Tuesday, June 3, 2014 11 comments

వెల్లింగ్టన్ తో కాఫీ - తల్లిదండ్రులూ, బాల్యం..







మా నాన్న మ౦డేలా స్పూర్థి తో అంచెలంచెలు గా ఎదిగి ఆయన తూర్పు కేప్ ప్రాంతానికి ANC అద్యక్షుడవడం, అలాగే ఉద్యమం లో మండేలా తో ఎప్పుడూ కలిసి తిరగడం తో అక్కడి ప్రభుత్వ దృష్టి లో తీవ్రవాది గా ముద్రపడ్డాడు. 

మండేలా ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన తో పాటూ ఏడుగురు నాయకులతో పాటూ జైలుకి తీసుకెళ్లగా, వందలాది ఉద్యమ కారులని కూడా నిర్బంధించడం జరిగింది. వీరిని కేప్ టౌన్ దగ్గర నుండి మూడు గంటల దూరం లోని రాబిన్ ద్వీపానికి తరలించారు. అయితే మనుషులని తీసుకెళ్లినట్లే కాదు. ఒక ట్రక్ లో పట్టినంత మందిని కుక్కి, ఊపిరి కూడా ఆగిపోతుందేమో అన్నంత గా, 'అసలు మేము మనుషులం అన్న జ్ఞానం వారికుంటే గొడవేముంది?"  అన్నాడు నవ్వుతూ.  

మళ్లీ అ౦తలోనే సీరియస్ గా చెప్పడ౦ మొదలు పెట్టాడు….

 రాబిన్ ఐలాండ్ లో మండేలా తో పాటూ పదేళ్లుండిపోయాడు మా నాన్న. ఆ పదేళ్లూ, ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. అసలెలా తెలుస్తుంది? ఏ విధమైన సమాచారమూ బయటకి పొక్కనీయకుండా పకడ్బందీ గా ఏర్పాట్లు చేసుకుంది అపార్థీడ్ ప్రభుత్వం. ఆ తర్వాతి పదేళ్లూ, ఆయన బ్రతికే ఉన్నాడా? ఉంటే ఏ స్థితి లో ఉన్నాడు? ఎప్పటికైనా విడుదలయ్యే అవకాశం ఉందా? అవేవీ తెలియవు. 

ఉన్నపళాన అలాగ భర్త జైలు పాలైతే కుటుంబం పరిస్థితి? అని అడిగాను.

మండేలా తన భార్య విన్నీ నీ, ఇద్దరు కూతుళ్లనీ వదిలి ఎలా వెళ్లాడో, మరి మా నాన్నా అంతే. అయితే మండేలా/విన్నీల పరిస్థితి చూసిన, దక్షిణాఫ్రికా కన్నీరు పెట్టింది. ప్రజాగ్రహం పెల్లుబికింది. విన్నీ ఏ ఎన్ సీ కి నాయకత్వం వహించి, ముందుకు వెళ్లింది. అయితే ఆవిడ కి ఆ సౌలభ్యం ఉంది. దేశం ఆవిడ నాయకత్వం కోసం ఎదురు చూసింది.  ప్రపంచం సానుభూతి ని గెల్చుకుంది. కొద్దిమాత్రమైనా కమ్మూనికేషన్ అంటూ తన భర్త తో చేసుకోగల్గింది.  ఆవిడ చదువుకున్న స్త్రీ, ఒక ఉద్యమ నాయకునికి భార్య, స్వయానా ఉద్యమం లో పాలు పంచుకుంది. 

అయితే మా అమ్మ కనీసం హైస్కూలు కూడా పాసవ్వని స్త్రీ. ఇద్దరు చిన్న పిల్లల తల్లి. భర్త అండ, జీవనాధారం కోల్పోయి, ఏటూ దిక్కు తోచక, ఇద్దర్నీ ఎలాగ పెంచాలో, ఎక్కడ వదిలి పనికి వెళ్లాలో, ఏ పని చేయాలో తేల్చుకోలేని పరిస్థితి లో, జార్జ్ టౌనుకి 200 కి. మీ. దూరం లో ఉన్న ఒకావిడ, యాభయ్యేళ్ల మనిషి, ఆవిడ భర్త కూడా జైలుకి వెళ్లాడు. ఆవిడ మా అమ్మ కష్టం తెలుసుకుని, "జార్జ్ టౌన్లో అయితే పిల్లల్ని పెంచుతూ నువ్వు పని చేయలేవు. అదే నేనుండేది పల్లెటూరు. అక్కడ ఏదో ఒకటి చేసి నేను సాకుతాను. నాకూ తోడు గా ఉంటుంది, బడి కి కూడా పంపుతాను. అక్కడ ఖర్చు తక్కువ." అని నాలుగేళ్ల నన్ను, రెండేళ్ల మా తమ్ముడినీ వెంట తీసుకుబోయింది. 

అంత చిన్న వయసులో తండ్రి జైలు కెళ్లిన దానికన్నా, తల్లి మమ్మల్ని పెంచలేక ఎవరికో ఇచ్చేసిందని మొదట్లో చాలా కోపం గా ఉండేది. పెంపుడు తల్లి ముఖం కూడా చూడాలనిపించలేదు. ఆవిడకైనా చేరనైతే తీసింది కానీ, మమ్మల్ని ముద్దు చేసి, తల్లిదండ్రులని మరిపించేంత సమయం లేదు. అయితే మూడు పూటలా కడుపు నిండా పెట్టి, తమ పరిస్థితి ని వివరించి స్కూల్లో చేర్చింది. సమయం దొరికినంత వరకూ ప్రేమగా చూసేది. మా అమ్మ కూడా రెండు, మూడు నెలల కోసారి వచ్చి  మాకు ఏవో తిండి పదార్థాలు, బట్టలు, బొమ్మలు తెచ్చి రెండు, మూడు నెలలకోసారి వచ్చి ఒకటి రెండు రోజులుండి వెళ్లేది.  

అప్పట్లో ఆమెని నేను క్షమించలేదు. బెంగ బెంగ గా ఉండేది. కొన్నేళ్ల తర్వాత తగ్గింది. తల్లి కోసం ఎదురు చూసే వాడిని.  
అని ఆగాడు.

మరి తండ్రి మాటో? ఆయన పదేళ్ల తర్వాత బయటకి రాలేదా? అని అడిగాను

"మా నాన్నని పదేళ్ల తర్వాత విడుదల చేస్తారని చెప్పగానే మా అమ్మ సంతోషం గా వచ్చి మమ్మల్ని మళ్లీ జార్జ్ టౌనుకి తీసుకెళ్లింది.  మా నాన్న ని మళ్లీ చూస్తామని మేమనుకోలేదు. పదేళ్ల తర్వాత వచ్చిన ఆయన చాలా బక్కగా, ముసలి వాడిలా, కుంటుతూ, వచ్చి నిలబడితే, మా అమ్మే మమ్మల్ని పరిచయం చేయాల్సి వచ్చింది. అయితే రెండు నిమిషాల్లోనే ఆయన కి వినికిడి జ్ఞానం పూర్తి గా నశించిందని అర్థమైంది" అని  మళ్లీ  ఆగిపోయాడు.

"ఆయన జైలు జీవితం గురించి ఏమైనా చెప్పారా అప్పుడు?" అని అడగగా, 

ఎంతో పోరగా,  'అయిపోయిన దాని గురించి మాట్లాడి ప్రయోజనం ఏంటి?, ఇవ్వాళ్ల మనమందరం కలిసి ఉన్నాము. ఇది చాలదా? నా బాధ ఒక్కటే. మండేలా ఇంకా జైల్లోనే ఉన్నాడు.. ఆయన విడుదలవ్వాలి, ఈ అపార్థీడ్ ప్రభుత్వం మారాలి. అప్పటిదాకా శాంతి అనేది నాకు లేదు ' అని అంటూ ఉండేవాడు. 

ఒక్కోసారి మూడ్ బాగున్నప్పుడు పాత విషయాలు తలచుకునే వాడు.  అక్కడ మమ్మల్ని చాలా హీనం గా చూసేవారు. పారల, గడ్డపారల సహాయం తో మాత్రమే పొలం దున్నించే వారు. వర్షం వచ్చినా, ఎండ కాసినా, అనారోగ్యం పాలయినా  రొటీన్ లో మార్పనేది లేదు. 

ఒక ఏడేళ్ల పాటూ నిస్సారమైన బ్రతుకు బతికాకా, కాయకష్టం, పోషకాహార లోపం వల్ల శుష్కించిపోయాం..  అయితే మా పరిస్థితి బయటి ప్రపంచానికి తెలిసే అవకాశమే లేదు. కేప్ టౌన్నుండి మా నుంచి ఏ విధమైన సమాచారమైనా అందుతుందేమోనని మా కార్యకర్తలు ఎదురు చూస్తూనే ఉండేవారు. అయితే పోలీసులు అస్సలూ పడనీయలేదు..  మండేలా తాగి పారేసిన సిగరెట్ పెట్టె ల్లో ముచ్చిరేకు లోపల భాగం లో మెసేజులు రాసి పంపేవారు. అవి చెత్త తో పాటూ బయటకి వెళ్లి ఒక్క మెసేజ్ మెయిన్ లాండ్ కి చేరింది.  అది అమెరికన్ కాన్సులేట్ దగ్గర, ఇంకా కొన్ని మానవ హక్కుల సంస్థల దగ్గరకి చేరి, వారి జోక్యం తో, మాకు కొన్ని కనీస సదుపాయాలు కల్పించడం జరిగింది. అక్కడ జైల్లో మగ్గిపోతున్న మాకు పుస్తకాలు చదువుకోవటానికి ఇచ్చారు. అయితే నిరక్షరాస్యులే ఎక్కువ గా ఉండటం తో, టీచర్లం అయిన మేము వారికి ఖాళీ సమయాల్లో చదువు చెప్పే వాళ్లం.. 

అని చెప్పారు. అంతకి మించి ఒక్క ముక్క చెప్పలేదు. 

మరి జైలు నుండి వచ్చిన మీ నాన్న, ఇంకా ఉద్యమం లో పాల్గొన్నారా? అని వాచీ చూసుకుంటూ ఆసక్తి గా అడిగాను. ఇంకా ఈ బోటు ప్రయాణం మరి అరగంటే మిగిలిందాయె ..



 మిగతా భాగ౦ - రేపు
 
;