Wednesday, March 30, 2011

గేటెడ్ కమ్యూనిటీ కథలు - పండగ భోజనం ఏర్పాట్లు..



దీపావళి పండగ.. (ఇదేంట్రా.. బ్రహ్మానందం అదేదో సినిమాలో చేసినట్టు.. హోలీ పండగప్పుడు దీపావళి కథ మొదలెడుతుందీవిడా.. అనుకుంటున్నారా? మనం కాస్త స్లో అన్నమాట!) వాళ్ల వాళ్ల ఇండ్లల్లో  ఏం చేసుకుంటున్నారో తెలియదు కానీ,.. కాలనీ లో మాత్రం  సామూహికంగా ఝం ఝం లాడించేయాలని నిర్ణయం జరిగిపోయింది. కాలనీ కల్చరల్ కమిటీ లో కొత్త గా ఇంట్లోకి దిగిన మాంచి ఉత్సాహమైన అమ్మాయి చేరింది.   పిల్లా, జెల్లా లేరేమో.. సమయం కూడా బాగానే ఉన్నట్టుంది...

ఆ అమ్మాయి ఉత్సాహం చూసి .... మాలాంటి వాళ్ళకీ కాస్త ప్రేరణ కలిగి ప్లానింగ్ మొదలు పెట్టేసాం. నాకు సాధారణం గా అంత టైం/ఇంటరెస్ట్  ఉండటం అరుదు కానీ.. ఒకళ్లు కాస్త ముందుకు రావటం తో.. వెనక ఉండి చేయ గలిగినంత చేయచ్చని.. అదీ గాక మరి ఫస్ట్ లేడీ కదా మరి నాకొక ఇజ్జత్, గట్రా ఉండాలి కదా.. మా వారి ప్రెసిడెంట్ గిరీ లో .. సాంస్కృతపరం గా కూడా పేరు గడించవచ్చు..


ఇంకేం? ఆఫీస్ నుండి వచ్చాక పిల్లలు ఆటలకి బయల్దేరుతూనే. నేనూ కల్చరల్ కమిటీ మీటింగ్ కి వెళ్లాను.. ఇంట్లో అంట్లు తర్వాతైనా తోమచ్చు.. కాలనీ లో కాస్త మంచిపేరు తెచ్చుకుంటే ఎంత డాబు గా ఉంటుంది?  "అబ్బా..కృష్ణ గారు ఎంత ఆక్టివ్.. ఇల్లూ, పిల్లలూ, ఆఫీసూ  మానేజ్ చేసుకుంటూనే.. కాలనీ లో దీపావళి వేడుకలు ఎంత అద్భుతం గా జరిపించారు? " ఆహా.. ఆలోచనల తోనే ఒళ్లు పులకరించిపోయింది..  రాత్రి ఆఫీస్ మీటింగ్ లోపల చేయాల్సిన వంట, తిండి, పిల్లల హోంవర్కూ..మీటింగ్ లో కి కావలసిన నాలుగు స్లైడ్లూ.. అబ్బే... దీపావళి ధమాకా ఆలోచనల వీటో ఓటు ముందు వీగిపోయాయి...


మనం అసలు ఏది మొదలు పెట్టినా , మొదట ప్లాన్ చేసినా తిండేగా? అసలు ఆ మీటింగ్ లోకి ఏం తినాలో కూడా ఫోన్ల ద్వారా తెగ చర్చలు జరిపి.. ఫలితాలు రాక.. కావలసిన వాళ్లు ఎవరి చాయ్/కాఫీ వాళ్లే తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకునేటప్పటికే చావు తప్పి కన్ను  లొట్ట పోయినంత పరిస్థితి.. ఏర్పడింది...అలాంటిది నలభై ఇళ్ల వారు చేరి పండగ భోజనం ఏం తినాలో చర్చించాలంటే ఎంత కాంప్లెక్స్?



"పండగ భోజనాల బాధ్యత ఎవరు తీసుకుంటారు? కృష్ణాజీ ఆప్ లేంగే క్యా? " అని అడగ్గానే.. ..రోజంతా ఆఫీస్ లో ఏదో కస్టమర్ ఇష్యూ తో  కొట్టుకోవటం వల్ల ఏర్పడిన మతి భ్రమణమో,  ఏం జన్మలో ఏం పాపం చేసానో..  (అంటే ఈ జన్మ లో చేయలేదని కాదు.. వీటి ఎఫెక్ట్ ఇంకో రెండు మూడు జన్మలదాకా..  రాదని ఒక పిచ్చి నమ్మకం.. అదిచ్చిన ధైర్యం! ) దర్పం గా 'ఓకే' అని తల పైకీ కిందకీ స్టైల్ గా ఊపుతూ చూసాను..అందరివంకా.. 



కొందరు శ్రేయోభిలాషుల కళ్లల్లో జాలీ,  నేనంటే విసుగు, చిరాకు ల్లాంటి భావాలున్న ఉన్న కొందరి మొహాల్లో.. టీవీ సీరియల్ కారక్టర్ల మొహాల్లో లాంటి వర్ణించలేని ఫీలింగ్ చూసా.. ఎందుకో ఒక్క క్షణం కొద్దిగా గుగుర్పాటు లాంటిది వచ్చింది.. ( రాం గోపాల్ వర్మ షోలే చూసాక వచ్చిన భావం లాంటిది )  కానీ.. 'భోజనాలదేముందీ? నాలుగు హోటళ్లు చూసి ఏదో ఒక దాంట్లో ఆర్డర్ చేసేయటమే.. మనమేమైనా గుండిగలు మోయాలా.  గానుగలు తిప్పాలా? " అని నా ఆలోచనలని తిప్పి కొట్టి.. ఇంటికి నడిచా..


వారాంతం దాకా అసలు పండగ గురించి ఆలోచనలు రాలేదు.. అసలు అలాంటి ఆలోచన వచ్చినట్టు తెలిసినా.. మా బాసాసురుడు ఇంకొంచం పని ఇచ్చి ఆ కొద్ది తీరిక సమయానికీ కూడా పని చెప్పటానికి సిద్ధం గా ఉన్నారాయే...  శుక్రవారం సాయంత్రం కార్ దిగి లోపలకి వస్తుంటే.. పండగ కి ఎంటర్టైన్మెంట్ బాధ్యత తీసుకున్నావిడ హడావిడి గా నలుగురినేసుకుని నడుస్తుండటం కనిపించింది.. పలకరింపుగా నవ్వా..


ఆవిడ అరనిమిషం ఆగి 'హాయి కృష్ణాజీ. ఎలా అవుతోంది మీ ప్రిపరేషన్? రెండు డాన్సులూ, ఒక నాటకం, స్కిట్, బింగో గేం ప్లాన్ చేశా.. సామూహిక పూజా, ముగ్గులూ,.. ఏర్పాటు చేశా.. అలాగే పాటలూ, ఫాషన్ షో కూడా పెడుతున్నా..  హాండీ క్రాఫ్ట్ స్టాల్ లాంటిది కూడా ట్రై చేస్తున్నా!!" అంది.. నా గుండె లో రాయి పడింది. 'వామ్మో.. నేను అసలు పండగ గురించే ఆలోచించలేదు.. చచ్చాన్రా!!! ' అని మనసులో అనుకుని.. పైకి మాత్రం గంభీరం గా.. 'యా.. కన్సిడరింగ్ వేరియస్ ఆప్షన్స్ యూ నో..' అన్నాను.. ఆవిడ ..'ఓకే..' అని వెళ్ళింది..


సరే.. ఇక లాభం లేదని శనివారం మొదలు పెట్టాను నా డిన్నర్ ప్లానింగ్.. మనమే అంతా ఎలా నిర్ణయిస్తాం? కాస్త అందర్నీ కనుక్కుందాం అని రెండో నంబర్ ఆవిడ కి ఫోన్ కొట్టా..  " ప్లేట్ 250 Rs కి తక్కువ అయితే మేము రాము డిన్నర్ కి .. ఆగస్ట్ 15 కి సొసైటీ లో సెలెబ్రేషన్ అప్పుడు మాకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఛీప్ గా పెడితే..మేము రాము..' అంది.   'ఓహ్.. ఖరీదైన ప్లేట్ ఐతే శుచికరం గా ఉంటుందని ఎలా చెప్పగలం? ...' అని ఇంకా ఏదో అంటుండగా ఆవిడ.. 'మా నాన్న గారు  పేద్ద ఆఫీసర్... మాకు చిన్నప్పటి నుంచీ ఖరీదైన జీవితం అలవాటు..' అంది.. 'ఆహా.. చిన్నప్పటి నుండీ స్మార్ట్ గా ఉండంటం లాగా నా? ' అని మనసు లో అనుకుని.. పైకి మాత్రం వెర్రి నవ్వు నవ్వి.. "తర్వాత చెప్తా అప్ డేట్" అని చెప్పి  తర్వాతి నంబర్ తిప్పా.

ఆవిడ.. 'మానేజింగ్ కమిటీ పెట్టుకుంటుందా? మనమే పే చేయాలా? ' అని అడిగింది.. 'మనమే ..' అంటుండగానే.. 'మా చుట్టాలొస్తారు దీపావళి కి.. మేముండము.. ' అని ఆదరా బాదరా గా పెట్టేసింది..  'వార్నీ... అదే సొసైటీ పెడుతుంది ఖర్చు అంటే బంధు మిత్ర సపరివార సమేతం గా  వస్తుందేమో..' అనుకున్నా..


ఎక్కువ మందిని కనుక్కుంటున్న కొద్దీ.. ఒక్కొక్కళ్ళూ వాళ్ల అద్భుతమైన ఆలోచనలతో.. నాకు కళ్ళు తిరిగేలా చేసారు.  ఒకళ్లు అందరం.. ఇంటికొక వంట చొప్పున చేద్దామని, ఆ ఖర్చు తగ్గిద్దామనీ, ఇంకొకరు.. ప్లేట్ కి ౧౦౦ కి మించి పెట్టద్దని, వేరొకరు South Indian వంటలైతే రామని.. వేరొకరు రాత్రి పూట పూర్తి స్థాయి డిన్నర్ వేస్ట్.. అనీ.. ఒకళ్లు కారాలు ఎక్కువ అయితే తాము రామనీ.. ఒకళ్లు తమ పిల్లలు మహా అంటే ఒక్క రొట్టె ముక్క తింటారు కాబట్టి వారికి సెపరేట్ గా పే చెయమనీ.. 


తల  పట్టుకుని కూర్చున్నా.  ఇప్పుడర్థం అయింది...ఎవ్వరూ భోజనాల బాధ్యత ఎందుకు తీసుకోలేదో.. అయినా.. ఏదో ఏడాదికి ఒక్క సారి, ఒక్క పూట ఏదో తినే వంట గురించి ఇంత రభసా? పది మంది తో సరదా గా తినాలి కానీ...అని నాకు బాగా చనువు ఉన్న పక్కావిడ తో అంటే.. 'పది మంది తో మంచి తిండి తినాలి కదా.. దీపావళి అంటే దేశం లొ అందరికీ ఇంపార్టంటే... ఆ రోజు ఎవ్వరైనా.. మంచి విందు భోజనం చేయాలనుకుంటారు కదా..? ' అంది..  నేను బెంబేలెత్తాను. .


దానితో ఆడవాళ్లతో కాదు.. మగవారితో ఆడిగితే ఆఫీస్ లంచుల్లా కాస్త ఈజీ గా ఏదో ఒకటి అని వదిలేస్తారేమో.. అని కొంత మంది మగవారిని కదిపి చూశా..వాళ్లు మరీ.. 'మొదట ఎవరి దగ్గర కెళ్లారు? మా ఒపీనియన్ కోసం ముందర రాలేదు కాబట్టి నేనేమీ చెప్పను.. పదహారో నంబర్ ఆయన సౌత్ ఇండియన్ కావాలన్నాడా? అయితే.. పంజాబీ అయితే తప్ప నేను రాను.. అందరికీ ఆం లైన్ వోటింగ్ పెడితే? ' లాంటి సజెషన్లతో.. విసుగెత్తించారు. ఇక లాభం లేదని వెళ్లా.. పాత ప్రెసిడెంట్ గారింటికి..  ఆయన కూర్చుని  చిద్విలాసం గా నవ్వి.., 'పది మంది దగ్గరికెందు కెళ్లావు? మీరు ఒకరిద్దరు కోర్ కమిటీ చేసుకో.. లేకపోతే.. అంతా నీమీదకే వస్తుంది.. ఒకళ్లు ఉత్తర భారతీయులయ్యేట్టు, ఒకళ్లు గుజ్జు, లేక మరాఠీ వారయ్యేట్టు కూడా జాగ్రత్త పడు ' అని జాలి గా గీతోపదేశం చేశారు.  

ఒక ఆ ప్రయత్నాల్లో భాగం గా ఒక పంజాబీ అమ్మాయిని అడిగాను.. 'కోర్ ఫుడ్ కమిటీ లొ మెంబర్ గా ఉంటావా?' అని.. ఆ అమ్మాయి . 'ఉంటా.. కానీ.. నాకు మంచి పంజాబీ ఫుడ్ పెట్టిద్దాం.. నాకొక రెస్టారెంట్ తెలుసు.. అక్కడ పొద్దున్న ఫ్లైట్ లొ పనీర్ పంజాబ్ లోంచి వస్తుంది.. ఇంగువ దగ్గర్నించీ..అక్కడినుంచే తెప్పిస్తారు..multi cuisine andra family restaurants లాగా ఎవరో తెలుగు కుక్స్ తో వండించి ఇదే పంజాబీ భోజనం అని చెప్పరు..' అని పారవశ్యం గా చెప్తూ పోతోంది.. 'ఆహా.. ' అనుకుని... ఇక మధ్య దేశం వారి నడిగితే ఇంకే అభిప్రాయాలు చెప్తారో.. అని విరక్తి కలిగి.. ఇంటికి చేరాను. పండుగ చూస్తే నాలుగు రోజుల్లో..


 'అవునూ.. ఎందుకు నేను అందర్నీ ప్లీజ్.. చేయటానికి ప్రయత్నిస్తున్నాను? అసలు సాధ్యమేనా? మా ఇంట్లోనే ఒకళ్ల మాట ఒకరికి పడదు.. ' అని ఒక ఆలోచన వచ్చింది.. మన ఇంట్లో అంటే మన డబ్బు కాబట్టి మనమే బాధ్యత పడతాం కాబట్టి.. ధైర్యం గా ఖర్చు పెడతాం. మరి జనాల డబ్బు అంటే...value for money అందివ్వాలనే టెన్షన్ లో ఇదేంటి ఇంత కష్ట పడటం? అయినా..నా మీద బాధ్యత పెట్టినప్పుడు నా ఇష్టం.. మహా అంటే.. తిండి బాగాలేదు.. కృష్ణ టేస్ట్ చెత్త.. అంటారు.. దానితో..ఇక ముందు కూడా నాకు బాధ్యత అప్పగించరు.. కదా..  అని ఉత్సాహం గా.. ఐదేళ్లు దాటిన మనిషికి 150 Rs చొప్పున పండుగ భోజనం తిందామనుకునేవారు చెల్లించాలని నోటీస్ పంపి..  ఆఫీస్ పక్కన ఉన్న ఒక 'multi cuisine andhra family restaurant' లో రెండు నార్తూ, రెండు సౌతూ, రెండు సలాడ్లూ, రెండు స్వీట్లూ ఆర్డర్ చేసి గమ్మున ఊరుకున్నా.. 

అదేదో పాత హిందీ సినిమా లో దేవానంద్ లా దీపావళి డిన్నర్ అప్పుడు ఎవ్వరి కళ్ళల్లోకీ చూడకుండా..  నుదుటి వంకా.. జుట్టు వంకా.. చూస్తూ పిల్లలున్న వైపు గడిపేసా.. ఫీడ్ బాక్ ఇవ్వటానికి వచ్చేటప్పుడు.. రింగ్ టోన్ నొక్కేసి.. ఫోన్ వచ్చినట్టు నటించి.. 'చాలా కొంపలు ముంచే ఇష్యూ.. అటెండ్ అవకపోతే.. నా తల తీసే ప్రమాదం ఉందన్నంత బిల్డప్ ఇచ్చి బయట పడ్డా.. 


అబ్బా!!..నేను దొరుకుతానా? బాసులు, కో వర్కర్లు, చుట్టాలు,పిల్లల స్కూల్ టీచర్లు.. ఎందరి ఫీడ్ బాక్ లు సాధ్యమైతే తప్పించుకుని, తప్పదంటే విన్నట్టు నటించి.. ఇంకెప్పుడూ ఈ తప్పిదం చేయను అన్నట్టు ముఖం పెట్టి బయట పడలేదు? 

అప్పటికీ కొద్ది మంది పట్టు వదలని విక్రమార్కులు నా వెంట బడి మరీ ఇచ్చారనుకోండి..అబ్బే..మనం హర్ట్ అయితేగా.. కొద్ది మంది వెనకేం తిట్టుకున్నా, ముఖం మీద మాత్రం భోజనం బాగుందని ఇచ్చారు..  



కాకపోతే .. సెక్యూరిటీ, హౌజ్ కీపింగ్ వాళ్ల గురించి మర్చిపోవటం వల్లా.. కొంతమంది ఐదేళ్ల లోపల అని తల్లిదండ్రులు రాయించినా,.. కేటరర్ ఒప్పుకోకపోవటం వల్లా..  వాళ్లకి టిప్స్ సంగతి మర్చిపోవటం వల్లా.. దాదాపు 1500 Rs  ఖర్చు నా ఖాతా లో పడింది... చాల్లే దీనితోనయినా వదిలింది... ఇంక ఈ జన్మ కి వచ్చిన పేరూ, ప్రతిష్టా చాలు..  అని నిర్ణయించుకుని ఇదిగో..ఇలా ఊరూ పేరూ లేని మంద లో గొర్రె లాంటి జీవితం గడిపేస్తున్నా...


28 comments:

Sravya V said...

హ హ అసలు మిమల్ని అమాయకులని చేసి ఆడుకుంటున్నారండి మీ కాలనీ వాళ్ళు , నేనోచ్చాకా చెప్తా ఉండండి వాళ్ళ సంగతి :)

------------------------
అదేదో పాత హిందీ సినిమా లో దేవానంద్ లా దీపావళి డిన్నర్ అప్పుడు ఎవ్వరి కళ్ళల్లోకీ చూడకుండా.. నుదుటి వంకా.. జుట్టు వంకా.. చూస్తూ పిల్లలున్న వైపు గడిపేసా.. ఫీడ్ బాక్ ఇవ్వటానికి వచ్చేటప్పుడు.. రింగ్ టోన్ నొక్కేసి.. ఫోన్ వచ్చినట్టు నటించి..
---------------------
వామ్మో ఇది మాత్రం awesome :)
సరే దీపావళికి ఆ కష్టాలతో పాటు 1500 సమర్పించుకున్నారు ఫస్ట్ లేడీ గారు మరి ఉగాది కి ఏమీ లేదా ?

కృష్ణప్రియ said...

@శ్రావ్య,
:) ఉగాది కి కూడానా? సమస్యే లేదు.. మీరు వచ్చేయండి త్వరగా..

Unknown said...

బాగా రాసారు. పది తలలున్నచోత పది రకాల తలనెప్పులు ( ఇమామీ పెయిన్ బాం ఆడ్ లా). ఇలాంటివాటితొ తల బొప్పి కట్టీ కట్టీ ఇప్పుడు కమీటీ లొ ఉండమంటే నావల్ల కాదు అని డైరెక్ట్ గా అనలేక వెర్రి నవ్వులతోనూ, కుంటిసాకులతోనూ గడిపేస్తున్నా . మీరు మీ గేటెడ్ కమ్యూనిటీ కధలు పబ్లిష్ చెయ్యంది ఒక పుస్తకంగా, బావుంతాయి. లేదా ఒక పీ.డీ.ఏఫ్ అయినా చేసి అందరికీ పంపండి.. గుడ్ లక్. మీ అమ్మాయిలూ, పేరెంట్స్ బావున్నారా?

lalithag said...

పోస్టు గురించి ఏం రాయను!
ఇంకొన్ని సార్లు చదువుకుంటాను:)
ఈ సారి నాకు నచ్చింది:
"అంటే ఈ జన్మ లో చేయలేదని కాదు.. వీటి ఎఫెక్ట్ ఇంకో రెండు మూడు జన్మలదాకా.. రాదని ఒక పిచ్చి నమ్మకం.. అదిచ్చిన ధైర్యం! "

Jai Telangana said...

krishna-priya madam,

Namaste!.Manchigundandi mee katha.
Noti ko ruchi , purre ko budhidhi, ee prapamcham la. Mana desam la andaru mechchalante ge englisholla pizza no pettalnemo mari...

Sravanthi said...

Hello KrishnaPriya garu,

ఎంత హాయిగా ఉన్నాయండి మీ కబుర్లన్నీ! చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నాను.. Will keep following ur blog :-)

Sravanthi

Sravanthi said...

Hello Krishnapriya garu,

ఎంత హాయిగా ఉన్నాయండి మీ కబుర్లన్నీ! చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నాను.. You have very good sense of humour! Keep writing

Sravanthi

ఆత్రేయ said...

క్రిష్ణక్కాయ్
ఈ కమ్యూనిటీ సేవ ఎలాంటిదంటే
కోతి దూలము వాలము కధలాంటిది
బాగున్నాయి మీ పాట్లు.
మీ పోస్ట్ కి కామెంటుదామంటే మంటే అదే ఒకే బెద్ద పోస్టయ్యేలా ఉంది.
కాబట్టి అంచేత నా బ్లాగులో నే రాసుకుంటా (సీక్వెల్)

కృష్ణప్రియ said...

@ ప్రసీద గారు,

థాంక్స్.. మా అమ్మాయిలూ, పేరెంట్స్..మీకింకా గుర్తున్నారు.. చాలా సంతోషం గా ఉంది. మీరు పరిచయం అయ్యాక మీ రచనలు వాళ్ళు విధిగా చదువుతున్నారు.

@ లలిత,
:) థాంక్స్.. థాంక్స్..

@ Jai Telangana,

ధన్యవాదాలు.. అవును.. దేశాన్ని కలిపేవి పిజ్జా, లేస్ చిప్స్, కుర్కురే లు మాత్రమే అనిపిస్తోంది ఈమధ్య..


@ స్రవంతి,

థాంక్స్.. :) I am honoured!

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

కృష్ణప్రియ గారు,

ఎప్పట్లాగే మీ నెరేషన్ చాలా అసక్తిదాయకంగా ఉంది. మీ కాలనీ అయినా, దేశం అయినా...విభిన్న దృక్పథాలూ, ప్రాధాన్యతలూ, ఆలోచనల మధ్య సమన్వయం సాధించడమే అతి ముఖ్యమైన విషయం. అది ఎంత కష్టతరమైన విషయమో చక్కగా చెప్పారు.

btw,
>> ఊరూ పేరూ లేని మంద లో గొర్రె లాంటి జీవితం గడిపేస్తున్నా...

ఇది మాత్రం నమ్మశక్యంగా లేదు. మెగా బ్లాగర్ మందలో ఉండడమేంటి!!! Having read your blog, I think you will not be one of the crowd in your colony :)

Even if you disagree with me on this I know most of your readers will agree with me on this :))

Kathi Mahesh Kumar said...

సాధారణంగా అనిపించే జీవితంలోని ఘటనల్ని సునిశితహాస్యపు తాళింపు వేసి అందించడంలో మీకు మీరేసాటి. ఎంతైనా మెగా బ్లాగర్ బిరుదాంకితులు కాబట్టి ఆ విషయం మీకు తెలుసనుకోండి. మళ్ళీ ఆ మాట చెప్పడానికి నా వెనకాల చాలా మందే వెయింటింగనికూడా అనుకుంటాను.

I am actually more interested in the background of "గేటెడ్ కమ్యూనిటీ కథలు". ఒక నియోరిచ్ మిడిల్ క్లాస్ మల్టీ కల్చరల్ ఎన్విరాన్ మెంట్ నేపధ్యం నుంచీ వస్తున్న ఈ series కు సారస్వతంపరంగా ప్రాముఖ్యత ఉందని నాకు అనిపిస్తోంది. Are you planning to publish them as a book ! I am sure it has huge readership.

లత said...

నిజమేనండి అందర్నీ త్రుప్తిపరచలేము
మాకూ ఫ్లాట్స్ లో వినాయక చవితికి ఉంటుంది ఈ భోజనాల సందడి

కృష్ణప్రియ said...

@ ఆత్రేయ,

:) తప్పకుండా రాయండి. Eagerly waiting!

@ Weekend Politician,

థాంక్స్.. 'మెగా బ్లాగర్ ' .. LOL.. సరదాకి పాపం శ్రీకర్ రాసినది.. ఇక మందలో గొర్రె కాదంటారు... హ్మ్మ్.. 'బరువూ బాధ్యతా' టపా చదివార ఏంటి కొంప దీసి? :)


@ Kathi Mahesh Kumar,

ముందు గా మీ పొగడ్త కి ధన్యవాదాలు! పుస్తకం అంటే.. అదొక బాధ్యత.. మరియు రేపు అది చదివి 'ఈ పారా మా మీద రాసిందా? లేక అదిగో.. మమ్మల్ని బజార్ లో నిలబెట్టింది.. ' అని కాలనీ వాసులు అనుకునే ప్రమాదం ఉంది. నేను రాసిన విషయాలు స్థూలరూపం లో ప్రతి గేటెడ్ కమ్యూనిటీ కీ వర్తిస్తాయి.. కాకపోతే తాళింపు లోనే ఉంది తమాషా అంతా.. రాసిన దాంట్లో కల్పనా ఉంది! ఒకరిని ప్రత్యేకం గా ఉద్దేశ్యించి రాసినది కాకపోయినా బ్లాగ్ లో అయితే.. ఎవరికైనా అభ్యంతరాలుంటే కరెక్ట్ చేసుకోవచ్చు.. అని......

Sravya V said...

కృష్ణ ప్రియ గారు నిజం గానే ఈ కథలన్నీ ఒక pdf రూపం లో తెసుకొస్తే చదివే వాళ్లకి బావుంటుంది , పైగా పెద్ద కష్టం కూడా కాదు . మీరు ఒకే అంటే చెప్పండి ఒక ఈ -బుక్ చేద్దాం , మీకు హెల్ప్ అవసరం ఐతే నేను సిద్దం , హరేకృష్ణ వింటున్నారా :)

మీకు ఈ బుక్ ఐడియా రావంటే ఒక సారి ఇక్కడ చూడండి https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B5ZRf4xWjLOEMzVhMzM1YjAtYmRlYy00MGJkLTk3MWEtN2ViNGE3YzY4NDEx&hl=en&pli=౧



ఈ పోస్టు చూడండి http://harekrishna1.blogspot.com/2011/02/inception-pdfined.html

Anonymous said...

*'మెగా బ్లాగర్ ' .. సరదాకి పాపం శ్రీకర్ రాసినది..*

కృష్ణ ప్రియ గారు,
నేను సరదాకైతే మిమ్మల్ని మెగా లేడి రైటర్ అని అనలేదు. నా వరకు మీకు అది తగిన బిరుదే . నేను గత కొన్ని సంవత్సారాలుగా బ్లాగులు చదువుతున్నాను. నా మటుకు దాదాపు చాలా బ్లాగులు రోటిన్ అయిపోయాయి. కొన్ని బ్లాగులు తెలుగు భాష గురించి,సాహిత్యం, ఆధ్యాత్మికత, సైన్స్, ప్రకృతి,రాజకీయాలు,ఇజాలు,మీడియా, వంటలు, అభిరుచులు, వివిధ వాదాలు (హేతు,మానవ,దళిత) మొదలైనవి అన్ని కవర్ చేసేశారు. అవి ఎక్కువగా గతం గురించో లేక సమాజం లో జరిగే అన్యాయలగురించో, మనం(సంఘం, ప్రజలు) అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనే వాటి మీద రాసే వారు.
ఏ కొత్త బ్లాగరు వచ్చినా వారు రాసేవి కూడా ఈ కేటగిరిలోనికే వచ్చేవి. బ్లాగులు రెగులర్గా చదివేవారికి ఈ కొత్త బ్లాగులు పెద్దగా ఆసక్తి కలిగించ లేక పోతూండేవి. ఆ తరుణం లో మీరు కొత్త బ్లాగు పెట్టి రాయటం జరిగింది. అది నేను పైన చెప్పిన ఏ కేటగిరిలో మీ బ్లాగు రాదు. మీరు ఒక కొత్త కేటగిరిలో ఎంటర్ అయి మీ ముద్రను తెలుగు బ్లాగర్ల మీద వేశారు. అదే కాక మీరు కత్తి మహేష్ చెప్పినట్టుగా " సాధారణంగా అనిపించే జీవితంలోని ఘటనల్ని సునిశితహాస్యపు తాళింపు వేసి అందించడంలో మీకు మీరేసాటి. "
----------------------------------
మీరూ రాసే టపాలలో జీవితం మీద ఒక శ్రద్దాసక్తి కనిపిస్తుంది. జీవితం లో సాధారణంగా అనిపించే చిన్న చిన్న పనులను చేతనైనంత శ్రద్దగా చేయాలనుకోవటం, వాటి ఫలితాలను ఆనందించటం, తిరిగి మీ బ్లాగు ద్వారా ఆ విషయాలను అందరితో పంచుకోవటం. ఇదే కదా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి నిజమైన ఉదాహరణ.

Anonymous said...

గేటెడ్ కమ్యునిటి కథలలో మీరు కవర్ చేయవలసినవై ఇంకా చాలా ఉన్నాయి అని నేనను కొంటాను. ఇల్లు కొనేముందర చెప్పే స్విమింగ్ పూల్, జిం, కమ్యునిటి హాల్ మొద|| ఫేసిలిటిస్ ఎర్పాటు చేయటానికి చాలా మంది బిల్డర్లు వేనకడుగు వేయటం. వారి పై చర్య తీసుకోవటానికి కమ్యునిటి ప్రజలు జరిపే సభలు, సమావేశాలు. నీళ్ళు రాక పోవటం. లీఫ్ట్ పని చేయక పోవటం. ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క విధమైన సమస్యలు ఉంటాయి. ఇటువంటి వాటి మీద మీరు రాయాలి. మీ కమ్యునిటిలో ఇటువంటి అనుభవం లేక పోతే మీ మిత్రుల నుంచైనా వివరాలు సేకరించి రాస్తే బాగుంట్టుంది.
----------------------------------
ఈ కథలన్నిటిని కలిపి చదివితే పాఠకులకు రాజేంద్రప్రసాద్ ఏప్రిల్ 1 విడుదల సినేమా అంత వినోదాన్ని ఇస్తుంది. ఆసినేమాలో కథ మధ్యతరగతి ప్రజలు ఉండే కాలని చుట్టుతిరుగుతూ ఉంట్టుంది. మీ ఈ కథలు మహేష్ చెప్పినట్టు నియోరిచ్ మిడిల్ క్లాస్ మల్టీ కల్చరల్ ఎన్విరాన్ మెంట్ నేపధ్యం చుట్టూ తిరుగుతాయి.

కృష్ణప్రియ said...

@ లత,

అదే.. అందరినీ సంతృప్తి పరచటమనేంత కష్టమైన పని వేరొకటి లేదు...

@ శ్రావ్య,

హ్మ్.. తప్పకుండా చేద్దాం. ఇంకా ఒక 10-15 టాపిక్ లు ఉన్నాయి.. అవి స్లో గా వీలు దొరికినప్పుడల్లా కవర్ చేస్తాను (Between Job, kids etc etc..) ఇంక అందరికీ విసుగెత్తుతోంది అనే వరకూ రాసి.. చాప్టర్ల లా కన్సాలిడేట్ చేస్తాను..

@ శ్రీకర్,

చాలా చాలా థాంక్స్ మీ అభిమానానికి. మీరు చెప్పిన కొత్త కాటెగరీ లో నేను రాసి మెప్పిస్తున్నానని మీరు అనుకుంటే అది నా అదృష్టం గా భావిస్తున్నాను. నాకు మామూలు రోజూ వారీ విశేషాలు తప్ప నిజంగా ప్రత్యేకమైన విషయ జ్ఞానం తక్కువే. బ్లాగ్ అంటే మనకి తోచినది తోచినట్టు గా రాయచ్చనే ధైర్యంగా రాస్తున్నాను :)

కృష్ణప్రియ said...

@ శ్రీకర్,
మీ రెండవ కామెంట్ కి.. అవును.. నేను రాసేవీ.. పూర్తిగా అచ్చం గా మా కాలనీ కథలనే కాదు. కొందరు స్నేహితులూ, ఆఫీస్ లో నాకు తెలిసిన వారందరూ దాదాపు గా అపార్ట్ మెంట్ లలోనో.. ఇలాగ గేటెడ్ కమ్యూనిటీల్లోనో.. నివసిస్తున్నారు.. నా బ్లాగ్ పోస్టులకి స్నేహితుల అనుభవాలు కూడా కొద్దిగా వాడుకుంటూ రాస్తున్నాను.

ఆ.సౌమ్య said...

హహహహ బావుంది మీ భోజన సదుపాయ తాపత్రయం. నేనందుకే ఇలాటి వాటి జోలికి వెళ్ళను.ఎవరైనా దేనికైనా డబ్బులదిగారా.. వీలుంటే ఇచ్చేస్తా, ఎలా ఉన్నా ఏదో ఒకటి లాగించి వచ్చేస్తా అంతే.

అన్నట్టు గేటెడ్ కమ్యూనిటీ కథల pdf అవిడియా నాక్కూడా నచ్చింది...తయారుచెయ్యండి ఓ పుస్తకం, మేము చదివిపెడతాం.

కృష్ణప్రియ said...

@ సౌమ్య,
:-) ఏదో కీర్తి కోసం తాపత్రయం తో వచ్చిన తిప్పలు... ఇప్పుడు నేనూ అంతే.. మన బడ్జెట్ లో ఉన్నంత అడిగితే హాయిగా డబ్బు నసగ కుండా ఇవ్వటం.. ఏది నచ్చితే అది ఆనందం గా తిని రావటం....

తప్పకుండా.. pdf రూపం లోకి తెచ్చి.. మీరు చదివారా లేదా? అని స్పాట్ క్విజ్ లు కూడా నిర్వహించి చూస్తా.. (ఉదాహరణ కి.. కృష్ణప్రియ కి రెండవ నంబర్ ఓనర్ ఏమని చెప్పెను? ఎక్స్ ప్రెసిడెంట్ ఏమని చెప్పెను? ) లాంటివి..

Mauli said...

@LMW garu :)

ha ha .నేను మాత్రం చదువుతున్నంత సేపు Items ఎం పెట్టారా అని ఉత్సుకత తో చదివాను (చదివించారు)

అ౦దుకే మీరు మెగా బ్లాగరు :)

ఇక పుస్తకం అ౦టారా, ఎలాగు మీ autobiography వ్రాస్తారు కదా.అప్పుడు అనుబంధం గా వేయొచ్చులే ఇప్పుడె౦దుకు :)

కథాసాగర్ said...

నాకు తెలిసి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు మంచి ప్లానింగ్ ఉండాలండి బాబు..
లేకపోతే మొదటికే మోసం వస్తుంది..
అలాగే కమిటి మెంబెర్స్ ని ఎంచుకున్నప్పుడు కూడా చాల జాగ్రత్త గా వుండాలి..
కొందరు ఏదో అజమహిషి చేద్దామని వస్తారు..
కానీ ఆఖరి లో ఏది సవ్యంగా చేయకుండా మనల్ని నట్టేట ముంచేస్తారు..
మీకు కథ సమాప్తం లో 1500 Rs నష్టం కలిగించినట్టు..
చాల రోజుల తరువాత ఒక మంచి పోస్ట్ చదివాను..
ధన్యవాదాలు

PRADEEP said...

krishna priya garu bagunnayi andi

ప్రవీణ said...

enta bagundoo...

మాలా కుమార్ said...

ఎలాగైతే నేమి భోజన ఏర్పాట్లు చేయటమైతే వచ్చేసిందిగా :)

కృష్ణప్రియ said...

@ మౌళి ,

ఆటో బయోగ్రఫీ కి అనుబంధం.. :) ష్యూర్..

@ కథాసాగర్, ప్రదీప్, ప్రవీణ
థాంక్స్!


@ మాలగారు,
అవునండీ..అది నిజం. భోజనమవగానే.. చెవి లో ఇయర్ ప్లగ్స్..పెట్టేసుకోవటమే ..

buddhamurali said...

baagundandi

కృష్ణప్రియ said...

@ బుద్దా మురళి గారు,

థాంక్స్!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;