Wednesday, September 21, 2011 49 comments

వావ్! నేను తెల్లవారుఝామున కన్న కల నిజమైంది....విజయ గర్వం తో జై జై ద్వానాల మధ్య.. నాలుగు వైపులా జనాలు కరతాళ ధ్వనులు.... ఒక చేతిలో ఖడ్గం.. రెండో చేతిలో రథం పగ్గాలు. రథాన్ని ఆపి శిరస్త్రాణం తీసి,కవచాన్ని వదులు చేసి దిగాను. నా చేతిలో ఉన్న వస్తువుల్ని ఇద్దరు ముగ్గురు అందుకున్నారు.. దుమ్ముకొట్టుకుపోయిన,అక్కడక్కడా చిరిగిన బట్టలు, చిన్నపాటి గాయాలు. జుట్టు చెదిరి, వొళ్లు నొప్పులు .. బురద తో నిండిన పాదరక్షలు.. వెనక్కి తిరిగి చూశాను. చాలా మంది ఇంచుమించు నాలాగే.. యుద్ధం లొ పోయిన వారు పోగా.. కొందరు క్షతగాత్రులై చికిత్సా శిబిరాలకి తరలి వెళ్లిన వారు కొందరైతే.. రథాలు విరిగి, వాహనాలకి, శరీరాలకి గాయాలయినా.. కొండలూ, కోనలూ, నదులూ దాటి, విజయాన్ని చేజిక్కించుకుని ఆనందం చిందుతున్న మొహాలతో నా వాళ్లు నా వెనక..‘కృష్ణా..లే.. మళ్లీ లేటయింది అని గోల పెడతావు.. నువ్వు లేస్తే కానీ.. పిల్లలు లేవరు’ అని మా వారు.. ‘ఆహా! ఇదంతా కలయా!..తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమౌతాయంటారు.ఐతే ఇవ్వాళ్ల యుద్ధం చేస్తానా? రాత్రంతా వర్షం కురిసినట్టుంది.. సరే లే జీవితమే ఒక యుద్ధం.... ‘ అనుకుంటూ లేచి పనుల్లో పడ్డాను.

ఎవరితో అవుతుంది యుద్ధం? అత్తగారితో.. ఆవిడకా ఓపిక లేదు. నాకా తీరిక లేదు. పిల్లలతో, పక్కవాళ్ళతో,పని మనిషితో.. పాలు పోసే అబ్బాయితో.. మా వారితో.. ఫోన్లో స్నేహితులతో.. ఇలా సరదాకి..ఎవరితో అవవచ్చో ఆలోచించాను.

బాసు తో యుద్ధం అవుతుందేమో.. ఇవ్వాళ్ల.. లేక మా సింగం,నేనూ కలిసి టెస్ట్ టీం వాళ్లతో గొడవ పడం కదా.. అనుకుంటూ బయటకి స్కూటర్ తీశాను.. హెల్ మెట్, జాకెట్ వేసుకుని రివర్స్ చేస్తున్నాను. DRDO లొ సైంటిస్ట్ ఆవిడ కార్ లొ వెళ్తూ నా వైపు పలకరింపు గా చూసి నవ్వి..’ఏంటి? వర్షం రాత్రంతా వర్షం! స్కూటర్ మీద వెళ్తున్నారా? జాగ్రత్త!’ అంది. కొద్దిగా జంకు గా అనిపించింది కానీ ఎక్కుబెట్టిన రామ బాణాన్నీ, ఒకసారి బర్రు మనిపించిన స్కూటర్నీ ఇక వెనక్కి తిప్పే ప్రశ్నే లేదు.
కాస్త మెయిన్ రోడ్డెక్కా.. ఒక ఇరవై నిమిషాల తర్వాత పావు కిలో మీటర్ నడిచి ఆగింది బండి.. పర్వాలేదు.. ఇవ్వాళ్ల పెద్దగా ట్రాఫిక్ లేదు.. అనుకుని బండి పార్క్ చేశా నడి రోడ్డు మీద. పక్క స్కూటర్ ఆయన ఎవరితోనో.. ఫోన్లో కబుర్లు చెప్తున్నాడు.. ముందు మోటార్ సైకిల్ ఆయన షేవింగ్ కిట్ తీసి గడ్డం గీస్తున్నాడు. ఇంకో ఆవిడ హెల్ మెట్ తీసి దాంట్లో పాకెట్ లోంచి సన్నజాజులు గుమ్మరించి మాలలు కడుతోంది. నేను బ్యాగ్ తీసి చూస్తే.. ట్రాఫిక్ జాముల్లో చదువుకునే పుస్తకం కనపడలేదు. పోన్లే.. కాసేపు యోగా చేద్దాం అని మొదలు పెట్టాను.


కాసేపయ్యాక ఒక్కసారి గా హారన్ లు కొడుతున్నారు. ‘హమ్మయ్య.. ఇంకో రెండు ఇంచులు ముందుకెళ్లచ్చు.. అని మళ్లీ స్కూటర్ ఆన్ చేసి రెండించులు ముందుకెళ్లి ఆగి అటూ ఇటూ చూస్తున్నా రాత్రి మీటింగ్ అర్థ రాత్రి దాకా అయ్యింది. ఒక్క కునుకు తీద్దామా? అని కాస్త సెంటర్ స్టాండ్ వేసి బ్యాగ్ దిండు లా అడ్జస్ట్ చేస్తుంటే ‘హాయ్ కృష్ణా!’ అని మా ఎదురింటావిడ కార్ లోంచి పిలుస్తోంది. సరే కబుర్లేసుకోవచ్చు.. అని ఉత్సాహంగా ఆవిడ విండో దగ్గరకెళ్లి ఈ ఆదివారం చూసిన ఈ టీ వీ సుమన్ సినిమా ట్విస్ట్ కథ మొదలు పెట్టా.. ఆవిడ..’కృష్ణా! యూట్యూబ్ లొ ఉందన్నావు గా.. చూస్తాలే’ అని రెండు చేతులూ జోడించి దీనం గా అడిగింది. ‘అమ్మా! ఆశ! నువ్వు మళ్లీ ఇంత తీరిగ్గా దొరుకుతావా?’ అని మొదటి భార్య ఎంట్రీ దాకా చెప్పా.. మరి మొన్న వాళ్లింట్లో తమ్ముడి పెళ్లి ఫోటోలు దాదాపు ఏడు వందలు చూపించినప్పుడో?

 
ఇంతలో ఏ కమ్యూటర్ చేసిన వ్రత ఫలమో..అక్కడ ఆక్సిడెంట్ తాలూకు శకలాల్ని తొలగించి వదిలినట్టున్నారు.. ముందు నుండి ఒక హారన్ మోగింది.. అందరూ ఉత్సాహం గా బోయ్ బోయ్ అని ఒకటే మోత. ఒకేసారి అందరూ బండ్లు ముందుకురికించారు.


కళ్ళు మూసి తెరిచేలోగా అన్ని వైపులనుండీ బండ్లు... ముందుకు దూసుకుపోతున్నాయి. దుమ్ము మేఘం లా చుట్టూ దట్టం గా..
స్కూటర్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, కార్లు, టెంపో ట్రక్ లు, వాన్లు, బస్సులు, లారీలు, ఒకటేమిటి.. మధ్యలో పాదచారులు, వీళ్లు చాలదన్నట్టు మహా నగర సింహాలు (అవేనండీ గ్రామ సింహాలు/శునక రాజాలు) ఆవేశం తో రోడ్డు మీద.. బరి లోకి ముందడుగు వేస్తున్నాయి..
అదేదో యుద్ధం శంఖారావం ముందున్న సైన్యాధ్యక్షుడు చేయగానే.. సైన్యం అంతా వారి వారి శంఖాలు పూరించి శూలాలు పట్టుకుని వెళ్లే పాదచారులు, గుఱ్ఱాల మీద వెళ్లే వారు (ఆశ్వారూడులు), ఏనుగుల పై వెళ్లేవారు, రథాలనధిరోహించి రథ సారథి పై ఆధారపడి బాణాలూ అవీ సరి చూసుకునేవారు ముందుకి ఉరకలేస్తూ వేగం గా వెళ్తున్నట్టు..


ఒక్కసారి గా బల్బ్ వెలిగింది ఉదయపు కల నిజమైంది అని అర్థమైంది. టపటపా కన్నీళ్లు కారిపోయాయి. జ్ఞాన/ఆనంద/దుఃఖ భాష్పాలు కావవి.. దుమ్ము వల్ల కలిగిన కాలుశ్య భాష్పాలు. తుడుచుకుందామంటే శిరస్త్రాణం లోకి చేయి పెట్టి తుడవాలి. ఒక Ford I10 కీ, వాల్వో బస్సుకీ మధ్య ఉన్న అరమీటర్ గాప్ లోంచి అతి లాఘవం గా బండిని ఇరికించి ఇద్దరు డ్రైవర్ల చూపులూ, అరుపులూ, హాంకులూ విననట్టు, చూడనట్టు, నటిస్తూ ముందుకెడుతూ ఆలోచిస్తున్నా.. ఎలాగోలా ఇంటర్వ్యూ కాండిడేట్ వచ్చే సమయానికి చేరుకుంటే చాలు..ముందు ఒక కాల్ టాక్సీ శకటం వెళ్లి ఒక ద్విచక్ర వాహనాన్ని స్పృశించింది. ఒక చిన్న పాటి గొడవ ని పట్టించుకోకుండా..శకటం దెబ్బ తింది. ద్విచక్ర వాహన చోదకుడి కాలి కి గాయం తగిలి రక్తం కారుతోంది.. కరుణ తో కూడిన ఒక చూపు అరసెకను వారి వైపు విసిరి ముందుకేగుతూనే ఉన్నా. రింగు రోడ్డెక్కా! అన్ని దేశాల సైన్యం చిన్న చిన్న దారుల ద్వారా వచ్చి ప్రధాన రహదారి లొ కలిసినట్టు.. రోడ్డు రంగు కనిపించట్లేదు. అన్నీ వాహనాలే.
ఇంకా ఎక్కడైనా గాప్ దొరుకుతుందా అని చూస్తున్నా.. అబ్బే.. లాభం లేదు. చుట్టూ దుమ్ము మేఘం పలచబడుతోంది. గుండె లబలబ లాడింది.. ‘అంటే..మళ్లీ ట్రాఫిక్ జామా! అయ్యో!! పోన్లే బాబాయి కి ఫోన్ చేసి రెండు నెలలవుతోంది.. ఇప్పుడు చేసేస్తే సరి!’ అనుకుంటున్నా.. ‘అదేంటి? ఆ చివర జనాలు పోతున్నారే! అసలు అక్కడ మాత్రం ఖాళీ ఏదబ్బా!’ అని బండి ని అటువైపు ఉరికించా.. చూస్తే.. రోడ్డు పక్క ఉన్న కాలువ పైన రెండు బండలు వేసి అప్పటికప్పుడు తాత్కాలికం గా వేసిన అడ్డ రస్తా! మీద ఒక్కొక్కరు గా కాలవ దాటి సర్వీస్ రోడ్డు మీదకి చేరుతున్నారు. అద్భుతమైన టీం వర్క్! చాలా ఆనందం వేసింది. నేనూ వెళ్దామని చూశా.. కానీ.. కొద్దిగా భయం వేసింది. స్కూటర్ తూలితే.. మురికి కాలవ లోకే! కార్ల వారు, బస్సుల వారు ఇదంతా ఈర్ష్య గా చూస్తున్నారు.


నా వెనక శంఖారావాలు తారా స్థాయికి అందుకున్నాయి. వెనక్కి చూస్తే.. ‘ఆ వంతెన ఎక్కవేం!! ‘ అని కొందరు చూపులతో గద్దిస్తే.. కొందరు చేతులతో మార్గ నిర్దేశన చేస్తున్నారు. నేను వెళ్తే గాని వెనక వారు వెళ్ళలేరు. సరే అని నా వెనక బండాయన దిగి నా స్కూటర్ పడకుండా చూస్తానని మాటిచ్చాడు. బండ ఇలా ఎక్కానో లేదో..ఒక చక్రం ఇరుక్కుపోయింది. నలుగురు వచ్చి తీసి మళ్లీ రింగు రోడ్డు మీదకి తెచ్చేశారు. ఈలోగా.. ఇంత సాహసం చేసి బ్రిడ్జ్ కట్టి మరీ సర్వీస్ రోడ్డు మీదవెళ్లిన జనం మళ్లీ తిరిగి వస్తున్నారు. ముందు అంతా పైప్ లైన్ కోసం తవ్వేశారు ట. లాభం లేదట.


చతుర్చక్ర వాహన చోదకులు ‘బాగా అయింది!’ అన్న లుక్కు ఇచ్చి సంతృప్తి గా నిట్టూర్చారు. కానీ పట్టు వదలని విక్రమార్కులు ద్వి.చ.వా.చోలు (ద్విచక్ర వాహన చోదకులు) డివైడర్ మీద కెక్కించి ఎదురుగా వస్తున్నా ట్రాఫిక్ వైపు వెళ్దామని ప్రయత్నిస్తున్నారు.


ఇంతలో మళ్లీ శంఖారావం మ్రోగింది. అందరూ.. మళ్లీ ముందుకు.. ఒక్కసారి గా మళ్లీ ప్రకృతి పరవశించి, దుమ్ము మేఘం వెలిసింది, బురద ఫౌంటెన్.. చిమ్మింది. ప్లెయిన్ చుడీదార్ మీద మంచి డిజైన్లు ఏర్పడ్డాయి. చెప్పులు మీద చాక్లెట్ కోటింగ్ లా బురద చేరింది. ఏం చేస్తాం.. కొంతమంది అభినవ కర్ణులు తమ బండ్ల చక్రాలు బురద లొ కూరుకుపోయాయి. పక్క బండి వాడి బూటు కాలు కొట్టుకుంది. ‘ఒక్క సారి గా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు..’.. ఈ సినిమాల్లో ఎన్ని దెబ్బలు తిన్నా.. ఎలా మళ్లీ లేచి ఫైట్ చేస్తారబ్బా! అనుకున్నాను. అవున్లే..ఉత్తుత్తి నే తంతే అంతే.. పైగా లేచేదాకా.. కర్ణ కఠోరంగా స్పూర్తిదాయక గీతాలు పాడుతుంటే ఆపటానికైనా లేవాలి తప్పదు.

అభినవ భీష్మాచార్యులు ట్రాఫిక్ పోలీసు నిస్సహాయం గా చూస్తున్నారు.మరీ మడమలు దాటెంత ఎత్తు వర్షపు నీరు. అయ్యప్ప స్వామి లా లూనాల వాళ్లు కాళ్లు పైకెత్తేసారు. నేను ఒక అడుగు పైకి కాళ్లు పెట్టి ముందు వెళ్తున్న స్కూటర్ వెనకే జాగ్రత్త గా వెళ్తున్నా.. ముందర ట్రాఫిక్ మళ్లీ ఆగింది. అక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు. విధిగా ఆగి ప్రోగ్రెస్ చూసి ప్రతి ప్రయాణికుడూ/రాలూ తరించాలి గా.. చిన్న గాప్ ఉంది ఎదురుగా.. పడతానా? పట్టనా? భయం గానే ఉంది. వెనక బండి అతను హాంక్ చేస్తున్నాడు. ఇంకో నిమిషం ఆగితే దిగి హారన్ బదులు నన్ను కొడతాడేమో అని భయం వేసింది. గాప్ ఇచ్చిన వాడు గమ్యం చేర్చక పోతాడా అన్న ధీమా తో.. ముందుకు వెళ్లాను. డివైడర్ మీద ముళ్ల కంప గీరుకుని కమీజ్ పక్క కొర్రు, చేతి మీద ఎర్ర రక్తపు చార.. కనీసం ఇంకో నాలుగు మీటర్లు ముందుకొచ్చాం సంతోషం..పక్క బండి మీద వారు ఎవరో ఏసుక్రీస్తుకి మొక్కుకుంటున్నారు.. నేనూ ‘ఆమెన్’ అని నా దేవుళ్ళు రామ కృష్ణులని పూజించుకున్నా.


ఈలోగా అందరూ మెయిన్ రోడ్డు పక్కన గ్రామం లోంచి వెళ్తే బెటర్ అని అటుపోతున్నారు. నేనూ ఒక్క క్షణం ఊగిస లాడా.. కానీ.. మెయిన్ రోడ్డు మీద, అందునా రింగు రోడ్డు మీద, బురద లొ మునిగి, గాయం అయి, బట్టలు చిరిగి దుమ్ము కోటింగ్ తో ఉన్నా.. ఇంక చిన్న గుంతల రోడ్డు మీద వెళ్లి కొత్త సమస్యలనెదుర్కునే మానసిక స్థైర్యం, శారీరక బలం లేక వదిలేశా. ఇంకో అరగంట తర్వాత ఇంకో రెండు కిలో మీటర్ల దూరం వెళ్లాకా చూస్తే అర్థమైంది. నేను తీసుకున్నది సరైన నిర్ణయమని. అక్కడ రైల్ ట్రాక్ దాటాలి. రైలోస్తుంటే.. ఆఫీస్ తొందరలో ఎవరో దాటాలని పట్టాల కింద పడ్డారట! దానితో.. మళ్లీ అటు డీ-టూర్ అయిన జనాలు మా వెనక కలిసారని. బాధ తో హృదయం నిండి పోయింది.


ఉక్క గా.. చెమట గా కాసేపు హెల్ మెట్ తీద్దామని తీసి చేత్తో పట్టుకున్నా.. మళ్లీ శంఖారావం. దుమ్ము మేఘం.. బురద ఫౌంటెన్.. అలాగే ముందుకు పరిగెత్తిస్తున్నా బండి ని.

 
మా ప్రార్థనలు కాస్తా పొరపాటున వరుణ దేవుడు విన్నట్టున్నాడు..ఆయన కరుణించాడు. ఒకేసారి ఫెళ్ళున వాన. ‘వామ్మో నా లాప్ టాప్’ అనుకుని ఒడుపు గా జాకెట్ తీసేసి లాప్ టాప్ బాగ్ మీద కప్పి హెల్ మెట్ పెట్టేసుకున్నా. ముందరేమవుతుందో తెలియదు. వెనక్కెళ్ళటానికి లేదు. ఎవరో అండర్ పాస్ కోసం తవ్విన గుంట లొ పడ్డారని అంటున్నారు. ‘అయ్యో’ అనుకోవటం తప్ప చేసేదేదీ లేదు. వర్షం వల్ల గుంటల్లోకి ధబ్ ధబ్ మని పడుతూ లేస్తూ మా ఆఫీస్ గేట్ దగ్గర కి చేరుకొని ఆత్రం గా షెడ్ కిందకి వెళదామంటే.. ‘అబ్బే! మా సెక్యూరిటీ వాళ్లంత కర్తవ్య నిష్ఠ కలిగిన వారు యావద్ప్రపంచం లొ ఉండరాయే. నిజమే.. ఈ ట్రాఫిక్ వల్ల ఉన్న ఆవేశం తో బిల్డింగ్ కూల్చేస్తే! చెప్పలేం..

అసలు ఈ నోబుల్ పీస్ ప్రైజులు, సెయింట్ హుడ్లూ, మఠాలకి పీఠాధిపతుల పోస్టులూ గట్రా ఇచ్చే ముందు ఈ ట్రాఫిక్ టెస్ట్ చేసి చూడాలి. ఈ ట్రాఫిక్ లో ఒక్క తిట్టు వాడకుండా, ఒక్క రూలైనా బ్రేక్ చేయకుండా.. చిరునవ్వు చెదరకుండా, ప్రశాంత చిత్తం తో ఐదు కిలో మీటర్లు రెండు గంటల్లో ప్రయాణం చేస్తేనే ఇవ్వాలని.. ఏమంటారు?


ఆ వర్షం లొ బ్యాగ్ లోంచి ఐడీ కార్డ్ తీసి చూపించి ముఖాన్ని మాచ్ చేయటానికి హెల్ మెట్ తీసా.. సెక్యూరిటీ వాళ్లు నా బ్యాగ్ లో ఏమైనా మారణాయుధాలు తెచ్చానేమో అని చూస్తున్నారు.. వెనక్కి తిరిగి చూశా..
అచ్చం నా కల లాగానే!!!
ఒక చేతిలో ఖడ్గం.. రెండో చేతిలో రథం పగ్గాలు. రథాన్ని ఆపి శిరస్త్రాణం తీసి,కవచాన్ని వదులు చేసి దిగాను. నా చేతిలో ఉన్న వస్తువుల్ని ఇద్దరు ముగ్గురు అందుకున్నారు.. దుమ్ముకొట్టుకుపోయిన,అక్కడక్కడా చిరిగిన బట్టలు, చిన్నపాటి గాయాలు. జుట్టు చెదిరి, వొళ్లు నొప్పులు .. బురద తో నిండిన పాదరక్షలు.. వెనక్కి తిరిగి చూశాను. చాలా మంది ఇంచుమించు నాలాగే.. యుద్ధం లొ పోయిన వారు పోగా.. కొందరు క్షతగాత్రులై చికిత్సా శిబిరాలకి తరలి వెళ్లిన వారు కొందరైతే.. రథాలు విరిగి, వాహనాలకి, శరీరాలకి గాయాలయినా.. కొండలూ, కోనలూ, నదులూ దాటి, విజయాన్ని చేజిక్కించుకుని ఆనందం చిందుతున్న మొహాలతో నా వాళ్లు నా వెనక..


Monday, September 12, 2011 57 comments

మాకూ ఉన్నాయండీ రక్తం లో పాటలు.. కానీ :)


“పాటలు పాడటం మా రక్తం లో ఉంది! మా తాతగారు ... మా అమ్మగారు.. మా మేనమామ... “ టీ వీ లో ఎవరో చిన్నమ్మాయి పట్టు పరికిణీ కట్టుకుని నానాలంకార భూషితురాలై ఏదో పాటల పోటీ లో చెప్పుకుపోతోంది. ‘తస్సదియ్య’ రక్తం లో ఉందిట  అని నవ్వుకున్నా. ఇంకో చానెల్ పెడితే అక్కడా ఇదే సోది.. ముగ్గురేసి జడ్జిలు కూర్చుని తీర్పులు.. పాటలు, డాన్సులు, అగ్ని లో దూకటాలు, వంటలు, హాస్యం, ఏంటేంటో ప్రక్రియల మీద పోటీలు. చూస్తూ చూస్తూ.. ‘ఓర్నాయనోయ్.. నాకు దొరికేదే తక్కువ సమయం. ఏదైనా తెలుగో, హిందీ యో మంచి కార్యక్రమం ఏదైనా చూద్దామంటే ఇదేమి గోల రా బాబూ.. పోనీ మద్యాహ్నం పూట ఎప్పుడైనా ఇంటినుంచి పని (Work From Home) చేస్తూ, భోజన సమయం లో కనీసం ఏదైనా చూద్దామని కూర్చుంటే వంద రకాల వంటల ప్రోగ్రాములు.. కాదంటే ఆడవాళ్ళకి నాగార్జున ముక్కూ, వరుణ్ సందేశ్ మూతీ చూపించి గుర్తించమనటం...


‘హతవిధీ.. నాకు ఈ జన్మకి మంచి ప్రోగ్రాం చూసే అదృష్టమే లేదా? స్కూల్ రోజుల్లో మొదట్లో ఇంట్లో టీవీ లేదు. ఉన్నప్పుడు కళ్ళు పాడవుతాయి అని వద్దనటం, తర్వాత, చదువులని, ఆ తర్వాత హాస్టల్ లో ఉన్న రెండు చానళ్ళ కోసం గాంగ్ వార్లు జరుగుతుంటే భరించలేక బయట పడటం.. తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగం లో డాలర్ల ఉద్యోగం ఇప్పుడు మనం చూస్తే పిల్లలూ చూస్తారని భయం..” చానళ్ళు నొక్కుతూ పోతుంటే మళ్లీ మొదటికి వచ్చింది.. ఇంకో అబ్బాయి తలకి ఒక గిన్నెడు నూనె రాసి ఒక మంచి చమక్ చమక్ చుడీదార్ వేసి..’మా కుటుంబం ఒక మ్యూజికల్ ఫామిలీ అండీ’ అంటున్నాడు. నవ్వొచ్చింది. అందరూ మ్యూజికల్ ఫామిలీ లే..


సరే కళ్ళు మూసుకుని ఏదో ఒక చానెల్ నొక్కా..’యాదోమ్కీ బారాత్ నిక్లీ హై ఆగే దిల్ కె ద్వారే’ అన్నదమ్ములు తిరిగి కలుసుకుని పాడుకుంటున్నారు. చిన్నప్పటి ఒక విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది.


మా తమ్ముడు మహా క్రియేటివ్. మేమంతా ఒకసారి దూర్ దర్శన్ లో ఈ సినిమా వచ్చినప్పుడు చలించి ఏదైనా ఒక కుటుంబం పాట పెట్టుకోవాలి ని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏడో క్లాస్, చెల్లి నాలుగో క్లాస్.. తమ్ముడు ఒకటో క్లాస్. అప్పుడే ‘ఫలానా వారి సంగీతానికి రాళ్లే కరుగుతాయి’ అని పుస్తకం లో చదివాం. అర్జెంట్ గా మా కుటుంబం పాట రెడీ చేసేసాం.


‘రాళ్లే కరుగుతాయి మా పాటకూ..మా పాటకూ మా పాటకూ..


కరిగి పారుతాయి మా పాటకూ మా పాటకూ మా మాటకూ


పారి వరదలౌతాయి మా పాటకూ మా పాటకూ మా పాటకూ’


దీనికి ఆనందం గా ఉన్నప్పుడు ఎలా పాడాలో.. మళ్లీ మాలో కనీసం ఒక్కరు తప్పి పోతే..దానికి ఏసుదాసు దుఖం గా పాడినట్టు ఎలా పాడాలో ప్రాక్టీస్ చేశాం.


ఒకేరకం లాకెట్లు చేయించమని అడిగాం కూడా మా అమ్మని.. ‘అది చాలా ఖర్చైన పని. దానికి బదులు గా.. అసలు మేళా లూ, సంతలూ, జన సమ్మర్తమైన ప్రదేశాలకు తీసుకెళ్లను.. మీరేం తప్పిపోరు లెండి..’ అని భరోసా ఇచ్చేసింది. చాలా నిరాశ గా.. సరే ఏం చేస్తాం? ఒకవేళ తప్పిపోతే కరెక్ట్ గా చార్మినార్ మూడు మినార్ల దగ్గర నుంచుని కరెక్ట్ గా అమ్మ పుట్టిన రోజున ఈ పాట పాడుతూ వచ్చి కౌగలించుకుని కన్నీరు కార్చాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయించుకున్న రోజు, పదేళ్ల తర్వాత జరగబోయే ఆ సన్నివేశం తలచుకుంటేనే మా గుండెలు భారం అయిపోయాయి. మొన్నీ మధ్య మా తమ్ముడు ఏదో పని మీద మా ఊరొచ్చినప్పుడు సరదాగా ఆ పాట పాడుకున్నాం... ఆ క్లిప్పింగ్.


అయినా చిన్నప్పుడు మా ఇంట్లోనూ.. సినీ గాన సరస్వతి ప్రతి గది లో తచ్చాడుతూ ఉండేది.
వంటింట్లో ‘సుశీల’ అమ్మ!


మా అమ్మ వంటింట్లో.. తాళింపు లో ఆవాలు తాళలేక చేసే చిటపటలనీ, గ్రైండర్ బర్రుమని ఉరమటాన్నీ, కుక్కర్ ఘీ మని విజిల్ ఎత్తి మరీ అరవటాన్నీ, పాత ఎగ్జాస్ట్ ఫాన్ ఏమీ అనలేక ఖాట్ ఖట్ మంటూ పళ్ళు కోరుక్కోవటాన్నీ, తాళాలు గా బాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా భావించి ‘వినుడు వినుడు రామాయణ గాధా!’ నుంచి ‘నిన్నటి దాకా శిలనైనా..’ దాకా పాడుకుంటూ..


‘అమ్మా! ఆకలేస్తోంది’ అని అరిస్తే.. టేబుల్ మీద అన్నం పెడుతూనే.. ‘అన్నము లేదు.. కొన్ని మధురాంబులున్నవి’.. అని పద్యం ఎత్తుకునేది... ఎవరైనా స్నేహితులు వస్తే.. వంటింట్లోంచి వినబడే గాన మాధుర్యాన్ని విని ఒక్కోసారి కిసుక్కుమని నవ్వితే.. ‘హమ్మా!! ఇంకోసారి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పాడావంటే ఊరుకోను..’ అని ఉక్రోశపడితే అలాగే లే..’పాటలైతే వచ్చు గానీ.. పాడనైనా పాడగలనూ.. పాపిష్టి సిగ్గు నన్ను పాడనీయదూ’ అని గమ్మున ఊరుకుంటాలే అని వెక్కిరించేది.


దేవుడి గది లో ‘నాగ(అ)య్య’..


దేవుడి గది లో ‘నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత..’ అంటూ నరసింహ శతకము, ‘జయ హనుమాన జ్ఞాన గుణ సాగర’ అంటూ హనుమాన్ చాలీసా.. మార్ధవ్యం, రాగ, తాళం,శృతి ల్లాంటి అంశాలతో పని లేకుండా.. పాడినా ఆయన పారవశ్యం,భక్తి, ఆయన మీద మాకున్న ప్రేమ వీటన్నింటి తో మాకు అద్భుతం గా తోస్తూ ఉంటాయి మరి 


స్నానాల గది లో ‘చిత్ర‘ విచిత్ర గానం చేసే చెల్లి.


షవర్ భోరున ‘బాబోయ్’ అంటూ బాత్ రూమ్ (కన్నీ) నీటి జల్లుల ధారల తో నింపేసినా.. వాటర్ హీటర్ పెట్టిన బకెట్ లో నీళ్లు రక్తం మరిగినట్టు సల సల మరగినా. బయట నుండి ‘ఇంకెంతసేపు?మేమూ స్కూళ్ళకి వెళ్లాలి ’ అంటూ అరిచే మా అరుపుల్ని కోరస్ గా, తలుపు ధన ధన మని మేము చేసే బాదుళ్లని లయ గా వాడుకుంటూ దానికి తెలిసిన పాటలన్నీ పాడుకుంటూ.. బయటకొచ్చాక ఎలాగూ మాకు ‘ఎటాక్’ చేసే సమయం ఉండదు అనే ధైర్యం అనుకుంటా.. ‘అయ్య బాబోయ్.. ఇంకా లిరిల్ సబ్బు అడ్వర్టైజ్మెంట్ లో ఉంది ఇది.. ఎప్పటికి ఇంక టీవీ సీరియళ్ల పాటలు అవ్వాలి, ఎప్పటికి సినిమా పాటల కెళ్ళాలి.. ఇలాగ ఉండేవి మా బాధలు..


గడప ని మీటితే.. గాన మాలపించే ‘బాలు’డు మా తమ్ముడు ..


నాయనమ్మ పాడే భగవంతుడి లీలలు నాన్నగారు పాడే శతకాలతో, అమ్మ పాడే పౌరాణికాల, సాంఘికాల, పాత తరం రేడియో పాటల తో, చెల్లి పాడే పాత హిందీ, ఆంగ్ల మెలడీలతో, కొత్త సాఫ్ట్ మ్యూజిక్ తో ఒక రకమైన సంగీతానికి అలవాటు పడిన ఇంట్లోకి ‘బంగారు కోడి పెట్ట’ ని తెచ్చి పరుగులెత్తించాడు,..’క్క్క్క్క్క్క్క్ క్క్కాలేజీ స్టైలే... అంటూ.. విప్లవం సృష్టించిన వాడు మా తంబే! పాపు, జాజు, ఒకటేంటి.. గిన్నెలు, చెంచాలు, గంటెల తో దరువు వేసి.. పాటలే పాటలు.. చివరికి చదువు కూడా వాడి ఫేవరేట్ పాటల్లా పాడుతూ చదివేవాడు..


అలాగని మేమెవ్వరమూ పండితులం కాదు. ఏ టాలెంట్ పోటీలు పెట్టినా ఆఖరి స్థానం మాదే...


లక్కీ గా మా నాన్నగారు మధ్యతరగతి కి చెందిన వారవటంతో.. ఊరి మధ్య ఇల్లు కొనలేక పోవటం వల్ల మా గాన ప్రభంజనానికి అడ్డూ, అదుపూ లేకపోయింది అనుకుంటాను. చుట్టుపక్కల ఇళ్లు ఒక్కొక్కటి గా రావటం, మేమూ రెక్కలొచ్చి చదువులకి ఇల్లు వదలటం.. కానీ ఎప్పుడొచ్చినా పాపం ...


మా రక్తం లో పాట, చుట్టుపక్కలవాళ్ల రక్తానికి పోటు గా రూపాంతరం చెందుతుంది.


గత ట్రిప్ నుండి ఈసారి దాకా కొత్త గా విన్న పాటలని ఒకరికొకరు వినిపించుకునేవాళ్లం.. బస్సుల్లో సీట్లు దొరికినప్పుడు ఆ పాట విన్నావా? ఈపాట తెలుసా.. ‘ అని అప్ డేట్ అయిపోయేవాళ్లం.. పారడీలు కట్టేసుకుని మురిసిపోయేవాళ్లం. మాకు తోడు మా కజిన్లు వచ్చారంటే ఇంక గానా బజానా యే..


‘గాలి వాన లో.. వాన నీటిలో పెళ్లి భోజనం.. పప్పు ఎక్కడో కూర ఏమిటో తెలియదు పాపం..


అది పప్పు చారనీ తెలుసూ.. అందులో ఉప్పు లేదనీ తెలుసూ.. పప్పు లేకున్నా, ఉప్పు లేదన్నా.. తినక తప్పదని తెలుసూ.. ‘ అని జేసుదాసు పాట కి పారడీ ఒకరు వినిపిస్తే..


‘ఇదేమి సబ్బూ ఇది రిన్ను సబ్బూ.. అదేమీ రిన్నూ.. అది సూపర్ రిన్నూ..


సబ్బుకి సబ్బే సాటబ్బా.. డబ్బుకి డబ్బే చెల్లబ్బా..’ లాంటి చిరంజీవి పాటలని ఖూనీ చేసేది ఒకరూ..


గో కాట్ కోసం స్కై కాశమల్లే వేయిటాను యువర్ అరైవల్ కై..


యూ దేరూ, ఐ హియరూ, సాంగ్ దేరూ, హార్ట్ హియరూ.. ‘ అంటూ విరహ గీతాన్ని ఎత్తుకునేది ఇంకొకరూ..


ఒకసారి కాలేజ్ లో ‘ఆడవారు’ అనే థీం తో పాటల పోటీ. అబ్బా.. ఆడవారి మీద..పాటలు అంటే మరీ సీరియస్ పాటలు దుఖం తో.. అని అందరూ అనేసుకున్నారు. సగం మంది ‘లేచింది నిద్ర లేచింది మహిళా లోకం..’, గుండె పిండి చేసి.. కర్చీఫ్ లు తడిసి ముద్దలు చేసే సినిమాల స్పెషలిస్ట్ విసు గారి సినిమా పాట అనుకుంటా ‘ఆడదే ఆధారం..మనిషికి ఆడదే...’ అని కొందరూ.. ఒకమ్మాయి..’జయ జయహే మహిషాసుర మర్ధిని..’ ఇంకో అమ్మాయి ‘అఖిలాండేశ్వరీ..చాముండేశ్వరీ’. ఇవన్నీ వద్దు.. ఇంకేమైనా పాడితే బాగుంటుంది.. అని అనుకుంటే.. మా అమ్మ.. పక్కాంటీ నడగవే అంది.. ఆవిడ ‘నల్ల పెగ్మణీ.. మిగ నల్ల పెగ్మణీ.. తాయ్ నాట నాగరీగం పేణి..నడిపవలఎవరో ఆవళే’ అని నేర్పింది. తీరా చూస్తే.. ‘మంచి చిన్నదీ.. బహు మంచి చిన్నదీ’ అని ..


ఇలా కాదురా.. ఏదైనా ‘హట్కే ‘ కావాలి రా.. అన్నాను తమ్ముడితో.. అంతే.. ఒకళ్ల పాట మనం పాడటమేమిటి? నేనే కడతా పద’ అన్నాడు. ‘అది కాదురా బాబూ.. అందరికీ తెలిసిన భాష లో కాదురా..’ అన్నాను. ఒకళ్ల భాష మనం వాడేదేమిటి.చలో.. నేనే.. రాసేస్తా.. ఒక పాట.. నా భాష లో..’ అని ఒక పాట ఆశువు గా రాసేసి రాగ యుక్తం గా పాడేసాడు. వార్నీ.. అనుకున్నా. పైగా.. అస్సాం పక్కనున్న అడవుల్లో ఒక తెగ.. ‘చిన్బోయ్’ అని వాళ్ల పాట.. అనీ.. సరిపోతుంది. వాడిని ముద్దుగా చిన్నా అని పిలిచేవాళ్లం కదా.. చిన్బోయ్. అంతే కాస్త వాళ్ల భాషల్లానే అనిపిస్తుంది కదా.. అని లాజిక్కు.. అంతే..ఇక ఆ పాట ధైర్యం గా పాదేసా కాలేజ్ లో .. కన్సోలేషన్ ప్రైజ్ తో పాటు ఇంత మంచి పాట.. అంత దూరపు తెగ పాట మీకెక్కడిది? అంటే మళ్లీ దానికో కథ కట్టుకుని  ...


ఆ లిరిక్స్ మీకోసం..

దద్దన్ బోలీ రే.. దద్దన్ బోలీ రే..


షోట్తో కోతే మోరీ కీచే దోద్దోన్ బోలీ రే.. (౨ సార్లు)


చోయ్బోకోతే కోలో రీతే హోనీరే బోణీ రే..


జోయ్కేలోతో కోరోరో మోరీ షో తుర్ ముఖీ రే.. (౩ సార్లు)


(పైగా ఈ బోడి పాట కి .. కోరస్.. ఒక్కటి...)


రొథీరె బోరోతె ఖోతోరె బారీతె మొథూర్ గీరీ రే..


అరి చోథోరే గోగోర్ గోగోర్ బాగీరె షోడీరే..
మరి ఇప్పుడో? మా ఇంట్లో ఇప్పటికీ ఈ పాటల పిచ్చి ఇప్పుడు వేరే స్థాయి లో .. ఆరోజులు రావు.. అలాగని ఈరోజుల్లో పారడీల వెనక పడ్డాం మేము.. (నేను, మా వారు, పిల్లలు)..


ఉదయం లేస్తూనే.. రోజుకో పాట తో, కర్ణ కఠోరం గా పాడుతూ (పెద్దగా శ్రమ పడక్కర్లేదు లెండి..).. శరత్ గారు ఓసారి చెప్పినట్టు..’ఇది ఆరని రావణ కాష్టం..’ , ‘జన్మమెత్తితి రా! అనుభవించితి రా!’ లాంటి పాటలతో పిల్లల్ని లేపటం..


పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని ... స్టైల్ లో .. ‘బ్రష్షు చేసుకుని, నీళ్లు పోసుకుని మెల్లగ స్కూలుకి కదలాలోయ్.. చదువులు చదివీ రావాలోయ్..’ అప్పటికి ‘నాన్న్నాఆఆఆఅ’ ఆపు!’ అని కళ్ళు పూర్తిగా తెరుచుకుని..


మా పక్క వాళ్ల తో ఒక గొడవ ‘almost’ తేబోయిన పాట.. మా పాప చిన్నప్పుడు స్నానం చేశాక దానికి తువ్వాలు చుట్టే పాట.. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నరసింహ పాట ..’ఎత్తూ పైకెత్తూ.. నువ్వూ...’ కి పారడీ చేసి


‘ఎత్తూ పైకెత్తూ.. నువ్వు..చేతులు పైకెత్తూ.. నాకు వీలు కలిగేట్టూ ఓ చిన్న పాపా!


నేనూ తువ్వాల్ చుట్టేట్టూ.. త్వరగా తయ్యారయ్యేట్టూ .. స్కూలుకి పరిగెత్తేత్టూ.. ఓహ్ చిన్న పాపా..’ అని పైగా దీనికి చరణాలు.. మా బాత్ రూమ్ లో ఈ పాట మొదలు.. మా పక్కింట్లోంచి వంటింట్లోంచి తాళం మొదలు. ఆవిడ రజనీ ఫాన్. (ఆ మాట కొస్తే నేనూనూ..) తలైవర్ పాట ని ఈ విధం గా ఖూనీ చేస్తుంటే తట్టుకోలేక ఆ పంఖా హృదయం వెయ్యి ముక్కలు కాకముందే .. ఆ గిన్నెలు ముక్కలవుతాయనిపిస్తుంది. (మనలో మాట.. అవి వాళ్లత్తగారు ఇచ్చినవి లెండి. ఇలాంటి కోప తాప ప్రదర్శన కి చాలా అనువు గా ఉంటాయి). 


మా వల్ల వాళ్ల పిల్లలకి కూడా ‘ఆకలేస్తే అన్నం పెడతా..’ లాంటి కృతులు వంట బడ్డాయి..


చదువుకొమ్మని పిలవటం కూడా.. మేము కాస్త పాటల రూపం లో అదుర్స్ అనుకోండి....


Where is that? (నేను)


What is that? (అమ్మాయి)


వేర్ ఈజ్ దట్ టెక్స్టు బుక్కు, వేర్ ఈజ్ దట్ నోటు బుక్కు వేర్ ఈజ్ దట్ పెన్సిల్ ముక్క పిల్లా!


మా పాప అచ్చం జూనియర్ ఎన్ టీ ఆర్ లా ఆక్ట్ చేస్తూ.. ‘చించేసా.. విసిరేసా.. కట్ చేశా’ అని కాసేపు కాలక్షేపం చేయటం..


సరే ఇది మామూలు రోజుల చదువు కైతే... పరీక్షలకి ‘మాతృదేవో భవ’ అంత దుఖం కాబట్టి ఆ పాటే మాకు శరణం...


‘స్కూలు కెళ్లే పిల్లా నీకు సినిమా లెందుకే? మార్కులెన్నడో గల్లంతాయే లే’


అనగానే .. మా పిల్లలూ ఊరుకోరు..


‘ఆఫీస్ కెళ్లే అమ్మా నీకు టీవీ ఎందుకే? డెడ్ లైన్ ఎప్పుడో మిస్సయ్యింది లే.. అని రాగం తీసి కక్ష తీర్చుకోవటం..


‘మీకిది ఎగ్జామ్స్ టైమమ్మా.. అన్నీ మానేసి చదువే చదువనవమ్మా..’


‘మాథ్స్ పేపర్ నిండా సున్నాలే.. సైన్స్ పేపర్ అంతా తప్పులే...’ అంటూ చరణాలూ.. పాడి పాడి పిల్లలకి కాస్త తెలుగు వచ్చిందేమో.. అనిపించింది.


పడుకునేటప్పుడు 'పడుకుంటావా? పాట పాడనా?' అన్నానంటే.. రెండు నిమిషాల్లో పడుకోవటమే.. అదీ మన లాలి పాటలంటే!!


రామ నామధారులపై ప్రతి భావం లో పోటీలు పడి మన సంగీత కళానిధులు, గేయకారులు, వాగ్గేయకారులు, జానపద కారులు (కరెక్టేనా..ఇలా అనటం..) రాసేశారు గా.. మావారి పేరు లో రామ నామం నా పాలిట వరం అయింది.


పనమ్మాయి రాకపోతే, ఇల్లూడుస్తూ, అంట్లు తోముతూ ‘బంటు రీతి కొలూ,.... విస్తివయ్య రామ! ‘ అని నిష్టూరం తో త్యాగయ్య కృతుల నుండీ,


‘మీ అమ్మకి చేసిస్తీ.. ఫిల్టర్ కాఫీ నేను.. రామ చంద్రా! ఆ కాఫీ కొరకూ పట్టే.. పదిహేను నిమిషాలూ రామ చంద్రా!’ లాంటి రామదాసు పాటల దాకా.. అవకాశం బట్టి సిట్యుఏషన్ గ్రావిటీ బట్టి... వాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నా..


‘నువ్వీ దరినీ, నేనా దరినీ ఆ అమ్మమ్మ కలిపింది ఇద్దరినీ ‘ అని మా పెళ్లి కుదిర్చినావిడ ని, సినిమా పాటలనీ వదలకుండా ఆడిపోసుకోవటం కూడా మానలేదు.


‘ఆడదే ఆధారం.. జగతికి ఆడదే సంతోషం ‘.. లాంటి పాటలతో నా విలువ గుర్తు చేయటం కూడా రోజూ చేస్తూ ఉంటాను...


సో మా కుటుంబం లో కూడా గానామృతం రక్తం లో పారుతోంది.. వరదలై పొంగుతోంది. పక్కవాళ్ళ రక్తం లో కి పోటుగా స్థిరపడుతోంది.. మాదీ మ్యూజికల్ ఫామిలీ.. అంతే నన్నమాట. మీరూ ఒప్పేసుకోండి సరేనా?

Saturday, September 3, 2011 39 comments

ఆ నలుగురూ.. (ఇరవై ఏళ్ల తర్వాత!)


హైదరాబాద్ నగరం.. పేరు వినగానే నాకు ఏదో మా అమ్మాయి పేరో, అమ్మ పేరో, నా ప్రాణ స్నేహితురాలి పేరో విన్నంత అభిమానం, ఆనందం. మొన్న చెప్పానా? హైదరాబాదు ప్రయాణం గురించి? చిన్న చిన్న పనులేసుకుని ఒక్కదాన్నే బస్సేక్కేసా. ఈద్ హలీం లు, వినాయకుడి విగ్రహాల తో ప్రతి గల్లీ.. సన్నగా వర్షం కురుస్తూ.. చలి గా.. తాజా తాజాగా ... అవసరం లేకపోయినా ఎప్పుడూ బోల్డు కొనేదాన్ని. ఈ సారి తడిసిన సిటీ అందాల్ని గమనించటం లో, ఇష్టమయిన స్నేహితులతో నైట్ అవుట్ చేసి, పాత స్నేహితులని కలిసి.. వీటిల్లోనే ఎక్కువ ఆనందాన్ని పొందినట్టున్నాను. ముప్ఫై రూపాయల పాల వల్లి తప్ప అస్సలు ఏమీ కొనలేదు..
అసలీ ప్రయాణం పెట్టుకున్నది నా పనుల కోసం అయితే .. దానితో పాటు గా చాలా చాలా ముఖ్యం గా పందొమ్మిది ఏళ్ల తర్వాత ఒక స్నేహితురాల్ని కలవాలని ప్రణాళిక ఉందాయే! ఫేస్ బుక్ పుణ్యమాని జ్ఞాపకాల పొరల్లో తప్పిపోయిన వాళ్లు గబుక్కున ‘ఇదిగో మేమిక్కడున్నాం’ అని ముందుకు వస్తున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది.. అసలు ఇలాంటి ఆనందం తర్వాతి తరాలకి ఉంటుందా? ఇరవయ్యేళ్ల తర్వాత అకస్మాత్తు గా ఏ రైల్లోనో, దుకాణం లోనో బీచ్ లోనో, ‘ఓహ్.. రమేష్! సురేష్! ?” అంటూ .. ఎదురయ్యే స్నేహితులు? ప్రతి జీవికీ ఫేస్ బుక్కో, లింకేడ్ ఇన్నో, అథమ పక్షం ఒక కాలేజ్ మేయిలరో, జీమేయిల్ ఎకౌన్తో, ఇంకా మున్ముందు వచ్చే నానారకాల ఐడీ లతో.. మనస్సులోంచి తప్పి పోవటం తప్ప, అసలు కావాలంటే దొరకబుచ్చుకోవటం ఎంతసేపు?


‘ స్టేట్స్ నుండి వచ్చాను, ఇంకో రెండు వారాలు హైదరాబాదే’.. అంది లిఖిత. ఫేస్ బుక్ ద్వారానే.. నంబర్లు ఇచ్చి పుచ్చుకుని వెళ్తూనే ఫోన్ చేశా..’నీకు గుర్తుందా రేఖ! పేద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అయి కూర్చుంది. తననీ పిలుస్తా. అలాగే నీకింకో సర్ప్రైజ్.. మన లక్ష్మిని కూడా రమ్మంటున్నా..’ ‘ఆహా.. అడక్కుండానే బోనస్ గా ఇంకో ఇద్దరు పాత స్నేహితులు దొరికితే ఆనందమే కదా..’ ఉత్సాహం తో రోజంతా కాళ్లు నేల మీద లేవు! అనుకున్న సమయానికి వెళ్లి కూర్చున్నా..

‘ఆడ దేవదాస్’ లిఖిత

సన్నగా వర్షం.. రెస్టారెంట్ ముందు ఒక బెంచీ. దాని మీద కూర్చుని ఆలోచిస్తున్నా. వీళ్లల్లో నాకు అత్యంత ప్రియమైన సఖి లిఖిత. ‘ఒకమ్మాయి.. బిందాస్.. ముందుకి దూకుతూ ప్రేమగా చుట్టుకుంటున్న నల్లటి త్రాచు లాంటి రెండడుగుల జడని నిర్లక్ష్యం గా,నిర్దాక్షిణ్యం గా వెనక్కి విసిరేస్తూ.. చిన్న పువ్వుల సల్వార్లు వేసుకుని సీరియస్ మొహం.. ఇంట్లో తిడతారనే ఓకే ఒక్క కారణం తో, సూది మొన అంత సన్నటి బొట్టు, పుస్తకాల్లో మలుగుతూ, తేలుతూ రాతి బండ మీద కూర్చుని సమాజం గురించి, జీవితం లో కారీర్ గురించి ఆలోచించే లిఖిత ఎలా మారి ఉంటుందా అని ఆలోచిస్తున్నా. ఎప్పుడూ లైబ్రరీల్లో.. కాలేజ్ ఆవరణ లో రాయి మీదో... కొన్నిసార్లు స్నేహపూరిత చర్చలు, కొన్ని సార్లు వేడిగా, వాడిగా ఒక్కోసారి వాకౌట్లు, మాటలాగిపోవటాలు, మళ్లీ మనసు వెనక్కి గుంజి.. మాట్లాడటాలు! ఒక్కోసారి మౌనం గా వెళ్లి చదువుకుని వచ్చేసేవారం. ఒక్కోసారి క్లాసులెగ్గొట్టి సినిమాలకీ, షికార్లకీ.. ‘ఏంటో.. ఆరోజులు’ ఒకసారి సన్నీ దయోల్ సినిమా కి వెళ్తే టికెట్లు అయిపోయాయి.. ‘బ్లాక్ లో కొందామే పద’ అని ఒక అబ్బాయిని అడిగింది. వందకి ఒకటి .. అన్నాడు. అంతే.. ‘సన్నీ దయోల్ కి వంద పెట్టాల్నా.. నీ ... ‘ అంది. చదువుకునే అమ్మాయి అలాంటి భాష మాట్లాడుతుందని ఊహించని అమ్మే అబ్బాయి, నేనూ ఫక్కున నవ్వేసాం.. అది గుర్తొచ్చి చిరునవ్వు తో నా మొహం నిండిపోయింది. ‘ఎంత రఫ్ గా మాట్లాడేది!’ లక్ష్మి కదూ తనకి పేరు పెట్టింది ‘ఆడ దేవదాసు’ అని? ఎప్పుడూ సీరియస్ గా ఉంటుందని?


మొదట్లో వారానికో ఉత్తరం.. తర్వాత నెలకొకటి..తర్వాత ఆగిపోయి.. ఒకసారి తన ఇంటి ఏరియా కి వెళ్లి వెతుకుదామని చూస్తే.. ఇళ్లన్నీ అపార్ట్ మెంట్లయి.. నా వల్ల కాలేదు. పైగా.. దేశం లో లేనేమో.. నెమ్మది గా జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిపోయింది.


నాకు తెలిసినంత వరకూ తను చాలా కాలం కారీర్ మీదే దృష్టి పెట్టి పెళ్లి చేసుకోలేదు.. రెండు గంటలకి కలుద్దాం అనుకున్నాం. ఇంకో పది నిమిషాలుంది. చటుక్కున ఒక పక్కన నుంచి వచ్చింది. చిన్న జుట్టు సోగ్గా కాలానుగుణంగా, బొట్టు, కళ్లనిండా కాటుక, కలంకారీ వర్క్ తో లాంగ్ స్కర్ట్, ..’అరెవ్వా! స్త్రీత్వం ఉట్టిపడటం అంటే ఇదేనేమో!!’ అన్నింటికన్నా.. ముఖ్యం గా సుస్పష్టమైన మార్పు.. ‘ముఖం లో సీరియస్ నెస్ చోట ప్రశాంతత, ఆప్యాయత’ ‘మాన్!!!! తను అంత సౌమ్యం గా మాట్లాడటం ఎప్పుడు నేర్చింది?’ తన పిల్లల గురించి, కుటుంబం గురించి, మామ గారి గురించి మాట్లాడింది. తను అలాగ మాట్లాడటం నాకు కొత్త. కానీ ఎవ్వరైనా మారతారు కదా.. ఆనందాశ్చర్యాల్లోంచి ఇంకా బయట పడలేదు. అమ్మా నాన్నలు చేసుకోలేకపోతున్నారట. తన తోబుట్టువులందరూ వేరే దేశాల్లో ఉండిపోయారుట! తన ఇంటి పైన రెండు గదులు నిర్మించి అన్ని సదుపాయాలూ చేస్తోందిట!. వాళ్ల మామగారికి ఏవో సమస్యలు తీర్చటానికి ఉండి పోయాను... అలా అలా చెప్తూ పోతోంది.. అమ్మాయి బాగా మారిపోయింది. అనుకున్నా..


కాసేపు కుటుంబాల గురించి మాట్లాడుకున్నాకా.. ‘కృష్ణా! మీ పని గురించి చెప్పు..’ అంది. నేను క్లుప్తం గా పెద్దగా ఇంటరెస్ట్ లేకుండా చెప్పాను. ఊరుకోలేదు..’ఇంకా చెప్పు. అప్పుడు ఆ hardware ASICs,FPGAs, OS లో కొత్త ట్రెండులు అడుగుతూ పోతోంది నేను చెప్తూ పోతున్నాను. ఒక నలభై నిమిషాలకి ఇంకో స్నేహితురాలి ఫోన్ కాల్ తో మళ్లీ ఈలోకం లోకి వచ్చి పడ్డాం. తర్వాత కూడా అన్నా హజారే గురించి, స్కూల్ పిల్లల్లో కాలేజ్ పిల్లల్లో విశ్రుంఖలత గురించి అందరితో తను మాట్లాడుతుండగా అనిపించింది.. ‘కొన్ని రకాలు గా మారినా.. మౌలికంగా మార్పు లేదని.. అర్థమైంది. పైగా..అందరికన్నా ముందు సమయానికి ముందు చేరింది మేమిద్దరమే అని ఆ విషయం లో ఏ మార్పూ లేదని కూడా..


అలాగే తనకి గుర్తున్నంత నాకు గుర్తు లేదని అర్థమయింది. అంటే నేను అప్పటి జీవితాన్ని వెనక వదిలేసి ‘ముందుకి’ వెళ్లిపోయాను.. అని అనుకుంటున్నాను.. కొత్త స్నేహితులు, కొత్త జీవితం. ఆ రోజులు ఎక్కడో ఆటక మీద నెట్టేసిన అట్ట పెట్టెల్లో.. అప్పట్లో నా గురించి తను చెప్తుంటే.. ‘నేనేనా అది?’ అని ఆశ్చర్యం కలిగింది.


లక్ష్మి ‘The winner!’

‘లక్ష్మి గురించి నీకు ఏం గుర్తుందో చెప్పు?’ అని అడిగింది లిఖిత. ‘లక్ష్మి.. BSc చేసి తర్వాత BEd చేరింది.. ఆఖరి సారి చూసినప్పటికి.. అప్పటికే పెళ్లయింది. చీర, నల్ల పూసలు.. నవ్వుతూ నవ్విస్తూ ఎప్పుడూ తృప్తి గా ఉండేది. కలల బేహారి.. అవునా?’ చిరునవ్వు తో చూస్తూ ఉండిపోయింది లిఖిత. నేను ఇంకా ఉత్సాహం గా.. నీకు గుర్తుందా దాని కల ఒకటి? అని అడిగాను.


దానికి ఒక 'చిన్న్న్న్న ' కోరిక.. దానికి పెళ్ళి సంబంధాలు చూసేవారు ఇంట్లో..

SV Rangarao గారి లాంటి గుంభనమైన మామగారు


డబ్బింగ్ జానకి లాంటి నోరు లేని అత్తగారు.


రాజ్యలక్ష్మి లేదా..పూర్వం పరికిణీ ఓణీలేసుకుని ఒక చెల్లెలు పాత్రలేసే అమ్మాయి ఉండేది..) ఆ అమ్మాయి లాంటి 'వదినా.. వదినా ' అని తిరిగే hardworking ఆడపడచు..


రంగనాథ్, సంగీత ల్లాంటి harmless బావగారు/తోటికోడలు..


రాళ్ళపల్లి లాంటి వఫాదార్ నౌకరూ.. భర్తేమో.. అని.. డ్రమాటిక్ గా అందర్నీ తలకాయ అటుంచి ఇటూ, ఇట్నుంచి అటూ తిప్పి.. ఒకసారి చూసి.. ' చిరంజీవి లా' అనేది..


ఇద్దరం నవ్వుకున్నాం. ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది.. ఒకసారి తన ఇంటికి వెళ్తే ఒక అల్మారీ తెరిచి ఇవిగో.. ‘మా అమ్మావాళ్లు నా పెళ్లయ్యాక ఇవ్వాలని పెట్టుకుని స్టీల్ సామాన్లు’ అని చూపించింది. అప్పుడు నాకు చిత్రం గా అనిపించింది...


రెస్టారంట్ బయట నుండి ఫోన్ చేసింది. ఎలా రావాలో చెప్పి చూస్తున్నాం. అప్పుడే పదో క్లాస్ చదువుతున్న కూతురు ఉందని విన్నాను. నేను చీర చుట్టుకున్న కొద్దిగా లావు పాటి స్త్రీ ల కోసం చూస్తున్నాను. ఆశ్చర్యం! జీన్స్,కుర్తీలో స్టెప్ కట్ చేసిన జుట్టు, నాజూగ్గా అలాగే నవ్వుతూ సరదాగా వస్తోంది...పలకరింతలు, అప్ డేట్లు అయ్యాక తెలిసింది. ఒక పేరు పొందిన సాఫ్ట్ వేర్ సంస్థ లో ఆప్స్ మానేజర్ గా బాధ్యత నిర్వర్తిస్తోంది. మాట తీరు లో అస్సలూ మార్పు లేదు. చాలా ఆశ్చర్యం గా అనిపించింది. నెమ్మది గా అడిగాను. ‘ఇదంతా ఎలా సాధ్యమైంది? ‘ అని.


‘ఒక్క కార్డ్ ముక్క నా జీవితం మార్చేసింది.. ‘ అంది. అదెలాగో ఏంటో కుతూహలం గా ముందుకి వంగి చూస్తున్నాను.. ‘మావారు అకౌంటంట్. B Ed చేసిన తర్వాత కుటుంబ ఆర్ధిక పరిస్థితి కి నా వంతు సాయం చేయాలని స్కూల్లో పని చేస్తూనే పిల్లలకి లెక్కలు ట్యూషన్లు చెప్తూ ఉండేదాన్ని.. ఈలోగా పాప. ఒక రోజు పాప ని ఎత్తుకుని ఏదో దుకాణం లో వస్తువు కొంటున్నాను.. పక్కన్నుంచి ఒకమ్మాయి ‘హాయ్ లక్ష్మీ’ అని కార్ లోంచి విండో దించి పిలుస్తోంది. ‘ఎవరీ అమ్మాయి? ఎక్కడో చూస్తునట్టుంది..’ అని ఆలోచిస్తూ కార్ వైపుకి నడిచాను. గుర్తొచ్చింది. నా స్కూల్లో నాతో చదువుకున్నమ్మాయి. నా దగ్గర ఎన్ని సార్లు లెక్కలు చెప్పించుకుంది! ఛా.. అమ్మాయేంటి? నా కన్నా పెద్దది. ‘ ఆలోచిస్తూనే...మాట్లాడుతున్నాం. ఈలోగా.. ట్రాఫిక్ వల్ల కార్ కదలాల్సి వచ్చింది. తను బై బై అంటూ ... ఫార్మల్ షర్ట్ పొకెట్ లోంచి నాజూగ్గా బిజినెస్ కార్డ్ తీసి ఇచ్చింది. ఆ షర్ట్ చివర వేలాడుతూ తను పని చేస్తున్న కంపెనీ తాలూకు బాడ్జ్. నేనేమో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ,.. రోజుకి 12-14 గంటలు పని చేస్తూ కూడా తన సంపాదన లో పదో వంతు సంపాదించుకుంటూ..’


ఆ కార్డ్ తెచ్చుకుని నా బల్ల మీద పెట్టుకుని ఒక వారం పాటు రోజూ.. చూస్తూ ఉన్నాను. నెమ్మదిగా ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. మా వారికీ, అత్తగారికీ చెప్పాను. వాళ్లు ముందర ‘మనం చేయగలమా?’ అని భయపడ్డా.. ఒప్పుకున్నారు. MCA ఎంట్రన్స్ రాసి 1400 రాంక్ తెచ్చుకుని నా స్కూల్ కి పక్క నున్న కాలేజ్ లో సీట్ తీసుకుని, వెంటనే మా అమ్మ గారింటికి దగ్గర లో ఇంట్లోకి మారాం. మా అమ్మాయిని నా స్కూల్లోకి మార్చుకుని సాయంత్రం ఇంట్లో దింపి సాయంత్రం కాలేజ్ లో చదువుకునే దాన్ని. తల్లిదండ్రులు, అత్త మామలూ, అందరూ సహాయం చేశారు. మూడేళ్ల తర్వాత స్కూల్ లో ఉద్యోగ విరమణ చేసి సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం తెచ్చుకున్నాను.ఇప్పుడు నా చదువు కోసం చేసిన అప్పులు, ముందర ఉన్న అప్పులూ అన్నీ తీర్చుకుని ఇల్లు కట్టుకున్నాం. మా అమ్మాయిని మంచి స్కూల్లో చదివిస్తున్నాం. కళ్లల్లో బోల్డు ఆత్మా విశ్వాసం! ‘ఫేస్ బుక్ లో రావు.. నీ సంగతులు తెలియవు... ‘ అని గొడవ గా అందరం అరిస్తే.. ‘పది గంటలు ఆఫీసు లో కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసి మళ్లీ ఇంటికి వచ్చి నాకెందుకు ఈ ముఖ పుస్తకాలు? అనేసింది... తను చెప్పిన కొన్ని విషయాలు ఇంటికి వస్తూ కూడా ఆలోచిస్తూ ఉండిపోయాను... ‘కాలేజ్ లో కొంత మందిని చూసి.. వాళ్లని ఏదో మరీ ఫాస్ట్ అనీ, మంచి వాళ్ళు కాదనీ.. అనుకునే వాళ్లం గుర్తుందా? ఇప్పుడనిపిస్తుంది.. వాళ్లు మామూలు గానే ఉండేవారని.. మనమే కూపస్థ మండూకాల్లా ఉండేవాళ్లం అని.. అలాగే ఆఫీస్ పని, టెన్షన్ ఇంటికి తేను.. ఇంటి పని, టెన్షన్ ఆఫీసు కి తీసుకెళ్లను. పెద్ద కస్టమర్ ఇష్యూ అయితే తప్ప ఇంటికొచ్చాక సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉంచుతాను. సెలవల్లో చీరే నా యూనీ ఫారం. ఏ పనీ పెట్టుకోను. మా చెల్లీ ఇండియా లో ఉండదు. అమ్మా నాన్నలని పలకరిస్తాను. కాస్త పనులు చేసి పెడతాను. అలా తన జీవితాన్ని తనకి తోచిన రీతి లో అనుభవించే పధ్ధతి చెప్తుంటే చాలా చాలా గర్వం గా, ‘మా లక్ష్మి’ అని అందరికీ చెప్పాలని అనిపించింది.


‘లక్కీ డ్రెస్ ‘ నేర్డ్ రేఖ

ఎనిమిదో క్లాస్ లో కుట్టించుకున్న సల్వార్ కమీజ్. ఎందుకో అచ్చి వచ్చిందట. దాని కుట్లు విప్పదీసి.. గుడ్డలతికించి పొడుగు చేసి.. నానా తంటాలు పడి ప్రతి పరీక్ష కీ అదే వేసుకుని వచ్చేది. ఎవ్వరేమన్నా.. పట్టించుకునేది కాదు. నుదుటి మీద రక రకాల కుంకుమలు, విభూతులు, కనుబొమ్మలు చిట్లించి పరీక్ష హాల్ లోకి ఒక అడుగు పెట్టి కూడా చదువుతూ వదల్లేక వదల్లేక పుస్తకాలని పడేసి, దేవుడిని స్మరిస్తూ, కంగారు కంగారు గా, ఎప్పుడూ... ఒక యుద్ధ భూమి లో పోరాడుతున్న సైనికుడి లా సీరియస్ గా ఉండేది. అద్భుతం గా పాడేది కానీ.. ‘ఏదీ? చదువుకే అంకితం! ఒక్క సారి కూడా ఖాళీ గా కనిపించిన గుర్తు లేదు. లైబ్రరీ లో.. ఇక క్లాస్ ఫస్ట్ ఎప్పుడూ తనే అని చెప్పనక్కరలేదనుకుంటాను? ఆ కంగారు వల్లే ఇంజనీరింగ్ లో సీట్ కూడా రాలేదేమో అనిపిస్తుంది. లేకపోతే దాదాపు గా పుస్తకాలన్నింటిలో చెప్పిన ప్రతి పదం తనకి తెలుసు. ప్రతి సబ్జెక్ట్ కీ నాలుగైదు రిఫరెన్స్ పుస్తకాలు చదివి ఎప్పుడూ ఆ విషయ జ్ఞానం గురించి చర్చలే! మొదటి బెంచ్ లో మొదటి జాగా ఎప్పుడూ తనదే. అత్యంత బోరింగ్ క్లాసుల్లో కూడా నిటారు గా కూర్చుని లెక్చరర్ల తో చర్చలు చేసేది. నోట్స్ రాసేది. తన వల్ల చాలా మంది హాయిగా క్లాస్ లో మా పనులు మేము చేసుకోగల్గేవాళ్లం.. BSc చేసి LIC పరీక్షల్లో గెలిచి LIC ఆఫీసరు అయిందని విన్నాను. కానీ ఎప్పుడూ కలవటం కుదరలేదు.తన ఫోన్ నంబర్ కూడా తెలియదు. ఫేస్ బుక్ పుణ్యమా అని మళ్లీ ఈ విధం గా..


నా నంబర్ దొరుకుతూనే నాకు కాల్ చేసింది.. బోల్డు ఉత్సాహం చూపించింది.అందరి వివరాలు కనుక్కుంది. ‘భలే సరదాగా గల గలా మాట్లాడుతుందే!’ అనుకున్నాను. ఒకే అబ్బాయి! ఎనిమిదో తరగతి ఇలాగ.. వివరాలు చెప్పింది. చిన్న ఊళ్లో పోస్టింగ్.. ప్రస్తుతం లాంగ్ లీవ్ లో ఉన్నాను.. అంది. ప్రతి క్లాస్ కీ, ప్రతి పరీక్షకీ ఠంచన్ గా సమయానికి ఐదు నిమిషాల ముందే వచ్చే తను, అందరి కన్నా ఆఖరు గా వచ్చింది. పలకరింపులు అవీ అయ్యాక.. ‘అమ్మమ్మ కి వంట్లో బాగోలేదు. నేను వెళ్లి కాస్త సహాయం చేసి వచ్చాను..’ అంది. ‘ఆహ్’ అనుకున్నాము. ‘ఏంటో.. పూర్వం చదువు తప్ప ఇంకేదీ పట్టేది కాదు. ఎప్పుడూ ఒక ఒత్తిడి లో ఉండేదాన్ని. అది తగ్గటానికి ధ్యానం, యోగా.. అనుకునేదాన్ని. పాటలు అంటే ఇష్టం..కానీ సమయం చిక్కేది కాదు. చుట్టాలని, చుట్టు పక్కల వారిని, ఎవ్వర్నీ పట్టించుకునే దాన్ని కాదు. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది. నేను మారాను.. నెలకోసారి మా అత్తగారి ఊర్లో ఉన్న పొలాల్లో పెంకుటింట్లో గడిపి వస్తాము. సంగీతం నేర్చుకుంటూ ఉంటాను. కచేరీలు చేయాలని కాదు. నలుగురితో గడుపుతూ, నలుగురికీ చేతనయినంత సహాయ సహకారాలందిస్తూ .. ఇదే నా ధ్యానం! ఏ యోగా నాకు ఇంత తృప్తి ఇవ్వలేవు అనిపిస్తుంది అంది. చాలా సంతోషం వేసింది.


వెళ్లి పోయేముందు.. అందరం కొద్దిగా బరువెక్కి ఉన్నాం, గొంతు కాస్త పూడుకు పోయి..... రేఖ.. చటుక్కున ‘అన్నట్టు.. ఒక విషయం మర్చిపోయా.. ‘ అంది. మేమంతా.. కుతూహలం గా చూస్తున్నాం.. ‘నా LIC ఇంటర్వ్యూకీ, రాత పరీక్షకీ అదే లక్కీ డ్రస్సు వాడాను..’ అంది. ‘పెళ్లి చూపులకో’ అని అడిగి వేళాకోళాలు చేసి.. నవ్వుకుంటూ విడిపోయాం.


రాలేక పోయిన రాజీ..

మాలో ఇంకో అమ్మాయి రాజీ..ఎప్పుడూ నవ్వుతూ తృళ్ళుతూ ఉండేది. ఇంజనీరింగ్ చదువుతూ.. అందర్నీ ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లి అయింది. పోయే ముందు రోజు కూడా నవ్వుతూ మాట్లాడిన రాజీ, ‘ఏమయిందో.. ఆరేళ్ల క్రితం ఉరి పోసుకుని, చిన్న పిల్లల్ని కూడా వదిలి వెళ్లి పోయిందంటే అసలు ఏం బాధ తన మరణం వెనక ఉండిఉంటుందో ఊహకి అందదు ఎవ్వరికీ.. అప్రయత్నం గా తనకోసం మౌనాన్ని పాటించాం.. మనస్సు కాసేపు బరువెక్కి , తన పిల్లలెలా ఉన్నారో కాసేపు మాట్లాడుకుని మళ్లీ మాటల్లో పడిపోయాం.


‘ఎవరన్నారు.. జీవితం మళ్లీ దొరకదని? స్పెయిన్ లో దూసుకు వస్తున్న దున్నపోతుల నుండి పరిగెత్తో, సముద్రపు లోతుల్లో దూకో, ఆకాశపు అంచుల్ని తాకేదాకో ఆగక్కరలేదు. చిన్న థాట్.. అవగాహన తో ఒక పాజిటివ్ దృక్పథం తో, పట్టుదల తో, పరిశ్రమ తో జీవితాన్ని తమకి కావలసినట్టు మలచుకున్నవారు ముగ్గురు... ఓకే ఒక్క బలహీన క్షణాన్ని దాటలేక, కావాలని చేసుకున్న పెళ్లి ద్వారా కావాలని కన్న బిడ్డల్ని వదిలి పోయిన వారొకరు.. ఆర్థికం గా, సాంఘికం గా వాళ్ల అభివృద్ధి గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. మనషులు గా ఈ ముగ్గురి లో వచ్చిన మార్పు నన్ను ఆశ్చర్యానందాలకి గురిచేసింది. ఏం మాట్లాడామో.. ఏం తిన్నామో..ఎలా బయట పడ్డామో.. సమయం అతి వేగం గా గడిచినట్టనిపించింది. సాయంత్రం రైలెక్కాల్సిన పని లేకపోతే నేను ఎప్పుడు ఇంటికి చేరేదాన్నో.. తెలియదు. కానీ బెంగుళూరు పిలుస్తుంది..వెళ్లక తప్పదు గా?

 
;