"శుక్రవారం రాత్రి వచ్చేయండి.. మా ఇంటికి భోజనాలకి"..
అని మాకు బాగా తెలిసిన ఒక కొత్తగా పెళ్లయిన అబ్బాయి చెప్పాడు. "మా ఆవిడ వంట చాలా బాగా చేస్తుంది" అని తెగ పొగిడాడు. పైగా మద్యాహ్నం కాఫెటేరియా లో ఏదో “ఆరోగ్యకరమైన” సాండ్ విచ్ తిన్నానేమో నక నక లాడుతూ ఉన్నా! ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు చల్లగా ఉంది వాతావరణం.. కాస్త ఏదైనా వేడిగా తాగుదామా? అనుకుని మళ్లీ టీ తాగితే ఆకలి తగ్గిపోతుందని అలాగే బయల్దేరదామని మా వారిని ఊదర పెడుతుంటే..
"నువ్వు ఏం చేస్తావో చేసుకో!!.. నేను మాత్రం నా మగ్గుడు కాఫీ తాగకుండా కదిలేది లేద" ని ఖచ్చితం గా ఆయన చెప్పేయటం తో.. ఉసూరు మంటూ వెయిట్ చేస్తూ ఆ సువాసన ఆఘ్రాణిస్తూ తిప్పలు పడుతూ ఎలాగో ఆగి ఎట్టకేళకి . , మా వారిని బయల్దేరదీసా ..
ఒక పది మంది ఉంటారు డిన్నర్ పార్టీ లో. ఆ అమ్మాయి టేబుల్ మీద సలాడ్లు, బజ్జీల్లాంటివి ఏవో సద్ది కుక్కర్ లోంచి పొగలు కక్కుతున్న పప్పు, అన్నం తీసి పెట్టింది. కమ్మటి వాసన వస్తున్నకరిగిన నెయ్యి .. 'ఆహా.. మామిడి కాయ పప్పు లా ఉంది'. దానికి తోడు ఆవిరి కక్కుతున్న అన్నం, ఇంక ఆగలేక పోతున్నా.. అందరూ బజ్జీలు అవీ తీసుకుంటుంటే.. నేను అఆబ గా.. కంచెడు అన్నం పెట్టుకుని మధ్యలో చేత్తో గుంట చేసుకుని పప్పు గుమ్మరించుకుని, నెయ్యి వంపుకుని.. కాలుతున్న వేళ్లతో,.. ఆదరా బాదరా గా కలుపుకుని వాపిరి గా పింగ్ పాంగ్ బంతి అంత ముద్ద నోట్లో పెట్టుకున్నానంతే!!.
సీతాఫలం కన్నా మధురం గా ఉంది ఆ పప్పు. అదోరకం గా వాసన కూడా! జలుబు వల్ల ఇందాకా తెలియలేదు. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఫౌంటెన్ లా పైకి వచ్చేస్తుంది తిన్న పదార్ధం. ఎలాగోలా కష్టపడి మింగి .. "ఇది ఏం పప్పు?" అని అడిగాను.ఆ అమ్మాయిని.
"ఇది గుమ్మడి పండు, అరటిపండు మాష్ చేసి బెల్లం తో ఉడికించి చేసే పప్పు. జీడి మామిడి పండు గుజ్జు కూడా కలుపుతాం, ఇక్కడ దొరకదు గా.. జీడి మామిడి ఎక్స్ట్రా క్ట్ తెచ్చా ఇండియా నుంచి! మా వైపు స్పెషల్ ఇది తెల్సా!" అని మెరుస్తున్న కళ్ళతో చెప్పింది. "ఎలా ఉంది?" అని అడిగింది. ఇంక నాలో 'నా వల్ల కాదు.. నన్నోదిలేయ్!!! " అని దాక్కుంటున్న 'ఊర్వశి కృష్ణప్రియ' ని (ఆవిడ నాలో దాగిన నటి లెండి) బర బరా లాక్కొచ్చి ముందు నిలబెట్టా... ఆవిడ ఇక.. టీ వీ లో వంటల కార్యక్రమం లో వంట టేస్ట్ చేసాక ఆంకరమ్మ ఇచ్చే ఎక్స్ ప్రేషన్లని గుర్తు తెచ్చుకుని.. అటువంటి విపత్కర పరిస్థితి లోనూ
"It's nice! చాలా బాగుంది.. ఎప్పుడూ తినలేదు!!" అని బొంకింది.
ఈ అచేతనావస్థ లోంచి బయట పడేందుకు శత విధాలా ప్రయత్నిస్తుండం లో కాస్త బిజీ గా ఉన్నానా? చూసుకోలేదు :-(( "ఆ భరోసా ఇచ్చావు చాలు" అన్న ఉత్సాహం తో అమ్మాయి గిన్నె ఎత్తి నా కంచం లో ఇంకో పావు లీటర్ "వాళ్లూరి వంట' పోయటం! హతవిధీ.. నాకు కంచం లో పెట్టింది పారేయటం అలవాటు లేదు. కానీ ...ఇక నెమ్మది గా ఎవ్వరూ చూడకుండా ట్రాష్ లో పడేద్దామా? అని చూస్తున్నా. చూస్తే అందరూ బజ్జీలు లగాయిస్తున్నట్టున్నారు.. చెత్త బుట్ట ఫ్రెష్ గా.... ఒక్కళ్ళూ ఏదీ వేయలేదు :-( అంటే ఈ అన్నం పడేసింది నేనే అని తెలిసి పోతుంది. ఎలా? అర్థం కాలేదు. ఎవరైనా ఏదో ఒకటి పారేయకపోతారా వాటితో కలిపేయచ్చు అని.. నీరసం గా ప్లేట్ తో కూర్చున్నా. అందరూ హాయిగా.. బజ్జీలు తింటూ.. జీడి మామిడి ఎక్స్ట్రా క్ట్ వాసనకి తిప్పుతోంది.
కొత్త పెళ్ళికూతురు తియ్య పప్పు చప్పరించుకుంటూ ఒక రకమైన పారవశ్యం తో తింటోంది.కొత్త పెళ్లి కొడుకు కూడా తెగ ఎంజాయ్ చేస్తూ తింటున్నట్టున్నాడు. హః! అవున్లే పెళ్లైన కొత్తలో నేనూ బ్రోకోలీ , కాప్సికం ఉప్మా తిన్నాను అదో మాయ కదా...
చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తొచ్చింది.ఒకళ్ల ఇంటికి వెళ్లాం.వాళ్ళింట్లో చెల్లలేదేమో! పెద్ద ప్లేట్ లో పైనాపిల్ ముక్కలు కలిపిన చక్ర పొంగలి పెట్టారు. ప్రసాదం అని!. ఏదో తేడా ఉంది. పారేద్దామా అంటే భయం. దేవుడు శిక్షిస్తాడని! నేనూ మా చెల్లీ, ఆరోజు లక్కీ గా జేబుల చొక్కాలు వేసుకు వెళ్లామేమో.. అప్పటికి తప్పించుకోవటానికి జేబుల్లో నింపేసాము. ఇంటికొచ్చాక ఆటల్లో పడి మర్చిపోయాం. తర్వాత రోజు వాషింగ్ మషీన్ బట్టల్ని ఉతికితే.. మా అమ్మ మమ్మల్ని ఉతికింది ..
నాలోనేనే నవ్వుకుంటున్నా.. రెండు బజ్జీలు తీసుకుని ఏదో పప్పు లో నంచుకున్నట్టు నటిస్తూ బజ్జీలు మాత్రమే తింటున్నా.. 'అక్కడున్న వాళ్లందరి నీ చూస్తే ఒళ్లు మండింది.. ఈర్ష్య తో గుండె భగ్గుమంది. 'నా కాపీనం మండ! ఇంత పప్పు వేసుకోవాలా?' ఏడుపు వచ్చినంత పనైంది. చిన్నప్పటి లాగా చున్నీ లో మూట కడదామా అన్నంత వైల్డ్ ఆలోచన వచ్చింది కానీ.. బంగారం లాంటి చున్నీ.. అని ఆ ఆలోచన విరమించుకున్నా.
ఆ అమ్మాయి మళ్లీ అతిథి మర్యాదలకి పెట్టింది పేరనుకుంటా! నిమిషానికి నాలుగు సార్లు 'ఏంటి కృష్ణా తినట్లేదు? ' అని గోల!
ఊర్వశి కృష్ణప్రియ ని మళ్లీ లాక్కొచ్చా.. ఈసారి బెదిరిస్తే కూడా రాలేదావిడ. కాళ్లా వెళ్లా పడి రమ్మంటే వచ్చి.. 'నెమ్మదిగా ఆస్వాదిస్తూ తింటున్నా' అని అరమోడ్పు కన్నులతో, అరచెంచా పప్పన్నం నోట్లోకి వేసుకుని చెప్పింది.
ప్లేట్ క్షణ క్షణానికీ బరువెక్కుతోంది. మా కజిన్ కి పెళ్లి కుదిరిన కొత్త లో వాళ్ల కాబోయే అత్తగారింటికి వచ్చినప్పుడు వాళ్లు ఇచ్చిన ఫ్రూట్ సలాడ్ గుర్తొచ్చింది. ఏదో సిట్రస్ ఫ్రూట్ చేదెక్కి తినలేకపోయాం. ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంటే.. వాళ్ల అబ్బాయి 'రండి వదినా.. మా మొక్కలు చూపిస్తా..' అని పిలిచి ఒక దట్టమైన గుబురైన నిమ్మ గడ్డి మొదట్లో చోటు చూపించి పారేయమని మాకు దారి చూపించాడు. సరే అదే పని చేద్దాం అని.. 'మీ బాక్ యార్డ్ చూస్తా.. ఒకసారి .." అని తలుపు తీసి చూసా.. :-((( అబ్బే.. నీట్ గా ఉంది.ఒక్క మొక్క లేదు.
ప్లాస్టిక్ కవర్ లాంటిది ఏదైనా దొరుకుతుందని చూస్తున్నా.. నేనొక్క దాన్నే ఇలా!!!.. మిగతా వారంతా హాయిగా తింటున్నారు. ఈలోగా ఇంకో కామన్ ఫ్రెండ్ లీల వచ్చింది నా వైపు . అయోమయం గా చూస్తూ..
"ఎలా తింటున్నావు? నువ్వూ ఆ ఊరేనా? ఒక్క స్పూన్ ప్రయత్నిస్తేనే నాకైతే కడుపు లో దేవేస్తోంది." అంది.
ఏదో సముద్రం లో పడి ఊపిరాడకుండా కొట్టుకుంటున్న వాడికి లైఫ్ జాకెట్ దొరికినట్టు, టెక్నికల్ ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు అడిగిన ప్రశ్న కి సమాధానం లేక తెల్ల మొహం వేసినప్పుడు ఇంకొకరెవరో మన తరఫున సమాధానం చెప్పినట్టు.. చెప్పలేనంత రిలీఫ్!!!!. ఆ క్షణం లో ఆవిడ నాకు సాక్షాత్తూ అమ్మవారి లా అనిపించింది. నెమ్మది గా ఎందుకు మౌంట్ ఎవరెస్ట్ అంత ఎత్తు పప్పన్నం నా కంచం లో పెట్టుకున్నానో చెప్పా..
కిసుక్కున నవ్వింది. 'నీకో ఇన్సిడెంట్ చెప్తా.. మా పిన్ని మొన్నీ మధ్య ఎవరింటికో వెళ్తే కాఫీ ఇచ్చారుట. చాలా పిచ్చి గా ఉందిట. దాన్ని అస్సలూ తాగలేక వాష్ బేసిన్ లోకి వంపుదామని ఆ హోస్టెస్ ని మంచి నీళ్లడిగిందట. ఆవిడ వచ్చేలోగా అతి లాఘవం గా మరుగుతున్న కాఫీ ని ఒక్క సారి గా బేసిన్ లోకి వంపిన తర్వాత ఒక తెలియని బాధ.. కాళ్లల్లోంచి. మంట.. చూస్తే.. బేసిన్ కింద పైప్ లేదట. దానితో మరుగుతున్న కాఫీ కాళ్ల మీద వంపుకున్నానని అర్థమయి .. బాధకి తాళలేక అరిచిందట! ఆ ఇంటావిడ పరుగున వచ్చి విషయం అర్థమయి చల్లని నీరు ఉన్న గిన్నె తెచ్చి కాళ్లని దాంట్లో పెట్టుకొమ్మని ఇచ్చి తడి గుడ్డ తెచ్చి 'సారీ అండీ.. పైప్ పెట్టమని మొత్తుకున్నా..వినట్లేదు. ఎవ్వరికీ సమయం దొరకట్లేదు ' అంటూ తుడుస్తోందిట.. కాలి మంట కన్నా.. ఆవిడ కష్టపడి చేసిన కాఫీ పారబోసి, పైగా ఆవిడకే పట్టుపడి, సపర్యలు చేయించుకోవటం చాలా సిగ్గు, బాధ తెప్పించింది" అని చెప్తే.. అంత టెన్షన్ లో కూడా నవ్వు వచ్చేసింది.
ఈలోగా మా వారు కొద్దిగా పప్పు వేసుకుని, నా బాధ అర్థమై.. నా వైపు చూసి.. దూరం నుంచే ముసి ముసి నవ్వులు. నా చూపులకే శక్తి ఉంటే.. ఆపూట ఏమయ్యేదో.. నేను రాయకూడదు, మీరు చదవకూడదు లెండి.
ఒక చిన్న పాప .. వాళ్లమ్మ నోరు బలవంతాన తెరిచి పప్పన్నం కుక్కుతోంది.. అది వాళ్లమ్మ నుంచి అతి లాఘవం గా తప్పించుకుని 'yucky smell! It is too sweet! నాకొద్దు' అని అరుస్తోంది. చా.. ఆ పిల్ల ఎంత క్లియర్ గా చెప్తోంది!
చిన్న పిల్ల చక్క గా చెప్తుంటే నేనేమో ఇంత అనవసరపు ఇబ్బంది మొహమాటం.. హ్మ్.. ‘అమ్మా.. నీకు ఇంకా పని లేదు. వెళ్ళిరా’ అన్ని మా ఊర్వశి కృష్ణప్రియ కి చెప్పేసాను.
వెళ్లి పారేద్దాం.. ట్రాష్ లోకి... అంతగా అడిగితే.. 'జీడిమామిడి ఎక్స్ట్రాక్ట్ పడట్లేదు ఎందుకో' అని పడే ద్దామని కృత నిశ్చయం తో లేస్తుంటే లీల పిలిచి చటుక్కున నీళ్లు వంపెసింది నా ప్లేట్ లో! నాకు అర్థమయ్యే లోపలే.. 'అయ్యయ్యో.. సారీ సారీ' నాకు మాత్రమే కనపడేలా కన్నుకొట్టి గట్టి గట్టి గా అందరూ వినేట్టు గా అనేసింది.
అమ్మయ్య! .. నాకప్పటికి అర్థమైంది. 'శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని!'. ఈ మాత్రం హింట్ ఇస్తే మా ఊర్వశి కృష్ణప్రియ అల్లుకుపోదూ? “వద్దు.. వెనక్కి రా.. “ అని మళ్లీ పిలిచాను.
"అయ్యో!! ఇంత చక్కటి రుచికరమైన పప్పన్నం!" అన్న భావాన్ని అభినయిస్తూ... ' It's ok.' అంటూ .. ఆవిడ...
నేను ఆనందం గా చెత్త బుట్ట దగ్గరకి పరిగెత్తాను. డైనింగ్ టేబుల్ నిండా.. బోల్డున్నాయి! మళ్లీ ఆకలి తిరిగి వచ్చింది.
"ఏమంటున్నారూ..! ఓహ్ అదా.. ఆ తప్పు మళ్లీ జీవితం లో చేయను లెండి. ఈసారి అన్నీ కొద్ది కొద్దిగా రుచి చేసి మరీ వేసుకుంటా.... "