Friday, February 25, 2011

చేజారిన మంత్రదండం!




మొన్న  ఆఫీస్ కి స్కూటర్ మీద తీరిగ్గా బయల్దేరాను..  అసలు ఇంటి నుండే పని చేద్దామనుకున్నా.. కానీ అత్యవసరం గా రమ్మంటే.. ఉన్న పళాన బయల్దేరాల్సి వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్డు మీద బోల్డు ట్రాఫిక్! టక్క్మని శబ్దంవచ్చింది.. ఏంటా అని చూస్తే.ఏమీ ప్రత్యేకం గా తేడా గా అనిపించలేదు..  ముందర ఆఫీస్ బ్యాగ్ అయితే ఉంది.  సరే రోడ్డు మీద ఏదైనా రాయో రప్పో లే అనుకుని నా దారిన నేను పోతుంటే.. 

పక్కన కార్ డ్రైవర్ హారన్ కొట్టి కొట్టి ఇబ్బంది పెడుతున్నాడు.. కొద్ది సేపు ఇగ్నోర్ చేసి..  తర్వాత కోపం గా చూసే టప్పటికి అర్థమైంది.. వాళ్ళేదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నారని.. వాళ్ళు రోడ్డుకి మధ్యన అడ్డంగా కార్ ని రాయల్ గా ఆపేసి.. నన్ను రమ్మని సైగ చేస్తే.. నేనూ అయోమయం గా వాళ్ల పక్కకి వెళ్లి నిలుపు కున్నాను... 

జనాలంతా  ఏదైనా అయిందేమో అని చుట్టూ ఆసక్తి గా చూస్తున్నారు... చెత్త ట్రాఫిక్ లో ఏదైనా మసాలా దొరకచ్చు అని!  కార్ లో వాళ్ళు.. 'నీ మొబైల్ పడిపోయింది ..బ్రిడ్జ్ మీద.. ఒక సైకిల్ అబ్బాయి వెంటనే తీసుకుని పారిపోయాడు..' అని చెప్పారు.. 

ఈలోగా  'ఏ ఫోన్...ఎలా? ఎక్కడ పెట్టుకున్నావు? ....' అని పక్క నున్నవాళ్ళు ఊదర కొట్టటం.. 

మంచి ఖరీదయ్యినదైతే 'అయ్యో...' వాల్యూ ఎక్కువ కదా! .. నేను షాక్ లోంచి బయటకొచ్చేసరికి..  జనాలు చుట్టూ అడుగుతున్నారు.. ఆశ్చర్యమేంటంటే.. ట్రాఫిక్ లో అరక్షణం వేస్ట్ చేయలేని మోటార్ సైక్లిస్స్టులు, బస్సుల మధ్యలోంచీ, ఫుట్ పాతుల మీద రాళ్ళమీదనుండీ. కరెంట్ స్తంభాల మధ్య ల్లోంచీ  దూకుడు గా హారన్ కొడుతూ దూసుకెళ్ళే వారంతా .. ఏ మాత్రం తొందర లేకుండా.. నింపాది గా ఎదురు చూస్తున్నారు. 

'అంత ఖరీదైనది కాదని అన్నాను.. అంతే.. 




వాళ్ళని నేనేదో  బొట్టు పెట్టి పిలిచినట్టు.. వాళ్ళని నేను డిజాప్పాయింట్ చేసినట్టు నిరసన గా.. అంతా వెళ్ళిపోయారు. సిగ్గేసింది. కనీసం ముప్ఫై వేల రూపాయల ఫోన్ పోగొట్టుకుంటే.. కాస్తైనా ఇజ్జత్ ఉండేది ఇలాకా లో.. ఈసారి మంచి ఖరీదైంది పారేసుకోవాలి ..  అని ముందర గట్టి నిర్ణయం తీసుకుని..  అప్పుడు పోయిన సెల్ ఫోన్ కోసం బాధ పడటం మొదలు పెట్టాను. ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే ఎత్తాడు కానీ.. తర్వాత సిం కార్డ్ విసిరేసుంటాడు.. చాలా cheated గా, నీరసం గా అనిపించింది.  



ఫోన్ లో రికార్డ్ చేసిన పిల్లల విన్యాసాలు,..  తీసిన వందలాది ఫోటోలు..  ఐదేళ్ల నుండీ మేరు పర్వతం లా పెరిగిన కాంటాక్ట్ లిస్టూ... కళ్ళ ముందు రీల్స్ గా తిరగటం మొదలయింది.. చా.. సినిమాలు తగ్గించాలి.. మరీ రింగురోడ్డు మీద రింగులు రింగులు గా వెళ్లి పోవటం.. బాగుండదు కదా.. అని ఎలాగో వచ్చి పడ్డాను ఆఫీసుకి.. 

అప్పుడు .. చూడాలి కష్టాలు..  మా వారి నంబర్ అయితే గుర్తుంది, మాట్లాడాను కానీ.. ఇంకెవ్వరి నంబర్లూ గుర్తు లేవు. ఇంటి నంబర్ తో సహా..  తనని అడగ వచ్చు కానీ ఆమాత్రం తెలియదా అని గేలి చేస్తారేమోనని  ఒకటి రెండు సార్లు తప్పు  నంబర్లకి చేసి.. మొత్తానికి ఇంటి నంబర్ కి చేయగలిగా!!!...  

సాయంత్రం ఎవరికో ఫోన్ చేయాలంటే ఆ నంబర్లు లేవు. ఫోన్ లేకపోవటం తో ఎప్పుడూ సీట్ లోనే కూర్చోవాల్సి రావటం అన్నింటికన్నా పెద్ద కష్టం లా తోచింది.ఎవ్వరు ఫోన్ చేసినా ఉండాలని..

సెల్ లేనిదే అస్సలూ నడవదు కదా.. ఇంట్లోంచి బయటకెళ్ళేముందు కార్ లో కూర్చుని.. నేను తాళాలేసుకునే లోపలే 'మంచి నీళ్ళు తీసుకురా.. స్టడీ రూం లోంచి ఫలానా పుస్తకం తీసుకురా ' అని ఫర్మాయిష్ లు కూడా ఈ మొబైల్ ఫోన్ ద్వారా నడుస్తూ ఉండటమే!..సూపర్ మార్కెట్ లో ఒక ఐల్ నుండి రెండో ఐల్ లోకీ ఫోన్ కాల్స్!! రెండు నిమిషాలు లేటైతే కాల్స్.. మూడు నిమిషాలు ముందు వచ్చానని కాల్స్..  వంకాయ పులుసు లో పోపెలా పెట్టాలని కాల్స్.. అడ్రస్ కనుక్కోవటానికి కాల్స్.  

మొన్నీ  మధ్య ట్రైన్ జర్నీ ముందు గా ఒక పిచ్చి ట్రైన్ లో చేసుకుని.. తర్వాత తత్కాల్ లో మాకు కావలసిన ట్రైన్ లో చేసుకున్నాం. మా వారు ..రైలెక్కాక.. 'అన్నట్టు... టికెట్ కాన్సెల్ చేసావు కదా?' అని అడగగానే.. గుండె లటుక్కుమంది. అసలే మమ్మల్ని ఎక్కించటానికి కూడా వచ్చారు మావాళ్ళు.. మర్చిపోయానూ అంటే.. ఎంత అప్రతిష్ట! ' అని 'యా.. చేసేసా' అన్నాను. రైల్లో పిల్లి లా వెళ్లి తన జేబు లోంచి ఐఫోన్ తీసి.. రెండు నిమిషాల్లో కాన్సెల్ చేసేసి.. మళ్ళీ జేబు లో పెట్టేసి.. 'హమ్మయ్యా' అనుకున్నా..



ధనుస్సు లేని రాముడినీ, వేణువు లేని కృష్ణుడినీ, త్రిశూలం లేని శివుడినీ అయినా ఒక్కోసారి ఊహించవచ్చు.. 'సెల్లు' అనే మంత్రదండం లేని మనిషి ని ఈరోజుల్లో ఊహించగలమా?  మా పనమ్మాయి మేరీ  దగ్గర్నించీ.. మా బాసు దాకా అంటా సిట్యుయేషన్ ని ఆనందం గా వాడేసుకున్నారు. .. మేరీ రాలేదు.. ఫోన్ చేసి అడుగుదామంటే  నంబర్ లేదాయే.. వచ్చినప్పుడు 'ఏంటి ... చెప్పా పెట్టకుండా మానేయటమేనా?  '  అని నిలదీస్తే.. 'ఫోన్ పన్నిటా.. ఎంగ పోయిటాంగ నీంగ  మాడం ? '  అని చిలిపి గా,  అమాయకం గా అడిగినట్టు అడిగింది.. ఏం చేస్తాం? నంబర్ ఒక కాగితం మీద రాసుకున్నా..  (ఆ కాగితం గంట లోపలే పారేసుకున్నానను కొండి)   

బాసు గారేమో.. 'I called your desk number multiple times.. Looks like you were away.. ' అని కాస్త ప్రోబింగ్ గా అడిగారు..  రెండో రోజు డ్రైవర్ నంబర్ తీసుకోవటం మర్చిపోయి హడావిడిగా ఆఫీస్ లోపలకి పరిగెట్టేసరికి సాయంత్రం.. ఎనిమిది అంతస్స్థుల్లో కార్ ఎక్కడ పెట్టాడో తెలియక లాప్ టాప్ బ్యాగ్ తో తిరగాల్సి వచ్చింది.



అంటే ఎంత టైం వేస్ట్? అసలు ఎంత కష్టం...? అని నా మీద నేను తెగ జాలి పడిపోయి.. ఇలా కాదని.. ఎలాగయినా.. ఇన్స్ట్రుమెంట్ కొని తీరాలని అనుకున్నా.. కానీ.. ఇల్లూ.. పనులూ గుర్తొచ్చి..మళ్ళీ పోస్ట్ పోన్ చేసేసా.. ఇంటికొచ్చాక చాలా కాలానికి మా లాండ్ లైన్ ఫోన్ ఏ మూల ఉందో చూసి దుమ్ము దులిపి..  కొత్త ఫోన్ వచ్చేదాకా ఇదే కదా గతి అని అనుకునేంతలో.. రింగ్ అవుతొంది... 

అమ్మ.. 
'ఎక్కడికెళ్ళావు? ఈరోజంతా లేవు.. ఇంటి ఫోన్ కీ అందాకా.. సెల్ కీ అందక? భయపడి చచ్చాను..!!!' హ్మ్.. అనుకున్నా.. ఈ ఫోన్ పోవటం వల్ల .. కాస్త ఇంపార్టెంట్ గా ఫీల్ అయ్యా... కానీ పాత విషయం గుర్తొచ్చింది..


మా స్కూల్   రోజుల్లో హైదరాబాద్ లో ఉండే వాళ్ళమేమో.. ఊర్ల నుండి వచ్చిన చుట్టాలని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా,  మా సర్వీస్ ల అవసరం మా తల్లిదండ్రులకుండేది.   అలా వెళ్ళినప్పుడు  చుట్టాల ఇళ్ళల్లో ఒక్కోసారి  రాత్రి కి ఉండిపొమ్మంటే ఉండిపోయేవాళ్ళం. మా ఇంట్లోనూ ఫోన్ ఉండేది కాదు.. మా వాళ్ళిళ్ళల్లో అంతకన్నా ఉండేవి కావు! ఇంటికి రాత్రి ౧౦ దాటినా రాలేదంటే బహుశా అక్కడ ఉండిపొమ్మన్నారేమో అనుకునేవాళ్ళు మా పెద్దవాళ్ళూనూ.. 


ఆ రోజుల్లో ఉన్న 'ఏమీ కాదన్న' నమ్మకం  ఈరోజు ఉందంటారా?  అప్పట్లో ఒకసారి మా చెల్లి, సడెన్ గా మత కల్లోలాలయ్యాయని  కర్ఫ్యూ విధించినప్పుడు ఇంటికి దాదాపు 20 కి. మీ. దూరం లో ఉండిపోయింది.  అప్పుడు ఫోన్ అవసరం.. దాని ప్రాముఖ్యత తెలిసి వచ్చి మా ఇంట్లో.. ఎక్కువ డబ్బు ఇచ్చైనా పెట్టిన్చుకోవాలనే పట్టుదల వచ్చేసింది.అప్పటిదాకా మాకు లాండ్ లైన్ ఫోనే లేదు! తర్వాతైనా.. ఫోన్ కాల్స్ అంటే అత్యవసర  పరిస్థుతులకోసం..


ఏమాట    కామాటే చెప్పుకోవాలి..  ఫోన్ లేకపోవటం వల్ల  withdrawl  symptoms కనిపించినా (అంటే రెండు చేతులూ వాడుతూ  పని చేస్తున్నప్పుడు  కాస్త తల భుజం మీద కి వంచి.. ఫోన్ అటెండ్ చేస్తున్న పోజు లో ఉండటం.. చేతులు ఫోనుని ఫ్లిప్ ఫ్లాప్ చేసున్న ఆక్షన్ చేస్తూ ఉండటం.. కనులు మూసినా ఫోన్.. తెరిచి చూసినా ఫోనే ... ఇలాగ ఆఫోన్ గురించి కన్నీరు కారుస్తూ ..బెంగ పెట్టుకుంటే.. ఎందుకో తట్టింది.. 

నాకు ఫోన్ లేదని ఆఫీస్ లో వీకెండ్ సపోర్ట్ డ్యూటీ విముక్తి లభించిందని.. వీకెండ్ అంతా ఎక్కడో ఉన్న మనుషులతో కాకుండా హాయిగా చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడటానికి వీలైంది..  ఫోన్ లేనప్పుడు ఇలా ఉండేవాళ్ళమా అని ఆశ్చర్యం వేసింది! సూపర్ మార్కెట్ లో ఇక్కడ కలుద్దాం ఒకవేళ తప్పిపోతే అని ముందస్తు గా అనుకోవటం..  ఈ టైం కి వస్తానని చెప్పుకుని.. కాస్త అటూ ఇటూ అయితే కంగారు పడద్దని అనుకోవటం.. కొద్దిగా అనిశ్చత లో థ్రిల్, కొద్దిగా ఆరాటం లో ఉన్న భావోద్వేగం.. ఎదురు చూపు లో దాగున్న అభిమానాన్ని అసలు ఈ సెల్ ఫోన్లు ఎప్పుడు కబళించి వేసాయి? అని ఆశ్చర్యపడి .. ఆ తృప్తి ని తనివి తీరా అనుభవించాను..





మొత్తానికి ఏదో ఒక పాత ఫోన్ లో టెంపరరీ గా సిం కార్డ్ వేయించుకున్నా..  పాత కాలం టైప్ రైటర్ కి బలం గా నొక్కినట్టు నొక్కితేనే కానీ నంబర్ వెళ్ళని అరకిలో బరువున్న గుండ్రాయి లాంటి ఫోన్. అన్ని కాంటాక్ట్ లూ పోయాయి. ఐదేళ్ళ నుండీ సంపాదించిన నంబర్లు!!! ఎక్కడెక్కడ పట్టుకోను మళ్ళీ ? 


ఇంక ఆఫీస్ లో  కో వర్కర్స్, చుట్టు పక్కల వారు చుట్టాలు .. చివరికి పిల్లల దగ్గర్నించీ ఆంతా చెప్పేవారే.. కాస్త జాగ్రత్త గా బ్యాగ్ లో పెట్టుకోవాల్సింది...జిప్ వేసి పెట్టుకోవాలి.. రోడ్ మీద ప్రయాణాలప్పుడు!!  (అదే మరి.. వినే వాడు వెంగళప్ప అయితే చెప్పేవాడు మహాజ్ఞాని అవుతాడు)  

అప్పుడప్పుడూ కాంటాక్ట్స్ కంప్యూటర్ లోకి ఎక్కించుకోవా నీవు? (ఏదో రోజూ పళ్ళు తోముకోవా? ' అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి మరీ అడగటం.. )  

కొంత మందైతే మరీ.. స్కూటర్ నడపడం మానేయి అసలు.. అలాగే ఎత్తుకుపోతారు.. రేప్పొద్దున్న నీ ఆఫీస్ బ్యాగ్ ఎత్తుకుపోతెనో? (ఆహా.. అంత వంటి మీద స్పృహ లేని దాన్నా?)  

ఇంకా  అందరూ వాళ్ల పెద్దత్తగారి చిన్న కోడలి బావ ఫోన్ ఎలా పోయింది? దగ్గర్నించీ.. స్కూటర్ మీద వెళ్తున్న వాళ్ల ఆడపడచు వాళ్ల బాబాయి గారి కూతురి మెదలోంచి మంగళ సూత్రం ఎంత లాఘవం గా లాగేసారో.. కూలంకషం గా వర్ణించి చెప్పి నా బ్రెయిన్ వాష్ చేసేసారు.. (మనలోమాట.. నేనూ ఇలాంటి చాన్స్ వస్తే.. అస్సలూ తగ్గను ! ౩-౪ ఇలాంటి కథలు అనర్గళం గా చెప్పేస్తాను మామూలు గా..  ఇప్పుడు విక్టిమ్స్ మనం కదా.. అందుకే పెద్దగా సొక్కలేదన్నమాట)..
  
ఇదిగో.. సెల్ ఫోన్, లాప్ టాప్..పర్సూ అవీ .. జాగ్రత్త.. పారేసుకోకు.. (చా..సెటైర్లు.. ఒకసారి పోగొట్టుకున్నంత మాత్రాన.. ఎలా కనపడుతున్నాను?)




ఏం చేస్తాం..ఇలానేను ఎలా చేసి ఉండవల్సిందీ.. నేను చేసిన ప్రాథమిక తప్పిదాలేంటి అన్న విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవటం ఒక ఎత్తు.. ఫోన్లు ఎత్తటం మరో ఎత్తు.. కొంతమంది కాల్స్ స్క్రీన్ చేయటానికి లేదు. ప్రతి వాళ్ళు చేసిన ఫోన్లూ ఎత్తాల్సి వచ్చింది. బాస్ తో కస్టమర్ ఇస్ష్యూ గురించి మాట్లాడుతుంటే.. దూరం చుట్టాలావిడ కాల్.. ఏమైనా అర్జంటా? అంటే.. 'అబ్బే ..చాలా కాలం అయింది కదా అని ఊరకే చేశా ' అంది.. 'నా తల్లే ' అనుకుని.. సాయంత్రం మాట్లాదతానని వాగ్దానం చేసి బయటపడ్డాను.  

అలా అని జరిగిన మరో మేలు ఉంది లెండి.. ఒక స్నేహితురాలు చేసిన పని మీద కోపం వచ్చి తన కాల్స్ తీసుకోవట్లేదు... కానీ నంబర్ చూపించక పోవటం తో.. ఎవరో ఏంటో అనుకుని ఎత్తి.. . మాట్లాడి మనస్పర్థలు దూరం చేసుకోవటమైంది.  చాలా తేలిగ్గా అనిపించింది మనస్సంతా.. 

కొత్త  ఫోన్ కొనాలి.. అనగానే..ఒక్కసారి బజార్ల లో వెరైటీ చూస్తే కళ్ళు తిరిగినంత పని అయింది. కళ్ళు మూసుకుని ఈసారి మినిమం ఫీచర్లున్న ఫోన్ కొనాలా? ఫోన్ పోయినా అంత బాధ పడకుండా.. లేక ఐఫోన్.. ఆన్డ్రైడ్ లాంటి హై ఎండ్ ? తర్జన బర్జన..  పిల్లలు ఐఫోన్..ఐఫోన్.. అని..  మా బాంక్ పాస్ బుక్కేమో.. కొద్దిగా చవకైన ఫోన్ అనీ..  హ్మ్.. 

 ప్రతి సంవత్సరం అకాడెమిక్ ఇయర్ మొదలయ్యేముందు.. పుస్తకాలన్నింటికీ అట్టలేసి..జాగ్రత్తగా.. మొదటి వారమంతా అందంగా ఎలా నోట్స్ రాస్తామో.. జనవరి ఫస్ట్ నుండీ.. టెంత్ దాకా ఎలా డైరీ రాసి జిమ్ కెళ్ళి వస్తామో.. అలాగ నేనూ మొదట కొన్ని రోజులు రెగ్యులర్ గా సిస్టం లో ఫోన్ నుండి బాక్ అప్ చేసుకుంటా.. 


ఈలోగా.. మీ ఫోన్ నేను పొరపాటున ఎత్తక పొతే 'ఏదో పాత ఫోన్ కదా.. సిగ్నల్ సరిగ్గా దొరక లేదేమో అనుకొండే? ' ..



59 comments:

మంచు said...

అంత విచిత్రం గా ఎలా పాడేసుకున్నారండి :D:D

nade first comment anukuntaa...

Ennela said...

హాప్పీ ఫోన్ ఫ్రీ డే అండీ....

Sravya V said...

హ హ అయ్యో పాపం మంత్రదండం పారేసుకున్నారా :)
నాది ఒక ఉచిత సలహా ఆ కాంటాక్ట్స్ లిస్టు backup తీసిపెట్టుకోవాలి . ఇక మీ మిస్సియన పిల్లల విన్యాసాలు :(

Unknown said...

కనీసం ముప్ఫై వేల రూపాయల ఫోన్ పోగొట్టుకుంటే.. కాస్తైనా ఇజ్జత్ ఉండేది ఇలాకా లో.. ఈసారి మంచి ఖరీదైంది పారేసుకోవాలి .. అని ముందర గట్టి నిర్ణయం తీసుకుని



ఈ సారి మీరు ఎక్కడ పారేస్కున్టున్నారో కొంచెం వివరం చెప్తే వచ్చి అపహరిస్తాం :)

ఇందు said...

కృష్ణప్రియ గారూ..మంత్రదండం వాడకుండ జీవించ ప్రాణుల్లో నేను ఒకదాన్ని ఉన్నానండీ.గత తొమ్మిది మాసములనుండి నో సెల్ :)) నా సెల్లో ఇప్పటికీ ఏయిర్టెల్ సిం యే ఉంది తెల్సా! దానితో అప్పుడప్పుడు ఫొటోలు తీస్తుంటా! అంతే! :) మీ మొబైల్ కష్టాలు బహు చక్కగా ఉన్నాయ్! కాని సెల్ బాగా అలవాటయ్యక అది లేకపోతే ఎంత లోటుగా ఉంటుందో కదా!

Unknown said...

సేమ్ పించ్!!!! :( :( :(

నేను సెల్ పోగొట్టుకున్నా. ముప్ఫయినాలుగువేల ఐఫొన్ పోయిన బాధ తోబాటు బోనస్ గా కాంటాక్ట్ నంబర్స్ పోయి నానా చెత్తగా తయారయ్యింది జీవితం..ఒక్క బిజినెస్ నంబర్ , బంధువుల నంబర్స్, స్నేహితుల నంబర్స్ గుర్తు లేదు నా నంబర్ తప్ప. :( :( . ఐట్యూన్స్ లో ఏదయిన బాక్ అప్ ఉన్నయేమో రిసెర్చ్ చేస్తున్నా.

నాలుగు భాషల్లో కలిపి, ఇరవయ్యి ఒక్క వేల పాటలు, :( పన్నెండు నా ఫేవరెట్ నవలలు, :( , నాల్గొందల దాక చక్కని వాల్ పపర్లు, పది పన్నెండు దాక నాకిష్టమయిన సినిమాలు. :( వెరసి ఓ మంచి ఫ్రెండు నాకు.. ఐ లాస్ట్ హర్!!! :(

టెంపరరీ గా నొక్కుడు ఫోన్ తో బండి లాగిస్తున్నా , టచ్ స్క్రీన్ కిఅలవాటయిన ప్రాణం, నొక్క లేక కన్ఫ్యుజన్ ఒకటి.

గిరీష్ said...

Ennela gaaru annattu happy phone free day andi.. mobile valla na kastalu ikkada chudandi..

http://girish-mountain.blogspot.com/2011/01/blog-post_13.html

Indian Minerva said...

నేను ఆరోజు ఇంకెవరికైనా -ఫరెజ్జాంపుల్ ఏ బుక్ షాపులకో- ఫోను చెయ్యాల్సుంటే తప్ప ఫోనుని ఆఫీసుకి తీసుకెళ్ళను. అప్పుడుకూడా ఇన్‌కమింగ్ కాల్స్ బార్ చేసేస్తాను. you know.... cell phone is for my convenience not for the caller's :).మ్యానేజరు మొత్తుకున్నా దోస్తులు తిట్టిపోసినా నేను సెల్లు వాడనుగాక వాడను. నకైతే ఇప్పటివరకూ దీనివల్ల అన్నీ లాభాలే కనిపించాయి, అనుభవంలోకి వచ్చాయి.

Kathi Mahesh Kumar said...

:) :) :)

రాధిక(నాని ) said...

ధనుస్సు లేని రాముడినీ, వేణువు లేని కృష్ణుడినీ, త్రిశూలం లేని శివుడినీ అయినా ఒక్కోసారి ఊహించవచ్చు.. 'సెల్లు' అనే మంత్రదండం లేని మనిషి ని ఈరోజుల్లో ఊహించగలమా?
నిజ్జంగానండి ఇప్పుడంతా అలాగే ఉందికదా!
ఫోన్ లో రికార్డ్ చేసిన పిల్లల విన్యాసాలు,.. తీసిన వందలాది ఫోటోలు.. ఐదేళ్ల నుండీ మేరు పర్వతం లా పెరిగిన కాంటాక్ట్ లిస్టూ..
ముక్యంగా "పిల్లల విన్యాసాలు" :(( అయ్యో! మధుర జ్ఞాపకాలన్నీ మిస్సయ్యి ఉంటారు ..

కృష్ణప్రియ said...

మంచు,

:-) అబ్బా... ఈసారి చాలా సాధారణం గా పారేసుకుంటాను లెండి ..

@ ఎన్నెల,

థాంక్స్ :)

@ శ్రావ్య,

హ్మ్.. బాక్ అప్ విలువ తెలిసింది :)

@ కావ్య,

:) పోనీ ఈసారి ఆస్ట్రేలియా కొచ్చి పారేసుకుంటాను.. మీకు ఆట్టే శ్రమ లేకుండా... అక్కడే వెతుక్కోవచ్చు..

KumarN said...

మీ రచనా శైలి బావుంటుందండీ, ఆహ్లాదంగానూ, ఆపకుండా చివరిదాకా చదివించేదిగానూ ఉంటుంది. అందులోనూ మీరు దైనందిన జీవితం లోని అతి మామూలుగా దృష్టి లోకొచ్చి వెంటనే వెళ్ళిపోయే విషయాలని ఒడుపుగా పట్టుకుని వాటి మీద రాస్తారు. వెరీ ఇంప్రెస్సివ్ సో ఫార్.

ఓ చిన్న సలహా. ఐఫోన్ కన్నా మంచి ఫోన్ లు చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇండియాలో కూడా ఉన్నాయనే అనుకుంటున్నాను. ఆండ్రాయిడ్ ఫోన్ లేటెస్ట్ మోడల్ ఏది తీసుకున్నా కూడా, మీకస్సలు కాంటాక్ట్స్ ఎప్పుడూ పోవడమనే ఫికరే ఉండదు. ప్రతి కాంటక్ట్, మీ గూగుల్ అకౌంట్ కి మీరేం ప్రతిసారీ ఏం చెయకుండానే సింక్ చేసేసుకోవచ్చు. ఎప్పటికీ ఉండిపోవడమే కాకుండా, ప్రపంచంలో ఎక్కణ్ణుంచయినా మీరు రిట్రీవ్ చేసుకొవచ్చు. అలాగే మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అట్లాంటివన్నీ కూడా ఆటొమెటిక్ గా సింక్ చేసేసుకోవచ్చు. Photos, and what not..Just make use of apps.

నేను చాలా సెల్ ఫోన్లు పోగొట్టుకోని, కొనీ, అసలు ఏవి పోయినా నా లైఫ్ సఫర్ అవకుండా వెంటనే నార్మల్సీ రిస్టోర్ అయ్యే టెక్నాలజీ వెతుక్కుంటుంటాను. నా పాస్పోర్ట్స్, ఇంట్లో మనుషులు తప్ప.

KumarN said...

R,
You are amazing..21,000 songs..
I thought 5,000 songs on my Ipos itself was big collection. Sucks..

Meeku malli aa collection dorukute cheppandi, Vaalipotaa..free gaa :-)

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

చాలా బావుంది. చాలా ఆలోచించవలసిన విషయాలని సున్నితంగా చెప్పారు :)

>> ఆశ్చర్యమేంటంటే.. ట్రాఫిక్ లో అరక్షణం వేస్ట్ చేయలేని మోటార్ సైక్లిస్స్టులు, బస్సుల మధ్యలోంచీ, ఫుట్ పాతుల మీద రాళ్ళమీదనుండీ. కరెంట్ స్తంభాల మధ్య ల్లోంచీ దూకుడు గా హారన్ కొడుతూ దూసుకెళ్ళే వారంతా .. ఏ మాత్రం తొందర లేకుండా.. నింపాది గా ఎదురు చూస్తున్నారు.

హ్మ్..Something for everyone to think about..

మనసు పలికే said...

హ్మ్మ్.. పాపం కృష్ణ ప్రియ గారు:(
>>కనీసం ముప్ఫై వేల రూపాయల ఫోన్ పోగొట్టుకుంటే.. కాస్తైనా ఇజ్జత్ ఉండేది ఇలాకా లో.. ఈసారి మంచి ఖరీదైంది పారేసుకోవాలి .. అని ముందర గట్టి నిర్ణయం తీసుకుని
>>ధనుస్సు లేని రాముడినీ, వేణువు లేని కృష్ణుడినీ, త్రిశూలం లేని శివుడినీ అయినా ఒక్కోసారి ఊహించవచ్చు.. 'సెల్లు' అనే మంత్రదండం లేని మనిషి ని ఈరోజుల్లో ఊహించగలమా?
:D:D:D

మనసు పలికే said...

కృష్ణప్రియ గారూ.. నాదో సందేహం;) మీ టపాల్లో పెట్టే పిక్చర్స్ గూగులమ్మ దయేనా అండీ.. భలే ఉంటాయి:)

Mauli said...

క్రిష్ణప్రియ గారు

First Congrats!

@ఐదేళ్ళ నుండీ సంపాదించిన నంబర్లు!!! ఎక్కడెక్కడ పట్టుకోను మళ్ళీ ?

అన్ని అవే వస్తాయ్....వాటి గురి౦చి క౦గారు పడక౦డి .. పుటొలు అ౦టారా అవి మర్చిపొవడమె :) ...

ఆ.సౌమ్య said...

మీరు చెప్పినది నిజమేనండీ బాబూ...పేరు బాగా పెట్టారు మంత్రదండం అని...అది లేకపోతే ఎన్ని సమస్యలో. ఆ మధ్య మా దొడ్డమ్మ ఒకసారి అన్నారు.."ఈ కాలంలో అన్ని ఎంత సులువో, మనిషి అమెరికా చేరగానే ఫోన్ కొట్టో, ఈ మైల్ కొట్టో చేరానని చెబుతున్నారు. ఆ కాలంలో పది-ఇరవై రోజులైనా అమెరికాలో పోస్టు చేసిన ఉత్తరమో, టెలిగ్రాము కోసమో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవాళ్ళం" అని. మీరన్నట్టు నిరీక్షణలో కాస్త విసుగు ఉన్నా కొంత అనుభూతి కూడా ఉంది లెండి. ఓ పదేళ్ల క్రితం హాస్టల్లో మా అమ్మనాన్నగార్లు, బంధువులు రాసే ఉత్తరం కోసం కళ్ళు కాచేలా ఎదురుచూసేదాన్ని. అలాగే రెండు వారాలకి ఒకసారి వచ్చే ఫోన్ కోసం రెండు గంటల ముందునుండే హాస్టల్ ఫోన్ దగ్గర పడిగాపులుకాచేదాన్ని. అందులో ఒక మాధుర్యం ఉందిలెండి. కానీ ఇప్పుడు ఫోన్లు బాగా అలవాటయిపోయి వేచి చూసే ఓపిక పూర్తిగా నశించిపోయింది. నాకు మాత్రం ఫోన్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది. ఒకసారి పోగుట్టుకున్నాను...కాకపొతే నా అదృష్టం బావుండి మూడు రోజుల్లో మళ్ళీ దొరికిందిలెండి.

మీకో ఉచిత సలహా...మీ సిమ్ ని మీరు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు...అదే నంబర్ మళ్ళీ పొందొచ్చు. కాంటాక్టులు, పిల్లల విన్యాసాలు....మరింక దొరకవులెండి. అవన్నీ మీరు ముందే బేక్ అప్ చేసి పెట్టుకోవలసింది.

ఫోను పోగొట్టుకున్న సందర్భంగా మీకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను :)

Unknown said...

కుమార్ గారు.

పాటలు, నవలలు(పి డి ఎఫ్), సినిమాలు, ఇలా వేటికవే వేరు వేరు ఎక్స్టర్నల్ హర్డ్ డ్రైవ్ లో సేవ్ చేసుకుంటా. సో సమస్య లేదు.
ఒక్క ఘంటసాల గారి కలెక్షన్ నా దగ్గర పదకొండు వేల దాకా ఉన్నాయ్. మహమ్మద్ రఫీ, లత, కిశోర్,తలత్ మహ్ మూద్, పి.బి శ్రీనివాస్,అవే కాకుండా పాకిస్తానీ సింగర్స్ ఫాతిమా ఖున్నుమ్ గజ్అల్స్... ఇలా.. చాలా... చాలా... :) చుట్టు పక్కల ఇలాకా లో ఎవరికి ఏ పాట కావలసినా మనమే సప్లై చేస్తున్నాం.

ఇప్పుడు, రాజన్ నాగేంద్ర కలెక్షన్స్ ప్రాసెస్ లో ఉన్నాయి.

Admin said...

phone poyinanduku bada ledu kani,pillala photos poyinanduku bada kaligindi.

కృష్ణప్రియ said...

@ ఇందు,

చాలా సంతోషం.. జీవితం లో సగం టెన్షన్లుండవు. పిల్లలు పుట్టక ముందు మాకూ లేవు కానీ.. ఇప్పుడు.. మంత్రదండం లేకుండా క్షణం గడవట్లేదు. :-(

@ r,


మీ బాధ నాకర్థం అవుతోంది. మనమిద్దరమూ ఒకే బోట్ లో..:-(( అసలు నా కాలర్ ట్యూనే మా పాప ఆకతాయి గా.. మూడేళ్ళ క్రితం ముద్దుగా పాడిన శ్లోకం :-( మీరన్నది కరెక్ట్.. ఒక మంచి ఫ్రెండ్ .. పోయినట్టే..

@ గిరీష్,

:) థాంక్స్.. మీ పోస్ట్ ఇప్పుడే చూసి వస్తున్నా.


@ Indian Minerva,

హ్మ్.. చాలా బాగుంది. ఇలా అందరం అలవాటు పడిపోయి ఎక్స్పెక్టేషన్ పెంచేసినట్టున్నాము.. :-(

కృష్ణప్రియ said...

@Kathi Mahesh Kumar,

హ్మ్.. 3 స్టార్ రేటింగ్ లాగా 3 స్మైలీ రేటింగ్ ఇచ్చారన్నమాట.. థాంక్యూ.

@ రాధిక,

:-( అదేనండీ నా బాధ..

@KumarN,

చాలా చాలా థాంక్స్! You made my day! ఆండ్రాయిడ్ మీదే నాకూ మనసుంది.. :)

@ WP,


:) అవును.. Normal is boring కదా.. రోడ్డు మీద ఏ గొడవ జరిగినట్టనిపించినా. ట్రఫిక్ ని తిట్టుకోవటం తాత్కాలికం గా మానేసి నేనూ ఆఖరి క్షణం దాకా మెడ వంచి మరీ చూస్తా.. మానవ నైజం ..


@ మనసు పలికే,

:) థాంక్స్.. అన్ని పిక్చర్లూ గూగులమ్మవే.. మొదట్లో చాలా బుద్ధి గా .. డిస్క్లైమర్ పెట్టేదాన్ని.. ఇప్పుడు మానేసాను. మళ్ళీ అలవాటు చేసుకోవాలి...

కృష్ణప్రియ said...

@ Mauli,

:) థాంక్స్..

@ సౌమ్య,

మంత్రదండం యూసేజ్ నేను నిన్ననే ఫస్ట్ టైం విన్నా :) మీరు చెప్పిన ఎదురుచూపు లో మాధుర్యం మాట.. 100% కరెక్ట్ మాట.. హాస్టల్ లో మా నాన్నగారు నాకు రాసిన ఉత్తరాల కట్ట.. ఇప్పటికీఎ ఎంతో భద్రం గా ఉంది :) నేను ఉత్తరాలు /STD కాల్స్ గురించి ఎదురుచూపు.. టచ్ చేద్దామనుకున్నా.. కానీ ఇప్పటికే టపా సైజు .. కిలోమీటర్ దాటిందని మానేసా :)

..nagarjuna.. said...

అందరూ తెగ ఫీలవుతున్నారుగాని..... నేను మీకు కంగ్రాట్స్ చెబుతున్నా కృష్ణప్రియగారు, ఫోన్ పోగొట్టుకున్నందుకు......ఫోన్ లేని ఆ కొంతకాలం ఎంత సమ్మగా ఉంటుంది, హాయిగా నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ కాల్స్ ఉండవు. కొంపలు మునిగిపోయేట్టు ఆపరేటర్‌వాడి నస ఉండదు......

BTW ఆ r గారు ఎవరండి బాబు.... ఇరవైయొక్క వేల పాటలా...!!! ఆయన కొన్నది ఫోనా? కంప్యూటరా ?

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీకు నా విచారం మొదలైనవన్నీ వ్యక్తం చేస్తున్నాను. చాలా త్వరగానే ఇంకా బోల్డు మంచి ఫోన్ కొనుక్కుని ఓ 100GB లో KG. లో సమాచారం అందులో పెట్టుకొని అది ఆనందంగా పోగొట్టుకొని అందరి సానుభూతి సంపాయించెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను , భగవంతుడిని ప్రార్ధించేస్తున్నాను. పనిపాడు లేని మోటారుసైకిలు వాడు, పాదచారి కూడా పోయింది చవక ఫోనేనా అని పెదవి విరవడాన్ని తీవ్రం గా, నిర్దాక్ష్యణ్యం గా ఖండిస్తున్నాను. ఇల్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పటానికైనా మీరు వెంటనే ఓ మంచి ఫోన్ ఎక్కడైనా జారవిడిచైనా పోగొట్టుకోవాలని సరదాపడుతున్నాను. జారవిడిచేటప్పుడు నాకు ముందస్తు సమాచారం, ఆయ్ అంతేనన్నమాటండి.:):)

మీ ఏభై వ టపాకి శుభాభినందనలు.

Anonymous said...

ఇలాటప్పుడు మెడ మీద తలున్న ప్రతీవాడూ సలహా చెప్పేవారే!! అలా చేయకుండా ఉండవలసిందీ, ఇలా బ్యాగ్గులో పెట్టుకునుంటే బావుండేది, అసలు ఒంటి మీద స్పృహుంటేనా, చేతిలో బండుంటే చాలు ఒళ్ళు తెలియదు..అసలు ఈ కాలం పిల్లలా, ఎంత అడక్కుండా ఉంటే అంత మంచిదీ... వగైరా వగైరా వగైరా చివాట్లు తగలలేదా మరి ?

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

క్రిష్ణప్రియ గారు,

హ్మ్మ్.. నెను ఆలోచించాల్సిన విషయం అన్నది గొడవెంటో చూద్దామనే క్యూరియాసిటీ గురించికాదండీ..

ట్రాఫిక్ లో అరక్షణం వేస్ట్ చేయలేని మోటార్ సైక్లిస్స్టులు, బస్సుల మధ్యలోంచీ, ఫుట్ పాతుల మీద రాళ్ళమీదనుండీ, కరెంట్ స్తంభాల మధ్య ల్లోంచీ దూకుడు గా హారన్ కొడుతూ దూసుకెళ్ళటం గురించి :))

Durga said...

Good blog, i have read all your posts today. Good Ones

sphurita mylavarapu said...

ఒక ఐఫోను కొనుక్కుని నేను వెనగ్గా వస్తుంటే పడేస్కోండే ఈ సారి...

As Always...simply superb...

నాకు మామూలుగా పొడుగ్గా వున్న post లు చదవటమంటే మహా బధ్ధకం...అందుకే నేను కూడా చిన్న చిన్న post లే రాస్తూ వుంటా కాని మీరు ఎంత రాసినా అప్పుడే ఐపోయిందా అనిపించేలా భలే రాస్తారండీ

రంగావఝ్యుల శేషాంజనేయావధాని శర్మ said...

కృష్ణప్రియ గారు చాలా బాగా వ్రాశారు
మరియు చాల బాగా పడేసుకున్నారు ఫోన్..
ఒక్కసారి నాది అదె పరిస్థితి నేను హనుమద్ దేవాలయంలో అర్చకుడిగా చేస్తున్నను.
ఓక్క సారి హనుమంతుడికి లక్ష తమలపాకుల పూజ పెట్టాను.
మా గుడి కమిటీ వాళ్ళకి ప్రమేయం లేకుండా.
అయితే పూజకి ఓక్క రోజు ముందు తమలపాకులు మా బావ చేప్పి అంగలకుదురు నుంచి తెప్పించాను.
అప్పుడె మొదలు నా సమస్య అవి తెల్లవారు జామున 4.00గంటలకు వస్తుంది బస్సు అని చేప్పాడు.ఆ బస్సు 4.30 వచ్చింది. క్షష్టపడి అవని దింపుకున్నాను. నాతో పాతో పాటు మా మవయ్యని తీసుకుని వేళ్ళాను.మా మావయ్య స్నేహితుడు ఊరి నుంచి లారిలో సామాన్లు తెస్తు మమ్మల్ని చూసి లారి ఆపాడు. సరే రూపాయి తగినా తగ్గినటె అనుకుని తమలపాకుల ముట్టలు సుమారు ఒక్కోకటి 60 నుంచి 70 కిలోలు వుండచ్చు అవి మొత్తము 7 ముటలు అవి లారిలో ఏక్కిచే సరికి మా తాతలు దిగి వచ్చారు. ఆ పనిలో పడి నా జోజులో వున్న ఫోను పడిపోయిన విషయము తేలియదు.
నేను బండి మీద వస్తాను మీరు పదండి అన్నాను.
నేను వేంటనే బండి తీసుకున్ని బయలు దేరాన్ను.
మా గుడి దేగ్గరే వాటిని దించి మా మావయ్య స్నేహితుడు వెళ్ళిపోయాడు.
పూజకి కావలసిన ఆకులు వచ్చెసాయి.ఇక భక్తుల పని మాత్రమే వుంది అన్నుకుని సాన్నం చేద్దామని నా రూంకి వేళ్ళినూ.
నా స్నేహితుడికి ఫోన్ చేయలని ఫోన్ చూసుకునే సరికి ఫోన్ లేదు అప్పుడు తేలిసింది నా ఫోన్ పోయిన విషయము.
ఇక చూడండి నా తంటాలు.వర్ణనాతీతం
ఏందుకంటే పూజకి రావలసిన పురోహితుల ఫోన్ నెంబర్లు మరియు పూజకి కావలసిన వస్తువు దాతల ఫోన్ నెంబర్లు ఇంకా కావలసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు మరియు ముఖ్యంగా మా కమిటి వాళ్ళ ఫోన్ నెంబర్లు వున్నాయి.
దాంతో ఏమి చేయలో అర్ధం కాక స్నానం చేసి గుడికి వేళ్ళాను. గుడి శుభ్రం చేసుకుని పూజ చేసేసి మా మావయ్యకి గుడి అపగించి ఇప్పుడే ఫోన్ కొనుక్కుని వస్తాను.అని గుడి నుంచి బయటపడే సరికి ఉదయం:-10.30 అయింది.
ఆరోజు ఏదో ముస్లింల పండగా దాంతో ఒక్క షాపు తేరిచి లేదు.మా గుడికి వచ్చె భక్తుడికి సెల్ ఫోన్ అమ్మే షాపు వుంది అతని దేగ్గరికి వెళ్ళీ nokia 3110 మోడల్ ఫోన్ కొన్నాను.
సిమ్ ఏలా అని అడిగాన్ను.(నేను ఐడియా సిమ్ వాడె వాడిని) అతను మీరు ఐడియా హేడ్ ఆఫిసుకు వేళ్ళండి .ఆఫీసు తేరిచివుంది అన్నాడు.
అంతే వురుకుల పరుగుల మీద ఐడియా ఆఫీసు వెళ్ళాను .ఆఫీసులో చాను తాడంతా క్యూ సరే ఏట్లో గట్ల సంపాదించాను సిమ్.
ఆటోలో కూర్చుని సెల్ ఫోన్లో సిమ్ వేసే సరికి మధ్యాహ్నం 1.00 గంట వేంటనే దబదబ మెసెజులు చూసెసరికి అవని మిస్డ్ కాల్ అలర్ట్ మేసెజులు దాదాపు 100కి పైగా వచ్చాయి.
అందులో మా న్నాన గారి ఫోన్ నేంబరు కూడ వుంది
కానీ ఎవరి నెంబరు గుర్తు లేదు .
దాంతో ఒక్కకలికి ఫోన్ చేసి మాట్లాడాను.
అలాగే మా న్నాన గారికి ఫోన్ చేసాను ఫోన్ ఏత్తగానే చడమడ తిట్లేతిట్లు దాంతో ఇంకా ఏప్పుడు ఫోన్ పడేసుకోకుడదు అని నియమము పేట్టుకున్నాను.
అది నా సెల్ చేసి బాగవతం

KumarN said...

R
నేనూ పక్కన పడేస్తా ఉంటాను, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ లో, కానీ మీ దగ్గరున్న కలెక్షన్ తో పోలిస్తే, నాది నథింగ్. కాని నా నోరేంటో భలే ఊరిపోతోంది, మీరు చెప్పినవన్నీ వింటూంటే. మీరెక్కడ ఇండియాలోనా ఉండేది? ఇక్కడెక్కడన్నా దగ్గర్లో ఉంటే, ఈ పాటికి మీ ఇంట్లో burglar attempt చేసేసి ఉండేవాణ్ణి :-)

సుమలత said...

very nice ....
your 50 th postki congrats andi....

హరే కృష్ణ said...

ఆ ఫొటోస్ పోగొట్టుకోవడం చాలా బాధాకరం
అయిదేళ్ళు గా ఒకే ఫోన్ అంటేను.కొత్త ఫోన్ రాబోతోంది ఇది మాత్రం చాలా____కరమైన విషయం

lalithag said...

మొదటి సారి టపా చదివినప్పుడు, విషయం తెలిసింది.
తర్వాత కామెంట్లు చదువుతూ, హాస్యం పండిందని తెలిసింది.
రెండో సారి తీరికగా చదివినప్పుడు ఏరుకున్న హైలైట్లు:
"వీకెండ్ అంతా ఎక్కడో ఉన్న మనుషులతో కాకుండా హాయిగా చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడటానికి వీలైంది."
"మనలోమాట.. నేనూ ఇలాంటి చాన్స్ వస్తే.. అస్సలూ తగ్గను ! ౩-౪ ఇలాంటి కథలు అనర్గళం గా చెప్పేస్తాను మామూలు గా."
"అలా అని జరిగిన మరో మేలు ఉంది లెండి.. ఒక స్నేహితురాలు చేసిన పని మీద కోపం వచ్చి తన కాల్స్ తీసుకోవట్లేదు... కానీ నంబర్ చూపించక పోవటం తో.. ఎవరో ఏంటో అనుకుని ఎత్తి.. . మాట్లాడి మనస్పర్థలు దూరం చేసుకోవటమైంది."

ఇంకా ఒక డౌటూ -
మేరు పర్వతమా పెరిగినది వింధ్య పర్వతమా?
ఏమిటో భారతం హ్యాంగోవర్ పోలేదింకా మరి.

నిజంగా బ్యాటరీ ఎంత ఖర్చౌతుందో తెలీదు కానీ అత్యవసరమైనప్పుడు ఒకటి రెండు సార్లు బ్యాటరీ లేకపోవడంతో ఆ బెంగతో నేను సెల్లుని వీలైనంత తేలికగా ఉంచుకుంటాను.
కానీ మా పిల్లలున్నారే, నీలాగే :) ( వాళ్ళకెందుకు సెల్లని అడగద్దు. అందులో నా ప్రమేయం లేదు.)
download చేసుకోవడానికి లేదని విడిగా ప్లే చేసుకుని మరీ రికార్డు చేసుకుంటారు. వాళ్ళ కోసం వాళ్ళే ఏవో విన్యాసాలు చేసుకుని రికార్డు చేసుకుంటారు.

"అసలు నా కాలర్ ట్యూనే మా పాప ఆకతాయి గా.. మూడేళ్ళ క్రితం ముద్దుగా పాడిన శ్లోకం :-( " ఇక్కడ నువ్వూ నేనూ ఒకటే. కాకపోతే అది శ్లోకం కాదు, ఒక వాయిస్ విన్యాసం.

కృష్ణప్రియ said...

@ నాగార్జున,

:) థాంక్స్ ! well said.. r గారు వాడేది ఐఫోన్ అన్నారు కదా 32 జీ బీ ఉంటుందనుకుంటా డిస్క్ స్పేస్. ఇంకేం కావాలి? కానీ.. ఆయన చాల చాలా రిసోర్స్ ఫుల్ అని అర్థమైంది.

@ Lakshmi P.,

థాంక్స్.

@ బులుసు గారు,

:-)) థాంక్స్.. కామెంట్ తో కూడా తెగ నవ్విస్తారు మీరు. మరేనండీ.. ఇక మాంచి ఖరీదైన ఫోన్ కొని పారేసుకుంటా.. మీ ఇంటి దగ్గరో, ఆస్ట్రేలియాలోనో :)

నా యాభయ్యవ టపా అనగానే మీ బ్లాగు 239 వ దినం గుర్తొచ్చింది :) గమనించి అభినందనలు చెప్పినందుకు


@ harephala గారు,

:-(( అవును ఎందుకు తగల్లేదూ? తగిలినవే అవి గదా అసలు.. నా నిర్లక్ష్య వైఖరి మీద సునిశిత చర్చలు బోల్డు .. జరిగాయి లెండి..

Unknown said...

కుమార్ గారూ
నేను ఉంటున్నది ఉద్యాన నగరి లో నండి.
ఇది నా మైల్ ఐ.డి
conquorer.r@gmail.com

కృష్ణప్రియ said...

@ Weekend Politician ,

:) అలాగంటారా?


@ Durga,

Welcome to my blog.. thaanks! ..

@ స్ఫురిత,

చాలా చాలా థాంక్స్ :) ఇంత పొగిడారు కాబట్టి ఆస్ట్రేలియా, హైదరాబాద్ కాన్సెల్. మీ ఊర్లోనే పారేస్తా ఈసారి. మీ అడ్రస్ మెయిల్ చేస్తే... ప్లాన్ చేసుకుందాం :)

కృష్ణప్రియ said...

@ శేషు గారు,



మరియు చాల బాగా పడేసుకున్నారు ఫోన్.. ---------

ధన్యవాదాలు! :)

చాలా ఇబ్బంది పడ్డట్టున్నారు సెల్ పోవటం తో.. కానీ ఒక్కరోజు లో ఠక్కున కొని మానేజ్ చేయగలిగారు. మీరు ఆవిధం గా అదృష్టవంతులు.


@ సుమలత గారు,

థాంక్సండీ... 50 వ పోస్ట్ అని గమనించారు! పోస్ట్ బాగుందన్నారు... నా బ్లాగ్ కి మీకు స్వాగతం!!!

@ హరేకృష్ణ,

హ్మ్మ్.. చాల ?? :)

@ లలిత,

:) ఏమో .. మేరు పర్వతం తోనే కంపేర్ చేస్తారేమో అనుకుంటున్నాను ... అవును. పిల్లల చేతిలో పడి నిజం గా వాడాల్సి వచ్చినప్పుడు.. మనకి లో బాటరీ అయిపోవటం..

తృష్ణ said...

మా పాప బాత్రూమ్లో స్నానం చేయించిన నా మొదటి సెల్ ఫొను, పోయిన మరో రెండు సెల్ ఫోన్ల ఉదంతాలు గుర్తుకొచ్చాయండి..:) చాలా బాగా రాసారు.

lalithag said...

వ్యాఖ్య రాసేశాక నేను ఆలోచించి అడిగిన కోణం సరైనది కాదేమో అనిపించింది.
మేరు పర్వతం అంత ఎత్తు పెరిగి పోయింది అని నీ ఉద్దేశ్యమనుకుంటాను.
నాకు మేరు పర్వతంలాగా పెరగడం అంటే వింధ్య పర్వతం పోటీ కోసం పెరగడం గుర్తుకు వచ్చి అలా అన్నాను.

Yagna said...

ఉఫ్ఫ్ఫ్ఫ్....నా ఫోన్ ని తొక్కేశారు...
డ్యుయల్ సిం ఫోన్ లో ఒక సిం కూడా పని చేయకుండా తొక్కేశారు...
ఆట గెలిచినందుకు నవ్వాలో, ఫోన్ పార్ట్స్ కూడా దొరకనందుకు ఏడవాలో తెలియట్లా!!!
అసలు కథ లోకి వెళ్తే...

ఆఫీస్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్, ఫైనల్

స్థలం : షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్, మా ఆఫీస్
సమయం : 25 ఫిబ్రవరి 2011, సాయంత్రం 7:30

స్కోర్: 10-4

సర్వీస్ చేసా... బర్డ్ అటునుంచి ఇటు, ఇటునుంచి అటు తిరుగుతుంది... ఒక మంచి అవకాశం, సద్వినియోగం చేసుకున్నా... పెద్దగా అరుపులు... Great shot.. Well played... You made it... Yes, We won the tournament. అందరూ కోర్ట్ లోకి వచ్చేశారు..., కంగ్రాచ్యులేట్ చెయ్యడానికి...


కట్ చేస్తే,
నేను ఎగిరి బర్డ్ ని కట్ చేసేటప్పుడు, నా షర్ట్ జేబు లో వున్న ఫోన్ కింద పడింది...ఏ పార్ట్ కి ఆ పార్ట్ వూడిపోయింది. మమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేయడానికి కోర్ట్ లోకి వచ్చిన నా “అభిమానుల” కాళ్ళకింద నలిగి పోయింది.

thorough UI టెస్ట్ చేస్తే గానీ, ఏది ఐడియా సిమ్మో ఏది వోడఫోన్ సిమ్మో అర్థం కాలా.. రెండూ తెల్లగానే వున్నాయి.

అన్నీ ఏరుకుని, ఈ సారి పాంట్ జేబులో వేసుకుని, డాటా రికవరీ అవకాశం ఏదైనా వుంటుందేమో అని నోకియా కేర్ లోకి వెళ్ళి, జేబులో చిల్లర తీసినట్టు తీసి, టేబుల్ మీద పెట్టా, ఏమీ మాట్లాడకుండా... వాడు ఒక సంచి ఒపెన్ చేసి, అందులో వేసుకున్నాడు. నా ఐడీ కార్డ్ చూసి నా పేరు రాసుకున్నాడు...3 డేస్ తరవాత ఏ విషయం చెప్తానన్నాడు. రేపు నేనే వెళ్ళాలి, he can not reach me, because, as usual, I have given him the same number that was working before I won the match..

ప్రస్తుతానికి, నా టీం కి మొబైల్ టెస్టింగ్ కోసం ఇచ్చిన ఫోన్స్ లో ఒక ఫోన్ తీసుకుని వాడుతున్నా, వాళ్ళ వర్క్ రివ్యూ చేసే నెపంతో!!

కృష్ణప్రియ గారూ,
పాత జ్ఞాపకాలను మిస్ చేసుకున్నందుకు ఓదారుస్తూ, కొత్త ఫోన్ కొనే అవకాశాన్ని పొందినందుకు అభినందిస్తున్నాను. congratulations.
మీరు ఏ ఫోన్ కొన్నారో చెప్పండి, నాకూ అవసరం రావచ్చని ప్రగాఢంగా నమ్ముతున్నా!!!

sphurita mylavarapu said...

మీరు వదిలొచ్చేసిన దేశమే ప్రస్తుతం మా నివాసం...ఒక్క సారి Visit కి వచ్చి shopping చేసి అలా అన్ని జారవిడుస్తూ వెళ్ళండి కాస్త...మిమ్మల్ని ఇంత పొగిడాను కదా ఒక్కసారి నా blog మీద కూడా look వెయ్యొచ్చు కదా :)...ఇంకా పొగడనా...
మీ blog చదువుతుంటే అర్జెంటు గా బెంగలూరు వచ్చేసి మీ పక్కింట్లో మకాం పెట్టేసి మీతో friendship చేసేసి ఒక కప్పు చక్కెర అప్పడిగెయ్యాలని కూడా అనిపించేస్తోంది...(నిజంగానే)

మంచు said...

స్పురిత గారు. అటు పక్కిల్లు, ఇటు పక్కిల్లు, ఎదురిల్లు, వెనకిల్లు అన్ని రిజర్వ్ అయిపొయాయి. మీరు చాలా లేట్. వైటింగ్ లిస్ట్ తీసుకుని ట్రై చెయ్యండి. ఆ పై మీ లక్ అంతే :D:D:D

Sasidhar Anne said...

Cell Phone povatam kadu kani.. dani lo vundey pillala photos and videos povatam badha ga vuntundi.
ayina 5 years nunchi okey phone vaduthunnaru kada.. anduke phone key mee meeda kopam vacchesi jaripoyi vuntundi :)

Phone pothey poyindhi kani.. weekend work nunchi tappinchukunnaru :)

కృష్ణప్రియ said...

@ తృష్ణ గారు,

నా బ్లాగ్ కి స్వాగతం! థాంక్స్...

@ లలిత,

:) ఔను.. ఇంతకీ నేను మేరుపరవతమంత ఎత్తు...అనేది సరైనదేనా?

@ Yagna,

నా బ్లాగుకి స్వాగతం! ధన్యవాదాలు.
హ్మ్.. కప్పు గెలిచాక, అభిమానుల కాళ్ళ క్రింద మొబైల్ నలిగిపోయిందా.. అయ్యో... మీరన్నది నిజమే .. ఆనందించాలో బాధపడాలో తెలియని పరిస్థితి.. ఏమో..

అదేదో... సామెత చెప్పినట్టు (కేసు ఓడినవాడు కోర్టు లే ఏడిస్తే..గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏకాంతం లో ఏడ్చాడట)..


@ స్ఫురిత,
:) పొగడండి.. పొగడండి... ఎంత పొగిడినా ఆనందమే.. మా హౌజింగ్ కమ్యూనిటీ లోకి వచ్చేయండి.. మంచు గారు చెప్పినట్టు అందరమూ బ్లాగర్లమే ఉంటామేమో..


@ మంచు,

:)


@ Sasidhar Anne,

అవునండీ.

మధురవాణి said...

అరెరే.. మంత్రదండం పోగొట్టుకున్నారా? ప్చ్.. ఇక్కడ బాధ అసలు బాధ ఏంటంటే.. కొత్త మంత్రదండం కొనుక్కున్నంత మాత్రాన కుదరదు.. పాత మంత్రాలన్నీ కష్టపడి మళ్ళీ మొదటి నుంచీ నేర్చుకోవాల్సి వస్తుంది కదా! :D
ఏంటో, మీరు చెప్తుంటే ఏ కబుర్లైనా సరే అలా వింటూ (చదువుతూ) ఉండిపోవాలనిపిస్తుంది.. :)

Bhãskar Rãmarãju said...

నేనింతక ముందు మీ బ్లాగులో కామెంటూ పెడితే
*నా బ్లాగ్ కి స్వాగతం!*
అనలేదు. ఇప్పుడేమో తృష్ణ గారికీ యజ్ఞగారికీ అందరికీ
స్వాగతం చెప్తున్నారు.
వద్దులేండి.
అందుకే కేవలం అజ్ఞాతగా మీ బ్లాగుని కుమ్ముతున్నాను, సైలెంటుగా.
గుర్తెట్టుకుంటా లేండి.

lalithag said...

మేరు పర్వతం రైటే.

కృష్ణప్రియ said...

భాస్కర్ గారు,

:-) తృష్ణ గారు, యజ్ఞ్య గారు మొదటిసారి వచ్చారు కదా అని...
మీరు నా బ్లాగ్ లో మొదటి సారి కామెంట్ పెట్టినప్పుడు నాకు ఆట్టే బ్లాగ్ మానర్స్ తెలియక మీకు స్వాగతం చెప్పలేకపోయినట్టున్నాను.

ఇప్పటికీ మించిపోయిందేదీ లేదు..

నా బ్లాగ్ కి (భాస్కర్ రామ) రాజు గారికి స్వాగతం..శుభ స్వాగతం..

http://www.youtube.com/watch?v=nKikKRPiaXEfeature=related

Yagna said...

అయ్యబాబోయ్!! సమయం సందర్భం చూసుకుని చదవాలి ఈ బ్లాగ్ ని.. లేకపోతే ఇక అంతే.

కొత్త ప్రాజెక్ట్... కిక్ ఆఫ్ మీటింగ్, క్లైంట్ తరఫు నుంచి సీయీఓ,ఈయం ఒకరిద్దరు బీయేస్ వున్నారు. ఇక్కడ నేను మా టీం తో కూర్చున్నా. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. క్రిష్ణ గారి అనుభవాలు చదువుతూ పెద్దగా నవ్వేశా... నేను అలా నవ్వడం మావాళ్ళు ఫస్ట్ టైం చూశారు... థాంక్ గాడ్... పెద్ద దగ్గు తో మేనేజ్ చేసి, ఒక 'సారీ' పడేసి, బ్లాగ్ లో నుంచి బయటికి వచ్చేశా...

ఇదేంటో, ఇదేం విచిత్రమో, బ్లాగ్ మొత్తం చదివేసిన తర్వాత స్వాగతం చెప్తున్నారు మీరు. అన్య్ వయ్స్, మీ స్వాగతానికి ధన్యవాదాలు...

@ భాస్కర్ రామరాజు గారు,
మీరూ స్వాగతం చెప్పాలి నాకు... ఎందుకంటే, నేను క్రిష్ణప్రియ గారి టపా తర్వాత ఇష్టంగా చదివే కామెంట్లలో మీవే ఎక్కువ. :)

Bhãskar Rãmarãju said...

కృష్ణప్రియ గారు అప్పుడు స్వాగతం చెప్పనందుకు ఇప్పుడు తృష్ణ గారు సారీ చెప్పాలి. అప్పటిదాకా నిద్ర పోనూ?
ఎక్కడ ఎక్కడ తృష్ణ గారు ఎక్కడ?

యజ్ఞ :):) ధన్యవాదాలు.

sphurita mylavarapu said...

@మంచు గారూ,
అయ్యయ్యో నేను అంత లేటా...పోన్లెండి క్రిష్ణ గారు భరోసా ఇచ్చేసారు...వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ లో ఎక్కడో ఒక మూలైనా దొరక్కపోతుందా...కృష్ణ గారి దెబ్బతో వాళ్ళ హౌజింగ్ కమ్యూనిటీ లో real estate boom, double ఐపోతుందేమో...
@కృష్న గారూ,
డైరీ అని పేరు పెట్టారు కదా రోజుకొక టపా రాస్తే బావుంటుంది కదా అని సలహా...మనవి...
అన్నట్టు మీ profile picture వేద్దామని ప్రయత్నాలు మొదలు పెట్టానండోయ్...మీ blog ని బట్టీ మీరెలా వుంటారా అని వూహించి భావించి వేద్దామనుకుంటున్నా....పూర్తవ్వగానే పంపిస్తానేం...:)

తృష్ణ said...

@భాస్కర్ రామరాజు: అబ్బే నేనా స్వాగతాన్ని ఏక్సెప్ట్ చెయ్యనిదే. ఎందుకంటే నాకీ బ్లాగ్ కొత్త కాదు కదా...:) ఇదివరకూ కూడా చూశాను. మధ్యలో url మర్చిపోయి దారి తప్పా. మళ్ళీ మొన్నొకరోజు కృష్ణప్రియగారి వ్యాఖ్యతో మళ్ళీ దారి దొరికి ఇటు వచ్చేసా. నచ్చిన బ్లాగ్ url s దాచుకున్న ఫైల్ పొరపాటున డిలీట్ అయిపోయింది. లేకపోతే మొన్న న్యూ ఇయర్కి నే రాసిన "డిస్కవర్డ్ బ్లాగ్స్" టపాలో ఉండాల్సిన బ్లాగ్ ఇది....:)

సిరిసిరిమువ్వ said...

:( అయ్యో!

నేను మాత్రం మీకు పూర్తిగా వ్యతిరేకం. నా సెల్లు పాడయిపోతే ఎంత ఆనందమో నాకు:) నా ఆనందాన్ని ఇక్కడ చూడొచ్చు.
http://vareesh.blogspot.com/2009_12_01_archive.html

సామాన్యంగా నేను ఇంట్లో ఉండగా సెల్లు ముట్టుకోను. బయటికి వెళ్లేటప్పుడు కూడా మరీ ఎక్కువదూరం..ఎక్కువ సేపు నేనొక్కదాన్నే వెళ్తుంటేనే తీసుకెళతాను. పక్కన మా అమ్మాయో మా వారో ఉంటే అదీ తీసుకెళ్లను.
సెల్లు ఎక్కువ వాడను కాబట్టి బాగా దగ్గర వ్యక్తులవి ఓ 50 నంబర్లు దాకా నాకు కంఠతా వచ్చు. ఫోను నంబర్లు ముందు ఫోను డైరీలో వ్రాసుకున్నాకే అవసరమయితేనే సెల్లులోకి ఎక్కించుకుంటాను, కనుక సెల్లు పోయినా మనం ఆల్ హాపీస్.

Bhãskar Rãmarãju said...

అలా ఐతే
కృష్ణప్రియ గారికి, మా తృష్ణమ్మ గారికీ మిగతా అందరికీ *ట్రూస్* అని చెప్పి సంఘీభావం ప్రకటిస్తూ గమ్మున కామెట్లు సదివే దోవలో పడుతున్నా అని ప్రకటిస్తున్నాను.

కృష్ణప్రియ said...

@ Yagna, భాస్కర్ రామరాజు గారు, తృష్ణ గారు,

:)

@ స్ఫురిత,

Yes I am eagerly waiting for my profile picture!

@ సిరిసిరిమువ్వ,

హ్మ్.. మీ పద్ధతి బాగుంది. ఆఫీస్ లో 9 గంటలు పని చేసి ఇంటికి వెనక్కి వచ్చినా సెల్ ఫోన్ మీద available గా ఉండాలన్న expectation వల్ల సెల్ కి బానిస అయిపోయామేమో..

విరిబోణి said...

Hello Krishnapriya gaaru,
As usal ga post chala touching gaa raasaaru..edi naa first comment mee blog lo..enthakumundu try chesaa kani comment petaalekka poyaa. enthaki maro phone konesaara ledha?

జయ said...

కృష్ణప్రియ గారు, మీకు హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

కృష్ణప్రియ said...

@ విరిబోణి,

నా బ్లాగు కి స్వాగతం.. (అలాగే భాస్కర్ రామ రాజు గారికి కూడా.. పునహ స్వాగతం!)

కొన్నాను.. Nokia X2. ఐదు వేల చిల్లర.. సింపుల్ ఫోన్. నా అవసరాలకి చాలు అనిపించి...

@ జయ,

థాంక్సండీ.. ఆలస్యం గా ప్రతిస్పందిస్తున్నాను.. క్షమించండి..

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;