Thursday, May 29, 2014 16 comments

వెల్లింగ్టన్ తో కాఫీ.. Introduction to Wellington






సూర్యాస్థమయం..  లాంచీ నెమ్మదిగా దక్షిణాఫ్రికా, జార్జ్ టవున్లో హిందూ మహా సముద్రం భూభాగం లో ఏర్పర్చిన ఉప్పు నీటి కయ్య.. లో కదులుతోంది. మంధ్రం గా ఏదో స్థానిక పాటలేవో నడుస్తున్నాయి.. దూరం గా సిటీ లో విద్యుద్దీపాలు..  అంతా బాగుంది కానీ, గాలి చల్ల్లగా రివ్వుమని కొడుతోంది. కింద గది లో కూర్చుంటే ఏవీ కనబడవేమోనన్న ఆత్రం తో,  గబ గబా.. లాంచీ పై భాగం ఎక్కేసి కూర్చున్నాం కానీ ఇక లాభం లేదని కింద కంపార్ట్మెంట్లోకి  దిగి వచ్చేశాం. 

కూర్చునేందుకు జాగా వెతుక్కుని కాస్త పిల్లలకి తినడానికి ఏవో ఏర్పాట్లు చేసి తీరిగ్గా పక్కకి చూస్తే, మా బస్సు డ్రైవరు ఒక్కడే కూర్చుని కిటికీ లోంచి చూస్తూ కనిపించాడు. పలకరింపు గా పల్చగా చిరునవ్వు నవ్వాడు. మేమూ అదే పని చేసి సెటిల్ అయిపోయాం. 




పదిహేను రోజుల దక్షిణాఫ్రికా యాత్ర లో మా గ్రూపుకి ఏర్పాటు చేసిన టూరిస్టు బస్సుని గత వారం రోజులు గా అతనే నడుపుతున్నాడు. నల్లవాడు, చూస్తే యాభై దాటిన వాడిలానే కనిపిస్తున్నాడు. కేప్ టవున్ నుండి, 
గార్డెన్ రూట్ లో మా టూర్ ఆర్గనైజర్లు బస్సు ద్వారా తెచ్చి జార్జ్ టవున్లో హిందూ మహా సముద్రం ఏర్పరిచిన లగూను లో సూర్యాస్థమయపు క్రుయిఙ ఎక్కించారు. 

పిల్లలు వాళ్ల వ్యాపకం లో మునిగిపోయారు, మాకిద్దరికీ  కాఫీ తెచ్చుకుందామని వెళ్తుండగా, "వెల్లింగ్టన్ కి కూడా కావాలేమో అడుగు.. అతనూ ఒక్కడే ఉన్నాడు కదా.." అని మా వారు అనగానే నేనూ వెళ్లి అడిగాను. అతను మొహమాట పడుతూ, సరేనన్నాడు.  కాఫీ తాగుతూ నెమ్మది గా మాటల్లో పడ్డాం నేనూ, వెల్లింగ్టన్. మా వారు పిల్లలకి ఏదో ఏర్పాటు చేస్తూండిపోయారు.  

మాటల్లో ఒక్కసారి గా. "అవునూ.. మొన్న డర్బన్ రైల్వే స్టేషన్ దగ్గర మీకేమనిపించింది? నాకు అక్కడికి ఎప్పుడు బస్సు ని తీసికెళ్లినా మహాత్మా గాంధీ ని మొదటి తరగతి డబ్బా లోంచి తోసేసిన సంఘటనే గుర్తొచ్చి ఆవేశం వస్తుంది.. ఇండియాకి వెళ్లాకా ఆయన ఏం చేశాడు? చాలా గొప్ప వ్యక్తి. passive resistance అన్నది మా వాళ్లకి నేర్పాడు.. మా మండేలా మహాత్మా గాంధీ నుండి చాలా స్పూర్థి పొందాడు.." అన్నాడు.

నాకూ చాలా సంతోషం వేసింది. మహాత్మా గాంధీ ఇండియా కొచ్చాకా ఆయన స్వాతంత్ర్య సమరానికి ఎలాగ నాయకత్వం వహించిందీ, దేశాన్నాని ఒక్క త్రాటిపైకి తెచ్చి౦దీ, వగైరాలు నాకు తెలిసినంత మేర క్లుప్తం గా చెప్పాను. చివరకి ఒక భారతీయుడి చేతిలోనే చంపబడ్డాడని విని అతన ముఖం మరింత నల్లబడింది. నిరసనగా తల ని అడ్డం గా తిప్పుతూ 'వెరీ బాడ్. ఒక మంచి వ్యక్తి జీవితం లో ఇన్ని కష్టాలా? ఏదేశం కోసం జీవితాన్ని అంకితం చేశాడో అక్కడే ఆయన్ని తుపాకీ తో చంపుతారా? ' అని తన బాధ ని వ్యక్తం చేశాడు.

"అన్నట్టు, మీరు Nelson Mandela, a long walk to freedom అన్న పుస్తకం చదివారా? ఈ మధ్యే సినిమా కూడా తీశారు" అన్నాడు..

నాకు సంతోషం వేసింది. "యెస్. గత వారం విమానం లో పెట్టుకుని చూశాను. మీ దేశానికి వస్తున్నాను కదా, మండేలా గురించి తెలుసుకుందామని…మీకు రాజకీయాలు బాగా ఇ౦టరెస్టా?" అని అన్నాను.

"దక్షిణాఫ్రికా లో పుట్టి పెరిగి, అందునా ఒక నల్లవాడినయి ఉండి,  రాజకీయావగాహన లేకుండా ఎలా ఉంటాను? నా దేశ చరిత్ర, నా సంస్కృతి లో భాగం కదా.. " అన్నాడు వెల్లింగ్టన్ ఉద్వేగం గా.. 

"నిజమే.. మీరు చదువుకున్నారా? ఎంత వరకూ చదివారు? మీ మాతృ భాష జులుస్ అని గైడ్ చెప్పాడు. ఇంగ్లిష్ బాగా మాట్లాడుతున్నారు కదా?" అన్నాను.

"నేను పన్నెండో క్లాసు దాకా చదువుకున్నాను. నేను ఒక టీచర్ కొడుకుని. కేవలం టీచరే కాదు. ఒక ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకర్త, మండేలా తో పాటూ రాబిన్ ఐల్లాండ్ లో పదేళ్జె జైలు జీవితం గడిపిన స్వాతంత్ర్య సమర యోధుని కొడుకుని.. ఆమాత్రం ఆంగ్లం, రాజకీయ జ్ఞానం లేకుండా ఉంటాయా? " అని మెరుస్తున్న కళ్ల తో అన్నాడు వెల్లింగ్టన్.

"వావ్!! మీ నాన్నగారు మండేలా తో జైల్ జీవితం గడిపారా? మీ కథ నాకు చెప్పాల్సిందే.. ఈ లాంచీ ఒడ్డుకి చేరడానికి ఇంకా గంట సమయం ఉంది. మీ కభ్యంతరం లేకపోతే.. నాకు మీ తండ్రి కథ చెప్తారా?" అన్నాను ఉత్సాహం గా.

వెల్లింగ్టన్.. 'ఓహ్ తప్పకుండా.. " అని తన కథ ప్రారంభించాడు.

"నా తాతగారి తండ్రిని బానిస గా ఒక డచ్ వాడు ఐరోపా కి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆయన కొన్నేళ్ల తర్వాత జర్మన్ ఆయనకి అమ్మేశాడు. జర్మన్ ఆయన ముసలి వాడు. ఆయనకి ఒకే కూతురు. ఆయన చనిపోయే సమయానికి ఆ అమ్మాయి (కమీలా) మా ముత్తాత తో ప్రేమ లో పడి  వివాహం చేసుకుని మా తాతని, చిన్న తాత నీ కన్నాకా, మా ముత్తాత ఏదో రోగం తో చనిపోయాడు.  దానితో మా తాతమ్మ పిల్లలిద్దర్నీ తీసుకుని దక్షిణాఫ్రికా కి వచ్చి పోర్ట్ ఎలిజబెత్ లో ఉద్యోగం ఒక టీచర్ గా ఉద్యోగం చేస్తూ ఉండిపోయింది..

ఆవిడ పోయాకా, మా చిన్న తాత కేప్ టౌన్ కి వెళ్లిపోయాడు. మా తాత మాత్రం జార్జ్ టౌన్లోనే టీచర్ గా ఉండిపోయాడు. అయితే నల్ల వాడవటం వల్ల దక్షిణాఫ్రికా లో అపార్థీడ్ కి గురయ్యి చాలా కష్టాలు పడ్డా, మా నాన్న ని కూడా నల్ల వాళ్ల బడి లో చదివించి టీచర్ ని చేశాడు. 

అయితే అప్పట్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అపార్థీడ్ కి వ్యతిరేకం గా చేస్తున్న ఉద్యమం పట్ల విపరీతం గా ఆకర్షితుడయ్యాడు. టీచర్ గా పని చేస్తూనే, ANC కార్యక్రమాలల్లో పాలు పంచుకునే వాడు.  ఒక దశ లో ఉద్యోగం వదిలిపెట్టి పూర్తిగా ఉద్యమం లోనే మమైకం అయిపోయాడు. ముఖ్యం గా మండేలా వెనకే తిరగడం మొదలు పెట్టాడు..

ఆరోజుల్లో నల్లవారికి సిటీల్లోకొచ్చి ఉద్యోగం చేయాలంటే ఒక పాస్ పోర్టు లాంటి కార్డు కావాలి. అదిలేకపోతే పని చేయడం చట్ట వ్యతిరేకం అవుతుంది.  మండేలా తమ తమ కార్డులని మంటలో తగల బెట్టి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చాడు. " 


నాకు ఏదో గాంధీ సినిమాలో కూడా ఇలాంటిదే చూపించిన గుర్తు వచ్చింది.  అడుగుదామా అనుకుని, వద్దులే.. అతని ఫ్లో కి మనం అడ్డం రావడమెందుకని ఊరుకున్నాను.



(రె౦డవ భాగ౦ రేపు..)
 
;