కార్తీక మాసం వనభోజనాలకోసం.. నా వంట.. మెంతి కూర, పండుమెరప కాయల వంటకం, టల్లోస్..
టల్లోస్.. పేరు వెనక కథ..
పండు మెరప కాయల ఘాటు కాస్త అటూ ఇటూ అయితే స్స్ స్స్ స్స్ అని వగరుస్తూ, జగ్గుల కొద్దీ నీళ్ళు తాగుతూ, ' తల్లో స్స్ స్స్ స్స్ ', 'తల్లో స్స్ స్స్ ' అని అరుపులు మామూలు కనక..
మరీ 'నా తల్లో, ఓర్నాయనో' .. అని పెట్టకుండా.. 'త ' ని 'ట ' గా మార్చి 'టల్లోస్ ' అని పెట్టానన్నమాట.
ఇక టల్లోస్ ఎలా చేయాలో తెలుసుకుందాం..
తప్పని సరి గా కావాల్సిన పదార్థాలు:
పండుమెరప కాయలు - 100 గ్రా
మెంతి కూర - ఒక కట్ట
ఉల్లిపాయ - 1 పెద్దది
బెల్లం - చిన్న నిమ్మకాయంత
చింతపండు - బెల్లం ముక్కంత
ధనియాలు - ఒక తేనీటి చెంచా తో
ఉప్పు, పసుపు - తగినంత
కర్వేపాకు - రెండు రెబ్బలు
తాళింపుకి :
4 బల్ల చెంచాల నువ్వుల నూనె, చిటికెడు ఇంగువ, తేనీటి చెంచాడు ఆవాలు, మినప పప్పు
కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయవచ్చనుకునే పదార్థాలు..
ఉల్లి, వెల్లుల్లి - రుచికి తగ్గట్టుగా
పెరుగు - ఒక కప్పు..
ముందుగా రెడీగా ఉంచుకోవాల్సినవి..
మెరపపళ్ళు :
పండు మెరపకాయలు కడిగి, పొడిగుడ్డతో తుడిచి డైరెక్ట్ గా జార్ లోకే కత్తెర తో ముక్కలు గా కత్తిరించుకోవాలి. ఫుటో లో మూడు రంగులవి ఉంచాను. కొంతమంది ఎర్ర రంగు చూసి.. 'బాబోయ్ ' అంటారని ఒక్కోసారి నారింజ రంగు మెరపపళ్ళు వాడతాను.. ఒక్కోసారి కాస్త మార్పు గా ఉంటుందని ఆకుపచ్చ గా ఉన్న పచ్చిమెరప కాయా వాడవచ్చు.. కాకపోతే.. ఘాటుని ఎంత వరకూ భరించగలమో,.. మన ఇష్టం..
తరిగిన మెరప పళ్ళల్లో, చింతపండు, బెల్లం, ధనియాలు, ఉప్పు,పసుపు, వేసి కచ్చా పచ్చాగా నూరాలి.
మెరప మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచుకుని ఇక పొయ్యి వెలిగించటమే తరువాయి!!!
మూకుడు/బాణలి పొయ్యి మీద పెట్టుకుని, నూనె వేసి, కాస్త కాగాక ఇంగువ వేయాలి, పిదప ఆవాలు, మినప్పప్పు వేసి చిటపట లాడేంత వరకూ ఆగి ..
మంట తక్కువ చేసి, మెంతి కూర మూకుట్లోకి సన్నగా కత్తెర తో కత్తిరించాలి.. ముందే తరుక్కుని రెడీ గా ఉంచుకోవచ్చులెండి.. కానీ నాలాంటి లో మెయింటెనెన్స్/త్వరగా వంట ముగించుకుని బయట పడాలనుకునే వాళ్ళు చేసే షార్ట్ కట్స్ అన్నమాట :)
ఇప్పుడు ఇందాక రుబ్బుకున్న మెరపపళ్ళు,మసాలా మిశ్రమాన్ని మూకుట్లో మెంతికూర తురుముకి జోడించి కలియబెట్టి, మంచి సువాసన వచ్చేంతవరకూ సన్నటి సెగ మీద రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.
కాస్త మెంతి కూర మగ్గాక, ఇప్పుడు ముందుగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలియపెట్టి పొయ్యి ఆపేయాలి.
పొయ్యి మీద ఉల్లిపాయలు వేడిగా ఉన్న టల్లోస్ లో ఉల్లి ముక్కలు కమిలి రసాన్ని పీల్చి,..జ్యూసీ గా తయారవుతాయి.
తర్వాత, ఒక గిన్నె లోకి తీసుకుని కర్వేపాకు జత చేసి, ఒక పండుమెరప కాయ, పచ్చి ఉల్లి ముక్కలతో గార్నిషింగులు చేయాలి.
రొట్టెల్లోకీ, అట్టు జాతి పదార్థాలతో, పెరుగు-టల్లోస్ వాడవచ్చు. అదెలా చేస్తారంటే.. ఒక కప్పు పెరుగులో ఒక చెంచాడు టల్లోస్ వేసుకుని కలుపుకోవడమే !! వేడి అన్నం లోకి, ఒక చెంచా నెయ్యి తో తినండి..
కలిపాక పెరుగు టల్లోస్ చూడండి.. ఎంత బాగుందో.. దీన్ని టల్లోస్ రాయ్ తా అని కూడా పిలుచుకోవచ్చు..