Tuesday, November 22, 2011

ఆర్ముగం తో చాయ్ – ౩

అమాయకత్వమో, అతి తెలివో, రెండింటి మిశ్రమమో, ఆర్ముగం చేసే పనులు, ఆలోచనలూ గమ్మత్తు గా ఉంటాయి.


ఒక రోజు చాయ్ సమయం, మామూలు గానే మా చాయ్ గాంగ్ అందరం చేరాం, పెట్రోల్ ధర మళ్లీ పెరిగిందని, మేధావుల్లా ఫీల్ అయి కాస్త ఇరాక్, కువైట్, అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇలా మాకున్న మిడి మిడి జ్ఞానాన్ని అందరం ఒకరి మీద ఒకరు రుద్దుకుంటున్నాం. ఆ పూట పేపర్ ఆఖరి నిమిషం లో చూసుకుని వచ్చి బజ్ వర్డ్స్, వాడి హమ్మయ్య మాకూ కాస్త జనరల్ నాలెడ్జ్ ఉందనిపించి పరువు దక్కించుకుంటున్నాము. అందరం ఇలాగ మా గొడవ లో మేము అరుచుకుంటుంటే ఆర్ముగం మాత్రం ఏదో ఆలోచనలో ఉన్నాడు..

‘ఏంటి కథ? ఏమాలోచిస్తున్నావు?’ అని అడిగారెవరో..

“మనం ఊర్కే వేరే దేశాల వారి మీద పెట్రోల్ కోసం ఆధారపడుతున్నాం, అందువల్ల మనకి బోల్డు ధర, దానికి వేరే ప్రత్యామ్నాయం లేదా? అని ఆలోచిస్తున్నా.. “

“ఏమన్నా దొరికిందా మరి?” అని వ్యంగ్యం గా అడిగారొకరు.

AK మాత్రం చాలా గంభీరం గా ఒక వైట్ బోర్డ్ దగ్గర కెళ్లి కింది బొమ్మ వేసి, గుజరాత్ దగ్గర సముద్రం లోంచి భూగర్భం లో ఒక సొరంగం తవ్వి గల్ఫ్ దేశాల క్రింద ప్రాంతం నుంచి ముడి చమురు తెచ్చుకోవచ్చు కదా అని ..”

“వ్వాట్!!”

“దీని వల్ల, మనం చమురుకి మన దేశం ఎవ్వరికీ చెల్లించక్కరలేదు, శక్తివంతమైన మోటార్ తో లాగేయవచ్చు. ఇక భారత దేశం లో పెట్రోల్ రూపాయికి నాలుగు లీటర్లు అమ్మవచ్చు.. ”

‘హాఆఆఆఆ!”

"కానీ .. ఇంకో ప్రాబ్లం ఉంది.. "

"అబ్బా ఏంటో అది!"

"అటు వాళ్లూ, ఇటు మనం, తవ్వేస్తే.. భూమి లోంచి ఒక ముక్క.. పడిపోతుందా? I am confused.. చూడాలి!"

• * * * * * * *

ఇంకో చాయ్ సెషన్ లో ఆర్ముగం మంచి ఐడియా తో వచ్చాడు..


అప్పట్లో రాజ్ కుమార్ ని అపహరించి, గంధం దొంగ వీరప్పన్ సంచలనం సృష్టిస్తున్నాడు..  జయప్రద అడవుల్లోకి వెళ్లింది ..
ఈ జయప్రద వాళ్లతో అయ్యేది కాదు, రాజకీయ నాయకులూ, పోలీసుల అండదండలతో ఉన్న వీరప్పన్ ని పట్టుకోవాలంటే..ఒక్కటే మార్గం..
ఆయన ఆఖరి గంధం చెట్టు కొట్టినప్పుడు, సినిమాల్లో లాగా పోలీసుకు.. 'You are under arrest" అని తీసుకు వెళ్ళచ్చు గా.. అంతవరకూ, ఆ గంధం చెక్క విలువ కన్నా, కన్నా, వాడిని పట్టుకోవటానికి, మన ప్రభుత్వం పెట్టె ఖర్చు,పోయిన పోలీసుల ప్రాణాల వాల్యూ ఎక్కువ. వేస్ట్.
*************************************************************************
ఇంకోసారి చాయ్ కి వచ్చి చేరినప్పుడు.. గంభీరం గా కనిపించాడు..

“ఏంటి సర్? కాస్త గంభీరం గా ఉన్నారు? ఏంటి కథ?”

“ఇది చాలా సీరియస్ విషయం..”

“ఏంటది?”

“మా అక్కకి వయసు దాటిపోతోంది. పెళ్లి ఆపాం మేము.. ఇప్పుడే మా అమ్మా వాళ్లకి చెప్పాను. ప్రయత్నం చేయద్దని..”

“ఆపటం ఎందుకూ? “

“తన జాతకం లో ఇరవై ఎనిమిదవ ఏట కానీ పెళ్లి రాసి లేదు..”

“అయితే? ప్రయత్నం చేయరా?”

“అంటే ప్రయత్నం చేయవచ్చు.. కానీ అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటే జనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఏమైనా లోపం ఉందేమో అనుకుంటారు కదా!”

“మరి పెళ్లి మాటే ఎత్తటం లేదు.. అనుకోరా?”

“అది వేరు..”

ఈ విషయం మీద హోరా హోరీ గా చర్చ జరిగాక, అందరం ఎవరి క్యూబ్స్ కి వాళ్లు వచ్చి పడ్డాక,..

ఆర్ముగం చెప్పాడు. “ఇంతకీ.. నీకో ఆంటీ క్లైమాక్స్ చెప్పనా? “

“అనుకున్నా.. నీ కథలకి, ఆంటీ క్లైమాక్స్ ఉంటుందని తెలుసు లే ..”


“మా అక్క పుట్టినప్పుడు మా ఇంట్లో గడియారం అనేదే లేదు. మా నాన్న బయట నుంచుని, చంటి పాపాయి ఏడుపు వింటుండగానే, మా ఊరు లోంచి వెళ్లే ఏకైక ఎక్స్ ప్రెస్ బండి అదే సమయానికి వెళ్లింది. తర్వాత జాతకం రాయించేటప్పుడు ఆ రైలు మా ఊరు చేరే సమయం తెలుసుకుని పంతులు గారితో రాయించాం..”

‘ఆఆ!”

• * * * * * * *


ఇంకోరోజు మరో చాయ్ మీటింగ్ లో ఇప్పుడే వస్తాన్నన్న వాడు, మేమింక టీ బ్రేక్ అయిందనిపించి మళ్లీ క్యూబులకి బయల్దేరుతున్నాం,.. ముఖం వేలాడేసుకుని వచ్చాడు ఆర్ముగం.

‘ఏంటీ.. కథ? “

“అబ్బే ఏం లేదు లే”

“పర్వాలేదు చెప్పు ఏదో ఉంటుంది..”

“మళ్లీ నవ్వుతారు!”

“మేమేం నవ్వం... చెప్పేయ్”

“మొన్న మరి HR వాళ్లు నామినేషన్ ఇవ్వమన్నారు కదా.. 401K, Accidental, death benefits etc..”

“అవును.. ఏం? అనుకున్న వాళ్లకి కాకుండా వేరే వాళ్లకి చెందాలని రాశావా? మార్చేసుకోవచ్చు గా ఇంకా టైం ఉంది?”

“అది కాదు...”

“చెప్పు బాబూ.. ఏం చేశావు ఈసారి?”

“ఏం లేదు.. 25% మా అమ్మ, నాన్నలకి, 25% మా ఆవిడకీ, 25% మా ఊర్లో తెలివైన బీదవారిని చదివించేందుకు ఫండ్ కోసం ఇచ్చాను. ఇంకో 25% ఎవరికీ నామినేట్ చేయాలా అని ఆలోచించి...”

‘ఊ.. ఆలోచించి?”

“ఈలోగా, ఈ సాఫ్ట్ వేర్ రాసిన వారు, సరిగ్గా రాశారా? లేక బగ్స్ ఏమైనా ఉన్నాయా? చూద్దాం అని..”

“ఆ.. చూద్దాం అని?”


“మిగిలిన 25% నాకే రాసుకుంటే ఈ సాఫ్ట్వేర్ ఎర్రర్ ఇస్తుందా? లేదా? అని చెక్ చేశాను..”

“ఏంటీ? నీవు పోయాక వచ్చే బెనిఫిట్స్ నీకే చెందేలా సిస్టం లా ఎంటర్ చేశావా? అప్పుడు? “ అందరికీ నవ్వొచ్చేస్తోంది..

“అందుకే.. చెప్పన్నన్నాను...”

“అబ్బా.. నవ్వం లే కంటిన్యూ..”

“సిస్టం నాకు ఇచ్చేసింది. నేనేమో.. సరే నా నుంచి తీసేసి మా అమ్మా వాళ్లకో, మా ఆవిడ కో వేద్దాం అని నా నామినేషన్ మార్చాలని ప్రయత్నించా.. కానీ.. ఈ పార్ట్ రాసిన వాడు కాస్త గట్టి వాడనుకుంటా.. ‘You can not transfer nomination from dead person : ) ‘ అని ఎర్రర్ మెసేజ్ వస్తోంది...”

ఇక అందరం ఘోల్లుమని నవ్వేసాం. “బాబూ.. మరి ఇప్పుడేమి చేద్దామని?”

“ఏముంది? ఫోన్ చేసి వాళ్లకి ఇదంతా చెప్పి, మార్చమని చెప్పి వచ్చా”

ఇంకా నవ్వుతూనే ఉన్నాం,.. మా AK కూడా సరదా గా,.

ఒకవేళ కనక ఆ సొమ్ము ట్రాన్సఫర్ కాదు, కుదరదు అంటే.. “ఏం చేస్తాం? 237 హై వే మీద అతి పెద్ద అంతిమ యాత్ర చేయండి నాకు, పూలు, బొంగు పేలాల తో పాటు చిల్లర పైసలకి బదులు, ముత్యాలో, డాలర్ నాణాలో జల్లండి.. డప్పు శివమణి తో కొట్టించండి.. డాన్సు కి కుదిరితే మైకేల్ జాక్సన్, అథమ పక్షం షారుఖో, అక్షయో..” అని నాటకీయం గా అని మమ్మల్ని నవ్విన కొద్దీ ఇంకా ఇంకా ‘ఇక చాల్లే’ అనేంత వరకూ నవ్వించాడు..

• * * * * * * *

ఇంకోసారి చాయ్ లో, అందరం కూర్చున్నాం. ఆర్ముగం ఇంకా రాలేదు. .. మా బాస్ అటువైపు వచ్చి ఇవ్వాళ్ల AK రాడు లెండి.. అన్నాడు.

“ఓహ్. ఏం?” అని అడిగితే ఆయన చెప్పిన వృత్తాతం...బాసు గారి దగ్గరకి ఆర్ముగం, మోహన్ వెళ్లారట. దేనికో ఎస్టిమేట్ ఇవ్వటానికి..

“అసలీ కోడ్ ఎవరు రాశారో.. పరమ చెత్త గా రాశారు.. ఇది కరెక్ట్ చేసుకునే బదులు, కొత్తగా రాసుకోవటం బెటర్..” అని AK అనేశాడట..

ఒక్కసారి గా బిత్తర పోయారట, మా బాసు గారూ, మొహనూ. అదంతా మరి పూర్వాశ్రమం లో బాసు గారే రాశాడు.

ఆపుతాడేమో, అని చూస్తే ఆగలేదట... ప్రతి తప్పునీ, చూపించి, ప్రూవ్ చేసుకోవటం.. తప్పులుండచ్చు గాక, మరీ మొహం మీద చెప్పేటప్పుడు కాస్త మృదువు గా,.. అబ్బే లేదు.. ఫటా ఫట్ చెప్తూ, ఆవేశం గా అలాంటి ‘చెత్త’ కోడ్ వల్లపడే ఇబ్బందులు ఏకరువు పెడుతుంటే ..

ఎలా ఆపాలో తెలియక, మోహన్ కాలుతో అతని కుర్చీ కదిపి, సైగలు చేయటం మొదలు పెట్టాడట.. ‘ఏంటి? మోహన్? “ అని గట్టి గా అడిగేసరికి అతనికీ ఇంకేమనాలో తెలియక ఊరుకుండిపోయాడట...

తర్వాత మోహన్ చెప్పుంటాడు., “నా కోడ్ ని అన్నేసి మాటలన్నాడు కదా.. అందుకని నేనున్న పరిసరాల్లోకి కొంతకాలం ఇక రాడు..” అని ఆయనా నవ్వేశాడు.

“అది సరే.. మొన్న నన్నేమన్నాడో తెలుసా? “ ఇంకా కంటిన్యూ చేస్తూ..

ఆసక్తి గా అందరం చూస్తూ ఉన్నాం..

“ఈ నెలంతా శనివారాలు కష్టమర్ కి డ్యూటీ మీద ఉంటాను.. కానీ, వచ్చే నెల నాలుగు రోజులకి సెలవ కావాలి అన్నాడు..”

నేనూ సరే అన్నాను. అలా కాదు, రాసిమ్మన్నాడు. ఎందుకు? నీకు నమ్మకం లేదా? అని అడిగాను..”

“మీ మీద నమ్మకం ఉంది. రేప్పొద్దున్న మిమ్మల్ని ట్రాన్సఫర్ చేస్తే? అలాగే, మీకేదైనా అనారోగ్యమో, ఆక్సిడెంటో జరిగితే? అన్నాడు”

ఎవ్వరమూ, గట్టిగా నవ్వలేదు.. కానీ AK నెమ్మదిగా ఇలాంటి మాటలు మాట్లాడటం తగ్గించాడు.. కొద్ది, కొద్దిగా సాఫిస్తికేటేడ్ అయ్యాడు.. అయినా ఒక్కోసారి అప్రమత్తం గా ఉండనప్పుడు పాతకాలపు ఆర్ముగం బయట కి తొంగి చూస్తూనే ఉంటాడు..చాలా సార్లు ఇతరుల లంచ్ బాక్సుల్లోంచి తిని, ‘బాగుంది బాగుంది’ అన్నా... ఒక్కోసారి ‘అబ్బా! ఈ సొరకాయ కూర డంబ్ గా ఉంది. నేను తినలేను..’ అని, మళ్లీ “Actually... blah blah” అని ఏదో చెప్తూ, సరిదిద్దుకుంటూ...

అదీ మా ఆర్ముగం రెండో ముఖం.. ఇలాగ తన గురించి బ్లాగు లో రాయనిచ్చినందుకు ధన్యవాదాలతో.. ఆర్ముగం ఇంకో కోణం తో మళ్లీ వస్తా..22 comments:

subha said...

"అటు వాళ్లూ, ఇటు మనం, తవ్వేస్తే.. భూమి లోంచి ఒక ముక్క.. పడిపోతుందా? I am confused.. చూడాలి!"
‘You can not transfer nomination from dead person : ) ‘ అని ఎర్రర్ మెసేజ్ వస్తోంది...”
“మీ మీద నమ్మకం ఉంది. రేప్పొద్దున్న మిమ్మల్ని ట్రాన్సఫర్ చేస్తే? అలాగే, మీకేదైనా అనారోగ్యమో, ఆక్సిడెంటో జరిగితే? అన్నాడు”
బాబోయ్ పొట్ట పగిలిపోయేట్టుగా ఉందండీ.. నవ్వు ఆగడం లేదసలు. కేక పుట్టించారుగా అసలు..

Unknown said...

*మీ మీద నమ్మకం ఉంది. రేప్పొద్దున్న మిమ్మల్ని ట్రాన్సఫర్ చేస్తే? అలాగే, మీకేదైనా అనారోగ్యమో, ఆక్సిడెంటో జరిగితే? అన్నాడు*

ఇలా ఆర్ముగం ఒక్కరే కాదు, చెన్నాయ్ లో పని చేసేటప్పుడు, నా తమిళ మిత్రులు ఎప్పుడు ఇటువంటి వాదన చేసేవారు. సాఫ్ట్ వేర్ కంపేనీలో మేనేజర్ ఏ పనైనా చేయమని అడిగితే మైల్ లో రాయండి అని అనేవారు. ఇది తమిళ తంబీల స్పెషల్. అరవం వారితో పని చేస్తే బుర్ర వేడెక్కుతుంది. సీటు కదలకుండా గమ్మేసుకొని కూచొని పని చేస్తారు. ఆర్ముగం కొంచెం మంచోడులాగే ఉన్నాడు. ఇతరులను విసిగించినట్టు లేడు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీ ఆర్ముగం నిజం గా ఉన్నాడా? నాకు అనుమానం గా ఉంది. ఉంటే ఆయన్ని కలుసుకోవడాని కైనా బెంగుళూరు వస్తాను. ఒక గంట ఆయన తోటి మాట్లాడితే నేనో పాతిక టపాలు వ్రాసుకోవచ్చు.

అన్నట్టు డయాగ్నల్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. అన్ని వందల కిలోమీటర్స్ ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు కానీ వందో/వెయ్యో ఏళ్లకి..... అ.హా
బాస్ గారిని కమిట్ చేయించడానికి pl. see and approve అని మేమూ నోట్ పంపేవాళ్లం....దహా

బులుసు సుబ్రహ్మణ్యం said...

డయాగ్నల్ & పేర్లల్ డ్రిల్లింగ్ అని చదువుకోమని మనవి.

జ్యోతిర్మయి said...

"ఈ పార్ట్ రాసిన వాడు కాస్త గట్టి వాడనుకుంటా.. ‘You can not transfer nomination from dead person : ) ‘ అని ఎర్రర్ మెసేజ్ వస్తోంది...”
కృష్ణప్రియ గారూ నవ్వడం అపేసరికి కాఫీ చల్లారిపోయింది. అంతా మీ వల్లే..

DG said...

Went back to old Armugam story about his wife. Felt tears rolling down my cheeks and had to close browser. Somewhere in a book I read this kind of people in world is what makes us feel better to still live in it, despite all the junk we all create. What a character!

శ్రీవిద్య said...

Hilarious

Zilebi said...

అమాయకత్వము, అతి తెలివి, అరవతనమునూ ! మరో ముఖం బాగున్నది.
ఆరుముగములు వచ్చినచో మీరు

Tuesdays with Morie

లాగా ఒక పుస్తకం ప్రచురించవచ్చు!

మధురవాణి said...

:)))))))

Zilebi said...

కృష్ణ ప్రియ గారు,

బులుసు గారికి వెంటనే ఆ ఆరుముగాన్ని పరిచయం చెయ్యండి మరో ప్రభంజనం మొదలవుతుంది- తెలుగు అరవ కామెడీ కొండాట్టం !

కృష్ణప్రియ said...

@ శుభ,

థాంక్స్!

@ unknown,

:) నాతో పని చేసిన వారు చాలా వరకూ సెన్సిబుల్ గానే ఉండేవారు, ఒకరిద్దరు తప్ప. మీరనగానే గుర్తొచ్చింది.. పక్క క్యూబ్ లో ఉన్నా, మెయిల్ పంపకపోతే, చేసిన వర్క్ లెక్క లోకి రాదనుకుని, చేసేవాళ్లు కాదు కొందరు..

@ బులుసు గారు,

ఆర్ముగం ఉండక పోవటమా? నాకున్న కొద్దిపాటి స్నేహితుల్లో అతనొకరు. బెంగుళూర్లో లేరు,యూరోప్ లో ఉన్నాడు.
:) కలవాలంటే మళ్లీ మీరూ పారిస్ ప్రయాణం కట్టాల్సిందే

కృష్ణప్రియ said...

జ్యోతిర్మయి గారు,
: ) థాంక్స్!
DG గారు,
ధన్యవాదాలు!
ఆవిడ ఆర్ముగం తల్లి. రిమార్కబుల్ లేడీ.. ఆవిడ తో ఒకటి రెండు సార్లు మాట్లాడాను..
@ శ్రీ విద్య,
: ) Credit goes to AK

కృష్ణప్రియ said...

@ జిలేబి,

:) పుస్తకమా? ధన్యవాదాలు!


@ మధురవాణి,

:))

@ జిలేబి మళ్లీ,

:) అవును.

Zilebi said...

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్

బులుసు గారి పారీసులో ఆరుముగం తొ వాక్ ది టాక్ - రేపే విడుదల

కొత్తావకాయ said...

:) nice!!

రసజ్ఞ said...

"అటు వాళ్లూ, ఇటు మనం, తవ్వేస్తే.. భూమి లోంచి ఒక ముక్క.. పడిపోతుందా? I am confused.. చూడాలి!"
మా అక్క పుట్టినప్పుడు మా ఇంట్లో గడియారం అనేదే లేదు. మా నాన్న బయట నుంచుని, చంటి పాపాయి ఏడుపు వింటుండగానే, మా ఊరు లోంచి వెళ్లే ఏకైక ఎక్స్ ప్రెస్ బండి అదే సమయానికి వెళ్లింది. తర్వాత జాతకం రాయించేటప్పుడు ఆ రైలు మా ఊరు చేరే సమయం తెలుసుకుని పంతులు గారితో రాయించాం..
ఈ పార్ట్ రాసిన వాడు కాస్త గట్టి వాడనుకుంటా.. ‘You can not transfer nomination from dead person : ) ‘ అని ఎర్రర్ మెసేజ్ వస్తోంది...”నవ్వు ఆపుకోలేకపోతున్నాను!
నాకు అస్సలు చాయ్ తాగే అలవాటే లేదు కాని మన ఆర్ముగం గారి కబుర్లని వినడానికయినా మీతో పాటు రావాలనిపిస్తోంది!

Sravya Vattikuti said...

హ హ :))
ఆర్ముగం అసలు హిప్రో క్రసి లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారన్న మాట చాలా నచ్చారు , ఈ సారికి కలిసినప్పుడు నా తరపున ఈ ముక్క ఆయనకి చెప్పండి :)))
బులుసు మాష్టారు డయాగ్నల్ డ్రిల్లింగ్ వగైరా ఉన్నాయని ఈ పార్టు చదివినంత శ్రద్ద గా ముందు పార్టు చదవాలా అందుకే ఇంకా ఆర్ముగం బెంగళూర్ లో ఉన్నారు అనుకుంటున్నారు అ.హా .

Kathi Mahesh Kumar said...

:) :) :) :)

Chitajichan said...

Krishna Akkayya... nenu meeku pichi pichi fan ni ayinpoyaanu...

mee gurtu gaa mee pen adugudaamu anukunaanu .. kaani meeru keyboard vaadutaaru kada... mee keyboard ivvandi mee gurtuga ,,, just kidding..I love reading all your posts. mee blog office PC lo , na personal lappy lo book mark chesi untundi... roju office ki velaaka.. emails kanna mundu.. office applications tho paatu, mee blog kuda open chesi pedatanu.. aa roju lucky ayite podunne.. first coffee sip chestu... mee new post chadive bhaagyam dorukutundi. meeru ALL in ALL. Super Woman. itu job atu pillalu, illu, and this blog maintain cheytam choostunte chala muchata vestundi. meeku manchi time management cheytam vachi undaali. mee posts kosam roju eduru chuse mee abhimaani.

Mauli said...

అంటే అన్నామంటారు కాని, ఏదో స్మార్ట్ గా చేసాడని చెప్పకుండా అమాయకత్వం , అతి తెలివి అనేస్తారా ...కి కి కి నేను కూడా విప్రో లో ఇదే పని చేసా . ఆన్సైట్ కి వచ్చాక ఏదో ప్రొఫైల్ ఫిల్ చెయ్యమన్నారు. బ్యాంకు అకవుంట్ నంబర్ తప్పకుండా పెట్టాలి. మనకి అప్పటికి ఉండదు కాబట్టి టీము లో ఎవరో ఒకరిది ఇవ్వొచ్చు(ట).అలా అడగడానికి మొహమాటం వేసి , dummy నంబర్ పెట్టేసా,.౨ వారాలకి సాలరి స్లిప్ వచ్చింది అదే అకవుంట్ కి :)). హి హి ...మా మేనేజరు, టీము నన్ను చీవాట్లేసినా నేను మాత్రం బగ్గు పంపించాను, అకవుంట్ నంబరు కి mandatory setting తీసేయ్యమని చెప్పేశారు . :))

కృష్ణప్రియ said...

@ జిలేబి,
హ్మ్మ్ రేపే విడుదల అన్నారు నాలుగు రోజు అయింది.
@ కొత్తావకాయ,: )
థాంక్స్!
@ రసజ్ఞ,
Credit goes to AK! చాయ్ తాగక్కరలేదు. ఊర్కే కబుర్లు వినచ్చు..నేనూ ఈ కబుర్లు విని ఆరేళ్లు దాటిపోతోంది :- (
@ శ్రావ్య,
: ) అవును. అస్సలూ హిపోక్రసీ అనేది లేకుండా ఉండేవాడు. ఇప్పుడు కొంత మారాడు లెండి. ఓసారి సొరకాయ కూర లంచ్ లో తీసుకెళ్లాను. కొద్దిగా షేర్ చేశాను. తిని.. ‘నువ్వు ఇంత చప్ప కూర చేసినప్పుడు, కనీసం , మినప్పప్పు, కర్వేపాకయినా పోపు పెట్టవు! చాలా డంబ్ గా ఉంది..’ అన్నాడు. ఇప్పటికీ, ఎప్పుడు సొరకాయ కూర చేసినా ఆ వ్యాఖ్య గుర్తొచ్చి నవ్వొస్తుంది.

కృష్ణప్రియ said...

@ మహేశ్ కుమార్,
థాంక్స్! మళ్లీ రేటింగ్ పెరిగినట్టుంది. Thanks to AK!

@ Chitajichan,
నా బ్లాగ్ కి తొలి సారి వచ్చినట్టున్నారు. స్వాగతం! మీకు నా రాతలు నచ్చినందుకు సంతోషం! You made my day!

@ మౌళి,
సరే .. ‘ఏదో స్మార్ట్ గా చేశాడు’ : ) బాగుంది మీరు కూడా ఏకే టైపేనన్న మాట .. కానీ అలా ఎలా పెట్టారు? LOL...

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;