Saturday, November 26, 2011

సంధ్య,రమేశ్ మరియు ద్రౌపది..


‘ఇదిగో,ముందే చెప్తున్నాను.. ఆ పుస్తకం ఇంటికి తీసుకొస్తే ఒప్పుకోను..’ రమేశ్ నెమ్మది గా చెప్తున్నా, దృఢంగా చెప్తున్నాడు. అంతమంది ముందు చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్పాడని చిన్నబుచ్చుకుంది సంధ్య. ముఖం ఎర్రగా .. ‘అయ్యో, మధ్యలో నేనిరుక్కున్నానే..’ అని నేను నొచ్చుకున్నాను..

రమేష్, సంధ్య మాకు బాగా తెలిసిన వాళ్లు.. పెద్దగా దాపరికాలు పెట్టుకోరు.. అంతా డైరెక్ట్ గానే మాట్లాడటం, తాము నమ్మింది, బల్ల గుద్ది మరీ చెప్తారు. నమ్మనిది ఖండించటమే కాదు, ఖండఖండాలు గా చీల్చి చెండాడుతారు. ‘ఒప్పుకున్నాం.. మమ్మల్నోదిలేయండి!!’ అని దణ్ణం పెట్టేంత దాకా వదలరు. అలాగే, తమ వాదన లో తప్పుందని అనిపిస్తే సంవత్సరం ముందు సంగతైనా సరే, ‘అప్పుడు అలాగ అనుకోవటం తప్పని అర్థమైంది.’ అని ఫోన్ చేసి మరీ చెప్తారు.

కొత్త ఇల్లొకటి చూశారు. బోల్డు ఖరీదు. నెలనెలా కట్టాల్సిన వడ్డీ తర్వాత అంత పేద్ద ఇంట్లో గంజి తాగాలి .. మనం.. మన తాహతు లో మనం తీసుకుందాం, మనం ఎగరలేని ఎత్తుకి ఎయిమ్ చేస్తే, దబ్బున కూలబడతాం..’ అని సంధ్య అంటుంటే..

‘అబ్బే జీవితం లో రిస్క్ తీసుకోందే,..పైకి రాలేం!’ అని రమేశ్ అంటున్నాడు.. మేమూ, కర్ర విరగకుండా, పాము చావకుండా, మాకు తోచిన సలహాలు, గోడ మీద పిల్లుల్లా ఇస్తున్నాము.


యార్లగడ్డ రచించిన వివాదాత్మకమైన కథ ద్రౌపది పుస్తకం రైల్వే స్టేషన్ లో కొనుక్కుని రైల్లో చదివేసి హాల్లో టీపాయ్ మీద పడేసినట్టున్నాను.
సంధ్య చూసి ‘అరే ఈ పుస్తకం గురించి టీవీ లో ఏదో చూశాను. చాలా చెత్తగా రాశాడటగా? ‘ .. అంది.
‘చెత్త.. అంటే ఆయన అభిప్రాయం ఆయన రాసుకున్నాడు. నాకు అదొక మహత్తరమైన పుస్తకం అనిపించలేదు. కొన్ని సరిగ్గా రాయలేదు. అనిపించింది.. కొద్ది పార్ట్ అస్సలూ నచ్చలేదు.. ‘ ఇలా ఏదో చెప్తూఉండగా..
‘ఆగు ఆగు. చెప్పేయకు... నువ్వు చదివేసానంటున్నావు.. నేనూ చదివి ఇస్తా,, తీసుకెళ్లనా?’ అడిగింది సంధ్య.
దానికి వచ్చిన గొడవ ఇది. ఈ ఖరీదైన ఇల్లు కొనాలా,వేరేది వెతకాలా అన్న మీమాంస మీద వేడి చర్చ లో వాడిగా వాగ్బాణాలు విసురుకుని కచ్చ గా ఉన్నారేమో..


‘ఇదిగో,ముందే చెప్తున్నాను.. ఆ పుస్తకం ఇంటికి తీసుకొస్తే ఒప్పుకోను..’ రమేశ్ అనేశాడు.
‘ఏం? ఎందుకు ఒప్పుకోరు? నాకిష్టం అయిన పుస్తకం నేను చదివితే మీకేంటి ప్రాబ్లం? !’ పౌరుషం గా అంది సంధ్య.
‘ఆ పుస్తకం అంతా చెత్త అని మా ఆఫీస్ లో విన్నాను. టీవీ లో కూడా చెప్తున్నాడు..’
‘అయితే? నేనేమైనా చిన్న పిల్లనా ? నాకు మంచీ చెడ్డా తెలియవా?’
... అందరి ముందూ, తనని వద్దన్నాడని సంధ్యా, అందరి ముందూ, తను ‘ఆ పుస్తకం చెత్తని ‘ తెలుసుకున్న విషయాన్ని, గౌరవించకుండా ‘ నా ఇష్టం.. నేనే చదివి తెలుసుకుంటాను’ అందని రమేశ్ బిగుసుకుపోయారు.
‘ఈ పుస్తకం మా కాలనీ ఆవిడ అడిగింది, ఇవ్వలేను ‘ అని తప్పించుకున్నాను. కానీ ద్రౌపది మీద చర్చ మాత్రం కాసేపు అలా నడిచింది.
ఐదుగురు భర్తలని చేసుకున్న ద్రౌపది ఇంకా కర్ణుడిని కావాలనుకుందని, ఆవిడకి అసలు పురాణాల్లో ఒక స్థానం లేదని, బ్లా హ్... తనకున్న నాలెడ్జ్ తో హోరా హోరీ గా మిగిలిన అందరితో కాస్త చర్చ జరిపి రమేశ్,కాసేపటికి చల్లారి, మళ్లీ ఇంటి టాపిక్ కి వచ్చి, .. అలాగ ఒక సాయంత్రం గడిచి పోయింది. ఇద్దరూ వెళ్లిపోయారు. వెళ్లాక వాళ్లింట్లో దీపావళి అయ్యుంటుందని అనుకున్నాం.


ఇది జరిగిన ఒక వారం తర్వాత, అనుకున్న ఇల్లు కొనేస్తున్నామని, ఫోన్ వచ్చింది. సంధ్యతో ‘నొ రిస్క్, నొ గెయిన్’ అని వాదించినా కాస్త భయం గానే ఉందని ఉద్యోగాల మార్కెట్ లో తేడా వస్తే, చిప్ప చేతిలో పట్టుకోవాలేమో.. అని కాసేపు మదన పడ్డాడు. అయిపోయిన డెసిషన్ కదా.. ‘పర్వాలేదు.అంత పేద్ద మొత్తం తో ఇల్లు కొంటున్నావు. ఈ మాత్రం భయం సహజమేనని, జీవితమే ఒక జూదం.. ఆడక తప్పని ఆట అనీ.. మాకు తెలిసిన పాత సినిమా డైలాగులు గుర్తు చేసుకుని చెప్పేశాం...

అనుకున్నట్టు గా ఇల్లు రిజిస్ట్రేషన్ కానిచ్చి, ఇల్లు చూపించటానికి మమ్మల్ని కార్లో తీసుకెళ్లాడు రమేశ్. అందరం ఉత్సాహం గా వెళ్తున్నాం.
‘ఇంతకీ ఈ ఇంటి రిజిస్ట్రేషన్ అప్పుడు చిన్న గమ్మత్తు జరిగింది.. మీకు చెప్పాలి’ అన్నాడు రమేశ్.
సంధ్య మొహం కళ కళ లాడి పోయింది.? మాకూ భలే ఉత్సుకత గా అనిపించింది.
‘కోటిన్నర ఇల్లు... తొంభై లక్షల అప్పు.. ఇద్దరం చాలా టెన్షన్ గా వెళ్లాం. చేస్తున్న పని కరెక్టే అని ఒకరికి ఒకరం చెప్పుకుంటూ.. ‘

రిజిస్ట్రేషన్ లేట్ అయింది.. రెండయిపోతోంది. అబ్బాయి స్కూల్ నుండి వచ్చే సమయం అవుతోంది.. సంతకాలు అవుతూనే.. సంధ్య బయల్దేరింది. నేను చిన్నా చితకా పనులు చేసుకుని వెళ్దామని, ఆటో ఎక్కిద్దామని వెళ్లాను..

‘సంధ్యేమో.. మనం పొదుపు చేయాలి.. అని బస్సెక్కి వెళ్తానంది.’

మేము వాళ్లు చెప్పాలనుకున్న గమ్మత్తు అదేనేమోననుకుని, పక పకా నవ్వేసాం.
‘express/ volvo బస్సులెక్కి డబ్బు తగలేసావా? లేక మామూలు బండి ఎక్కావా? అసలే తొంభై లక్షల అప్పు!’ వేళాకోళం చేశాను నేను.
‘లేదు లే వచ్చిన మొదటి బస్సెక్కా’ అనేసింది సంధ్య.
‘అయినా అసలు చెప్పాలనుకున్న గమ్మత్తు అదికాదు.. ‘ అని కథ కొనసాగించింది తను.

‘బ్యాంక్ అతను పనులన్నీ అయితే sale deed తీసుకెళ్లటానికి ఎదురు చూస్తున్నాడు. మళ్లీ ఏ ముప్ఫై ఏళ్లకి చూస్తామో అని, రమేశ్ దేవుడికి ఒకసారి చూపించి వెళ్దామని ..’
ఇంకా చెప్తున్న సంధ్య ని ఆపి రమేశ్ ..
‘నేను చెప్తాలే.. మరీ అంతా ఉత్సాహ పడిపోకు..’ అని ఉడుక్కుని, కంటిన్యూ చేశాడు..

‘రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గుడి భోజన సమయం కదా, మూసేసారు. పక్కన ఇంకో గుడి కనిపిస్తోంది. అక్కడికి ఓకే ఒక్క నిమిషం.. చూపించి ఇచ్చేస్తాను.. ప్లీజ్’ అన్నాను ‘
‘బాంక్ అతను అసహనం గా.. వాచ్ చూసుకుంటూ.. సరేనని అనగానే, నేను ఆ గుడి వైపుకి పరిగెత్తాను. పూజారి గారు అప్పటికే గుడి మూయటానికి బయటకి వచ్చేశారు’

‘నేను వెళ్లి ఓకే నిమిషం లో వస్తానని బ్రతిమలాడుకుని, లోపలికి చెంగున పరిగెత్తి దేవుడి ముందు కుంకుమ పాకెట్ కి పెట్టి కళ్ళు మూసుకుని ‘నాయనా.. తండ్రీ.. నా జీవితం లో అతి పెద్ద రిస్క్, తీసుకుని కట్టుకుంటున్న ఇల్లు.. అన్నీ సవ్యం గా జరిగేట్టు అనుగ్రహించు..’ అని భక్తి గా దణ్ణం పెట్టుకున్నానో లేదో.. ‘శీఘ్రం.. ‘ అని అరుస్తున్నాడు అయ్యగారు.
‘’ఊ..’

‘నేను అదే పరుగు తో బయటకి వచ్చి బాంక్ అతనికి కాగితాలందించి.. అమ్మయ్య అని వెనక్కి తిరిగి చూశాను.. పంతులు గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు..
‘ధన్యవాదాలు! అని చెప్పి.. ఇంతకీ, లోపల దేవుడు ఎవరు స్వామీ ఉంది? అర్థం కాలేదు. అడుగుదామా అంటే.. సమయం లేకపాయే.. ఎవరైతే ఏంటి అని దణ్ణం పెట్టి వచ్చా.. అన్నాను.. అప్పుడు ఆయన నవ్వి.. ‘
అని ఎఫెక్ట్ కోసం ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగి ఉండటం తో అందరి వంకా, నాటక ఫక్కీ లో చూశాడు రమేశ్..

మేము.. ‘చెప్పండి. మళ్లీ మాకు క్విజ్జా?’ అని అడిగాము.
సంధ్య తన ఉత్సాహాన్ని ఆపలేక మెరుస్తున్న కళ్ళతో బ్రేక్ చేసింది..


‘అది ద్రౌపదీ సహిత ధర్మ రాజు గుడి’

PS :

ద్రౌపది గుడుల గురించి చదవాలంటే....

http://www.indianetzone.com/49/draupadi_temples_south_india.htm

17 comments:

Chitajichan said...

Singapore lo Sri Mahamari Amman temple, China town lo undi.This is more than 100 years old temple. Akkada Draupadi Gudi kuda undi. garbha gudilo ammavaru draupadi, bhayata pancha pandavula vigrahalu untaayi. mana hyd lo unde grama devatala temples laaga untundi. Nenu tega tega surprize ayyaanu modati saari chusi nappudu. vinayakudini vignalu tolaginchu ani vedukuntamu. hanumantudini dhairyam ivvu ani vedukuntam. mari draupadini emi ivvamani vedukovali???

వేణూ శ్రీకాంత్ said...

హహహ :-)))

కౌటిల్య said...

ద్రౌపదిని " నీ అంత సహనం, సంయమనం, క్షమాగుణం ఇవ్వమ్మా!" అని వేడుకోవాలి చితజిచన్ గారూ...

కృష్ణప్రియ said...

@ chitajichan,

కర్ణాటక లో చాలా ఉన్నాయి. అలాగే తమిళ నాట, అమ్మన్ కల్ట్ ఒకటి ఉందని ఒక నాట్య శైలి ఉందని చదివాను. ఇది చూడండి.

http://en.wikipedia.org/wiki/Draupati_Amman

@ కౌటిల్య గారు,

bravo! మంచి ఆన్సర్.. థాంక్స్..

@ వేణు శ్రీకాంత్ గారు,

:) ధన్యవాదాలు!

విరిసిన అరవిందం said...

యాజ్ఞసేని అని ఒరియా రచయత్రి ప్రతిభారాయ్ రాసిన ద్రౌపది
నవల(౯తెలుగు లో మన విశాలాంధ్ర బుక్ షాప్౦ లో దొరుకుతుంది.)
అదిచదివేతే ద్రౌపది అంతరంగం ఆవిడా మనోవేదన రచయత్రి ఎంతో
ఉన్నతం గ ఆవిష్కరించారు. తెలుగు సేత అంతా అందంగ ఎంతో విలువలతో కూడి వుంది.
ఈ పుస్తకం చదివితే ద్రౌపది మీద అందరకి ఒక గౌరవం పెరుగుతుంది

sunita said...

hahaha!baagundanDee chamakku!!

Varuna Srikanth said...

hi...ee post punyamani...Karnataka lo Draupadi ki gudi undani telisindi...)))
Armugam series emaindandi? meeru continue cheyyatleda?

లత said...

ఫన్నీ ఇన్సిడెంట్ ... బావుంది

బులుసు సుబ్రహ్మణ్యం said...

I see, మీరు ఇలాంటి పుస్తకాలు చదువుతున్నా రన్నమాట. Mr. కృష్ణప్రియ ఎక్కడ?... దహా

రాజ్ కుమార్ said...

హిహిహిఇ.. క్లైమాక్స్ సూపరండీ... ;)

బుద్దా మురళి said...

కృష్ణప్రియ గారు బాగుంది

కృష్ణప్రియ said...

@ విరిసిన అరవిందం,
అవును. మీరూ చదివారా? ఆంగ్లం లో pdf నేనూ చదివాను. Thanks for the comment!

@ సునీత గారు,
: )
@ వరుణ శ్రీకాంత్ గారు,
ఆర్ముగం కథ కి మళ్లీ వెనక్కి వస్తాను. కొద్దిగా సమయాభావం వల్ల...

@ లత గారు ,
: ) థాంక్స్! నాకూ చాలా ఫన్నీ గా అనిపించిన సంఘటన అది.

@ బులుసు గారు,
: ) అబ్బే చదవలేదండీ.. నేనూ పెద్ద పెద్ద అవార్డులు వచ్చిన పుస్తకాలు చదివానని అందరూ అనుకోవాలని అలాగ అందరికీ కనిపించేలా పడేస్తూ ఉంటానన్న మాట..

@ బుద్దా మురళి గారు,
ధన్యవాదాలు!

స్ఫురిత said...

మీరు suspence serials రాసెయ్యొచ్చు కృష్ణా...

మీ టపా సూపరు..బులుసు గారి కామెంటు కి మీరిచ్చిన జవాబు మళ్ళీ సూపరు...:)

కృష్ణప్రియ said...

రాజ్ కుమార్, స్ఫురిత,

ధన్యవాదాలు!

చైతన్య దీపిక said...

ఏదేమైనా మీరు చెప్పే విధానం మాత్రం బాగుంది..మన సంస్కృతి ని , స్త్రీ తత్వాన్ని కించపరిచే విధంగా రచయిత "ద్రౌపది" నవలిక ఉందన్న విమర్శ వచ్చినా మంచి సాహితీ విలువలు కలిగిన పుస్తకంగా ఎందరో సాహితీవేత్తల మన్ననలను పొందింది ఆ నవల .

గీత_యశస్వి said...

droupadi book maa ammamma chadivi chaala bagundi ante nenu chadivaanu. droupadi gurinchi anni konaala nunchi telusukogaligaanu. mee twist baagundi.

కృష్ణప్రియ said...

@ చైతన్య దీపిక, గీతా యశస్వి,

ధన్యవాదాలు!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;