Friday, August 27, 2010

వావ్ ఈ విషయం మాకు చెప్పనే లేదే?ర్ర్ర్ర్ర్ర్ర్ కిర్ర్ర్ర్ర్ర్ శభ్దం తో. మొదలయి డబ్ డబ్ మంటూ ఆగిపోయింది మా వాషింగ్ మిషను.

ఈ ఏడాది నాలుగోసారి అప్పుడే. సరే అని టెక్నిషియన్ ని పిలిపించాం. మల్లిక్ హీరోలా చిలిపి గా చెవుల్దాకా నవ్వుతూ " నాలుగు వేలవుతుంది సార్!!" అన్నాడు నాగరాజ్ ప్రతిసారీ అతనే వస్తాడు.. ప్రతి సారీ ఆలోచించి చించి మళ్ళీ రిపైర్ చేయించటం.. మళ్ళీ 2 నెలల్లో పాడవటం..

ఇలా కాదని ఈసారి కొత్తది కొనేశాం. కొన్నప్పుడు షాపు వాళ్ళు లక్కీ డ్రా కూపన్లని మాకు ఒక నాలుగు కూపన్లు చేతిలో పెట్టారు. మొదటి బహుమతి 50 గ్రా బంగారం, రెండవ బహుమతి అరకిలో వెండి, మూడవది.. 10 గ్రా బంగారం.. అలాగ.. మనకొస్తుందా చస్తుందా, ఎన్ని చూశాం అని నిర్లిప్తం గా పక్కన పడేశాం. వాటిని మా పని అమ్మాయి తీసి పిల్లల పాత కాగితాలలో పడేసింది. మొన్న శ్రావణ శుక్రవారం మాంచి కన్నడ హీరో తో లక్కీ డ్రా చేసి చూస్తే మా పేరు ఉందిట. వాళ్ళు ఫోన్ చేసారు.

పండగ పూటా ఇలా లక్ష్మీ దేవి వచ్చిందని మా అత్తగారు తెగ సంబర పడ్డారు. మాకు ఫస్ట్ ప్రైజో, సెకండ్ ప్రైజో అర్థం కాలేదు. అప్పటికప్పుడు షాప్ కి ఫోన్ చేసి కనుక్కుంటే సెకండ్ ప్రైజ్ అని అర్థమైంది. ఆ కూపన్లెక్కడున్నాయో అస్సలూ గుర్తుకు రాలేదు!!! ఒక అరగంట నీది తప్పంటే.. నీ బుద్ధే చేలో మేయటానికెళ్ళిందని ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఇల్లంతా వెతుక్కుంటుంటే.. మా పనమ్మాయి చటుక్కున తీసి ఇచ్చింది.

అర కిలో వెండంటే మాటలా? ఎంతుంటుందో అని గబగబా ఒకళ్ళు పేపర్, ఇంకోళ్ళు లప్పు టప్పు (లాప్ టాప్ కి మేం ముద్దుగా తెలుగు లో పిలుచుకునే పేరు లెండి) తీసి ఆబగా ఆశగా ఎన్ని లక్షలుంటుందో అని చూస్తే దగ్గర దగ్గర 30 వేలట. కాస్త డిజపాయింట్ అయ్యాం లెండి. అంటే దాదాపు 15 వేలన్నమాట. పోన్లే "దంచినమ్మకి బొక్కినంత" అని సరిపెట్టుకున్నాం.

ఈ వార్త తెలిసేటప్పటికి బయటకి వచ్చి ఎవరెవరికి చెప్దామా అని బయటకొచ్చేటప్పటికి పేరంటాళ్ళంతా తలుపులేసేసుకున్నారు. మరీ తలుపులు కొట్టి ప్రత్యేకం గా చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి? .. ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్దవారు రాత్రి అన్నం తిన్నాక నడక కి వచ్చినట్టున్నారు. సాధ్యమైనంత కాజువల్ గా నడుస్తూ వాళ్ళ దగ్గరకి రాగానే.. ఏదో ఒక విషయం మీద పలకరించి వాళ్ళకి విషయం చెప్పేద్దాం అని.

సాధ్యమైనంత వరకూ లేజీ గా నడుస్తున్నట్టు నటిస్తూ వెళ్తున్నాం.. వాళ్ళు మా దగ్గరకొచ్చేటప్పటికి అకస్మాత్తు గా 'మాహా మాహా..మహా మహా మహా' అని పాట రావటం మొదలుపెట్టింది. బిత్తరపోయి చూసేటప్పటికి పాపం వృద్ధ దంపతులు.. ఇబ్బంది గా మొహం పెట్టారు. వాళ్ళ రింగ్ టోనట. ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోయారు. "అయ్యో బంగారం లాంటి చాన్స్ మిస్సయ్యాం" అనుకుని.. ముందుకెళ్ళి చూస్తే పిట్ట లేదు రోడ్ మీద.

సరే ఫోన్ చేసి చెప్పవచ్చు గా.. అనుకుని.. 'ఈ వీకెండ్ ఏదైనా హోం వర్క్ ఉందా పిల్లలకి ?', ' మొన్నీమధ్య వైరల్ జ్వరాలన్నారు ఇప్పుడు బాగున్నారా? " , "మీ తమ్ముడి పెళ్ళి అయిందన్నావు బాగా అయ్యిందా?", "మా ఆడపడచుకి చీర కొందామనుకుంటున్నాను, దగ్గర్లో మంచి బట్టల షాప్ ఎక్కడుంది?', "మొన్న జాబ్ మారతానన్నారు ఏమైంది?" లాంటి సాకులతో ఫోన్ చేసి గర్వం గా అప్పుడే గుర్తొచ్చినట్టు విషయం అందరికీ చెప్పేశాం. మా ఆడపడచులకి తలా 10% ఇస్తాం అని వాగ్దానం చేసాం.

అమ్మయ్య కాస్త కడుపు ఉబ్బరం తగ్గింది అనుకుని ఆ వెండి తో మా అత్తగారు చెప్పినట్టు "కడ్డీల్లాగే లాకర్ లో ఉంచేసుకోవాలా?" మా అమ్మ చెప్పినట్టు "వెండి కంచం చేయించుకోవాలా" అని తనివి తీరా వాదించుకుని పడుకుని లేచి షాప్ కి పరిగెత్తాం. 11 గంటలకి తాళాలు తీసి వాకిలి చిమ్ముతున్నారు. 'రండి రండి ' అని ఆదరం గా పిలిచిన వాళ్ళు.. విషయం తెలియగానే..'సరే కూర్చుని తగలడండి.. మా ఓనర్ వస్తాడూ అన్న లుక్కిచ్చి తమ పని తాము చూసుకోసాగారు. కాసేపాగి ఓనర్ సోమవారం వస్తాడు వెళ్ళండన్నారు.

సోమవారానికి మా కాలనీ అంతా చెప్పేసాం, మా వారి ఆఫీస్ లోనూ, నా ఆఫీస్ లోనూ అందరికీ చెప్పి అందరి కళ్ళల్లో ఆశ్చర్యం, లైట్ గా ఈర్ష్య చూసి తెగ ఆనందించాం. మా గ్రూప్ లో వాళ్ళు మమ్మల్ని కాఫీ డే లో పార్టీ కి తీసుకెళ్తావా చస్తావా? అని పీకల మీద కూర్చోవటం తో సాయంత్రం 14 మంది ని తీసుకుని ఆఫీస్ పక్కన దానికి తీసుకెళ్ళాను. కాఫీ, సండేలూ వగైరా ఆర్డర్ చేసారు అందరూ.. 'ఆహా నీ అదృష్టమే అదృష్టం.. పెట్టి పుట్టావు ' లాంటి మాటలతో నన్ను పొగిడి తబ్బిబ్బు చేసేసారు. గాలిలోకెక్కడికో వెళ్ళిపోయిన నన్ను ఒక్క దెబ్బలో భూమి కి పడేసింది బిల్లు. 1500 చిల్లర అయింది.

2 కిలోల స్వీట్ తెచ్చి పెట్టాను ఎందుకైనా మంచిదని. మా కాంప్లెక్స్ లో వాళ్ళు ..'ఆహా కృష్ణా.. పార్టీ " అంటూ వచ్చిన వారికి చేతిలో స్వీటు ముక్క పెట్టి సంతోషం పంచుకున్నాము. అక్కడో ఐదు వందలకి తైలం వదిలింది.

షాప్ వాళ్ళు కంప్యూటర్ లో చూసి 2 పాస్ పోర్ట్ ఫొటోలూ, పాన్ కార్డ్ కాపీలూ, 4,500 రూపాయల కాష్ తెచ్చి కట్టమన్నారు. 'అదేంటి? ' అంటే.. 'టాక్శ్ ' అన్నాడు.. 'ఈ మాత్రం తెలీదా? ' అన్నట్టు జాలిగా మొహం పెట్టి. మొత్తం కొన్న వెండికి విలువ చూస్తే 14 వేల చిల్లర. దీంట్లో ఐదు వేలు టాక్స్ కెళ్తే 9 వేల లాభం. అసలు కడదామా వద్దా అని తర్కించుకుని.. అసలే అందరికీ చెప్పేసుకున్నాం కొని తీరాల్సిందే అన్న నిర్ణయానికొచ్చి ఏడుపు ముఖమేసుకుని ఐదు వేలూ కట్టేసాం. (500 ఏమో వేరే ఖర్చులకి ..) రోకట్లో తల పెట్టాక రోకలి పోటులకి భయపడితే ఎలా?

'ఏదీ వెండి? ' అని అడిగితే 'అమ్మా! అంత వీజీ గా ఎలా ఇస్తాం? మా షాప్ వాళ్ళ ఫంక్షన్ ఉంటుంది దాంట్లో స్టేజ్ మీద పిలిచి ఇస్తారు..' అన్నారు. వెర్రి మొహాలేసుకుని ఇంటికి వచ్చి పడ్డాం. ఈ లోగా మా ఆడపడచులకి .. తలా వెయ్యీ ఇచ్చి మీకు కావలసిన వెండి వస్తువు కొనుక్కోండి అని ఇచ్చేసాం.

అంత ఫంక్షన్ లో కట్టుకోవటానికి మంచి చీర ఉంటే బాగుంటుంది కదా.. నావన్నీ సాదా సీదా గా ఉన్నాయి లేదా పాత ఫాషన్ వి. అని కొత్త పట్టు చీర అవీ తీసుకున్నాం. చెప్పొద్దూ.. మూడు వేలకి ఎంత చక్కటి చీర

నేను కొనుక్కుంటూ పిల్లలకి కొనకపోవటమేమిటని వాళ్ళకీ కొత్త బట్టలు కొన్నాం, 5 వేలు బట్టలకైంది అందరికీ. మా పనమ్మాయి 'మాడం.. మీరు అలా గాలికి వదిలేస్తే నేనే కదా పెట్టాను పక్కన జాగ్రత్త గా..' మీరు నాకు ఏం కొంటారు? అని అడిగింది. అదీ నిజమే అని తనకి 500 ఇచ్చి ఏదైనా చీర కొనుక్కొమ్మన్నాను.

ఫంక్షన్ అయింది వెండి కడ్డీలూ దొరికాయి. సంతోషం గా ఇంటికి చేరాం. వారం గడిచేటప్పటికి కాస్త రంగు లో మార్పు వచ్చినట్టనిపించింది. వెండి అంటే ఇది మామూలే అని ఊరుకున్నాం. నాకే మనసాగక కంసాలి దగ్గరకెళ్ళి చూపించాను. 'పర్వాలేదు.. మరీ నాసి రకం కాదు ' అన్నాడు. కానీ.. వేరే లోహం కలిసిందన్నాడు. 'ఏం చేస్తాం?' ఎవ్వరితోనూ అనకుండా తేలు కుట్టిన దొంగల్లా కాం గా ఉండిపోయాం. వెండి చేతికొచ్చేలోపల ఈ విషయం లో మేము చేసిన ఖర్చు తలచుకుంటే.. అసలు ఖరీదుకి కాస్త ఎక్కువే అయినట్టు తేలింది.

ఈ కథకి కొసమెరుపేంటంటే.. ఆ షాప్ కి బెంగుళూరు లో 4-5 బ్రాంచిలున్నాయి. అన్నింటిలోనూ వెండి అందుకుంటూ మా ఫొటోలు పెట్టారు. తెలిస్న వారు కొందరు చూసి.. 'వావ్ ఈ విషయం మాకు చెప్పనే లేదే?' అని జెలస్ గా అంటుంటే.. మేము హి హి హి అని పైకి అంటూ, లోపల మాత్రం తెగ గింజుకుపోతున్నాం. మీరూ చెప్పకండే?

41 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

I like your frankness.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

అయ్యో!!!

nagarjuna said...

నేను నొటికి వెండి సీలు వేసుక్కుచున్నా......
బాబులు కృష్ణప్రియ గారు కొత్త వాషింగ్‌ మేషిను కొన్నారు, లక్కీ కూపన్ తీసుకున్నారు, లక్కీ డ్రా తీసారు. మరి వెండి కడ్డిలు వచ్చిన విషయం?-ఆ సంగతి నాకు తెలియదు నాయనా....

maha said...

(వదిన నువ్విది విన్నావా.అది సంగతి!!!!!!!!!!!.)........
అయ్యో కృష్ణప్రియ గారు నేనేవ్వరికి చెప్పలేదండి.....

భాస్కర రామి రెడ్డి said...

హ హ హ్హ.. పోన్లేండి మీరు పడ్డ శ్రమకు మరో పాలిపోయినట్టు తెల్లటి వెండి ఇస్తే ఏంబావుంటుందని కొద్దిగా రంగు పూసి వుంటారు.

ఆహో కృష్ణా అదృష్టమంటే మీదేనండి [ కొద్దిగా ఈర్ష కలుపుకోండి ] ఎంతైనా ఫ్రీగా పదిహేను వేలు కొట్టేసారు. మరి మాకు పార్టీ?

వేణూ శ్రీకాంత్ said...

కెవ్వ్.వ్.వ్.వ్.వ్.వ్.వ్. కేక, మల్లిక్ స్టైల్ లోనే :-)

Ramesh said...

కేస్ ఓడిన వాడు కొర్టులో ఏడిస్తే వచ్చిన వాడు ఇంటికి వచ్చి ఎడ్చాడట :-)
కలికాలఫు కష్ట సుఖాలు(రేపటి కష్టాలు) :-)

indrathinks said...

:) :) :)
Excellent..

KumarN said...

Hillarious!!!

Sravya Vattikuti said...

ముందు గా మీ అదృష్టానికి అభినందనలు . మీ మార్కు ఈ టపాలోని ప్రతి వాక్యం లోను కనపడుతుంది just I loved it.
ఇంతకూ మాకు పార్టీ ఎప్పుడు? (వెండి రంగు మారింది ఇట్టాంటి కారణాలతో మాకు సంభంధం లేదు :))

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

హహ్హ..హా.

Krishnapriya said...

@ గణేష్,
థాంక్స్! :)

@ లక్ష్మీ నారాయణ గారు,
:-( మరే..

@ నాగార్జునా, మహా,
చెప్తా మీ పని.. మీరెప్పుడైనా నాకు సీక్రెట్లు చెప్పినప్పుడు..

@ భాస్కర్ రామిరెడ్డి గారు,
అబ్బా.. మీరు ఎంత అండర్స్టాండింగ్ టైప్.. కాకపోతే.. ఆ షాప్ వాళ్ళ వైపు..
:-) థాంక్స్ అండీ. తప్పకుండా ఇస్తాను. బెంగుళూరుకొచ్చేప్పుడు ఒక్క ఈ మెయిల్ కొట్టండి..

@వేణూ శ్రీకాంత్,
హి హి హి.. మల్లిక్ స్టైల్లోనే.. చాలా థాంక్స్!!! :-)

Krishnapriya said...

@రమేష్,
కరెక్ట్ గా చెప్పారు :-) 'అగ్రహారం పోయినా లా తెలిసందయ్యా' అన్నాడట వెనకటికి ఎవడో.. అలాగ ఈ స్కీం ల గురించి తెలిసింది.

@ ఇంద్రథింక్స్,
:) ధన్యవాదాలు...

@ కుమార్, ఎన్,
చాలా థాంక్స్!

@ శ్రావ్య,
మీ అభినందనలకి థాంక్స్ అండీ.. భాస్కర్ గారికి చెప్పినట్టే.. బెంగుళూరు నగరానికి విచ్చేస్తుంటే ఒక్క ఈ మెయిల్ కొట్టండి.. పార్టీ తప్పక ఇస్తాను.

స్వగతం.. (అమ్మయ్య.. నేను కొత్తగా కనిపెట్టిన చుంబరస్కా టల్లోస్ వంట ఇంట్లో ఎలాగూ ఎవ్వరూ తినమని విసుక్కుంటున్నారు. శ్రావ్య, భాస్కర్ గార్లు వచ్చినప్పుడు వండేసి ఇంట్లో నే పార్టీ ఇచ్చేస్తా..)

Weekend Politician said...

Hilarious...తాలింపు కొంచెం ఎక్కువయ్యింది. అయినా పర్లేదు హాస్యం కోసమేగా..:)

హరే కృష్ణ said...

hmmm
కేక పెట్టించారు :D

మా అభిమాన బ్లాగర్ అరకిలో వెండి గెలుచుకున్నారు ఇక్కడివరకు చెప్పొచ్చా :)

బ్లాగ్ లోకంలో చుంబరస్కా,టల్లోస్ వంటలకు విస్తృత ప్రచారం మేము చేస్తాం మీరు ఒక పోస్ట్ రాస్తే :)
చుంబరస్కా,టల్లోస్ వంటల వీరాభిమానులు!

శిశిర said...

>>>>'ఏం చేస్తాం?' ఎవ్వరితోనూ అనకుండా తేలు కుట్టిన దొంగల్లా కాం గా ఉండిపోయాం.
మాతో అనేశారు కదా :) btw, నేను మీ అభిమానినండి.

Sheshu Kumar Inguva said...

బావుందండి మీ గిఫ్ట్ సంబరాలు ఉత్సవాలు. మొత్తానికి వెండితో ఏమి చేసారు? వెండి కంచం?

సవ్వడి said...

baagundi. navvincaaru.

శివరంజని said...

మల్లిక్ హీరోలా చిలిపి గా చెవుల్దాకా నవ్వుతూ " నాలుగు వేలవుతుంది సార్!!చెవుల్దాకా నవ్వడం ఎలా అబ్బా ? బావుందండి ...ఇంతకూ మాకు పార్టీ ఎప్పుడు? (వెండి రంగు మారింది ఇట్టాంటి కారణాలతో మాకు సంభంధం లేదు :))

sunita said...

hahaha! But a serious issue with a light note.

Sravya Vattikuti said...

హైదరాబాద్ కన్నా బెంగుళూరు కి టికెట్ రేటు తక్కువుంది పైగా కృష్ణ ప్రియ గారు పార్టీ ఇస్తానన్నారు కదా ఇసారి బెంగళూరు కి వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ కి వెళ్దామని కక్కుర్తి పడ్డా, కాన్సిల్ కాన్సిల్ . వామ్మో ఏదో నా అదృష్టం బాగుండీ దేవుడు మీ మనసులో మాట తెలుసుకోగలిగే శక్తి ఇచ్చాడు కాబట్టి గండం గేట్టెకింది . j/k

నీహారిక said...

మీరు చెప్పిన విధానం ఉంది చూసారూ,ఎంత నవ్వు వచ్చిందో,భలే explain చేసారు.Sooooooooooooooooper.

Krishnapriya said...

@ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
:-) థాంక్స్

@ వీకెండ్ పొలిటీషియన్,
థాంక్స్, తాళింపు ఎక్కువైంది అంటారా? అంటే ఏంటి మీ ఉద్దేశ్యం? నేను చెప్పిన కథ లో కల్పన పాలు ఎక్కువైందనా? :-)

@ హరేకృష్ణా,
కంట తడి పెట్టించావయ్యా! రాఖీ కట్టిన తమ్ముడే నేను ప్రేమతో వండిన చుంబరస్కా టల్లోస్ తినకుండా డబల్ ముడుపు చెప్పించి బయట పడితే..తాళి కట్టిన భర్తే తప్పించుకు తిరిగితే... తల్లి లా చూడాల్సిన అత్తగారే..అనారోగ్యం నటించి తప్పుకుంటే.. నిర్మొహమాటం గా దాని మొహం కూడా చూడకుండా పిల్లలు పరుగులెడితే.. నీవొక్కడివేనయ్యా అభిమానాన్ని ప్రదర్శించినది!!! బెంగుళూరు కొస్తే తప్పక స్వయంగా చేసిపెడతా. టపా కూడా త్వరలో రాస్తా..అభిమానులని నిరాశపరచేంత కఠిన హృదయం లేదయ్యా ఈ క్రిష్ణక్కయ్యకి... :-)

Krishnapriya said...

@ శిశిర,
ధన్యవాదాలు. మీరూ మేమూ ఒకటే కదా అని చెప్పేశా :-)

@ శేషుకుమార్ ఇంగువ,
థాంక్సండీ.. ముందర "మా అమ్మ చెప్పినట్టు కడ్డీల్లా ఉంచేద్దాం" అని ఆయనా, "ఇంకా నయం మా అమ్మ చెప్పినట్టు కంచం చేయించి తీరాల్సిందే" అని నేనూ .. కానీ రంగు మారాక, అభిప్రాయమూ మారి ఇప్పుడు రివర్స్ లో.. "పాపం అత్తగారు చెప్పినట్టు కడ్డీల్లాగే ఉంచేద్దామండీ" అని నేను,.. .. "అయ్యో.. మీ అమ్మ చెప్పినట్టు విందాం ఈ సారికి.. కంచం చేయిద్దాం అని ఆయనా !! :-)
Just kidding..
ఇంకా ఏమీ ఆలోచించలేదు..

Krishnapriya said...

@ సవ్వడి,
థాంక్స్!

@ శివరంజని,
వివేక్ ఒబ్రాయ్ ని చూశారా నవ్వటం.. నాకెప్పుడూ మల్లిక్ ఇలాంటి నవ్వునే అలా చెప్పారేమో అనిపిస్తుంది :-) పార్టీ ఎప్పుడు కావాలంటే అప్పుడే.. వంటల చాఇస్ మాత్రం నాదే .. మా ఇంట్లోనే జరగాలి అదీ షరతు.. అన్నట్టు మీరేంటి? కామెంట్ల పండగ చేసుకుంటున్నట్టున్నారు. :-)

Krishnapriya said...

@ సునీత,
థాంక్స్!
@ శ్రావ్య,
భయపడవద్దు. చుంబరస్కా టల్లోస్ కి అభిమాన సంఘాలు కూడా ఏర్పడుతుంటే.. మీకెందుకు భయం..? నేనున్నాను, హరేకృష్ణ ఉన్నారు.. మీకేదైనా అయితే గబగబా డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళటానికి :-)
On a serious note, When you are in Bangalore, you are welcome!

@ నీహారిక,
ధన్యవాదాలు..

Bulusu Subrahmanyam said...

బాగా చెప్పారు. అదేమిటో మీ అవస్థ చూస్తే జాలి కలగడం లేదు సరే నవ్వు ఎందుకు వస్తోందో మాకు?

C.ఉమాదేవి said...

వ్యాపారం పెంచుకునే దిశలో రకరకాల ప్రకటనలు,ఉచిత బహుమతులు,లాటరీలు ప్రవేశపెట్టే ఇలాంటి సంస్థలు వినియోగదారులను నమ్మకంతో గెలిచిననాడే నిజమైన,న్యాయమైన వ్యాపారం చేస్తున్నట్టు లెక్క.మనసులోని భావనలను మధుర మధురంగా,చతురత నింపిన హాస్యగుళికల్లా పేర్చారు.వాటిని స్వీకరించడమేకాదు,అంతర్లీనంగా ఉన్న హెచ్చరిక కూడా అందుకున్నాం.

భాస్కర రామి రెడ్డి said...

అయ్యో నేను అండర్స్టాండింగ్ టైప్ అని ఆ షాపోళ్ళ అకౌంట్ లో వేసారా?? ప్చ్..

చుంబరస్కా,టల్లోస్ తినడం కోసమన్నా ఈసారి బెంగుళూరు రావాల్సిందే :-)

Krishnapriya said...

@ బులుసు సుబ్రమణ్యం గారికి,
:-) థాంక్స్ కొద్దిగా కూడా జాలి కలగట్లేదా? హ్మ్మ్..

@ ఉమాదేవి గారు,
మీరెంత అందం గా పెట్టారు మీ వ్యాఖ్య.. ఎంతైనా వ్యాసకర్త/రచయిత్రి/కవయిత్రి కదా.. థాంక్స్ అండీ..

@ భాస్కర రామిరెడ్డి గారు,
:-) ఈ మాత్రం ఇంటరెస్ట్ చూపించారు చాలు, ఇక ఆగేది లేదు.. ఇలాంటి బోల్డు వంటకాలు 2 రోజులు సెలవు పెట్టైనా చేసి రెడీ గా ఉంటాను మీరు వచ్చేసరికి..

కృష్ణప్రియ/

Venkat said...

krishnapriya garu..........
Kekaaaaaaaaaaaaaaa :)

వీరుభొట్ల వెంకట గణేష్ said...

___________________________
మనసులోని భావనలను మధుర మధురంగా,చతురత నింపిన హాస్యగుళికల్లా పేర్చారు.వాటిని స్వీకరించడమేకాదు,అంతర్లీనంగా ఉన్న హెచ్చరిక కూడా అందుకున్నాం.
___________________________
Truly said. Now in majority of the fields there is no ethics & transparency.

Nice comment by Umadevi Gaaru.

C.ఉమాదేవి said...

బ్లాగ్ పోస్ట్ రాసినప్పుడు అందిన కామెంట్లు మరిన్నిపోస్టులు రాయడానికి ప్రేరణలవుతాయి.నేను రాసిన వ్యాఖ్య మీకు,గణేష్ గారికి నచ్చినందుకు ధన్యవాదములు.

ఆత్రేయ said...

చాలా బాగున్ది .. కానీ జాగ్రత కూదలి వాలు ఫొనె చెసి ద్రా లొ బెస్త్ పొస్త్ గా ఎమ్పిక అయిన్ది అన్తె కధ మొదతికి వస్థున్ది...

Krishnapriya said...

@ ఆత్రేయ గారు,
అబ్బో అలా కూడా చెప్తారా? ఐతే ఉండండి గబ గబా చూసుకోవాలి మిస్స్ డ్ కాల్స్ ఏమైనా ఉన్నాయేమో.. మళ్ళీ లేటైతే.. అర్థరాత్రి యోగక్షేమాలు అడిగే సాకు మీద ఫోన్ చేస్తే బాగుండదు, పది మందికీ చెప్పుకోవటానిని.. :-)

థాంక్స్,
కృష్ణప్రియ/

భావన said...

హి హి హి హ హ హ ... పార్టీ ఎప్పుడు మరి ఐతే. ;-)

Krishnapriya said...

:-) మీ ధైర్యాన్ని బట్టి .. బెంగుళూరు వచ్చినప్పుడు ..

శేషేంద్ర సాయి said...

ఆదిశ్వర్ ఆ అండి అది ???

Krishnapriya said...

కాదండీ.. 'పాయ్ ఇంటర్నేషనల్ '

sunday.aj@gmail.com said...

mee *ammo yemi ruchi ni 23.03.14 aadivaaram aandhrajyothi sanchikalo sankhipthamga prachuristhunnamu.
-editor, andhrajyothi

Anonymous said...

mee *ammo yemi ruchi ni 23.03.14 aadivaaram aandhrajyothi sanchikalo sankhipthamga prachuristhunnamu.
-editor, andhrajyothi

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;