Tuesday, December 15, 2015

ఇరవయ్యేళ్లిక్కడ - ఒక చిన్న హలో ఖరీదు!


బాక్సు ఇంటి నుండి తెచ్చుకోనప్పుడు  సౌత్ ఇండియన్ బఫే కి మించిన గొప్ప ఆప్షన్ లేనే లేదు.  బఫే లైన్లో నిలబడ్డా.  నా ముందు చాలా మందున్నారు. తోచక అటూ ఇటూ దిక్కులు చూస్తున్నా.

టేబుల్ కి అవతల పక్క చైనా ఆవిడ లా ఉంది, నేను తలెత్తి ఐ కాంటాక్ట్ చేసేలోపల తల గబుక్కున దించేసుకుంది. 

'అబ్బో మనల్ని చూసి కూడా సిగ్గుపడే వారున్నారా! ఎవరబ్బా? బెంగుళూరు లో చైనా ఆవిడ అంటే గతం లో ఆవిడ తో పని చేసానేమో ' అనుకుని తల ఎప్పటికైనా ఎత్తకపోతుందా  అని చూస్తున్నా. చిన్న ఫ్రేమ్. స్కూల్ పిల్లలా ఉంది.  రెండు మూడు సార్లు నేను తల అటు తిప్పాకా నన్ను చూస్తోంది కానీ మళ్లీ నేను ఆవిడ వైపు తిరుగుతూనే తల తిప్పేసుకోవడం .. 

'ఆహా ఈరోజు భలే టైమ్ పాస్.  ఎవరో ఈ మిస్టరీ ఛేదించి తీరాలనుకుని నేను అటెటో చూస్తున్నట్టు నటించా.   మళ్లీ ఆవిడ తలెత్తడం కంటి చివర్నించి గమనించి ఒక్కసారి గా ఆవిడ వైపు తిరిగా.   ఆవిడ గబాల్న తలెక్కడ పెట్టుకోవాలో తెలియక సతమత మైంది  కానీ, గుర్తు పట్టాకా నేనే తల తిప్పేసుకున్నాను.

మా ఎక్స్ డైరెక్టరు.  ఆరేళ్లు  ఆవిడ కి పని చేసాను. ముందర ఆవిడ కే కొంతకాలం రిపోర్ట్ కూడా చేసాను. అయితే ఇప్పుడు మాత్రం ఆవిడ ని పలకరించడానికి కూడా అహం అడ్డం వచ్చేసింది.  కొద్దిసేపటికి టేబుల్ మీద సెటిల్ అయ్యాకా తలెత్తి చూస్తే  వెళ్లి పోయినట్లుంది. 'బ్రతికించింది' అనుకుని, తినడం మొదలు పెట్టాను. ఆవిడ ఆలోచనలు మాత్రం నన్ను వదలలేదు .

ఆవిడది  వియత్నాం నుండి అమెరికా కి వలస వచ్చిన కుటుంబం . తొంభైల్లో నుండీ ఆవిడ తో పరిచయం.  కొత్త సెకండ్ లైన్ మానేజర్ వస్తోంది. ఆవిడొక టెర్రర్.  ప్రతి చిన్న విషయం ఆవిడ చూస్తుంది. ఆవిడ చూడదు కదా అని ఏదీ వదల్లేమని  వేగులు వార్త  మోసుకొచ్చారు .   తర్వాత రెండు రోజులకి టీమ్ మీటింగ్ లో మా మానేజర్ పరిచయం చేస్తే,   ఈవిడేనా ఆ టెర్రరిస్ట్? ఆశ్చర్యపోయాము.

బాస్ అంటే ఆరడుగులు లేకపోయినా, కనీసం ఐదడుగులయినా ఉంటారనుకుంటాం కదా! చూస్తే  హైస్కూల్  పిల్లలా ఉంది. మాట్లాడటం కూడా  చక్కగా స్కూల్ పిల్ల లాగే ఉంది . అయితే ఎక్కడ సీరియస్ గా ఉండాలో అక్కడ మాత్రం ఉంటుందని అర్థమయింది . 

కొత్త టీం ని  లంచ్ కి తీసుకెళ్ళింది. వ్యక్తిగత విషయాలు, అందునా మొదటి సారి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ని అడగడం సభ్యత కాకపోయినా,  ఆవిడ కలుపుగోలుదనం, వల్ల  రిపోర్ట్ చేసేవారితో చనువు గా, సరదాగా ఉండటం తో అందరం ఇట్టే కలిసిపోయి స్నేహపూరిత వాతావరణం నెలకొనడం తో  వియత్నాం లో ఆవిడ చిన్ననాటి రోజుల గురించి ఆసక్తి గా అడగడం ప్రారంభించాం .

ఆవిడ ఎనిమిది మంది తోబుట్టువుల మధ్య కటిక దారిద్ర్యం లో పెరిగినట్టే.   "కనీసం టాయ్లెట్ లాంటి మౌలిక అవసరాలు కూడా తీరని పరిస్థితి మాది.  ఒక చెక్క బకెట్ ని వాడు కునే వారం . ఆ బకెట్ శుభ్ర పరిచే బాధ్యత వంతుల వారీ గా తీసుకునే వారం. పదేళ్ల దాకా స్కూలు ముఖం కూడా ఎరగం. ఉదయం లేచిన దగ్గర్నించీ ఈరోజు గడవటానికి  ఏం చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచనలే ఉండేవి కావు.   మా రెండో అన్నయ్య కి మాత్రం ఎప్పుడూ, అమెరికా కి వలస వెళ్లాలి జీవితాన్ని మార్చుకోవాలనే పట్టుదల చాలా ఉండేది .  చేపల పడవ లో ప్రాణాలరచేత  పట్టుకుని ఆస్ట్రేలియా కి వలస వెళ్లి అక్కడ కొంత కాలం పని చేసి, ఎలాగోలా అమెరికా చేరుకొని, ఒక్కొక్కళ్లనీ అమెరికాకి లాగేశారు.  చిన్న చిన్న పనులు, వ్యాపారాలూ చేసుకుంటూ ముగ్గురు పెద్దన్నయ్యలు చిన్నవాళ్లని మాత్రం చదువుకుని స్థిరపడేలా అన్ని విధాలా ప్రోత్సహించారు. ఇప్పుడు మేమంతా US పౌరులం, అందరం సుఖంగా ఉన్నాం. " అని చెప్పుకున్నారావిడ.

ఆవిడకి  ముప్ఫై ఐదు, నలభై ఏళ్లు ఉండచ్చు .  మాటల్లో మై హస్బండ్ అని రెండు మూడు సార్లు చెప్పడం వల్ల "మీకు పిల్లలున్నారా?" అని ఎవరో అడిగారు. "లేరు. మేమిద్దరం కారీర్ లో పై స్థాయి కి చేరుకోవాలని కోరుకుంటున్నాం. మా ఆశయాలు తీరాలంటే పిల్లలుంటే అసాధ్యం " అంది.  ఆవిడిచ్చిన చనువు తో, ఒకరు ఇంకో స్టెప్ ముందుకెళ్లి  "మరి ఆఫీసు ల్లో కష్టించి పని చేసి ఇంటికి చేరినప్పుడు ఎవరో ఒకరు మనకోసం ఉండాలని, వారికి మన వారసత్వం ఇవ్వాలని అనిపించదా?" అని అడిగారు.

ఆవిడ నవ్వేసి "కంటేనే వారసత్వం ఎందుకవుతుంది? అయినా మాకు పిల్లలుండి తీరాలనే ఫీలింగ్ లేదు. ఎప్పుడైనా అలాగ అనిపించి నప్పుడు  మా నీస్  తో ఆడు కుని వచ్చేస్తాం " అందావిడ.  మొదటి సారి ఆవిడ విషయాలు వింటున్నప్పుడు 'అయ్యో అదేంటి' అనిపించింది . అయితే తర్వాత, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి అభిప్రాయాలు, జీవనశైలి వారివి' అనుకున్నాను.

ఎన్ని వందల సార్లు టీం లంచిలకి వెళ్లినా, ఈ లంచ్ మాత్రం నాకు బాగా గుర్తుండి పోయిన లంచ్. తర్వాత మూడేళ్లల్లో నిజంగానే టెర్రర్ పదానికి అర్థం తెలిసేలా చేసింది . ఆవిడ ఎప్పుడూ ఒక ఎగ్జైటేడ్ స్టేట్ లో ఉన్నట్టు అనిపించేది మాకు . బద్ధకం తో  ఉన్నవారిని వంచి పని చేయించేది. కూర్చుని ఉన్నవాళ్లని  పరిగెత్తించేది.  ఇరవై నాలుగ్గంటల్లో ఏ సమయం లో మెయిల్ పంపినా ఇరవై నిమిషాల్లో సమాధానం వచ్చేది.

సాయంత్రం వేళ ఎక్కువసేపు ఆఫీసు లో ఉండి పోయేవారికి  అప్పట్లో చాలా ఆఫీసుల్లో తిండి తెప్పించి, మేపి,  పని చేయించినా, ఈవిడతో పని చేసినప్పుడు మాత్రం నాకైతే  దాదాపు ఇంట్లో  తిన్నట్లుగా అనిపించేది.

ఎప్పుడూ ఎగురుతూ నడుస్తున్నట్లుండేది. తన క్రింద పని చేసే మానేజర్లని ఉదయం జాగింగ్ చేయించేది. మిగిలిన వాళ్లని అందర్నీ రమ్మని ప్రోత్సహించేది.

 AT&T, MCI, PacBell, లాంటి పెద్ద పెద్ద టెలిఫోన్ సంస్థలు అప్పట్లో మా క్లైంట్లు. వీళ్ల నెట్వర్క్ లో ఎప్పుడు ఏం  తేడా వచ్చినా మా పీకల మీదకి  వచ్చి కూర్చునేది.   ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా కదిలేది కాదు. అర్థరాత్రనిలేదు, అపరాత్రని లేదు. బ్రాహ్మీ ముహూర్తమైనా అవకుండానే ఫోన్ కాల్స్ 'ఆఫీసుకి రాగలవా?' అని అడిగేది.   అప్పట్లో మరి మాకు సెల్ ఫోన్లూ లేవు, లాప్ టాపులూ లేవు. చాలా సార్లు వెళ్లి తీరాల్సి వచ్చేది.

ఓసారి బద్ధకం గా 'సారీ.  నా కార్ రిపెయిర్ లో ఉంది. నేను రాలేను ' అని ఊరుకున్నాను. ఒక పది నిమిషాల్లో మళ్లీ ఫోన్! ఎత్తితే, ఆవిడ గొంతు .. "మీ అపార్ట్ మెంటు బయట ఉన్నాను. వచ్చేయ్ '

ఓసారి ఏదో కస్టమర్ ఇష్యూ కోసం కష్ట పడుతున్నాం. తెగట్లేదు.  అసలే రావట్లేదంటే ఆవిడ ఫోన్ల మీద ఫోన్లు.  నా క్యూబ్ లో దాదాపు నలుగురైదుగురం పని చేస్తున్నాం. ఆవిడ ఫోన్ వచ్చినప్పుడల్లా 'ఇంకా రూట్ కాజ్ తెలియలేదు' అని చెప్పాలంటే చాలా ఇబ్బంది గా ఉంది.  'guys! Please do everything that you can. AT&T will chop my head off if the rootcause is not found by end of the day..' అంది. వెంటనే మ్యూట్ నొక్కి మా అనిరుద్ద్ 'We would love that option!' అనేశాడు. అందరం పగలబడి నవ్వుతుంటే వినిపించింది మా టెర్రర్ గర్ల్ గొంతు. 'Guys! Mute obviously did not work!' దెబ్బకి అందరికీ చెమటలు పట్టాయి. 

టీమ్ లో ఒకే ఆడదానిగా ఉండటం లో ఉన్న అతి పెద్ద కష్టం ఇదే. పది మంది నవ్వుతున్నా, మాట్లాడుతున్నా, అవతల పక్కవారికి, మనమేమేం  అన్నాం, ఎప్పుడెప్పుడు నవ్వాం అంతా ఈజీ గా తెలిసిపోతుంది.

అయితే, ఆవిడ ఆ ప్రసక్తి ఎన్నడూ తేకుండా హుందా గా ప్రవర్తించడం తో నాకు ఆవిడ అంటే ఉన్న గౌరవం పదింతలయింది.

ఆవిడని కాకా పట్టేవారికి దొరికేది కాదు. పని చేసే వారిని అంటిపెట్టుకుని ఉండేది.  ఓసారి ఆవిడని  'మెయిల్స్ చూస్తే దాదాపు  రాత్రంతా పని చేస్తున్నట్లే ఉంటారు,...  మీరు నిద్రపోరా? " అని సరదాకి అడిగాను. 'నాకు నిద్రలేమి ఉంది. ఎప్పుడో రోజులో ఒకటి రెండు గంటలు నిద్ర పడితే గొప్ప!' అంది. అటువంటి వారు సాధారణంగా గ్రంపీ గా ఉంటారని విన్నాను. ఈవిడ బాగానే ఉంటారేనని ఆశ్చర్య పోయాను.

ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కూడా ఒక సారి తెల్లవారు ఝామున మూడు దాకా పని చేయించి, నేను కార్ పార్కింగ్ వైపు వెళ్తుంటే వారించి,  ఇంట్లో దింపింది.  'అయ్యో, అసలే ఒట్టి మనిషివి కావు, చాలా థాంక్స్!' లాంటి పదాలు అంటే ఏమనాలో నిర్ణయించేసుకుని  ఎదురు చూస్తున్నాను. దోవంతా, కస్టమర్ ఇష్యూ తప్ప వేరే గొడవ తీసుకురాలేదు.  చాలా దారుణమైన డిజపాయింట్మెంటు అది. 

తర్వాత కొన్ని నెలలకి మెటర్నిటీ లీవులన్నీ అయ్యాకా వచ్చి  చేరినప్పుడు కనీసం 'పాపా, బాబా!' అని కూడా అడగలేదు.  పోన్లెమ్మని ఊరుకున్నాను. కొన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు  'కృష్ణకి ముందర చాయిస్ ఇవ్వండి. She is our best and She deserves to get the  module that she is most interested in!' అని మా మానేజర్ కి చెప్పిందని విని ఉబ్బి పోయాను. నాలుగు రోజులు మేఘాల మీద నడిచాను.  బిల్డ్ బ్రేక్ చేసినప్పుడు, బగ్ ఫిక్సులు లేటయినప్పుడు, ఆవిడ మా గుండెల మీద కరాళ నృత్యము  చేసేది. అలాగ మా డైరెక్టర్ గా కూడా ఎదిగి పోయింది.  మేము ఆవిడ స్టైల్ కి పూర్తిగా అలవాటు పడిపోయాము.

ఈలోగా, రెండో పాప పుట్టినప్పుడు నేను చేసుకోలేక, ఒక సంవత్సరం బ్రేక్ తీసుకుని, ఇంట్లో ఉండిపోయానా? పిల్లలతో కాలం గడిచి పోయినా, మా ఆఫీసు జీవితం మిస్సవుతూనే ఉండేదాన్ని. వారం వారం, ఫార్మర్స్ మార్కెట్టుకి పిల్లలతో వెళ్లి కూరగాయలు, పండ్లు తేవడం ఒక్కటే నాకు ఒక ఔటింగ్ లా తయారయినప్పుడు,  ఓ సారి మా టెర్రర్ గర్ల్ అక్కడ టమాటా లేరుతూ కనపడింది.

ఆరేళ్ల పాటూ ప్రతి రోజూ ఆవిడ కనుసన్నలలో గడిచి పోయి, ఆవిడ ని చూడకుండా అప్పటికే దాదాపు ఏడెనిమిది నెలలయ్యిందేమో, ఆత్రం గా నాలుగంగల్లో ఆవిడని చేరుకున్నాను.

ఉత్సాహం గా 'హాయ్!' అన్నా, విననట్లు నల్ల గాగుల్స్ పెట్టేసుకుని తల అటువైపు తిప్పేసింది.  నాకు ఒక క్షణం ఏదీ అర్థం కాలేదు.  గుర్తు పట్టలేదేమో, లావయ్యాను, పైగా సల్వార్ కమీజ్ వేసుకున్నాను అనుకుని, మళ్లీ పిలిచేంత లో, పాపాయి స్ట్రోలర్  లోంచి ఏడుస్తోంది.  స్ట్రోలర్  తో సహా తిరిగి వచ్చేసరికి, టెర్రర్ గర్ల్ భర్త అంటున్నాడు  ' I think she was saying hi to you..'  దానికి ఆవిడ కోల్డ్ గా 'తెలుసు. నాతో పనిచేసేది. ఇప్పుడు ఇంట్లో ఉంటోంది. I don't need her. It's waste of time' అంది.

గుండెల్లో గునపం తో గుచ్చినట్లైంది. కార్పోరేట్ లైఫ్ లో ఇవన్నీ సహజం అని తెలుసు, కానీ, మనని అంతలా వాడుకుని, ఒకవిధం గా స్క్వీజ్ చేసుకుని పిప్పి ని విసిరినట్లు విసిరేస్తుందా, అని కోపం తో వణికి పోయాను. ఈలోగా ఆవిడ భర్తగారు నన్ను చూసి,  'She is right behind us' అని కొద్దిగా గిల్టీ గా అన్నాడు. దానికి ఆవిడ, 'Let us get out of here' అని వేగంగా నడుస్తూ వెళ్లి పోయింది.

అవమానం తో భగ్గుమంది నాకు. ఆవిడ మీదున్న అభిమానం, గౌరవం ఒక్కసారి గా ఆవిరయ్యాయి.

 చూస్తుండగానే మళ్లీ ఆఫీసులో జాయిన్ అవడం, ఆవిడ వేరే కొత్త  గ్రూపుకి మారిందని తెలిసి ఆనందించడం జరిగి పోయాయి. ఆవిడ మా డొమెయిన్ లో అతి పెద్ద బాక్స్ ఇంప్లిమెంటేషన్కి executive head అయిందని, ఈ మెగా ప్రాజెక్టు లో, కనీసం రెండు వందల నిపుణులు కావాల్సి వస్తుందని తెలిసింది. మేము చేస్తున్న పని అంతా ఇండియాకి పంపేస్తామని ప్రకటించేశారు. దానితో, అందరూ వేరు వేరు చోట్ల అప్లయ్ చేసుకోవడం మొదలు పెట్టేసారు.

ఈలోగా ఆవిడ మానేజర్లు మమ్మల్ని వారి గ్రూపుల్లోకి లాగడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. నేను మాత్రం చాలా పట్టుదలగా ఉన్నాను ఆవిడ గ్రూప్ కి మాత్రం వెళ్లకూడదని!   నాకు బాగా తెలిసిన మానేజర్ లూకస్  ఫోన్ చేసి ఓ రోజు 'హే! కృష్ణా! Remember us? Your old friends?' అని పలకరించాడు. పక్కన గుస గుసగా ఆవిడ గొంతు వినబడుతోంది.

ఆరునెలలు పని చేస్తేనే వారు వీరవుతారంటారు., మరి మేము ఆరేళ్లు కలిసి  పని చేసామాయే, ఆవిడ వే ఆఫ్ వర్కింగ్ నాకు క్షుణ్ణం గా తెలుసు.  అంతకు ముందు వేరే వారితో అడిగించినప్పుడే తెలుసు, మళ్లీ వేరే మానేజర్ తో పిలిపిస్తుందని.  స్పీకర్ లో మాట్లాడుతున్నాడని అర్థమైంది.  వెంటనే చెప్పేశాను.  "సారీ, ఏదీ లేకపోతే, వేరే కంపెనీ లో వెతుక్కుంటా,  అదీ దొరక్కపోతే, ఇంట్లో కూర్చుంటా, కానీ ఆవిడకి మాత్రం పని చేయను.  ఫార్మర్స్ మార్కెట్ ఇంసిడెంట్  ముందయితే తప్పక నేనే అడిగి మరీ వచ్చేదాన్ని. నా ఆఖరి నిర్ణయం ఇదే. ఇందులో ఏ మార్పూ ఉండదు' అన్నాకా కొద్ది నెలలు గా దాచుకున్న ద్వేషానికి విముక్తి దొరికినట్లైంది.  నా అంచనా తప్పు కాలేదు. కాసేపటికి ఆ మానేజర్ మళ్లీ కాల్ చేసి, ' ఏమైంది? ఫార్మర్స్ మార్కెట్ కథేంటి? ఇందాకా అడగలేదు, ఆవిడ నా పక్కనే ఉంది.'  అని అడిగాడు.  'అదా పర్సనల్ ఖాతా లే' అని తప్పించుకున్నాను.  

నేనూ, మంచి ప్రాజెక్ట్ లో చేరిపోయాను. రోజులు నెలల్లోకీ, సంవత్సరాల్లోకీ  మారిపోతున్నాయి
తర్వాత రెండు మూడు సార్లు ఎదురు పడినా, మేము పలకరించు కోలేదు. బహుశా నా కారీర్ లో ఒకరితో మాట్లాడటం మానేసింది ఈవిడ తోనేనేమో!  తర్వాత ఆవిడ గ్రూప్ లో మంచి వర్క్ గురించి, వాళ్ల ప్రోగ్రెస్ గురించి విన్నప్పుడు 'అయ్యో నేనూ దీనిలో భాగస్వామి నయ్యేదాన్నేమో' అనుకునేదాన్ని.  ఇండియా కొచ్చి రెండేళ్ల తర్వాత బెంగుళూరు కాంపస్ లో మళ్లీ ఇలా కలుసుకుంటానని అనుకోనే లేదు'

లంచ్ చేశాకా  క్యూబ్ కెళ్లి కూర్చుని, పనిలో పడి పోయాను. తర్వాత మా బాసు గారు  అడ్హాక్ గా టీం మీటింగ్ కి పిలిచాడు. ఏమయ్యుంటుందా అనుకుంటూ, అందరం పొలోమని బయల్దేరి వెళ్లాం.  బాసు తో బాటూ మీటింగ్ హాల్ లోకి  టెర్రర్ గర్ల్ కూడా వచ్చింది.  నా మొహం పాలిపోయింది. మళ్లీ ఆవిడ కింద చేయాల్సి వస్తుందని అనిపించింది.  చాలా అసహనం గా అనిపించింది. కానీ చేసేది లేక కూర్చున్నాను.

ఆవిడని పరిచయం చేసి, 'ఈవిడ గ్రూప్ తో మనం చాలా క్లోస్ గా వర్క్ చేస్తాం కాబట్టి, ఆవిడ కున్న వాస్ట్ కస్టమర్ ఫేసింగ్ ఎక్స్పీరియన్స్ మనకి బెనేఫిషియల్ అవుతుందని ఆవిడని పిలిచాను ' అన్నాడు.   ఆవిడ రావడమే బాగేజెస్  తీసుకుని వచ్చింది. రాత్రికే విమానం అని చెప్పాడు మా బాసు.  నెమ్మదిగా లాప్టాప్ తెరిచి అడ్జస్ట్ చేసుకుంటుండగానే, వేరే లోకల్ డైరెక్టర్ గారు వచ్చి, అదేంటి ఇప్పుడు మొదలు పెడుతున్నారు? you need to leave in like 15 minutes!' అని ఆపేశారు. ఆవిడ వెళ్లి పోయింది. వెళ్తూ వెనక్కి తిరిగి నా వైపు చూసింది. నేను అభావంగా చూస్తూ, పెదాలు సాగదీసినట్లు నవ్వి ఊరుకున్నాను.

 ఆవిడ వెళ్లాకా, మా బాస్ నావైపు చూసి, "Hey Krishna! looks like she has a very good impression on you. She was happy that I hired you. She told me proudly .. I mentored her! నిన్ను బాగా పొగిడింది. ఏదో ఒక విషయం లో తన చేసిన తప్పు/బ్లండర్ వల్ల నిన్నుఇదివరకు తన ప్రాజెక్ట్ లో హైర్ చేయలేకపోయాను, I regret to this date అని చెప్పింది." అన్నాడు.

నన్ను ఆవిడ ప్రాజెక్ట్ లోకి తీసుకోక పోవడం అంత ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకోవాల్సినంత తప్పిదం కానేకాదు. అయితే, ఆవిడ నాకు ఆయన ద్వారా చిన్న సారీ లాంటి మెసేజ్ పాస్ చేసిందని అర్థమైంది. ఆ అవసరం నిజానికి ఆవిడకి లేదు. నేనే మరీ తీవ్రం గా తీసుకున్నానేమో! వయసులో, చదువులో, పోసిషన్ లో అన్నింటిలో నాకన్నా పెద్ద కదా, చిన్న తప్పుని పట్టించుకోకపోతే బాగుండేది కదా!

నాకు చాలా పిచ్చి గా అనిపించింది. ఏదో ఒక సంఘటన ఆధారం గా కాఫెటేరియాలో ఆవిడని పలకరించకపోవడం తప్పన్న  బాధ మొదలైంది. ఆవిడ కి పింగ్ చేసి గుడ్ వర్డ్  కి థాంక్స్! అని చెప్దామనుకున్నాను. అయితే ఆవిడ అమెరికా వెళ్లాకా ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ కోసం సెలవ తీసుకుందని వినడం తో ఆ ఆలోచన ని అమలు పెట్టనే లేదు.

ఒక నాలుగు నెలల తర్వాత గుర్తొచ్చినా ఆలస్యం అయిపోయింది., చెప్పినా బాగుండదని మానేశాను. కొన్నాళ్ల కి రిజైన్ చేసి వెళ్లి పోయిందని విన్నాను.

ఏది చేసినా, సమయానికి చేసేయాలి. ఒకసారి సమయం దాటి పోయాకా ఎంత బాధపడ్డా లాభం లేదు! రియల్ టైమ్ సిస్టమ్స్ స్పెషలైజేషన్ ఉంది కానీ, జీవితం లో అప్లై  చేయనే లేదు. :-(

Linked in లో గానీ, ఫేసు బుక్కు లో కానీ దొరకలేదు. గట్టి గా ప్రయత్నిస్తే ఆవిడ తప్పక దొరుకుతుందని తెలుసు. దొరికినా, ఏం  చెప్తాను? తొమ్మిదేళ్ల క్రితం మీరు చెప్పిన సారీ ని అంగీకరిస్తున్నానని చెప్పడానికా?

0 comments:

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;