హైదరాబాద్ నగరం.. పేరు వినగానే నాకు ఏదో మా అమ్మాయి పేరో, అమ్మ పేరో, నా ప్రాణ స్నేహితురాలి పేరో విన్నంత అభిమానం, ఆనందం. మొన్న చెప్పానా? హైదరాబాదు ప్రయాణం గురించి? చిన్న చిన్న పనులేసుకుని ఒక్కదాన్నే బస్సేక్కేసా. ఈద్ హలీం లు, వినాయకుడి విగ్రహాల తో ప్రతి గల్లీ.. సన్నగా వర్షం కురుస్తూ.. చలి గా.. తాజా తాజాగా ... అవసరం లేకపోయినా ఎప్పుడూ బోల్డు కొనేదాన్ని. ఈ సారి తడిసిన సిటీ అందాల్ని గమనించటం లో, ఇష్టమయిన స్నేహితులతో నైట్ అవుట్ చేసి, పాత స్నేహితులని కలిసి.. వీటిల్లోనే ఎక్కువ ఆనందాన్ని పొందినట్టున్నాను. ముప్ఫై రూపాయల పాల వల్లి తప్ప అస్సలు ఏమీ కొనలేదు..
అసలీ ప్రయాణం పెట్టుకున్నది నా పనుల కోసం అయితే .. దానితో పాటు గా చాలా చాలా ముఖ్యం గా పందొమ్మిది ఏళ్ల తర్వాత ఒక స్నేహితురాల్ని కలవాలని ప్రణాళిక ఉందాయే! ఫేస్ బుక్ పుణ్యమాని జ్ఞాపకాల పొరల్లో తప్పిపోయిన వాళ్లు గబుక్కున ‘ఇదిగో మేమిక్కడున్నాం’ అని ముందుకు వస్తున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది.. అసలు ఇలాంటి ఆనందం తర్వాతి తరాలకి ఉంటుందా? ఇరవయ్యేళ్ల తర్వాత అకస్మాత్తు గా ఏ రైల్లోనో, దుకాణం లోనో బీచ్ లోనో, ‘ఓహ్.. రమేష్! సురేష్! ?” అంటూ .. ఎదురయ్యే స్నేహితులు? ప్రతి జీవికీ ఫేస్ బుక్కో, లింకేడ్ ఇన్నో, అథమ పక్షం ఒక కాలేజ్ మేయిలరో, జీమేయిల్ ఎకౌన్తో, ఇంకా మున్ముందు వచ్చే నానారకాల ఐడీ లతో.. మనస్సులోంచి తప్పి పోవటం తప్ప, అసలు కావాలంటే దొరకబుచ్చుకోవటం ఎంతసేపు?
‘ స్టేట్స్ నుండి వచ్చాను, ఇంకో రెండు వారాలు హైదరాబాదే’.. అంది లిఖిత. ఫేస్ బుక్ ద్వారానే.. నంబర్లు ఇచ్చి పుచ్చుకుని వెళ్తూనే ఫోన్ చేశా..’నీకు గుర్తుందా రేఖ! పేద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అయి కూర్చుంది. తననీ పిలుస్తా. అలాగే నీకింకో సర్ప్రైజ్.. మన లక్ష్మిని కూడా రమ్మంటున్నా..’ ‘ఆహా.. అడక్కుండానే బోనస్ గా ఇంకో ఇద్దరు పాత స్నేహితులు దొరికితే ఆనందమే కదా..’ ఉత్సాహం తో రోజంతా కాళ్లు నేల మీద లేవు! అనుకున్న సమయానికి వెళ్లి కూర్చున్నా..
‘ఆడ దేవదాస్’ లిఖిత
మొదట్లో వారానికో ఉత్తరం.. తర్వాత నెలకొకటి..తర్వాత ఆగిపోయి.. ఒకసారి తన ఇంటి ఏరియా కి వెళ్లి వెతుకుదామని చూస్తే.. ఇళ్లన్నీ అపార్ట్ మెంట్లయి.. నా వల్ల కాలేదు. పైగా.. దేశం లో లేనేమో.. నెమ్మది గా జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిపోయింది.
నాకు తెలిసినంత వరకూ తను చాలా కాలం కారీర్ మీదే దృష్టి పెట్టి పెళ్లి చేసుకోలేదు.. రెండు గంటలకి కలుద్దాం అనుకున్నాం. ఇంకో పది నిమిషాలుంది. చటుక్కున ఒక పక్కన నుంచి వచ్చింది. చిన్న జుట్టు సోగ్గా కాలానుగుణంగా, బొట్టు, కళ్లనిండా కాటుక, కలంకారీ వర్క్ తో లాంగ్ స్కర్ట్, ..’అరెవ్వా! స్త్రీత్వం ఉట్టిపడటం అంటే ఇదేనేమో!!’ అన్నింటికన్నా.. ముఖ్యం గా సుస్పష్టమైన మార్పు.. ‘ముఖం లో సీరియస్ నెస్ చోట ప్రశాంతత, ఆప్యాయత’ ‘మాన్!!!! తను అంత సౌమ్యం గా మాట్లాడటం ఎప్పుడు నేర్చింది?’ తన పిల్లల గురించి, కుటుంబం గురించి, మామ గారి గురించి మాట్లాడింది. తను అలాగ మాట్లాడటం నాకు కొత్త. కానీ ఎవ్వరైనా మారతారు కదా.. ఆనందాశ్చర్యాల్లోంచి ఇంకా బయట పడలేదు. అమ్మా నాన్నలు చేసుకోలేకపోతున్నారట. తన తోబుట్టువులందరూ వేరే దేశాల్లో ఉండిపోయారుట! తన ఇంటి పైన రెండు గదులు నిర్మించి అన్ని సదుపాయాలూ చేస్తోందిట!. వాళ్ల మామగారికి ఏవో సమస్యలు తీర్చటానికి ఉండి పోయాను... అలా అలా చెప్తూ పోతోంది.. అమ్మాయి బాగా మారిపోయింది. అనుకున్నా..
కాసేపు కుటుంబాల గురించి మాట్లాడుకున్నాకా.. ‘కృష్ణా! మీ పని గురించి చెప్పు..’ అంది. నేను క్లుప్తం గా పెద్దగా ఇంటరెస్ట్ లేకుండా చెప్పాను. ఊరుకోలేదు..’ఇంకా చెప్పు. అప్పుడు ఆ hardware ASICs,FPGAs, OS లో కొత్త ట్రెండులు అడుగుతూ పోతోంది నేను చెప్తూ పోతున్నాను. ఒక నలభై నిమిషాలకి ఇంకో స్నేహితురాలి ఫోన్ కాల్ తో మళ్లీ ఈలోకం లోకి వచ్చి పడ్డాం. తర్వాత కూడా అన్నా హజారే గురించి, స్కూల్ పిల్లల్లో కాలేజ్ పిల్లల్లో విశ్రుంఖలత గురించి అందరితో తను మాట్లాడుతుండగా అనిపించింది.. ‘కొన్ని రకాలు గా మారినా.. మౌలికంగా మార్పు లేదని.. అర్థమైంది. పైగా..అందరికన్నా ముందు సమయానికి ముందు చేరింది మేమిద్దరమే అని ఆ విషయం లో ఏ మార్పూ లేదని కూడా..
అలాగే తనకి గుర్తున్నంత నాకు గుర్తు లేదని అర్థమయింది. అంటే నేను అప్పటి జీవితాన్ని వెనక వదిలేసి ‘ముందుకి’ వెళ్లిపోయాను.. అని అనుకుంటున్నాను.. కొత్త స్నేహితులు, కొత్త జీవితం. ఆ రోజులు ఎక్కడో ఆటక మీద నెట్టేసిన అట్ట పెట్టెల్లో.. అప్పట్లో నా గురించి తను చెప్తుంటే.. ‘నేనేనా అది?’ అని ఆశ్చర్యం కలిగింది.
లక్ష్మి ‘The winner!’
దానికి ఒక 'చిన్న్న్న్న ' కోరిక.. దానికి పెళ్ళి సంబంధాలు చూసేవారు ఇంట్లో..
డబ్బింగ్ జానకి లాంటి నోరు లేని అత్తగారు.
రాజ్యలక్ష్మి లేదా..పూర్వం పరికిణీ ఓణీలేసుకుని ఒక చెల్లెలు పాత్రలేసే అమ్మాయి ఉండేది..) ఆ అమ్మాయి లాంటి 'వదినా.. వదినా ' అని తిరిగే hardworking ఆడపడచు..
రంగనాథ్, సంగీత ల్లాంటి harmless బావగారు/తోటికోడలు..
రాళ్ళపల్లి లాంటి వఫాదార్ నౌకరూ.. భర్తేమో.. అని.. డ్రమాటిక్ గా అందర్నీ తలకాయ అటుంచి ఇటూ, ఇట్నుంచి అటూ తిప్పి.. ఒకసారి చూసి.. ' చిరంజీవి లా' అనేది..
ఇద్దరం నవ్వుకున్నాం. ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది.. ఒకసారి తన ఇంటికి వెళ్తే ఒక అల్మారీ తెరిచి ఇవిగో.. ‘మా అమ్మావాళ్లు నా పెళ్లయ్యాక ఇవ్వాలని పెట్టుకుని స్టీల్ సామాన్లు’ అని చూపించింది. అప్పుడు నాకు చిత్రం గా అనిపించింది...
రెస్టారంట్ బయట నుండి ఫోన్ చేసింది. ఎలా రావాలో చెప్పి చూస్తున్నాం. అప్పుడే పదో క్లాస్ చదువుతున్న కూతురు ఉందని విన్నాను. నేను చీర చుట్టుకున్న కొద్దిగా లావు పాటి స్త్రీ ల కోసం చూస్తున్నాను. ఆశ్చర్యం! జీన్స్,కుర్తీలో స్టెప్ కట్ చేసిన జుట్టు, నాజూగ్గా అలాగే నవ్వుతూ సరదాగా వస్తోంది...పలకరింతలు, అప్ డేట్లు అయ్యాక తెలిసింది. ఒక పేరు పొందిన సాఫ్ట్ వేర్ సంస్థ లో ఆప్స్ మానేజర్ గా బాధ్యత నిర్వర్తిస్తోంది. మాట తీరు లో అస్సలూ మార్పు లేదు. చాలా ఆశ్చర్యం గా అనిపించింది. నెమ్మది గా అడిగాను. ‘ఇదంతా ఎలా సాధ్యమైంది? ‘ అని.
‘ఒక్క కార్డ్ ముక్క నా జీవితం మార్చేసింది.. ‘ అంది. అదెలాగో ఏంటో కుతూహలం గా ముందుకి వంగి చూస్తున్నాను.. ‘మావారు అకౌంటంట్. B Ed చేసిన తర్వాత కుటుంబ ఆర్ధిక పరిస్థితి కి నా వంతు సాయం చేయాలని స్కూల్లో పని చేస్తూనే పిల్లలకి లెక్కలు ట్యూషన్లు చెప్తూ ఉండేదాన్ని.. ఈలోగా పాప. ఒక రోజు పాప ని ఎత్తుకుని ఏదో దుకాణం లో వస్తువు కొంటున్నాను.. పక్కన్నుంచి ఒకమ్మాయి ‘హాయ్ లక్ష్మీ’ అని కార్ లోంచి విండో దించి పిలుస్తోంది. ‘ఎవరీ అమ్మాయి? ఎక్కడో చూస్తునట్టుంది..’ అని ఆలోచిస్తూ కార్ వైపుకి నడిచాను. గుర్తొచ్చింది. నా స్కూల్లో నాతో చదువుకున్నమ్మాయి. నా దగ్గర ఎన్ని సార్లు లెక్కలు చెప్పించుకుంది! ఛా.. అమ్మాయేంటి? నా కన్నా పెద్దది. ‘ ఆలోచిస్తూనే...మాట్లాడుతున్నాం. ఈలోగా.. ట్రాఫిక్ వల్ల కార్ కదలాల్సి వచ్చింది. తను బై బై అంటూ ... ఫార్మల్ షర్ట్ పొకెట్ లోంచి నాజూగ్గా బిజినెస్ కార్డ్ తీసి ఇచ్చింది. ఆ షర్ట్ చివర వేలాడుతూ తను పని చేస్తున్న కంపెనీ తాలూకు బాడ్జ్. నేనేమో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ,.. రోజుకి 12-14 గంటలు పని చేస్తూ కూడా తన సంపాదన లో పదో వంతు సంపాదించుకుంటూ..’
ఆ కార్డ్ తెచ్చుకుని నా బల్ల మీద పెట్టుకుని ఒక వారం పాటు రోజూ.. చూస్తూ ఉన్నాను. నెమ్మదిగా ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. మా వారికీ, అత్తగారికీ చెప్పాను. వాళ్లు ముందర ‘మనం చేయగలమా?’ అని భయపడ్డా.. ఒప్పుకున్నారు. MCA ఎంట్రన్స్ రాసి 1400 రాంక్ తెచ్చుకుని నా స్కూల్ కి పక్క నున్న కాలేజ్ లో సీట్ తీసుకుని, వెంటనే మా అమ్మ గారింటికి దగ్గర లో ఇంట్లోకి మారాం. మా అమ్మాయిని నా స్కూల్లోకి మార్చుకుని సాయంత్రం ఇంట్లో దింపి సాయంత్రం కాలేజ్ లో చదువుకునే దాన్ని. తల్లిదండ్రులు, అత్త మామలూ, అందరూ సహాయం చేశారు. మూడేళ్ల తర్వాత స్కూల్ లో ఉద్యోగ విరమణ చేసి సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం తెచ్చుకున్నాను.ఇప్పుడు నా చదువు కోసం చేసిన అప్పులు, ముందర ఉన్న అప్పులూ అన్నీ తీర్చుకుని ఇల్లు కట్టుకున్నాం. మా అమ్మాయిని మంచి స్కూల్లో చదివిస్తున్నాం. కళ్లల్లో బోల్డు ఆత్మా విశ్వాసం! ‘ఫేస్ బుక్ లో రావు.. నీ సంగతులు తెలియవు... ‘ అని గొడవ గా అందరం అరిస్తే.. ‘పది గంటలు ఆఫీసు లో కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసి మళ్లీ ఇంటికి వచ్చి నాకెందుకు ఈ ముఖ పుస్తకాలు? అనేసింది... తను చెప్పిన కొన్ని విషయాలు ఇంటికి వస్తూ కూడా ఆలోచిస్తూ ఉండిపోయాను... ‘కాలేజ్ లో కొంత మందిని చూసి.. వాళ్లని ఏదో మరీ ఫాస్ట్ అనీ, మంచి వాళ్ళు కాదనీ.. అనుకునే వాళ్లం గుర్తుందా? ఇప్పుడనిపిస్తుంది.. వాళ్లు మామూలు గానే ఉండేవారని.. మనమే కూపస్థ మండూకాల్లా ఉండేవాళ్లం అని.. అలాగే ఆఫీస్ పని, టెన్షన్ ఇంటికి తేను.. ఇంటి పని, టెన్షన్ ఆఫీసు కి తీసుకెళ్లను. పెద్ద కస్టమర్ ఇష్యూ అయితే తప్ప ఇంటికొచ్చాక సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉంచుతాను. సెలవల్లో చీరే నా యూనీ ఫారం. ఏ పనీ పెట్టుకోను. మా చెల్లీ ఇండియా లో ఉండదు. అమ్మా నాన్నలని పలకరిస్తాను. కాస్త పనులు చేసి పెడతాను. అలా తన జీవితాన్ని తనకి తోచిన రీతి లో అనుభవించే పధ్ధతి చెప్తుంటే చాలా చాలా గర్వం గా, ‘మా లక్ష్మి’ అని అందరికీ చెప్పాలని అనిపించింది.
‘లక్కీ డ్రెస్ ‘ నేర్డ్ రేఖ
నా నంబర్ దొరుకుతూనే నాకు కాల్ చేసింది.. బోల్డు ఉత్సాహం చూపించింది.అందరి వివరాలు కనుక్కుంది. ‘భలే సరదాగా గల గలా మాట్లాడుతుందే!’ అనుకున్నాను. ఒకే అబ్బాయి! ఎనిమిదో తరగతి ఇలాగ.. వివరాలు చెప్పింది. చిన్న ఊళ్లో పోస్టింగ్.. ప్రస్తుతం లాంగ్ లీవ్ లో ఉన్నాను.. అంది. ప్రతి క్లాస్ కీ, ప్రతి పరీక్షకీ ఠంచన్ గా సమయానికి ఐదు నిమిషాల ముందే వచ్చే తను, అందరి కన్నా ఆఖరు గా వచ్చింది. పలకరింపులు అవీ అయ్యాక.. ‘అమ్మమ్మ కి వంట్లో బాగోలేదు. నేను వెళ్లి కాస్త సహాయం చేసి వచ్చాను..’ అంది. ‘ఆహ్’ అనుకున్నాము. ‘ఏంటో.. పూర్వం చదువు తప్ప ఇంకేదీ పట్టేది కాదు. ఎప్పుడూ ఒక ఒత్తిడి లో ఉండేదాన్ని. అది తగ్గటానికి ధ్యానం, యోగా.. అనుకునేదాన్ని. పాటలు అంటే ఇష్టం..కానీ సమయం చిక్కేది కాదు. చుట్టాలని, చుట్టు పక్కల వారిని, ఎవ్వర్నీ పట్టించుకునే దాన్ని కాదు. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది. నేను మారాను.. నెలకోసారి మా అత్తగారి ఊర్లో ఉన్న పొలాల్లో పెంకుటింట్లో గడిపి వస్తాము. సంగీతం నేర్చుకుంటూ ఉంటాను. కచేరీలు చేయాలని కాదు. నలుగురితో గడుపుతూ, నలుగురికీ చేతనయినంత సహాయ సహకారాలందిస్తూ .. ఇదే నా ధ్యానం! ఏ యోగా నాకు ఇంత తృప్తి ఇవ్వలేవు అనిపిస్తుంది అంది. చాలా సంతోషం వేసింది.
వెళ్లి పోయేముందు.. అందరం కొద్దిగా బరువెక్కి ఉన్నాం, గొంతు కాస్త పూడుకు పోయి..... రేఖ.. చటుక్కున ‘అన్నట్టు.. ఒక విషయం మర్చిపోయా.. ‘ అంది. మేమంతా.. కుతూహలం గా చూస్తున్నాం.. ‘నా LIC ఇంటర్వ్యూకీ, రాత పరీక్షకీ అదే లక్కీ డ్రస్సు వాడాను..’ అంది. ‘పెళ్లి చూపులకో’ అని అడిగి వేళాకోళాలు చేసి.. నవ్వుకుంటూ విడిపోయాం.
రాలేక పోయిన రాజీ..
‘ఎవరన్నారు.. జీవితం మళ్లీ దొరకదని? స్పెయిన్ లో దూసుకు వస్తున్న దున్నపోతుల నుండి పరిగెత్తో, సముద్రపు లోతుల్లో దూకో, ఆకాశపు అంచుల్ని తాకేదాకో ఆగక్కరలేదు. చిన్న థాట్.. అవగాహన తో ఒక పాజిటివ్ దృక్పథం తో, పట్టుదల తో, పరిశ్రమ తో జీవితాన్ని తమకి కావలసినట్టు మలచుకున్నవారు ముగ్గురు... ఓకే ఒక్క బలహీన క్షణాన్ని దాటలేక, కావాలని చేసుకున్న పెళ్లి ద్వారా కావాలని కన్న బిడ్డల్ని వదిలి పోయిన వారొకరు.. ఆర్థికం గా, సాంఘికం గా వాళ్ల అభివృద్ధి గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. మనషులు గా ఈ ముగ్గురి లో వచ్చిన మార్పు నన్ను ఆశ్చర్యానందాలకి గురిచేసింది. ఏం మాట్లాడామో.. ఏం తిన్నామో..ఎలా బయట పడ్డామో.. సమయం అతి వేగం గా గడిచినట్టనిపించింది. సాయంత్రం రైలెక్కాల్సిన పని లేకపోతే నేను ఎప్పుడు ఇంటికి చేరేదాన్నో.. తెలియదు. కానీ బెంగుళూరు పిలుస్తుంది..వెళ్లక తప్పదు గా?
38 comments:
చాలా బాగుందండీ.. Very Inspiring..
నాకైతే నిజ జీవితాల గురించి చదువుతున్నట్లు లేదు. ఏదో సినిమా చూస్తున్నట్లు.. ఒక కథ చదువుతున్నట్లు అనిపించింది..
సహభాష్ కృష్ణప్రియ గారూ !!
" ఆ నలుగురు " పేరు చూసి క్లిక్ చేసి చదివే రెండు నిముషాల టైం లోపే
ఇదేదో ఏడు అడుగుల కర్రలు రెండు, వాటికి అడ్డం గా ఏడు పుల్లల కట్టలు బాపతేమో అనుకున్నా.
చదివాక ఆ ఆలోచన వచ్చినందుకు కించిత్తు సిగ్గేసింది.
ఇరవై సంవత్సరాలు చాలా ఎక్కువ కాలమేమో మనిషి కొద్దిగానైనా మారటానికి.
మీ స్నేహితురాళ్ళ ఉదంతాలు (మీతోకలిపి) నాలుగూ ఎంతో స్పూర్తిదాయకం.
చదువుతున్నంత సేపూ మనసు కాలేజీ, చదువు , పరీక్షలు అవన్నీ గాలికి ఒదిలేసి స్నేహితులతో తిరిగిన, చేసిన వాయు చేష్టలు మీదుగా పయనించింది.
ఎన్ని వెధవ పనులు చేసినా జీవితం లో బాగా వృద్ధిచెందిన నా మిత్రబృందం(నాతో కలిపి) గుర్తువచ్చి ఛాతీ పొంగింది.
ఆఖరి పేరా చదువుతుంటే ఎందుకో భారంగా, మనసుకి చెమ్మగా, చూపుకి మసకగా అనిపించింది
భాధతో కాదు, ఆనందంతో కాదు
ఏమో నాకున్న భాషా పరిమితి కి సరైన మాట రాయ లేను.
కానీ ఏదో భాద్యత రాహిత్యం ముఖ్యం గా "రాజీ" లాంటి వారి కోసం మనమేమీ ముందస్తు జాగ్రతలు చేయలేమా అన్న భావన.
మనం ఓకే, అందరూ ఓకే నా?
హూ.. నిట్టూర్పు వచ్చింది. నా గురించి ఎవరైనా నా ఫ్రెండ్స్ ఇలా రాస్తే ... చదువుకోవడానికి బాగుంటుందని పిస్తుంది. :)
బాగుందండి. మీ లక్ష్మిగారు నిజంగా విన్నరే! మీరు రాసుకునేదేదో రాసుకోక మాజ్ఞాపకాలను కదపడం ఎంతమాత్రమూ బాగాలేదు. ఇక్కదా రూంలో ఇదిచదివాక పేధ్ధ రీలులో సినిమా నడుస్తోంది.
హూ.. నిట్టూర్పు వచ్చింది. నా గురించి ఎవరైనా నా ఫ్రెండ్స్ ఇలా రాస్తే ... చదువుకోవడానికి బాగుంటుందని పిస్తుంది. :)
....
నాదీ ఇదే కామెంటు
కృష్ణ గారు రాయడానికి మాటలు రావడం లేదు..
లక్ష్మి గారు నిజం గా గ్రేట్...అలాగే రేఖ గారి జీవన సైలి కూడా బాగుంది...లిఖిత గారిలో చేంజ్...కొన్ని అలా జరుగుతుంటాయి...
రాజీ గారిది చదువుతోంటే మనసు భారం అయ్యింది...మీరన్నది నిజమే జీవితం మళ్ళీ ఎందుకు దొరకదు...:)
Truly inspiring!!!
కృష్ణా,
ఈ మధ్యనే కలిసిన చిన్ననాటి స్నేహితుల గురించి వ్రాయాలని అనుకుంటూ ఉన్నాను.
ఇంకా మేము ప్రత్యక్షంగా కలవలేదు. కానీ దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత టచ్ లోకి వచ్చాము.
ఎప్పుడూ e-mails వ్రాసుకుంటూనే ఉన్నా ప్రత్యక్షంగా కలిసినప్పటి తృప్తి ఇంకో స్నేహితురాలిని కలిసినప్పుడు పొందాను. ఇక నీతో పునఃపరిచయం ఎంత విచిత్రంగా జరిగింది! తలుచుకున్నప్పుడల్లా చిన్నగా నవ్వుకుంటాను. నాకున్న కొద్దిమంది స్నేహితుల్లో ఇంకా ఒకరిద్దరు తప్ప అందరూ ఇప్పుడు మళ్ళీ టచ్లోకి వచ్చారు.
నీ టపా బావుంది. చివర్నే బాధ వేసింది.జ్ఞాపకాలు బాగా నెమరు వేసుకున్నావు. ఆలోచనలు చక్కగా వ్యక్తీకరించావు.
నువ్వు పరిచయం ఎంత విచిత్రంగా జరిగింది!
నేను నా ఆలోచనలు వ్రాయగలుగుతానా? చూడాలి.
పాత స్నేహితులు ఫేస్ బుక్ ద్వారా కానీ ఇంకెలాగైనా కలిసిన వారిలో కొందరి గురించి నాకు ఎక్కువ గుర్తు ఉన్నాయి. కొందరికి నేను ఎక్కువ గుర్తు ఉన్నాను.
"అలాగే తనకి గుర్తున్నంత నాకు గుర్తు లేదని అర్థమయింది. అంటే నేను అప్పటి జీవితాన్ని వెనక వదిలేసి ‘ముందుకి’ వెళ్లిపోయాను.. అని అనుకుంటున్నాను.."
హ్మ్మ్ ... నా వైపు జ్ఞాపకాలను పరిశీలిస్తే నేను నా జీవితంలో కొన్ని భాగాలు వెనక వదిలేశాను, కొన్నిటిని ఎక్కువ పట్టించుకున్నానేమో అనిపిస్తుంది.దాదాపు ప్రతి ఒక్కరూ నా గురించి మంచి విషయాలే గుర్తుంచుకున్నారు. నాకు కూడా గుర్తు లేనివి. నేను ఇంకేవో విషయాలు తలుచుకుని కాస్త మొహమాటపడుతున్నా ఆ ఆవసరం లేదనిపించేలా చేశారు. That's friendship :)
పాతికేళ్ళ క్రితం ఇంటర్ కలిసి చదివిన మా ఆరుగురు స్నేహితులూ ఇప్పటికీ ఏడాదికో రెండేళ్ళకో కలుస్తూనే ఉంటాం.
మీ టపా చదివాకా మా స్నేహం గురించి చెప్పాలనిపించింది.
ఆ జిందగీ మళ్ళీ రాదు కాని ఆ జ్ఞాపకాలు ఎక్కడికీ పోవు.
@ వేణూ శ్రీకాంత్ గారు,
అవునా? :)) థాంక్స్!
@ ఆత్రేయ గారు,
చాలా థాంక్స్! మీ తప్పు లేదు లెండి. శీర్షిక అలా ఉంది. పైగా దాని టాగ్ లైన్.. బీస్ సాల్ బాద్ :) (అదేదో దయ్యాల సినిమా అనుకుంటా)
మీరు చెప్పారే.. అలాగే నాకూ భాషా పరిమితి,ఇంకా నాకు కలిగిన అనుభూతి ని కాగితం/కీ బోర్డ్ మీద పెట్ట లేకపోవటం జరిగింది.
@ snkr,
ఇది అసలు బెస్ట్ కాంప్లిమెంట్ ఈ టపా కి! ధన్యోస్మి..
@ Indian Minerva,
కానీయండి,కానీయండి! థాంక్స్!
@ తార,
ధన్యవాదాలు!
@ స్నిగ్ధ,
జీవితం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుందని నా అభిప్రాయం. మన చుట్టూ పరిస్తుతులు మాత్రం కొన్ని మన ప్రమేయంతో, కొన్ని మన ప్రమేయం తో మారిపోతూ ఉంటాయి కదూ? ఎప్పటికప్పుడు రిట్రాక్ట్ అయి తాజా అప్రోచ్ ఇవ్వటం లో అసలు కిటుకు ఉంటుందని అనుకుంటున్నాను.
@ bonagiri,
నేను రెండు పేజేల్లో చెప్పింది మీరు రెండు ముక్కల్లో చెప్పారు.భేష్!
ఆలోచనల్లో పడేశారు.. నిజమే.. ఒక్క క్షణం చాలు జీవితం మారిపోడానికి... అది ఏరకంగా అయినప్పటికీ....
Dear Krishna Priya,
Meeru chala baaga blogs raastaru :)
office lo kurchuni enta pani unnna meee posts motham chadivesaanu.
I have been following your blogs since few months.
looking forward for more sweet muffin like posts.
ఫేస్ బుక్, ఆర్కుట్ ల పుణ్యమా అని బోలెడు మంది పాత స్నేహితులను మళ్ళీ కలుసుకొనే అవకాశం వచ్చింది. దేశాంతరం వల్ల కబుర్లను చాటింగ్ కే పరిమితం చేసుకున్నాం ప్రస్తుతానికి. "కలిసి ముచ్చట్లాడుకుంటే ఇలా ఉంటుందా!" అనిపించింది మీ అనుభవం చదువుతూ ఉంటే. ఆ రోజు తొందరగా వస్తే బాగుండునని ఆశగా కూడా ఉంది. మీ టపా గురించి ప్రత్యేకంగా పొగిడేదేముంది! జగద్విదితం. చక్కగా ఉంది.
ఆ నలుగురు గురించి బాగా రాసారండి .
అవునండి " జిందగీ న మిలేగీ దుబారా " చూసినప్పుడు హోరినీ జొందగీ కోసం ఇవన్నీ చేయాలా అని నాకూ అనిపించింది :) జీవితం మీద ప్రేమ వుండాలే కాని , చిన్న చిన్న అనుభూతులలో కూడా జీవితం దొరుకుతునేవుంటుంది .
ఇలాగ బాల్య స్నేహితులతో కలవడం అనేది జరగ లేదు నాకు. కొంతమంది బాల్య స్నేహితులతో అప్పటినుంచి టచ్ లో ఉన్నాను. వాళ్ళ తోటి అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాను.
ఈ అనుభవం నేను మిస్ అయ్యాను. తప్పి పోయిన మరి కొందరి మిత్రులను వెతకాలనిపిస్తోంది ఇప్పుడు.
చివరి పేరా బాగుంది. వేణూ శ్రీకాంత్ గారన్నట్టు ఒక కధ లాగా ఉంది ఈ మీ అనుభవం.
>>>అలాగే తనకి గుర్తున్నంత నాకు గుర్తు లేదని అర్థమయింది. అంటే నేను అప్పటి జీవితాన్ని వెనక వదిలేసి ‘ముందుకి’ వెళ్లిపోయాను.. అని అనుకుంటున్నాను.. కొత్త స్నేహితులు, కొత్త జీవితం. ఆ రోజులు ఎక్కడో ఆటక మీద నెట్టేసిన అట్ట పెట్టెల్లో.. అప్పట్లో నా గురించి తను చెప్తుంటే.. ‘నేనేనా అది?’ అని ఆశ్చర్యం కలిగింది.
---
ఈ ముక్క కొంచెం ఆలోచింపచేసిందండి. మీ సమావేశం బాగుందండి, అలాగే మీ మిత్రుల జీవనయానం జీవితానికి ఇంకొన్ని కోణాలు చూపించింది. మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
అలాగే అపుడెపుడో నా ఇంగ్లీషు బ్లాగులో స్నేహం గురించి రాసుకున్న వ్యాసాలు గుర్తొచ్చాయి. నా బ్లాగు ప్రచారమని అనుకోమాకండే :-)
నేను అనుభవించిన దాన్ని మీ మాటలలో చెప్పినట్టు అనిపించింది. మేమూ ఇలాగే కలుసుకున్నాము.
ఇంకా కలవాల్సిన వాళ్ళు వున్నారు. మీ టపా చదివాక ఏమి రాయాలో తెలీడంలా. థాంక్స్. అంతే
హమ్మయ్య!
ఇంక్కొన్ని రోజులకి బ్రెయిన్ టానిక్ దొరికేసింది.
మీ టపాలు చదవక పొతే నా పరిస్థితి, ఐసియు లో వున్నా పేషెంట్ కి రెగ్యులర్ గా మెడిసిన్ ఇవ్వక పొతే కండిషన్ పాడైపోయినట్టు వుంటుంది.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నుంచి ఎప్పుడు వొస్తారా, టపా ఎపుడు రాస్తారా అని చూస్తున్నా.
క్రిష్ణప్రియ గారు,
చాలా మంచి అంశం గురించి వ్రాయటమే కాదు అందులో చూడాల్సిన విషయాల్నికూడా చక్కగా ప్రతిబింబించారు. మీరు మామూలుగా ఇలానే వ్రాస్తారు కానీ, ఈ టపాలో చదువరుల కోసం కాకుండా మీకనిపించిన దాన్ని సూటిగా వ్రాశారనిపించింది.(I may be wrong, but its just my personal opinion and observation)
ఇంక టపాలోని విషయాల కొస్తే..అందరూ తమ తమ జీవితాల్లోనూ వ్యక్తిత్వాల్లోనూ ఎదగడమే కాకుండా ఆ ఎదుగుదలకి స్వంతంగా కృషిచేసి ఫలితాన్నీ జీవితానీ ఆనందంగా అనుభవించగలుగుతున్నారు. వాళ్ళలో సహజంగా ఉన్న మంచి గుణాల్ని మారిన పరిస్థితులకీ ప్రాధాన్యతలకీ అనుగుణంగా మలుచుకోగలిగారు.
లిఖిత గారి విషయంలో -- > తనకి జీవితంలో ఏమికావాలి అనేదాని మీద నిర్దిష్టమైన అవగాహనా స్పష్టత ఉండడం దానికోసం ఎంతైనా శ్రమ పడగల పట్టుదలా, శ్రమిస్తూనే ఆనందంగా ఉండగల నేర్పూ ఆవిడలో అప్పుడూ ఇప్పుడూ ఉన్న మంచి లక్షణం. ఒకప్పుడు కెరీర్ కోసం శ్రమించినట్టుగానే తరవాత తన ఆనందం కుటుంబంలోనూ తన వాళ్ళలోనూ ఉందనిపించినప్పుడు అందులోనూ అదేవిధమైన పరిశ్రమ చెయ్యడం ఆనందంగా ఉండగలగడం జరిగింది. కుటుంబం కోసం జీవించే చాలా మందిలా కాకుండా ఇతర విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండటం తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉండటం లిఖిత తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటునే ఉన్నారనేదానికి నిదర్శనం.
లక్ష్మి గారి విషయం లో --> వైవాహికజీవితం మాత్రమే భవిష్యత్తు అనుకునే రోజుల్నుండి, జీవితాన్ని ఏ రోజునుంచైనా ఏ పరిస్థితులనుండైనా మళ్ళీ చిగురింపచేయొచ్చు అన్నట్టుగా సాగింది. ఎక్స్పోషర్ లేక పోవడం వల్లో, సరైన గైడెన్స్ లేకపోవడం వల్లో చాలా మంది కేవలం వైవాహిక జీవితమే జీవిత పరమావధి అన్నట్టుగా ఆలోచిస్తారు. కానీ ఈమె తనకి అవసరమైనప్పుడు ఆత్మ విశ్వాసంవల్ల తిరిగి జీవితాన్ని నిలబెట్టుకోగలిందనిపిస్తుంది. చాలా సార్లు మనం రిలేట్ చేసుకోగలిగేవాళ్ళు ఇచ్చే ఇన్స్పిరేషన్ చాలా బాగా పనిచేస్తుంది మనమీద అనడానికి ఉదాహరణే ఆమె జీవితాన్ని మార్చేసిన కార్డు ముక్క. ఈవిడ విషయంలో ప్రత్యేకత ఏంటంటే, తనకీ తన వాళ్ళకీ అవసరమైనప్పుడు ఎంత కష్టమైనా సాధించి ఆనందంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోగలగడం.
రేఖ గారి విషయంలో --> తన ప్రాధాన్యతలేంటో వాటికి ఎలా కష్టపడాలో మొదట్నుంచీ క్లారిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అనుకున్న పద్దతిలో జీవితాన్ని తీర్చిదిద్దుకున్నా తనలోని లోపాన్ని గమనించి దాన్ని సరిదిద్దుకోగలగడం (తన మీద ఉండే విపరీతమైన ఒత్తిడిని తగ్గించుకోగలగడం). కావలిన దానికోసం కష్టపడుతూనే, ఇతరవిషయాలని కూడా ఆనందించడం అవసరం అని గురించి తగిన మార్పులు చేసుకోగలగడం ద్వారా రేఖ గారు తన వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకున్నారు.
రాజీ గారి గురించి --> బాధాకరం. నో కామెంట్స్.
Yes. You can definitely be proud of your friends. If we look at the world properly we can see heros all around us. Most of the people around us have a story to tell and waged great struggles to win the battles of their lives. We just need to observe them with positive attitude and we need to have the honesty to appreciate and humility to learn from them. You have exhibited these fine qualities in your writings.
ఇంక వీళ్ళందరి మరో స్నేహితురాలి గురించి మీరు పెద్దగా వ్రాయలేదు :) but the following lines from the post tells a lot about her.
>> "ఈ సారి తడిసిన సిటీ అందాల్ని గమనించటం లో, ఇష్టమయిన స్నేహితులతో నైట్ అవుట్ చేసి, పాత స్నేహితులని కలిసి.. వీటిల్లోనే ఎక్కువ ఆనందాన్ని పొందినట్టున్నాను."
>> "ఆర్థికం గా, సాంఘికం గా వాళ్ల అభివృద్ధి గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. మనషులు గా ఈ ముగ్గురి లో వచ్చిన మార్పు నన్ను ఆశ్చర్యానందాలకి గురిచేసింది. "
glad .. and .. sad.
అయ్యయ్యో, నేనూ సినిమా గురించే అనుకున్నాను. మంచి విషయాలు కనపడేసరికి, రెండు మొట్టికాయలు వేసుకున్నా కూడా. జీవితాన్ని ఎదుర్కోలేకపోవడానికి వాళ్ళకి ఏ కారణాలుంటాయో తెలీదు కానీ, పంచుకుంటే కాస్త ఊరటనిచ్చే స్నేహితులుండరా అని బెంగగా ఉంటుంది.
మనసైన జ్ఞాపకాలన్నీ కోల్పోయిన వ్యక్తులను గుర్తు తెచ్చినప్పుడు, ఏకాంతంలో ఓదార్పునిచ్చేందుకు ఎవరొస్తారిక ?
కాస్త బాధతో, ఇంకాస్త ఆశతో (నేనూ పాత స్నేహితులనెవరినైనా కలుస్తానా అనుకుంటూ...) ..
@ లలితా,
తప్పక రాయి. ఎంత ఈ మెయిల్స్ రాసుకున్నా.. ప్రత్యక్షం గా కలవటం చాలా గొప్ప గా ఉంటుంది.
ఇక మనమూ బ్లాగ్ ద్వారా పదిహేనేళ్ల తర్వాత కలిసినట్టున్నాం? :)
నువ్వు చెప్పిన తర్వాత చూస్తే.. ఆ వాక్యాలు అసంపూర్ణం గా ఉన్నాయని అర్థమైంది. నిజానికి నాకు గుర్తున్నవి వాళ్లకి గుర్తులేవు అలాగే వాళ్లకి గుర్తున్నవి నాకు గుర్తులేవు. వాళ్లూ ఆశ్చర్యపోయారు, అలాగే నేనూనూ!
@ మురళి గారు,
థాంక్సండీ!
@ సుమ,
మొదటి సారనుకుంటాను మీరు నా బ్లాగ్ కి వ్యాఖ్య రాయటం ? స్వాగతం మరియు ధన్యవాదాలు!
@ కొత్తావకాయ,
అవును. ఈ ఎక్స్పీరియన్స్ అనుభవిస్తే కానీ అర్థం కాదు. నాకైతే మా లిఖిత ని కళ్ళేమో మసక గా, గుండె దడ,దడ, కాళ్లు శక్తి హీనం గా నోట్లోంచి మాట పెగిలి రాలేదు. అద్భుతం!
@ మాలా కుమార్ గారు,
హమ్మయ్య మీరూ నాలాగే అనుకున్నారన్నమాట! థాంక్యూ.
@ బులుసు వారు,
ధన్యోస్మి!
@ జెబి - JB,
మీ ఆంగ్ల బ్లాగ్ కెళ్లి వచ్చాను.. ట్రూ ఫ్రెండ్ షిప్ పోస్ట్ చదివాను. మీరు2006 నుంచీ రాస్తున్నట్టున్నారు. చాలా బాగుంది.
@ తొలకరి,
ధన్యవాదాలు! చాలా సంతోషం గా ఉంది.
@ కృష్ణ,
:)
@ WP,
మొదటి సారి చాలా పెద్ద వ్యాఖ్య పెట్టినట్టున్నారు. నా స్నేహితులు మీచేత ఈ పని చేయించినట్టున్నారు. మీరు ముగ్గురి స్వభావాల మీద రాసిన వ్యాఖ్యలు
కరెక్ట్ గా అనిపించింది
ఇక ఐదో స్నేహితురాలి గురించి రాసి రాసి బ్లాగ్ లోకానన్ని ఓవర్ లోడ్ చేస్తుంటే ! :)
@ మౌళి,
:)
@ కొత్త పాళీ గారు,
థాంక్స్!
@ మానస చామర్తి,
:) మీరూ సినిమాయే అనుకున్నారా?
అవునండీ పాపం ఏం కష్టం ఎదుర్కొందో.. ఎందుకు ధైర్యం కోల్పోయిందో..
కృష్ణా,
అవును. అది కూడా నీ చొరవతోటే. నా గురించి నీకేమి గుర్తున్నాయో తెలీదు (ఇక్కడచెప్పొద్దు)కానీ, నీ గురించి మర్చిపోలేని విషయం ఒకటి:
నాకు మొట్టమొడటి సారి, అదృష్టవశాత్తూ ఇప్పటి వరకూ ఆఖరి సారీ ఎందుకనో విపరీతమైన breathing trouble వచ్చినప్పుడు నీ రూములోనే సేద తీరాను. నా రూం మేట్స్ హాయిగా నిద్రపోతూ నేనేదో అనవసరంగా గొడవ చేస్తున్నానేమో అన్నట్టు ఉండగా నాకు నువ్వూ, నీ రూం మేట్స్ నాకు చాలా సాయం చేశారు.
నేను చాలా దగ్గరగా స్నేహితులుగా అనుకున్న వారు చాలా కొద్ది మందే. కానీ ఏ కారణం వల్లో పరిచయమైనా మరీ దగ్గర కాని వారితో కొంతమందితో ఇలా మర్చిపోలేని సంఘటనలు నాకు జరుగుతుంటాయి. అందుకే నేను ఎవరినీ ఫలానా లాంటి వారు అని తీర్పు ఇచ్చి దూరం చేసుకోలేను. అలాగే మరీ ఎక్కువ మందితో సన్నిహితంగానూ ఉండలేను.
నిన్ను ఇలా మళ్ళీ కలుసుకోవడం (తెలుసుకోవడం) నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ మధ్యే కలిసిన ఇంకో చిన్ననాటి స్నేహితురాలు కూడా అనుకోని విధంగా ఇంకో స్నేహితురాలి ద్వారా నన్ను కలుసుకుని ఎవరినీ ఎప్పటికీ వదిలెయ్యకూడదనీ, ఎప్పుడు ఎవరు మనని మనకి కావలిసిన వాళ్ళతో కలుపుతారో తెలియదు అనీ అంది.
ఇక్కడే ఇంకో టపా సైజు వ్యాఖ్య వ్రాసేట్టున్నాను. ఇప్పటికిది చాలు.
**** 4*s
చాలా బావుందండీ మీ కలయిక... ఆఖరి పేరా మరీ బావుంది. ఇక్కడ US లో మేము నలుగురం స్నేహితులం మళ్ళీ ఒకే వూరిలో వుద్యోగాల ద్వారా కలిశాం. అంతగా విడిపోయి కలవలేదనుకోండి...కాస్త touch లో వున్నవాళ్ళమే అయినా ఒకే చోట మళ్ళీ కలవటం భలే అనిపించింది. అందులో ఒకమ్మాయికి మేమంతా కలిసి surprise baby shower చేసి మిగిలిన చోట్లలో వున్న friends ని conference call లో కలిపాము...తనకన్నా మిగిలిన మా అందరి excitement ఎక్కువైపోయింది ఆరోజు...
చాలా బావున్నాయండీ మీ re-union విశేషాలు..
సుమారు ఇలాంటిదే నాకు కూడా ఒక సంఘటన అనుభవంలోకి వచ్చింది ఈమధ్యనే!. నా బాల్యమితృడ్ని(http://kakaalu.blogspot.com/2011/09/blog-post.html) కలుసుకున్నా.. చాలా ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత.. :)
కృష్ణ ప్రియ గారు మీ స్నేహితుల కలయిక కదిలించే విదంగా ఉంది . పెర్లుమర్చి దీన్ని మీరు ఒక కథగా ఏదైనా పత్రికకు పంపవచ్చు కదా?
chala baga rasarandi.....nijjanga oka katha vintunnatlu,oka cinema chustunnatlu...chala feelings oke sari vachi...kalagapulagam aipoyinatlu....chala goppa feeling kaligindi..thanq very much...
లలితాజీ,
నాకు గుర్తుంది! నేనూ ఎప్పుడూ ఎవ్వర్నీ చూడలేదు అలాగ. కాస్త టెన్షన్ పడ్డాము..
>>>> అందుకే నేను ఎవరినీ ఫలానా లాంటి వారు అని తీర్పు ఇచ్చి దూరం చేసుకోలేను.
Well Said!
@ మహేశ్ కుమార్,
థాంక్స్!
@ స్ఫురిత,
ఓహ్ బాగుంది బాగుంది,
@ రవికిరణ్,
థాంక్స్! చదివానండీ.. కామెంట్ కూడా చేసినట్టు గుర్తు. కుచేల మిత్రుడి కథ.
@ బుద్ధా మురళి గారు,
మీ వ్యాఖ్య చూశాక చాలా చాలా సంతోషం వేసింది ఈ పేర్లు కూడా.. వాళ్ల ప్రైవసీ దృష్టి పెట్టుకుని పేర్లు మార్చటమైంది.
పత్రికలకి ఎప్పుడూ పంపలేదు. దానికి పధ్ధతి కూడా తెలియదు. వాళ్ల దగ్గర బోల్డు వ్యాసాలూ వస్తాయికదా.. మూల పడేస్తారేమో..
@ వరుణ శ్రీకాంత్ గారు,
ధన్యోస్మి! మీరు నా బ్లాగుకి ఇదే రావటం అనుకుంటాను.. స్వాగతం!
Krishna Priya Garu,
ledandi...oka one month ninchi mee blog ni follow avuthunnanu, naku chala nachesina first blog almost...chusara? mimmalni meeku teleekunda rahasyanga ela anusaristunnano...:)
@ వరుణ శ్రీకాంత్,
:) థాంక్స్!
@ వరుణ శ్రీకాంత్,
:) థాంక్స్!
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.