“అమ్మా!! రేపు 800 రూపాయలియ్యాలి స్కూల్లో.. కవర్ లో పెట్టి ఇచ్చేయ్..” అంది చాలా మామూలు గా మా పెద్దది.
“ఎందుకు? స్కూల్లో పనీ పాటా లేనట్టుంది! ఎప్పుడు చూడు.. ఎనిమిది వందలియ్యి, వెయ్యియ్యి.. అంటూ... “
“స్పోర్ట్స్ డే కి’ (ఏంటింత వివరం అడుగుతావు? అన్నట్టు మొహం పెట్టి)
“మీ స్కూల్ వాళ్లు స్పోర్ట్స్ డే చేస్తే నేనెందుకియ్యాలి? నువ్వే ఆటా ఆడట్లేదు కదా! ”
“అమ్మా!! మేం ఆడకపోయినా డ్రిల్ ఉంటుంది కదా.. మాకు ఒకేరకం బట్టలు కుట్టించాలి కదా!”
“స్కూల్ డ్రెస్ వేసుకుని ఏడవచ్చు కదా!.. “
“అమ్మా.. ఇదేమీ కంపల్సరీ కాదు. కానీ ‘strongly encouraged’ అని మా ప్రిన్సిపాల్ చెప్పారు. ప్రాక్టీస్ కి రాని వాళ్లకి పాఠాలు ఉండవు. ఊర్కే తరగతి గది లో కూర్చోవాలి. మా క్లాస్ వాళ్లల్లో వెళ్లని వాళ్లు లేరు.ఒక్క అమ్మాయి కి కాలు లేదు కాబట్టి ఆ అమ్మాయి ఒక్కత్తే ఉంటుంది. నీ ఇష్టం ” అని చేతులెత్తి నిరసన చూపించి వెళ్లిపోయింది మా అమ్మాయి.
ఈ సంవత్సరం ఇప్పటికే ఎన్ని సార్లు ముక్కు పిండి వసూలు చేశారో! దీనికి వెయ్యి, దానికి మూడు వేలు.. అంటూ.. టైలర్ల తో ఏదో ఒప్పందం ఉండే ఉంటుంది. ఏదో ప్రోగ్రాం పెట్టి నాట్యం పెట్టటం..నాలుగు వేల మంది విద్యార్థులకి బట్టలు కుట్టే కాంట్రాక్ట్.. పైగా.. ఆ చెత్త డ్రస్సులు పిచ్చి బట్ట తో, ధగ ధగ మెరిసేలా కుట్టిస్తారు ఇంకోసారి ఇంట్లో వేసుకోవటానికి కూడా లేకుండా..ఎరుపు, మామిడి పండు పసుపు, వంగపండు రంగు, నారింజ రంగు చారలతో, అడ్డదిడ్డమైన కాంబినేషన్ల గుడ్డల మీద జరీ పోగు..వేసుకోవటానికుండదు, దాచుకోలేము. ఏ కార్యక్రమమైనా event management కి ఇచ్చేసి, అక్కడే తిండి అవీ కూడా యాభై కి నూడిల్స్, ఇరవై కి చిప్స్, ఐస్ క్రీం కి యాభై.. వేదిక ‘నలంకరించిన’ ముఖ్య అతిథులకి పుష్ప గుచ్చాలు, పెద్ద షామియానా, వీడియో,ఫోటోలు తీసి వాటికి మళ్లీ పిల్లల దగ్గర్నించి వసూలు చేయటం.. కార్లతో రోడ్డంతా జామ్ అయిపోవటం..
పిక్నిక్ అని రిసార్ట్ లకి తీసుకెళ్లటం .. విహార యాత్రలకి విదేశాలు తీసుకెళ్లటం.. అంతెందుకు? వారం లో ఐదు రోజుల్లో మూడు రకాల యూనీఫారాలు..పుట్టిన రోజుకి స్కూల్లో పంచటానికి ఖరీదైన చాక్లెట్ బార్లు, బట్టలు, పార్టీలు,..క్రిస్మస్ కి గిఫ్టులు..
చిన్నప్పుడు మా బళ్లో కార్యక్రమాలు గుర్తొచ్చాయి... మా బడి వార్షికోత్సవాలకి ‘మా తెలుగు తల్లికి’ పాట కి నాట్యం. మా టీచర్ గారు ఎలా చేయాలో ఎంతో చక్కగా నేర్పించారు కానీ అందర్నీ పట్టు లంగాలు వేసుకుని రమ్మన్నారు. మా అమ్మకి పెళ్ళప్పుడు కొన్న చీరలు మూడు. ఏదో వాటిల్లోంచి ఒకటి చింపించి నాకూ, మా చెల్లికీ కుట్టించింది కాబట్టి, ఏ కార్యక్రమం అయినా అవే వేసుకునేవాళ్ళం. పైగా మా భాగం అవగానే, అవీ కుట్టించుకోలేని పిల్లలు గబగబా మా బట్టలు వేసుకుని చేసేవారు. ఈ డాన్స్ లో మరి అందరమూ వేయాలి. తల నొప్పయిపోయింది మా టీచర్ గార్కి. ఇద్దరికి కనీసం మెరుపు పరికిణీలున్నాయని ఉన్నారు, మా చెల్లి పరికిణీ కుట్లు రెండు తీసి నా స్నేహితురాలు వేసుకుంది. ఇంకో ఇద్దరు అప్పు తెచ్చుకుని తంటాలు పడ్డారు. ఒకమ్మాయి కి ఆ భాగ్యమూ లేక నాట్యం లో పాలు పంచుకోలేకపోయింది. ఆ అమ్మాయి ఒకటే ఏడుపు. కళ్లల్లో నీళ్లు తిరిగి అప్పు తెచ్చుకున్న పరికిణీలు వెనక్కి ఇవ్వమని ఆ ఇద్దరు పిల్లలకీ చెప్పి, ఇద్దరి చేత ధోవతులు కట్టించి, మీసాలు గా కాటుక దిద్ది మగ వారిగా మార్చి, మిగిలిన ఒకరికి తన చీర ఇచ్చి తెలుగు తల్లిని చేసిన మా పంతులమ్మ గుర్తొచ్చి, ‘ఆ నాటి చదువులు, ఆ గురువులు, మధ్యతరగతి విద్యార్థులు వారి ఆర్ధిక స్థాయి.’. అలా పాత జ్ఞాపకాల్లోకి జారుకున్నాను.
వేదిక మీద పాత కాలం టేబుల్, మీద ఒక చీర, మా ఇంటినుంచి తెచ్చి ఒక ఫ్లవర్ వేజూ, సంవత్సరానికోసారి మైక్ తెస్తే గొప్ప, ఆగస్ట్ పదిహేనుకీ, జనవరి ఇరవయ్యారుకీ పది పైసల చాక్లేట్లు పంచితే గొప్ప.. ఇంట్లో ఏడిస్తే వచ్చే తల్లిదండ్రులు..వాళ్లల్లో కార్లల్లో వచ్చేదేవరని?
పిక్నిక్ కి పబ్లిక్ గార్డెన్ కి తీసుకెళ్తేనే, సగం మంది వచ్చేవారు కాదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కి రెండు రోజులు వెళ్లటానికి ఏడ్చి, నిరాహార దీక్షలు.. వేసిన ఒట్లు తలచుకుంటే నవ్వొచ్చింది. సగం సంవత్సరం దాకా శని వారం వేయాల్సిన తెల్ల యూనీఫారం లేక, బూట్లు లేక ఎంతమంది దెబ్బలు తినేవారో, చేతిపని క్లాస్ లో సంచీ కుట్టాలంటే ఇంట్లో బట్ట కొనక ప్రతి క్లాస్ కీ ఒక్కో దెబ్బ తినే పిల్లలు గుర్తొచ్చారు.. అంతెందుకు నాలుగైదు పాఠాలు అయ్యాక కూడా పుస్తకాలు కొననివారెందరో, టిఫిన్ బాక్స్ లో నిమ్మకాయ పులిహార తప్ప తేని వాళ్ల సంగతో? పుట్టిన రోజున కూడా కొత్త దుస్తులు లేక యూనీఫారం లో వచ్చిన పిల్లలు గుర్తొచ్చారు.. ఇటుక బట్టీ లో పని చేసే కార్మికుడి కొడుకు స్కూల్ ఫీజు కట్టలేక మానేస్తుంటే అందరమూ కొద్ది కొద్దిగా వేసుకుని కట్టిన జ్ఞాపకం ఒకటి వచ్చింది. మనసు చేదయిపోయింది. నాకింతే తెలుసు.. ఈ మాత్రం లేని వాళ్ల కథలు ఎన్ని వినలేదు? ...
వీళ్లకి విలువ తెలియదు.. కాస్త విలువ నేర్పాలి.. దృడం గా నిశ్చయించుకున్నాను.
మా పెద్దది మళ్లీ వచ్చింది..
“అమ్మా! మన ప్రింటర్ మళ్లీ పని చెయ్యట్లేదు.. ప్రాజెక్ట్ ఎల్లుండి లోపల ఇచ్చెయ్యాలి.. ఎలా? బయట చేయిస్తావా?, ఈ ప్రింటర్ ని తీసేసి మనం కొత్తది కొనాలమ్మా!” అంది విసుగ్గా మొహం పెట్టి.
నేను గంభీరం గా కూర్చున్నాను. అది పట్టించుకోకుండా..
“అమ్మా! చదువుకునే గది లో ఫాన్ శబ్దం వస్తోంది. అది కూడా.. “ అంటూ నా మొహం లో భావాల్ని చూసి..
“I know I know..వెనక గుడిసెల్లో పిల్లలకి ఫ్యాన్ వదిలేయ్, గది లేదు, చదువే సరిగ్గా లేదు..”
“కాదు తల్లీ.. మీకు ప్రింటర్ ఉంది ఇంట్లో! ఎంత మంచి సదుపాయం? ఎందరికి ఉంటుంది? కాస్త చుట్టూ చూడు. ఆ బొమ్మలేవో చేత్తో వేయచ్చుకదా! “
అదొక రకమైన చూపు చూసి.. “అమ్మా! నేను బొమ్మ వేసేస్స్తాలే.. డోంట్ వర్రీ.. BTW,.. మా ఫ్రెండ్స్ ఇంట్లో wii, kinnect,DS, కిండిల్, పీ యెస్ పీ, ipod, laptop అచ్చం గా వారికే ఉన్నాయి. కొందరికి ఇ-పాడ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి.” అని ఎఫెక్ట్ కోసం ఆగి అప్పుడప్పుడూ నేను కొట్టే సినిమా డైలాగ్ “ప్రింటర్ తో పాటూ వాళ్లకి అమ్మ కూడా ఉంది” అని నవ్వేసింది..
ఒక్కసారి గా “ఈ ఫౌంటెన్ పెన్ను ఏదో క్లాస్ లో ఉన్నప్పుడు మా నాన్న కొనిచ్చాడు.. ఇరవయ్యేళ్లు దాచుకున్నాను. నువ్వు నెలకి ఇరవై పెన్నులు పోగొడుతున్నావు.. గుడ్డి దీపం లో చదువుకుని పైకొచ్చాను...” అని చెప్తున్న మా నాన్నగారి వీడియో.. నా కళ్లముందు ఒక్కసారి గా ఆటో ప్లే అయిపోయింది.
44 comments:
అవసరాల అర్ధం మారిపోయింది, రోజులు అర్ధం చేసుకోలేనంత వేగంగా పరిగెడుతున్నయ్. ఒపికున్నంతవరకూ పరిగేత్తడమే..వేరే దారి లేదు మరి!
antenandi. kaalam marutoone vuntundi...
repu mee pillalu peddavallayyetappatiki ela vuntundo
నిజమే !! నేనైతే పదవ తరగతి లో సంవత్సరం మొత్తం కట్టిన ఫీజు వెయ్యి దాటదు. ఇప్పుడు అయితే అది యాబై వేల పైనే !!
మరి చదువు ఏమైనా సాగుతుంద అంటే అది లేదు.
Nice..
కాలం మారింది కాలంతో పాటే మనమూ మారాలి అంటూ అందరూ చెప్పొచ్చేవాళ్ళే కానీ.... మన బాధని అర్థం చేసుకునేదెవరు....
అలాగని పిల్లలకి తక్కువచెయ్యడానికి మనసొప్పదు...వాళ్ళు ఎప్పటికి విలువలు తెలుసుకుంటారో తెలియదు....
చిన్నప్పుడు మా స్కూల్‌లో టాయ్ క్లబ్ పెట్టినట్టు గుర్తు కానీ ఆ క్లబ్‌కి ఎవరూ డబ్బులు కట్టలేదు.
ఎక్కడికో... వెళ్ళిపోయానండీ..
తిరిగి రావాలనిపించలేదు మళ్ళీ..
ఇలా స్కూల్లో ఫంక్షన్స్ కి డబ్బులు దండుతారని(దోచేస్తారని)తెలియదండీ ఇప్పటిదాకా.. ;(
చూస్తూ వుండండీ,
అన్నీ మీ నాన్నగారి కాలానికి మళ్ళీ వచ్చేస్తాయి
భూమి గుండ్రముగా వుండును !
ఈ మధ్య పేపర్లో చదివా వెస్టర్న్ కంట్రీ స్ లో మళ్ళీ 'పాత తరహా లో వెళ్ళా లని చాలా మంది వుత్సాహం చూపుతున్నారంటా అంటే, అవి కొత్త ట్రెండ్ అయిపోతాయి. కొంత కాలం తర్వాత మన దేశం లో కూడా అవి కొత్త ట్రెండ్ క్రింద వచ్చేస్తాయి !
'యు నో దిజ్ పెన్ మై మామ్ ప్రెసెంటడ్ ఫర్ మై ఫస్ట్ బర్త్ డే !
చీర్స్
జిలేబి.
>>ఆ చెత్త డ్రస్సులు పిచ్చి బట్ట తో, ధగ ధగ మెరిసేలా కుట్టిస్తారు ఇంకోసారి ఇంట్లో వేసుకోవటానికి కూడా లేకుండా...
బాగా చెప్పారు.
చాలా బాగా చెప్పారు.
ఇది 1971లో జరిగిన సంఘటన. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజులకు జరిగిన ముచ్చట. మా నాన్నగారు శ్రధ్ధగా జమాఖర్చులు పద్దు వేసుకునేవారు. ఆ రోజున పద్దులు సరిజూసుకుంటున్నారు కాబోలు, నన్ను పిలిచి 'ఒరేయ్ యీ పది తీసుకో' అన్నారు. నేను ఆశ్చర్య పోతుంటే ఆయనే చెప్పారు. "ఈ మూడు సంవత్సరాలుగా నీ డిగ్రీ చదువుకు అయిన ఖర్చు అన్ని రకాలూ కలిపి 1990 రూపాయలు అయింది. ఇప్పుడు మరో 10 నీ కిస్తే చక్కగా 2000 సంఖ్య అవుతుంది."
అలా ఇచ్చారా, ఆ 10 రూపాయలనోటును రోజూ ఒక చొక్కా జేబులోంచి మరొకదానికి మారుస్తూ కొన్ని నెలలు గడిపి విసుగొచ్చి మా నాన్నగారికే తిరిగి యిచ్చేసాను. ఆ రోజున ఆయన మా అమ్మగారితో 'వీడు ఆర్నెల్లపాటు ఒక పది కూడా ఖర్చుచేసుకోలేకపోయాడే, యెలా బ్రతుకుతాడో యేమిటో' అన్నారు!
కొసమెరుపేమిటంటే, నాకన్నా మూడేళ్ళు చిన్న అయిన మా తమ్ముడికి డిగ్రీ మొదటి సంవత్సరం ఖర్చే అక్షరాలా పదివేలయిందని మా నాన్నగారు నాతో అన్నారు.
Very nice post. Looking fwd for more.
అంతే అంతే, మా తాతగారు గురువు గారింటికే వెళ్ళి చదువుకున్నారట వేదం.స్కూళ్లే లేవు... దహా
ఎంత కాలం మారినా 800 స్పొర్ట్స్ డే కి అంటే మీరంతా ప్రొటెస్ట్ చేయాల్సిందే.
ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదండీ!
స్టార్ హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు బిల్లుకి రీజను అడగకూడదు.
నేను 80లలో హైస్కూల్లో చదివినపుడు 6, 7 తరగతులకి ఫీజు ఏడాదికి 9 రూపాయలు.
8, 9 మరియు 10 తరగతులకి ఫీజు ఏడాదికి 20 రూపాయలు మాత్రమే.
ఒక గుమస్తా కొడుకునైన నేను, మా ఊరి మునిసిపల్ చైర్మను కొడుకు, ఒక రైతు కూలీ కొడుకు, ఇలా అందరూ ఒకే స్కూల్లో చదివేవాళ్ళం. ఇప్పుడు వీధి బళ్ళలో ఎవరు చదువుతున్నారు?
నాకు ఒకోసారి అనిపిస్తుంది, పిల్లలకి పెట్టే ఖర్చంతా బాంకులో వేస్తే, వాళ్ళకి జీతం కంటే ఎక్కువ డబ్బులు వస్తాయేమోనని.
శ్యామలీయం గారూ ఇప్పుడు సమస్య ఖర్చు కంటే..ఆ రోజుల్లో మీరు పది రూపాయలు ఆరు నెలలు దాచారు. ఇప్పుడు పది వేలు ఇచ్చినా పిల్లలకు దాచాలనే ఆలోచనే రాదు. ఈ మధ్య వరకూ పెంపకం లోపం అనే అపోహలో ఉండేదాన్ని. కాని పరిస్థితులే అలా మారిపోయాయి అనుకోవాల్సి వస్తుంది.
ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. తప్పదు.
నేనూ ఇదే ఖర్చులో ఉన్ననండీ ప్రస్తుతం! రేపు ఇరవయ్యారుకి మా అమ్మాయి కాష్మీరీ డాన్స్ లో పేరు ఇచ్చేసింది.(నా తప్పేలే! ఇంతకు ముందు అడిగి పేరు ఇచ్చింది.అప్పుడు నేను "నీకు ఆసక్తి ఉంటే పేరు ఇచ్చెయ్యామ్మా! ప్రతి సారీ నన్ను అడగటం ఎందుకూ అన్నాను) అందువల్ల ఆ కాష్మీరీ డాన్స్ కి వెయ్యి రూపాయలిచ్చాను. ఆ ఐదు పైసల బిళ్ళలూ, ముసుగులూ కనీసం ఇంట్లో కూడా వేసుకోలేదు.
పోయిన ఆగస్టు 15 కి ట్రైబల్ డాన్స్! ఆరొందలు తీసుకున్నారు. ఇంతా చేసి వీళ్ల యూనిఫాం మీదే పాకింగ్ లో వాడే వైర్లు రంగు రంగులవి వేలాడ దీసి, తల పైన కూల్ డ్రింక్స్ తాగే స్ట్రాలు హెయిర్ బాండ్ పెట్టి దాంట్లో గుచ్చారు. మొత్తం మీద వంద మించదు ఖర్చు.
అంతకు ముందువి డ్రెస్ లు! ఆరెంజూ-నీలం, ముదురాకు పచ్చ మీద పసుప్పచ్చ ఆఠీను గుర్తులు, పసుప్పచ్చ సూటు (కోడి పిల్లల డాన్స్)
మొన్న కాస్త మొహమాట పడుతూ "నీకోటి ఇస్తాను. నన్ను తిట్టకూడదు"అని పనమ్మాయి దగ్గర మాట తీసుకుని ఆ డ్రెస్ లు ఇస్తే మా గౌసియా మాట ఇచ్చినందుకు నన్ను తిట్టలేక "అవి మా పిల్లలకు పట్టవమ్మా" అని చెప్పేసి పోయింది.
కట్టే ఫీజులు కాక, పై ఖర్చు ఎంత అవుతుందంటే గుండె చెరువవుతుంది. ఇవి కాక ప్రతి రెండ్రోజులకోసారి మా స్టేషనరీ షాపు వాడి దగ్గర "cruelty to animals" చార్ట్ ఉందా, our cricketers ఉందా, అని లైన్లో నిలబడి అడగటం, అడిగినవి అక్కడ దొరక్కపోతే గూగుల్లో వెదికి కలర్ లో ప్రింట్స్ తీయడం ...ఇంకా మైదా పిండితో కుండలు చేయడం,,,హుష్!
ఓస్! ఎనిమిదివందలేనా? అప్పుడే ఎక్కడ అయింది?....
బాగా చెప్పారు. మొన్న మా ఫ్రెండు కొడుకుని ఎల్‌కే్‌జీలో చేర్చడానికి పోతే యేడాదికి యాభైవేలు అడిగాడట. అది పెద్ద కార్పోరేట్ బడి కూడా కాదు. ఇక ఏ కో, కో పోతే ఎంతడుగుతారో. నేను డిగ్రీలో చేరేవరకు పెట్టిన మొత్తం ఖర్చుతో వీళ్లు ఒక్క ఏడాది చదువుతారంతే.
నేను 8 లో వుండగా 60 మందిని ఒక్క బస్సులో తీస్కెళ్లే 3 రోజుల ట్రిప్ కోసం ఎంత గొడవ చేసానో. మొన్న మా అక్క కూతురికి పదో క్లాసులో ట్రిప్ అని చెప్పి వారం రోజులు రాజస్థాన్ కి విమానంలో తిప్పుకొచ్చారు. ట్రిప్పులు, పార్టీలు, స్పోర్ట్సు, యానివర్సరీలు.... అన్నీ కలిపితే ఇంకో ఏడు ఫీజుకి సరిపడా అవుతున్నాయీమధ్య.
బాగా చెప్పారు. మొన్న మా ఫ్రెండు కొడుకుని ఎల్‌కే్‌జీలో చేర్చడానికి పోతే యేడాదికి యాభైవేలు అడిగాడట. అది పెద్ద కార్పోరేట్ బడి కూడా కాదు. ఇక ఏ HPS కో, DPS కో పోతే ఎంతడుగుతారో. నేను డిగ్రీలో చేరేవరకు పెట్టిన మొత్తం ఖర్చుతో వీళ్లు ఒక్క ఏడాది కూడా చదవలేరు.
నేను 8 లో వుండగా 60 మందిని ఒక్క బస్సులో తీస్కెళ్లే 3 రోజుల ట్రిప్ కోసం ఎంత గొడవ చేసానో. మొన్న మా అక్క కూతురికి పదో క్లాసులో ట్రిప్ అని చెప్పి వారం రోజులు రాజస్థాన్ కి విమానంలో తిప్పుకొచ్చారు. ట్రిప్పులు, పార్టీలు, స్పోర్ట్సు, యానివర్సరీలు.... అన్నీ కలిపితే ఇంకో ఏడు ఫీజుకి సరిపడా అవుతున్నాయీమధ్య.
నేను పదో తరగతి దాకా పైసా ఫీజు లేకుండా ప్రభుత్వం వారి పాఠశాలలోనే చదివాను. మా అమ్మాయి ఇండియా లో నెల రోజులు వెళ్ళి ఇక్కడకొచ్చేసిన స్కూలు కి నాలుగు వేలు కట్టేసరికి వుసూరుమనిపించింది.
మనకెలాగూ అలా జరగలేదు...అది అడిగిందల్లా తెచ్చివ్వాలని మా వారూ...అడగ్గానే అన్నీ ఇచ్చేస్తే దానికి దేని విలివా తెలీదని నేనూ రోజూ యుధ్ధమే...అది పెద్దయ్యాక ఎలా తయ్యారవుతుందో మరి...
మేము చేసిన డాన్సు కి మా అమ్మగారు తన చీర ఇచ్చి పాడు చెయ్యనని చెప్తే పాపం మా మాస్టారు వాళ్ళావిడ పట్టు చీర ఇచ్చి మళ్ళీ నేనెక్కడ పడితే అక్కడ కూచుని దాని పని పట్టేస్తానని ఇంకో పిల్ల కి కుర్చీ ఇచ్హి కాపలా పెట్టడం గుర్తొచ్చింది మీ చిన్న నాటి సంగతులు చదువుతుంటే...:)
ఇక్కడ సమస్య స్కూలు ఆడంబరాలనుకుంటా?
పై వ్యాఖ్యలలో నుచి తీసుకున్నా ఈ మాటలు నిజమనిపిస్తోంది మరి:
"ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదండీ!
స్టార్ హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు బిల్లుకి రీజను అడగకూడదు."
ఇవి అన్నీ ఆర్థికంగా పై స్థాయిలోకి ఎదిగిన తర్వాత 'కొని ' తెచ్చుకునే సమస్యలే కదా? కాదా?
స్కూలు వాళ్ళని ఈ డబ్బులు కడుతున్న వారుగా జమా ఖర్చుల గురించి తల్లి దండ్రులు ప్రశ్నిస్తున్నారా? వాటి ఉపయోగం గురించి నిలదీస్తున్నారా? యాజమాన్యం వినదూ, తల్లిదండ్రులకు ఇవే బళ్ళు గతి అని వాళ్ళ ధైర్యం అంటారా? లేక పైసల విలువ తల్లిదండ్రులకే తగ్గి inconvenience నుంచి తప్పించుకోవడానికి ఒప్పేసుకుంటున్నారా? నిజంగా ఇటువంటి బళ్ళు తప్ప గత్యంతరం లేదా? లేక ఈ బళ్ళలో ఈ చిరాకులను మించిన ప్రయోజనాలు ఏవైనా ఉన్నాయి కాబట్టి ఇవి భరించక తప్పదా? ఈ సమస్య చాలా లోతైనది. ఇది పిల్లల తప్పు అని మాత్రం అనిపించడం లేదు.
దూరంగా ఉంది వింటున్న సమస్యలు కనుక నేను చూసే కోణంలో తేడా ఉండ వచ్చు. అదే ఐతే తెలుసుకోవాలని ఉంది.
నాకయితే మీ అమ్మాయి చెప్పింది బాగా నచ్చింది ( అంటే చివరి రెండు పేరాలు).
నా అంచనా ప్రకారం మీ నాన్నగారి జీతం బహుశా అప్పట్లొ మూణ్ణాలుగు వేలు ఉండి ఉండొచ్చు. అందులొనుండి మీకు ఇచ్చిన పది రూపాయలు మీకు చాలా అపురూపం గా ఉండి ఉండొచ్చు. అప్పటి మీ కుటుంబ సంపాదనకి పది రూపాయల చొప్పున ఇప్పటి మీ కుటుంబ సంపాదన ప్రకారం నిష్పత్తి కట్టి చూస్తే ఇప్పటి 800 వందలు అప్పటి పది రూపాయలకి సమానం అయ్యి ఉండొచ్చు అని నా నమ్మకం. ఇక అప్పటికి ఇప్పటికి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లొ చాలా తేడా వచ్చింది కాబట్టి అప్పట్లొ విలాస వస్తువులు అనుకున్నవి ఇప్పుడు కనీస అవసరాలుగా మారిపొయాయి. మీ చిన్నప్పుడు పట్టు పరికిణి ఖరీదయిన విలాస వస్తువు అనుకుంటే ఇప్పుడు అదే ప్లేస్ లోకి ఐ పేడ్ వచ్చింది.
ఓ రెండు దశాబ్దాలు తరువాత మీ అమ్మాయి "నా చిన్నప్పుడు స్పొర్ట్స్ డే కొసం 800 రూపాయలు అడగడానికి ఎంత పేచీ పెట్టాల్సి వచ్చిందొ... ఇప్పుడు నా పిల్లలు స్పొర్ట్స్ డే అంటూ 50 వేలు అడుగుతున్నారు" , " మీకు తెల్సా .... మా చిన్నప్పుడు నేను మా చెల్లి ఒకే లాప్ టాప్ షేర్ చేసుకునే వాళ్ళం" అని ఒక పొస్ట్ రాసేయొచ్చు :-)
ఇవన్నీ ఎలా ఉన్నా.......... వీ, కిన్నెట్, కిండిల్, ఐ పాడ్, ఐ ఫొన్ లాంటివి అడగకుండా కేవలం 800 తొ సరిపెట్టడం, కేవలం పాడయిపొయిన ప్రింటర్ ని బాగు చేయించమని అడగడం చూస్తుంటే బాధ్యతల విషయం లొ మీ అమ్మాయికి మీ పొలికలే వచ్చాయి అనిపిస్తుంది.. మీరు నిశ్చింతగా ఉండొచ్చు :-)))
/టిఫిన్ బాక్స్ లో నిమ్మకాయ పులిహార తప్ప తేని వాళ్ల సంగతో?/
అబ్జక్షనండి. పులిహోర రుచి ఎరిగిన వాళ్ళెవరూ ఇలాంటి మాటలు అనరు. ఐనా నేను వారంలో కనీసం రెండ్రోజులు పులిహోర లంచ్ బాక్స్లో తీసుకెళతానని మీకెలా తెలిసింది? ఎంత నిమ్మకాయ పులిహోర తినేవాళ్ళైనా అందులో దోరగా వేయించిన వేరుశెనగ/జీడిపప్పు వేసుకుని ఆరగించేవారు కూడా వుంటారన్న చేదు నిజాన్ని మీరు మరచిపోయి మీరిలా ఎద్దేవా చేయడం ఏంబాగోలేదండి. నేను నిరసిస్తున్నా. లంకలో హోరా హోరిగా పోరాడిన తమిళ పులులకు ఇష్టమైన అన్నం కాబట్టే పులిహోర అనే పేరు వచ్చిందని జాఫ్నా నుంచి వచ్చిన తంగముత్తు ఇళ్ళాంగోవన్ అనే మా పొరుగింటాయన చెప్పారు. రావణబ్రహ్మ పులిహోర లైక్ చేసేవాడని కంబరామాయణంలో వుందట.
పులిహోర ప్రియుల మనోభావాలు గాయపరిచినందుకు పరిహారంగా... "పులిహోరలు-అందులో రకాలు" అనే వ్యాసం రాయాలని డిమాండ్ చేస్తున్నా.
--------
పాపం చిన్నపిల్ల,యూనిఫాం వేసుకుని డ్రిల్లు చేయాలని ముచ్చట పడి నోరు తెరిచి ఓ 800రూ అడిగింది. చిన్నావన్నా స్కూలా! గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూలాయే. కార్పొరేషన్ స్కూళ్ళలో ఈ ముచ్చటలు మీకు కావాలన్నా తీరుతాయా? ఈమాత్రానికే ఏకంగా ఓ వ్యాసం రాసేశారే! పాపం ఇచ్చేయండి, రేపు అమెరికా వెళ్ళి సాఫ్ట్వేరుద్యోగం చేసి నెలకు 80వేలు మీకు పంపుతుందిలేండి, ఇచ్చిచ్చేయండి. :))
నాదీ కూడా పైన January 20, 2012 7:07 AM దగ్గర అనానిమస్ గారు చెప్పిన అభిప్రాయమే నండి, ofcourse మీ పోస్టు లో చివరి వాక్యం లో మీరు అదే చెప్పారు అనుకోండి .
ఎవరి బాల్యం వాళ్లకి అద్భుతమైన జ్ఞాపకం అది నిన్నటి తరానికైనా , ఇప్పటి తరానికైనా , రేపటి తరానికైనా :-)
@ జ్యోతిర్మయి గారు,
అవును. చాలా కన్ఫూజింగ్ గా ఉంటుంది.
@ రవి గారు,
నిజమే.
మన కొనుగోలు శక్తి పెరగటం వల్ల ,మన ప్రయారిటీలు,జీవన శైలి మారటం వల్ల , పిల్లల చుట్టూ మన జీవితాలు తిరుగుతుండటం వల్ల, ప్రతి తరానికీ కొత్తగానే ఉంటుందేమో :)
@ cricketLover,
:) నేను పదవ తరగతి లో నెలకి ఆకాశారాలా అరవై మూడు రూపాయలు.
ఇప్పుడు అందరూ పోటీలు పడి ఈ ఖరీదైన స్కూల్స్ లో చేర్పించేస్తున్నాము.. మా అమ్మాయి స్కూల్లో ఒకటి విన్నాను.. 'పాపం.. అది ఒక్కసారి కూడా విదేశాలకి వెళ్లలేదుట..' లాంటివి. స్కూల్ టూర్లు సింగపూర్ కీ, మలేషియా.. యూరప్.. లాంటివి చేస్తున్నారు!
అలాగని మా పిల్లల స్కూల్ సంవత్సరానికి లక్ష+ తీసుకునే పెద్ద ఖరీదైన ఇంటర్ నేషనల్ స్కూలేం కాదు.
@ రెండవ అజ్ఞాత,
ధన్యవాదాలు!
@ మాధవిగారు,
నాకు ప్రపంచం లో అన్నింటికన్నా క్లిష్టమైన పని 'పిల్లల పెంపకం' అనిపిస్తుంది. ఏది తప్పు? ఏది ఒప్పు? ఎంతవరకూ పర్వాలేదు? ఎక్కడ వదిలేయవచ్చు? అనేవి.. కాలానుగుణం గా మారిపోతూ .. మనల్ని చాలా అయోమయం పాలు చేస్తుంటాయనిపిస్తుంది :-(
@ ప్రవీణ్ శర్మ గారు,
హ్మ్.. మా స్కూల్లో కూడా చిన్న పాటి కార్యక్రమాలకి సగానికి పైగా పిల్లలు డబ్బు కట్టట్లేదనే,..డబ్బుతో పని బదేవాటిని చేసేవారు కాదు.
@ రాజ్ కుమార్,
:) మీ పిల్లల సమయానికి, మీరిలాంటి టపాలు రాస్తే.. మేము బుగ్గలు నొక్కుకుంటూ 'మా కాలం లో ఇలాంటి సూకరాలెరగమమ్మా..' అనుకుంటూ ఉంటాం..
@ జిలేబి,
:) మొన్నెక్కడో చదివాను.. బ్రిటన్ లో ఒక సర్వే లో సగానికి పైగా తల్లిదండ్రులు బెత్తం తో పిల్లల్ని కొట్టి మందలిస్తే బాగుండునని కోరుకున్నారట
@రిషి,
మరే..సుజాత గారు చెప్పినట్టు.. మా పనమ్మాయి 'మేమిలాంటివి వేసుకోం మాడం' అనేసింది :)
@ శ్యామలీయం గారు,
నిజమేనండీ.. మేము చదువుకునే రోజుల్లో సంవత్సరానికి పదివేలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫీజు అంటే 'మన వల్ల కాదని..' BSc లో చేరిన వాళ్లు బోల్డు మంది చేరారు. ఇప్పుడు ఓ మాదిరి గా సంపాదిస్తున్న వారు, LKG పిల్లలకి కూడా సంవత్సరానికి 80,000- లక్ష రూపాయలు ఖర్చుపెట్టటానికి వెనకాడటం లేదు..
@Sujata గారు,
ధన్యవాదాలు
@ బులుసు వారు,
:) అవును.
@ bonagari గారు,
Exactly! పూర్వకాలం బడుల్లో లాగా డబ్బున్నవాళ్లు, లేనివాళ్లు అందరూ ఒకే దగ్గర చదువుకునే అవకాశం బహుశా చాలా చాలా తక్కువ.
నిజమే ..సంవత్సరానికి లక్ష చొప్పున ఫీజు కడితే,.. హై స్కూల్ దాటేసరికి పన్నెండు లక్షలు, తర్వాత, ఎంట్రన్స్ లు, కోచింగులు.. :) మామూలు స్కూళ్లల్లో వేసి.. ఈ డబ్బు వేరే విధం గా ఇన్వెస్ట్ చేస్తే ఒక జీతం లా వస్తాయేమో ..
జ్యోతిర్మయి గారు,
ఇది కరెక్టే.. మాకు తెలిసిన వారమ్మాయి (తొమ్మిదో క్లాస్) ఎనిమిది జతల చెప్పులు (స్కూల్ బూట్లు, స్పోర్ట్స్ షూలూ,ఇంటి చెప్పులూ కాకుండా)ఉన్నా.. ఏమీ లేవు.. అంటుందిట. కాస్త రంగు మారింది పారేయమని చాలా ఈజీ గా చెప్పేస్తుందిట.
మా అమ్మాయికి స్కూల్ వాళ్లు మల్టిప్లెక్స్ లో సినిమా కి తీసుకెళ్తే, పాప్ కార్న్ కోసం వంద రూపాయలు డబ్బులిస్తే.. స్కూల్ వాళ్లు కొనిచ్చారు ఎలాగూ అని, ఆ డబ్బు తో ఏది దొరికితే అది కొనుక్కుని తినేసి కడుపు నొప్పితో వచ్చింది :) 'ఏంటమ్మా? దాచుకోవచ్చు కదా..పోనీ..' అంటే.. 'It did n't occur to me ' అనేసింది :)
@ సుజాతగారు,
నా 'మనసు లో మాట' చెప్పేశారు!
@ ఫణి బాబు గారు,
:) అంతే నంటారా అయితే?
@ నరేశ్ గారు,
అదే నేనంటున్నదీ.. ఎప్పుడూ, ఏదో ఒక కొత్త ఖర్చు వస్తూనే ఉంటుంది. ఏదో ఒక దినం అని సెలబ్రేట్ చేసి, వెయ్యి పెట్టి బట్టలు కొనిపించి, తొమ్మిది వందల మంది తో డాన్స్ చేయించి.. దానికి వీడియో తీసి 300 Rs కి అమ్ముతారు :) మనం మన పిల్లల్ని ఆ వీడియో లో దుర్భిణీ వేసి వెతుక్కోవాల్సిందే
@ స్ఫురిత,
అవును.. మా ఇంట్లోనూ ఇదే గోల.. ఏది కరెక్టో, ఎంతవరకూ కరెక్టో.. మనం నిర్ణయించుకోవాల్సిందే.. అందుకే కొద్దిగా భయం గానే ఉంటుంది.
అయితే సామెత చెప్పినట్టు పట్టు చీర మీకిచ్చి పీటట్టుకుని మీ వెంట తిరిగారన్నమాట..
లలితా,
నువ్వన్నట్టు ఈ సమస్య మూలం మారుతున్న జీవన శైలి, పిల్లల భవిష్యత్తు చుట్టూ అల్లుకుపోయిన ఆధునికుల ఆలోచనలు, జనాల్లో విపరీతమైన కాంపిటీటివ్ ధోరణి, వెనకబడి పోతామన్న భయం.. :)
ఎవరు వెళ్లి అడుగుతారు? స్కూళ్ల యాజమాన్యం చాలా జాగ్రత్త గా ఉంటుంది. ఎక్కడా, ఇది కంపల్సరీ అని చెప్పరు. ఏ కార్యక్రమం లోనూ పాలుపంచుకోకుండా క్లాస్ లో 'బట్టలు కుట్టించట్లేదని తమ బిడ్డ ఒక్కరే క్లాస్ లో కూర్చుంటుందని అంటే ఏ తల్లి దండ్రుల గుండెలు తరుక్కు పోకుండా నిలవ గలవు?
ఇప్పుడు కొత్త పిచ్చి వచ్చింది. నల్ల బల్ల మీద చెప్పే చదువు మీద నమ్మకం ఎగిరిపోయింది. 'టెక్నో స్కూళ్లు, ఆన్ లైన్ లో హోం వర్క్ ఇస్తే అదొక 'షాన్'.
మా అమ్మాయి స్కూల్లో పిక్నిక్ అంటే పచ్చని పార్కుల్లో, జూ పార్కుకో తీసుకెళ్ళరు.రిసార్ట్ కో, అమ్యూజ్ మెంట్ పార్క్ కో మాత్రమే వెయ్యేసి రూపాయల ఖర్చు తో.. తీసుకెళ్తారు..
చెప్పుకుంటూ పోతే ఇదొక పెద్ద కథ..
ఆఖరి అజ్ఞాత గారు,
:) మీ మాటలతో ౧౦౦% ఏకీభవిస్తున్నాను.
snkr గారు,
:) అప్పుడోసారి ఉప్మా ప్రేమికులందరికీ శత్రువయ్యాను. ఇప్పుడు పులిహార ప్రేమికులని కూడా దూరం చేసుకోబోతున్నానా! హతవిధీ!!
నా తరువాతి టపా.. పులిహార మీదే..ఈ నిర్ణయానికి తిరుగులేదు.
On a serious note,.. ఈ నిమ్మకాయ పులిహార కుటుంబం.. ఐదుగురు అక్కాచెల్లెళ్లు. నాలుగేళ్ల స్న్హేహం లో ఏ ఒక్కరోజూ పులిహార తప్ప, ఏదీ తెచ్చుకునేవారు కాదు. మగ పిల్లవాడికోసం చూసి చూసి.. వాళ్ల తల్లిదండ్రులు,.. ఎలాగూ మైనస్ లు వీళ్లకి మళ్లీ కూర ఖర్చు దండగ అని.. ఎండిపోయిన కొమ్మల్లా ఉండేవారు. ముప్ఫై ఏళ్ల మాట లెండి.
ఇక 80,000 Rs పంపుతుందని :) ష్యూర్.. మీరు భరోసా ఇచ్చాక తప్పుతుందా?
@ శ్రావ్య,
కరెక్ట్!!
కార్పొరేట్ స్కూళ్ళ మోజులో పడి ప్రభుత్వ స్కూళ్ళను చిన్నచూపు చూసిన ఫలితమిది. ఆర్ధికంగా అంతగా వెసులుబాటు లేనివాళ్ళు కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలోనే చదివిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదవటం చిన్నచూపయిపోయింది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు దీనికి మినహాయింపు. మీరన్నట్లు నిమ్మకాయ పులిహోర తప్ప గతిలేనివాళ్ళు, ప్రభుత్వ స్కూలు తప్ప మరే స్కూలూ అందుబాటులో లేని వాళ్ళు మాత్రం వాటిలో చదువుతున్నారు.
అసలుకి వడ్డీ,స్కూలు ఫీజుతో పాటు ఈ అదనపు ఖర్చులు తప్పవేమో మరి.
"'పాపం.. అది ఒక్కసారి కూడా విదేశాలకి వెళ్లలేదుట..' "
ఇక్కడ స్కూల్లో టీచరు వాళ్ళమ్మాయి ప్యారిస్ వెళ్దాము (అప్పుడు ఆ అమ్మాయికి ఐదారేళ్ళు ఉండొచ్చు) అందని చెప్పి మాతో "ప్యారిస్ వెళ్ళేన్ని డబ్బులు లేవు. తను పెరిగి పెద్దయ్యాక తన డబ్బులతో వెళ్తే అది వేరే విషయం" అనే అర్థం వచ్చేలా చెప్పారు. అప్పుడే నువ్వు ప్యారిస్ వెళ్ళొచ్చిన విశేషాలతో టపా వ్రాశావు. అది చదివి నాకూ మా పిల్లలకి మేము ప్రపంచం చూపించట్లేదేమో అన్న అనుమానం వచ్చింది కొంతసేపు. ఆ టీచర్ మాటలు నన్ను ఆలోచింపచేశాయి. ఇలా వ్రాస్తుంటే అనిపిస్తోంది, మనం పోటీ పడుతున్నాం. ఒక వైపే చూస్తున్నాం కాబట్టి వాళ్ళని అందుకోవట్లేదేమో అని భయపడుతున్నాం. ఇంకో వైపు కూడ చూస్తుండాలేమో అని. చాలా చిన్నగా చెప్పేశాను కానీ ఇది ప్రతిరోజూ ఎదుర్కోవలసిన సమస్య.
@ వజ్రం,
నిజమే. నా అప్పుడు, చుట్టూ ఎవర్ని చూసినా జిల్లా పరిషదోన్నత పాఠశాలల్లో చదివిన వారే ఉండేవారు. ఇప్పుడు అలాగ అనిపించటం లేదు.
ఆ విధం గా అమెరికా లో చాలా మంది పిల్లల్ని చక్కగా పబ్లిక్ స్కూళ్లల్లో చదివిస్తున్నారు గా.. ఎంత చక్కటి స్కూలింగ్ ఉందక్కడ? మంచి స్కూల్ డిస్ట్రిక్త్స్ లో ఇళ్లకి బోల్డు డిమాండ్!
ఒకప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలూ అంత స్టాండర్డ్ గా ఉన్నాయి కదా.. తవ్వుకుంటూ పోతే ఇదంతా ఇంకో పెద్ద సబ్జెక్ట్..
రెండేళ్ల క్రితం ఒకసారి బెంగుళూరు లో, మా ఆఫీస్ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వారం లో రెండు సార్లు గంట సేపు ఆంగ్లం వాలంటీర్ గా చెప్పటానికి ఒప్పుకుని అలాగే చేశాను కూడా.
పిల్లలకి కార్పోరేట్ సంస్థలు యూని ఫారాలు, పుస్తకాలు ఇచ్చారు. కొద్ది మంది పిల్లలు చాలా నీట్ గా ఉన్నారు.చదువుకోవాలన్న తపన కనపడుతోంది. చాలా మంది చింపిరి జుట్లతో, తైల సంస్కారం లేకుండా మురికి గా ఉన్నారు. దాదాపు అందరూ కూలీల పిల్లలే. ముందర స్నానం చేయండి తరువాతి క్లాస్ కి.. అని చెప్పాను. చాలా మంది విన్న్నారు.
అక్కడ క్లాస్ అంతా దుర్వాసన. బోర్డ్ మీద రాయటానికి సుద్ద ముక్క లేదు. అక్కడ టీచర్ మాత్రం పువ్వు లా ఉంది. రేడియో పెట్టుకునేది. నా క్లాస్ అప్పుడు రేడియో తగ్గిస్తే.. 'చాలా సీరియస్ గా' రేడియో.. పెంచు !! అంది.
నాకేమనాలో తెలియక ఊరుకుండిపోయాను. అడిగే వాళ్లు లేరు. అక్కడ వచ్చే పిల్లల తల్లిదండ్రులకి 'అంత సీన్' లేదని టీచర్లకి తెలుసు.
ఇలాంటి స్కూళ్లల్లో పిల్లల్ని చేర్పించాలంటే ఎలా సాధ్యం? మనమే కలెక్టివ్ గా ఈ స్థితి తెప్పించుకున్నాం.
అందరూ పూర్వం లా ధైర్యం గా పిల్లల్ని చేర్పిస్తూ, వసతుల గురించి, చదువు గురించి అడుగుతూ ఉంటే పరిస్థితి మారుతుందేమో.. ఎవరు తీసుకుంటారు/తీసుకోగలరు ఆ స్టెప్? అంతెందుకు.. నేనే అలాంటి ఆలోచన చేయలేను. :-(
లలితా,
కరెక్టే.. మా ఇంటి దగ్గర ఒకమ్మాయి ఉంది. తండ్రి ఒక సాఫ్ట్ వేర్ సంస్థ లో సీనియర్ డైరెక్టర్. ఆయనకి చాలా పిసినారి అని పేరు. వాళ్లమ్మాయి కి కంప్యూటర్ కొనలేదు. సెలవలకి ఎక్కడికీ తీసుకెళ్లరు, కజిన్ల పాస్ ఆన్ బట్టలు, లైబ్రరీ లోనే పుస్తకాలు చదవాలి.. ఇలాగ.
ఒకసారి ఆ అమ్మాయి తో పాటూ నడవాల్సి వచ్చింది. అప్పుడు మాటల్లో, ఆ అమ్మాయి అంది. ' మా నాన్న ని లాప్ టాప్ అడిగితే నేను కొనను. కావాలంటే నువ్వు పెద్దయ్యాక నీ డబ్బు తో కొనుక్కో..' అన్నాడు. నేను బాగా చదివి, ఉద్యోగం తెచ్చుకున్నాక లాప్టాప్ కొని చూపిస్తా మా నాన్న కి.. అంది. అలాగే కష్టపడి ఒక ధ్యేయం తో చదువుతుంది..
అలాగే, ప్రతి సెలవలకీ బోల్డు ప్రాంతాలు తిరుగుతూ, ఇరవై రకాల చెప్పుల జతలూ, అడగక ముందే అమరే అన్ని రకాల వసతులూ, అన్నీ ఉన్న అమ్మాయి.. ' మా అమ్మా వాళ్లు చాలా కష్టపడి నాకిన్ని చేస్తున్నారు.. I can n't let them down' అంది. ఎప్పుడూ స్కూల్లో ప్రథమ స్థానమే.
ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పలేమేమో.. అనిపిస్తుంది నాకు.
"మా అమ్మా వాళ్లు చాలా కష్టపడి నాకిన్ని చేస్తున్నారు.. I can n't let them down' అంది. ఎప్పుడూ స్కూల్లో ప్రథమ స్థానమే.
ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పలేమేమో.. అనిపిస్తుంది నాకు."
మీరు చెప్పింది నిజమండీ, నేనూ కూడా రెండు రకాల వాళ్ళనూ చూశాను.
మీ ప్రతి పోస్టూ, ఎక్కడో ఒకచోట, నోస్టాల్జియా కలగ చేస్తుంది. అది మంచి రచన లక్షణం అనుకుంటా.
హ్మ్మ్మం..........ఏమిటో....నేను కూడా చూస్తున్నా..మా అక్క కూతురి స్కూల్ లో రోజుకోటి తెమ్మంటారు....
ఒకటే అనిపిస్తుంది...వీళ్ళు ఇన్ని వ్యాపకాలు పెట్టుకుని కూడా చదువుతున్నారంటే గొప్పే అనిపిస్తుంది అప్పుడప్పుడు..
ఏం చేద్దాం...మనం మార లేక ....చూడలేక...ఇలా ఆలోచించేయాలి
Ikkada school vallu okka parents ne ibbandi pettadam varaku ok..
US lo unnapudu... maa telisina valla intiki velli nappudallaa.. edo oka paper chupinchi donation or collection ani teesukune vallu.. liek $25 or $30 sometimes $50.. no ani cheppataniki hesitation.. naku aniinchedi.. baaboi ee pillalu unna valla intiki konchem dooram ga undaalani..
కృష్ణ ప్రియ గారు బాగా రాశారు . రెండు మూడేళ్ళ క్రితం హైదరాబాద్ లో ఒక ముస్లిం అమ్మాయి పదవతరగతిలో హైదరాబాద్ లో ఫస్ట్ వచ్చింది . ఆ పేడ పిల్ల ఇంట్లో చదువుకోవడానికి స్థలం లేక ఇంటి పక్కనే ఉన్న స్మశాన వాటిక లో సమడులపైనే కూర్చొని చదివింది . ఫలితాలు వచ్చాక mantri swayanga intiki vellaru .
ఒక్కసారి గా “ఈ ఫౌంటెన్ పెన్ను ఏదో క్లాస్ లో ఉన్నప్పుడు మా నాన్న కొనిచ్చాడు.. ఇరవయ్యేళ్లు దాచుకున్నాను. నువ్వు నెలకి ఇరవై పెన్నులు పోగొడుతున్నావు.. గుడ్డి దీపం లో చదువుకుని పైకొచ్చాను...” అని చెప్తున్న మా నాన్నగారి వీడియో.. నా కళ్లముందు ఒక్కసారి గా ఆటో ప్లే అయిపోయింది.
Nice
హ్మ్!
మొన్న చిన్న సైజ్ కిడ్స్ ఫేషన్ వీక్ జరిగితే ఒక్కొక్కోరు 25k బడ్జెట్ తో designer వేర్ లు కొనుక్కొని మరీ రాంప్ మీద నడిచేసారు
ఏమిటో బాల్యం నుండే పిల్లలు స్కూల్ లో స్నేహితుల ప్రభావం స్కూల్ యాజమాన్యం ఒకటేమిటి అంటా
పైసా మే పరమాత్మా !
but the True
Happiness resides not in possessions, and not in gold, happiness dwells in the soul. – Democritus
This generation need to learn how to think
telugu lo bloglu untayani kooda teledu naku. anukokunda internet lo edo vetukutunte jalleda aney website ki velli atu nundi itu vachanu. I just loved it. About to go home. Will definitely read your entire blog. Keep writing :)
లత గారు,
ధన్యవాదాలు! తెలుగు లో బోల్డు బోల్డు బ్లాగులు. మీరూ తప్పక చదవండి.
జల్లెడ ద్వారా అన్ని బ్లాగులూ చూడగలమో లేదో తెలియదు. ఈ క్రింది వెబ్ సైట్ల ద్వారా వెళ్తే.. ఎన్నో విషయాల మీద చాలా తెలుగు బ్లాగులు చూడవచ్చు..
www.koodali.org
www.maalika.org
http://www.haaram.com/Default.aspx?ln=te
www.sankalini.org
చందు గారు, కిరణ్, చితాజిచన్ గారు, వినయ్ రెడ్డి గారు,బుద్ధా మురళి గారు, హరేకృష్ణ,
మీ వ్యాఖ్యలు చూసి ఇప్పుదు ధన్యవాదాలు చెప్తున్నా :)
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.