Monday, January 17, 2011

చెప్పు, చెప్పవయ్యా!!..చెప్పూ??.....



మా డ్రైవర్ రాము మా ఇంట్లో పని చేయబట్టి నాలుగేళ్ళు!    వాళ్ళావిడ లక్ష్మీ మా ఇంట్లో మధ్యాహ్నం 2 గంటలు పని చేస్తుంది, కాస్త కూరగాయలు తరిగిపెట్టటం, పప్పు రుబ్బి పెట్టటం లాంటివి,. పిల్లలతో బాడ్మింటన్, బోర్డ్ గేంస్ ఆడి 'తొండి తొండీ"  అని వాళ్ళల్లో కలిసి పోట్లాడుతుంది కూడా!

లక్ష్మి కి పదహారు నిండకుండానే వాళ్ళ నాన్న పెళ్ళి చేసేశాడు. పదవ తరగతి ఇలా పాస్ అయిందో లేదో, అలా పెళ్ళి చేసుకుని వచ్చేసింది.. ఆ అమ్మాయి ని చూస్తే.. ఇంకా చిన్న పిల్లలానే అనిపిస్తుంది. 

                                  ఎంత చదువుకుంటానన్నా, వాళ్ళ నాన్న బలవంతాన పెళ్ళి చేసేశాడని కాస్త తండ్రి మీద అలిగింది. నేను ఎంత బలవంతం చేసినా, ఫీజులన్నీ కడతానన్నా.. 'అబ్బే..వద్దాంటీ...' అనేసింది. మొదట్లో గంభీరం గా ఉన్నా, రాను రాను పిల్లలతో కలిసి పోటీ పడి ఆడటం, ముగ్గులేసి పెట్టటం,.. పాటలు పాడటం లాంటివి చేసేది. మాకందరికీ చాలా దగ్గరైపోయింది.

భర్త మమ్మల్ని "సార్, మాడం"  అని పిలిచినా, తను మాత్రం,.. నాలుగు రోజుల్లో ఆంటీ, అంకుల్ లోకి వచ్చేసింది. మా అత్తగారికి స్వెటర్లు అల్లటంలో, నాకు రొట్టెలు ఒత్తటం లో సహాయం చేస్తూ, పిల్లలకి బొమ్మలు వేయటం, ముగ్గులేయటం లాంటివి నేర్పించటం చేస్తూ మా అందరికీ తల లో నాలుకైపోయింది.

పెళ్ళయి రెండు నెలలు తిరక్కుండానే, గర్భవతి అయింది. ఆరోజు 'అయ్యో ఎంత చిన్నపిల్ల.. అప్పుడే తల్లా? '' అని బాధేసింది. కాకపోతే.. బయటకి అంటే.. నొచ్చుకుంటుందని భయం వేసి అన్యమనస్కంగానే కంగ్రాట్స్, అవీ చెప్పి ఊరుకున్నాను. రోజూ పిల్లలతో పాటు పాలూ, సాయంత్రం బలవంతం గా 2 పళ్ళూ పెట్టేదాన్ని.

ఇట్టే కళ్ళు తిరిగి పడిపోయేది.. "నువ్వు పనికి రాకు..రెస్ట్ తీసుకో!!." .అంటే.. "బెంగుళూరు కొచ్చినదే వ్యవసాయం మీద అప్పులు తీర్చుకోవటానికి.. ఇంత చిన్నదానికే భయపడితే ఏట్లా ఆంటీ." అని నవ్వేసేది... నెలలు నిండుతున్నా..చురుకు గా పని చేస్తూ,గడ గడా మాట్లాడేది.

నెల క్రితం పుట్టింటికి డెలివరీ కెళ్ళింది  'ఆంటీ.. మళ్ళీ మీ అందర్నీ చూస్తానో లేదో..'  అని కన్నీళ్ళు పెట్టుకుని కాళ్ళకి నమస్కరించి వెళ్ళింది.  పని కోసం వచ్చినా, మా పిల్లలాగే అనిపించింది.

మా డ్రైవర్ రాము వారం లో వాళ్ళావిడ డెలివరీ అనగానే సెలవు పెట్టేశాడు!  అరగంట క్రితం ఫోన్ చేసి..'మాడం.. !!!' అని ఆగిపోయాడు..  'ఆ చెప్పు రామూ ' అన్నాను..

"మాడం మీరు పనిలో లేరు కదా.. లక్ష్మి విషయం చెప్దామని...  "  అని అన్నాడు..

'అయ్యో ఏమైందో.. అసలే చిన్నది.. లక్ష్మి క్షేమమే కదా.' అని గుండె దడ దడ లాడింది. కుర్చీ లో కూలబడి..'చెప్పు రామూ.. ' అనగానే..  'మాడం.. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా.. ' అన్నాడు రాము.

'ఆ ..ఆ చెప్పు చెప్పు...' అన్నాను ఆత్రం గా..
'లక్ష్మిని ఎడ్మిట్ చేశాము మాడం..నిన్న నొప్పులొస్తుంటే..' అన్నాడు సాగదీస్తూ...
'ఆ..ఆ.. ఏమయ్యింది? ' అన్నాను..కాస్త గొంతు పెంచి..
'అదే.. డెలివరీ .. నార్మల్ గా అవటం కష్టం అని నిన్న రాత్రి చెప్పారు మాడం' అన్నాడు..
'ఆ... ఆ.. చెప్పు చెప్పు.. మరి ఎలా? బానే ఉందా తను?' అని అడిగాను ఎంత భయం వేసిందో.. ఇదేంటి రాము గొంతు లో ఏ భావం లేదు? బిడ్డకేమైనా ప్రమాదమేమో...' అని టెన్షన్ వేసింది.
ఈలోగా.. మా ఇంట్లో వాళ్ళూ నా చుట్టూ మూగి చూస్తున్నారు..

'అదీ .. మాడం.. మా ఊర్లో.. డాక్టర్ ఇక్కడ కాదంటే..రాత్రి కి రాత్రే తెచ్చాం మాడం, బంగార్ పేట పెద్దాసుపత్రికి, ట్రాక్టర్ లో. ...' అన్నాడు..
నాకు లీల గా అర్థమయిపోయింది.. 'ఆ.. నాకు తెలుసు.. లేటయిపోయినట్టుంది..' అయ్యో.. లక్ష్మీ!!!' అని విచారం వేసింది..
స్పీకర్ లో పెట్టాను.. అందరూ వింటారని..

రాము నెమ్మది గా..'మాడం.. ఇద్దరు డాక్టర్లు చేశారు మాడం.. ఆపరేషన్..' అన్నాడు..
ఇంకా నీరసం వచ్చేసింది.. మా వారూ, పిల్లలూ విచారం గా చూస్తున్నారు. 

మాడం .. మరి.. ' అని ఆగిపోయాడు.
రామూ చెప్పూ..చెప్పవయ్యా.. ఎలా ఉందీ...   అరిచేసాను..
;అందరూ ఉన్నారు మాడం.. ఆపరేషన్ కే గంట పైన పట్టింది మాడం, లక్ష్మి చాలా వీక్ అయింది, మందిచ్చారు నిద్రపోతోంది మాడం, బాధ తెలియకుండా ' అన్నాడు..
'ఓహ్..పోన్లే' అనుకున్నాం..
'పాప పుట్టింది ..మాడం.. ఇప్పుడే 20 నిమిషాలైంది మాడం..' అన్నాడు.
ఒక్కసారిగా ఉధృతం గా కోపం వచ్చింది.. అంతలో మళ్ళీ చిన్న డవుట్.. 'పిల్ల ...అంతా బాగానే ఉందా?'
'బాగుంది ..మాడం.. మా అమ్మ లాగనే ఉంది మాడం ' అన్నాడు..

ఇంక ఆనకట్ట తెగిపోయింది.. అందరం కంగ్రాట్స్ మానేసి, అరిచి చేసిన గొడవకి... రాము కనక అసలు ఎదురుగా  ఉంటే..నాలుగు వేసేవాళ్ళం కూడానేమో..

అందుకే ఆధ్యాత్మ రామాయణం లో ..

రామలక్ష్మణులు,  'సీత సమాచారం హనుమంతుడు తప్పక తెస్తాడు' అని ఎదురు చూస్తుంటే..
హనుమంతుడు లంక నుండి వచ్చి ఆయన ముందు వాలి, .'సీతమ్మ ...'  అని మొదలుపెడితే.. ఆ రెండు క్షణాలూ ఆ శ్రీ రామచంద్రుడు ఎక్కడ కంగారు పడతారో నని,..'కనుగొంటినీ రాఘవా!!!  సీతమ్మ తల్లినీ... ...' అని అన్నాడని ఉంటుంది...

29 comments:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

చిన్న వయసులో పెళ్ళిళ్ళూ, పైగా పిల్లలూ లాంటి దురదృష్టకర పరిస్థితులు లేని రోజులు త్వరగా రావాలని ఆశిద్దాం.

బాగా రాశారు అనేది ప్రత్యేకంగా చెప్పాలా ! :)

shyamkr said...

అక్కడ చెప్పింది హనుమంతుడు...ఇక్కడ రాముడు...అదే తేడా!!

Unknown said...

amma mammalni kuda tension pettesaru kada krisna priya gaaru :) ..
maha lakshmi puttindannamata ayite ...

budugu said...

సుఖాంతం కథలకు కూడా ఇంత టెన్షను పెట్టేస్తారు. ఓనరుకు తగ్గ డ్రైవరు. nice finishing touch.

మాలా కుమార్ said...

ha ha ha

రాజ్ కుమార్ said...

మీ డ్రైవరే కాదండీ.. మీరు కూడ టెన్షన్ పెట్టారు కాసేపు.. :)
పోనీలెండి కధ సుఖాంతం .. సంతోషం.. :)

కృష్ణప్రియ said...

@ WP,
హ్మ్మ్.. నిజమే..

@ shyamkr,
అవును.. మా అమ్మాయి కూడా ఒక పట్టాన విషయానికి రాదు. రోజూ ఇదే గొడవ మాకు.. 2 నిమిషాల తర్వాత అసలు పాయింట్ కి వస్తుంది..

@ కావ్య,
అదే మరి.. తెగ టెన్షన్ పెట్టాడు..

@ బుడుగు,
అయ్యో టెన్షన్ నేను కాదు మా రాము పెట్టాడు..

కృష్ణప్రియ said...

@ మాలా కుమార్ గారు,
:)))
@ బులుసు సుబ్రమన్యం గారు,
:) థాంక్స్..

@ వేణూ రాం,
టెన్షన్ పెట్టింది అతనే.. నేను కాదు.. నాకు సంబంధమే లేదు..

@ శ్రీనివాస్,
నిజమే.. నాకూ అలాగే అనిపించింది. సరిగ్గా రాయలేదని.. కాకపోతే.. నన్ను ఎఫెక్ట్ చేసిన సంఘటన గురించి రాయాలని రాసేశాను. మీ వ్యాఖ్య కి చాలా థాంక్స్... నేననుకున్నది చెప్పారు :)

3g said...

మీతో ఉండి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళక్కూడా రచయిత లక్షణాలొచ్చేస్తున్నాయండి. బుడుగు చెప్పినట్టు ఓనర్ కి తగ్గ డ్రైవర్ :):).

రాధిక(నాని ) said...

:))) బాగుందండి.ఏమైందో??అన్న టెన్షన్ తో చదివాను.

శివరంజని said...

హహహ్హ బాగా రాశారు

Bhãskar Rãmarãju said...

ఎంత వయసు అంటే చిన్న వయసూ?
పదారేళ్ళకు తల్లికావటం అనేది నాకైతే పెద్ద అయ్యో అనాల్సినంత లేత వయసు కాదనిపిస్తుంది.
ఏ ఇరైఎనిమిదికో ముఫైకో పెళ్ళి అయ్యి, ముఫై రెండేళ్ళకో పిల్లల్ని కనటంకన్నా పదహారు-ఇరవై, లేక ఇరవై ఐదు అనుకోవచ్చు, మధ్య పిల్లలు కలుగుట ఉత్తమం. మానసికంగా ఎలా ఉన్నా శారీరకంగా బలంగా ఉండే వయసు అది అని నా భావన

మంచు said...

:-)ఈసారి నుండి మాలిక లొ కామెంట్స్ చదివి పొస్ట్ చదవకూడదు

Anonymous said...

భాస్కర రామరాజు గారు, మంచి-చెడు తెలియని అపరిపక్వ టీనేజ్ దాటనిది పెళ్ళిచేయడమే మంచిది కాదు. తమకే జీవితం మీద సరైన అవగాహన/స్థిరత్వం లేని వయసులో పిల్లలు కని, వారిని గాలికి వదిలేయక సక్రమంగా పెంచిపోషించి, 35ఏళ్ళకే మనుములను పెంచే బాధ్యతలు కూడా నెత్తినేసుకోవడం, ఈ కలికాలంలో మంచిదికాదని నా అభిప్రాయం. 19ఏళ్ళు దాటనిది పిల్లలు కంటే వారి ఆర్థికస్థోమతను బట్టి, 3నెలల కమ్యూనిటీ సర్వీస్, కనీసం 20వేల రూ| ఆ వూరి ప్రాథమికవిద్య/స్త్రీశిశు సంక్షేమశాఖలకు చెందేలా జరిమానా వుండేలా చట్టాలు వుండాలి.
రాముడు-సీత, కృష్ణుడూ-రుక్మిణి 16కే చేసుకున్నారు కదా అంటే .. ఆ కాలంవేరు. ఆకాలంలో ధరలు చవగ్గావుండేవి, కెజి ఉల్లిపాయలు 70రూ, లీటర్ పెట్రోలు 60రూ వుండేవి కావేమో. :)

కృష్ణప్రియ said...

@ 3g,
:)) బోల్డు సేపు రాగాలాపన చేసి పల్లవి లోకొచ్చినట్టు, ఉపోద్ఘాతం 5 నిమిషాలు, అసలు విషయం మూడు సెకన్లు.. ఇదీ గొడవ ఇక్కడ..

@ రాధిక,
అదే మరి.. ఒక సారి మా డాక్టర్ కూడా ఇలాగే టెన్షన్ పెట్టాడు నన్ను..

@ శివరంజని,
థాంక్స్! :)

కృష్ణప్రియ said...

@ మంచు,
:) దీని భావమేమి తిరుమలేశ? కామెంట్లు చదివి ఏదో ఊహించుకుంటే డిజపాయింటెడ్ అనా?

Mauli said...

మీ డ్రైవరు అ౦టే చెప్పడ౦ తెలీక యెదొ చెసాడు..మీరే౦టి అసలు .. ఖ౦డిస్తున్నా౦ అధ్యక్శా ఈ దౌర్జన్య౦ :) :)

కృష్ణప్రియ said...

@ భాస్కర్ రామరాజు గారు,

పదహారు చాలా చిన్నే కదా.. వాళ్ళే పిల్లలు. 20 దాటితే ok అనుకుంటున్నాను. మరీ 30 దాటితే.. నిజమే..

ఇక 'అయ్యో .. అనుకోవటానికి కారణం.. తనేదో సాధిద్దామనుకుంటే..తన ఇష్టానికి వ్యతిరేకం గా పెళ్ళి, పోన్లే ఇప్పటికైనా చదువుకో అంటే.. ఇంకొకరి మీద కోపం తో చదువుకోను అనటం.. వల్ల...

Anonymous said...

చాలా బాగుందండి. చదివిన మాకే ఇంత టెన్షన్ ఉంటే పాపం మీరు ఇంకెంత టెన్షన్ పడి ఉంటారో అని అనిపించింది. మీ మంచి మనసుకు నా జోహార్లు. దయచేసి నా బ్లాగ్ http://madhudairymilk.blogspot.com/చూడండి

మంచు said...

uhu...

మీ పొస్ట్ కన్నా ముందు...ఈ కామెంట్ మాలిక లొ చూసా...ఇక థ్రిల్ ఎముంటుంది...ముందే విషయం అర్ధం అయిపొయింది.
-------------------------------------------
మీ డ్రైవరే కాదండీ.. మీరు కూడ టెన్షన్ పెట్టారు కాసేపు.. :)
పోనీలెండి కధ సుఖాంతం .. సంతోషం.. :)
January 18, 2011 12:36 PM
-------------------------------------------

Ennela said...

hahaha..may god bless all the three children

హరే కృష్ణ said...

:))

కృష్ణప్రియ said...

@ మయూరి,

థాంక్స్..

@ మంచు,

ఐతే ఓకే.. :)

@ ఎన్నెల, హరేకృష్ణ,

:))

ఇందు said...

హయ్యో! కృష్ణప్రియగారూ...మీరు జాన్ 17న పోస్ట్ వేస్తే నేను ఇప్పుడు చూసా! అసలు మీ బ్లాగ్ నా బ్లాగ్ రోల్ లొ కూడా పెట్టా!అయినా మిస్ అయ్యా! ఇక అలా అవ్వకూడదనీ మిమ్మల్ని ఫాలో అయిపోవడం మొదలుపెట్టా :))

ఇక పోస్ట్ విషయానికి వస్తే...మీరు చెప్పిందంతా చదివాకా ఆ రామయణ కథే గుర్తొచ్చిందీ...మీరు అచ్చు అదే రాసేసారు...భలే కోఇన్సిడెన్స్ కదా! హమ్మయ్య ఎలాగైతేనేం...లక్ష్మి హాపీస్...మీరు హాపీస్...మేమంతా హాపీస్! :)

Kathi Mahesh Kumar said...

:)

Sasidhar Anne said...

Mothaniki bale tension pettaru andi :) kadha sukhantam ayinanduku memu kooda happies.

sphurita mylavarapu said...

Thank God ఎంత Tension పెట్టారండీ...

రంగావఝ్యుల శేషాంజనేయావధాని శర్మ said...

బాగా వ్రాశారు.
హహహహహహహ:):):):):):):):):):):):):):)

కృష్ణప్రియ said...

@ ఇందు, :) ధన్యవాదాలు. మీ అందరి కామెంట్లు ఇప్పుడే చూస్తున్నా.. ఏ విషయం చెప్పినా చటుక్కున చెప్పకుండా నాన్చి నాన్చి చెప్పటం తన స్పెషాల్టీ..
@మహేశ్ కుమార్, :)
@ శశిధర్, టెన్షన్ పెట్టింది నేను కాదు.. మా రాము.
@స్ఫురిత, :) మేమూ ఆరోజు టెన్షన్ తో చచ్చాం..
@ శేషు గారు, :) ధన్యవాదాలు ...

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;