Sunday, October 3, 2010

గుండె ఊసులు.. (అబ్బే రొమాంటిక్ కథ కాదు.. )

నాన్నగారికి బీ పీ తగ్గట్లేదని డాక్టర్ కి చూపిస్తే హార్ట్ ప్రాబ్లం, రక్తనాళాల్లో బ్లాకులున్నాయి,  ఏంజియోప్లాస్టీ చేయాలి అన్నారని చెప్పగానే విపరీతమైన దిగులు వేసింది. యుద్ధ ప్రాతిపదిక మీద నేనూ, మా తమ్ముడూ వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నా రెక్కలు కట్టుకుని వాలిపోయాం. చెల్లీ, మరిదిగారూ ఇల్లూ, వాకిలీ వదిలేసి హాస్పిటల్, ఆఫీసూ, అమ్మా వాళ్ళ ఇల్లూ తిరగటం మొదలుపెట్టారు. ఒక పక్క మా అత్తయ్యలు దిగిపోయారు. మా బాబాయి పిల్లలు ఊర్లోనే ఉంటారు, వాళ్ళూ పొద్దున్నా సాయంత్రం ఫోన్లు చేసి ఊదరగొట్టారు. . ఊళ్ళోనే 2 కి మీ దూరం లో ఉండే అమ్మమ్మ అమ్మకి సపోర్ట్ గా వచ్చేసింది. పెద్దమ్మ కుటుంబం ఇంచుమించు ఇంట్లోనే ఉంటున్నట్టు లెక్క.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇల్లు కళ కళలాడిపోయింది. వంటలు,వార్పులు, ఆ రిపోర్టుల  గురించి గంటల కొద్దీ చర్చలు, జోకులు.. వేళాకోళాలు. అదేదో పెళ్ళి సందడి లాగా.. మేము 'కాస్త గుమ్మడి లా దుఖం గా మొహం పెట్టి శాలువా కప్పుకుని గడ్డం పెంచుకోండీ 'శూన్యం లోకి చూస్తూ, నిట్టూరుస్తూ, జీవితం నీటి బుడగలాంటిది ' అని కాస్త బరువైన డైలాగులు చెప్పండి అని మేము ఆయన్ని ఆట పట్టించాము. ఆయన అంత సరదాగానూ తీసుకుని,.. ఇంకొంచెం కూర వేసుకోమ్మా.. లేకపోతే.. నా ఈ చిన్ని హృదయం, సన్నని రక్తనాళాలూ తట్టుకోలేవమ్మా...తట్టుకోలేవు .. ' అని సినీ ఫక్కీ లో డైలాగులు కొట్టారు.

పరీక్షల ముందు రోజు దాకా పుస్తకాలు దులపనట్టు గా, రెండేళ్ళ క్రితం కొన్న షుగర్ టెస్ట్ మెషిను అట్టపెట్టె లోంచి తీసి మాన్యువల్స్ చదవటం మొదలు పెట్టాం. మా పిన్ని కూతురు తెచ్చిపెట్టిన బీపీ మిషను ఒకళ్ళం తెరిచాం.

ఒక్కసారి గా, అన్నం,పప్పూ, ఎఱ్ఱావకాయా, కమ్మని నెయ్యీ, మెంతికారం, బెల్లం వేసి చేసిన చిక్కని పులుసు కూరలూ, మజ్జిగ పులుసులూ, జీలకర్ర కారం వేసిన గుత్తి కూరలూ, చెవులూరించే రోటి పచ్చళ్ళూ, చల్ల మెరపకాయలూ, గుమ్మడి వడియాలూ, అప్పడాలూ,  ఆవపెట్టిన పెరుగు పచ్చళ్ళూ, ముద్ద కూరలూ, , ఎఱ్ఱ గా వేయించిన వేపుళ్ళకూ ఆయన పళ్ళెం లో స్థానం లేకుండా పోయి, , ఒక్కసారి గా  75 గ్రాముల ముడి బియ్యం తో చేసిన అన్నం, ఆవిరిపై ఉడికించిన ఉపూ వేయని కూరలూ, చక్కెర లేని తేనీరూ, మీగడ తీసిన మజ్జిగా,  అవీ లిమిటెడ్ గా...

తెనాలి రామలింగడు ప్రూవ్ చేసినట్టు అందరం, మా మిడి మిడి జ్ఞానాన్ని ప్రదర్శించి ఏవి తినవచ్చో, తినకూడదో,.. గూగుల్ నుండి, మా స్నేహితుల ద్వారా నేర్చుకున్న విషయాలతో ఉక్కిరి బిక్కిరి చేశాం.

ఇది చాలదన్నట్టు మాకు తెలిసిన వారికెన్ని హార్ట్ బ్లాకులు ఎంత శాతం పూడుకుపోయాయో, వారే జాగ్రత్తలు తీసుకుంటున్నారో, వర్ణించి వర్ణించి.. వదిలిపెట్టాం. పనిలో పనిగా.. అమ్మమ్మగారు ముగ్గురు నలుగురు దేవుళ్ళకి మొక్కేసుకున్నారు.

          మా నాన్నగారు అటక మీదనుంచి ఎప్పుడో కొన్న పుస్తకాలు వెలికి తీయించారు. 'హార్ట్ ఎటాక్, రక్త పీడనం, చక్కెర వ్యాధీ లాంటి టైటిళ్ళు. ఈ పుస్తక పఠనం వల్ల ఇంకా కొత్త కొత్త అనుమానాలొచ్చాయి ఆయనకి. మచ్చుకి.. 'అవునూ.. ఈ స్ప్రింగుల్లాంటివి రక్త నాళాల్లో అమరిస్తే.. కొన్నాళ్ళకి ఆ స్ప్రింగ్ పక్కనున్న కొవ్వు కరిగితే ఆ స్ప్రింగులు జారి గుండె లోకి జారవు కదా..???', ఆ స్ప్రింగులకి తుప్పు పడితే? స్ప్రింగ్ రక్త పీడనానికి ముక్క విరిగితే?' లాంటివి. ఇక అందరూ ఆయన మీద గంతేసి పుస్తకాలు బయటకి గిరవాటేయించేదాకా శాంతించలేదు..

సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలా? లేక ఆయన దగ్గరే చేయించుకోవాలా అని వాదోపవాదాలు చేసి చేసి ఇక ఓపిక లేక సరే ఈ డాక్టర్ మీదే తల్లిదండ్రులకి గురి కాబట్టి ఆయనతోనే చేయిద్దామని నిర్ణయం చేసుకున్నాం. ఇక మా నాన్నగారు 'నా దగ్గర పైకం ఉంది. ఎవ్వరిమీదా ఆధారపడవలసిన అవసరం లేదు. నేను ఖర్చు పెట్టుకుంటాను ' అనేశారు. 'అదేంటి.. అంటే నేను లేననుకున్నారా? ఇన్స్యూరన్స్ తీసుకున్నది ఎందుకు ?  నా అవసరమే లేదూ అని మీరు తేల్చి చెపితే ఇక నేనెందుకు ఇక్కడ?. రాత్రి బస్సుకి పోతానని తమ్ముడు అలిగాడు. వీళ్ళని చూసి ఎందుకైనా మంచిదని నా ఆఫీస్ ఇన్ష్యూరన్స్ కాగితాలు ఇంక సంచీ లోంచి తీయలేదు.

ఇక నాన్నగారు పదే పదే అదే కథ ని పాల అబ్బాయి దగ్గర్నించీ,  పక్కింటాయన దాకా, చిన్నత్తయ్య ఆడపడచు నుండీ, మా బాబాయి గారి వియ్యకుండిదాకా చెప్పి చెప్పి బుగ్గలు నొప్పెట్టి పడుకున్నారు. 2 లీటర్ల పాలు ఎక్కువ తెప్పించి పరామర్శకి వచ్చిన వాళ్ళకి టీ లూ, కాఫీలూ ఏర్పాటు చేశారు.

ఈలోగా, ఎలాగూ అందరం ఉన్నాం అని మా అమ్మ ఇంటిముందుకొచ్చిన పచ్చి చింతకాయలు తొక్కి కబుర్లాడుతూ పచ్చడి చేసి అందరికీ వాటాలు చేసి కవర్లలో పెట్టింది. కోరుకొండ నుండి మా బావగారి అక్క వస్తూ, అందరికీ అప్పడాలూ, మాంచి ఇంగువ వేసిన అప్పడాల పిండీ భరిణె లో తెచ్చి పెట్టింది.  

 2 లక్షల పైనే ఖర్చు ఉందని తేలింది. రక్తనాళాల్లో వేసే స్టెంట్ అనే పరికరం భారతదేశం లో తయారయ్యిందయితే 87 వేలు, జర్మన్ స్టెంట్ అయితే లక్షా, అమెరికన్ దయితే 1.25 లక్షలూ అని చెపితే.. ఏది బెస్ట్ అయితే అదే వేయమని చెప్పాం.

అన్నిటికన్నా హై లైట్ మా చిన్నత్త రాక. ఆవిడ ఇల్లు కట్టించటం లో బిజీ గా ఉండి ఈ విషయం తెలియలేదట. రాత్రి 10 గంటలకి తెలిసింది..ఎల్లుండి ఆపరేషన్ అని..అంతే.. బస్సెక్కేసింది.  హాండ్ బాగ్ వేలాడేసుకుని వచ్చిన అత్తని చూసి ఆశ్చర్యపోయాం. కాళ్ళకి చెప్పులు లేవు. 'ఏంటత్తా? ' అంటే.. బస్సు లో తెగిపోయింది. మళ్ళీ టైం వేస్ట్ అని వచ్చేశాను. అన్నయ్య ని చూశాక తీరిగ్గా కొనుక్కోవచ్చులే అని.. అంది. నాన్నగారు తను చూడకుండా.. కన్నీళ్ళు తుడుచుకున్నారు.  మద్యాహ్నం భోజనమవుతూనే స్లాబ్ వేయించగానే వచ్చేస్తానని మళ్ళీ బస్సెక్కేసింది.

ముహూర్తం నిర్ణయించుకుని ఆయన్ని ఆసుపత్రి లో చేర్పించేశాము.  ఇంక ఆసుపత్రి లో ఒక్క మనిషి నీ, తిండి పదార్థాలనీ రానీయకుండా సెక్యూరిటీ గార్డులు అడ్డుపడుతున్నా, మేము మాత్రం, మా ఆరేళ్ళ చిన్నమ్మాయి దగ్గర్నించీ, మాగాయ అన్నం బాక్స్ దాకా స్మగుల్ చేసాం.. అదో తుత్తి. 20 నిమిషాల ఆపరేషన్ కి మా చెల్లెలి ఇంటినుండి ఒక టిఫిన్, పెద్దమ్మ గారింటినుండి ఒకటీ..

అంత మంది మధ్య కోలాహలం గా విజయవంతం గా ఇంటికి చేరారు మా నాన్నగారు. కొత్త దుప్పట్లు పరిచి, సాధ్యమైనంత ఆహ్లాదకరం గా గది ని మలిచి, ఒక్కొక్కళ్ళం బయల్దుదేరాం.

ఇదంతా బాగుంది కానీ, మా నాన్నగారి 'టర్న్ ' కోసం ఎదురుచూస్తుంటే ఒకావిడని బయటకి తెచ్చారు. ఆవిడ కి మూడు రక్త నాళాలు బ్లాక్ అవుతే స్టెంటులు వేశారుట. ఆవిడ భర్త, కొడుకూ, కూతురూ ఆత్రం గా, ఆనందం గా ఆవిడ చుట్టూ మూగి .. 'ఎలా ఉంది?' అని అడగ గానే..ఆవిడ కన్నీరు పెట్టుకుని కూతురి చేయి ని ముద్దు పెట్టుకుంది. మేమూ ఆ దృశ్యం చూసి నిట్టూర్చాం.

మర్నాడు ఐ సీ యూ దగ్గర ఆవిడ భర్త చెప్పుకొచ్చారు కథ. ఆయన ఫోర్మన్ గా పదవీ విరమణ చేశారుట. కొడుకు చిన్న దుకాణం పెట్టుకున్నాడు. పెద్దమ్మాయి పెళ్ళి అయింది. చిన్నమ్మాయి డిగ్రీ చదివి ప్రైవేట్ గా చదువుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది ట.

చాలా మామూలు గా ఉన్న కుటుంబం. రెండేళ్ళ క్రితం ఇదే ఆపరేషన్ అయితే ఒకటిన్నర లక్షలయితే, 'ఎంప్లాయీ అసోసియేషన్ ఇన్ష్యూరన్స్'  వల్ల సులభం గా జరిగిపోయిందిట. తర్వాత బైపాస్ చేయించాల్సి వస్తే.. ఇంకో లక్ష పైగా ఖర్చయితే.. రిటైర్ అయిన ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయీ బెనిఫిట్స్ ద్వారా రియెంబ్రన్స్ అయి గట్టెక్కారట.  కానీ అది ఫెయిల్ అయి ఆరు నెలలు తిరగ కుండానే, తీవ్రమైన ఆయాసం, అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి లో ఉన్నారట ఆవిడ. కోడలు డాక్టర్ దగ్గరకెళ్ళి తీరాల్సిందేనని పట్టుపడితే. 'ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే ఒట్టే' అని ఆపారట.

అమ్మాయి హైదరాబాద్ లో ఏవో పోటీ పరీక్షలకోసం చదువుతూ, అక్క ఇంట్లో ఉందిట.  ఇంటి మీద గాలి మళ్ళి ఊరికి వచ్చిన అమ్మాయి, తల్లి పరిస్థితి చూసి తండ్రినీ, మిగిలిన వారినీ కేకలేసి, హైదరాబాద్ కి బయలు దేరదీసిందిట.

'నాకేమీ లేదు.. నీకు పిచ్చి ' అని కూతురి మీద అరిచి యాగీ చేసినా వినిపించుకోకుండా తెచ్చి చూపిస్తే.. కార్డియాలగిస్ట్,.. తెర వెనకకి కూతురినీ, భర్తనీ వెళ్ళమని,..' 'అమ్మా.. నీకేంటి ప్రాబ్లం.. చెప్పు.. మందులతో తగ్గించి, ఎక్కువ ఖర్చు కాకుండా చేస్తాను..' అని నెమ్మదిగా అడగగానే.. 'భరిచలేని నొప్పి, ఆయాసం డాక్టర్ గారూ, నాకు విషం ఇవ్వండి.. కానీ.. పెద్ద ఖర్చున్న ఆపరేషన్లు చెప్పవద్దు. బిడ్డకు పెళ్ళి కాలా..' అన్నారుట.

మూడు బ్లాకులున్నాయని, 3 స్టెంటులకి జర్మన్ వైతే ఐదున్నర లక్షలవుతుందని, మన దేశపు స్టెంటులేయిస్తే,.. 3 లక్షల చిల్లర తో తేలిపోవచ్చని చెప్పారుట.

భారతీయ టెక్నాలజీ తో తయారు చేసిన స్టెంట్ (మాజీ రాష్ట్రపతి కలాం గారు, సోమరాజు గారి ఐడియా ద్వారా చేశారని విన్నాను) వాడితే 2 లక్షలైనా మిగిలేది కదా.. కానీ.. ఏమో ఏమవుతుందో అన్న భయంతో వారి కుటుంబం జర్మన్ టెక్నాలజీ కే మొగ్గిందట.

ఆ అమ్మాయి కోసం దాచిన ఆరు లక్షల ఫిక్స్ డ్ డిపాసిట్ ముట్టటానికి వీల్లేదని ఆవిడ మళ్ళీ వొట్టు ! రెండు లక్షలకి ఇన్ష్యూరన్స్ ఉంది కాబట్టి ఒక్కటే బ్లాక్ తీయించుకుంటానని పేచీ.. పాపం ఆ తల్లి వ్యథ అర్థమయినా,.. అమ్మాయి మాత్రం తండ్రి సహకారం తో,.. ఎఫ్ డీ ల సెక్యూరిటీ తో 2.5 లక్షల లోన్ బాంక్ ద్వారా తీసుకుని, తల్లికి 1.5 లక్షల లో అయిపోతుందని చెప్పి ఆసుపత్రి లో చేర్పించారట.

ఆ అమ్మాయి కూడా .. 'మాది ఎంత అదృష్టమండీ .. మా అమ్మ మాకు దక్కింది.  
అమ్మకి ఆపరేషన్ చేయించకుండా దాచిన డబ్బుతో పెళ్ళి చేసుకుని సుఖపడతానా నేను? వీళ్ళ చాదస్తం గాని? నా ఎం బీ యే అయిపోతుంది 3 నెలల్లో.. జూనియర్ అకౌంటంట్ ప్రవేశపరీక్ష రాసాను. 2 మార్కుల్లో పోయింది. మళ్ళీ రాస్తా .. మా నాన్నగారు 1.5 లక్షలు తెస్తున్నారు ఫ్రెండ్ దగ్గర్నించి.. మంచి ఉద్యోగం రావడమేమిటి..తీర్చేస్తాను..' అంది. ఆ అమ్మాయి కళ్ళు ఆత్మవిశ్వాసం తో కళ కళ లాడిపోతున్నాయి.  నా కళ్ళు తెలియని భావం తో మసకబారాయి. ఈ అమ్మాయే ఈ నాటి యువత కి ప్రతీక అనుకున్నాను. ఆసుపత్రి నుండి వచ్చే ముందు ఆ తల్లిదండ్రులకి అభినందనలు చెప్పి సెలవు తీసుకుని వచ్చాము.


కానీ,.. మనసులో ముల్లు మాత్రం నాటుకుపోయింది. మనకి ఒక ఫోరం / సంస్థ  కావాలి...  మన దేశపు పరికరాల నాణ్యత వివరాలు, అపోహలు లేకుండా, కమర్షియల్ వాసన లేకుండా..  ఇలాంటిది ఉందా? మన మీడియా లో ఈ వివరాల ప్రచారం విస్త్రుతం గా జరగాలి. సామాన్య ప్రజల అపోహలు తొలగించేలా..


ఏదో అవసరానికి అప్పులపాలయినా అర్థం ఉంది కానీ, ఇలాగ అపోహల కోసం ఖర్చు చేయగలగటం ఎంతవరకూ సబబు?

మా అమ్మాయి వాక్సినేషన్ కి వెళ్ళినప్పుడు కూడా, అమెరికన్ ది కావాలంటే 1700 రూపాయలు, ఇండియన్ ది అయితే 150 అంది. అమెరికన్ ది అయితే నొప్పి తక్కువ, జ్వరం రాదు అంటే.. మాతో సహా, చంటిపిల్లలకి నొప్పి,జ్వరం ఎందుకొచ్చిన ఇబ్బంది అని అమెరికన్ దే వేయించాము.


మొన్నీ మధ్య కంటి సర్జరీలకీ ఇదే పోకడ విన్నాను. ఇండియన్ పరికరాలతో అయితే.. ఒక ధరా, అమెరికన్ అయితే ఇంకో ధరా, ఇంగ్లిష్ వాళ్ళవయితే వేరొకటీ..  'కన్ను' అనగానే.. మనకీ భయమే కదా.. ఇండియన్ వి అయితే గొడ్డలి పాటి మందం తో ఉంటాయేమో, అమెరికన్ వి సన్నగా, నాణ్యతతో ఉంటాయేమో నని...

డాక్టర్లు కూడా ఇలాంటి చాయిస్ ఇవ్వటం వల్ల.. ఎదురైన పరిస్థితి ఇది ఏమో?..  పర్వాలేదు తక్కువ రకం వేయమని ఎవరు చెప్పగలరు?

38 comments:

ఆత్రేయ said...

క్రిష్ణక్కా!! మీకు ఆ అమ్మాయికీ అభినందలు ( క్రిష్ణక్కా అని ఎందుకన్నానంటే రాసిన ప్రతీది పెద్ద ఆరిందలా రాస్తుంటే )
నిజ్జం గా మీరు భలే అదృష్టవంతులు మీరు చెప్పిన ఊసులు నాకు దగ్గర గా వచ్చి దూరమయ్యాయి. 13 ఏళ్ళ క్రితం ఒక దురదృ స్తపు సాయంత్రం మా నాన్న గారిని తీవ్ర గుండె పోటు తో పోగొట్టుకున్నాం
మంచి ఆర్ధిక స్తోమత ఉండీ, చేయటానికి మేము ఉండీ, సమయానికి పక్కన లేక అలా జరిగింది. చుట్ట పక్కాలు అదృష్టవంతుడు అనాసాయ మరణం అని పోగుడుతే లోపల్లోపల భాధ పడుతూ బయటకి అవునవునవును అంటూ.. అలాంటి పరిస్థితి చూసిన తర్వాతః మా అమ్మకి సుస్తీ చేస్తే డాక్టర్లు ఏమి చెబితే అది చేసాం ఎంత ఖర్చైన పర్లేదు అంటూ...( అన్నీ అమెరికా వే డాక్టర్ తో సహా,,)
మీ నాన్న గారికీ ఆ అమ్మాయి తల్లికి మంచి ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్దిస్తూ....

హరే కృష్ణ said...

టపా చాలా సరదాగా వెళ్తోంది అనే సమయంలోనే
ఒక మంచి విషయాన్ని లేవనెత్తి ఆలోచింపచేసేలా చేసారు
kudos!

మొదట పోస్ట్ లెంగ్త్ చూసి భయపడ్డా
చదివాక అర్రే అప్పుడే అయిపోయిందా అని అనిపించింది.మీరు ఎన్ని పేజీ లు రాసినా ఇట్టే చదివేసేలా ఉన్నాయి
చాలా బాగా రాసారు

హరే కృష్ణ said...

'ఎలా ఉంది?' అని అడగ గానే..ఆవిడ కన్నీరు పెట్టుకుని కూతురి చేయి ని ముద్దు పెట్టుకుంది
ఇది చాలా నచ్చింది
ఆ సీన్ కళ్ళముందు కనిపించింది.

ఎంతమంది మిమ్మల్ని అక్క అని పిలిచినా
మొదటి తమ్ముడు అని పిలిచింది నన్నే :)

ఆత్రేయ said...

నో !! హరేకృష్ణ !!! నేనే పెద్ద తమ్ముడు నాకు నలభై నాలుగున్నర (వయసు)

ఆత్రేయ said...

నా వాటా చింతకాయ తొక్కు ఏదీ?

హరే కృష్ణ said...

మీరు అన్నయ్య అవుతారేమో :)
తమ్ముడు అని పిలిపించుకోవాలి అంటే టల్లోస్ అనే వంటకం రెండు లీటర్లు తినగలిగి ఉండాలి :)
ఒక్కసారి టల్లోస్ తినడం మొదలెట్టాక నా మాట నేనే వినను

sunita said...

ఇండియావి అని చిన్నచూపేకాదు, నమ్మకం కూడా లేదు.ఎలాంటివి అంటే చనిపోయిన పేషంటువి కూడా తీసి వెయ్యడం లాంటివి. మా నాన్నగారికి స్టెంట్స్ వేసినప్పుడు మా తమ్ముడు ఫ్రెండ్ ఒకడు చెప్పిన విషయమిది.అందులో మరలా రెండు రకాలు, మెడికేటెడ్ నాన్ మెడికేటెడ్.ఒక్కోటి లక్షా ముఫైవేలు అన్నట్లు గుర్తు, మెడికేటెడ్ మూడు వేయించాం.

నీహారిక said...

మీరు స్పీడ్ గా వ్రాయడమే కాదు, స్పీడ్ గా చదివేలా కూడా చేస్తారు. మీ నాన్నగారి ఆరోగ్యం ఇపుడు ఎలా ఉంది?

వజ్రం said...

చాలా బాగా వ్రాసారండి.మీ కుటుంబ అనుబంధాలు చదివి చాలా ఆనందం కలిగింది.అన్ని కుటుంబాలు అలా ఆదర్శ ప్రాయంగా ఉండాలి.
మీరు చెప్పింది నిజమేనండి, వైద్య సామాగ్రి (హోమియో మందులు,డెంటల్,డయాలసిస్ పరికరాల తో పాటు మీరు చెప్పినవన్నీ) లో కూడా వెరైటీలు చెప్పి గందరగోళం సృష్టిస్తారండి.ఇండియా వి కూడా నాణ్యత విషయం లో అంత తీసి పోలేదు,అయితే ఎవరి భయం వారిది.

మాలా కుమార్ said...

ఇప్పుడు మీ నాన్నగారు ఎలా వున్నారండి ?

కౌటిల్య said...

"భారతీయ టెక్నాలజీ తో తయారు చేసిన స్టెంట్ (మాజీ రాష్ట్రపతి కలాం గారు, సోమరాజు గారి ఐడియా ద్వారా చేశారని విన్నాను) "

ఆ పెద్దవాళ్ళిద్దరూ కలిసి చేసింది స్టెంట్ కాదండీ! ఆర్టిఫిషియల్ హార్ట్ వాల్వ్...

ఇక అమెరికన్, ఇండియన్ తేడాల గురించంటారా! వాటి మీద రాయాలంటే ఓ పెద్ద టపా పడిద్ది..సింపుల్ గా చెప్తా.."దొడ్లో కాకరగాయలు 'చేదు',పొరుగింటి పుల్లకూర రుచి"....అయినా డాక్టర్లం ముందే ఓ డిస్క్లైమర్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటాంగా..ః-),"ఇదైతే చేదు,అదైతే పులుపు..ఏది రుచిగా ఉంటదో, మీకు ఏ రుచి కావాలో డిసైడ్ చేసుకోండి..ఏది తిన్నా ఆకలి తీరుతుంది మరి" అని...;-)))

Krishnapriya said...

@ ఆత్రేయ,

థాంక్స్! అవును.. అదృష్టవంతులం.. చిన్న సింటం అప్పుడే జాగ్రత్త తీసుకోగలిగాము. మీ తండ్రి గారి విషయం లో అలా జరిగాక, అవును, మీరు తల్లి కోసం తీసుకున్న జాగ్రత్తల గురించి చదివితే.. నిజమే.. ఏది బెస్ట్ అని అంటే అదే చేయమని అంటాం.. తప్పదు..
నా బాధల్లా.. మన మెడికల్ వ్యవస్థ,,.. పరికరాలూ, వైద్యం పట్ల ఈవిధం గా 3-4 రకాలు చెప్పి సామాన్యులని కంఫ్యూజ్ చేస్తున్నారని..

క్రిష్నక్క :-) ష్యూర్.. అంధ్రభూమి లో చిన్నప్పుడు చద్విన క్రిష్నక్కయ్య గుర్తుకొచ్చింది.. థాంక్స్ ఫర్ ద అభిమానం ..

Krishnapriya said...

@ హరేకృష్ణ,
చాలా థాంక్స్.. ఏంటో చిన్న టపా రాద్దామనుకుంటాను ప్రతిసారీ.. కానీ ఎంత రాసినా ఇంకా చాలా మిగిలిపోయాయనిపిస్తుంది.. : సోషల్ స్టడీస్ లో అందుకే ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ మనమే :-)

ఈ సంఘటన జరిగి వారం ఇవ్వాళ్టికి.. ఆవిడ ముఖం మాత్రం నా కళ్ళముందే కనిపిస్తోంది. .. ఆవిడ ఆరోగ్యం ఈ ఆపరేషన్ తో కుదుట పడాలని ఆశిస్తూ..

Krishnapriya said...

@ ఆత్రేయ,

వయసు సంగతి వదిలేయండి, చిన్నో పెద్దో.. కానీ హరేకృష్ణ చెప్పింది నిజమే.. 2 లీటర్ల టల్లోస్ తిని (అంటే గట్టిగా వస్తే తిని, ద్రవరూపం లో వస్తే తాగి, జిగటగా వస్తే పళ్ళతో పీకి తాగి) ఆయన ఫస్ట్ తమ్ముడి పొసిషన్ ఖాయం చేసుకున్నాడు .. :-)

మీకు చింతకాయ తొక్కు తో పాటూ, టల్లోసూ తప్పక పంపిస్తాను.. అడ్రస్ పంపండి :-)

@ హరేకృష్ణ,
LOL .. (మీ మాట మీరే విననంటేనూ..)

Krishnapriya said...

@ సునీత,

బాబోయ్, మీరు చెప్పింది వింటే .. బాధనిపిస్తుంది. టూ మచ్!
అవును ఇంపోర్టెడ్ స్టెంటులు లక్ష పైన .. ఆపరేషనూ అదీ కలుపుకుని 2.27 లక్షలైంది..

@ వజ్రం,

థాంక్స్! నాణ్యత విషయం లో గందరగోళం .. ఎవ్వరికైనా తక్కువ రకం అంటే కాస్త కంఫర్ట్ లెవెల్ తక్కువే ఉంటుంది కదా.. అందుకే.. ఈ నాణ్యత విషయాలు ఎవ్వరైనా తెలుసుకునే విధం గా స్వతంత్ర్య ప్రతిపత్తి ఉన్న సంస్థ లేక ఫోరం అవసరం.. ఉంది. సునీత గారు చెప్పిన విషయం వింటే స్టెంటుల్లాంటి పరికరాలు మనమే సీల్ తో ఉన్నవి కొనుక్కోగలిగే అవకాశం ఉంటే మంచిదేమో అనిపిస్తుంది.

@ మాల గారు, నీహారిక గారు,
ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యం గా, హాయిగా ఉన్నారు. బీ పీ అవకతవకల వల్ల కనుక్కోవటం వల్ల సకాలం లో ప్రివెంటివ్ చికిత్స పొందటం వల్ల పెద్ద ప్రమాదాలు తప్పించుకున్నారు..

వీరుభొట్ల వెంకట గణేష్ said...

_______________________________________________
కానీ,.. మనసులో ముల్లు మాత్రం నాటుకుపోయింది. మనకి ఒక ఫోరం / సంస్థ కావాలి... మన దేశపు పరికరాల నాణ్యత వివరాలు, అపోహలు లేకుండా, కమర్షియల్ వాసన లేకుండా.. ఇలాంటిది ఉందా? మన మీడియా లో ఈ వివరాల ప్రచారం విస్త్రుతం గా జరగాలి. సామాన్య ప్రజల అపోహలు తొలగించేలా..

పర్వాలేదు తక్కువ రకం వేయమని ఎవరు చెప్పగలరు?


ఏదో అవసరానికి అప్పులపాలయినా అర్థం ఉంది కానీ, ఇలాగ అపోహల కోసం ఖర్చు చేయగలగటం ఎంతవరకూ సబబు?
_______________________________________________

Very true.

ఇప్పుడు మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందండీ?

ఆత్రేయ said...

టల్లోస్ వల్ల స్టంట్స్ వేయించుకొనే అవసరమా రాదుకదా కొంపతీసి వస్తే ఇండియా వా యుకె వా అమెరికా వా అని మళ్ళీ టెన్షన్ డాక్టర్ కొట్టు అబ్బాయి బయటవే మంచి వంటాడు....

కౌటిల్య said...

@సునీత గారు,
చనిపోయిన పేషెంటుది తీసి వెయ్యడం అనేది కేవలం అపోహ మాత్రమే! ఒకసారి వేసిన స్టెంటుని తియ్యడం కుదరదు...చాలా కష్టం...దానికి పెట్టే శ్రమ,ఖర్చుకి అలాంటివి రెండు,మూడు వస్తాయి...ఇంకా చనిపోయిన వాళ్ళల్లో తియ్యాలంటే, బాడీని పెద్ద డిసెక్షన్ చెయ్యాల్సిందే...

@వజ్రం గారు,
రకాలంటారా! తప్పదు మరి..అన్నిటా అంతే కదా! ఏదన్నా చిన్న వస్తువు కొనాలన్నా పది వెరైటీలు చూస్తాం...మరి ఆరోగ్యం విషయంలో అంతకంటే ఓర్పుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా!

Sravya Vattikuti said...

హ్మ్ ! మీ పోస్టు మొత్తం చదివాక ఏమి రాయాలో కూడా తెలియటం లేదు, మీరు కుటుంబం గురించి రాసింది చదువుతుంటే నిజం గా ఆనందం కలిగింది, మీ నాన్న గారు త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నాను .
ఆ రెండో కుటుంబం గురించి చదువుతుంటే చాల సార్లు డబ్బుదేముంది అని అనుకుంటాం కాని డబ్బుంటేనే బాగా బతకగలం అని కాకపోయినా , బాగా బతకటానికి డబ్బు కూడా అవసరమే కదా అనిపిస్తుంది .
క్వాలిటీ విషయం లో గతంలోకన్నా ఇప్పుడు మన పరిస్తితి మెరుగే అనుకుంటున్నాను , నాసిరకం తో డబ్బు చేసుకుందాం అనే ఈ పిచ్చి బుద్ధి మనవాళ్ళకి పోవటానికి ఇంకా కొద్ది సంవత్సరాలు పడుతుందేమో .

కొత్త పాళీ said...

Very interesting and important point.
మీ నేరేషన్ గురించి కొత్తగా చెప్పేదేముంది గానీ, ఈ టపాలో మూడు వేర్వేరు పాయల్ని కలిపి అల్లడంలో ముఖ్యమైన టెక్నికల్ పాయింటు మరుగునపడే అవకాశం ఉంది.
మరో సూచన - ఎలాగూ ఇంత రీసెర్చీ చేశారు కాబట్టి ఈ స్టెంటుల్ని గురించి ఒక పేజి కరపత్రం చేస్తే ఎలా ఉంటుంది? మీరే చొరవ చెయ్యాలి!

blogyama said...

gundepindesaru sumandi

sunita said...

@కౌటిల్య---మేము ఈ(వైద్య)టెక్నాలజీ తెలిసినవాళ్ళం కాదుకదా? చాలా భయం వేసింది. అప్పుడున్న టెన్షనుకు ఇంకేవీ అలోచించడం లేదు. ఎంత సేఫుగా బైటపడతాము అనె అలోచన అంతే.అందునా మా చుట్టాలమ్మాయి( మా వారి మేనమామ కూతురు) ఒక కార్పరేటు లో బ్రైన్ హేమరేజి తో చనిపోతే ఇంకో పూట ఎక్కువ వుంచి బిల్ల్ మొత్తం వసూలు చేసిగానీ చెప్పలేదు చనిపోయిందని. అంతదాకా డ్రిప్ ఇస్తూనే ఉన్నారు. మా కళ్ళముందే ఒక ఎగ్జాంపిల్ ఉండేసరికి మేము ఇంకో అలోచన చెయ్యలేదు.

శ్రీ said...

మీ నాన్నగారు ఎలా ఉన్నారు ఇప్పుడు... మీ టపా బాగుంది ...

ఆ.సౌమ్య said...

ఒక ఏడేళ్ళ క్రితం మా నాన్నగారికి కూడా గుండెపోటు వచ్చినప్పుడు ఇలాగే ఇబ్బంది పడ్డాం .మీరన్నట్టు ఏది మంచిదో, ఏది చెడ్దదో తెలుసుకోలేక సతమతమవుతున్నారు చాలామంది. దీనిమీద మీరు ఏదైనా టపా రాయండి. మీ నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను.

ఏమీ అనుకోకపోతే ఒక చిన్న సూచన "చెవులూరించే.." కాదండీ, "చవులూరించే" అనాలి. :)

Weekend Politician said...

క్రిష్ణ ప్రియ గారు,

చాలా ముఖ్యమైన సమస్యని చూపించారు. అవునండీ, మన రెగ్యులేటరీ వ్యవస్థ చాలా బలహీనం గా వుండడం వల్ల సామాన్యులకి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. వ్యవస్థలో మార్పు రావడానికి కొంత సమయం పట్టొచ్చు. అయితే ఈ లోపు స్వచ్చందం గా సమాచారాన్ని తెలియచేసి అపోహలని దూరం చేసే ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. రాజకీయ పార్టీల ద్వారా అటువంటి ప్రయత్నాలకి ఏమైనా మద్దత్తు లభించే అవకాశం ఉండొచ్చు. ఆ వైపుగా నేనొక ప్రయత్నం చేసి చూస్తా. (I will let you know how it is going through email)

PS: మంచి వ్యాసం. ఎప్పట్లాగే చాలా బాగా రాశారు అని చెప్పలేను. ఎందుకంటే, మీరచనా శైలిలో నాకు బాగా నచ్చే ఒక పాటర్న్ ఈ టపాలో కనిపించలేదు. నాకైతే, ఇది బాగా రాసిన టపా మాత్రమే, కానీ మీ నుండి వచ్చిన టపాగా అనిపించట్లేదు. I guess you can figure out what I am referring here..:)

Krishnapriya said...

@ గణేష్,
థాంక్స్, మా నాన్నగారు హాయిగా ఆరోగ్యం గా ఉన్నారు.
@ ఆత్రేయ,
:-)
@ డాక్టర్ కౌటిల్య,
మీ కామెంట్ కి, మీ వివరణకీ చాలా చాలా థాంక్స్!

@ శ్రావ్య,
ధన్యవాదాలు.
మా కుటుంబం గురించి చెప్పటం లో ముఖోద్దేశ్యం ఏంటంటే,.. కుటుంబం అండ ఉండి, ఆర్థిక ఇబ్బందులు లేకపోతే అవలీల గా గట్టెక్కవచ్చు కానీ,.. మా పక్క రూం ఆవిడ కుటుంబం ఆర్థికం గా ఎంత ఇబ్బంది పడిందో (అది కూడా బెస్ట్ స్టెంటులు వేయించాలన్న తపన తో.. అని..)

Krishnapriya said...

@ కొత్తపాళీ గారు,
మీరన్నట్టు టపా లో 2-3 విషయాలు టచ్ చేయటం వల్ల నాకూ ఎక్కడో తేలిపోయిందని అర్థమైంది. మీ కామెంట్ కి చాలా థాంక్స్!
మీ మరో సూచనకి ధన్యవాదాలు. టెక్నికల్ గా బాగా తెలుసుకుని ఉండాలేమో.. కాస్త రిసర్చ్ చేయవచ్చు. కానీ, ఈ సమాచారం అందరికీ అందుబాటు లో ఉండటం.. వినియోగదారుల హక్కు అనుకుంటున్నాను. నా లాంటి వాళ్ళు మహా అంటే ఒక వికీ పేజో ఏదో అప్డేట్ చేయవచ్చు.. సామాన్యులకి ఎలా అందుబాటులోకి తేవటం అన్నదే తెలియదు.

@ శ్రీ,
థాంక్స్.. ఆయన ఆరోగ్యం గా ఉన్నారు..

@ శౌమ్య,
థాంక్స్.. ముఖ్యం గా మీ కరెక్షన్ కి :-))

@ వీకెండ్ పొలిటిషియన్,
హ్మ్మ్.. Thanks for the frank feedback! మీరన్నట్టు ఏదో మిస్సింగ్ అని అనిపించింది కానీ.. ఏంటో అర్థం కాలేదు. మీరే చెప్పేయండి..

ఆ.సౌమ్య said...

ఏంటండీ నా పేరు మార్చేసారు...నేను సౌమ్యనండీ, శౌమ్యని కాదు :)

శివరంజని said...

చాలా బాగా వ్రాసారండి.మీ టపా ఎంత పెద్దగా వున్నా చదవడానికి అస్సలు విసుగెయ్యదు ...అంత బాగా రాస్తారు

Krishnapriya said...

@ సౌమ్య,

మీ పేరులో మొదటి అక్షరాన్ని ఆంగ్లం లో కాపిటల్ చేసేటప్పటికి మీ పేరు మారిపోయింది.. (మీ పేరు మీద పోస్ట్ చూశాను)... అందుకే లంచ్ తర్వాత రాస్తే.. బోల్డు తప్పులు దొర్లుతాయి :-)

@ శివరంజని,
:-) థాంక్స్!

Ramakrishna Reddy Kotla said...

Informative and entertaining :-)
I Pray god for the good health and long life of ur father and that daughter's mother.

రాధిక(నాని ) said...

బాగుందండి బాగారాసారు.
మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందండి?తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను
.ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసానికి ముచ్చటేస్తుంది.
ఎంత మంచిదైనా ఇండియాది అనేటప్పటికి సహజంగాచాలామందికి చిన్నచూపు,అనుమానం ,భయం . ...

Srivalli said...

an informative post.

by the grace of god and with all the best wishes, wish your father a very speedy and happy recovery. Best Wishes Valli

సవ్వడి said...

మీ బంధాలు చాలా బాగున్నాయి.
మంచి పోస్ట్ పెట్టారు. మీ బ్లాగు చదువుతుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి.
మీ నాన్నగారికి, ఆ అమ్మాయి అమ్మగారికి బాగుండాలని కోరుకుంటున్నాను.

Raghuram said...

కృష్ణక్కా !,

మీ బ్లాగు ఎప్పటి నుండో చదువుతూ వున్నా ఇప్పటికి కుదిరింది వ్యాఖ్య వ్రాయడానికి (బద్దకం అంతే మరేమి కాదు). మీ రచనలు బాగా చదివించేవిగాను, చదివి ఆలోచింపచేసేవిగాను వుంటాయి.

రఘురాం

కృష్ణప్రియ said...

@ రామకృష్ణ, రాధిక, శ్రీవల్లి, సవ్వడి, రఘురాం,
ధన్యవాదాలు! చాలా సంతోషం వేసింది, ఈ టపా కి వచ్చిన రెస్పాన్స్ చూసి.. (కొన్ని కామెంట్ల ద్వారా, కొన్ని ఈ-మెయిల్ ద్వారా)! స్పందించిన వారందరికీ నెవర్లు!

drsd said...

బాగుందండి. మీరు ఎంచుకొనే సబ్జక్ట్స్, వాటిని వ్రాసే విధానం బాగుంది. ఎప్పుడు silent గా మీ బ్లాగ్ చదివేసి వెళ్ళే నేను ఈసారి కామెంట్ వ్రాయాలని అనుకొనేలా ఉంది. Your blog is one of my faviourites. నేను కూడా ఈ ప్రాబ్లం పేస్ చేశాను. మా బాబు కి vaccination టైం లో ఇండియన్ వి ఐతే 200 అని, అమెరికా వైతే 1800 అని చెప్పారు wockhardt హాస్పిటల్లో. మేము చాలా ఆశ్చర్యపోయాం. కాస్ట్ గురుంచి చెప్పారని కాదు కానీ నొప్పి ఉంటుంది జ్వరం ఉంటుంది అని చెప్తే ఎవరు ఇండియన్ వెర్షన్ ట్రై చేయ్యలనుకొంటారు? ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళం కాబట్టి సరిపొఈన్ది కానీ, మరి బయట పరిస్థితి? గవర్నమెంట్ హాస్పిటల్స్ లో vaccination ఫ్రీ అయుంటుంది? ఐన అక్కడకి వెళ్ళాలంటే కాన్ఫిడెన్సు సరిపోదు.
Keep writing good posts.

Sreedevi.

కృష్ణప్రియ said...

@ శ్రీదేవి గారు,
ధన్యవాదాలు, ఎగ్జాట్లీ.. ఎక్కడ కాంప్రమైజ్ అయినా పసి వాళ్ళకి నొప్పీ, జ్వరమూ అంటే ఎంత లేని వాళ్ళయినా ఆలోచిస్తారు.. 9 రెట్లు ఎక్కువ డబ్బు కట్టటానికి రెడీ అయిపోతారు. కనీసం ఈ కేస్ లో రెంటికీ తేడా చెప్పుతున్నారు. కొన్నింటిలో మేడ్ ఇన్ ఇండియా / దిగుమతి చేసుకోబడ్డవీ.. అని మాత్రమే చెప్పటం వల్ల చూజ్ చేసుకోవటం కష్టమే.
మీరన్నట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితం గా ఇచ్చే వాక్సినేషన్లు.. తీసుకోవటానికి భయపడే స్థితి నుండి బయట పడగలగాలి..

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;