. అక్కడి మానేజర్ ఆ మాటా, ఈ మాటా అంటూ,.. ‘పే చెక్ వచ్చిందా AK?’ అనడిగాడు. నాకు సాలరీ తెలుసు కానీ పే చెక్ తెలియదు కదా.. అందుకని.. పేచెక్ అంటే?’  అనడిగాను. ఆయన ‘పేచెక్’ అంటే ఏంటో తెలియకుండా పని చేసేవాడిని మొదటి సారి చూస్తున్నాను.. అని తెగ జోకులేసి  నువ్వు నా టీం లోకి వచ్చేయ్’ అని ఒకటే గొడవ..  
ఓ సారి టీం మీటింగ్ లో ఏదో అడుగుతుంటే, చెప్తున్నారనుకుని ‘యా యా.. అంటున్నాను. అందరూ ఒకటే నవ్వు!’   చెప్పే విధానానికి నాకూ కాస్త నవ్వొచ్చింది.. కానీ ఆపుకున్నాను.
ఇంకోసారి ఎవరో ఫ్రెండ్ నన్ను ఇంటి దగ్గర దింపుతున్నాడు.. ‘Go to da zendar of da rODD and you can see the sain..’ అన్నాను. ఎన్ని సార్లు చెప్పినా జెండర్ అంటే ఏంటో అతనికి అర్థం కాలేదు.. అన్నాడు..
 ‘జెండర్ అంటే సెంటర్ అని తన నోట్స్ లో రాసి చూపించాకా కానీ నిజానికి నాకూ అర్థం కాలేదు.  అతను ఏం పని ఇచ్చినా చక చకా చేసేస్తాడు కాబట్టి ఎక్కువ గా  అతని తో కమ్యూనికేషన్ పెద్ద సమస్య అని ఎవరూ అనుకోలేదు. సహజం గా తెలివైన వాడవటం తో ఆక్సెంట్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. టీం కి తలలో నాలుక అయ్యాడు.
రెండు మూడు నెలలు తిరిగేసరికి స్నేహం కొద్దిగా  పెరిగింది. వారానికి ఒకటి రెండు సార్లు నాలుగు గంటలకి టీ కి కలిసి బ్రేక్ రూమ్ కి వెళ్లేవాళ్లం...  


ఒకరోజు.. పాంట్ అడుగు భాగం మడత పెట్టే దగ్గర అంతా చిరుగు పట్టి ఉంది. పాంట్ కింద అంతా చిరిగినట్టుంది. చెప్పాలా? వద్దా? అని ఆలోచించి సర్లే చెప్పి చూద్దాం తప్పేముంది  అనుకుని చెప్పాను. అతను దానికి ‘ఆ  తెలుసు.. నాకు రెండే పాంట్లు ఉన్నాయి. కొంటాను దీపావళికి ...  ‘ అన్నాడు. ‘ఏంటీ?!! మూడు నెలలు ఆగుతావా? అప్పటిదాకా చిరుగు పట్టిన దానితోనే వస్తావా? ‘ అని అడిగాను. ‘లేదు. కుట్టుకుంటాను!’ అన్నాడు.  నేను..’ఓకే’ అని ఊరుకున్నాను.

‘కిష్ణబిరియా.. మా ఇంట్లో ఎవ్వరికీ రెండు జతలకి మించి బట్టలు ఎప్పుడూ లేవు..’ అన్నాడు. నేను ఆసక్తి గా వినటం గమనించి.. ‘మా నాన్న రైల్వేస్ లో పట్టాలు శుభ్రం చేసే వాడు. వారానికోసారి ఇంటికి వచ్చేవాడు. మేము నలుగురు పిల్లలం. మా నాన్న తల్లిదండ్రులు, అమ్మ తల్లిదండ్రులు మాతోనే ఉండేవారు. మా అమ్మ.. నలుగురి ఇళ్లల్లో పనులు చేసేది.. చిన్నప్పుడు రెండు జతలు బట్టలు, కడుపు నిండా అన్నం, సాంబారు ఉంటే అదే పది వేలు.. అనుకునేవాళ్లం. సంవత్సరానికి రెండే సార్లు కొత్త బట్టలు. ఒకటి దీబావాలి కి, ఇంకోటి పుట్టిన రోజుకి..’ పొంగల్ వస్తోంది అంటే వారం రోజుల నుండీ ఎదురు చూసేవాళ్లం.. ‘మా అమ్మ నూనె బాండీ పొయ్యి మీద పెడుతుందా? లేదా? ఏదైనా మురుక్కు చేస్తే బాగుండు.. ’ అని. రోజూ స్కూల్ నుండి పరుగున రావటం, పిండి వంటల వాసన రాకపోవటం.. నిరాశ గా మేము వెనక్కి తిరిగటం. ఇంక రేపు పొంగలనగా కూడా ఏమీ చెయ్యట్లేదు అని తేలిపోయాకా, నేనూ, మా అక్కా గంభీరం గా ఉండిపోయినా, చెల్లీ, తమ్ముళ్లు ఎక్కిళ్లు పెడుతూ పడుకునేవారు. మా అమ్మ ఏమీ మాట్లాడేది కాదు. అర్థరాత్రి కలలోలాగా ఒక్కోసారి నూనె కాస్తున్న వాసన తో లేచి చప్పట్లు కొట్టేవాళ్ళం.. మా అమ్మ కారం మురుక్కు, స్వీట్ మురుక్కు చేస్తే కాగితాల్లో పంచుకుని ఇంటి ముందు గొప్ప గా కూర్చుని తినేవాళ్ళం.. ఇప్పుడనిపిస్తుంది సిగ్గుగా.... అది కూడా చేసుకోలేకపోయిన వాళ్లు ఎంతమంది ఉండేవారో మా బస్తీ లో... వాళ్లందరి ముందూ కూర్చుని తినటం!.. అని తల విదిల్చాడు AK. నేను కొద్దిగా పెద్దయ్యాక, దళితుల సంక్షేమ హాస్టల్ లో చదువుకున్నాను. నేనూ మా తమ్ముడూ  సెలవలకి ఇంటికి వస్తే..  మా అమ్మా వాళ్లకి మాకు ఇంత పెట్టాలన్న ఇబ్బంది, అయ్యో పెట్టలేక పోతున్నాము అన్న బాధ తప్ప .. ఏమీ ఉండేది కాదు..
సడన్ గా గుండె ఎందుకో పట్టేసినట్టు.. నాలుగున్నర కి మీటింగ్ లేకపోతే.. అలాగే ఎంత సేపు కూర్చునే దాన్నో..
ఇంకోరోజు.. మళ్లీ నాలుగు గంటలకి మళ్లీ టీ కి కూర్చున్నాం..మొన్న బాబోయ్.. అంత ఏడిపించాడు. ఇవ్వాళ్ల ఏం చెప్తాడో అనుకున్నా.. కానీ....


AK నాకు పదహారేళ్లు గా పరిచయం. ఆశ్చర్యం! నేను మారిన ప్రతి కంపెనీ లోనూ అతనూ వచ్చాడు. మూడు కంపెనీలు మారాకా కానీ మేము స్నేహితులం కాలేకపోయాం. ఒక పదేళ్లు నాలుగు గంటలకి టీ కలిసి తాగాం. ఆఫ్ కోర్స్.. ఒక్కోసారి ఒక్కో బృందం తో అనుకోండి... ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను, నన్ను నేను ఇంకొంచం తెలుసుకున్నాను, ఒక్కోసారి కన్నీరు పెట్టించాడు, ఒక్కోసారి నవ్వించాడు.ఒక్కోసారి చిరాకు తెప్పించి.. విసుక్కునేలా చేశాడు..
‘AK!  ఏదో ఒక రోజు ‘4 pm tea with Armugam’ అని పుస్తకం రాసేస్తా.. అని అంటూ ఉండేదాన్ని. పుస్తకం రాయలేకపోయినా.. బ్లాగ్ లో నేను నా అనుభవాలని ఈ విధం గా ప్రచురించుకునే అవకాశం రావటం.. నా అదృష్టం అనుకుంటున్నాను. మొన్న అమెరికా వెళ్లినప్పుడు గుర్తు చేసి..’ఇలాగ తెలుగు బ్లాగు రాస్తున్నాను. దాంట్లో వేయనా? ‘ అని అనుమతి అడగటం జరిగింది.. ఈ సిరీస్ లో బహుశా నాలుగైదు టపాలు రాయవచ్చు..
Thursday, November 10, 2011 40 comments

కార్తీక మాసం వన భోజనాలు – ఇదిగో.. నా వంట!



కార్తీక పౌర్ణమి కి జ్యోతి గారేమో బ్లాగ్లోకం ఘుమ ఘుమ లాడిపోవాలన్నారు. సరే చూద్దాం, చేద్దాం అనుకుని చూస్తే అది గురు వారం అయింది. నేనేదో ‘వీకెండ్’ పూట ‘బాగా ఆలోచించి’, ‘అర్థవంతమైన’ టపా వేద్దామనుకుంటే.. వారం మధ్యలో బుధ వారం పూట రాయమనేశారు.. ‘తప్పుతుందా?’

క్రితం ఏడు టల్లోస్ చూశారు గా .. ఎలా చేయాలో.. బుధ వారం పూట ఏదైనా పుల్ల పుల్ల గా ‘లొట్ట లేస్తూ’ తినాలనిపించిందనుకోండి.. ఆవకాయలు తీయబుద్ధవలేదనుకోండి.. అన్నీ పోపు సామాన్లు, ఉప్పూ, కారం గట్రా ఉండి, నాలుగు ఉసిరి కాయలు దొరికితే ఐదు నిమిషాల్లో తయారయ్యే ‘లొట్టల్స్’ దగ్గరుండి నేర్పిస్తా..



లొట్టల్స్ తయారీ కి కావలసిన పదార్థాలు..



ఉసిరికాయలు ఒక దోసెడు

ఉప్పు ఒక చారెడు

పసుపు చిటికెడు

కారం ఉప్పుకి రెండు రెట్లు.

నూనె చిన్న మట్టు గిన్నెడు

మెంతి పిండి తేనీటి చెంచాడు

ఆవ పిండి బల్ల చెంచాడు.

ఆవాలు తల గొట్టి బల్ల చెంచాడు

కర్వేపాకు నాలుగు రెబ్బలు

ఉపోద్ఘాతం :



2009 జనవరి 26 న సరదాకి ఒక ఉసిరి మొక్క తెచ్చి ఇంటి వెనక స్థలం లొ నాటాను. అది విరగ కాస్తోంది. కార్తీక మాసమేమో.. చూస్తూనే నోరూరిపోతోంది.

కార్తీక మాసం లో ఉసిరికాయలు తినాలంటారు.. నాకు ఏమాసమైనా ఉసిరికాయలు తినటమంటే తగని ఇష్టం!



ఇదిగో... ఇలాగ ఒక కర్ర తెచ్చి చెట్టుని బాది, రాలిన కాయల్ని ఏరి .. వట్టివి కానీ, ఉప్పూ, కారం అద్దుకుని కానీ , తినగల్గినన్ని తినేయగా మిగిలినవి ఒక పళ్లెం లో పెట్టుకోవాలి.



కర్వేపాకు పెరట్లోంచి దూసుకుని

ఇలాగ పేర్చుకుని,





పోపు సామాన్లన్నీ ఒక దగ్గర అమర్చుకుని..



మూకుడు పొయ్యి మీద పెట్టి, కాస్త వెచ్చబడ్డాకా నూనె వేయాలి.



అన్నట్టు ఉసిరి కాయలకి ఒక షవర్ కొట్టాలి. .. మట్టి లోంచి ఏరాం కదా, ఎంతైనా ..



నూనె కాగేలోపల ఒక పిట్ట కథ :

మా తాతగారు మా స్కూల్ టిఫిన్ బాక్సులు చూసి.. ‘ఛా.. ఇవేం తిండ్లర్రా! మా చిన్నప్పుడు మూడు గిన్నెల ఇత్తడి కారియర్ లో అన్నం పెట్టుకుని ఒక దాంట్లో నిమ్మకాయంత ఘాటు గా పోప్పెట్టిన చింతకాయ పచ్చడన్నం లో సగం నూనె గిన్నె వంపి కలిపి ఒత్తు గా పెట్టుకుని, ఇంకో దాంట్లో అప్పటికప్పుడు జాడీ లోంచి తీసి కొత్తిమీర, పచ్చి మిర్చి వేసి దంపి ఇంగువ పోప్పెట్టిన ఉసిరి కాయ పచ్చడన్నం కలుపుకుని, పై గిన్ని లో పెరుగన్నం రవ్వంత ఉప్పేసుకుని కట్టుకుని ఓ మాగాయ ముక్కో, ఆవకాయ బద్దో.. ఇలా చెప్తూ పోతుంటే... ఇక మేమా బచ్చలి కూర పప్పులూ, కారట్ పెసరపప్పు కూరలూ తింటే ఒట్టు..

నూనె కాగాక, కాస్త ఇంగువ వేసి, ఉసిరి కాయల్ని వేయాలి. కొద్దిగా కదుపుతూ మగ్గ నివ్వాలి.



 మగ్గే లోపల మా ఇంట్లో ఉసిరికాయ కి ఉన్న ప్రాముఖ్యత :

మనకి పురాణాల్లో రెండు మొక్కలని అత్యంత పూజనీయమైనవని చెప్పారు. ఒకటి ధాత్రి (ఉసిరిక) , రెండు తులసి. నాకు ఎప్పటినుంచో ఈ రెండు పేర్లంటే చచ్చే ఇష్టం. అందుకే నా ఇద్దరు పిల్లలకీ ఆ పేర్లు పెట్టుకోవాలని అనుకుంటూ ఉండేదాన్ని. అనుకున్నట్టు గానే మా పెద్దమ్మాయి కి ధాత్రి అని పెట్టాము. చిన్నదానికి తులసి అన్న పేరు రికార్డ్ కెక్కక పోయినా, బియ్యం లో రాయించి నా ముచ్చట తీర్చుకున్నాను.

రోగ నిరోధక శక్తి బోల్డు ఉన్న ఈ ఉసిరి లో సీ విటమిన్ చాలా అధిక స్థాయి లో ఉంటుంది. పచ్చిరాచ ఉసిరి ఒక్కటి తింటే చాలు.. ఇంక ఆ రోజుకి సీ విటమిన్ గురించి ఆలోచించక్కర్లేదు

కాస్త మెత్తపడ్డాక, చింతపండు రసం ఉసిరికాయల మీద పోసి కలియ పెడుతూ ఉండాలి.  ఉప్పూ, పసుపూ వేసుకుని..



కొద్దిగా రుచి చూసుకుని ..



కారం, మెంతి పిండీ వేసుకుని,



పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారాక ఆవ పిండి కలపాలి.



చల్లారేలోపల.. ఇంకో కథ..

కుక్కర్ మూత తీస్తూనే కళ్లముందు పొగలు తప్పితే ఏదీ కనపడకూడదు. అంత వేడన్నం లోకి ఇంత ఉసిరి పచ్చడి వేసుకుని, మధ్యలో గుంట చేసుకుని నెయ్యి వేసి పెడితే అసలు అన్నం తినటానికి రామని ఏ పిల్లలు పేచీ పెట్టగలరు?

మా పాప కి అలవాటు చేయటానికి ‘ధాత్రి రైస్’ అని చెప్పేదాన్ని. తర్వాత చుట్టు పక్కల తల్లులు వచ్చి గొడవ గొడవ చేసి పోయారు. ‘ఏమ్మా! నీ పాటికి నువ్వు ధాత్రీ రైస్ అని పెట్టేస్తే.. మా పిల్లలకి మేమేం వంట ని వాళ్ల పేరు తో పెట్టుకోవాలి అని..  అదీ కథ!



అన్నట్టు మూకుట్లో మిగిలిన నూనె లో కాస్త ఆవాలు చిటపట లాడించి పోపు పెట్టుకోవాలి. కర్వేపాకు చుట్టూ సాధ్య మైనంత అందం గా పెట్టి ఎవర్నైనా కాస్త రుచి చూడమనాలి.



వాళ్లు ఇదేంటి? అని అడిగారనుకోండి. అసలు తింటే .. మీరే చెప్తారు అని చూడండి. తిని.. వాళ్లే



ల్ల్ల్ల్ల్ల్ల్ల్ ట్ట!! అనేస్తారు 



 
ఏమ్మా! పేద్ద నువ్వు కనిపెట్టిందేంటి ? అంటారా?


అంటే ఉసిరికాయ ఊరగాయ చేసేటప్పుడు వాడేవి రాచ ఉసిరికాయలన్నమాట. అలాగే వాటికి కాస్త ఫోర్క్ తో గాట్లు పెట్టటం, కుక్కర్ లో ఆవిరి పైన ఉడికించటం లాంటివి చేస్తారు. ఇక్కడ నేను చేయలేదన్నమాట.

ఇది ఎలా తినాలి?

చూపుడు వేలు తో నాకచ్చు, లేదా, అన్నం లోకి తినచ్చు. ఇంకోటి.. ‘ఉసిరిక్ సాండ్ విచ్’ చేసుకుని కూడా లాగించవచ్చు

 
;