మా డ్రైవర్ రాము మా ఇంట్లో పని చేయబట్టి నాలుగేళ్ళు! వాళ్ళావిడ లక్ష్మీ మా ఇంట్లో మధ్యాహ్నం 2 గంటలు పని చేస్తుంది, కాస్త కూరగాయలు తరిగిపెట్టటం, పప్పు రుబ్బి పెట్టటం లాంటివి,. పిల్లలతో బాడ్మింటన్, బోర్డ్ గేంస్ ఆడి 'తొండి తొండీ" అని వాళ్ళల్లో కలిసి పోట్లాడుతుంది కూడా!
లక్ష్మి కి పదహారు నిండకుండానే వాళ్ళ నాన్న పెళ్ళి చేసేశాడు. పదవ తరగతి ఇలా పాస్ అయిందో లేదో, అలా పెళ్ళి చేసుకుని వచ్చేసింది.. ఆ అమ్మాయి ని చూస్తే.. ఇంకా చిన్న పిల్లలానే అనిపిస్తుంది.
ఎంత చదువుకుంటానన్నా, వాళ్ళ నాన్న బలవంతాన పెళ్ళి చేసేశాడని కాస్త తండ్రి మీద అలిగింది. నేను ఎంత బలవంతం చేసినా, ఫీజులన్నీ కడతానన్నా.. 'అబ్బే..వద్దాంటీ...' అనేసింది. మొదట్లో గంభీరం గా ఉన్నా, రాను రాను పిల్లలతో కలిసి పోటీ పడి ఆడటం, ముగ్గులేసి పెట్టటం,.. పాటలు పాడటం లాంటివి చేసేది. మాకందరికీ చాలా దగ్గరైపోయింది.
భర్త మమ్మల్ని "సార్, మాడం" అని పిలిచినా, తను మాత్రం,.. నాలుగు రోజుల్లో ఆంటీ, అంకుల్ లోకి వచ్చేసింది. మా అత్తగారికి స్వెటర్లు అల్లటంలో, నాకు రొట్టెలు ఒత్తటం లో సహాయం చేస్తూ, పిల్లలకి బొమ్మలు వేయటం, ముగ్గులేయటం లాంటివి నేర్పించటం చేస్తూ మా అందరికీ తల లో నాలుకైపోయింది.
పెళ్ళయి రెండు నెలలు తిరక్కుండానే, గర్భవతి అయింది. ఆరోజు 'అయ్యో ఎంత చిన్నపిల్ల.. అప్పుడే తల్లా? '' అని బాధేసింది. కాకపోతే.. బయటకి అంటే.. నొచ్చుకుంటుందని భయం వేసి అన్యమనస్కంగానే కంగ్రాట్స్, అవీ చెప్పి ఊరుకున్నాను. రోజూ పిల్లలతో పాటు పాలూ, సాయంత్రం బలవంతం గా 2 పళ్ళూ పెట్టేదాన్ని.
ఇట్టే కళ్ళు తిరిగి పడిపోయేది.. "నువ్వు పనికి రాకు..రెస్ట్ తీసుకో!!." .అంటే.. "బెంగుళూరు కొచ్చినదే వ్యవసాయం మీద అప్పులు తీర్చుకోవటానికి.. ఇంత చిన్నదానికే భయపడితే ఏట్లా ఆంటీ." అని నవ్వేసేది... నెలలు నిండుతున్నా..చురుకు గా పని చేస్తూ,గడ గడా మాట్లాడేది.
నెల క్రితం పుట్టింటికి డెలివరీ కెళ్ళింది 'ఆంటీ.. మళ్ళీ మీ అందర్నీ చూస్తానో లేదో..' అని కన్నీళ్ళు పెట్టుకుని కాళ్ళకి నమస్కరించి వెళ్ళింది. పని కోసం వచ్చినా, మా పిల్లలాగే అనిపించింది.
మా డ్రైవర్ రాము వారం లో వాళ్ళావిడ డెలివరీ అనగానే సెలవు పెట్టేశాడు! అరగంట క్రితం ఫోన్ చేసి..'మాడం.. !!!' అని ఆగిపోయాడు.. 'ఆ చెప్పు రామూ ' అన్నాను..
"మాడం మీరు పనిలో లేరు కదా.. లక్ష్మి విషయం చెప్దామని... " అని అన్నాడు..
'అయ్యో ఏమైందో.. అసలే చిన్నది.. లక్ష్మి క్షేమమే కదా.' అని గుండె దడ దడ లాడింది. కుర్చీ లో కూలబడి..'చెప్పు రామూ.. ' అనగానే.. 'మాడం.. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా.. ' అన్నాడు రాము.
'ఆ ..ఆ చెప్పు చెప్పు...' అన్నాను ఆత్రం గా..
'లక్ష్మిని ఎడ్మిట్ చేశాము మాడం..నిన్న నొప్పులొస్తుంటే..' అన్నాడు సాగదీస్తూ...
'ఆ..ఆ.. ఏమయ్యింది? ' అన్నాను..కాస్త గొంతు పెంచి..
'అదే.. డెలివరీ .. నార్మల్ గా అవటం కష్టం అని నిన్న రాత్రి చెప్పారు మాడం' అన్నాడు..
'ఆ... ఆ.. చెప్పు చెప్పు.. మరి ఎలా? బానే ఉందా తను?' అని అడిగాను ఎంత భయం వేసిందో.. ఇదేంటి రాము గొంతు లో ఏ భావం లేదు? బిడ్డకేమైనా ప్రమాదమేమో...' అని టెన్షన్ వేసింది.
ఈలోగా.. మా ఇంట్లో వాళ్ళూ నా చుట్టూ మూగి చూస్తున్నారు..
'అదీ .. మాడం.. మా ఊర్లో.. డాక్టర్ ఇక్కడ కాదంటే..రాత్రి కి రాత్రే తెచ్చాం మాడం, బంగార్ పేట పెద్దాసుపత్రికి, ట్రాక్టర్ లో. ...' అన్నాడు..
నాకు లీల గా అర్థమయిపోయింది.. 'ఆ.. నాకు తెలుసు.. లేటయిపోయినట్టుంది..' అయ్యో.. లక్ష్మీ!!!' అని విచారం వేసింది..
స్పీకర్ లో పెట్టాను.. అందరూ వింటారని..
రాము నెమ్మది గా..'మాడం.. ఇద్దరు డాక్టర్లు చేశారు మాడం.. ఆపరేషన్..' అన్నాడు..
ఇంకా నీరసం వచ్చేసింది.. మా వారూ, పిల్లలూ విచారం గా చూస్తున్నారు.
మాడం .. మరి.. ' అని ఆగిపోయాడు.
రామూ చెప్పూ..చెప్పవయ్యా.. ఎలా ఉందీ... అరిచేసాను..
;అందరూ ఉన్నారు మాడం.. ఆపరేషన్ కే గంట పైన పట్టింది మాడం, లక్ష్మి చాలా వీక్ అయింది, మందిచ్చారు నిద్రపోతోంది మాడం, బాధ తెలియకుండా ' అన్నాడు..
'ఓహ్..పోన్లే' అనుకున్నాం..
'పాప పుట్టింది ..మాడం.. ఇప్పుడే 20 నిమిషాలైంది మాడం..' అన్నాడు.
ఒక్కసారిగా ఉధృతం గా కోపం వచ్చింది.. అంతలో మళ్ళీ చిన్న డవుట్.. 'పిల్ల ...అంతా బాగానే ఉందా?'
'బాగుంది ..మాడం.. మా అమ్మ లాగనే ఉంది మాడం ' అన్నాడు..
ఇంక ఆనకట్ట తెగిపోయింది.. అందరం కంగ్రాట్స్ మానేసి, అరిచి చేసిన గొడవకి... రాము కనక అసలు ఎదురుగా ఉంటే..నాలుగు వేసేవాళ్ళం కూడానేమో..
అందుకే ఆధ్యాత్మ రామాయణం లో ..
రామలక్ష్మణులు, 'సీత సమాచారం హనుమంతుడు తప్పక తెస్తాడు' అని ఎదురు చూస్తుంటే..
హనుమంతుడు లంక నుండి వచ్చి ఆయన ముందు వాలి, .'సీతమ్మ ...' అని మొదలుపెడితే.. ఆ రెండు క్షణాలూ ఆ శ్రీ రామచంద్రుడు ఎక్కడ కంగారు పడతారో నని,..'కనుగొంటినీ రాఘవా!!! సీతమ్మ తల్లినీ... ...' అని అన్నాడని ఉంటుంది...