Tuesday, December 20, 2011

తథాస్తు దేవతలు చేసిన మేలు..


ఆఫీస్ డెడ్ లైన్ దగ్గరకొచ్చేసింది.. ప్రతి రోజూ అర్థ రాత్రి దాకా కాన్ఫరెన్స్ కాల్సు,.. వెండర్ హార్డ్ వేర్ కరెక్ట్ చేసి ఇయ్యడు, కస్ట్ మర్ ఇస్తావా చస్తావా? అని బాసు గారి మీద రంకెలేస్తే, ఆయన యథాతథం గా ఆ దీవెనలన్నీ, ముళ్లల్లో జాగ్రత్త గా పెట్టి, దానికి ఆయన తిక్క కూడా జోడించి మా నెత్తి మీద గుమ్మరించేశాడు. సరే ‘జీతాలు తీసుకోవట్లా?’ అనుకుని, ఈ పనుల్లో హడావిడి గా.. తిరుగుతున్నానా? వచ్చే వారం నుండీ పిల్లల పరీక్షలని గుర్తుకొచ్చింది. వీళ్లని చదివిస్తూ, కస్టమర్ బగ్.. చూసుకుంటూ.. పదేళ్లు గా ఒక్కసారైనా మా ఇంటికి రాలేకపోయిన బంధువులు వస్తున్నామని ఫోన్.. ‘ఆహా! ఏమదృష్టం!’ అనుకుంటూ, చంద్రముఖి లో రజనీ లా.. “అసలు నా ఊహ కరెక్ట్ అయితే ఈ పాటికి పనమ్మాయి కి జలుబో, జ్వరమో రావాలి” అని కళ్ళు మూసుకుని ఇలాగ అన్నానో లేదో.. ఫోన్ రింగ్ అయింది.

‘హలో’ కి సమాధానం.. “ఖళ్ ఖళ్” మేరీ.. “ఒడంబు సరి ఇల్లే మేడం..”

ఒక్క క్షణం నా వాక్షుద్ధి కి గర్వించినా, అంట్లు, బట్టలు,ఇల్లు తుడవటం లాంటి అదనపు బాధ్యతలు కూడా కూడా నెత్తిన పడ్డాయి. కప్పు చాయ్ తాగేలోగా కనీసం మూడు సార్లు వెచ్చపెట్టుకోవటం,.. నీలపు పన్ను (బ్లూ టూత్) లో కాల్స్ లో మాట్లాడుతూనే తినటం, పిల్లల్ని తయారు చేయటం, వంటలు వండటం, ఇల్లూడవటం, చదివించటం,

అదేంటో, హాచ్చర్యం గా నాకు ఆఫీస్ లో ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు మా వారి ఆఫీసుల్ లో పెనుతుఫాన్లు, ఉత్పాతాలు.. నేను ఆడియో కాన్ఫెరెన్సులైతే, ఆయన ఇంకో మెట్టేక్కి, వీడియో కాన్ఫరెన్సులంటారు, ఇంట్లో ఉన్నంత సేపూ తలుపులు బిడాయించుకుని మరీ..

“ఇంకా పని అవలేదా? ఎలా? పోనీ ఆ చేతన్ కి ఇయ్యనా?” (నీ వల్ల కాదులే.. అని అసలు మెసేజ్), అని అడిగే బాస్ గారిని “లేదు.. దీని అంతు చూస్తే గానీ నిద్రపోను..” అని భీకర ప్రతిజ్ఞలు చేస్తూ, .... ప్చ్..

ఈ లోగా.. పరీక్షలకి కూర్చోపెట్టి చదివిస్తున్నానని కచ్చ తో, మా పాప కొలవేరి పాట కి తన సొంత వర్షన్ పాడుతోంది.

“కొలవేరి కొలవేరి కొలవేరి డి..

వాట్ కైండ్ ఆఫ్ ఫామిలీ ఫామిలీ ఫామిలీ ఇదీ..

మా నాన్న ఏమో కైన్డూ, కైన్డూ, అమ్మ మాత్రం రూడూ..

.. “

“భడవా! అమ్మ రూడా? ఏది కావాలంటే అది చేసి, మీకోసం కష్టపడుతుంటే! ..” అదెప్పుడో తుర్రుమంది.

పెద్దమ్మాయీ, “ఎప్పుడూ చదువూ, చదువూ అంటావు..” అని విసుక్కుంటోంది..

ఎంత చేసినా, ఏదీ చేసినట్టు లేదు. ఎవరికీ తృప్తి లేదు. ఏంటో.. నేను ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచానికి నష్టం లేదు.. ఎలాగూ సామాజిక స్పృహా లేదు.

‘ తల పగిలిపోతోంది.. నిద్రలేమి కి,..హు... ఏంటీ జీవితం! పగవారికి కూడా వద్దు ఈ కష్టాలు.దీనికన్నా.. ఎడారి లో నీళ్ల కోసం పరితపించటం మేలు.. ధృవాల దగ్గర చలికి వణకటం మేలు.. వీటన్నింటి నుంచీ దూరం గా వెళ్లగలిగితే ఎంత బాగుండు?’ అనుకుంటున్నా.. మా నాయనమ్మ చెప్పేది.. “కనుచీకటి పడే వేళ అలాగ ఏమీ అనుకోవద్దే బాబూ! తథాస్తు దేవతలుంటారు.!” అని. అబ్బే.. మనకెక్కితే గా! వాళ్లు బిరబిర లాడుతూ వచ్చేశారు..

‘తథాస్తు’ అనుకుంటూ..

లేకపోతే, వారం మధ్యలో బుధవారం పూట, అన్నన్ని పనులు పెట్టుకుని, అర్థరాత్రి దాకా పని చేసి, మర్నాడు పెద్దదానికి సైన్సు, చిన్నదానికి హిందీ పరీక్షలు పెట్టుకుని.. తల నొప్పి తగ్గకుండా, పని మనిషి రాని రోజుల్లో, ఎవరైనా.. విహార యాత్రకి వెళ్లగలరా?

పదిహేను రోజుల క్రితమే మా ఆఫీస్ లో కుర్రాడు రాజు తన పెళ్లికి రావలసిందే.. అని గట్టి గా చెప్పాడు. ‘ఓస్.. దానికేముంది.. అని మాటిచ్చేశాను. అమ్మాయి కూడా బెంగుళూరు.. ఏ మాత్రానికేం?’ అనుకున్నాను. ఉరుకులూ, పరుగుల జీవితం లో సహోద్యోగులు, స్నేహితులవటానికీ, సన్నిహితులవటానికీ, ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడిపే ఉద్యోగులకి సాధ్యమేమో, కానీ, ఇంట్లోంచి ఎక్కువగా పని చేసి ఆఫీసుల్లో తక్కువ సమయం గడిపే నా లాంటి వారికి పరిచయస్తులు ఎంతమంది అయినా, కొత్త స్నేహితులు ఏర్పడటం అరుదే. రాజు నా టీం లోనే ఉన్న తెలుగబ్బాయి. గత రెండు సంవత్సరాలల్లో ఏర్పడిన ఒకరిద్దరు ఫ్రెండ్స్ లో ఒకరు ఈ రాజు. బుధ వారం ఉదయం ముహూర్తం పెళ్లి అంటే తప్పక వస్తాను అని చెప్పేసాను.

బాసు గారు కూడా, “పెళ్లికి వెళ్తున్నావా కృష్ణా! అందరూ బచ్చాగాళ్ళు వెళ్తున్నారు.. నాకు చాలా పని ఉంది. నువ్వెడితే కాస్త వెయిట్ ఎక్కువ ఉంటుంది... ఆ రోజు కస్టమర్ బాధ్యత చేతన్ కిచ్చి వెళ్లు. ఇంతకీ ఎలా వెళ్తున్నావు?” అన్నారు.

‘వెయిటా!! అంటే?’ అని అడుగుదామన్న పౌరుషం, ‘కేతన్ కి వద్దు నేనే చేస్తా..’ అని బాధ్యతాయుతం గా ప్రవర్తిద్దామన్న ఆలోచనా.. పక్కకి పెట్టి..

‘’ఏముంది? కార్! నాతో ముగ్గుర్ని తీసుకెళ్లగలను” అనేశాను. స్టాఫ్ లో బాసుగారు “కృష్ణ వెళ్తోంది పెళ్లికి తనతో కొంతమందిని తీసుకెళ్లగలదు..” అని చెప్పేశారు. “ఓహ్! కడప కెడుతున్నావా?” పక్కన ఉన్న కునికి పాట్లు పడుతున్న సింగం అడిగాడు.

“కడపా!! Are you kidding?” అన్నాను.

“అవునూ.. పెళ్లి కడప లో కదా!” అన్నాడు కూల్ గా సింగం.

‘నిజమే కదూ అసలెలా మర్చిపోయాను??.. ఓర్నాయనో!.. మాటిచ్చాను. పైగా ముగ్గుర్ని నాతో కార్ లో కడపకి!!, అందునా వారం మధ్యలో.. అసలు ఊళ్లో పెళ్లికే వెళ్లటానికి పది సార్లు ఆలోచించాల్సిన సమయం లో 250 కి. మీ దూరం లో పెళ్లికి. పోనీ ఎమర్జెన్సీ కూడా కాదు. ఏం చెప్పి తప్పించుకోవచ్చు?’ అనుకున్నా.. కానీ రాజు కి ఎంత ఘాట్టి గా మాటిచ్చానో గుర్తొచ్చాకా, నెమ్మదిగా ఆచరణ లోకి పెట్టటం వైపుకి ఆలోచనలు మరలాయి.

మా వారు అభయ హస్తం ఇచ్చేసారు. “నేను మానేజ్ చేస్తాలే.. నువ్వెళ్ళు.. ఎలా వెళ్తావు? బస్సుకా? టాక్సీ కా”

“మీకు తెలుసుగా.. నాకు రోడ్డు జర్నీ పడదని? అందరికీ రైలుకి బుక్ చేస్తాను”

“కడప కి రైలు లేదు” 

రేపుదయమే నాలుగు గంటలకి ప్రయాణం అనగా.. బ్లూ టూత్ పెట్టుకుని మాట్లాడుతూనే, మర్నాటికి అల్పాహారం, టిఫిన్ బాక్సులు, పిల్లలకి స్కూల్ డ్రెస్సులు, అన్నీ రెడీ చేస్తూ, ... తలుపు చప్పుడు. తీస్తే ఎదురింటావిడ...

“పరీక్షల సమయం లో మీకు అర్జెంట్ గా ఊరెళ్ళాల్సి వస్తుందిట కదా, రేపు మీ పిల్లల్ని జడలకి, స్కూల్ నుంచి వచ్చాక చదువుకీ మా ఇంటికి పంపండి..” అని. “అలాగే” అని కృతజ్ఞత తో నిండిన గొంతు తో చెప్పాను.

అంతలోనే మేరీ ఫోన్.. “మాడం. నాళకి నా ఖండిపావరే! నీ పో..” ఆహా.. కడప నుండి ఏదైనా గిఫ్ట్ తేవాలి మేరీకి.. సంతోషం వేసింది.

పెద్దమ్మాయి నాతోనే లేచేసింది. “పడుకోవే.. మళ్లీ పరీక్ష సమయానికి నిద్ర వస్తుంది..” అన్నా వినకుండా.. చుట్టూ తిరిగింది. ఉదయం నాలుగు కల్లా బిల బిల లాడుతూ వచ్చేశారు పిల్లలు (అందరూ పాతికేళ్ళ లోపు వారు.. అమ్మాయిలూ, అబ్బాయిలూ..) అందరికీ కాఫీలు కలిపి వాన్ ఎక్కేశాను.

ఆఫీసు పిక్ నిక్ లకి వీళ్లందరితో వెళ్లటం ఒక ఎత్తు, ఇలాగ పెళ్లికి వెళ్లటం ఇంకో రకం. మా ఆఫీసు పిక్నిక్ లల్లో అసలు గొడవ గొడవ గా వెళ్తారు. ఆ వయసు లో మేమెక్కడికైనా వెళ్తే పాటలు, అంత్యాక్షరి ల్లాంటివాటితో బస్సు టాప్ లేపేసేవాళ్ళం. ఏంటో వీరంతా కొద్దిగా గంభీరం గానే ఉన్నారనిపించింది. చాలా మెచ్యూర్ సంభాషణలు...

నెమ్మదిగా కదిలిస్తే అందరూ మంచి ‘నెర్డ్ ‘ లన్నట్టు అనిపించింది. ఇదేదో బానే ఉంది.. అందరినీ కదిలిద్దాం అని మొదలు పెట్టాను... ఒక్కొక్కరూ ఒక్కో రకం, కాకపోతే అందరూ వాళ్ల కాలేజ్ టాపర్లే. ఒకరిద్దరు రెండు మూడేళ్లనుండీ పనిచేస్తున్న వారైనా, సహజం గా ముభావం గా ఉండటమే వారికి అలవాటు లా ఉంది. ఇద్దరు IIT ల్లోంచి MTech అయితే, ఒకరు BHU, ఇంకోరు BITS Pilani. కడప చేరేలోగా.. కొద్ది కొద్దిగా అందరూ కాస్త ‘loosen up’ అయ్యారు.అయినా డిసెంబర్ లో అంత ఎండేంటి? ఆ ఎండకి, ఆ ఘాట్ రోడ్డుకి, కాస్త తిప్పి, బయటకి వచ్చి, నానావస్థా పడుతూ కూడా ఇంద్ర, సింహాద్రి, సమరసింహా రెడ్డి ల దగ్గర నుండి, సీమ శాస్త్రి కథల దాకా స్థల పురాణాలు చెప్పుకుంటూ, వచ్చి పడ్డాం. దోవలో YSR విగ్రహాల దుకాణాలూ, అవీ చూస్తూ పెళ్లి పందిటి దగ్గరికి వచ్చేశాం. ఈలోగా మా పెళ్లి కొడుకు నుండి కాల్స్. ఎక్కడిదాకా వచ్చారు? అని.. వస్తున్నాం లెమ్మని, పందిట్లోకి వెళ్లే ముందు చూసుకున్నాం మా బట్టలు.. అందరూ నెర్డ్ లు, ఒక దారపు పోగులో కూడా ఏమాత్రం సంబంధం లేని బట్టల కాంబినేషన్ వేసుకుని ఆఫీసు బాగుల్లో కెమేరాలు పట్టుకుని ఉన్నారు అందరూ. సరే. మరి నేను? దోవలో వాంతవటం తో సువాసనలు చిమ్ముతూ, గుడ్డ బాగు లో ఒక చీర, పర్సూ పెట్టుకుని వచ్చేసాను కదా.. ‘ఆహా.. ఎమోచ్చామండీ.. పెళ్లివారం.. బెంగుళూరు నుండి!’ థళ థళ లాడుతున్న పందిరి లో యూని ఫారం లాగా బంగారు బెల్టులూ, మెడల నిండా, చేతుల నిండా, సరే, తల నిండా కూడా, రక రకాల గొలుసులూ, బిళ్ళలతో ఉన్నారు ఆడవాళ్లు. చీరల్లో ఫాబ్రిక్ తక్కువ, జరీ పోగెక్కువ. కానీ మగవాళ్లు మాత్రం హాయిగా తెల్ల లుంగీలు, చొక్కాలు మోచేతుల పైకి..

అందరిలో మరీ తేలి పోయినట్టయింది. నెమ్మదిగా నా ఏడువందలెట్టి కొనుక్కున్న చీర మార్చుకున్నాక, కనీసం సుగంధాలు తగ్గాయి. నలుగురిలో పడ్డాం. బాపురే.. ఆ వేదిక మీద పది కిలోల బంగారం అయినా ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో... ఉలవ చారు గురించి ఎన్ని కథల్లో విన్నాం? మొదటి సారి రుచి చూశాను.. పెళ్లి భోజనం చేసి మళ్లీ వెనక్కి తిరిగి వెడుతున్నంత సేపూ, ఈ కాలపు పిల్లలు, చదువే లోకం గా, పెద్ద కాలేజీల్లోంచి బయటకి వచ్చిన వీళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయో చూద్దామని కదిపాను.

ఒకబ్బాయి తెలుగు వాడే, పైకి కనపడడు కానీ, హమ్మో, ప్రతి తెలుగు సినిమా లో డైలాగులూ నాలిక చివర్నే! ప్రత్యేకం గా జీవిత ధ్యేయాల్లాంటివి చెప్పలేదు కాని, ఒకరెండేళ్ళ ఉద్యోగ పర్వం తర్వాత, మళ్లీ చదువులోకి దూకుతాడని అర్థమైంది. చిన్నప్పట్నించీ క్లాస్ పుస్తకాలు రుద్దాడేమో, బొద్దుగా ఉన్నాడు.. ఇప్పుడు మాత్రం జిమ్మూ, ఆటలు, తెలుగు, ఆంగ్ల పుస్తకాలన్నీ తెగ చదువుతున్నాడు, వచ్చిన ప్రతి సినిమా చూస్తున్నాడు.

ఇంకో అమ్మాయి పది నెలల ఉద్యోగం లోనే 38 లక్షల ఫ్లాట్ కొనేసిందిట. “ఎలా సాధ్యం? ఎలా తీరుస్తావు?” అంటే.. ఒక పది నిమిషాల పాటు లెక్కలు చూపించింది. రిస్కూ, మిటిగేషన్, .. “సమీకరణాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఇప్పుడు అప్పులకి పోగా.. ఎంత మిగులుతుంది? ఏం తింటున్నావు?” అని అడిగా. “మూడువేలు మిగులుతాయి. ఫ్లాట్ లో ఒక గది అద్దెకిచ్చాను. రాత్రికి ఇద్దరం వండుకుంటాం. ఉదయం ఆఫీస్ లో తింటాను. సినిమాలు లాప్ టాప్ లో చూస్తాను. జీతమే పెరగదా?” అంది. ‘అభీష్ట ప్రాప్తి రస్తు!’ అనుకున్నాను.

ఇంకో అబ్బాయి BHU లో BTech చేసిన వాడు.. కేవలం రెండు వందల రూపాయలతో బ్రిజ భూమి చుట్టి ఇరవై రోజులు గడిపి వచ్చాడట. “అదెలా సాధ్యమైంది?” అనడిగాను. “వాళ్లల్లో కలిసిపోయి నందగావ్, మథుర, బృందావనం, గోవర్ధన గిరి అన్నీ, ఒక్కో చోట చిన్న చిన్న పనులు చేస్తూ, ఊరి వారి తో కలిసిపోయి వాళ్ల ఇళ్లల్లో తింటూ, ఊళ్ల మధ్యలో కాలి నడకన,.. చాలా ఆసక్తి కరం గా అనిపించింది. ఈసారి ఆయన అనుభవాలు తెలుసుకుని తీరిగ్గా రాయాలి..

ఒక కన్నడ పిల్లాడు, మామూలు గా అందరితోనూ చాలా చక్కగా గౌరవం గా మాట్లాడటం చూశాను ఆఫీస్ లో. కాబ్ డ్రైవర్ తో కూడా అదే ధోరణి.. చిరునవ్వు చెదరనీయకుండా, అతనితో మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలుసుకుని మాకూ చెప్పాడు. డ్రైవర్ ఇంటర్ లో ఉండగా ఒక అమ్మాయి ప్రేమ లో పడి చదువు పాడు చేసుకున్నాడట. ఆ అమ్మాయి ప్రేమ నిరాకరించాక, దేవదాసు అయి ఇంకొంత కాలం చదువుకి దూరం గా ఉన్నాడట. అతని ఇద్దరు అన్నలూ సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులట. అయినా వారితో ఇప్పుడు కాబ్ నడుపుతూ సమానం గా సంపాదిస్తున్నాడట. ఇదే బాగున్నట్టుంది.. అనుకున్నాం.

ఇంకో అబ్బాయి, వారాంతం రెండు రోజులూ కాన్సర్ తో బాధ పడుతూ జీవితపు చరమాంకం లో ఉన్న వారితో గడుపు తాడట. ఇంకొకతను ఒరిస్సా లోని వాళ్ల ఊరిలో కంప్యూటర్లు అవీ పెట్టించి ఊళ్లల్లో యువత కి శిక్షణ ఇచ్చి కొన్ని మార్పులు ఎలా తెచ్చాడో వివరించాడు. నాకు వారితో కబుర్లతో భలే కాలక్షేపం అయింది. వాళ్ల భిన్నాభిరుచులూ, ఆసక్తులూ తెలుసుకున్నాక నాకు సంతోషం గా అనిపించింది.

ఈలోగా.. కనీసం డజన్ సార్లు పిల్లల ఫోన్లు. ‘అమ్మా! ఎప్పుడోస్తున్నావు? మాకేదైనా సర్ప్రైజ్ తెస్తున్నావా?’ అని గొడవ. కడప లో నాకేమీ గొప్పగా అనిపించలేదు.. దోవలో మాత్రం భలే వస్తువులు కొన్నాను. జిడ్డు కృష్ణమూర్తి గారి మదనపల్లె లో.. ఉదయం పూట నేను వంట చేస్తుంటే వంటిట్లో ప్లాస్టిక్ స్టూళ్ళ మీద కూర్చుని నిద్ర కళ్ళతో కబుర్లు చెప్పే మా పిల్లల కోసం.అలాగే తోలు బొమ్మలతో చేసిన ఈ హాన్గింగ్స్..మధ్యలో చిన్న డీవియేషన్ తీసుకుని హార్స్లీ హిల్స్ వైపుకి వెళ్లాం కానీ, అక్కడ ప్రయాణం పడక నాకు కడుపు తిప్పేసి దిగకుండా, కార్ లోనే నిద్రపోయాను. తిరిగి వెళ్లే సమయానికి, చీకటి పడుతున్నకొద్దీ అయ్యో పిల్లలు ఎలాగ ఉన్నారో అని బెంగ.. తల నొప్పి, అందర్నీ దింపుకుంటూ మా ఇంటికి చేరే సరికి ఎనిమిది.. పిల్లలు పరిగెత్తుకుని వచ్చి ‘అమ్మా..’ అంటున్నా..వినే ఓపిక లేదు.

మర్నాడు లేస్తూనే ఫ్రెష్ గా .. లాప్ టాప్ తెరిచాను. బాసు గారి నుంచి మెయిల్. ‘చేతన్ చేతులెత్తేశాడు.. మరి నువ్వే చూసుకోవాలి తప్పదు.’ ఆహా.. మరి నేను చూసినంత కాలం, చేతన్ సహాయం తీసుకో.. అని!

టీ తాగుతూ ‘ఆఫీసు పని చూసుకుంటూ, వీళ్లని చదివించటం..అమ్మో! మాటలు కాదు’ అంటున్న మా వారితో ‘పొగిడేయటం ఈజీ. నిలబడి చేయగలగటం గొప్ప! రెండు సబ్జెక్టుల బాధ్యత మీరూ తీసుకోండి.’ అన్నాను. ఇంతలో పిల్లలూ లేచి వారంతట వారే పని చేయటం మొదలు పెట్టారు. ‘అబ్బో.. ఏంటీ విప్లవం?’ అని అడిగితే.. ‘నిన్న we almost missed the school bus!’ అంది మా చిన్నమ్మాయి. మా పెద్దది..’అమ్మా.. ఆంటీ చాలా ఎక్కువ చదివిస్తుంది. కదలనీయదు’..

‘ఆహా.. మరి నేను ఉదయం త్వరగా లే.. పరిగెట్టు.. అన్నప్పుడు.. నన్ను రూడూ.. అదీ అన్నారు? చదువు తో చంపుతున్నాను అన్నారు?’

నెమ్మది గా ఆఫీసు కెళ్ళాను.. కారిడార్లలో.. కొత్తగా ఒక అరడజన్ మంది నుంచి కొత్తగా ఒక చిరునవ్వు...

హ్మ్.. అప్పుడప్పుడూ ఇలాగ ‘ఎస్కేప్’ అవుతుంటే.. ఇన్ని లాభాలుంటాయా? ఇంకా ఎవరిదైనా పెళ్లి ఉందేమో చూడాలి.. ఎవరిదీ లేకపోతే.. రాజు వాళ్ల పదహారు రోజుల పండగ ఏ ఊర్లో చేస్తారో కనుక్కోవాలి..’ ఉత్సాహం గా క్యూబ్ వైపుకి నడిచాను.

34 comments:

రాజేష్ మారం... said...

:) Nice. ..

Rajesh said...

Krishna Garu,
simple and sweet. Chala bagundi post.

Working woman ante office work tho patu inti panulu, pillala panulu...

Meeru chebuthunte, maa misses gurthochindi...

Rajesh

Chandu S said...

దీని అంతు చూస్తే గానీ నిద్రపోను..” అని భీకర ప్రతిజ్ఞలు చేస్తూ

స్థల పురాణాలు

ఫాబ్రిక్ తక్కువ, జరీ పోగెక్కువ

మంచి ‘నెర్డ్ ‘

రాజు వాళ్ల పదహారు రోజుల పండగ

వీటన్నిటికీ బాగా నవ్వొచ్చింది.

అవునూ, కృష్ణప్రియ గారూ, పదహారు రోజుల పండక్కి ఫ్రెండ్స్ ని పిలుస్తారా? పిలవరనుకుంటా.

సుభ said...

“ఓహ్! కడప కెడుతున్నావా?” పక్కన ఉన్న కునికి పాట్లు పడుతున్న సింగం అడిగాడు.
Once again కేకో కేక :):):)

కృష్ణప్రియ said...

@ రాజేష్ మారం గారు,
:) థాంక్స్!

@ రాజేశ్ గారు,

ధన్యవాదాలు!
నిజానికి ఈరోజుల్లో వర్కింగ్ వుమన్ జీవితం చాలా బెటర్ అనుకుంటాను. ఒక ఇరవయ్యేళ్ల క్రితం, WFH లు లేవు, ఇన్ని appliances లేవు, అన్నీ ఉన్నా కరెంట్ ఉండాలి, వచ్చే పోయే చుట్టాలు, ముఖ్యం గా భర్త సహాయం తక్కువ, ఒక వేళ చేయటానికి ముందుకొచ్చినా, సమాజం దాని మీద జోకులేయటం కూడా ఎక్కువే కదా..

టెంపరరీ వైరాగ్యాలు.. అన్నీ వదిలేసి పారిపోదామనే ఫీలింగ్ ఎవ్వరికైనా ఒక్కోసారి కలగక మానదు. నాకు ఎదురైనా చిన్న చిరాకు గురించి రాశాను. మీకు నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.

@ చందు గారు,

:) థాంక్స్!

ఫాబ్రిక్ తక్కువ, జరీ పోగెక్కువ కి -- మీ మెడ చుట్టూ ట్రాఫిక్ జామ్ స్ఫూర్తి.

ఇక రాజు పదహారు రోజుల పండగ కి :) అంతే నంటారా? అయితే ఇంకోటేదైనా పండుగ వేరే ఊళ్లల్లో చేసుకొమ్మని అర్థించాలి.. మీరు పుట్టిన రోజు లాంటిది ఏదైనా చేసుకోవచ్చు కదా.. మీ ఊరికి వచ్చేస్తాను...

Chandu S said...

కృష్ణప్రియ గారూ,
మీరు రావాలే గానీ ఆ రోజే పుట్టిన రోజు పండగ జరిపేద్దాం.( పిల్లల్ని వదిలేసి రావొద్దు)

గీతిక బి said...

చాలా చాలా... బావుంది పోస్ట్.

సన్నని నవ్వుల్తో అలా.. సాగిపోయింది. పోస్ట్ చివర్లో కొసరు ఆలోచన ఇంకా బాగుంది.

లత said...

ఎప్పటిలాగే మీ స్టైల్ లో నవ్విస్తూ బావుందండీ

sunita said...

baagundi:))

kavitha said...

చాల బాగుందండి ....నేను వారానికి ఒక్కసారన్న ఏమి జీవితం రా బాబు అని నిట్టూర్పులు వదులుతుంటాను...ఎప్పటిలాగే చాల బాగా రాసారు...నేను మీ పోస్ట్ లన్ని చదువుతాను ఎప్పటికప్పుడే, కాని కామెంట్ పెట్టాలంటే మాత్రం బద్ధకం..
కవిత

రసజ్ఞ said...

హహహ బాగుందండీ! ఈ సారి మా ఊరు వద్దురులెండి ;)

..nagarjuna.. said...

:) :) :) :)

మరేంలేదు చాలా రోజుల బ్రేక్ తరువాత మీ బ్లాగు వచ్చాను కదా. స్మైలితే మీరు మరి కాస్త హ్యాపీ ఫీలవుతారనీ.
మొత్తానికి వెకేషన్ బాగా ఎంజాయ్ చేశారన్నమాట :)

బ్లాగు ఓపెన్ చెయ్యగానే సాదాసీదా టెంఫ్లెట్ కనిపించేసరికి వచ్చింది కృషాజీ బ్లాగేనా, గేటేడ్ కమ్యూనిటి ప్రెసిడెంట్ గారి ఇల్లాలి బ్లాగేనా అని అనుమానం వచ్చింది. టైటిలు ట్యాగ్‌లైన్ చూసుకొని పోల్చుకున్నా :)

జేబి - JB said...

:-)

I am also allergic to road travel, I can understand.

*Feeling bad to put comment in English on a Telugu post, please excuse.

కొత్తావకాయ said...

పదహార్రోజుల పండక్కా? హ్హహ్హహా..

మీ చిన్న బంగారం పాట రికార్డ్ చేసి వినిపించకూడదూ.. "మా నాన్నేమో స్వీటూ స్వీటూ... అమ్మ మాత్రం ఘాటూ" అని! :)

వేణూ శ్రీకాంత్ said...

బాగుందండీ..

మధురవాణి said...

ఏంటండీ.. బ్లాగ్ రూపు రేఖలు మార్చేసారా? నేను కాసేపు తికమక పడ్డాను ఎవరింటికి వచ్చానా అని.. :)) మరేమో, నాకు మీ పాత టెంప్లేటే ఎక్కువ నచ్చింది.. :P
అయితే తథాస్తు దేవతలు నిజంగానే ఉంటారన్నమాట.. బాగున్నాయి మీ ట్రిప్ విశేషాలు.. నాకు మాత్రం అన్నీటి కంటే మీ పాప పాడిన కొలవేరి పాట నచ్చింది. super creativity ! ఎంతైనా పాట మీ రక్తంలోనే ఉంది కదా మరి! ;) :D

Varuna Srikanth said...

Hi Krishna Garu...
ela unnaru? ee sari chala wait cheyincharu post kosam....karanam post chadivaka telisindi..
ika post gurinchi..as usual chala chakkaga rasesaru....

Anonymous said...

*ముఖ్యం గా భర్త సహాయం తక్కువ*

మీకు పని చేయటానికి మేరి ఉంది.ఎప్పుడొ ఆమే అర్థాంతరంగా శెలవు తీసుకొన్నపుడు ఒక రెండ రోజులు మీకు పని పడుతుంది. ఆ రేండు రోజులు పని చేయటం కూడా మీకు కష్ట్టామా?

చైతన్య.ఎస్ said...

మా 'రతనాల' సీమ కి వచ్చారన్న మాట
కొలవెరి కి సొంత వెర్షన్.. మీ చిన్న పాప సూపరండి :)

kastephale said...

Good narration

కృష్ణప్రియ said...

@ సుభ గారు,
:) థాంక్స్!

@ చందుగారు,
:) అలాగే.

@ గీతిక గారు,
ధన్యవాదాలు!

@ లత గారు,
థాంక్స్..

@ సునీత గారు,
:) థాంక్స్..

@ కవిత గారు,

తాత్కాలిక వైరాగ్యం :) ధన్యవాదాలు!

కృష్ణప్రియ said...

@ రసజ్ఞ,
:) ష్యూర్
@ నాగార్జున,

:) థాంక్స్!
బ్లాగ్ కొందరికి ఓపెన్ అవట్లేదని చెప్పారు. రెండు సార్లు స్క్రీన్ ని రంగు తో నింపటం వల్ల, కొందరు చూడలేకపోతున్నామని అన్నారని, సమయం లేక ప్రస్తుతానికి బ్లాగర్ వారందిస్తున్న మామూలు టెంప్లేట్ కి మారా. కిస్ మస్ సెలవల్లో మళ్లీ మంచి దానికి మార్చాలి.

@ జేబీ,
:) అమ్మయ్య.. మీకూ తెలుసన్నమాట ఈ బాధ..

@ కొత్తావకాయ,

:) థాంక్స్.. ఆడియో హ్మ్.. చూస్తా.

కృష్ణప్రియ said...

@ రసజ్ఞ,
:) ష్యూర్
@ నాగార్జున,

:) థాంక్స్!
బ్లాగ్ కొందరికి ఓపెన్ అవట్లేదని చెప్పారు. రెండు సార్లు స్క్రీన్ ని రంగు తో నింపటం వల్ల, కొందరు చూడలేకపోతున్నామని అన్నారని, సమయం లేక ప్రస్తుతానికి బ్లాగర్ వారందిస్తున్న మామూలు టెంప్లేట్ కి మారా. కిస్ మస్ సెలవల్లో మళ్లీ మంచి దానికి మార్చాలి.

@ జేబీ,
:) అమ్మయ్య.. మీకూ తెలుసన్నమాట ఈ బాధ..

@ కొత్తావకాయ,

:) థాంక్స్.. ఆడియో హ్మ్.. చూస్తా.

కృష్ణప్రియ said...

@ వేణూ శ్రీకాంత్ గారు,

:) థాంక్స్.

@ మధురవాణి గారు,

థాంక్స్. నా బ్లాగ్ టెంప్లేట్ లోడ్ అవటానికి సమయం పట్టి కొందరికి ఓపెన్ అవట్లేదన్నారని ప్రస్తుతానికి బేసిక్ టెంప్లేట్ కి మార్చాను. త్వరలో మంచి టెంప్లేట్ కి మారతాను.

@ వరుణ శ్రీకాంత్ గారు,

ధన్యవాదాలు. చాలా బిజీ అయిపోయి... ఈ మధ్య బ్లాగుల జోలికి రాలేదు. మళ్లీ కాస్త తెరిపి వచ్చి..

కృష్ణప్రియ said...

@ అజ్ఞాత,

కొద్దిగా misunderstand చేసుకున్నట్టున్నారు. పనిమనిషి రెండు రోజులు రాకపోతే చేసుకోలేకపోవటం కాదు. ఒకేసారి అన్ని సమస్యలూ నెత్తి మీద కూర్చున్నప్పుడు వచ్చే తాత్కాలిక పలాయన వాదపు ఆలోచనల గురించి రాశాను.
నిజానికి ఒక పదేళ్లు ఏ పనిమనుషులూ లేకుండా హాయిగా ఒక్కదాన్నే పనులు చేసుకున్న దానిని నేను.

@చైతన్య గారు,
అవునండీ. ఇదే మొదలు..కడప దిక్కుకి రావటం.

థాంక్స్!

@ కష్టేఫలే శర్మ గారు,
ధన్యోస్మి!

harephala said...

" ఇంద్ర, సింహాద్రి, సమరసింహా రెడ్డి ల దగ్గర నుండి, సీమ శాస్త్రి కథల దాకా స్థల పురాణాలు చెప్పుకుంటూ, " "చిన్నప్పట్నించీ క్లాస్ పుస్తకాలు రుద్దాడేమో, బొద్దుగా ఉన్నాడు." "ఇదే బాగున్నట్టుంది.. "
"రాజు వాళ్ల పదహారు రోజుల పండగ ఏ ఊర్లో చేస్తారో కనుక్కోవాలి.."---- సూపర్ !!! రాజు ఎక్కడ చేసికుంటున్నాడుట ?

Sravya Vattikuti said...

హ హ బావుదండి , ఐతే మిమ్మల్ని ఫోన్ చేసి surprise గిఫ్ట్ ఏమిస్తున్నారు అంటే ఏదో ఒకటి కొని ఇచ్చేస్తారన్న మాట, నేను ట్రై చేస్తా ఐతే :P (కొంపదీసి ఈ అవకాసం మీ పిల్లలకి మాత్రమేనా :( )

పెళ్ళికి మీతో పాటు మేము కూడా వచ్చినట్లు ఉంది ఈ పోస్టు చదివితే !

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

>>"ఏంటో.. నేను ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచానికి నష్టం లేదు.. ఎలాగూ సామాజిక స్పృహా లేదు."

loooooool :)))))))))))

బులుసు సుబ్రహ్మణ్యం said...

బాగుందండీ. రెండు దహా లు.

Mauli said...

/ఎలాగూ సామాజిక స్పృహా లేదు./

idi assal ardham kaale ninna, ivvaala WP comment chudagaane ...ROFL!

malli comment post chestaanu...chaalundi :)

కృష్ణప్రియ said...

@ 'హరేఫల'ఫణిబాబు గారు,
:) థాంక్సు. ఏమోనండీ.. బహుశా.. ఆ పాటికి ఏ హనీమూన్ లోనో ఉన్నాడేమో? తెలియదు.

@ శ్రావ్య,
:) అడిగి చూడండి. తప్పక సర్ప్రైజ్ అవుతారు. థాంక్స్.

@ బులుసు వారు,
చి. న.

కృష్ణప్రియ said...

@ WP, మౌళి,

:) పట్టేశారన్నమాట.

Kathi Mahesh Kumar said...

మొత్తానికి కడప మీద మన తెలుగు సినిమాలు క్రియెట్ చేసిన మిథ్ లు తగ్గాయన్నమాట. గుడ్.

kallurisailabala said...

పోస్ట్ చాలా బావుందండి.
మీ పాప కొలవరి పాట అయితే సూపరు.
ఇక ఫాబ్రిక్ తక్కువ, జరీ పోగెక్కువ ఇది ఇంకా సూపరు.
పోస్ట్ చివర్లో పదహారు రోజుల పండగ అసలు పోస్ట్ కే హైలెట్ అని చెప్పాలి.
నవ్వుతూ చదివించింది
అలాగే వర్కింగ్ వుమన్ గురించి ఒక పిక్చర్ ఇచ్చినట్టుగా ఉంది మీ పోస్ట్.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;