Friday, January 13, 2012

రివర్స్ గేరు..

శనివారం ఉదయం.. ఉదయాన్నే..కాసేపు టీ తాగుతూ, ఇంటి ముందు గార్డెన్ లో దినపత్రికలని నములుతూ కూర్చున్నా..ఫోన్ మోగింది. చూస్తే నా పాత స్నేహితురాలు సంధ్య. 'మరీ ఇంత పొద్దున్నే ? ' అనుకుంటూ ఎత్తాను. 'ఏం చేస్తున్నావు కృష్ణా? తీరిగ్గా ఉన్నావా? మామూలు రోజుల్లో నిన్ను పట్టుకోవటం కష్టం.. అని ఈ సమయం లో ఖచ్చితం గా ఉంటావని చేశాను.. ' అంది. నాకూ ఉత్సాహం గా అనిపించింది. ఎప్పుడు నేను ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడుతున్నా.. వంద అవాంతరాలు! పిల్లలు అప్పుడే వచ్చి 'చాక్లెట్ తినచ్చా? హోం వర్క్ వదిలేసి ఊరెమ్బడ బలాదూర్ తిరగచ్చా? ' లాంటివి అడిగి సాధించుకుంటూ ఉంటారు. విసుగొచ్చి పెట్టేస్తూ ఉంటాను.
ఇంట్లో ఎవ్వరూ లేవలేదు.. ఇదీ బానే ఉంది. అనుకుని 'ఆగు.. చిన్న బచ్చన్ walk 'n' talk అన్నాడు .. నడుస్తూ మాట్లాడతా' అని వీధిలోకి వచ్చాను. మాది ఇరవయ్యేళ్ల స్నేహం. ఎన్నో విషయాలు అరమరికలు లేకుండా చెప్పుకుంటూ ఉంటాం. కాసేపు.. బెంగుళూరు ట్రాఫిక్, హైదరాబాద్ ఎండలు, పిల్లల అల్లరి, కిస్మస్ సెలవల్లో ఏ ఏ సినిమాలకి బలి అయ్యామో, మా సెలవల్లో ట్రిప్ లాంటివి చెప్పుకుని.. టాపిక్ నెమ్మది గా భర్తల మీదకి వచ్చింది. 'రమేశ్ ని భరించలేకపోతున్నా కృష్ణా.. తెగ ఏడిపించేస్తున్నారు.' అంది. నాకిది అలవాటే.. ఎప్పుడూ అలాగే అంటుంది. మళ్లీ అంతలోనే ఎడ్జస్ట్ అయిపోతుంది. . 'హ్మ్... అలాగా..' అన్నాను.

'మరీ అంత డ్రై గా ఆఅలాఆగాఆఆ అనకు కృష్ణా! నువ్వంటే కూడా ఒళ్లు మండుతోంది..వెధవ రెస్పాన్సూ నువ్వూ..' అని కసి గా అనేసింది. 'లేదు..లేదు.. రోడ్డు మీద ఎవరో తెలిసిన వారు కనిపిస్తే.. అంత డీప్ గా స్పందించ లేకపోయా..' అని ఏదో సద్ది చెప్పటానికి ప్రయత్నించా.. 'డీప్ గా స్పందించలేకపోయావా? ఆ భాషేంటి? నేనంటే నీకు చాలా చులకన అయిపొయింది.. ' అని పెట్టేసింది. మళ్లీ ఫోన్ చేసి.. తనని ప్రసన్నం చేసుకునేసరికి తల ప్రాణం తోక కొచ్చింది.

'ఏమైంది అసలు చెప్పు శాండీ.. ఏమిటి అసలు ఈ రమేశ్ ప్రాబ్లం?' అని అడిగాను. 'ఉదయం లేస్తూనే చిరాకు చూపిస్తారు. వంటింట్లోంచి శబ్దం వస్తే సహించలేరు. అలా అని కాఫీ కి లేట్ అయితే మళ్లీ సాధింపు. నేల మీద ఇంత చిన్న కాగితమో, చెత్తో కనపడినా.. రోజంతా ఇంట్లో కూర్చుంటావు.. ఏం చేస్తావు? పొద్దున్నే లేవగానే ఏ మాల్ కి వెళ్దామా? ' అనే గొడవ. తప్పితే ఇల్లు ఎంత అసహ్యం గా పెడతావో చూడవు. అయినా.. చేసేదంతా పని మనిషి. తనతో కూడా సరిగ్గా చేయించలేవు.. ఎందుకూ.. వేస్ట్..' అని ఒకటే చిరాకు పడటం.

బాబు ఉదయం.. విపరీతమైన బద్ధకం చూపిస్తాడు.. వాడి మీద ఏమాత్రం గొంతు పెంచి అరిచినా గొడవే.. దానితో వాడికి నా మీద భయం భక్తీ లేవు. .. విరక్తి గా అనిపిస్తుంది.. ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది.. ' అంది.

'మా ఇంట్లోనూ same problem - no difference - only names changed' అన్నాను. 'అలా అనకు. Don 't be silly! నీకంటూ ఉద్యోగం ఉంది.నువ్వు ఊరకే నన్ను ఊరడించటానికి అంటున్నావని తెలుసు. నన్ను బొత్తిగా తీసి పారేస్తున్నారు తను. ఏదైనా గట్టిగా మాట్లాడితే.. మా అత్తగారూ వింటారని ఒక భయం. పైగా.. 'కష్టపడి ఉద్యోగం చేసి అర్థరాత్రి దాకా పని చేసి ఇంటికి వస్తే ఈ సాధింపులా? ' అని దాడి చేయటం. దీని కన్నా నరకం మేలు... " అంది. కాస్త సీరియస్ గానే ఉన్నట్టుంది.. అనుకుని.. నేనూ... 'అయ్యో..ఎందుకలా? ' అన్నాను.

ఇంక తనకి ఆవేశం కట్టలు తెంచుకుంది. 'తనేదో కష్టపడి ఉద్యోగం వెలగపెడితే.. నేను కంఫర్టబుల్ గా కూర్చుని.. మెక్కుతున్నానని, పని మనుషులు పని చేస్తుంటే.. నేను ఊరికే టీవీ చూస్తూ, స్నేహితులతో కాలక్షేపం చేస్తున్నానని అనుకుంటున్నారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు తెచ్చుకోవటం, బిల్లులు కట్టటం లాంటివి అన్నీ చేస్తున్నాను.. బాబుకి చదువూ,సంధ్యా, క్లాసులకి తీసుకెళ్లటం, ఇంటికొచ్చిన చుట్టాలూ పక్కాలూ నేను చూసుకోవట్లేదా? అని అంటే అదొక పేద్ద విషయమా? మా అమ్మా అలాగే చూసుకుంది.. ఆ మాటకొస్తే.. ఇంకా ముగ్గురు పిల్లలం, ఆవిడ టీచర్ ఉద్యోగమూ చేసేది.. ఇన్ని ఫెసిలిటీలూ లేవు.. బట్టలుతుక్కుని, గిన్నెలు తోముకుని, బియ్యాలూ అవీ ఏరుకుని.. బస్సుల్లో ప్రయాణాలు చేసి...చిరిగిన బట్టలకి టాకాలు వేసుకుంటూ, ఆర్ధిక ఇబ్బందులని ఎదుర్కుంటూ, చుట్టాలని సమర్ధించుకుంటూ..' ఇదీ ధోరణి!!.. వాళ్ళమ్మ ఆరోజుల్లో కష్టపడిందని నేనూ అలాగే కష్టపడాలి అంటే ఎలాగ? ' గొంతు గద్గదం గా ..
బాధేసింది.

ఏం చెప్పచ్చా.. అని ఆలోచిస్తుంటే.. ఉదయం.. అందరూ ఆఫీసులకీ,స్కూళ్ళకీ వెళ్లాక నేను ఇంటి పనీ అదీ చేసాక, నాకు టీవీ చూసే ఆసక్తి ఉండదు.. ఉన్నా.. మా అత్తగారు ఏవో వంటల ప్రోగ్రాం లో, భక్తీ ప్రోగ్రాం లో చూస్తారు. బాబు వచ్చాక వాడి చదువు తో బిజీ. సాయంత్రం నేను ఏదైనా చూద్దామంటే.. 'పొద్దున్నుంచీ.. నువ్వే ఇంట్లో కూర్చుని ఖాళీగా .. మేమింటికి వచ్చాక కూడా.. నువ్వే టీవీ చూడాలా? అని !!' 'ఇంట్లో నేను "ఖాళీ' గా కూర్చున్నానని.. సాయంత్రం అందరికీ ఒదిగి ఉండాలనీ, సాయంత్రం నేను రిలాక్స్ డ్ గా ఉంటే తనకి విసుగు, జెలసీ.. అలాగని టెన్స్ గా కనపడితే.. 'ఏమీ లేకుండానే ఇంత ఓవరాక్షన్.. నిజంగా ఏమైనా ఉద్యోగం చేస్తే ఏమవుతావు? ' అని .. తట్టుకోలేక పోతున్నాను.. మొన్నేదో సరిగ్గా చూసుకోకుండా ఎక్కువ ఖరీదు పెట్టి కొన్నానని......."

నా వాకింగ్ రౌండ్ అయినా.. పాపం చెప్తోంది కదా అని వింటున్నాను. "అంతెందుకు? నేను అందరూ ఇంట్లో ఉన్నప్పుడు వార్తా పత్రికలు చదువుతున్నా.. ఒక రకమైన లుక్ ఇస్తారు.. వీకెండ్స్ పని లేకుండా ఉండటానికి నేను ఎవ్వరూ లేనప్పుడు చాలా వరకు పని పూర్తి చేసుకుని అందరూ ఉన్నప్పుడు సరదా గా ఉన్నా కూడా సహించలేకపోతున్నారు. సరే అని ఎదో ఒక పని కల్పించుకుని చేస్తున్నట్టు కనిపిస్తే.. "చుట్టూ అందరమ్మాయిలనీ చూడు..చక చక లాడుతూ ఉంటారు..నువ్వు వారాంతం కూడా ఇలా మొహం వేలాడేసుకుని.. పనులు చేసుకుంటూ.."

ఎలా ఉన్నా తప్పే, ఏం వండినా తప్పే, ఏం చేసినా తప్పే, ఏం చేయకపోయినా తప్పే.. అసలు నేను బ్రతికుండటమే వచ్చింది. దుఃఖం తో గొంతు పూడుకుపోయినట్టుంది. . "అయ్యో! ఏంటిది.. " అనుకున్నా..

తనింకా చెప్పుకుంటూ పోతోంది.. "నా కారీర్ వదిలేశాను.. ప్రతి బిల్లూ నేనే కడతాను. ఇంటి పనీ, బయట పనీ నేనే చేస్తాను.. అయినా.."
నేనేమైనా అంటే.. మళ్లీ వాళ్లు కలిసిపోయి.. నన్ను విలన్ చేస్తారు. ఏం చెప్పాలా అని... ఆలోచిస్తూ..

నేను గొణుగుతున్నట్టు... 'అబ్బా అది కాదు లే.. ఏదో ఆఫీసు చిరాకేమో లే'
సంధ్య .. "నాకుండవా.. చిరాకులు? ఒక్క సరదా లేదు షికారు లేదు..'
నేను .. "అది కాదే బాబూ.. వాళ్ల ఆఫీసు ఈ మధ్య మూసేస్తున్నారని రూమర్లు వచ్చాయి కదా.."
సంధ్య.. "పోనీ అమ్మా వాళ్లకి చెప్దామంటే.. తన ఆరోగ్య పరిస్థితే బాగోలేదు.."
నేను.. " ఏదైనా తనకి ఆరోగ్య సమస్య ఉందేమో? బీ పీ? మధుమేహం? కొలెస్ట్రాల్?"
సంధ్య.. "నాకు లేదా? కొలెస్ట్రాల్? అలాగని అరుస్తానా నేను? "
నేను.. "ఒకసారి కూర్చుని నెమ్మదిగా మాట్లాడుకోండి..రమేశ్ అంత చెడ్డవాడు కాదు.."
సంధ్య.. "నాకూ మీ ఆయన ఉత్తమోత్తముడు లా కన్పిస్తాడు.. నువ్వోప్పుకుంటావా?"

లాభం లేదు.. అయినా ప్రతి వాళ్లతో మనం మంచి గా కనపడాలి, వాళ్లు మనగురించి "అబ్బ కృష్ణప్రియ ఎంత మంచి మనిషి? అనుకోవాలని దుగ్ధ ఎందుకు? ఇప్పుడు ఈ మూడ్ లోంచి బయటకి లాగేద్దాం. మహా అంటే.. దానికెంత పొగరు.. అనుకుంటుంది అంతేగా..." అనుకుని రివర్స్ గేర్ వేశా..

నేను.. "అది కరెక్టే.. మా ఆయన మంచి సంస్కార పరుడు.. ఇలాగ ఎవ్వర్నీ అనే తత్త్వం కాదు. ఆడవాళ్లని చాలా గౌరవిస్తారు.."

సంధ్య వైపునుంచి కొన్ని క్షణాల నిశ్శబ్దం.. .. తర్వాత.. " చూడు .. రామ్ నిన్నెప్పుడైనా ఇన్నేసి మాటలన్నాడా? అయినా ఉద్యోగం చేసే ఆడవాళ్లకి ఉండే రెస్పెక్ట్ వాళ్ళకుంటుంది లే.."

(నేను మనసులో.. హ్మ్. అనటమైతే అంది కానీ గొంతు లో తీవ్రత తగ్గింది.. చలో రెండో బాణం తీద్దాం..) పైకి..
" ఉద్యోగాస్తురాలినని కాదులే... ఇన్నేళ్ల పరిచయం లో ఒక్కళ్ళనీ అవమానకరం గా మాట్లాడగా నేను చూడలేదు.. హీ ఈజ్ అ జెంటిల్ మాన్ "

సంధ్య ఈసారి వెంటనే.. "రమేశ్ చెడ్డ వాడని కాదు కృష్ణా.. ఈ మధ్య అలాగ తయారయ్యాడు.. ఎందుకో.."

(నేను మనసు లో.. అమ్మయ్య.. రూట్ మార్చింది.. ) పైకి
" ఎప్పుడైనా పనమ్మాయి రాకపోతే, లేదా.. ఆఫీసు పని చాలా ఉంటే.. నేను పని చేస్తూ అలిసిపోయినట్టు కనిపిస్తే.. గబ గబా.. వచ్చి ఒక చేయి వేస్తారు.. లేదా.. వంట వద్దు.. పిజ్జా తెప్పిద్దాం. అనేస్తారు.."

సంధ్య.. "హే.. ఆయనా అంతేనే.. నాకు వొంట్లో బాగోలేని రోజు.. పెద్ద కస్టమర్ తో మీటింగులూ అవీ ఉన్నా.. ఇంట్లోంచి పని చేసి.. "

(నేను.. తన మాట మధ్యలోనే తుంచేస్తూ..) "అయినా తన దాకా అక్కర్లేదు.. నేనే ఇంకోళ్ళని పెట్టుకుంటా.. లేదా.. బయట నుండి తెప్పించేస్తా.. తనకి చెప్పటం..పర్మిషన్లూ అలాంటివేమీ ఉండవు మా ఇంట్లో.."

సంధ్య.. (కాస్త ఉక్రోషం గా) "ఇంటి ఖర్చు అంతా నేనే నడిపిస్తా కృష్ణా! జేబు ఖర్చు రోజూ నా దగ్గరే తీసుకుంటారు తను.. ఎప్పుడూ డబ్బు విషయం లో ఛీప్ గా తను ఎప్పుడూ లేరు.. మొన్నంటే.. నిజంగా చూసుకోకుండా.. ఏదో కొనేశాను.. రెండు వేల నష్టం..."

(నేను నవ్వాపుకుంటూ.. కట్ చేసేసి ) "హ్మ్.. ఎంత ఆఫీస్ ప్రెషర్ ఉన్నా.. ఇంట్లో చూపించటం.. రమేశ్ తప్పే"

సంధ్య .."కాదు లే.. మరీ ఉదయం తొమ్మిది కల్లా తినీ తినక ఇంట్లోంచి బయట పడితే మళ్లీ ఒక్కోసారి రాత్రి వచ్చేసరికి పదకొండయిపోతోందోయ్..పాపం.. ఈ మధ్య ఎసిడిటీ కూడా వచ్చేస్తోంది.. పైగా అంత సేపు కమ్యూట్ చేసి చేసి.. నడుం నొప్పి తనకి. పైగా.. ఆఫీస్ లో తలనొప్పి పెట్టించేస్తున్నారు.."

(నేను మనసు లో .. 'ఇంక ఈ డైలాగ్ తో మటాష్..) పైకి.. కాస్త ఘాట్టి గా..
"ఏమో బాబూ.. తనైతే.. చాలా అండర్ స్టాండింగ్ . ఎంతైనా సహాయం చేస్తారు. నేనే అంటాను కానీ.. ఒక్క మాటా నన్ను అనరు. అంటే నేనస్సలూ ఊరుకోను..ఎందుకు పడాలి మనం.. నీకేం తక్కువ అసలు? ఎక్కువ మాట్లాడితే నాలుగు రోజులు మీ అమ్మా వాళ్లింటికి వెళ్లిపో.. తెలిసొస్తుంది తనకి భార్య విలువ.."

సంధ్య. "అదేంటి కృష్ణా అలా అంటావు? నువ్వేదో.. కాస్త తెలివి గా మంచి గా చెప్తావు సలహా అనుకుంటే.. ఇలాగ మాట్లాడుతున్నావు? రమేశ్ ఎప్పుడైనా ఇలా ఉన్నాడా? తన గురించి నీకు తెలియదా? "

నేను ".ఊ..."

సంధ్య కంటిన్యూ చేస్తూ .. "తనకి ఆఫీసు లో పని ఎక్కువైపోతోంది.. కంపెనీ కూడా మూసేస్తారని, అమ్మేస్తారని రూమర్స్.. ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు.. వేళకి తిండి,నిద్ర ఉండట్లేదు.. ఏదైనా అన్నా నన్నే కదా. నా మీద కాకపోతే ఎవరి మీద చూపిస్తారు చిరాకు? ఒక సపోర్ట్ గా నిలుస్తాను కానీ నువ్వెవరివి నన్ననటానికి? అని నీలా ఎదురు తిరిగి దెబ్బలాడను. ఇదంతా తాత్కాలికం. "

నేను .."ఊ.."

"అయినా నాకు ఒక్కోసారి చిరాకేదైనా వస్తే నేనంటే తను పడరా? ఒక్క మాటనకుండా పడతారు. నా చిరాకు తగ్గాక నేను సారీ చెప్పేస్తాను. అలాగే ఇదంతా ఒక ఫేజ్. ఇదయ్యాక తన ప్రవర్తనకి తానే సిగ్గు పడి నాకు అపాలజీ చెప్తారు.."

"ఊ.."

.. "సరే.. రమేశ్ లేచినట్టున్నారు.. రోజూ ఎలాగూ ఆదరా బాదరా గా సీరియల్ తిని వెళ్తారు. ఇవ్వాళ్ల పెసరట్లకి నానపెట్టా. ఉప్మా పెసరట్ వేస్తాను.. ఉంటాను. మళ్లీ మాట్లాడతా.. బై"

ఫోన్ పెట్టేసి గట్టి గా నవ్వేసుకున్నా..ఎదురు గా వస్తున్న పెద్దాయన నా వైపుకి అనుమానం గా చూస్తూ ఎందుకొచ్చిందని రోడ్డు క్రాస్ చేసి అవతల పక్కకి వెళ్లాడు..22 comments:

మధురవాణి said...

Hahhahhaa... Too smart! :))

Anonymous said...

haha reverse gare super krishna gaaru...mee friend gaaru correct root lo ki vachhesaru

మాలా కుమార్ said...

మీ రివర్స్ గేర్ టెక్నిక్ బాగానే పనిచేసిందే :))))

జయ said...

బాగుంది:) మీకు నా హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

సంక్రాంతి శుభాకాంక్షలు .

Sravya Vattikuti said...

ఉండండి ఈ పొస్టు లింక్ సంధ్య గారికి ఇస్తున్నాలే :P

జ్యోతిర్మయి said...

ఐడియా బావుంది..ఎవరిమీద ప్రయోగిద్దామా అని వెయిటింగ్...

@ శ్రావ్య గారూ సంధ్య నాకు ఫోన్ చేశారు..చూసారా చూసారా ఆ శ్రావ్య ఏం చేసారో అని మొదలెట్టారు..ఇప్పుడు ఏ గేర్ వెయ్యాలంటారూ

Sravya Vattikuti said...

జ్యోతిర్మయి గారు అది రాంగ్ కాల్ మీరు కంగారు పడకండి , ఈ గేర్ వేయక్కర్లేదు :D

రాజేష్ మారం... said...

:)

జ్యోతిర్మయి said...

Good one Sravya gaaroo...

raf raafsun said...

ఐడియా బావుంది....టెక్నిక్ బాగానే పనిచేసిందే ....సంక్రాంతి శుభాకాంక్షలు.

కృష్ణప్రియ said...

@ మధురవాణి,

:) థాంక్స్!

@ అజ్ఞాత,

ధన్యవాదాలు!

కరక్టా కాదా అన్న మాట ఒక పక్కనుంచితే, పాపం తనకి కావలసింది తన బాధ చెప్పుకోవటానికి ఒక స్నేహితురాలు అంతే! మనం తగు మాత్రం గా మాత్రమే స్పందించాలి :)
Just to clarify... సంధ్య అన్నది ఒక నిజమైన ఫ్రెండ్ పేరు కాదు. తరచూ చుట్టూ ఎదురయ్యే అమ్మాయిల్లో ఒక తరహా అమ్మాయిల జనరల్ స్వభావం అంతే.

@ మాలా కుమార్ గారు,

కదా! బ్రహ్మాస్త్రం :)

కృష్ణప్రియ said...

జయగారు,మాల గారు

ధన్యవాదాలు. మీకు కూడా కాస్త లేట్ గా సంక్రాంతి శుభాకాంక్షలు..

శ్రావ్య,

:) అంత పని చేయకండి. అప్పుడు ఏ గేరూ పని చేయదిక.

@ జ్యోతిర్మయి గారు,

:) థాంక్స్..

రాజేశ్ మారం గారు, రాఫ్ రాఫ్సన్ గారు,

ధన్యవాదాలు!

రాజ్ కుమార్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్....
ఆవిడ ఈపోస్ట్ చూస్తే పరిస్థితి ఏంటండీ? ;)

మానస చామర్తి said...

నిజంగానే సానుభూతి కోరుకోవడం ఒక దురలవాటుగా మారిపోతోందండీ! కష్టాల చిట్టా ఒకరిప్పగానే "నాకు పదింతలు ఎక్కువ కష్టాలు" అంటూ ఏవేవో చెప్పడం, లేదంటే "నీ కన్నా మేమెంత గొప్పో తెలుసా" తీరులో విసిగించేయడం...

చాలా అందంగా రాశారు. చివర్లో నేనూ గట్టిగా నవ్వేశాను :)

lalithag said...

"అయినా ప్రతి వాళ్లతో మనం మంచి గా కనపడాలి, వాళ్లు మనగురించి "అబ్బ కృష్ణప్రియ ఎంత మంచి మనిషి? అనుకోవాలని దుగ్ధ ఎందుకు? "
అయ్యో, పాపం, ఇదీ రివర్సయ్యిందే :) కృష్ణప్రియ ఎంత మంచిదీ. తన స్నేహితురాలి మూడ్ బాగు చెయ్యడం కోసం తనకి పొగరనుకున్నా పర్వాలేదనుకుంది :)అంతే కాదు తన మంత్రం బలే పని చేసింది. ఇప్పుడు కృష్ణప్రియ తెలివైనది కూడా :)))

Madhavi said...

super............ :-)

bonagiri said...

నిజమే, ఈ టెక్నిక్ ప్రాక్టికల్‌గా బాగానే పని చేస్తుంది.
చాలామంది, ఔనంటే కాదనిలే, కాదంటే ఔననిలే టైపే.
ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా.
మనం చెప్పింది నిజమైనా, ఒప్పుకోకుండా వాదిస్తూ ఉంటారు.

kamudha said...

This is one of the best post, you got rid of looking good and took responisibility of your friend. This is very good.

I have shared this on my face book and my frineds also liked this.

కాముధ

కృష్ణప్రియ said...

@ రాజ్ కుమార్ గారు,

:)) థాంక్స్! చస్తాను సంధ్య కి తెలిస్తే..

On a serious note,

నేను సాధారణం గా రెండు రకాలు గా రాస్తాను.తెలిసిన వారి మీద రాసేటప్పుడు వారి అనుమతి తో, వారికి నా టపా ఒకసారి చూపించి, లేదా..ఊహాజనిత పాత్ర నాతో మాట్లాడుతున్నట్టు

@ మానస,

:) థాంక్స్!

లలితా,

ఇప్పటికైనా తెలుసుకున్నావా? నేనెంత త్యాగశీలినీ,స్నేహ శీలి నీ,మరియు తెలివైన స్త్రీ నో? :)) థాంక్స్..

స్వగతం : 'బాబోయ్.. నాకు నేనే భుజం మీద తట్టుకుని శెభాష్ అనుకోవాలనిపిస్తుందేంటి?'

కృష్ణప్రియ said...

@ మాధవి గారు,

థాంక్స్!

@ bonagiri గారు,

అవును. :)

@ కాముధ,

ఓహ్. చాలా చాలా థాంక్స్!

Surabhi said...

Krishna Priya gaaru,
I like all your posts and most of the times I feel that I'am reading my diary, may because ihave the same lifestyle too.
Specially on this post. Exactly I had similar conversation with my dearest freind padmaja and I used the same trick. The thing is I did it before reading your post and I 'am so amazed to see the similarities in our thought process.
I really appreciate your writings.Very good posts. Keep going

Surabhi

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;