శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక నాకు ఎక్కడ లేని నీరసమూ ఆవహిస్తుంది. అలా సోఫా లోకి కూరుకుపోయానంటే.. సాక్షాత్తూ యమ ధర్మ రాజు వచ్చి 'నడువ్వ్...' అని కొరడా ఝుళిపించినా 'నా వల్ల కాదు.. రేపు రండని పంపించే పరిస్థితి. అంటే మిగిలిన వాళ్ళంతా చెంగు చెంగున గెంతులేస్తూ ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటారని కాదు. రఘు మాత్రం శనివారం పొద్దున్నే 9 కల్లా ఎక్కడికైనా వెళ్ళే ప్రోగ్రాములు విధి గా వేయటం, చిన్న "డిస్కషన్" లోకెళ్ళటం.. మర్నాడు గెలిచిన వాళ్ళు బెరుగ్గా,.. ఓడిన వారు కసి తీరా నోరు పారేసుకోవటం మాకు మామూలే..
2 వారాల క్రితం సరిగ్గా అలాంటి ఒక శుక్రవారం పూట, నిస్త్రాణ గా సోఫా లో పడి టీ తాగుతున్న సమయాన అసాధారాణ స్థాయి లో ప్రసన్నత నిండిన స్వరం లో "ఆన్నట్టు చెప్పటం మర్చిపోయాను,.. మా ఫ్రెండ్ ఫణి తెలుసు కదా... " అని తను అడగగానే.. నా మనస్సెందుకో కీడు శంకించింది
'ఆ.. గుర్తున్నాడు చెప్పండి ' అన్నాను చాలా భయంగా. తను అంతకన్నా భయభక్తులతో ఎందుకైనా మంచిదని నా చుట్టుపక్కల ఉన్న చిన్న సామాన్లు తీసి నాకు దూరం గా పెడుతూ... నా టీ ఆఖరి చుక్క కూడా అయిపోయిందని నిర్ధారణ చేసుకుని 'చెప్పడం మర్చిపోయాను కృష్ణా.. వాడు రేపు ఉదయం నాలుగ్గంటల ఫ్లైట్ కి దిగుతాడు.. ఒక వారం ఉంటాడట.. ' అని కప్పు విసిరేస్తే లాఘవం గా పట్టుకోడానికి రైనా లా సంసిద్ధమై నుంచున్నారు.
నా ముఖం లో ఎక్స్ ప్రెషన్ మారే లోపలే.. 'వాడికి ప్రత్యేకం గా ఏమీ చేయక్కరలేదు. ఏదో మనతో పాటే కల్లో, గంజో...' అని ఒక పాత కాలం డైలాగ్ కొట్టారు. నాకు ఏమనాలో తోచలేదు. ఊరుకుండిపోయాను. ఫణి నాకు పదేళ్ళకి పైగానే తెలుసు. రఘు కి ఒకప్పటి కో వర్కర్. చాలా డబ్బు మనిషి. కానీ మంచివాడే. ఆడ వాళ్ళకి అతనికి అన్నం పెట్టమంటే ఎంతో ఆనందం గా ఉంటుంది. ఏమి పెట్టినా వంక పెట్టకుండా ఆనందం గా మరో సారి అడిగి వడ్డించుకుని ' అన్నదాతా సుఖీ భవ !! ' అని ఆశీర్వాదం కూడా ఇచ్చి.. ఎలా చేశారో అన్నీ తెలుసుకుని మరీ వెళ్తాడు. కానీ బొత్తి గా మెటీరియలిస్టిక్. అవసరాన్ని బట్టే సంబంధ బాంధవ్యాలు నడిపిస్తాడు.
అదంతా కాదు నా భాధ. వారం క్రితం మెయిల్ పంపి కాల్ చేసి చెప్తే రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం లో దిగుతున్నాడని చెప్తే.. మా బట్టలు కొట్టు సద్దేది ఎప్పుడట?" వారం రోజుల్లో ఉతికిన బట్టలు గెస్ట్ రూం లో పడేయటం మాకు అలవాటు. మా మేరీ మడతలు పెట్టి ఉంచినా అవి మా వార్డ్ రోబ్ లో పెట్టుకోవటానికి కూడా ఒక్కోసారి తీరికుండదు. ఓపిక లేకపోవటం తో, ఆయన కేయాల్సిన అక్షింతల కార్యక్రమం సాధ్యమైనంత క్లుప్తం గా ముగించి, గది సద్దటం మొదలు పెట్టాను.
"ఉదయం మూడు కే కార్ తీసుకుని వెళ్ళాలి Airport కి" ... అని అనగానే నాకు కోపం వచ్చింది. "ఏంటి అసలు? అమెరికా నుండి వస్తూ, ఉదయం పూట గంట డ్రైవ్ చేసుకుని రమ్మనమనడమేమిటి? మనమే డ్రైవర్ మీద ఆధారపడతాం, లేదా టాక్సీ తీసుకుంటాం.. " అని ఏదో అనబోయి.. 'పాపం తనకి మొహమాటం ' అని ఊరుకున్నాను. చక్కగా 2 సూట్ కేసులతో దిగాడు ఫణి. టీ తాగుతూ బోల్డు కబుర్లు, కాకరకాయలూ అయ్యాక.. మా పిల్లలూ వచ్చి చేరారు ఆరు గంటలకే.. (స్కూల్ ఉంటే 7.30 చేస్తారు కానీ.. వీకెండ్ మాత్రం ఠంచన్ గా ఆరుకే లేస్తారు మరి).
పాపం ఏం తిన్నాడో ఫ్లైట్ లో.. మొహమాటం గా ఉంటాడేమో నని, మసాలా దోశలు, 2 చట్నీలూ చేసి వడ్డిస్తే.. ఆనందం గా తిని, పొగడ్తలతో నన్ను ముంచెత్తి,... వెళ్ళి పడుకున్నాడు జెట్ లాగ్ అని. మేమంతా కాస్త నెమ్మది గా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశాం సాయంత్రం వెళ్ళి డ్రైవర్, టాక్సీ తో వచ్చాడు. ఈ లోగా మా పిల్లలు "మా బొమ్మలుండిపోయాయి ఆ రూం లో" అని ఎంత నసిగినా మేము ఒప్పుకోలేదు అక్కడికి వెళ్ళటానికి. సాయంత్రం అతనొచ్చాక గది లోకెళ్ళి వచ్చిన పిల్లలు మెరుస్తున్న కళ్ళతో... 'అమ్మా... అంకుల్ బాగ్స్ చుట్టూ, బోల్డు చాక్ లేట్లు, టాయ్స్ అవీ ఉన్నాయి.. మాకు ఇస్తాడేమో కొన్ని... " అని ఉత్సాహంగా చెప్పారు.
"అతను ఎవరికోసం తెచ్చాడో.. మీరు అస్సలూ అటువైపు వెళ్ళద్ద"ని వాళ్ళని మందలించేసాం. ఫణి తో కూర్చుని మాట్లాడుతుంటే... రోజురోజుకీ ఇంకా మెటీరియలిస్టిక్ గా మారుతున్నట్టు అనిపించింది.
'అమెరికా నుండి ఏదీ తేలేదు రా రఘూ,.. మా అక్క చెళ్ళెళ్ళకి, కజిన్లకీ.. ' అన్నాడు. మేము 'ఆ అవును. ఎక్కడైనా ఒకటే ఈ రోజుల్లో.. అన్నీ అన్ని చోట్లా దొరుకుతున్నాయి ' అని అతన్ని సమర్ధించాం. ' ఓ పది వేలు తీసుకుని షర్ట్ కావాలన్న వాడికి షర్టూ, షూలు కావాలన్నవాడికి షూలూ, ఫోన్లు కావాలన్న వాడికి ఫోన్లూ కొని పడేద్దామనుకుంటున్నాను...' అన్నాడు. నాకు వొళ్ళు మండి పోయింది. కానీ సౌమ్యంగా 'అయినా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళే కొనుక్కుంటారేమో ఫణీ.. ఈ మధ్య ఒకరి చాఇస్ ఒకరికి నచ్చటం మానేసింది..' అన్నాను.
డబ్బు సంబంధమైన మాటలు తప్ప, మంచీ, చెడ్డా అనేది అన్నీ వదిలేశాడు. ఇళ్ళూ, స్టాకులూ, జాబులు అసలు ఎంత క్విక్ గా మారుస్తాడో .. అలాంటివి చెప్తూనే ఉన్నాడు. ఆశ్చర్యం వేసింది. డబ్బు మనిషి అని తెలుసు కానీ.. మరీ ముదిరిపోయాడనిపించింది.
ఏదో విషయం మాట్లాడుతూ, 'మా మేనకోడల్ని ఇంట్లో పెట్టుకొమ్మంటున్నారు రా.. మా అక్క/బావగారు. తనకి MS లో సీటొచ్చింది. ఖర్చంతా భరిస్తాం .. కానీ.. సహజం గా భయస్తురాలు. మీతో కొంతకాలం ఉంటే తర్వాత నెమ్మది గా పరిచయాలయ్యాక అపార్ట్ మెంట్ లో కెళ్ళిపోతుంది .. అని..' ' గాడిద గుడ్డేం కాదూ? ' అన్నాను. అని..
అయ్యో అనుకున్నాము. "సుకన్య వచ్చి ఎన్నాళ్ళయింది ఇండియా కి? " అని అడిగితే.. 'తను రాదు రా.. నాకేదో పని ఉందని వచ్చాను. తనకి ఇబ్బంది గా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యా వాళ్ళది ఇరుకైన 2 బెడ్ రూం అపార్ట్ మెంట్ ' .. అందుకని రాదు. అన్నాడు.
ఇస్త్రీ అబ్బాయి వచ్చాడు, బట్టలు తీసుకోవటానికి. 'నావీ ఉన్నాయి వేస్తాను ' అన్నాడు. కానీ.. "ఏంటీ!! 5 రూపాయలా? వద్దులే " అని మానేశాడు. పొద్దున్ననంగా ఇంట్లోంచి వెళ్ళి.. అర్థరాత్రి తిరిగి వచ్చేవాడు. రెండో రోజు ఉదయం లేచి హాల్లోకి రాగానే ఎవరో ఉన్నట్టు అనిపించి..'బాబోయ్' అని చూస్తే.. ఫణి డ్రైవర్ ట. హల్లో పడుకున్నాడు. అతనికి కూడా రగ్గూ, దుప్పటీ, దిళ్ళూ.. ఇచ్చారట. ఓహో.. మళ్ళీ ఇదొకటా అనుకున్నాను.
కాసేపయ్యాక చూస్తే.. మోటర్ సైకిల్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది. 'అమ్మయ్య.. కందిపప్పు అయిపోయింది అనుకున్నాను. చెప్దాం ' అని నేను బయటకెళ్తుంటే కనిపించింది.. ఫణి డ్రైవర్ తీసుకెళ్తున్నాడని. అతని పర్సనల్ వర్క్ కోసమట. 'అదేంటి? బస్సులో వెళ్ళచ్చు కదా? ' అంటే.. 'పాపం.. బస్ స్టోప్ దూరం కదా' అని నసిగారు రఘు. 'ఫణి కార్ ఉంది కదా..?' అంటే.. 'పెట్రోల్ వేస్ట్ అనీ.' అనగానే నాకు చిరాకు పెరిగిపోయింది. కానీ మొహమాటమొకటేడ్సింది కదా మనకి.
అలా వారం రోజుల పాటూ, ఫణికీ, అతని డ్రైవర్ కీ భోజనం, పడకా, టీ, కాఫీలూ, వారం రోజులకీ వాడుకోవటానికి మా ఇంట్లో ఉన్న మొబైల్ ఫోనూ .. హాయిగా సాగిపోయింది. దేశ విదేశాలు తిరిగిన మహానుభావుడు కనీసం తువ్వాలూ, సబ్బూ కూడా తెచ్చుకోలేదు. తనకే కాక తన డ్రైవర్ కి కూడా ఇవ్వవలసి రావటం ..
ఇంకో రెండు రోజుల్లో వెళ్తాడనగా ...
'క్రిష్నా.. మీ పిల్లలు చాక్లేట్లు తింటారా? ' అని అడిగాడు. 'ఓహో ఇప్పుడు చాక్లేట్లు పడేస్తాడన్నమాట ' అనుకున్నాను. ఎలాగైనా సరే ఫణి ఒక్క పది రూపాయలైనా ఖర్చు పెడుతుంటే చూడాలన్నా ఆకాంక్ష తో..'యా.. పిల్లలన్నాక చాక్ లేట్లు ఇష్టం లేని వాళ్ళు చాలా అరుదు కదా ' అన్నాను. 'ఏ ఫ్లేవర్ ఇష్టపడతారు? వైట్? బ్లాక్? బ్రవున్? ' నేను నిర్లజ్జగా ' ఏదైనా ఓకే.. కాడ్ బరీజ్ సిల్క్ ' వాళ్ళ ఫేవరేట్ అన్నాను.
'ఓకే.. మీరు శుక్రవారం సాయంత్రం మాత్రం ఫ్రీ గా ఉంచుకోండి.. I want to take you all out for dinner. Pick a nice restaurant.." అన్నాడు. సాధారణం గా అయితే.. 'వద్దు ఫణీ.. ఈ హడావిడి లో ఇదంతా ఎందుకూ? ' ససేమిరా ఒప్పుకునేదాన్ని కాదు. అందునా శుక్రవారం రాత్రికి!
కానీ ఒక విధమైన పంతం మొదలైంది. 'సరే ' అని ఒకటి రెండు పేర్లు చెప్పాను. ఇలా చెప్తున్నప్పుడు రఘు.. ముఖం చూడలేదు ఎందుకైనా మంచిదని. :)
శుక్రవారం రానే వచ్చింది. సాయంత్రం 7 అయినా రాడే? ఫోన్ చేస్తే .. 'నాకు లేట్ అవుతుంది ఒక గంట లో వస్తాను ' అన్నాడు. నేను పిల్లలకి 2 దోశలు పెట్టేసి చూస్తున్నాను. 8.30 కి వచ్చి.. "I am very tired. Can we order pizza? " అన్నాడు. సరే అని డామినోజ్ లోంచి అందరికీ పిజ్జాలూ, స్టార్టర్లూ, డెజర్టులూ, కోక్ లూ చాలా ఉదారం గా ఆర్డర్ చేశాడు 1200+ అయింది బిల్లు. ఆర్డర్ ఇంటికి వచ్చాక వెంటనే బాత్ రూం లో కి దూరాడు. ఎంతకీ బయటకి రాడే? డెలివరీ అబ్బాయి నుంచున్నాడు... విసుగ్గా..
సరే ఏం చేస్తాం? అని అయిష్టం గా.. నేనే పే చేశాను. అదేంటో.. కరెక్ట్ గా డెలివరీ బాయ్ బయటకి వెళ్ళడమేమిటి.. 'అయ్యో.. నువ్వు పే చేసావా క్రిష్నా.. ఇదేం బాగా లేదు.. This is my treat ' అన్నాడు. కానీ.. అంతకు మించి ఏమీ రియాక్ట్ అవలేదు. హాయిగా తినేసి.. మర్నాడు.. 'వెళ్ళొస్తాను .. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను రా" అని వెళ్ళిపోయాడు.
1200 అని కాదు కానీ ఆశ్చర్యం వేసింది అంతలా ఎలా తప్పించుకున్నాడని.. చాక్ లేట్లన్నాడు, ఏ రకం కావాలన్నాడు.. చివరకి తన బట్టలు కూడా మా చేతే ఉతికించి.. వెళ్ళిపోయాడు.. మళ్ళీ అమెరికా చేరానని ఫోన్ కూడా చేయలేదు.
వారెవ్వా.. ఇంక 2 యేళ్ళు ఆడుకోవచ్చు మా వారిని .. ఈ ఒక్క పాయింట్ మీద అనుకున్నాను.
మళ్ళీ అంతలోనే ...
చ చ... ఏమైంది నాకు? అతని స్వభావం అతనిది. నేనెందుకు మారాలి? అతనికి నచ్చిన విధం గా అతనున్నాడు. తన స్వభావాన్ని దాచటానికి ప్రయత్నం చేయలేదు. నేనే దిగజారాను. ఈ విధం గా అతను డిన్నర్ కి ఖర్చు పెడితే నాకు వచ్చేది ఏంటి? ఇలా ఎక్స్ పెక్ట్ చేయటం.. మెటీరియలిజం కాదా? అనుకుని నెమ్మది గా మా గొడవలో మేము మునిగిపోయాము..
నిన్ననే బిల్లు వచ్చింది తను వాడిన మొబైల్ ది. 1700 రూపాయలట..
తన జేబు నుంచయితే కనీసం 5 రూపాయలని ఇస్త్రీ చేయించుకోడా? తనది కాదు కదా అని ఇంత యూజ్ చేస్తాడా?
నెక్స్ట్ ఇయర్ రానీయండి చెప్తాను..
మొన్నీ మధ్యేనా? త్రైమాసిక పరీక్షలయ్యాయి,.. 'ఓ పనై పోయింది బాబూ ' అన్నాను? మళ్ళీ వచ్చి పడ్డాయండీ హాఫ్ యర్లీస్ .. పిల్లలు రెండు నెలల క్రితం ఆఖరి పరీక్ష రాసిన తర్వాత విసిరేసిన పుస్తకాల దుమ్మూ గట్రా దులుపుకుని, చెదలూ అవీ బ్లేడులతో గీకి పడేసి.. ముందరేసుకుని కూర్చున్నారు. ఉదయం నుండీ పదిహేను నిమిషాల సుదీర్ఘ చదువు ఎపిసోడ్ కి 2 గంటల షార్ట్ బ్రేకులు విధి గా తీసుకుంటూ, తెగ అలిసిపోతున్నారు. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఉదయం నుంచీ ఒకటే దెబ్బలాట.
ఉదయం నుంచీ చూస్తున్నాను. అసలు ఇద్దరికిద్దరూ ఆగరే? ఇక లాభం లేదని జస్టిస్ కృష్ణప్రియ అవతారం ఎత్తాను. ఇద్దరినీ తలా ఒక గది లో కూర్చోమని హుకుం జారీ చేసాను ..నేను చూడకుండా మళ్ళీ ఒకదగ్గర చేరి 10 నిమిషాలాడుకోవటం.. మళ్ళీ తగవు మూడ్ లోకి వెళ్ళిపోవటం :-( ఇద్దరూ మాట్లాడుకోవటానికి వీల్లేదని తీర్పు ఇస్తే..సైగల్లో మాట్లాడుకుంటూ ఇకిలింపులు.. నిమిషాల్లో గొడవల్లోకి రూపాంతరం చెందటం.. పోనీ ఏక పక్ష తీర్పు ఇచ్చామా? మనల్ని ఫూల్స్ చేసి ఇద్దరూ కలిసిపోతారు!!!
అసలు రోజు మొదలవటమే పెద్ద గొడవతో .. టూత్ బ్రష్ మీద పేస్టు నేను ఫస్ట్ వేసుకుంటానంటే..నేను ఫస్టని రగడ. పరుగు పరుగున వచ్చాను. తగవు తీర్చటానికి.. ఇద్దరూ నా వైపు నేను వర్ణించలేని భావం తో చూస్తున్నారు, తీర్పు ఎలా ఇస్తానా అన్నట్టు. రాం జన్మ భూమి తీర్పు కన్నా వంద రెంట్ల ఉత్కంఠ మా ఇంట్లో..TV రియాలిటీ షో ల్లో ఎవరు గెలిచారో చెప్పే ముందు చూపించే టెన్షన్ వాతావరణం లో..
సరేనని, దీనికి ఒక పరిష్కారం ఆలోచించి ఇద్దరి టూత్ బ్రస్షులూ తీసుకుని వేరే గది లోకెళ్ళి గడియలు బిగించి పేస్టులు వేసి .. ఎందుకో అనుమానం వచ్చి చూస్తే.. గది బయట కిటికీ లోంచి కర్టెన్ల సందులోంచి చూస్తున్నారు, ఎవరికి ఫస్ట్ వేస్తున్నానా అని. 'హమ్మో.. తృటి లో ఎంత ప్రమాదం తప్పింది. నిన్న మా మేరీ కి ఉదారం గా మూడు రోజుల సెలవ గ్రాంట్ చేసినందులు భగవంతుడు ఇన్స్టంట్ గా ఇచ్చిన వరం!!
రోజంతా.. పిల్లల చాడీలతో తల వాచిపోయింది. 'అదిగో నేనేమీ చేయకుండానే నావైపు కోపం గా చూసింది చెల్లి ' అని అక్కంటే .. 'నేను ఏమీ అనకుండా నా పని చేసుకుంటూ కూర్చుంటే.. గట్టిగా అరుస్తూ, కావాలని నన్ను తోసుకుంటూ వెళ్ళింది చెల్లెలుంగారి కంప్లెయింట్.. అంబానీ సోదరులైనా కాస్త మీడియా ముందైనా అన్యోన్యత నటిస్తారేమో కానీ.. వీళ్ళు మాత్రం టాం & జెర్రీల్లా గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఒకపక్క సహనం నశిస్తున్నా.. పరీక్షలప్పుడు ఏడిపించటం ఎందుకని చూస్తున్నాను.
మా పెద్దమ్మాయికేమో,.. 'తప్పు చెల్లిదయినా తిట్లు నాకే పడతాయి. అమ్మ చెల్లిని ఫేవర్ చేస్తుంది ' అని బలమైన అభిప్రాయం. చిన్నదేమో.. 'అక్కంటేనే అమ్మకి ప్రాణం.. నాకు ఎప్పుడూ సెకండ్ ప్రిఫరెన్సే.. అని.. అందుకే అక్క ని ముందు కన్నాక దాన్ని కన్నామని దానికి అంతకన్నా దృఢమైన అభిప్రాయం.
తల్లిదండ్రులకి ఇద్దరూ సమానమే ' అన్న కాన్సెప్ట్ తలకెక్కేలా బోల్డు కథలు చెప్తున్నాను అప్పటికీ.
నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది.. చిన్నప్పుడు మా అమ్మ చెల్లిని వెనకెసుకొచ్చినప్పుడల్లా.. మా అమ్మ నిజంగా నాకూ అమ్మేనా? లేక నన్ను ఎక్కడినిచైనా తీసుకొచ్చారా అని అనుమానాలు రావటం గుర్తొచ్చింది.
మధ్యాహ్నం, చదువులయ్యాక కాస్త వంట చేద్దాం అని పిల్లలకి ' బ్రేక్ ' ఇచ్చి కూరగాయలు తరగటం మొదలు పెట్టానో లేదో పేద్దగా ఏడుస్తూ ఇంటికి చేరారు ఇద్దరూ.. వెనకాలే పిల్లల గాంగ్ తమాషా చూడటానికి చేరిపోయారు. ముందర బాబోయ్.. ఈ పిల్లలకి ఏ మోకాళ్ళ చిప్పలు పగలడమో, పళ్ళు విరగటమో జరగలేదు కదా అని వంటింట్లో పని అర్థంతరం గా ముగించి చేతులు కడుక్కునేంత లోనే.. ఇద్దరూ ఒకేసారి గట్టిగా వాళ్ళ వాదనలు మొదలు పెట్టేశారు. వీళ్ళకి తోడు పెద్దమ్మాయి స్నేహితులు, చిన్నమ్మాయి స్నేహితులు కూడా.. ఒకేసారి అరుస్తూండటం తో.. కళ్ళు బైర్లు కమ్మి.. 'ఆపండీఈ, ' అని అరిచి.. కచేరీ మొదలు పెట్టాను.
ఇంతకీ విషయం ఏంటీ అంటే..
హానా మోంటానా స్టిక్కర్లట 10 రూపాయలకి ఒకటి చొప్పున దొరుకుతాయి. ఎవరో రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. వాటికోసం ఇవ్వాళ్ళ మరీ రోడ్ మీద జుట్లు పీక్కున్నంత పని చేశారు.
సాధారణం గా ఇలాంటి గొడవలప్పుడు.. నాకు మా చిన్నదనం లో అక్కా చెళ్ళెళ్ళంటే వీళ్ళు రా అన్నట్టు ఎంత సఖ్యత గా ఉండేవాళ్ళమో.. కథలు కథలు గా చెప్పటం అలవాటు.. (మన లో మాట.. మా అమ్మా ..అదే కథ చెప్పేది.. "మీలా మేము కొట్టుకుంటే మా అమ్మా-నాన్న సన్యాసుల్లో కలిసిపోయేవాళ్ళు. ఏడుగురు పిల్లలలం ఎప్పుడూ అంబుల పొది లా కలిసి తిరిగే వాళ్ళం అని.. చిన్నప్పుడు అమాయకం గా నమ్మేసేదాన్ని.
ఇంకా నేను మొదలు పెట్టేలోపలే.. మా పెద్ద టపాకాయ.. 'నాకు తెలుసు.. నువ్వూ, పిన్నీ..ఒక్కసారి కూడా జుట్లు పీక్కునేవాళ్ళు కాదు. మేమే బాడ్ ' అంది ఉక్రోషం గా.. నేను వెంటనే రూట్ మార్చేసి.. ' అది కాదు.. నాకూ, నాన్నకీ..' అని ఏదో మొదలు పెట్టబోయాను.. 'మాకిద్దరికీ కొంత పరువు లాంటివి ఉంది. రోడ్డు మీద గొడవ పడితే మేము తల ఎత్తుకోగలమా? ' అని బరువైన డైలాగులు చెప్దామని ముఖం సాధ్యమైనంత సీరియస్ గా పెట్టుకునేంత లో.. మా చిన్న సిసింద్రీ . 'తెలుసు తెలుసు.. మీరిద్దరూ ఎంత ఫైట్ చేసినా.. ఇంట్లోనీ చేస్తారు కానీ..బయట జుట్లు పీక్కోరు.. ' అనేసింది. దానితో అందరం హాయిగా నవ్వేసాం.
Same story in my family aanTee అంది ఎందురింటి ఆరేళ్ళ పిల్ల. 'ఆ ' అని అనేలోపలే ఏడేళ్ళ పక్కమ్మాయి మా ఇంట్లో కూడా మా అమ్మా నాన్న ఫైట్ చేసుకుంటారు కోనీ.. they won' t hit each other aunty.. అంది. ఇంకో పాప.. " మా ఇంట్లో అయితే.. My grandparents also fight with each other like anything Aunty అంది. పక్కమ్మాయి మళ్ళీ అందుకుని.. మా క్లాస్ లో అరుణ్ వాళ్ళ అమ్మా నాన్న fought so hard that.. Arun missed the school yesterday అంది, పెద్ద రహస్యాన్ని కనుక్కున్న దానిలా...
వీళ్ళ ఇబ్బంది కరమైన వాక్ప్రవాహాన్ని ఆపాలంటే మన దగ్గరుంది గా బ్రహ్మాస్త్రం? హా హా హా అని మనసులోనే వికటాట్టహాసం చేసుకుని.. 'పదండి పదండి.. ఇంక చదువు కీ అని మా పిల్లలని లోపలకి లాగి చాయిస్ ఇచ్చాను " చదువుకుంటారా? రండి లేదా.. కలిసి మెలసి ఆడుకోండి.." కాలనీ పిల్లలని.. పోనీ మీరు కూడా వస్తారా? సరదాగా ప్రశ్నలడు... ' అనేలోపలే పిల్లలంతా.. 'గాయబ్, గాన్, (వెళ్ళి ) పోయారు.. పోయ్టాంగ.. గేలే,, పోగిదరే .
టైం దొరికింది గా.. చక చకా టపా రాసేస్తున్నాను.. :)
Subscribe to:
Posts (Atom)