Saturday, December 8, 2012

గేటెడ్ కమ్యూనిటీ కథలు... రాధా మామియార్, సెంథిల్ మామ




“రాధా మామీ వస్తోంది.. లోపలకి పోదాం. లేకపోతే అరగంట దాకా వదలదు!! పద పద.. “..అని గబుక్కున ఇంట్లోకి లాక్కెళ్లి పోయింది రెండో నంబరావిడ.. అతి లాఘవం గా మిగిలిన జనాలు కూడా ఆవిడకి కనబడకుండా అందరూ భాగో అని తలుపులేసేసుకున్నారు..

(రాధక్క - మైత్రి)

‘అరే.. ఎవరబ్బా..ఆవిడ.. అంతలా హడిలిపోతున్నారు జనాలు’ అనుకుని కర్టెన్ లోంచి నెమ్మది గా తొంగి చూశాను. జుట్టుకి మైదాకు పెట్టి పెట్టి ఎర్రగా ఉంది. కాస్త భారీ మనిషి ముసలావిడ.. రోడ్డు మీద కొద్దిగా బాలన్స్ చేసుకుంటూ నడుస్తోంది.. నాకెప్పుడూ ఆవిడ తో మాట్లాడే సందర్భం రాలేదు.. నేను ఇక్కడ దిగే సమయానికి ఆవిడ కోడలి డెలివరీ కి అమెరికా వెళ్లిందట. అందువల్ల పరిచయ భాగ్యం కలగలేదు.

తర్వాత తీరిగ్గా కాస్త తెహ్కీకాత్ చేస్తే బయట పడ్డ విషయాలు.. రాధా మామియార్ కి కనీసం అరవయ్యయిదు వయసు. ఆవిడ భర్త సెంథిల్ గారికి ఓ డెబ్భై ఉంటుంది. కొడుకులు ముగ్గురూ ఖండానికొక్కరు గా వెళ్లి సెటిల్ అయ్యారు. ప్రతి సంవత్సరం,.. లండన్ కో, ఆస్టేలియాకో, అమెరికా కో ప్రయాణం కడుతూనే ఉంటారు భార్యా భర్తలు. కాలనీ లో ఉన్నప్పుడు వాళ్లని భరించడం మానవ జాతి తరం కాదు.

సెంథిల్ మామ రహస్యం చెప్తే మా నలభై ఇళ్లవాళ్లకీ మైక్ లో చెప్పినట్టు ఉంటుంది. ఇక గళమెత్తి ఏదైనా పద్యం అందుకుంటే చిన్నస్వామి స్టేడియం వాళ్లు మైకూ, స్పీకరుల్లాంటి ఖర్చులు లేకుండా ఈయన చేతే అక్కడ క్రికెట్ మాచిలకి కామెంటరీలు చెప్పించీగలరు. ఇక రాధా మామియార్ కి తను పెద్దదాన్ని అని ఒప్పుకోవడం ఇష్టం ఉండదు..ఇరవైల్లో, ముప్ఫైల్లో ఉన్న ఆడవాళ్ల తో అక్కా అని పిలిపించుకోవాలని బాగా తహ తహ. విధి వశాత్తూ రోజు లో ఏ సమయం లో ఎక్కడ కనిపించినా.. ఇక కనీసం ఒక గంట ఇంక ఆవిడ వదలరు.. గడగడా మాట్లాడుతూనే ఉంటుంది.

ఈ విషయాలు విన్నాకా నేను ప్రత్యేకం గా ఆవిడ తో పరిచయం పెంచుకోవాలని ప్రయత్నించలేదు. రోడ్డు మీద కనిపించినప్పుడు పలకరింపు గా ఒక చిరు నవ్వు., ఎవరో తోస్తే వంచినట్టు తలని అరక్షణం దించి, ఏదో పని మీద వెళ్తున్నట్టు ఉరుకులూ పరుగులూ పెట్టడం. మావారు మేనేజ్మెంట్ కమిటీ లో ఉండటం వల్ల సెంథిల్ మామ మాత్రం ఆ సంవత్సరం కోశాధికారి గా పనిచేయడం వల్ల చాలా సార్లు ఇంటికి వచ్చి ఏవో డబ్బుల లెక్కలు మాట్లాడుకోవడం మాత్రం జరిగేది. ఆయన మొదట్లో వచ్చి మాట్లాడేప్పుడు మావారి ని ఎందుకు అంతలా అరుస్తున్నారు అని ఒకటి కి పది సార్లు తొంగి చూసి, కొన్నాళ్లకి ఆయన తీరే అంత అని అర్థమయ్యాకా పట్టించుకోవడం మానేశాను.

ఈలోగా పంద్రాగస్తు వచ్చేసింది. మరి పొద్దున్నే ఖచ్చితం గా ఎనిమిది కల్లా జండా ఎగరేద్దామని నిర్ణయించుకుని అందరం ఠంచన్ గా తొమ్మిదీ, తొమ్మిదీ పదికి బద్ధకం గా జండా కర్ర దగ్గర నుంచున్నాము. ఈలోగా గున గునా నడుస్తూ రాధా మామీ.. ఆవిడని చూసి అప్పడిదాకా ముఖం గంటు పెట్టుకున్న వాళ్లు ఆవిడని చుట్టు ముట్టేసి ‘బాగున్నారా మామీ.. కనిపించడం మానేసారే? ‘ అని కుశలం అడుగుతుంటే ముక్కున వేలేసుకోవడం నా వంతైంది. ఆవిడ తీవ్రం గా ‘ఎనిమిది గంటలకి రమ్మంటే సంవత్సరానికి రెండు సార్లు కూడా స్నానాలు చేసి ఇక్కడకి రాలేరా? నేను ఇది మూడోసారి రావడం.. ఒక్కరూ లేరని వెనక్కి పోవడం.. ఏంటమ్మా? ఒక్క పూట కాస్త ఉదయమే లేవ లేరా? మీరే ఇలాగైతే మీ పిల్లలకి ఏం క్రమశిక్షణ నేర్పుతారు? ‘ అని అందరి మీదా విరుచుక పడింది.


నాకు భలే కిక్ వచ్చింది. నేనూ పిల్లలకి అల్పాహారం పెట్టేసి హడావిడి లో ఉదయం చాయ్ కూడా మానుకుని జెండా కర్ర దగ్గర పడిగాపులు కాస్తుంటే.. నాకూ ఇంచుమించు అదేస్థాయి అసహనం వచ్చింది. కానీ ఆవిడ లా బయట పడక నోరు మూసుకుని కృత్రిమ చిరునవ్వు అతికించుకుని తిరుగుతున్నాను. ఆవిడ వాక్ప్రవాహానికి అడ్డు వేయడానికే అన్నట్టు జండా ఎగరేసే కార్యక్రమం మొదలై పోయింది. పదకొండు గంటలకి మళ్లీ అందరూ కలవాలనీ, అప్పుడు అంత్యాక్షరీ, క్రికెట్ కార్యక్రమాల తర్వాత భోజనాలనీ నిర్ణయించుకుని అందరూ ఎవరిళ్ళకి వాళ్లు బయల్దేరారు. పిల్లలు, మావారు క్రికెట్ వైపు వెళ్లడం తో, నేనూ ఏదైనా టిఫిన్ తినేసి హాయిగా మాంచి పుస్తకమో, లేక టీవీ లో సినిమాయో చూద్దామని ఉత్సాహం గా ఇంటికేసి అడుగులేస్తుంటే, వెనక నుంచి ‘కృష్ణా.. ఉదయపు కాఫీ తాగలేదన్నావు కదా ఇంకా? నీతో ఈ రోజు పరిచయం సందర్భం గా ఫిల్టర్ కాఫీ పెడతాను మా ఇంటికి పద..’ అని మొహమాట పెట్టేసింది రాధా మామీ.


సరిగ్గా పని చేయనప్పుడు కాబిన్ లోకి .మేనేజర్ వెనక వెళ్తున్న ఉద్యోగి వెళ్తుంటే మిగిలిన వాళ్లు చూసినట్లు కొంతమంది జాలిగా, కొంతమంది ‘బాగా అయ్యింది దీనికి’ అన్నట్టు చూస్తున్నారు. నాకూ కొద్దిగా బెరుకు గా అనిపించింది.. ఇంట్లోకి వస్తూనే గమనించింది.. హాల్లో రకరకాల పత్రికలు చిందర వందర గా.. ఒక పక్క బల్ల నిండా మందులే. ఇంకో పక్క తాగేసిన కాఫీ కప్పులు.. మడత పెట్టాల్సిన బట్టలు. వంటింట్లో కి నడిస్తే అక్కడ సింక్ నిండా అంట్లు, పొయ్యి మీద ఉదయం పొంగిన పాల తాలూకు మరకలు, రాత్రి మూకుడు లోంచి ఎగిరి తప్పించుకున్న తాళింపు గింజలు.. అరుగు నిండా సామాన్లు.. ఆవిడ ఏమాత్రం సిగ్గు పడకుండా ఫిల్టర్ కాఫీ కప్పులోకి పోసి ‘పద..హాల్లో కూర్చుందాం.. ఇక్కడ చాలా సఫోకేటింగ్ గా ఉంది.. ‘ నన్ను సోఫాల్లోంచి పత్రికలని ఓ వైపు తోసుకొమ్మని, ఆవిడ బట్టల మూటని దీవాన్ మీదకి పెట్టి కబుర్లు చెప్పడం మొదలు పెట్టింది. చక్కటి ఆంగ్లం.

ఐదు నిమిషాల్లోనే ఆవిడ అద్భుతమైనభాషా జ్ఞానం నాకు అవగతమైంది. ఇంకో పది నిమిషాలకి ఆవిడకి సంగీతం లో ప్రవేశం ఉందనీ, మొక్కలంటే ప్రాణమనీ, ఈ వయసు లో పది కిలోమీటర్లు వెళ్లి సంగీతం నేర్చుకుంటుందనీ, చిన్న స్కూల్లో ఆంగ్లం, లెక్కలూ చెప్తుందనీ, అప్పుడప్పుడూ ఆడపిల్లల సంక్షేమ హాస్టల్ లో వాలంటీరింగ్ చేస్తుందనీ అర్థమైంది.

వచ్చేసేముందు అన్నాను... 'రాధా మామీ,.. ఇంత చక్కటి ఇంగ్లిష్ ఎలా మాట్లాడుతున్నారు? ఒక పక్క తమిళ్, ఇంగ్లిష్ పెద్ద పెద్ద నవల్లు చదువుతున్నారు.. ఒక పక్క భజన సంఘాలు, పూజలు..కిట్టీ పార్టీలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ఆసక్తి.. ఇదంతా చేయటానికి ఎంత ఓపిక, ఆసక్తి ఉండాలి.. మీరు చాలా యూనీక్ పర్సన్ '

వెంటనే.. ఆవిడకి ముఖం లో అప్రసన్నత ఆవహించింది. 'నన్ను మామీ అనద్దు. పేర్లతో పిలుచుకుందాం. నన్ను రాధా అని పిలువు. లేదా.. నీకన్నా పెద్ద కాబట్టి రాధక్కా /రాధాజీ అని పిలిచినా ఓకే.. ' నేను ‘అలాగే అలాగే ‘అని కంగారు గా అనేశాను. ఆవిడ కూడా తగ్గి ‘నేను సింగపూర్ లో పుట్టి పెరిగాను. నాకు 18 ఏళ్లు వచ్చేసరికి మా నాన్నగారికి జబ్బు చేసి అర్జెంట్ గా పెళ్లి చేసేస్తే బాధ్యత అయిపోతుందని మెడిసిన్ చదువుతున్న నన్ను బలవంతం గా మీ అంకుల్ కి ఇచ్చి పెళ్లి చేసేశారు. ఆయన ఇండియా కి వచ్చేసి ‘నువ్వు వస్తే రా.. నేను మాత్రం విదేశాల్లో ఉండే ప్రసక్తే లేదు..’ అనడం తో చదువు ఆపేసి వచ్చేయాల్సివచ్చింది. ఈలోగా వరసగా ముగ్గురు పిల్లలు.. ‘ అనేసి ఆపేసింది.

తర్వాత ‘చూడు ఇల్లు.. It’s all mess. Clean & neat house is a sign of a wasted life’ అని నమ్ముతాను. నాకున్న ప్రతి క్షణాన్నీ నాకిష్టం వచ్చినట్లు గడపటానికి ఇష్టపడతాను’ అందావిడ.

ఆరోజు అంత్యాక్షరీ లో ఎవ్వర్నీ పాడనీయకుండా ఆవిడే అన్నీ పాడేసిందనీ, ఎవ్వరికీ మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా ఆవిడే మాట్లాడేస్తోందనీ అందరూ విసుక్కుంటూనే ఉన్నారు. తర్వాత ఆవిడ నన్నూ ఎప్పుడూ వదిలేది కాదు. ఎప్పుడో స్కూల్లో కడుపు నొప్పి సాకు తర్వాత, మళ్లీ ఆవిడ తో కబుర్లకి ‘మీటింగ్ ఉంది.. పిల్లలకి పరీక్షలు.. చుట్టాలొస్తున్నారు.. ‘ లాంటి సాకులు చెప్పి తప్పించుకోవడం లో Expert అయిపోయాను. తోట పని చేసుకుంటున్నా, ఎవరితోననైనా కబుర్లు చెప్తున్నట్టు కనిపించినా అంతే సంగతులు. ఖాళీ గానే ఉన్నావు కదా అని ‘రాధక్క’ నుంచి అలా కబుర్లు జీవనది ప్రవహిస్తూనే ఉండేది. అప్పుడప్పుడూ కొత్తరకం సాంబారు. పోరియల్, కేకులు, పాస్తా లూ తెచ్చి ఇస్తూ ఉండేది.  నాకు ఆవిడ ని తప్పించుకు తిరిగే ప్రణాళికలేయడం దినచర్య లో భాగమైపోయింది.


(సెంథిల్ మామ - ధాత్రి)
ఈలోగా సెంథిల్ గారిమీద అందరూ విసుక్కోవడం విపరీతమైపోయింది. ఆటోలో మోటారు బాగుచేయించుకుని వచ్చిన కాలనీ సిబ్బంది ని ‘ఆటో ఫేర్ కి రసీదు ఇస్తే కానీ బిల్లు పాస్ చేయననీ, అలాగే కాలనీ లో నాలుగు మొక్కలేస్తే.. ఛీప్ గా వస్తున్నాయని రాసీదులివ్వని చోట కొన్నారని తెలిసి డబ్బులు రిలీజ్ చేయలేదని ఒక గొడవ.. అంతకుముందు పని చేసిన కోశాగారాధికారి రిజిస్టర్ లో బాలన్స్ షీట్ సరిగ్గా టాలీ అవలేదని.. కాలనీ వాసులు నీళ్లు ఎక్కువ వాడేస్తున్నారని విమర్శిస్తున్నాడని ఎప్పుడూ ఆయన నిరంకుశ ధోరణి చర్చలే. అన్నింటికీ మించి ఆయన కసురుకున్నట్టు మాట్లాడటం మాత్రం తెల్ల కాలర్ ఉద్యోగులెవ్వరికీ కిట్టక అంతా లబలబ లాడిపోయారు.


ఆయన టర్మ్ అయ్యేసరికి ఆయనకి కాలనీ నిండా విరోధులే. ఆవిడ ని చూస్తే చాలు పరుగున ఇంట్లోకెళ్ళి తలుపులేసుకునే వారే ఎక్కువ. నేను మాత్రం ప్రతి ఆగస్టు 15 కీ, జనవరి 26 కీ ఆవిడ ఇంట్లో ఫిల్టర్ కాఫీ కార్యక్రమం మాత్రం వదల్లేదు. ఆవిడ పుస్తక పరిజ్ఞానం, సంగీతం విజ్ఞానం, సామాజిక స్పృహ .. వహ్వా..వహ్వా.. కానీ ఇలాగ అందరినీ ఊదరకొట్టకుండా ఉంటే ఎంత బాగుండు? అని రోజూ అనుకునేదాన్ని.

ఈలోగా.. ఓరోజు రాధా మామీ కింద పడిందని, కాలు ఎత్తలేక పోతోందని విన్నాను. ఆవిడ ఉంటే విముఖత వదిలి అందరూ తండోపతండాలు గా వెళ్లి పలకరించి వచ్చాం. నాకు ఎక్కువ కుదరకపోయినా.. చాలా మంది ఆవిడకి వంటావిడ కుదిరేలోపల కూరో, కుమ్మో అన్నంతో ఇచ్చి రావడం అలవాటు చేసుకున్నారు. ఆవిడ ధోరణి లో మార్పు లేదని, ఇంకా కబుర్లతో వాయిస్తూనే ఉందని విన్నాను. నేనూ సాయంత్రం నడక చివ్వర్లో ఓ నిమిషం ఆగి పలకరించి పరిగెత్తుకొచ్చేసేదాన్ని. ఆవిడ ఎలాగైనా లేచి నడవాలని ఒక పట్టుదల తో ఉండేవారు. భయంకరమైన విల్ పవర్. ఓసారి వెళ్లినప్పుడు ‘ఇంకో నిమిషం ఉందా నీ దగ్గర కృష్ణా’ అని అడిగారావిడ. ‘ష్యూర్ చెప్పండి అక్కా..’ అంటే.. లోపల అల్మారా లో ఒక పాకెట్ లో చీరలున్నాయి. ఇలా తీసుకురా.. అందావిడ. సరేనని తెచ్చాను.. అన్నీ పరవమంది. పరిచాకా, నువ్వొకటి తీసుకో.. అంది.

‘బానే ఉంది. నాకెందుకు? అస్సలూ వద్దు’ అనేశాను. ‘లేదు. మీ అందరికీ ఇద్దామని.. తెప్పించాను..’ నా పిల్లలెవ్వరూ రాలేదు.. మీరే కదా నాకు ఇంత సహాయం చేశారు! మేము ఇక్కడినుంచి వెళ్లిపోతున్నాము.. వచ్చేవారం.’ అంది. ‘అయ్యో మనిపించింది.’ కానీ వాళ్లు వెళ్లేది సిటీ మధ్యలో అపార్ట్మెంట్ లో మొదటి అంతస్తు లోకి.. ఎదురుగా డాక్టర్, బొక్కెన కి తాడు కట్టి కిందకి వదిలితే కూరగాయలు, పచారీ కొట్టు సామాన్లు, చప్పట్లు కొట్టి పిలిస్తే ఆటో సదుపాయం,.. అపార్ట్ మెంట్ లో బోల్డు మంది సీనియర్ సిటిజన్లు..ఎదురింట్లో ఆవిడ అక్కగారి కొడుకు..

నిజమే అదే కదా కావాలి వాళ్లకి ఈ వయసులో.. రెండు కిలో మీటర్లు నడిస్తే కానీ బస్సు/ఆటో దొరకని చోటు, డాక్టర్ కావాలంటే అరగంట వెళ్ళాల్సి వస్తే.. ఉప్పు కి అరకిలో మీటర్, కాయగూరలకి రెండు కిలో మీటర్లు వెళ్లాల్సి వచ్చే చోట, తన అనుభవ సారాన్ని రంగరించిన కబుర్లు వినేందుకు మనిషి లేని చోటు.. ప్రేమ గా అదిలిస్తే, క్రమశిక్షణ, సిన్సియారిటీ ని బోధిస్తే ‘shouting/interfering ’ అనుకుని విసుక్కునే చోటు..

అది నందనవనమైతే ఏంటి? ఇల్లు విశాల భవనమైతే నేంటి..కాలుష్య రహితమైతే నేంటి.. “Good Decision, we will miss you Radhakkaa..’ అన్నాను.. మనస్పూర్థి గా.. ఆవిడ ఒకింత సిగ్గు గా.. ‘You are like my daughter.. Call me Radha maaami.. No akkaa business’ అనేసింది. సెంథిల్ మామ దగ్గర్నించి కూడా సెలవు తీసుకుని కొద్దిగా బరువు గా అనిపిస్తుండగా వచ్చేశాను.

ఇప్పుడు మా కమ్యూనిటీ లో శబ్ద కాలుష్యం తక్కువైంది బాబూ.. ఎవ్వరూ వచ్చి ఆపేసి కబుర్లు చెప్పేయరు. సమయపాలన గురించి లెక్చర్లు ఇవ్వరు. అకౌంట్లు మెయింటెయిన్ చేయడం గురించి నిలదీయరు.. కాలనీ నీళ్లు వృధా చేస్తే అడిగే వాళ్లుండరు. ఏంటో...చుట్టూ ప్రశాంతతే! అది తినూ, ఇది తాగూ.. అని బలవంత పెట్టేవారు లేరు. నాకు ఈసారి జనవరి 26 న కమ్మటి కాఫీ చేతికిచ్చి ఎవ్వరూ మిల్టన్ పొయెట్రీ, త్యాగరాయ కృతుల చర్చలు చేయరు. టీవీ లో ఏదో ఒక చానెల్ లో సుత్తి ప్రోగ్రాం హాయి గా ఎంజాయ్ చేయవచ్చు...

29 comments:

భాను కిరణాలు said...

డెబ్బై ఏళ్ళ సెంథిల్ మామ మీరు వెసిన స్కెట్చ్ లో లాగ కలర్ ఫుల్ డ్రెస్స్ ల్లో తిరుగుతుంటే బహుశా అమ్రుతం లో అప్పాజీ లా ఉంటారనిపిస్తొంది నాకు .................

Kottapali said...

చివరికొచ్చేసరికి గొంతు చిక్కబడింది.

Sravya V said...

హ్మ్ ! నిజం గా జరిగిందా అండి? చాలా బాగా రాసారు.
మేము కొన్ని రోజులు హైద్ లో నల్లకుంట ఏరియా లో అద్దె కి ఉన్నాం. ఆ ఇంటి ఓనర్ ఆవిడ కూడా అంతే (డ్రైవర్ ఉన్నాసరే) రిటైర్ అయ్యాకా డ్రైవింగ్ నేర్చుకుని భలే ఆక్టివ్ గా ఉండేవారు . కానీ తేడా ఏమిటంటే ఆవిడ చాలా ఇల్లు చాల నీట్ గా ఉంచేవారు కానీ వస్తువులు, బట్టలు ఎక్కువ కొనడం చూస్తే మాత్రం బాగా క్లాసు తీసుకునేవారు. బుర్రని బీరువా లో పెట్టొద్దు ఇది ఆవిడ ఎక్కువ వాడే డైలాగ్ :-)

సవ్వడి said...

తెహ్కీకాత్ ante...

baagaa ceppaaru..

కృష్ణప్రియ said...


@ సవ్వడి,
తెహ్కీ కాత్ : investigation

జ్యోతిర్మయి said...

ఏ వయసుకా ముచ్చట.
మీ కథనం గురించి చెప్పేదేముంది...

Chinni said...

బావుంది కృష్ణప్రియ గారు, మీ శైలి నాకెంతో నచ్చుతుంది. చాలా సరళంగా ఉంటుంది.

Anonymous said...

"కాఫీ చేతికిచ్చి ఎవ్వరూ మిల్టన్ పొయెట్రీ, త్యాగరాయ కృతుల చర్చలు చేయరు. టీవీ లో ఏదో ఒక చానెల్ లో సుత్తి ప్రోగ్రాం హాయి గా ఎంజాయ్ చేయవచ్చు..." -- ఎప్పుడైనా "తరువాతే" అనుకునేది..... మీ మనోభావాలు చాలా బాగా వ్యక్తపరిచారు...

Padmarpita said...

చివరిలో మనసుకి హత్తుకునేలా ఉన్నాయి మీ మాటలు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

ముగింపు చాలా బాగుంది.

రెండు మూడేళ్ళలో పదవీ విరమణ చేసేవారు కూడా అంకుల్ అనేస్తున్నారు నన్ను. అన్నా అనమని చెప్పాలి నేను కూడా....దహా.

ధాత్రి said...

Too Good..:)
చివరి మాటల్లో పరోక్షంగా ఆవిడని "మిస్స్" అవుతున్నట్లు భలే వ్యక్తపరిచారు.. :):)

జేబి - JB said...

గూగులమ్మ బోమ్మలు కాకుండా మీ పిల్లలు గీసినవి (గీయించినవి) పెట్టడం బాగుందండీ.

కథ ఎప్పటిలాగే అద్భుతంగా చెప్పారు.

కృష్ణప్రియ said...


@ భాను కిరణాలు,
అవును. డెబ్భై ఏళ్ల వాళ్లు అంటే ఈ మధ్య చాలా వరకూ పాంటూ షర్టులే వేస్తున్నారు. మా అమ్మాయి ఆ రోజు ఆయన వేసుకున్న బట్టల తోనే ఆయన బొమ్మ వేసింది.

@ నారాయణ స్వామి గారు,
మొన్న వాళ్లు మా ఇంటికి ఏదో పని మీద వచ్చినప్పుడు నాకు అలాగ అనిపించే ఈ పోస్ట్ రాశాను.
@ శ్రావ్య,
అవును. నిజంగా జరిగినదే. నేను పేర్లు మాత్రం మార్చి మీ ఇద్దరి మీద బ్లాగు పోస్ట్ రాస్తానన్నప్పుడు ఆవిడ నేను రాయదలచుకున్న కథ విని, ఫోటో తీసుకో.. మా ఇద్దరిదీ అన్నారు. కానీ ఎందుకో నాకు వాళ్ల ఫోటో వేయకూడదనిపించింది. మా పిల్లలతో సరదాగా బొమ్మలు వేయించాను.

@ జ్యోతిర్మయి గారు,
ధన్యవాదాలు.

@చిన్ని గారు,
థాంక్స్.

@ఫణి బాబు గారు,
ధన్యవాదాలు.. అవును. ఎప్పుడైనా ‘తరువాతే’ అనుకునేది.

@పద్మార్పిత గారు,
థాంక్సండీ..

@సుబ్రహ్మణ్యం అన్నయ్య గారు,
అలాగే నండీ :)) ధన్యవాదాలు.

@ ధాత్రి గారు,
థాంక్స్... ఈ విషయం లో ఒకటి చెప్పాలి. మొన్నీమధ్య డా: శైలజ గారి బ్లాగు లో ‘చులకన చేయకు దేన్నీ’ అన్న పోస్ట్ చదివాను. తెగ నచ్చి మళ్లీ మళ్లీ చదివాను. తర్వాత నాకు తెలియకుండానే అది మనసులో ఎక్కడో బాగా రిజిస్టర్ అయిపోయింది. రాసినప్పుడు తెలియలేదు కానీ, ప్రచురించాకా తట్టింది. బహుశా ఆ ప్రేరణ తోనే రాసి ఉంటానని..

@ లలిత,
:))

@జేబి,
థాంక్సండీ.. మీరు చెప్పాకానే నాకు ఈవిషయం లో ఎవేర్ నెస్ పెరిగి సాధ్యమైనంత వరకూ గూగుల్ లోంచి వెతికిన బొమ్మలు పెట్టకూడదని నిశ్చయించుకున్నాను.

Anonymous said...

నిన్ననే చదివేను కాని వ్యాఖ్య పెట్టడానికి మా కరంటు సైంధవుడు అడ్డుపడ్డాడు. ఏదయినా లేనపుడే దాని విలువ తెలిసేది. :)

కావ్యాంజలి said...

హాయ్ కృష్ణప్రియ...నిజమేనండి.....ఈ సిటీ లైఫ్ లో పక్క వాళ్ళు మాట్లాడితేనే disturbance అనుకుంటారు....పోస్ట్ నాకు చాలా నచ్చిందండి...మీరు చెప్పిన తీరు బాగుంది.....

Hamsa said...

Hmmm..చాలా బాగా రాసారండి...

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

చాలా బావుంది:)

>>"‘You are like my daughter.. Call me Radha maaami.. No akkaa business’ అనేసింది’"

ఇదొక్కటే మరీ K విశ్వనాథ్ సినిమాల్లోలా అనిపించింది ;)

కృష్ణప్రియ said...

@ కష్టేఫలే శర్మ గారు,
:) నిజమే.

@ కావ్యాంజలి గారు,
అవును. ధన్యవాదాలు..

@ హంస గారు,
థాంక్స్..

@ వీకెండ్ పొలిటిషియన్,
:) కే. విశ్వనాథ్ సినిమాలు యదార్థ జీవిత కథలకి దర్పణం కదా. On a serious note, తాత్కాలికం గా అలాంటి స్ట్రాంగ్ భావాలు రావడం చాలా చాలా సహజం. కాసేపయ్యాకా మళ్లీ మామియార్ నుండి అక్క అయిపోయారావిడ.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

విశ్వనాథ్ సినిమాల మీద నాకు పెద్ద అభిప్రాయాలేమీ లేవండీ. జస్ట్ గుర్తొచ్చింది అంతే. మీ సమాధానం చూశాక ఆలోచిస్తే....

>>తాత్కాలికం గా అలాంటి స్ట్రాంగ్ భావాలు రావడం చాలా చాలా సహజం.

నాకెందుకో విశ్వనాథ్ సినిమాల్లో ఈ సహజత్వం అనే ముసుగులో ఒక తరహా మూసనీ బాగా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.

కృష్ణప్రియ said...

@వీకెండ్ పొలిటిషియన్,

ప్రొటెక్ట్? ఎందుకలా అనిపిస్తుంది? స్వరాభిషేకం చూసి కాదు కదా? :)

నాకు కేవీ సినిమాలు అన్నీ కాకపోయినా, చాలా వరకూ ఇష్టం. కనీసం ఒక అరడజన్ సినిమాలు ఐదారు సార్లు కూడా చూసినవే. పాటలైతే ఇంక చెప్పనక్కరలేదు.

Anonymous said...


"నాకెందుకో విశ్వనాథ్ సినిమాల్లో ఈ సహజత్వం అనే ముసుగులో ఒక తరహా మూసనీ బాగా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది"

వీకెండ్ గారు,
మీరేలాగూ భూస్వామ్య వర్గాల వారసులు కనుక మీ జీవన విధానం ,సంస్కృతి లోని మంచి విషయాలన్ గురించి గొప్పగా టపాలుగా రాయండి. అది బ్రాహ్మణ సంస్కృతి కన్నా ఎంత భిన్నమైనదో స్పష్ట్టం గా తెలిసేవిధంగా రాయండి. ఇంకా వీలైతే విశ్వనాథ్ గారిలాగా సినేమాలు తీయండి. మాకు మీ సంస్కృతి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నాది. ఇవేవి వీలుకాకపోతేబ్లాగులో మీ ఆత్మకథ రాయండి. మీరేంత విప్లవవీరులో అంటె మూస విధానం లో ఇమడ కుండా ఎలా జీవిస్తున్నరో తెలుసుకొని సంతోషిస్తాం. వీలైతే అనుకరిస్తాం.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

ప్రొటెక్ట్, ఎండార్స్ లాంటి పదాలు నూరు శాతం నేనుకున్న దాన్ని వ్యక్త పరిచలేక పోవచ్చు. జస్ట్ మీకు విషయం అర్థమవుతుందిలే అని ఏదో ఒక దగ్గరగా ఉండే పదం వాడేశాను.

కేవీ సినిమాలునాకూ ఇష్టమేనండీ. ఆయన సినిమాలు బావుండని నేను అనట్లేదు. కాకపోతే.. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా కనిపించే ఒక పోకడని మీ టపాలో నేను ఉదహరించిన విషయం తలపింప చేసింది. అదే చెప్పాను. అంతర్లీనంగా ఆయన సినిమాల్లో మీకు కనిపించిన పోకడ ఏంటి అని మీరు మళ్ళీ అడిగితే, అది ఈ టపా ని వదిలి పూర్తిగా వేరే చర్చ అవుతుంది. పైగా, ఆయన సినిమాల మీద నాకున్న అభిప్రాయాలు కేవలం నా అబ్సర్వేషన్స్ మాత్రమే.

In simple he endorses tradition and shows the flip side of tradition and generally closes it with a magnanimous traditionalist and a repenting reactionary side. That's just a pattern. Nothing wrong with it. To my personal taste, following that pattern is nice when interpretation of tradition is wrong and people are blindly following the tradition with out spirit. But when the spirit of the tradition itself is based on the wrong ideas then, following the above said pattern and obfuscating the actual points behind other commercial success parameters is not to my liking.

This may not be the case with just KV but many of the traditionalist great writers, directors etc.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Srinivas గారు,

మీరు నా వ్యాఖ్యలని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనిపిస్తుందండీ. లేదంటే నేనే బహుశా వ్యాఖ్య సరిగ్గా రాయలేదేమో ! విశ్వనాథ్ గారి సినిమాలు బావుండవనో, లేక ఆయన సినిమాల్లో ఉండే (ఉందని నాకనిపించే) మూస తప్పనో నేను అనడం లేదండీ. ఏదో ఒక మూస లేని విషయాలు ఏవీ ఉండవు నా దృష్టిలో. ఒకవేళ ఏదైనా విషయం అలా కనిపిస్తే, ఆందులోని పాటర్న్ ని మనం గుర్తించలేక పోయామని అర్థం.

నేను భూస్వామ్య వర్గాల వారసుణ్ణనీ, విప్లవవీరుణ్ణనీ నాకెప్పుడూ అనిపించలేదు. మీకెందుకలా అనిపించిందో మీకే తెలియాలి :))

Anonymous said...


WP గారు
--------------------------------------

/@>>"‘You are like my daughter.. Call me Radha maaami.. No akkaa business’ అనేసింది’"
/
ఇదే కదా KP గారు వ్రాసింది. ఉన్నది ఉన్నట్లు చెపితే రచయిత మూస విధానం ఫాలో అయినట్లు కాదు. కాని మీ అభిప్రాయం ప్రకారం కొన్ని సంఘటనలు ప్రస్తావించి, చివరిలో ఒక మార్పు చూపించి అక్కడి తో ఆపెయ్యడం వల్ల మీరన్నది నిజమే అనిపిస్తుంది. అదికూడా కృష్ణప్రియ గారు మరల ఆ మార్పు కాస్సేపే అని తర్వాత సమాధానం చెప్పడం వల్ల మాత్రమె మీరన్నది కరెక్టే అని నమ్మాల్సి వస్తుంది.
కాని ఇంకోలా కధ వ్రాసే అవకాసం కూడా నాకు కనిపించడం లేదు. ఇంకా చాలా మంది ఇలానే మోడెస్ట్ గా వ్రాసారు. సో KV లా కధ వ్రాసి RGV లా మళ్ళి విశ్లేషణ చెయ్యాలి అంటున్నారు మీరు :)
--------------------------------------

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Anonymous,

The story and narration is good. She is a good person with her own quirks. Other people in the colony are also good and are with their own set of quirks.

Both sides realizing the value of the other side and appreciating their company and missing that when the lady is moving out is good enough for me. None of the sides really need to change their behaviors due to that emotion and that has nothing to do with the actual issues of understanding each other and appreciating the good things in the other side and still being able to live with the not so comfortable things in the other side.

కృష్ణప్రియ said...

@ అజ్ఞాత,

ఐదేళ్లుగా ఆవిడని గమనించడం వల్ల నాకు అర్థమయి/తెలిసి రాధా మాడం సహజం గా కలుపుగోలు స్వభావం ఉన్న మహిళ,తన వంటలూ అవీ అందరికీ తినిపించడం, తన వయసు దాచుకోవడానికి ప్రయత్నించడం లాంటివి ఆవిడ సహజం గుణాలయినా ఒక చిన్న ఒంటరిదనం తో బాధ పడుతూ, చుట్టుపక్కల వారందరూ తనకన్నా కనీసం ముప్ఫై సంవత్సరాలు తక్కువ వయసు వారవడం తో, వారందరితో బాగా కలిసిపోవడానికి చేసిన ప్రయత్నాలతో ఇదంతా మరీ ఎక్కువయింది. ఒక (బలహీన?) క్షణం ఆవిడ తనని తాను మామియార్ గా రిఫర్ చేసుకున్నా, మళ్లీ రబ్బర్ బాండ్ లా అక్క అయిపోయింది.

నేను ఏ విధమైన మార్పూ సూచించానా అని ఆలోచిస్తున్నాను. All I said .. Now that they are gone.. Neighbourhood is again peaceful. But I am missing the couple.

@ WP,
You said,..
Both sides realizing the value of the other side and appreciating their company and missing that when the lady is moving out is good enough for me.
None of the sides really need to change their behaviors due to that emotion.....

I don’t know if I said that anybody changed or needed to change. Infact, I thought, I made it clear in the post that, it was better for them to stay in a locality where they can get shopping at hand’s stretch, instant help, emergency care, and people to talk to,.. rather than a beautiful, lush green & peaceful location, where they are not cared and appreciated and have to run 5 km for shopping & medical help..
ఇక పోతే ఆవిడ అక్క నుండి అత్త కి లాంగ్ జంప్ కొట్టి వెనక్కి రావడం :)) తాత్కాలిక మానసిక స్థితి.
నిజానికి ఇంకొంచం ఎక్కువ ఎమోషనల్ గా దాదాపు విసు సినిమాలోలా కన్నీటితో చున్నీలు తడిసిపోయేలాంటి సంభాషణలు అయ్యాయి. మరీ మెలోడ్రామాటిక్ గా ఉంటుందనే నేను రాయలేదు.

Anonymous said...

\నేను ఏ విధమైన మార్పూ సూచించానా అని ఆలోచిస్తున్నాను.\

మార్పు సూచించి కాదండి 'చివరిలో ఒక మార్పు చూపించి'
థాంక్ యూ

Mauli said...

క్రిష్ణప్రియగారు,

అజ్నాతకు చక్కని వివరణ ఇచ్చారు. ఆమె వయసు దాచడానికి ప్రయత్నించినట్లు నాకు ఎక్కడా అనిపించలేదు. వయసు గుర్తు పెట్టుకొని ప్రవర్తించే అవసరం ఆమెకి ఎపుడు రాలేదు. ఆ ఫ్రేంవర్క్ లో తనని బంధించుకోలేదు కాబట్టి మిగిలినవారిలా సొసైటి లో మిగిలిన వారితో నటించే అవసరం పడలేదు . కారణం మనకన్నా మెరుగైన సమాజం (ఫార్మాలిటీస్ లో ) నుండి రావడం?

అసలు మీరంతా తను వయసుకు మించి ఉత్సాహం గా ఉండడాని చూసి జెలసీ ఫీల్ అయ్యారేమో :).

కాని మామిగా ప్రవర్తించడం/నటించడం ఆమెకి రాదే ? అక్కడి వారి ఆలోచనలు ఆమెకి చేరి ఉంటాయి, ఎక్కడో ఒక్క క్షణం మీకు నచ్చినట్లు ఉండడానికి ప్రవర్తించి ఉండొచ్చు. కాని ఆ కష్టం కన్నా దూరంగా కనీసం వస్తు సౌకర్యమ్ ఉన్నచోట కి మారిపోవడం తప్పనిసరి అయ్యింది.

కృష్ణప్రియ said...

@ అజ్ఞాత,
సరే.. నేను ఏం మార్పు చూపించానో కూడా నాకర్థం కాలేదు. కానీ, నేను రాసినది ఆవిధం గా అర్థమైందనుకుంటున్నాను.. ఇది నా భావ వ్యక్తీకరణ లో లోపమనుకుంటున్నాను

@ మౌళి గారు,
అసలు మీరంతా తను వయసుకు మించి ఉత్సాహం గా ఉండడాని చూసి జెలసీ ఫీల్ అయ్యారేమో :)....>>
ఎక్కడో ఒక్క క్షణం మీకు నచ్చినట్లు ఉండడానికి ప్రవర్తించి ఉండొచ్చు.>>
అయ్యుండచ్చు :)

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;