Sunday, December 25, 2011 47 comments

మూడు వందల అరవై రోజుల జ్ఞాపకాలు....ఇంకో కాలెండర్ చెత్త బుట్టలోకి.., ఇంకో ‘యాప్పీ న్యూ ఇయరు..’ పది పేజీలు రాసి వదిలేసే ఇంకో డైరీ, రెండు రోజులు ఆచరించి మూలన పెట్టిన రెసొల్యూషన్లు.. ఈసంవత్సరం పోగేసిన ఇంకో నాలుగు పౌండ్లు.. మూడు వందల అరవై రోజులు,.. అంతేనా? ఒక సంవత్సరం కొందరి జీవితాల్లో ఓడల్ని బళ్లు గా .. బండ్లని ఓడలు గా మారుస్తుందేమో, . కొంత మంది జీవితాల్లో ఎక్కడి గొంగళి ని అక్కడే ఉంచేస్తుందేమో, వయసు పెరిగిన కొద్దీ, నలభైలకి దగ్గర కొస్తున్నకొద్దీ జీవితం గానుగెద్దు జీవితం లా అలాగే ఉంటుందనీ, పెద్దగా కూర్పు, మార్పు,చేర్పులుండవనీ, విసుగెత్తిపోతుందనీ.. ఎన్నో విన్నాను. మానసికం గా రెడీ అవ్వాలనుకుంటూ కూడా ఆలోచిస్తూన్నాను ఒకప్పుడు.. కానీ నాకైతే 2011 బాగా పాళ్లు కుదిరిన ఉగాది పచ్చడి లా.. కొద్దిగా తియ్యగా, పుల్లగా, చేదుగా,కమ్మగా,కారంగా, వగరు గా, అన్ని రకాలు గా.. జయోపజయాలు, కష్ట సుఖాలు, శాశ్వతమనుకున్న కొన్ని పరిచయాలు స్నేహాలు, ముందు రోజు జాజుల్లా వడలిపోగా, కొన్ని పరిచయాలు ఆకులు దూసేసిన మల్లె తీగలా కొత్త చిగుర్లు తొడగటాలు,.. ఎవరిదో బ్లాగ్ టాగ్ లైన్ లా ‘సహస్ర వర్ణ శోభితమీ జీవితం’ అన్న మాట కి అర్థం తెలిసేలా..


కమ్మగా,..కొబ్బరి పలుకుల్లా..

భలే పుస్తకాలు చదివాగా..

ప్రొ. బైరప్ప గారు రాసిన పర్వ, డా. కేశవరెడ్డి గారు రచించిన ‘మునెమ్మ’, ‘అతడు అడవిని జయించాడు’, యండమూరి రాసిన ‘డేగ రెక్కల చప్పుడు’, యార్లగడ్డ రాసిన ‘సత్యభామ’, మధురాంతకం వారి కథల కలెక్షన్, శ్రీపాద వారి పుల్లం పేట జరీ చీర, మార్గదర్శి కథల సంకలనాలు, నాలుగు కాలక్షేపం ఆంగ్ల నవలలు, అరడజను తెలుగు నవలలు,నవలికలూ..

నచ్చిన కొత్త రుచులు!

ఉలవచారు మీగడ తో, కిసాన్ వారి కొత్త క్రీం చీజ్ లు, శొంఠి, కర్వేపాకు కాడల చారు, డామినోస్ వారి చాకో లావా కేక్, హైడ్ & సీక్ – కిస్ ఆఫ్ కాఫీ బిస్కట్లు,

హం చేసుకున్న కొత్త పాటలు..

శంకర్ మహాదేవన్ - గణేశాయ ధీమహి, Mr Perfect - చలి చలిగా, JNDB- సేనోరిటా, రావన్ -చమ్మక్ చల్లో..

చేసుకున్న కొత్త అలవాటు..

ఒకటి రెండు ఇంట్లో శుభ కార్యాలకి తప్ప, సింథటిక్,పట్టు బట్టల వాడకం దాదాపు లేకపోవటం. అన్నీ నూలు బట్టలే నా వార్డ్ రోబ్ ని ఆక్రమించటం..

వ్యవసాయ విజయాలు..
చెప్పుకోదగ్గ పంటలు (కొద్దిగా పెద్ద పదం వాడినట్టున్నాను).. సంక్రాంతికి పసుపు కొమ్ములు తవ్వుకోగలగటం, ౨౦ గ్రాముల కందిపప్పు పండించుకోగలగటం, ఓ నాలుగు కిలోల చేమగడ్డలు, ఎనిమిది గెలల అరటి పండ్లు,.. బ్రహ్మ కమలాలు

తియ్య తియ్యని కొత్త బెల్లం లాగా.. మంచి బ్లాగ్ జ్ఞాపకాలు..

బ్లాగు లో దాదాపు అన్ని టపాలూ, విహంగ లో ఒక రచన, మాలిక పత్రికలో ఒక రచన, ఒక పుస్తకానికి తొలి రివ్యూ, ఒక సినిమా కి నవతరంగం లో ఏ-వ్యూ, నమస్తే ఆంధ్ర లో నా బ్లాగ్ టపా, బ్లాగ్ పరిచయం.. కృష్ణప్రియం టపా, స్ఫురిత వేసిన నా బ్లాగ్ ప్రొఫైల్ బొమ్మ, బోల్డు ఈ-ఉత్తరాలు..

అందుకున్న ప్రశంసలు..

నా తో అనారోగ్యకరమైన పోటీ తత్వం తో బాధపడుతున్న ఒక వ్యక్తి, ఒక బలహీన క్షణం లో నా బాటే కరెక్ట్ అని అంగీకరించటం, ,

కొన్ని బ్లాగర్ల ఈ-మెయిళ్ళు

చేసిన తప్పులు..

అబ్బా..ఇది కష్టం బాబూ.. చాలా చేశాను. అయినా.. కొన్ని .. స్కూటర్ మీద వెళ్తూ కూలీల పిల్లలిద్దరు ‘లిఫ్ట్’ అని అడిగితే కొంపలు మునిగే పని లేక పోయినా..సినిమా హాల్లో పార్కింగ్ దొరకదేమో నన్న బెంగ తో ఎక్కించుకోకపోవటం.. తర్వాత సినిమా చూస్తున్నంత సేపూ, అయ్యో అని వగచటం.

ఇస్త్రీ చేసే కుర్రాడు, నా బిడ్డ వయసు వాడు.. కేవలం పండగలకీ, పబ్బాలకీ స్వీట్లూ, అవీ ఇస్తాననీ,స్కూల్ ఫీజు కడుతున్నానన్న (ఎక్కడో మస్తిష్కం లో దాక్కున్న) గర్వం తో, ఒక విషయం లో సరిగ్గా పని చేయలేదని కొద్దిగా అవమానకరం గా మాట్లాడటం, సంవత్సరం అంతా.. మానని గాయం లా అది బాధించటం.

ఆఫీసులో కొంత పనిని కావాలని తప్పించుకోవటం, ఆఫీస్ సమయం లో వ్యక్తిగత పనులు చేసుకోవటం, .కొన్ని సార్లు హాస్యం శృతి మించి ఎదుటి వారిని గాయపరచటం.. ఒకరిద్దరిని ‘అవాయిడ్’ చేయటం..

మనస్సుకి నచ్చిన ఒక రోజు..

ఉదయపు అల్ఫాహారం, తోట పని, తలంట్లు అయ్యాక ఒకానొక ఆదివారం, పిల్లలు ఏదో ప్రాక్టీసులకని, శ్రీవారు ఆఫీసు పనికనీ,వెళ్తే.. నచ్చిన పుస్తకం చదువుకుంటూ, ఆవకాయన్నం తిని, ఒక కునుకు తీసి, చిరు చీకటి సమయం లో దీపాలు పెట్టకుండా.. పురందర దాసు రచించిన కాపీ రాగ కృతి ‘జగదోద్ధారణ’ పాడుకుంటుంటే, పక్కింటావిడ (బోంబే జయశ్రీ పెద్దమ్మ కూతురు) తన శృతి పెట్టే తెచ్చుకుని మరీ వచ్చి, నాతో కూర్చుని బోల్డు పాటలు పాడటం..

చిరు విజయాలుఎప్పుడో చిన్నప్పుడు చూసిన ‘లైవ్’ హరికథ, దూర్ దర్శన్ పుణ్యమాని టీవీ లో మళ్లీ అప్పుడప్పుడూ చూసిన ప్రక్రియని ఆంగ్లం లో ‘దాక్షాయణి’ కథ ని ‘నాదా తనుమనిశం శంకరం’ , ‘నటనం ఆడెనే’, ‘శివాష్టకం’ లాంటివి పాడుతూ కర్ణాటక సంగీతం కృతులతో, పద్యాలతో కూర్పు చేసుకుని, నా పెద్ద కూతురి గాత్ర సహకారం తో కాంప్లెక్స్ వాసులకి చెప్పటం..

అన్ని వైపుల నుండీ వచ్చే ఒత్తిడులకి చెదరకుండా, బెదరకుండా, రెండు పెద్ద కస్టమర్ ఇష్యూలకి చెక్ పెట్టటం, నా కారీర్ లో ఇంకో ప్రాజెక్ట్ కొత్త బాక్స్ మీద సంవత్సరపు ఆఖరి రోజున పని చేయించగలగటం..

పిజ్జా, పాస్టా లే తిండి పదార్థాలు, ఆలుగడ్డ వేపుడు, ఉత్తర భారతీయులు చేసుకునే మీగడల, పనీర్ కూరలు మాత్రమే , తినాలి అనుకునే మా పిల్లల తో,.. పెసరపచ్చడి, నెయ్యన్నం, కాబేజ్, కాప్సికం, ముఖ్యం గా వంకాయ పులుసు అలవాటు చేయటం.


ఏకైక తమ్ముడికి పెళ్లి కుదిర్చటం లో ప్రముఖ పాత్ర వహించి, మరదల్ని తెచ్చుకోవటం.

సుమన్ బాబు సినిమాలకి ‘టెంప్ట్’ అవటమో, రాత్రి పూట మీటింగ్ లు నడుస్తుంటే పది దాటాక వేసే తెలుగు/హిందీ సినిమాలు చూడటం, అప్పుడప్పుడూ వేరే పనేదో చేసుకుంటూ చూసిన ఆంగ్ల సినిమాలు తప్పితే, టీవీ వ్యామోహం నుండి దూరమవగలగటం..

ఇంట్లో Wii,DS ల్లాంటివి ఉంచుకుని కూడా పిల్లలకి వాటి వైపు ధ్యాస పోకుండా ఆటపాటల్లో, పుస్తక పఠనం ఎక్కువ సమయం గడిపేలా చేయగలగటం.

మహాభారతం కథ విశదం గా చెప్పి, ఆఖర్న కొన్ని కథలు సగం సగం వదిలి, తద్వారా, మా పెద్దమ్మాయి తో డా. రాజ గోపాలాచారి గారి భారతం, దేవదత్త పట్నాయక్ రచించిన ‘జయ’ చదివేలా చేయగలగటం, అలాగే ఇడ్లీలు, దోశలు, పచ్చడి,మాగీ,సాండ్ విచ్ లు చేసుకోవటం అలవాటు చేయటం.

అపజయాలు..

నా దగ్గర చేరిన BITS BTech intern చేత పని చేయించుకోలేకపోవటం..

సంగీతం నేర్చుకోవటం ఆపేయటం.,

కార్ డ్రైవింగ్ టెస్ట్ కి ఈ సంవత్సరం కూడా వెళ్లకపోవటం...

యోగా వదిలేయటం.

స్నేహితులు..

ఇరవయ్యేళ్ల తర్వాత, కలిసిన నలుగురు స్నేహితులు, పదహారేళ్ల తర్వాత కలిసిన ఇంకో స్నేహితురాలు.. Thank you facebook, Linked in!

కేవలం నాలుగేళ్లు కనుమరుగమవటం వల్ల, పల్చబడ్డ పదిహేనేళ్ల స్నేహాలు రెండు మూడు..

కొత్తగా ఏర్పడ్డ మూడు స్నేహాలు..

ప్రయాణాలు..

బెంగుళూరు కి దగ్గర ఊళ్లకి వారాంతం ట్రిప్ లు..మేకెదాటు, రామ నగర, దొడ్డ మలూర్, కాలి నడకన తిరుపతి వెంకన్న దర్శనం, అమెరికా, పారిస్ పర్యటన, ఒక ఎనిమిది సార్లు హైదరాబాద్ ట్రిప్పులు, ఒక కడప ప్రయాణం..

దుఃఖాలు.. వ్యక్తిగతం గా పెద్దగా లేనట్టున్నాయి. పేపర్లలో పడ్డ కొన్ని సంఘటనలు, దేవానంద్ మరణం,

‘వా హ్’ అనుకున్న సెలెబ్రిటీ .. అన్నా హజారే

‘వార్నీ’ అనుకున్న దొంగలు : గాలి జనార్థన్. కనిమొళి

కొత్తగా సంపాదించిన చరాస్తులు.... నా బ్లాక్ బ్యూటీ (నల్ల హోండా ఆక్తివా బండి), ఒక జత బంగారు గాజులు.

బాగా కాయకష్టం చేసి అలిసిన రోజు.. వెంకన్న దర్శనం కోసం కాలి బాటన వెళ్లటాన్ని వదిలేస్తే, ఇంటి వెనక తోటంతా శుభ్రపరచిన రోజు..

‘అమ్మయ్య’ అనుకున్నరోజులు... తమ్ముడి పెళ్లయి ఇంటికి వచ్చిన రోజు, పిల్లల పరీక్షలైన రోజు, నిరోష్ఠ బ్లాగాయణం టపా అయిందనిపించినరోజు..

ముప్పైల్లో అందులో ఆఖరి సంవత్సరం ఇంత ఇంటరెస్టింగ్ గా గడుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు రోలర్ కోస్టర్ రైడ్ లాంటి బిజీ జీవితం లో చిన్న సర్ప్రైజ్ లు చిలకరించి మనసు లోతుల్లో, ఎక్కడో ఆటక పైన పెట్టిన దుమ్ము పెట్టిన అట్ట పెట్టెల్లో దాచిన పాత పరిచయాలు, అప్పుడప్పుడూ ఒక్కోటి గా దింపి, నెమరు వేసుకునేలా చేసిన ఘనత మాత్రం ఫేస్ బుక్, బ్లాగ్, లింకేడ్ ఇన్ లకే ఇస్తాను. మళ్లీ మనుషులని కాస్త దగ్గర చేయటానికి విత్తనం అయితే వేయబడింది. ఇక వాటిని నీళ్లు పోసి, జాగ్రత్తలు చేసి నిలుపుకోవటం, వదిలేయటం నా చేతుల్లోనే ఉంది.

ఇంకో ఐదు రోజులుంది కొత్త సంవత్సరాగమనానికి... ఇంకెన్ని రంగులున్నాయో, రుచులున్నాయో, ఇంకెన్ని  పరిమళాలు నా కోసం వేచి ఉన్నాయో,. చూద్దాం!

Tuesday, December 20, 2011 34 comments

తథాస్తు దేవతలు చేసిన మేలు..


ఆఫీస్ డెడ్ లైన్ దగ్గరకొచ్చేసింది.. ప్రతి రోజూ అర్థ రాత్రి దాకా కాన్ఫరెన్స్ కాల్సు,.. వెండర్ హార్డ్ వేర్ కరెక్ట్ చేసి ఇయ్యడు, కస్ట్ మర్ ఇస్తావా చస్తావా? అని బాసు గారి మీద రంకెలేస్తే, ఆయన యథాతథం గా ఆ దీవెనలన్నీ, ముళ్లల్లో జాగ్రత్త గా పెట్టి, దానికి ఆయన తిక్క కూడా జోడించి మా నెత్తి మీద గుమ్మరించేశాడు. సరే ‘జీతాలు తీసుకోవట్లా?’ అనుకుని, ఈ పనుల్లో హడావిడి గా.. తిరుగుతున్నానా? వచ్చే వారం నుండీ పిల్లల పరీక్షలని గుర్తుకొచ్చింది. వీళ్లని చదివిస్తూ, కస్టమర్ బగ్.. చూసుకుంటూ.. పదేళ్లు గా ఒక్కసారైనా మా ఇంటికి రాలేకపోయిన బంధువులు వస్తున్నామని ఫోన్.. ‘ఆహా! ఏమదృష్టం!’ అనుకుంటూ, చంద్రముఖి లో రజనీ లా.. “అసలు నా ఊహ కరెక్ట్ అయితే ఈ పాటికి పనమ్మాయి కి జలుబో, జ్వరమో రావాలి” అని కళ్ళు మూసుకుని ఇలాగ అన్నానో లేదో.. ఫోన్ రింగ్ అయింది.

‘హలో’ కి సమాధానం.. “ఖళ్ ఖళ్” మేరీ.. “ఒడంబు సరి ఇల్లే మేడం..”

ఒక్క క్షణం నా వాక్షుద్ధి కి గర్వించినా, అంట్లు, బట్టలు,ఇల్లు తుడవటం లాంటి అదనపు బాధ్యతలు కూడా కూడా నెత్తిన పడ్డాయి. కప్పు చాయ్ తాగేలోగా కనీసం మూడు సార్లు వెచ్చపెట్టుకోవటం,.. నీలపు పన్ను (బ్లూ టూత్) లో కాల్స్ లో మాట్లాడుతూనే తినటం, పిల్లల్ని తయారు చేయటం, వంటలు వండటం, ఇల్లూడవటం, చదివించటం,

అదేంటో, హాచ్చర్యం గా నాకు ఆఫీస్ లో ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు మా వారి ఆఫీసుల్ లో పెనుతుఫాన్లు, ఉత్పాతాలు.. నేను ఆడియో కాన్ఫెరెన్సులైతే, ఆయన ఇంకో మెట్టేక్కి, వీడియో కాన్ఫరెన్సులంటారు, ఇంట్లో ఉన్నంత సేపూ తలుపులు బిడాయించుకుని మరీ..

“ఇంకా పని అవలేదా? ఎలా? పోనీ ఆ చేతన్ కి ఇయ్యనా?” (నీ వల్ల కాదులే.. అని అసలు మెసేజ్), అని అడిగే బాస్ గారిని “లేదు.. దీని అంతు చూస్తే గానీ నిద్రపోను..” అని భీకర ప్రతిజ్ఞలు చేస్తూ, .... ప్చ్..

ఈ లోగా.. పరీక్షలకి కూర్చోపెట్టి చదివిస్తున్నానని కచ్చ తో, మా పాప కొలవేరి పాట కి తన సొంత వర్షన్ పాడుతోంది.

“కొలవేరి కొలవేరి కొలవేరి డి..

వాట్ కైండ్ ఆఫ్ ఫామిలీ ఫామిలీ ఫామిలీ ఇదీ..

మా నాన్న ఏమో కైన్డూ, కైన్డూ, అమ్మ మాత్రం రూడూ..

.. “

“భడవా! అమ్మ రూడా? ఏది కావాలంటే అది చేసి, మీకోసం కష్టపడుతుంటే! ..” అదెప్పుడో తుర్రుమంది.

పెద్దమ్మాయీ, “ఎప్పుడూ చదువూ, చదువూ అంటావు..” అని విసుక్కుంటోంది..

ఎంత చేసినా, ఏదీ చేసినట్టు లేదు. ఎవరికీ తృప్తి లేదు. ఏంటో.. నేను ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచానికి నష్టం లేదు.. ఎలాగూ సామాజిక స్పృహా లేదు.

‘ తల పగిలిపోతోంది.. నిద్రలేమి కి,..హు... ఏంటీ జీవితం! పగవారికి కూడా వద్దు ఈ కష్టాలు.దీనికన్నా.. ఎడారి లో నీళ్ల కోసం పరితపించటం మేలు.. ధృవాల దగ్గర చలికి వణకటం మేలు.. వీటన్నింటి నుంచీ దూరం గా వెళ్లగలిగితే ఎంత బాగుండు?’ అనుకుంటున్నా.. మా నాయనమ్మ చెప్పేది.. “కనుచీకటి పడే వేళ అలాగ ఏమీ అనుకోవద్దే బాబూ! తథాస్తు దేవతలుంటారు.!” అని. అబ్బే.. మనకెక్కితే గా! వాళ్లు బిరబిర లాడుతూ వచ్చేశారు..

‘తథాస్తు’ అనుకుంటూ..

లేకపోతే, వారం మధ్యలో బుధవారం పూట, అన్నన్ని పనులు పెట్టుకుని, అర్థరాత్రి దాకా పని చేసి, మర్నాడు పెద్దదానికి సైన్సు, చిన్నదానికి హిందీ పరీక్షలు పెట్టుకుని.. తల నొప్పి తగ్గకుండా, పని మనిషి రాని రోజుల్లో, ఎవరైనా.. విహార యాత్రకి వెళ్లగలరా?

పదిహేను రోజుల క్రితమే మా ఆఫీస్ లో కుర్రాడు రాజు తన పెళ్లికి రావలసిందే.. అని గట్టి గా చెప్పాడు. ‘ఓస్.. దానికేముంది.. అని మాటిచ్చేశాను. అమ్మాయి కూడా బెంగుళూరు.. ఏ మాత్రానికేం?’ అనుకున్నాను. ఉరుకులూ, పరుగుల జీవితం లో సహోద్యోగులు, స్నేహితులవటానికీ, సన్నిహితులవటానికీ, ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడిపే ఉద్యోగులకి సాధ్యమేమో, కానీ, ఇంట్లోంచి ఎక్కువగా పని చేసి ఆఫీసుల్లో తక్కువ సమయం గడిపే నా లాంటి వారికి పరిచయస్తులు ఎంతమంది అయినా, కొత్త స్నేహితులు ఏర్పడటం అరుదే. రాజు నా టీం లోనే ఉన్న తెలుగబ్బాయి. గత రెండు సంవత్సరాలల్లో ఏర్పడిన ఒకరిద్దరు ఫ్రెండ్స్ లో ఒకరు ఈ రాజు. బుధ వారం ఉదయం ముహూర్తం పెళ్లి అంటే తప్పక వస్తాను అని చెప్పేసాను.

బాసు గారు కూడా, “పెళ్లికి వెళ్తున్నావా కృష్ణా! అందరూ బచ్చాగాళ్ళు వెళ్తున్నారు.. నాకు చాలా పని ఉంది. నువ్వెడితే కాస్త వెయిట్ ఎక్కువ ఉంటుంది... ఆ రోజు కస్టమర్ బాధ్యత చేతన్ కిచ్చి వెళ్లు. ఇంతకీ ఎలా వెళ్తున్నావు?” అన్నారు.

‘వెయిటా!! అంటే?’ అని అడుగుదామన్న పౌరుషం, ‘కేతన్ కి వద్దు నేనే చేస్తా..’ అని బాధ్యతాయుతం గా ప్రవర్తిద్దామన్న ఆలోచనా.. పక్కకి పెట్టి..

‘’ఏముంది? కార్! నాతో ముగ్గుర్ని తీసుకెళ్లగలను” అనేశాను. స్టాఫ్ లో బాసుగారు “కృష్ణ వెళ్తోంది పెళ్లికి తనతో కొంతమందిని తీసుకెళ్లగలదు..” అని చెప్పేశారు. “ఓహ్! కడప కెడుతున్నావా?” పక్కన ఉన్న కునికి పాట్లు పడుతున్న సింగం అడిగాడు.

“కడపా!! Are you kidding?” అన్నాను.

“అవునూ.. పెళ్లి కడప లో కదా!” అన్నాడు కూల్ గా సింగం.

‘నిజమే కదూ అసలెలా మర్చిపోయాను??.. ఓర్నాయనో!.. మాటిచ్చాను. పైగా ముగ్గుర్ని నాతో కార్ లో కడపకి!!, అందునా వారం మధ్యలో.. అసలు ఊళ్లో పెళ్లికే వెళ్లటానికి పది సార్లు ఆలోచించాల్సిన సమయం లో 250 కి. మీ దూరం లో పెళ్లికి. పోనీ ఎమర్జెన్సీ కూడా కాదు. ఏం చెప్పి తప్పించుకోవచ్చు?’ అనుకున్నా.. కానీ రాజు కి ఎంత ఘాట్టి గా మాటిచ్చానో గుర్తొచ్చాకా, నెమ్మదిగా ఆచరణ లోకి పెట్టటం వైపుకి ఆలోచనలు మరలాయి.

మా వారు అభయ హస్తం ఇచ్చేసారు. “నేను మానేజ్ చేస్తాలే.. నువ్వెళ్ళు.. ఎలా వెళ్తావు? బస్సుకా? టాక్సీ కా”

“మీకు తెలుసుగా.. నాకు రోడ్డు జర్నీ పడదని? అందరికీ రైలుకి బుక్ చేస్తాను”

“కడప కి రైలు లేదు” 

రేపుదయమే నాలుగు గంటలకి ప్రయాణం అనగా.. బ్లూ టూత్ పెట్టుకుని మాట్లాడుతూనే, మర్నాటికి అల్పాహారం, టిఫిన్ బాక్సులు, పిల్లలకి స్కూల్ డ్రెస్సులు, అన్నీ రెడీ చేస్తూ, ... తలుపు చప్పుడు. తీస్తే ఎదురింటావిడ...

“పరీక్షల సమయం లో మీకు అర్జెంట్ గా ఊరెళ్ళాల్సి వస్తుందిట కదా, రేపు మీ పిల్లల్ని జడలకి, స్కూల్ నుంచి వచ్చాక చదువుకీ మా ఇంటికి పంపండి..” అని. “అలాగే” అని కృతజ్ఞత తో నిండిన గొంతు తో చెప్పాను.

అంతలోనే మేరీ ఫోన్.. “మాడం. నాళకి నా ఖండిపావరే! నీ పో..” ఆహా.. కడప నుండి ఏదైనా గిఫ్ట్ తేవాలి మేరీకి.. సంతోషం వేసింది.

పెద్దమ్మాయి నాతోనే లేచేసింది. “పడుకోవే.. మళ్లీ పరీక్ష సమయానికి నిద్ర వస్తుంది..” అన్నా వినకుండా.. చుట్టూ తిరిగింది. ఉదయం నాలుగు కల్లా బిల బిల లాడుతూ వచ్చేశారు పిల్లలు (అందరూ పాతికేళ్ళ లోపు వారు.. అమ్మాయిలూ, అబ్బాయిలూ..) అందరికీ కాఫీలు కలిపి వాన్ ఎక్కేశాను.

ఆఫీసు పిక్ నిక్ లకి వీళ్లందరితో వెళ్లటం ఒక ఎత్తు, ఇలాగ పెళ్లికి వెళ్లటం ఇంకో రకం. మా ఆఫీసు పిక్నిక్ లల్లో అసలు గొడవ గొడవ గా వెళ్తారు. ఆ వయసు లో మేమెక్కడికైనా వెళ్తే పాటలు, అంత్యాక్షరి ల్లాంటివాటితో బస్సు టాప్ లేపేసేవాళ్ళం. ఏంటో వీరంతా కొద్దిగా గంభీరం గానే ఉన్నారనిపించింది. చాలా మెచ్యూర్ సంభాషణలు...

నెమ్మదిగా కదిలిస్తే అందరూ మంచి ‘నెర్డ్ ‘ లన్నట్టు అనిపించింది. ఇదేదో బానే ఉంది.. అందరినీ కదిలిద్దాం అని మొదలు పెట్టాను... ఒక్కొక్కరూ ఒక్కో రకం, కాకపోతే అందరూ వాళ్ల కాలేజ్ టాపర్లే. ఒకరిద్దరు రెండు మూడేళ్లనుండీ పనిచేస్తున్న వారైనా, సహజం గా ముభావం గా ఉండటమే వారికి అలవాటు లా ఉంది. ఇద్దరు IIT ల్లోంచి MTech అయితే, ఒకరు BHU, ఇంకోరు BITS Pilani. కడప చేరేలోగా.. కొద్ది కొద్దిగా అందరూ కాస్త ‘loosen up’ అయ్యారు.అయినా డిసెంబర్ లో అంత ఎండేంటి? ఆ ఎండకి, ఆ ఘాట్ రోడ్డుకి, కాస్త తిప్పి, బయటకి వచ్చి, నానావస్థా పడుతూ కూడా ఇంద్ర, సింహాద్రి, సమరసింహా రెడ్డి ల దగ్గర నుండి, సీమ శాస్త్రి కథల దాకా స్థల పురాణాలు చెప్పుకుంటూ, వచ్చి పడ్డాం. దోవలో YSR విగ్రహాల దుకాణాలూ, అవీ చూస్తూ పెళ్లి పందిటి దగ్గరికి వచ్చేశాం. ఈలోగా మా పెళ్లి కొడుకు నుండి కాల్స్. ఎక్కడిదాకా వచ్చారు? అని.. వస్తున్నాం లెమ్మని, పందిట్లోకి వెళ్లే ముందు చూసుకున్నాం మా బట్టలు.. అందరూ నెర్డ్ లు, ఒక దారపు పోగులో కూడా ఏమాత్రం సంబంధం లేని బట్టల కాంబినేషన్ వేసుకుని ఆఫీసు బాగుల్లో కెమేరాలు పట్టుకుని ఉన్నారు అందరూ. సరే. మరి నేను? దోవలో వాంతవటం తో సువాసనలు చిమ్ముతూ, గుడ్డ బాగు లో ఒక చీర, పర్సూ పెట్టుకుని వచ్చేసాను కదా.. ‘ఆహా.. ఎమోచ్చామండీ.. పెళ్లివారం.. బెంగుళూరు నుండి!’ థళ థళ లాడుతున్న పందిరి లో యూని ఫారం లాగా బంగారు బెల్టులూ, మెడల నిండా, చేతుల నిండా, సరే, తల నిండా కూడా, రక రకాల గొలుసులూ, బిళ్ళలతో ఉన్నారు ఆడవాళ్లు. చీరల్లో ఫాబ్రిక్ తక్కువ, జరీ పోగెక్కువ. కానీ మగవాళ్లు మాత్రం హాయిగా తెల్ల లుంగీలు, చొక్కాలు మోచేతుల పైకి..

అందరిలో మరీ తేలి పోయినట్టయింది. నెమ్మదిగా నా ఏడువందలెట్టి కొనుక్కున్న చీర మార్చుకున్నాక, కనీసం సుగంధాలు తగ్గాయి. నలుగురిలో పడ్డాం. బాపురే.. ఆ వేదిక మీద పది కిలోల బంగారం అయినా ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో... ఉలవ చారు గురించి ఎన్ని కథల్లో విన్నాం? మొదటి సారి రుచి చూశాను.. పెళ్లి భోజనం చేసి మళ్లీ వెనక్కి తిరిగి వెడుతున్నంత సేపూ, ఈ కాలపు పిల్లలు, చదువే లోకం గా, పెద్ద కాలేజీల్లోంచి బయటకి వచ్చిన వీళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయో చూద్దామని కదిపాను.

ఒకబ్బాయి తెలుగు వాడే, పైకి కనపడడు కానీ, హమ్మో, ప్రతి తెలుగు సినిమా లో డైలాగులూ నాలిక చివర్నే! ప్రత్యేకం గా జీవిత ధ్యేయాల్లాంటివి చెప్పలేదు కాని, ఒకరెండేళ్ళ ఉద్యోగ పర్వం తర్వాత, మళ్లీ చదువులోకి దూకుతాడని అర్థమైంది. చిన్నప్పట్నించీ క్లాస్ పుస్తకాలు రుద్దాడేమో, బొద్దుగా ఉన్నాడు.. ఇప్పుడు మాత్రం జిమ్మూ, ఆటలు, తెలుగు, ఆంగ్ల పుస్తకాలన్నీ తెగ చదువుతున్నాడు, వచ్చిన ప్రతి సినిమా చూస్తున్నాడు.

ఇంకో అమ్మాయి పది నెలల ఉద్యోగం లోనే 38 లక్షల ఫ్లాట్ కొనేసిందిట. “ఎలా సాధ్యం? ఎలా తీరుస్తావు?” అంటే.. ఒక పది నిమిషాల పాటు లెక్కలు చూపించింది. రిస్కూ, మిటిగేషన్, .. “సమీకరణాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఇప్పుడు అప్పులకి పోగా.. ఎంత మిగులుతుంది? ఏం తింటున్నావు?” అని అడిగా. “మూడువేలు మిగులుతాయి. ఫ్లాట్ లో ఒక గది అద్దెకిచ్చాను. రాత్రికి ఇద్దరం వండుకుంటాం. ఉదయం ఆఫీస్ లో తింటాను. సినిమాలు లాప్ టాప్ లో చూస్తాను. జీతమే పెరగదా?” అంది. ‘అభీష్ట ప్రాప్తి రస్తు!’ అనుకున్నాను.

ఇంకో అబ్బాయి BHU లో BTech చేసిన వాడు.. కేవలం రెండు వందల రూపాయలతో బ్రిజ భూమి చుట్టి ఇరవై రోజులు గడిపి వచ్చాడట. “అదెలా సాధ్యమైంది?” అనడిగాను. “వాళ్లల్లో కలిసిపోయి నందగావ్, మథుర, బృందావనం, గోవర్ధన గిరి అన్నీ, ఒక్కో చోట చిన్న చిన్న పనులు చేస్తూ, ఊరి వారి తో కలిసిపోయి వాళ్ల ఇళ్లల్లో తింటూ, ఊళ్ల మధ్యలో కాలి నడకన,.. చాలా ఆసక్తి కరం గా అనిపించింది. ఈసారి ఆయన అనుభవాలు తెలుసుకుని తీరిగ్గా రాయాలి..

ఒక కన్నడ పిల్లాడు, మామూలు గా అందరితోనూ చాలా చక్కగా గౌరవం గా మాట్లాడటం చూశాను ఆఫీస్ లో. కాబ్ డ్రైవర్ తో కూడా అదే ధోరణి.. చిరునవ్వు చెదరనీయకుండా, అతనితో మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలుసుకుని మాకూ చెప్పాడు. డ్రైవర్ ఇంటర్ లో ఉండగా ఒక అమ్మాయి ప్రేమ లో పడి చదువు పాడు చేసుకున్నాడట. ఆ అమ్మాయి ప్రేమ నిరాకరించాక, దేవదాసు అయి ఇంకొంత కాలం చదువుకి దూరం గా ఉన్నాడట. అతని ఇద్దరు అన్నలూ సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులట. అయినా వారితో ఇప్పుడు కాబ్ నడుపుతూ సమానం గా సంపాదిస్తున్నాడట. ఇదే బాగున్నట్టుంది.. అనుకున్నాం.

ఇంకో అబ్బాయి, వారాంతం రెండు రోజులూ కాన్సర్ తో బాధ పడుతూ జీవితపు చరమాంకం లో ఉన్న వారితో గడుపు తాడట. ఇంకొకతను ఒరిస్సా లోని వాళ్ల ఊరిలో కంప్యూటర్లు అవీ పెట్టించి ఊళ్లల్లో యువత కి శిక్షణ ఇచ్చి కొన్ని మార్పులు ఎలా తెచ్చాడో వివరించాడు. నాకు వారితో కబుర్లతో భలే కాలక్షేపం అయింది. వాళ్ల భిన్నాభిరుచులూ, ఆసక్తులూ తెలుసుకున్నాక నాకు సంతోషం గా అనిపించింది.

ఈలోగా.. కనీసం డజన్ సార్లు పిల్లల ఫోన్లు. ‘అమ్మా! ఎప్పుడోస్తున్నావు? మాకేదైనా సర్ప్రైజ్ తెస్తున్నావా?’ అని గొడవ. కడప లో నాకేమీ గొప్పగా అనిపించలేదు.. దోవలో మాత్రం భలే వస్తువులు కొన్నాను. జిడ్డు కృష్ణమూర్తి గారి మదనపల్లె లో.. ఉదయం పూట నేను వంట చేస్తుంటే వంటిట్లో ప్లాస్టిక్ స్టూళ్ళ మీద కూర్చుని నిద్ర కళ్ళతో కబుర్లు చెప్పే మా పిల్లల కోసం.అలాగే తోలు బొమ్మలతో చేసిన ఈ హాన్గింగ్స్..మధ్యలో చిన్న డీవియేషన్ తీసుకుని హార్స్లీ హిల్స్ వైపుకి వెళ్లాం కానీ, అక్కడ ప్రయాణం పడక నాకు కడుపు తిప్పేసి దిగకుండా, కార్ లోనే నిద్రపోయాను. తిరిగి వెళ్లే సమయానికి, చీకటి పడుతున్నకొద్దీ అయ్యో పిల్లలు ఎలాగ ఉన్నారో అని బెంగ.. తల నొప్పి, అందర్నీ దింపుకుంటూ మా ఇంటికి చేరే సరికి ఎనిమిది.. పిల్లలు పరిగెత్తుకుని వచ్చి ‘అమ్మా..’ అంటున్నా..వినే ఓపిక లేదు.

మర్నాడు లేస్తూనే ఫ్రెష్ గా .. లాప్ టాప్ తెరిచాను. బాసు గారి నుంచి మెయిల్. ‘చేతన్ చేతులెత్తేశాడు.. మరి నువ్వే చూసుకోవాలి తప్పదు.’ ఆహా.. మరి నేను చూసినంత కాలం, చేతన్ సహాయం తీసుకో.. అని!

టీ తాగుతూ ‘ఆఫీసు పని చూసుకుంటూ, వీళ్లని చదివించటం..అమ్మో! మాటలు కాదు’ అంటున్న మా వారితో ‘పొగిడేయటం ఈజీ. నిలబడి చేయగలగటం గొప్ప! రెండు సబ్జెక్టుల బాధ్యత మీరూ తీసుకోండి.’ అన్నాను. ఇంతలో పిల్లలూ లేచి వారంతట వారే పని చేయటం మొదలు పెట్టారు. ‘అబ్బో.. ఏంటీ విప్లవం?’ అని అడిగితే.. ‘నిన్న we almost missed the school bus!’ అంది మా చిన్నమ్మాయి. మా పెద్దది..’అమ్మా.. ఆంటీ చాలా ఎక్కువ చదివిస్తుంది. కదలనీయదు’..

‘ఆహా.. మరి నేను ఉదయం త్వరగా లే.. పరిగెట్టు.. అన్నప్పుడు.. నన్ను రూడూ.. అదీ అన్నారు? చదువు తో చంపుతున్నాను అన్నారు?’

నెమ్మది గా ఆఫీసు కెళ్ళాను.. కారిడార్లలో.. కొత్తగా ఒక అరడజన్ మంది నుంచి కొత్తగా ఒక చిరునవ్వు...

హ్మ్.. అప్పుడప్పుడూ ఇలాగ ‘ఎస్కేప్’ అవుతుంటే.. ఇన్ని లాభాలుంటాయా? ఇంకా ఎవరిదైనా పెళ్లి ఉందేమో చూడాలి.. ఎవరిదీ లేకపోతే.. రాజు వాళ్ల పదహారు రోజుల పండగ ఏ ఊర్లో చేస్తారో కనుక్కోవాలి..’ ఉత్సాహం గా క్యూబ్ వైపుకి నడిచాను.

 
;