చదువుకునే రోజుల్లోనో, మొదట్లో ఉద్యోగం చేసే రోజుల్లోనో ఎప్పుడో గుర్తులేదు ఈ సినిమా విడుదల అయినట్టుంది (ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు.. ఉత్సాహం లో “ఓహ్ యముడికి మొగుడు నేను నాలుగో క్లాస్ లో ఉండగా విడుదలైంది..” ఆలాగ.. ఒక్క గూగుల్ సర్చ్, ఒక్క కూడిక వచ్చిన వాళ్ళకి తమ వయసు చెప్పెసుకోవటం.. చూసి చాలా తెలివి గా ఎలా చెప్పానో చూశారా?
ఒక రేజ్.. అందరూ ఎంత ఉత్సాహం తో సినిమాకి బళ్ళు కట్టించుకుని మరీ వెళ్లినట్టున్నారు. (ఆటో బళ్లు, మోటార్ సైకిళ్లు అవీ..) ఈ సినిమా చూడని జన్మ వ్యర్థమన్నారు.. షారుఖ్ ఖాన్, కాజోల్, కొత్తమ్మాయిట రాణి ముఖర్జీ, జోయ్ ముఖర్జీ కుటుంబం లోంచిట. కాజోల్ కి కజిన్ ట. సల్మాన్ అతిథి నటుడు.. ఇంకేం కావాలి? నేనూ వెంటనే వెళ్లిపోయా.. టికెట్ దొరకక ఈవిల్ డెడ్ హిందీ అనువాదం చూసి తల నొప్పితో రూమ్ కి వచ్చా! (ఆ హాల్ పక్కన చవక గా దొరికే పాత సినిమాలు తెప్పించి ఆడించే ఒక థియేటర్ ఉండేది లెండి.. సినిమా కని బయట కెళ్తే ఏదో ఒకటి చూడకుండా రాకూడదని మాకు నియమమాయే! తప్పదుగా!). మళ్లీ మరింత ముందు రెండు క్లాసులు బ్యాంకు కొట్టి మరీ వెళ్లాను. అబ్బే దొరకలేదు.. ‘పాప్ కొ జలాకర్ రాఖ్ కర్ దేంగే’ సినిమా చూసి చలించిన మమ్మల్ని ఎవరో దయామయులు హాస్టల్ కి చేర్చారు. మూడవ సారి పొద్దున్నే హాల్ కి చెక్కేసి కూర్చుని మొత్తానికి చూశాం.. అందరూ అబ్బో ఆహా.. అన్నారు కానీ.. నాకు ఎందుకో నచ్చలేదు. “నీది మరీ చాదస్తం కృష్ణా! సినిమా ని సినిమా గా చూడు! సమాజానికి స్ఫూర్తిదాయకమవ్వాలని అనుకోకు.” అని స్నేహితులంతా హిత బోధ చేశారు. అప్పటికి ఊరుకున్నాను.
కానీ బుర్ర లో ఎక్కడో తొలుస్తూనే ఉంది. ఒకరిద్దరు సన్నిహితుల దగ్గర అన్నాను.. ‘నాకు అర్థం కావట్లేదు..కాజోల్ షారుఖ్ ఖాన్ ని ఓడించినంత కాలం స్నేహితురాలి గా చూశాడు. కులాసా గా తిరుగుతూ, ఆటలు ఆడుతూ, అల్లరి చేస్తున్న అమ్మాయి స్నేహానికి పనికొచ్చింది. ప్రేమకి,పెళ్లికి మాత్రం కాదు..’ అని..
‘నీ మొహం! షారుఖ్ ఆ అమ్మాయి పట్ల ఉన్న స్నేహం, ప్రేమ అని తెలుసుకోలేకపోయాడు..’ ఆ అమ్మాయి జీవితం లోంచి వెళ్లిపోయాకా కానీ తెలిసి రాలేదు..’ అని అరమోడ్పు కన్నులతో పారవశ్యం గా చెప్తే..’హబ్బో.. ఏమో లే’ అనుకున్నాను.
షారుఖ్ చదువు పూర్తి చేసుకుని, జీవితం లో సెటిల్ అయి, పెళ్లి చేసుకుని ఒక బిడ్డని కని,.. ఆ బిడ్డకి తొమ్మిదో ఏడు వచ్చేంత వరకూ..అంటే ఒక దశాబ్దం పట్టదూ? ఈలోగా కాజోల్ అల్లరి తగ్గించి, ప్రశాంతత ని అలవరచుకుని, నెమ్మదితనం నేర్చుకుని, బాస్కెట్ బాల్ మానేసి, భారత నాట్యం నేర్చుకుని, పాటల్లో ప్రావీణ్యం సంపాదించి, జుట్టు పెంచుకుని,చీర కట్టు తో, నగలు,నాణ్యాలు తదితర ఆక్సె సరీలు ఏర్పరచుకుని సాంప్రదాయ సిద్ధం గా, పరివర్తనం చెంది .. ఏదో ఇన్నేళ్ళకి పెళ్లి చేసుకుందామని సల్మాన్ ఖాన్ తో ‘అడ్జస్ట్’ అవుదామని నిర్ణయించుకుని తన మానాన పెళ్లి నిశ్చయ తాంబూలాదులు పుచ్చుకొని పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటుంటే మళ్లీ ఆ పిల్ల మనసు మళ్లించి ..
అబ్సర్డ్ అని తెల్చేసాను.
అయినా.. ఆనందం ఉన్నంత కాలం కాజోల్ మాడర్న్ బట్టలేసుకుని ప్రేమ లో విఫలమైన వెంటనే అర్జెంట్ గా బజారు కెళ్లి సల్వార్ కమీజులు తెచ్చుకుని మొదటి సారి దుఃఖపడుతూ ఏడుస్తూ విడిపోతూ.. అంటే..భారతీయ దుస్తులు దుఖానికి ప్రతీక అనా కరణ్ జోహార్ ఉద్దేశ్యం? అంతే! నన్నొక మనిషిలా గుర్తించటం మానేశారు నా స్నేహితులు.. ఇన్నేళ్లయిపోయినా ఆ విషయం లో దెప్పి పొడుస్తూనే ఉంటారు. అప్పటికీ చెప్తూనే ఉన్నాను. “ సినిమా బోరింగ్ గా ఉండదు నాకు నచ్చుతుంది బాబోయ్” అని. వినరే! హతవిధీ! ఏదో మహా నటి సావిత్రి అంటే నాకు వెగటు.. NTR కృష్ణుడి వేషం లో సూట్ అవడు. శంకరాభరణం లో పాటలు బోరు అన్న వాళ్లని కూడా ఇంత ఘోరం గా చూడరు. ఏం చేస్తాం?
చదువూ,ఉద్యోగం, పెళ్లీ, పిల్లలూ.. ఈలోగా ఈ సినిమా చర్చ నా జీవితం లోంచి వెళ్లలేదు.. పాత స్నేహితురాళ్లు ఎప్పుడు కలిసినా ఇదే గొడవ.. నీకు మరీ చాదస్తం! అని.. నాకూ ఉక్రోశం వచ్చి మూడు సార్లు చూశా.. అబ్బే నా అభిప్రాయం మారట్లేదు. మా వారు అంతకు మునుపు చూడలేదట ఆయనా ఈ సినిమా కి ఫాన్ అయిపోయారు. మా అత్తగారూ భాష పెద్దగా అర్థం కాకపోయినా ‘చాలా బాగున్నట్టుంది ఈ సినిమా ‘ అని సినిమా అభిమానుల సంఘం లో మెంబర్ షిప్ తీర్థం పుచ్చేసుకున్నారు. పైగా.. ఇంత మంచి సినిమా పరిచయం చేసినందుకు నా మీద అభిమానం కాస్త పెరిగిందేమో కూడానూ. ఈ విషయం ఎప్పుడో ఎవరికో మా అత్తగారు చెప్తే.. వాళ్లు నా పుట్టినరోజు సందర్భం గా ఈ సినిమా DVD కొని ప్రేమ గా ఇచ్చారు. ఇంకేం? బోర్ కొట్టినప్పుడల్లా ఇంట్లో ఈ సినిమా చూసేయటం!!.. నాకూ పాటలూ, సరదా సన్నివేశాలూ ఇష్టమే కానీ చాప కింద నీరు లాగా మా ఇంట్లో జరిగే ఒక కొత్త మార్పు ని నేను గ్రహించుకోలేక పోయాను.
పిల్లలు!! ఒకరోజు పరీక్షలు అయిపోయిన సందర్భం గా ఇంట్లో కాస్త, సరదా గా పార్టీ ఏర్పాటు చేశాను. సినిమా చూస్తాం అంటే సరే అని DVD బాక్సు వాళ్ల దగ్గర పెట్టి వెళ్తే ఆరేళ్ల నుండీ పదకొండేళ్ల అమ్మాయిలు ఒక పదిహేను మంది ఈ సినిమా చూస్తామని.. ఆశ్చర్యం వేసింది. వార్నీ.. ఈ జెనరేషన్ పిల్లలకి కూడా నచ్చుతుందా? వద్దు.. వేరేది చూడండన్నా. లేదూ.. ఇదే చూస్తాం.. అని అందరూ! చేసేది లేక సరే అని వాళ్ల మాటలు విందాం అని కూర్చున్నా కొద్ది దూరంలో.
ఒక పాప అంటోంది. ‘ He is very cute nah?’ ‘ఆహా!’ అనుకున్నా.
‘Actually you know Kajol is better looking than Rani. Wonder why Shahrukh prefers her..’ ‘వార్నీ..’ అనుకున్నా.
ఇంకో అమ్మాయి ఆరిందాలా సమాధానం చెప్పేస్తోంది.. ‘She is boyish! not at all like a girl..you know..’ ‘వామ్మో’ అనుకున్నా....
కాజోల్ వెళ్లి పోతోంది. రైల్లోంచి చున్నీ గాల్లోకి ఎగరేసింది.. రాణీ అందుకుంది.. ‘Why is she giving away her chunnee?’ ఒక పిల్ల దౌట్.. ‘It is symbolic! It means she is giving away her boyfriend to Rani’ ‘ఓర్నాయనోయ్’ నా రియాక్షన్!
సినిమాలో షారుఖ్ కూతురు తల్లి రాసిన ఉత్తరం చదవటం ఆపి కళ్ళు తుడుచుకుంది. పిల్లలూ అంతే!! సినిమాలో పిల్ల లాగా ఈ పిల్లలు కూడా కాజోల్, షారుఖ్ తిరిగి కలుసుకుంటే చూడాలని కళ్లల్లో కోటి ఆశలు.. నాకేమో గంగవెర్రులెత్తుతోంది ఒక పక్క!! ఇంకా నయం కాసేపుంటే అలాంటి అవకాశం తమకు రాలేదని బాధ పడతారేమో ఈ పిల్లలు..
ఈలోగా..షారుఖ్ చెప్తున్నాడు. కాజోల్ లక్షణాలు.. వాస్తవానికి కాజోల్ పూర్తి గా మారిపోయింది. మొదటి సారి చూసే పిల్లలు ‘థాంక్ గాడ్’ ‘Now he will like her.. Oh wow she is getting engaged to Salman Oh no! ‘ ముందు గా చూసేసిన పిల్లలు ‘No worries! wedding gets postponed. In the meanwhile Shahrukh will get her!’ ఇంక ఆగలేక పోయా.. ఈ సినిమా వద్దు.. చిన్నపిల్లలవి చూడండి. లేదా.. వేరే పనులేమైనా చూసుకోండి.అని గద్దించాను.
తర్వాత నెమ్మదిగా ఎక్కడో తోసేశా DVD ని. పిల్లలు చూసి చాలా కాలమైంది. ఏదో ఆఫీస్ లో పెద్ద ఎమర్జెన్సీ.. పగలు రాత్రి ఏకం చేసి మరీ పని చేయాల్సి వచ్చింది. ఆదివారం ఉదయానికి చిత్తడి అయిపోయా. మొన్న రెండు సార్లు కాస్త గంభీరమైన సినిమాలకి తీసుకెళ్లి పిల్లల్ని ఇబ్బంది పెట్టాం. ఈరోజు పిల్లల్ని 3D సినిమా ట చూపిద్దామా? అని మావారడిగారు. నాకు అస్సలూ ఓపిక లేదు. వద్దు బాబూ.. TV లో చూద్దాం ఏదైనా..అని చానెళ్లు తిప్పుతున్నాం. ‘క్యా కరూ హాయే కుచ్ కుచ్...హోతాహై’.. పాట.. ‘ఓహ్ అంజలి సినిమా వస్తోంది అక్కా! ‘ అని మా చిన్నది. ‘అవునా? వస్తున్నా! ‘ అని పెద్దది.
బద్ధకం ఒక్కసారిగా వదిలిపోయింది. ‘పదండి పదండి.. సినిమాకి వెళ్దాం. టీవీ కట్టేయండి..’ అని బయల్దేరదీసాను అందర్నీ..
అవునూ.. నాకూ, రాం గోపాల్ వర్మ కీ మాత్రమేనా? ఇలాగ? ఎవరైనా ఉన్నారా ఇంకా ఈ సినిమా నచ్చని వారు?
33 comments:
“కుచ్ కుచ్ హోతా హై” సినిమా sexist, stereotyped romantic bullshit అని అప్పుడప్పుడూ చెబుతుండేవాడిని...ఇప్పుడు ఇన్ని ఇజాలతో కాకున్నా కొంత అదే అర్థంతో మీరూ అన్నారు. I am glad apart from RGV you are there :)
@ఇంకా నయం కాసేపుంటే అలాంటి అవకాశం తమకు రాలేదని బాధ పడతారేమో ఈ పిల్లలు..
కాజోల్ పై జెలసి నా :)
హహహ!మీరు చెప్పిన లెక్కలోనే నేను ప్రవాసంలో చూసిన మొదటి సినిమా:)మొదటిసారి చూసినప్పుడు గంగవెర్రులెత్తింది. వినీ వినీ పాటలూ, చూసీ చూసీ సినిమా అలవాటైపోయాయి.అలాంటి కాలేజీ, అలాంటి ఆటలూ,అలాంటి స్నేహాలూ, ఒక్క కరన్ జోహార్ కు మాత్రమే సాధ్యం.పిల్లల అభిప్రాయాలంటారా, ఏదో చెదురు మదురుగా మీరు ఉటకించినవే కానీ నేను పెద్దగా ధ్యాస పెట్టలేదు.ఇంకో సినిమా ఉంది కభి అల్విధ నా కెహనా!అది చూస్తే జన్మలో సినిమా అనరు ( అభిమానులూ ఈసారికి నన్నొదిలెయ్యండి) ముక్కలు ముక్కలు గా కూడా చూసే ప్రయత్నం చేసి ఓడిపోయాను.కానీ కాఫీ విత్ కరణ్ మాత్రం చూసాను.
అన్ని మెలికలూ తిప్పి కధను సుఖాంతం చెయ్యడం వల్ల అందరికీ నచ్చిందనుకుంటున్నాను నేను:)
ఈ సినిమా వచ్చినప్పటికి నేను చిన్నపిల్లాణ్ణి కానీ మొన్నామధ్య మగధీర సినిమా చూసి అదేంట్రా రాజపుత్ర యువతి అంటున్నాడు మళ్లీ దేశాన్ని దాని మానాన దాన్ని వదిలి ప్రేమ పూజ కావాలని పిచ్చి మాటలు మాట్లాడుతోంది అన్నందుకు మా ఫ్రెండ్స్ నన్ను నానా హింసల పాలు చేశారు.
ఆ టైంలో ఏదో క్రేజ్‌లో సినిమా చూసేసాను కాని తరువాత తరువాత చూసినప్పుడు నాక్కూడా మీక్కలిగిన సేం డౌట్లే కలిగాయి...ఈ సినిమాని ఎట్టా హిట్ చేసారా బాలివుడ్ జనాలు అని ఓ అనుమానం వచ్చి నా సినిమా టేస్ట్ పైన నాకే డౌట్ వచ్చింది..
:) కానీ షారుఖ్ మాత్రం చాలా క్యూట్ సుమండీ ఈ సినిమాలో...
I hate this movie, in fact I dont like typical Karan Johar movies at all.
ఆ సినిమా చూస్తూ మీ పిల్లలూ వాళ్ళ స్నేహితుల కామెంట్లు మీకు అలా అనిపించాయా?
అయితే ఇది చదవండి నా స్నేహితుని కొడుకూ వాడి చెల్లెలూ( వయసు 12 -10 ) నాతో దోస్తాన సినిమా గురించి చెప్పారు
అభిషేక్ - జాన్అబ్రహం మధ్య సం(?)బంధం గురించి వివరిస్తే, నా అజ్ఞానం లో (నేను సినిమాలు చూడను) నేను ఫ్రెండ్సా అంటే కాదు అంకుల్ వాళ్ళిద్దరూ అంటూ..
ధూ నాసినం సినిమాలు !!
నాకు నచ్చిన ఒకేఒక కరణ్ జోహార్ సినిమా! డీడీఎల్జేతో సహా ముషీ-ముషీ ప్రేమ కథలు నచ్చని నాకు ఈ చిత్రం ఎందుకో నచ్చింది - ఆ పిల్ల వయసుకి మించిన మాటలు-చేతలు పక్కనపెడితే. టీవీలో ఎన్నిసార్లు వచ్చినా బోరుకొట్టకుండ చూస్తాను.
కృష్ణగారూఉ.......గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ నాకు ఈ సినిమా చాలా ఇష్టం. ఎంత గొప్పగా రాసారో నా ఫెవరెట్ షారుక్ సినిమా గురించి అనుకుని వస్తే....ఏమిటిది? వాఆఆఆఆఆ!!! వాఆఆఆఆఆఆ! నహీఈఈఈఈఈఈఈఇ!
I agree! It is an incredibly retrograde movie. It is a surprise why it was such a big hit! But nobody can predict what catches public attention, isn't it?
Sharada
ఆగండాగండి..ఆన్ లయిన్లో యీ సినిమా ఉందేమో అర్జెంట్ గా చూసొచేస్తాను..విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ .నేను ఇంకా చూడలేదంటే చీప్ గా ఉంటుందేమో...
ennela
మీరే టాపిక్కు మీద వ్రాసినా భలే వ్రాస్తారండి.
చెత్త సినిమాలు కూడా ఎంత పెద్ద హిట్టు అవుతాయో చెప్పటానికి ఈ సినిమా ఓ మంచి ఉదాహరణ. నేను హిందీ సినిమాలు అంతగా చూడను..ఈ సినిమా మాత్రం టి.వి చానళ్ళ పుణ్యమా అని ఓ మూడు నాలుగు సార్లు చూసుంటాను...సినిమా మొత్తం కాదులేండి..మొదట..మధ్య..చివర. ఆ ప్రేమలేంటో..షారూక్ కళ్లల్లో ఆ తడి ఏంటో(ఆ తడితో అభిమానుల గుండెలు పిండేసి ఉంటాడు)!
మొదటిసారి చూసినప్పుడు అంత లాజికల్‌గా ఆలోచిస్తూ చూడం కదా..పాటలు అవీ బావుంటాయి కాబట్టి సినిమా బాగానే అనిపిస్తుంది..రెండోసారి నుండి కథలోని పైత్యం చిరాకు తెప్పిస్తుంది.
ఈ ఒక్క సినిమా అనేముంది లెండి , ఏది చూసినా ఇంతే . ఈ మద్య ఐశ్వర్యారాయ్ దొక సిన్మా చూసాను . అందులో ఒకరిని ప్రేమిస్తుంది . ఇంకోరిని పెళ్ళి చేసుకుంటుంది . పెళ్ళి చేసుకున్నవాడు ప్రేమించిన వాడి తో పెళ్ళి చేస్తానని తీసుకెళుతుంటె అప్పటి వరకూ ధరించని సింధూరము , మంగళ సూత్రమూ అన్ని వేసుకొని పెద్ద ముత్తైదువలా వెళుతుంది . అది చూసి నాకు ఆపుకోలేనంత నవ్వు వస్తే అందరూ నన్ను తిట్టారు :) ఆ సినిమా పేరు హీరో లు గుర్తులేరంకోండి :)
తర్కం (అవసరంలేని) కూడని సినిమాల్లో కరణ్ జోహార్ సినిమాలు ముందుంటాయి.
ఆనంద్ లో రూప, మగధీరలో మిత్రవింద నచ్చలేదంటే నన్నూ ఇలాగే, "ఉలిపికట్టె"నని నవ్వార్లెండి ఊరంతా.
కృష్ణగారూ, ఈ సినిమాలో కాజోల్ నాకూ నచ్చదు
కానీ షారూఖ్ బావుంటాడు. టైటిల్ సాంగ్ మాత్రం చాలా ఇష్టం.చివరి లైన్ క్యా కరు హాయె,కుచ్ కుచ్ హోతాహై
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
పిల్లల కామెంట్స్,మీ రియాక్షన్స్ మాత్రం భలే ఉన్నాయి.
ఎన్నెల గారు కంగారు పడకండి మీకు తోడు నేనున్నా :))) ఏంటో ఇప్పుడు అర్జెంట్ గా చూసి ఎండింగ్ ఏంటో తెలుసుకోవాలని ఉంది :)))))
@ మహేశ్ కుమార్ గారు,
హ్మ్.. ఈ మధ్య మన సినిమాలు దాదాపు గా ఇలాగే ఏడిశాయి అని అనుకుంటూ ఉంటా. ఎక్కడో కొండొకచో బాగుంటున్నాయి ఈ మధ్య.
RGV, నేనూ :) ఊర్కే అలా రాశా. I know there are a lot who would agree with me on this.
@ మౌళి,
అదే! జెలసీ ;)
@ సునీత గారు,
హమ్మయ్య. సినిమా సరదా గా బాగానే ఉంటుంది. పాటలు, కబుర్లు.. కానీ.
మీరన్నాకా గుర్తొచ్చింది. 'KANK' చూసినప్పుడు హాల్ అంతా చాలా అసహనం గా ఉన్నట్టు అనిపించింది. ఒక సీన్ లో ప్రీతి చెంప దెబ్బ కొడుతుంది షారుఖ్ ని. వెంటనే హాల్ లో చప్పట్లు..
@ పక్కింటబ్బాయి,
:) మరే...
@ స్నిగ్ధ,
:) నేనూ ఒప్పుకుంటాను. అందరూ అద్భుతం గా చేశారు. పూర్తిగా ఎంటర్ టేయినింగ్ గా ఉంటుంది. కాకపోతే ఈ విషయాల్లో నన్ను అసహనానికి గురి చేస్తుంది.
@ మయూఖ,
హ్మ్. గుడ్. నాకు తోడు మీరు. ఆయన సినిమాలు ఒకటి రెండు నాకు కాస్త పర్వాలేదు. కొన్ని మాత్రం ..నా వల్ల కాదు.
@ ఆత్రేయ,
:-( I can understand..
@ జేబి - JB,
hmm..నాకూ బోర్ కొట్టదు. ఆ మాట కొస్తే చాలా వరకు ఆయన సినిమాలు (దోస్తానా, KANK, అమెరికా లో సినిమా - షారుఖ్ కి కాన్సర్.. లాంటివి తప్ప). బోర్ కొట్టవు.
కానీ...
@ ఇందు,
:) సారీ
@ శారద గారు,
థాంక్స్! కరక్ట్ గా చెప్పారు.
@ ఎన్నెల,
చాలా కాలానికి కనిపించారు.. చూడండి
@ సిరిసిరి మువ్వ,
:) థాంక్స్! కరెక్ట్ గా చెప్పారు.
@ మాలా కుమార్ గారు,
'హమ్ దిల్ దే చుకే సనం.' సినిమా అది. తండ్రి ని ఎదిరించి చెప్పలేదు కానీ.. వేరే మనిషి మీద కోపం చూపించటం.. ఆ అమ్మాయి జీవితం తన చేతుల్లోకి మళ్లీ రావటం బొత్తి గా చాలా అదృష్టం అని చెప్పాలి.
మీరన్నట్టు ... మామూలు గా తీరిగ్గా ఉన్నప్పుడు బొట్టు పెట్టుకోదు కానీ ఆసుపత్రి లో రూపాయ్ చేతి లో లేనప్పుడు మాత్రం ఇటలీ లో కుకుం భరిణె మాత్రం ఎలాగో సంపాదించి విరిగిన చేతులతో, కట్లతో ఎలాగోలా పెట్టుకుంటూ ఉంటుంది :)
@ కొత్తావకాయ,
:) అవునా? కొన్ని అందరూ మెచ్చి తీరాలి తప్పదు.
@ లత గారు,
థాంక్స్! ఆ సినిమా లో అన్నీ ఓకే. కారక్టరైజేషన్లు చిరాకు తెప్పిస్తాయనే తప్ప!
@ శ్రావ్య,
:) ఎండ్ ఏంటో సగం లోనే తెలిసిపోతుంది లెండి. చూసి తప్పక చెప్పండి ఎలా ఉందొ..
అ దీ అసలు విష్యం. :) నువ్వే కావాలి సినిమా గుర్తు౦దా మీకు , అప్పటిదాకా మోడరన్ గా ఉన్నమ్మాయి 'కళ్ళలో కళ్ళు పెట్టి చూడమ౦టు' చుడిదార్ వేసుకొని కు౦డలు కు౦డలు కన్నీళ్ళు పెట్టేస్తదిగా. అ౦టే దర్శక హృదయం అలా నిజమైన ప్రేమకి, (మేబి బాధ కి) స౦ప్రదాయమ్ ఉ౦దని చెపుతు౦దేమొ. :) :) .
మీకొచ్చిన అనుమానాలన్నీ నాకు వచ్చి ఇలా పోయాయి. ఇప్పటికి షారుక్ పెద్ద సెల్ఫిష్ (విలన్?) లా కనిపిస్తాడు ఈ సిన్మాలో . బట్ వాళ్ళిద్దరి స్నేహం లో ఏదయినా సమ్మతమే అనుకోవాలి.
నాకు అసలు ఆ షారుక్ సినిమాలేవి నచ్చిచచ్చవు (excpet swades , chakde) కాబట్టి I no comment.
అమ్మా వాళ్ల చిన్నప్పుడు 'లేత మనసులు" అని సినిమాలొ పిల్లల డైఅలగులు చూసి ఆ సినిమాని "ముదురు మనసులు" అనుకునేవారుట. అలాగ ఈ సినిమా ..ముదురు పిల్ల, ముదురు డైలాగులు..ఎలా హిట్ అయ్యిండొ ఇప్పటికీ అర్ధం కాదు నాకు. పాటలు బావుంటాయి కానీ ఆ కాన్సెప్ట్ అస్సలు నచ్చదు నాకు. డ్రెస్సులు వేస్తే నచ్చని అమ్మాయి చీర కట్టేసి,చెయ్యి తగిలిస్తే నచ్చేస్తుందా? ఏమిటో కలికాలం..అప్పట్లో కాజల్ కోసం ఈ సినిమాకు నాన్నని బ్రతిమాలుకుని తీసుకువెళ్ళి..ఎప్పుడు అయిపోతుందా అని ఇద్దరం తిట్టుకుంటూ చూడ్డం ఇంకా గుర్తు నాకు..:)) ఇప్పుడంటే పక్కనవారి ప్రభావం వల్ల మధ్యలో వచ్చేయటం అలవటైంది కాని అప్పట్లో అలా కూడా వచ్చేస్తారని తెలీదు..:(
@ మౌళి,
:)
@ నాగార్జున,
:) చాలా మంది అబ్బాయిలకి ఈ రెండే నచ్చుతాయనుకుంటా
@ తృష్ణ,
:) exactly! ఇప్పటికీ మధ్యలో మేము రాలేం బాబూ. ఎంత బాగుండకపోయినా చూడాల్సిందే
హ హ హ...నా దృష్టిలో ఈ సినిమాలో షారుఖ్ విలన్ సల్మాన్ హీరో...ఎవరు ఎప్పుడు అందంగా వుంటే వాళ్ళ వెంట పడటం కన్నా ఏమీ చెయ్యలేదని నా అభిప్రాయం...ఈ point తో ఎప్పుడూ నాకూ నా కజిన్ కి పెద్ద గొడవ...అది అప్పట్లో షారుఖ్ కి పేద్ద fan మరి...ఐనా కరణ్ జోహార్ సినిమాల్లో లాజిక్కులు వెతకటం అనవసరమని కొన్ని సినిమాల తర్వాత తెల్సింది...:)
అవునూ, ఇది మీ పిల్లలు చూసిన మొదటి సినిమానా, లేక వాళ్ళు కామెంటు చేస్తుండగా నువ్వు గమనించిన మొదటి సినిమానా? ఈ పాటికే నువ్వూ, పిల్లలూ కాస్త ఇమ్యూనిటీ పెంచుకుని ఉండాలే సినిమాలకి? ఒక వేళ ఇలా అనిపించే సినిమా మీ పిల్లలకి ఇంతవరకూ చూపించలేదు అంటే వాళ్ళకి ఇంత వరకూ చూపించిన సిమాల లిస్టు చెపితే మా పిల్లలకి చూపించుకుంటాను :)
ఇక నీ అభిప్రాయం మాటకొస్తే అర్థం చేసుకోగలను. నాకు అలా నచ్చనివి చాలానే ఉంటాయి కనుకేమో. బహుశా వినోదపరంగా బావున్న దాంట్లో ఇలాంటి సందేశాలు అందుతుంటే అభ్యంతరం అని నువ్వు చెప్పదల్చుకుంటే సరే. సినిమా మొత్తానికే చెత్తగా ఉన్నప్పుడు ఎలాగూ అవాయిడ్ చేస్తాము, లేదా పెద్ద చెత్తలో చిన్న చెత్త కొట్టుకుపోవచ్చు. నటీ నటులు అందంగా ఉండి, అందంగా వినోదాత్మకంగా ఆకర్షించేలా తీసినప్పుడు ఆ సినిమా ఇచ్చే సందేశం కూడా ముఖ్యమే అని నీ ఉద్దేశం అనుకోవచ్చా?
@ స్ఫురిత,
Totally!
@ లలితా,
:) నా ఉద్దేశ్యం.. అంత గొప్ప హిట్, యావద్భారతం నోళ్లు తెరిచి చూసిన చిత్రరాజం.. ఇచ్చే సందేశాన్ని విమర్శించటం..
ఇక పిల్లల విషయమంటావా? ఎన్నో రకాల చెత్త సినిమాలు అర్థం అయ్యీ అవక చూస్తూనే ఉంటారు.. కానీ. ఈ సినిమా నె ప్రత్యేకం గా ప్రస్తావించటానికి కారణం ఏంటంటే ఈ సినిమా కథ వారు ఒకరకం గా అర్థం చెసుకుని నచ్చిన్దనుకుని పదే పదే సామూహికం గా కూడా చూడాలనుకోవటం.
>> అబ్సర్డ్ అని తెల్చేసాను. <<
ఈ లైన్ కి ముందు మీరు రాసిన కారణంతోనే అదీ కాజల్ కి అన్యాయం జరిగిందని నాకు కూడా ఈ సినిమా మీద కొంచెం కోపమండీ... ఈ సినిమా హిట్ కావడానికి కథ కన్నా టేకింగ్ ది ప్రధమ స్థానం అని నాకనిపిస్తుంటుంది. కానీ మాస్ హిస్టీరియా కూడా ఒక కారణం అనుకోవచ్చు.. కొందరు బాగుంది అమోఘం అని తేల్చగానే అందరూ అదే బాట పట్టడం. కాలేజ్ యువతే కదా హిట్ చేసింది.. నేను ఈ డివిడి పాటలకోసం మాత్రమే కొన్నాను.
Hello Krishna Priya Garu,
I have been following your blog for some time now. I like all your posts. I thought of writing commments earlier. How ever this post i could not resist.
I hate this movie.My wife and myself will always fight when ever this movie is telecasted in TV( is it telecast or broadcast?)
By the way naaku telegu rayatam chadavatam rendu vachi kaani online lo ela rayalo teleyaka para bhsha meeda adhara paddanu
@ వేణూ శ్రీకాంత్ గారు,
Absolutely! మేమూ అంతే .. ఈ సినిమా పాటలు హిట్, ఎవర్ గ్రీన్!
@ రాజేంద్ర గారు,
థాంక్స్! నాకూ ఒళ్లు మండే ఈ పోస్ట్ రాశాను.
I use google transliterator, and www.lekhini.org to write in telugu. మీరూ ప్రయత్నించి చూడండి.
హహహ బాగుందండీ మీ టపా! ఈ సినిమాని ద్వేషించే సంఘంలో నాకు కూడా మెంబెర్షిప్ ఉంది!నా తొమ్మిదో తరగతిలో మొదటి సారి చూసా అప్పటికి వచ్చి ఇన్నేళ్ళయినా ఇంత గొప్ప సినిమా నువ్వు చూడలేదా అని నేనేదో ఆమరణ నిరాహార దీక్ష అన్నేళ్ళుగా చేస్తున్నట్టు చూసారు నా స్నేహితులు! ఆ పిల్లల కంమెంట్లు మీ రియాక్షనూ బాగున్నాయండీ! ఆ పాప లాగానే నాకు కూడా అనిపించింది కాజోలే బాగుంది కదా రాణీ కన్నా అని! అబ్సుర్డ్ అని నాకు కూడా అనిపించింది!
I am a BIG FAN of SHARUKH......but I did not watch this Movie....after watching DDLJ movie in TELUGU DUBBING VERSION....I became a FAN for him.....
but...all U ppl r criticising this movie so sarcastically...:)
I will watch this movie this week and post my opinion on that
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.