Saturday, December 19, 2015

చిత్తుకాగితాల దుకాణం పాలైన మా వంశ సంపద కథ :) - స్వల్ప హెల్ప్ మాడి!


ఖాళీ గా ఉన్నా, సరే టీవీ పెట్టా. తెలుగు చానల్ లో ఏదో ప్రోగ్రాం వస్తోంది.

కొత్త కోడలు ఇంటికొచ్చింది. 'ఇదిగో అమ్మాయ్.. ఇక నుండీ ఈ ఇంటి బాధ్యత నీదే!' అని అత్తగారు టీవీ లో కోడలికి తాళాల గుత్తి ఇస్తోంది.  ఎంత  పాత డైలాగు.  'ఇదిగో అమ్మా, ఇక నుండీ బాధ్యత నీదే. ఇదిగో ఆన్ లైన్ బాంకింగ్ కి పాస్ వర్డ్, బాంక్ లాకర్ కీ, స్విస్ బాంక్ ఎకౌంట్ ఇన్స్క్రిప్ట్ చేసిన లాకెట్ ఇదిగో ..  'ఇలాంటి డైలాగులు అసలు ఎవరైనా, ఎవరికైనా చెప్తారా?  అని నవ్వొచ్చింది. స్టాకుల మీద లక్షలు సంపాదించాడు. ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు పెట్టాడో భార్య కి కూడా చెప్పకుండా పోయిన కో వర్కర్ గుర్తుకొచ్చాడు.

నాకు ఏ తాళాల గుత్తీ, మా అత్తగారు ఇచ్చినట్లు గుర్తులేదు నాకు.  (ఆవిడ ప్రేమ గా ఇచ్చిన తన వస్తువులు, ఆవిడ కొని ఇచ్చిన వస్తువులూ  తప్ప) ఏ సినిమా చూసినా, తరతరాల నుండీ పాస్ అయిన నగలు ఇస్తూ ఉంటారు.  సామాన్లు, ఏవేవో గొప్ప గొప్పవి ఇస్తూ ఉంటారు,  మధ్య తరగతి వాళ్లకి లైఫ్, ఇంటిపేరు,  + కొన్ని వాల్యూస్ ఇస్తే అదే గొప్ప అని ఎంత చెప్పుకున్నా,  'ఇదిగో, ఇది నాకు తరతరాల నుండీ మా వంశం లో పాస్ అవుతూ వస్తోంది, అని తెలిసిన వారికి చెప్పుకుంటే.. అబ్బ.. ఆ కిక్కే వేరు!

మన నందమూరి  వంశం నుండీ, బొట్టు వారిదాకా ఎవరి వంశాలకి వారి సాంప్రదాయాల దగ్గర్నించీ, సామాన్ల దాకా ఎన్నెన్ని వచ్చేసాయో, అనుకుని నిట్టూర్చగానే, గుర్తొచ్చేసింది.  నాకూ దక్కిన వారసత్వ సంపద! మా నాయనమ్మ/తాతగారి ఇరవై మనవలూ, మనవరాళ్లల్లో  నాకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం!

అబ్బో ఎప్పుడో,... ఏడో క్లాసు లో ఉన్నప్పటి మాట! టీవీ లో ఏదో పాత నలుపు, తెలుపు సినిమా వస్తుంటే నేనూ, మా నాయనమ్మా చూస్తున్నాం. మా అమ్మ, నాన్నగారూ, చెల్లి నీ, తమ్ముణ్ణీ తీసుకుని ఏదో పెళ్లికి  వెళ్లారు.

హీరో అన్ని రకాల విద్యలో అభ్యసించి రాజుగారి దగ్గరకి వచ్చి 'తండ్రి గారూ, సకల విద్యలూ నేర్చితిని, బ్లహ్ బ్లహ్ .' అని చెప్తున్నాడు. ఆ తండ్రి గారు కొన్ని పరీక్షలు చేసి, మెచ్చి, 'నాయనా! నీవు ఇప్పుడు యుక్త వయస్కుడవైనావు! మన వంశం లో తరతరాలు గా వారసత్వ సంపదగా వస్తున్న ఈ పవిత్ర మంత్రాన్ని నీకు ఉపదేశం చేయవలసిన సమయం ఆసన్నమైనది, పౌర్ణమి నాడు వంద సంవత్సరాలకి కానీ రాని  ఒక దివ్యమైన ముహూర్తం ఉంది. ప్రాతః సమయములో నదీ తీరమున నేను నీకు ఆ మంత్రశక్తి ని ధారపోస్తాను' అన్నాడు. రాజకుమారుడు 'మహా ప్రసాదం!' అని ఎంతో ఆనందం గా వంగి నమస్కరించాడు. ఈలోగా కమర్షియల్ బ్రేక్ ఇచ్చేశాడు.

నేను ఆలోచనలో పడిపోయాను. మా నాయనమ్మ  'ఏమిటి ఆలోచిస్తున్నావు?' అని అడిగింది. 'నాయనమ్మా! మన వంశం లో ఇటువంటి ఆచారాలు ఏమీ లేవా? ఒక్క మంత్రం అయినా మనకి తరతరాలు గా రావట్లేదా? అంత అనామక వంశమా మనది?' అన్నాను నిష్టూరం గా.

అనామక వంశం - అన్నమాట ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది ఆవిడ కి.  'ఎంత మాటన్నావు? మన వంశం అంటే ఏమనుకున్నావు? ' అని ఏదో చెప్పడం మొదలు పెట్ట బోయింది.

'అబ్బే! నాకు వంశం గొప్పదనం కథలొద్దు నాయనమ్మా! తరతరాలు మన వంశం లో పాస్ ఆన్ అవుతున్న మంత్రం ఏమీ లేదా? నాకు మంత్ర శక్తి ఏదీ ధార పోసేది ఉండదా అసలు మన ఇంట్లో?' అని నిర్వికారం గా ముఖం పెట్టాను.

మా నాయనమ్మ ముఖం ఒక్కసారి గా వెలిగి పోయింది . సాధారణం గా రెండు నిమిషాలకి పైగా తీసుకుని లేచేది, కానీ ఈసారి మాత్రం దిగ్గున లేచింది. 'కృష్ణా! నాకున్న మంత్ర శక్తి మీ నాన్న కానీ, అమ్మ కానీ తీసుకోవడానికి ఇష్ట పడట్లేదు నువ్వు తీసుకుంటావా?' ఆశ గా అడిగింది.

నాకు ఉద్వేగం తో నోట మాట రాలేదు.  టీవీ సినిమా లో హీరోలా చేతులు నుదుటి దాకా ఎత్తి దణ్ణం పెట్టి ' మహా ప్రసాదం! ఎందుకు తీసుకోను? చెప్పు! నీకు వచ్చిన మంత్రవిద్య ని నీతోనే పోనీయకు ' అని నిటారు గా నిలబడి రెడీ అయిపోయాను.

మా నాయనమ్మ కి కన్నీళ్లే తక్కువ. 'ఎప్పుడంటే అప్పుడు ఈ మంత్రాన్ని ధార పోయలేము.  వచ్చే నెల సూర్యగ్రహణం పూట పట్టు, విడుపు స్నానాల మధ్య నేను నీకు ఈ మంత్రోపదేశం చేస్తాను. మూడు మంత్రాలున్నాయి.' అంది.

కాలెండర్ చూసి లెక్కపెట్టి,  'అబ్బా! ఇంకా 17 రోజులున్నాయి.  ఏం? ఇప్పుడే చెప్పేస్తే ఏమవుతుంది?' అని ఉత్సాహం గా, ఆశ గా అడిగాను.

 'అట్లా ఎప్పుడు పడితే అప్పుడు చెప్తే మంత్రం వాడినా ఫలితం ఉండదు! సరే, జాగ్రత్త గా విను!  మీ అమ్మకీ, నాన్న కీ తెలియనీయకు ! వాళ్లు నమ్మట్లేదు. పైగా నిన్ను కూడా ఈ మంత్రం నేర్చుకోనీయకుండా అడ్డుకుంటారు!' అని రహస్యం గా చెప్పింది.

నేను కూడా గుసగుస గా  'సరే . మా అమ్మకీ, నాన్నకీ ఎందుకు ఇష్టం లేదు? నువ్వు ఇప్పటిదాకా ఎంతమందికి చెప్పావు ఈ మంత్రం? ' అని అడిగాను. ( మా అమ్మా, నాన్నా, 200 కిలో మీటర్ల దూరం లో ఉన్నారని తెలిసీ)

మా నాయనమ్మ 'హు: వాళ్లు నాలుగు ముక్కలు చదువుకుని హైదరాబాదు చేరారు కదా, మనమంత్రాలు అంటే లెక్కలేదు ' అని కినుక గా అంది. 'మీ బాబాయి కి చెప్పా.  వీళ్లు నా మాటే వినలేదు. మీ బాబాయి మాత్రం నేను చెప్పిన మంత్రాన్ని ఉపయోగించి ఎంతో మంది కష్టాలు తీర్చాడు '  అంది.

'సరే! ఇంతకీ ఆ మంత్రం మహిమలేంటి? ఏం  చేయచ్చు?' అని ఆసక్తి గా అడిగాను.  మనుషుల్ని కప్పలు గా, రాళ్లు గా, చెట్లు గా ..  ఇలాగ నాకు మంచి కిక్ వచ్చేసింది.

'లేదు. నాకొచ్చినవి  మూడు మంత్రాలు! పాము మంత్రం, తేలు మంత్రం, దిష్టి మంత్రం' అంది.

గాలి తీసేసినట్లైంది  నాకు. 'అవా?' అని నిరాశ గా కూర్చున్నా.  కానీ అరక్షణం లోనే తేరుకుని, 'దంచినమ్మకి  బొక్కినంత' అనుకుని సర్ది చెప్పు కున్నాను.

అక్కడ నుంచీ ఒక సీక్రెట్ పాక్ట్ మాది. ఎక్కడా బయటపడలేదు. ఈలోగా కొన్ని సాంకేతిక పరమైన అనుమానాలు వచ్చాయి మాకు.  వంశ పారంపర్యం గా వచ్చే మంత్రాలకి నిజమైన వారసులు మగ పిల్లలే అవుతారా? ఆడవాళ్లకి  కూడా ఈ మంత్ర ధార పోయచ్చా?,  ముఖ్యం గా ఆడవాళ్లు పోయచ్చా? మూడుగదుల  అద్దె ఇంట్లో మా అమ్మా, నాన్నగారు, చెల్లి, తమ్ముడు చూడకుండా మడి కట్టుకుని మా నాయనమ్మ ఎలా ఇదంతా చేయగలదు? ఈ మంత్రాలని నేను ఎక్కడైనా రాసుకుంటే, వేరే వారికి తెలిస్తే దాని ప్రభావం పూర్తి గా పోతుంది. ఎలా? దానికి ఒక రహస్యపు భాష ని కనిపెట్టాలి/లేదా ఎన్-కోడింగ్ ఆల్గో ఏదైనా రూపొందించాలి!

రేపు ఈ మంత్రాలు నేర్చుకున్నాకా, పాము కాటు కి, తేలు కాటుకీ గురైన వారు నాకు ఎక్కడ దొరుకుతారు? దిష్టి మంత్రం, దిష్టి కొట్టకముందే వేయాలా? లేక దిష్టి కొట్టాకే వేయాలా?' దిష్టి తగిలిందని ఖచ్చితం గా ఎలా తెలుస్తుంది? లాంటివి గుసగుస గా చర్చించుకోవడం అందరూ గమనించారు కానీ, పట్టించుకోలేదు.

చూస్తూండ గానే గ్రహణం రోజు వచ్చేసింది.   మా నాయనమ్మ పట్టు స్నానం చేశాకా 'అమ్మాయ్! ఒక్క నిమిషం గది లోకి రా . వీపు మీద ఎందుకో పుండు లా తయారయినట్లుంది, కాస్త చూద్దువుగానీ, ' అని కన్నుకొట్టి బెడ్ రూం లోకి వెళ్లింది. నేనూ వెనకాలే వెళ్లా.

సినిమాలో చూపించినట్లు గురువు గారికి ప్రణామం చేసి, మంత్రం, దీక్ష తీసుకున్నా. ముందు గా ఆలోచుకున్నట్టుగా నా నోటు పుస్తకం లో వెనక పేజీ మీద నేను పెట్టుకున్న రహస్యపు లిపి/ భాష లో రాసేసుకున్నా.  ఉదాహరణ కి  కృష్ణప్రియ = గెస్తబ్లుర,  రామాయణం  = లియిరాప్    అలాగన్నమాట.   తర్వాత ఏమీ ఎరగనట్లు బయటకి వచ్చి కూర్చున్నాం.

'ఏమైందమ్మా! బాగానే ఉందా?' అని మా నాన్నగారడిగారు.  'బానే ఉంది. ఏవో చెమట కాయలనుకుంటా! దురద అని బాగా గీకేసుకున్నట్లుంది అంతే!' అని చెప్పాను.

కొత్తగా నేర్చిన ఈ మంత్ర శక్తి నాకు మంచి గాంభీర్యాన్ని తెచ్చి పెట్టింది. నెహ్రూ గారిలా చేతులు వెనక్కి ముడిచి, నాలుగు రోజులు సీరియస్ గా నడిచాను.  మా ఇంట్లో మొదట్నించీ దిష్టి నమ్మకం లేదు. మేమున్న ఏరియా లో పాములు, తేళ్లు లేనే లేవు.  నా విజ్ఞానం అంతా బూడిద  లో పోసిన పన్నీరయిందని చాలా బాధపడ్డాను.  చుట్టు పక్కల వారిని పాములు, తేళ్లు కుట్టడం లేదని మొదట్లో బాధ పడి, పడి, మనసు పాడుచేసుకుని, నెమ్మది గా రికవర్ అయ్యాను.

ఈలోగా వేసవి సెలవలు వచ్చేశాయి. ఎప్పటిలాగానే, మేమంతా బాబాయి ఇంటికి వెళ్లి ఒక పది రోజులుండి, అక్కడినుంచి  మా అమ్మమ్మ గారింటికి వెళ్లి రెండు నెలల తర్వాత హైదరాబాదు కి వచ్చే ప్రోగ్రాం వేసేశాం.

బాబాయి కి మళ్లీ ట్రాన్స్  ఫర్ అయి చిన్న ఊళ్లో ఉద్యోగం.  దిగుతూనే రాత్రి వేళ గడ్డి వాముల పక్క పెంకుటిల్లు చూసి సినిమాల్లో లాగా దొర్లేసాం. అయితే, దురదలు పట్టి, మందులు రాసుకుని, మింగి, పడుకున్నాం నేనూ, మా చెల్లీ, తమ్ముడూ!  నాకు నిద్ర పట్టడం లేదు. 

ఈలోగా రాత్రి 10 దాటాకా బయట గొడవ గొడవ గా మాట్లాడుకుంటూ, ఏడ్చుకుంటూ పెద్ద గుంపు వచ్చేశారు.  'పంతులూ! పంతులూ !!, మా శీనయ్య కి పాము కర్చింది. జర్రంత పామ్  మంత్రం .. ' నాకు తెగ ఉత్సాహం, క్యూరియాసిటీ  వచ్చేశాయి. కర్టెన్ వెనక నుంచుని గమనిస్తున్నా. మా బాబాయి బయట మాట్లాడుతున్నాడు. నురగలు కక్కుతున్నాడు ఒక పాతికేళ్ల మనిషి. ఎత్తుకొచ్చి ముందు గదిలో పడుకో పెట్టారు. మా బాబాయి కళ్లు మూసుకుని ఏవో చదువుతూ, చేత్తో సైగ చేసి, అందర్నీ బయటకి పంపేశాడు. అది ఖచ్చితం గా పాము మంత్రం కాదు. నాకు చచ్చే ఎగ్జైట్ మెంట్ గా ఉంది

 తలుపు వేసి, కిటికీల దగ్గర్నించీ వేసి, నన్ను చూసి, 'నువ్వూ లోపలికి పో.. ఇక్కడుండ కూడదు ' అన్నాడు. నేను వినలేదు. 'నాకూ పాము మంత్రం వచ్చు.  నేనూ సహాయం చేస్తాను' అన్నాను. మా బాబాయి ఆ మాటా వినలేదు, నా వైపు ఇక చూడలేదు.  ఒక టూల్ బాక్స్ లాంటిది తెచ్చి బ్లేడ్ తో కట్ చేయడం లాంటివి ఏవో చేశాడు. తర్వాత ఇంజెక్షన్ కూడా చేశాడు. మంత్రం ఏమీ చదవలేదు.  క్లాస్ పుస్తకం లో చెప్పిన ప్రథమ చికిత్స లాంటి పనులే. కాసేపటికి నన్ను చూసి, 'నిన్ను లోపలి వెళ్ల మన్నాను కదా .. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు?' అన్నాడు.

'సర్లే' అని తలుపు తెరవబోయి, మళ్లీ వెనక్కెళ్లి  మూల న పెట్టుకున్న కుంకుమ తెచ్చి కాస్త పెట్టేసి, తలుపు తీసాడు.  తప్పకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తామని ఒట్టు పెట్టించుకుని, ఏవేవో జాగ్రత్తలు చెప్పి లోపలికి అలసట గా వచ్చాడు.

 'అదేంటి బాబాయ్? తప్పు మంత్రం చదివావ్?' అని అడిగితే,  ఏమనుకున్నాడో తెలియదు  'మంత్రం చదివా. అయితే నేను నేర్చుకున్న చిన్నపాటి వైద్యం కూడా ..' నేను వినలేకపోయాను. తరతరాల నుండీ, కుటుంబం లో పాస్ ఆన్ అవుతున్న మంత్రాల మహిమ ఇంతేనా?'

ఈ ప్రథమ చికిత్స లాంటివి మానేసి  రిస్క్ తీసుకోలేము. పాముల, తేళ్ల మంత్రాలు కాకుండా దిష్టి మంత్రం ఉపయోగించి చూడాలి హైదరాబాదు కెళ్లి ఎవరికీ దిష్టి బాగా తగులుతుందో, దిష్టి తగిలిన వారి లక్షణాలు ఏంటో కాస్త అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నాను.  ఈ మహత్కార్యం కోసం, అవసరమైతే, నేనే, లోక కల్యాణార్థం నలుగురైదుగురికి దిష్టి కొడదామని కఠోర నిర్ణయం తీసుకున్నాను. 

వేసవి సెలవలన్నీ అల్లరి చిల్లరి గా గడిపేసి ఎనిమిదో క్లాసుకి వచ్చాకా, ఈ మంత్రాల గొడవ మర్చిపోయా.  తర్వాత గుర్తొచ్చి చూస్తే ఎక్కడ వెతికినా, ఎక్కడెక్కడ గాలించినా ఏడో క్లాసు పుస్తకాలు దొరకలేదు. .  మా అమ్మ పాత పేపర్ల వాడికి ఇచ్చేసింది :-(

మళ్లీ నాయనమ్మ ని అడిగితే అప్పుడే కాదు మళ్లీ గ్రహణం రావాలి, పట్టూ విడుపూ స్నానాలు..  అయితే మళ్లీ గ్రహణం వచ్చి, మా ఇద్దరికీ కుదిరే ముహూర్తం వచ్చే లోపలే ఆవిడ  ఆ దేవుడి దగ్గరకి వెళ్లిపోయింది.  మా బాబాయి కి నాకు మంత్ర దీక్ష చేయమని శత విధాలా వేడుకుంటూ ఉత్తరం రాశా. జవాబు గా, 'అసలు నాకు ఆ మంత్రాలే గుర్తులేవు. నేను నేర్చుకుని చేసేది  ప్రాథమిక చికిత్స + డాక్టర్ గారు ట్రెయినింగ్ ఇచ్చిన ఎమెర్జెన్సీ ప్రొసీజర్ మాత్రమే! అయినా నువ్వు ఈ పిచ్చి లోంచి త్వరగా బయటకి రా ' అని హితబోధ చేస్తూ ఉత్తరం రాశాడు.

ఎంతో  దీక్ష గా, మా వంశాచారం ప్రకారం నాయనమ్మ దగ్గర్నించి తీసుకున్న మంత్రాన్ని చిత్తుకాగితాల పాలు చేసేశా!  ప్చ్!  ఏం  చేయడం!  

అన్నట్టు మీకు ఎక్కడైనా ఒక పాత పేపరు ముక్క కానీ, నోటు పుస్తకం కానీ ఏ బెల్లమో చుట్టో, లేక ఎక్కడో ఏ కాల నాళిక లోనో నిక్షిప్తమై దొరికితే, ( దాదాపు 1984-85 లోది  కాబట్టి కాస్త మగధీర లో 400 యేళ్ల క్రితం పుస్తకం చదివినంత సున్నితం గా హాండిల్ చేసి) నాకు కాస్త ఆఖరి పేజీ ఒక్క ఫోటో తీసి పంపగలరా?

గుర్తులు : Lepakshi books కి అప్పట్లో వచ్చిన డూప్లికేట్ పుస్తకం Lipaksi వారిదది.   కృష్ణప్రియ VII  B   సైన్సు నోట్సు అని అట్ట  మీదా,  అలాగే వెనక పేజీ లో ..

సున్నాలూ, ఇంటూ మార్కుల ఆట,  'చిరుగాని కొత్త సిన్మ రుస్తుం చూసినవానే? ' అని ఒక చేతి రాతా, 'లే! రేపు పోతాం' అని ఇంకో చేతి రాతా,  నీ పక్కన కూర్చున్న సుశీల చేతికి వాచి పెట్టుకుంది కదా, టైం చూసి చెప్తావా? బోర్ కొడుతుంది కదా ఈ టీచర్ ఎప్పటికి ఆపుతుంది? ' అన్న మాటలూ,  కార్టూన్లూ, కారికేచర్లూ, హాంగ్ మాన్ లాంటి తెలుగు ఆట, చుక్కలు కలిపి, initials fill చేసే ఆట, క్లాస్ లో ఎవరు ఎవరికీ లైనేస్తున్నారో మా స్వంత బెంగుళూరు టైమ్స్/జూమ్ చానెల్,

 'వంకాయ
   కారము
 యముడు' అనీ,  అలాగే,  'దడిగాడు  వానసిరా' అన్న వాక్స్యం,  'మాధవ్ రెడ్డి, గిర్ గీధవ్ రెడ్డి, నీ పేరే బాధవ్ రెడ్డి' లాంటి బోల్డు అర్థం పర్థం లేని మాటలూ, మూడు పేరాల encoded script which goes like 'ఆబ్ ఇప్ట్ హిఫ్టు ఇవ్సిడు హౌకా, బ్ర్దందార్గ్ర మహరు పిర్దిరి ' టైపు లో రాసి ఉంటుంది. మీరు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అంతే. ఆ మంత్ర మహిమ మానవాళి కి దక్కకుండా పోవచ్చు  సరేనా?



0 comments:

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;