Monday, June 4, 2012

ఎవెంజర్లూ, రివెంజర్లూ..



 

ఈ వేసవి సెలవల్లో..



‘Ammaa! I am bored.. What should I do?’ పిల్లలు ఈ ప్రశ్న కి రోజూ వారీ సెంచరీ పూర్తి చేసేశారు..



వేసవి సెలవలనేసరికి అమ్మమ్మ ఊరికి పరిగెత్తటం, లేదా, కొత్త ప్రదేశాలకి వెళ్లి రావటం తప్ప, గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవటం, చుట్టుపక్కల ఎవ్వరూ పిల్లలు లేకపోవటం, అనేదే మా పిల్లలకి తెలియదు.

ఈసారేమో.. ఒక నెల రోజులు వాళ్ల అమ్మమ్మగారింట్లో గడిపినా, వాళ్లూ ఉత్తర దేశయాత్రలకి బయల్దేరటం తో, బెంగుళూరికి వచ్చి పడ్డారు..

భాగ్య నగరం లో ఎండలు మండినా, .. అమ్మమ్మ, తాత గార్లు, కదలకుండా కూర్చోబెట్టి ఎక్కాలు వల్లె వేయించి, పట్టు పట్టి తెలుగు పద్యాలు, పాటలు నేర్పించినా.. పిజ్జాలూ, నూడిల్సూ, కుదరదని, ఇడ్డెన్లూ, మినపరొట్టెలూ, పెసరట్లు,.. పెట్టినా, స్విమ్మింగ్ పూళ్ళూ, ఎలెక్ట్రానిక్ ఆట సామాగ్రికీ దూరం ఉంచి, కొబ్బరి నూనె రాసి నున్నగా జడలేసి, అష్టా చెమ్మా, పులీ మేకా, కారమ్స్ కి పరిమితం చేసినా.. మాళ్ళూ, ఎమ్యూజ్ మెంట్ పార్కులూ కాదని చార్మినార్లూ, సాలార్ జంగ్ మ్యూజియం లు బస్సులెక్కించి తిప్పినా, వేసవి సెలవల్లో అమ్మమ్మ గారింటికి ఉన్న చార్మ్, ఇంక దేనికీ లేదు కదా..

బెంగుళూరు కి రావటమేమిటి? ఇదిగో ఈ ‘బోర్’ మంత్రం.. పక్కన లైబ్రరీ లో పుస్తకాలన్నీ చదివేసింది పెద్దది. అప్పటికీ ఒక ఇరవై పుస్తకాలు కొని పెట్టాను. అన్నీ అయిపోయాయి. చిన్నదానికి అబ్బే ..పుస్తకాలు అంతగా ఎక్కవు. స్విమ్మింగ్, యోగా, బాడ్మింటన్,..తిరుగుళ్లు, షికార్లు, టీవీలు, అయినా బోరే..

ఈ ‘బోర్,బోర్’ అన్న గొడవ పడే కంటే.. అదిగో పరీక్షలకి దగ్గరుండి చదివించటమే సులువేమో.. కనీసం ఏం చేయాలో తెలుసు.

ఏమయితేనేం? వేసవి సెలవల కోసం ఎదురు చూసినంత సేపు పట్టలేదు! .. వచ్చినట్టే వచ్చి, ఇట్టే అయిపోయాయి.. వచ్చేవారం స్కూళ్లు మళ్లీ తెరుస్తున్నారంటే, ఇంకా వారమే సెలవలు అని ఒక బెంగ మొదలైపోయింది.

సాయంకాలం సినిమా కెడదామా అనుకునేసరికి ఇంట్లో రెండు పార్టీలు తయారు. మా వారు,నేను గబ్బర్ సింగ్ అని, పిల్లలు ‘అవెంజర్స్’ అనీ!

ఎవెంజర్లు!


‘పోన్లే పాపం పిల్లలు ఎవెంజర్స్ అంటున్నారు.. గబ్బర్ సింగ్ లేదు, దమ్ము లేదు.. ఎవెంజర్స్ సినిమా కి వెళ్తున్నాను.. ఎవరొస్తారు నాతో?’ అని మా వారు ఆర్డర్ పాస్ చేసేశారు. . కళ్ళుమూసి తెరిచే లోపల పిల్లలు గాయబ్. ఒకళ్ల చేతిలో నీళ్ల సీసా.. ఇంకోల్ల చేతిలో బండి తాళాలు.. ‘అదేంటి? ఇప్పుడా! మా క్లాస్ మేట్ కర్ణాటక సంగీత కచేరీ కి వెళ్దాం అనుకున్నాం కదా..’ కంగారు గా అన్నాను..



‘ఓ పని చేద్దాం.. ఇంగ్లిష్ సినిమా గంటా, గంటన్నర కి మించి ఉండదు.. అది చూసి, పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి అప్పుడు సంగీత కచేరీ కి వెళ్దాం..’ అప్పుడు అందరూ హాప్పీ... సరేనా?’ అని మావారు అనడగగానే, ‘ఇది బాగానే ఉంది.. ‘అనుకుని, నేనూ చక చకా రెడీ అయపోయా..

దారి పొడుగునా “ఆరుగురు సూపర్ హీరోలు.. ఒక్క సినిమా లో..” అని అరమోడ్పు, కన్నులతో, అత్యంత పారవశ్యం గా.. పిల్లలు.. హల్క్, మెటల్ మాన్.. అదీ ఇదీ అని ఏవేవో విశేషాలు చెప్తూనే ఉన్నారు. నాకేమో కార్టూన్ సినిమాలు పట్టవు. సూపర్ మాన్, స్పైడర్ మాన్, బాట్ మాన్ సినిమాలే చిరాకు అనుకుంటే ఒక్క సినిమా లో ఆరుగురే! ఇదెక్కడి గొడవ? అదే కళ్యాణ్ బాబైతే.. వెయ్యి సూపర్ హీరోలకి పెట్టు.. పైగా.. ఒక్క సూపర్ హీరోకి అయినా ప్రేమ వ్యవహారాలూ, డ్యూయేట్లూ ఉంటాయో ఉండవో,.. అని విసుక్కుంటూ, హాల్లో సీట్లు సంపాదించుకుని కూలబడ్దాం..

ఒక కంటికి గంత కట్టుకుని సామ్యూల్ జాక్సన్ గారు, ప్రపంచాన్ని రక్షించే బాధ్యత నెత్తి మీద వేసుకున్నారు.. యోకీ అన్న గ్రహాంతర వాసి అనుకుంటా.. వచ్చి దొరికిన వాడిని దొరికినట్టు కొట్టి, ప్రపంచాన్ని నాశనం చేయగల రసాయన స్పటికం లాంటిది కొల్లగొట్టి పారిపోయాడు. రెండువారాలే సమయం ఉంది. మన సూపర్ హీరోలందరినీ రప్పించి యోకీ ఎక్కడున్నాడో కనిపెట్టి, రేడియో ఆక్టివ్ మూలకాన్ని తెచ్చి మళ్లీ భద్రపరచాలని.. తెగ సీరియస్ గా ప్లానింగ్ జరుగుతోంది.. ఆవలింతలు.. పక్కన చూస్తే.. పిల్లలు.. సీట్లో స్టిఫ్గా కూర్చుని.. ముందుకు ఒరిగి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు. హాల్లో అందరూ దాదాపు అదే అలౌకికావస్థ లో ఉన్నారు.

‘హాఆఆఆఆఅయ్’ నాకు ఆవలింతలు..

నెమ్మదిగా సీట్లో జాలబడి ఓ రెండు నిమిషాలు నా మొబైల్ ఫోన్ లో సరిగ్గా రాని ఫోటోలు తీసేయటం, పాత SMSలు తొలగించటం లాంటివి చేసుకున్నాను.

మళ్లీ ఆవలింతలు..! హిందీ లో డైలాగు వినబడింది.. కుతూహలం గా నేనూ చూడటం మొదలు పెట్టాను.



ఒక సూపర్ హీరో దారిద్ర్యం తో మగ్గుతున్న కోల్కోతా వీధుల్లో, మురిక్కాలవ లో ఒక సంవత్సరం మురగ బెట్టి రెండు వేల చిరుగుల కర్టెన్ వేసిన కొంప లో, భయానక అంటు వ్యాధి తో, (కలరా? ప్లేగ్?) మ్రగ్గుతున్న ముసలి వాడికి వైద్యం చేస్తూ, రెండు ఇంచిల మేర మురికి పట్టిన, తైల సంస్కారం లేని జుట్టు తో, ఈసురోమంటూ, (స్లం డాగ్ పిల్లలు?) ఓ అమ్మాయి, మా నాన్నకు మందియ్యి ప్లీజ్.. నా దగ్గర డబ్బుంది.. అని దీనం గా ప్రాధేయపడుతోంది.. ఒళ్లు మండింది.. మురికి వాడలవెంబడి పరుగులెత్తి హైన్యం కోరుతున్న ఒక ఇంట్లో కి వెళ్లాడు.. ‘నీ అవసరం ఉంది.. ప్రపంచాన్ని రక్షిద్దాం.. పద’ మని ఓ ఏజెంట్ తీసుకుపోయింది.. అంటే.. కోల్కోత్తా లో ప్రపంచం లో భాగం కానట్టు.. వాళ్ల మాన్హాటన్, మాత్రమే ప్రపంచం అన్నట్టు..

లోహపు మనిషి (మెటల్ మాన్) ఎగురుతూ వచ్చి నూరంతుస్థుల మేడ మీద లాండ్ అవటం తోనే, ఒక్కోటి గా ఆయన కవచ కుండలాలు విడిపోయి, వెళ్లి తమ తమ స్థానాల్లో చేరిపోవటం,.. కళ్ళ ముందు హెల్మెట్ గ్లాస్ లాంటి దాని మీద సిక్స్త్ సెన్స్ లా ప్రతీదీ కనపడటం, దాన్ని చేతి కదలికలతో కంట్రోల్ చేయటం.. ‘ ఈ అమెరికన్లు ఎంతైనా సరి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని భలే వా... డుకుం టారు ‘హాఆఆఆయ్’ .. ఆవలింతలు..

చల్ల గా మల్టీప్లెక్స్ లో మెత్తటి సీట్ మీద హాయిగా సుషుప్తావస్థ లోకి జారుకున్నాను.

‘అమ్మా! ఇంత మంచి సినిమా లో నిద్ర పోతావా? ‘ అని కోపం చూస్తో మా పిల్లలు అరుస్తుంటే మెలకువ వచ్చింది.. ఇంటర్వెల్ ట.. సరే.. లేచి పాప్ కార్న్ కోసం బయట పడ్డాం. మా వారు నెమ్మది గా ‘అండాళ్ళూ.. నీకేమైనా అర్థమైందా?’ అని సణిగారు. ‘ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు.. ‘ అంటున్నానో లేదో, పక్కన గబ్బర్ సింగ్ నడిపిస్తున్న స్క్రీన్ లోంచి ‘కెవ్వు కేకా’ అని పాటా, ఈలలూ, హంగామా.. అక్కడికెడితే ఎంత హాయిగా ..ఈ పాటికి తిట్టుకుంటూనో, నవ్వుకుంటూనో, ఆనందంగానో, చూసేవాళ్లం కదా.. ఈ గొరిల్లా యోధుడెంటో! వీళ్లంతా, ఈ ప్రపంచ రక్షణ చేయటమేమిటో, తల రాత! అని విసుక్కుంటూ మళ్లీ మా బుట్ట పేలాల పొట్లం తీసుకుని సీట్లో కూలబడ్డాను. ఎంతకీ అవదే? నా ఖర్మ కాలి రెండున్నర గంటల సినిమా ట!

సెకనుకు ముగ్గురు కొత్త యోధులు గ్రహాంతర వాసుల అంతరీక్ష నౌక నుంచి పుట్టుకొచ్చి మాన్హాటన్ నగరాన్ని .. సారీ వాళ్ల ఉద్దేశంలో ప్రపంచం కదూ, సర్వ నాశనం చేస్తుంటే,.. ఒకడు కత్తితో, ఒకడు బాణాలతో, ఒకడు భవంతుల మీద నుంచి స్పైడర్ మాన్ లంఘించి దూకి, ఇంకోడు గోడ్జిల్లా లాగా శత్రుసైన్యాన్ని చేతుల తో ఎత్తి నేలకి కుదేసి మ్రోది,.. కష్టపడుతుంటే,.. న్యూయార్క్ వాసులు, హాహా కారాలు చేస్తూ, రోడ్ల మీద పరుగులు తీయటం... మొత్తానికి సినిమా ముగిసింది.. హాల్లోంచి పిల్లలు ఆనందంగా.. నేను, మావారు ఒక విధమైన చిరాకు తో, కూడిన విసుగు సమేతమైన నిస్సహాయ స్థితి నుండి ఉద్భవించిన తల నొప్పి తో బయట పడ్డాం..

రివెంజర్లు..

ఇంటికి వెళ్లి పిల్లలని దింపే సమయం లేదు. విశ్వవిద్యాలయం లో నాతో కలిసి చదువుకున్న మోహన్ సంగీత కచేరీ.. ఎప్పుడో లల్లాయి పదాలు, పాత సినిమా పాటలు, పాడుతుండగా ఇరవై ఏళ్ల క్రితం విన్న నా స్నేహితుడి సంగీతం ప్రోగ్రాం.. వదులుకునే సమస్యే లేదని కారాఖండీ గా చెప్పేశా.. పిల్లలు దోవ పొడుగునా, సణుగుతూనే ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు.. ‘ఏం? మీ అవెంజర్లు చూసినప్పుడు మా పరిస్థితీ ఇంతేగా? మీరూ వచ్చి తీరాలి.. వేరే మార్గం లేదు’ అని దటాయించి ‘బెంగుళూరు గాయన సమాజ‘ భవంతి ఎదురు గా కారు ఆపి దిగి చూస్తే, ఒక శాల్తీ లెక్క తక్కువైంది.. చూస్తే మా చిన్నది రెండు చేతులూ కట్టుకుని ‘రానని’ కార్ లోనే భీష్మించుకుని కూర్చుంది. సామ దాన బేధ, దండోపాయాదులని ఉపయోగించి అమ్మాయిని దారిలోకి తెచ్చుకుని నలభై రూపాయల టికెట్లు కొట్టించుకుని హాల్లో కి ప్రవేశించాం. ఐదు వందల మంది పట్టే హాల్లో, అక్కడక్కడా.. నలుగురూ, ఐదుగురూ,.. ముసలి వారు ఉన్నారు. యాభై ఏళ్లకి తక్కువ వయసువారు బహుశా మేము కాకుండా మా మొహనుడి భార్య మాత్రమే నేమో.. . మోహన్ స్టేజ్ మీద నించే పలకరింపుగా చేయి ఊపి అభివాదం చేశాడు.

ఏమాట కామాట చెప్పద్దూ, మా పిల్లలు ఉప్పొంగిపోయారు. ఒక విద్వాంసుడు, స్టేజ్ మీద నుంచి నన్ను పలకరించాడని.. సీట్లల్లో కూలబడ్డాకా, మా అమ్మాయి.. ‘అమ్మా! నీకొక ఫన్నీ తింగ్ చెప్తా..’ అంది..

‘ఇప్పుడు కాదు..’ అని వారిస్తున్నా, వినకుండా.. ‘చూడు.. మగవాళ్ల జుట్లన్నీ తెల్లగా, పక్కన కూర్చున్న ఆడవాళ్ల జుట్లు కాటుక లా నల్లగా..’ కిసుక్కున నవ్వాను.. కానీ..’ష్... ‘ అని సీరియస్ గా కూర్చున్నాను. ‘ఏం చేస్తాం? ఉన్నదే ఒక యాభై మంది.. సరిగ్గా వినకపోతే, అసహ్యంగా ఉంటుంది మరి..’

‘ఆట తాళ వర్ణం.. ‘ చక్కగా పాడుతున్నాడు . చిన్నదేమో.. ‘మా సినిమా లో నువ్వు నిద్రపోయావు కాబట్టి నేనూ, మీ ఫ్రెండ్ సంగీతం లో నిద్రపోతా.. రివెంజ్..’ అంది. కోపం గా చూశాను. అంతకు మించి ఏం చేయగలం?

తోడి రాగం లో కీర్తన అందుకున్నాడు మోహన్.. ఈలోగా.. మూడు బాత్ రూమ్ బ్రేక్ లు. తీసుకున్నారు పిల్లలు. ఇంకో సారి అడిగితే ఏమవుతుందో తెలుసు వాళ్లకి.. దానితో, వారిలో వారు సైగలు చేసుకుని, మాటలు రువ్వుకుని, నవ్వుకుని, ఏవో గుసగుసలు మొదలు పెట్టారు.

కీర్తన అయింది. ‘మా క్లాస్ మేట్ కి కాస్త చప్పట్లు కొట్టండి! మీ క్లాస్ మేట్ మొన్న పిచ్చి బోరింగ్ జోక్ చెప్తే , నేను హా హా హా ‘ అని నవ్వా కదే! ‘ అని మరుగున పడుతున్న పాత జ్ఞాపకాలని వెలికి దీసి మా వాళ్లతో మా ఫ్రెండ్ కి చప్పట్లు కొట్టించుకున్నా..

‘దుడుకు గల నన్నే దొర కొడుకూ బ్రోతు రా ..’ మొదలు పెట్టాడు. వీళ్లకి దుందుడుకు హెచ్చింది.. గుసగుసల కొట్లాట మొదలు పెట్టారు. ఎంత మంది ఎలా తల కాయలు ఊపుతున్నారో చెప్పుకుంటూ, నవ్వుకోవటం.. ‘ఇంకా ఎంతసేపు?.. ‘ అని విసుగు చూపించటం.. ‘ఆకలేస్తోంది..’ అనటం.. పక్కన వారు ‘షష్ష్.. ‘ అనేంతవరకూ తెచ్చుకున్నారు..

ఈ లోగా, మోహన్ వెనక్కి తిరిగి ఒక ఫ్లాస్క్ లోంచి ఏదో ద్రవం స్టీలు సీసా లోకి వంపుకున్నాడు. ఇక మా పిల్లలు గొడవ.. ‘అమ్మా.. అదేంటి? కాఫీ? చాయ్? నీళ్లేమో?’ అని. “ అంత అద్భుతం గా పాడుతుంటే, మీకొచ్చే డవుట్లు ఇవా?” అని గుస గుస గా చివాట్లు వేసాను. మా చిన్నది.. పోనీ, ఏదో పని ఉన్నట్టు ముందు వరస లోకెళ్ళిస్మెల్ చేసి రానా? తెలిసిపోతుంది?’ అని ఉత్సాహం గా ఆఫర్ చేసింది. పళ్ళు పటపట లాడించా! ‘ఓకే ఓకే.. జస్ట్ కిడ్డింగ్’ అంది.

బొత్తి గా హాల్ గోడనానుకుని బజ్జీల స్టాల్ పెట్టాడేమో? అందునా, ఏసీ ఖర్చు లేకుండా, పక్క తలుపులు తెరిచి ఉంచాడేమో.. ఉల్లి పాయ పకోడీ, అరటి కాయ బజ్జీల వాసన.. హాల్లోకి మత్తుగా, ఆవరించింది. అంతే!

ఇక మా వాళ్లని ఆపలేకపోయాను. ‘రీతి గౌళ’ రాగం అయ్యేంతవరకూ, వేరే రసాస్వాదన లో తన్మయులై లోపలికి వచ్చారు.

‘కదన కుతూహల ‘ రాగాలాపన ఇటు మోహన్ మొదలు పెట్టేసరికి వీళ్ల చిరాకు తారా స్థాయి కి ఎక్కి, వీళ్ల గొడవ భరింప రానిదై కూర్చుంది... ‘షీ ఈజ్ సో మీన్.. కాదు! అదే స్టార్ట్ చేసింది. నన్ను తిట్టింది.. కాదు కావాలని నన్ను ఎల్బో తో తోసింది..’ ఇలాగ అంటూ అంటూ, .. చిత్రం గా, రాగాలాపన ఆపి కృతి ఆరంభించగానే, పిల్లలు వద్దనుకుంటూనే, నెమ్మదిగా పాట లో లీనమైపోయారు.. తెలియకుండానే తాళం వేయటం మొదలుపెట్టారు.. అప్రయత్నం గానే ఈసారి అడక్కుండానే చప్పట్లు కొట్టారు.

ఇక ఇదే ఆఖరు ఇదే ఆఖరు.. అని పోరు పెట్టడం మొదలు పెట్టినా పట్టించుకోకుండా, మొత్తానికి కచేరీ పూర్తి చేసి బయట పడ్డాం. దోవంతా ఎవరి ఆలోచనల్లో వాళ్లముండి పోయాం.

సంగీతం ప్రభావం వల్ల, మనస్సంతా ప్రశాంతత ఆవరించటం తో, నా ఆలోచనలు సినిమా మీదకి పోయాయి.. ‘ఎంత టెక్నాలజీ! పూర్వం సై ఫై సినిమాలకీ, ఎవెంజర్ సినిమా కీ ఎంత తేడా! అంత అద్భుతం గా ఎలా తీయగలిగారు.. అక్కడక్కడా, హాస్యాన్ని కూడా సందర్భానుసారం గా సంభాషణల్లో, బలవంతాన చొప్పించినట్లు కాకుండా.. ఇలాగ ఏదో ఆలోచిస్తూండగా, ఏదో తేడా గా అనిపించి వెనక్కి తిరిగి చూశాను..

చిరంజీవి పాట ‘యమహా.. నగరీ, కలకత్తా పురీ..’ పాట సన్నగా పాడుకుంటూ, ‘అమ్మ ఫ్రెండ్ పాడిన పాట అచ్చం ఇలాగే ఉంది కదూ..! It must be in the same raagaaa.. ’ అని మా రివెంజర్లు మాట్లాడుకుంటూ..



29 comments:

Anonymous said...

"మా వారు నెమ్మది గా ‘అండాళ్ళూ.. నీకేమైనా అర్థమైందా?’ అని సణిగారు. ‘ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు.. ‘ అంటున్నానో లేదో,"--ఇది మాత్రం చాలా బావుంది...

జలతారు వెన్నెల said...

నేను కూడా ఇలాగే బాధ పడుతూ వెళ్ళాను, కాని Avengers సినిమా నచ్చింది నాకు. చాలా బాగా రాసారు కృష్ణప్రియ గారు.

వేణూశ్రీకాంత్ said...

హహహహ కంక్లూజన్ బ్రహ్మాండం అండీ మీరు సినిమా గురించి పిల్లలు కచేరి గురించి ఆలోచించడం బాగుంది :) పోస్ట్ ఎప్పటిలాగే బాగుంది :)

Anonymous said...

మేడం, బెంగలూరు లొ సంగీత సంబంధ కార్యక్రమాల సమాచారం ఎక్కద దొరుకుతుంది.
నాకు కొంచెం ఆశక్తి ఉంది కాని అవి ఎక్కడ జరుగుతాయొ తెలియదు.
ఏమైన website ఉంటె చెప్పగలర ?
:venkat

రసజ్ఞ said...

ఎవెంజర్ పార్ట్ కన్నా రివెంజర్ పార్టు బాగుంది :):)

Subramanya Shastry said...

"...నా మొబైల్ ఫోన్ లో సరిగ్గా రాని ఫోటోలు తీసేయటం, పాత SMSలు తొలగించటం..." మరీ ఇంత నిరాదరణా! Heights... పాపం ఆ పసి హృదయాలను మీరు ఎంతగా గాయ పరిచి ఉంటారో ఆలో చించారా? (ఉత్తుత్తినే - తమాషాకే లెండి) కానీ మీ టపా చదువుతుంటే, ఎందుకో - కొంచెం మాటర్ మిస్సయ్యారనిపించింది. ముగ్గురు లేడీస్ మధ్య మీ ఆయన పరిస్థితి గురించి బొత్తిగా ఏమీ రాయలేదే! నాకెందుకో కాస్తంత జాలి కలుగుతోంది. :-)

Anonymous said...

ఒకసారి మా వూర్లో విన్న బాలమురళి కచేరి గుర్తొచ్చింది.
ఇలాగే పిల్లా పీచులను వెంటేసుకుని, నాలుగు రకాల తిండ్లతో, కరుం కరుం అని చప్పుడు చేస్తూ, మద్యలో గుట గుట మని డ్రింక్స్ మింగుతూ, అల్లల్ని కోప్పడుతూ ఆ పిల్లల్కోళ్ళు ఓహ్... రామా...

సినిమా పాటలు పాడమని మంగళంపల్లిని అడిగిన రసహృదయులైన ప్రేక్షకులు... ఓహ్... మంగళంపల్లి గారు రెండు సినిమాపాటలు పాడి కచేరి అయ్యింది అనిపించి, బ్రతుకు జీవుడా అంటూ కారులో తుర్రుమన్నారు.

ఇలాంటి షోలకు పిల్లల్తో వచ్చేవాళ్ళకి టికెట్ రేట్లు మూడింతలు చేయాలి అన్న ఓ రసహృదయిని ఆవేదన, సమంజసమే అనిపించింది.

Found In Folsom said...

హమ్మా...మీ టైటిల్ చూసే చచ్చే అంత నవ్వు వచ్చింది. అమ్మో, తెలుగులో టైపు చేయటం చాలా కష్టమండి. ఎగ్జాక్ట్లి సేం టు సేం అనుభవం మా దంపతులకి కూడా. నేను నెల రొజులు ఇండియా వెళ్ళి వచ్చాక, పోనీలే పాపం పిల్లాడికి ఇష్టం ఐన దానికే తీసుకువెళ్దాం అని వెళితే, ఓరి దెవుడా,అదేమి సినిమారా నాయనా. బయట అంటే, టెక్నాలజి తెలీదు, వూరి ఫేస్ అంటారని మూసుకున్నా. నేను కూడా మీ లానే నిద్ర పొయే ప్రయత్నాలు చెస్తుంటే, ఎదో టిక్కెట్టు వేస్టు చేస్తున్నట్లు మా వారు, తను పడుకుంటే నేను లేపతం, మా వాడేమో ఆ ఏలియన్స్ లొ కలిసి పొయి...హ్మ్మ్..పిల్లలు సెలవులకి ఇండియా వెళ్ళారు. మన జీవితానికి కొద్దిగా ఖాళి సమయం దొరికింది కదా సినిమాకి వెళ్దామా అంటే వెంటనే, "ఏంటి, ఎవెంజెర్స్ కా..చెత్త సినిమాలు, చెత్త గోల, నేటివిటి తగ్గట్లే ఉండవు అని హితవిచ్చారు...నా సుత్తి వదిలేస్తే, మీ పోస్టు మాత్రం సూపర్.:)

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీ పిల్లలు కేక మీరు కెవ్వు మీ టపా సూపర్ ఇక్కడ మేము దహా.

Anonymous said...

:)

Anonymous said...

ఇంగ్లిష్ సినేమాలు తెలుగు సినేమాలకి ఎవిధంగాను తీసిపోవు. మన తెలుగు వారు వంశాలు,రాయలసిమ ఫాక్షన్ గొడవలు, ప్రేమ ఇటువంటి వాటితో బుర్ర తింటారు. అదే విజయవంతమైన ఇంగ్లిష్ సినేమాలలో వారిపై రష్యావాడో, సోవియట పతనాంతరం జంతువో,గ్రహాంతరవాసో దాడి చేసి వాళ్ల దేశాన్ని నాశనం చేయాలనుకొంటారు. వీళ్లు దానిని తిప్పికొడతారు. వాళ్ల ఫార్ముల సినేమాలలో ఒకటే మార్పు ఈ సారి గాలిలో తేలే గుడరాం చూపించాడు. అవేంజర్ ఒక చెత్త సినేమా! కలకత్తాను మరింత చెత్తగా చూపించటం వాళ్ల పొట్ట పొగురుకి నిదర్శనం.

Anonymous said...

మిమ్మల్ని గ్రహాంతరాల్లోకి తీసుకువెళ్ళిన మీ పిల్లలని పరోక్షంగా రఘువంశ సుధాంబుధిలో తేల్చారన్న మాట. :)

కృష్ణప్రియ said...

@ puranapandaphani,

Exactly! అద్భుతం గా చెప్పారు..

sunita said...

బాగుంది.

<>>

ఇలా వెంటపడి యకవుంట్ సెటిల్ చెయ్యడం నాకూ అలవాటే:))

తృష్ణ said...

"ఎవెంజర్స్" నాకూ బోర్ కొట్టిందండి. బాగా సాగదీశాడు. చివరి ఇరవై నిమిషాలూ కాస్త సరదాగా చూసా.
పిల్లలతో కచేరీకేమో గానీ వెళ్లక వెళ్ళక మా పిల్లను ఒక్క సినిమాకు తీసుకువెళ్ళి గొప్ప సాహసం చేసాము. మీ టపా చదువుతూంటే ఆ రోజున మేం పడిన పాట్లు కళ్ళకు కట్టినట్లు కనబడింది.

lalithag said...

నువ్వు మన వాళ్ళందరినీ బలే కలుస్తున్నావు కృష్ణా. నిజమే కదూ అతను పాడిన సినిమా పాటలే గుర్తున్నాయి నాకు. నువ్వు వినే ఉంటావు అనుకున్నాను అతని దగ్గర classical అప్పట్లో. ఇంకా కొంతమందిని అడిగి కొన్ని పాటలు పాడించుకునే దాన్ని. కొన్ని పాటలు అలా ఒక్కో friend తో ముడిపడిపోయి గుర్తుండిపోయాయి నాకు. ఇప్పుడు మా పిల్లలు నేర్చుకుని వినిపిస్తారేమోనని ఆశ పడుతుంటాను. (Classical మీ పిల్లలో నువ్వో పాడి వినిపించాలి :) )
టపా ముగింపు బావుంది.

కృష్ణప్రియ said...

@లక్ష్మీ ఫణి గారు,
:) థాంక్స్..

@ జలతారువెన్నెల,
ధన్యవాదాలు! ఎవెంజర్స్ సినిమా జనాలకి చాలా చాలా నచ్చినట్లుంది.. కానీ సూపర్ హీరోలంటే నాకు మొదట్నుంచీ సహజం గా ఉన్న విముఖత వల్ల, అంత గా ఎంజాయ్ చేయలేకపోయాను.

@ వేణూ శ్రీకాంత్,
థాంక్స్.. మీ కామెంటూ బాగుంది.. :)

కృష్ణప్రియ said...

@ వెంకట్ గారు,
సాధారణం గా, నేను చేసేది దినపత్రికల లో ఆర్ట్ సెక్షన్ లో చూసుకోవటమే!.. ఈ మధ్య గుళ్ళో కూడా నోటీస్ బోర్డుల్లో చిన్న చిన్న కళాకారుల కార్యక్రమాల గురించి చూస్తున్నాను.

@ రసజ్ఞ,
:) అవునా?

@ తెలుగు భావాలు,
: ) ముగ్గురు ఆడవాళ్ల మధ్య ఆయన పరిస్థితా! ఆయనకేం? సినిమా హాల్లో పాప్ కార్న్, సంగీత కచేరీ లో బజ్జీలు, పకోడీలు, ఫణీంద్ర గారు చెప్పినట్టు ఒక పక్క గ్రహాంతరవాసుల దండయాత్రలు, ఇంకో పక్క ‘రఘు వంశ సుధాంబుధి ‘ లో మునిగి తేలడాలు!

Anonymous said...

మేము క్రిందటి వారం గబ్బర్‌సింగ్ చూసేం, పెద్ద బాగాలేదు. అంతా సొంత డబ్బా, మా పాపకి నచ్చలేదు.

మీ టపా చాలా బాగుంది. ముగింపు నచ్చింది.

కాముధ

Anonymous said...

వేసవి సెలవల్లో అమ్మమ్మ గారింటికి ఉన్న చార్మ్, ఇంక దేనికీ లేదు కదా..

దీనితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.

కాముధ

కృష్ణప్రియ said...

@ snkr,
:) బాగుంది, బాగుంది. ఓసారి ఇలాగే ఒక సంగీత విభావరి కి వెళ్తే పిల్లలకోసం వేరే గది ఏర్పాటు చేసి సీరియస్ గా వినని వారిని లోపలి రానీయలేదు.

@ Found in Folsom,
:)) కదూ.. థాంక్స్!

@ బులుసు గారు,
:) మీ కామెంట్ కూడా కెకే! (కెవ్వు కేక)

కృష్ణప్రియ said...

@ కష్టే ఫలే శర్మ గారు,
ధన్యవాదాలు!

@ అనాన్,
మిగిలిన పార్ట్ సంగతి ఎలా ఉన్నా, కోల్కోత్తా ని మరీ అంత రోగాల మాయం గా, మురికి కూపం గా చూపించటం నాకు నచ్చలేదు.

@ సునీత గారు,
;) అవును అప్పుడే మజా!

కృష్ణప్రియ said...

@ తృష్ణ గారు,
ఎవంజర్స్ సినిమా నాకైతే బోరింగ్ గానే ఉంది. కానీ చాలా మందికి చాలా చాలా నచ్చినట్టుంది. మా పిల్లలైతే సినిమా హాల్లోంచి బయటకి వస్తూనే హడావిడి గా వాళ్ల కజిన్స్ కి, స్నేహితులకి ఫోన్లు చేసి కథ గురించి చర్చించేశారు.. : )

లలితా,
అవును. నేనూ విన్నాను. నాకు చాలా సంతోషం వేసిన విషయం ఏంటంటే, అప్పట్లో నేను మోహన్ కి చేసి పెట్టిన త్యాగరాజ కీర్తనలకి తెలుగు ట్రాన్స్లే షన్లని గుర్తు చేసి , అవి తన దగ్గర ఇంకా ఉన్నాయని చెప్పటం.. నేనే మర్చిపోయాను. మోహన్ ఇప్పుడు ప్రొఫెషనల్ కర్ణాటక విద్వాంసుడు. కొన్ని అవార్డులు వచ్చినట్టున్నాయి..

@ కాముధ,
అవునా! నేనూ, గబ్బర్ సింగ్ గురించి చాలా భిన్నాభిప్రాయాలు విన్నాను. సినిమా చూడలేక పోయాను.

Anonymous said...

imtaki evaraa mOhan? emaa katha? atani web site pErEmi? mIku lalitag eppaTinumci telugu? friendsaa?

Anonymous said...

మీకు సంగీతం ఇష్టంలా ఉన్నట్లు ఉంది, ఈ జునైద్ జంషద్ భాయ్ పాటలు విని ఆనందించండి.ఆయన గడ్డం చూసి అతనిని అంచనా వేయకండి.

http://www.youtube.com/watch?v=mAbpX-6aRgU

http://www.youtube.com/watch?v=FPwMJzr8YPU&feature=g-vrec

Kottapali said...

రెండు అనుభవాలూ భలే కలిపి కొట్టారుగా! :)

lalithag said...

@Anonymous who wants to know about how the blog write knows lalithag, it is interesting that you keep your identity hidden while wanting to know details about others. I don't think you have to know anything more than what is already revealed in our conversation.

హరే కృష్ణ said...

.. ‘నీ అవసరం ఉంది.. ప్రపంచాన్ని రక్షిద్దాం.. పద’ మని ఓ ఏజెంట్ తీసుకుపోయింది.. అంటే.. కోల్కోత్తా లో ప్రపంచం లో భాగం కానట్టు.. వాళ్ల మాన్హాటన్, మాత్రమే ప్రపంచం అన్నట్టు..

ఇది సూపర్ :)

Chandu S said...

పోస్ట్ లో ఎక్కడో ఒక చోట నోస్టాల్జియా డోస్ ఇవ్వకుండా ఉండరు కదా. చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఇంత హాయిగా నవ్వి చాలా రోజులయ్యింది. thank you

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;